University Campus
-
Israel-Hamas war: అమెరికా వర్సిటీల్లో నిరసనల హోరు
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు నానాటికీ ఉధృతరూపం దాలుస్తున్నాయి. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. న్యూయార్క్, కాలిఫోరి్నయా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 900 మందికిపైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెలెస్–కాలిఫోర్నియా(యూసీఎల్ఏ)లో ఇజ్రాయెల్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తాజాగా ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అధికారులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు. -
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
చైనా పోలీసులను వణికిస్తున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్‌కు మరింత స్వాతంత్య్రం కావాలంటూ వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న యూనివర్శిటీ విద్యార్థులు రోజురోజుకు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పాత కాలం నాటి యుద్ధ విద్యలను అవలంబిస్తూ చైనా పోలీసులను వణికిస్తున్నారు. విల్లంభులతోపాటు రాళ్లు విసిరే పంగ కర్రల (ఒడిసెల) తోని పెట్రోలు బాంబులు విసురుతున్నారు. నిఘా టవర్లను నిర్మిస్తున్నారు. ‘చైనా యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్’ ప్రాంగణమే ఇప్పుడు ఓ యుద్ధ ప్యాక్టరీగా తయారయింది. బుధవారం ఒక్క రోజే యూనివర్శిటీ విద్యార్థులు చైనా సైనికులపైకి 400 పెట్రోలు బాంబులను విసిరారు. స్థానికులు విద్యార్థులకు గ్లాస్ బాటిళ్లు, హాల్కహాల్, పెట్రోలు సహాయం చేస్తున్నారు. హాంకాంగ్‌లో నేరం చేసిన వారిని చైనాకు అప్పగించాలనే బిల్లును చైనా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఒక్కసారిగా హాంకాంగ్ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. చివరకు విద్యార్థుల ఆందళనకు తలొగ్గి ఆ బిల్లును చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ విద్యార్థులు తమ ఆందోళనను వీడకుండా హాంకాంగ్‌కు పూర్తి ప్రజాస్వామ్యం కావాలంటూ తీవ్రతరం చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన విద్యార్థులందరిని బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థుల ఆందోళనను అల్లర్లుగా పేర్కొనడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు. -
క్యాంపస్‌లో నవదంపతుల మృతి
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో విశ్వభారతి యూనివర్సిటీ క్యాంపస్‌లో నవ దంపతులు మరణించిన ఘటన కలకలం రేపింది. క్యాంపస్‌లోని చీనా భవన్ వద్ద కొత్త జంట మృతదేహాలను గుర్తించామని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వెల్లడించారు. విశ్వభారతి వర్సిటీకి చెందిన చైనా భాష, సాంస్కృతిక శాఖ చినా భవన్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. మృతులను సోమనాధ్ మహతో (18), అవంతిక (19)గా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారని, వీరు గతంలో బోల్పూర్లోని శ్రీనంద హైస్కూల్ విద్యార్ధులని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఏడాది సోమనాధ్ హయ్యర్ సెకండరీ పరీక్షలకు హాజరవగా, అవంతిక పదవ తరగతి పరీక్షలు రాసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తుండగా పోస్ట్ మార్టర్ నివేదిక తర్వాతే వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి వేళ నవజంట క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై వర్సిటీ అధికారులు విచారణకు ఆదేశిస్తారని విశ్వభారతి యూనివర్సిటీ పీఆర్ఓ అనిర్బన్ సర్కార్ వెల్లడించారు. -
అందంగా లేనా.. అసలేం బాలేనా...
పాటలతో బిజీగా ఉండే గాయని సునీత ఆటల కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతిలోని వెంకటేశ్వర వెంటర్నరీ యూనివర్సిటీలో గురువారం క్రీడా సాంస్కృతిక ఉత్సవ ముగింపునకు ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. బహుమతులందజేశారు. అంతేకాదు తన గానలహరితో అందరినీ అలరించారు. అందంగా లేనా అని ఆమె పాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకం ప్రకటించారు. యూనివర్సిటీక్యాంపస్: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక ఉత్సవం వెట్ ఓరియన్–2017 ఓవరాల్ చాంపియన్‌గా తిరుపతి వెటర్నరీ కళాశాల నిలిచింది. నాలుగు రోజుల క్రీడా సంబరాలు గురువారంతో ముగిశాయి. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రదానం చేశా రు. వ్యక్తిగత చాంపియన్‌గా గన్నవరం వెటర్నరీ కళాశాల విద్యార్థి మోహన్‌రావు, బాలికల చాంపియన్‌గా కిరణ్మయి నిలిచారు. తిరుపతి వెటర్నరీ కళాశాల బాలికల జట్టు 65 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని అందుకుంది. అలాగే వివిధ క్రీడా, సాంస్కృతిక అంశాల్లో విజేతలకు గాయని సునీత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలి పారు. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తాను 3వ సంవత్సరం నుంచి సంగీత సాధన మొదలు పెట్టానని చెప్పారు. అనుకోకుండా సినీరంగంలోకి వచ్చి ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడ్డానన్నారు. వీసీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల మంచి స్పందన లభించిందన్నారు. చక్కటి క్రీడా ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్య క్రమంలో డీఎస్ఏ హరిజనరావు, అసోసియేట్ డీన్ ఈశ్వర్ ప్రసాద్, ఓఎస్ఏ రాంబాబునాయక్ పాల్గొన్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. బహుమతుల ప్రదానోత్సవం అనంతరం గాయ ని సునీత తన గానామృతంలో ఓలలాడించారు. ‘అందంగా లేనా... అసలేం... బాగాలేనా...’ అం టూ ప్రారంభించి ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’అన్న పాటతో ముగించారు. ఆమె పాటలకు విద్యార్థులు కేరింతలు కొట్టారు. -
ఎస్కేయూసెట్ గడువు పెంపు
ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎస్కేయూసెట్–2017 దరఖాస్తు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. మే 5 వరకు రూ.500 అపరాధ రుసుముతో, 10 వరకు రూ.వెయ్యి అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ఉన్నత విద్య.. ఉద్యోగం
⇒డిగ్రీ తర్వాత ఎన్నో అవకాశాలు ⇒అందుబాటులో యూనివర్సిటీ విద్య ⇒ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అత్యున్నత విద్య.. ఉపాధి పొందే కోర్సులు అభ్యసించవచ్చు. పోటీ పరీక్షలు రాసి మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఉద్యో గం చేస్తూ కూడా ఆసక్తి ఉన్న ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. యూనివర్సిటీక్యాంపస్ (తిరుపతి): ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల చివరికి పరీక్షలు పూర్తికానున్నాయి. ఈనేపధ్యంలో ఏంచేయాలని విద్యార్థులు ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో 136 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేలమంది డిగ్రీ చదువుతున్నారు. చివరి సంవత్సరం చదువుతున్న వారి సంఖ్య దాదాపు 25వేలు ఉంది. వీరిలో కొంతమంది డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్నారు. దూరవిద్య రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లి చదవలేని వారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వివిధ పీజీ కోర్సులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ప్రస్తుతం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా యూనివర్సిటీలకు నోటిఫికేష న్ రావాల్సి ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశానికి నాగార్జున యూనివర్సిటీ నిర్వహించే పీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్వీయూ, మహిళా వర్సిటీతో పాటు ఐదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. జాబ్ ఓరియంటెడ్ కోర్సు డిగ్రీ తర్వాత హాస్పిటాలిటీ, జర్నలిజం, ఫ్యాషన్ అండ్ డిజైనింగ్, ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళా వర్సిటీల్లో మరికొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్ కళాశాలలు, ఇతర సంస్థలు కూడా కొన్ని అందిస్తున్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కాని, ఉన్నత విద్యకాని అవసరం లేదనుకునేవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా వివిధ రకాల చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్వీయూ, మహిళా విశ్వవిద్యాలయాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తరగతులు అప్పుడప్పుడూ నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీ పూర్తయిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో విజయం సా«ధిస్తే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. యూపీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసి వాటిని పొందవచ్చు. బ్యాంకింగ్, డిఫెన్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పలు ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవి కాకుండా ఉన్నత విద్య పొందేవారికి రెగ్యులర్, దూరవిద్య ద్వారా అనేక విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ కోర్సులు చదవాలనుకునేవారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాలు పలు రకాల సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులు సీటు పొందవచ్చు. ఇక్కడ అడ్మిషన్ పొందినవారికి హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంది. అంతేగాకుండా క్యాంపస్‌లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. మహిళా వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21న ప్రవేశ పరీక్ష నిర్వహించి జూన్‌లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10 నుంచి 16వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 5 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. న్యాయవాద కోర్సులు డిగ్రీ పూర్తిచేసిన వారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే లాసెట్ ప్రవేశ పరీక్ష రాసి మూడు సంవత్సరాల లా కోర్సులో చేరవచ్చు. జిల్లాలో మహిళా వర్సిటీతో పాటు ఏడు లా కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. -
'నాగార్జున' లో విద్యార్థుల భారీ ర్యాలీ
గుంటూరు : ఆర్కిటెక్చర్ విద్యార్థి రుషితేశ్వరి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ బుధవారం డిమాండ్ చేసింది. అందుకోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తీశారు. రుషితేశ్వరి ఆత్మహత్య ఆ తర్వాత క్యాంపస్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యూనివర్శిటీలోని అన్ని కాలేజీలకు 10 రోజుల పాటు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ తిరిగి బుధవారమే యూనివర్శిటీలోని అన్ని కాలేజీలు ప్రారంభమైనాయి. అయితే రుషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విషయం విదితమే. -
ఓయూలో ఉద్రిక్త వాతావరణం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ ఐకాస నాయకులు బుధవారం ఆర్ట్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని ఐకాస నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగ ఐకాస నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీలో మోహరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వాట్సప్‌కు హేటా్‌సఫ్
ఆకట్టుకుంటున్న మొబైల్ ఆప్స్ మొగ్గుచూపుతున్న యువత భారీగా పెరిగిన ఆదరణ వాట్సప్‌కు యువత హేట్సాప్ అంటోంది. ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిన మొబైల్ ఆప్స్‌లో అత్యంత ఆదరణ పొందిన ఆప్స్ వాట్సప్. మొబైల్లో టాక్‌టైమ్ ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ డేటాకార్డు వేసుకుంటే ఎంత సేపైనా ఈయాప్స్ సహాయంతో మాట్లాడుకోవచ్చు. సందేశాలు పంపుకోవచ్చు. వీడియో చాట్ చేసుకోవచ్చు. గ్రూప్కట్టి ఒకరి భావాలను మరొకరు పంచుకోవచ్చు. వాట్సప్‌పై ప్రత్యేక కథనం మీ కోసం.. యూనివర్సిటీక్యాంపస్: ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ధరలు తగ్గిపోయాయి. కేవలం ఐదువేలకే అన్ని ప్యూచర్లు కలిగిన ఫోన్లను కొని అన్ని యాప్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక యాప్స్ కాకుండా హైక్, లైన్, లైబర్, చాట్ తదితర మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. యువతకు ఎంతో ఉపయోగం నీకు హైక్‌లో అకౌంట్ ఉందా ? లేదా ... కనీసం వైబర్లో నైనా టచ్‌లో ఉంటావా ? వీలుంటే వాట్సప్‌లో ఫొటోలు షేర్ చేయవచ్చుకదా. ఫేస్బుక్ మెసెంజర్ ఉంటే సరదాగా మాట్లాడుకోవచ్చుకదా ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం యువత మధ్య ఉన్న మాటలు. ఒకప్పుడు మెసేజ్ పంపాలంటే నెట్వర్క్ పరిధిలోని సెల్ నంబర్ నుంచి వేరేసెల్కు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ అధునాతన ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. మెసెంజర్స్ ద్వారా మెసేజెస్ పంపడమే కాకుండా వీడియో, ఫొటోలు షేర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే చాలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాట్సప్, వైబర్, లైన్, హైక్, చాట్, తదితర యాప్స్ ఉపయోగించుకోవచ్చు. చాటింగ్, షేరింగ్, కాలింగ్, వీడియో కాలింగ్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉండడంతో యువత వీటికి పడిపోయారు. గూగుల్స్ ప్లేలో రోజుకోకొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. యువత ఎక్కువగా వాడుతున్న యాప్స్ వాట్సప్, వైబర్, పేస్బుక్ మెసెంజర్ . ఫేస్బుక్ మెసెంజర్ వాట్సప్, వైబర్‌ల తర్వాత ఎక్కువమంది ఆకర్షిస్తున్న యాప్ ఫేస్బుక్ మెసెంజర్. ఫేస్‌బుక్‌కు అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీని ద్వారా చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫొటోలు పంపుకోవచ్చు. గంటల తరబడి చాట్ చేసుకోవచ్చు. వైబర్ వైబర్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఫోన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వాట్సప్ అంటే వాట్సప్ అంటే దీని ద్వారా ఫోన్ నంబర్ తెలిసిన వారు కూడా వాట్సప్‌లో ఉంటే ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. మెసెజ్‌లు పంపుకోవచ్చు. చాటింగ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సెల్పీ ఫొటోలపై యువతలో మోజు పెరిగింది. దీంతో యువత అనుక్షణం తామేం చేస్తున్నా సెల్ఫ్ ఫొటోలు తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. దీని ద్వారా కొంతమంది మిత్రులు కలసి గ్రూపులు కట్టి తమ భావాలను పంచుకుంటున్నారు. ఉపయోగకరంగా ఉంది నేను సంవత్సర కాలంగా వాట్సప్‌ను వాడుతున్నాను. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఫొటోలను, మెసేజ్‌లను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం ఖర్చులేకుండా మెసెజెస్ పంపుకోవడానికి వీలవుతుంది. - హేమంత్‌కుమార్, ఎస్వీయూ అందరూ వాడుతున్నారు నేను ఆరునెలలుగా వాట్సప్‌ను వాడుతున్నాను. నా స్నేహితులు ఎక్కువమంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. అందువల్ల అందరూ కలసి ఒక గ్రూప్క్రియేట్ చేసి అందరి భావనలను షేర్ చేసుకుంటున్నాం. మెసేజ్కాని, ఫొటోకాని షేర్ చేస్తే గ్రూప్‌లో అందరూ వాటిని చూ సుకోవచ్చు. - కల్పన, ఎస్వీయూ తగ్గిన ఖర్చు స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి వచ్చి న హైక్, వాట్సప్, వైబర్, లన్, చాట్, ఫే స్‌బుక్ మెసెంజర్లు బాగున్నాయి. వీటి ద్వారా మొబైల్ చార్జీలు తగ్గుతాయి. టాక్‌టైం లేక పోయినా డాటాకార్డు వేసుకుని అతి తక్కు వ ఖర్చుతో మాట్లాడుకోవడానికి, సందేశాలు పంపుకోవడానికి వీలుగా ఉంది. - శ్రావణ్, ఎస్వీయూ -
పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం
యూనివర్సిటీ క్యాంపస్ : పరిశుభ్రతలో ఎస్వీ యూనివర్సిటీ ఆదర్శంగా ఉండాలని వీసీ రాజేంద్ర పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తకుప్పలు తొలగించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద సభ నిర్వహించారు. ఈ సమావేశంలో వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి-మా వూరు’ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు ఆదర్శంగా ఉండాలన్న భావనతో ఎస్వీయూ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు మొక్కలు నాటారు. చివరగా ఎస్వీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో కలసి సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. -
శ్రీవారి వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాధు’
యూనివర్సిటీక్యాంపస్: టీటీడీలో పని చేసి, అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన పండితులు, పరిశోధకులు సాధు సుబ్రమణ్యశాస్త్రి సేవలను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. సాధు సుబ్రమణ్యం శాస్త్రి 30వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శ్వేత భవనం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సాధు సుబ్రమణ్యం శాస్త్రి తమిళనాడు ప్రాంతానికి చెందినవారని, 1920-30 సంవత్సరాల మధ్య డెప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయ ఇన్స్పెక్టర్గా వచ్చారన్నారు. ఈ సమయంలో ఆయన శ్రీవారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనల రాగిరేకులను వెలుగులోకి తెచ్చి పరిశోధనలు చేశారన్నారు. అన్నమయ్య కీర్తనల్లోని భక్తితత్వాన్ని, శ్రీవారి వైభవాన్ని అందరికీ తెలిసేలా చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి ఎంతో మేధావి అయినప్పటికీ ఆయన్ను ఎవరు గుర్తించలేదని తెలిపారు. ఆయన తన చివరి రోజుల్లో తిరుపతి వీధుల్లో దుర్భర జీవితం గడిపారన్నారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయన చేసిన కృషిని గుర్తించి శ్వేత భవనం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు హర్ష, రామస్వామి వెంకటేశు, దుద్దేల బాబు, కట్టా గోపియాదవ్, మోహన్, బొమ్మగుంట రవి, గౌరి, చాను పాల్గొన్నారు. -
యూపీఎస్సీకి స్పందన కరువు
హాజరు 38 శాతం మాత్రమే ఎస్వీయూ రీజియన్‌లో 7796 దరఖాస్తులు కేవలం 3 వేల మంది హాజరు యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలో ఆది వారం నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు స్పందన తగ్గింది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష రాయాల్సిందే. ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా దీనిని యుపీఎస్సీ నిర్వహిస్తోంది. యేడాదిలో క్రమం తప్పక నిర్వహిస్తున్నప్పటికీ హాజరవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో కేవలం మూడు కేంద్రాల్లో నిర్వహిం చారు. ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించేవారు. తెలంగాణ విడిపోయాక కొత్తగా విజయవాడలోను పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలోని చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు తిరుపతిలో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు కేవలం 7796 మంది దరఖాస్తు చేయగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పేపర్-1కు 3వేల మంది, పేపర్-2కు 2294 మంది హాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే సివిల్స్ పట్ల యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థం అవుతుంది. ఎక్కువ శ్రమతో, కష్టంతో, దీర్ఘకాలం సిద్ధం కావాల్సిన ఈ ప్రవేశ పరీక్షకన్నా తక్కువ కాలంలో ఉద్యోగాలు వచ్చే వాటిపైనే యువత ఆసక్తి చూపుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ యేడాది నుంచి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. పేపర్-2లో ఇంగ్లిషు కాంప్రహెన్సివ్‌ను మెయిన్స్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రవేశ పరీక్ష రాసిన వారు ఆ విభాగపు ప్రశ్నలను అటెంప్ట్ చేయలేదు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఈ మేరకు నోటీసు బోర్డులు పెట్టడం విశేషం. పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆదివారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నగరంలోని 13 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ కేంద్రా ల వద్ద పరీక్షలు రాసేవారు, వారి సహాయకుల సందడి ఎక్కువగా కనిపించింది. కొందరు పిల్లలను కూడా పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ పరీక్షకు ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చారు. వీరికి సరైన వసతి లేక చాలా ఇబ్బం దులు పడ్డారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన కరువు
యూనివర్సిటీ క్యాంపస్ : మూడు రోజులుగా జరుగుతున్న ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన కరువవుతోంది. విద్యార్థులు రాకపోవడంతో హెల్ప్‌లైన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 7 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 5 వేల లోపు ర్యాం కులు పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 27 మంది మాత్రమే పాల్గొన్నారు. రెండో రోజైన శుక్రవారం 84 మంది, మూడో రోజైన శనివారం వందమంది హాజరయ్యా రు. శనివారం 10 వేల నుంచి 15 వేల ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 41 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 30 మంది, చిత్తూరులోని పీవీకేఎన్‌లో 29 మంది హాజరయ్యారు. 11 గంటలకే ఖాళీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది హాజ రుకాకపోవడంతో ఉదయం 11 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్లు ఖాళీ అయిపోతున్నాయి. కారణాలేంటి? ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడానికి కారణాలు అన్వేషిస్తే ప్రస్తుతం కళాశాలల సంఖ్య బాగా పెరిగింది. వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వీరికి ఉపాధి లభించడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు వెళ్లకూడదని సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు. అందువల్ల ఇంజనీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాలు రోజుకో మాట చెబుతుండడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కనబరచడం లేదు. గతంలో చిత్తూరు జిల్లాలో కేవలం ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 37కు చేరింది. దీనికితోడు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలి వెళ్లారు. మరికొంతమంది విద్యార్థులు ఐఐటీ, నిట్, విట్‌లాంటి సంస్థల్లో చేరారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎన్నో అవాంతరాలు, అటంకాల అనంతరం గురువారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన అంతంతమాత్రమే లభించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం తేలక కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఈనెల 31లోపు అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టింది. తొలిరోజైన గురువారం ఒకటి నుంచి ఐదువేల ర్యాంకులు పొందిన విద్యార్థుల ధ్రుపత్రాల పరిశీలన జరిగింది. జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈప్రక్రియను ప్రారంభించారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 15 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో అయిదుగురు, చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏడుగురు మాత్ర మే హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు ధ్రువపత్రాలను పరిశీలించి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. వీరు ఆన్లైన్లో లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. తొలి ఐదు వేల ర్యాంకులు సాధించినవారిలో చాలామంది ఐఐటిలు, విట్, నిట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరి ఉంటారని అందువల్ల కౌన్సెలింగ్‌కు ఎక్కువ మంది రాలేదని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎల్ఆర్ మోహన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 5001 నుంచి 10వేల లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుంది. -
ఎస్వీయూలో అంతరిక్ష పరిశోధనలు
అత్యాధునిక మీటియోర్ రాడార్ కేంద్రం ఏర్పాటు ఇలాంటి కేంద్రం ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూనే యూనివర్సిటీ క్యాంపస్ : అంతరిక్షం.. అదో అంతుచిక్కని మాయాజాలం. ఇందులో ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలు మరె న్నో... ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. అ టువంటి అంతరిక్ష పరిశోధనలకు ఎస్వీయూ కేంద్రం వేదిక అవుతోంది. ఇందుకోసం ఎస్వీయూలో మీటియోర్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ మనదేశంలో కోలాపూర్‌లో ఒక రాడార్ కేంద్రం, త్రివేండ్రంలో మరో రాడార్ కేంద్రం ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కేంద్రాన్ని ఎస్వీయూలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. అంతరిక్షంలోని గ్రహశకలాల నుంచి వెలువడే ఉల్కపాతం, వాటి పరిణామం, వాటి దశ, దిశ మొదలైన విషయాలను శోధించడానికి మీటియోర్ రాడార్ కేంద్రం ఉపయోగపడుతుంది. దీంతో అంతరిక్ష పరిశోధనలో కీలక అంశాలైన గ్రహాంతర శకలాల ఉనికిని, భూవాతావరణంలోని మీసో(Meso)ధర్మో(Thermo)అవరణాల నిర్మాణం, ఈ పొరల మధ్య పరస్పరం జరిగే అనేక చర్యలకు గల కారణాలను కనుగొనడానికి వీలవుతుంది. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగంలో యూజీసీ సహకారంతో రూ.1.5 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అత్యాధునిక రాడార్‌ను ఆస్ట్రేలియాలోని అట్రాడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి జర్మన్, ఆస్ట్రేలియన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో 2 నెలల పాటు కష్టించి ఏర్పాటు చేశారు. అంతరిక్ష, వాతావరణ ప్రయోగాల కోసం అత్యాధునిక స్వంత రాడార్ వ్యవస్థను కల్గిన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూ కావడం విశేషం. ఈ రాడార్ వ్యవస్థ పనితీరు ప్రయోగాలను ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం దూరవిద్యావిభాగం పక్కను న్న ఖాళీ స్థలంలో 6 ఏంటినాలు, ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక లైడార్ ఉం టుంది. దీని(లైడార్) ద్వారా రాత్రివేళల్లో కాంతి పుంజాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. ఈ రాడార్ 24 గం టలూ పని చేస్తుంది. ఇది 70 నుంచి 110 కిలోమీటర్లు ఎత్తులో ప్రవేశించే ఉల్కలను పరిశీలించి లెక్కిస్తుంది. ఇస్రో సహకారంతో.. ఇస్రో సంస్థ సహకారంతో సెంటర్ ఫర్ అట్మాస్పియర్ సెన్సైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నాం. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా వచ్చిన గణాంకాలు ఇతర పరిశోధన కేంద్రాల్లో లభించిన గణాంకాలకన్నా మెరుగ్గా ఉన్నాయి. మీటియోర్ రాడార్‌తో పాటు లైడార్ వ్యవస్థను, వర్షపాతాన్ని వివ్లేషణ చేసే మైక్రో రైన్ రాడార్, డిస్ట్రో మీటర్లను ఏర్పాటు చేశాం. ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి అధ్యయనకేంద్రం లేదు. - ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కర్‌రావు, యూజీసీ, ఎస్వీయూ సెంటర్ డెరైక్టర్ -
కొత్త రిజిస్ట్రార్‌కు పెనుసవాళ్లు
రెండేళ్లుగా అస్తవ్యస్త పాలన అనుభవం లేని కొత్త రిజిస్ట్రార్ వర్సిటీకి నిధుల వరద పారనుందా? యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీనూతన రిజి స్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్త దేవరాజులునాయుడు ఎదుట అనేక సవాళ్లు ఉన్నారుు. బాధ్యతలు స్వీకరించిన నూతన రిజిస్ట్రార్‌పై యూనివర్సిటీలోని అన్ని వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. అస్తవ్యస్త పాలన ఎస్వీయూలో ఇప్పటివరకు పనిచేసిన అధికారుల హయాంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. సంవత్సరకాలంగా వర్సిటీలో లెక్కలేనన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. గత విద్యా సంవత్సరమంతా బంద్‌లతోనే సరి పోయింది. ఒక వైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు అంతకు మించిన ఉద్యమాలు క్యాంపస్‌లో నడిచాయి. 2013-14 విద్యా సంవత్సర ఆరంభంలోనే మహిళా హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలన్న అంశంపై మొదలైన ఆందోళనలు ఏడాది పొడవునా కొనసాగాయి. విభాగాల విలీనంతో ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అనంతరం అధ్యాపక పోస్టుల భర్తీ అంశంలో చోటు చేసుకున్న వివాదాలు, అధికారులపై వచ్చిన ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబునాయుడే గవర్నర్‌కు లేఖ రాశారు. అనుభవ లేమి ఎస్వీయూ నూతన రిజిస్ట్రార్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దేవరాజులుకు ఎలాంటి పరిపాలన అనుభవమూ లేదు. కనీసం విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. ఈయనకు క్యాంపస్‌లో పెద్దగా ప్రజాసంబంధాలు లేవు. విద్యార్థులతో, సంఘాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎదుర్కొన్న సందర్భాలు లేవు. కేవలం సామాజిక బలం, ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి. నిధుల వరద పారిస్తారా? ఎస్వీయూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. వర్సిటీని నడపాలంటే ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే గత ఏడాది ఇచ్చింది. ఈ ఏడాదికి రూ.265 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఈ ఆర్థిక లోటును వర్సిటీయే సొంతంగా సమకూర్చుకోవాల్సిందే. కొత్త రిజిస్ట్రార్ ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు తెస్తారో వేచి చూడాలి. వేతనాలు పెరిగేనా? ఎస్వీ యూనివర్సిటీలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు, ఫుడ్‌బేసిక్ వర్కర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు, అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కొత్త అధికారులు రావడంతో తమ వేతనాలు పెరుగుతాయని, తమకు మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. రిజిస్ట్రార్ వారి ఆశలను ఏ మేరకు తీర్చగలరో వేచిచూడాలి. కోర్టు కేసులు ఎస్వీయూకు సంబంధించి అనేక కోర్టు కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికోసం తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రార్ ఒక వైపు పాలన, మరో వైపు కోర్టు వ్యవహారాలు చక్క పెట్టాల్సి ఉంది. ఈ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
కొత్త బంగారు లోకం!
క్యాంపస్ ఓ అందమైన ప్రపంచం. సువిశాలమైన పకృతి ఒడిలో నెలకొల్పిన ప్రదేశం. భూలోక స్వర్గంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ చదువులో పరిణితి సాధించడంతోపాటు కళలకు సానపెట్టకోవచ్చు. ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం క్యాంపస్‌లో అడుగుపెట్టాలనిపించదు. ఇది నిజమే. ప్రతి విద్యార్థీ ఈ క్యాంపస్‌ను ఒక్కసారి చూస్తే తాను అందులో చదవాలని, అక్కడ గడపాలని భావించక తప్పదు. అలాంటి సుందరస్వప్నం వచ్చింది. సోమవారం నుంచి పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు క్యాంపస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నో ఆశల్ని, మరెన్నో ఆశయాల్ని, అందమైన ఊహల్ని, తల్లిదండ్రుల కలల్ని మోసుకొని వస్తున్నారు. ఇలాంటి కొత్తబంగారు లోకానికి స్వాగతం పలకడానికి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ సిద్ధమైంది. - రేపటి నుంచి పీజీ తరగతులు - తరలిరానున్న విద్యార్థులు యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీకి 62 సంవత్సరాల చరిత్ర ఉంది. 1952లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నత విద్యను అందించడానికి ఏర్పాటైన విద్యాలయం. జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించారు. సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటైన రాష్ట్రంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయం. ప్రవేశం అంత సులువు కాదు ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కళాశాలలున్నాయి. ఆర్ట్స్ కళాశాల్లో 25 సబ్జెక్ట్‌లు, సైన్స్‌లో 33 , కామర్స్‌లో 4 సబ్జెక్టులున్నాయి. వీటి ద్వారా 2305 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం కోసం సుమారు 12 వేల మంది ప్రవేశపరీక్ష రాశారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 11వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా 1327 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారు. వీరందరికి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అందమైన భవనాలు ఎంతో ఆకర్షణీయమైన, దృఢమైన భవన నిర్మాణాలు ఎస్వీయూ సొంతం. తాజ్‌మహల్‌ను తలపించే గ్రంథాలయం.. దేశం గర్వించే ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచనతో రూపొందించిన శ్రీని వాస ఆడిటోరియం.. నాలుగువైపులా గడియారాలతో సమయాలను సూచిస్తూ, నిటారుగా, హుందాగా కన్పించే పరిపాలనా భవనం.. ఇవి మతసామరస్యానికి చిహ్నంగా చెప్పవచ్చు. శ్రీనివాస ఆడిటోరియం ఒక్క పిల్లర్ కూడా లేకుండా నిర్మించడం ఎవరి మేథస్సు, అంచనాలకు అందని అద్భుత కట్టడం. దీనిపై శాస్త్రవేత్తల బొమ్మలు అద్భుతంగా చిత్రీకరించారు. పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో ప్రతినిత్యం ఏదో ఒక సదస్సులు జరుగుతుంటాయి. శ్రీనివాస ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకేసారి 1500 మంది ఇందులో కార్యక్రమాల్ని తిలకించవచ్చు. కంప్యూటర్ సెంటర్ ఎస్వీయూనివర్సిటీలోని విద్యార్థుల కోసం కంప్యూటర్ సెంటర్ ఉంది. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. బాలుర వసతిగృహాలవద్ద ఇంటర్నెట్ హబ్ ఉంది. దీన్ని రాత్రి వేళల్లో కూడా వాడవచ్చు. హెల్త్ సెంటర్ ఎస్వీయూ విద్యార్థుల కోసం చక్కటి ఆరోగ్య కేంద్రం ఉంది. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. క్యాంపస్‌లో చేరిన వెంటనే విద్యార్థులందరికీ ఓపీ కార్డులు ఇస్తారు. అనారోగ్యం కల్గితే చికిత్స కోసం వెళ్లవచ్చు. రక్తపరీక్ష, ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆధునిక పరికరాలు ఉన్నాయి. హెల్త్‌సెంటర్‌లో ఒక వైద్యుడు, ఒక నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర కేసుల్లో వైద్య సేవలందించడానికి వీలుగా రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. చక్కటి తరగతి గదులు క్యాంపస్‌లోని విద్యార్థులు విద్యనభ్యసించడం కోసం చక్కటి తరగతి గదులు, పర్నిచర్ ఉన్నాయి. కొన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలతో సెమినార్ హాళ్లు ఈ-తరగతి గదులు ఉన్నాయి. విద్యార్థులకు బోధించడం కోసం సుమారు 300 మంది నైపుణ్యం, సుదీర్ఘ అనుభవం కల్గిన అధ్యాపకులున్నారు. అధ్యాపకులు లేనిచోట అర్హత కల్గిన తాత్కాలిక అధ్యాపకులు విద్యార్థులకు విద్య అంది స్తున్నారు. ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రకాశం భవన్, వామనరావు భవనాల్లో తరగతి గదులున్నాయి. సైన్స్ కళాశాల రెండు సైన్స్ బ్లాకుల్లో విస్తరించి ఉంది. క్రీడా సదుపాయాలు పలు క్రీడా సౌకర్యాలున్నాయి. సుమారు 50 ఎకరాల్లో స్టేడియం ఉంది. చక్కటి జిమ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులున్నాయి. పలు మైదానాలు అందుబాటులో ఉన్నాయి. అన్నమయ్య భవన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ పొందడానికి అన్నమయ్యభవన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ, భావప్రకటన నైపుణ్యాల పెంపుపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మూడు క్యాంటీన్లు విద్యార్థులు సేదతీరడానికి, సరదాగా గడపడానికి పూర్ణ, అన్నపూర్ణ, సంపూర్ణ అనే మూడు క్యాంటీన్లు ఉన్నాయి. లైబ్రరీ చూడచక్కని రూపం, ఎదురుగా కూర్చొని చదవడానికి వీలుగా బల్లలు, హెమాస్లైట్లు, వాటిచుట్టూ వాటర్ ఫౌంటెన్లు, ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. ఇందులో దా దాపు 4 లక్షల పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్ర రీ, కాంపిటేటివ్ సెల్, రెఫరెన్స్ సెల్ ఉన్నాయి. అలానే ఎన్నోరకాల దిన, వార, మాస పత్రిక లు, జర్నల్స్, అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. హాస్టల్ వసతి ఎస్వీయూక్యాంపస్లో చేరిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. బాలురు కోసం పది, బాలికల కోసం 8 వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు ఐదు వేలమంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నా రు. వీరు భోజనం చేయడానికి వీలుగా అనుబంధ మెస్‌లు ఉన్నాయి. క్యాంపస్‌లో పీజీలో చేరిన విద్యార్థులందరికీ వసతి కల్పిస్తారు. ఇందులో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేయాలి. ఓసీ విద్యార్థులు రూ.6,750, బీసీ లైతే రూ.5,750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.4,750 కాషన్ డిపాజిట్ చెల్లిం చాలి. అలానే మెస్ కార్డుకోసం అదనంగా రూ.2100 చెల్లించి వసతి, మెస్‌లో భోజన సౌకర్యం పొందవచ్చు. లైబ్రరీని ఉపయోగించుకోవాలి ఎస్వీయూనివర్సిటీలో చక్కటి లైబ్రరీ ఉంది. వీటిలో నాలుగు లక్షల పుస్తకాలున్నాయి. దిన, వార, మాస పత్రికలతో పాటు ఎన్నో జర్నల్స్ ఉన్నాయి. అలానే పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం కాంపిటెటివ్ సెల్ ఉంది. ఇందులో అన్నిరకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అవసరమైన పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఆన్లైన్ జర్నల్స్ చూసుకోవచ్చు, నూతన విద్యార్థులు లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి. - వి.షణ్ముగం, లైబ్రరీ ఉద్యోగి సరైన వేదిక డిగ్రీ వరకు ఇంటిపట్టునే ఉండి చదువుకున్న విద్యార్థులు తొలిసారిగా తల్లిదండ్రులను వదలి క్యాంపస్‌లో అడుగు పెడుతున్నారు. యూనివర్సిటీల్లో ఎన్నో వసతులు, సౌకర్యాలున్నాయి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది తలపిస్తుంది. పీజీలో చేరిన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడి సౌకర్యాలు వినియోగించుకొని బాగా చదివితే స్థిరపడవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. - ప్రొఫెసర్ సీ.ఈశ్వర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చు ఎస్వీయూనివర్సిటీలో విద్యానభ్యసించిన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు మరెంతో మంది గొప్పవారు ఇక్కడి విద్యార్థులే. రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్లు వైస్‌చాన్స్‌లర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత వీసీ రాజేంద్ర కూడా ఇదే విశ్వవిద్యాలయంలో చదివిన వారే. - ప్రొఫెసర్ పి.శ్రీనివాసులరెడ్డి, తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఇక్కడ చదవడం అదృష్టం ఎస్వీయూనివర్సిటీకి 60 సంవత్సరాలు చరిత్ర ఉంది. రాష్టం లోనే రెండో పెద్ద విశ్వవిద్యాల యం. ఇందులో చదవడం ఎంతో అదృష్టం. ఈ విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి లైబ్రరి ఉంది. వీటి ద్వారా విద్యార్థులు ఎంతో జ్ఞానం పొందవచ్చు. మరెన్నో పరిశోధన సంస్థలు ఉన్నాయి. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నాము. - ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర, వైఎస్చాన్స్లర్, ఎస్వీయూ -
ప్రశాంతంగా జేఈఈ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఐఐటీ, ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం తిరుపతిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) ప్రశాంతం గా జరిగింది. రాయలసీమ జిల్లాలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరిగాయి. 28 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాల, ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు జరగడంతో టౌన్‌క్లబ్ సర్కిల్ నుంచి పద్మావతి వర్సిటీ వరకు రోడ్లు జనాలతో కిటకిటలాడాయి. పరీక్ష కేంద్రాల వద్ద సరైన సూచిక బోర్డులు లేకపోవడం, విద్యార్థులకు గైడ్ చేసే సహాయకుల సంఖ్య తక్కువగా ఉండడంతో పలువురు ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులంతా ఒక్కసారిగా చుట్టుముట్టడంతో వారికి సంబంధించిన గదుల కేటాయింపు బోర్డు వద్ద, లోపలికి ప్రవేశించే ద్వారం వద్ద తోపులాట జరిగింది. 90 శాతం పైగా హాజరు జేఈఈ ప్రవేశ పరీక్షకు 90 శాతం పైగా హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్ -1 ప్రవేశ పరీక్షకు 14,547 మంది దరఖాస్తు చేయగా 13,751 మంది హాజరయ్యారు. 95 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 2,515 మందికి గాను 2,285 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 91 శాతం హాజరు నమోదైంది. ఈ ప్రవేశ పరీక్షకు శ్రీవిద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ రోహిత్ పండా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 62,384 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 23 పట్ణణాల్లో 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించడానికి 44 మంది పరిశీలకులను నియమించారు. గురువారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. -
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 116 కళాశాలలకు చెందిన మొదటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులు, సప్లిమెంటరీ రాసేవారు 62,384 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను వెబ్సైట్లో పెట్టారు. ఆన్లైన్ ద్వా రా హాల్‌టికెట్ల పంపిణీ సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. మంగళవారం నుంచి సర్వర్ మొరాయించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ అంశాన్ని విద్యార్థులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వెబ్‌సైట్‌ను మంగళవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆన్లైన్ కష్టాలు ఎస్వీయూలో డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీనికోసం చెన్నైకి చెందిన టీఆర్ఎస్ ఫామ్స్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సంస్థ నిర్వాకంవల్లే మంగళవారం హాల్‌టికెట్ల డౌన్లోడ్ కాక ఇబ్బంది పడినట్లు కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు ఖండించారు. 60 వేల మంది ఒకేసారి హాల్‌టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. మధ్యాహ్నం కల్లా సరిదిద్దామని చెప్పారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇతర జిల్లాల వారికి తిరుపతిలో పరీక్షలు వైఎస్ఆర్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన సప్లిమెంటరీ విద్యార్థులకు డిగ్రీ పరీక్షలను తిరుపతి కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తున్నట్టు అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఏ.సునీత తెలిపారు. బీకాం, బీఎస్సీ, బీసీఏ విద్యార్థులకు ఎస్జీఎస్ కళాశాలలో బీఏ, బీబీఎం వారికి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో, బీఎస్సీ విద్యార్థులకు పద్మావతి డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాలి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఉన్నత విద్యా శాతం పెరగాలంటే విద్యా ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసోం గవర్నర్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్ జేబీ.పట్నాయక్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 17వ స్నాతకోత్సవం బుధవారం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని డిగ్రీలను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉన్నత విద్య చదివే వారి సంఖ్యను 25 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఉన్నత విద్యా శాతం పెంచాలంటే నాణ్యమైన, అర్హత కల్గిన అధ్యాపకులు అవసరమన్నారు. ఈ కొరతను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. అలాగే నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నాణ్యత కల్గిన విద్యా సంస్థల రేటింగ్‌లో మన దేశంలోని విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయన్నారు. సంస్కృత భాష అభివృద్ధికి సంస్కృత కమిషన్ ఏర్పాటయిందన్నారు. పాఠశాల విద్య నుంచే సంస్కృత భాషను తప్పనిసరి సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని సూచించారు. మన దేశంలో ఎక్కువ మంది యువత తాగుడుకు అలవాటు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు పెంచుకునేందు ప్రభుత్వాలు విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తున్నాయని అన్నారు. దీనిని రూపుమాపేందుకు విద్యావంతులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్కృత పండితులు ప్రియబ్రతదాస్ స్నాతకోపన్యాసం చేశారు. వేదాల్లో బ్రహ్మచర్యం ప్రాముఖ్యతను, బ్రహ్మచారి గొప్పతనాన్ని వివరించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడమే విద్య అంతిమ లక్ష్యం కావాలని అభిప్రాయపడ్డారు. మనిషి తన ప్రయాణాన్ని సత్యాన్ని చేరుకునే వరకు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీ హరేకృష్ణ శతపతి, రిజిస్ట్రార్ ఉమాశంకర్, వేదిక్ యూనివర్సిటీ వీసీ కె.ఈ దేవనాధన్, డీన్ రాధాక్రాంత్ ఠాకూర్ పాల్గొన్నారు. డిగ్రీలు ప్రదానం సంస్కృత విద్యాపీఠం 17వ స్నాతకోత్సవం సందర్భంగా ముగ్గురికి మహామహోపాధ్యా య, ముగ్గురికి వాచస్పతి, 50 మందికి పీహెచ్‌డీలు, 60 మందికి ఎంఫిల్, 277 మందికి ఎంఏ, 11 మందికి ఎంఎస్సీ, 118 మందికి బీఏ, 17 మందికి బీఎస్సీ, 41 మందికి ఎం ఈడీ, 149 మందికి బీఈడీ డిగ్రీలను ప్రదానం చేశారు. అలానే విద్యాపీఠం మ్యాగజైన్ ‘సుముసి’ని జేబీ.పట్నాయక్ ఆవిష్కరించారు. -
తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యానం
సాక్షి, తిరుమల: తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రతినిధులు ఆదివారం సామూహిక ధ్యానం నిర్వహించారు. యోగాగురు పండిట్ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ధ్యానంలో పాల్గొన్నారు. ఇందులో విదేశీయులు కూడా భారతీయ కట్టూబొట్టూ సంప్రదాయంతో హాజరయ్యారు. రవిశంకర్ సూచనలతో ప్రతినిధులందరూ ఉ చ్ఛ్వా స, నిశ్వాసపై దృష్టి కేంద్రీకరించి ధ్యానంలో లీనమైపోయారు. దేవదేవుని సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయటం ప్రతి ఒక్కరి అదృష్టంగా భావించాలని పండిట్ రవిశంకర్ అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అధికారులు సైతం ధ్యానంలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలను పండిట్ రవిశంకర్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలం భారతీయ హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలమని, అవి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యోగా గురు పండిట్ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో రవిశంకర్ మాట్లాడారు. భక్తులకు టీటీడీ కల్పించే సేవలు విశేషంగా ఉన్నాయని కొనియాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. -
స్వార్థాన్ని విడనాడండి
ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు భగవంతుడే సార్వభౌముడు ధ్యానం, జ్ఞానం, గానం అవసరం ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ప్రజలు స్వార్థాన్ని (నేను, నా అనే భావనను) వదిలిపెట్టాలని ‘ద ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పేర్కొన్నారు. ఎస్వీయూ క్రీడామైదానంలో ఆదివారం రాత్రి దివ్య సత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. 15 నిమిషాల పాటు అందరిచేతా యోగా చేయించారు. జీవనమనే బండికి భక్తి, ధర్మమే ఇంధనాలని చెప్పారు. కష్టపడే వ్యక్తిలోనే దైవత్వం ఉంటుందన్నారు. భగవంతుడే సార్వభౌముడని, ఆయన అన్నిచోట్లా ఉన్నాడని చెప్పారు. ప్రపంచం అంటే పంచభూతాలని చెప్పారు. గుడిలో హారతి, తీర్థం, ప్రసాదం, మంత్రోచ్ఛారణ, శఠగోపం రూపాల్లో పంచభూతాలు ఉన్నాయని చెప్పారు. మన పురాతన సంస్కృతి గొప్పదని, కొందరు ఇతర మతాల వైపు, ఇతర సంస్కృతుల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇది పెద్ద తప్పిదమని చెప్పారు. అజ్ఞానం వల్లే మతమార్పిడిలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని మతాలు సమానం అని, అన్ని మతాలను గౌరవించాలని సూచించారు. శఠగోపం అంటే మనం దేవుడికి దాసోహం అవుతున్నామని అర్థమన్నారు. ప్రతి వ్యక్తీ చిన్నచిన్న వాటికి దాసోహం కాకుండా, అత్యున్నతులైన భగవంతునికి మాత్రమే దాసోహం కావాలని చెప్పారు. మనం చేసే పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత ఉండాలన్నారు. మనది సంపన్నమైన రాష్ట్రం అని ఇంగ్లాండ్‌కు చెందిన మెకాలే చెప్పారని గుర్తు చేశారు. అయితే లంచగొండితనం వల్ల పేదరికం పెరిగిపోయిందన్నారు. ప్రతి డాక్టరూ ఏడాదిలో 3 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అలానే లాయర్లు ఏడాదిలో ముగ్గురికి ఉచిత న్యాయసలహా అందించాలని చెప్పారు. మన రాష్ట్రంలో వనరులకు కొదవ లేదని అయినప్పటికీ విదేశాల నుంచి అందే వనరులను దిగుమతి చేసుకోవడం బాధాకరమన్నారు. రోజూ ధ్యానం చేయండి ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. ధ్యానం వల్ల శరీరం సేద తీరి మనస్సు, ఆలోచనలు విశాలమౌతాయని చెప్పారు. తక్కువ కాలం సంతోషం ఎక్కువ కాలం బాధ ఉంటే అది చెడు అని, ఎక్కువ కాలం సంతోషం తక్కువ కాలం బాధ ఉంటే అది మంచి అని చెప్పారు. నేను అనే అహంకారం పోవాలంటే సహజంగా ప్రవర్తించాలని, ఒక రోజు పిచ్చివాడిలా వ్యవహరించాలని చెప్పారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛమైన మంచినీరు దొరకడం లేదన్నారు. ఇందుకోసం తాము తక్కువ ఖర్చుతో వాటర్ ఫిల్టర్ అందజేస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రతి రోజూ 80 లీటర్లు శుద్ధి చేసుకోవచ్చన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపొందించిన తెలుగు తల్లి అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ఎస్వీయూ వీసీ రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా వాలెంటీర్ ఫర్ బెటర్ ఇండియా అనే సంస్థకు చెందిన విద్యార్థులు రవిశంకర్ అనుగ్రహ యాత్రకు సంబంధించిన నృత్యాన్ని ప్రదర్శించారు. అలానే కళాబృందాలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులను భక్త పారవశ్యంలో ముంచెత్తాయి. -
పెత్తనం కొందరిదేనా?
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : పురాతన కాలం నుంచి బలహీనవర్గాలకు, దళితులకు రాజ్యాధికారం దక్కడం లేదని, రెండుమూడు కులాల వారే పెత్తనం చెలాయిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్వీయూనివర్సిటీలో మహాజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మహాజన సోషలిస్టు పార్టీ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. రాయలసీమలో ఎస్టీలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రిజర్వు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రతి రాజకీయ పార్టీ 50 శాతం సీట్లు బలహీనవర్గాలకు కేటాయించాలని సూచించారు. రాయలసీమకు చెందిన రాజకీయనాయకులే సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సూచించిన మేరకు తాము చిన్న రాష్ట్రాల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 2001లో ఎమ్మార్పీఎస్ స్థాపించిన సమయంలోనే ఈ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో టీడీపీలు తమ మ్యానిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని చేర్చాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్నాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మెన్రాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు వెంకటస్వామి, బీసీ సంఘం నాయకులు గోవిందు, భాస్కర్‌యాదవ్, హేమాద్రియాదవ్ పాల్గొన్నారు. నగరంలో బైక్ ర్యాలీ మహాజన సోషలిస్టుపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ నగరంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. పద్మావతి అతిథిగృహం నుంచి బాలాజీ కాలనీ, ప్రకాశంరోడ్డు, గాంధీరోడ్డు, తిలక్‌రోడ్డు, భవానీనగర్, రాజన్నపార్కు మీదుగా ఎస్వీయూ వరకు ర్యాలీ సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.