ringing bells
-
అడ్డంగా బుక్కైన రూ.251 స్మార్ట్‌ఫోన్ ఫౌండర్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చౌక ధరకే స్మార్ట్‌ఫోన్ అంటూ వార్తల్లో నిలిచిన రింగింగ్ బెల్స్ వ్యవస్థాపకుడు మోహిత్ గోయెల్ మరోసారి వెలుగులోకి వచ్చాడు. వ్యాపారవేత్తలను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు మోహిత్ గోయెల్‌ను అరెస్టు చేశారు. ఒక మహిళతో కలిసి అక్రమంగా గ్యాంగ్‌రేప్ ఆరోపణలు చేయడంతో పాటు బలవంతపు వసూళ్ళకు పాల్పడిన కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ‘భీవాండి గ్యాంగ్ రేప్ కేసు' గా పేరొందిన కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారవేత్తలపై ఓ మహిళతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందుతులనుంచి బలవంతపు వసూళ్లకు ప్రయత్నించారని నార్త్-వెస్ట్ డీసీపీ అస్లాం ఖాన్ తెలిపారు. కీలక సమాచారం మేరకు గోయెల్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న తనను పిలిపించి, మత్తుమందు ఇచ్చి, ఒక ఫాం హౌస్‌లో సామూహిక అత్యాచారం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత నెలలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అయిదుగురు వ్యాపారవేత్తలను నిందితులుగా పేర్కొంది. అయితే ఈ కేసులో ఆమె, గోయెల్‌తో కలిసి వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు తన ముఠాతో కలిసి నిందితులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఈమె ఇప్పటికే 1.1 కోట్ల రూపాయలు కూడా తీసుకుంది. అయితే తాజాగా మరింత డబ్బును డిమాండ్ చేస్తూ, వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వలపన్నిన పోలీసులు చాకచక్యంగా గోయల్ అండ్ గ్యాంగ్‌ను ట్రాప్ చేశారు. కేసును వాపస్ తీసుకునేందుకు 2.5 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నటించి, వారి ఆటకట్టించారు. ఈ కేసులో ఆ మహిళను కూడా అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా ఘజియాబాద్‌కు చెందిన ఓ కంపెనీనీ రూ.16 లక్షలు మోసంచేసిన ఆరోపణలతో గోయల్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు మూడునెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. మే 31న అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
'ఫ్రీడం 251' డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
స్మార్ట్ఫోన్లను కేవలం రూ. 251కే ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి, అనేక మందితో డబ్బులు కట్టించుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అతడిని పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రింగింగ్ బెల్స్ సంస్థ తమను రూ. 16 లక్షల మేర మోసం చేసిందంటూ అయామ్ ఎంటర్ప్రైజెస్ అనే ఘజియాబాద్ సంస్థ ఫిర్యాదు చేయడంతో గోయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై విచారించేందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఘజియాబాద్ డిప్యూటీ ఎస్పీ మనీష్ మిశ్రా తెలిపారు. 2015 నవంబర్ నెలలో గోయల్, ఇతరులు కలిసి ఫ్రీడమ్ 251 ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాల్సిందిగా తమను కోరారని అయామ్ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఇందుకుగాను ఆర్టీజీఎస్ ద్వారా తాము రూ. 30 లక్షలు చెల్లించామని, ఆకనీ ఇప్పటివరకు కేవలం రూ. 13 లక్షల విలువైన ఫోన్లు మాత్రమే వచ్చాయని చెప్పింది. ఆ తర్వాత ఎంతగా ఫాలో అప్ చేసినా కేవలం రూ. 14 లక్షల విలువైన డబ్బు, ఫోన్లు మాత్రమే అందాయన్నారు. మిగిలిన 16 లక్షల రూపాయల గురించి పదే పదే అడిగితే చంపేస్తామని కూడా తమను బెదిరించినట్లు అయామ్ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థ గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి వెబ్సైట్ ద్వారా బుకింగులు మొదలుపెట్టింది. దాదాపు ఏడు కోట్ల మంది వరకు ఆ ఫోన్ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫోన్లు వచ్చింది మాత్రం చాలా తక్కువ మందికే కావడంతో చాలామంది కంపెనీపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
రింగింగ్ బెల్స్ మరో సంచలనం షురూ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రింగింగ్ బెల్స్ ఫ్రీడం టీవీలంటూ వినియోగదారుల ముందుకొస్తోంది. 10 వేల లోపే చీసెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీ అంటూ మరో సంచలనాత్మక ప్రకటన చేసింది. తమ కొత్త 'ప్రీడమ్ 9900' టీవీలకోసం ఆగస్టు 15 న బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటన చేసింది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీల ను రూ. 9,900లకే అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 15 న బుకింగ్ మొదలవుతుందనీ, తరువాతి రోజు నుంచి (ఆగస్టు 16 ) పంపిణీ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. క్యాష్ ఆన్ పద్ధతిలో వీటిని డెలివరీ చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1366x768 పిక్సెల్స్, రిజల్యూషన్, 3000 కాంట్రాస్ట్ రేషియో, రెండు హెచ్ డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు, రెండు స్పీకర్ల తదితర ఫీచర్లు దీని సొంతం. అసక్తివున్నవారు సంస్థ వెబ్ సైట్ రింగింగ్‌బెల్స్ .కో.ఇన్ వెబసైట్ లో బుకింగ్ లు చేసుకోవచ్చు. తమ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే తమ టెలివిజన్ కు కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తామనే భరోసా వినియోగదారులకు ఉందని పేర్కొంది. -
ఫ్రీడమ్ 251 ఫోన్ పంపిణీ మొదలైందట!
న్యూఢిల్లీ: అదుగో..ఇదిగో.. అంటూ ఊరిస్తూ వచ్చిన ఫ్రీడం 250 స్మార్ట్ ఫోన్ల డెలివరీ ఎట్టకేలకు మొదలైందట. మొదటి విడత డెలివరీలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలో ఫోన్ల బట్వాడా మొదలు పెట్టినట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. సుమారు అయిదువేల ఫోన్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. హర్యానాలో 390 ఫోన్లు, పశ్చిమ బెంగాల్లో 540 ఫోన్లు, హిమాచల్ ప్రదేశ్, 484, 605 ఫోన్లు బీహార్‌లో, ఉత్తరాఖండ్‌లో 221 ఫోన్లను మొదటి విడతగా పంపిణీ మొదలుపెట్టనట్టు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ పీటీఐకి వెల్లడించారు. మొదటి విడతలో అయిదువేల స్మార్ట్ ఫోన్ల డెలివరీకి కట్టుబడి ఉన్నామని గోయల్ తెలిపారు. సుమారు 2,240 యూనిట్లను కొరియర్ సర్వీసు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా తమ ఖాతాదారులకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలో వినియోగదారులకోసం 223 ఫోన్లు, పంజాబ్‌లో 364 , జమ్ము కాశ్మీర్ 108, మహారాష్ట్ర 521, మధ్యప్రదేశ్‌లో 194, జార్ఖండ్‌లో 225, రాజస్థాన్‌లో 365 స్మార్ట్ ఫోన్లకు డెలివరీ చేస్తున్నామన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లో సోమవారం నోయిడా, ఘజియాబాద్, మీరట్ లలో పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అనంతరం మిగతా రెండు లక్షల ఫోన్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన భాగాలు ఇప్పటికే ఫ్యాక్టరీకి చేరుకున్నాయని తెలిపారు. ఈ క్రేజీ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలుదారులు డెలివరీ ఛార్జ్ గా రూ 40 రూ.అదనంగా చెల్లించాల్సి ఉందట. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ అంటూ సంచలనం సృఫ్టించిన ఈ ఫోన్ కోసం ఫిబ్రవరిలో కంపెనీలో 70 మిలియన్ పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. అయితే ఐటీ జోక్యం, వివాదాలు, పంపిణీ ప్రక్రియ పలుమార్లు వాయిదాపడటం.. యాజమాన్యం మధ్య విభేదాలు నెలకొన్నాయన్న వార్తల ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ ఫోన్లపై ఆశపెట్టుకున్న ఖాతాదారులు డైలమాలో పడిపోయిన సంగతి తెలిసిందే. -
రూ.251 ఫోన్లను పంపేస్తున్నాం
ఎప్పటినుంచో ఊరిస్తున్న ఫ్రీడమ్ 251 ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారుల చెంతకు చేరబోతున్నాయి. మొదటి విడతగా మొత్తం 2,240 ఫోన్లను పంపినట్లు నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. పశ్చిమబెంగాల్ వినియోగదారులకు మొత్తం 540 ఫోన్లు, హర్యానాకు 390 యూనిట్లు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 605, బిహార్‌కు 484, ఉత్తరాఖండ్‌కు 221 ఫోన్లను పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో ఇస్తామన్న మొత్తం 5వేల ఫోన్లలో మిగిలినవాటిని శనివారం పంపుతామని చెప్పారు. ఫోన్లు అందుకున్నవాళ్లు మొత్తం రూ. 291 చెల్లించాలని, అందులో ఫోను ఖరీదు రూ. 251 కాగా, మిగిలిన 40 రూపాయలు డెలివరీ చార్జి అని కంపెనీ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. ఈ ఫోన్ల కోసం మొత్తం 7.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, లాటరీ ద్వారా మొదటి బ్యాచ్ వినియోగదారులను ఎంపిక చేశామని అన్నారు. 31.5 అంగుళాల ఎల్ఈడీ టీవీని, నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను కూడా రింగింగ్ బెల్స్ సంస్థ ఆవిష్కరించింది. ఫ్రీడమ్ 251 ఫోన్ల తయారీకి మొత్తం రూ. 1180 ఖర్చవుతుందని, అందులో రూ. 700-800 వరకు యాప్ డెవలపర్ల నుంచి తీసుకుంటున్నామని గోయల్ తెలిపారు. 251 రూపాయలకు ఫోన్ అమ్మినా, ఇంకా ఒక్కో సెట్ మీద రూ. 180 నుంచి 270 వరకు నష్టం వస్తుందని చెప్పారు. -
చవక ఎల్ఈడీ టీవీ.. రేటెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చిన రింగింగ్ బెల్స్ సంస్థ, చౌకగా ఎల్ ఈడీని మార్కెట్లోకి తీసుకొస్తామని మరో సంచలన ప్రకటనతో దుమ్మురేపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసిన కస్టమర్లకు మాత్రం షాకే ఎదురైంది. దాదాపు రూ.10 వేలకు 31.5 అంగుళాల హెచ్ డీ ఎల్ఈడీ టీవీని ఇవ్వనున్నట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. దీంతో టీవీ కూడా చౌకగా వస్తుందని ఆశపడిన వినియోగదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ టీవీతో పాటు నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను ఢిల్లీ ఈవెంట్ లో రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. ఎల్ఈడీ టీవీ ధర రూ.9,900గాను, నాలు ఫీచర్ ఫోన్లు హిట్ - రూ.699, కింగ్ - రూ.899, బాస్ - రూ.999, రాజా -రూ.1099కు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సొగసైన 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్లను రూ.3,999, రూ.4,999 ధరలకు మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుతాయని కూడా రింగింగ్ బెల్స్ తెలిపింది. మొదటి దశగా 5,000 ఫోన్లను కంపెనీ డెలివరీ చేయనుంది. డెలివరీ చార్జీల కింద వినియోగదారులు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఒక్కో ఫ్రీడమ్ ఫోన్ పై వస్తున్న రూ.930 నష్టంతో పాటు.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లను మరిన్ని తయారీ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆ కంపెనీ ఆశ్రయించిందట. ఏకంగా రూ.50 వేల కోట్లను సహాయంగా అందించాలని ఆ కంపెనీ కోరినట్టు తెలుస్తోంది. నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరుతూ జూన్ 28నే ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ కంపెనీ లేఖ రాసిందని సమాచారం. ఒక్కో స్మార్ట్ ఫోన్ తయారీపై రూ.930 నష్టాన్ని కంపెనీ భరించిందని రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. మొత్తం ఈ ఫోన్ తయారీకి రూ.1180 ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. రూ.700-800లను యాప్ డెవలపర్లు, ప్రకటనల రెవెన్యూల నుంచి రికవరీ చేసుకున్నామని చెప్పారు. తర్వాత రూ. 251 (క్యాష్ ఆన్ డెలివరీ)లకు ఫోన్ అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో ఫోన్ పై రూ.180 నుంచి రూ.270 వరకు నష్టాలు వస్తాయని బావిస్తున్నట్టు గోయిల్ పేర్కొన్నారు. -
రూ. 251 ఫోన్లాగే.. చవగ్గా టీవీ ఇస్తాం!
ఫ్రీడమ్ 251.. ఈ పేరుతో అత్యంత చవగ్గా కేవలం 251 రూపాయలకే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామంటూ ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పటివరకు ఆ ఫోన్లనయితే డెలివరీ చేయలేదు గానీ, అప్పుడే మరో సంచలన ప్రకటన మాత్రం చేసింది. ఎల్ఈడీ స్క్రీన్, హెచ్డీ రిజల్యూషన్‌తో ఇంతవరకు ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఫ్రీడమ్ టీవీని గురువారం ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు బుధవారమే ఫ్రీడమ్ 251 ఫోన్లు అందాల్సి ఉంది. కానీ అది మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. ఇదే అంశంపై గురువారం నాడు కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ ఓ ప్రకటన కూడా చేస్తారని రింగింగ్ బెల్స్ తెలిపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఫోన్ ఇవ్వడానికే ఇంత ఆలస్యం చేసి.. ఇన్ని వాయిదాలు వేసినవాళ్లు ఇక టీవీలు అందించడానికి ఇంకెంత ఆలస్యం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరొక్క రోజు ఆగితే ఫ్రీడమ్ టీవీల విషయం కూడా తెలిసిపోతుంది. -
మరో రెండు రోజుల్లో చౌక ఫోన్!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌకయిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లు రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. జూన్ 30 నుంచి డెలివరీ చేస్తామని కొనుగోలుదారులకు రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. అయితే జూన్ 28 నుంచి డెలివరీ చేస్తామని అంతకుముందు ప్రకటించింది. ఆలస్యానికి కారణాలు వెల్లడి కాలేదు. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తామని రింగింగ్ బెల్స్ నాలుగు నెలల క్రితం చేసిన ప్రకటించడంతో అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ఈ ఫోన్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిందరికీ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ గోయెల్ హామీయిచ్చారు. ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని హన్స వర్మ అనే యువతి చెప్పింది. రింగింగ్ బెల్స్ వెబ్ సైట్ లో పలుమార్లు ప్రయత్నించి ఫ్రీడమ్ ఫోన్ కోసం ఆర్డర్ నమోదు చేశానని వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ కింద తన పేరు నమోదు చేసుకున్నట్టు తెలిపింది. 'ముందుగా జూన్ 28న డెలివరీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరో రెండు ఆలస్యమవుతుందంటున్నారు. దీంతో రింగింగ్ బెల్స్ కంపెనీపై అనుమానం కలుగుతోంది. రూ.251 ఫోన్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. మరోసారి మోహిత్ గోయెల్ మాట మార్చరని భావిస్తున్నా'నని హన్స వర్మ పేర్కొంది. మొదటి విడత (2 లక్షల ఫోన్లు డెలివరీ చేస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ మాట నిలుపుకుంటుందో, లేదో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. -
251 రూపాయల స్మార్ట్ ఫోన్లు రెడీ
ప్రపంచంలోనే అత్యంత చౌకయిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లు రెడీ అయ్యాయి. దాదాపు 2 లక్షల మొబైల్ ఫోన్లను తయారు చేసినట్టు రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తామని రింగింగ్ బెల్స్ గతంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ గోయెల్ చెప్పారు. ఈ నెల 30 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని తెలిపారు. మొదటి విడత (2 లక్షల ఫోన్లు) డెలివరీ పూర్తయిన తర్వాత ఫోన్ల అమ్మకాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. 4 అంగుళాల, డ్యుయల్ సిమ్ ఫోన్లు నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమకు నష్టం వచ్చినా, పేదలకు, గ్రామీణులకు చౌకధరకు ఫోన్లు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. చౌకధరకు ఎల్ఈడీ టీవీలను ఫ్రీడమ్ పేరుతో అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. జూన్ 30లోపు 25 లక్షల స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేయాలని రింగింగ్ బెల్స్ కంపెనీ గత ఫిబ్రవరిలో యోచించింది. ఈ ఫోన్ల ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించగానే మూడు రోజుల్లోనే సైట్ క్రాష్ అయ్యింది. ఈలోపు ఏడు కోట్ల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకున్నారు. అప్పట్లో ఈ కంపెనీపై అనేక ఆరోపణలు వచ్చాయి. -
ఫ్రీడం రూ.251 ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
ముంబై: అతి చవకగా...రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఇటీవల సంచలనానికి తెరతీసిన రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవహారం గుర్తుందా. కోట్లాదిమంది ఎగబడి మరీ తమ పేర్లను నమోదు చేసుకున్న ఈ వివాదా స్పద ఫోన్లు ఎట్టకేలకు వినియోగదారులను మురిపించేందుకు రడీ అవుతున్నాయి. ఈ నెలలోనే ఆయా ఫోన్లను అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ 28వ తేదీ నుంచి తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ సోమవారం ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందజేస్తానని ప్రకటించి ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి బుకింగ్ చేసిన వారికి స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ప్రపంచంలోనే అతి చౌకగా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల విక్రయానికి గత ఫిబ్రవరిలో కంపెనీ ఆన్లైన్లో బుకింగ్‌కు ప్రకటన ఇచ్చింది. రూ.2,500 విలువైన స్మార్ట్ ఫోన్‌ను రూ.251కే అందిస్తున్నాని తెలిపింది. దీంతో ఫోన్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకోవడం, తదనంతర పరిణామాలు వివాదానికి దారి తీశాయి. చివరికి టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోక్యం చేసుకుని ఐటి శాఖను కల్పించుకోవాల్సిందిగా కోరారు. ఐటి దాడులు జరిగాయి. అనేక విమర్శలు కూడా వెల్లువెత్తడంతో పాటు కంపెనీ పైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరి మరోసారి వివాదానికి తెర తీస్తుందా.. లేక వినియోగదారులను ఆకట్టుకుని మరో సంలచనానికి దారితీస్తుందా? వేచి చూడాల్సిందే. -
ఫ్రీడమ్ 251 తయారీదారులకు ఊరట!
అలహాబాద్: ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీదారులకు శుక్రవారం అలహాబాద్ హై కోర్టులో ఊరట లభించింది. ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీ సంస్థ.. రింగింగ్ బెల్స్ ప్రతినిధులపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అప్రస్తుతమని అని తెలిపింది. రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్, కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దాపై భారతీయ జనతా పార్టీకి చెందిన కిరిట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చిలో దాఖలైన ఎఫ్ఐఆర్లో 420 సెక్షన్‌ను నమోదు చేశారు. అయితే వీరిపై సెక్షన్ 420 నమోదు చేయడానికి గల కారణాలు తెలపాలని కోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూషన్ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లు తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది. కోర్టు తీర్పుతో సంతృప్తిగా ఉన్నామని రింగింగ్ బెల్స్ సంస్థకు చెందిన అభిషేక్ విక్రమ్ వెల్లడించారు. సంస్థ ఉత్పత్తులను ఆలస్యం చేయాలనే దురుద్దేశంతోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కంపెనీకి సంబంధించిన ఇతర ఉత్పత్తులను ఇప్పటికే 28,000 యూనిట్లను అమ్మినట్లు ఆయన తెలిపారు. 251 రూపాయలకే కస్టమర్లకు స్మార్ట్ ఫోన్‌ను అందించడానికి భిన్న వ్యూహాలతో కంపెనీ ముందుకు పోతుందని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని విక్రమ్ తెలిపారు. -
ఫ్రీడం 251:రింగింగ్ బెల్స్ ఆఫీస్ క్లోజ్!
న్యూ ఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరుతో ఇండియాలో అత్యంత చౌకయిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు ఆర్డర్లు తీసుకున్న తయారీ సంస్థ రింగింగ్ బెల్స్‌కు సంబంధించిన నోయిడా కార్యాలయం బుధవారం మూసివేసి ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్‌కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది. అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు. రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్‌ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలున్న నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. -
రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి
న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదాల నేపథ్యంలో.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేస్తానని ప్రకటించిన తయారీ సంస్థ మంగళవారం నుంచి ఆ పనిని మొదలుపెట్టింది. సదరు ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. రూ.251 స్మార్ట్ ఫోన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేస్తామన్న తయారీ కంపెనీ ఇప్పటివరకు 14,800 మంది కస్టమర్లకు రూ.84 లక్షలను వెనక్కి ఇచ్చేసినట్లు అవెన్యూ ఇండియా సీఈవో విశాల్ పటేల్ 'ఎకనామిక్స్ టైమ్స్'కు తెలిపారు. కాగా రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ భారీ ప్రచారం చేసిన రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించింది. కంపెనీ, దాని ప్రమోటర్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ నోటీసుల్లాంటివేవీ జారీకాలేదు. ఆదాయ పన్ను విభాగం కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తుండటం తెలిసిందే. -
రింగింగ్ బెల్స్‌పై చీటింగ్ కేసు..!
న్యూఢిల్లీ: కేవలం రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటించి కొన్ని కోట్ల విలువైన పబ్లిసిటీని ఉచితంగా పొందిన రింగింగ్ బెల్స్ కంపెనీ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకుంది. ‘సైఫ్యూచర్’ సంస్థ రింగింగ్ బెల్స్ కంపెనీపై చీటింగ్ కేసు పెట్టే యోచనలో ఉంది. సైఫ్యూచర్ సంస్థ డేటా, బీపీవో సర్వీసులను అందిస్తుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు సంబంధించి భారత్‌లో కాల్ సెంటర్ సేవలను అందించడానికి సైఫ్యూచర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ తమకు చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించడం లేదని, ఇదేంటని అడిగితే సేవలు బాగోనందున, కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు రింగింగ్ బెల్స్ తెలిపిందని సైఫ్యూచర్ సంస్థ సీఈవో అనుజ్ బైరథి తెలిపారు. అయితే తమ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇలా ఏడాదిలోపు , ఎటువంటి నోటీసూ లేకుండా అర్థాంతర కాంట్రాక్టు రద్దు కుదరదని పేర్కొన్నారు. -
‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ ఫోన్స్ రాకపోతే..
చర్యలు తప్పవు: రవి శంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు అందించడంలో విఫలమైతే.. అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్ 251’ ఉదంతాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ ‘ఫ్రీడవ్ 251’ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా తయారు చేస్తుంది? రూ.251లకు ఆ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందా? బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా? లేదా? వంటి తదితర అంశాలపై తమ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోందని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ కూడా రింగింగ్ బెల్స్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పరిశీలిస్తోంది. -
రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!
న్యూఢిల్లీ: అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు. తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే 'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు. కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు. -
రింగింగ్ బెల్స్‌పై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: వివాదాస్పద చౌక స్మార్ట్‌ఫోన్ ‘ఫ్రీడం’ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కార్యకలాపాలపై ఎక్సైజ్, ఆదాయ పన్ను విభాగాలు దృష్టి సారించాయి. కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఐటీ విభాగం కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్, ఐటీ విభాగం అధికారులు వచ్చిన సంగతి వాస్తవమేనని, వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా పేర్కొన్నారు. ఫ్రీడం బ్రాండ్ పేరిట రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ఊదరగొట్టడం, దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవడం తెలిసిందే. మరోవైపు, ఈ చౌక స్మార్ట్‌ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం (డైటీ) కార్యదర్శి అరుణ శర్మను టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఫ్రీడం ఫోన్ ధరపై సందేహాలు లేవనెత్తుతూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య రాసిన లేఖకు స్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రీడం ఫోన్ విక్రయాలు తమపై ప్రభావం చూపబోవని మరో కంపెనీ డేటా విండ్ స్పష్టం చేసింది. ఫ్రీడమ్ 251 ఫోన్‌కి భారీ డిమాండ్ రావడంతో బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజున 2.47 కోట్ల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించింది. -
'ఫ్రీడం 251'తో లాభాలు కూడా వస్తాయట!
'ఫ్రీడం 251'.. ఇప్పుడు సాకేంతిక ప్రపంచంలో ఓ పెద్ద దుమారమే రేపుతోంది. అత్యాధునిక ఫీచర్లున్న 'త్రీజీ' స్మార్ట్‌ఫోన్‌ను అక్షరాల రూ. 251కే అందిస్తామంటూ ముందుకొచ్చిన రింగింగ్ బేల్స్ ప్రకటనపై ఇటు విమర్శలు అటు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్న స్మార్ట్‌ఫోన్ అంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు? నిజంగా రూ. 251కే ఇస్తారా? ఆ ధరకు స్మార్ట్‌ఫోన్ అమ్మడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇది సాధ్యమే అంటోంది రింగింగ్ బేల్స్ కంపెనీ. యాడ్‌కామ్ కంపెనీకి చెందిన ఐకాన్ 4 స్మార్ట్‌ఫోన్‌ను 'ఫ్రీడం 251'గా రీబ్రాండ్ చేసి అమ్ముతారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఐకాన్ 4' రూ. 4వేలకు లభిస్తున్నది. దీని ఉత్పత్తి ధర మొత్తంగా చూసుకుంటే రూ. 2,546గా ఉంటుందని ఒక అంచనా. ఈ మొత్తంలో పదిశాతానికే మొబైల్ ఫోన్ అందిస్తామంటోంది రింగింగ్ బేల్స్. ఇదెలా సాధ్యం? ఇదేమన్నా మార్కెటింగ్ జిమ్మిక్కా?.. అంటే దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆ కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం రూ. 251కే అందించాలన్న సంకల్పంతో తాము ఈ సాహసానికి సిద్ధమయ్యామని ఆయన తెలిపారు. ఎంతో పరిశోధన చేసి.. ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు. అర్ధరాత్రి దాబాలో ఐడియా! సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్ రూ. 2,300 లేదా రూ. 2,400లకు లభిస్తుందని, ఈ నేపథ్యంలో రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందించాలన్న ఆలోచన ఝాన్సీ హైవేలో అర్ధరాత్రి వేళ ఓ దాబా వద్ద తనకు, తన సహోద్యోగి మోహిత్ గోయల్ (రింగింగ్ బేల్స్ డైరెక్టర్)కు వచ్చిందని ఆయన చెప్పారు. వెంటనే డ్రాయింగ్ రూమ్‌కు వచ్చి ఈ ఆలోచనపై కసరత్తు చేశామని, తుది లెక్కల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ కనీస ధరను రూ. 800 వరకు తగ్గించవచ్చునని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. 'మేకిన్ ఇండియా'లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురావడం వల్ల 13.8శాతం సుంకం (దాదాపు రూ. 450 నుంచి రూ. 470 వరకు) భారం తగ్గే అవకాశముంది. ఇక భారీగా ఉత్పత్తి చేపట్టడం వల్ల వ్యయం గణనీయంగా తగ్గి రూ. 530 వరకు ఆదా అయ్యే అవకాశముంది. దీనికితోడు ఆన్లైన్ బుకింగ్స్ ద్వారానే అమ్ముతుండటంతో మార్కెటింగ్, అమ్మకాల కోసం పెట్టే ఖర్చు దాదాపు రూ. 460 వరకు ఆదా అవుతుంది. ఈ లెక్కల ఆధారంగా ఒక మొబైల్‌ఫోన్‌ను రూ. 800 కనీస ధరకు అందించడం సాధ్యమేనని ఆయన చెప్పారు. అయితే, ఈ కనీస ధరకు అమ్మకం ధర రూ. 251కి మధ్య భారీగానే తేడా ఉంది. అయితే ఈ వ్యత్యాసాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని ఆయన చెప్ప్తున్నారు. ఈ పద్ధతిలో 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామని, దీనివల్ల తమకు భారీగా లాభాలు రాకపోయినా.. సహేతుకమైన ఆదాయం, లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు అశోక్ చద్దా చెప్తున్నారు. తాము స్థాపించబోయే మార్కెట్ వేదికను 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్‌లో బిల్ట్ ఇన్ యాప్‌గా రూపొందిస్తామని, ఈ మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు భాగస్వామ్యులకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. -
'ఫ్రీడం 251'కు ఐదుకోట్ల రిజిస్ట్రేషన్లు!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే అమ్ముతామని చెప్తూ ముందుకొచ్చిన 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్ చుట్టూ ఎన్ని సందేహాలు ముసురుతున్నా.. రిజిస్ట్రేషన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. అంత తక్కువ ధరకు అసలు ఇస్తారా? లేదా? అని ఎన్ని ప్రశ్నలు చుట్టుముడుతున్నా.. దానిని కొనాలన్న ప్రజల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ కోసం కేవలం రెండురోజుల్లోనే ఐదు కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని రింగింగ్ బేల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా 25 లక్షల 'ఫ్రీడం 251' ఫోన్లను ప్రజలకు అందించాలని కంపెనీ నిర్ణయించిన నేపథ్యంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా కొనసాగించాలా? వద్దా? అనేది పునరాలోచిస్తున్నట్టు రింగింగ్ బేల్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా తెలిపారు. ఈ కారుచౌక మొబైల్ ఫోన్ ముందస్తు బుకింగ్ కోసం ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ తెరిచి ఉంచాలని కంపెనీ మొదట నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఐదు కోట్లకు రిజిస్ట్రేషన్లు చేరిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఇంకా కొనసాగించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తున్నామని అశోక్ చద్దా చెప్పారు. అత్యాధునిక త్రీజీ ఫీచర్స్ తో, ఆధునిక హంగులతో 'ఫ్రీడం 251' స్మార్ట్‌ఫోన్ ను రూ. 251కే అందిస్తామని ప్రకటించి మొబైల్ ఫోన్ మార్కెట్లో రింగింగ్ బేల్స్ కంపెనీ దుమారం రేపిన సంగతి తెలిసిందే. నరేంద్రమోదీ తలపెట్టిన 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే తాము కారుచౌక ధరకు మొబైల్ ఫోన్ అందివ్వనున్నట్టు ఆ కంపెనీ చెప్పుకొస్తున్నది. -
ఫ్రీడం 251 కంపెనీలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన మొబైల్ కంపెనీ రింగింగ్ బెల్స్ కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఆదాయపన్ను శాఖ అధికారులు నోయిడాలోని ఫీడ్రం 251 కంపెనీ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. సిబ్బందిని విచారించారు. ఈ విషయం తెలిసి.. ఫోన్ బుక్ చేసుకున్న వందలాది మంది వినియోగాదారులు రింగింగ్ బెల్స్ కార్యాలయం ముందు గుమిగూడి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కాగా నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఫోన్ ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించింది.. 'ఫ్రీడమ్ 251'గా పేర్కొన్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ. 251 అంటూ ప్రకటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. కేంద్రం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింన సంగతి తెలిసిందే. -
సగం ఫోన్ కూడా కొనచ్చా?
మనం ఆన్లైన్లో ఏమైనా కొనాలంటే ఎన్ని కావాలనే 'క్వాంటిటీ' అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందులో కనీసం 1 నుంచి మొదలుపెట్టి, మనకు ఎన్ని కావాలో చెప్పాలి. సాధారణంగా ఫోన్లలాంటివి అయితే ఒక ఈమెయిల్ ఐడీ నుంచి ఒకటి కంటే ఎక్కువ కొనే అవకాశం ఉండదు కాబట్టి కేవలం 1 అనే అంకె మాత్రమే అక్కడ వేయాల్సి ఉంటుంది. కొన్ని ఈ-కామర్స్ సైట్లయితే డీఫాల్ట్‌గానే 1 అనే క్వాంటిటీ అక్కడ పేర్కొంటాయి. దాన్ని మార్చడానికి కూడా ఉండదు. అదే, ఇతర వస్తువులు గానీ, దుస్తులు గానీ అయితే ఒకటి కంటే ఎక్కువ కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. ఎప్పుడైనా సగం వస్తువు ఆర్డర్ చేయడానికి మీరు ప్రయత్నించారా? అసలు అలా కుదురుతుందో లేదో చూశారా? భారతదేశాన్ని.. ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని ఊదరగొడుతున్న 'ఫ్రీడం 251' ఫోన్ మాత్రం సగం కూడా బుక్ చేయొచ్చట. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులు గుర్తించారు. వాస్తవానికి వెబ్సైట్ రూపకల్పన చేసేటప్పుడే.. దానికి సంబంధించిన ఆల్గరిథమ్ సరిగ్గా రూపొందించుకోవాలి. 'మినిమమ్' అనే లాజిక్ ఒకటి ఇవ్వాలి. కానీ అది సరిగా ఇవ్వకపోవడంతో ఇలా సగం ఫోన్ కూడా బుక్ చేసుకోడానికి 'ఫ్రీడమ్ 251' అవకాశం కల్పించిందని తెలుస్తోంది. మళ్లీ సైట్ గోవిందా తొలిరోజు గురువారం నాడు సెకనుకు 6 లక్షల మంది తమ సైట్‌ను సందర్శించారని, అంత భారాన్ని సెర్వర్లు తట్టుకోలేకపోవడం వల్లే అది పనిచేయకుండా పోయిందని రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ శుక్రవారం కూడా సైట్ సగం సగమే పనిచేసింది. ఉదయం కాసేపటి వరకు బాగానే ఉండి, బుకింగ్ కూడా అయింది గానీ.. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రయత్నించినవాళ్లకు సైట్ మొత్తం ఖాళీగా తెల్లగా కనిపించడం మొదలైంది. అసలు ఎలాంటి ఎర్రర్ మెసేజి గానీ, అక్కడి నుంచి రీడైరెక్ట్ కావడం గానీ ఏమీ లేదు. దాంతో వినియోగదారులు విసుగెత్తి ఊరుకున్నారు. -
రూ.251 ఫోన్‌కు ఆర్డరిచ్చే ముందు జాగ్రత్త!
నోయిడా: ఆశ.. దోశ.. అప్పడం.. వడ అన్నతీరుగా ఉంది రింగింగ్ బెల్స్ కంపెనీ వ్యవహారం. కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ విడుదల చేసి మొబైల్ రంగాన్ని ఓ కుదుపుకుదిపేసినట్లు కనిపించిన ఆ సంస్థ గురువారం చేతులెత్తేసి విమర్శలు రావడంతో తిరిగి శుక్రవారం ఫోన్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. బుధవారం ఈ ఫోన్ విడుదల చేసిన ఆ సంస్థ తమ ఫోన్ బుకింగ్లకోసం అనూహ్య స్పందన వచ్చిందంటూ బుకింగ్ అవకాశాలను గురువారం తాత్కాలికంగా నిలిపేసింది. అయితే, ఇలా నిలిపేయడంపట్ల సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే, శుక్రవారం ఈ ఫోన్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిది. బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి 1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదు. 2. మొబైల్ ఫోన్ షిప్పింగ్‌కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందని మాత్రం అనుకోలేం. 3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు. 4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. 5. ఈ ఫోన్లు కేవలం భారత్‌లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు. -
రూ.251 ఫోను.. రెండువేల లొసుగులు!!
♦ ఉదయం 6 గంటలకే మొరాయించిన వెబ్సైట్ ♦ 30వేల మొబైల్స్‌ను విక్రయించామని చెబుతున్న కంపెనీ ♦ సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయన్న సంస్థ ♦ ఈ రేటుతో నష్టమే... ‘వినూత్న’ పద్ధతుల్లో అధిగమిస్తామని వెల్లడి సాక్షి బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి అత్యాధునిక ఫీచర్లున్న త్రీజీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.251కే విక్రయిస్తానని చెప్పిన రింగింగ్ బెల్స్ సంస్థ తొలిరోజే చేతులెత్తేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచీ తన వెబ్సైట్లో వీటిని బుక్ చేసుకోవచ్చని సంస్థ చెప్పటంతో... ఫోనొస్తుందో రాదో అని అనుమానాలున్నా... పోనీ రూ.251 మాత్రమేగా!! అనుకుంటూ లక్షల మంది బుక్ చేయటానికి ప్రయత్నించారు. కాకపోతే మొదట పేరు, చిరునామా వివరాలు నింపిన తరవాత... చివరగా పేమెంట్ బటన్ దగ్గర ప్రెస్ చేయగా... మళ్లీ వివరాలు నింపాలంటూ రావటం అందరికీ పట్టలేని చిరాకు తెప్పించింది. ‘‘నేను 251 సార్లు నా వివరాలు నింపా... 251 సార్లు సబ్మిట్ చేశా. 251 సార్లు పేమెంట్ బటన్ నొక్కా... అయినా బుకింగ్ కాలేదు’’ అని ఒకరు... ‘‘బుక్ చేశా... వీకెండ్‌కు రైలు టికెట్‌ని’’ అని మరొకరు... ఇలా ట్విటర్లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఇక రింగింగ్‌బెల్స్ సంస్థ మాత్రం... 30వేల బుకింగ్‌లు తీసుకున్నామని, దేశీ యంగా తయారీకి ప్లాంటు పెడతామని, తయారు చేసిన అనంత రం వీరికి డెలివరీ చేస్తామని చెప్పింది. ‘ఎన్డీటీవీ’ ఇంటర్వ్యూలో సంస్థ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సెకనుకు 6 లక్షల హిట్స్ వచ్చాయి. దాన్ని మా సర్వర్లు తట్టుకోలేకపోయాయి. అందుకే 30వేల బుకింగ్‌లే తీసుకోగలిగాం’’ అన్నారాయన. ట్విటర్ సందేశాలు చూసినపుడు మాత్రం ఒక్కరు కూడా తాము ఫోను బుక్ చేసినట్లు పేర్కొనకపోవటం గమనార్హం. అంత చీప్‌గా ఎలా ఇస్తామంటే... రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్ చద్దా మాట్లాడుతూ... ఫోను ఖరీదు రూ.2,500 వరకూ అవుతోందని, తమకు దీనిపై నష్టమేనని చెప్పారు. ‘‘మేం భారీగా విక్రయాలు చేయటం ద్వారా, దేశీయంగా తయారు చేయటం ద్వారా, డిస్ట్రిబ్యూషన్‌కు వినూత్న మార్గాలు అనుసరించటం ద్వారా దీన్ని అధిగమిస్తాం’’ అని చెప్పారు. నిజానికి దేశీయంగా తయారు చేయడానికి ఈ సంస్థకు ప్లాంట్లేమీ లేవు. దేశీయంగా ప్రస్తుతం ఏ కంపెనీ సెల్‌ఫోన్ పరికరాలు తయారు చేయటంలేదన్నది కూడా ఇక్కడ గమనార్హం. మరో 24 గంటల్లో మళ్లీ బుకింగ్‌లు మొదలెడతామని పేర్కొంది. బుక్ చేసినవారికి జూన్‌లో డెలివరీ చేస్తామనటం గమనార్హం. రూ.999కే ఇవ్వలేని డేటావిండ్! దేశంలో ఇలా చీప్‌గా ఇస్తామని చేసిన ప్రకటనలు ఇప్పటికే ఫెయిలయ్యాయి. 10 డాలర్లలోపు ల్యాప్‌టాప్ తెస్తామని 2008లో ప్రభుత్వం ప్రకటించింది. తీరా అది తయారయ్యేసరికి ధర 100 డాలర్లయింది. ఆ తరువాత 20డాలర్లలోపు ధరకే ఆకాశ్ ట్యాబ్లెట్లు ఇస్తామంటూ డేటావిండ్ ప్రకటించింది. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా తీసుకుంది. కానీ ఆ సబ్సిడీ డబ్బు, ఇటు బుకింగ్‌ల డబ్బు అన్నీ తీసుకుని చేతులెత్తేసింది. ఇదే డేటావిండ్ సంస్థ... రిలయన్స్‌తో జట్టుకట్టి రూ.999కే స్మార్ట్‌ఫోన్ తెస్తామని గతంలో ప్రకటించింది. ఏడాదైనా ఇది రాలేదు. మెటీరియల్ ధరే రూ.2,700: ఐసీఏ నిజానికి ఈ కంపెనీ చెప్పిన స్పెసిఫికేషన్లతో ఫోన్ విక్రయించాలంటే కనీసం రూ.4,000 ధర ఉండాలి. కాకపోతే రూ.251కే ఫోన్ విక్రయిస్తామంటూ... ఆ మోడళ్లను కొన్ని పత్రికలకు కంపెనీ పంపింది. కాకపోతే అవన్నీ వేరే కంపెనీల ఫోన్లు. అదేమంటే.. అసలు ఫోన్ వేరే ఉంటుందని పేర్కొంది. దీన్లో నిజానిజాలను తెలుసుకోకుండానే.. రూ.251కే స్మార్ట్‌ఫోన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది. 3 రోజుల కిందటి వరకూ ఎవ్వరికీ తెలియని ఈ కంపెనీ.. ఒక్కసారిగా హాట్టా పిక్ అయిపోయింది. వందల కోట్ల విలువైన ప్రచారాన్ని ఫ్రీగా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కంపెనీకి బ్రాండ్ వచ్చింది కనక పెట్టుబడులు రావటంకష్టమేమీ కాదని, ఆ డబ్బుతో ప్లాంటు పెట్టి భవిష్యత్తులో ఖరీదైన ఫోన్లు అమ్మే అవకాశముందని ఓ విశ్లేషకుడు చెప్పారు. ప్రస్తుత బుకింగ్‌లకూ ఫోన్లు డెలివరీ చేయకపోవచ్చని, అసలు బుకింగ్‌లే తీసుకుని ఉండకపోవచ్చని చెప్పారాయన. దీనిపై ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ బుధవారం ప్రభుత్వానికి హెచ్చరిక చేయగా... దాంతో ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గైర్హాజరయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను ఐసీఏ కోరింది. -
సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!
ఫ్రీగా వస్తోందంటే చాలు.. దేనికైనా వెంటపడతారు. వేల రూపాయల విలువైన వస్తువు వందల్లోనే వస్తోందన్నా అంతే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అయ్యింది. దాదాపు రూ. 3-4 వేల ఖరీదుచేసే స్మార్ట్‌ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామని చెప్పేసరికి జనం ఒక్కసారిగా ఆ సైట్ మీద పడ్డారు. ఒక్క సెకనులోనే 6 లక్షల హిట్లు రావడంతో దెబ్బకి ఫ్రీడమ్251 వెబ్సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పడంతో, ఒక్కసారిగా నెటిజన్లు ఆ సైట్ మీద పడ్డారు. దాంతో తమ సైట్ క్రాష్ అయ్యిందని రింగింగ్ బెల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుతమైన స్పందన కనబర్చినందుకు థాంక్స్ అని, అయితే ఇంత భారాన్ని తట్టుకోలేక తమ సెర్వర్లు మూలపడ్డాయని ఆ సంస్థ తెలిపింది. తమ సెర్వర్ అప్‌గ్రేడ్ చేసుకుని, 24 గంటల్లో మళ్లీ వస్తామని చెప్పింది. 4 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామనడంపై పలు వర్గాల నుంచి సందేహాలు వెల్లువెత్తాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ తొలుత ప్రకటించింది. జూన్ 30వ తేదీ నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామని అంటూ.. డెలివరీ చార్జీల కింద మరో రూ. 40 కూడా వసూలు చేస్తోంది. -
'ఫ్రీడం 251'.. గూడుపుఠాణి ఏంటో తేల్చండి!
న్యూఢిల్లీ: కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నోయిడాకు చెందిన ఓ కంపెనీకి ముందుకురావడంపై మొబైల్ ఫోన్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సత్యాసత్యాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ (ఐసీఏ) లేఖ రాసింది. ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చినా స్మార్ట్‌ఫోన్‌ను రూ. 3,500 కన్నా తక్కువ ధరకు అమ్మడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామనడం వెనుక ఉన్న రహస్యాలేమిటో వెలికితీయాలని ఐసీఏ తన లేఖలో కోరింది. ఈ మొబైల్ అమ్మకం వ్యవహారంలో పలు వివాదాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ చౌకైన మొబైల్ ఫోన్ ఆవిష్కరణకు ప్రభుత్వ పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరుకావడాన్ని తప్పుబట్టింది. అత్యాధునిక ఫీచర్స్ ఉన్న త్రీజీ ఫోన్ 'ఫ్రీడం 251'ను రూ. 251కే అందిస్తామంటూ రింగింగ్ బేల్స్ కంపెనీ బుధవారం దీనిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్ ప్రాడక్ట్‌ను రూపొందించడానికి కనీసం చౌక ఉత్పత్తి ధర 40 డాలర్లు (రూ. 2,700) అవుతుందని, దీనికి పన్నులు, సుంకాలు, పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్ కలుపుకొంటే.. కనీసం ఎంతలేదన్న రూ. 4,100 ధర అవుతుందని, దీనిని ఎలా రూ. 251కి అందిస్తారని ఐసీఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహిందరో తన లేఖలో పేర్కొన్నారు. ఇలా చౌక ధరకు అందిస్తామనడం ప్రస్తుతం బూమ్ మీద ఉన్న భారత మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్‌ను దెబ్బతీయడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.