Nature Farming
-
ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి..
అది కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం. ఒక మారుమూల పల్లె. అదిప్పుడు చరిత్రకెక్కుతోంది. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని, ఈ ఊరు చేపట్టిన సేంద్రియ సాగు విధానాలు రైతు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాడిపంట అనే పదానికి అసలైన అర్థం చెబుతున్నారు ఇక్కడి రైతులు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునర్జీవం తీసుకొస్తున్నారు. ఆ ఊరి పురుషులు పొలాలను పర్యావరణహితంగా మారుస్తుంటే.. మహిళలు ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపి అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. దేశానికే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వం ఈ గ్రామాన్ని దుర్గా ఊడ, దుర్గా వాహిని అనే పేర్లతో పిలిచేవారు. ప్రాచీన కవి పుల్ల కవి 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించారన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు సంబంధించిన స్మారక చిహ్నాలు, భవనాలు కనిపిస్తాయిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొట్టి మిర్చి విత్తన తయారీ నుంచి అంతా ఇక్కడే పండిస్తారు. ఈ ఊళ్లో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. రైతులు తాము వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. భారతీయ రైల్వే, సాఫ్ట్వేర్, బ్యాకింగ్, టీచింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, చార్టర్డ్ అకౌటెంట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అతి పురాతన ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయం, మసీదు, చర్చిలతో మతసామరస్యానికి పెట్టింది పేరుగా ఉంది ఈ ఊరు. కరోనా చూపించిన దారిదుర్గాడలో ఎటు చూసినా పచ్చని పొలాలే. ప్రతి ఇంటా గోవులు దర్శనమిస్తాయి. ధాన్యం నుంచి కూరగాయలు, పళ్లు అన్నీ తామే పండించుకుంటూ ఆదాయాన్నే కాదు ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు. ఇక్కడ నదులు, కాలువలు లేకపోవడంతో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు సాగుతోంది. సన్నకారు రైతులే ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మామిడికాయ పచ్చళ్లు, కూరగాయలు, మిర్చి వ్యాపారాలూ అధికమే! అయితే కరోనా ముందు వరకు ఇక్కడ రసాయన ఎరువులనే వాడేవారు. కరోనా వల్ల సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం, ఆం్ర«ధప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వమూ సేంద్రియ సాగుకు పెద్దపీట వేయడంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందీ ఊరు. తొలుత ఒక ఇంట్లో మొదలైన ఈ ఉద్యమం అనతి కాలంలోనే పల్లె అంతా విస్తరించింది. సేంద్రియ ఎరువుల ద్రావణాల తయారీ ఇక్కడ ఓ కుటీరపరిశ్రమగా మారిపోయింది. ఏటీఎం విధానంలో సాగువ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసా లేదు. ప్రకృతి దయ.. రైతుల ప్రాప్తం అన్నట్టు ఉంటుంది. దుక్కి దున్నిన నాటి నుంచి పంట కోసి, ధాన్యాన్ని ఎండబెట్టి మార్కెట్‌కి తీసుకెళ్లే వరకు ఆదాయం ఉండదు. ఈలోపు ప్రకృతి కన్నెర్రజేస్తే అంతే సంగతులు. అందుకే వ్యవసాయం గాలిలో దీపం లాంటిది అంటారు. అలాకాకుండా నారు వేసిన పదిహేను రోజుల నుంచి రోజూ ఆదాయాన్ని పొందే మార్గాన్ని పట్టుకున్నారు దుర్గాడ రైతులు. దాన్నే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ సాగు అంటున్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల చేత శిక్షణ తీసుకున్నారు. కొంత నేలను సిద్ధం చేసుకుని అందులో ఒకేసారి.. కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు.. పూలు ఇలా 30 రకాలను వేస్తారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ఏదో ఒక కాయగూరో.. ఆకు కూరో.. దుంపలో.. పూలో.. కోతకు వచ్చేస్తాయి. దాంతో ప్రతిరోజూ వాటిని కోసి అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అలా ఏటీఎం సాగు పద్ధతిలో రోజూ ఆదాయాన్ని ఆర్జిస్తూ జనాలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. దీనికయ్యే పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సాగు మీదే పెట్టుబడిగా పెడుతున్నారు చాలామంది రైతులు. కోసిన పంట స్థానంలో మళ్లీ విత్తనాలు వేస్తూ! ఇలా కాలంతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి, నిత్యాదాయం.. వైవిధ్యమైన పంటలుగా సాగుతోంది ఏటీఎం పద్ధతి.చేపలతో చేలకు వైద్యం..వ్యర్థ పదార్థాలతో పంటకు బలాన్నిచ్చే రసాయనాలను తయారు చేయడంలో దుర్గాడ రైతులకు సాటి,పోటీ లేదు. మత్స్యకారులు పక్కన పడేసిన కుళ్లిపోయిన చేపలతో చేలకు చేవనిచ్చే మీనామృతాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేసే ఈ మీనామృతం కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని మొక్కల ఎదుగుదలకు, పూత, పిందె బలంగా మారడానికి వాడుతున్నారు. ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీన్ని తయారీదారులు లీటరు రూ.120 ధరకు విక్రయిస్తున్నారు. పురుగులు, తెగుళ్లపై యుద్ధంపంటలపై దాడి చేసే పురుగులు, తెగుళ్లపై నీమాస్త్రం, బ్రహ్మాస్త్రాలతో ఇక్కడి రైతులు యుద్ధం చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ ఆకులు అలములే! నీమాస్త్రంతో చిన్న చిన్న పురుగులు చనిపోతే, బ్రహ్మాస్త్రంతో ఎంతటి తెగులైనా, పురుగైనా పరారవుతుంది. అంతేకాదు ఉల్లి, మిరప, మజ్జిగ, బెల్లం, గోమూత్రం వంటి వాటితో కషాయాలనూ తయారుచేస్తూ పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా పర్యావరణహితమైన ప్రయోగాలు, ప్రయత్నాలతో నిరంతర ఆదాయాన్ని గడిస్తూ ప్రకృతి సాగులో ప్రపంచానికి స్ఫూర్తి పంచుతోందీ గ్రామం. వ్యవసాయ పాఠశాలగా దుర్గాడ గ్రామం ప్రకృతి సాగుకు పాఠశాలగా మారింది. వ్యవసాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను బ్యాచులుగా విభజించి.. వ్యవసాయ క్షేత్రాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల్లోని రైతులతో వారికి ప్రకృతి సాగులో శిక్షణనిప్పిస్తున్నారు.గోమయంతో ప్రమిదల తయారీ..గోమూత్రంతో కషాయాలు, గోమయంతో ఘన జీవామృతంలాంటి ఔషధాలు తయారు చేస్తున్న దుర్గాడ రైతులు దేశీ ఆవుపేడతో ప్రమిదలు ధూప్‌స్టిక్స్ వంటివీ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఈ ప్రమిదలలో ఆవునేతితో దీపం వెలిగిస్తే పరిసరాల్లో క్రిమి కీటకాలు నశిస్తాయి. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు.తయారవుతున్న సేంద్రియ ఎరువులుబీజామృతం, జీవామృతం, మీనామృతం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, చిల్లి స్పెషల్ కషాయం మొదలైనవి.పండిస్తున్న పంటలు ఉల్లి, బురియా మిర్చి (పొట్టి మిర్చి, చిన్న రౌండ్ బెల్ రకం మిర్చి), చెరకు, కొబ్బరి, ఆయిల్ పామ్, మామిడి, బొప్పాయి, మినప, పెసర, శనగ, అరటి, వరి, కూరగాయలు, పుచ్చ, నువ్వులు, మునగ మొదలైనవి.మా ఇంటి పంట పదిళ్లకు వంటమా పెరట్లోని ఒక సెంటు స్థలంలో ఏటీఎం పద్ధతిలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టాను. నాట్లేసిన పదిహేను రోజుల నుంచి ఫలసాయం మొదలైంది. ఖర్చు తగ్గడం, నా ఆదాయానికి గ్యారంటీ ఉండటం, మా ఇంటి పంట చుట్టుపక్కల పదిళ్లకు వంట అవటం చూసి మా ఊళ్లోని చాలామంది మహిళలు నాలా ఇంటి పంటను మొదలుపెట్టారు. – ఆకుల కనక సూర్యలక్ష్మి, రైతు, దుర్గాడ.ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను..ప్రకృతి వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఆరెకరాల పొలంలో సేంద్రియ సాగు స్టార్ట్ చేశాను. ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఇంటర్ పూర్తి చేశాను. నా పొలంలోని సేంద్రియ సాగు ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను. వీటికి మంచి గిరాకీ ఉంది. – జీలకర్ర భాను, యువ రైతు, దుర్గాడపరిశీలిస్తున్నారు.. తెలుసుకుంటున్నారుగత ఐదేళ్లలో ఇక్కడ ప్రకృతి సాగు బాగా పెరిగింది. ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు, విదేశీ రైతులు దుర్గాడకు వచ్చి ప్రకృతి సాగును పరిశీలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, ద్రావణాల తయారీని తెలుసుకుంటున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖాధికారి, కాకినాడ -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
మూలాలకు పోదాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన భారతదేశంలో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, నీటివసతి, భౌగోళిక స్వరూపం.. ఇలా పరిస్థితులను అనుసరించి ఆయా ప్రాంతాల్లో వివిధరకాల వరి సాగుచేసేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో విత్తనాల సంకరీకరణకు బీజం పడింది. అధిక దిగుబడి ఇచ్చేవి, పంటకాలం స్వల్పంగా ఉండేవి, వ్యాధులను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అధిక దిగుబడి ఇచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటివైపు మొగ్గచూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగుచేసేవారులేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అక్కడక్కడా మిగిలినవాటిలో ఉన్న ఔషధ విలువలు, పోషక విలువలు గుర్తించిన కొందరు కొన్ని రకాలను పునరుజ్జీవింపజేసేపనికి పూనుకున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా అత్తోటకు చెందిన 60 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని దేశవాళీ రకాలను విజయవంతంగా సాగుచేస్తూ లాభాలు పండిస్తున్నారు. ‘భూమి భారతి’ పేరుతో విత్తన నిధి మనం ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను నేటి తరానికి అందించాలనేది వీరి ఆశయం. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులతో తీసిన విత్తనాలతో ‘భూమి భారతి’ పేరుతో ‘దేశవాళీ వరి విత్తన నిధి’ని 2022లో ఏర్పాటుచేశారు. ఇందుకు ‘తానా’ సహకరించింది. దేశీ వరి విత్తన నిధిని నిర్వహిస్తూ, రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహార ఉత్పత్తులను సంతల్లో, సోషల్‌మీడియాలో ప్రచారంతో విక్రయిస్తున్నారు. వీరు సాగుచేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’, అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. తులసి బాసోమొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 40 రోజులు గింజ చాలా చిన్నగా ఉండి, అన్నం మంచి సువాసన కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం. ఒక్కసారి నాటితే మూడు పంటలు తీసుకోవచ్చు. పంటకాలం కేవలం 40 రోజులు పశ్చిమ బెంగాల్ దీని మూల స్థానం, మంచి పోషక విలువలు కలిగి తినడానికి అనువుగా ఉంటుంది. ఈ బియ్యాన్ని దేవుడికి నేవేద్యంగా పెడతారు. ఇంద్రాయణిసాధారణ ఎత్తులో పెరిగే ఈ వరి వంగడం పంటకాలం 130 రోజులు, బియ్యం మంచి సువాసన కలిగిఉంటాయి. అత్యధిక పోషక విలువలు కలిగిఉంటాయి. వండుకోవడానకి, తినడానికి ఈ బియ్యం అనుకూలంగా ఉంటాయి. ఈ బియ్యానికి సర్వరోగనివారిణిగా పేరుంది. మహారాష్ట్రలోని ఇంద్రాయణి నది పరీవాహక ప్రాంతంలో గతంలో ఎక్కువగా సాగులో ఉండటం వల్ల దీనికి ఇంద్రాయణి రైస్ అని పేరువచ్చింది. కాలాబట్టి5 నుంచి 6.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 150 రోజులునలుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కాలాబట్, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్ అనే పేర్లతో పిలుస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రకాన్ని సాగుచేస్తుంటారు. ఈ నల్లబియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం మణిపూర్ అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఆంథోసియానిన్ అనే యాంటి ఆక్సిడెంట్లు అధికం. మధుమేహ బాధితులు, హృద్రోగులకు ఇది గొప్ప ప్రయోజనకారి. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రీ రాడికల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ప్రాచీన కాలంలో ఈ బియ్యంరాజకుటుంబాలు, ఉన్నతవర్గాలవారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. మాపిళైసాంబమాపిళ్లై సాంబ మొక్క 4.5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. పంటకాలం 160 రోజులు ఈ బియ్యాన్ని ‘పెళ్లికొడుకు బియ్యం’ అని కూడా అంటారు. ఎరుపురంగులో ఉండే ఈ బియ్యాన్ని కొత్తగా పెళ్లయిన దంపతులకు ఇవ్వడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఈ బియ్యం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యవృద్ధి కలుగుతుంది.గర్భదారణ సమస్యలతో బాధపడే దంపతులకు ఉపకరిస్తుందనే నమ్మకం. తమిళనాడులోని తిరవణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూలకేంద్రం. నాగపట్టణం, తిరుచ్చురాపల్లి, తంజావూర్ జిల్లాల్లో రైతులు కొంతమేరకు సాగుచేస్తూ వస్తున్నారు. నవారమొక్క 5 అడుగుల వరకు పెరుగుతుంది. పంటకాలం 90 రోజులు ఈ విత్తనం త్రేతాయుగం నాటిది. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. కేరళలోని పాలక్కాడ్ ప్రాంతం ఈ బియ్యానికి మూలకేంద్రంగా గుర్తించారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ బియ్యం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. నరాల బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఈ బియ్యం చక్కగా దోహదపడతాయి. కేరళ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఈ బియ్యాన్ని ఔషధంగా వినియోగిస్తారు. పక్షవాతం వచ్చినవారికి బాడీ మసాజ్‌లో వినియోగిస్తారు. బియ్యం నుంచి కూడా మొలకలు రావటం దీని ప్రత్యేకత. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదుదేశవాళీ వరి వంగడాల్లో గణనీయమైన జన్యువైవిధ్యాలున్నాయి. వివిధ కారణాలతో అనేక రకాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి సంరక్షణకు మా వంతు కృషిచేస్తున్నాం. దేశవాళీ సాగు ఎప్పుడూ దెబ్బతీయదు. అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లోనూ కనీసం యాభై శాతం ఫలితాన్ని అందిస్తుంది. – యర్రు బాపన్న, సంప్రదాయ సాగు రైతుహైబ్రిడ్ బియ్యంతో ఆకలి అణగదుహైబ్రిడ్ బియ్యం తింటే ఆకలి అణగదు. దీనివల్ల మరో 50 శాతం అదనంగా అన్నం తినాల్సి వస్తుంది. రుచి కూడా అంత బాగుండదు. దేశవాళీ బియ్యం ఇందుకు భిన్నం. మంచి గ్‌లెసైమిక్ ఇండెక్స్ కలిగివుండటంతో కొన్ని రకాలు మధుమేహ రోగులకు ఆరోగ్య సంరక్షిణిగా నిలుస్తున్నాయి. –నామని రోశయ్య, సంప్రదాయ సాగు రైతుఈ రకాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి రైతులు సాగుచేస్తున్న అరుదైన దేశవాళీ వరి వంగడాల్లో కొన్ని మాత్రమే. తొమ్మిదేళ్ల క్రితం దీనికి అంకురార్పణ జరిగింది. ఇక్కడి రైతులు తొలుత 5 నుంచి 10 సెంట్లలో స్వల్పరకాలతో ఆరంభించి, ఏటా విస్తీర్ణాన్ని, సాగుచేసే రకాలను పెంచుకుంటూ వెళ్లారు. 2018లో చేపట్టిన వంద రకాల సాగు సత్ఫలితాన్నిచ్చింది. దీంతో 2019 ఖరీఫ్‌లో 180 రకాలను విత్తారు.్ఙభారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ శివప్రసాదరాజు నుంచి ఆయా రకాల విత్తనాలను సేకరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుకు కావాల్సిన ద్రవ, ఘన జీవామృతాలు, కషాయాలను స్వయంగా తయారుచేసుకుంటున్నారు. ప్రస్తుతం అత్తోట గ్రామంలో అరవై మంది రైతులు, సమష్టిగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. మొత్తం 85 ఎకరాల్లో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. ఇందుకు ఆద్యుడైన రైతు యర్రు బాపారావు. 365 రకాల దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. వినియోగదారులు ఇప్పటికే అలవాటుపడిన మైసూర్మల్లిక, బహురూపి, నవార, నల్లబియ్యం వంటి రకాలను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తూ, ఇతర రకాలను విత్తన సంరక్షణ కోసం స్వల్పవిస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఈ గ్రామ రైతులు భారతదేశ వరి వంగడాల్లోని వైవిధ్యత సంరక్షణకు తోడ్పడుతూ, అక్కడి మట్టికి కొత్త పరిమళం అద్దారు. -
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు
పిఠాపురం: రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ సాగులో ముందడుగు వేసిన ఏపీ రైతులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇతర దేశాల చూపు పడింది. రసాయనాలతో సహజత్వం కోల్పోయిన భూముల్లో తిరిగి సత్తువ పెంచేందుకు మన రైతులు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు. రసాయనాల వాడకంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు చేసిన కృషి ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తోంది. గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రకృతి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల ప్రతినిధులు, ఆయా దేశాల్లోని ఔత్సాహిక రైతులు మన రాష్ట్రానికి వచి్చన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐల రాకతో కాకినాడ జిల్లాలో మారుమూల గ్రామమైన గొల్లప్రోలు మండలం దుర్గాడ వస్తున్నారు. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారో తెలుసుకుని.. ఏయే సందర్భాల్లో వాటిని వినియోగించాలని, ప్రకృతి సాగు ఎలా చేయాలనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది మాది ఆంధ్రప్రదేశ్. నా చిన్నతనంలోనే అమెరికాలో సెటిలయ్యాం. అమెరికాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంది. రసాయనాలు వాడని వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే కొనడానికి ఇక్కడివారు ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి అమెరికాలో ఈ తరహా పంటలను పండించేందుకు ప్రయతి్నస్తున్నాం. అందుకే.. దుర్గాడ గ్రామానికి వచ్చాం. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారు. బయో ఇన్పుట్ సెంటర్లు నిర్వహిస్తూ ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సైతం మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గత ఐదేళ్ల నుంచే ప్రకృతి వ్యవసాయం పెరిగిందని రైతులు చెప్పారు. – ఎన్.దేవి, ఎన్ఆర్ఐ, కాలిఫోర్నియా, అమెరికాప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగింది గత ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాం. ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభించి వివిధ రకాల పద్ధతులతో నిత్యం ఆదాయం వచ్చేవిధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. శాస్త్రవేత్తలు, ఎన్ఆర్ఐలు మమ్మల్ని సంప్రదించి ప్రకృతి వ్యవసాయ సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. మా గ్రామంలో బయో ఇన్పుట్ సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నాం. మా ప్రాంతంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు విదేశీయులు రావడం గర్వకారణం. – గుండ్ర శిశచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ విదేశీ ప్రతినిధులు వస్తున్నారు కాకినాడ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం, జీవ ఉ్రత్పేరకాలు, బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ని కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, మీనామృతం, చిల్లీ స్పెషల్ కషాయం, లింగాకర్షణ బుట్టలు, ఎల్లో–బ్లూ స్టిక్కీ ప్లేట్స్, పీఎండ్స్ (నవధాన్యాల విత్తనాలు) ఎలా తయారు చేస్తారనే విషయాలపై ఎన్ఆర్ఐలు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు దుర్గాడ వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు విదేశీయులు త్వరలో రానున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ -
అనగనగా ఒక ఊరు..
మన మూలం చెప్పేది ఊరే! అందుకే మన పరిచయం ఊరి నుంచే మొదలవుతుంది! ఒక్కో ఊరుది ఒక్కో స్వభావం! సంస్కృతీసంప్రదాయాల నుంచి అభివృద్ధిబాట దాకా! ఆ భిన్నత్వాన్నే చెబుతోందీ ‘అనగనగా ఒక ఊరు’!అన్యులను అంటుకోని మలాణా (హిమాచల్ ప్రదేశ్)మన దేశంలోని అతి పురాతన గ్రామం ఇది. కులు, పార్వతి లోయల మధ్యలో సముద్రమట్టానికి 2,652 మీటర్ల (8,701 అడుగుల) ఎత్తులో.. మలాణా నది ఒడ్డున కొలుౖవై ఉంది. ప్రకృతి అందాలకు ఆలవాలం. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. మలాణీయులకు భారతీయ పోలికలకన్నా మెడిటరేనియన్ పోలికలే ఎక్కువ. బహుశా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు! స్థానిక భాష కనాశీ. ఆధునిక ఛాయలకు దూరంగా ప్రాచీన సంస్కృతీ సంప్రదాయలకు నిలయంగా ఉంటుంది.జమదగ్నిని వీళ్లు జమ్లు దేవతగా కొలుస్తారు. ఆయననే తమ గ్రామ రక్షకుడిగా భావిస్తారు. జమదగ్నికి ఇక్కడ గుడి ఉంటుంది. మలాణీయులది ఫ్రెండ్లీ నేచరే కానీ మలాణీయేతరులెవరైనా వీళ్లకు అస్పృశ్యులే! వీరి అనుమతి లేకుండా పరాయి వాళ్లెవరూ వీరిని అంటుకోకూడదు. దూరం నుంచే మాట్లాడాలి. నడిచేప్పుడు వాళ్ల ఇంటి గోడలను కూడా తాకకూడదు. ఇక్కడి కొట్లలో పర్యాటకులు ఏమైనా కొనుక్కుంటే ఆ వస్తువులను చేతికివ్వరు కౌంటర్ మీద పెడతారు. అలాగే పర్యాటకులూ డబ్బును కౌంటర్ మీదే పెట్టాలి.పొరపాటున తాకితే వెంటనే స్నానం చేయడానికి పరుగెడ్తారు. ఈ ఊరిలో పోలీసులకు ప్రవేశం లేదు. మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ప్రత్యేకమైన న్యాయవ్యవస్థ ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం గల ఊరు అని దీనికి పేరు. వీరి ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని పోలి ఉంటుందట! వీళ్ల ప్రధాన ఆర్థిక వనరు గంజాయి. ఎక్కడపడితే అక్కడ గంజాయి వనాలు కనిపిస్తుంటాయి. బ్యాన్ అయినప్పటికీ ‘మలాణా క్రీమ్’ పేరుతో ఇక్కడి గంజాయి దేశంలో ప్రసిద్ధి. ఉత్పత్తిలో మహిళలే అగ్రగణ్యులు. వంట పని నుంచి సాగు, మార్కెటింగ్ దాకా అన్ని బాధ్యతలూ మహిళలవే. మగవాళ్లు గంజాయి మత్తులో నిద్రపోతుంటారని మలాణా సందర్శకుల పరిశీలన. ఇక్కడ వెహికిల్స్ వెళ్లేంత రోడ్లు ఉండవు. వీళ్ల రోజువారీ రవాణాకు కేబుల్ కార్లే మార్గం.లక్షాధికారుల హివ్రే బాజార్ (మహారాష్ట్ర)తన తలరాతను తానే తిరగరాసుకుని అత్యధిక మిలయనీర్లున్న విలేజ్‌గా వాసికెక్కిందీ ఊరు. మరాఠ్వాడా ప్రాంతం, అహ్మద్‌నగర్ జిల్లాలోని హివ్రే బాజార్ ఒకప్పుడు దట్టమైన అడవి, పంటపొలాలతో అలరారిన గ్రామం. అడవిలోని చెట్లు వేటుకు గురై, వర్షాభావ స్థితులు ఏర్పడి.. చెరువులు కూడుకుపోయి.. భూగర్భ జలాలు అడుగంటి.. బావులు ఎండిపోయి.. కరవు కాటకాలకు నిలయమైంది. తాగుడు, క్రైమ్‌కు బానిసైంది. ఒకానొక దశలో సారా కాయడం, నేరాలే హివ్రే బాజార్‌కు ఉపాధిగా మారాయన్నా విస్తుపోవాల్సిన పనిలేదు. 90 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి, ఇక ఆ ఊరికి ఉనికిలేదనే పరిస్థితికి చేరిపోయింది. ప్రభుత్వోద్యోగులకైతే పనిష్మంట్ బదిలీ కేంద్రంగా మారింది.వలస వెళ్లిన వాళ్లు పోనూ.. మిగిలిన జనం తమ ఊరు అలా అయిపోవడానికి కారణాలు వెదుక్కున్నారు. ఆ అన్వేషణలోనే పరిష్కారమూ తట్టింది గ్రామ పెద్దలకు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ‘ఉపాధి హామీ’ పథకంతో అడవిని, చెరువులను పునరుద్ధరించుకోవచ్చనీ, వాన నీటిని సంరక్షించుకోవచ్చనీ అనుకున్నారు. తమ ఊరికే ప్రత్యేకమైన పంచవర్ష ప్రణాళికను వేసుకున్నారు. దాని ప్రకారం జనాలు నడుం కట్టారు. తొలకరికల్లా అడవుల సంరక్షణ, ప్లాంటేషన్, చెరువులు, బావుల పూడికతీత, వాటర్ షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు.పడిన ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టుకున్నారు. అయిదేళ్లూ కష్టాన్ని పంటికింద బిగబట్టారు. శ్రమ ఫలించసాగింది. నాటిన మొక్కలు ఎదిగాయి. అడవి పచ్చగా కళకళలాడింది. భూగర్భజల స్థాయి పెరిగింది. చెరువులు, బావుల్లోకి నీరు చేరింది. పంటలు లాభాలు పండించలేకపోయినా తిండిగింజలకు కొదువ లేకుండా చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఊరి వాతావరణం మారసాగింది. వర్షపాతం పెరిగింది. నీళ్లొస్తే జీవకళ వచ్చినట్టే కదా! ప్రకృతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు హివ్రే బాజార్ వాసులు. వలస వెళ్లిన వాళ్లంతా మళ్లీ సొంతూరుకి చేరిపోయారు. మద్యాన్ని మరచిపోయారు. ఆదాయం తద్వారా జీవన ప్రమాణం పెరిగాయి.మూత బడిన బడులు తెరుచుకున్నాయి. 30 శాతానికి పడిపోయిన అక్షరాస్యత క్రమంగా 69 శాతానికి పెరిగింది. యువతలోంచి టీచర్లు, ఇంజినీర్లు వస్తున్నారు. ఇప్పుడక్కడ రైతు నెలసరి సగటు ఆదాయం 30 వేలు. 235 కుటుంబాల్లోకి 60 మంది రైతులు (ఫిబ్రవరి, 2024 నాటికి) లక్షాధికారులు. అలా దారిద్య్రం నుంచి అభివృద్ధి పథంలోకి నడిచిన ఈ ఊరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.శుచీశుభ్రతల చిరునామా మావల్యాన్నాంగ్ (మేఘాలయా)స్వచ్ఛభారత్ కంటే ముందే 2003లోనే ఆరువందల జనాభా గల ఈ చిన్న ఊరు ఆసియాలోకెల్లా క్లీనెస్ట్ విలేజ్‌గా కీర్తి గడించింది. ఇక్కడ అయిదేళ్ల పిల్లాడి నుంచి పళ్లూడిపోయిన వృద్ధుల వరకు అందరూ సామాజిక బాధ్యతతో మెలగుతారు. మావల్యాన్నాంగ్ పిల్లలంతా ఉదయం ఆరున్నరకల్లా లేచి చీపుర్లు పట్టుకుని వీథుల్లోకి వచ్చేస్తారు. వీథులన్నీ శుభ్రం చేస్తారు. డస్ట్బిన్స్లోంచి ఆర్గానిక్ చెత్తను వేరుచేసి మట్టి గుంతలో వేసి కప్పెట్టి, మిగిలిన చెత్తను కాల్చేస్తారు. తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయ్యి స్కూల్ బాటపడతారు.ఇది వారి రోజువారీ కార్యక్రమం. ఆ ఊరి బాటల వెంట పూల మొక్కలను పెంచడం, పచ్చదనాన్ని సంరక్షించడం పెద్దల పని. ఇక్కడ ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ ఉంటుంది. ప్రతి ఇల్లూ అద్దంలా మెరుస్తూంటుంది. రోజూ చేసే ఈ పనులే కాకుండా ప్రతి శనివారం చిన్నాపెద్దా అందరూ సోషల్ రెస్పాన్స్బిలిటీకి సంబంధించిన స్పెషల్ అసైన్మెంట్స్నూ చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిందని వాళ్ల బాధ. తాము ప్లాస్టిక్‌ని నివారించినా.. పర్యాటకుల వల్ల ఆ సమస్య ఏర్పడుతోందని వాళ్ల ఫిర్యాదు. ‘రీసైకిల్ చేయగలిగిన వాటితో ఇబ్బంది లేదు.. చేయలేని ప్లాస్టికే పెద్ద ప్రాబ్లం అవుతోంది.వాటిని కాల్చలేం.. పూడ్చలేం. పర్యాటకులు కూడా పర్యావరణ స్పృహతో ఉంటే బాగుంటుంది’ అని మావల్యాన్నాంగ్ వాసుల సూచన. మీ ఊరికి ఇంత శుభ్రత ఎప్పటి నుంచి అలవడిందని అడిగితే ‘130 ఏళ్ల కంటే ముందు.. కలరా ప్రబలినప్పటి నుంచి అని మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం’ అంటారు. శుభ్రత ముందు పుట్టి తర్వాత మావల్యాన్నాంగ్ పుట్టిందనడం సబబేమో ఈ ఊరి విషయంలో!పొదుపు, మదుపుల మాధాపార్ (గుజరాత్)కచ్ జిల్లాలోని ఈ ఊరిలో మొత్తం 7, 600 (2021 నాటి లెక్కల ప్రకారం) ఇళ్లు ఉన్నాయి. వీళ్లలో యూకే, అమెరికా, కెనడాల్లో నివాసముంటున్నవారే ఎక్కువ. మాధాపార్‌లో మొత్తం 17 బ్యాంకులున్నాయి. విదేశాల్లో ఉంటున్న మాధాపార్ వాసులు ఈ బ్యాంకుల్లోనే తమ డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. అలా వాళ్లు డిపాజిట్ చేసిన మొత్తం రూపాయలు (2021 లెక్కల ప్రకారం) అయిదువేలకోట్లు. దీంతో మాధాపార్ దేశంలోకెల్లా ధనికగ్రామంగా పేరొందింది. ఈ ఎన్ఆర్ఐలు 1968లోనే లండన్‌లో ‘మాధాపార్ విలేజ్ అసోసియేన్’ను స్థాపించుకున్నారు. దీని ఆఫీస్‌ను మాధాపార్లోనూ ప్రారంభించి ఊరి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. వ్యవసాయపరంగానూ మాధాపార్ ముందు వరుసలోనే ఉంది. వీరి వ్యవసాయోత్పత్తులు ముంబైకి ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఆటస్థలాలు, మంచి విద్యాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, చెరువులు, చెక్ డ్యామ్‌లకు కొదువలేదు.మోడర్న్ విలేజ్ పున్సరీ (గుజరాత్)మామూలుగా ఊరు అనగానే .. మట్టి ఇళ్లు, మంచి నీటి కొరత, కరెంట్ కోత, మురికి గుంతలు, ఇరుకు సందుల ఇమేజే మెదులుతుంది మదిలో! కానీ సబర్‌కాంతా జిల్లా.. అహ్మదాబాద్‌కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పున్సరీ మాత్రం ఆ ఇమేజ్‌కి భిన్నం! ఇక్కడ 24 గంటల మంచినీటి, కరెంట్ వసతి ఉంటుంది. టాయ్‌లెట్ లేని ఇల్లుండదు. రెండు ప్రైమరీ స్కూళ్లు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సిస్టం.. మాత్రమే కాదు ఊరంతటికీ వైఫై, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు, 140 లౌడ్ స్పీకర్లతో దేశానికే మోడల్ విలేజ్‌గా విరాజిల్లుతోంది. అంతేకాదు ఇది స్కూల్ డ్రాపౌట్స్ లేని గ్రామం కూడా. దీని అభివృద్ధి కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీ నిరంతరం శ్రమిస్తోంది. అందులో అయిదుగురు మహిళలున్నారు. ఈ గ్రామాభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300కు పైగా అధికారులు ఈ ఊరును సందర్శించారు.మత్తూర్ (కర్ణాటక) సంస్కృతిసంస్కృతం పండిత భాషగానే బతికి కనుమరుగైపోయింది. కానీ షిమోగా జిల్లాలోని మత్తూర్‌లో ఆ భాష నేటికీ వినపడుతుంది. పండితుల నోటెంటే కాదు అక్కడి ఇంటింటా! ఆ గ్రామవాసులు తమ మూలాలను, సంస్కృతీసంప్రదాయాలనూ పరిరక్షించు కోవాలనే దృఢనిశ్చయంతో ఆ భాష ఉనికిని కాపాడుకుంటున్నారు. అందుకే మత్తూర్‌లో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా మార్చేసుకున్నారు.పెళ్లి పీటలెక్కని బర్వాకలా (బిహార్) కైమూర్ హిల్స్‌లోని ఈ ఊరు.. గుజరాత్ బెస్ట్ విలేజ్ పున్సరీకి భిన్నం. కనీస వసతులకు కడు దూరం. ఇక్కడ తాగునీటి సరాఫరా లేదు. కరెంట్ కనపడదు. టాయ్లెట్లు, డ్రైనేజ్ల గురించి అడగనే వద్దు. రోడ్లూ ఉండవు. ఈ స్థితి వల్ల ఈ ఊరు వార్తల్లోకి ఎక్కలేదు. ఈ స్థితి వల్ల ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. సుమారు 50 ఏళ్లుగా ఈ ఊళ్లో మంగళ వాయిద్యాల మోగడం లేదు. కనీస అవసరాలు లేని ఆ ఊరికి మా అమ్మాయిని ఎలా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులంతా తమ మాట్రిమోనీ లిస్ట్‌లోంచి బర్వాకాలాను డిలీట్ చేసేశారు. కనాకష్టంగా 2017లో ఒక్కసారి మాత్రం ఇక్కడ పెళ్లి హడావిడి కనిపించింది. ఎందుకూ.. ఊరి ప్రజలంతా కష్టపడి రోడ్డు వేసుకోవడం వల్ల! ఇంకేం ఆ పెళ్లితో ఊరి కళ మారి తమకూ కల్యాణ ఘడియలు వచ్చేస్తాయని అక్కడి బ్రహ్మచారులంతా సంబరపడ్డారట. అది అత్యాశే అయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిగో ఈ నేపథ్యం వల్లే ఆ ఊరు పేరు వైరల్ అయింది.ద్వారాలు కనపడని శని శింగణాపూర్ (మహారాష్ట్ర)శిరిడీని దర్శించిన చాలామందికి శనైశ్చరుడి ఊరు శని శింగణాపూర్ సుపరిచితమే. శనైశ్చరుడి ఆలయం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. చెప్పుకోవాల్సిన ప్రత్యేకత అదే. ఇక్కడుండే ఆఫీస్ బిల్డింగ్స్, రిసార్ట్స్ వంటి వాటికి, ఆఖరకు పోలీస్ స్టేషన్‌కి కూడా తలుపులు ఉండవు. కొన్నిళ్లల్లో మాత్రం ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కనపడ్తాయి తలుపుల స్థానంలో. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఊరు అప్పటి నుంచీ ఇంతే అట!పాములను పెంచుకునే శెట్పాల్ (మహారాష్ట్ర)ఈమధ్య.. హైదరాబాద్, మణికొండ ప్రాంతంలోని నివాసాల మధ్య నాగుపాము కనపడిందని సోషల్ మీడియాలో ఒకటే గోల. అలాంటిది శెట్పాల్ గ్రామమే నాగుపాముల మయమని తెలిస్తే వీడియోల కోసం ఆ ఊరికి క్యూ కడతారో.. భయంతో బిగుసుకుపోతారో! శెట్పాల్లో ఈ ఇల్లు.. ఆ ఇల్లు అనే భేదం లేకుండా ఏ ఇంటినైనా చుట్టొస్తాయట నాగుపాములు. వాటిని చూసి అక్కడివాళ్లు ఆవగింజంతైనా భయపడకపోగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను ముద్దు చేసినట్టుగా ముద్దు చేస్తారట. ఆ పాములూ అంతే.. శెట్పాల్ వాసులను సొంతవాళ్లలాగే భావిస్తాయిట. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ పాములు విసుగుతోనో.. కోపంతోనో.. చిరాకేసో.. ఏ ఒక్కరినీ కాటేసిన సందర్భం ఒక్కటీ లేదని స్థానికుల మాట. అందుకేనేమో శెట్పాల్æ జనాలు ఈ పాములను తమ ఇలవేల్పుగా కొలుస్తారు!కవలల్ని కనే కొడిన్హీ (కేరళ)మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు అంటారు. కానీ ఒకే ఊళ్లో డజన్లకొద్దీ కనిపిస్తే! అవునా.. నిజమా.. అని హాశ్చర్యపోయే పనిలేదు. నిజమే! ఆ దృశ్యం కొడిన్హీలో కనిపిస్తుంది. ఈ ఊళ్లో దాదాపు రెండువేల కుటుంబాలు ఉంటాయి. దాదాపు అయిదు వందల కవల జంటలు కనిపిస్తాయి. ఈ విశేషంతో అత్యధిక కవలల రేటు నమోదైన ఊళ్ల సరసన కూడా చేరింది కొడిన్హీ. ఇక్కడ ఇంతమంది కవలలు పుట్టడానికి కారణమేం ఉండొచ్చని పలు అధ్యయనాలూ జరిగాయి. ప్చ్.. ఏమీ తేలలేదు!రెండు పౌరసత్వాల లోంగ్వా (నాగాలాండ్)మోన్ జిల్లాలోని ఈ ఊర్లో కొన్యాక్ నాగా జాతి ప్రజలు ఉంటారు. ఆ జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ఇదీ ఒకటి. ఆ ఊరి వాసులకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద నివాసమే. అతని ఇంటిని మన దేశంతో పాటు మయన్మార్ కూడా పంచుకుంటుంది. అంటే అతనిల్లు సరిగ్గా ఈ రెండు దేశాల సరిహద్దు మీద ఉంటుంది. డీటేయిల్‌గా చెప్పాలంటే ఆ ఇంటి పడకగది ఇండియాలో ఉంటే వంటగది మయన్మార్‌లో ఉంటుంది. దీనివల్ల ఆ ఊరు ఈ రెండు దేశాల హద్దులోకి వస్తుందని ఇటు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది.. అటు మయన్మార్ కూడా లోంగ్వా వాసులకు తమ సిటిజ¯Œ షిప్‌ని మంజూరు చేస్తుంది. మన దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంలో ఈ ఊరి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఉంది.చెప్పులొదిలి వెళ్లాల్సిన వెళ్లగవి (తమిళనాడు)కొడైకెనాల్ దగ్గర్లోని చిన్న తండా ఇది. వంద కుటుంబాలుంటాయి. మూడు వందల ఏళ్ల నాటి ఈ తండాకు రోడ్డు లేదు. ట్రెక్కింగ్ ఒక్కటే మార్గం. ఇక్కడ చెప్పుల జాడలు కనిపించవు. ఊరి పొలిమేరల్లో బోర్డ్ కూడా ఉంటుంది.. ‘దయచేసి మీ పాదరక్షలను ఇక్కడే వదిలేయండి’ అని! ఎందుకంటే ఇక్కడ ఇళ్లకన్నా గుళ్లు ఎక్కువ. లెక్కకు మించిన గుడులైతే ఉన్నాయి కానీ ఒక్క బడీ లేదు. అంతెందుకు ఒక్క ప్రాథమిక కేంద్రం కూడా లేదు. ఒక టీ కొట్టు, చిన్న కిరాణా కొట్టు తప్ప ఇంకే కనీస సౌకర్యాలూ వెళ్లగవిని చేరలేదు. రోజువారీ అవసరాలకు ఈ తండా వాసులు కొడైకెనాల్ దాకా నడిచివెళ్తారు.దయ్యాల కొంప కుల్ధారా (రాజస్థాన్)జైసల్మేర్ జిల్లాలోని ఈ ఊరు 13వ శతాబ్దం నాటిది. ఇప్పుడు మొండి గోడలతో.. నిర్మానుష్యంగా కనిపించే కుల్ధారా ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులకు నిలయం. ఒక మంత్రగాడి శాపంతో రాత్రికి రాత్రే ఆ ఊరు మాయమైందని ఒక కథ, భూస్వాముల దాష్టీకాలను తట్టుకోలేక ఆ బ్రాహ్మణులంతా కుల్ధారా వదిలి వెళ్లిపోయారని ఇంకో కథ ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా మనుషుల ఆనవాళ్లు లేక ఇది ఘోస్ట్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. పాలీవాల్ బ్రాహ్మణుల ఆత్మలు నేటికీ ఆ ఊరిలో తిరిగుతుంటాయనే ప్రచారమూ ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం కుల్ధారాను పర్యాటక కేంద్రంగా మలచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.పోర్చ్‌గీస్ జాడ.. కోర్లాయీ (మహారాష్ట్ర)అలీబాగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ ఊరిని పోర్చ్‌గీస్ వాళ్లు నిర్మించారు. అందుకే ఒకప్పుడు దీన్ని పోర్చ్‌గీస్‌లో ‘మరో డి చాల్’ అనేవారట. అంటే ‘గుండ్రని చిన్న కొండ’ అని అర్థం. ప్రస్తుతం ఇక్కడి వాళ్లు పోర్చ్‌గీస్ క్రీయోల్ (యాస) ‘క్రిస్టీ’లో మాట్లాడుతారు. అంతేకాదు ఇక్కడ పేర్లన్నీ పోర్చుగీస్వే ఉంటాయి. పోర్చ్‌గీస్ ఫుడ్డే తింటారు. క్రీయోల్ అనే పదమే రూపాంతరం చెంది కోర్లాయీగా స్థిరపడింది.ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్ జాంబుర్గిర్కి సమీపంలో ఉన్న ఈ ఊరును ‘ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్’ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ భాషను మాట్లాడుతూ, గుజరాతీ పద్ధతులను పాటించే ఆఫ్రికన్స్ ఉంటారు కాబట్టి. ఆఫ్రో– అరబ్ వారసులైన వీళ్లను సిద్దీస్ అంటారు. బానిసలుగా అరబ్ షేక్‌ల ద్వారా ఇక్కడికి వచ్చారు. దాదాపు 200 ఏళ్ల నుంచి వాళ్లు ఈ ఊరిలోనే జీవిస్తున్నారు.సోలార్ తొలి వెలుగు ధర్నాయీ (బిహార్)జహానాబాద్ జిల్లాలో, బో«ద్ గయాకు దగ్గర్లో ఉంటుందీ ఊరు. దీని జనాభా 2,400. ఒకప్పుడు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గింది. కానీ కొన్నేళ్ల కిందట. ఆ ఊరి ప్రజలే పూనుకొని సోలార్ పవర్ ప్లాంట్‌ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది 450 ఇళ్లకు, 50 వాణిజ్య సముదాయాలకు ఎలాంటి కోతల్లేని కరెంట్‌ని అందిస్తోంది. ధర్నాయీ వాసుల ఈ సాహసం ఆ ఊరిని.. దేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్‌నే వాడుతున్న తొలి గ్రామంగా నిలబెట్టింది. ఇప్పడు ఆ ఊర్లో ఇప్పుడు పిల్లలు చదువును కేవలం పగటి పూటకే పరిమితం చేసుకోవడం లేదు. స్త్రీలు రాత్రివేళల్లో గడపదాటడానికి భయపడటమూ లేదు.ఇవేకాక ఫస్ట్ విలేజ్ మానా, బ్యూటిఫుల్ విలేజ్ చిరాపూంజీ, వలస పక్షుల ఆత్మహత్యలకు కేంద్రం జతింగా, ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కుంబలంగీ, బార్టర్ సిస్టమ్ అమల్లో ఉన్న జూన్ బేల్ మేల (అసోం) లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఊర్ల జాబితా చాంతాడంత పెద్దది. సమయం చిక్కినప్పుడల్లా వాటి గురించి తెలుసుకుంటూ.. డబ్బు వెసులుబాటైనప్పుడల్లా చుట్టిరావడమే! ప్రస్తుతం ఈ వివరాలతో వెరీ నెక్స్›్ట వెకేషన్‌కి డిస్టినేషన్ని టిక్ చేసేసుకోండి మరి! -
ఏపీలో ప్రకృతి వ్యవసాయం భేష్
సాక్షి, అమరావతి: రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. ఏపీ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అమలుచేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు 45 దేశాల ప్రతినిధులు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం అమలుతీరు చాలా బాగుందని జాంబియా దేశ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. నిజానికి.. రాష్ట్రంలోని 10 లక్షల 35 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. 4,120 గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ కలిసి పనిచేస్తోంది. దీంతో.. ప్రపంచంలో విస్తృత స్థాయిలో ఆగ్రో ఎకాలజీ కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థగా గుర్తింపు పొందిన రైతుసాధికార సంస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని పరిశీలించి తమ దేశంలో అమలుచేసేందుకు జాంబియా దేశ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈనెల 7న రాష్ట్రానికి చేరుకున్న ఆ దేశ అత్యున్నత ప్రతినిధి బృందం 21 వరకు అనంతపురం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్) ప్రాజెక్టు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్, రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందడంతో పాటు క్షేత్రస్థాయిలో బృంద సభ్యులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. జాంబియా దేశంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలుచేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఈ బృందంలో జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖతోపాటు మరో రెండు సామాజిక సంస్థలైన కస్సీ వ్యవసాయ శిక్షణా కేంద్రం (కేఏటీసీ), వాల్పో నాస్కా శిక్షణా క్షేత్రం ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు అమలుచేస్తున్న “లెర్నింగ్ బై డూయింగ్’ విధానంలో జాంబియా ప్రతినిధి బృందం రెండువారాల పాటు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలులో భాగస్వాములై అధ్యయనం చేస్తుంది.ప్రపంచానికే ఏపీ ఆదర్శం..ప్రకృతి వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకునే క్రమంలో భాగంగా జాంబియా ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ శనివారం రైతు సాధికార సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా జాంబియా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ.. ఏపీలో గడిచిన ఐదేళ్లుగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. తమ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున 2023లో ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఏపీలో పర్యటించిందని వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఏపీ రైతు సాధికార సంస్థ జాంబియాతో కలిసి పనిచేసేందుకు తొలి అడుగువేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. జాంబియా బృందం పర్యటన ముగిసిన అనంతరం రైతు సాధికార సంస్థ తరఫున ఓ సీనియర్ సాంకేతిక బృందం జాంబియా దేశంలో పర్యటించి అక్కడ కాలానుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను సూచిస్తుంది. సామాజిక మార్పు కోసం పనిచేసే వంద మందికి పైగా భాగ్యస్వామ్యం కలిగిన ఎన్‌వోడబ్ల్యూ (నౌ) నెట్వర్క్ సహకారంతో ప్రకృతి వ్యవసాయ జ్ఞానాన్ని జాంబియా దేశానికి ఏపీ అందించనుంది. -
ఆ దీవి భూతల స్వరం! సకల ప్రకృతి..
ప్రకృతి వైవిధ్యమంతా ఆ దీవిలో ఒకేచోట కనువిందు చేస్తుంది. అందుకే పర్యాటక నిపుణులు ఆ దీవిని ‘ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ అని అభివర్ణిస్తున్నారు. ‘ఇలా దాస్ ఫ్లోరిస్’ అనే ఈ దీవి పోర్చుగల్‌లో ఉంది. ఈ దీవిలో అందమైన బీచ్‌లు మాత్రమే కాదు, సహజమైన సరోవరాలు, జలపాతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు చుట్టూ పచ్చగా కనిపించే దట్టమైన వనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో అలరారే అపురూపమైన ‘హైడ్రేంజ’ మొక్కలు ఈ దీవిలో విరివిగా ఉండటంతో ఈ దీవికి ‘ఇలా దాస్ ఫ్లోరిస్’– అంటే పూలదీవి అనే పేరువచ్చింది. ఈ దీవి తీరంలో డాల్ఫిన్లు విరివిగా కనిపిస్తాయి. ఈతకొడుతూ సేదదీరాలనుకునే వారికి, కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ దీవి అనువుగా ఉంటుంది. ఈ దీవిలో జనాల సందడి చాలా తక్కువ. చాలా చోట్ల ఖాళీగా మిగిలిన ఊళ్లు, ఆ ఊళ్లలోని పాతకాలం ఇళ్లు కనిపిస్తాయి. ఈ దీవికి వెళ్లే పర్యాటకులు కొందరు ఖాళీ ఊళ్లలో ఖాళీగా మిగిలిన పాత ఇళ్లనే శుభ్రం చేసుకుని తాత్కాలికంగా బస చేస్తుంటారు. పర్యాటకుల రాక ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో పోర్చుగల్ ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా మిగిలిన ఊళ్లలోని ఇళ్లకు మరమ్మతులు జరిపి, వాటిని కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ఈ దీవిని యూరోప్‌లో వెలుగుచూడని రత్నాలలో ఒకటిగా అభివర్ణించడం విశేషం. (చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో..) -
ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసుకున్న కాలనీవాసులు
-
సంఘటితంగా రైతుల ప్రకృతి సాగు
-
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీవోఏ) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా.. ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీవో)తో పాటు బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీటిని సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్ ఇండియా నేచురల్స్ ఎక్స్ పో’లో ప్రదానం చేయనున్నారు. ప్రకృతి సాగులో ఏపీ బహు బాగు.. కాగా రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది. 700 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తోంది. దీంతో ప్రకృతి సాగు ప్రస్తుతం 3,730 పంచాయతీల పరిధిలో విస్తరించింది. 9.40 లక్షల ఎకరాల్లో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములవుతున్నారు. ప్రకృతి, సేంద్రియ సాగులను ప్రోత్సహించేందుకు ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుత సీజన్ నుంచే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) సర్టిఫికేషన్ జారీ చేయనుంది. అత్యుత్తమ ఎఫ్‌పీవోగా.. అత్తలూరుపాలెం రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) కేటగిరీలో పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరుకు చెందిన ‘అత్తలూరుపాలెం ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీవో)’కు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించిన ఈ ఎఫ్‌పీవో పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలో ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు. అంతేకాకుండా వారు పండించిన కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, బియ్యం, వంట నూనెలు, పొడులు, పచ్చళ్లను మార్కెటింగ్ చేస్తున్నారు. అలాగే 70 దేశీ ఆవులతో ప్రత్యేకంగా ఆవుల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆవు పాలు, నెయ్యి, మజ్జిగలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. రైతులు మార్కెట్ ధర కంటే అధిక ఆదాయం పొందేలా ఎఫ్‌పీవో కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్రకృతి సాగు చేసే రైతులకు అవసరమయ్యే శిక్షణ కూడా అందిస్తోంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతో గుంటూరు విద్యానగర్‌లో హోటల్‌ను సైతం నడుపుతోంది. గుంటూరు, విజయవాడల్లో ప్రత్యేక స్టోర్ల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. మహిళా రైతుకు జాతీయ అవార్డు.. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళా కేటగిరీలో బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ జైవిక్ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. పద్మజ సేవలను గుర్తించి ఇటీవల రైతు సాధికార సంస్థ ఆమెను మోడల్ మేకర్‌గా ఎంపిక చేసింది. ఆమె తనకున్న ఎకరంలో ఏటా రూ.లక్షన్నర ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. ఆదర్శంగా తీసుకున్న పలు రాష్ట్రాలు.. ఏపీలో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సాగును కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు రైతు బజార్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీక్లీ మార్కెట్ల ద్వారా కూడా ప్రోత్సాహం అందజేస్తోంది. ఈ క్రమంలో ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ముందుకొచ్చిన అమూల్ ఆర్గానిక్స్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైంది. -
ప్రకృతి వ్యవసాయం చేయండి, అదొక్కటే ఎన్నో సమస్యలకు పరిష్కారం
కళ్యాణదుర్గం: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. గురువారం కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న పంట పొలాలను కలెక్టర్ గౌతమి, ఏటీఎం మోడల్ రూపకర్త, ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని ప్రకృతి వ్యవసాయం నిజం చేస్తుందన్నారు. కలెక్టర్ ఎం. గౌతమి మాట్లాడుతూ పొలాల్లోకి దిగిన ప్రతిసారీ ఆదాయం పొందే విధంగా ‘ఏటీఎం మోడల్’ను అవలంబించాలని ఆకాంక్షించారు. ఈ విధానం రైతులకు లాభసాటిగా ఉండటంతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించేందుకు దోహదపడుతుందన్నారు. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ విస్తీర్ణంలో, రసాయనాలు అవసరం లేకుండా వివిధ రకాల పంటలు ఏకకాలంలో పండిస్తూ సొమ్ము చేసుకుంటున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏటీఎం మోడల్‌పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ సూచించారు. అనంతరం పలువురు రైతులు సాగు చేసిన చిరుధాన్యాల పంటలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సాగులో రాష్ట్రం బెస్ట్
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యమంలా సాగుతన్న ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం దక్కింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో ఏపీలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని ప్రశంసించింది. రాష్ట్రంలో ప్రకృతి సాగు ద్వారా వస్తున్న సామాజిక మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అన్ని రాష్ట్రాలూ ఏపీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించింది. తొలుత 704 గ్రామాల్లో 40 వేల మందితో ప్రారంభమైన ప్రకృతి సాగు రాష్ట్ర ప్రభుత్వంలో ఓ ఉద్యమంలా రూపుదిద్దుకొంది. ప్రస్తుతం 3,730 గ్రామాల్లో 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీ మాన్సూన్ సోయింగ్ పద్ధతిలో (తొలకరి వర్షాలు కంటే ముందే విత్తనం వేయడం) 3.70 లక్షల మంది రైతులు ఏపీలో ప్రకృతి సాగు చేస్తున్నారు. మిగతా రైతులు వీరితోపాటు ఖరీఫ్, రబీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతులు కాకుండా ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 1.32 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు భాగస్వాములయ్యారు. 1.71 లక్షల మంది పేద, మధ్య తరగతుల ప్రజలు ఇళ్లలో కిచెన్ గార్డెన్లను పెంచుతున్నారు. 45 వేల మంది రైతులు ఏడాది పొడవునా ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ఘన జీవ, ద్రవ జీవామృతాలు, కషాయాలు, వివిధ రకాల ద్రావణాలను రైతుల ముంగిట అందించేందుకు గ్రామైక్య సంఘాల సహకారంతో 3,909 బయో ఇన్పుట్ షాపులను ఏర్పాటు చేసింది. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో 28 లక్షల మందిని ప్రకృతి సాగులో భాగస్వాములను చేయాలన్నది లక్ష్యం. రాష్ట్ర సహకారంతో పొరుగు రాష్ట్రాల్లో మరో 4 లక్షల మందిని ప్రకృతి సాగు వైపు మళ్లించేలా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఏపీ స్ఫూర్తితో ఈ ఏడాది జాతీయ స్థాయిలో కోటి ఎకరాల్లో ప్రకృతి సాగుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రకృతి సాగుతో వలసలకు అడ్డుకట్ట ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన మార్పులపై సామాజిక ఆర్థిక సర్వేలో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ప్రకృతి సాగు వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుల నికర ఆదాయం పెరుగుతున్నట్టు సర్వే పేర్కొంది. నగరాలకు వలసలు వెళ్లే యువతను తిరిగి గ్రామాలకు రప్పిస్తుందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిన రాష్ట్ర యువతలో కొందరు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. ఇదే కాకుండా పంట దిగుబడులను అంచనా వేసేందుకు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ (ఐడీఎస్) ఆధ్వర్యంలో చేపడుతున్న పంట కోత ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఏపీలో నిరూí³తమైందని సర్వే వెల్లడించింది. వ్యవసాయంలో ఖర్చుతో పాటు రిస్కును తగ్గించి దిగుబడులను పెంచడం ద్వారా అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొంది. వాతావరణ అనుకూల మార్పులకు బాటలు వేస్తోందని, సురక్షితమైన రసాయన రహిత ఆరోగ్యకర పౌష్టికాహారాన్ని సమాజానికి అందిస్తుందని, నేల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను, జీవ వైవిధ్యత పునరుత్పత్తి ద్వారా భావితరాలకు రక్షణగా నిలుస్తుందని పేర్కొంది. ఈ సాగు ప్రయోజనాలు ఏపీలో నిరూపితమయ్యాయని కూడా వెల్లడించింది. ప్రకృతి వ్యవసాయం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను, మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం అభినందించిన అంశాన్ని ఆర్థిక సర్వే నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలని ఆ సర్వేలో పేర్కొన్నారు. సామాజిక సర్వేలో ప్రస్తావించడం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వల్ల సమాజంలో వస్తున్న మార్పులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏపీసీఎన్ఎఫ్ (ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్) చేస్తున్న కృషిని సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించడం హర్షణీయం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థిక సర్వే ఊతమిస్తోంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ -
70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా
ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిన బ్యాంకింగ్ నిపుణుడు ఇమ్మానేని రంగప్రసాద్ తన పొలాన్ని ఉద్యాన పంటల జీవవైవిధ్య క్షేత్రంగా మార్చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మస్’ పేరుతో అభివృద్ధి చేశారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లతో పాటు నాటుకోళ్లు, ఆవుల పెంపకం చేపట్టారు. పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా అమృతాహారాన్ని అందించడమే లక్ష్యమంటున్న రంగప్రసాద్ కృషిపై కథనం. హైదరాబాద్‌కు చెందిన ఇమ్మనేని రంగప్రసాద్ బ్యాంకింగ్ నిపుణుడు. డా. కిరణ్మయి మైక్రోబయాలజిస్టు. ఈ దంపతులకు సేంద్రియ/ప్రకృతి సేద్యం అంటే మక్కువ. ఈ మక్కువతోనే హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో సమీకృత సేంద్రియ ఉద్యాన పంటల క్షేత్రానికి ఎంతో శ్రమించి రూపుకల్పన చేశారు. ఏడాది పొ డవునా రసాయనిక అవశేషాల్లేని చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నాటు కోడిగుడ్లను నగరవాసులకు అందించాలని సంకల్పించారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మ్స్’ పేరుతో జీవవైవిధ్య ఉద్యాన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువను అనుకొని ఉండటంతో ఈ క్షేత్రానికి సాగు నీటి కొరత లేదు. తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత ఎమ్మెస్ సుబ్రహ్మణ్యం రాజు సూచనలు, సలహాలతో ఈ క్షేత్రం మెరుగైన ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. దేశ విదేశీ రకాలెన్నో... అనేక రకాల నేలలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ పొ లాన్ని అనేక విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ఒక్కో రకం ప్రధాన పంటలను, వాటి మధ్య అనేక అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొ డవునా దిగుబడులు తీసుకునేందుకు వీలుగా వారానికోసారి ఆకుకూరలు, 15 రోజులకోసారి కూరగాయ మొక్కలు నాటుతూ (స్టాగ్గర్డ్ ప్లాం టేషన్ చేస్తూ) ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజి, కాళీఫ్లవర్ వంటి పంటలు 15 రోజులకోసారి విత్తుతున్నారు. కాకర, బీర, సొర, టమాటో, బెండ వంటి పంటలను నెలకోసారి విత్తుతున్నారు. ఐఫార్మ్స్లో ఆరుబయట ఎత్తు మడులపై పెరుగుతున్న కసూరి మేతి, ఎర్ర ముల్లంగి, దిల్, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, పర్పుల్ కార్న్, బేబీ కార్న్, మిక్స్డ్ కలర్ కార్న్.. వంటి విదేశీ జాతుల కూరగాయలు వినియోగదారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే నల్ల కంది, సుగంధ పసుపు, మామిడి అల్లం వంటి పంటలు కూడా ఈ క్షేత్రంలో సాగవుతున్నాయి. అంతర పంటలు.. మొరంగడ్డ తీగతో మల్చింగ్... మామిడి, జామ, సీతాఫలం, బొ΄్పాయి తదితర పండ్ల మొక్కల మొదళ్లలో మొరంగడ్డ (చిలగడదుంప) తీగ ముక్కలను నాటడం ద్వారా కలుపును నివారించడమే కాకుండా సజీవ ఆచ్ఛాదన కల్పిస్తుండటం మరో విశేషం. తీగ ముక్క నాటిన ఆరు నెలల్లో చిలగడదుంపలను తవ్వి వినియోగదారులకు అందిస్తూ ఆదాయం కూడా పొ ందుతున్నారు. పండ్ల తోటల్లో ఖరీఫ్‌లో, రబీలో కూడా అంతర పంటలను సాగు చేస్తున్నారు సజీవ ఆచ్ఛాదన, కలుపు నివారణ, అదనపు ఆదాయం.. అంతర పంటల ద్వారా ఈ మూడు ప్రయోజనాలు సాధిస్తున్నారు. జామ తోటలో మొక్కల మధ్య చిలగడదుంప, సాళ్ల మధ్య వేరుశనగ వేశారు. వేరుశనగలతో వంట నూనె ఉత్పత్తి చేయడానికి ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకుంటున్నామని రంగప్రసాద్ తెలిపారు. శాశ్వత పందిరికి దొండ తీగలు పాకించి.. పందిరి కింద సాళ్ల మధ్య ఖాళీలో వెల్లుల్లి, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బొ΄్పాయి తోట మధ్యలో 9 రకాల తులసి రకాలను పెంచుతున్నారు. సీతాఫలంలో బాలానగర్, ఎన్ఎంకె గోల్డ్, రామాఫలం, లక్ష్మణఫలం రకాలు నాటారు. ఈ నాలుగూ ఒకేసారి కాపునకు రావు. ఒకటి పూర్తయ్యాక మరొకటి ఫలాలనిస్తాయి. ఎటు చూసినా 10 అడుగుల దూరంలో మామిడి మొక్కలు నాటారు. మధ్యలో ఖరీఫ్‌లో కంది, రబీలో చిలగడదుంప సాగు చేస్తున్నారు. అందరూ ఎక్కువగా ఇష్టపడే బేనిషాన్, హిమాయత్ మొక్కలు పెట్టాం. ఎక్కడెక్కడి నుంచో అరుదైన రకాలను సైతం తెచ్చి అన్నీ కలిపి 70 రకాలను నాటామని రంగప్రసాద్ తెలిపారు. భవిఫ్యత్తులో అన్ని రకాల మామిడి పండ్లతో కూడిన బుట్టలను ప్రజలకు సరఫరా చేయనున్నట్లు సుబ్రమణ్యరాజు తెలిపారు. ఒకసారి విత్తితే.. వరుసగా రెండు పంటలు! ఆకుపచ్చ క్యాబేజీ, ఎరుపు బ్రోకలీ వంటి కొత్తరకం పంటలను ఐఫార్మ్స్లో పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒకే మొక్కకు రెండు సార్లు దిగుబడి తీస్తున్నారు. ఒక పంట తీసుకున్న తర్వాత అదే మొక్క నుంచే 50 రోజుల్లో కార్శి(రటూన్ క్రాప్) పంట తీస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి సేద్య నిపుణులు సుబ్రహ్మణ్యం రాజు పర్యవేక్షణలో ఈ ప్రయోగాత్మక సాగు జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే.. మొదటి పంటగా క్యాబేజీ, బ్రోకలీ కోసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచి, ఎప్పటిలాగే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. 2 వారాల్లో కొత్త పిలకలు వస్తాయి. పెద్దదాన్ని ఉంచి, మిగిలినవన్నీ తీసివేయండి. 400–500 గ్రాముల క్యాబేజీ, బ్రోకలీ కావాలంటే రెండు రెమ్మలు ఉంచండి. ప్రతి పది రోజులకు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఆవు మూత్రం పిచికారీ చేయడం ద్వారా పోషకాహారం ఇవ్వండి. పంట కాలంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండో పంట కోసం 40–50 రోజుల వరకు వేచి ఉండండి. ఈ కార్శి పంట వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెండో పంటకు బెడ్ తయారీ అవసరం లేదు. అదనపు శ్రమ లేదు. తక్కువ కలుపు. తక్కువ వ్యవధి. కాబట్టి చాలా తక్కువ ఖర్చు. సీజన్ లో కన్నా ధర ఎక్కువగా వస్తుంది. నాటు కోళ్లు సమీకృత సేద్యం ద్వారానే ఉత్తమ ఫలితలు వస్తాయని రంగప్రసాద్ నమ్మిక. 35 దేశీ ఆవులతో కూడిన గోశాల ఈ క్షేత్రంలో ఉంది. సుమారు 400 నాటుకోళ్ల ఫారాన్ని నెలకొల్పారు. నాటు కోళ్లతో పాటు గిన్నెకోళ్లు, టర్కీ కోళ్లు, అసీల్ తదితర జాతుల కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యదాయకన రీతిలో ఆరుబయట తిరుగుతూ పెరిగేలా కోళ్లకు ఏర్పాట్లు చేశారు. నాటు కోడి గుడ్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు అందించాలన్నదే రంగప్రసాద్ లక్ష్యం. సంతృప్తికర∙ఉత్పాదకత పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, జీవన ఎరువులు, జీవన పురుగుమందులను అవసరాన్ని బట్టి వాడుతున్నారు. తద్వారా పోషకలోపాలు లేకుండా, చీడపీడల బెడద లేకుండా.. సంతృప్తికరమైన రీతిలో పంటల ఉత్పాదకత సాధిస్తున్నట్లు సుబ్రహ్మణ్య రాజు(76598 55588) వివరించారు. హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు అందించడంతో పాటు ఎంపికచేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలకు స్వయంగా తీసుకెళ్లి వారానికోసారి తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు రంగప్రసాద్. సేంద్రియ ఆహారోత్పత్తులను నేరుగా పొ లం నుంచి పొ ందగోరే గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాలు ఉచితంగా తమ క్షేత్రాన్ని సందర్శించవచ్చని సమీకృత సేంద్రియ సాగుదారుడు రంగప్రసాద్(98851 22544) ఆహ్వానిస్తున్నారు. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
చూస్తే ప్రకృతి ధామంలా ఆహ్లాదంగా ఉంటుంది! కానీ అది..
అక్కడికి అడుగుపెట్టగానే పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతుంది. పాడిపంటలు కనువిందు చేస్తాయి. జీవవైవిధ్యం ముచ్చటగొలుపుతుంది. ఒకసారి ప్రవేశిస్తే ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగని అదేమీ అందమైన అటవీ ప్రాంతం కాదు. జనారణ్యం నడుమ ఉన్న ఓ జైలు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. అదే రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఖైదీల వ్యవసాయ క్షేత్రం). ఖైదీల పరివర్తన కేంద్రంగా, అందమైన వ్యవసాయ క్షేత్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సాక్షి, అనంతపురం: క్షణికావేశంలో చేసిన నేరాలు జైలుగోడల మధ్యకు నెడతాయి. సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వస్తే జీవితమే నరకంగా మారుతుంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కానీ అది పరివర్తనకు దోహదపడినప్పుడే అర్థవంతమవుతుంది. ఖైదీల్లో పరివర్తన, చట్టాలను గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దడం, పునరావాసానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్‌జైలు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద ఓపెన్ ఎయిర్ జైలును 1965 సంవత్సరంలో అప్పటి కేంద్రమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతపురం నగరానికి అత్యంత చేరువలో ఉండే ఈ జైలును మొదట్లో 1,427.57 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో జిల్లా జైలు, ఏపీఎస్పీ బెటాలియన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి 623.44 ఎకరాలను కేటాయించారు. దీంతో ప్రస్తుతం 804.13 ఎకరాల్లో ఓపెన్ ఎయిర్‌జైలు కొనసాగుతోంది. స్వేచ్ఛ జీవితం, నైపుణ్య శిక్షణ సాధారణ జైల్లో శిక్ష అనుభవించే సమయంలో క్రమశిక్షణతో మెలిగి, పరివర్తన చెందేవారిని చివరిదశలో రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలుకు పంపుతారు. ఇక్కడి స్వేచ్ఛా వాతావరణంలో ఖైదీల్లో ఒత్తిడి తగ్గించి.. వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు సమగ్ర వికాసానికి దోహదం చేస్తున్నారు. వారు విడుదలైన తర్వాత సమాజంలో సాఫీగా బతకడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ జైలును 300 మంది ఖైదీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయితే..జిల్లా జైళ్లలోనే సెమీ ఓపెన్‌ఎయిర్ సిస్టం తేవడం, నేరాల సంఖ్య తగ్గడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇక్కడ 32 మంది మాత్రమే ఉన్నారు. పంటల సాగు పెట్రోల్ నిర్వహణ రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలు ఖైదీలు వ్యవసాయ, అనుబంధ విభాగాలతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ సత్తా చాటుతున్నారు. దాదాపు అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటిని గతంలో ట్రాక్టరులో అనంతపురానికి తెచ్చి విక్రయించేవారు. ఇప్పుడు జైలు వద్దే అనంతపురం–తాడిపత్రి రహదారి పక్కన అమ్ముతున్నారు. తక్కువ పురుగు మందుల వాడకంతో నాణ్యమైన కూరగాయలు పండిస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మామిడి, సపోటా, ఉసిరి తదితర పండ్లతోటల సాగుతో పాటు డెయిరీ నిర్వహణ, గొర్రెలు, పశువుల పెంపకంలోనూ ఖైదీలు నైపుణ్యం సాధించారు. ఇక పెట్రోల్ బంకుల నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ రూ.పది లక్షల దాకా వ్యాపారం చేస్తున్నారు. ప్రకృతి రమణీయత..జీవవైవిధ్యం ఓపెన్ ఎయిర్‌జైలు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంది. ఎటుచూసినా చెట్లు, పండ్ల తోటలు, పంటలతో అలరారుతోంది. వన్యప్రాణులకూ ఆశ్రయమిస్తోంది. పచ్చనిచెట్ల మధ్య నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు తదితర వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. వీటిని ఖైదీలు, జైలు అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, వైవిధ్యం కల్గివున్నందునే అది ఒక జైలన్న భావన కల్గదు. అక్కడున్న వారు ఖైదీలన్న విషయమూ మరచిపోతాము. (చదవండి: -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్‌పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్
ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే (2.90 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా.. గుజరాత్లో 2.49 లక్షల మంది రైతులు (అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కృషి భవన్లో ‘జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’ సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రకృతి సేద్య విస్తరణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్లను అనుసంధానించాలని అధికారులను కోరారు. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. 2021 డిసెంబర్ తర్వాత 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు మంత్రి తోమర్ వెల్లడించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు తెలిపారు. – సాక్షి, సాగుబడి డెస్క్ -
ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతు ఓబులమ్మ
తలకు మించిన భారంగా, నష్టదాయకంగా మారిన రసాయనిక వ్యవసాయంతో విసిగి వేసారి ఆరేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మహిళా రైతు కుటుంబం రైతు లోకానికే ఆదర్శంగా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జైవిక్ ఇండియా జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని గెల్చుకోవటం విశేషం. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన బండి ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు 2016 నుంచి కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి.. తదనంతరం పదెకరాలకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించారు. నిమ్మ తోటలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. దేశీ వరిని సాగు చేస్తున్నారు. కొంత విస్తీర్ణంలో ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ.. స్వయంగా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ నిరంతర ఆదాయం గడిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. మూడు ఆవులను కొనుగోలు చేసి, పేడ, మూత్రంతో ఘనజీవామృతం, జీవామృతం స్వయంగా తయారు చేసి వాడుతున్నారు. అవసరం మేరకు కషాయాలు వాడి పంటలు పండిస్తున్నారు. తొలుత యూట్యూబ్‌లో ప్రకృతి సేద్యపు విజయగాథలు చూసి స్ఫూర్తి పొంది శ్రీకారం చుట్టారు. తదనంతరం గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది సూచనలు, సలహాలు పాటిస్తూ.. పర్యావరణానికి, ప్రజలకు ఆరోగ్యదాయకమైన సేద్య రీతిలో తిరుగులేని పట్టు సంపాదించారు. అంతేకాదు, సొంతంగా ప్రజలకు అమ్ముకోవటంలోనూ విజయం సాధించారు. కలిసొచ్చిన నోటి ప్రచారం పండించిన కూరగాయలు, ఆకుకూరలను తాము తినటంతో పాటు ఓబులమ్మ స్వయంగా ఇంటింటికీ వెళ్లి అమ్ముతుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆరోగ్యదాయక ఉత్పత్తుల విశిష్టత గురించి గ్రామాల్లో ఆయమ్మకు ఈయమ్మకు చెప్పడం మొదలు పెట్టారు. వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలియజెప్తూ అమ్మేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తామర తంపరగా పాకిపోయింది. వారి గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే మైదుకూరు పట్టణంలోని కూరగాయల వ్యాపారులకూ ఈ విషయం తెలిసింది. వారి నుంచి కడప, పొద్దుటూరులో కూరగాయల వ్యాపారులకు కూడా తెలిసింది. వారు నేరుగా ఓబులమ్మ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కెళ్లటం అలవాటైంది. దీంతో ఓబులమ్మ పండించే ప్రకృతి వ్యవసాయ పంట దిగుబడులకు మార్కెటింగ్ సమస్యతో పాటు రవాణా ఖర్చు కూడా మిగిలింది. ఖర్చు తగ్గడంతో మంచి రాబడి ప్రారంభమైంది. దీంతో ఓబులమ్మ తన భర్త తిరుమలయ్యతో కలిసి క్రమంగా ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచుతూ వచ్చారు. 2018 నుంచి తమకున్న మొత్తం 10 ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మిల సహకారంతో ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ దిగ్విజయంగా ఓబులమ్మ, తిరుమలయ్య దంపతులు ప్రకృతి వ్యవసాయంలో ముందుడుగు వేస్తున్నారు. నిమ్మ తోటలో అంతర పంటలు మొదల్లో 2 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటి.. అంతరపంటలుగా వంగ, మిరప, ఆరటి, బొప్పాయి వంటి తదితర పంటలను సాగు చేశారు. నిమ్మ, అరటి, బొప్పాయి పండ్లను పొలం వద్దనే వ్యాపారులకు అమ్మేవారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రం ఆలవాటు కొద్దీ ఉదయాన్నే గ్రామాగ్రామానికి తిరిగి అమ్మడం నేటికీ కొనసాగిస్తున్నారు ఓబులమ్మ. 2020లో మరో 6 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటారు. ఈ ఆరు ఎకరాల్లో కూడా అంతర్ పంటగా ప్రతి 50 సెంట్లలో టమోటా, మిరప, వంగ, గోంగూర, పాలకూర, చుక్కాకు వంటివి సాగు చేశారు. పండ్లు, కూరగాయలను పొలం వద్దే కొనుగోలు చేసుకొని తీసుకు వెళ్తుండటంతో ఓబులమ్మకు మార్కెటింగ్ సమస్య లేకుండా పోయింది. (క్లిక్: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!) అధిక ధరకే అమ్మకాలు గతేడాది 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ. 6.99 లక్షల నికరాదాయం వచ్చిందని ఓబులమ్మ తెలిపారు. రూ. 4.8 లక్షలు ఖర్చవ్వగా వివిధ పంటల అమ్మకం ద్వారా రూ. 11,79 లక్షల ఆదాయం వచ్చింది. 3 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో కొర్రలు, 2 ఎకరాల్లో మైసూరు మల్లిక, బహురూపి దేశీ వరిని ఓబులమ్మ సాగు చేశారు. మిగతా 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశారు. నువ్వుల ద్వారా రూ. లక్ష, నిమ్మకాయల ద్వారా రూ.4.70 లక్షలు, మైసూరు మల్లిక, బహురూపి బియ్యం ద్వారా 1.13 లక్షలు, కొర్ర ధాన్యం ద్వారా రూ. 56 వేలు, మిర్చి ద్వారా రూ. 2.78 లక్షలు, టమాటోలు తదితర కూరగాయల ద్వారా రూ. 1.62 లక్షల ఆదాయం వచ్చింది. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం ద్వారా ప్రతి రోజూ కొంత రాబడి వస్తున్నది. మార్కెట్లో సాధారణ కూరగాయల చిల్లర కన్నా కిలోకు 2–3 రూపాయల అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ఓబులమ్మ వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నిమ్మ తోటలో అంతరపంటలుగా 2 ఎకరాల్లో ఉల్లి, 1.5 ఎకరాల్లో కొత్తిమీర, 50 సెంట్లలో వరి పంటలను సాగు చేస్తున్నారు. ఇతర వివరాలకు ఓబులమ్మ అల్లుడు శివరామయ్య (98485 58193)ను సంప్రదించవచ్చు. – గోసుల ఎల్లారెడ్డి, సాక్షి, కడప అగ్రికల్చర్ మా కష్టాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి సాగు ఖర్చు భారీగా తగ్గింది. నా భర్త తిరుమలయ్యతోపాటు అల్లుడు శివరామయ్య, కుమార్తె ఆదిలక్ష్మితో కలిసి వివిధ పంటలను సాగు చేస్తున్నాను. పురుగు మందులకు బదులు నీమాస్త్రం, దశపర్ణి కషాయం, వేపనూనె, కానుగ నూనెలను వాడతాం. ఎరువులకు బదులుగా జీవామృతం, ఘనజీవామృతం వేసుకుంటాం. వీటిని మేమే తయారు చేసుకుంటాం, పంటల సాగుకు ముందు నవధాన్యాలను విత్తి, ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నుతాం. తర్వాత వేసే పంటలకు అది సత్తువగా పనికొస్తుంది. పండ్లను వ్యాపారులే వచ్చి కొనుక్కుంటున్నారు. కూరగాయలను ఇంటింటికీ తీసుకెళ్లి అమ్ముతున్నా. మా కష్టాన్ని గుర్తించిన ప్రకృతి వ్యవసాయ అధికారులు అవార్డుకు దరఖాస్తు చేయించారు. జైవిక్ ఇండియా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – బండి ఓబులమ్మ, ప్రకృతి వ్యవసాయదారు, టి. కొత్తపల్లె, మైదుకూరు మం., వైఎస్సార్ జిల్లా -
నేర్చుకుంటూ, నేర్పుతూ.. విలువైన పాఠాలు!
పర్యావరణం అనేది యూత్‌కు పట్టని మాట... అనేది తప్పని ‘యూ కెన్’లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నయువతరం నిరూపిస్తోంది. మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు తిరుగుతూ పర్యావరణ సందేశాన్ని మోసుకెళుతుంది... మధ్యప్రదేశ్‌లోని పిపరియ అనే టౌన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రతి శనివారం తప్పనిసరిగా వస్తుంది 27 సంవత్సరాల లహరి. ‘అక్కయ్య వచ్చేసింది’ అంటూ పిల్లలు చుట్టుముడతారు. అందరిని పలకరించి తాను చెప్పదలుచుకున్న విషయాలను చెబుతుంది. పిల్లలందరూ నిశ్శబ్దంగా వింటారు. సందేహాలు అడిగి తీర్చుకుంటారు. ఆ తరువాత లహరితో కలిసి ప్రకృతిని పలకరించడానికి వెళతారు. ‘ఈ చెట్టు పేరు మీకు తెలుసా?’ ‘అదిగో ఆ కీటకం పేరు ఏమిటి?’ ... ఇలా ఎన్నో అడుగుతూ వాటికి సవివరమైన సమాధానాలు చెబుతుంది లహరి. ముచ్చట్లు, కథలు, నవ్వుల రూపంలో పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను లహరి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు. ‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగాను. మౌనమే వారి సమాధానం అయింది. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. తమ చుట్టూ ఉన్న మొక్కలు, చెట్ల పేర్లు చెప్పడంతో సహా వాటి ఉపయోగాలు కూడా చెప్పగలుగుతున్నారు’ అంటుంది లహరి. యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్(యూ కెన్) వేదికగా మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో లహరిలాంటి వారు పల్లెలు, పట్ణణాలు, కొండలు, కోనలు అనే తేడా లేకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు. ‘పిల్లల్లో కలిసిపోయి వారిని నవ్విస్తూనే నాలుగు మంచి విషయాలు చెప్పగలిగే వారిని తయారు చేయాలనుకున్నాం’ అంటున్న రామ్‌నాథ్ చంద్రశేఖర్, వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్, ఫొటోగ్రాఫర్, కన్జర్వేషన్ ఎడ్యుకేటర్ రచిత సిన్హాతో కలిసి యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్వర్క్ (యూ కెన్) అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి 20 మంది యువతీ యువకులను ‘యూ కెన్’ కోసం ఇంటర్వ్యూలు, వీడియో ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఝార్ఖండ్‌కు చెందిన రచిత సిన్హా పచ్చటి ప్రకృతితో చెలిమి చేస్తూ పెరిగింది. ‘మా చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఉండేవో తెలుసా, ఎన్ని పక్షులు ఉండేవో తెలుసా!’ అంటూ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను వింటూ పెరిగింది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన రచిత ఆ తరువాత ‘యూ కెన్’పై పూర్తిగా దృష్టి పెట్టింది. (క్లిక్: కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!) ‘లాభాపేక్షతో సంబంధం లేకుండా ఒక మంచిపని కోసం సమయాన్ని వెచ్చించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యువతరానికి యూ కెన్ మంచి వేదిక అవుతుంది. దీనికోసం పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. పర్యావరణ ప్రేమ, నాలుగు మంచి విషయాలు పిల్లలకు చెప్పగలిగే నైపుణ్యం ఉంటే చాలు’ అంటుంది రచిత సిన్హా. ‘నేర్చుకుంటూ... నేర్పుతూ’ అంటారు. ‘యూ కెన్’ ద్వారా యూత్ చేస్తున్న మంచి పని అదే. విలువైన పాఠాలు ప్రకృతి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూనే ‘యూ కెన్’ లాంటి వేదికల ద్వారా తాము నేర్చుకున్న విషయాలను పిల్లలతో పంచుకోవడంలో ముందుంటుంది యువతరం. – రచిత సిన్హా, యూ కెన్, కో–ఫౌండర్ -
ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆషామాషీ కాదు: మోదీ
అహ్మదాబాద్: మన దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇది ఆషామాషీ విజయం విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విజయమని, ఈ ఒరవడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని పెద్ద విజయాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఒల్పాడ్లో గురువారం జరిగిన మెడికల్ క్యాంప్‌లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశమున్న ప్రకృతి సేద్యం వైపు మరలాలని రైతులను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లను జమ చేశామన్నారు. ఇంటర్నెట్, సాంతికేక పరిజ్ఞానం పుస్తకాల స్థానాన్ని భర్తీ చేయలేవని ప్రధాని మోదీ అన్నారు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. నవభారత్ సాహిత్య మందిర్ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా మోదీ సందేశం పంపించారు. -
‘ప్రకృతి’ పరిశోధనలకు పెద్ద పీట
ఆహారంతో పాటు మనం తింటున్న రసాయనాలే క్యాన్సర్ తదితర మహమ్మారి జబ్బుల్ని కలిగిస్తున్నాయని మీకు తెలుసా? కలుపు మందు తయారీ కంపెనీపై అమెరికన్ ప్రజలు 9 వేలకు పైగా నష్టపరిహారం కేసులు వేశారని మీకు తెలుసా? రసాయనిక అవశేషాల్లేని, రోగ కారకం కాని స్వచ్ఛమైన ఆహారం.. అంటే ‘అమృతాహారం’ తీసుకునే వారు బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారని తెలుసా? అటువంటి అమృతాహారం రానున్న కొద్దేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలన్న మహాయజ్ఞం ప్రారంభమైంది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విప్లవాన్ని ప్రతి గ్రామానికీ, ప్రతి రైతుకూ, ప్రతి పొలానికీ విస్తరింపజేయడానికి దార్శనికతతో రాచబాటలు వేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుల భాగస్వామ్యంతో వచ్చే 7–8 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్నీ దశలవారీగా ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించడానికి నిర్మాణాత్మకమైన ప్రణాళికతో కదులుతున్నారు. బృహత్తరమైన ఈ కలను సాకారం చేసుకోవడానికి ఈ నెల 7న తొలి అడుగు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిశోధన, అధ్యయన అకాడమీని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక, సాంకేతిక తోడ్పాటుతో పులివెందులలో ప్రారంభించారు. పశుసంపదపై పరిశోధనకు గతంలో అత్యున్నత వసతులతో ఏర్పాటు చేసిన ‘ఐజి కార్ల్’ ఆవరణలో (‘ఇండో–జర్మన్ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ – ఐజిఎఎఆర్ఎల్–‘ఐజి ఆర్ల్’గా మార్చారు.) ఇది ఏర్పాటైంది. ప్రపంచ ప్రకృతి వ్యవసాయ పరిశోధన చరిత్రలోనే అదొక సుదినం. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6,30,000 మంది రైతులు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంలో ముందంజలో ఉన్నారు. ఈ కృషికి మెచ్చిన జర్మనీ ప్రభుత్వం ఐజి ఆర్ల్ నెలకొల్పటానికి రూ.174 కోట్ల గ్రాంటు ప్రకటించటం విశేషం. పరిశోధనలకు, రైతు శాస్త్రవేత్తల శిక్షణతో పాటు దేశ విదేశీ శాస్త్రవేత్తలకు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, 365 రోజుల పంటల సాగు వంటి పలు రైతు ఆవిష్కరణల వెనుక శాస్త్రీయత, ఎదుర్కొంటున్న సవాళ్లపై పరిశోధనా పత్రాలను వెలువరిస్తుంది. రాష్ట్రంలోని ఇతర 25 జిల్లాల్లోని 7 జిల్లాల్లో ఐజి ఆర్ల్కు అనుబంధ పరిశోధన, అధ్యయన కేంద్రాలను నెలకొల్పుతారు. మిగతా జిల్లాల్లోనూ ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వైవిధ్య పంటలు, తోటల సరళికి అనుగుణంగా మెట్ట, మాగాణి భూముల్లో ప్రకృతి సేద్య నమూనాలపై పరిశోధనలు చేస్తారు. ఆర్బీకే స్థాయిలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులను ఎంపిక చేసి, ఐజి కార్ల్‌లో వారికి మూడేళ్ల పాటు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చి, వారి జ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అధికారిక గుర్తింపుగా సర్టిఫికెట్లు ఇస్తారు. రాష్ట్రంలో 10,800 రైతు భరోసా కేంద్రాలు రైతులకు గ్రామస్థాయిలో చేదోడుగా ఉంటున్నాయి. ప్రతి ఆర్బీకేలో ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులైన సర్టిఫైడ్ రైతు శాస్త్రవేత్తను నియమించడం ద్వారా స్థానికంగా రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఆర్బీకే ద్వారానే ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను సమకూర్చుతారు. వీటిని సముచిత ధరకు విక్రయించుకునేందుకు సైతం ఆర్బీకే వేదికగా నిలుస్తుంది. ఆ విధంగా మిగతా రైతులు సైతం రసాయనాలను పూర్తిగా వదిలేసి, తనకున్న మొత్తం పొలాన్ని దశలవారీగా మూడేళ్లలో ప్రకృతి సేద్యంలోకి మళ్లించడం వీలవుతుంది. మన రైతు శాస్త్రవేత్తల అనుభవాలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చక్కని ఆచరణాత్మక అపూర్వ పాఠాలుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఇందుకోసం లక్ష మంది సర్టిఫైడ్ ప్రకృతి రైతు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే విధంగా, వచ్చే ఐదేళ్లలో కనీసం 200 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణమైన భవనాలు సిద్ధంగా ఉండటంతో ‘ఐజీ ఆర్ల్’ ఈ ఖరీఫ్ నుంచే పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏపీ ప్రభుత్వ ప్రకృతి సేద్య విస్తరణ రోడ్‌మ్యాప్‌లో మరో ముఖ్య అంకం ఏమిటంటే... ఈ ఆవరణలోనే వచ్చే ఏడాది కల్లా అంతర్జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించటం. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్డీ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం ఆఫర్ చేయనుంది. సీఎం జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో వ్యవస్థీకృతం అవుతున్న ఐజి ఆర్ల్, ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) ఉపాధ్యక్షులు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్ అయిన టి.విజయకుమార్ పర్యవేక్షణలో వేరూనుకోనుంది. వ్యవసాయ విద్య, పరిశోధనలను ప్రకృతి బాట పట్టించి కొత్త పుంతలు తొక్కించాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పాన్ని భారత ప్రభుత్వం సైతం గుర్తించి ప్రోత్సహిస్తుండటం కలిసి వచ్చింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశు పరిశోధన, విస్తరణ సంస్థలు సైతం ప్రకృతి సేద్యంపై దృష్టి సారించటం శుభసూచకం. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
ప్రకృతి సేద్యానికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కడప : ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. భవిష్యత్తులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని వ్యవసాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతోంది. రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకు రాలేకపోయినా దశల వారీగా ఈ తరహా వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకోసం పులివెందుల ఐజీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్‌ఎల్)ని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 7వ తేదీన పులివెందుల పర్యటనలో శంకుస్థాపన చేశారు. రూ. 222 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. ఇందుకోసం జర్మనీ రూ. 174 కోట్లు గ్రాంటుగా ఇస్తుండగా, మిగిలిన రూ. 48 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తోంది. దీంతోపాటు పులివెందులలోని ఐజీ కార్ల్ ప్రాంగణంలో 25 హెక్టార్ల భూమితోపాటు భవనాలను యూనివర్సిటీ కోసం కేటాయించారు. ఈ అకాడమి ప్రకృతి వ్యవసాయ పరిశోధనలకు దిక్సూచిగా నిలువనుంది. ప్రామాణికమైన శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా విరాజిల్లనుంది. రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా దీనిని విస్తరించనున్నారు. రైతులకు శిక్షణ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం అవసరమైన మాస్టర్ ట్రైనర్స్‌ను, వ్యవసాయ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచనున్నారు. ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్ ట్రైనర్, కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్, అగ్రి సైంటిస్టులను నియమిస్తారు. వారి ద్వారా రైతులకు శిక్షణ ఇప్పిస్తారు. రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ల ద్వారా అందుబాటులో ఉంచుతారు. దశల వారీ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలన్నది లక్ష్యం. తొలుత రైతు పొలంలో మూడోవంతు, ఆ తర్వాత 50 శాతం పొలాన్ని, ఆ తర్వాత మొత్తం పొలాన్ని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకు రానున్నారు. ఫెస్టిసైడ్స్, ఎరువుల వాడకం లేకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మరోవైపు భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నాణ్యమైన దిగుబడి ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా రైతుల పెట్టుబడుల ఖర్చు తక్కువగా ఉంటోంది. భూసారం క్షీణించదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. రసాయనిక ఎరువులతో పండించే పంట ధర కంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ధర ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు రసాయనిక ఎరువులతో పండించిన పుట్టి వరి ధాన్యం రూ. 10 వేలు ఉంటుండగా, అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వడ్ల ద్వారా రూ. 50 వేలకు పైగానే ఉంటుంది. అన్ని పంటల పరిస్థితి అలాగే ఉంటుంది. 2023 నాటికి 1.26 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం 2018 నాటికి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని 51 మండలాల పరిధిలో కేవలం 14,803 ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ ఏడాది నా టికి ఉమ్మడి జిల్లాలో 372 గ్రామ పంచాయతీల ప రిధిలో 90,191 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. 2023 నాటికి 1.26 లక్షల ఎకరాలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లాలో వరిలో నవార, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్, కుజి పటాలియా, కృష్ణ వ్రీహి, కాలాపట్టు, మాపులేసాంబ, బహురూపి, రా ధాజిగేల్, రత్నచోడి, రక్తసాలి, ఇంద్రాణి, సుగంధి, సిద్ది సన్న, పరిమళ సన్న రకాలతోపాటు వేరుశనగ, చీనీ, అరటి, కూరగాయల పంటలు సైతం పండిస్తున్నారు.పులివెందులలో ప్రకృతి వ్యవసాయం యూనివర్సిటీ ఏర్పాటుతో భవిష్యత్తులో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించనుంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం సాగును విస్తృతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పర్యావరణం మెరుగుపడుతుంది జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 2018 వరకు దా దాపు 15 వేల ఎకరాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతానికి 90 వేల ఎకరాలకు చేరింది. వచ్చే ఏడాది నాటికి 1.26 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ప్రకృతి వ్యవసాయంతో భూములు దెబ్బతినకుండా ఉంటాయి. పర్యావరణం మెరుగు ప డుతుంది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. పులివెందులలో యూనివర్శిటీ ఏర్పాటు తో ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించనుంది. – రామకృష్ణరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, కడప -
సేంద్రియ సైనికులు... అందరికీ ఆదర్శంగా
డుంబ్రిగుడ: భిన్న ఆలోచనలకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవ్వడంతో ఇద్దరు రైతు మిత్రులు లాభలబాటలో పయనిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీ దేముడువలస గ్రామానికి చెందిన త్రినాథ్, పాంగి తిరుపతిలు బావబావమరుదులు. వీరిద్దరూ ఆరెకరాల విస్తీర్ణంలో బీన్స్, వంకాయ, బీరకాయ, మిరప , కాకరకాయ, క్యాబేజి, మొక్కజొన్న సాగు చేపట్టారు. పూర్తిగా సేంద్రియ ఎరువులు వారే స్వయంగా తయారు చేయడంతోపాటు తోటి రైతులకూ అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే స్థానిక వ్యవసాయాధికారుల సహకారంతో ఐదేళ్లుగా అనేక రకలైన కూరగాయలను సాగు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే అంతర పంటలు సైతం సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సొవ్వ టు వైజాగ్ ఈ పంటలను విశాఖలోని వివిధ రైతు బజార్లకు, అరకు వారపు సంతలకు ప్రతి వారం 30 టన్నుల నుంచి 50 టన్నుల వరకు విక్రయాలు చేస్తుంటారు. కాలంతో సంబంధం లేకుండా నిత్యం కూరగాయలు పండిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. పశువుల పేడ, మూత్రం వినియోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. అలాగే వేప కషాయం తయారు చేసి పంటలకు పిచికారి చేస్తున్నారు. (చదవండి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) -
ప్రకృతి సేద్యం విస్తరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
సాక్షి, కడప: రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు వద్దు– ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతిసాగులో సలహాలు, సూచనలు అందిస్తూ అధిక పెట్టుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మొదట్లో వరి సాగుకే పరిమితం కాగా ప్రస్తుతం ఉద్యాన పంటలకూ ఈ విధానంలో సాగు విస్తరించింది. గతం కంటే మెరుగ్గా.. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు గతం కంటే మిన్నగా ప్రకృతి సేద్యాన్ని ప్రజలకు, రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సదస్సులో ప్రత్యేకించి ప్రసంగించడం తెలిసిందే. అంతేకాదు వైఎస్సార్‌జిల్లా నుంచి ముగ్గురు రైతులు నీతి ఆయోగ్‌లో అవార్డు అందుకున్నారు. ఇందులో మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన రైతు శివరామయ్య, పెండ్లిమర్రికి చెందిన గంగిరెడ్డి, కలసపాడు మండలం బ్రహ్మణపల్లెకు చెందిన కోటేశ్వరరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఖరీఫ్ సాగు లక్ష్యమిలా.. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 68700 మంది రైతులకు సంబంధించి 78,310 ఎకరాల్లో వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలను సాగు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 23700 మంది రైతులకు సంబంధించి 27059 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు 51,251 ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో 28,650 మంది రైతులకు సంబంధించి 30920 ఎకరాల్లో వరి, 5720 మంది రైతులకు సంబంధించి 6920 ఎకరాల్లో వేరుశనగ పంటను, 4800 మంది రైతులకు సంబంధించి 6570 ఎకరాల్లో శనగ, మినుములు, 5830 మంది రైతులకు సంబంధించి 6850 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసి వారికి కావా ల్సిన సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు. కిచెన్ గార్డెన్స్‌పై ప్రత్యేక దృష్టి.. జిల్లా అధికారులు కేవలం రైతులతో ప్రకృతి సాగు చేయించి సరిపెట్టకుండా మహిళలను కూడా ప్రకృతి సాగు వాటి ఉపయోగాల వైపు మరల్చి మహిళా సంఘాల ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ప్రతి మహిళా ఆకుకూరలు, కూరగాయలను ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా పండించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో కలుపుకుని 75 వేల దాకా కిచెన్గార్డెన్లను ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడంవల్ల మనకు కావాల్సిన మిటమిన్స్, మినరల్స్ అధికంగా లభించే అవకాశం ఉంది. లక్ష్యం అధిగమించేందుకు కృషి ఖరీఫ్ సీజన్లో 73310 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశాము. ఆ దిశగా సిబ్బందిని అప్రమత్తం చేశాము. ప్రకృతి వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా రైతులను అప్రమత్తం చేయనున్నాం. వీటి స్థానంలో ఘన జీవామృతం, జీవామృతాలను వాడే విధంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చి లక్ష్య సాధనకు కృషి చేస్తాం. – రామకృష్ణమరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా.