water problem
-
‘పాలమూరు’పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు కము్మకున్నాయి. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తిప్పిపంపడంతో ప్రాజెక్టు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఉల్లంఘనల ఆరోపణలతో పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం ససేమిరా నిరాకరిస్తుండగా, దీనికి నిధులు, పెండింగ్ బిల్లుల సమస్య తోడుకావడంతో ప్రాజెక్టు నిర్మాణం నీరసించిపోయింది. తాజాగా నీటి కేటాయింపుల అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ ఏమంటుందో..? పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని దశాబ్దాల కిందట గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలు తమవేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ 45 టీఎంసీలకు తోడుగా మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దీనిని ఏపీ వ్యతిరేకిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీల జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు పోలవరం నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు గతేడాది కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడంతో ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పనులు నత్తనడక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ‘పాలమూరు’ను చేర్చింది. ఏటా రూ.6 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రస్తుత ఏడాది (2024–25)లో రూ.6130 కోట్లు, వచ్చే ఏడాది (2025–26) రూ.6313 కోట్ల పనులు చేయాలని నిర్దేశించుకుంది. అయితే గత ఏడాది కాలంలో రూ.4743 కోట్లు విలువైన పనులు మాత్రమే జరగడంతో నిర్దేశిత గడువు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్లో రూ.1500 కోట్లు చెల్లించినప్పటికీ మరో రూ.1437 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎకరాకూ అందని నీరు శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.35,200 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, తర్వాత అంచనా రూ.55,086 కోట్లకు ఎగబాకింది. గత ప్రభుత్వం రూ.27,554 కోట్ల విలువైన పనులు చేయగా, మొత్తం రూ.32,297 కోట్లు విలువైన పనులు పూర్తిచేసినా, ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. ప్రాజెక్టుకు మరో రూ.22,789 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్దండాపూర్ పనులను అడ్డుకుంటున్న రైతులు... స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆరు రిజర్వాయర్లలో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయాయి.ముంపునకు గురైన ఉద్దండాపూర్, వల్లూరు, పొలేపల్లి గ్రామాలతో పాటు శామగడ్డ, ఒంటిగుడిసె, చిన్నగుట్ట, రాగడిగుట్ట తండాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తక్షణం రూ.30 కోట్ల పరిహారంగా చెల్లిస్తేనే పనుల పునరుద్ధరణ జరగనుంది. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై మీమాంస గత ప్రభుత్వం ఉద్దండాపూర్ సహా 5 రిజర్వాయర్ల పనులను మాత్రమే ప్రారంభించింది. చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుని ప్రత్యామ్నాయ మార్గంలో ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లభించని పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతుల్లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పలు షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేయాలని గతేడాది సిఫారసులు చేసింది.పర్యావరణ పునరుద్ధరణకు రూ.153 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పీసీబీ కేసును ఫైల్ చేసింది. తీవ్ర పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలుండడంతో, ఈఏసీ సిఫారసులు చేసినా కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడం లేదు. -
హైదరాబాద్‌లోని ఇందిరా నెహ్రూ నగర్లో నీటి సమస్య
-
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం.. ఆరుగురి మృతి
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన హస్తీనా వాసులకు చల్లగాలులు, వర్షంతో ఉపశమనం లభించినప్పటికీ.. ఊహించని స్థాయిలో పడిన కుండపోత వర్షాలు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దేశ రాజధానిలో శుక్రవారం ఒక్క రోజే 228.1 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఢిల్లీలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షం కురవడం 88 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.అయితే మరో రెండు రోజులు(జూన్ 1) భారీ వర్షాలు, అయిదు రోజులు తేలికపాటి వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో విద్యుత్తు సరఫరాకు, మంచి నీటి సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వర్షం, వరదలు కారణగా దేశ రాజధానిలో ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు.వీరిలో 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో వర్షపు నీరు నిండిన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. వీరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది శనివారం బయటకు తీశారు. షాలిమార్‌బాగ్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఓ వ్యక్తి మునిగిపోయాడు.“दिल्ली की जनता को थोड़ी तमीज़ होनी चाहिए, यें कोई जगह है गाड़ियाँ पार्क करने की।”😏 pic.twitter.com/qOBE6r8HxC— Dr. Atishi || AAP || CM, Delhi 2024 || Parody || (@atishi_maarlena) June 28, 2024 ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న పైకప్పు కూలిన టెర్మినల్-1ను నేడు కూడా మూసివేశారు. శుక్రవారం పైకప్పు కూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలసిందే. మరో నలుగురురికి గాయాలయ్యాయి. ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఓ అండర్‌పాస్‌లో వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది.గత మూడు నెలలుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ నగరం.. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ఈ వర్షంతో రాజధాని మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయిందిఇక నేడు (శనివారం) ద్వారకా, పాలం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గుర్గావ్, ఫరీదాబాద్, మనేసర్‌తో సహా ఢిల్లీ-ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఢిల్లీ వాటర్ కష్టాలు
-
ఢిల్లీలో నీటి సంక్షోభం.. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా
-
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది. -
నీటి వినియోగంపై ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు. -
ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు
సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు, నాలుగు నెలలుగా ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు.. యాత్రలు చేస్తున్నాడే తప్ప రైతుల బాధలు చూడట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో నీరు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పొలాలు నీరు లేక ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కానీ, మంత్రులు కానీ పొలాల దిక్కు చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో కాళేశ్వరంపై, కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేరు చేయకుండా.. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా పొలాలను ఎండబెట్టారని ఆరోపించారు. గతంలో గోదావరి నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా చెరువులు నింపి పొలాలు ఎండిపోకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. సారంపల్లిలో పొలాలను చూస్తుంటే.. మేతకు తప్ప కోతకు పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి అప్పులు కడతారా.. చస్తారా.. అన్నట్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఖజానా నింపుతున్నారు యాసంగి సీజన్లో రైతుబంధుకు రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే.. రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తూ వాళ్ల ఖజానా నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయోజనాల కోసం రైతులను గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ఈసీకి లేఖ రాసి రుణమాఫీని ప్రకటించాలన్నారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, పంటలు ఎండిన రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ధైర్యం నింపి వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పొలాలను సందర్శించాలని కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. నిరుడు చెరువుల్లోకి కాల్వనీరు వచ్చి పొలం పారిందని, ఈసారి పది ఎకరాల్లో వరి వేస్తే మొత్తం ఎండిపోయిందని కేటీఆర్‌కు పర్శరాములు అనే కౌలు రైతు చెప్పారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. -
వారికి మెగాస్టార్ చిరు సలహా.. ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి నేపథ్యంలో చిరు సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో అవలంభించిన పద్ధతులను వివరించారు. తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ఫోటోలను పంచుకున్నారు. అంతే కాకుండా తన ట్వీట్లో కన్నడ భాషలో రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే?) కాగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత త్రిష మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ... ಬಹಳ ಮುಖ್ಯ. ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024 -
తడారిన తండాలు ..ఏజెన్సీ ప్రజల పాట్లు
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి. పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశాడు. రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. -
రాష్ట్రంలో కరువు పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఏడాదిగా సరైన వర్షపాతం లేక రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. కరువు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. బుధవారం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ జిల్లాల రైతులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పండిస్తున్న పంటలు, అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కరువు పరిస్థి తులు ఉన్నాయి. వచ్చే ఎండాకాలంలో తాగునీటికి కష్టా లు రాకుండా చూడాల్సిన అవ సరముంది. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలంటూ కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలు ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడు తుంది. రైతులు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. ఎప్పుడూ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలి. అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వం రైతుల తో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడు తుంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ఏ పంట వేయాలనేది మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకు నేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో మా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతుభరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది. పంట మార్పిడితో అధిక దిగుబడులు రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉన్నా యి. రైతులు కేవలం వరి, పత్తి, మిర్చి పంటలకే పరిమితం కావొద్దు. ఇతర పంటలు సాగు చేయాలి. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లా భాలు వచ్చేలా పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసు కోవాలి. దీనిద్వారా తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావొచ్చు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్ర మాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తాం. రైతులు ధైర్యం కోల్పోవద్దు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమ ల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటే.. రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా పనిచేస్తుంది. పంట వేసినప్పటి నుంచి కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం అందుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుంది. వారు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ‘రైతు నేస్తం’ ఏమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతువేదికలను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి.. నేరుగా రైతుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. తగిన సలహాలు ఇవ్వడంతోపాటు పంటల సాగులో అధునాతన మెలకువలను సూచిస్తారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు కూడా ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. -
Aqueduct Water Risk Atlas: ఇక కన్నీళ్లేనా..?
వానలు, వరదలతో ప్రపంచంలో కొన్ని దేశాలు అల్లాడిపోతుంటే, మరి కొన్ని దేశాల్లో గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకి కరువు వచ్చి పడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ జనాభాలో 25% మంది ప్రస్తుతం అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నివేదిక ఏం చెప్పిందంటే.. ► ప్రపంచంలోని 25 దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి దేశాలున్నాయి. ► బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతీ ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ప్రతీ ఏడాది కరువు బారిన పడుతున్నాయి. ► ప్రపంచంలో నీటి కొరత అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలు పశి్చమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. ఈ ప్రాంతాల్లో 83% జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ► దక్షిణాసియా జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశాల్లో 74% మంది జనాభా నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► ప్రపంచ జనాభాలో 50% మంది అంటే 400 మంది కోట్ల వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి. ► నీటి కొరత కారణంగా భారత్, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి. ► 2010లో నీటి కొరత వల్ల ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు (ప్రపంచ జీడీపీలో 24%) నష్టపోతే, 2050 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 31% నష్టం వాటిల్లుతుంది. అంటే 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తుంది. ► ఆసియా దేశాల్లో భారత్ అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షిత నీరు అందదు. ► ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలపై ప్రభావం పడుతోంది. నీటి కటకటకి కారణాలివే..! జనాభా పెరుగుదల , పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సమర్థంగా చేయకపోవడం వంటివెన్నో నీటి కటకటకి కారణాలు. భూమ్మీద 70% నీటితో నిండి ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువైంది. యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం అధికమవడమే కాకుండా, కలుíÙత నీరు పెరిగిపోయే ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. చేయాల్సింది ఇదే..! ప్రతీ వాన బొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. వ్యవసాయ, పారిశశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే చర్యలు చేపట్టడం వంటివి చెయ్యాలి. ఇక గ్లోబల్ వారి్మంగ్ అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సి ఉంది. ఆ 25 దేశాలు ఇవే..!: భారత్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా నీరు మనకి జీవనాధారం. భూమ్మీద లభించే అత్యంత ముఖ్యమైన వనరు అదే. అయినా దాని నిర్వహణలో మనం విఫలమవుతూ వస్తున్నాం. జల సంరక్షణ అనే అంశంలో నేను 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ప్రతీ ఏడాది అదే నివేదిక, అదే కథనం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సంక్షోభ పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాధినేతలు చిత్తశుద్ధితో పని చేస్తూ నీటి వనరుల సంరక్షణకి ఆర్థిక వనరులు కేటాయించాలి’’ –సమంతా కుజ్మా, డబ్ల్యూఆర్ఐ నివేదిక రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాగునీటి సమస్యకు చెక్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్తకు సమాచారం.. పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం. రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు.. అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్‌లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్‌లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు. -
పడిపోయిన భూగర్భజల మట్టం... అప్రమత్తత లేకుంటే ముప్పే
కైలాస్‌నగర్: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలో 9.93 మీటర్ల లోతుకు చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, యాసంగి సాగుకు ఎక్కువ నీటిని వినియోగించడం, బోరుబావుల తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం, జూన్ నెలాఖరుకు చేరినా వర్షాలు కురవకపోవడంతో జలమట్టం పాతాళానికి చేరువవుతోంది. నీటి వినియోగంపై అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకం జిల్లాలో బోరుబావుల తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కొందరు వాల్టా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు. నిబంధనల ప్రకారం బోరుబావి ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. అలాగే బోరుకు బోరుకు మధ్య 250 మీటర్ల దూరం ఉండాల్సి ఉండాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. కనీసం పది మీటర్ల దూరంలోనే రెండు, మూడేసి బోర్లు ఉండడం గమనార్హం. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం శ్రీమామూలుశ్రీగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సాగు చేసిన పంటలకు బోరుబావులే ఆధారం కావడంతో జలాల వినియోగం అధికమై లోతుకు చేరడానికి ప్రధాన కారణమవుతుంది. ఇచ్చోడలో అట్టడుగుకు.. ఈ ఏడాది మే నెలలో నమోదైన అధికారిక నీటి మట్టం వివరాలు పరిశీలిస్తే.. ఇచ్చోడలో అత్యధికంగా 25.70 మీటర్లకు పడిపోయింది. అలాగే గుడిహత్నూర్‌లో 18.2 మీటర్లు, జైనథ్‌లో 14.85 మీటర్లు, నేరడిగొండలో 9.90 మీటర్ల లోతుకు చేరాయి. ఈ మండలాల్లో ఏప్రిల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇచ్చోడలో ఏకంగా 37.60 మీటర్లకు చేరడం గమనార్హం. అయితే మేలో కురిసిన అకాల వర్షాలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ ఏడు మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉన్నాయి. అప్రమత్తత అవసరం నీటి వినియోగంలో ప్రజలు అప్రమత్తత పాటించకుంటే ముప్పు తప్పదని అధికారులు సూచిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించేలా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ క్షేత్రాల్లోనైతే నీటి కుంటలు నిర్మించుకోవాలి. చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా కూడా నీటిని సంరక్షించుకున్న వారమవుతాము. ఎక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను కాకుండా డ్రిప్, తుంపర్ల సేద్యం ద్వారా సాగయ్యే పంటలపై దృష్టిసారిస్తే నీటి సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి జిల్లాలో భూగర్భ జలమట్టం రోజురోజుకు పడిపోతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోరుబావుల తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలి. ముందుగా మీ సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారు పరిశీలించి అనుమతించాకే బోరు ఏర్పాటు చేసుకోవాలి. – ఏ.శ్రీవల్లి, భూగర్భ జలవనరుల శాఖ ఏడీ -
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్/అశ్వాపురం: దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2,250 కోట్ల వ్యయంతో అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద పనులు చేపట్టారు. 23 మండలాల పరిధిలోని 1,828 గ్రామాల్లో 9.97 లక్షల మందికి, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి(ఖమ్మం జిల్లా) పట్టణాల్లోని 2.98 లక్షల మందికి తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 2016లో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు, అశ్వాపురం మండలం మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40ఎంఎల్డీ, పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద 145 ఎంఎల్డీ, పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, పూసూరు వద్ద 9ఎంఎల్డీ సామర్థ్యం గల ఇన్‌టేక్ వెల్లు నిర్మించారు. ప్రతిరోజూ 145 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల డబ్ల్యూటీపీలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలోనే తొగ్గూడెంలోని నీటిశుద్ధి కేంద్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఇంట్రా విలేజ్ స్కీమ్ ద్వారా.. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ పర్యవేక్షణలో పైపులైన్, ట్యాంక్‌లు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.191.09 కోట్లు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో 818 ట్యాంక్‌లు, 2,234 కిలోమిటర్ల పొడవునా పైపులైన్ నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది లేదు జిల్లాలో మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రధానంగా వేసవిలో సమస్య జఠిలంగా ఉండేది. మిషన్ భగీరథ స్కీం అమల్లోకి వచ్చాక తాగునీటి సమస్య పరిష్కారం అయింది. జిల్లాలోని అన్ని గ్రామాలకు దాదాపుగా తాగునీరు అందుతోంది. 85 గొత్తికోయల గ్రామాలకు గాను 75 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.10 గ్రామాలకు అటవీశాఖ అనుమతి లేనందున పైపులైన్ నిర్మించలేకపోయాం. –తిరుమలేశ్వరరావు, ఇంట్రా విలేజ్ ఈఈ -
నీటికోసం బావి చుట్టూ మహిళలు