Minister Tummala Nageswara Rao
-
రాష్ట్రంలో 71 కొత్త పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 71 పురపాలిక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. 173 గ్రామ పంచాయతీలు/ఆవాస ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఈ 71 చిన్న పట్టణ ప్రాంతాలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామాలు/గ్రామాల్లోని భాగాలను విలీనం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. గత సాంప్రదాయానికి భిన్నంగా స్థానిక ప్రజల అభిప్రాయంతో, గ్రామ పంచాయతీల తీర్మానంతో పనిలేకుండా.. నేరుగా కొత్త పురపాలికల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో గ్రామాలు/ఆవాసాలను విలీనం చేసేందుకు వీలుగా సవరణలు చేపడుతున్నారు. 144కు పెరగనున్న పురపాలికలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగియనుండడంతో ఆలోపే పురపాలక చట్టాల సవరణలు పూర్తిచేసి.. కొత్త పురపాలికల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఆగమేఘాల మీద కసరత్తు పూర్తి చేసి.. తాజాగా శాసనసభలో సవరణ బిల్లులు ప్రవేశపెట్టింది. కొత్తగా ఏర్పాటుచేసే 71 మున్సిపాలిటీలు, న్యాయ వివాదాల్లో ఉన్న మరో ఏడు మున్సిపాలిటీలు, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేసే 136 గ్రామ పంచాయతీల పేర్లను ఆయా చట్టాల్లో చేర్చనుంది. ఈ బిల్లులకు గురువారం రాష్ట్ర శాసనసభ ఆమోదం లభించే అవకాశముంది. కొత్త పురపాలికలుగా ఏర్పాటవుతున్న, ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనమవుతున్న గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన వెంటనే... వాటికి మున్సిపాలిటీ హోదా అమల్లోకి రానుంది. ఇక జీహెచ్ఎంసీలో కొత్తగా బండ్లగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీతో సహా 73 పురపాలికలు ఉండగా... కొత్త పురపాలికల ఏర్పాటుతో వాటి సంఖ్య 144కి పెరగనుంది. న్యాయ సమస్యలు లేకుండా.. ఇప్పటికే ఏర్పాటును ప్రకటించిన ఏడు పురపాలికలకు సంబంధించి స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్లుగా అది అమల్లోకి రాలేదు. ఈ న్యాయ వివాదాన్ని అధిగమించేందుకు ఆ ఏడు మున్సిపాలిటీలైన నకిరేకల్, జిల్లెలగూడ, మీర్పేట్, బొడుప్పల్, పీర్జాదిగూడ, దుబ్బాక, మేడ్చల్‌లను.. తాజాగా సవరణ బిల్లులలో చేర్చినట్టు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బిల్లులో రాతపూర్వకంగా తెలిపారు. పట్టణ లక్షణాలు, పట్టణ పరిసరా ల్లో ఉన్న గ్రామాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గుర్తించి.. పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు ప్రస్తుత చట్టాల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా కల్పించడానికిగాని, ప్రస్తుతమున్న మున్సిపాలిటీలో విలీనం చేయడానికిగానీ పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం బహిరంగ ప్రకటన జారీచేసి.. నిర్ణీత గడువులోగా స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి రాత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలి. చివరిగా గ్రామసభ నిర్వహించి మున్సిపాలిటీగా ఏర్పాటు/మున్సిపాలిటీలో విలీనాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇకపై పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రక్రియేదీ అవసరం లేకుండానే.. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు మున్సిపల్ హోదా/మున్సిపాలిటీలో విలీనం వంటివి చేపట్టేలా చట్టాలకు సవరణలు చేస్తున్నారు. -
రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి
సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. effort for International glory to Ramadas:Tummala -
‘భగీరథ’ పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, మరిపెడ(వరంగల్): మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ఈనెల 26న ట్రయల్ రన్ చేయాలని భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద కొనసాగుతున్న మిషన్ భగీ రథ పనులపై శనివారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల పై చిలుకులు గ్రామాలకు శుద్దీచేసిన నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కే సీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అబ్బాయిపాలెం నుంచి పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్‌తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి నీటి ని అందించనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. అయితే అన్నింకంటే ముందుగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్ మండలాలకు ఈనెల 15 వరకుభగీర«థ నీరందుతుందన్నారు. ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్ పనులు 25 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. అధికారులపై మండిపాటు.. బొడ్లాడ వద్ద జరుగుతున్న పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దని హెచ్చరించారు. అలాగే పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈనెల 8 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, జనగామలో ఈనెల 30లోగా పూర్తవుతాయని, అయితే ఇక్కడ పైప్‌లైన్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇది సహించే విషయం కాదని చైర్మన్ మందలించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేరే వారిని పెట్టుకుని పనులు చేయించుకుంటామని హెచ్చరించారు. ఏటూరునాగారం వద్ద జరుగుతున్న పనుల్లో ఎలక్ట్రోమెకానిక్ వర్క్స్ ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈనెల 15 వర కు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులకు చెప్పా రు. జనగామ 180 ఇంట్రా విలేజ్‌లో పనులు కావాల్సి ఉందన్నారు. యాదాద్రిలో 569 పనులకు 207 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్ని ఈ నెల 20 వరకు పూర్తిచేస్తామని సమీక్షలో వెల్లడించారు. అధికారులకు స్వాగతం... మరిపెడ శివారులోని ఎస్సీ గురుకులం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలంలో భగీరథ వైస్ చైర్మ న్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్ దిగారు. ఈ సందర్భంగా వారికి మం త్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వాగతం పలికారు. ఏ రోజు నివేదిక ఆ రోజు ఇవ్వాలి.. ఈనెల 26న మిషన్ భగీరథ ట్రయల్ రన్ చేయాల్సిందేనని సీఎం కార్యాలయం సెక్రటరీ స్మితా సబర్వాల్ అన్నారు. కొంత మంది అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది సరైందని పద్ధతి కాదన్నారు. అ«ధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి రోజు 24 గంటలు పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రేపటిలోగా ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో నివేదిక తీసుకో వాలని సీఎంసీ సురేంద్రరెడ్డికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనుల ను గడువులోగా పూర్తి కాకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ప్రభుత్వ సలహదారుడు జ్ఞానేశ్వర్, జనగామ ఇన్చార్జి కలెక్టర్ అనితా రాంచంద్రన్, మహబూబాబాద్ జిల్లా జేసీ దామోదర్‌రెడ్డి, గుడిపుడి నవీన్, డి.ఎస్ రవిచంద్ర, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మెగా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
అత్యాధునికంగా సచివాలయం
► బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో రూ.300 కోట్లతో మూడు అంతస్తుల్లో: తుమ్మల ►మొదటి అంతస్తులో ఒకవైపు సీఎం, మరోవైపు సీఎస్ కార్యాలయాలు ►రెండు, మూడో అంతస్తుల్లో కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ►ప్రతిపక్షాలు కాకిగోల ఆపాలంటూ మండిపడ్డ ఆర్ అండ్ బీ మంత్రి సాక్షి,ప్రతినిధి ఖమ్మం: ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా బైసన్ పోలో గ్రౌండ్స్‌లో రూ.300 కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ప్రస్తుత సచివాలయం పాలనా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోందన్నారు. కొత్త సచివాలయంలో మూడు ఫ్లోర్లు ఉంటాయని, మొదటి ఫ్లోర్లో ఒకవైపు సీఎం కార్యాలయం.. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంటుందని చెప్పారు. రెండో ఫ్లోర్లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఉంటారని, మూడో ఫ్లోర్లో ప్రభుత్వ శాఖల ప్రధాన అధికారులు ఉంటారని తెలిపారు. బుధవారం ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భం గా కొత్త సచివాలయ నమూనాను విడుదల చేశారు. ‘‘రక్షణ శాఖ పరిధిలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రంతో చర్చలు జరిపింది. పట్టుబట్టి సాధించుకున్నాం. దీనికి బదులుగా కేంద్రానికి రూ.95 కోట్ల నగదుతోపాటు వారు కోరుకున్నచోట 596 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 38 ఎకరాల బైసన్ పోలో గ్రౌండ్స్‌లో ఆధునిక హంగులతో సచివాలయాన్ని నిర్మిస్తాం’’ అని వివరించారు. ప్రతిపక్షాలది కాకిగోల.. రాద్ధాంతం.. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడు తున్నాయని, ఇప్పటికైనా కాకిగోల ఆపాలంటూ తుమ్మల మండిపడ్డారు. ‘‘సచివాలయాన్ని కూడా కట్టనివ్వబోమంటూ శపథాలు చేస్తున్నారు. పనులను అడ్డుకుని నిర్మాణాలను ఆలస్యం చేయ గలుగుతారేమో కానీ.. వాటిని ఆపే శక్తి ప్రతి పక్షాలకు లేదు. అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఇప్పుడున్న సచివాలయంలో ఏ సమావేశం నిర్వహించాలన్నా ఇబ్బంది కలుగు తోంది. కలెక్టర్ల సదస్సు, కేబినెట్ సమావేశాలను హోటళ్లను అద్దెకు తీసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త సచివాలయంలో ఆధునిక హంగులతో పూర్తిస్థాయి సమావేశ మందిరాన్ని నిర్మిస్తాం’’ అని తెలిపారు. కాళేశ్వరం, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి నిర్మాణాలను ఆపేందుకు యత్నించి ప్రతిపక్షాలు విఫలమయ్యాయన్నారు. -
'గ్రీన్ డే'లో పాల్గొన్న తుమ్మల, ఇంద్రకరణ్
పెగడపల్లి: రాష్ట్ర ప్రభుత్వ పిలుపులో భాగంగా మంత్రులు హారితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో పాఠశాలల్లో ‘గ్రీన్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి పాఠశాలలో మొక్కలు నాటారు. దమ్మపేటలో... దమ్మపేట మండలం గండుగులపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కస్తూర్భా గాంధీ విద్యా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ ఇలంబర్తి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మద్దులపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: తుమ్మల
ఖమ్మం రూరల్: మద్దులపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని మద్దులపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 22 డబుల్ బెడ్రూం పనులు పూర్తి కాగా, గృహప్రవేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవం తో తలెత్తుకుని బతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. గతంలో ఇళ్లు నిర్మించుకుని.. బిల్లులు రాని 36వేల మంది లబ్ధిదారుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, బడ్జెట్లో కూడా వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేది లేదన్నారు. సాదాబైనామా ప్రవేశపెట్టి సన్న, చిన్నకారు రైతులకు పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. -
ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్ర అభివృద్ధి
కరీంనగర్ రుణం తీర్చుకోకుంటే ‘తెలంగాణ’కు అర్థముండదు: తుమ్మల కొత్తపల్లి(కరీంనగర్): ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ రూరల్ 2 మండలం ఎలగందులలో రూ.60 కోట్లతో ఎల్ఎండీ రిజ ర్వాయర్పై నిర్మించ తలపెట్టిన పాత రహదారి పునరు ద్ధరణ పనులకు ఆదివారం ఆర్థిక మంత్రి ఈటలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బహిరంగ సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తే అడ్డు తప్పించైనా పనులు చేపడతామన్నారు. బంగారు, ఆకుపచ్చ, భాగ్యవంతమైన తెలంగాణ నిర్మించి తీరు తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉన్నత స్థానంలో నిలిపిన కరీంనగర్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోకుంటే తెలంగాణ సాధించిన అర్థమే ఉండదని తుమ్మల వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ కరీంనగర్‌ను పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్ది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. -
రహదారుల నిర్మాణ సమస్యలు తెలపండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: రహదారుల నిర్మాణంలో భూసేకరణ, అటవీ సంబంధిత సమస్యలు, పైపులు, విద్యుత్ తీగల తొలగింపు వంటి సమస్యలను తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణం గా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిన 2,132 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను కాంట్రాక్టర్ల తో, ఇంజనీర్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
అప్పు చేసైనా రోడ్లేస్తాం: తుమ్మల
మా హయాంలోనే పూర్తి చేస్తాం మంజూరు చేసిన రోడ్లపై మంత్రి వ్యాఖ్యలు హైదరాబాద్: అనుమతులిచ్చిన రోడ్లను తమ హయాంలోనే, రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. నిధుల విషయంలో ఆందోళన అవసరం లేదని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పారని, ఎంతైనా ఇస్తామన్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారులుగా (ఎన్‌హెచ్) అభివృద్ధి చేసేవన్నీ టోల్ రోడ్లేనని, వాటి విషయంలో ఆందోళనే అవసరం లేదని వివరించారు. మరీ అవసరమైతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులెలా వచ్చాయో.. అలాగే రోడ్లకూ తీసుకొస్తామని, అప్పు చేసైనా రోడ్లను వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జి’లు అంశంపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 21 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని, అందులో రూ. 13,360 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో వేసిన రోడ్లు తొందరగా దెబ్బతిన్నాయని, అందుకే రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్ ప్రమాణాలతో వేసేందుకు చర్యలు చేపట్టడం వల్ల మొదటి ఏడాది ఆలస్యమైందన్నారు. పక్క రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రంలో రోడ్లు వేయాలన్నదే తమ ఆలోచనని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామని మంత్రి వివరించారు. రూ.100 కోట్లతో హైదరాబాద్ ఎన్‌హెచ్‌ల అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీ సుముఖంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించారని, ఇంకా రూ. 2,500 కోట్ల రోడ్లకు ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లోని ఎన్హెచ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రైపోర్టు అధ్యయనాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించామని.. ఇప్పటివరకు భువనగిరి, జహీరాబాద్, జడ్చర్లను పోర్టుల కోసం గుర్తించారని తెలిపారు. ఇంకా ఒకటీ రెండు ప్రాంతాలు ఉంటాయని, తుది నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. గోదావరిపై అన్ని బిడ్జిలను జల రవాణకు అనుగుణంగా నిర్మిస్తున్నామని, భద్రాచలం నుంచి మహారాష్ట్రకు జల రవాణాపై కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. బీటీ వేసిన పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బీ రోడ్లుగా మార్చుతామని, మండల కేంద్రాల నుంచి కొత్త జిల్లాలకు భవిష్యత్తులో నాలుగు లేన్ల రోడ్లు వేస్తామన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో మాత్రం డబుల్ రోడ్లను వేస్తామని మంత్రి వివరించారు. -
రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని, వారికి ఎప్పటికీ ద్రోహం చేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఒకవేళ మాట తప్పాల్సిన పరిస్థితి ఎదురైతే ఉరి వేసుకుంటామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజే శ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌తో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్.. రైతు పరామర్శ యాత్ర, సీపీఎం.. మహాజన పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కకుండా సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కోతల్లేని కరెంటు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణను వ్యతిరేకించి, పార్లమెంటులో తెలంగాణ ఇచ్చి తప్పు చేశారని ఇటీవల పార్లమెంటులో అన్న సీపీఎం ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేపడుతుందన్నారు. క్షమాపణ చెప్పి పాదయాత్ర చేయండి: పల్లా రాష్ట్ర ప్రజల కోసం సీపీఎం ఏనాడూ సానుకూలంగా ఆలోచించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మహాజన పాదయాత్ర చేపట్టాలని హితవు పలికారు. -
ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?
ఇలాంటి విపక్షాలు ఉండడం సిగ్గుచేటు: తుమ్మల నాగర్‌కర్నూల్: ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాల ని బంద్‌లు, ధర్నాలు చేస్తారని, కానీ ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్షాలు బంద్‌లు చేయ డం ఏమిటని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండ టం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని, అయినా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయన్నారు. గత పాలకుల అసమర్థతతోనే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చేసి నీరందిస్తున్నా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయన్నా రు. ప్రతిపక్షాలు చిల్లరరాజకీయాలను మా నుకోవాలని మంత్రి హితవు పలికారు. లెక్కలు చెప్పేందుకు సిద్ధమే: జూపల్లి తెలంగాణలో ఎవరెవరి హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు కేటాయిం చారో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరి నా ఎవరూ ముందుకు రావడంలేదని జూపల్లి అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు పట్టువదలమని నాగం, రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగంను ఓయూలో ఓ పట్టుపట్టాకే తెలంగాణ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. -
శ్రీవారి చరణాలకు తుమ్మల ‘పచ్చకర్పూరం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తిరుమల శ్రీనివాసునికి రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 21 వేల ప్రతులతో కూడిన ‘పచ్చకర్పూరం’ దివ్యగ్రంథాన్ని సమర్పించనున్నారు. ఈ దివ్య గ్రంథంలో దేవతల స్త్రోత్రాలు, పురాణగాథలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. వేంకటాద్రి, యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల ప్రత్యక్ష, పరోక్ష అక్షరమంత్ర దర్శనంగా ఆవిష్కృతమవుతున్న ఈ ‘పచ్చకర్పూరం’ గ్రంథాన్ని మంత్రి తుమ్మల నాణ్యతాప్రమాణాలతో ముద్రిస్తున్నారు. దేశం లో ఎందరో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు నిత్యం శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నప్పటికీ.. తొలిసారి ఇలాంటి అపురూప అక్షర ప్రయత్నాన్ని చేసి వేంకటేశుని చరణాలకు సమర్పిస్తున్న భక్తునిగా, మంత్రిగా తుమ్మల గుర్తింపు పొందనున్నారు. 250 పేజీల ఈ గ్రంథాన్ని ఈనెల మూడో వారంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందజేయనున్నట్లు తుమ్మల తెలిపారు. తిరుమల శ్రీవారిపై పూర్తి నమ్మకంతో ఈ దివ్య గ్రంథాన్ని సమర్పిస్తున్నట్లు వివరించారు. -
ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణం
అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చే శారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో రోజే ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావు గౌడ్ , ఖమ్మం నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చే సిన తుమ్మల అభినందన సభకు వచ్చిన పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, పలువురు నేతలు తుమ్మలను కలసి అభినందించారు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానన్నారు. -
మండలి సభ్యత్వానికి తుమ్మల రాజీనామా
26న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ పంపగా ఆయన ఆమోదించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడంతో తుమ్మల ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ నెల 26న ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం అధికార పార్టీలో అప్పుడే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పలువురు ఆశావహులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు విన్నవించుకుంటున్నారు. తుమ్మలను అభినందించిన సీఎం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అభినందనలు తెలి పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్బి.బేగ్, కొండబాల కోటేశ్వరరావు, పిడమర్తి రవి, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న నిర్ణయిస్తేనే.. పాలేరులో పోటీచేస్తా
తుమ్మల తనయుడు యుగంధర్ కోదాడ అర్బన్: తన తండ్రి నిర్ణయిస్తేనే.. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తెలిపారు. మంగళవారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ కుటుం బంలో తన తండ్రి మినహా వేరెవరూ ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరన్నారు. 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తుమ్మల యుగంధర్ తెలిపారు. -
ప్రాజెక్టుల పేరిట దోచుకున్న కాంగ్రెస్: తుమ్మల
రాయికల్/మెట్పల్లి: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తమ పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. లక్షల కోట్లు దోచుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి వద్ద రూ.70 కోట్ల వ్యయంతో గోదావరిపై నిర్మించే బ్రిడ్జి పనులకు బుధవారం మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కల్వకుంట్ల కవితతో కలసి తుమ్మల భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌పై కాం గ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 2.7 శాతంగా ఉంటే ప్రస్తుతం అది 3.1శాతానికి పెరిగిందని చెప్పారు. రూ.40 వేల కోట్లతో అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులను కలిపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. -
‘భక్తరామదాసు’ పనులు వేగవంతం చేయండి
ఇస్లావత్‌తండా(తిరుమలాయపాలెం): పాలేరు నియోజకవర్గంలోని 59వేల ఎకరాలకు సాగునీరు అందించే భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయూలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం పైపులైన్, కాలువ నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి సాగునీరు అందించాలనే సంకల్పం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యపడలేదని, తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అవకాశం వచ్చిందని, దీనికి ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలపడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వ్యవసాయపనులు కూడా ముగిసినందున పైపులైన్ నిర్మాణ పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత వరకు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దుమ్ముగూడెం ప్రాజెక్టు ఈఈ నాగేశ్వరరావుని ఆదేశించారు. పాలేరు ప్రాంత ప్రజలకు సాధ్యమైనంత తొందరగా సాగునీరు అందించడమే తన ముందు ఉన్న ప్రత్యేక ధ్యేయం అని, ఆ దిశగా అధికారులు కృషి చేయూలని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బోడ మంగీలాల్, సంజీవులు, ఆలుదాసు ఆంజనేయులు రాములు, కొలిచలం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు వనవాసం సురేష్‌రెడ్డి, భానోతు శ్రీను ఇస్లావత్‌తండా, సర్పంచ్ దాసరోజు సోమేశ్వరచారి ఉన్నారు. -
టీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో తుమ్మల సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో టీఆర్ఎస్ ఆవిర్భావసభను ‘న భూతో నభవిష్యతి’ అన్న రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఖమ్మం జిల్లాను పూర్తిగా గులాబీమయం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్ సభ పెట్టడమంటే విజయవాడలో సభ పెట్టినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్ఠి గా మాట్లాడారు. సభ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని, భారీగా ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన పాలేరు నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీకి పెట్టాలా.. వద్దా.. అనే విషయాన్ని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పోటీ చేసి, పాలేరులో పోటీకి దూరంగా ఎలా ఉంటామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నక్సల్ హింస వంటి సంఘటనల్లో చనిపోయినవారి విషయంలో ఆలోచించవచ్చుగాని, సాధారణ మరణంతో ఖాళీ అయిన స్థానాల్లో పోటీ లేకుండా ఎలా వదిలి పెడతారని వ్యాఖ్యానించారు. పాలేరులో తాను పోటీ చేస్తున్నానా, లేదా అంటూ జరుగుతున్న ప్రచారంపై తుమ్మల స్పందించారు. ‘ఎమ్మెల్సీ పదవీకాలం ఆరేళ్లకు సంబంధించింది. సీఎం ఇష్టాయిష్టాలను బట్టే ఏదైనా ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాకు మూడు నెలల వ్యవధిలోనే పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీగా గెలిపించారు. సీఎం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా..’ అని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. -
బంగారుతల్లిని కొనసాగించం
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని ప్రభుత్వం ఇకపై కొనసాగించబోదని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. పురిట్లోనే ఆడపిల్లలను చంపుకొనే పరిస్థితుల నుంచి ఆయా కుటుంబాలను బయటపడేసే బంగారుతల్లి పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత కోరారు. ఈ మేరకు తుమ్మల మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంతో పాటు, పుట్టిన ఆడపిల్ల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. వివాహ వయస్సు వచ్చాక పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థికసాయం అందిస్తున్నందున, బంగారు తల్లి వంటి నగదు బదిలీ పథకం అవస రం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి సమాధానం ఇచ్చారు. సూక్ష్మ సాగుకు సంబంధించి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం బదులిస్తూ.. డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసిన రైతులందరికీ సబ్సిడీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు నాబార్డ్ నుంచి రూ.1,000 కోట్లు తీసుకుంటున్నామని, మరో రూ.300కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు. -
రహదారులకు రూ.ఐదున్నర వేల కోట్లు
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణానికి రూ.ఐదున్నర వేల కోట్ల వరకు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్‌లోని న్యాక్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు గత సంవత్సరం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒప్పందం మేరకు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని, అలసత్వం ప్రదర్శించే అధికారులను కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే పనులకు సంబంధించి డీపీఆర్‌లు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. వాటిని కేంద్రానికి పంపితే అనుమతులు వస్తాయని, ఆ వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
రోడ్లు, భవనాల శాఖకు రూ.5500కోట్ల బడ్జెట్!
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు వచ్చే బడ్జెట్లో రూ.5500 కోట్ల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణం ముమ్మరంగా జరగాల్సి ఉన్నందున నిధుల అవసరం ఎక్కువగానే ఉంటుందని, ఆ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మేడారం జాతర, కృష్ణా పుష్కరాల పనులపై ఆరా తీశారు. రూ.1,730 కోట్లు ఇవ్వండి... మహిళా శిశుసంక్షేమశాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,730కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాదికంటే ఇది రూ.170 కోట్లు అదనం. బడ్జెట్ ప్రతిపాదనలపై మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిం చారు. ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలగించాలని, శిశు సంక్షేమశాఖ పరిధిలోని విద్యకు సంబంధించిన యూనిట్లను విద్యాశాఖకు బదలాయించాలని ఆయన ఆదేశించారు. -
ప్రజలారా.. ఆలోచించండి
ఇలాంటి తెలంగాణ కోసమే పోరాడారా: జానా సాక్షి, హైదరాబాద్: ‘‘బెదిరింపులు, ప్రలోభాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోంది. ఆ పార్టీ సాధిస్తున్న విజయాల్లో ఏది విజయమో, ఏది బలవంతమో తెలియని గందరగోళం నెలకొంది. కేవలం అభివృద్ధికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్లు కట్టుకథలు చెప్పిస్తున్నారు. అసలు కారణాలేంటో అందరికీ తెలుసు’’ అంటూ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజలారా..! ఆలోచించండి. మీరు పోరాడింది ఇలాంటి తెలంగాణ కోసమేనా? మమ్మల్ని త్యాగాలు చేయమన్నది దీని కోసమేనా? ఈ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరేవారితో కనీసం పాత పార్టీకి రాజీనామా చేయించడం లేదని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏమాత్రం అమలు కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక కోటా శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్ మినహా రాష్ట్రంలోని ఇతర ఏడు జిల్లాల్లో గెలిచేందుకు టీఆర్ఎస్కు ఏమాత్రమూ బలం లేదని జానా అన్నారు. అయినా ఆ ఏడు జిల్లాల్లో సైతం గెలుస్తామని ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెప్పుకోవడం బెదిరింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్కు కేవలం నలుగురు ఎంపీటీసీలే ఉన్నా, ‘ఎమ్మెల్సీ స్థానాన్ని మా పార్టీ (టీఆర్ఎస్) గెలుచుకుంటుంది’ అని ఆ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం తగదన్నారు. ‘‘కేవలం నలుగురు సభ్యులతో అక్కడ ఎలా గెలుస్తారు ? ఎన్ని పార్టీలనైనా ప్రలోభపెడతారా?’’ అని ప్రశ్నించారు. ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్తో పోల్చితే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్యా బలం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలు అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ను ఏకపక్షంగా గెలిపించారని గుర్తు చేశారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి పనుల విషయంలో మేం సహకరిస్తున్నాం. కానీ అందుకు ప్రతిఫలంగా టీఆర్ఎస్ మాత్రం ప్రలోభాలతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయింపులు తగవు. ప్రజాస్వామ్య అభివృద్ధే అసలైన అభివృద్ధి’’ అంటూ హితవు పలికారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తామంటూ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకే తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. -
మంత్రి గారూ.. మా దప్పిక తీర్చండి
తుమ్మలకు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరువాసుల వినతి దమ్మపేట: నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి నీటిని విడుదల చేసేలా చూడాలని ఆ ప్రాంతవాసులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రి తుమ్మలను గురువారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పలువురు నేతలు కలిశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు అడుగంటి పోయాయని, పశువులకు సైతం తాగటానికి నీరులేదని వారు తుమ్మల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. సాగర్ జలాలను విడుదల చేసి తమ దప్పిక తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తిరుపూరు ఎన్ఎస్పీ ప్రాజెక్ట్ చైర్మన్ వై.పుల్లయ్యచౌదరి, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు సుంకర కృష్ణమోహనరావు, సీతారాంప్రసాద్, ఆళ్ల గోపాలకృష్ణ ఉన్నారు. -
డివిజన్ కార్యాలయాలను ప్రారంభించిన మంత్రి
సత్తుపల్లి : సత్తుపల్లి డివిజన్ పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖల డివిజన్ కార్యాలయాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిర్మించిన ఐటీడీఏ హాస్టల్ భవనాన్ని చూసి.. ఇరిగేషన్ శాఖ స్థలంలో హాస్టల్ భవనానికి ఎలా అనుమతించారని ఐడీ డీఈఈ శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్ ఆదేశాలతో హాస్టల్ భవనం నిర్మించినట్లు ఆయన బదులిచ్చారు. చూపులు కూడా కరువాయే... ‘ఓటుకు కోట్లు’ కేసులో పరస్పర ఆరోపణలు చేసుకున్న తరువాత తొలిసారిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడంతో అందరిచూపు ఈ ఇద్దరిపైనే ఉంది. ఎమ్మెల్యే సండ్ర జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఇతర టీఆర్ఎస్ నేతలతో ముచ్చటిస్తూ కనిపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కనీసం ఒకరివైపు ఒకరు కూడా చూసుకోకపోవటం చర్చానీయాంశమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర పంచాయతీ చైర్పర్సన్ దొడ్డాకుల స్వాతి, ఎంపీపీలు జ్యేష్ట అప్పారావు, మోటపోతుల వెంకటేశ్వరరావు, వి.రజిత, జెడ్పీటీసీలు హసావత్ లక్ష్మి, గుగ్గులోతు భాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ భద్రాద్రికి సమాయత్తం..!
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలు ముగిసిన మరుసటి రోజు నుంచి స్వచ్ఛ భద్రాద్రి పేరుతో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. గోదావరి పుష్కర స్నానం కోసం భద్రాచలానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీ సీతారాముల వారి దర్శనం చేసుకోవాలనే వాంఛతో భద్రాచలం పుష్కర ఘాట్లలోనే స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానం చేసిన భక్తులు గోదావరి తీరంలో పూజాది కార్యక్రమాల పేరిట వివిధ రకాల వ్యర్థ పదార్థాలను విడిచిపెడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం పట్టణం, గోదావరి తీరం చిత్తడిగా మారింది. ఇప్పటికే గోదావరి పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతోంది. అయితే గత పుష్కరాల అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న అధికారులు, భద్రాచలం మొత్తాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దితేనే భవిష్కత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నిర్ణయించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపటంతో అధికారులు ఇందుకనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు భద్రాచలంలోనే ఉండి, చెత్త చెదారాన్ని తొలించే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణరుుంచారు. పుష్కర ఘాట్ల నుంచి బ్రిడ్జి సెంటర్, ఇందిరా గాంధీ విగ్రహం మొదలుకొని ఆర్డీవో కార్యాలయం మీదుగా రామాలయంనకు వెళ్లే దారి మొత్తాన్ని అవసరమైతే నీటితో కడిగేసేలా ఆలోచన చేస్తున్నారు. మిగతా ఐదు రోజుల్లో పారిశుధ్య కార్మికులతో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ పేరుతో క్లీన్ భద్రాద్రి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అవసరమైతే ఆ వారం రోజుల పాటు భద్రాచలం రామాలయూనికి ఇతర ప్రాంతాల నుంచి భక్తులను అనమతించకుండా, స్వచ్ఛ భద్రాద్రిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.