Restoration of ponds
-
‘మిషన్ కాకతీయ’...నిధులు లేవాయె..!
సాక్షి, హైదరాబాద్ : చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’పనులు చివరి దశలో చతి కిలపడ్డాయి. ఏడాదిగా నిధుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో మూడు, నాలుగో విడతలో చేపట్టిన 5,553 చెరువుల పనుల్లో స్తబ్దత ఏర్పడింది. నిధులు విడుదల చేస్తే తప్ప ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడివక్కడే... రాష్ట్రంలో 4 విడతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 21,436 పనులు పూర్తయ్యాయి. మొదటి, రెండో విడతలో చేసినంత వేగంగా మూడు, నాలుగో దశల్లో ముం దుకు కదలడం లేదు. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 3,918 చెరువులే పూర్తయ్యాయి. మరో 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని గతేడాది జూన్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో ఇప్పటివరకు 1,742 పనులే పూర్తయ్యాయి. మరో 2,472 పనులు పూర్తి కాలేదు. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ‘మిషన్ కాకతీయ’కు అనుకున్న మేర నిధుల ఖర్చు జరుగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖను సంప్రదించినప్పుడల్లా అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. పెండింగులో రూ.450 కోట్లు... ప్రస్తుతం రూ.450 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పనులు చేయాల్సిన సీజన్ అంతా వృథాగా పోతోంది. జూన్ నుంచి వర్షాలు మొదలైతే పనులు కొనసాగించే వీలుం డదు. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణను నీటిపారుదల శాఖ ఎలా ముగిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ‘మిషన్ కాకతీయ’ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై చూపనుంది. రూ.4 కోట్లకు పైగా అంచనాలతో చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవనున్నారు. వీటి బిల్లుల చెల్లింపులో జాప్యం భయంతో నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? అన్నది ప్రశ్నగా ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
5,703 చెరువుల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయ కింద 5,703 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులకు గాను ఈ నెలాఖరులోగా పరిపాలనాపరమైన అనుమతి పొందాలని.. జనవరి నుంచి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్లో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సంబంధిత సాగునీటి వనరుల ఆయకట్టు స్థిరీకరణ, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలని హరీశ్ ఆదేశించారు. పాలనా అనుమతులు లభించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ నాలుగోదశ టైం లైన్లను విధిగా పాటించాలని స్పష్టంచేశారు. ఈ నెల 15కల్లా పాలనాపరమైన అనుమతి కోసం అంచనాలు పంపి.. నెలాఖరు వరకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ రెండు, మూడు దశలలో ప్రారంభించి పూర్తికాకుండా మిగిలిపోయిన చెరువులను కూడా పూర్తిచేసి తుది బిల్లులు చెల్లించాలని ఇంజనీర్లకు సూచించారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని హెచ్చరించారు. పునరుద్ధరించే చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలన్నారు. పూడికతీత మట్టిపై అవగాహన కల్పించాలి గతంలో రాష్ట్రంలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందని హరీశ్ అన్నారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామపంచాయతీల ఎదుట పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలని కోరారు. వ్యవసాయ, ఇరిగేషన్శాఖల కింది స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ కాకతీయ నాలుగోదశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను సహకారం తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ కింద 147 చెరువుల పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం రూ.162 కోట్లు మంజూరు చేసిందని.. ఈ పనులను సైతం వెంటనే ప్రారంభించాలని హరీశ్ ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా పంచాయతీరాజ్ చట్టం-మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఉం డాలని, ఆ దిశగా పకడ్బందీగా చట్టానికి రూపకల్పన జరపాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు తుది దశకు చేరిన సందర్భంగా మంగళ వారం జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చట్టంలో పొందుపర్చేందుకు సిద్ధం చేసిన పలు అంశాలపై కూలంకశంగా చర్చించి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా, తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేలా చట్టం ఉండాలన్నారు. -
మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్బండ్లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు. ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది. -
ఇరిగేషన్‌కు సాంకేతిక సహకారం
* బిట్స్, ఐఐటీ, నాబార్డ్‌లతో నీటిపారుదల శాఖ ఎంఓయూ * మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పనుల్లో పురోగతికి తోడ్పాటు * మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సంతకాలు సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇరిగేషన్ శాఖకు సాంకేతిక సహకారం అందించేందుకు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్), ఐఐటీ హైదరాబాద్, నాబార్డ్‌లు ముందుకొచ్చాయి. ఈ 3 సంస్థలు గురువారం నీటిపారుదల శాఖతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సచివాలయంలో సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి సమక్షంలో సాంకేతిక సహకారం విషయమై ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ దేశాయి, బిట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్‌రావు, నాబార్డ్ డెరైక్టర్ సీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇరిగేషన్ శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందని, ఐఐటీ, బిట్స్, నాబార్డ్ సేవలను వినియోగించుకొని దేశానికి మరింత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో ముందుకు పోతున్నామని, ఈ క్రమంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ అవసరం ఉంటుందని, దీనిద్వారా లోటుపాట్లుంటే తెలిసిపోతుందన్నారు. నాబార్డ్‌కు అనుసంధానంగా ఉన్న నాప్కాస్ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాలను ఎంచుకొని మిషన్ కాకతీయ ఫలితాలను విశ్లేషిస్తుందని, ఐఐటీ, బిట్స్‌లు పైలట్ ప్రాజెక్టులను ఎంచుకొని ఇరిగేషన్ శాఖ లో జరుగుతున్న పనులపై వారి విద్యార్థులు, అధ్యాపకులతో అధ్యయనం చేయించాలని సూచించారు. శాఖ పరిధిలోని ఇంజనీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ప్రాజెక్టుల సమగ్ర వివరాలతో డేటాబేస్‌ను రూపొం దించడానికి సంస్థలు కృషి చేయాలన్నారు. ఆ సంస్థల డెరైక్టర్లు దేశాయి, వీఎస్‌రావు, సత్యనారాయణలు మాట్లాడుతూ.. సాగునీటిరంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ముఖ్యకార్యదర్శి జోషి మాట్లాడుతూ, మూడు సంస్థలతో ఒక్కరోజే ఎంఓయూ కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని అన్నారు. -
మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం అని మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ కితాబిచ్చారు. కాకతీయుల నుంచి అందిన వారసత్వ సంసృ్కతిని పునరుద్ధరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వాలే ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపిం చలేవని, పౌర సమాజం సైతం అండగా నిలిచినప్పుడే ఇది విజయవంతం అవుతుందని అన్నారు. చెరువుల పూడికను స్వచ్ఛందంగా తరలించేలా ప్రజలను ప్రోత్సహించడం, వారిని భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావుతో పాటు ఇతర అధికారులను నీటిపారుదల శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెరువుల పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రితో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చెరువులు తెలంగాణ సంసృ్కతికి ప్రతీకలు. మధ్యలో చెరువుల సంసృ్కతికి అవాంతరాలు ఎదురైనా వాటిని ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నారు. వారసత్వ చెరువులను గుర్తించడం ఒక ఎత్తై, పంటల ఉత్పాదకత పెరిగేలా పూడిక మట్టిని తరలించేందుకు సమాజాన్ని ప్రోత్సహించడం నా ఆలోచనలకు దగ్గరగా ఉంది’ అని అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర కేటాయించడం గొప్పవిషయమని కొనియాడారు. రాష్ట్రంలో వర్షపాతానికి అనుగుణంగా పంటల విధానాన్ని అనుసరించాలని, దీనికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. చెరువుల పరిరక్షణకు చట్టం: హరీశ్‌రావు అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం చట్టాన్ని తీసుకురాబోతోంది. పట్టణీకరణ నేపథ్యంలో చెరువులు మాయం అవుతున్నాయి. ఈ దృష్ట్యా అటవీ చట్టం మాదిరే చెరువుల కబ్జాలకు పాల్పడితే జైలుకు పంపే రీతిలో చట్టాన్ని తీసుకురానున్నాం’ అని తెలిపారు. మిషన్ కాకతీయ లక్ష్యాలను మంత్రి, రాజేందర్‌సింగ్‌కు వివరించారు. కాగా, రాజేందర్‌సింగ్ నేతృత్వంలోని బృందం గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించి.. అక్కడ మిషన్ కాకతీయ పనులను పరిశీలిస్తుంది. -
చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు సస్యశ్యామలం
మంత్రి మహేందర్‌రెడ్డి షాబాద్: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని హైతాబాద్‌లో, లక్ష్మరావుగూడ సంగయ్య కుంటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం కుంటుపడుతున్న ప్రస్తుత తరుణంలో చెరువులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తే వ్యవసాయ భూములు సారవంతమవుతాయని, భూగర్భజలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు జడల లక్ష్మి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ.. తెలంగాణ పునర్ జ్ఞాపకం
సందర్భం చెరువులు పునరుద్ధరణ అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. ఇది భావుకత కాదు. వాస్తవికతగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం. గత నెల 2న సాక్షి పత్రిక సంపాదకీయ పేజీలో వచ్చిన బిక్షం గుజ్జాగారి వ్యాసం ‘మిష న్ కాకతీయ: భావుకత-వాస్త వికత’ వ్యాసం కాస్త ఆలస్యం గా నా దృష్టికి వచ్చింది. మిష న్ కాకతీయ కార్యక్రమం అమ లులో మొదటినుంచి భాగస్వా మిగా ఉన్న నాకు ఆయన పాఠ కుల్లో సృష్టించిన గందరగోళాన్ని తొలగించాల్సిన అవస రం ఉందనీ, ఈ విశిష్ట పథకంపై ఆయన చేసిన అలవోక వ్యాఖ్యలను, సూత్రీకరణలను పూర్వపక్షం చేయవలసిన అవసరం ఉందనిపించింది. అందుకే ఈ ప్రతిస్పందన. భిక్షం గారు ప్రస్తావించిన అంశాలను చర్చించేముం దు మిషన్ కాకతీయ భావన ఎలా రూపొందిందో, దీనికి ఎలాంటి మేధోమథనం జరిగిందో తెలియాలి. మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) అనేది గాల్లోంచి ఠక్కున ఊడిపడిన భావన కాదు. అది తెలంగాణ ఉద్య మ ఆకాంక్ష. తెలంగాణ గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాం స్కృతిక వికాసానికి అనాది ఆధారాలుగా ఉన్న గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ గత పాలకుల విధానపరమైన నిర్ల క్ష్యం కారణంగా విధ్వంసం అయిపోయిందన్న విషయం బిక్షంగారికి తెలియంది కాదు. తెలంగాణ భౌగోళిక పరి స్థితులకు అనుగుణంగానే కాకతీయులు, వారి తర్వాతి పాలకులైన కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానా ధీశులు తెలంగాణలో వేలాది చెరువులను నిర్మించి వ్యవ సాయ విస్తరణకు తోడ్పాటును అందించారు. అవి తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి కూడా దోహదం చేసినాయని చెప్పాలి. భూస్వామ్య అణిచివేత కొనసాగినప్పటికీ, వేలాది చెరువుల నిర్మా ణం వల్ల తెలంగాణలో కరువుకాటకాలు అరుదుగా వచ్చే వి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 33,000 లకు పైగా చెరు వులు, కుంటల కింద 12 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ చెరువులేని గ్రామం లేకపోగా, ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. 1969 తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలిస్తే, ఆనాడు ఉద్యోగాలు, నిధుల దోపిడీనే ప్రధానాంశంగా ఉండేది. నీరు ఇంకా ఒక సమస్యగా ముందుకురాని పరిస్థితి, ఎం దుకంటే తెలంగాణలో చెరువులు ఇంకా ఆనాటికి బతికే ఉన్నాయి. ఎనభైల నాటికి చెరువుల వ్యవస్థ విధ్వంసం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. తొంభైలనాటికి అదొక సంక్షోభంగా మారింది. అటు చెరువుల విధ్వంసం, ఇటు కొత్త ప్రాజెక్టుల కింద పారకం అభివృద్ధి కాకపోవడంతో తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం తారాస్థాయికి చేరు కున్నది. దీంతో ఒకనాటి స్వయంపోషక తెలంగాణ గ్రా మాలు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారాయి. అందుకే తొంభైలలో మళ్లీ పురుడుపోసుకున్న ఉద్యమా నికి నీరే ప్రధాన ప్రాతిపదిక అయింది. తెలంగాణ భౌగో ళిక అనివార్యత గనుకనే టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణా ళికలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలుప రుస్తానని వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే చెరువుల పునరుద్ధరణకు పూనుకుంది. ముఖ్యమంత్రి కేసీ ఆర్, సాగునీటి శాఖ పరిధిలో అనేక చర్చలు, సమీ క్షలు తర్వాతే మిషన్ కాకతీయ కార్యక్రమం సిద్ధమైంది. మిషన్ కాకతీయ కార్యక్రమం రూపొందిన ఈ పరి ణామక్రమంలో బిక్షం గారన్నట్లుగా పిసరంత భావుకత లేదు. ఇది ఉద్యమ ఆకాంక్షను వాస్తవికతగా మార్చడా నికి అకుంఠిత దీక్షతో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ. గతంలో అమలైన పథకాలను సమీక్షించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన ఆర్ఆర్ పనులను, జైకా, ప్రపంచ బ్యాంకు పనులను నిత్యం సమీక్షిస్తూ గత లోపాలు పునరావృతంకాకుండా ఇంజనీ ర్లకు సూచనలు జారీచేస్తున్నాము. ‘నాటి చెరువునే కోరుకుంటున్నామంటే పెను మార్పులకు గురైన సమాజంలో మారిన ఆర్థిక వాస్తవిక తలో ఒక నిర్దిష్ట సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించ డానికి ప్రయత్నిస్తున్నామన్నమాట’ అని బిక్షంగారంటు న్నారు. నాటికీ, నేటికీ భూసంబంధాల్లో మార్పు వచ్చి నా, చెరువు యాజమాన్య పద్ధతులను ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చుకునే అవసరాన్ని ప్రభుత్వం గుర్తిం చింది. చెరువు కాకుండా ఎలాంటి సాగునీటి వ్యవస్థను తెలంగాణలో పునరుద్ధరించాలో వ్యాసకర్త సెలవిస్తే బాగుండేది. ‘...చెరువులు పూడికతీత, తవ్వడం, కట్టలను, గట్ల ను బలోపేతం చేయడం, మూలజలాన్ని శుద్ధి చేయడం ద్వారా ఏదో జరిగిపోతుందని అనుకుంటే.. అమాయక త్వమే’ అని అంటున్నారు బిక్షంగారు. అంతర్జాతీయ జలనిర్వహణ నిపుణుడైన ఆయన ఇంత అమాయక సూత్రీకరణ చేయడమే ఆశ్చర్యకరం. చెరువున్న గ్రామా ల్లో, లేని గ్రామాల్లో తాగునీటి సమస్యపై తులనాత్మక అధ్యయన రికార్డులు భూగర్భ జలశాఖ వద్ద ఉన్నాయి. వాటిని ఎవరైనా పరిశీలించి నిర్ధారించుకోవచ్చు. దీనిపై బిక్షం గారి వ్యాఖ్య అభ్యంతరం, అశాస్త్రీయం కూడా. చివరగా.. ‘ఈ ప్రాజెక్టుల లక్ష్యసాధనలో ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రజలు సందేహిస్తున్నారు...’ అన్నారు. ప్రజలకేమో గానీ బిక్షంగారికే ఈ సందేహం ఉన్నట్లుంది. మొన్ననే సౌదీ నుంచి మోహన్ బానోత్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. సౌదీలో ఆయన డ్రైవర్‌గా వెయ్యి రియాళ్లకు (రూ.12,000లు) పనిచేస్తున్నాడు. తనది కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, నూకలమర్రి గ్రామం. ‘లొంక చెరువులకు నీల్లు వస్తే మా ఊల్లె యవుసం లేస్తది. మేమందరం మా ఊల్లెకు వాపసు వస్తం. ఊరికి దూరంగా, భార్యాపిల్లలకు దూరంగా బతుకుడు కష్టం గా ఉన్నది సారు. చెరువుల నీల్లుంటే మా ఊల్లెనే యవు సం చేసుక బతుకుతం సారు. మా ఊరి చెరువును బాగు చెయున్రి’ అని చెప్పినాడు. నా కండ్లు చెమ్మగిల్లినాయి. ఇలాంటి లక్షలాది వలస జీవులు గ్రామాలకు తిరిగివస్తే ఈ కార్యక్రమం జయప్రదం అయినట్లే. మిషన్ కాక తీయ మోహన్ బానోత్ లాంటి తెలంగాణ బిడ్డల కోస మే బిక్షంగారు. ఇది భావుకత కాదు. వాస్తవికతంగా మారబోతున్న తెలంగాణ ప్రజల పునర్ జ్ఞాపకం. (వ్యాసకర్త ఒ.ఎస్.డి, తెలంగాణ సాగునీటి శాఖ మొబైల్: 9491060585) శ్రీధర్‌రావు దేశ్‌పాండే -
నీటి సంఘాల ఎన్నికల ఊసేది?
రెండేళ్ల క్రితం సిద్ధమై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఏడేళ్లుగా ఎన్నికలకు నోచుకోని నీటి సంఘాలు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణ, అభివృద్ధికి అవసరమైన నీటి సంఘాల పదవీకాలం ముగిసి ఏడేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. 2008 జనవరిలో జిల్లాలో దాదాపు 2.5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల్లో టీసీలకు ఎన్నికలు నిర్వహించారు. యలమంచిలి: నీటి సంఘాల ఎన్నికల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2013 జనవరిలో సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించిన అప్పటి ప్రభుత్వం అదే స్ఫూర్తితో నీటి సంఘాలకు సైతం ఎన్నికలకు సిద్ధపడింది. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో అప్పట్లో వీటిజోలికి పోలేదు. సొసైటీ ఎన్నికల అనంతరం వెం టనే జిల్లా వ్యాప్తంగా ఉన్న టీసీలకు సంబంధించి రెవెన్యూ అధికారులకు మార్పులు, చేర్పులు, ఖాళీగా ఉన్న టీసీల వివరాలతో పాటు ఓటరు జాబితా త్వరగా అందించాలని ఆదేశించడంతో అధికారులు వివరాలు అందించారు. నోటిఫికేషన్ వెలువడనుందని అధికారులతో ఆఘమేఘాల మీద రిపోర్టులు తయారు చేయించారు. ఒత్తిడికి లోనై పనులు పూర్తి చేసినా ఎన్నికల ఊసెత్త లేదు. దీంతో రిపోర్టులు మళ్లీ తయారు చేయించాల్సిందేనని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. 2008 జనవరిలో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి నేటికీ వాటి ఊసేలేదు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆదేశాలతో ఆ లోపు నిర్వహించేందుకు సిద్ధమైనా చివరకు వెనక్కి తగ్గారు. నీటి సంఘానికి ఆరుగురు చొప్పున టీసీలు కేటాయించి సభ్యులను ఎన్నుకుంటారు. చెరువు, ప్రాజెక్టుల పరిధిలోని సంబంధిత ఆయకట్టుదారులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. వీరు సంఘ సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులతో చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. కాగా సభ్యుల పదవీకాలం ఎమ్మెల్సీ మాదిరి ఆరుగురిలో ఇద్దరు రెండేళ్లు, మరో ఇద్దరు నాలుగేళ్లు, మిగతా ఇద్దరు ఆరేళ్లు ఉంటారు. ప్రతి రెండేళ్లకు పదవీ కాలం ముగిసిన సభ్యుల స్థానంలో ఎన్నికలు నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. 2008 నుంచి ఎన్నికల జోలికి వెళ్లకపోవడంతో కాలపరిమితి ముగిసి సంఘాలు లేకుండా పోయాయి. జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి దాదాపు 2.5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో మేజర్, మీడియం, మైనర్ నీటి సంఘాల్లో టీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజాగా నోటిఫికేషన్ ఇస్తే మృతుల తొలగింపు, మార్పు చేర్పులు పోను ఆయకట్టు, సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువుల కింది ఆయకట్టు వివరాలు నమోదు కాలేదు. కొన్ని ప్రాజెక్టులకు కాలువలు నిర్మించలేదు. నిర్మించిన చోట నిర్వహణ లేదు. నీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తే చాలా వరకు కాలువలు ఉపయోగంలోకి రావడంతో పాటు నిర్వహణకు ఎంతో కొంత నిధులు సమకూరే అవకాశం ఉన్నందున నీటి సంఘాల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’
* 89 చెరువులకు రూ.24.19 కోట్లు విడుదల * ‘పునరుద్ధరణ’కు మూడుసార్లు నోటిఫికేషన్ * అయినా ముందుకు రాని కాంట్రాక్టర్లు * వెంటాడుతున్న పర్సెంటేజీల భయం * ఆయా పనులపై ప్రజాప్రతినిధుల కన్ను సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’కు బాలారిష్టాలు తప్పడం లేదు. మంత్రి మాటలు, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ పనులపై కొందరు ప్రజాప్రతినిధులు కన్నేయడంతో, కాంట్రాక్టర్లను ‘పర్సెంటేజీ’లు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధులు విడుదలైనాటెండర్లు జరగడం లేదు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా చేపట్టే 701 పనుల అంచనాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 356 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను స్వీకరించిన ప్రభుత్వం 89 చెరువుల పనులను తక్షణమే మొదలు పెట్టాలని రూ.24.19 కోట్లు విడుదల చేసింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల పరిధిలోని ఈ పనులను చేపట్టేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఇప్పటికీ మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ-టెండర్ల ద్వారా పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చెరువు పనులు లాభదాయకంగా ఉన్నా ఎందుకు ముందుకు రావడం లేదని ఆరా తీస్తే, అధికారులు సైతం పెదవి విప్పడం లేదు. కొం దరు ప్రజాప్రతినిధులు పనులు మొదలెట్టే ముందు ‘మమ్మ ల్ని కలవాల్సిందే’ అంటూ ఆర్డర్లు వేయడంతోనే చెరువుల పనులపై మొగ్గు చూపడం లేదంటూ కాంట్రాక్టర్లు చర్చించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. ఇదీ పరిస్థితి మొదటి విడతగా 701 చెరువుల పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు తయారు చేయాలని డిసెంబర్ ఐదున మంత్రి హరీష్‌రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. అంతకు ముందు నుంచే నీటి పారుదల శాఖ 456 చెరువులు, కుంటలను సర్వే చేసి 356 చెరువులు, కుంటలపై రూ.131.19 కోట్ల అంచనా వ్యయం (ఎస్టిమేట్ కాస్ట్)కు సం బంధించిన రికార్డులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వివిధ కారణాల చేత చెరువుల పనుల ఎస్టిమేట్లు ఆశించిన రీతిలో ముందుకు సాగకపోగా, 89 చెరువుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.24.19 కోట్ల పనుల ఖరారుకు కొం దరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లకు మోకాలడ్డుతుండటం తో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న చర్చ ఉంది. రూ. 24.19 కోట్ల పనులకు కోసం మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ-టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదంటే, చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రజాప్రతి నిధుల పాత్ర ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే నిధులు విడుదలైన చెరువుల పునరు ద్ధర ణ ఎలా పూర్తవుతుంది? 345 చెరువుల ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎస్టిమేట్లు సమర్పించి సిద్ధంగా ఉన్న మిగిలిన 256 చెరువులకు నిధులు ఎప్పుడిస్తారు? టెండర్లు ఎలా చేపడుతారు? మార్చిలోగా మొదటి విడత చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యం? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
చెరువు బాగు.. ఎవుసం సాగు
* చెరువుల పునరుద్ధరణతోనే రైతుకు బంగారు భవిత * ‘మిషన్ కాకతీయ’ అమలుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు * నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్దుర్తి/నర్సాపూర్: ‘మిషన్ కాకతీయ’ను ఓ మహాయజ్ఞంలా చేపట్టి.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణతోనే అన్నదాతల బతుకులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. మండలంలోని మంగళపర్తికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, .. మిషన్ కాకతీయలో గుర్తించిన చెరువుల పునరుద్ధరణ పనులు ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చెరువుల పునరుద్ధరణ కోసం టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిషన్ కాకతీయను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని సొంత ఖర్చులతో పొలాల్లోకి తరలించుకోవాలన్నారు. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గడంతోపాటు పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే చెరువుల పునరుద్ధరణ కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులను, ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మురళీయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణాగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి హరీష్‌రావు మంగళపర్తికి చెందిన సంఘ సేవకుడు మణికొండ రాఘవేందర్రావును పరామర్శించారు. ఇటీవలే రాఘవేందర్రావు తల్లి జానకీదేవి మృతి చెం దడంతో హరీష్‌రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సివిల్స్‌లో రాణించాలి... శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీవీఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటైన తెలంగాణ సంప్రదాయ ఉత్సవాలకు హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, .. ఇంజనీరింగ్ విద్యార్థులు సివిల్స్‌లోనూ రాణించాలని సూచించారు. సౌత్ ఇండియాలోని రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో చాలా తక్కువ మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఉంటారని, మన రాష్ర్టం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌లో రాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ పట్ల దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు విద్యార్థులకు సూచించారు. బీటెక్ పూర్తవగానే అందరూ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని, అలా కాకుండా సివిల్స్ పట్ల దృష్టి పెట్టాలని, ఐఏఎస్, ఏపీఎస్లో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు విద్యార్థులు హరీష్‌రావుకు ఎడ్లబండిపై ఘన స్వాగతం పలికారు. -
‘ఇరిగేషన్’లోనే ‘మిషన్ కాకతీయ’ పైలాన్
{Xన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ 50 అడుగుల ఎత్తుతో నిర్మాణం కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో నిర్మించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పచ్చజెండా ఊపారు.. 50 అడుగుల ఎత్తుతో కాకతీయుల సంస్కృతిని ప్రతిబింబించేలా.. పైలాన్ పై భాగంలో రెండు చేతులు అభ్యర్థిస్తున్నట్లుగా పై నుంచి నీటి చుక్క పడే విధంగా నిర్మించాలని ఆదేశించారు. - వరంగల్ రూరల్ - వివరాలు 2లో.. ‘ఇరిగేషన్’లోనే ‘మిషన్ కాకతీయ’ పైలాన్ వరంగల్ రూరల్ : ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పైలాన్ నిర్మించేందుకు ఆదివారం పార్లమెంటు కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ కిషన్, ఇరిగేషన్ సీఈ విజయప్రకాశ్, ఎస్ఈ పద్మారావు, ఆర్అండ్బీ అధికారుల బృందం నగరంలోని పలు స్థలాలను పరిశీలించారు. పబ్లిక్‌గార్డెన్, ఇరిగేషన్ కార్యాలయం, వడ్డేపల్లి చెరువు సమీపంలోని రహదారిపై నిర్మించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మూడు ప్రాంతాల వివరాలు సోమవారం వినయ్‌భాస్కర్, సీఈ విజయప్రకాశ్ ముఖ్యంత్రి కె.చంద్రశేఖరరావు, నీ టి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు వివరించారు. దీం తో సీఎం నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలోనే మిషన్ కాకతీయ పైలాన్ నిర్మించాలని సూచించారు. 8వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పూజ చేసి పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. 50 అడుగుల ఎత్తులో ‘పైలాన్’ ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను 50 అడుగుల ఎత్తుతో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాకతీయుల సంస్కృతిని ప్రతిబించేలా ఉండాలని సూచించారు. పైలాన్ పైభాగంలో రెండు చేతులు అభ్యర్థించినట్లు ఉండగా పై నుంచి నీటి చుక్క పడే విధంగా అత్యద్భుతంగా నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పైలాన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఆవిష్కరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆమె పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు. -
వెనకబడుతున్న ‘మిషన్ కాకతీయ’
సాక్షి, సంగారెడ్డి: ‘చెరువుల పునరుద్ధరణ ప్రతిపాదనల రూపకల్పన సంతృప్తికరంగా లేదు.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇలా అయితే లక్ష్యం మేరకు చెరువుల పునరుద్ధరణ ఎలా చేస్తాం..?’ గతసోమవారం జరిగిన ‘మిషన్‌కాకతీయ’ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాటలివి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ లక్ష్యానికి గండికొట్టేలా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనల రూపకల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు ఇప్పటికి సుమారు 25 శాతం చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేశారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మిషన్‌కాకతీయ ప్రతిపాదనల రూపకల్పనలో మెతుకుసీమ వెనకబడుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు సర్వే సామగ్రి ఇంకా అందలేదు. పలుచోట్ల సిబ్బంది సెలవుల్లో ఉండటం, మరికొంత మంది రెండు, మూడు చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేయటంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వే సామగ్రి ఏఈలకు చేరవేయకపోవడంపై మండిపడ్డారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించారు. దీంతో జనవరి మొదటి వారం వరకు ప్రతిపాదనలు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. అయితే అది ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే. చీఫ్ ఇంజనీర్‌కు చేరింది 224 ప్రతిపాదనలే... మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 1,958 చెరువులను ఎంపిక చేశారు. అధికారుల సమాచారం మేరకు వీటిలో ఇప్పటి వరకు 224 ప్రతిపాదనలు పూర్తయి చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి చేరాయి. మరో 82 ప్రపోజల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇంకా 1,652 చెరువుల ప్రతిపాదనలు పూర్తి చేయా ల్సి ఉంది. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 464 చెరువులను ఎంపిక చేయగా 56 చెరువుల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఇంకా 408 ప్రతిపాదనలు పూర్తి చేయాల్సి ఉంది. సిద్దిపేట డివిజన్లో 1,017 చెరువులు ఎంపిక చేయగా 160 ప్రతిపాదనలు పూర్తయ్యాయి. మరో 857 ప్రతిపాదనలు పూర్తి చేయాలి. మెదక్ డివిజన్లో 477 చెరువులకు 90 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కాగా 387 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కావాల్సిఉంది. సర్వే పనులు మందకొడిగా సాగుతుండటంతో ప్రతిపాదనల రూపకల్పనలో సైతం జాప్యం జరుగుతోంది. సర్వే పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మండలానికి అవసరమైన సర్వే సామగ్రి అందజేస్తోంది. సమగ్ర సర్వే ప్రతిపాదనల రూపకల్పనలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇకపై ప్రత్యేక అధికారి పర్యవేక్షణ... మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు చీఫ్ ఇంజినీర్ కృష్ణారావును జిల్లా ఇన్చార్జ్గా నియమించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కృష్ణారావు జిల్లా నీటిపారుదల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రతిపాదనల రూపకల్పనను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనైనా మిషన్‌కాకతీయ పనులు వేగవంతమవుతాయో..? లేదో..? వేచి చూడాలి. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదాం
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో చూపినా తెగువను రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చూపాలని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ యువతకు పిలుపునిచ్చారు. రెవెన్యూ గార్డెన్స్‌లో శనివారం టీఆర్ఎస్వీ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ నదులు, నీళ్లు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుదామని అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న ఘనత, నామినేటెడ్ పోస్టులిచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆర్నెల్లలోనే రైతులకు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి అనేక పథకాలు ప్రారంభించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు జనవరి ఒకటి నుంచి సన్నబియ్యం అందిస్తామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్ధం వేణు మాట్లాడుతూ విద్యార్థులకు పార్టీలో పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెమసారం తిరుపతి, బీఎస్ఎఫ్ నాయకులు రంజిత్, దుబ్బయ్య, దీకొండ నాగరాజు మాట్లాడారు. పొన్నం అనిల్‌గౌడ్, కాటం సురేశ్ కుమార్, సుదగోని శ్రీనాథ్ గౌడ్, కొంకటి శేకర్, రాజాంజనేయులు, రామడుగు రాజేశ్, ప్యాట సురేశ్, శేకర్బాబు, గోగుల గణేశ్, పటేల్ శ్రావణ్‌రెడ్డి, రవివర్మ, రవితేజ, ఫహద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ.. తెలంగాణ పాటల హోరు పిడమర్తి రవి, ఎంపీ బాల్క సుమన్ జిల్లాకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ కార్యకర్తలు వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. గాయకుడు సుధీర్ ఆ లపించిన పాటలు ఉత్తేజం నింపాయి. రవి, బాల్క సు మన్ స్వయంగా వాహనాలు నడుపుకుంటూ వచ్చారు. పలు సంఘాల సన్మానం .. పిడమర్తి రవి, బాల్క సుమన్‌ను వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సన్మానించాయి. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు కంసాల శ్రీనివాస్, ముల్కల గంగారాం, కొంకటి శ్రీనివాస్ గజమాలతో సన్మానించారు. విద్యార్థి జేఏసీ పక్షాన సిద్దం వేణు, రవీందర్‌రెడ్డి, తిరుపతి, పొన్నం అనిల్, సురే శ్తో పోటాపోటీగా సన్మానించారు. -
‘మిషన్’పై అశ్రద్ధ
⇒ నత్తనడకన సాగుతున్న మిషన్ కాకతీయ పనులు ⇒ 555 చెరువులకు గాను 340 చెరువుల్లో సర్వే పనులు కొలిక్కి ⇒ అందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారు ⇒ జూన్ నాటికి తొలివిడత పనులు పూర్తయ్యేది అనుమానమే సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. వచ్చే వర్షాకాలం నాటికి చెరువులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని సర్కారు భావించినప్పటికీ.. జిల్లాలో మాత్రం అధికారుల ఉదాసీనత వల్ల సర్వే పనులు ముందుకుసాగడం లేదు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,747 చెరువులున్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు పొలాలకు నీరు అందించి సాగులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలివిడత 20శాతం చెరువులను ఎంపిక చేసుకుని వాటి మరమ్మతులు, కొత్తగా పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా నీటిపారుదల విభాగాలను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో 555 చెరువులను గుర్తించిన అధికారులు.. వాటి సర్వే పనుల్లో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలోగా నిర్దేశించిన చెరువులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మూడోవంతు చెరువులకే.. జిల్లాలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా తొలివిడత 555 చెరువులను గుర్తించారు. ఈ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. ఇందుకుగాను ముందుగా ఆయా చెరువులను సర్వే చేసి అంచనాలను సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా సర్వే పనులను ఉపక్రమించిన అధికారులు.. ఇప్పటివరకు కేవలం 340 చెరువుల సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఇందులో 187 చెరువులకు మాత్రమే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల చెరువులు 77 ఉండగా, వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు 110 ఉన్నాయి. రూ.113 కోట్లకు ఓకే.. సర్వే పనులు పూర్తిచేసి ప్రణాళికలను ప్రభుత్వానికి పంపితే అందుకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం ఇస్తుంది. ఈక్రమంలో జిల్లాలో 555 చెరువులకుగాను ఇప్పటివరకు 187 చెరువుల ప్రణాళికలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఆయా పనులను ఆమోదిస్తూ పరిపాలన పరమైన అనుమతులిచ్చింది. ఈ 187 చెరువుల మరమ్మతులకుగాను రూ.113 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. గడువులోగా పూర్తయ్యేనా.. వచ్చే ఏడాదిలో వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా నిర్దేశించిన చెరువుల పునరుద్ధరణ పూర్తికావాలి. జిల్లాలో 555 చెరువులు గుర్తించగా.. ఇప్పటివరకు 187 చెరువుల పనుల అంశం కొలిక్కి వచ్చింది. మిగతా చె రువులకు సంబంధించి సర్వే, ప్రణాళికల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వ ఆమోదం లభిస్తే గడువులోగా పనులు పూర్తిచేసే వీలుండేది. కానీ అధికారుల ఉదాసీనవైఖరితో ప్రణాళికల తయారీ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో వానాకాలంలోగా నిర్దేశించిన చెరువులు పునరుద్ధరణ అనుమానమే. -
పుట్టింట్లో పండుగలా ఉంది..
⇒ కాకతీయుల స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణ ⇒ తొలి దశలో జిల్లాలో 1,447 చెరువుల పనులు ⇒ ఖరీఫ్‌లోపు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక ⇒ చెరువు పనుల బాధ్యత సాగునీటి శాఖదే.. ⇒ ఉమ్మడి రాష్ర్టంలో పాలకులు పట్టించుకోలేదు.. ⇒ భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలి.. ⇒ ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించాలి ⇒ ‘మిషన్ కాకతీయ’ సదస్సులో మంత్రి హరీష్‌రావు సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్‌లో చెరువుల గురించి మాట్లాడుతుంటే పుట్టింట్లో పండుగలా ఉందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయానికి చేయూతనిచ్చేలా గొలుసుకట్టు చెరువులను నిర్మించిన కాకతీయుల రాజధానిలో చెరువులపై అవగాహన సదస్సు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ పేరు పెట్టినట్లు వివరించారు. ఆచరణలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా జిల్లాలో 5,865 చెరువులను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించామని.. తొలి దశలో 1,447 చెరువుల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంపై మంగళవారం ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు జరిగింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అందరూ భాగస్వాములు కావాలి.. ‘ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా భాగస్వాములు అరుుతేనే మిషన్ కాకతీయ విజయవంతమవుతుంది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, అటవీ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మొదటి దశలో చేపట్టిన పనులను వచ్చే మే నెల వరకు పూర్తి చేస్తాం. ఖరీఫ్‌లో ఈ ఫలి తాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చెరువులను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణలో వ్యవసాయం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. చెరువులను నిర్మించిన కాకతీయులను మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. పునరుద్ధరణ పనులు చేపట్టిన మనలను భవిష్యత్తు తరాలు ఇలాగే గుర్తు చేసుకుంటాయి. అందరం కలిసి మిషన్ కాకతీయను విజయవంతం చేయాలి’ అని హరీశ్ అన్నారు. వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, ఎ.సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు డి.వినయభాస్కర్, కొండా సరేఖ, ఆరూరి రమేశ్, దొంతి మాధవరెడ్డి, ఎ.చందులాల్, డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పూల రవీందర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కలెక్టరు జి.కిషన్, సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ విజయప్రకాశ్, ఎస్ఈ పద్మారావు పాల్గొన్నారు. ‘మిషన్ కాకతీయ’పై సూచనలు.. వ్యవసాయ శాఖ : సాగునీటి శాఖ అందించిన చెరువుల పట్టికను పరిగణలోకి తీసుకుని, ఆ చెరువుల మట్టి పరీక్షలు జరపాలి. ఆ మట్టిలో ఎలాంటి లవణాలు(పోషకాలు) ఉన్నాయో 15 రోజుల్లో నివేదిక తయారు చేయాలి. దీని వల్ల పూడిక తీసిన మట్టి పొలాల్లో పోసుకునే రైతులకు ఎరువుల విషయంలో సరైన సమాచారం ఇవ్వొచ్చు. మట్టి పరీక్షల ఫలి తాలు ఉంటే రైతులను చైతన్య పరచవచ్చు. అటవీ శాఖ : అటవీ ప్రాంతాల్లోని చెరువులు, కట్టకాల్వల పునరుద్ధరణకు అడ్డంకులు లేకుండా సహకరించాలి. సాగునీటి శాఖ నుంచి నిధులు అందిస్తాం. కాల్వ కట్టలపై ఆరేళ్లలోపు వినియోగంలోకి వచ్చే ఈత చెట్ల విత్తనాలతో నర్సరీ ఏర్పాటు చేయాలి. చెరువు గరిష్ట నీటిమట్టం పరిధిలో బాగా పొడవుగా పెరిగే సిల్వర్ ఓక్, ఇతర మొక్కల విత్తనాలు తయారు చేసుకోవాలి. సాగునీటి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. రెవెన్యూ : కొన్ని చెరువులు, శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ యంత్రాంగం తమ పాత రికార్డులు పరిశీలిస్తే ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. రికార్డుల ఆధారంగా వాటిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలవనరులు : జిల్లాలో 194 గ్రామాల్లో భూగర్భ జలాలు అడు గంటినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వీటిని కరువు ప్రభావ(ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) గ్రామాలుగా గుర్తించారు. మిషన్ కాకతీయలో ఈ గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా దృష్టి పెట్టాలి. సాగునీటి శాఖ : మిషన్ కాకతీయ మొత్తం సాగునీటి శాఖ బాధ్యతే. గతంలో రెండు జిల్లాలకు ఒక పర్యవేక్షక ఇంజినీర్ ఉండేవారు. ప్రస్తుతం జిల్లాకు ఒకరిని నియమించాం. రూ.50 లక్షల పనులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు, రూ.కోటి పనులు పర్యవేక్షక ఇంజినీర్ కు అధికారాలు వికేంద్రీకరించాం. టెండర్‌కు వారం రోజులు, ఒప్పందానికి వారం చొప్పున.. 16వ రోజు నుంచి పని మొదలయ్యే విధంగా నిబంధనలలో మార్పులు చేశాం. ప్రతి చెరువుకు వేర్వేరుగా టెండర్‌ను పిలవాలని నిర్ణయించాం. చెరువుల పునరుద్ధరణ పనుల నాణ్యతను, ఇంజినీర్ల పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్‌లో నాణ్యత పర్యవేక్షణ విభాగాన్ని నెలకొల్పుతున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఈ విభాగం పని చేస్తుంది. ఇంజినీర్లకు ల్యాప్‌టాప్, ఆధునిక సర్వే పరికరాలు ఇచ్చాం. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తప్పనిసరిగా పనులు జరిగే మండలాల్లోనే ఉండాలి. పనితీరును బట్టి ఇంజినీర్లకు ర్యాంకులు ఇస్తాం. పోస్టింగ్‌ల విషయంలో దీనిని ప్రామాణికంగా తీసుకుంటాము. మండలాలు, గ్రామాల్లో అవగాహన ‘మిషన్ కాకతీయ’పై నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు వచ్చిన ఎంపీపీ, జెడ్పీటీసీలు వారివారి మండలాల్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు ఇలాం టి సమావేశాలు నిర్వహించాలి. కొన్ని చెరువుల్లో ఎంత వర్షం పడినా నీరురాదని అలాంటి వాటిని మినహాయించాలి. నియోజకవర్గానికి ఒక చెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళిక పోచమ్మమైదాన్ : ఎంతో మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేలా లేదనే బెంగతో వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి పిల్లి గిరిబాబు యూదవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. గిరిబాబు యూదవ్ స్మారకార్థం పాలిటెక్నిక్ ప్రహరీ గోడకు అనుకుని ఆయన స్మారక స్థూపం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన వారందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, టెక్నికల్ కోర్సుల్లో చేరినప్పటి నుంచే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్‌లో సప్లమెంటరీని త్వరలో ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నిస్తానని విద్యార్థులకు హమీ ఇచ్చారు. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఏడు ఫిబ్రవరి 19వ తేదిన గిరిబాబు యూదవ్ స్మారక స్థూపం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధికి పునరంకితం కావాలి వరంగల్ లీగల్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచి... ఉద్యమకారులకు ధైర్యాన్ని అందించిన న్యాయవాదులు భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని న్యావాదులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. న్యాయవాదుల వృత్తికి ఆటంకంగా ఉన్న సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ సవరణ అంశాన్ని ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళుతామన్నారు. న్యాయవాదులకు హెల్త్ కార్డు ల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వరంగల్‌లో ఏసీబీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వరంగల్ జిల్లా కోర్టు ఏర్పాటై 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిధులు అందజేస్తామన్నారు. అనంతరం న్యాయవాదులు హరీష్‌రావును సత్కరించారు. శతాబ్ది ఉత్సవాలను గుర్తుగా నిర్మించే భవనానికి రూ.10 లక్షలను ఎంపీ ఫండ్స్ నుంచి కేటాయిస్తానని శ్రీహరి తెలిపారు. మార్కెట్‌ను ఆధునికీకరిస్తాం వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను పూర్తిస్థారుులో ఆధునికీకరిస్తామని మంత్రిహరీష్‌రావు అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. మార్కెట్లో నూతనంగా నిర్మించిన భోజన, ఫలహారశాల క్యాంటీన్‌తోపాటు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపెన్షెడ్ను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. మార్కెట్ మొత్తాన్ని ఆన్లైన్ సిస్టంలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ప్రధాన రహదారులను డబుల్ లేన్ రోడ్లు వేయిస్తామన్నారు. మార్కెట్లో రైతు, హమాలీలకు విశ్రాంతి భవనాల ఏర్పాటు చేస్తామన్నారు.ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ షాపుల యజమానుల కోరిక మేరకు పాత గ్రెయిన్మార్కెట్లో దుకాణ సముదాయం ఏర్పాటుకు రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీష్‌రావుకు ప్రజాప్రతినిధులు సీసీఐ, మార్కెఫెడ్ కొనుగోళ్ల తీరుతో రైతులు ఏవిధంగా నష్టపోతున్నారో వివరించారు. హమాలీ, గుమస్తా, దడువాయిలు తమసమస్యలను తీర్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రికి వినతుల వెల్లువ హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో మంత్రి హరీష్‌రావుకు టీడీపీ శాసన సభాపక్షనేత ఎర్రబెల్లి పక్షాన పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏనుమాముల మార్కెట్లో రైతుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించారు. వీఆర్ఏలకు 10 పీఆర్సీలో మూలవేతనం ఇవ్వాలని, పదోన్నతుల్లో 70 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని, 010 పదద్వారా వేతనాలు ఇవ్వాలంటూ హరీష్‌రావుకు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు వినతిపత్రం అందజేశారు. నోముల విజేందర్‌రెడ్డి, ఏల్పుల సదానందం పాల్గొన్నారు. హన్మకొండ : ఆదర్శ రైతలను కొనసాగించాలని మంత్రి హరీష్‌రావుకు నవ తెలంగాణ ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంకుమార్‌గౌడ్, ఆదర్శ రైతులు ఎం.కేశవరెడ్డి, కటకం రాజు, పూజారి కర్ణాకర్, సింగారం రాజేందర్ వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ అధ్యాపకుడు పులి సారంగపాణికి టీఆర్ఎస్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. -
కలసికట్టుగా కదులుదాం
⇒చెరువుల పునరుద్ధరణపై సుదీర్ఘ చర్చ ⇒సభ్యుల నుంచి సూచనల స్వీకరణ ⇒ఆక్రమణలు, కబ్జాలను ఉపేక్షించవద్దు ⇒రెవెన్యూశాఖ అధికారులు స్పందించాలి ⇒బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు ⇒నీటిపారుదల మంత్రి హరీష్‌రావు ఆదేశం ⇒‘మిషన్ కాకతీయ’పై ప్రజాప్రతినిధులతో సమీక్ష సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రధానంగా చిన్ననీటి వనరుల అభివృద్ధి, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తదితర నాలుగు అంశాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని 3,251 చెరువులను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన చిన్న నీటి వనరుల పునరుద్ధరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, నీటిపారుదలశాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. చెరువులు, కుంటల పునరుద్ధరణపై పలు సూచనలు చేశారు. వినతులను సమర్పించారు. రైతుల పాత్రే కీలకం అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 3,251 చెరువులకుగాను ఈ ఏడాది 700 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తూ పంటల సాగులో, దిగుబడిలో జిల్లాకు ధాన్యాగారంగా పేరు తెచ్చారన్నారు. చెరువుల పునరుద్ధరణతో వృత్తి పనివారికి ఉపాధి లభిస్తుందని, పశువులకు, గొర్రెలకు తాగునీరు లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక చీఫ్ ఇంజినీరును నియమించామన్నారు. కబ్జాకు గురయిన చెరువుల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చెరువుల నుంచి తీసిన మట్టి నమూ నాలను సేకరించి, వాటిని వాడడంతో కలిగే ఫలితాలను తెలియజేయాలని జేడీఏకు సూ చించారు. చెరువుల చుట్టూ చెట్లు, కాలువల గట్టున ఈత చెట్లను నాటించనున్నామన్నారు. ఈనెల మూడవ వారం కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను గ్రామాలలో ఉద్యమరీతిలో, పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు.పనులు పారదర్శకంగా ఉండా ల ని, అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల ని, అవసరమైన చోటే ఖర్చు చేయాలని అన్నా రు. ప్రతి ఏఈకి ల్యాబ్టాప్లు, సర్వే పరికరా లు అందిస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏడాదికి ఒక మిని ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్రమణలు, కబ్జాదారుల భరతం పట్టండి ‘మిషన్ కాకతీయ’పై జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటల ఆక్రమణలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్, బాన్సువాడ, బిచ్కుంద తదితర ప్రాం తాలలో కబ్జాలకు గురైన చెరువులపై అధికారు లు స్పందించడం లేదని వాపోయారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు చెరువుల పునరుద్ధరణలో రెవెన్యూశాఖ పాత్ర ఏమీ లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని, ఖచ్చితంగా నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కబ్జా దారుల భరతం పట్టాల్సిందేనన్నారు. రెండు శాఖలు సమన్వయంతో సర్వే చేసి ఆక్రమణల వెనుక ఎంతటి వారున్నా వదలిపెట్టద్దన్నారు. చెరువుల పునరుద్ధరణలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని కోరారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందు కోసం ఆర్అండ్బీ శాఖకు రూ.1,122 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.750 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి ఇందూరు జిల్లా బడ్జెట్ ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట ని పేర్కొన్నారు. మంత్రి హరీష్ సుడిగాలి పర్యటన మంత్రి హరీష్‌రావు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి రో డ్డుమార్గాన నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన మొదట స్థానిక ఎమ్మెల్యే గణేష్‌గుప్త ఇంటికి, అ ర్బన్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంత రం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రూ. 255.50 లక్షలతో నిర్మించిన మహిళా రైతు వి శ్రాంతి భవనం, క్యాంటిన్, రూప్ట్ షెడ్డు, ఎల క్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్, ఆర్ఓ ప్లాంట్‌ను ప్రా రంభించారు. రూ. 405 లక్షలతో ఏర్పాట య్యే గాల్వాల్యూమ్ సీట్ షెడ్డుకు, 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి, మురుగు కాలువ నిర్మాణానికి, 10 చిన్న ఈ ట్రేడింగ్ క్యాబిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చే శారు. జడ్పీ సమీక్షలో పాల్గొన్న మంత్రి సదాశివనగర్ మండలం భూంపల్లి చెరువును, ప్రా ణహిత-చేవెళ్ల కాల్వ నిర్మాణం పనులను, గాం ధారి మండలం కాటేవాడీ డ్యామ్, గుజ్జులం ప్రాజెక్టును పరిశీలించారు.కార్యక్రమంలో మం త్రి పోచారం, ఎంపీ కవిత, కలెక్టర్ రొనాల్డ్రో స్, మేయర్ సుజాత, శాసనమండలి స భ్యు లు వీజీ గౌడ్, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంతు సింధే, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్త, డీ సీ సీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పాల్గొన్నారు. -
దశ మారేనా!
‘మిషన్ కాకతీయ’ ⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జిల్లాకు మంత్రి హరీశ్‌రావు రాక ⇒ నీటి వనరుల నవీకరణపై సమీక్ష ⇒ హాజరు కానున్న మంత్రి పోచారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటల కింది ఆయకట్టుకు మం చిరోజులొచ్చాయి. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువులు, కుంటలను మరమ్మతు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు తీరు తెన్నులను సమీక్షించేందుకు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలవారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభో త్సవాలలో పాల్గొననున్నారు. జడ్పీ సమావేశ మందిరం లో ‘మిషన్ కాకతీయ’పై జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు శాసనసభ, శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ ‘మిషన్ కాకతీయ’ తీరు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా విడతలవారీగా 46,531 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణకు కార్యాచరణ రూపొం దించింది. ఇందులో మొదటి విడతగా 9,971 చెరువులు, కుంటలను తీసుకుంది. జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 630 చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం నీటిపారుదలశాఖ అధికారులు నిజామాబా ద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో 450 చెరువులు, కుంటలను సర్వే చేశారు. 158 చెరువులు, కుంటల కోసం రూ.84.89 కోట్ల నిధులు కావాలని అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వాటి మంజూ రు లభించింది. ఈ పనులకు ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు కూడ ఆహ్వానించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న టెండర్లు తెరిచి పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో పలుచోట్ల చెరువులు, కుంటలు ఆక్రమణలు, కబ్జాలకు గురి కాగా, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదన్న ఆరోపణ లు ఉన్నాయి. నిజామాబాద్ సమీపంలో రామర్తి చెరువుతో కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరలలో చిక్కుకున్నాయి. ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్‌గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు తొలగించకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ కాకతీయ’కు ప్రతిబంధకాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి హరీష్‌రావు పర్యటన ఇలా మంత్రి తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9.15 గంటలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ఇంటికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పా టు చేసిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ సిస్టమ్, మహిళా రైతుల విశ్రాంతి గృహాలను ప్రారంభిస్తారు. 11 గంట లకు జడ్పీ సమావేశ మందిరంలో ‘మిషన్ కాకతీ య’పై వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతి నిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి సదాశి వనగర్ మండలం భూంపల్లి చెరువును పరిశీలిస్తారు. 4 గంటలకు గాంధారి మండలం గుజ్జులడ్యామ్, 4.45 గంటలకు కాటేవాడి డ్యామ్‌ను సందర్శిస్తారు. 5 గంటలకు గాంధారి మండల కేంద్రంలో ‘ప్రెస్‌మీట్’ నిర్వహించిన అనంతరం 5.30కు గాంధారి లోనే చిన్న నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించి 6 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. -
చెరువులకు నిధుల వరద!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మిషన్ ‘కాకతీయ’గా నామకరణం చేసిన చెరువుల పునరుద్ధరణకు వచ్చే వర్షాకాలం నాటికీ పూర్తి చేసేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొ ని చెరువుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆయకట్టు విస్తీర్ణం, చెరువు సామర్థ్యం, ఫీడర్ ఛానళ్ల నిర్వహణ, చెరువుకట్ట పటిష్టత, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా భూగర్భజలాలు దారుణంగా పడిపోయిన ప్రాంతాల్లోని చెరువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా భూగర్భనీటి మట్టా న్ని రీచార్జి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు ప్రవహించేలా కాల్వలు ఉన్నా యా? వివాదరహితంగా ఉన్నాయా? అనే అంశాలను కూడా గమనంలోకి తీసుకుంటున్నారు. తొలిదశలో గుర్తించిన వాటిలో ఇప్పటివరకు 164 చెరువులకు సంబంధించిన ప్రతి పాదనలను ఇరిగేషన్ ఇంజినీర్లు తయారు చేశారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందు కు చర్యలు తీసుకుంటున్నారు. పనులు ఆలస్యం కాకుండా టెండర్ల నిర్వహణలో ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇవ్వడంతో రూ.50 లక్షలలోపు పనులకు డివిజన్ స్థాయిలో ఈఈ కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అపై పనులకు ఎస్ఈ అనుమతి త ప్పనిసరి. కాగా, పూడికతీత విషయంలో మాత్రం పరిమితి విధించింది. వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చిన్ననీటిపారుదల కమతాల్లో పూడికతీతను 30వేల క్యూబిక్ మీటర్ల వరకు, అపై విస్తీర్ణంలోని చెరువులకు 60వేల క్యూబిక్ మీటర్ల వరకు పరిమితి పెట్టింది. తద్వారా చెరువుల మరమ్మతుల్లో అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని ప్రభుత్వం అంచనా. ఇదిలావుండగా, కేవలం సాగునీటి అవసరాలకే కాకుండా నియోజకవర్గానికో మినీ ట్యాంక్‌బండ్‌ను నిర్మించాలనే ప్రతిపాదనలనూ ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తోంది. -
చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి
మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామం. రాష్ట్రంలో అపర భద్రాద్రిగా పేరు గాంచిన మా గ్రామానికి నలువైపులా నాలు గు చెరువులుండేవి. 40 ఏళ్ల క్రితం వరకూ ఇల్లంద కుంట సస్యశ్యామలంగా ఉండేది. మంచినీటి చేద బావుల్లో నీరు ముంచుకునేట్టుండేది. గ్రామానికి కల్పవృక్షం. కామధేను వులైన పుల్లాయకుంట, కుమ్మరికుంటలను భూకబ్జాదారులు ఆక్రమిం చుకున్నారు. అవి అదృశ్యం కావటంతో గ్రామంలో సాగునీరు, తాగు నీటి ఎద్దడి ఏర్పడింది. పచ్చని గ్రామం కళ తప్పింది. గుండ్ల చెరువు కింద 8 గ్రామాల రైతులు పంటలు పం డిస్తారు. గుండ్ల చెరువు పూడికను పాలకులు మరిచి పోయారు. ఊర చెరువు కబ్జాకు గురైనా గత ప్రభుత్వాలకు పట్టలేదు. ఇల్లందకుంట ఊర చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కబ్జాకు గురైన చెరువులను విముక్తి చేసి, వెంటనే పునరుద్ధరించి తిరిగి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలి. సీఎం కేసీఆర్ ‘సాక్షి’ ఇన్‌బాక్స్ లేఖకు స్పందించడం గ్రేట్. ప్రతిరోజూ ఈ లేఖలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించాలి. రావుల రాజేశం ఇల్లందకుంట, జమ్మికుంట, కరీంనగర్ -
నియోజకవర్గానికో.. మినీ ట్యాంకుబండ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామాలకు ప్రధాన నీటివనరైన చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో చెరువులను పరిరక్షించడంతోపాటు అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా విడతల వారీగా చెరువులు పునరుద్ధరించాలంటూ నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పనుల కేటాయింపులపైనా ఇంజినీర్లకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వారంలోగా చెరువుల పునరుద్ధరణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని, వాటి ఆమోదం అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఇంజినీర్లు.. జిల్లాలో ఉన్న 3400 చెరువుల్లో తొలివిడత 683 చెరువులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. చెరువుల అభివృద్ధితోపాటు పర్యటక పరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో చెట్ల పెంపకాన్ని సైతం ఈ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చెరువును ఎంచుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉన్న పెద్ద చెరువును ఎంచుకుని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మార్గనిర్దేశించింది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో రావిరాల చెరువులతోపాటు లక్నాపూర్, కోట్‌పల్లి తదితర ప్రాజెక్టులన్నీ పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో చెరువుకు గరిష్టంగా రూ.50లక్షలు.. చెరువుల మరమ్మతు పనులకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. చెరువులో పూడికతీత, కాల్వ పనులు, ఫీడర్ చానళ్ళ మరమ్మతులు తదితర పనులకు సంబంధించి ఒక్కో చెరువుపై గరిష్టంగా రూ.50లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈలెక్కన తొలివిడత చేపట్టే 683 చెరువుల మరమ్మతుకుగాను రూ.350 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మినీట్యాంక్‌బండ్‌ల అభివృద్ధి ఈ ప్రణాళికలో రూపొందిస్తున్నప్పటికీ.. నిధులు మాత్రం ఇతర కోటాలో ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోచోట ఒక్కోవిధంగా పనులు చేయాల్సి ఉన్నందున ప్రణాళిక తయారైన అనంతరం ప్రభుత్వ ఆమోదంతోనే వీటిని నిధులిస్తారు. -
జిల్లానుంచే కాకతీయ మిషన్
* పెలైట్ ప్రాజెక్టుగా మునుగోడు, భువనగిరి, ఆలేరు మండలాల ఎంపిక * డిసెంబర్ చివరినాటికి పనులు ప్రారంభం నల్లగొండటౌన్/చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాకతీయ మిషన్ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జిల్లానుంచే ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. వాటర్‌గ్రిడ్ పనులను జిల్లా నుంచే మొదలుపెడతామని ప్రకటించిన ప్రభుత్వం, హైదరాబాద్‌తోపాటు వాటర్‌గ్రిడ్‌ను చెరువులకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉంది. జిల్లాలో ఈ ఏడాది 952 చెరువులను పునరుద్ధరించాలని చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే కరువుతో అల్లాడుతున్న ఆలేరు, మునుగోడు, భువనగిరి మండలాల్లో పెలైట్ ప్రాజెక్టుగా చెరువుల పునరుద్ధరణను ప్రారంభించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. హైదరాబాద్‌లో గురువారం సీఎం కేసీఆర్ ముం బయికి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిపుణులతో సమావేశమయ్యారు. భౌగోళిక సమాచార సర్వే విధానం(జీఐఎస్)తో చెరువులను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం లిడార్ టెక్నాలజీని ఉపయోగించి, వాటర్‌గ్రిడ్‌ను, హైదరాబాద్ నగరాన్ని, చెరువులను అనుసంధానం చేసేలా సర్వే చేయనున్నారు. అంచనాల రూపకల్పనలో నిమగ్నం పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే సుమారు 200 చెరువులకు సంబంధించి అంచనాలు పూర్తి చేశారు. మిగతా 276 చెరువుల అంచనాలను నవంబర్ నెలాఖరు వరకు పూర్తిచేసి డిసెంబర్ మొదటి వారంలో పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. పనుల్లో ఎలాంటి జాప్యమూ జరగకుండా వేగవంతంగా పూర్తి చేయించాలన్న భావనలో అధికారులు ఉన్నారు. దీనికిగాను గతంలో ఉన్న టెండర్ల ప్రక్రియ మాదిరిగా కాకుండా కేవలం వారం రోజులలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌లోపే సదరు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించనున్నారు. డిసెంబర్లో మొదటి విడతగా పనులను ప్రారంభించిన 476 చెరువుల పునరుద్ధ్దరణ పనులను జూన్ చివరినాటికి పూర్తి చేయాలనే పట్టుదలలో ఉన్నారు. అదే విధంగా జనవరి మొదలైన మిగిలిన సగం 476 చెరువుల పునరుద్ధరణ పనులకు అంచనాల కోసం సర్వే పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటి అంచనాలను, టెండర్ ప్రక్రియను కొలిక్కితెచ్చి పనులను జూలై నెలలో ప్రారంభించి 2015 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముమ్మరమైన కసరత్తు చేస్తున్నారు. 10నుంచి 15చెరువుల ఎంపిక.. తొలిదశలో చెరువుల పునరుద్ధరణ పథకం(కాకతీయ మిషన్)లో తొలిదశలో భాగంగా భువనగిరి, ఆలేరు, మునుగోడు మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలాల్లో త్వరలో సర్వేను ప్రారంభించనున్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్ధరణకు భువనగిరిలో 16, ఆలేరులో 20, మునుగోడులో 9చెరువులను ఎంపిక చేశారు. తొలి దశగా ఈ మండలాల నుంచి, 10నుంచి 15చెరువులను ఎంపిక చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో 15నుంచి 20చెరువులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువుల్లో నీటిని తొలగించం : హమీద్‌ఖాన్, ఈఈ చెరువుల పునరుద్ధరణ పనులలో భాగంగా చెరువులలో ఉన్న నీటిని తొలగించం. నీటిని పూర్తిగా వాడుకున్న తరువాతనే పూడికతీత పనులను చేపడతాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. అభివృద్ధి పనులు ఇలా.. * చెరువుల్లో పూడికతీతతోపాటు తూములు, అలుగులను సరిచేస్తారు. * చెరువుల్లోకి వర్షపునీరు వచ్చేలా వరద కాలువలు, ఫీడర్చానళ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. * నదులు, ప్రధాన వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను కూడా సర్వేలో గుర్తిస్తారు. * ఒక్కో చెరువుకు, సామర్థ్యాన్ని బట్టి రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నారు. * వాటర్‌గ్రిడ్ పథకానికి ఈ చెరువులన్నింటినీ అనుసంధానం చేయనున్నారు. తద్వారా వాటర్‌గ్రిడ్‌లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చూడనున్నారు. -
ఉద్యమంలా ‘మిషన్ కాకతీయ’
పట్టణ ప్రాంతాల్లో మినీ ట్యాంక్బండ్లు విపక్షాలను కలుపుకొనిపోతాం: మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేపట్టిన‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళతామని శుక్రవారం శాసనమండలిలో నీటిపారుదల, శాసనసభవ్యవహారాల శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. భూగర్భజలాలను పెంచడంతో పాటు వ్యవసాయానికి నీరందించే ఈ కార్యక్రమంలో విపక్షాలను కూడా కలుపుకుపోతామన్నారు. అంతేకాక కవులు, కళాకారులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘చెరువుల పరిరక్షణ గురించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు, పాఠకులు రాసిన లేఖలకు స్పందించిన ప్రభుత్వం వాటి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని’ చెప్పారు. చెరువుల పునరుద్ధరణ వలన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వివిధ కుల వృత్తుల వారికి జీవనోపాధి లభిస్తుందన్నారు. చెరువుగట్లపై ఈత, తాటి చెట్లు పెంచడం వలన గీత కార్మికులకు ఉపయోగపడతాయన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కనీసం గంటపాటు శ్రమదానం చేయనున్నారని మంత్రి తెలిపారు. గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణతో పాటు, పట్టణాల్లోని చెరువులను కూడా పటిష్టం చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్ మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. చెరువులను పరిరక్షించేందుకు సోషల్ ఫెన్సింగ్ పేరిట కాలనీవాసులకు బాధ్యతను అప్పగిస్తామన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్‌లోగా టెండర్లు పిలిచి డిసెంబర్ రెండో వారం నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. -
కట్టలు, అలుగులపై దృష్టిపెట్టాలి
* చెరువుల పునరుద్ధరణపై నీటి పారుదల * నిపుణుడు హనుమంతరావు సూచన * చెరువుల్లో పూడిక కంటే ముందు కట్టల బలోపేతం, అలుగు విస్తరణ తప్పనిసరి * ఇప్పటికే తెగిపోయిన 1,700 చెరువులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలి * చెరువులకు నీరు వచ్చే కాలువలు, వాగుల్లో పూడిక తీత వద్దని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అభినందనీయమని... అయితే ముందుగా చెరువుల్లో పూడిక తీయడం కాకుండా వాటి కట్టల భద్రత, అలుగు (మత్తడి) విస్తరణ చేపట్టాలని ప్రముఖ నీటి పారుదల నిపుణుడు, రిటైర్డ్ ఈఎన్సీ టి.హనుమంతరావు సూచించారు. భారీ వర్షాల సమయంలో చెరువుల కట్టలు తెగి, నీరు నిల్వ ఉండ టం లేదని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికే 1,700 చెరువుల కట్టలు తెగిపోయి వృథాగా ఉన్నాయని.. వాటిని యుద్ధప్రతిపాదికన మరమ్మతు చేయాలని పేర్కొన్నారు. పదేళ్ల వరదను దృష్టిలో ఉంచుకోవాలి.. పదేళ్లపాటు ఆ చెరువులకు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని, ఆయా ప్రాంతాల నేల స్వ భావం ఆధారంగా పనులు చేపట్టాలని హనుమంతరావు సూచించారు. చెరువుల పూడికతీత కార్యక్రమం సాధారణంగా తూముల వద్ద ఎక్కువగా జరుగుతుందని, తూముల వద్ద పూడిక తీయడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. దీనివల్ల అక్కడ తూములుపైకి ఉండి, చెరువులోతుగా ఉంటే.. నీరు బయటకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. త్వరగా నిండే వాటికి ప్రాధాన్యత.. చెరువుల్లో నీరు నిండుగా ఉన్నప్పుడు వాటి కట్టలు తెగకుండా ఉండాలంటే... వాటి భద్రత సామర్థ్యాన్ని పెంచి, ఏటవాలుగా ఏర్పాటు చేయాలని, అలుగు విస్తీర్ణం కూడా పెంచాల్సి ఉంటుందని హనుమంతరావు తెలిపారు. వర్షాలతో త్వరగా నిండే చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని... భారీ వర్షాలు వచ్చినా నిండని చెరువుల్లో పూడికతీసే కార్యక్రమంతో ప్రయోజనం ఉండదని చెప్పారు. చెరువులకు సంబంధించి తాను రాసిన ‘చిన్న నీటిపారుదల సాంకేతిక మార్గదర్శకాలు (మైనర్ ఇరిగేషన్ టెక్నికల్ గైడ్‌లైన్స్)’ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చెరువుల్లోకి నీరు చేరే కాలువలు, వాగుల్లో పూడిక, చెట్లను కొట్టేయడం వల్ల నీరు వేగంగా వచ్చి చెరువుల్లో చేరుతుందని... కానీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు చేరకుండా పోయే అవకాశముంటుందని హనుమంతరావు చెప్పారు. కాలువలు, వాగుల్లో పూడిక తీయకుంటే... వర్షం నీరు కాస్త ఆలస్యంగా వచ్చినా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. గరిష్ట నీటి మట్టం వద్ద... పట్టణాలు, నగరాల్లో చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్టీఎల్) వద్ద కంచె నిర్మాణం చేస్తున్నారని, అలా కాకుండా గరిష్ట నీటిమట్టం (ఎంటీఎల్) వద్ద కంచె వేయడం మంచిదని హనుమంతరావు అభిప్రాయపడ్డారు. చెరువుల చుట్టుపక్కల ఇళ్లు నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వర్షాలు పడినప్పుడు ఆ ఇళ్లన్నీ ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల గరిష్ట స్థాయి నీటి మట్టం వద్ద కంచె నిర్మాణం చేపడితే.. దాని లోపల ఇళ్ల నిర్మాణం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. పునరుద్ధరణకు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలు! భారీ ఎత్తున చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి రిటైర్డ్ ఇంజనీర్ల సహకారం తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్న సెక్షన్ కార్యాలయాల పరిధిలో సుమారు 100 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి... ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. మండల స్థాయిలో చెరువు పనుల అంచనాలు, పనుల పర్యవేక్షణ, పనుల సర్వే తదితర బాధ్యతలను వారు నిర్వర్తిస్తారని తెలిపాయి. -
చెరువులకు పూర్వవైభవం
‘మిషన్ కాకతీయ’పై నజర్ * జిల్లాలో 1,580 చెరువుల ఎంపిక * చురుగ్గా సాగుతున్న సర్వే పనులు * నేడు మంత్రి హరీష్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం సాక్షి, సంగారెడ్డి: చెరువుల పునరుద్ధరణకు సర్కార్ చేపట్టిన ‘మిషన్ కాకతీయ’పై అందరూ దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సోమవారం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టనున్న ‘మిషన్ కాకతీయ’ పనులపై మంత్రి నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు చే యనున్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు ఎ లా చేపట్టాలి, పనుల నాణ్యత, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై మంత్రి హరీష్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. గొలుసుకట్టు చెరువులపైనా చర్చ జిల్లాలోని గొలుసుకట్టు చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో మంత్రి హరీష్‌రావు జిల్లాలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంశంపై ప్రత్యేక శ్ర ద్ధ కనబరుస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు సమీక్ష సమావేశంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చెరువులు పునరుద్ధరణ, మరమ్మతు పనుల కోసం 1,580 చెరువులను అధికారులు గుర్తించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 136, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 243, అందోలులో 160, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 85, జహీరాబాద్‌లో 67, నారాయణఖేడ్‌లో 85, నర్సాపూర్‌లో 60, మెదక్‌లో 352 చెరువులను గుర్తించారు. ఈ చెరువుల మరమ్మతు, అభివృద్ధి పనులు డిసెంబర్లో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి చెరువుల సర్వే పనులు మండలాల వారీగా నీటిపారుదల శాఖ అధికారులు ముమ్మరం చేశారు. అదే సమయంలో చెరువుల మరమ్మతు పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు పూర్తి చేసి డిసెంబర్లో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నారు. పునరుద్ధరణ పనుల్లో భాగంగా చెరువుల పూడికతీత పనులు, తూము, అలుగులు, కాల్వల మరమ్మతులు చేయనున్నారు. పూడికతీత, చెరువుకట్ట మరమ్మతు పనులను రైతులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత మిషన్ కాకతీయకు నీటిపారుదల శాఖలోని సిబ్బంది కొరత కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగంలో జిల్లా వ్యాప్తంగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సిద్దిపేట, అందోలు డీఈ పోస్టులతోపాటు మెదక్, సిద్దిపేట ఐబి డివిజన్ల పరిధిలో 8 మంది ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు రెండు, ప్రింట్ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఇవి కాకుండా పరిపాలన పరంగా డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3, జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఒకటి, టైపిస్టు పోస్టులు రెండు, స్టెనో పోస్టు ఒకటి, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు మూడు భర్తీ చేయాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. -
చెరువుల ఎంపికకు కసరత్తు
నర్సాపూర్ : చెరువుల పునరుద్ధరణ లో భాగంగా మొదటి విడత ఎంపిక కోసం అధికారులు కసరత్తును ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సాగు నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు చెందిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు మొత్తం 1,612 ఉండగా వాటిలో 1,182 చెరువులు, కుంటలు సాగునీటి పారుదల శాఖకు చెందినవిగా రికార్డులు పేర్కొంటున్నాయి. సాగు నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, కుంటల్లో 20 శాతం చెరువులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా అందులో భాగంగా ఆరు మండలాలకు చెందిన సుమారు 259 చెరువులను మొదటి సంవత్సరం పునరుద్ధరించాలని నిర్ణయించి అందులో మొదటి విడత కోసం 60 చెరువులు ఎంపిక చేయనున్నారు. ఏ మండలంలో ఎన్ని చెరువులంటే.. నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో 39 చెరువులు, హత్నూరలో 57, కౌడిపల్లిలో 55, శివ్వంపేటలో 48, కొల్చారంలో 20, వెల్దుర్తి మండలంలో 40 చెరువులు, కుంటలను ఎంపిక చేస్తారు. కాగా వీటిలో మొదటి దశ కింద మండలానికి పది చెరువులు, కుంటలను కలిపి పునరుద్ధరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నేతృత్వంలో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎంపిక చేయనున్నారు. సంపూర్ణంగా మరమ్మతులు పునరుద్ధరణ కింద ఎంపిక చేసిన చెరువులు, కుంటలను సంపూర్ణంగా మరమ్మతులు చేపడతారు. చెరువులు, కుంటల్లో పూడికను తీసి మట్టిని రైతులకు అందజేస్తారు. మట్టిని ప్రభుత్వ ఖర్చులతో వాహనాల్లో నింపితే రైతులు తమ ఖర్చులతో తమ తమ పొలాల్లోకి తరలించుకోవాల్సి ఉంటుంది. కాగా చెరువుల కట్టలను వెడల్పు, అలుగులు, తూములను మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే పునర్నిర్మాణం పనులు చేపడతారు. చెరువుల మరమ్మతులకు అంచనాల నివేదికల ఆధారంగా నిధులు కేటాయించనున్నారు. డిసెంబర్లో పునరుద్ధరణ పనులు చెరువుల పునరుద్ధరణ పనులను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను స్థానిక అధికారులు సిద్ధం చేయగానే ఉన్నతాధికారులు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.