Vigilance Department
-
వంట నూనెల అక్రమ నిల్వలపై విస్తృత దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై విజిలెన్స్ శాఖ దాడులు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 214 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. పలుచోట్ల లీటర్ ప్యాకెట్లలో వంట నూనె 910 గ్రాములే ఉన్నట్టు తేలింది. మరికొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న 53 దుకాణాలు, సూపర్ మార్కెట్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. మార్చిలో మొత్తం 5,328 దుకాణాలు, సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి 1,690 కేసులు నమోదు చేశారు. -
రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే..
సాక్షి, హైదరాబాద్: రెండు తలల పామును అమ్మ కానికి పెట్టిన ముఠాను బుధవారం అటవీశాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. ఈ పాము ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, గుప్తనిధులు దొరుకుతాయని తమ వద్దనున్న పామును ఈ ముఠా అమ్మకానికి పెట్టింది. తమకందిన సమాచారంతో విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నాగారంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ.ఆంజనేయప్రసాద్‌తో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాలుగున్నర కేజీల బరువున్న పామును డెబ్బై లక్షలకు వీరు అమ్మకానికి పెట్టారని, వీరితో పాటు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. నిందితులను మేడ్చల్ కోర్టు లో హాజరుపరిచారు. ముఠా ఆటకట్టించిన అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ అభినందించారు. కాగా, రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్ సాండ్ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా అదృష్టం కలిసిరావటమనేది అపోహేనన్నారు. ఈ పాముకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు ఫిర్యాదు చేయాలన్నారు. చదవండి: ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. కనీసం రూ.25 కోట్లు హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ -
నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ వ్యాపారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లపై ఆహార భద్రత, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లోని నెయ్యి తయారీ కేంద్రాలను, బీసెంట్ రోడ్డులోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత విభాగం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే ముడి సరకు నమూనాలను సేకరించారు. సేకరించిన 14 నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నామని, ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ దాడుల్లో రూ.5.45 లక్షల విలువైన పామాయిల్, రూ.3.81 లక్షల విలువైన నెయ్యి, రూ.27,000 వేలు విలువైన వేరుశనగ నూనెను సీజ్ చేశామన్నారు. రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు మంగళవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. విజయవాడ పటమట డివిజన్లోని సాయినగర్‌లో ఉన్న పారడైజ్ ఫుడ్ కోర్టును ఆహార భద్రతాధికారి టి.శేఖర్‌రెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్, తహసీల్దార్ డీవీఎస్ ఎల్లారావు తనిఖీ చేశారు. నాణ్యత సరిగా లేవన్న అనుమానంతో కారం పొడిని, మటన్ దమ్ బిర్యానీ నమూనాలను సేకరించారు. రెండో బృందానికి ఆహార భద్రతాధికారి ఎన్.రమేష్‌బాబు నేతృత్వం వహించారు. ఈ బృందం గవర్నర్‌పేటలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. రూ.4,225 విలువ చేసే నాణ్యత లేని 65 కిలోల వేరుశనగ గుండ్లను సీజ్ చేశారు. కిచెన్ రూం పరిశుభ్రంగా లేదని, రిఫ్రిజిరేటర్ కూడా సరిగా లేదని, తక్షణమే వాటిని సరిచేసుకోవాలంటూ హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఇదే బృందం కొత్త రాజరాజేశ్వరి పేటలోని శ్రీలక్ష్మి దివ్య బాబు డెయిరీని తనిఖీ చేసింది. అక్కడ తయారు చేస్తున్న ఆవు నెయ్యి, గేదె నెయ్యిలను పరిశీలించింది. 193.4 కిలోల ఆవు నెయ్యి, 700.4 కిలోల గేదె నెయ్యిని సీజ్ చేసి వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని మూడో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని ఇందిరానాయక్ నగర్లో శ్రీకృష్ణా వెగాన్ ఘీ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. అక్కడ ఇతర బ్రాండ్లను పోలిన ప్యాకింగ్ లేబుల్స్‌ను వినియోగిస్తుండటంతో 2,500 నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 70 కిలోల నకిలీ పామాయిల్‌ను అధికారులు గుర్తించి నమూనాను సేకరించారు. అనంతరం గవర్నర్‌పేటలోని బర్కత్ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వింగ్స్‌లో అధికంగా కలర్ వాడినట్టు గుర్తించారు. వాటిన నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి పి.శ్రీకాంత్ నేతృత్వంలోని నాలుగో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని వెంకటేశ్వర జనరల్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసింది. ఇందులో నాణ్యతపై అనుమానం రావడంతో విజయ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ నమూనాను సేకరించి.. 9 ఆయిల్ టిన్నులను సీజ్ చేశారు. 58 టిన్నుల్లో నిల్వ ఉంచిన 3,600 కిలోల పామాయిల్‌ను సీజ్ చేశారు. అనంతరం వన్‌టౌన్‌లోని ఇస్లాంపేటలోని మిలాప్స్ పంజాబీ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత సరిగా లేవన్న కారణంతో బిర్యానీ, పెరుగు నమూనాలను సేకరించారు. -
‘మెడ్‌టెక్’ మెడకు ఉచ్చు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో అతిపెద్ద కుంభకోణంగా మారిన ‘మెడ్‌టెక్ జోన్’ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వైద్య ఉపకరణాల తయారీ పేరుతో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సమీపంలో అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడంతో పాటు అక్కడ జరిగిన నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అందులో భాగంగా విశాఖలోని ఏఎంటీజడ్ (ఆంధ్రా మెట్‌టెక్ జోన్) కార్యాలయానికి తాజాగా నోటీసులు జారీచేశారు. ఇందులో ప్రధానంగా భూముల కేటాయింపుతో పాటు, అక్కడ నిర్మాణాలకు భారీగా అంచనాలు పెంచి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. చంద్రబాబు సర్కారు నియమించిన కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థ అక్కడ నిర్మాణాలకు రూ.708 కోట్లతో అంచనాలు రూపొందిస్తే.. ఏఎంటీజడ్ అధికారులు మాత్రం అడ్డగోలుగా దీన్ని రూ.2,350 కోట్లకు పెంచేశారు. డిఫాల్టర్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంస్థ అయిన ల్యాంకో ఇన్ఫ్రాకు కాంట్రాక్టు అప్పగించడం.. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.53 కోట్లు ఇవ్వడం, ఆ తర్వాత టెండరు రద్దయినా ఆ మొత్తాన్ని రికవరీ చేయకపోవడం వంటి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీచేశారు. లగడపాటి సంస్థకు సంబంధించిన టెండరు రద్దుచేయగానే పవర్‌మెక్ అనే మరో సంస్థను తెరమీదకు తెచ్చి పనులు చేయించారు. అంతేకాక.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 23కు నాలుగు రోజుల ముందే పవర్‌మెక్‌కు రూ.100 కోట్లు చెల్లింపులు చేయడంతో దీనిపై అనుమానాలు పెరిగాయి. పైగా దీనిపై కోర్టులో వ్యాజ్యం కూడా ఉందన్న కనీస అవగాహన లేకుండా కోట్లాది రూపాయలు చెల్లించారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా సదరు కాంట్రాక్టు సంస్థకు వంద కోట్లు ఎలా చెల్లించారని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్రకుమార్ శర్మ కీలకపాత్ర పోషించినట్టు విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, చంద్రబాబునాయుడు, లోకేశ్‌కు మెడ్‌టెక్ జోన్ సీఈఓ సన్నిహితుడిగా పేరుంది. అవినీతిని చూసి డైరెక్టర్ల రాజీనామా ఇదిలా ఉంటే.. మెడ్‌టెక్ జోన్లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అప్పటి ఉన్నతాధికారుల రాజీనామాలే సాక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇది ఏర్పాటైన కొత్తలో ఐపీఎస్ అధికారి (నాటి ఔషధ నియంత్రణ డీజీ) డా.రవిశంకర్ అయ్యన్నార్, అప్పటి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సుజాతాశర్మలు డైరెక్టర్లుగా ఉన్నారు. డైరెక్టర్లుగా నియమితులైన కొద్ది నెలల్లోనే అక్కడ పరిస్థితులను చూసి నివ్వెరపోయిన అధికారులు.. ఉన్నతాధికారులతో తీవ్రంగా విభేదించి రాజీనామా చేశారు. ఈ ఫైళ్లపై తాము సంతకాలు చేయలేమని, తమను డైరెక్టర్లుగా తప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసి మరీ తప్పుకున్నారు. వీరిరువురూ తప్పుకోక ముందే అప్పట్లో మెడ్‌టెక్ జోన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జుడిష్ రాజును కూడా అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కారణంగా తొలగించి, కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం విదితమే. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ బాగోతం తీగలాగుతున్నారు. కాగా, మెడ్‌టెక్ అక్రమాలపై వారం రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
‘విజిలెన్స్’ డీజీగా గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునితా ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ విభాగంతోపాటు సవాంగ్ ప్రభుత్వ ఎక్స్–అఫీషియో ముఖ్యకార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. గౌతం సవాంగ్ 2015 ఆగస్టు 2న విజయవాడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లపాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఇటీవల డీజీపీ పదవి రేసులో కూడా చివరి వరకు ఆయనే ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఠాకూర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. అప్పటి నుంచి కినుక వహించిన సవాంగ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల కిందటే సీఎంను సవాంగ్ కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు శనివారం నాడు బదిలీ ఉత్తర్వులు రావడం చర్చనీయాం శమైంది. -
బాబు అవినీతిపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో జరుగుతున్న అవినీతిపై న్యాయపరంగా పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అవినీతి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యత చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్ర పార్టీ పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం విజయవాడలో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అవినీతిపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పేదలకు కేంద్ర ప్రభుత్వం 7.87 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ పథకంలో భారీగా అవినీతి మొదలు పెట్టారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో కేంద్రం నిధులతో చదరపు అడుగుకు రూ. 1,000తో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తుంటే.. ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ. 2400 దాకా ఖర్చవుతుందంటూ లెక్కలు చెబుతున్నారని.. కేంద్రమిచ్చే సాయానికి తోడు పేదల నుంచి రూ. 6–7 లక్షల దాకా వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై సమావేశంలో చర్చించారు. షేర్వాల్ టెక్నాలజీ పేరుతో ఇళ్లనిర్మాణ పనులు కేవలం రెండు మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి నిరుపేదల నుంచి ప్రభుత్వ పెద్దలు వందల కోట్లు దోచుకునే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై సాక్ష్యాధారాలతో కేంద్ర విజిలెన్స్ సంస్థలను ఆశ్రయించడంతో పాటు న్యాయపరంగా పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై మండలాల వారీగా, జిల్లాల వారీగా ఆధారాలతో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్న నీరు–చెట్టు పనులు, రాజధాని నిర్మాణంలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపై న్యాయ, చట్టపరమైన పోరాటాలకు అవకాశాలను పరిశీలించాలని.. అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలని సమావేశంలో తీర్మానించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల వారీగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం సాగించనున్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటన... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జూలై ప్రథమార్థంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కనీసం రెండు రోజులు ఆయన రాష్ట్ర పర్యటన సాగే అవకాశం ఉంటుందని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలకు వివరించారు. వచ్చే సాధారణ ఎన్నికల విషయంలో పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీని సన్నద్ధం చేసేందుకు జిల్లా అధ్యక్షులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కన్నా సూచించారు. 12 నుంచి 21 వరకు విశేష సంపర్క్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమలను మేధావులకు, విద్యావంతులకు తెలియజేప్పేందుకు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి తెలిపారు. పదాధికారుల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ముఖ్యనేతలు ఒక్కొక్కరు కనీసం 25 మంది ప్రముఖలను కలిసి కేంద్ర పథకాలను వివరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు జిల్లాల వారీగా పర్యటిస్తారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మహా న్యూస్ చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ, ఆ చానల్‌ను పార్టీ బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్న విధానాలను తెలిపేందుకు జూన్ 23న యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరపాలని నిర్ణయించామన్నారు. జూన్ 21, 22, 23వ తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని సురేష్‌రెడ్డి తెలిపారు. -
‘విజిలెన్స్’పై సర్కారు గుర్రు
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్ విభాగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విజిలెన్స్ పనితీరుపై అసంతృప్తితో ఉంది. పలు కేసుల్లో అధికారులు తప్పుడు నివేదికలిచ్చారని ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ విభాగాల్లో అంతర్గత విచారణలు, ప్రాజెక్టులు, పథకాల అమల్లో ఉన్న లొసుగులపై ఎప్పటికప్పుడు నివేదికివ్వాల్సిన విజిలెన్స్ విభాగం అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగేళ్లు కుడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన ప్రధాన దర్యాప్తుల్లో ఏ ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ పనితీరులో డొల్లతనం ఉందా? లేక విజిలెన్స్ పంపిన నివేదికలపై చర్యలకు ప్రభుత్వంలో జాప్యం జరుగుతోందా.. అన్న విషయాలపై సందిగ్థత నెలకొంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే నివేదికివ్వాలని విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతి లేదని పేర్కొంటూ తప్పుడు నివేదికలు పంపించినట్టు తెలిసింది. దీనితో ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో నాణ్యతాలోపాలు తదితర అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే అందులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారని విచారణలో బయటపడింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు, మిల్లర్ల అక్రమాలు, ఎరువులు, విత్తనాల కంపెనీలు, డీలర్ల మోసాలపై తప్పుడు నివేదికలు పంపించారని ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ వెంచర్లు, నిర్మాణాలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు భూముల అమ్మకాలు జరిపిన వ్యవహారంపై నివేదికిస్తే ఇప్పటికీ కమిషన్ గానీ, ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోలేదని విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 8 ప్రధాన వ్యవహారాల్లో నివేదికిచ్చినా.. ఎందుకు స్పందించరంటూ అంతర్గతంగా ఎదురుదాడికి సైతం దిగినట్టు తెలుస్తోంది. నిజాలు బయటపెట్టిన ఏసీబీ... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పోస్టింగ్ కోసం కొంతమంది అధికారులు కొద్దిరోజుల క్రితం జరిగిన బదిలీల్లో లక్షలు ఖర్చు పెట్టినట్టు ఏసీబీ విచారణలో బయటపడింది. ఇటీవలి దాడుల్లో ఓ మిల్లర్ నుంచే రూ.లక్ష లంచం తీసుకున్నట్టు గుర్తించారు. రైసుమిల్లులు, ఫర్టిలైజర్లు, విత్తన కంపెనీలు, రేషన్ బియ్యం, కల్తీ, అక్రమ వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కమీషన్ పద్ధతిలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. విజిలెన్స్ విభాగాన్ని ఎత్తేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక తరహాలో అవినీతి నిరోధక శాఖలోనే విజిలెన్స్‌ను విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని హోంశాఖ, ఏసీబీ అధికారులను ఆదేశించినట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఏసీబీలోనే మరో యూనిట్ విజిలెన్స్ వింగ్‌గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ సీనియర్ ఐపీఎస్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
ప్రైవేట్ బోట్ ఆపరేటర్ల ఇష్టారాజ్యం
‘నిర్దిష్ట అనుమతులు లేకుండానే ప్రైవేటు ఆపరేటర్లు కృష్ణా నదిలో బోటు సర్వీసులు నిర్వహిస్తున్నారు. లైసెన్సు ఇచ్చే ముందు జల వనరులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అనుమతులు పొందడంలేదు. ప్రైవేటు ఆపరేటర్లు తగిన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. సిబ్బందికి తగిన నైపుణ్యం లేదు.’ (కృష్ణా నదిలో ప్రైవేటు బోటు ఆపరేటర్ల మాఫియాపై కొద్ది నెలల క్రితం విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఇదీ.) సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: రాజధానిగా రూపాంతరం చెందిన అనంతరం విజయవాడలో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవానీ ద్వీపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బోట్ టూరిజాన్ని పెంపొందించేందుకు పర్యాటక శాఖ అధికారులు కొన్ని ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లో పర్యాటక శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. వారి సూచనలకు భిన్నంగా ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించాలని అధికారులకు పరోక్షంగా ఆదేశాలిచ్చారు. మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు బోట్లపై విజిలెన్స్ అధికారులు గత ఏడాది నవంబర్‌లో దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఆ బోట్లను జలవనరుల శాఖకు అప్పగించారు. కానీ, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఆ బోట్లను ఒక్కరోజులోనే విడుదల చేశారు. అనంతరం విజిలెన్స్ శాఖ అధికారులు కృష్ణా నదిలో ప్రైవేటు బోటు ఆపరేటర్ల అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ, ప్రభుత్వ పెద్దలు ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా.. సీజ్ చేసిన బోట్లను వెంటనే విడుదల చేయాలని జలవనరుల శాఖను ఆదేశించి అప్పటికప్పుడు తూతూ మంత్రంగా అనుమతులిచ్చేశారు. ప్రభుత్వ పెద్దలే పర్యాటక మోజులో వారికి దన్నుగా నిలవడంతో మరికొందరు ప్రైవేటు బోటు ఆపరేటర్లు సైతం కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపట్టారు. ఫలితం.. కృష్ణా నదిలో ఆదివారం పెను విషాదానికి దారితీసింది. అంతేకాదు.. జలక్రీడలకు సైతం ఇటీవల ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదీ గర్భంలో అధికారపార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి ఫ్లోటింగ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ఛాంపియన్స్ యాచెట్స్ క్లబ్‌కు అనుమతిస్తూ గత జూన్ 21న జలరవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం.. దీనివల్ల చేకూరే ప్రమాదాలపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో గత ఆగస్టు 29న ఆ అనుమతులను రద్దు చేశారు. పర్యాటక శాఖ వద్దు.. ప్రైవేటు ఆపరేటర్లే ముద్దు కాగా, విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించిన తరువాత ప్రభుత్వ పెద్దలు పంథా మార్చారు. పర్యాటక శాఖ కంటే ప్రైవేటు ఆపరేటర్లకే ఎక్కువ లబ్ధి కలిగేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఆదాయంలో పర్యాటక శాఖకు 30శాతం, ప్రైవేటు ఆపరేటర్లకు 70శాతం ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం పర్యాటక శాఖకు కేవలం 10శాతం, ప్రైవేటు ఆపరేటర్లకు 90శాతం దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక బోటింగ్, జల క్రీడలు, జలరవాణాకు లైసెన్సు ఇవ్వాలంటే రాష్ట్ర జలవనరుల శాఖ, జాతీయ అంతర్గత జలరవాణా సంస్థ, అంతర్గత జలరవాణా సంస్థల అనుమతులు తప్పనిసరి. వీరితోపాటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు పరిశీలించి అనుమతివ్వాలి. కానీ, వీటితో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటు బోట్లకు అనుమతులు ఇచ్చేసింది. ఆదివారం ప్రమాదానికి గురైన రివర్ బోటింగ్ అడ్వంచర్స్ సంస్థ కూడా అదే విధంగా నాలుగు నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఉధృతి అంచనా వేయలేకే... పట్టిసీమ జలాలను కృష్ణా నదిలోకి మళ్లించిన లగాయతు.. పవిత్ర సంగమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రవాహ ఉధృతి బాగా పెరిగింది. జలవనరుల శాఖకు ఈ పరిస్థితి నివేదించి ఉంటే ఆ ప్రాంతంలో నీటి ఉధృతిని అంచనా వేసేవారు. అందుకు బోట్లు తగిన విధంగా ఉన్నాయో లేవో పరిశీలించేవారు. కానీ, ఆ శాఖను కనీసం పట్టించుకోలేదు. అదే విధంగా రెవెన్యూ, అగ్నిమాపక శాఖలను పక్కనబెట్టేశారు. ప్రభుత్వ పెద్దల నిర్వాకమే ఆదివారం ప్రమాదానికి ప్రధాన కారణమైంది. భద్రతా ప్రమాణాలు గాలికి... ప్రైవేటు బోటు ఆపరేటర్లు భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఏ బోటులో కూడా లైఫ్ జాకెట్లు లేవని విజిలెన్స్ శాఖ నివేదించింది. అగ్నిమాపక పరికరాలూ లేవు. బోటు సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వలేదని విజిలెన్స్ శాఖ గుర్తించింది. నదిలో కొన్నిచోట్ల ఇసుక దిబ్బలు ఉంటాయి కాబట్టి వాటిని ముందే గుర్తించి బోటు గమనాన్ని మార్చాలి. ఇక ఉధృతి పెరిగినప్పుడు కూడా చాకచక్యంగా బోటును నడపాల్సి ఉంటుంది. బోటు సామర్థ్యం ఎంత, ఎంతమందిని ఎక్కించాలన్న దానిపై సిబ్బందికి అవగాహన ఉండాలి. కానీ, కృష్ణా నదిలో ప్రైవేటు బోట్ల సిబ్బందిలో దాదాపు ఎవరికీ ఈ నైపుణ్యంలేదని విజిలెన్స్ నివేదిక స్పష్టంచేసింది. దీనిపై ప్రభుత్వం అప్పుడే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పర్యాటక బోట్లలో డ్రైవర్‌తో సహా ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు సమకూర్చాలి. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కానీ, ఆదివారం ప్రమాదానికి గురైన బోటులో ఇవేవీ లేకపోవడం గమనార్హం. ఇక ఎంతమంది పర్యాటకులు బోటు ఎక్కుతున్నారో అన్నదానిపై సరైన రికార్డులూ నిర్వహించడంలేదు. ఎందుకంటే అందులో 10శాతం పర్యాటక శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పర్యాటకుల సంఖ్యపై ఆపరేటర్లు సరైన రికార్డులు నిర్వహించడంలేదు. -
గ్రామ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం
తాడిమర్రి / ధర్మవరం అర్బన్ : గ్రామ సంపూర్ణ అభివృద్ధే తన లక్ష్యమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అనూరాధ పేర్కొన్నారు. తాను దత్తతకు తీసుకున్న మండలంలోని ఆత్మకూరు, శివంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో రూ.4లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 20 మంది చేనేత కార్మికులకు ఒకొక్కక్కరికి రూ.1000లు ప్రకారం నగదు సాయం, చేనేత మగ్గం పరికరాలను అందజేశారు. అనంతరం శివంపల్లి గ్రామంలో రూ.6లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికే శివంపల్లి, ఆత్మకూరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిమర్రి, ఆత్మకూరు సర్పంచ్‌లు దేవర హర్షిత, సాకే లక్ష్మీదేవి, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎస్ఐ రాంభూపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కౌసల్య, మండల ఇంజనీర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మవరం మండలం కుణుతూరు సమీపంలో పోలీస్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ డీజీపీ రాముడు దత్తత తీసుకున్న నార్సింపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో తాను తాడిమర్రి మండలంలోని శివంపల్లి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నట్లు వివరించారు. గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టుశిక్షణ, అగరబత్తీ తయారీ, పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామంలోని చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో అక్రమ మైనింగ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు, రూరల్ సీఐ శివరాముడు, ఎస్ఐలు యతీంద్ర, సురేష్ పాల్గొన్నారు. -
మా విభాగాన్ని రద్దు చేయండి
సర్కారుకు విజిలెన్స్ ఉన్నతాధికారుల ప్రతిపాదన కర్ణాటక తరహాలో ఏసీబీలోనే విజిలెన్స్ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు సాక్షి, హైదరాబాద్: అవినీతిపై నిరంతరం యద్ధంచేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను కాపాడాల్సిన విజిలెన్స్ శాఖలోనే అవినీతి రాజ్యమేలడం ఆ విభాగ ఉన్నతాధి కారులను కలవరంలో పడేసింది. నిఘా, అమలు పటిష్టంగా పాటించాల్సిన అక్కడి అధికారులే ఏసీబీకి పట్టుబడటం ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసింది. తమ విభాగంలోని అవినీతి అధికారుల ఆగడాల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రద్దు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం సంచలనం రేపుతోంది. ప్రతిష్టాత్మక విచారణల్లో డొల్లతనం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి, అక్రమాలపై నివేదికివ్వాలని ప్రభు త్వం ఆదేశిస్తే.. కాంట్రాక్టర్లతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులే కుమ్మక్కై కమీష న్లు వసూలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో నాణ్యత లోపాలపై విచారణ కు ఆదేశిస్తే అందులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారని బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు రీజియన్లున్నాయి. ఒక్కో రీజియన్‌కు ఏటా రూ.60 కోట్లకు పైగా జరిమానా వసూలు టార్గెట్ పెట్టడమే అవినీతికి ప్రధాన కారణమవుతోందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. నిజాలు బయటపెట్టిన ఏసీబీ... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఆర్‌వీవోలుగా పోస్టింగ్స్ పొందేందుకు కొంతమంది అధికారులు లక్షలు ఖర్చుపెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఏకంగా ఒక్క మిల్లర్ నుంచే రూ.లక్ష లంచం వచ్చినట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో రైసుమిల్లులు, ఫర్టిలైజర్లు, సీడ్స్ కంపెనీలు, రేషన్ బియ్యం మాఫియా, కల్తీ మాఫియా, చెక్‌పోస్టులు.. ఇలా ప్రతీ దాంట్లో విజిలెన్స్ సిబ్బంది కమీషన్ పద్ధతిలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించారు. ఏళ్ల పాటు విజిలెన్స్‌లో పాతుకుపోయిన అధికారులు వ్యవస్థను భ్రష్టు పట్టించారని నివేదించారు. విజిలెన్స్ విభాగం అవినీతిని తట్టుకోలేకే సివిల్ సప్లై ఉన్నతాధికారులు గతంలోలా తమ విభాగంలోనే ఇటీవల ప్రత్యేకంగా మళ్లీ విజిలెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక తరహాలో మేలు ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో నిఘా, అమలు విధానాన్ని కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లోని ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలో కీలక భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
చేప పిల్లలను మింగారు!
వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ అధికార పార్టీ ఎమ్మెల్సీ కీలక పాత్ర అక్రమాలపై విజిలెన్స్ విభాగం దృష్టి ప్రభుత్వ లక్ష్యానికి అక్రమార్కుల గండి చేప పిల్లల పంపిణీలో భారీ కుంభకోణం చేపలను లెక్కించడం కష్టమైన పని. చేప పిల్లలను లెక్కించడం ఇంకా కష్టం. ఈ కఠినమైన పనులను కొందరు అక్రమాలకు నెలవుగా మార్చుకున్నారు. లెక్కించడం సాధ్యంకాని చేప పిల్లల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అగ్రభాగాన ఉందని తెలుస్తోంది. చెరువుల్లో చేప పిల్లలను వేసే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లతో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ) అక్రమాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విజిలెన్స్ విభాగం వివరాలు సేకరించడం మొదలుపెట్టింది. గత ఏడాది సైతం ఉమ్మడి జిల్లాలో ఇవే అక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీపైనే ఆరోపణలు రావడం గమనార్హం. వరంగల్ :వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవగా మిషన్ కాకతీయ పనులతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో జిల్లాలోని 90 శాతం చెరువులు అలుగు పోశాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మత్స్య శాఖ చేపల పిల్లల సేకరణ కోసం టెండర్లు పిలిచింది. ఉమ్మడి జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. ఒక్కో చేప పిల్లకు రూ.70 పైసల నుంచి రూ.90 పైసల చొప్పున ధర నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4.15 కోట్ల చేపల పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 910 చెరువుల్లో చేప పిల్లలను వేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 1 నుంచి డిసెంబరు మొదటి వారం వరకు చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ చేప పిల్లల పంపిణీ టెండర్లను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. చేప పిల్లల పంపిణీలో లెక్కల్లో చూపిన దానికి, పంపిణీ చేసిన దానికి భారీగా తేడా ఉన్నట్లు తెలిసింది. చేప పిల్లలను ఆక్సీజన్ సిలిండర్ అమర్చిన వ్యాన్లలో తీసుకువచ్చారు. ఒక్కో వ్యాన్‌లో పది డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ములో పది వేల చొప్పున చేప పిల్లలు ఉంటాయి. 4.15 కోట్ల చేప పిల్లలను పోసినట్లు లెక్కలు చెబుతున్నారంటే... వరంగల్ ఉమ్మడి జిల్లాకు 4,150 వాహనాలు రావాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. గణాంకాల్లో పేర్కొన్న వాహనాల్లో సగం కూడా జిల్లాకు రాలేదని తెలుస్తోంది. వాహనాల రాకపోకలను నమోదు చేసే చెక్‌పోస్టులలో పేర్కొన్న లెక్కలతోనే చేప పిల్లల పంపిణీలో అక్రమాలు బయటపడుతున్నాయి. కొన్ని చెరువుల్లో పోసిన చేప పిల్లల లెక్కల విషయంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు, చెక్‌పోస్టుల్లో నమోదైన లెక్కల ఆధారంగా చేప పిల్లల పంపిణీలో అక్రమాలను బయటికి తీసేందుకు విజిలెన్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాలో అనధికారికంగా చేపపిల్లల పంపిణీ బాధ్యత తీసుకున్న ఓ ఎమ్మెల్సీ సదరు కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత చేప పిల్లల్లో అక్రమాలు, అక్రమార్కుల వివరాలు బయటకి రానున్నాయి. -
విద్యుత్ చౌర్యంపై కేసుల నమోదు
ఏసీలు ఉన్న ఇంటికి దొడ్డిదారిలో.. నాలుగు మండలాల్లో దాడులు చేసిన విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది 193 కేసులు నమోదు, రూ.20 లక్షల జరిమాన తిరుపతి రూరల్: విద్యుత్ చౌర్యంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ఆకస్మిక దాడులు చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన 38 మంది విద్యుత్ విజిలెన్స్, ఏపీటీఎస్ ఇన్స్పెక్టర్లు, వివిధ బృందాలుగా ఏర్పడి చిత్తూరు రూరల్, పెద్దమండ్యం, బంగారుపాళెం, ఏర్పేడు మండలాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో మీటర్‌కు సంబంధం లేకుండా వివిధ రూపాల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న మొత్తం 193 మందిపై కేసులు నమోదు చేసినట్లు సదరన్ డిస్కం విజిలెన్స్ సూపరింటెండింగ్ ఇంజనీరు వి.రవి తెలిపారు. మొత్తం రూ.20 లక్షలను జరిమాన విధించామన్నారు. ముఖ్యంగా పెద్దమండ్యం మండలం కనిచెర్లలోని చైతన్య స్కూల్‌కు మీటర్‌ను బైపాస్ చేసి దొంగచాటుగా విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామని, ఆ స్కూల్‌కు రూ.85 వేలు జరిమాన విధించామన్నారు. అలాగే బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లిలో దేవేంద్ర బ్రిక్స్ ఫ్యాక్టరీకి రూ.40 వేలు, పెద్దమండ్యం మండలం కనిచెర్లలో పాపన్నకు చెందిన ఎస్వీఎస్ బేకరీలో మీటర్ బైపాస్ చేసి విద్యుత్‌ను చౌర్యం చేయడంతో రూ.70 వేలు, పైపల్లి మండలం నెల్లిశెట్టిపల్లిలో ఎస్ఆర్ కృష్ణ అనే వ్యక్తికి రూ.88 వేలు, ఇటుకబట్టీకి నేరుగా కొక్కీలు వేసుకుని విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న బంగారుపాళెం మండలం ముంగరమడుగులో దండు రాజశేఖర్‌కి రూ.88 వేలు జరిమాన విధించినట్లు తెలిపారు. జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖారు నాటికి 2,914 కేసులు నమోదు చేసి రూ.2.07 కోట్లను జరిమానగా విధించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్యుత్ చౌర్యం ఎక్కువగా పీలేరు, మదనపల్లి, చిత్తూరు రూరల్, పుత్తూరు, తిరుపతి రూరల్ డివిజన్ల పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ జేఎండీ ఉమాపతి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ మీటరు ద్వారానే విద్యుత్ వినియోగించుకోవవాలని కోరారు. -
‘ఆరోగ్యలక్ష్మి’లో అన్నీ అవకతవకలే..
- రాష్ట్రంలో పాత ఆదిలాబాద్ జిల్లాలో మొదట గుర్తింపు - గత జూలైలో రాష్ట్ర విజిలెన్స్ విభాగం తనిఖీలో బహిర్గతం - అర్హులకే నేరుగా నగదు బదిలీ చేసేందుకు నిర్ణయం - ఇక ఏటా రూ. 31.24 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకే.. సాక్షి, నిర్మల్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నగదు బదిలీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం గమనా ర్హం. మహిళ, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన గర్భిణులు, బాలింతల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి దానికయ్యే ఖర్చును వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. అంగన్వాడీల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో తొలి విడత దీన్ని నగదు బదిలీ కిందకు మార్చనున్నారు. ఇలా చేయడం వల్ల పౌష్టికాహారంలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడంతోపాటు అర్హులకు నేరుగా లబ్ధి కలుగుతుందని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. అవకతవకలు మొదట ఆదిలాబాద్‌లోనే.. ఆరోగ్యలక్ష్మి పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో మొదట పాత ఆదిలాబాద్ జిల్లాలోనే రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. గత జూలై 22, 23 తేదీల్లో పాత ఆదిలాబాద్ జిల్లాలోని అర్బన్ ప్రాజెక్టులు మినహా 15 రూరల్ ప్రాజెక్టులలో ఆరు విజిలెన్స్ బృందాలు తనిఖీ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ తనిఖీల్లో ఆరోగ్యలక్ష్మిలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ బృందానికి తేటతెల్లమైంది. పలుచోట్ల లబ్ధిదారుల హాజరు, పౌష్టికాహారం పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. వాస్తవంగా గర్భిణులు, బాలింతలు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రానికి రావడాన్ని కష్టంగా భావిస్తున్నారు. చాలాచోట్ల దొడ్డుబియ్యంతో వండిన భోజనాన్ని నిరాకరిస్తున్నారు. వండిన పదార్థం కాకుండా ముడి సరుకు ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని అప్పట్లో స్పష్టమైంది. సరుకులు దారి తప్పుతున్నాయని విజిలెన్స్ బృందం తనిఖీలో వెల్లడైంది. ఆదిలాబాద్‌లో భారీ అవకతవకలు బయటపడడంతో మిగతా జిల్లాల్లోనూ ఈ తనిఖీలు చేయాలని ప్రభుత్వం యోచించింది. ఆ తరువాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇలాంటి త నిఖీలు చేపట్టి అవకతవకలను గుర్తించింది. అప్పట్లో సస్పెన్షన్లు, చార్జ్ మెమోలు.. ఆరోగ్యలక్ష్మి అవకతవకలు విజిలెన్స్ తనిఖీలో వెల్లడి కావడంతో ఆ బృందం రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక అందజేసిన పది రోజుల్లోనే పలువురు అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 3వ తేదీన జైనూర్ సీడీపీవో శ్రీదేవి, లక్సెట్టిపేట జూనియర్ అసిస్టెంట్ శారద, తలమడుగు సూపర్వైజర్ మమత, చెన్నూర్ కిష్టంపేట సెక్టార్ సూపర్వైజర్ ఉమాదేవి, వాంకిడి జూనియర్ అసిస్టెంట్ సలీం పాషాలను సస్పెండ్ చేశారు. మరో 39 మంది ఉద్యోగులకు చార్జ్ మెమోలిచ్చారు. అందులో 12 మంది సీడీపీవోలు ఉండడం గమనార్హం. చార్జ్ మెమో అందుకున్న సీడీపీవోల్లో బోథ్ సీడీపీవో జ్యోతి వ్యత్యాసాలను సరిచూపకపోవడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. మిగతా సూపర్వైజర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఉద్యోగులు నెలరోజుల్లో ప్రభుత్వానికి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం తరువాత సద్దుమణిగింది. మెమోలు ఇచ్చినవారిపై చర్యలు తీసుకోలేదు. కాగా.. ఇటీవల సస్పెన్షన్ వేటుకు గురైన ఉద్యోగులు దాన్ని ఎత్తివేయాలని ముఖ్య నేతలను ఆశ్రయించినట్లు విమర్శలు వచ్చాయి. ఇదీ పరిస్థితి.. పాత ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్యలక్ష్మి ద్వారా 41 వేల 326 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరుతుంది. జిల్లాలోని 18 ప్రాజెక్టుల పరిధిలో 4 వేల 124 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుకు రోజూ ఒకపూట పప్పు భోజ నం, 200 మిల్లీ లీటర్ల పాలు, గుడ్డు అం దిస్తారు. నిత్యం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే లబ్ధిదారు పౌష్టికాహారం కోసం ప్రతీపూట రూ.21 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఏటా రూ.31.24 కోట్లు వెచ్చిస్తోంది. ఆరోగ్యలక్ష్మి పథకంలో అన్నీ అవకతవకలే జరగడంతో ఇక రానున్న రోజుల్లో ఈ రూ.31.24 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ కానున్నాయి. -
కాలేజీల తనిఖీ నివేదికల్లో తేడాలు!
- జేఎన్టీయూహెచ్ - విజిలెన్స్ తనిఖీల మధ్య భారీగా వ్యత్యాసాలు - మూడు కేటగిరీలుగా కాలేజీల విభజనకు ప్రభుత్వ ఆదేశాలు - నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపునకు కసరత్తు! - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షలో నిర్ణయం - ఫీజుల నిర్ణయంపై ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం 29కి వాయిదా - ఫలితంగా వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల్లో తప్పని ఆలస్యం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ తదితర అంశాల్లో ఇటు జేఎన్టీయూహెచ్, అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన తనిఖీల మధ్య అనేక తేడాలు వెల్లడయ్యాయి. జేఎన్టీయూ చేపట్టిన తనిఖీల సందర్భంగా కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడి కాగా, విజిలెన్స్ తనిఖీల సందర్భంగా మరిన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. జేఎన్టీయూహెచ్ లోపాలు లేవని భావించిన కొన్ని కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీల సందర్భంగా లోపాలు బయట పడ్డాయి. ఇక విజిలెన్స్ విభాగం లోపాలు లేవని నివేదికలు రూపొందించిన కొన్ని కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 247 ఇంజనీరింగ్ కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. జేఎన్టీయూహెచ్ లోపాలు ఉన్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో ఒక నివేదిక, విజిలెన్స్ విభాగం లోపాలు ఉన ్నట్లు తేల్చిన కాలేజీలు, లోపాలు లేవని తేల్చిన కాలేజీలతో మరో నివేదిక, రెండు విభాగాల నివేదికల మధ్య తేడాలు కలిగిన (ఒక దాంట్లో లోపాలు ఉన్నవి, మరోదాంట్లో లోపాలు లేనిని, ఒకదాంట్లో బాగున్నవి, మరొక దాంట్లో బాగా లేవని తేల్చినవి) కాలేజీల జాబితాతో కూడిన ఇంకో నివేదిను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఎన్టీయూహెచ్ను ఆదేశించారు. ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు, కాలేజీల తనిఖీల వ్యవహారంపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు కేటగిరీలుగా కాలేజీలను విభజించాక తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చేలా కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారం బుధవారం ఓ కొలిక్కి వస్తుందని భావించినా అది సాధ్యం కాలేదు. త్వరలోనే మరోసారి సమావేశమై తేల్చే అవకాశం ఉంది. ఎటూ తేలని ఫీజుల వ్యవహారం మరోవైపు బుధవారం జరిగిన ఎఫ్ఆర్సీ కమిటీ సమావేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో వచ్చే మూడేళ్లపాటు వసూలు చేసే ఫీజుల ఖరారు వ్యవహారం ఎటూ తేలలేదు. పలు అంశాలపై స్పష్టత రాక.. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ఈ నెలాఖరులోగా ఫీజులు ఖరారు అవుతాయని భావించినా అది సాధ్యం అయ్యేలా లేదు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు, ఫీజులు ఖరారు అయితేనే ప్రవేశాలు చేపట్టే కాలేజీల జాబితాను విద్యార్థులకు అందుబాటులోకి తేవడం సాధ్యం. ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్లు, ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఆలస్యం తప్పేలా లేదు. -
వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో దొంగ వ్యాపారం
► బీటీ పేరుతో లూటీ ► గుంటూరు అడ్డాగా యథేచ్ఛగా నకిలీ విత్తనాల విక్రయాలు ► ప్రధాన కంపెనీల బ్యాగుల పోలికతో మోసగిస్తున్న వైనం ► విజిలెన్స్ శాఖ దాడులతో వెలుగుచూస్తున్న అక్రమాలు ► పత్తి విత్తనాల విక్రయం రైతులను మోసగిస్తున్న వ్యాపారులు ► పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా విత్తనాలను తయారు చేసి అక్రమార్కులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులూ చెబుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి:- నకిలీ విత్తనాలకు గుంటూరు అడ్డాగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ప్రాంతాల నుంచి కొన్ని ప్రధాన కంపెనీలకు చెందిన జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో ఫెయిల్ అయిన విత్తనాలను తీసుకొచ్చి కొందరు వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. జిన్నింగ్ మిల్లులో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని శుభ్రం చేసి అందమైన ప్యాకెట్‌గా, ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టి రైతులకు అమ్ముతున్నారు. గత ఏడాది నిలువునా మునిగిన రైతులు... నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాల సరఫరా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. విత్తనాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొంత మంది వ్యాపారులు రైతులకు మాయ మాటలు చెప్పి నిలువునా మోసం చేస్తున్నారు.. విజిలెన్స్ దాడులతో.... పిడుగురాళ్లలోని రెండు దుకాణాల్లో‘ న్యూటన్’ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చింది. బీటీ అనుమతి లేకుండానే వర్ష 666, దివ్య 333 పేరుతో విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రెండు దుకాణాల నుంచి 946 ప్యాకెట్లు.. దాదాపు రూ.7.50 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జీఏసీ (జెనెటిక్ ఇంజినీర్ అప్రూవల్ కమిటీ)అనుమతి ఇస్తెనే బీటీ అనుమతి వస్తుంది. అలాంటి అనుమతులు ఈ విత్తనాలకు ఏమీ లేనట్టు తెలిసింది. వీరు ఓ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యాపారులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ వారు చెప్పిన విషయాలపై ఆరా తీయగా వీరికి 2014 నుంచి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేనట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చర్యలు తీసుకుంటున్నాం నకిలీ విత్తనాలను ఆరికట్టేందుక అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం.. పత్తి విత్తనాల కొరత లేదు.. జిల్లాలో 3.20 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. ఇప్పటికే జిల్లాలో 85 నుంచి 90 వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు డీలర్ల వద్దకు వచ్చాయి. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆథరైజ్డ్ డీలర్ల నుంచే బీటీ విత్తనాలు కొనుగోలు చేయాలి. - కృపాదాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు -
‘అద్దె’ మింగిన వారికి అందలం!
♦ అభియోగాలున్న అధికారులను తప్పించిన వైనం ♦ స్వాహా చేసిన 2 కోట్ల రికవరీలో మౌనం ♦ ఆర్టీసీలో అక్రమార్కులకు తెర వెనక అండ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అక్రమార్కులదే రాజ్యం.. నిధులు స్వాహా చేసినా వారిపై చర్యలుండవు. పైగా పదోన్నతులతో అందలమెక్కిస్తారు. దీంతో ఇతర అధికారుల్లో భయం లేకుండా పోయింది. ప్రతి డిపో పరిధిలో ఆడిట్, ఆర్టీసీకి సొంతంగా విజిలెన్స్ విభాగం ఉన్నా యథేచ్చగా అక్రమాలు జరగడానికి ఉదాసీనతే కారణం. ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న దుకాణాల అద్దెలు వసూలు చేసి ఖజానాకు జమ చేయకుండా జేబులో వేసుకుని సంస్థకు కన్నం వేసిన అధికారులను ఎలాంటి చర్యలు లేకుండా తప్పించడం చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ చేసి తాత్కాలిక పద్ధతిపై అద్దెలు వసూలు చేస్తున్న వారిని తప్పించి ఆర్టీసీ యాజమాన్యం చేతులు దులుపుకొంది. ఈ కుంభకోణంలో అభియోగాలు నమోదైన అధికారులకు క్లీన్చిట్ ఇవ్వడంతో ప్రస్తుతం రోజుకో రకమైన అవినీతి బాగోతం చోటుచేసుకుంటోంది. మరి స్వాహా అయిన నిధుల సంగతేంటి...? ఆదాయం కోసం బస్టాండ్లలో దుకాణాలను ఆర్టీసీ అద్దెకిస్తోంది. నెలనెలా వసూలయ్యే మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. ఈ అద్దెల వసూలుకు రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందిని నియమించింది. వివిధ డిపోల పరిధిలో దాదాపు రూ.2 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసిన సిబ్బంది బ్యాంకుల్లో జమ చేయలేదనే విషయం గతంలో వెలుగుచూసింది. దీనిపై అప్పట్లో విచారణకు ఆదేశించగా, రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది.. ఈ వ్యవహారంలో అధికారుల హస్తముందని తేల్చింది. 15 మంది అధికారులు, సిబ్బందిపై అభియోగాలు కూడా నమోదు చేశారు. వెంటనే అద్దెలు వసూలు చేస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేసిన ఆర్టీసీ.. అసలు కారకులైన అధికారులపై నాన్చుడు ధోరణి ప్రారంభించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్లీ విచారణ అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఆ కేసు మరుగునపడే వరకు వేచి చూసి ఆ అధికారుల పేర్లను గుట్టుచప్పుడు లేకుండా తప్పించింది. ఓ ఉన్నతాధికారికి క్లీన్చిట్ ఇచ్చి మరీ పదోన్నతి కల్పించి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టింది. మిగతా అధికారులను కూడా పదోన్నతులు, బదిలీలతో సీట్లు మార్చేసింది. చిన్నచిన్న ఆరోపణలతో డ్రైవర్లు, కండక్టర్లను సస్పెండ్ చేస్తున్న ఆర్టీసీ.. రూ.2 కోట్ల కుంభకోణంలో మాత్రం అధికారులకు క్లీన్చిట్ ఇవ్వడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 7 బస్లాండ్లకు సంబంధించి కొత్త దుకాణ స్థలాలను కేటాయించేందుకు టెండర్లు పిలవగా మంచి స్పందన వచ్చింది. నెలకు రూ.10 లక్షల అద్దె వచ్చే అవకాశానికి స్వయంగా కొందరు అధికారులే అడ్డు తగులుతున్నారు. స్థలాలను అప్పగించకుండా వేరే అద్దె దుకాణాలదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మరో 274 సింగరేణి కొలువులు
-
మరో 274 సింగరేణి కొలువులు
♦ త్వరలో మూడో నోటిఫికేషన్ విడుదల ♦ డిపెండెంట్ పోస్టుల భర్తీకీ యాజమాన్యం చర్యలు సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి త్వరలో మూడో ఉద్యోగ నియామక ప్రకటన జారీ కానుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,147 పోస్టుల్లో 3,518 పోస్టులను బహిరంగ నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన యాజమాన్యం..ఇప్పటికే 3,244 పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. మూడో విడతగా త్వరలో 274 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతర్గత ప్రకటనల ద్వారా మరో 929 పోస్టులు, డిపెండెంట్ కేటగిరీ కింద 2,700 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. సింగరేణిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ సంస్థ ప్రజాసంబధాల అధికారి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ మార్గదర్శకత్వంలో విజిలెన్స్ విభాగం నిరంతర పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నియామకాల ప్రక్రియ జరుగుతోందని ఇందులో తెలిపారు. నవంబర్‌లో నియామక ఉత్తర్వులు.. తొలి రెండు విడుతల్లో 3,244 పోస్టుల భర్తీకి ప్రకటనలు రాగా, ఇప్పటికే 2,045 పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జరిగాయి. ఇప్పటికే 453 పోస్టులకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయగా, నవంబర్‌లో 811 జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (జేఎంఈటీ) పోస్టులు, 60 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) పోస్టులు, 72 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) పోస్టులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొన్ని పోస్టులకు విద్యార్హతల విషయంలో చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే అంశంపై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావాల్సి వుంది. ఆ తర్వాతే మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు. అంతర్గత అభ్యర్థులకు కేటాయించిన 929 పోస్టుల్లో ఇప్పటి వరకు 769 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పూర్తైది. డిపెండెంట్ కేటగిరీ కింద సైతం ఇప్పటి వరకు 2,200 మందికి ఉద్యోగాలు కల్పించారు. -
దోచుకున్నోళ్లకు దోచుకున్నంత!
సాక్షి ప్రతినిధి, కడప : ‘నీరు-చెట్టు’ పనుల్లో చోటు చేసుకుంటున్న అవకతవకల ఉదంతానికి ఇదో చక్కటి ఉదాహరణ. నీటి సంరక్షణ చర్యల పేరుతో జిల్లాలో అధికార పార్టీ నేతల జేబులు నింపేదిశగా అధికారుల చర్యలున్నాయి. పాడుబడ్డ వంకలు, వాగులు టీడీపీ నేతలు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తక్కువ ఖర్చు, శ్రమ తక్కువ, ఎక్కువ లాభం అన్నట్లుగా ఈ పనులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.26 కోట్లతో ప్రారంభమైన పనులన్నీ దాదాపు పైన పేర్కొన్న రీతిలోనే సాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఉపయోగం లేని పనులకు కోట్లాది రూపాయలిలా ఖర్చు చేస్తున్నారు. ఎక్కువ ఉపయోగం ఉన్న చెరువుల్లో పూడికతీత పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, వంకల్లో పూడికతీతకు పెద్ద పీట వేయడం అనుమానాలకు తావిస్తోంది. మైదుకూరులో 15 శాతం ఖర్చుతో పనులు పూర్తి వర్షపు నీరు సహజంగానే వాగులు, వంకల ద్వారా చెరువులకు చేరుతోంది. అయితే టీడీపీ నేతల భుక్తి కోసం చెరువులకు నీరు వెళ్లే మార్గాలను శుభ్రపరిచే పనులు చేపట్టారు. అవసరం లేని పనులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం టీడీపీ నేతల దోపిడీకి మార్గమయ్యాయి. మంజూరైన నిధుల్లో కేవలం 15 శాతం ఖర్చుతో పనులు పూర్తి అవుతున్నాయి. మరో 30 శాతం వరకూ అధికారులకు పర్సెంటేజీ ఇవ్వాల్సి ఉందని సమాచారం. తక్కిన మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతోంది. అంటే రూ.1లక్ష పనిచేస్తే రూ.50 నుంచి రూ.60 వేల ఆదాయం దక్కుతోంది. దాంతో ఈ పనుల కోసం వారు ఎగబడుతున్నారు. 60 సెంటీ మీటర్లు వంకల్లో పూడిక తీయాల్సి ఉండగా ముళ్లపొదలను తొలగించి డబ్బులు దండుకుంటున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో ప్రస్తుతం నీరు-చెట్టు పనులు అత్యంత అధ్వానంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా 25 పనులకుగాను రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చక్రం తిప్పుతోన్న ఏఈ ఆయన సొంత మండలం బి.మఠం. 30 ఏళ్లుగా అదే మండలంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరుతాడు. ప్రస్తుతం ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన అన్ని పార్టీల రాజకీయ నేతగా చలామణి అయ్యారు. అధికారం రావడంతో ప్రస్తుతం టీడీపీతో జట్టు కట్టారు. నీరు-చెట్టు నిధులు ఎల వేసి స్వయంగా ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి మెప్పు కోసం కొత్తపల్లె, పలుగురాళ్లపల్లె, ముడుమాల, గుండాపురం, నేలటూరు, కమ్మవారిపల్లెలలో అతి తక్కువ ఖర్చుతో టీడీపీ నేతలకు లక్షలాది రూపాయాలు దోచి పెట్టుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘నీరు-చెట్టు’లో దోపిడీపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విభాగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
- విచారణ ఫైళ్లకు తిలోదకాలు - విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట - ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర - కమిషనరేట్ అవినీతి మయం సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ కమిషనరేట్‌లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. లేదని చెబుతూ... కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం. నిండా నిర్లక్ష్యమే.. కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్‌కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
కార్మికశాఖ విజిలెన్స్‌లో అవినీతి తిష్ట..!
- మూడుస్లారు తప్పించినా అదే స్థానంలో ‘పర్యవేక్షకుడు’ - ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ‘విచారణ’ ఫైళ్లు సాక్షి,సిటీబ్యూరో: కార్మికశాఖ కమిషనరేట్‌లోని విజిలెన్స్ విభాగానికి అవినీతి చెద పట్టింది. కార్మికశాఖ నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలకు సిఫార్సు చేయాల్సిన విజిలెన్స్ విభాగం అవినీతిమయంగా మారింది. దీర్ఘకాలికంగా ఇక్కడ తిష్ట వేసిన ‘పర్యవేక్షకుడు’ పై అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని ఈ విభాగం నుంచి ముచ్చటగా మూడుసార్లు తప్పించినప్పటికీ మళ్లీ అదే స్థానానికి రావడం విస్మయం కలిగిస్తోంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల అమలు సైతం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కార్మిక శాఖ కమిషనర్‌గా డాక్టర్ అశోక్ ఉన్నప్పుడు విజిలెన్స్ విభాగం పర్యవేక్షకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో అతడిని అక్కడి నుంచి తప్పించారు. కమిషనర్ డాక్టర్ అశోక్ బదిలీ కావడంతో తిరిగి పాతస్థానం చేజిక్కించుకోవడంలో సదరు పర్యవేక్షకుడు సఫలీకృతమయ్యాడు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో కొత్త కమిషనర్ అతడ్ని అక్కడి నుంచి తప్పించారు. తాజాగా రాజకీయ పైరవీలతో మళ్లీ ఆయన అదే స్థానంలో చేరడం కార్మిక శాఖలో చర్చనీయంశంగా మారింది. తొక్కి పెట్టుడు... కార్మికశాఖ విజిలెన్స్ విభాగానికి విచారణ కోసం ఫైల్‌ను తొక్కి పెట్టడం ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు రెండేళ్ల క్రితం ‘ పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల జీతాన్ని అక్రమంగా తీసుకున్నారు’ అనేఅభియోగాలపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/5002/2013, తేదీ 7-11-2013) అధికారికంగా ఒక ఫైల్ చేరింది. కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్ విచారణకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉంది. సదరు అధికారి పదవీ విరమణ కూడా జరిగిపోయింది. అలాగే, రంగారెడ్డి జిల్లా డీసీఎల్ ఒకరు ఆఫీస్ రికార్డును ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడిన అభియోగంపై విజిలెన్స్ విభాగానికి (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012.తేదీ 25-08-2012) మరో ఫైల్ చేరింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫైల్ కూడా విచారణకు నోచుకోలేదు. అసలు ఫైల్ ఉందా? అదృశ్యమైందా..? తెలియని పరిస్థితి నెలకొంది. సదరు డీసీఎల్ సైతం ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఏసీబీ విచారణ జరిపించండి: రిటైర్డ్ డీసీఎల్ కార్మిక శాఖ విజిలెన్స్ విభాగం అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని అదే శాఖకు చెందిన రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎస్. రాజేందర్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఆ లేఖలో వివరించారు. -
లడ్డూ చుట్టూ అవినీతి చీమలు
- దళారులకు ఇంటి దొంగల సహకారం - పెరిగిన ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం - చర్యలు శూన్యంతో చేతులు మారుతున్న రూ.లక్షలు సాక్షి, తిరుమల: భక్తి శ్రద్ధలతో భక్తులు స్వీకరించే తిరుమల శ్రీవారి లడ్డూ చుట్టూ అవినీతి చీమలు చుట్టుకున్నాయి. ఇంటి దొంగలు, దళారులు కలసిపోవడంతో లడ్డూ అక్రమ దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ప్రసాదాలు విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ఉద్యోగే ఏకంగా కార్పొరేట్ కంపెనీతో బేరసారాలు సాగించి గురువారం విజిలెన్స్ విభాగానికి పట్టుబడిన సంఘటనే ఇందుకు నిదర్శనం. భక్తుల రద్దీతో సంబంధం లేకుండా కొందరు ఉద్యోగులు, సిబ్బంది లడ్డూలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుచేసుకోవటంలో ఆరితేరిపోయారు. పై అధికారులను కాకా పట్టుకుని మారు పేర్లతో ఇబ్బడిముబ్బడిగా లడ్డూలు దక్కించుకుంటారు. రూ.25 చిన్న లడ్డూను కనీసం రూ.50కి, రూ.100 కల్యాణోత్సవం లడ్డూ డిమాండ్‌ను ఆధారంగా రూ.200 పైబడి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రద్దీ పెరిగిందంటే వీరికి పంట పండినట్టే. ఆలయ కేంద్రంగా పనిచేసే కొందరు ఉద్యోగులు, ఇతర విభాగాల సిబ్బంది ఈ దందాలో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అక్రమ దందాలో ఔట్‌సోర్స్ సిబ్బంది హవా లడ్డూ దందాలో కొందరు ఔట్‌సోర్స్ సిబ్బంది చేతివాటం పెరిగిపోయింది. బ్యాంకుల నేతృత్వంలో కొందరు నిజాయితిగా జీతాన్ని నమ్ముకుని పనిచేస్తుంటే మరికొందరు మాత్రం అక్రమంగా కాసులు సంపాదించాలనే ఇక్కడ కొలువులో చేరుతున్నారు. అది కూడా రూ.వేల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు చెల్లించి విధుల్లోకి చేరుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే సుమారు వంద మందిలో 20 శాతం మంది వరకు లడ్డూ అక్రమ తరలింపు పాత కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అయినా అలాంటివారు దొరల్లా కౌంటర్లో లడ్డూ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లడ్డూతో ముడిపడిన కొన్ని విభాగాలు సిబ్బందికి కాసులు ముట్ట చెప్పి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తుంటం గమనార్హం. కాసులు కురిపిస్తున్న సబ్సిడీ లడ్డూ టోకెన్లు ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.24 దాకా ఖర్చు అవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. అయితే, టీటీడీ నిర్ణయం దళారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సర్వదర్శనం కోసం రోజూ సుమారు 45 వేల టోకెన్లు అంటే 90 వేల లడ్డూలు ఇస్తున్నారు. అయితే, అక్కడి కొందరి సిబ్బంది చేతి వాటంతో నల్లబజారుల్లోకి తరలిస్తున్నారు. మొన్న లడ్డూ టికె ట్ల ముద్రణలో అక్రమాలు చోటు చేసుకుని కొంత తగ్గినట్టు కనిపించినా మళ్లీ ఆ వ్యాపారం పుంజుకుంది. -
ట్రాన్స్పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ దాడులు
కడప(ప్రొద్దుటూరు): పన్ను కట్టకండా అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. సుంకం చెల్లించకుండా తీసుకెళ్తున్న రెడిమేడ్ దుస్తులు, ఎలక్ట్రికల్ వస్తువులను గుర్తించిన విజిలెన్స్ సీఐ ఓబులేసు వాటి విలువ ప్రకారం ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన పన్ను 1.80 లక్షలుగా తేల్చారు. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా విజయ, సాయిరాం ట్రాన్స్‌పోర్టు కార్యలయాలకు నోటీసులు జారీ చేశారు. -
వచ్చారు.. వెళ్లారు..
- సీజన్ పూర్తయ్యాక వచ్చిన విజిలెన్స్ బృందం.. - సీసీఐ పత్తి కొనుగోళ్లపై తనిఖీలు - కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి కొనుగోళ్లపై భారత పత్తి సంస్థ(సీసీఐ) విజిలె న్స్ విభాగం దృష్టి సారించింది. ముంబయిలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారుల బృందం నాలుగు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. ఆదిలాబాద్‌లోని ఆ సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం జిల్లాలోని పలు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. కొనుగోళ్ల తీరును బృందంలోని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆదిలాబాద్ సీసీఐ బ్రాం చ్ అద్దెకు తీసుకున్న మెదక్ జిల్లా తూప్రాన్‌లో పత్తి బేళ్ల గోదాములను కూడా బృందం తనిఖీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రెండు నెలల క్రితం జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగాయి. కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తయయ్యాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మొదట్లో రైతుల పత్తిలో తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో కొనుగోళ్లకు సీసీఐ అధికారులు నిరాకరించారు. ఇదే పత్తిని దళారులు క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,700 చొప్పున కొనుగోలు చేసి సీసీఐకికనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.4,050 చొప్పు న విక్రయించారు. దళారులు తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు ఎలాంటి నాణ్యత పరిశీలించకుండానే కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో క్వింటాల్‌కు రూ.200 వరకు సీసీఐ అధికారులకు దళారులు ముట్టజెప్పారనే ఆరోపణలు వచ్చాయి. సీసీఐ అద్దెకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులో ఇటీవల పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల వెనుక కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ అగ్ని ప్రమాదాలు ఆసరాగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ సీజన్లో ఆసిఫాబాద్, బోథ్, బేల తదితర చోట్ల ఉన్న సీసీఐ జిన్నింగ్‌లలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం మరిన్ని ఆరోపణలకు దారితీస్తోంది. ఈ బృందం ఆదిలాబాద్‌తోపాటు, వరంగల్ సీసీఐ బ్రాంచ్ కార్యాలయాన్ని, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలన్నీ ఏటా ఉండేవేనని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ విభాగం అధికారులు జిల్లాకు వచ్చారని అన్నారు. సీసీఐ పంట పండింది.. పత్తి సాగుతో అన్నదాతలు అప్పులపాలైతే.. దళారులు, సీసీఐ అధికారులకు మాత్రం పంట పండినట్లయింది. ఈ కొనుగోలు సీజన్లో జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుమారు 44 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు నామమాత్రంగా 1.60 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీసీఐ భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. సుమారు రూ.1,500 కోట్ల విలువ చేసే టర్నోవర్ చేసినట్లు సీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. -
హాస్టళ్లపై విజి‘లెన్స్’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలు అక్రమాలకు నిల యాలుగా మారాయి. నిరుపేద దళి త విద్యార్థుల విద్యాభ్యున్నతికి ఏ ర్పాటు చేసిన ఈ విద్యా సంస్థల్లో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పలు గురుకుల కళాశాలల్లో అధికారులు రికార్డుల నిర్వహణను గాలికొదిలేశారు. నిర్వహణ నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల బాగోతంపై ఆ శాఖ విజిలెన్స్ విభాగం ప్ర త్యేక దృష్టి సారించింది. ఆయా గురుకులా ల్లో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల కళాశాల ను అధికారులు తనిఖీ చేశారు. పలు రికార్డు ల నిర్వహణను కళాశాల సిబ్బంది గాలికొది లేసినట్లు విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చిం ది. అలాగే.. ఆయా గురుకులాల నిర్వహణకు వచ్చిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చినట్లు సమాచారం. సుమారు 15 రకాల రిజిష్టర్లను పరిశీలించగా, ఈ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇందుకు బాధ్యులైన గురుకులం సూపరిండెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గురుకుల సొసైటీ రాష్ట్ర ఉన్నతాధికారులు నుంచి బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 14 గురుకులాలు.. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు 14 ఉన్నాయి. ఇందులో రెండు గురుకు ల పాఠశాలలు కాగా, మిగిలిన 12 గురుకు ల కళాశాలలు ఉన్నాయి. సుమారు ఎనిమి ది వేల మంది దళిత విద్యార్థులు విద్య న భ్యసిస్తూ, వసతి పొందుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి ఆధునిక హంగు ల భవనాలతో గురుకులాలను నిర్మించింది. ఒక్కో గురుకులంలో సుమారు 600 నుంచి 700 వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వసతితోపాటు, అదే పరిసరాల్లో కళాశాల, పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందనుకున్నారు. వీటి నిర్వహణకు ప్రతినెలా రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నాయి. వసతిగృహాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తున్నాయి. విద్యార్థుల భోజనానికి అవసరమైన పాలు, గుడ్లు, కిరాణ, ఇతర ప్రొవిజన్స్ కొనుగోళ్ల కోసం ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అలాగే అకాడమిక్ వైపు లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల, స్టేషనరీ, ఇతర కొనుగోళ్ల కోసం కూడా నిధులు వస్తాయి. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి ఈ నిర్వహణ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంబంధిత రికార్డులను ఏవీ నిర్వహించకుండానే నిధులు డ్రా చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం.. - యాదగిరి, జిల్లా కోఆర్డినేటర్. గురుకుల కళాశాలల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. వారానికి రెండు గురుకులాలను తనిఖీలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ విభాగం లక్సెట్టిపేట గురుకులాన్ని తనిఖీ చేసింది. ఈ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు సూపరిండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.