temparatures
-
ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. పలు చోట్ల జల్లులకు ఛాన్స్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. బుధ, గురువారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాదు కోస్తా రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. రేపు ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని అంచనా వేస్తోంది. గడిచిన రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో దాదాపు నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అయ్యింది. అయితే.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అనంతలో అత్యధికంగా 40.3.. నంద్యాలలో 40 డిగ్రీలు విశాఖలో అత్యల్పంగా 35.4°డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు మంగళవారం ఏపీలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 53 మండలాల్లో వడగాలులు వీచాయి. బుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. -
నిప్పుల కొలిమి
ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. రివాజుగా జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు. కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే. అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
ఏపీ: తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాలం వచ్చినా.. వేసవి తాపం నుంచి భారత్ ఊరట పొందడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినా కూడా పలు రాష్ట్రాల్లో ఇంకా తొలకరి పలకరింపు జరగలేదు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో తీవ్ర నుంచి అతితీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా వర్షాలు పడినప్పటికీ.. చాలావరకు ఆయా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలనైతే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఏపీ విషయానికొస్తే.. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో మరీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. పెద్దలు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. అవసరమైతేనే బయటకు రావాలని, డీహైడ్రేషన్ నేపథ్యంలో దాహం వేయకున్నా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. ఇక బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ. బిపర్జోయ్ తుపాను బలహీనపడడం, మరో 12 గంటలపాటు పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుండడంతో.. రేపు సాయంత్రానికిగానీ, ఎల్లుండికిగానీ ఏపీలో రుతుపవనాల ప్రభావం కనిపించొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇదీ చదవండి: జూన్ మూడోవారంలోనూ నిప్పుల కొలిమిలా తెలంగాణ -
తెలంగాణలో ఇక భానుడి భగభగలు.. జైనలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలతో రాష్ట్రం హీటెక్కింది. గురువారం రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావాలతో గత పక్షం రోజులుగా నడి వేసవిలోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండ్రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం మరింత పెరిగి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా జైనలో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 44.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చని వివరించింది. -
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
తెలుగు రాష్ట్రాల్లో చలి.. మరింత పెరిగే ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటి పూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. శనివారం(ఇవాళ), ఆదివారం చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో వికారాబాద్ పరిధిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంత్లానూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. పోను పోను మరింతగా చలి ప్రభావంగా మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల ప్రజలు గత వారంగా స్వెట్టర్లు, మంకీ క్యాప్స్‌పై ఆధారపడుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది చలి కాలంలో రికార్డు స్థాయిలో లో-టెంపరేచర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక గుండె జబ్బులు, అస్తమా, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు సాధ్యమైనంత వరకు మార్నింగ్ వాకింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని పేరెంట్స్‌కి సూచిస్తున్నారు. -
ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!
మార్చి నెలంటే మనకు వేసవి కాలమేమీ కాదు. కానీ ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల నాటి రికార్డు స్థాయి అత్యధిక ఉష్ణోగ్రతలు దేశంలో నమోద య్యాయి! ఇప్పుడు మార్చిలో లేము. ఏప్రిల్ నెలనూ దాటేసి, మే లోకి ప్రవేశించాం. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుం టోంది. మనుషులు, పశుపక్ష్యాదులు, పంటలు, వ్యాపారాలపై వేడిమి తన ప్రభావాన్ని చూపిస్తోంది. వడగాలులు ఈడ్చి కొడుతున్నాయి. పెరిగిన వేడిమి కారణంగా విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యం అవుతున్నాయి. వేసవి ఇలానే ఉంటుందని అనుకోవడం పొరపాటు. వేసవి వేరు, వేసవి వేడి పెరగడం వేరు. ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ప్రభుత్వ విధాన ప్రతిస్పందన అవసరం. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో... ముఖ్యంగా వాయవ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలకు పెరిగింది. కొన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45–50 సెల్సియస్ డిగ్రీల మధ్య కూడా ఉంటూ అత్యుష్ణ ప్రాంత పరిస్థితుల్ని తలపిస్తున్నాయి. వాయవ్య, మధ్య భారతదేశంలో మహోగ్రమైన వేసవి కాలాలు కొత్తవేమీ కాదు. అయితే వేసవి కాల ప్రారంభ వారాల్లోనే ఉష్ణోగ్రత మితిమీరి పెరగడం, దానికి దీర్ఘకాల పొyì వాతావరణం తోడవటం ఆందోళనకరంగా పరిణమించింది. పెరిగిన వేడిమి కారణంగా విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఏర్ప డింది. ఫలితంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అని వార్యం అవుతున్నాయి. ఇందుకు కారణం థర్మల్ విద్యుత్ కేంద్రా లకు బొగ్గు సరఫరాలో తలెత్తుతున్న సమస్యలేనని చెబుతున్నారు. మహా నగరాల్లో ఇప్పటికే కూలర్లు, ఎయిర్ కండిషనర్ల కొరత; చిన్న నగ రాలు, పట్టణాలలో నీటి ఎద్దడి మొదలైంది. అయితే వీటన్నిటినీ వేసవికాల సాధారణ పరిణామాలుగా పరిగణించడం తప్పు. వేసవి వేరు, వేసవి వేడి పెరగడం వేరు. అధికమౌతున్న ఉష్ణోగ్రత మానవ ఆరోగ్యానికి, పశుగణానికి, ఇతర జీవ రాశులకు, పంటలకు, వ్యాపా రాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణా త్మకమైన ప్రభుత్వ విధాన ప్రతిస్పందన అవసరం. ఉష్ణ దీవులుగా పట్టణాలు! తొలి అడుగుగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజ్ఞాన శాస్త్రాన్నీ, మున్ముందు అందుబాటులోకి రానున్న ఏకాభిప్రాయ శాస్త్ర పరిజ్ఞా నాన్నీ స్వీకరించడం. వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐ.పి.సి.సి. (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) దేశంలోని అన్ని ప్రాంతాలలో వడగాలుల విస్తృతి, తీవ్రత పెరుగుతోందనీ; వేసవులు దీర్ఘంగా, శీతాకాలాలు చిన్నవిగా మారబోతాయనీ అదే పనిగా హెచ్చరిస్తూ వస్తోంది. భూతాప స్థాయి 2 సెల్సియస్ డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యానికి, వ్యవసా యానికి ఉండే సహన పరిమితులను చేరుకుంటాయని చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో ఐ.పి.సి.సి. అప్రమత్తం చేసింది. భూతాపం వల్ల ఉష్ణ వ్యవస్థలో సంభవించే మార్పుల ప్రభా వంతో సముద్రపు ఆమ్లీకరణ పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ దేశాల్లో ఉష్ణస్థితుల సమాచా రాన్ని బట్టి చూస్తే పట్టణ ప్రాంతాలలో తీవ్ర తరమౌతున్న వడగా లులు ఆ ప్రాంతాలను ఉష్ణ దీవులుగా మార్చే ప్రమాదం కనిపిస్తోం దని ఐ.పి.సి.సి. ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణంలోని మార్పు లను అంచనా వేస్తుండే ‘ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్’ సంస్థ లెక్కల ప్రకారం వార్షిక సగటు ఉపరితల వాయు ఉష్ణోగ్రత పెరుగుదల 1.7–2 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉంటోంది. వాతావరణ మార్పులపై శాస్త్ర అధ్యయనాలు, ఉష్ణోగ్రతల తీవ్రత సహా, ఇతర వాతావారణ మార్పులపై శాస్త్ర అధ్యయనాల వెల్లడిం పులు స్పష్టంగానే ఉన్నాయి. ప్రతి వడగాలినీ వాతావరణ మార్పు లకు ఆపాదించి చూడటానికి ‘ఆపాదన శాస్త్రం’ (ఆట్రిబ్యూషన్ సైన్స్) మరింతగా అభివృద్ధి చెందవలసి ఉంది. అయితే మానవ ప్రమేయం వల్ల సంభవించే వాతావరణ మార్పులకూ... తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలుల ఉద్ధృత దశలకూ సంబంధం ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి ఆపాదింపుల అవసరం ఉండదు. ఉష్ణ హానికి చేరువలో పేదలు రెండో అడుగు, వడగాలుల ప్రతికూల ప్రభావానికి గురయ్యే జన సమూహాలను గుర్తించడం, ఆ సమూహాలను కాపాడేందుకు అవస రమైన రక్షణ చర్యలను తక్షణం చేపట్టడం. దేశంలో ప్రస్తుతం వడ గాలులు వీస్తున్న రాష్ట్రాలు, జిల్లాల దుర్బలత్వ ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకు సహాయపడే నమూనా ఒకటి.. కొన్ని ప్రాజెక్ట్‌ల రూపంలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఉదాహరణకు, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐ.ఐ.పి.హెచ్.) ఒడిశాలో జరిపిన ఒక అధ్యయనంలో – మురికివాడల్లో నివసించే ప్రజల గృహ నిర్మాణ పద్ధతి, పైకప్పులో ఉష్ణాన్ని ఒడిసిపట్టేందుకు ఉపయోగించే ఆస్బె స్టాస్, తగరం వంటి పదార్థాలు, అవాసాల రద్దీ; విద్యుత్, నీటి సరఫరా లేకపోవడం, వంట సమయంలో అదనపు వేడి వెలువడటం వంటి కారణాలతో ఉష్ణ్రోగ్రత దుష్ప్రభావాలకు గురవుతున్నారని స్పష్టమయింది. ఆ క్రితం గుజరాత్లో గాంధీనగర్‌లోని ఐ.ఐ.పి.హెచ్. చేసిన అధ్యయనం కూడా ఉష్ణోగ్రతలకు తేలిగ్గా లోనయ్యే దుర్బల ప్రదేశాలలో తీసుకోవలసిన జాగ్రత్తల్ని సూచించింది. ప్రస్తుతం దేశంలోని 640 జిల్లాల్లో 10 జిల్లాలు ఉష్ణోగ్రతల రీత్యా ‘మిక్కిలి ప్రమాదం’లో ఉన్నాయనీ, మరో 97 జిల్లాలు ‘అత్యధిక ప్రమాదం’లో ఉన్నాయనీ ఐ.ఐ.పి.హెచ్. నిర్ధారించింది. ఈ ప్రమాదభరిత ప్రదేశా లన్నీ ఎక్కువ భాగం మధ్య భారతదేశంలోనే ఉన్నాయి. బయటి ఉష్ణోగ్రతను నిర్ణయించే భౌగోళికత, వృక్ష సంపద, గాలి వేగం మొదలైనవాటిని; మానవ ఆవాసాలలో లోపలి ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే వెంటిలేషన్, రూఫింగ్ వంటి అంశాలను పరిగణన లోకి తీసుకుని దుర్బలత్వాన్ని అంచనా వేయడం జరగుతుంది. నగరాల్లో కొన్ని ప్రాంతాలు అక్కడే ఉన్న మరికొన్ని ప్రాంతాల కన్నా అత్యధిక ఉష్ణోగ్రతల్ని కలిగి ఉండొచ్చు. ఉష్ణహానిని తగ్గించడానికి అటువంటి వేడి ప్రదేశాలన్నిటినీ గుర్తించాలి. వేడి ఒత్తిడిని అనుభవిం చేది కేవలం మనుషులే కాదు. పంటలు, పశువులు కూడా ప్రతి కూలంగా ప్రభావితమవుతాయి. వేడి ఒత్తిడి పాల ఉత్పత్తిని కూడా దెబ్బతీస్తోంది. చల్లబడిన ‘హీట్ యాక్షన్ ప్లాన్’! వాతావరణ మార్పులపై దాదాపు 15 సంవత్సరాలుగా అమలులో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్రణాళికలు.. తీవ్ర ఉష్ణోగ్రతల్ని మానవాళి ఎదు ర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొన్నప్పటికీ.. వాటి వల్ల కని పిస్తున్న మార్పేమీ ఉండటం లేదు. కొన్ని నగరాల మునిసిపాలిటీలు ‘హీట్ యాక్షన్ ప్లాన్’లను సిద్ధం చేయడానికి చొరవ తీసుకున్నప్పటికీ అమలులో జాప్యం జరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత సంవ త్సరం వేడి సంబంధిత వ్యాధులపై జాతీయ కార్యాచరణను రూపొం దించింది. ఉష్ణోగ్రత వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలను నమోదు చేసి, వాటిని సమగ్ర వ్యాధుల నిఘా కార్యక్రమానికి నివేదించాలని రాష్ట్రాలను కోరింది. అయినప్పటికీ, అంతర్వ్యూహ ఉష్ణ స్థితిస్థాపకత విధానం అంటూ ఏర్పడలేదు. మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యలను స్పష్టంగా వివరించే జాతీయ ఉష్ణమాపక కార్య ప్రణాళిక కూడా లోపించింది. వేడి ప్రభావాలను తగ్గించడానికి కొత్త సాంకేతికతల్ని, పరిష్కారా లను అభివృద్ధి చేయడానికి మనకొక లక్ష్య సాధన వ్యూహం నేటి తక్షణావసరం. వడగాలుల అంచనాలు, హెచ్చరికలపై సమాచారాన్ని సుల భంగా అర్థమయ్యే రీతిలో, భాషలో మనం ప్రజలకు చేర్చాలి. నిర్మాణ, గ్రామీణ ఉపాధి, విద్యాసంస్థలు వంటి నిర్దిష్ట రంగాలలో సాధారణ ప్రజలకు, సంస్థల యజమానులకు వారు చేయవలసిన పనుల జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వం తగిన ప్రచారం కల్పిం చాలి. పైకప్పులను పెయింటింగ్ చేయడం లేదా రూఫింగ్ కోసం వేడి–శోషక పదార్థాల వాడకాన్ని నివారించడం, గాలి తేలిగ్గా చొరబడి వీచేలా క్రాస్–వెంటిలేషన్ కోసం కిటికీలను అమర్చడం వంటి సాధారణ పరిష్కారాలు ఆవాసాల లోపలి ఉష్ణోగ్రతలను తగ్గించ గలవు. ఈ తరహా పరిష్కారాలను పునరావృతం చేయడంలో స్థానిక సమూహాలు, పౌర సమాజాన్ని నిమగ్నం అయ్యేలా చేయగలిగితే ఉష్ణాన్ని నియంత్రించే లక్ష్యానికి మనం చాలా దగ్గరికి వెళ్లొచ్చు. వ్యాసకర్త: దినేశ్ సి. శర్మ విజ్ఞానశాస్త్ర వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పగలూ రాత్రీ సెగలే..వాతావరణశాఖ హెచ్చరిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటానికి తోడు వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీలకుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వడగాడ్పులతో జాగ్రత్త..: ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జనం పగటి పూట దూరప్రయాణాలు మానుకోవాలని.. వృద్ధులు, పిల్లలు బయటికి రాకపోవడమే మంచిదని సూచించింది. వడగాడ్పులు, ఎండ వేడిమి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఇప్పటికే ఎన్సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఏప్రిల్‌లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపింది. ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలకు సంబంధించిన జాతీయ కార్యాచరణ (నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్)లోని అంశాలపై ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. పలుచోట్ల ఈదురుగాలుల వానలు తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని.. దాని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. -
చీకటి పడితే గజగజ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ.. రాత్రిళ్లు మాత్రం చలి గజగజ వణికిస్తోంది. గత మూడ్రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. ఇదే స్థాయిలో కొనసాగితే పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. గతేడాది ఇదే సమయంలో పగలు, రాత్రి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అయితే గత సంవత్సరం రాష్ట్రంలో సాధారణ వర్షాలే కురిశాయి. కానీ ఈసారి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 18 జిల్లాల్లో అతిభారీ వర్షపాతం, 9 జిల్లాల్లో భారీ వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులతోనే ఉష్ణోగ్రతల నమోదులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 9 డిగ్రీలు పతనం.. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఈసారి చలి తీవ్రత భారీగా ఉండే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 12 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తోంది. ఇందులో ఖమ్మం మినహా మిగతా 11 కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల్లోపే నమోదు కావడం గమనార్హం. పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఖమ్మంలో గరిష్టంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో 32 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈనెల మొదటి వారంలోనే చలి పెరగడంతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. బేలలో 10.3 డిగ్రీలు.. రాష్ట్రంలో పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 10.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా కుబీర్‌లో 10.6 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 11.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 11.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా మథూర్‌లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 12 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. -
ఇందూరు కుతకుత
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఇందూరు జిల్లా కుతకుత ఉడుకుతోంది.. ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమవుతోంది. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పది గంటల తర్వాత నిప్పులు కురిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. భానుడి ప్రతాపానికి జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం జిల్లాలో సగటున 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో 45.2 డిగ్రీలుగా నమోదైంది. మిగతా మండలాల్లోనూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, వడ గాలులు దడ పుట్టిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉదయం 10 గంటలకే భయకరమైన వేడి వడ గాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే గడప దాటుతున్నారు. ఎండ తీవ్రత పెరగడం, జనం బయటకు వచ్చేందుకు భయపడుతుండడంతో ఉదయం పది గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం ఐదారు గంటలకు రహదారులు బోసి పోతున్నాయి. -
భానుడి భగభగ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా జనాలు ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ఇంట్లో ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కూలర్లు, ఏసీలకు అతుక్కుపోయారు. గతేడాది కంటే ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం జిల్లాలో 40 డిగ్రీల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే లాక్డౌన్ ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో రైతులు పంట పొలాల్లో పనులను చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధిహామీ పనులు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు.. మండుతున్న ఎండలు గతేడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంటుండడంతో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం చిరుజల్లులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పూరి గుడిసెల్లో ఉండేవారు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో వారికి ఎండ తీవ్రత కనిపించడం లేదు. ఉక్కపోత భరించలేక కూలర్లు, ఏసీలు అధికంగా వినియోగిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బారికేడ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతనెలలో కురిసిన అకాల వర్షం కారణంగా పలు మండలాల్లో మొక్కజొన్న, జొన్న, శనగ పంటలతో పాటు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు. జాగ్రత్తలు పాటించాలి ప్రస్తుతం ఎండ అధికమవుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. లాక్డౌన్ దృష్ట్యా ఇండ్లకే పరిమితం కావాలి. అత్యవసరమైతే ఎండ నుంచి రక్షణ పొందేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దు.– డాక్టర్ రమ, ఆదిలాబాద్ -
ఉష్ణోగ్రతలు కోవిడ్‌పై ప్రభావం చూపవు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా కరోనా ప్రభావం తగ్గదు. మారుతున్నవాతావరణ పరిస్థితులకనుగుణంగా వైరస్ రూపాంతరం చెంది మరింత బలపడే అవకాశాలున్నాయి. కోవిడ్‌కు.. ఉష్ణోగ్రతలకు అసలు సంబంధమే లేదు. మ్యూటేటెడ్ వైరస్ అయిన కరోనా ఎలాంటి కాలంలోనైనా తట్టుకుని బతికే అవకాశాలున్నాయని కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ పోరిక శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎండలు తీవ్రమైన కొద్దీ వైరస్ తన శక్తిని కోల్పోతుందనే భావనతగదని, రానున్న కొద్దిరోజులు ప్రజలు మరింత అప్రమత్తంగాఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మరో రెండువారాల పాటు లాక్డౌన్ పొడిగింపే శ్రీరామరక్షణ అని, తెలంగాణలో వైరస్ థర్డ్‌స్టేజీకి చేరలేదన్నారు. లోకల్ ట్రాన్స్మిషన్ చైన్లింక్ను విజయవంతంగా విడగొట్టామన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. గాంధీ ఆస్పత్రి: కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు అటాప్సీ చేస్తే వైరస్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ అనుమతితోపాటు నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాలి. అటాప్సీతో కరోనా వైరస్ మానవ శరీరంలో ఏయే అవయవాలపై ఎంత ప్రభావం చూపించింది, మృతికి నిర్దిష్టమైన కారణం, వైరస్ బలం, బలహీనతలను అంచనా వేసే అవకాశం ఉంటుంది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో కరోనా మృతదేహాలను హైపోక్లోరైడ్, లైజాల్ వంటి ప్రత్యేకమైన ద్రావణాలతో శుభ్రపరిచి, ఇతరులకు వైరస్ వ్యాపించకుండా జిప్బ్యాగ్లో సీల్ చేసి కుటుంబసభ్యులకు అందిస్తున్నాం. గాంధీలో మూడు సేప్టీ టన్నెల్స్ కోవిడ్ బాధితులు, అనుమానితులతో పాటు సుమారు 1500 మంది వైద్యసిబ్బంది, మరో 200 మంది పోలీసులు గాంధీ ఆస్పత్రికి రాకపోకలు సాగిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా మూడు సేప్టీ టన్నెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. ఉపశమనానికి ప్రత్యేక ప్రణాళికలు గాంధీ వైద్యులు, సిబ్బంది, ఇతర అ«ధికారులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారు. దీని నుంచి వారికి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాం. వైద్యులు, సిబ్బందిని మూడు గ్రూపులుగా విభజించాం. ఒక గ్రూప్‌కు రెస్ట్ ఇచ్చి మిగిలిన వారు విధులు నిర్వర్తిస్తారు. సెక్రియాట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వైఫై, ల్యాప్‌టాప్, ఫోన్ వంటి సౌకర్యాలు కల్పించాం. గాంధీలో వైద్యులు, అధికారులతో 16 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. ఆయా కమిటీలు ఫర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అవసరమైతేనే క్లోరోక్విన్ మాత్రలు పాజిటివ్ పేషెంట్‌తోపాటు క్లోజ్ కాంట్రాక్టులో ఉన్నవారికి, బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నవారికే క్లోరోక్విన్ మాత్రలు ఇస్తున్నాం. మాత్రలు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు తదితర రుగ్మతలు ఉన్నవారు వైద్యసలహా మేరకే ఈ మాత్రలు వాడాలని సూచిస్తున్నాం. వైద్యులు, సిబ్బంది చాలామంది ఈ మాత్రలను వినియోగిస్తున్నారు. గాంధీ వైద్యులు, సిబ్బందికి కరోనాపై అధ్యయన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటి వరకు గాంధీ వైద్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓన్లీ పాజిటివ్ కేసులైతే బెటర్ కోవిడ్ ఆస్పత్రిగా గుర్తించిన గాధీఆస్పత్రిలో కేవలం కరోనా పాజిటివ్ కేసులే అడ్మిట్ చేస్తే మరింత మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది. బాధితులు, అనుమానితులకు వేర్వేరుగా వైద్యసేవలు అందించడం కొంత తలనొప్పి వ్యవహారమే. అనుమానితులకు ఇతర ప్రాంతాల్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి, పాజిటివ్ వచ్చిన రోగులనే గాంధీకి రిఫర్ చేస్తే బాగుంటుంది. గచ్చిబౌలి నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే గాంధీలో ఉన్న అనుమానితులకు అక్కడికి తరలించే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రి ఎప్పటికీ కోవిడ్ ఆస్పత్రిగా ఉండదు. మరో నాలుగు నెలల తర్వాత గతంలో మాదిరిగానే అన్ని విభాగాల ద్వారా వైద్యసేవలు అందిస్తాం. ప్రస్తుతం గాంధీ వైరాలజీ విభాగంలో గాంధీ ఆస్పత్రికి నేరుగా వచ్చే అనుమానితులకు మాత్రమే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. రెండునెలల్లో కరోనా రహిత తెలంగాణ మరో రెండు నెలల్లో కరోనా రహిత తెలంగాణ ఆవిషృతమవుతుంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాజిటివ్ బా«ధితులకు నయం చేసేందుకు నెలరోజులు పడుతుంది. లాక్డౌన్ కొనసాగించి, ప్రజలు చైతన్యవంతులై సహకరిస్తే రెండు నెలల్లో కరోనా వైరస్ లేని తెలంగాణను చూడవచ్చు. హంటాతో తంటా.. కరోనా పురిటిగడ్డ చైనాలోనే మరో కొంత వైరస్ హంటా వెలుగుచూసింది.ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్సేనని వైద్యనిపుణులు భావిస్తున్నారు. హంటా వైరస్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాం. -
వేసవికి ముందే భగ్గుమంటున్న భానుడు
అనంతపురం అగ్రికల్చర్: వేసవికి ముందే భానుడు భగభగ మంటున్నాడు. ఫిబ్రవరి చివరి వారంలోనే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్క్‌ను దాటిపోయింది. మధ్యాహ్నం వేళ మాడు పగిలిపోతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకుని జనం ఆందోళన చెందుతున్నారు. ఇకమంగళవారం జిల్లా వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. మడకశిర, పెనుకొండ, హిందూపురం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో చలి వాతావరణం కొనసాగుతున్నా.. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం తాడిమర్రిలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా... అగళిలో 13.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 39 నుంచి 34 డిగ్రీల మధ్య గరిష్ట, 14 నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగాయి. గంటకు 6 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
వేడిని పెంచుతున్న ఫుట్‌పాత్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : సుందర నగరాల్లో సాధారణంగా రోడ్ల పక్కన ఎండ ఎక్కువ పడకుండా ఎల్తైన చెట్లు, పక్కన పాదాచారుల కోసం సిమ్మెంట్ టైల్స్‌తో కూడిన ఫుట్‌పాత్‌లు కనిపిస్తాయి. పగటి పూట ఎండ వేడిని తగ్గించేందుకు రోడ్లు పక్కనున్న ఎల్తైన చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, పక్కనుండే పలు అంతస్తుల భవనాలు పగటి పూట ఎండలోని వేడిని గ్రహించి రాత్రి పూట వాతావరణంలోకి వదులుతాయి. తద్వారా రాత్రిపూట వాతావరణం ఆశించినంత లేదా కావాల్సినంత చల్లగా ఉండక పోవచ్చు. మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండాలనేది వైద్యులు ఎప్పుడే తేల్చి చెప్పారు. అయితే సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, ఎల్తైన కాంక్రీటు భవనాలు రాత్రి పూట వాతావరణం వేడికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టారు. మాడిసన్లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ పరిశోధకులు సైకిల్ మోటర్లకు జీపీఎస్ డివైస్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు అమర్చి పగటి పూట, రాత్రివేళ వివిధ రోడ్లలో వాటిని నడిపి ఉష్ణోగ్రతలను నమోదు చేశారు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయో గమనించి ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు. కింద కాంక్రీట్ ఫుట్పాతులున్నా, పైన ఛత్రిలాగా గుబురైన చెట్లు ఉన్న చోట వేడి తక్కువగా ఉండడం, పక్కన ఎల్తైన కాంక్రీటు భవనాలుంటే వేడి స్థాయిలో మార్పులు ఉండడం గమనించారు. పార్కుల వద్ద ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండడం తెల్సిందే. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇతర వేడి ప్రాంతాలకు పనులపై తరచూ వెళ్లి రావడం వల్ల కూడా (చలి, వాతావరణంల మధ్య సర్దుబాటు కుదరక) వారి ఆరోగ్యం దెబ్బతింటుందట. పల్లెల్లో అంతగా చెట్లు లేకున్నా పట్టణాల్లో ఎక్కువ చెట్లున్నా పట్టణాల్లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడానికి కారణం (వాహనాల కాలుష్యాన్ని మినహాయించి) వేడిని గ్రహించి రాత్రికి దాన్ని వదిలేసే కాంక్రీట్ భవనాలే. అందుకని కాంక్రీటు భవనాల మధ్య చెట్లు ఉండడంతోపాటు కాంక్రీట్ ఫుట్‌పాత్‌లకు బదులు, గడ్డితో కూడిన ఫుట్‌పాత్‌లు ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లు పార్కులకే పరిమితం కాకుండా ప్రతివీధి, ప్రతి సంధులో చెట్లు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉండడంతోపాటు సమ ఉష్ణోగ్రత ఉండి ప్రజల ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారంటున్నారు. -
ఆంధ్రప్రదేశ్ : నిప్పుల గుండం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!) సెగలు.. సెగలు.. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. వడదెబ్బకు 28 మంది మృతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ప్రాణాలు కోల్పోతున్న పశువులు ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు. తక్షణమే చికిత్స చేయించకపోతే చావే.. పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి తెలిపారు. వడదెబ్బ లక్షణాలు - రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. - జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. - అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం. - పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం. - పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం. వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. – ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. – శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. – రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి. – ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. – ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. – చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మే 11వ తేదీ: 46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు 39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 12వ తేదీ: 45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 13వ తేదీ: 43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 14వ తేదీ: 43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 15వ తేదీ: 43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు వడగాడ్పులు.. వర్షాలు రాష్ట్రంలో విభిన్న వాతావరణం రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. -
సేద్యం.. శూన్యం
ఖరీఫ్ సీజన్లో సగటు వర్షపాతం నమోదైనా..రబీ పంటలకు సాగునీరు అందని దైనస్థితి అన్నదాతలకు ఎదురైంది. కోటి ఆశలతో అప్పులు చేసి పంటలను సాగు చేస్తే మండుతున్న ఎండలతో పంటలు ఎండిపోతుండటంతో ఏమీ చేయని దుస్థితి నెలకొంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రూరల్ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అందకపోవడంతో బీటలు బారుతున్నాయి. ఈ ఏడు రబీ సీజన్లో సాధారణ సాగు 40,686 హెక్టర్ల విస్తీర్ణం కాగా అన్ని పంటలు కలిపి 37,395 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. సాధారణ సాగులో 92శాతమే సాగైనప్పటికీ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు అందక 20శాతం పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదు. నర్సంపేట: ప్రధానంగా వరి పంట, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు భారీ స్థాయిలో నష్టం కలుగుతోంది. జిల్లాలో 16,715 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగు కాగా మొక్కజొన్న 14,853 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైంది. నీరు లేక పంట చేతికందే సమయంలో పంటలు ఎండిపోతుండడంతో పశువులకు మేతగా ఉపయోగపడుతుండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఎండల గండం ఎండలు మండుతుండడంతో జలాశయాల్లోని నీరు అడుగంటిపోతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా చెరువులతో పాటు జిల్లాలోని ప్రధాన నీటి వనరులైన పాఖాల, మాధన్నపేట, రంగయ్యచెరువు, కోపాకుల చెరువు, చలివాగుల్లో నీరు తగ్గిపోయి బోషిపోతున్నాయి.40 డిగ్రీలు దాటుతున్న ఎండలతో చేతికందాల్సిన పంటలు ఎండిపోతున్నాయి. బోరు బావు కూడా వట్టిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 10.19 మీటర్ల లోతుకు నీరు.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. ఖరీఫ్ సీజన్లో సగటు వర్షపాతం జిల్లాలో నమోదు కావడంతో నీటి వనరుల్లో నీరు ఆశించిన స్థాయిలో నిల్వలేక భూగర్భజలాలపై ప్రభావం పడింది. ఫిబ్రవరి మాసంలో భూగర్భజలాలు 9.41 మీటర్ల లోతుకు పడిపోగా ఏప్రిల్‌లో మండుతున్న ఎండలతో అమాంతం 10.19 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం ప్రమాద ఘటికలకు సూచికగా మారింది. -
కాక పెరుగుతోంది.. బహు పరాక్!
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: మార్చిలోనే మాడుపగిలేలా ఎండలు అదరగొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులూ వీస్తున్నాయి. రెండు మూడు రోజులుగా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు వడదెబ్బ బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వడదెబ్బ లక్షణాలు.. శరీర ఉష్ణోగ్రత 105.1 ఎఫ్ కంటే ఎక్కువ ఉండడం. నీరసంగా ఉంటూ తడబడడం. చర్మం పొడిబారడం. మూత్రం ముదురు పసుపురంగులో ఉండి, విసర్జించే సమయంలో మంట. సొమ్మసిల్లి పోవడం వడదెబ్బకు కారణాలు నీరు తక్కువగా తాగడం. మత్తు పానీయాలు ఎక్కువగా తాగడం. ఎండలో ఎక్కువగా తిరగడం. వృద్ధుల్లో వయస్సుకు సంబంధించిన శారీరక మార్పులు. ఇలా నివారించొచ్చు.. ఎండలో ఎక్కువ తిరగకుండా ఉండడం. నీటితో పాటు ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం (దీని వలన శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు). మత్తుపానీయాలకు దూరంగా ఉండడం. (మద్యం తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది). వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం. గొడుగు వాడడం, దూదితో నేసిన తెలుపు వస్త్రాలను ధరించడం. తలకు టోపీ లేదా రుమాలు అడ్డుపెట్టుకోవడం. ఇదీ చికిత్స.. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి తడిగుడ్డతో పలుమార్లు తుడవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తాగించాలి. వీలైనంత త్వరగా హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలి. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఐవీ డ్రిప్ పెట్టాలి. రోగి బీపీ పల్స్‌లను గమనిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులూ అందుబాటులో ఉంచాం.. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. 36 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అన్ని కేంద్రాల్లో ఆరు లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వడదెబ్బ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులనూ అందుబాటులో ఉంచాం. ప్రతి ఆరోగ్యకార్యకర్త, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాం.సాధారణంగా నీరు కాకుండా ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగడం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మరం వంటివి తాగితే శరీరంలోకి ఎక్కువ ప్రోటీన్లు చేరతాయి. కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రంగురంగుల గొడుగులు (నలుపు మినహా) వాడాలి.– డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
షెల్టర్ ప్లీజ్!
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన చలి నగర ప్రజలను గజగజలాడిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల కంటే తగ్గిపోవడంతో నిరాశ్రయుల పరిస్థితి దయనీయంగా మారింది. తల దాచుకునేందుకు నీడ లేక.. కప్పుకొనేందుకు సరైన దుప్పట్లు లేక రోడ్డు పక్కన, దుకాణాల అరుగులపై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరంలో తగినన్ని నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్ఎంసీ ప్రకటనలు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీలో దాదాపు 200 నైట్ షెల్టర్లు అవసరముంది. కానీ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది 12 షెల్టర్లు మాత్రమే. వాటిలో పరిస్థితుల çసంగతెలా ఉన్నా.. కనీస ఆశ్రయం లేక వేలాదిమంది రోడ్ల పక్కన, డివైడర్ల మీద, మూసివేసిన దుకాణాల షట్టర్ల వద్ద చలితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని రోగులకు సహాయకులుగా వచ్చినవారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఇలాంటి వారు అధికసంఖ్యలో ఉన్నారు. పటిపూట సైతం తీవ్ర చలి ఉండగా, రాత్రుళ్లు మరింత పెరుగుతుండడంతో వారు అల్లాడుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు గ్రేటర్లో నైట్‌షెల్టర్ల సంఖ్యను పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీ చెబుతున్నా నేటికీ అమలు చేయలేదు. విశ్వనగరం పేరిట ఫ్లై ఓవర్లు వంటివి త్వరితంగా పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపుతున్న యంత్రాంగం.. అనాథలు, దీనులు, హీనులకు, ఆస్పత్రి అవసరాల కోసం వచ్చిన వారికి నీడనిచ్చే నైట్ షెల్టర్లపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు ఉన్న నైట్ షెల్టర్లనూ తగిన సదుపాయాలు లేక వాటిని వినియోగించుకునే వారు అతి తక్కువగా ఉంటున్నారు. ఉన్న షెల్టర్లలో కనీస సదుపాయాలు లేకపోవడం.. అవి అవరనానికి దూరంగా, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో ఉండడంతో అక్కడకు వెళ్లి ఉండేవారు కూడా తగ్గిపోతున్నారు. పైగా ఆయా షెల్టర్లలో తగిన పడకలు, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. వీటితోపాటు లాకర్ల సదుపాయి, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ ఇవేవీ లేక పోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు. ఎక్కువమంది ఆస్పత్రుల పరిసరాల్లోనే ఎముకలు కొరికే చలిలో కాలం వెళ్లదీస్తున్నారు. తూతూమంత్రపు సర్వేలు నిరాశ్రయులను గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు గతేడాది సర్వేలో చేపట్టారు. అందులో నగరంలో కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో 3,500 మంది ఉండగా, ఆ సంఖ్య çసగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ మంది నిరాశ్రయులు ఉండడాన్ని విశ్వసించని కేంద్ర బృందం మరోమారు సర్వే చేయాల్సిందిగా ఆదేశించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గ్రేటర్ అధికారుకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నగరంలోని నైట్‌షెల్టర్లు.. బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి వద్ద నైట్ షెల్టర్ కాక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 షెల్టర్లున్నాయి. వాటిలో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు చెబుతున్నా 200 మంది కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది తమ అవసరాల కోసం వచ్చిన ప్రాంతాల్లోనే చలిలో గడుపుతున్నారు. ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు నాలుగేళ్లక్రితం సర్వేలో గుర్తించిన అధికారులు ఆయా ప్రదేశాల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్టీ, ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, పేట్లబుర్జు, మహావీర్ ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. గాంధీ ఆస్పత్రి వద్ద స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ఆస్పత్రుల్లో మహావీర్, నిలోఫర్ వద్ద మాత్రం పూర్తికాగా, ఉస్మానియా, నిమ్స్, కోఠి ఈఎన్టీ ఆస్పత్రుల వద్ద త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అదికారులు చెబుతున్నారు. నగరంలో నైట్ షెల్టర్లు ఉన్న ప్రాంతాలు,వాటి సామర్థ్యం ఇలా.. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద 25 సరూర్‌నగర్ చౌడీ బిల్డింగ్ 20 పేట్లబుర్జు వార్డు కార్యాలయం 30 శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ 20 టప్పాచబుత్ర అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీహాల్ 50 గోల్నాక కమలానగర్ కమ్యూనిటీహాల్ 40 యూసుఫ్‌గూడ వార్డు కార్యాలయం 25 బేగంపేట ఫ్లై ఓవర్ కింద 45 శేరిలింగంపల్లి పాత మున్సిపల్ ఆఫీస్ 25 ఆర్కేపురం బ్రిడ్జి కింద 20 సికింద్రాబాద్ నామాలగుండు 30 బేగంపేట ఫ్లై ఓవర్ కింద (బ్రాహ్మణవాడి) 50 (ఉప్పల్, సరూర్‌నగర్, గోల్నాక, నామాలగుండు ప్రాంతాల్లో మహిళలకు కేటాయించగా, మిగతావి పురుషులకు కేటాయించారు) -
గజ.. గజ
పశ్చిమగోదావరి, దెందులూరు: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులు పెరిగాయి. దీంతో ప్రజలు గజ.. గజ వణుకుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు చలిమంటలు వేసుకుని చలిపులి నుంచి సంరక్షించుకుంటున్నారు. నాలుగు డిగ్రీలకు పైగా తగ్గిన ఉష్ణోగ్రతలు జిల్లాలో గత వారం రోజులుగా రాత్రిపూట 19 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. పగటి పూట 25 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కంటే దాదాపు నాలుగు డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏటా సాధారణంగా డిసెం బర్ నుంచి చలితీవ్రత పెరుగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా నవంబర్ నుంచే చలి విజృంభించింది. గతేడాదితో పోలిస్తే రెండు డిగ్రీల వరకు చలితీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పెథాయ్ తుపాను కారణంగా వాతావరణం బాగా చల్లబడింది. అప్పటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. చలితీవ్రతకు పగలు కూడా ప్రజలు స్వెట్టర్లు ధరించాల్సి వస్తోంది. రాత్రివేళ రాకపోకలను తగ్గించారు. స్వెట్టర్లు, రగ్గులు, బొంతలు, మాస్క్‌లు, మంకీ క్యాప్‌ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తగ్గిన విద్యుత్ వినియోగం చలి కారణంగా జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. ఏసీలు, కూలర్లు, లైట్లు, ఫ్యాన్ల వినియోగం జిల్లాలో గణనీయంగా తగ్గింది. చలి తీవ్రతకు ఉబ్బసం, ఆయాసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీటికి తోడు చిన్నారులకు అంటువ్యాధులు త్వరితగతిన తగ్గకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో రవాణా అస్తవ్యస్తం పొగమంచు కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొVýæ మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిలో ప్రయాణించే భారీ వాహనాలకు ఎదుట వెళ్లే వాహనాల జాడ తెలియడం లేదు. దీంతో పలుచోట్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొVýæమంచు కారణంగా జిల్లాలో Výæత నాలుగు రోజుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
కుంపటి... కొంప ముంచుతోంది!
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావంతో నగరంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అసలే శీతాకాలం కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నిద్రిస్తున్న గదుల్లో బొగ్గుల కుంపట్లను ఏర్పాటు చేసుకోవడమేగా, చల్లగాలి గదిలోకి రాకుండా తలుపులు, కిటికీలు భిగిస్తున్నారు. ఇలాంటి గదుల్లో నిద్రిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. . ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో జరిగే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలోనూ ఇలాంటి అపశృతులకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. అన్నీ బిగించేస్తే... బొగ్గులు, నిప్పులు, మంట... ఇలా ఏదైనా మండటానికి ఆక్సీజన్ అవసరం. ఏదైనా గదిలో బయట నుంచి చలి, గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసేసి వీటిని వెలిగిస్తే... గదిలోని ఆక్సీజన్‌ను ఈ మంట, నిప్పు గ్రహిస్తాయి. దీంతో గాలిలోని ఆక్సిజన్, బొగ్గుల్లో ఉండే కార్బన్ కలిసి కార్బన్డయాక్సైడ్ (సీఓ2) విడుదలవుతోంది. ఇదే పరిస్థితి మరి కొద్దిసేపు కొనసాగితే కార్బన్‌డయాక్సైడ్‌లో ఉన్న ఆక్సీజన్‌ను సైతం మంట లాక్కుని కార్బన్‌మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విష వాయువుగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి వాసన ఉండని ఈ వాయువును కేవలం నాలుగైదు సార్లు పీలిస్తే చాటు... ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే. కార్బాక్సీ హిమోగ్లోబిన్ తయారై... ఇలా పీల్చిన కార్బన్‌మోనాక్సైడ్ గుండె, మెదడుకు చేరుకుని కొన్ని నిమిషాల్లోనే మెదడును నిస్తేజం చేస్తుంది. గుండె ద్వారా ఈ వాయువు రక్తంలోకి ప్రవేశించి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను తయారు చేస్తుంది. దీని ఫలితంగానే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. నిద్రలో ఉండే వారు తమ శరీరంలో అంతర్గతంగా వస్తున్న ఈ మార్పులను సైతం గుర్తించలేరని తద్వారా మృత్యువాత పడతారని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి మరణాలు చలి ఎక్కువగా ఉండే ఉత్తరాదిలో ఏటా పెద్ద సంఖ్యలో ఉంటాయన్నారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు డ్రైనేజీ గుంతలు, లోతైన బావుల్లోనూ పుడుతుంటుందని, వాటిలో దిగిన కార్మికులు ప్రాణాలు కోల్పోయేందుకు ఇదే కారణమని వారు పేర్కొంటున్నారు. గాలి వచ్చి పోయేలా... చలి కారణంగా తలుపులు, కిటికీలు పూర్తిగా బిగించుకుని పడుకోవడం సరికాదని ఫోరెన్సిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికి తట్టుకోలేక గదుల్లో హీటర్ ఆన్ చేసుకున్నా, కుంపటి పెట్టుకున్నా, మరో మార్గాన్ని అనుసరించినా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా గదులకు కచ్చితంగా గాలి ప్రసరించే మార్గాలు ఉండేలా చూసుకోవాలని, లోపలి గాలి బయటికి, బయటకు లోపలికి వచ్చేలా కనీస ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ‘కుంపటి’ ప్రమాదాలు ఇవీ ♦ బుధవారం జూబ్లీహిల్స్‌లో ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన తల్లీకుమారులు బుచ్చి వేణి, పద్మరాజు కన్నుమూశారు. ♦ గత ఏడాది డిసెంబర్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫామ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు నిద్రిస్తున్న గదిలో ఓ బొగ్గుల కుంపటి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అదే వీరి ప్రాణం తీసిందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 2008లో డిసెంబర్ 31న కొందరు యువకులు దేవరయాంజల్‌లోని రామరాజు ఫామ్‌హౌస్‌లో విందు చేసుకున్నారు. వీరిలో శ్రీరామమూర్తి, వెంకటపతిరాజు ఓ గదిలో నిద్రిస్తూ నిప్పు రవ్వలు రాజేసుకున్నారు. తెల్లవారేసరికి ఇద్దరూ మరణించారు. దీనికి కారణం నిప్పుల కుంపటే. ♦ కొన్నేళ్ళ క్రితం నాంపల్లిలోని చాకలిబస్తీలో ఇలాంటి మరణమే సంభవించింది. తన గది తలుపులు, కిటికీలు బిగించుకున్న ఓ వ్యక్తి కూలర్ ఆన్ చేసుకుని పడుకున్నారు. ఆ కూలర్ కాలిపోవడంతో తయారైన కార్బన్‌మోనాక్సైడ్ పీల్చి కన్నుమూశాడు. తొలుత ఇది హత్యగా భావించినా... ఫోరెన్సిక్ నిపుణులు చిక్కుముడిని విప్పారు. -
చలి గండం!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చలి గండం పొంచి ఉంది. ఉత్తరభారతం నుంచి వీస్తోన్న శీతగాలుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. దీంతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 14.5 డిగ్రీలకు పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. దీంతో నగరంలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 25లో చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో బొగ్గులకుంపటి ఏర్పాటు చేసుకున్న బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజులు ఊపిరి ఆడక మరణించిన ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చలి తీవ్రతతో నగరంలోసాయంత్రం, తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే గురువారం నుండి రాత్రి ఉష్ణోగ్రతలు మరో 0.5 డిగ్రీలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తీ వ్రత శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో నగరంలో ఆకాశమంతా మేఘావృతమవటంతో గాలి నాణ్యత కూ డా ఓ మోస్తరుగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలిలో తేమ శాతం అతి తక్కువగా ఉండటంతో చలి గాలుల తీవ్రత అధికంగా ఉండి చర్మం చిట్లటంతో పాటు శ్వాస సం బంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వై ద్యులు హెచ్చరించారు. పిల్లలు, గుండె, శ్వాస సం బంధమైన వ్యాధులున్న వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొన్నారు. -
చలికే వణుకు!
సాక్షి, సిటీబ్యూరో: పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో చలి గజగజ వణికిస్తోంది. సిటీలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూలేనంతగా పడిపోవడంతో శీతల పవనాలతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తుల వైపు మళ్లుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ ఒంటికి వెచ్చదనాన్ని ఇచ్చే పలు రకాల రగ్గులు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో నగర మార్కెట్లలో దేశీయ, విదేశీ రగ్గుల విక్రయాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చలిని తట్టుకోవడానికి స్వెటర్లు వాడుతున్నా.. రాత్రి పూట రగ్గులు కప్పుకోవాల్సిన అవ సరం ఏర్పడిందని నగర ప్రజలు చెబుతున్నారు. ఎన్నెన్నో రకాలు.. కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు పలు రకాల దేశీయ, విదేశీ రగ్గులు విక్రయానికి ఉంచారు. సింథటిక్, క్విల్డ్, మింక్‌తో తయారైన దేశీయ రగ్గులు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. లుథియానాలో ఉన్నితో తయారు చేసిన రగ్గులు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. టర్కీ, ఇరాన్, స్పెయిన్, కొరియా దేశాల్లో తయారైన విదేశీ రగ్గులను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు మదీనా సర్కిల్లో మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్యాస్ బుఖారీ తెలిపారు. ఆకర్షణీయమైన డిజైన్లలో.. దేశీయ రగ్గులు మాత్రమే మూడు నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండగా.. విదేశీ రగ్గులు వివిధ రకాల కలర్స్‌తో పలు డిజైన్లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఉన్నితో తయారైన దేశీయ రగ్గులు వెచ్చదనంతో పాటు అంతగా మృదువుగా ఉండవని, అదే విదేశీ రగ్గులు నున్నటి మింక్, సింథటిక్‌తో తయారవుతాయి కాబట్టి మృదువుగా ఉంటాయంటున్నారు. ఇవి అన్ని వయసుల వారూ కప్పుకోవడానికి అనుకూలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. విదేశీ రగ్గులకు డిమాండ్ పెథాయి తుపాను ప్రభావంతో నగరంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు రాత్రిపూట కప్పుకోవడానికి రగ్గులు కొనుగోలు చేస్తున్నారు. లూథియానాలో తయారైన దేశీయ రగ్గులకు గతంలో ఎక్కువ డిమాండ్ ఉండేది. ప్రస్తుతం విదేశీ రగ్గులకు డిమాండ్ ఏర్పడింది. ఇవి వెచ్చదనంతో పాటు మృదువుగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. –మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు -
ఏపీలో ఒక్కరోజులో 41,025 పిడుగులు
-
నిప్పుల కుంపటి