Maoist party
-
మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. లొంగుబాటుకు ప్రయత్నాలు? సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం. కిషన్జీతో వివాహం? మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్కౌంటర్లో చనిపోయారు. -
ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం
సాక్షి,హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బడుగు బలహీన వర్గాల గొంతును సాయిబాబా వినిపించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించాడు.జైలులో సుదీర్ఘకాలం దుర్భర పరిస్థితులను సాయిబాబా అనుభవించాడు. జైలులో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదీ చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు -
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
అన్నల ఇలాఖాలో.. ఎన్నికల సందడి
కాజీపేట: ఎన్నికలు వచ్చాయంటే హనుమకొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో భయం భయంగా ఉండేది. ఒకవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్ నక్సలైట్ల పిలుపు. ఎన్నికల్లో పాల్గొనా లని పోలీసుల కవాతుల మధ్య పల్లె జనాల వెన్నులో వణుకు పుట్టేది. ఎన్నికలు జరగనీయొద్దని నక్సల్స్.. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పోలీ సుల పట్టు మధ్య గ్రామస్తులు నలిగిపోయే వారు. ఎన్నికలు ముగిసి ప్రశాంతత ఏర్పడే వరకు బిక్కుబిక్కుమంటూ కాలంగడిపే పరిస్థితులు ఉండేవి. తుపాకుల నీడన ఎన్నికలు.. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న అనేక గ్రామాలు నక్సల్స్ ప్రభావితంగా ఉండేవి. కాజీపేట పట్టణానికి చెందిన క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్న, మాచర్ల ఏసోబు, కడారి రాములు తదితరుల నేతృత్వంలో శివారు గ్రామాలన్నీ ఎన్నికలకు దూరంగానే ఉండేవి. కాజీపేటకు చుట్టూ పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పల్లెల్లో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి విజయవంతం చేయాలని అన్నలు ప్రయత్నించేవారు. భట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, అయోధ్యపురం, టేకులగూడెం, దర్గా కాజీపేట, కొండపర్తి తదితర గ్రామాల్లో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నక్సల్స్‌కు అండగా నిలిచేవారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ కైలాసం స్వగ్రామం టేకులగూడంలో పరిస్థితులు భయానకంగా ఉండేవి. నక్సల్స్‌కు షెల్టర్ జోన్లుగా పిలిచే ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడమంటే పోలీసులు, అధికారులకు సాహసమనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద గ్రామ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరింపజేసి ఎన్నికలను నిర్వహించిన సందర్భాలు అనేకం. కొన్ని సమయాల్లో సాయుధ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలీంగ్ కేంద్రాలకు తరలించేవారంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో.. అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాల్లో ప్రచారం చేసిన దాఖలాలు కనిపించేవి కావు. పోలీసులు ఎన్నికలకు నెలరోజుల ముందుగా నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో భారీగా కూంబింగ్ నిర్వహించి ఒకే.. అన్న తర్వాతే ఎన్నికల నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ పడేది. నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఎన్నికల ఏజెంట్‌గా ఉండేందుకు పలాన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేందుకు సాహసించేవారు కాదంటే అతిశయోక్తికాదు. -
అన్నలకే ‘పెద్దన్న’.. నిజాం వెంకటేశం..!
సిరిసిల్ల: మావోయిస్టు అగ్రనేతలకు ఆత్మీయుడు నిజాం వెంకటేశం. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మావో యిస్టు అగ్రనేతలు ఆయన మరణించే దాకా బయటపెట్టలేదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నిజాం వెంకటేశం(74) గతేడాది సెప్టెంబరు 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణించిన విషయం తెలిసి..సరిగ్గా పది రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఓ వ్యాసం రాశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల రాసిన వ్యాసం ఏడాది కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎవరీ నిజాం వెంకటేశం.. ఏమిటీ ఆయన చరిత్ర అని ఆరా తీశారు. ఆయన మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘అన్నలకే పెద్ద న్న’ అయిన నిజాం వెంకటేశం అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎవరీ నిజాం వెంకటేశం.. కల్లోల సిరిసిల్లలో 1948 నవంబరు 14న వైశ్య కుటుంబంలో పుట్టి పెరిగిన నిజాం వెంకటేశం ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మూలాలు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నాయని తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు ఉద్వేగానికి గురయ్యారు. సమసమాజ స్థాపనకు జరుగుతున్న ప్రజా యుద్ధంలో తన వంతు శక్తికి మించి సాయాన్ని అందించారని నిజాం వెంకటేశం నిజాల గురించి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాసిన వ్యాసంతో వెల్లడైంది. పెద్దపల్లిలోని తన చిన్ననాటి మిత్రులు ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘అవును వెంకటేశం సార్ ఇక్కడే ఉండేవారు. ఇక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత తిరిగి పెద్దపెల్లికి రాలేదు’ అంటూ 42 ఏళ్ల క్రితం తనతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఐదారేళ్లు పెద్దపల్లిలోనే ఉద్యోగం చేశారు. కరెంటు పవర్ హౌస్ (రాఘవపూర్ సబ్ స్టేషన్) లో ఉద్యోగం చేస్తూ ఓ సాహితీవేత్తగా విప్లవానికి అందించాల్సిన సేవలు అందించారు. ఆయన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూనే.. గుట్టలు సమీపంలో ఉండడంతో పెద్దపల్లిలో ఐటీఐ చదివే వారు, విప్లవకారులు ఆయన ఇంటిని షెల్టర్‌గా చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారికి భోజనం పెట్టి ఆత్మీయంగా ఉండేవారని మల్లోజుల తన వ్యాసంలో వెల్లడించారు. తన కంటే ముందు తన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావుకు వెంకటేశం అత్యంత సన్నిహితుడని వివరించారు. తనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని డబుల్ సవారీ చేస్తూ తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాడని వేణుగోపాల్ చెప్పడం విశేషం. అగ్రనేతలకు ఆత్మీయుడు.. పశ్చిమబెంగాల్లో అమరుడైన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ మొదలుకొని ఇప్పటికీ సజీవంగా కేంద్ర కమిటీలో ఉన్న గణపతి అలియాస్ ముప్పళ్ల లక్ష్మణ్‌రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి (కోసా), మంథనికి చెందిన మల్లా రాజిరెడ్డి, ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధి గణేష్ ఇలా.. ఓ పదిపదిహేను మంది మావోయిస్ట్ అగ్రనేతలకు నిజాం వెంకటేశం సార్ ఇల్లు ప్రధాన షెల్టర్ అని రాఘవపూర్ గ్రామస్తులు తెలిపారు. వామ్మో సార్ ఇంటికి అప్పట్లో పెద్ద పెద్దోళ్లు (పెద్దన్నలు) వచ్చేవారని అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ కార్యదర్శి సాగర్ అలియాస్ దుగ్గు రాజ లింగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. రాజలింగంకు నిజాం వెంకటేశం అత్యంత సన్నిహితుడిగా మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. నిజాం వెంకటేశం విప్లవ కార్యాచరణకు అందించిన సహకారాన్ని వివరిస్తూ రాసిన లేఖ పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఒక సంచలనం రేపింది. విప్లవ ఉద్యమానికి ఆయన నిర్వర్తించిన పాత్ర అనిర్వచనమని మల్లోజుల పేర్కొన్నారు. ఆశ్రయం కల్పించడం, సాహిత్యాన్ని అందించడం, వచ్చినవారిని కడుపులో దాచుకోవడం, ఉద్యమంలో పాల్గొన్నవారిని, వారి ఆర్థిక అవసరాలను తీర్చి, ప్రోత్సహించేవారిని నాటి వెంకటేశం మిత్రులు పేర్కొంటున్నారు. ఇలా ఉద్యమానికి అక్షరమై, ఆయుధాన్ని అందించిన వెంకటేశం సిరిసిల్ల ప్రాంత వాసి కావడం విశేషం. నిజానికి నిజాం వెంకటేశం గురించి సిరిసిల్ల ప్రాంత వాసులకు చాలా తక్కువే తెలుసు కానీ, ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి అపర మేధావి, ధైర్యవంతుడు, పెద్ద యుద్ధానికి అగ్రనేతలను సంసిద్ధులను చేసిన పెద్దన్నగా పేరు సంపాదించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో స్థిరపడి.. సిరిసిల్లకు చెందిన నిజాం విశ్వనాథం, సత్తమ్మ దంపతుల కొడుకు వెంకటేశం. భార్య పేరు మాధవి. ఒక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 1966లో పాలిటెక్నిక్ చేసిన వెంకటేశం, చదువు పూర్తికాగానే 1968లో తొలిసారి ట్రాన్స్‌కోలో ఉద్యోగిగా జగిత్యాలలో విధుల్లో చేరారు. 1972 నుంచి 1978 వరకు పెద్దపల్లిలో పని చేశారు. అనంతరం 1978 నుంచి 1990 వరకు జగిత్యాల ప్రాంతంలో పని చేశారు. 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఇంగ్లిష్‌పై పట్టున్న ఆయన అనేక పుస్తకాలను తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో జరిగే సాహిత్య వేడుకలకు ఆయన తరచూ వచ్చేవారు. సిరిసిల్లలో అనేక మంది కవులు, సాహిత్యకారులు నిజాం వెంకటేశం సన్నిహితులుగా ఉన్నారు. కవిగా, విమర్శకులుగా పలు సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’గా పుస్తకం వెంకటేశం సాహిత్యం.. వ్యక్తిత్వాన్ని ‘అజాత శత్రువు నిజాం వెంకటేశం’ పేరుతో పుస్తకాన్ని వెలువరించారు. తెలంగాణ జిల్లాలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యకారులు ఈ పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాలను రాశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయన ఎదుటివారికి సాయం చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారు కాదు. తన సంపాదనలో ఎక్కువగా పుస్తకాల కొనుగోలుకు వెచ్చించినట్లు పలువురు తమ వ్యాసాల్లో వెల్లడించడం విశేషం. తను మరణించిన ఏడాది పూర్తి అయిన సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలోని సాహిత్యకారులు ఆయన సేవలను యాది చేసుకున్నారు. -
గద్దర్ చేసిన ఆ పనులు విస్మయం కలిగించాయి.. ఎందుకిలా?
జనం గుండె చప్పుడులా మోగిన ఆ పాట దరువు ఆగింది. మద్దెల మోతల్ల విరబూసిన ఆ పదాల తోట వాడింది. ఉద్యమంలా జనాన్ని చైతన్యంవైపు నడిపించిన ఆ పాట పడమటి దిక్కున అస్తమించింది. కామ్రేడు గద్దరన్నా! కానరాని లోకాలకు పోయిండు, తన పాటను మన యాదిలో వదిలేసి! -సాక్షి, హైదరాబాద్ ప్రజా బాహుళ్యాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారంనాడు అనారోగ్య కారణాలతో దివికేగారు. తొలి నుంచి పూర్తిస్థాయి మావోయిస్టుగా, సానుభూతిపరుడిగా ఉన్న గద్దర్.. జీవిత చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పనులు విస్మయం కలిగించాయి. తన కర్రకు కట్టిన ఎర్ర జెండాను విప్పేయడం, సూటూబూటు ధరించడం, అచ్చమైన కమ్యూనిస్టు అయి ఉండీ.. ఎన్నికల్లో ఓటు వేయడం, గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కడుపులో తలపెట్టడం, కాంగ్రెస్ వారి వేదిక ఎక్కడం, ప్రధాని మోదీ సభకు ఆహ్వానం లేకున్నా వెళ్లడం వంటివీ చర్చనీయాంశంగా మారాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. -
మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం
బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్‌లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు. రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. -
నాడు దళంలో.. నేడు సమస్యల్లో.. కేసీఆర్‌కు కామ్రేడ్ రమాకాంత్ వేడుకోలు
ఓదెల(పెద్దపల్లి): సమసమాజ నిర్మాణం కోసమంటూ మావోయిస్టు పార్టీలో చేరి, నాలుగేళ్లు పని చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు ఓదెల గ్రామానికి చెందిన కోండ్ర నాగరాజు అలియాస్ రమాకాంత్. ప్రస్తుతం అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓదెలలో దళిత సామాజికవర్గానికి చెందిన నాగరాజు ఐదోతరగతి వరకు చదువుకున్నాడు. జీతానికి పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులతో పరిచయం ఏర్పడింది. వారి పాటలకు, కార్యకలాపాలకు ఆకర్షితుడై, 2006లో మావోయిస్టు పార్టీలో చేరాడు. తర్వాత ఏటూరునాగారం, మహదేవపూర్, గుండారం, నర్సంపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో దళ నేతగా, ఏరియా కమిటీ బాధ్యుడిగా పని చేశాడు. ప్రభుత్వం నాగరాజు తలపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న అతనికి మహారాష్ట్రలో పార్టీ నిర్మాణ బాధ్యతలను పైస్థాయి నాయకులు అప్పగించారు. 2010 జనవరి 27న మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. రెండేళ్లు జైలు జీవితం గడిపిన అనంతరం స్వగ్రామం ఓదెలకు వచ్చాడు. అప్పటినుంచి ఇక్కడే జీవిస్తున్నాడు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేని నాగరాజు బీపీ, గుండె సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం ద్విచక్రవాహనంపై ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఐస్‌క్రీం అమ్ముతున్నాడు. తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, ఇంట్లో తనతో భార్య, తల్లి, తమ్ముడు ఉన్నాడని తెలిపాడు. ప్రభుత్వం కనికరించి, దళితబంధు పథకం మంజూరు చేస్తే సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు. -
TS: 15మంది సర్పంచ్‌లకు మావోయిస్టుల హెచ్చరిక
సారంగాపూర్(జగిత్యాల): మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతి సొంత జిల్లాలో ఒకేసారి 15మంది సర్పంచ్‌లకు ఆ పార్టీ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈ లేఖలు అందినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని 15 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీవోలు, నర్సింహులపల్లె గ్రామంలోని మరో 12 మందికి మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ పేరిట లేఖలు అందాయి. అటవీ భూములు ఆక్రమిస్తూ, అక్రమంగా పట్టాలు జారీచేస్తున్నారని, ఇందుకోసం రూ.కోట్లు దండుకున్నారని లేఖల్లో ఆరోపించింది. గ్రామాల్లో నిర్వహించాల్సిన పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. నర్సింహులపల్లెలో అక్రమంగా నిర్మించిన ఓ దుకాణాన్ని కూలి్చవేయాలని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందన్నారు. అయితే, ఒకేరోజు 15మంది సర్పంచ్‌లు, అధికారులు, గ్రామస్తులకు లేఖలు పోస్టు ద్వారా పంపించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి మావోయిస్టులు జారీచేసినవా లేక, కావాలనే కొందరిలా చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బాధితులు ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ లేఖల విషయాన్ని ఎస్పీ భాస్కర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవిషయంపై బీర్పూర్ ఎస్సై అజయ్‌ను వివరణ కోరగా పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని చెప్పారు. ఇది కూడా చదవండి: ఇంగ్లండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర విజయం -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్
-
మావోయిస్టు కీలకనేత రైనో అరెస్ట్
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీసీఎం) జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనోను ఏవోబీలో అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీలేరు పోలీసు స్టేషన్ పరిధి, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల సమయంలో రైనోను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రైనో ఏవోబీ టెక్నికల్ టీమ్‌లో, సీఆర్సీ 3వ కంపెనీలో కమాండర్‌గా, మావోయిస్టు నేత ఆర్కేకు ప్రొటెక్షన్ స్క్వాడ్ కమాండర్‌గా, ఏవోబీలో మిలిటరీ ప్లటూన్ కమాండర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడని తెలిపారు. 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేల హత్యకేసులోనూ రైనో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్నాడని తెలిపారు. అరెస్టయిన శ్రీనుబాబు అలియాస్ రైనోపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. రైనోను న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. -
మావోయిస్టు అగ్రనేతల అమ్మ.. మధురమ్మ కన్నుమూత
పెద్దపల్లిరూరల్: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల మాతృమూర్తి మధురమ్మ (96) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూడునెలల క్రితం ఇంటి ఆవరణలో జారిపడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరికపై వెంటిలేటర్‌పైనే పెద్దపల్లిలోని సొంతింటికి తీసుకొచ్చారు. మధురమ్మను పరీక్షించిన వైద్యులు శ్వాస ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. పోరాట కుటుంబం.. మావోయిస్టు అగ్రనేతలు కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావుది పోరాట కుటుంబం. తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. తామ్రపత్ర గ్రహీత. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న కోటేశ్వర్రావు 1975లో అడవిబాట పట్టారు. మరో ఐదేళ్ల తరువాత వేణుగోపాలరావు సైతం కోటన్న బాటనే అనుసరించారు. 11ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో.. కిషన్‌జీ పీడిత, తాడిత ప్రజలకోసం సుదీర్ఘకాలం పనిచేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలో 2011 నవంబర్ 25న జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అమరుడయ్యారు. వేణుగోపాల్‌రావు ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మొదట పోలీసులు ఒత్తిడి పెంచినా.. పీపుల్స్‌వార్ గ్రూప్‌లో కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కాలంలో మల్లోజుల కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. 1986లో అప్పటి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. ఆ కోపంతో పోలీసులు వెంకటయ్య, మధురమ్మల ఇంటిని కూల్చివేశారు. ఆ తర్వాత తాటికమ్మలతో గుడిసె వేసుకుని వారు కొంతకాలం జీవనం సాగించారు. 1997 డిసెంబర్ 26న మల్లోజుల వెంకటయ్య మరణించారు. మధురమ్మకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆంజనేయరావు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి విరమణ పొందారు. మిగిలిన ఇద్దరు ‘కోటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు జనం కోసం పోరాడుతున్నారు.. అలాంటి కొడుకుల కన్నందుకు గర్వంగా ఉంది’ అని మధురమ్మ చెప్పేదని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
అట్టుడుకుతున్న అడవి పల్లెలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది. గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. క్షణక్షణం భయం భయం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు స్థావరాలపై కన్ను కొంతకాలం నుంచి కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్జీ పోలీస్ ఫోర్స్ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు. -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్‌వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్‌వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
సరిహద్దుల్లో మావోల అలజడి.. పుంజుకోకముందే కట్టడి చేయాలని పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో కొన్నేళ్ల తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీ కదిలికలు కనిపిస్తుండటంతో నిఘా వర్గాలతోపాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోల కార్యకలాపాలు పుంజుకోకముందే వారిని నియత్రించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంగి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలను పునర్నిర్మించే పనిలో స్థానిక దళాలు ఉన్నట్లు వార్తలు రావడం, కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తాజాగా ఇద్దరిని హతమార్చిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులతో సమావేశమై మావోయిస్టు పార్టీ వైపు ఎవరూ వెళ్లకూడదని, పార్టీకి సహకరించరాదని సూచిస్తున్నారు. అలాగే గ్రేహౌండ్స్ పార్టీలను కూంబింగ్‌లో నిమగ్నం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మీదుగా గోదావరి దాటి మావోయిస్టులు భారీగా సమీప అటవీ ప్రాంతాల్లోకి వచ్చారన్న సమాచారం నిఘా వర్గాలకు అందినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలను ఏకకాలంలో విస్తృతపరిచేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న అనుమానంతో ఈ మొత్తం సరిహద్దు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌తోపాటు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలను ఉన్నతాధికారులు కూంబింగ్‌లోకి దించినట్లు సమాచారం. మాజీల సహకారంపై అనుమానం వాస్తవానికి ఆదిలాబాద్‌లో 2011 వరకు మావోయిస్టు పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రేహౌండ్స్ సంయుక్త ఆపరేషన్లలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు మకాం మార్చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్దగా కదలికలు, కార్యకలాపాలు లేవు. గతంలో తిర్యాణి, మంగి ప్రాంతంలో ఐరీ దళం నాయకుడు శ్రీనివాస్ నాయకత్వం వహించాడు. తర్వాత దళం అంతరించిపోవడం, మిగతా సభ్యులంతా లొంగిపోవడంతో కార్యలాపాలు లేవు. అయితే అప్పుడు దళంలో పనిచేసిన పాత సభ్యులెవరైనా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల ధీమా.. మావోయిస్టు పార్టీకి గతంలో మాదిరిగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశమే లేదని, ప్రస్తుతమున్న టెక్నాలజీ యుగంలో ఎవరూ మావోయిస్టు పార్టీ వైపు అడుగులు వేయబోరని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. పైగా ఎవరైనా అలా పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే తమకున్న ‘నెట్వర్క్’ద్వారా గంటల వ్యవధిలోనే ఆ సమాచారం తెలుస్తుందని... అలాంటి వారిని వెనక్కి తెచ్చి కౌన్సెలింగ్ సైతం ఇస్తామని చెబుతున్నారు. -
పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్చిరోలికి చెందిన పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అరెస్టయిన ఐదుగురిలో పాండు నరేటి ఒకరని, ఈ నెల 26నే నాగ్‌పూర్ జైల్లో పాండు నరేటి మృతిచెందిన వార్తను బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మంగళవారం ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తప్పుడు కేసుకు, శిక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నాయని, ఆరోగ్యం సరిగాలేని పాండు స్వైన్ ఫ్లూతో మరణించినట్టు అభయ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు గానీ, ఆయన తరపు లాయర్‌కు తెలియజేయలేదని ఆరోపించారు. పాండును చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులకు డాక్టర్లు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పాండు మరణం ప్రభుత్వ హత్య అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అభయ్ స్పష్టంచేశారు. ముంబయి జైల్లో ఉన్న మావోయిస్టు కిరణ్ క్యాన్సర్ చికిత్స పొందుతున్నారని, ఆయన భార్య నర్మద ఆరోగ్యం విషమించిందని తెలిసినా కనీసం చూసేందుకు ఆయన్ను తీసుకెళ్లలేదని ఆరోపించారు. తీరా ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ప్రజాస్వామిక, మౌలిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ చర్యలను యావత్ ప్రజానీకం ఖండించాలని పిలుపునిచ్చారు. ఐసీఎస్ పీడబ్ల్యూఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 13నుంచి 19 వరకు జరగనున్న ఆక్షన్ వీక్‌లో ఈ విషయంపై ప్రశ్నించాలని అభయ్ కోరారు. చదవండి: వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే.. -
మావోలకు గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, పాడేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టుచేశారు. అంతేకాక.. ఆ పార్టీలో పనిచేస్తున్న 60 మంది సభ్యులు, సానుభూతిపరులు మంగళవారం పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఇంజరికి వస్తుండగా ప్రభాకర్ అరెస్టు మావోయిçస్టు పార్టీలో కీలకంగా ఉన్న పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడు కోండ్రుం నుంచి ఇంజరి గ్రామానికి వస్తున్న సమయంలో పెదబయలు పోలీసులు అరెస్టుచేసినట్లు డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆదివాసీ పీటీజీ కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అరెస్టయిన రామకృష్ణ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని మల్కన్‌గిరి, కోరాపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రజాకోర్టులు పెట్టి అమాయక గిరిజనులను హత్యలు చేసేవాడని, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసేవాడని డీఐజీ తెలిపారు. ఆయనపై ఏఓబీ వ్యాప్తంగా సుమారు 124 కేసులున్నాయన్నారు. 14 హత్యలు, 13 ఎదురుకాల్పుల ఘటనలు, నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లో వంతాల రామకృష్ణ నిందితుడు. అలాగే, అనేక ఎదురుకాల్పుల ఘటనలతో పాటు మందుపాతర్ల పేల్చివేతలు, పొక్లెయిన్లను తగులబెట్టిన సంఘటనలు, పలు కిడ్నాప్ కేసుల్లోను రామకృష్ణ ప్రముఖ పాత్ర వహించాడని డీఐజీ తెలిపారు. ఇక అరెస్టు అయిన రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు, ఐదు కిలోల మైన్, ఐదు డిటోనేటర్లు, 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు, ఆరు బ్యాటరీలు, 9ఎంఎం పిస్టల్, ఎనిమిది 9ఎంఎం రౌండ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని.. ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. 60 మంది లొంగుబాటు మరోవైపు.. మావోయిస్టు పార్టీ పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 33 మందిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వీరిలో ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన కొర్రా చిన్నయ్య అలియాస్ శ్రీకాంత్ 95 నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఐజీ తెలిపారు. ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని, గత ఏడాది 135 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా.. ప్రస్తుతం 60 మంది ఒకేరోజు జనజీవన స్రవంతిలోకి రావడం శుభపరిణామమని డీఐజీ హరికృష్ణ తెలిపారు. వీరందరిపై అనేక కేసులున్నాయన్నారు. రూ.లక్ష రివార్డు ఉన్న సభ్యులకు ఆ నగదును వారికే అందజేయడంతో పాటు లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేపడతామని.. ఇందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం కూడా అన్నివిధాల సహకరిస్తోందని హరికృష్ణ వివరించారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపడుతూ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుతో జీవనోపాధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నిరుద్యోగ యువతకు ప్రేరణ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని డీఐజీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ అడ్మిన్ తుసీన్ సిన్హా, సీఆర్పీఎఫ్ 284 బెటాలియన్ కమాండెంట్ ఆశీష్ విశ్వకర్మ, అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావు, పాడేరు సీఐ సుధాకర్ పాల్గొన్నారు. -
మావోయిస్టులతో లింకులపై... ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తిజేస్తూ యువత మావోయిస్టుల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారన్న అభియో గంపై చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. వారిలో శిల్ప హైకోర్టు న్యాయవాది. ఏపీలోని విశాఖపట్నంలో 2017 డిసెంబర్లో అదృశ్యమైన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృం దాలు సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న నిందితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశాయి. దాదాపు 4 గంటలపాటు సోదాలు చేపట్టి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వారిని అరెస్టు చేశాయి. ఇదీ కేసు... పోలీసుల కథనం ప్రకారం కాప్రాలోని సాయిబాబా కాలనీకి చెందిన పల్లెపాటి పోచమ్మ చిన్న కుమార్తె రాధ నర్సింగ్ విద్యార్థిని. మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ రాధను కలిసేవారు. 2017 డిసెంబర్లో రాధను కలిసిన దేవేంద్ర... కొందరికి వైద్యం చేయాల్సి ఉందంటూ బలవంతంగా ఆమెను తీసుకుకెళ్లాడు. అప్పటి నుంచి రాధ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె కోసం పోచమ్మ అనేక ప్రాంతాల్లో గాలించి చివరకు తన కుమార్తె మావోయిస్టు పార్టీలో చేరిందని... విశాఖపట్నం జిల్లా పెద్దబయలు అటవీ ప్రాంతంలో అగ్రనేతలు ఉదయ్, అరుణలతో కలసి పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. రాధ అదృశ్యంపై ఈ ఏడాది జనవరిలో విశాఖ జిల్లాలోని పెద్దబయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన సమయంలో రాధ మైనర్ కావడంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. బలహీన వర్గాల కేసులు వాదిస్తున్న శిల్ప... హైకోర్టు అడ్వొకేట్‌గా పని చేస్తున్న శిల్ప 6 నెలలుగా బోడుప్పల్‌లోని హేమానగర్లో భర్త కిరణ్, అత్త హేమతో కలసి అద్దెకు ఉంటోంది. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన పలు కోర్టు కేసులను శిల్ప వాదిస్తోంది. కాగా, తన భార్యను ఎన్ఐఏ అక్రమంగా అరెస్టు చేసిందని శిల్ప భర్త కిరణ్ ఆరోపించారు. రంగంలోకి ఎన్ఐఏ... కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. దీంతో ఈ నెల 3న ఈ కేసును రీ–రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ... సీఎంఎస్ నాయకులే కుట్రపూరితంగా రాధను మావోయిస్టు పార్టీలో చేర్చారని, అడవిలో ఆమెను నిర్బంధించి ఉంచారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులను నిందితులుగా చేర్చింది. -
‘మానాల’ మళ్లీ పురుడు?
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో 16 మందిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో పీపుల్స్ వార్ ఊచకోత కోసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ ప్రాంతానికి సమీపంలో 11 మంది పీపుల్స్ వార్ సభ్యులు పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఇప్పుడదే ప్రాంతంలో మానాలలో మళ్లీ పురుడుపోసుకునేందుకు నాటి పీపుల్స్‌వార్.. నేడు మావోయిస్టు పార్టీ.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్త సంచలనం రేపుతోంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త రక్తం కోసం ప్రయత్నాలు చేస్తున్న ముగ్గురు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేయడం కలవరానికి గురిచేస్తోంది. అయితే ఒకవైపు ఈ రెండు జిల్లాల్లో మావోయిస్టు పార్టీ నియామకాలపై దృష్టి సారిస్తుంటే.. మరోవైపు జనశక్తి కూడా కార్యకలాపాలను విస్తృతంచేస్తోంది. బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతూ అటు వ్యాపారులను, ఇటు పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నలుగురు వెళ్లారు.. ఇద్దరు వచ్చారు.. నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు, సిరిసిల్లకు చెందిన ఇద్దరు.. పట్టభద్రులు ఆరు నెలల క్రితం మావోయిస్టులో చేరేందుకు వెళ్లారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ల వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకే వెళ్లడంతో వారిని పార్టీ వెళ్లిపోవాలని సూచించగా తిరిగి వెనక్కు వచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. మిగిలిన ఇద్దరు ఆ పార్టీ సిద్ధాంతాలతో ఇమడలేక ఇబ్బంది పడుతున్నారని, వారు కూడా త్వరలోనే తిరిగివస్తారని పేర్కొన్నాయి. ఈ నలుగురిని సానుభూతిపరులుగా మార్చడంలో క్రియాశీల పాత్ర పోషించింది మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేసిన బుస జనార్ధన్, గంగాధర్, కమల్‌తో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మరో ఇద్దరు అని స్పష్టంచేశాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఇస్రోజివాడకు చెందిన లోకేటీ చందర్ అలియాస్ స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో దండకారుణ్య జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడి సంప్రదింపులతో అరెస్టయిన ముగ్గురు తెలంగాణ మావోయిస్టు కమిటీలో కీలక సభ్యుడు ఆజాద్‌ను కలిసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆజాద్ ఆదేశంతోనే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న యువతను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించినట్టు వెల్లడించాయి. ఇలా ఉమ్మడి నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నియామకాలు చేస్తున్నట్లు తెలిసింది. వసూళ్లలో జనశక్తి బిజీ... సిరిసిల్ల, వేములవాడ, కామారెడ్డి, జగిత్యాల.. ఈ ప్రాంతాల్లో నిషేధిత సంస్థ జనశక్తి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సిరిసిల్లకు చెందిన కూర రాజన్న అగ్రనాయకత్వంగా పనిచేసిన ఈ సంస్థ మళ్లీ జవసత్వాల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ జనశక్తికి ఊపిరిపోయాలని భావిస్తున్న రాజన్న పాత అనుచరులతో మళ్లీ దందాలకు తెరలేపినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం వేములవాడకు చెందిన వంగాల రాజమల్లయ్యని కొందరు హతమార్చేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. వీరిలో పోహునుక సురేష్ అలియాస్ మల్యాల సురేష్ అలియాస్ పీఎస్పీ రెడ్డి, చిట్టీ రాజేశ్వర్, నగురూరి రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనశక్తి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను, భవన నిర్మాణ వ్యాపారులను, పెట్రోల్ బంక్ యజమానులను, చోటామోటా నేతలను.. బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా జనశక్తిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వారందరికీ తుపాకులు అందిస్తోంది.. కార్యచరణ, కార్యాకలాపాల విస్తరణ ఐడియా మొత్తం రాజన్నదే అని పోలీసులు స్పష్టం చేశారు. -
హిడ్మా పోలీసులకు లొంగిపోలేదు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఓ వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. విప్లవోద్యమ ప్రాంతాలకు దూరంగా ఉండే మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులు ఎవరో ఒకర్ని అరెస్టు చేసి తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. హిడ్మా దండకారణ్యంలో గెరిల్లా బేస్‌లో ప్రజల మధ్య ఉన్నారని ఆయన వెల్లడించారు. -
‘మావో’ళ్లు 4739 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు, ఆపరేషన్ కమాండ్ గ్రూప్ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు. ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒకప్పటి కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2000లో ఏర్పాటు చేసిన పీఎల్జీఏను పీజీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) అని కూడా మావోయిస్టు పార్టీ పిలుస్తోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పీఎల్జీఏ ఏర్పా టై ఇరవై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ సావనీర్ విడుదల చేసింది. ఈ ఇరవై ఏళ్లలో పీఎల్జీఏ చేసిన ఆపరేషన్స్, మావోయిస్టులు, పోలీసులు ఎంతమంది చనిపోయారన్న పూర్తి వివరాలను అందులో పేర్కొంది. పీఎల్జీఏ రెండు దశాబ్దాల్లో సాగించిన ఆపరేషన్స్‌లో కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర కార్యదర్శులు, సభ్యు లు, డివిజన్ కమిటీ కార్యదర్శులు, మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యులు మొత్తం 4,739 మందిని కోల్పోయినట్లు సావనీర్లో తెలిపింది. ఇందులో 909 మంది మహిళామావోయిస్టులుండగా, 16 మంది కేంద్రకమిటీ సభ్యులు, 44 మంది స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్ర కమిటీ సభ్యులు, 9 మంది రీజినల్ కమిటీ సభ్యులు, 168 మంది జోన్/డివిజన్/జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందగా, మిగిలినవారిలో ఏరియా సభ్యులు, గ్రామదళ సభ్యులున్నట్టు పేర్కొంది. పీఎల్జీఏ ఆపరేషన్స్‌లో 3,054 పోలీసుల మృతి పీఎల్జీఏ 2000 నుంచి 2021 జూలై వరకు జరిపిన మిలటరీ ఆపరేషన్స్‌లో 3,054 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, అధికారులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మరో 3,672 మంది పోలీస్ బలగాల సిబ్బంది క్షతగ్రాతులైనట్టు, 3,222 ఆయుధాలు, 1,55,356 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 4,572 ఆపరేషన్స్ నిర్వహించగా, వాటిల్లో భారీవి 210 కాగా, మధ్యస్థ 331, మైనర్ ఆపరేషన్స్ 4,031 ఉన్నట్టు వెల్లడించింది. సీఆర్పీఎఫ్ ఉపయోగించిన రక్షణ శాఖ హెలికాప్టర్లపై కూడా దాడులు నిర్వహించినట్టు తెలిపింది. 2008, 2010, 2011, 2012, 2013లో హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించగా, కమాండర్ స్థాయి అధికారితోపాటు ముగ్గురు సిబ్బంది మరణించినట్టు పేర్కొంది. 2021 ఏప్రిల్ 19న సుక్మా–బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ డ్రోన్ సహాయంతో బాంబుదాడులు చేసిందని, ప్రతిదాడి చేసి దానిని కూల్చివేసినట్టు తెలిపింది. ఇలా పలు డ్రోన్ దాడులను కూడా నిర్వీర్యం చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సింగిల్ యాక్షన్‌లో నేతల హతం సింగిల్ యాక్షన్‌లో భాగంగా 2007లో జార్ఖండ్ టాటానగర్ ఎంపీ సునీల్ మçహతోను, అతడి ముగ్గురు బాడీగార్డులు, ఇతరులను ఒకేసారి పీఎల్జీఏ హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు 13 మంది బాడీగార్డులను 2013 మే 25న నిర్మూలించినట్టు పార్టీ పేర్కొంది. ఏపీలో 2018, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను హతమర్చినట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019 ఏప్రిల్ 9 దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండావితోపాటు అతడి నలుగురు బాడీగార్డులను బుల్లెట్ వాహనంతో సహా పేల్చివేసినట్టు తెలిపింది. -
‘పోరు’ ఎవరికోసం? మావోయిస్టులకు 25 ప్రశ్నలు ఎక్కుపెట్టిన ఆదివాసీలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి. ‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి. (చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..) -
మావోయిస్టుల ఫోన్లలో స్పైవేర్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులపై పోలీసులు గూఢచర్య ఆపరేషన్లు చేస్తున్నారని.. ఫోన్లలో స్పైవేర్ చొప్పించి లొకేషన్, ఫొటోలు సేకరిస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ పత్రికలో ఆరోపించింది. ఆ వివరాల ఆధారంగానే భారీగా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. అంతేగాకుండా ఇన్ఫార్మర్లు, కొరియర్లను లోబర్చుకుని.. వారి ద్వారా మావోయిస్టులపై విష ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ ప్రతి ఆరు నెలలకోసారి అధికార పత్రికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా తాజా పత్రికలో పలు సంచలన ఆరోపణలు చేసింది. హ్యాకర్లతో స్పైవేర్.. పోలీసులు హ్యాకర్ల సాయంతో తమ ఫోన్లలో రహస్యంగా నిఘా యాప్స్ (స్పైవేర్)ను ఇన్స్టాల్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. లొకేషన్, ఫోటోలు, వీడియోలను సంగ్రహించి.. కూంబింగ్ బృందాలకు పంపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పార్టీ ఇన్ఫార్మర్లు, కొరియర్ల ఫోన్లలోనూ స్పైవేర్‌తో నిఘా పెట్టినట్టు తెలిపింది. కొరియర్లను భయపెట్టి.. మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తున్న వారిని పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని.. వారు ప్రాణభయంతో కోవర్టులుగా మారిపోతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. కొరియర్లు మావోయిస్టుల కోసం తెచ్చే పళ్లు, డ్రైప్రూట్స్, మందులు, ఇతర ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారని ఆరోపించింది. దీనివల్ల మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని, కొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో వాజేడు– వెంకటాపురం దళంపై ఇలాంటి విష ప్రయోగమే జరిగిందని, దళంలోని కీలక నేతలు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని వెల్లడించింది. పక్కా ప్రణాళికలతో దాడులు మావోయిస్టులను నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి సమాధాన్–2022ను చేపట్టిందని మావోయిస్టు పార్టీ పత్రికలో తెలిపింది. ఇందులో భాగంగా నిర్దిష్టమైన ప్రణాళికతో పదిరకాల ఎత్తుగడలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించింది. ఆ వ్యూహాలను మొదట తెలంగాణ నుంచే అమల్లోకి తెచ్చారని. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 4న ములుగులో ఛత్తీస్గడ్, తెలంగాణ డీజీపీలతోపాటు కేంద్ర హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ డీజీ, ఆ జోన్ ఐజీల, ఇతర కీలక అధికారులు సమావేశమయ్యారని పేర్కొంది. ప్రధానంగా గెరిల్లా బేస్‌గా ఉన్న దండ కారణ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో.. దానికి ఆనుకుని ఉన్న మావోయిస్టు మద్దతు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. అందులో భాగంగానే తెలంగాణ–ఛత్తీస్గడ్ సరిహద్దు గ్రామమైన భట్టిగూడెం వద్ద 5వేలమంది కోబ్రా, డీఆర్జీ, గ్రేహౌండ్స్ బలగాలతో దాడికి పాల్పడ్డారని.. కానీ తెలంగాణ కమిటీ తప్పించుకోగలిగిందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఓ గ్రేహౌండ్స్ టీమ్‌ను చూసిన మరో గ్రేహౌండ్స్ గ్రూప్.. మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపిందని గుర్తుచేసింది. ఆ ఘటనలో ఓ ఎస్సై మృతిచెందాడని, మరో హెడ్ కానిస్టేబుల్ దాడి భయంతో గుండెపోటుతో చనిపోయాడని పేర్కొంది. మావోయిస్టుల కోసమే ఆ ఓఎస్డీలు! గతంలో మావోయిస్టులపై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ అధికారులను కీలక విభాగాల్లో ఓఎస్డీలుగా నియమిస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకాలను వేగవంతం చేశారని.. అందులో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తమ పత్రికలో వెల్లడించింది. మావోయిస్టు పార్టీని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతోనే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలంటూ పోలీస్ శాఖలో వేలాది మందిని నియమిస్తున్నట్టు ఆరోపించింది. -
హిడ్మా ఎక్కడ? ఏదైనా వ్యూహం ఉందా?
సాక్షి, అమరావతి/ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏదైనా వ్యూహం ఉందా? దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా.. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు.