Modernization
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
GMR: నాగ్‌పూర్ విమానాశ్రయం ఆధునీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. ‘వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్‌పూర్‌తో (మిహా న్) జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్ట్‌కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది. -
ఆధునీకరణవైపు వేగంగా డిస్కంల అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆధునీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్)ల్లో పనుల వేగవంతానికి రాష్ట్ర ఇంధన శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ పంపిణీ, సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, ప్రస్తుత వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రీవాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఉపయోగపడుతుంది. పాత నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం ఈ పథకం ముఖ్యఉద్దేశం. ఈ పథకంలో ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థను బాగుచేసి, కొత్త పరికరాలతో ఆధునీకరించేందుకు ప్రణాళికలను ఇప్పటికే అధికారులు రూపొందించారు. దీనివల్ల వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త కొత్తగా కరెంట్ వ్యవస్థ విద్యుత్ ప్రమాదాలు జరగడానికి, విద్యుత్ సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్ లోడ్ కావడమే ప్రధాన కారణమవుతుంది. ఆర్డీఎస్ఎస్లో భాగంగా వాటిని గుర్తించి లోడ్ సరిచేస్తారు. ఒకే ఫీడర్పై వ్యవసాయ, ఇతర సర్వీసులు ఉన్న చోట వాటిని వేరు చేసి, వ్యవసాయానికి ప్రత్యేక లైన్లు అందుబాటులోకి తెస్తారు. తద్వారా వ్యవసాయ బోర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహాలకు నిరంతర సరఫరాకు విఘాతం రాకుండా ఉంటుంది. అదే విధంగా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను బాగుచేయడానికి కూడా ఇందులో నిధులు కేటాయించారు. మొదటి దశలో రాష్ట్రంలో 30 శాతం ఓవర్ లోడ్ అయిన ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను సరిచేసి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం, 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లలో 200 కిలోమీటర్ల మేర పాత కండక్టర్లు మార్చడం, సాంకేతిక సంబంధిత (ఐటీ) పనులు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను డిస్కంలు చేపడుతున్నాయి. ఏడాదిన్నరలోపే పెట్టుబడి వెనక్కి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్ల జీవితకాలం 25 ఏళ్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వినియోగ సమయం పెరిగేకొద్దీ కోర్ సాచురేషన్, వైండింగ్ ఇన్సులేషన్ డ్యామేజ్, ఆయిల్ నాణ్యత లోపించడం కారణంగా ట్రాన్స్ఫార్మర్లలో నష్టాలు పెరుగుతాయి. పాత ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటం వల్ల సమస్యలు తగ్గుతాయి. స్టార్‌రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ల వినియోగం ద్వారా సుమారు 20 నుంచి 25 శాతం మేరకు సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి ఏడాదిన్నరలోపే వెనక్కి వస్తుంది. నాణ్యమైనవి కొనడం వల్ల ఇతర డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లతో పోల్చితే ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చే ఏడాదికల్లా మొదటిదశ పూర్తి ఆర్డీఎస్ఎస్ పథకం తొలి దశలో పాతవైపోయిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, బ్రేకర్లు మార్చడం ద్వారా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లు విభజన, తుపాను ప్రభావిత ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు, స్మార్ట్ మీటర్లు టెండర్ల ప్రక్రియను దశల వారీగా చేపట్టి, పనులను సంబంధిత గుత్తే దారులకు అప్పగించారు. రెండవ దశ విద్యుత్ వ్యవస్థ ఆధునికరణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తనిఖీ కోసం డిస్కంలు పంపించాయి. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తయారు చేసి డిపార్ట్మెంటల్ రివ్యూ కమిటీ (డీఆర్సీ), రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం కోసం ఇంధన శాఖకు పంపుతాయి. ఆర్డీఎస్ఎస్ పనులను డిస్కంలు నిరీ్ణత సమయంలో పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ గ్రాంటు లభిస్తుంది. మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేయడానికి 2025 వరకూ గడువు ఉంది. -
72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్ కోసం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2023–24లో జూన్ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64 కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 79 ర్యాంకుల మెరుగు ప్రపంచబ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్టు (డీబీఆర్)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్.. వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, ఎన్.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబిచ్చారు. దక్షిణమధ్య రైల్వేలో ఖాళీలు దక్షిణమధ్య రైల్వేలో గ్రూప్ ఏ, సీల్లో పలు ఖాళీలున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రూపు ఏలో 110, గ్రూపు సీలో 10,338 ఖాళీలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ ప్రాంతాలు సికింద్రాబాద్ఆర్ఆర్బీ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోకి వస్తాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు సికింద్రాబాద్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ల ప్రకారం దేశంలోని 21 బోర్డుల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయండి అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విదేశాంగమంత్రి జయశంకర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుచేస్తే అల్లూరి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు కూడా ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన విశాఖ పోర్టు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ పోర్టు అథారిటీ చరిత్ర సృష్టించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో తన రికార్డును తానే తిరగరాసింది. మునుపెన్నడూ లేనివిధంగా 73.73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 7 శాతం వృద్ధిని నమోదు చేసి తూర్పు తీరంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దఫా స్టీమ్ కోల్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ కోల్, ఎరువులు వంటి సరుకు రవాణాలో వృద్ధిని నమోదు చేసింది. పోర్టులో ఆధునికీకరణ పనులు భవిష్యత్‌లో విశాఖ పోర్టు మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునికీకరణ వైపు పయనిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2022–23 ఆర్థిక సంవత్సరంలో పోర్టు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడంతో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2022 డిసెంబర్ 31 నుంచి బేబీ కేప్(260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు) వెస్సల్స్ ఇన్నర్ హార్బర్లోకి వచ్చే విధంగా ఆధునికీకరణ చేపట్టారు. రూ.151 కోట్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పోర్టును ల్యాండ్‌లార్డ్ పోర్టు చేయడంలో భాగంగా పీపీపీ పద్ధతిలో రూ.655 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు తుది దశలో ఉన్నాయి. స్టాక్ నిల్వ కేంద్రాల నుంచి కాలుష్యం వెదజల్లకుండా ఉండేందుకు రూ.120 కోట్లతో 15 లక్షల నిల్వ సామర్థ్యంతో కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. మరిన్ని ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయి. తుది దశలో క్రూయిజ్ టెర్మినల్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా క్రూయిజ్ టెర్మినల్ పనులు జోరుగా సాగుతున్నాయి. 2,500 మంది పర్యాటకులు ఉండే క్రూయిజ్ వెస్సల్‌ను ఈ బెర్త్‌లో అపరేట్ చేసే విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ క్రూయిజ్ టెర్మినల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కార్యకలాపాలు ♦ 2022 ఫిబ్రవరి 25న ఈస్ట్ క్యూ–6 బెర్త్‌లో ఎంవీ దిస్పిన.కె నౌక నుంచి రికార్డు స్థాయిలో 20,050 టన్నుల క్రోమ్ ఓర్‌ను పోర్టులో దించింది. ♦ 2022 సెపె్టంబర్ 25న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో ఫెర్రో మాంగనీస్ స్లాగ్‌ను ఎంవీ ఎస్జే స్టార్ నౌక నుంచి పోర్టులో దించారు. ♦ 2022 అక్టోబర్ 16న ఈస్ట్ క్యూ7 బెర్త్ నుంచి హై కార్బన్ ఫెర్రో మాంగనీస్‌ను ఎంవీ ఆలమ్ సయాంగ్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2022 అక్టోబర్ 17న వెస్ట్ క్యూ–1 బెర్త్‌లో 29,500 టన్నుల ఐరన్ ఓర్(పిల్లెట్స్)ను ఎంవీ విశ్వవిజేత నౌకలోకి లోడింగ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 1న వెస్ట్ క్యూ–3 బెర్త్‌లో 23,030 టన్నుల ఐరన్ ఓర్ ఆక్సైడ్‌ను ఎంవీ అగియా ఇరిని ఫోర్స్ నౌక నుంచి అన్లోడ్ చేశారు. ♦ 2022 డిసెంబర్ 23న వెస్ట్ క్యూ–6 బెర్త్‌లో 16,478 టన్నుల ఫ్లైయా‹Ùను ఎంవీ కింగ్ ఫిషర్ నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 మార్చి 10న ఈస్ట్ క్యూ–6 బెర్త్ నుంచి 8,864 టన్నుల స్టీల్ బ్లూమ్స్‌ను ఎంవీ ఎంఎక్స్ డిక్సియామెన్ నౌకలోకి లోడ్ చేశారు. ♦ 2023 ఏప్రిల్ 26న వెస్ట్ క్యూ–2 బెర్త్‌లో 44,374 టన్నుల ఐరన్ ఓర్‌ను ఎంవీ జల కల్పతరు నౌకలోకి ఎక్కించారు. ♦ 2023 ఏప్రిల్ 29న ఈస్ట్ క్యూ–1 బెర్త్‌లో 36,177 టన్నుల పెట్రోలియం కోక్‌ను ఎంవీ అన్ చాంగ్ నౌక నుంచి దించారు. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. భూముల మానిటైజేషన్ ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్‌ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్ఎల్ స్మిత్‌ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్‌లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది. క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రయివేట్(ఎస్‌ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్‌ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది. -
Nandyal: అత్యాధునికంగా సర్వజనాసుపత్రి
బొమ్మలసత్రం: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. ఈ కోవలోనే నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడంతో పాటు వివిధ విభాగాలకు ప్రత్యేక గదులను నిర్మించింది. ఆసుపత్రి ఏర్పాటైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఆధునీకరించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాల ద్వారా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాల్లో దాదాపు 23 రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. ఇవే కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 గదులను నిర్మించారు. ఇదే సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. అందుబాటులోకి ఆధునాతన వైద్యం నంద్యాల జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల రూపుదిద్దుకుంటోంది. స్థానిక సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే ఓపీ భవనం, జిరియాట్రిక్ భవనం, డీఈఐసీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి రోజు 1,400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని పాడుబడిన భవనంలోనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆసుపత్రి రూపురేఖలు మార్చేయడంతో ఆపరేషన్ థియేటర్లో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ శస్త్ర చికిత్సలన్నీ ఇక్కడే.. ఆర్థో విభాగం: చేతులు, కాళ్లలో విరిగిన ఎముకలకు సర్జరీ, ఎముకలకు రాడ్లు, ప్లేట్లు అమర్చడం చేస్తారు. జనరల్ సర్జరీ విభాగం: హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్, పైల్స్, పిస్టులా, కొలొసెక్టమి, పారాటిడ్, పర్ఫరేషన్, లంప్ బ్రిస్ట్, సింపుల్ థైరాయిడ్, లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు. ఈఎన్టీ విభాగం: అడినో టోన్సిలెక్టోమీ, టింపోనిప్లాస్టి, మిరిన్గోటోమి, సెప్టోప్లాస్టి, ఫెస్, టర్బినో ప్లాస్టి తదితరాలు. అధునాతన యంత్రాలు.. ఉపయోగాలు ► ఎండోస్కోపి యంత్రం: ఈ యంత్రాన్ని రూ.20 లక్షలతో ఏర్పాటు చేశారు. కడుపు లోపలి భాగంలోని అల్సర్, క్యాన్సర్ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది. ► లాప్రోస్కోపి : ఈ యంత్రం దాదాపు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 లక్షలతో ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. కోత లేకుండా శరీరంపై చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ► సీఏఆర్‌ఎం : ఈ యంత్రం ఖరీదు రూ.12 లక్షలు. ఆపరేషన్ తర్వాత ఎముకలు సరైన క్రమంలో అమర్చినట్లు నిర్ధారించుకుంటారు. ► హారిజాంటల్ ఆటోక్లేవ్: ఈ యంత్రాల ఖర్చు రూ.11 లక్షలు. 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు, బట్టలపై క్రిములను నశింపజేస్తాయి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్: ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఈ యంత్రం ద్వారా రోగికి కృత్తిమ ఆక్సిజన్ అందిస్తారు. ఈ యంత్రం ఖరీదు రూ.50వేలు. అవసరానికి తగిన విధంగా ప్రత్యేక గదులు ► సీఎస్ఎస్డీ గది: ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రీ మెటీరియల్‌ను ఆసుపత్రిలో అవసరమయ్యే గదులకు పంపుతారు. ► సెప్టిక్ ఓపి గది: శరీరంలోని గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్ అయితే వారికి ఈ గదిలో చికిత్సలు అందిస్తారు. ► స్టాఫ్ నర్సులు, సర్జరీ వైద్యుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు. ► ప్రీ అనస్తీషియా గది: అనస్తీషీయా డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. ► థియేటర్లో సిలిండర్ స్టోర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలకు ప్రత్యేక గదులు. ► పీజీ విద్యార్థులకు అవసరమయ్యేలా స్టూడెంట్ డెమో గది. ► అనస్తీషియా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు. ► ఆపరేషన్ తరువాత శుభ్రం చేసిన నీటిని డర్టీకారిడార్ ద్వారా బయటకు పంపేందుకు డిస్పోజల్ జోన్. ► ఆపరేషన్ థియేటర్లో మందులు నిల్వకు డ్రగ్స్ స్టోర్. ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించాం నాలుగు నెలలుగా ఆపరేషన్ థియేటర్లో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. రోగులకు శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేస్తాం. ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. – ప్రసాదరావు, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, నంద్యాల -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించే ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఇదిగో అదిగో అంటూ ఇంతకాలం ఊరించిన రైల్వే.. ప్రస్తుత భవనాలను కూల్చి వాటి స్థానంలో విమానాశ్రయం తరహా వసతులతో పునర్నిర్మించే ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. రూ.699 కోట్లకు కోట్ చేసిన ఢిల్లీ సంస్థ గిరిధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్‌ను దక్కించుకుంది. 36 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో రైల్వే ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యం కోసం.. దేశవ్యాప్తంగా 123 స్టేషన్లను రూ.50 వేల కోట్లతో ఆధునీకరించాలని రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా నాన్ సబర్బన్ గ్రేడ్–1 పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ స్టేషన్‌ను అప్‌గ్రెడేషన్ ప్రాజెక్టు కోసం గతంలోనే రైల్వే బోర్డు ఎంపిక చేసింది. రూ.500 కోట్ల వార్షికాదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉపయోగించే స్టేషన్‌ను ఈ గ్రేడ్ కింద గుర్తిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రోజుకు సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారు. నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేసిన రైల్వేబోర్డు.. ఈ స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టెండర్లు ఖరారు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం చాలా అవసరమని, అందుకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ భవనాలు, పార్కింగ్ సదుపాయాలతో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు వైపులా మూడంతస్తులతో రెండు భారీ భవన సముదాయాలు ఉంటాయి. రెండు భవనాలను అనుసంధానిస్తూ ట్రావెలేటర్స్ (ఆటోవాకింగ్ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇక దక్షిణ భాగం వైపు 2వేల వాహనాలను నిలిపేలా మల్టీలెవల్ అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది.. ఉత్తరభాగం వైపు మూడు వేల వాహనాలను నిలిపేలా ఐదు అంతస్తుల పార్కింగ్ టవర్ నిర్మిస్తారు. ప్లాట్ఫామ్లన్నింటినీ ఆధునీకరిస్తారు. అన్నింటినీ కవర్ చేస్తూ పైకప్పు ఉంటుంది. రైల్వేస్టేషన్‌ను మెట్రోరైల్స్టేషన్లకు అనుసంధానిస్తూ స్కైవేలను నిర్మిస్తారు. -
నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, నెల్లూరు రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్లో రూ.360 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించారు. తాజాగా రూ.102కోట్లతో నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రణాళికను దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం నెల్లూరు రైల్వే స్టేషన్‌కు రోజూ సగటున 30వేల మంది ప్రయాణికులు వచ్చి, వెళుతుంటారు. భవిష్యత్‌లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా స్టేషన్లో వసతులను మెరుగుపరిచేందుకు రూ.102కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్‌కు పశ్చిమ వైపు కొత్తగా జీ+2 భవనం నిర్మిస్తారు. తూర్పు వైపు రైల్వే స్టేషన్ భవనాన్ని జీ+1గా విస్తరిస్తారు. ప్లాట్‌ఫారాలు 1, 2, 3, 4లను అభివృద్ధి చేసి, కొత్తగా ఫ్లోరింగ్, పైకప్పులు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సబ్ వేను రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ దిశల నుంచి ప్లాట్‌ఫాం–4తో అనుసంధానిస్తారు. రక్షిత మంచినీటి వ్యవస్థను, వాటర్ ట్రీట్మెంట్, సివరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ పనులను 21 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రణాళికను రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. -
రూ.600 కోట్లతో 3 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రైల్వేస్టేషన్లను మల్టీమోడల్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వేస్టేషన్లను అందుకోసం ఎంపిక చేసింది. మొదట పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రైల్వేశాఖ భావించింది. కానీ ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడంతో సొంత నిధులతో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఇటీవల ఆమోదించింది. వీటి అభివృద్ధికి రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీనిపై రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ తుది ఆమోదం తెలిపితే తదుపరి ప్రక్రియను చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. వచ్చే మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయాలని భావిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఆధునికీకరణ, వసతులకు ప్రాధాన్యం గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇండోర్ గేమ్స్ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి. కానీ ప్రస్తుతం రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసింది. ప్రధానంగా రైల్వేస్టేషన్లకు కొత్తరూపు ఇవ్వడం, ప్రయాణికుల వసతులు మెరుగుపరచడం వంటి పనులతోపాటు భద్రతకు ప్రాధాన్యమివ్వనున్నారు. అందుకోసం ప్రయాణికులకు వసతులు, ఇంటర్‌మోడల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ, ఆహ్లాదకర అంశాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, రైల్వే సమాచార వ్వవస్థ అనే ఆరు కేటగిరీల కింద అభివృద్ధి చేయనున్నారు. రైల్వే స్టేషన్లలో కల్పించనున్న వసతులు ► ప్రాంత విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్‌కు కొత్తరూపు తీసుకొస్తారు. ► రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టంతో అనుసంధానిస్తారు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానింగ్ వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుతోపాటు రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బందిని నియమిస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ► స్టేషన్లోనే ఇంటర్ఫేసెస్, స్వైపింగ్ టికెట్ మెషిన్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు. ► అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఎస్కలేటర్లు, ప్రధాన ద్వారం వద్ద తగినన్ని ఎలివేటర్లను ఏర్పాటు చేస్తారు. బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతారు. ► ఇంటర్‌మోడల్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే సిటీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోరిక్షాల కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌ను నెలకొల్పుతారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్ నుంచి ఆ ప్రత్యేక మార్గంలో బయటకు వచ్చి బస్‌స్టేషన్, విమానాశ్రయంతోపాటు ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. ► రైల్వేస్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫాంలను విశాలంగా తీర్చిదిద్దుతారు. ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. మందుల దుకాణాలు, రిటైల్ దుకాణాలు, ఏటీఎంలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. -
అమరవీరులను అవమానించడమే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ ఆధునీకరణ పనులను ‘అమరవీరులకు కలిగిన అవమానం’గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బలిదానం అంటే అర్ధం తెలియని వారే ఇలా అవమానించగలరని ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘నేను అమరవీరుడి కొడుకును. అమరులకు కలిగిన అవమానాన్ని ఏ మాత్రం సహించబోను. స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకోని వారు దీనిని అర్థం చేసుకోలేరు’ అని పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయంలో ఆధునీకరణ పేరుతో చేసిన మార్పులు, చేర్పులు చరిత్రను నాశనం చేసేవిగా ఉన్నాయంటూ వెల్లువెత్తుతున్న విమర్శలపై ఒక మీడియా కథనాన్ని మంగళవారం ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మార్పులు బ్రిటిష్ పాలన, జనరల్ డయ్యర్ పాల్పడిన అకృత్యాలను ప్రజలకు స్మరణకు తెచ్చేలా చేయడానికి బదులు..తుడిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ఆరోపించారు. ఆధునీకరించిన జలియన్ వాలాబాగ్ మెమోరియల్ సముదాయాన్ని శనివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. కొత్తగా చేపట్టిన మార్పులపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు కురిపించగా అదే పార్టీకి చెందిన సీఎం అమరీందర్ మాత్రం ప్రశంసలు కురిపించడం గమనార్హం. జలియన్‌వాలా బాగ్ మెమోరియల్ సముదాయం ఆధునీకరణ అనంతరం చూడటానికి చాలా బాగుందన్నారు. ఈ సముదాయంలో ఏఏ నిర్మాణాలను తొలగించారో తనకు తెలియదన్నారు. రాహుల్ ట్విట్టర్లో విమర్శించిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునీకరణ
న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్ఎస్ఎల్ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
‘గుంటూరు చానల్’లోనూ కమీషన్ల కక్కుర్తి
సాక్షి, అమరావతి : గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులు కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు దక్కవని నిర్ధారణకు వచ్చిన ముఖ్య నేత.. జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెక్నికల్ బిడ్ స్థాయిలోనే టెండర్‌ను ఈ నెల 7న రద్దు చేయించారు. తాజాగా అంచనా వ్యయాన్ని మరింతగా పెంచేయించి, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలను మార్చేసి టెండర్ నోటిఫికేషన్ ఇప్పించారు. ఫిబ్రవరి 4న టెక్నికల్ బిడ్, 8న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేసి అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టనున్నారు. ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కమీషన్‌గా రూ.100 కోట్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్‌కు నాలుగు టీఎంసీలు కేటాయించారు. బ్యారేజీ ఎగువన ప్రారంభమయ్యే ఈ కాలువ 47 కి.మీ.ల పొడవున తవ్వారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో 28,500 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాల్టీలకు మంచినీటితోపాటు కాలువ పరిసర 27 గ్రామాలకు తాగునీటి కోసం 32 చెరువులకు దీని ద్వారానే నీటిని సరఫరా చేస్తారు. 600 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్విన ఈ కాలువ పాడైపోయింది. దీంతో కాలువను విస్తరించి లైనింగ్ చేయడంతోపాటూ సుద్దపల్లి మేజర్, కోవెలమూడి మేజర్ డిస్ట్రిబ్యూటరీలను ఆధునికీకరించేందుకు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలపై సర్కార్ 2015, మే 27న ఆమోదముద్ర వేసింది. ఆధునికీకరణ పనులకు రూ.378.25 కోట్లను మంజూరు చేస్తూ మే 27, 2015న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడున్నరేళ్ల తర్వాత టెండరా? ఐదేళ్లుగా గుంటూరు చానల్ కింద ఆయకట్టుకు సర్కార్ సక్రమంగా నీళ్లందించిన దాఖలాలు లేవు. ఏటా పంటలు ఎండిపోవడం వల్ల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గుంటూరు చానల్‌ను ఆధునికీకరించడానికి నిధులు మంజూరు చేసిన మూడున్నరేళ్ల తర్వాత టెండర్ పిలవడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందిస్తామని రైతులను మభ్యపెట్టడం, ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించి భారీ ఎత్తున కమీషన్ దండుకోవడమే లక్ష్యంగా ఆ పనులు చేపట్టింది. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణ.. ఆధునికీకరణ పనులకు కి.మీ.కు గరిష్టంగా రూ.3 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. 47 కి.మీ. కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.141 కోట్లు ఖర్చవుతుంది. కాలువపై 172 సిమెంటు కట్టడాల (అండర్ టన్నెల్స్, సూపర్‌పాసేజ్‌లు, బ్రిడ్జిలు)ను తొలగించి.. కొత్తగా నిర్మించడానికి రూ.88 కోట్లు వ్యయమవుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన గుంటూరు చానల్ ఆధునికీకరణ పనులకు రూ.229 కోట్లకు మించి వ్యయం కాదు. కానీ అంచనా వ్యయాన్ని రూ.330 కోట్లకు పెంచేసి డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 31న టెక్నికల్ బిడ్.. జనవరి 4న ప్రైస్ బిడ్ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆరుగురు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. అయితే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కవనే నెపంతో సాంకేతిక బిడ్ తెరవకుండానే ముఖ్య నేత టెండర్‌ను రద్దు చేయించారు. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నిబంధనలు తాజాగా అంచనా వ్యయాన్ని రూ.332 కోట్లకు పెంచేసి.. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టి ఈ నెల 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో పదేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా 7.70 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి, 1,33,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి ఉండాలని నిబంధన పెడితే.. తాజాగా కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మట్టి పనుల పరిమాణాన్ని 3 లక్షల క్యూబిక్ మీటర్లకు, కాంక్రీట్ పనుల పరిమాణాన్ని 1.31 లక్షలకు తగ్గించారు. పదేళ్లలో ఒక్క ఏడాదైనా కనీసం రూ.83 కోట్ల విలువైన ఇదే రకమైన పనులు పూర్తి చేసి ఉండాలని మరో నిబంధన పెట్టారు. గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీకన్స్ట్రక్షన్), బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్), ఎస్డీఆర్ (స్టాటజిక్ డెట్ రీకన్స్ట్రక్షన్) విధానాలు అమలు చేయని కాంట్రాక్టర్లే అర్హులని నిబంధనలు విధించారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో సిమెంటు లైనింగ్ చేసిన కాంట్రాక్టర్లే షెడ్యూలు దాఖలు చేయడానికి అర్హులని షరతు విధించారు. ఇతరులు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే.. టెక్నికల్ బిడ్‌లో అనర్హత వేటు వేయించి, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రూ.వంద కోట్లకుపైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
మరికొద్ది సేపట్లో ప్లాట్‌ఫాం నం..
దేశంలో రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, సుఖవంతంగా మార్చే చర్యలు ఊపందుకున్నాయి. ఈ దిశలో చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గతంలోని ఇమేజీకి భిన్నంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నవీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక ఫలాల రూపంలో ప్రయాణికులు సౌకర్యాలు, ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతి లోకో మోటివ్ ఇంజన్లో జీపీఎస్ పరికరాలు అమర్చడం మొదలు డేటా లాగర్స్ రైలు ప్రయాణ సమయ పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఆర్ఐ) ను ఉపయోగించి మెయింటెనెన్స్, అందుబాటులోని రైల్వే ఆస్తుల వినియోగం, పర్యవేక్షణ, సెన్సర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన స్మార్ట్ కోచ్‌ల వినియోగం ఇలా అనేక అంశాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. ఇలాంటి నూతన ప్రణాళికల అమల్లో భాగంగా పలు ప్రా జెక్టులు చేపడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అవేమిటంటే.. నిర్దేశిత సమయానికి రైళ్లు రాకపోకలు సాగించేలా గతంలో స్టేషన్ మాస్టార్లు రైళ్ల సమయాన్ని రికార్డు చేసే విధానానికి బదులుగా ఇంటర్ చేంజ్ పాయింట్లలోనే ఈ సమయం నమోదు చేసేందుకు డేటా లాగర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్లో రైళ్ల సమాచారం కనిపిస్తుంది. డేటా లాగర్స్ వల్ల గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 73–74 శాతం సమయపాలన పెరిగినట్లు రైల్వే మంత్రి చెబుతున్నారు. ప్రతి లోకోమోటివ్ ఇంజన్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అమర్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధంగా మొబైల్ ఫోన్లో ప్రతి రైలు ఎక్కడుందో తెలుసుకునే వీలుంటుంది. దీంతో ఎప్పటికప్పుడు రైలు గమనం.. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైల్వేల విద్యుదీకరణ వల్ల ఏటా 200 కోట్ల డాలర్ల మేర ఆదా చేయొచ్చని రైల్వే శాఖ అంచనా. డీజిల్ ఇంజన్లకు మరమ్మతులు చేస్తారు. విద్యుత్ ఇంజన్లలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సమర్థతను పెంచుకునేందుకు వీలుగా ‘స్మార్ట్ టైం టేబుళ్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే కృషి జరుగుతోంది. ప్రస్తుత రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచే చర్యలతో పాటు లక్షన్నర వరకున్న బ్రిడ్జీల స్థితిగతులను పరిశీలించి, వాటిని మరింత మెరుగ్గా చేస్తారు. -
నిర్మాణాల్లో ‘పోలీస్’ వేగం
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల భవన నిర్మాణాలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు. పదవీ బాధ్యతలు స్వీకరించి సోమవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తోడ్పాటుతో పోలీసుశాఖకు కొత్త భవనాలు, క్వార్టర్లు, ఠాణాల ఆధునీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 95 శాతం వృద్ధిరేటు సాధించామని, ఈ ఏడాది బడ్జెట్లో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 464.46 కోట్లను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ హౌసింగ్ కార్పొరేషన్‌పై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని అన్నారు. పోలీసు భవనాలనే కాకుండా జైళ్ల, అగ్నిమాపకశాఖ, హార్టి్టకల్చర్ కాలేజీలు, ఇతర విభాగాల్లోని భవనాల నిర్మాణ బాధ్యతలనూ కార్పొరేషన్ చేపట్టడం గర్వకారణమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 13 జిల్లాల్లో పోలీస్ హెడ్క్వార్టర్లు(డీపీవో), పరేడ్ గ్రౌండ్స్, క్వార్టర్లు నిర్మిస్తున్నట్టు దామోదర్ తెలిపారు. సిద్దిపేటతోపాటు రామగుండం కమిషనరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 313 పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 103 కొత్త ఠాణాలను నిర్మిస్తున్నామని, రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పోలీసు గెస్ట్‌హౌస్, వెల్ఫేర్ సెం టర్ నిర్మాణం జరుగుతోందన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పారదర్శకంగా జరగడంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ బి. మల్లారెడ్డి కృషి ఎంతో ఉందని, సీఈ గోపాలకృష్ణ, ఎస్ఈ విజయ్‌కుమార్ తో పాటు మిగిలిన సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని దామోదర్ కొనియాడారు. సీఎం తోడ్పాటు మరువలేనిది: మల్లారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు పెద్దగా గుర్తింపు లేదని, కానీ స్వరాష్ట్రం లో పక్కా నిర్మాణాలన్నింటినీ తామే చేపట్టడం గర్వంగా ఉందని కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్ కమిషనరేట్ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. గతేడాదిలో రూ. 220 కోట్ల పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి బిల్లు పంపించామని, ఇది మొత్తం పోలీస్ హౌసింగ్ చరిత్రలో రికార్డు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తోడ్పాటు, కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ సూచనలతో హౌసింగ్ కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధించాలని మల్లారెడ్డి ఆకాం క్షించారు. అధికారులు, సిబ్బంది కృషి వల్లే నిర్మాణాలు, ఆధునీకరణ వేగవంతమవుతోందన్నారు. కాగా, పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పోలీసుశాఖలో భవనాలు, హెడ్ క్వార్టర్ల నిర్మాణంలో క్రియాశీలపాత్ర పోషిస్తున్న దామోదర్‌తోపాటు అంకితభావంతో పనిచేస్తున్న ఐజీ, ఎండీ మల్లారెడ్డిని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
జిల్లా పోలీసింగ్ ఆధునీకరణకు 150 కోట్లు
సైబర్, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖ ఆధునీ కరణలో భాగంగా జిల్లా పోలీస్ కమిషనరేట్లలో టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సీసీటీవీల ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పోలీస్ అధికారులు సైబర్ ల్యాబ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా, ప్రతీ జిల్లా/కమిషనరేట్‌కు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైమ్‌ను నియంత్రించేందుకు ప్రతీ జిల్లా పోలీస్/కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ వింగ్, దానికి అనుసంధానంగా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మరో 100 కోట్లకు ప్రతిపాదనలు.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉపయోగి స్తున్న సెక్యూరిటీ యాప్స్‌ను జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. సంచలనాత్మకంగా మారే కేసుల్లో కీలక ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలకం కావడంతో రీజియన్ల వారీగా ఏర్పాటుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే విధంగా జిల్లాకో అత్యాధునిక సాంకేతికత కలిగిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మొదటి దశలో భాగంగా రూ.150కోట్లు కేటాయించగా, మరో దఫాలో రూ.100కోట్లకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్‌వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
నీలినీడలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం కనబడటం లేదు. ఈ జిల్లా రుణం తీర్చుకోలేనిదంటూ ఇక్కడ పర్యటించినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి, జానంపేట అక్విడెక్ట్ వద్దకు తరచూ రావడం, మీడియాతో మాట్లాడి వెళ్లడం తప్ప జిల్లాలోని సాగునీటి ఇబ్బందులపై ఏనాడూ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈ ఏడాది ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా అమోదానికి నోచుకోలేదు. దీంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూ.136 కోట్లతో 167 పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొం దించిన జల వనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వీటికి జనవరి నెలలోనే అమోదం లభించి, టెండర్లు పూర్తవ్వాల్సి ఉంది. అలా జరిగి తేనే కాలువలు మూసివేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉండేది. ఈ నెలాఖరు నాటికి కాలు వలు మూసివేసేందుకు యంత్రాంగం నిర్ణయించగా, ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలకు ఆమోదం రాలేదు. ఫలితంగా టెండర్లు పిలిచే అవకా శం లేకుం డాపోయింది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. టెండర్లు ఖరారయ్యేందుకు నెల రోజులు పడుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఆమోదం లభించినా ఆదరాబాదరాగా పనులు చేపట్టి తూతూమంత్రంగా ముగించే ప్రమాదం ఉంది. గత ఏడాది రూ.72 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవగా.. అప్పట్లో పనులు చేపట్టలేదు. ఈ ఏడాది ఆ పనులతో సరిపెట్టే అవకాశం కనపడుతోంది. రూ.1,300 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ రూ.700 కోట్ల విలువైన పనులు కూడా పూర్తికాలేదు. 2012లో దీర్ఘవిరామం (లాంగ్ క్లోజర్) సమయంలో మాత్రమే ఓ మాదిరిగా పనులు జరిగాయి. తర్వాత ఏటా మొక్కుబడి పనులతో సరిపెడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ.112 కోట్ల విలువైన పనులు మాత్రమే చేశారు. పంట కాలువలు పూడుకుపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పొలాలు ముంపునకు గురవుతున్నాయి. సాధారణ రోజుల్లో మాత్రం పంట కాలువల్లో నీరు పారక వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. 2015లో డిసెంబర్లో కురిసిన చిన్నపాటి వర్షాలకు 1.32 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. 2016లోనూ వర్షాలకు నారుమడులన్నీ నీట మునిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాలువల ఆధునికీకరణ జరగకపోవడం వల్ల ఖరీఫ్‌తోపాటు రబీలోనూ నీటి సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. గడచిన రెండేళ్లలో అయిల్ ఇంజిన్లు, నీటి మోటార్లు ఉపయోగించకుండా రైతులు పంట పండించలేని పరిస్థితి ఏర్పడింది. -
నాలాల సర్వేకు మోకాలడ్డు!
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో వాననీటి కష్టాలకు కారణమైన నాలాలను ఆధునీకరించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఈ మేరకు ముందుగా చేపట్టిన నాలాల సర్వే పనులకు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నారని తెలుస్తోంది. ఆధునీకరణలో భాగంగా కోల్పోయే వ్యక్తిగత ఆస్తుల కొలతలు తీసుకునేందుకు వారు అడ్డుపడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఈపనులు ముందుకు సాగడం లేదు. ఇలా.. విస్తరణలో భాగంగా కోల్పోనున్న 238 ఆస్తుల(భవనాల) కొలతల్ని అధికారులు ఇప్పటికీ తీసుకోలేకపోయారు. ప్రజా ప్రతినిధులు అడ్డుకోవడంతో ఆస్తుల విస్తీర్ణం లెక్కించలేకపోయిన ప్రాంతాలు. -
రూ. 263 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
మంత్రులు ఈటల, తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విజయ డెరుురీని రూ.263 కోట్లతో ఆధునీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సచివాలయంలో మంగళ వారం పశుసంవర్థక అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ఈటల, తలసాని మాట్లాడుతూ... ప్రైవేటు డెరుురీ ల కన్నా విజయ డెరుురీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు నూతన పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాల సామర్థ్యం పెంచుతామన్నారు. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు పలు చోట్ల ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పెరుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంచార వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు రైతుల ఇంటి వద్దకే వెళ్లి పశు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు వైద్య శాలల సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 కోట్ల చేప పిల్లలను ఉచితంగా రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేశామన్నారు. ఈ నెలాఖరుకు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చేపల విక్రయానికి అవసరమైన స్థలాలను సేకరిస్తే మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సభ్యత్వం కలిగిన ప్రతీ మత్స్యకారుడు, గొర్రెల పెంపకం దారుడికి రూ. 5 లక్షల బీమా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, టీఎస్ఎల్డీఏ చైర్మన్ రాజేశ్వర్‌రావు, విజయ డెరుురీ ఎండీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
కేసీ ఆధునీకరణకు రూ.35 కోట్లు మంజూరు
కర్నూలు (టౌన్): కేసీ కెనాల్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.35 కోట్లు నిధులను మంజూరు చేసింది. మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పరిపాలనా అనుమతులకు సంబంధించి జీఓ 710 జారీ చేశారు. రూ.35 కోట్లు వెచ్చించి కేసీ కెనాల్ ఆధునీకరణ ప్రాజెక్టు కింద సీసీ లైనింగ్ పనులు చేపడతారు. కిలోమీటర్ 130.100 నుంచి కి .మీ.149.670 వరకు కేసీ కెనాల్ సీసీ లైన్ పనులతో పాటు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిధులకు సంబంధించి కర్నూలు చీఫ్ ఇంజనీరు (ప్రాజెక్టు) తదుపరి చర్యలు చేపట్టాలని ఆ జీఓలో ఆదేశాలు జారీ చేశారు.