utta pradesh
-
ఒకే షిఫ్టులో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష
ప్రయాగ్‌రాజ్: ప్రావిన్షియల్ సివిల్ సర్వీసెస్(పీసీఎస్) ప్రిలిమినరీ పరీక్ష–2024 వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. ఈ పరీక్షను ఒకే రోజు కాకుండా వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీపీఎస్సీ) నిర్ణయించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరీక్షను పాత విధానంలోనే ఒకే రోజు ఒకే షిఫ్టులో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలంటూ యూపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. దీంతో యూపీపీఎస్సీ వెనక్కి తగ్గింది. పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే రివ్యూ ఆఫీసర్(ఆర్ఓ), అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్(ఏఆర్ఓ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. -
కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ
లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
అందుకే అలాంటి నిర్ణయం.. కన్వర్ యాత్ర ఆదేశాలపై యూపీ ప్రభుత్వ వివరణ
న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరగా.. ఈమేరకు కోర్టుకు తాజాగా యూపీ ప్రభుత్వం తమ వివరణను తెలియజేసింది. ‘‘హోటల్స్, తినుబండారాల పేర్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని యాత్రికులు ఫిర్యాదు చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ (యూపీ) శివభక్తుల కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ల వివాదం పిటిషన్లపై ఇవాళ (జులై 26) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కీలకమైన ఆమేథీ పార్లమెంట్ స్థానంలో సస్పెన్స్‌కు తెరదించుతూ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలోకి దించింది. ఆయన ఎంపికపై బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఆమేథీలో కాంగ్రెస్ పార్టీ ఒక ‘ప్యూన్’ను పోటీకి దింపిందని ఎద్దేవా చేసింది. అయితే బీజేపీ విమర్శలకు ఆమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ కౌంటర్ ఇచ్చారు. తాను గాంధీ కుటుంబానికి ‘సర్వెంట్’ను కాదు.. చాలా అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని అని బీజేనీ విమర్శలను తిప్పికొట్టారు.‘ఆమేథి నియోజకవర్గంలో నా ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. నాకు టికెట్ ఇచ్చేవరకు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేయలేదు. టికెట్ రాకముందే నేను సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఓడిస్తానని ఎలా విశ్వాసం వ్యక్తం చేస్తాను. ఇక్కడ పోటీ చేస్తున్న నేను గాంధీ కుటుంబానికి సర్వెంట్‌ను కాదు.. నేను చాలా ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని. నాకు ఇక్కడ కాంగ్రెస్‌తో 1983 నుంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నేను వేతనం తీసుకునే ఉద్యోగి కాదు.. నేను ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని’ అని కిషోరి లాల్ శర్మ అన్నారు.ఆమేథీలో మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు కేరళలోని వాయ్‌నాడ్ సెగ్మెంట్ గెలిచారు రాహుల్ గాంధీ. అదే విధంగా ఈసారి కూడా రాహుల్ గాంధీ వాయ్‌నాడ్ బరిలో దిగగా.. అక్కడ పోలింగ్ పూర్తైంది. ఇక.. కాంగ్రెస్ పార్టీకి కీలమైన ఆమేథీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించింది. ఆమేథీలో కిషోరి లాల్ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ రెండు స్థానాలో మే 20న పోలింగ్ జరగనుంది. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్‌వే
ఉత్తరప్రదేశ్. లోక్‌సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్‌బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్‌బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్‌సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్, అఖిలేష్‌లది ఓ ఫెయిల్యూర్ సినిమా: మోదీ
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్‌లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడించటమే టార్గెట్‌గా ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఎస్పీ పొత్తు ఒక ఫెయిల్యూర్ సినిమా వంటిదని మోదీ ఎద్దేవా చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ పెట్టుకున్న పొత్తు ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. ఇద్దరు బాలురి (రాహుల్, అఖిలేష్)సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. ‘బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే 400 సీట్లు గెలువకుండా ప్రతిపక్షాలు పోటి చేస్తున్న మొదటి ఎన్నికలు ఇవి. సమాజ్‌వాదీ పార్టీ.. కాగ్రెస్ కోసం గంట గంటకు అభ్యర్థులను మార్చుకునే స్థితిలోకి వెళ్లిపోయింది. వారి బలమైన స్థానాల్లో సైతం పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఎస్పీ ఉంది. ఇద్దరు బాలురి(రాహుల్, అఖిలేష్) సినిమా గతంలో ఫెయిల్యూర్ అయింది. అయినా మళ్లీ ఇప్పుడు జతకట్టారు’ అని మోదీ అన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఇద్దరు సుమారు ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రాలో రోడ్డు షోలో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక..లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పోత్తులో భాగంగా మొత్తం 80 సీట్లలో ఎస్పీ-63 స్థానాల్లో, కాంగ్రెస్-17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్ -
ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ కుమార్తె
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది. ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు డింపుల్ తీసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ములాయం సింగ్‌ను ‘దాదా’ అని పిలిచేవారు. మెయిన్‌పురి సీటు 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి స్థానం నుంచి మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డింపుల్ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. యూపీలో నూతన రామాలయం ప్రారంభమైన నేపధ్యంలో ఇది సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందని పలువురు అంటున్నారు. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యూపీలో ముస్లిం, యాదవ్ వర్గాలను సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్ వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో తన హవా చాటుతోంది. -
జయా బచ్చన్‌కు మరోమారు రాజ్యసభ?
రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఈరోజు (సోమవారం) ప్రకటించే అవకాశాలున్నాయి. మీడియాకు తెలిసిన వివరాలప్రకారం సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) మరోమారు జయ బచ్చన్‌ను రాజ్యసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరో ఇద్దరి పేర్లను ఈరోజు వెల్లడించనున్నారు. సమాజ్‌వాదీపార్టీ కార్యాలయంలో జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో రాజ్యసభకు పంపే అభ్యర్థులను నిర్ణయించడంతో పాటు ఏ అభ్యర్థికి ఓటు వేయాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. -
బాలరామునికి భారీ వేణువు
అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు. అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు. కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు. కాగా వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు. ఇది కూడా చదవండి: ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే.. ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు. ఈ బారీ వేణువుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేణువును ఒక ట్రక్కులో అయోధ్యకు తరలించనున్నారు. -
యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్!
భోపాల్:మధప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్‌యాదవ్ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు స్టేట్లలో యాదవ జనాభా డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను బీజేపీ మధ్యప్రదేశ్‌కు సీఎంను చేస్తోందని పొలిటికల్ పండిట్లు విశ్లేషిస్తున్నారు. అంతేగాక మోహన్ యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆయనను సీఎం చేస్తే ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పవర్లోకి రావాలనేది కమలనాథుల టార్గెట్ అని స్పష్టమవుతోంది. మోహన్ యాదవ్ ఎంపికతో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గఢ్‌ముక్తేశ్వర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న కార్తీక పూర్ణిమ మేళాకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఓ వైపు ఘంటానినాదాలు, మరోవైపు మేళతాళాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గంగానది ఒడ్డున అలంకరించిన దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. గఢ్‌ముక్తేశ్వర్‌లోని గంగా ఘాట్లు భక్తుల కీర్తనలతో మారుమోగుతున్నాయి. మహాభారత కాలం నుంచి కార్తీక మాసంలో ఇక్కడి గంగానది ఒడ్డున జాతర జరుగుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26,27 తేదీలలో జరగనుంది. దీంతో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా గంగామాతకు హారతులు ఇస్తున్నారు. గంగా ఘాట్లపై యువతులు అందమైన ముగ్గులు వేస్తున్నారు. హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మేళా నవంబర్ 29 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26, 27 తేదీలలో జరుగుతుందని, దాదాపు 35 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా వేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన 2200 మంది పోలీసులు గంగామేళాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్? -
యూపీ సీఎంపై మహంత్ తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులతో వాగ్వాదం
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి(మహంత్) యతి నరసింహానంద్ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్‌ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్ గత 27న మీరఠ్‌లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్‌కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ములాయం, మాయావతి, అఖిలేష్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్ ఆరోపించారు. కొద్దిసేపు యతి నరసింహానంద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్‌ను అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
‘కుక్కకు ప్రేమతో’.. 13వ రోజున శాంతి హోమం, అన్నదానం!
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని బిజ్రోల్ గ్రామంలో ఒక వీధికుక్క మృతి చెందిన నేపధ్యంలో దానికి గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దాని ఆత్మశాంతి కోసం శాంతిహోమం నిర్వహించారు. అది మృతిచెందిన 13వ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గ్రామస్తులంతా ఒక చోట చేరి, ఆ కుక్కకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతూ ప్రార్థనలు కూడా చేశారు. వివరాల్లోకి వెళితే బాగపత్లోని బిజ్రోల్ గ్రామంలో ఉంటున్న వీధి కుక్క టామీ ఉరఫ్ మున్నా అక్కడి అన్ని గల్లీలోనూ తిరిగేది. ఆ కుక్కను గ్రామస్తులంతా ఎంతో ప్రేమగా చూసేవారు. అది గ్రామస్తులందరికీ ఎంతో దగ్గరయ్యింది. అయితే అది ఆగస్టు 6న తన 12 ఏళ్ల వయసులో మృతి చెందింది. దీంతో గ్రామస్తులంతా ఎంతో బాధపడ్డారు. దాని ఆత్మ శాంతించాలని పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. 13వ రోజున సామూహక అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గ్రామానికి చెందిన శ్రవణ్ సింగ్ మాట్లాడుతూ టామీ అంటే గ్రామంలోని అందరికీ ఎంతో ఇష్టమని, దాని గుణాలు తమను ఎంతో ఆకట్టుకునేవని అన్నారు. ఆ కుక్క మృతిచెందిన 13వ రోజున 500 మందికి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. కుసుమ అనే గృహిణి మాట్లాడుతూ టామీని తాము తమ పిల్లగా చూసుకునేవారమని, అది ఎంతో తెలివైనదని అన్నారు. అది ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదన్నారు. ఇది కూడా చదవండి: భూమిని చీల్చుకు వచ్చిన మొసళ్లు.. గుండె గుభేల్మనిపిస్తున్న వీడియో..! -
నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్
శ్రీ కృష్ణుని జన్మస్థలి మధుర, లీలాస్థలి బృందావనం.. ఈ రెండూ భక్తులకు భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయని అంటారు. శ్రీకృష్ణుని అపార ప్రేమకు ఈ రెండు ప్రాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ తన అపార భక్తిభావనతో బృందావనం చేరుకుని, శ్రీకృష్ణుని భక్తిలో మునిగితేలుతోంది. షబ్నం.. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని జిగర్ కాలనీ నివాసి ఇక్రమ్ హుస్సేన్ కుమార్తె. ఇక్రమ్ వంటపాత్రలతో పాటు లోహ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. షబ్నంనకు చిన్నప్పటి నుంచే హిందూ దేవీదేవతలపై ఆరాధనా భావం ఏర్పడింది. ఇదే ఆమెను కృష్ణునిపై ప్రేమకు, ఆపై బృందావనానికి పయనమయ్యేలా చేసింది. నాలుగు నెలల క్రితం ఆమె.. చేతిలో లడ్డూ పట్టుకున్న బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకుని బృందావనం చేరుకుంది. ఇక్కడి గోవర్థన ప్రదక్షిణ మార్గంలోని గోపాల ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. దీంతో ఇక్కడే ఉంటూ శ్రీకృష్ణుని భక్తిలోనే తన జీవితం అంతా గడపాలని నిశ్చయించుకుంది. 2000లో షబ్నంకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో నిఖా జరిగింది. ఐదేళ్ల తరువాత ఆమకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి ఇక్రమ్ ఇంటికి తిరిగివచ్చి కొన్నాళ్లు అక్కడే ఉంది. తరువాత షబ్నం ఢిల్లీ చేరుకుని మొదట ఒక ప్రేవేట్ కంపెనీలో, ఆ తరువాత లేడీ బౌన్సర్గానూ పనిచేసింది. శ్రీకృష్ణునిపై తనకు ఏర్పడిన ప్రేమ గురించి షబ్నం మాట్లాడుతూ ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులందరితో బంధాన్ని తెంచుకున్నానని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిపింది. శ్రీ కృష్ణుడే తనకు సర్వస్వం అని, అందుకే అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: యువత పాడైపోతున్నదంటూ సంగీత పరికరాల దహనం! -
‘అదొద్దు.. బుల్లెట్టే కావాలి’.. వరునితోపాటు 50 మందిని బుక్ చేసిన పోలీసులు!
ఉత్తరప్రదేశ్‌లోని దెహాత్కు ఊరేగింపుగా వచ్చిన మగపెళ్లివారు వధువు తండ్రి తమకు బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాలయల కట్నం అదనంగా ఇవ్వలేదని వెనుదిరిగారు. ఈ విషయమై పెళ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితో పాటు వారి తరుపు 50 మంది బంధువులపై కేసు నమోదు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రూరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నౌరంగాబాద్ నివాసి మోతీలాల్ మగపెళ్లి వారు అదనపు కట్నం అడిగారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో తన కుమార్తెకు మున్నూ సింగ్ కుమారుడు బాదల్‌తో వివాహం నిశ్చయమయ్యిందని తెలిపాడు. జూన్ 18న కల్యాణ మండపానికి వరుని తరపు వారంతా వచ్చారన్నాడు. వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశామన్నాడు. సరిగ్గా పెళ్లి తంతు ప్రారంభమయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారని తెలిపారు. బుల్లెట్ బండితోపాటు లక్ష రూపాయలు అదనంగా కావాలని కోరారన్నారు. వారు ఉన్నట్టుండి ఇలా అడిగేసరికి అడపెళ్లివారు, మగపెళ్లివారి మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు. వరునికి ఇంతకు మునుపే ఒక బైక్ కొనుగోలు చేశామని, అయితే అది వద్దని బుల్లెట్ బండి మాత్రమే కావాలని అడుగుతున్నాడని వధువు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు, అతని తండ్రితోపాటు మరో 50 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
కూతురికి లవ్ లెటర్.. విడిచిపెట్టని తల్లి.. 15 ఏళ్లపాటు కోర్టులో కేసు..
యూపీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో నిందితునికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది. ఒక మైనర్ బాలుడు మరో మైనర్ బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపధ్యంలో బాలిక తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బాందా జిల్లాలో 2008లో ఒక మైనర్ బాలునిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె ఆ బాలుడు.. తమ కుమార్తె(బాలిక)కు అశ్లీల రీతిలో ఉత్తరం రాయడమే కాకుండా వేధించాడని పేర్కొంది. దీంతో పోలీసులు ఆ బాలునిపై కేసు నమోదు చేశారు. విషయం కోర్టు వరకూ చేరింది. గత 15 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో పలువురు జడ్జిలు కూడా మారారు. ఎట్టకేలకు చివరికి ఆ యువకుడిని (అప్పుడు బాలుడు) దోషిగా నిర్థారిస్తూ ఏడాదిపాటు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. తెలిసీ తెలియని వయసులో రాసిన ఒక లవ్ లెటర్ కారణంగా ఆ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ ఉదంతం యూపీలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 2008 మే 21న ఒక మహిళ తన కుమార్తెకు ఒక కుర్రాడు అశ్లీల రాతలతో కూడిన ఉత్తరం రాశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసు 2008లో మొదలై 2023 వరకూ ఏకంగా 15 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో 70 నుంచి 80 వాయిదాలు పడగా, పదిమందికిపైగా జడ్జిలు కూడా మారారు. కాగా తాజాగా ఒక ఉన్నతాధికారి ఈ కేసులో చొరవచూపి, త్వరగా కేసును పరిష్కరించాలని జడ్జి బీడీ గుప్తాకు విన్నవించారు. ఈ నేపధ్యంలో నిందితుడు స్వయంగా జడ్జి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఎటువంటి కేసును ఎదుర్కోలేనని, ఇటువంటి తప్పు మరోమారు చేయబోనని విన్నవించుకున్నాడు. దీంతో జడ్జి ఆ యువకుని సత్ప్రవర్తనను గుర్తించి, ఏడాదిపాటు పరిశీలన(ప్రొబెషన్)శిక్ష విధించారు. దీంతో ఆ యువకుడు ప్రాసిక్యూటింగ్ అధికారి పరిశీలనలో ఏడాది పాటు ఉండవలసి ఉంటుంది. -
పేరుకు పొలిటికల్ లీడర్.. పాపం ఇలా బుక్కయ్యాడు.. వీడియో వైరల్
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ప్రభుత్వాలు మాస్కులు ధరించని వారికి జరిమానాలు సైతం విధించింది. దీంతో పల్లెటూరు నుంచి పట్నం దాకా.. మాస్కు ఎలా ధరించాలో అందరికీ తెలిసిపోయింది. కాగా, శివసేన పార్టీకి చెందిన ఓ నేత తాజాగా మాస్కు ధరించేందుకు 2 నిమిషాల పాటు తర్జనభర్జన పడ్డారు. అప్పటికీ మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలియక మరో వ్యక్తి సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన 41 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన నేతలు గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో శివసనే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా.. ఆయన వెనుక నిలుచున్న ఓ శివసేన నేత.. ఎన్-95 మాస్కును ఎలా ధరించాలో తెలియక దాదాపు రెండు నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాస్కు పెట్టుకోవాడం రాకపోవడంతో చివరకు పక్కనున్న మరో నేత సాయం కోరాడు. ఆయన సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నేతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. మాస్క్ పెట్టుకోగానే ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు ఓ స్పూఫ్ వీడియో కూడా జతపరిచారు. w8 for it...! 😁 pic.twitter.com/uG7gkaNLBg — Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022 -
పోయే కాలం అంటే ఇదేనేమో.. సోషల్ మీడియాను షేక్ చేసిన మహిళ
లక్నో: ఓ మహిళ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీ కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టడమేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్ ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటోంది. కాగా, తన ఇంట్లోని కిటికీని క్లీన్ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది. వెంటనే ఓ క్లాత్ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. She is a woman...can do anything.. A woman was seen hanging on to the railing of the fourth floor and cleaning the window. #Ghaziabad,#UttarPradesh.#LadkiHoonLadSaktiHoon (मैं एक लड़की हूं, मैं लड़ सकती हूं) 👇👇 pic.twitter.com/NJNlDX7njv — Mitesh Bambhaniya (@IamMitesh86) February 21, 2022 దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్ ఉమెన్ అని పొడుగుతుంటే.. ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూపీలోని కర్హాల్ వెళ్తుండగా మార్గమధ్యలో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నుంచి బఘేల్ క్షేమంగా బయటపడ్డారు. కానీ, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఆయనపై సమాజ్‌వాదీ పార్టీ చెందిన వారే దాడి చేశారంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతున్నారనే భయంతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది. శాంతి భద్రతల అంశం వారి చేతిలోనే ఉంది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చాకే పారిశ్రామికవేత్తలందరూ బ్యాంకులను లూటీ చేసి పారిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి ఘటనలు ఎక్కువవుతాయని అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సత్యపాల్.. కర్హల్ నియోజకవర్గం బీజేపీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ బరిలో ఉన్నారు. -
అత్త అల్లుడు వివాహేతర సంబంధం, పెళ్లి, ట్విస్టు ఏంటంటే?
లక్నో: సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. అత్త, అల్లుడు పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. 50 ఏళ్ల మహిళ ఒకరు పాతికేళ్ల వయసున్న తన సొంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వీరి సంబంధం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 10 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే 10 నెలల క్రితం పారిపోయిన వీరిద్దరూ బుదవారం ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు వివాహం జరిగిన విషయం తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే ఇందుకు కుటుం సభ్యులు అంగీకరించలేదు. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ జంటను అరెస్టు చేశారు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో.. అత్త, అల్లుడి అక్రమ సంబంధంపై నిరసన వ్యక్తం చేశారు. -
ఉత్తరప్రదేశ్ : లక్నో లో విషమిస్తున్న పరిస్థితులు
-
కుటుంబ సభ్యులనే హతమార్చిన డాక్టర్
గుర్గావ్: కుటుంబ భారాన్ని మోయడం కష్టమౌతోందని ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. స్థానికులు సోమవారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులను బయట గుర్తించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసికు చెందిన ప్రకాష్ సింగ్ (55) తన భార్య సోను సింగ్ (50), కుమార్తె అదితి (22), కుమారుడు ఆదిత్య (13) నిద్రిస్తున్నప్పుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరి గొంతును కత్తితో కోసిన గాయాలున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న సూసైడ్ నోట్లో కుటుంబ నిర్వహణ కష్టమైన కారణంగానే ప్రకాష్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన అనంతరం, సూసైడ్ నోట్‌ను ‘అతనే రాశాడా? లేక మరెవరైన రాశారా?’ అని కోణంలో విచారణ చేపడుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ప్రకాష్ గత ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లోనివాసం ఉంటున్నాడు. అతని భార్య గుర్గావ్లో సొంత స్కూల్‌ను నడుపుతోంది. -
మాజీ ఐఏఎస్ 225 కోట్ల ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేత్రామ్, ఆయన సన్నిహితులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతాలోని స్థిరాస్తులు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బూటకపు కంపెనీల్లో నేత్రామ్, ఆయన సన్నిహితులు కొందరు రూ.98.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ విభాగానికి సమాచారం అందడంతో గతంలో ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్‌కతా, బరేలిలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేసింది. 1979 బ్యాచ్‌కు చెందిన నేత్రామ్ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు.