Vempalle
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని.. ఆత్మహత్య!
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లోని క్యాంటిన్‌కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేంపల్లి పిల్లలకు ఆల్‌ది వెరీ బెస్ట్: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వేంపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోనే మోడల్ పాఠశాల గుర్తింపు పొందిన వేంపల్లి జెడ్పీ స్కూల్‌కు వెళ్లి.. అక్కడి పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. రూ. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వేంపల్లి జెడ్పీ పాఠశాలను సీఎం జగన్ ప్రారంభించారు. నాడు-నేడులో భాగంగా.. స్కూల్ రూపురేఖలు గతంలో ఎలా ఉండేవో? ఇప్పుడు ఎలా మారాయో.. స్వయంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపించారు సీఎం జగన్. అంతేకాదు పిల్లలందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఆల్‌ది వెరీ బెస్ట్ తెలియజేశారు. ‘అందరూ బాగా చదవాలి. ఈరోజు మీరు వేసే అడుగులు.. పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదివే పిల్లల చదువులకు ఏమాత్రం తీసిపోకూడదు. గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి’ అని కోరుకుంటూ మరోసారి ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. వైఎస్సార్ పర్యటనలో భాగంగా.. వేంపల్లిలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సీఎం జగన్ ప్రారంభించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన. -
Live Blog: సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
-
CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పులివెందుల/కడప: జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 9.30కి బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30కి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55కు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్అండ్బి అతిథి గృహానికి చేరుకుంటారు. ►11.05 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. 1.05కు ఆర్అండ్బి గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 1.15కు పులివెందులలోని ఏపీకార్ల్ చేరుకుంటారు. అక్కడ 1.30వరకూ ఉండి క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు. 1.30కి ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 1.35కు ఏపీకార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్‌లో పాల్గొంటారు. ►2.35కు ఏపీకార్ల్ నుంచి బయలుదేరి 2.45కు బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 2.50కు అక్కడి నుంచి బయలుదేరి 3.05కు వేంపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 3.20వరకూ స్థానిక నేతలతో మాట్లాడుతారు. 3.20కి రోడ్డు మార్గాన బయలుదేరి 3.30కి డా. వైఎస్సార్ స్మారక పార్కుకు చేరుకొని పార్కును ప్రారంభిస్తారు. 3.50కి అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ 4.50 వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటిస్తారు. 4.50కి వేంపల్లి జెడ్పీ స్కూల్ నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు వేంపల్లి హెలీప్యాడ్ చేరుకుంటారు. 5.05కు హెలికాప్టర్లో బయలుదేరి 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. చదవండి: (YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’) ►8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్ ఘాట్ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొంటారు. వేంపల్లెలో సీఎం పర్యటనా ప్రాంతాలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ 8 సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు వేంపల్లె: ఈనెల 7, 8వ తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీటీసీ ఎం.రవికుమార్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటనా ప్రాంతాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ►కడప – పులివెందుల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు భద్రతపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్కు, రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్స్, ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించారు. వీటిని 7వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ►కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, ఎంపీపీ ఎన్.లక్ష్మీగాయత్రి, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, ఈఈ సిద్ధారెడ్డి, ఏపీఈడబ్లు్యఐడీసీ డీఈ సుబ్రమణ్యకుమార్, విద్యుత్ శాఖ డీఈ శ్రీకాంత్, స్పెషలాఫీసర్ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్ ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అధికారులకు సూచనలు పులివెందుల: సీఎం వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్న దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు మంగళవారం పరిశీలించారు. పులివెందులలోని భాకరాపురంలోని హెలీప్యాడ్, ఆర్అండ్బీ అతిథి గృహం, ఏపీ కార్ల్‌ను వారు పరిశీలించారు. అధికారులకు పర్యటనా ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలు, భద్రతకు సంబంధించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఏపీ కార్ల్‌లో రైతులతో సమావేశం ఉన్నందున అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ►పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి, కమిషనర్ నరసింహారెడ్డి, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. -
మిన్నల్లి పనిపట్టే వై.ఎన్. ద్రావణం!
మిరప, బత్తాయి తదితర పంటలను ఆశిస్తూ అనేక రాష్ట్రాల్లో రైతులను బెంబేలెత్తిస్తున్న వెస్ట్రన్ త్రిప్స్ లేదా నల్లపేను లేదా మిన్నల్లికి ఎర్రి పుచ్చకాయలు, నల్లేరు (వై. ఎన్.) ద్రావణం అద్భుతంగా పనిచేస్తున్నదని వైఎస్సార్ జిల్లా వెంపల్లె మండలం టి. వి. పల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కె. విజయ్‌కుమార్ తెలిపారు. ఆరేళ్ల క్రితం ‘సాక్షి సాగుబడి’లో ప్రచురితమైనప్పటి నుంచి వై.ఎన్. ద్రావణం అన్ని రకాల పంటల్లో పురుగులు ఆశించకుండా నిలువరించటం, ఆశించిన పురుగును అరికట్టేందుకు వై. ఎన్. ద్రావణం ఉపయోగపడుతోందన్నారు. ఇప్పుడు మిరప తదితర తోటలను ఆశిస్తున్న మిన్నల్లిని అరికట్టడానికి కూడా వై.ఎన్. ద్రావణం చక్కగా పనిచేస్తున్నదని తెలిపారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదని, చాలా ఏళ్లుగా ఉన్నదేనని ఆయన అంటున్నారు. వై.ఎన్. ద్రావణం తయారీ ఇలా.. 5 కిలోల యర్రి పుచ్చకాయలు, 5 కిలోల ముదురు నల్లేరు కాడలు రెండింటిని మొత్తగా దంచాలి. వంద లీ. నీరు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పది రోజులు నిల్వ ఉంచి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. ఏడాది పాటు నిల్వ ఉంటుంది. నీడపట్టున ఉంచి పైన గోనె సంచి కప్పాలి. ఈ పసరు శరీరంపై పడితే విపరీతమైన దురద, దద్దుర్లు వస్తాయి. ముందు జాగ్రత్తగా చేతులకు తొడుగులు, ముక్కుకు శుభ్రమైన బట్టను కట్టుకోవాలి. పొరపాటున శరీరంపై పడితే పేడ రసం, బురద రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వరుసగా మూడు పిచికారీలు వై. ఎన్ ద్రావణాన్ని గత ఎనిమిదేళ్లుగా వివిధ పంటలపై పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇందులో ఉండే చేదు ప్రభావం.. చర్మంపై పడగానే కలిగే దురద వల్ల పురుగులు చనిపోతాయి. గుడ్లు దశలో పిచికారీ చేస్తే పురుగు లార్వాలు మరణిస్తాయి. ఏ రకం పంటలయినా వై. ఎన్. ద్రావణాన్ని మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండు పిచికారీల మధ్య 6 రోజుల ఎడం పాటించాలి. ఎకరాకు 15 ట్యాంకుల వరకు పిచికారీ చేస్తే పైరు బాగా తడిచి ద్రావణం సమర్థవంతంగా పని చేస్తుంది. ఉ. 6–9 గంటలు, సా. 5.30–7.00 మధ్య పిచికారీ చేయాలని విజయకుమార్ సూచించారు. (చదవండి: నల్ల పేనుకు హోమియోతో చెక్!) ఆకుకూరలను ఆశించే త్లెల పేనుబంక, రంధ్రాలు చేసే మిడతలను వై. ఎన్. ద్రావణం నివారిస్తుంది. ఆకుకూరలపై మొదటిసారి ట్యాంకు (20లీ.)కు 1/2 లీ., రెండోసారి 1 లీ., మూడోసారి 1 1/2 లీ. చొప్పున ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. కాయగూరలు వేరుశనగ, పత్తి, మిరప, వరి వంటి పైర్లు, పండ్ల తోటలపై మూడు దఫాలు వరుసగా 1లీ., 11/2లీ., 2 లీ. చొప్పున పిచికారీ చేయాలి. వేరు శనగను ఆశించే పచ్చపురుగు, నామాల పురుగు, కాండం తొలిచే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. వరిలో సుడిదోమ, కాండం తొలిచే పురుగును నివారిస్తుంది. పండ్ల తోటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే వివిధ చీడపీడలను వై. ఎన్. ద్రావణం సమర్థవంతంగా నివారిస్తుంది. (చదవండి: వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం) మామిడిలో తేనెమంచు పురుగుపై ఇది చక్కని ఫలితాన్నిస్తుందని విజయకుమార్ తెలిపారు. చెట్లపై పూత దశకు ముందు, పిందె దశలో మాత్రమే బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పూత మీద పిచికారీ చేస్తే రాలిపోతుంది. నిమ్మ, దానిమ్మ, బొప్పాయిల్లో వచ్చే మసి తెగులు, ఆకుముడతను నివారిస్తుందని విజయకుమార్ (98496 48498) తెలిపారు. -
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
సాక్షి, వేంపల్లె(కడప) : మండలంలోని గిడ్డంగివారిపల్లె గ్రామంలో ప్రమాదవశాత్తు వెంకటశివారెడ్డి(38) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి వెంకటశివారెడ్డి మిద్దెపైన నిద్రపోయారు. వ్యవసాయ పనుల నిమిత్తం తెల్లవారుజామున నిద్రలేచి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించగా.. మార్గ మధ్యంలోనే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల రెండు నెలల క్రితం భార్య రమాదేవి క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు కుమారులు ప్రకాష్‌రెడ్డి, హేమంత్‌రెడ్డిలు కాగా.. పెద్ద కుమారుడు ప్రకాష్‌రెడ్డి తోటలో పాము కాటుతో గతంలోనే మృతి చెందాడని బంధువులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో హేమంత్‌రెడ్డి ఒక్కడే ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. పోస్టుమార్టం కోసం వెంకటశివారెడ్డి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. -
బడిని బతికించుకున్నారు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ముప్కాల్ మండలం వేంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, విద్యార్థుల డ్రెస్ కోడ్, పాఠశాలలో వసతులను, విద్యా బోధనను చూసి ప్రైవేటు పాఠశాల అనుకుంటే పప్పులే కాలు వేసినట్లే. ఇదంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. వేంపల్లి ప్రాథమిక పాఠశాల నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు 210 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాలలో కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలకు పంపించకుండ ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. 2015–16లో 23 మంది విద్యార్థులతో ప్రారంభమైంది మండలంలోని వేంపల్లి ప్రాథమిక పాఠశాల. అదే సంవత్సరం గ్రామంలోని యువకులు, గ్రామస్తులు అంత కలిసి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపకూడదని తీర్మానం చేయడంతో విద్యార్థుల సంఖ్య 130కి చేరింది. 2016–17 విద్యా సంవత్సరంలో వీడీసీ, గ్రామస్తులు ఐక్యంగా నిలబడి ప్రైవేట్ బడికి పిల్లలను పంపకూడదు అని మళ్లీ తీర్మానించడంతో విద్యార్థుల సంఖ్య 180కి చేరింది. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుండటంతో ప్రస్తుతం పాఠశాలలో 210 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో పాఠశాలలో ప్రవేశానికి నో ఎంట్రీ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో ఇంగ్లిష్ మీడియం ప్రావేశ పెట్టారు. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు 210 మంది చదువుతున్నారు. వేంపల్లిలో గతంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో క్రమేణా ప్రాథమిక పాఠాశాలగా మార్చారు. నాలుగేళ్ల క్రితం పాఠశాలలో 23 మంది విద్యార్థులే పాఠశాలలో చదివేవారు. దీంతో ప్రాథమిక పాఠశాలను కూడా మూసేస్తారని భావించిన గ్రామస్తులు బడిని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, ఇతర గ్రామాలకు పంపమని తల్లితండ్రులు తీర్మానం చేసుకోవడంతో ప్రస్తుతం 210 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల నిర్వహణకు నిధి.. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులే ఐదుగురు విద్యా వలంటీర్లను నియమించారు. వారి జీతాల కోసం, పాఠశాల నిర్వహణలో కోసం గ్రామస్తులు 2015–16 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక నిధి ఏర్పాటు చేశారు. గ్రామంలో 300 కుటుంబాలుంటాయి. ప్రతి కుటుంబం నుంచి రూ. వేయి వసూలు చేసుకుని నిధి ఏర్పాటు చేశారు. అంతేకాకుండ గ్రామంలోని ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల సభ్యులు ప్రతి సంవత్సరం విరాళాలు అందిస్తున్నారు. దీంతో రూ.మూడు లక్షల నిధిని గ్రామస్తులు ఏర్పాటు చేస్తే దానికి దాతల సహకారం లభిస్తుంది. ప్రతి సంవత్సరం విద్యా వలంటీర్లకు ఆ నిధి నుంచే జీతాలను చెల్లిస్తున్నారు. దానికి తోడు గ్రామంలో పలువురు దాతలు ముందుకు రావడంతో పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రవేశాల్లో సత్తా చాటుతున్నారు. 2016–17లో 19 మంది, 2017–18 లో 23 మంది, 2018–19లో 23 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. తరగతి గదుల కొరత మూడేళ్లుగా వేంపల్లి ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా కొనసాగుతోంది. కాని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యను మాత్రం అధికారులు పెంచడం లేదు. దీంతో గ్రామస్తులకు విద్యా వలంటీర్ల వేతనాలు భారంగా మారాయి. రెగ్యులర్ పోస్టులు రెండు ఉన్నాయి. ఇద్దరు డిప్యూటేషన్‌పై వచ్చారు. గ్రామస్తులు ఐదుగురు విద్యా వలంటీర్లను నియమించారు. ప్రభుత్వం కూడా ఒక వలంటీర్‌ను పంపించింది. ప్రస్తుతం ఇతర గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు తరలి వస్తున్నారు. కానీ తరగతి గదుల కొరత తీవ్రంగా ఉండటంతో నో అడ్మిషన్సు బోర్డు పెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ తరగతులు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. రెండు ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు, నర్సరీ పిల్లలకు ఆట వస్తువులు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సహకారం ఉండటంతో వేంపల్లి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది. అందరి సహకారంతో.. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచుటకు గ్రామస్తులు అండగా నిలుస్తున్నారు. గడపకు రూ.వేయి అందించుటకు ముందుకు వచ్చినప్పటి నుంచి సహకారం అందిస్తున్నారు. గ్రామంలో దాతలు ముందుకు రావడంతో పాఠశాలలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. – గంగాధర్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు గ్రామస్తుల ఆదర్శాన్ని కాపాడుతున్నాం గ్రామస్తులు తీసుకున్న ఆదర్శ తీర్మానాన్ని కాపాడుతున్నాం. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకు రావాడానికి కృషి చేశాం. ప్రస్తుతం ఆ ఫలాలు అందుకుంటున్నాం. తరగతి గదుల కొరతతో విద్యార్థులను చేర్చుకోలేకపోతున్నాం. స్థానికుల కృషి అభినందనీయం. – లక్ష్మీనారాయణ, హెచ్ఎం, వేంపల్లి -
వైఎస్సార్‌సీపీతోనే అందరి సంక్షేమం
సాక్షి, వేంపల్లె : వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలో ఐటీఐ వద్ద నుంచి పట్టణ పురవీధులగుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ఏవిధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా విస్మరించారన్నారు. కేవలం అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు అందించడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ఏడాదిపాటు పాదయాత్ర చేసిన జగనన్న పేదల కష్టాలను చూసి చలించిపోయారన్నారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే నవరత్నాల పథకాలన్నారు. ఆయన తన మేనిఫెస్టోను ఉగాది రోజున ప్రకటించారని తెలిపారు. ఆయన ప్రకటించిన పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్నికల సమయంలో బాబు మాటలు నమ్మితే మనం నట్టేట మునిగినట్లేనన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి అరచేతిలో వైకుంఠం చూపి తర్వాత అట్టడుగుకు తొక్కివేసే రకమని ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమం ఫలాలు అందరికీ అందాయని, అభివృద్ధి జరిగిందన్నారు. పేదలకు పక్కాగృహాలు, ట్రిపుల్ ఐటీలు, పరిశ్రమలు, బైపాస్ రోడ్లు, పాలిటెక్నిక్ కళాశాల, జెఎన్టీయూ కళాశాల, ముస్లిం, మైనార్టీలకు కమ్యూనిటీ హాలు, టీటీడీ కళ్యాణ మండపం, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ వంటివి వైఎస్సార్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్న పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డిని వైఎస్సార్సీపీ నాయకులు బి.ప్రతాప్‌రెడ్డి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వల్లి, మాజీ ఎంపీపీ కొండయ్య, సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, మాజీ సర్పంచ్ సురేష్, మైనార్టీ కన్వీనర్ మునీర్లతోపాటు వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఎన్నికల ప్రచారం
-
వేంపల్లిలో వైఎస్ భారతి ప్రచారం
-
వేంపల్లికి నేను కొత్త కాదు: వైఎస్ భారతి
సాక్షి, కడప : ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికు అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఓటర్లను కోరారు. వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డితో కలిసి వైఎస్సార్ జిల్లా వేంపల్లెలోని షాదీఖానాలో జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్ కుమారుడు ఎస్ఎం అయాన్ తొలి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అక్కడికి వచ్చిన మహిళలతో భారతీరెడ్డి ఆత్మీయంగా మాట్లాడారు. ‘నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టా. మీ కష్టాలు చూశా. జగన్ సీఎం అయితే అందరి కష్టాలు తీరుతాయి. ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో మహిళల కష్టాలు పరిష్కారం కాలేదు’అన్నారు. పొదుపు సంఘాలను బాగా చూసుకుంటున్నామంటూ మళ్లీ మోసం చేసేందుకు బాబు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో అప్పులపై వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన సొమ్ములపై వసూలు చేసిన వడ్డీల మొత్తాన్నే తీసుకొచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఇస్తున్నట్లు చంద్రబాబు కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. వడ్డీలేని రుణాల్లేవు, రుణమాఫీ లేదు, చంద్రబాబుది మాటల గారడీ అని, మహిళలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తే వైఎస్సార్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళల సొమ్ము 2019 ఎన్నికల నాటికి ఎంత ఉందో అంత మొత్తాన్ని 4 విడతల్లో తిరిగి చెల్లిస్తారని చెప్పారు. అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్లు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇళ్లు కట్టిస్తామని, రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఇళ్లు కట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్‌కు ప్రణాళిక ఉందని భారతీరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎవరికైనా ఇళ్లు వచ్చాయా? అని ఆమె ప్రశ్నించగా మహిళలంతా రాలేదంటూ జవాబిచ్చారు. ఆడవాళ్లు కష్టపడవద్దు, సంతోషంగా ఉండాలని వైఎస్‌తో పాటు జగన్ కూడా అంటుంటారని వివరించారు. ఆయన అధికారంలోకి రాగానే ఇల్లు కట్టించి పట్టా, ఇల్లు ఆ ఇంటి యజమాని అయిన మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని వివరించారు. పిల్లల చదువుకు భరోసా వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు భరోసా ఉంటుందని భారతీరెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకయ్యే ఖర్చంతా జగనే భరిస్తారని భరోసా ఇచ్చారు. మొదటగా పిల్లల తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేస్తారన్నారు. తర్వాత ఇంటర్ అనంతరం వారి హాస్టల్ ఫీజులతోపాటు చదువుకయ్యే ఫీజులు భరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో పేదలు ఎలాంటి జబ్బు వచ్చినా రూ.వెయ్యి దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యత వైఎస్ జగన్ తీసుకుంటారని తెలిపారు. వెనుకబడిన వర్గాల మహిళలకు చేయూత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వెనుకబడిన వర్గాల మహిళలను ఆదుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారని, అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలు ఉచితంగా ఇవ్వనున్నట్లు భారతీరెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా మద్య నిషేదం అమలుకు అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లుగా నిత్యం ప్రజల్లోనే.. వైఎస్ జగన్ పులివెందులకు రాలేదని టీడీపీ ఆరోపిస్తోందని, పులివెందులకే కాదు.. ఆయన నిత్యం తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల్లోనే ఉండడంతో ఇంటికి కూడా రాలేదన్నారు. కేవలం ప్రజల మధ్య ఉండడం చూడలేకనే కుట్రలు, కుతంత్రాలు చేశారని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత బాధపెట్టినా వెరవకుండా ప్రజల బాగుకోసం పరితపిస్తున్న నాయకుడు జగన్ అని తెలిపారు. అనంతరం కడప లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలకు ఎవరూ లొంగవద్దని చెప్పారు. వైఎస్ జగన్‌కు పట్టం కట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతోందని, అందుకు చరమగీతం పాడాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకురాలు జింకా విజయలక్ష్మి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
టీడీపీ ప్రచారంలో ప్రాణం తీసిన టపాసులు
సాక్షి, వేంపల్లె: మండలంలోని టి. వెలమవారిపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో టపాసులు పేల్చి ఒక వ్యక్తి మృతికి కారకులయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసు కుంది. వివరాలిలా.. టి. వెలమవారిపల్లెలో వెఎస్సార్సీపీ నాయకుడు కందుల వెంకట రామిరెడ్డి ఇంటి ఎదుట మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్దనరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వస్తుండగా ఇంటి వద్ద టపాసులు పేల్చవద్దని చెబుతున్నా వినకుండా వారు పెద్ద ఎత్తన పేల్చారు. దీంతో ఆరోగ్యం బాగాలేని వెంకటరామిరెడ్డి ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి మృతి చెందాడు. విషయం తెలుసుకొని వైఎస్ అవినాష్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వలి, కన్వీనర్ చంద్రఓబుళరెడ్డి తదితరులు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ఈ ఘటనపై మృతుడి బావ శంకర్‌రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
వేంపల్లె : బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి నెప్పులు రావడంతో బస్సులోనే పురుడు పోసేందుకు చర్యలు తీసుకుని ఆర్టీసీ బస్సు సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా వేంపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. క్రిస్మస్ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లేందుకు గౌతమి అనే నిండు గర్భిణి పులివెందుల నుంచి తిరుపతి వెళుతున్న ఏపీ04జెడ్0131 నెంబర్ గల బస్సులో శనివారం ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో వేంపల్లె వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన బస్సు కండక్టర్ వేంపల్లె ప్రభుత్వాసుపత్రి సిబ్బందినకి ఫోన్ చేసి వారిని బస్సుకు వద్దకు పిలిపించారు. బస్సులోనే గర్భిణికి కాన్పు అయ్యేలా తగు చర్యలు తీసుకున్నారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆర్టీసీ సిబ్బంది తల్లీబిడ్డను వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బస్సులోని ప్రయాణికులు సిబ్బందిని అభినందించారు. -
వేంపల్లెలో పేద్ద చేప
వేంపల్లె : వేంపల్లెలో ఆదివారం సాయంత్రం పేద్ద చేప దర్శనమిచ్చింది. వేంపల్లెకు చెందిన మోహన్ అనే వ్యక్తి 5కిలోల ఉన్న చేపను విక్రయించేందుకు వీధులలో తిరిగాడు. దాదాపు 5కేజీల దాకా ఈ చేప ఉంటుంది. చెన్నూరు పెన్నానదిలో దీనిని పట్టుకున్నామని.. దీనికి వాలాగ రకానికి చెందిన చేప అని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బహుమతుల పంట
వేంపల్లె : వేంపల్లె మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైజ్ఞానిక, సృజనాత్మకత రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారని డైరక్టర్ భగవన్నారాయణ తెలిపారు. తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు చేతులమీదుగా విద్యార్థులు పురష్కారాలను అందుకున్నారని తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ‘‘జెడ్ఎఫ్ ఇన్నేవేషన్ చాలెంజ్’’ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులను అనేక దశలుగా పరీక్షించి 42బృందాలను క్వార్టర్ ఫైనల్‌కు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ బృందాలకు ప్రజెంటేషన్ పెట్టి సెమీ ఫైనల్‌కు 5బృందాలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 24న ఈ ఎంపిక జరిగింది. ఫైనల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రథమ, తృతీయ స్థానాలలో నిలబడి ట్రిపుల్ ఐటీ వైజ్ఞానిక విజయ దుందుభిని మ్రోగించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోనే ఈ విద్యార్థులు సృజనాత్మక ఆలోచన దోరణికి జెడ్ఎఫ్ టెక్నాలజీ యాజమాన్యం మెచ్చుకొని సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం శుభపరిణామమని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య రామచంద్రరాజు తెలిపారు. విద్యార్థుల ప్రొత్సహకానికి ముందుండి నడిపిస్తున్న డైరెక్టర్ భగవన్నారాయణను అభినందించారు. విద్యార్థులను మెచ్చుకున్నారు. ప్రథమ బహుమతిని శివప్రసాద్, సురేంద్ర, దుర్గా ప్రసాద్, ప్రదీప్‌కుమార్ బృందం ‘‘అటానమస్ డ్రైవింగ్ వెహికల్’’ ప్రాజెక్టుకు వీరికి ఈ బహుమతి వచ్చింది. తృతీయ బహుమతిని శివప్రసాద్, శ్రీనాథ బృందం భీమవరం ఎస్ఆర్కే కళాశాల విద్యార్థి విద్యా సాగర్, కరబ్రహ్మచారి బృందం ‘‘స్మార్ట్ ఇరిగేషన్ మానటరింగ్ సిస్టం అండ్ డ్రైవర్ గ్రోసినెస్ డిబెక్షన్ బై పీపుల్ డిబెక్షన్ రెస్పిక్టివిల్లీ’’ సంయుక్త ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. వీరి ప్రతిభను మెచ్చి డైరెక్టర్లు విశ్వనాథరెడ్డి, భగవన్నారాయణలు అభినందించారు. రాబోవు రోజులలో తమ విద్యార్థుల వైజ్ఞానిక, సాంకేతిక ఖ్యాతిని దేశ విదేశాల్లో మరింతగా ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏవో అమరేంద్రకుమార్, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, అధ్యాపకులు రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉల్లి విజయ్ (36) అనే హోటల్ యజమాని మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయ్ ఐదేళ్ల క్రితం కేరళ రాష్ట్రం పాల్ఘడ్ నుంచి వేంపల్లెకు వచ్చి కళాశాలకు వెళ్లే దారిలో హోటల్‌ను నడుపుతున్నాడు. విజయ్ శుక్రవారం సాయంత్రం తన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లాడు. మోటారు బైకులో వెనుకవైపున కూర్చొని వస్తుండగా.. కడప రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద వేంపల్లె వైపు నుంచి వస్తున్న ఓ ఆటో ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయ్ను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. విజయ్ కాలుకు తీవ్ర గాయాలు కాగా ఆపరేషన్ కూడా చేయించారు. వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పారు. కానీ విజయ్ శరీరానికి ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహాన్ని కడప నుంచి వేంపల్లెకు బంధువులు తీసుకొచ్చారు. అనంతరం మృతుడి స్వగ్రామమైన కేరళలోని పాల్ఘడ్ ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి తల్లి సుభద్రమ్మ, సోదరులు కృష్ణమూర్తి, వినోద్ ఉన్నారు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బొరుసు శ్రీనివాసులు (47) కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై సీఐ మోహన్‌ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు....వేంపల్లె పట్టణం శ్రీరామ్‌నగర్‌కు చెందిన బొరుసు శ్రీనివాసులు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ 2011 ఏప్రిల్ 21న జీవిత ఖైదు పడడంతో కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. అప్పుడప్పుడు అనారోగ్యంతో బాధపడేవాడు. ఈ ఏడాది జనవరి 30న అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్‌లో చేరాడు. మంగళవారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ లక్ష్మినరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
వేంపల్లె: వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మారం ఆంజనేయరెడ్డిపై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయరెడ్డికి తలపైన, ఎడమ కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితుడి కథనం మేరకు.. మారం ఆంజనేయరెడ్డి ప్రతి శనివారం తెల్లవారుజామున గండి వీరాంజనేయస్వామిని దర్శించుకొనేందుకు వెళుతుంటారు. అయితే ఈ శనివారం తెల్లవారుజామున కూడా చింతలమడుగుపల్లె నుంచి మోటారు బైకుపై గండికి బయలుదేరారు. కుమ్మరాంపల్లె గ్రామం వద్ద నుంచి రెండు మోటారు బైకులలో కొందరు వ్యక్తులు కర్రలు తీసుకొని వెంబడిస్తూ వచ్చారు. వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్ద మోటారు బైకుపై వెనకవైపు నుంచి వస్తున్న వ్యక్తులు ఆంజనేయరెడ్డి తలపై కర్రలతో దాడి చేయగా అదుపు తప్పి కిందపడ్డాడు. గాయపడిన ఆంజనేయరెడ్డి మోటారు బైకును మళ్లీ తీసుకొని వీరన్నగట్టుపల్లె సర్కిల్‌కు చేరుకున్నారు. మళ్లీ దాడి చేసిన వ్యక్తులు అక్కడికి రావాలని ప్రయత్నించినా.. అప్పటికే స్థానికులు అక్కడ ఉండటంతో వెనుతిరిగారు. ఈ విషయాన్ని బాధితుడు తన స్నేహితుడు మల్లికి ఫోన్ చేసి తెలియజేయడంతో 108 వాహనానికి సమాచారం పంపి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి ఆంజనేయరెడ్డిని తరలించారు. తనకు ఎవరూ శత్రువులు లేరని.. తనపై దాడి ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తనకు తెలియడంలేదని బాధితుడు ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ ఎస్ఐ మస్తాన్ తెలిపారు. -
వేంపల్లెలో చోరీ
వేంపల్లే: తాళం వేసి ఉన్న దుకాణంలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో శనివారం వెలుగుచూసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెడ్డయ్య దుకాణంలో దొంగలుపడి 4 బంగారు గాజులు, ఓ చైన్ రూ.10 వేల విలువ చేసే రిచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని వైద్యం కోసం కేరళ వెళ్లాడు. శనివారం తిరిగొచ్చి చూసేసరికి చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై మధుమల్లేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
సైబర్ నేరగాడు అరెస్టు
వేంపల్లె :ఏటీఎం నెంబర్లను సేకరించుకొని సెల్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను దొంగలించే సైబర్ నేరగాడు షేక్ శ్రీనివాసులును వేంపల్లె పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టుకు పంపారు. వివరాలలోకి వెళితే.. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసులు ఆర్మీలో పనిచేస్తూ వ్యసనాలకు బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. విజయవాడలో గుర్రపు పందేలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో క్యూలో నిలబడి వారి ఏటీఎం కార్డును సేకరించుకొని సెల్‌ఫోన్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను కాజేస్తూ వచ్చాడు. రాజేష్, ప్రహ్లాద, హరీష్ వేంపల్లెకు చెందిన సైఫుల్లా అనే స్నేహితుల ఏటీఎం నెంబర్ల ద్వారా డబ్బులు కాజేశాడు. ఈనెల 11వ తేదీన వేంపల్లె ఆర్ఎంఎస్ వీధికి చెందిన సైఫుల్లా పిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం కడప రోడ్డులోని అగ్రికల్చర్ చెక్‌పోస్టు వద్ద షేక్ శ్రీనివాసులును అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు ఏటీఎం కార్డులను, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు. -
కారు బోల్తా .. ఒకరి దుర్మరణం
చక్రాయపేట/పులివెందుల : మండలంలోని అద్దాలమర్రి క్రాస్ వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కండ్లి పెద్ద గంగన్న (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె శ్రీరామ్ నగర్‌కు చెందిన కండ్లి పెద్ద గంగన్న కుటుంబం అద్దాలమర్రి క్రాస్ వద్ద పందులను మేపుకుంటూ జీవనం సాగించేవారు. వీరు ఆదివారం పందులను మేపుకొని రోడ్డు దాటిస్తుండగా.. వేముల మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నాగేళ్ల సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్ విశ్వేశ్వరరెడ్డి, కోడలు కవిత గుర్రం కొండలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అద్దాల మర్రి క్రాస్ వద్ద పందులు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పందుల యజమాని పెద్ద గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా విశ్వేశ్వరరెడ్డి కుడి భుజానికి బలంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి : అద్దాలమర్రి క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో గాయపడిన పవన్ విశ్వేశ్వరరెడ్డి మెరుగైన చికిత్స కోసం పులివెందుల దినేష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డిలు దినేష్ మెడికల్ సెంటర్‌కు చేరుకొని పవన్ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించి తండ్రి నాగేళ్ల సాంబశివారెడ్డికి ధైర్యం చెప్పారు. వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరామర్శించారు. -
నాల్గోసారి ఆడపిల్ల పుట్టిందని..
వేంపల్లె: అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదలించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు పోలీసులు, వైద్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడపజిల్లా వెంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మండలంలోని బక్కన్నపల్లెకు చెందిన హరిత, బాలాజీ నాయక్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మళ్లీ ఈ రోజు జరిగిన కాన్పులో కూడా అనారోగ్యంగా ఉన్న ఆడపిల్ల పుట్టడంతో శిశువును వదిలించుకునేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్ల్లేందుకు ప్రయత్నిస్తుండటాన్ని గుర్తించిన వైద్యులు పోలీసుల సాయంతో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి అనారోగ్యంగా ఉన్న ఆడపిల్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
వేంపల్లెలో వైఎస్ జగన్ పర్యటన
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ముందుగా మండలంలోని గిడ్డంగివారిపల్లిలో దివంగత సర్పంచ్ రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. అనంతరం వేంపల్లెకు చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన సాదక్‌వలీ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఎంపీటీసీ పద్మ, రాజ్‌కుమార్ దంపతుల మనవరాలు నామకరణ వేడుకకు హాజరయ్యారు. -
మహిళ దారుణ హత్య
వేంపల్లె: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లెలో చోటుచేసుకుంది. స్థానిక గరుగు వీధిలో నివాసముంటున్న పూలకుంట తులసి(44) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. గురువారం ఉదయం ఆమె కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి తులసి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారంలో గొడవల ఏమైనా హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యలనడిగి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
వెంపల్లే: ద్విచక్రవాహనం పై వెళ్తున్న తండ్రీ కొడుకులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా వెంపల్లె మండలం బి. వెలమావారి పల్లె గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు తండ్లూరి వీరయ్య(50), బాబా ఫక్రుద్దీన్(24) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో ఉన్న కూరగాయల విక్రయ కేంద్రానికి బైక్ పై వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.