Waterboard
-
ఇటు సూరీడు.. అటు సర్కారు..
సాక్షి,సిటీబ్యూరో: మహానగర తాగునీటి అవసరాలు తీర్చే జలమండలి విద్యుత్ చార్జీల భారంతో కుదేలవుతోంది. ప్రస్తుతం పరిశ్రమల విభాగం కింద కరెంట్ చార్జీలతో బోర్డు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రూ.150 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక బోర్డు ఆపసోపాలు పడుతోన్న విషయం విదితమే. దీనికి తోడు ప్రతినెలా రూ.68 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. నవంబరు నెలలో ఏకంగా రూ.80 కోట్ల బిల్లు రావడంతో బోర్డు వర్గాలు ఇంత మొత్తం ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఈ విద్యుత్ భారం నుంచి బయట పడేందుకు సౌరవిద్యుత్ వినియోగించే అంశంపై జలమండలి దృష్టిసారిస్తోంది. ఇక వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల పంపింగ్, స్టోరేజీ రిజర్వాయర్ల నుంచి 9.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరాకు నెలకు సుమారు 100 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. ఈ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏకమొత్తంలో దాదాపు రూ.600 కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జలమండలికి సంబంధించి కృష్ణా, గోదావరి జలాల నీటిశుద్ధి, పంపింగ్ కేంద్రాల వద్ద సుమారు 989 ఎకరాల విస్తీర్ణంలో భూములుండడం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్టుకయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు సాకారమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం యాన్యుటీ విధానంలోనైనా చేపడితే బోర్డు నష్టాల నుంచి గట్టెక్కే అవకాశముంది. తాగునీటికి కరెంట్ బిల్లుల షాక్.. జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల వరకు సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.112 కోట్లు దాటుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.68 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతోంది. ఇలా ప్రతినెలా బోర్డు రూ.10 నుంచి రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికి తోడు గత కొన్ని నెలలుగా రూ.150 కోట్ల మేర విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోవడంతో బోర్డు ఖజానాపై భారీ భారం పడినట్టయింది. ఖజానాపై మోయలేని భారం ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం జలమండలికి పేరుకు రూ.1,420 కోట్లు కేటాయింపులు చేసినా.. రెండో త్రైమాసికానికి బోర్డుకు అందిన నిధులు కేవలం రూ.367 కోట్లే. ఇందులోనూ రూ.167 కోట్లు రుణ వాయిదాల చెల్లింపునకే సరిపోయాయి. మిగతా బడ్జెటరీ నిధుల విడుదలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. పులిమీద పుట్రలా హడ్కో సంస్థ నుంచి గతంలో జలమండలి తీసుకున్న రూ.700 కోట్ల రుణాన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా ఇతర అవసరాలకు దారి మళ్లించింది. ఇందులో ఏడాదిగా రూ.300 కోట్లు మాత్రమే బోర్డుకు చెల్లించింది. మిగతా రూ.400 కోట్లు చెల్లించే విషయంలో రిక్తహస్తం చూపించింది. దీంతో కీలకమైన తాగునీటి పథకాల పూర్తికి నిధుల లేమి శాపంగా పరిణమిస్తుండడం గమనార్హం. -
పేదింటికి నల్లా
►1,476 బస్తీల్లో అమలకు జలమండలి నిర్ణయం ►రూ.100 కోట్ల నిధులతో ఏర్పాట్లు ►రూ.1కే 50వేల నల్లా కనెక్షన్ల మంజూరు ►వందరోజుల ప్రణాళిక సిద్ధం ►ఇక పేదల తాగునీటి ఎదురుచూపులకు చెక్! ►తగ్గనున్న ట్యాంకర్ల నిర్వహణ వ్యయం ►పెరగనున్న జలమండలి ఆదాయం సిటీబ్యూరో: మహానగరం పరిధిలోని ఎంపికచేసిన 1,476 మురికివాడల్లో వందరోజుల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటే లక్ష్యంగా జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుపేదలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.100 కోట్లను వెచ్చించనుంది. ఆయా బస్తీలు, మురికివాడల్లో ఇప్పటివరకు నల్లా కనెక్షన్ లేని ఆవాసాలకు రూ.1కే ఇవ్వాలని, నూతనంగా 50 వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా సుమారు 5 లక్షల మంది పేదలకు మేలు చేకూర్చాలని నిర్ణయించింది. ఈ అంశంపై గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటులేని, కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న.. తక్కువ వత్తిడితో నీటిసరఫరా జరుగుతున్న ప్రాంతాలను తక్షణం సెక్షన్ల వారీగా గుర్తించాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి నల్లా కనెక్షన్ ఏర్పాటుకు చేయాల్సిన పైపులైన్లు, బూస్టర్ పంప్‌లు, కలుషిత జలాల నివారణకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు సిద్ధంచేసి పనులు ప్రారంభించాలన్నారు. బస్తీలకు తీరనున్న దాహార్తి.. నగర శివార్లలోని 12 శివారు మున్సిపల్ సర్కిళ్లను కలుపుకొని 2007లో మహానగర పాలకసంస్థ (జీహెచ్ఎంసీ) ఏర్పాటైంది. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీలో 1476 మురికివాడలున్నాయి. వీటిలో చాలా నివాసాలకు ఇప్పటికీ నల్లా కనెక్షన్లు లేవు. దీంతో పబ్లిక్ నల్లాలు, ట్యాంకర్ల ద్వారానే ఇక్కడి పేదలు గొంతు తడుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హడ్కో నిధులు రూ.1900 కోట్లతో జలమండలి ఆయా ప్రాంతాల్లో 1300 కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరో 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ పైపులైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో సమీప భవిష్యత్‌లో ఆయాబస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లకు రోజూ నీటిసరఫరా చేస్తారు. ఇదే జరిగితే ఆయా బస్తీలకు ట్యాంకర్ నీళ్లకోసం ఎదురు చూసే పరిస్థితి తప్పుతుంది. సీఎం సంకల్పాన్ని సాకారం చేస్తాం జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా బస్తీల్లో ఇంటింటికీ నల్లా లేదు. చాలా ప్రాంతాలకు ట్యాంకర్ నీరే దాహార్తిని తీరుస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. గ్రేటర్ పరిధిలో ప్రతి బస్తీలో ఇంటింటికి నల్లాల ఏర్పాటు ద్వారా సీఎం కలను సాకారం చేస్తాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే బస్తీల్లో పైపులైన్లు విస్తరించడానికి తక్షణం ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కొత్తగా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాల తుది జాబితాను సిద్దం చేయాలని సూచించాం. – ఎం.దానకిశోర్, జలమండలి ఎండీ -
రూ.100 కోట్లతో బస్తీలకు నీళ్లు
త్వరలో డైలీ వాటర్..! జలమండలి ఎండీ దానకిషోర్ సిటీబ్యూరో: నగరంలో మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని బస్తీలకు నూతనంగా ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా రూ.100 కోట్లు ఖర్చుచేసి తాగునీరు అందిస్తామని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో నగరంలో రోజూ మంచినీరు సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహణ విభాగం అధికారులతో.. సిల్ట్ ఛాంబర్లు, వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ఏర్పాటై 28 సంవత్సరాలైనా.. నగరంలో చాలా బస్తీల్లో ఇప్పటికీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తోందన్నారు.ఆయా బస్తీల్లో నూతనంగా పైపులైన్లు ఏర్పాటుకు బోర్డు సిద్ధంగా ఉందని, దీంతో ట్యాంకర్ల వినియోగం గణనీయంగా తగ్గుతుందన్నారు. మినీ జెట్టింగ్ యంత్రాలతో మురుగు ఉప్పొంగడం, చౌకేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వాణిజ్య భవనాలకు డ్రైనేజీ, నల్లా కనెక్షన్లు ఇవ్వాలంటే విధిగా సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలన్నారు. సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కొత్తగా నిర్మించిన 630 సిల్ట్ ఛాంబర్లకు ఈ వారంలో జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో నెలకు 40 సిల్ట్ ఛాంబర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల ప్రణాళిక, రెవెన్యూ ఆదాయం, వినియోగదారుల ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డైరెక్టర్లను అభినందించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, పీ అండ్ ఏ డైరెక్టర్ ఎ. ప్రభాకర్, ప్రాజెక్టు–1 డైరెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి, సీజీఎమ్‌లు పి.రవి, ఎంబీ ప్రవీణ్ కుమార్, ఎస్.ఆనంద్ స్వరూప్, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. -
ఇక కను‘మరుగు’
►జలమండలి ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ ►రూ.3.03 కోట్లతో మురుగునీటి పైపులైన్ల ప్రక్షాళన రూ.13 కోట్లతో 170 ►‘హాట్‌స్పాట్స్’కు మరమ్మతులు జూన్ తొలివారం లోగా పనుల పూర్తి సిటీబ్యూరో: గ్రేటర్లో చినుకుపడితే చాలు.. ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు..మురుగు, వరద నీరు సుడులు తిరుగుతూ రహదారులు చెరువులను తలపిస్తాయి. వాహనదారులకు నరకం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వర్షాకాలం అవస్థలను తొలగించేందుకు జలమండలి ‘ప్రీ మాన్సూన్ యాక్షన్‌ప్లాన్’ (వర్షాకాల ముందస్తు ప్రణాళిక)కు శ్రీకారం చుట్టింది. జూన్ తొలివారంలోగా మురుగునీటి పైపులైన్లు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన వాటి ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది. ఇరుకైన కాలనీలు, బస్తీల్లో ఈ ప్రక్షాళన పనులు చేపట్టేందుకు 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను రంగంలోకి దించనుంది. గ్రేటర్లో సుమారు ఐదువేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మురుగునీటి పారుదల వ్యవస్థలో.. సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు తరచూ మురుగు నీరు ఉప్పొంగి సమీపబస్తీలు, కాలనీలు, రహదారులను ముంచెత్తే పరిస్థితులున్నాయి. వీటికి తక్షణం ప్రక్షాళన చేపట్టనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇందుకవసరమైన రూ.16 కోట్ల నిధులను సైతం కేటాయించామని పేర్కొన్నాయి. ముందస్తు ప్రణాళిక అమలు ఇలా.. మహానగరంలో జలమండలికి 5 వేల కిలోమీటర్ల పరిధిలో విభిన్న పరిమాణం గల మురుగునీటి పైపులైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై ప్రతి 30 మీటర్లకు ఒకటిచొప్పున 1.85 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటిలో ప్రధానంగా వెయ్యి కిలోమీటర్ల పైపులైన్లు, మరో 50 వేల వరకు మ్యాన్‌హోళ్లలో ప్రస్తుతం చెత్తా, చెదారం, కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ కవర్లు వంటి వ్యర్థాల చేరికతో మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ప్రీమాన్సూన్ యాక్షన్‌ప్లాన్‌ను జలమండలి అమలుచేయనుంది. మరోవైపు మెస్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, డెయిరీ ఫారాలు, సినిమాహాళ్ల నుంచి వెలువడుతోన్న మురుగునీటిలో ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అధిక మొత్తంలో వెలువడుతోన్న నేపథ్యంలో ఆయా వాణిజ్య భవనాల ముందు విధిగా సిల్ట్ఛాంబర్లు(ఘనవ్యర్థాలను నిలువరించేవి)నిర్మించుకునేలా క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిశోర్ ఆదేశాలిచ్చారు. ఏ పనులకు ఎంత వ్యయం అంటే.. ► గ్రేటర్ పరిధిలో తరచూ మురుగునీరు ఉప్పొంగే 170 హాట్‌స్పాట్స్ వద్ద రూ.13 కోట్లతో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ► అసాధారణ స్థాయిలో మురుగు ఉప్పొంగే ప్రభావిత ప్రాంతాల్లో రూ.88 లక్షల అంచనా వ్యయంతో పైపులైన్లు, మ్యాన్‌హోళ్లను సమూలంగా ప్రక్షాళన చేస్తారు. ► ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.22 లక్షలతో 37 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లను శుద్ధి చేయనుంది. ►చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వరద, మురుగునీరు ఉప్పొంగి బస్తీలు, కాలనీలను ముంచెత్తే ప్రాంతాల్లో రూ.2.03 కోట్లతో అత్యవసర బృందాలను రంగంలోకి దించి వారి ఆధ్వర్యంలో ప్రక్షాళన, నష్టనివారణ చర్యలను చేపట్టనుంది. సమస్యలకు తక్షణ పరిష్కారం ప్రీ మాన్సూన్ యాక్షన్‌ప్లాన్‌లో ప్రధానంగా ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగునీటి పైపులైన్లలో తక్షణం ప్రక్షాళన పనులు చేపట్టాలని నిర్ణయించాం. తరచూ సమస్యలు తలెత్తే ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, ప్రక్షాళన పనులు చేపడతాం. వినియోగదారుల నుంచి జలమండలి టోల్‌ఫ్రీ నెంబరు 155313తోపాటు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రతి సెక్షన్ పరిధిలో సిల్ట్ ఛాంబర్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధచూపాలని అధికారులను ఆదేశించాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
నీటి లెక్క ఇక పక్కా!
గ్రేటర్లో ఆర్ఎఫ్ఐడీ మీటర్ల వినియోగం జలమండలి ప్రయోగాత్మక చర్యలు.. సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో సరఫరా చేస్తున్న ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించేందుకు జలమండలి ప్రయోగాత్మకంగా ఆర్ఎఫ్ఐడీ మీటర్లను ప్రవేశపెడుతోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి మహానగరానికి నిత్యం 404 మిలియన్ గ్యాలన్ల మేర కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తోంది. ఈ నీటిని 9.65 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇందులో బిల్లులు వసూలవుతున్నది కేవలం 209 మిలియన్ గ్యాలన్లకు మాత్రమే. మిగతా నీరంతా లీకేజీలు, చౌర్యం, అక్రమ నల్లాల కారణంగా బోర్డు లెక్కలోకి రాకపోవడంతో జలమండలి ఖజనా నష్టాల నుంచి గట్టెక్కడంలేదు. ప్రస్తుతం నెలవారీ ఆదాయం రూ.90 కోట్లు కాగా...జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకు రూ.102 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ఈ నేపథ్యంలో సరఫరా నష్టాలకు శాస్త్రీయంగా చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా జూబ్లిహిల్స్, రెడ్‌హిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో బడా భవంతులకున్న నల్లాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లకున్న వాణిజ్య నల్లాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) సాంకేతికత ఆధారంగా పనిచేసే అత్యాధునిక మీటర్లను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే గ్రేటర్ పరిధిలో ఇతర డివిజన్లకు కూడా క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది. కాగా సుమారు రూ.7,500 ధర పలికే ఈ మీటర్లను సుమారు ఐదు లక్షల నల్లాలకు ఏర్పాటు చేసి నెలవారీ బిల్లులో కొంతమొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేయాలని సంకల్పించింది. ఇందుకయ్యే వ్యయాన్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా స్వీకరించాలా..లేక ప్రభుత్వం ఇందుకయ్యే వ్యయాన్ని కేటాయిస్తుందా అన్న అంశం మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్ఎఫ్ఐడీ మీటర్లతో ఉపయోగాలివే.. మీటర్ రీడింగ్‌లో 100 శాతం కచ్చితత్వం ఉంటుంది. సిబ్బంది నిల్చున్న చోట నుంచే రీడింగ్ సేకరించే వీలు చేతిలో ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా డేటా సేకరణ. ప్రతి ఇంటికీ వెళ్లి నల్లా గుంతలో దిగాల్సిన అవసరం ఉండదు. నీటి సరఫరా నష్టాలను ఇట్టే గుర్తించవచ్చు. బెంగళూరులో ఇలా... మన పొరుగునే ఉన్న బెంగళూరు తరహాలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) నీటి మీటర్లను అక్కడి జలబోర్డు ఏర్పాటుచేసింది. అక్కడి వి«ధానంపై ఇటీవల జలమండలి ఉన్నతాధికారుల బందం బెంగళూరు వెళ్లి పరిశీలించి వచ్చింది.బెంగళూరులో తొలుత ఆయా నల్లాల కు మీటర్లు ఏర్పాటుచేసి తర్వాత విని యోగదారుల నుంచి వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రతి నల్లాకు అక్కడ బెంగళూరు జలబోర్డు ఆర్ఎఫ్ఐడీ మీటర్లను అమర్చుతోంది.మీటరు పనితీరుపై ఫిర్యాదు వచ్చిన 12 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగి మీటరు మరమ్మతులు లేదంటే కొత్తది ఏర్పాటు చేస్తారు. ఒక్కో ఆర్ఎఫ్ఐడీ మీటరు మార్కెట్లో రూ.7,500 ధర పలుకుతోంది. నగరంలో ఇలా... వినియోగదారులు తమ ఇళ్లలోని నల్లాలకు సాధారణ మీటర్లు పెట్టుకుంటున్నారు. ఇవి రూ.1,000 నుంచి రూ.1,500 లోపు ఉంటున్నాయి. నాణ్యత లేకపోవడంలో కొన్ని రోజుల్లోనే మూలకు చేరుతున్నాయి.ప్రస్తుతం నల్లాలకున్న నీటి మీటరు భూమిలోపల ఉంటుంది. ఈ గోతిలోకి దిగి రీడింగ్ తీయడం జలమండలి సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో చాలామంది మీటరు రీడర్లు తోచినంత రీడింగ్ వేసి బిల్లులు ఇస్తున్నారు.కొన్నిసార్లు వాడని నీటికి వినియోగదారులు భారీ ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ మీటర్ల ద్వారా కచ్చితమైన లెక్కలు తెలియడం లేదు. వినియోగిస్తున్న నీటికి చెల్లిస్తున్న బిల్లులకు పొంతన ఉండటం లేదు.ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్ఐడీ మీటర్లు పెట్టాలనేది జలమండలి యోచన. -
కొత్తగా లక్ష నల్లా కనెక్షన్లు
బీపీఎల్ కుటుంబాలకు రూ.1కే కనెక్షన్.. ‘భగీరథ’ విజయవంతం తీరనున్న శివారు ప్రజల దాహార్తి సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో పట్టణ భగీరథ పథకం సత్ఫలితాలిస్తోంది... త్వరలో శివారు ప్రజల దాహార్తి తీరనుంది.. ఈ నెలలోనే కొత్తగా ‘లక్ష’ నల్లా కనెక్షన్లు ఇస్తారు. ఇందులో బీపీఎల్ కుటుంబాలకు రూ. 1కే కనెక్షన్ మంజూరు చేస్తారు. దరఖాస్తు అందిన 2–3 రోజుల్లోనే నల్లా బిగిస్తారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సోమవారం పట్టణ భగీరథ ప్రాజెక్టు, నిర్వహణ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ ఈ విషయం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న పేదలకు, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బోర్డు గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది.. వారి ఇంటికి వెళ్లి కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూపాయికే నల్లా.. బీపీఎల్ కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలని ఎండీ ఆదేశించారు. దీనికి అదనంగా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సాధారణ వినియోగదారులు మాత్రం రోడ్డు కటింగ్ ఛార్జీలతో పాటు ఇంటి నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులను బట్టి నల్లా కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొత్త నల్లా ఛార్జీలను డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే సదుపాయం కల్పించినట్లు దానకిషోర్ తెలిపారు. ప్రతిసెక్షన్ మేనేజర్ రాబోయే మూడునెలల్లో నూతన నల్లా కనెక్షన్ల జారీకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ,ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు డి.శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆటోనగర్ నడిగడ్డ తండాలో ట్రయల్‌రన్.. ఆటోనగర్ నడిగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ పరిసరాల్లోని నిరుపేదలు, ఇతర వినియోగదారులకు నూతన నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి త్వరలో నీటిసరఫరా చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని దానకిశోర్ తెలిపారు. జలమండలి సిబ్బంది కంప్యూటర్లు, స్కానర్లతో ఆయా బస్తీలకు వెళ్లి క్షేత్రస్థాయిలో వినియోగదారులు, నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అక్కడికక్కడే వినియోగదారుని వివరాలను తనిఖీ చేసి నల్లా కనెక్షన్లు మంజూరీ చేయాలని సూచించారు. వినియోగదారులకు తక్షణ సాయం అందించేందుకు క్షేత్రస్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యులతో కలిసి కొత్త నల్లా కనెక్షన్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎండీ తెలిపారు. ఈ నెలలో 12 రిజర్వాయర్లు ప్రారంభం.. మహానగరంలో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లలో 12 రిజర్వాయర్లను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. శివార్లలో తాగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేని వందలాది బస్తీలు, కాలనీల్లో నూతన నల్లాకనెక్షన్ల జారీకి ఇప్పటివరకు 1800 కి.మీ మార్గంలో తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా రెండు లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామని దానకిశోర్ తెలిపారు. కాగా జలమండలి పరిధిలో ప్రస్తుతం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. నూతనంగా ఇచ్చే కనెక్షన్లతో వీటి సంఖ్య 11.65 లక్షలకు చేరుకోనుండటం విశేషం. -
వీణ - వాణిలకు నీటి కష్టాలు
-
వీణ - వాణిలకు నీటి కష్టాలు
హైదరాబాద్: వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్‌గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. హోం ఆవరణలో ఉన్న ఏడు భవనాలకు జలమండలి అధికారులు నీటి కనెక్షన్ కట్ చేశారు. స్టేట్ హోం తమకు రూ.24 లక్షల మేర చెల్లించాల్సి ఉందని జలమండలి అధికారులు అంటున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో కలిపి 700 మంది పైగా ఈ ఆవరణలో మూడు రోజులుగా నీళ్లు లేక అల్లాడుతున్నారు. -
వందేళ్ల వనరు!
‘గ్రేటర్’ దాహార్తిని తీర్చనున్న ‘కేశవాపూర్’ రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రెడీ - ఆరు నెలల్లోగా భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు - అటవీ భూమి సేకరణపైనే దృష్టి - పాములపర్తిసాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: త్వరలో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తి తీరనుంది. ఎండాకాలం కూడా తాగు నీరు సమృద్ధిగా లభించనుంది. మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7,770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ, జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదా వరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పా ట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సం బంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్‌లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్పూర్ రిజర్వాయర్‌కు తరలించే పైప్లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు జలమండలి సన్నద్ధమౌతోంది. భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు... ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3,822 ఎకరాల భూమిలో 918.84 ఎకరాల మేర అటవీ భూమి ఉంది. మిగతాది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ భూమిని ఆరు నెలల్లో సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమౌతోంది. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు సుమారు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాబోయే వందేళ్లకు గ్రేటర్‌కు జల భాగ్యం... విశ్వనగరం బాటలో పయనిస్తున్న మహానగర జనా భా కోటికి చేరువైంది. పదేళ్లలో జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముంది. కోట్లాది జనాభా తాగునీటి అవసరాలకు మరో వందేళ్లపాటు ఢోకాలేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చుట్టూ సహజసిద్ధమైన కొండలు, మధ్యలో జలసిరులు కొలువై ఉండేలా అందమైన రాతి ఆనకట్టతో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్లు సిద్ధమయ్యాయి. దీంతోపాటు చౌటుప్పల్ మండలం(యాదాద్రి జిల్లా) లోని దండుమల్కాపూర్లోనూ మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వకు మరో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం యోచి స్తోంది. అయితే ప్రభుత్వం బడ్జెటరీ నిధులు కేటాయిం చడం లేదా హడ్కో, జైకా, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణ సేకరణ లేదా, కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే ప్రధాన పైప్‌లైన్ పొడవు: 18.2 కి.మీ నీటిశుద్ధి కేంద్రం: 172 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా నిర్మాణం రావాటర్ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు,వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంప్‌లు శుద్ధిచేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యంగల 8 పంప్‌లు శుద్ధిచేసిన నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసే పైప్లైన్లు: 8 కి.మీ మార్గంలో 3,000 డయా వ్యాసార్థం గలవి సీడబ్ల్యూఆర్(క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్):80 మిలియన్ లీటర్లు -
ఆలస్యానికి చెక్
►బుక్ చేసిన వెంటనే నీటి ట్యాంకర్ ►అదే రోజు 90 శాతం సరఫరా.. ►సిటీలో తగ్గుతున్న నీటి డిమాండ్ సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్‌ను బుక్‌చేసి నీటి కోసం కళ్లు కాయలు కాసేలా వేచిచూడాల్సిన అవసరం ఇక ఉండదు. మహానగరం పరిధిలో ఇక నుంచి బుకింగ్‌లు జరిగిన రోజునే 90 శాతం మందికి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్యాంకర్ నీటి బుకింగ్‌లు క్రమంగా తగ్గుతుండడంతో కోరినవారికి వెంటనే ట్యాంకర్‌ను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి జలాలతో గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు జలమండలి ప్రణాళికాబద్ధంగా పలు ప్రాంతాల్లో సరఫరా నెట్వర్క్ విస్తరిస్తోంది. దీంతో పలు ప్రాంతా ల్లోని సిటీజన్ల దాహార్తి క్రమంగా తీరడంతోపాటు ట్యాంకర్లకు డిమాండ్ భారీగా తగ్గింది. గతంలో సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరానికి 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం వాటి నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో కృష్ణా, గోదావరి పథకం కింద 376 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. డిమాండ్ తగ్గుతోందిలా.. సుమారు కోటి జనాభా, 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నగరానికి ప్రస్తుతం మంచినీటి సరఫరాకు 8 వేల కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.1900 కోట్ల రుణంతో శివారు ప్రాంతాల్లో 2000 కి.మీ. మార్గంలో పైప్లైన్లు, నీటినిల్వకు జలమండలి 56 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్ పనులు పూర్తికావడంతో వందలాది శివారు కాలనీలకు జలభాగ్యం దక్కింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రావడం.. ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో నీటిసరఫరా జరుగుతుండడంతో ట్యాంకర్ నీటిపై ఆధారపడడం తగ్గినట్లు జలమండలి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాయి. రుతుపవనాలు కరుణిస్తే ఆయా ప్రాంతాలకు జూలై నుంచి రోజూ నీటిసరఫరా జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. -
ఔటర్ చుట్టు జలహారం
∙రూ.400 కోట్లతో పనులు.. ∙తొమ్మిది నెలల్లో పూర్తి ∙కృష్ణా, గోదావరితో నీటి సరఫరాకు ఏర్పాట్లు ∙నీటి వృథాపై సర్వే.. వాణిజ్య నల్లాలపై నజర్ ∙జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ సిటీబ్యూరో: రాజధానికి మణిహారంలాంటి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ భారీ మంచినీటి పైప్‌లైన్ (రింగ్‌మెయిన్)తో గ్రేటర్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి శ్రీకారం చుడుతోంది. ఇందుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పదిరోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలిచి.. 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మహా నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం సిటీకి తరలిస్తున్న 116 మిలియన్ గ్యాలన్లకు అదనంగా.. మరో 54 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఇందుకోసం 1800 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సింగూరు, మంజీరా నీటి సరఫరా వ్యవస్థలున్న పటాన్చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల దాహార్తి సమూలంగా తీరుతుంది. ప్రస్తుతం జంట జలాశయాలు, సింగూరు, మం జీరా జలాశయాల నుంచి నీటిసరఫరా లేకున్నా కృష్ణా, గోదావరి నుంచి నిత్యం 372 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించి సరఫరా చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోసోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్.. ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, సత్య సూర్యనారాయణతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. రుతుపవనాలు కరుణిస్తే ఈ ఏడాది జూలై నుంచి నగరంలో రోజూ నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం 170 బస్తీల్లో 10 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఔటర్ గ్రామాలకు తీరనున్న దాహార్తి.. వచ్చే వేసవి (2018 మే) నాటికి ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దానకిశోర్ తెలిపారు. రూ.628 కోట్లతో యాన్యుటీ విధానంలో చేపట్టనున్న పనులకు సింగిల్ టెండరు దాఖలైంది. దీంతో ఇటీవల ఈ టెండరును రద్దుచేసి తాజాగా టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఇందులో పలు సంస్థలు పాల్గొనేందుకు వీలుగా వడ్డీరేటులో సడలింపు, 70 శాతం పనులు పూర్తయిన తరవాతే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ వర్తింపు వంటి అంశాల్లో వెసులుబాటు కల్పించామన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్‌లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించి దాహార్తిని తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. శరవేగంగా హడ్కో పనులు శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో మొత్తం 2,600 కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థకు ఇప్పటి వరకు 908 కి.మీ. పైప్లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెలలో 20, ఏప్రిల్‌లో 15, మేలో మరో 15, జూన్‌లో 10 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా 10 మంది ఇంజినీర్లతో నాణ్యతా తనిఖీ బృందం ఏర్పాటు చేశామని, బయటి ఏజెన్సీలతో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణా ఫేజ్–2 పైప్‌లైన్ పనులకు 3 కి.మీ. మార్గంలో మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టడం ద్వారా పాతనగరానికి ఈ వేసవిలో 25 మి.గ్యాలన్ల జలాలను అదనంగా సరఫరా చేస్తామన్నారు. జంటజలాశయాలపై అధ్యయనం.. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తుందని, ఈ అంశంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ప్రస్తుతం 43 శాతం ఉన్న నీటి సరఫరా నష్టాలను తగ్గించేందుకు నారాయణగూడ, ఎస్.ఆర్.నగర్, మారేడ్‌పల్లి డివిజన్లలో ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సర్వే చేస్తామని తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఈసర్వే పూర్తవుతుందన్నారు. రెవెన్యూ నష్టాలను తగ్గించే దిశగా ఇటీవల రూ.46 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామన్నారు. వాణిజ్య నల్లాల గుర్తింపునకు 360 డిగ్రీ సర్వేకు ఉన్నతాధికారులను రంగంలోకి దించామన్నారు. గృహ వినియోగ కేటగిరీ కింద ఉన్న 5,942వాణిజ్య భవంతులను గుర్తించామన్నారు. దెబ్బతిన్న పైప్లైన్లను గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటషన్ రాడార్ సాంకేతికత, ఎన్జీఆర్ఐ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లో దెబ్బతిన్న భారీ సీవరేజీ పైప్‌లైన్‌ను క్యూర్డ్ ఇన్ప్లేస్పైప్ సాంకేతికతతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. -
జూలై నుంచి జలసిరి!
జంట నగరాల్లో ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లు ♦ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వెల్లడి ♦ మే నుంచి గ్రేటర్‌లోని 9.05 లక్షల నల్లాలకు ఎస్ఎంఎస్ సందేశం ♦ ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం.. ♦ ఫిబ్రవరి ఒకటి నుంచి 173 మురికివాడలకు రోజూ నీళ్లు.. సాక్షి, హైదరాబాద్: జంటనగరవాసులకు శుభవార్త. జూలై నెల నుంచి ప్రధాన నగరం (కోర్‌సిటీ) పరిధిలోని ఐదు లక్షల నల్లాలకు రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి చర్యలు ప్రారంభించింది. కృష్ణా, గోదావరి జలాల లభ్యత పుష్కలంగా ఉండడం, జూన్ నెలా ఖరులోగా నగరంలో పలు భారీ స్టోరేజి రిజ ర్వాయర్ల నిర్మాణం పూర్తవనున్న నేపథ్యంలో ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. మరోవైపు నల్లా నీళ్ల సరఫరా వేళలపై వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ సమాచారం అందించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మే నెల నుంచి గ్రేటర్ పరిధిలోని 9.05 లక్షల నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని సంకల్పించింది. ఈ మేరకు సంక్షిప్త సందేశం అందించే ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఎండీ తెలిపారు. ప్రస్తుతానికి కూకట్పల్లి డివిజన్ పరిధిలో 50 వేల నల్లాలకు ఈ సందేశం చేరవేస్తున్నామని.. ఫిబ్రవరి నెలలో సనత్‌నగర్ నియోజకవర్గానికి ఎస్ఎంఎస్ అందించాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి నగరంలోని 173 మురికివాడల్లో 50 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా ఉంటుందన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి అదనంగా మరో లక్ష నల్లాలకు రోజూ గంటకు తగ్గకుండా నీళ్లిస్తామన్నారు. ఇదే సమయంలో నీటి వృథాను అరికట్టడం, కలుషిత జలాల సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు లేదా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యన ఒక గంట పాటు మంచినీటిని సరఫరా చేయనున్నామన్నారు. బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు.. నీటి పొదుపు, అన్ని నల్లాలకు నీటి మీటర్ల ఏర్పాటు, వృథాను అరికట్టడం, కలుషిత జలాల నివారణ, సమస్యల పరిష్కారంలో స్థానికుల భాగస్వామ్యం, రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యలపై జలమండలికి ఫిర్యాదు చేయడం ఎలా.. తదితర అంశాలపై పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయిం చినట్లు ఎండీ చెప్పారు. ఆయా బస్తీల్లో కర పత్రాల పంపిణీ, పోస్టర్ల ఏర్పాటుతోపాటు, స్థానికులతో సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం... అరకొర నీటి సరఫరా.. ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు, కలుషిత జలాలు..అధిక నీటి బిల్లుల మోత.. తదితర సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసే వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఫేస్బుక్, ట్విట్టర్‌ను మరో నెల రోజుల్లో 50 వేల మంది అనుకరించేలా (ఫాలోవర్స్) చర్యలు ప్రారంభించారు. జలమండలి అందిస్తున్న సేవలను గ్రేటర్ సిటీజన్లకు చేరవేయడం, సమస్యల గుర్తింపు, తరచూ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించడం, తక్షణం ఆయా ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ ఉత్తమ సాధనమని భావిస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లకు అందజేసిన స్మార్ట్ఫోన్లలో ఉన్న జల్‌యాప్ మాధ్యమం ద్వారా నిత్యం 200కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయ న్నారు. సిబ్బంది, అధికారుల్లో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి సమావేశానికి ముందు గాంధీ ప్రతిజ్ఙ చేయిస్తున్నామని, వినియోగదారులే తమకు అత్యంత ముఖ్యమని భావించేలా ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపే యత్నం చేస్తున్నామని దానకిశోర్ పేర్కొన్నారు. మరో వందేళ్లకు తాగునీటికి ఢోకా లేకుండా... గ్రేటర్ నగరానికి మరో వందేళ్లపాటు తాగునీటికి ఢోకాలేకుండా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్... మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వ సామర్థ్యంతో మల్కాపురం(నల్లగొండ) రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎండీ తెలిపారు. ఇందుకు అవసరమైన భూముల లభ్యతను గుర్తించడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనుల్లో నిమగ్నమయ్యామన్నారు. -
శివారుకు సవాల్!
రూ.800 కోట్ల నిధులు దారిమళ్లింపు జలమండలి ఖజానా ఖాళీ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రిజర్వాయర్లు, పైపులైన్ల పనులకు బ్రేక్ రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు సిటీబ్యూరో: గ్రేటర్ శివార్ల దాహార్తిని తీర్చేందుకు హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.800 కోట్ల తొలివిడత నిధులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా దారి మళ్లించడంతో జలమండలి ఖజానా ఖాళీ అరుుంది. దీంతో గ్రేటర్ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులకు రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయారుు. ఖజనాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇటు బోర్డు అధికారులు సచివాలయం చుట్టూ....అటు పనులు చేపట్టిన సంస్థలు జలమండలి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తుండడం గమనార్హం. కొత్తగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 2700 కి.మీ మేర పైప్‌లైన్ పనులకు నిధుల లేమి శాపంగా మారింది. ఇటీవలే ఈ పనులకు జీహెచ్ఎంసీ రహదారి కోత అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన పైపులైన్లను కొనుగోలు చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని దుస్థితి తలెత్తింది. ఈనేపథ్యంలో పనులు చేపట్టిన సంస్థలు ఎలా ముందుకెళ్లాలా అన్న సంశయంలో పడ్డారుు. పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితితో శివార్ల దాహార్తి తీర్చే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాహార్తి తీరే దారేదీ.... మహానగర పాలకసంస్థలో 2007లో 11 శివారు మున్సిపల్ సర్కిళ్లు విలీనమయ్యారుు. వీటి పరిధిలో సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలు దశాబ్దాలుగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేక తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నారుు. ఆయా ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో హడ్కో సంస్థ జలమండలి సంస్థాగత భూములను తాకట్టుపెట్టుకొని రూ.1900 కోట్ల రుణం జారీ చేసేందుకు అంగీకరించింది. అరుుతే హడ్కో సంస్థ మంజూరు చేసిన తొలివిడత రుణం రూ.800 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా ఇతర పథకాలకు దారిమళ్లించడంతో దాహార్తి తీర్చే పనులకు నిధుల లేమి తలెత్తింది. ప్రస్తుతం నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో జలమండలి నెలవారీగా రూ.90 కోట్ల రెవెన్యూ ఆదాయం లభిస్తుండగా..విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిపితే నెలకు రూ.102 కోట్ల వ్యయం అవుతోంది. ఇప్పటికే నెలకు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తున్న బోర్డుకు ఇప్పుడు శివారు మంచినీటి పథకాలకు బిల్లులు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. ఇప్పటివరకు చేపట్టిన 56 రిజర్వాయర్ల నిర్మాణం పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. పూర్తిచేసిన పనులకు సంబంధించి గత రెండు నెలలుగా రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన సంస్థలు బోర్డు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇచ్చిన చెక్కూ వృథానే..! కాగా జలమండలికి హడ్కో సంస్థ మంజూరు చేసిన నిధులను పెద్దమొత్తంలో దారిమళ్లించిన సర్కారు....బోర్డు అవసరాలకు రెండు నెలల క్రితం జారీ చేసిన రూ.50 కోట్ల చెక్కు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున జలమండలికి నిధులలేమి కారణంగా శివార్లలో చేపట్టిన పనులను ఎలా పూర్తిచేయాలన్న అంశంపై బోర్డు అధికారులకు మింగుడు పడడంలేదు -
18న సగం సిటీకి నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా ఫేజ్–3 పైపులైన్లకు ముందస్తు మరమ్మతుల కారణంగా ఈనెల 18న (మంగళవారం) నగరంలో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో బీఎన్ రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అల్కాపురి, దిల్సుఖ్నగర్, ఆర్‌జీకె. బండ్లగూడ, బాలాపూర్, బాబానగర్, రియాసత్‌నగర్, బార్కాస్, డీఆర్డీఎల్, డీఎంఆర్ఎల్, మిధాని, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, బీరప్పగడ్డ, కైలాస్‌గిరీ, ఎన్న్ఎఫ్సీ, మైలార్‌దేవ్‌పల్లి, మధుబన్, పీడీపీ, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడీ, అత్తాపూర్, చింతల్మెట్, బుద్వేల్,మెహిదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌజ్, కాకతీయనగర్, హుమయూన్ నగర్, తాళ్లగడ్డ, ఆసిఫ్‌నగర్, ఎంఈఎస్, గంధంగూడ, ఓయూకాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్‌కాలనీ, రెడ్‌హిల్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, నాంపల్లి, లక్డికాపూల్, సెక్రటేరియట్, జియాగూడ, ఆళ్లబండ, గోడెఖీఖబర్, ప్రశాసన్ నగర్, గచ్చిబౌలి, లాలాపేట, చాణక్యపురి, గౌతంనగర్ ప్రాంతాలకు నీటిసరఫరా ఉండదని ప్రకటించింది. మరమ్మతులు పూర్తయిన 12 గంటల్లోగా సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. -
నీళ్లొస్తున్నాయ్.. నల్లా తిప్పండి..
నల్లాలకు నీటి సరఫరా వేళలపై ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం సాక్షి, హైదరాబాద్ : కోటి మందికిపైగా జనాభా ఉన్న మన భాగ్యనగరంలో మంచినీటికి ఎప్పుడూ కటకటే.. దీంతో జలమండలి గ్రేటర్ పరిధిలో రెండ్రోజులకు ఒకసారి.. శివారు ప్రాంతాల్లో మూడ్రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తోంది. అయితే నల్లా నీళ్లు వచ్చే సమయం ఎప్పుడంటే మాత్రం సరైన సమాధానం లభించదు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఇదే పరిస్థితి. ఇకపై నీటి వెతల నుంచి హైదరాబాదీలకు విముక్తి లభించనుంది. నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయో.. నేరుగా వినియోగదారుల మొబైల్‌కే సంక్షిప్త సందేశం రూపంలో సమాచారం అందనుంది. ఈ మేరకు జలమండలి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని 70 వేల నల్లా వినియోగదారులకు నీటిసరఫరా వేళలపై ఎస్సెమ్మెస్‌లు అందజేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి నగరంలోని మిగతా 20 డివిజన్ల పరిధిలోని 8 లక్షల నల్లాలకు సైతం సంక్షిప్త సందేశాలను అందజేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘జీపీఎస్’తో ఎస్సెమ్మెస్‌లు.. వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపేం దుకు జలమండలి జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. క్షేత్రస్థాయిలోని లైన్మెన్లకు స్మార్ట్ఫోన్లు అందించి.. అందులో ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంచింది. నీటి సరఫరా కోసం వాల్వ్ తిప్పేందుకు లైన్మెన్ వెళ్లినపుడు అతని ఫోన్లో ఆ వాల్వ్ నంబర్ ప్రత్యక్షమౌతుంది. దానిపై నొక్కగానే ఆ సమాచారం జలమండలి కేంద్ర కార్యాలయంలోని సర్వర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో ఆ వాల్వ్ పరిధిలోని వినియోగదారులందరికీ ఎస్సెమ్మెస్ ద్వారా నల్లా నీళ్లు వస్తున్నాయన్న సమాచారం అందుతుంది. ప్రయోగాత్మకంగా ‘జల్‌యాప్’ వినియోగం.. నిత్యం వినియోగదారుల నుంచి వచ్చే కలుషిత జలాలు.. అరకొర నీటి సరఫరా, మూతలు లేని మ్యాన్‌హోల్స్ వంటి 9 రకాల ఫిర్యాదులపై జలమండలి రూపొందించిన జల్యాప్ను ప్రయోగాత్మకంగా వంద మంది లైన్మన్ల వద్దనున్న స్మార్ట్ఫోన్లలో వినియోగంలోకి తీసుకొచ్చారు. జల్ యాప్‌కు అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక్కో క్షేత్రస్థాయి మేనేజర్‌కు రూ.2 లక్షల నగదును అందజేయనున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ చీఫ్ జనరల్ మేనేజర్‌ను నియమిస్తున్నామన్నారు. సెప్టెం బర్లో జలమండలిలో పనిచేస్తున్న మూడు వేల మంది లైన్మన్ల స్మార్ట్ఫోన్లలో జల్‌యాప్ అందుబాటులోకి రానుందన్నారు. లైన్మన్ల అక్రమాలకు చెక్.. నీటి సరఫరాపై వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు అందించడం ద్వారా లైన్మన్ల చేతివాటానికి చెక్ పడనుంది. ఉన్నతాధికారులకు సైతం నీటి సరఫరా వేళలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎస్సెమ్మెస్ ద్వారా అందుతుండడంతో డబ్బులు తీసుకుని ఓ ప్రాంతానికి అధికంగా.. మరో ప్రాంతానికి తక్కువ సమయం నీటిని సరఫరా చేయడానికి వీలుండదని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అన్ని నల్లాలకూ ఎస్సెమ్మెస్ కూకట్పల్లి డివిజన్లోని 70 వేల నల్లాలకు ఎస్సెమ్మెస్‌లు అందుతున్నాయి. జలమండలి పరిధిలోని మిగతా 8.06 లక్షల నల్లాలకు సెప్టెంబర్ 15 నుంచి ఎస్సెమ్మెస్‌లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసంమహానగర పరిధిలో మంచినీటి పైపులైన్లపై ఉన్న వాల్వ్‌లను అవి ఉన్న అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జీపీఎస్‌తో అనుసంధానిస్తున్నాం. దీంతోబోర్డు రికార్డుల్లో నమోదైన వినియోగదారుల మొబైల్స్‌కు నీటిసరఫరా వేళలపై ఎస్ఎంఎస్లు అందుతాయి. - దాన కిశోర్, జలమండలి ఎండీ -
‘నీటి’ లెక్క... లేదు పక్కా!
► నీటి మీటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం ► ఇంటింటి ప్రచారంపై క్షేత్రస్థాయి సిబ్బంది నిరాసక్తత ► ప్రతి నెలా జలమండలి ఖజానాకు రూ.కోట్లలో నష్టం ► 8.76 లక్షల నల్లాలకు..మీటర్లున్నవి 1.60 లక్షలకే.. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్ల ఏర్పాటు విషయంలో జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్కగట్టడం ద్వారా వినియోగదారులకు బిల్లుల మోత లేకుండా చూసేందుకు బోర్డు యాజమాన్యం మీటర్లను తప్పనిసరిచేసింది. కానీ వీటి ఏర్పాటు విషయంలో వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించి వారికి అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్మెన్లు, మీటర్ రీడర్లు విఫలమవుతున్నారు. మీటర్లు లేకపోవడంతో ప్రస్తుతం డాకెట్ సరాసరి పేరుతో అశాస్త్రీయంగా జారీ అవుతున్న బిల్లులతో వినియోగదారులకూ బిల్లుల మోత మోగుతుండడం గమనార్హం. 1.60 లక్షల నల్లాలకే మీటర్లు.. గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లుండగా..ఇందులో 1.60 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లున్నాయి. మిగతా నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ మంత్రి కేటీఆర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర ఎం.దానకిశోర్‌ల ఆదేశాల మేరకు ఇటీవల జలమండలి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, లైన్మెన్లు వినియోగదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి మీటర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతోపాటు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పలువురు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కేవలం 43,328 మంది వినియోగదారులకు మాత్రమే నోటీసులివ్వడం గమనార్హం. ఇక మీటర్లు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 1150 మంది వినియోగదారులకు వీటి ఏర్పాటుకు సహకరించే విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తుండడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరం పరిధిలో అన్ని నల్లాలకు నీటిమీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో నెలకు జలమండలి ఖజానాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. -
నీటి కష్టాలకు ‘యాప్’ చెక్
► 2న లాంఛనంగా ప్రారంభం.. ► 9 సమస్యల తక్షణ పరిష్కారానికి శ్రీకారం ► గ్రేటర్లో 24 గంటల నీటిసరఫరా! ► నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు గడువు ► 1 నుంచి మీటర్ల ఏర్పాటుపై డ్రైవ్.. ► ‘మీట్‌ది ప్రెస్’లో జలమండలి ఎండీ దానకిశోర్ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలు.. పైప్లైన్లు, వాల్వ్ లీకేజీ, మురుగు.. ఇలా తొమ్మిది రకాల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఆగస్టు రెండు నుంచి ప్రత్యేక ‘మొబైల్ యాప్’ అందుబాటులోకి రానుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. దీనికి ‘ఆపరేషన్స్ అండ్ మెయిన్టెనెన్స్ మానిటరింగ్ మొబైల్ యాప్’గా నామకరణం చేశామన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్’లో ఆయన వివరాలు వెల్లడించారు. సమావేశంలో బోర్డు డైరెక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఎల్లాస్వామి ఉన్నారు. ఎండీ మాట్లాడుతూ.. ఈ యాప్ గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది లైన్మెన్ల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలో ఉంటుందన్నారు. వారు రోజువారీగా తాము పనిచేస్తున్న పరిధిలో తమ పరిశీలనకు వచ్చిన సమస్యలు, వినియోగదారులు తెలిపిన సమస్యలను తమ వద్దనున్న మొబైల్ఫోన్లలో ఫొటో తీసి ఈ యాప్‌లో కనిపించే 9 బటన్స్‌లో సంబంధిత ఫిర్యాదు బటన్‌పై ప్రెస్ చేస్తారన్నారు. దీని ద్వారా ఏకకాలంలో ఈ సమాచారం సంబంధిత సెక్షన్ మేనేజర్, డీజీఎం, జీఎం, సీజీఎం, ఎండీ, కేంద్ర కార్యాలయంలో ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి తక్షణం తెలుస్తుందన్నారు. తద్వారా కొన్ని గంటల వ్యవధిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. పరిష్కరించే సమస్యలివే.. మొబైల్ యాప్ తెరపై 9 రకాల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా బటన్స్ ఉం టాయి. అవి.. 1. క్లోరిన్ లేని నీళ్లు 2.వాల్వ్ లీకేజీలు, 3.పైపులైన్ల లీకేజీ, 4.కలుషిత జలాలు, 5. పొంగుతున్న మురుగు, 6.మూతలు లేని మ్యాన్‌హోళ్లు, 7.నీటి బిల్లు అందకపోవడం, 8. మీటర్ కావాలని వినియోగదారుడు కోరడం/మీటర్ లేకపోవడం, 9. అక్రమ న ల్లా కనెక్షన్. పరిశీలనలో 24 గంటల నీటిసరఫరా.. ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి పథకం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగినందున నీటి లభ్యత 600 మిలియన్ గ్యాలన్లుగా ఉందని ఎండీ తెలిపారు. అయితే 24 గంటల పాటు నీటిసరఫరా అందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మహానగరంలో అన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు నీరందించేందుకు అవసరమైన పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో లేదని, నగరంలో వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. నల్లాల క్రమబద్ధీకరణకు అవకాశం గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్టు ఎండీ దానకిషోర్ తెలిపారు. ఈ గడువులోగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేవలం నల్లా కనెక్షన్ చార్జీలు చెల్లించి తమ కనెక్షన్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సెప్టెంబరు 1 నుంచి కనెక్షన్ చార్జీలు రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన పౌరులకుSఅక్రమార్కుల నుంచి వసూలు చేసే రెట్టింపు కనెక్షన్ చార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుని, రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన బీపీఎల్ కుటుంబాలకు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే వారి నల్లా కనెక్షన్‌ను క్రమబద్దీకరిస్తామని తెలిపారు. మీటర్లు లేని నల్లాలు 6 లక్షలు.. గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా ఇందులో 6 లక్షల నల్లాలకు మీటర్లు లేవని ఎండీ తెలిపారు. ప్రతి నల్లాకు మీటర్ ఏర్పాటు ద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు అధిక నీటి బిల్లుల మోత లేకుండా చూసేందుకు ఆగస్టు ఒకటి నుంచి మీటర్ల ఏర్పాటుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. ఒకసారి రూ.1500 చెల్లించి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నాలుగేళ్లపాటు వాడుకున్న నీటికే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుందన్నారు. సెప్టెంబరు 30 లోగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకుంటే నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ లభిస్తుందని, లేకుంటే అక్టోబరు నుంచి రెట్టింపు బిల్లు చెల్లించాలన్నారు. -
పీసీబీ వర్సెస్ జలమండలి
► మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంలో జాప్యం ► నిధులివ్వడం లేదని పీసీబీపై జలమండలి ఫిర్యాదు ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ.. సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల చుట్టూ ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాలు) నిర్మాణం విషయంలో జలమండలికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మధ్య సమన్వయ లోపం తలెత్తింది. చివరకు ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరుకుంది. ఎస్టీపీల నిర్మాణానికి నిధుల విడుదల చేయడంలో పీసీబీ జాప్యం చేస్తోందని జలమండలి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...గ్రేటర్ వరదాయినిలు ఉస్మాన్‌సాగర్(గండిపేట్), హిమాయత్‌సాగర్ జలాశయాలు కాలుష్య కాసారాలు కాకుండా కాపాడేందుకు పలుచోట్ల ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈమేరకు పీసీబీ రూ.13 కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే మొదట నిధుల విడుదలకు అంగీకరించి, తర్వాత పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలియడంతో ఈ అంశంపై జలమండలి అధికారులు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని లేఖ రాశారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎస్ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగితేనే ఈ పంచాయతీకి ఫుల్స్టాప్ పడనున్నట్లు సమాచారం. మురుగు శుద్ధి కేంద్రాలు ఎందుకంటే.. జంట జలాశయాలకు కాలుష్య విషం నుంచి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నిర్మించాలని ఏడాది క్రితం జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఉస్మాన్‌సాగర్(గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్,వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడా, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్‌నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక హిమాయత్‌సాగర్ పరిధిలో హిమాయత్‌సాగర్, అజీజ్‌నగర్, ఫిరంగినాలా, కొత్వాల్‌గూడా పరిధిలో ఎస్టీపీలు నిర్మించాలని తలపెట్టింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధంచేసింది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.27.50 కోట్లు వ్యయం చేయాలని గతంలో నిర్ణయించారు. వీటి నిర్మాణం, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షించనుంది. ఆయా గ్రామాల నుంచి రోజువారీగా వెలువడే వ్యర్థజలాలను మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. రోజువారీగా ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య వ్యర్థజలాలను శుద్ధిచేసిన అనంతరం స్థానికంగా ఆయా గ్రామాల పరిధిలో గార్డెనింగ్, వనసంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇన్‌ఫ్లో చానల్స్‌నూ ప్రక్షాళన చేయాల్సిందే..! జంటజలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల పరిధినుంచి జలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్ఫ్లోఛానల్స్)కబ్జాకు గురవడం,ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయాలు చుక్క నీరు లేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఇన్‌ఫ్లో చానల్స్‌ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇలా... ♦ ఉస్మాన్‌సాగర్(గండిపేట్ జలాశయం పరిధిలో) ఖానాపూర్–0.6 మిలియన్ లీటర్లు వట్టినాగులపల్లి–0.8 మిలియన్ లీటర్లు జన్వాడ–0.6 మిలియన్ లీటర్లు అప్పోజిగూడా–0.1 మిలియన్ లీటర్లు చిలుకూరు–0.7 మిలియన్ లీటర్లు బాలాజీ దేవాలయం–0.1 మిలియన్ లీటర్లు హిమాయత్‌నగర్–0.3 మిలియన్ లీటర్లు ♦హిమాయత్‌సాగర్ పరిధిలో... హిమాయత్‌సాగర్–0.25 మిలియన్ లీటర్లు అజీజ్‌నగర్–0.9 మిలియన్ లీటర్లు ఫిరంగినాలా–2.9 మిలియన్ లీటర్లు కొత్వాల్‌గూడా–0.3 మిలియన్ లీటర్లు -
జలమండలి పనులపై కెమెరా కన్ను!
మ్యాన్‌హోళ్లు, మరమ్మతులు, నిర్మాణం పనులపై సీసీటీవీ నిఘా కేంద్ర కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ సిటీబ్యూరో: పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ త్వరలో ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4500 కెమెరాల నుంచి ఫుటేజీ స్వీకరణ.. ప్రస్తుతానికి గ్రేటర్‌వ్యాప్తంగా పోలీసు శాఖ ఏర్పాటుచేసిన 4500 సీసీటీవీలతో ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈవిషయంలో పూర్తిగా సహకరించేందుకు పోలీసువిభాగం సూత్రప్రాయంగా అంగీకరించడంతో..ఆయా కెమెరాల నుంచి ఆన్లైన్లోనే నిరంతరం ఫుటేజీ స్వీకరణకు జలమండలికి మార్గం సుగమం అయ్యింది. అంటే ప్రస్తుతం ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల నిఘా నేత్రం ఇక నుంచి మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్లపైకీ మళ్లనుంది. ఈ ఫుటేజీని ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద, మురుగునీరు కలిసి సుడులు తిరుగుతూ ఉప్పొంగే మూతలు లేని మ్యాన్‌హోళ్లు,పైపులైన్లు, వాల్వ్‌లకు పడుతున్న చిల్లులు వంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు తెరపై వీక్షించి వెంటనే మరమ్మతు పనులకు ఆదేశించవచ్చని బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు. స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పనులపైనా నిఘా నేత్రం.. ప్రస్తుతం గ్రేటర్లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో హడ్కోసంస్థ మంజూరుచేసిన రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల మేర నీటిసరఫరా పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులపై సైతం సీసీటీవీలతో నిఘా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తద్వారా అక్రమాలకు తావుండదని, నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు చెబుతున్నారు. -
జలమండలిలో కమాండ్ కంట్రోల్ సెంటర్
పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, డ్రెయినేజీ పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
పైన పటారం...
‘బెస్ట్ కాలనీ’ సరిహద్దులో వరెస్ట్ వినయ్‌నగర్ కాలనీ బస్టాండ్‌లో డ్రైనేజ్ సమస్య 40 ఏళ్ల నాటి వ్యవస్థతో పదేళ్లుగా ఇబ్బందులు 250 మీటర్లు మార్చేందుకు జలమండలి కక్కుర్తి సిటీబ్యూరో: అది సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాను ఆనుకుని ఉన్న వినయ్‌నగర్ కాలనీ... గతేడాది బెస్ట్ కాలనీగా ఎంపికై బల్దియా నుంచి రూ.10 లక్షల నజరానా అందుకుంది. అయితే కాలనీ లోపల హుందాగానే ఉన్నా సరిహద్దులో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల నాటి పైప్‌లైన్‌ను కేవలం 250 మీటర్ల మేర మర్చడంలో ప్రభుత్వ విభాగాల కక్కుర్తితో 10 ఏళ్లగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ సంఘం ఆరోపిస్తోంది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని మసీదు/దేవాలయం నుంచి దాదాపు 250 మీటర్ల మేర ఏళ్ల నాటి డ్రైనేజ్ పైప్ లైనే ఉంది. ఈ ప్రాంతంలో పదేళ్లుగా వాణిజ్య, నివాస సముదాయాలతో పాటు వసతిగృహాలు పెరగడంతో వాటి నుంచి బయటకు వచ్చే మురుగునీరు ఎన్నో రెట్లు పెరిగింది. చౌరస్తా నుంచి చంపాపేట్ వెళ్లే సాగర్ హైవే. వినయ్‌నగర్ కాలనీ సరిహద్దుల్లోనే ఇబ్రహీంపట్నం/దేవరకొండకు వెళ్లే బస్సులు నిలిపే బస్టాప్ సైతం ఉంది. ప్రధానంగా రద్దీ వేళల్లోనే పాత పైప్‌లైన్ కారణంగా మ్యాన్‌హోల్స్ పొంగి బస్టాండ్‌తో పాటు రహదారిని ముంచెత్తుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలుఎదుర్కొంటున్నారు. ఐఎస్ సదన్ చౌరస్తా వెంబడి జీవనం సాగించే చిరువ్యాపారులు, ఆటో స్టాండ్‌కు ఆటో ఎక్కేందుకు వచ్చే స్థానికులు మురుగు నీటిలోంచే వెళ్లాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని ‘ఏడేళ్లుగా ఈదీబజార్లోని జలమండలి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు అధికారులు కనీసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయలేదు. సోమవారం చంద్రాయణగుట్టలోని జలమండలి జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్‌ను కలిశాం. గరిష్టంగా మూడు రోజుల్లోపు అంచనాలు తీయారు చేయాల్సిందిగా ఈదిబజార్ అధికారుల్ని ఆదేశించారు. కేవలం 250 మీటర్ల మేర పైప్‌లైన్ మార్చడానికి ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ స్థానికుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని వినయ్నగర్కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అవినాష్ కె.రౌత్ అన్నారు. -
ఏమిటీ నిర్లక్ష్యం?
సిటీబ్యూరో ‘చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా..గుంతలు, రోడ్లను కూడా నేనే పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలా.. ? నేను (మంత్రి), మేయర్, కమిషనర్ వస్తే తప్ప పనులు చేయరా...’ అంటూ రాష్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని రహదారుల పనులను పరిశీలించిన ఆయన..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడలలో రోడ్లపై గుంతలు, వివిధ విభాగాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న తవ్వకాలపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులు, విభాగాల మధ్య సమన్యయ లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తేల్చిచెప్పారు. తన పర్యటనతో అధికారుల్లో గుబులు పుట్టించారు. పనులు పూర్తి చేసేందుకు నెలరోజులు పడుతుందని కాంట్రాక్టర్, 15 రోజుల్లో అవుతుందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెప్పడంతో ‘స్టోరీలు చెప్పొద్దు’ అంటూ హెచ్చరించారు. రెండు పనులు కలిసి నెల అనడంతో ‘కామన్సెన్స్ లేదా..’అంటూ అసహనం వ్యక్తం చేశారు. తవ్వకాలతో తాగునీటి లైన్లు పాడవడంతో దాదాపు 45 రోజులుగా నీరు రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరోచోట గత కొన్ని రోజులుగా మురుగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో భోలక్‌పూర్ ఘటన పునరావృతమవుతుందని మంత్రి హెచ్చరించారు. పనులు పూర్తయ్యేంత వరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడే ఉంచాలని సూచించారు. హెచ్‌టీ లైన్లు, పైపులైన్లు తదితరమైన వాటికోసం రోడ్లు తవ్వి ఎంతకాలమైనా పనులు పూర్తికాపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు చూసి అసహనానికి గురయ్యారు. ఎక్కడి కక్కడే చెత్తకుప్పలు, మట్టిదిబ్బలు, ప్రజలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లపై పిచ్చిమొక్కలు కనిపించడంతో తట్టుకోలేకపోయారు. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయవద్దా అని అధికారులను నిలదీశారు. పలు చోట్ల రోడ్ల నాణ్యతపై, గుంతలపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆరా తీసిన మంత్రి.. పర్యటనలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్గౌడ్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఆయన గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో ఆ వివరాలు కనుక్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక సర్కిల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. కింది స్థాయి సిబ్బంది, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేద న్నారు. సాక్షాత్తు గవర్నర్ వచ్చి చెప్పినా సమస్యలు పట్టించుకోరా అంటూ అధికారులపై మండిపడ్డారు. అసలే ఇరుకు దారిలో నిత్యం మురగునీరు పారుతుందని, డంపర్బిన్లు నిండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల వారు ఒకరి తర్వాత ఒకరు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని, కళ్యాణ్‌నగర్, శ్రీనగర్‌కాలనీల్లో చాలా కాలం క్రితమే రోడ్లను తవ్వి కేబుల్స్ వేసినప్పటికి ఇప్పటికీ పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల అధికారులు , మెట్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రి పర్యటన ముఖ్యాంశాలు..... ⇒బురదమయంగా మారిన రహదారిపై మంత్రి వస్తున్నాడని తెలియడంతో అధికారులు అప్పటికప్పుడు ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న బురద మట్టిని ఫుట్‌పాత్ మీద వేస్తుండగా మంత్రి గమనించి ఇది పాదచారులకు ఇబ్బంది కాదా అని మందలించారు. ⇒కేబుల్ పనుల తవ్వకాల వల్ల, వర్షం వల్ల ఇక్కడ బురదలో కిందపడి ప్రజలు గాయపడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక డీసీని పిలిచి మందలించారు. రెండు నెలలుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంపై ⇒ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడు ఎండి. ఉమర్ అనే వ్యక్తి కేటీఆర్ వద్దకు వచ్చి మురుగునీటి సమస్యను ప్రస్తావించారు. ⇒యూసుఫ్‌గూడలో ఒకే రోడ్డులో రెండు వైపులా రోడ్ల తవ్వకాలతో మధ్యలో ఉన్న రోడ్డు గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. రెండు వైపులా తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే మధ్యలో వాహనదారులు చిన్న రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేయాలా అంటూ ప్రశ్నించారు. ⇒యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో బస్టాప్‌లో మంత్రి ఆగి ఉన్న ప్రయాణికులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ బస్షెల్టర్లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దృష్టికి తేగా తాత్కాలికంగానైనా వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ⇒ మెట్రోపనుల కోసం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో కొంత భాగం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ పరిస్థితిపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా పాఠశాలలో గ్రౌండ్ ఉందా, వసతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ⇒132 కేవీ విద్యుత్లైన్పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రోడ్లపై జనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రాజెక్టు విభాగం అధికారికి కేటీఆర్ సూచించారు. గాలి వస్తే కరెంట్ ఎందుకు పోతుందని అడిగారు. ⇒ శ్రీనగర్ కాలనీలో మంత్రి వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్ రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో ఇలా ఉంటే ఎలా.. అంటూ మండిపడ్డారు. ⇒మొత్తం ఎన్ని రోడ్డు కటింగ్‌లకు అనుమతులిచ్చారు.. ఎన్ని పూర్తయ్యాయి.. మిగతావి ఎప్పుడవుతాయి..పూర్తి సమాచారం అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రూ.5 భోజనం బాగాలేదు...(బాక్సులో) ‘ఇది సాంబారా.. నీళ్లా.. ? కారం ఎక్కువ వేశారు..రచీ పచీ లేదు..ఎలా తినాలి దీన్ని... ’అంటూ స్వయంగా ‘రూ. 5 భోజనం’ తిన్న అనంతరం మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ.5 భోజన కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇక ఇక్కడే రూ. 6 కోట్లతో జరుగుతున్న 6 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనుల విషయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పర్యటనలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి, విద్యుత్, తదితర శాఖల ఉన్నతాధికారులున్నారు. -
అరకొర నీటి సరఫరా నేడు
సిటీబ్యూరో: కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)లోని కృష్ణా మూడోదశ నీటిశుద్ధి కేంద్రానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొర నీటి సరఫరా ఉంటుందని జలమండలి ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాలు ఇవే.. ఎల్బీనగర్, వనస్థలిపురం, వాసవీ కాలనీ, అల్కాపురి, ఆటోనగర్, బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, ఎంఈఎస్, లోతుకుంట, ఎంఈఎస్, డిఫెన్స్‌కాలనీ, ఆర్.కె.పురం, సైనిక్‌పురి, సాయినాథ్‌పురం, గాయత్రీనగర్, ఆనంద్‌బాగ్, నేరేడ్మెట్, సఫిల్‌గూడ, మల్కాజ్గిరి, చాణక్యపురి, గౌతంనగర్, మౌలాలి, రాధిక, ఓయూటీ, మహేశ్‌నగర్, కాప్రా, హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, నాచారం, చిల్కానగర్, బీరప్పగడ్డ, ఉప్పల్, కైలాస్గిరి, తుర్కపల్లి, ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, సింగపూర్ టౌన్షిప్, రైల్వేస్,ప్రశాసన్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, బోరబండ, హస్మత్‌పేట్, భోజగుట్ట, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, రాజేంద్రనగర్ ప్రాంతాలు ఉన్నాయి. -
ధూంధాంగా
రాష్ట్రావతరణ వేడుకలకు సర్వం సిద్ధం విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న నగరం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలకు గ్రేటర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుల్లతల జిలుగు వెలుగులతో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, కూడళ్లు తళుకులీనుతున్నాయి. అంబరాన్నంటే స్థాయిలో సంబురాల నిర్వహణకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతోపాటు జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. ప్రధానంగా చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో గురువారం(జూన్ 2న) ఆకాశంలో మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతులు వెదజల్లే బాణాసంచాతో ఆకాశానికి హరివిల్లులు అద్దేందుకు పర్యాటక శాఖ ‘ఫైర్‌వాల్’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. రాత్రి 8.30 నుంచి 9 గంటల పాటు బాణాసంచా, మతాబుల వెలుగుల్లో సాగర పరిసరాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలు, సంస్కృతికి ఆలవాలమైన భాగ్యనగర సాంస్కృతిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేందుకు కవ్వాలి, గజల్, ముషాయిరా వంటి సాహితీ సమ్మేళనాలను నగర వ్యాప్తంగా ముఖ్యమైన ఆడిటోరియాల్లో ఏర్పాటు చేయనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో 500 మంది కళాకారులతో పేరిణీ నృత్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా సన్మానిస్తారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించనున్నారు. హైటెక్‌సిటీలోని హెచ్ఐసీసీలో ఎంపికచేసిన ప్రముఖలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. లుంబినీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సంజీవయ్యపార్కులో అతిపెద్ద జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ వంటకాలతో ఫుడ్‌ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హోటళ్ల అలంకరణ అత్యున్నతంగా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు. అలంకరణ బాగున్న హోటళ్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదుతో సత్కరించనుంది. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహూమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.25 వేల నగదుతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కోసం జీహెచ్ఎంసీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్‌దీపాలు, పూలతో తీర్చిదిద్దుతోంది.వంద జంక్షన్లలో 2247 ఫ్లడ్ లైట్లు, 530 రంగు రంగుల విద్యద్దీపాలతో పాటు ఆయా ప్రాంతాల్లో 240 హాలోజన్, 1721 పార్‌క్యాన్స్ లైట్లతో నగరాన్ని నయనానందకరంగా అలంకరించనున్నారు. వందరోజులప్రణాళికలో భాగంగా పూర్తిచేసిన బీటీరోడ్లకు లేన్ మార్కింగ్ , రేడియం స్టడ్‌ల పనులు ముమ్మరం చేశారు. ఎక్కడా చెత్త కనబడకుండా ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పతాకావిష్కరణలు చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే గన్‌పార్కు, ట్యాంక్‌బండ్, సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్, పరేడ్గ్రౌండ్లకు వెళ్లే అన్ని మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జలమండలి .. జలమండలి పరిధిలోని అన్ని సెక్షన్, డివిజన్ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డులో సుదీర్ఘ సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించేందుకు ఇంజినీర్స్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. మైనార్టీ సంక్షేమ శాఖ .... జూన్ 2న జష్నే తెలంగాణ పేరుతో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాల కోసం పాతబస్తీలోని మక్కామసీదు, సికింద్రాబాద్‌లోని సీఎస్ఐ చర్చి, అమీర్‌పేటలోని గురుద్వార్‌లలో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నాంపల్లిలోని అనీస్-ఉల్-గుర్భా అనాథాశ్రమం లో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, అధికారులు.. నగరంలో జరగనున్న పలు కార్యక్రమాల ఏర్పాట్లను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మంగళవారం పరిశీలించారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేయనున్న భారీ జెండాను పరిశీలించారు. దేశం గర్వ పడేలా 303 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. లుంబీనీ పార్కులో అమరవీరుల స్థూపానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని, ఇక్కడ తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా హాలు నిర్మిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో నగరం నలుమూలల నుంచి ప్రజలు నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, లుంబినీపార్క్కు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ప్లాన్ పిటీ
లక్ష్యం చేరని ‘100 రోజులు’ కార్యాచరణ ప్రణాళిక వందకు 34 మార్కులే... 26 పనుల్లో 12 మాత్రమే పూర్తిచేసిన జీహెచ్ఎంసీ.. జలమండలిలోనూ అంతంతే భాగ్యనగర రూపురేఖలు సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మేడిపండు చందమే అయ్యింది. వంద రోజుల ప్రణాళికకు వంద మార్కులు కేటాయిస్తే..ప్రస్తుత అంచనా మేరకు దక్కింది 34 అత్తెసరు మార్కులే. రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఈ మహా ప్రణాళిక అమలులో జీహెచ్ఎంసీ అధికారులు చతికిలపడ్డారు. జలమండలి అధికారులు అప్పటికే ప్రారంభించిన పనులకు వందరోజుల ముసుగు తొడిగి మమ అనిపించేశారు. చేయగలిగిన పనులు మాత్రమే ప్రణాళికలో పొందుపరచాల్సిందిగా మంత్రి సూచించినప్పటికీ, అత్యుత్సాహంతో 26 పనుల్ని ప్రణాళికలో పొందుపరచి బల్దియా అధికారులు అభాసుపాలయ్యారు. ఇందులో మహా అయితే 12 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో హడావుడి చేసిన మహానగర పాలక సంస్థ సిబ్బంది...కనీసం పబ్లిక్ టాయ్లెట్లను వినియోగంలోకి తేలేకపోవడం ఈ ప్రణాళిక అమలులో డొల్లతనం స్పష్టమవుతోంది. ఖాళీ స్థలాలకు ప్రహరీలు, పార్కుల్లో పిల్లల ఆటసామాగ్రి వంటి చిన్నచిన్న పనులను పూర్తిచేయడంలోనూ విఫలమవడం గ్రేటర్ పిటీ. ఇక జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులదీ అదే తీరు. హుస్సేన్‌సాగర్‌లో పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా చేపట్టిన నాలా మళ్లింపు పనులు సహా మరో 11 ముఖ్యమైన పనులకు వందరోజుల ముసుగు తొడిగి.. పని పూర్తయినట్లు సంబురాలు చేసుకోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ అమలు తీరుపై.. ‘సాక్షి’ ఫోకస్.. హైదరాబాద్ పట్టణం నగరమై.. నగరం మహానగరమై దాదాపు 125 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కోటిమంది జనాభాతో కిక్కిరిసింది. 150 మంది కార్పొరేటర్లతో ప్రత్యేక పాలకమండలి.. అధికార యంత్రాంగం అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారు (అలా అనుకోవాలి). ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశ్రమలకు కేంద్రమైంది. ప్రపంచ నగరిగా విస్తరిస్తోంది. ఇన్ని గొప్ప లక్షణాలున్న భాగ్యనగరం మౌలిక సౌకర్యాల భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. చాలావరకు వందల ఏళ్ల క్రితం నిజాములు ఏర్పాటు చేసిన వసతులే ఉన్నాయి. నగర రూపురేఖలు మార్చాలని ప్రపంచ గొప్ప నగరాల సరసన మనమూ నిలవాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ‘వంద రోజుల ప్రణాళిక’కు జీవం పోశారు. దీంతో సిటీ అద్భుతంగా మారిపోతుందని అంతా భావించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. తర్వాత ఆరంభ శూరత్వంగా మిగిల్చారు. గతంలో చేపట్టిన పనులకు ‘వంద’ రోజుల ముసుగు వేశారు. ప్రణాళికను ప్రకటించి ‘వంద’రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రకటించిన 26 పనుల అమలు తీరుపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, సిటీబ్యూరో వార్డు/ఏరియా కమిటీలు వార్డు కమిటీల ఎన్నికలకు మార్చి 9న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం మే 28న ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా జరగలేదు. అధికార పార్టీకి తగినంత మంది సభ్యుల బలమున్నప్పటికీ, కోరం లేని కారణంగా ఈ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంతో ఈ కమిటీలకు సంబంధించి పొత్తు కుదరకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు వార్డు కమిటీ సభ్యత్వాలను సైతం అధికార పార్టీ కార్పొరేటర్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బేరసారాలు పూర్తి కానందునే కోరం లేకుండా వాయిదా వేసుకున్నారనే విమర్శలూ ఉన్నాయి. ప్రయోజనం లేని పూడికతీత.. వర్షం వస్తే నాలాలు పొంగి పోర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. ఇందుకు వేసవిలోనే నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడమని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 22.79 కోట్లతో 826 కి.మీ. మేర 317 పనులు చేయాల్సి ఉంది. కానీ 285 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో పూడికను బయటకు తీసి నాలా పక్కనే వేసి వదిలేశారు. దీన్ని డంపింగ్ యార్డుకు తరలించక పోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తిరిగి మళ్లీ నాలాల్లోకే చేరింది. దీంతో చేసిన పనులకూ ప్రయోజనం లేకుండా పోయింది. బీటీ రోడ్లు సగం ప్రజా రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రోడ్లు బాగుచేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇందుకు రూ. 200 కోట్లతో 569 రహదారుల పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ 250 పనులే పూర్తి చేశారు. దీంతో షరా మామాలే.. నాలుగు చినుకులు పడితే రహదారులు కుంటలను తలపించే పరిస్థితి. ఎగుడు దిగుడు ప్రయాణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. శ్మశాన వైరాగ్యం.. ప్రణాళికలో భాగంగా రూ.10 కోట్లతో పది శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని తలపెట్టారు. కానీ ఒక్క శ్మశానవాటికలోనే పని జరిగింది. మిగతా తొమ్మిదింటినీ గాలికి వదిలేశారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు మెరుగుపరచి, అంత్యక్రియలకు హాజరైన వారికి పరిసరాలు ప్రశాంతతనిచ్చేలా పచ్చని మైదానాలు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. బస్‌బేల అభివృద్ధి తుస్.. నగరంలో బస్టాప్ ఒక చోట ఉంటే, బస్సులు మరోచోట ఆగుతాయి. ప్రయాణికులు ఆగిన బస్సును అందుకోవాలని పరిగెత్తేలోగా అది వెళ్లిపోతుంది. మరో బస్సుకోసం గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితి మార్చేందుకు నిర్ణీత ప్రదేశంలో బస్సులాగే విధంగా.. ప్రయాణికులు సౌకర్యవంతంగా బస్సు ఎక్కేందుకు వీలుగా 50 బస్‌బేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 3 కోట్ల నిధులు విడుదల చేశారు. వీటిల్లో 20 కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రజల ‘అత్యవసర’ పనులు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలను పాడుచేయకుండా చూసేందుకు వందరోజుల్లో వంద ‘పబ్లిక్ టాయిలెట్ల’ను అందుబాటులోకి తెస్తామన్నారు. పనులు ఆలస్యం కాకూడదని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను కూడా కొనుగోలు చేశారు. కానీ, ప్రజలకు సదుపాయం మాత్రం కల్పించలేకపోయారు. టాయిలెట్లయితే ఉన్నాయి. వాటి నిర్వహణ ఎవరికి అప్పగించాలో అర్థంకాక నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. ప్రకటనల ఏర్పాటు ద్వారా వచ్చే ఆదాయంతో జీహెచ్ఎంసీయే నిర్వహించాలని ఒకసారి, ప్రకటనల ఆదాయాన్ని కాంట్రాక్టు సంస్థలే పొందేలా ఎవరు ఎక్కువ కాలం నిర్వహించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగించాలని మరో సారి.. కాంట్రాక్టు ఏజెన్సీల డిమాండ్లు అడ్డగోలుగా ఉండటంతో ఎక్కడ ఉన్న టాయిలెట్లను వాటికి సమీపంలోని వ్యాపారులకే నిర్వహణ కివ్వాలని మరోసారి.. రకరకాల ఆలోచనలతోనే వంద రోజులు కరిగిపోయాయి. లక్ష్యం చేరని ఆటో టిప్పర్లు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు 2 వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లు వినియోగంలోకి తేవాలని భావించారు. 1790 ఆటోల కొనుగోలు పూర్తయినా, వాటిలో కొన్ని చెత్త సేకరణ పనులు చేయడం లేదు. వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై విచారణ చేసి ఒక సర్కిల్‌వి మరో సర్కిల్లో పనిచేస్తున్నాయని, మాయం కాలేదని ప్రకటించారు. సమీపంలో చెత్త రవాణా కేంద్రాలు లేకపోవడంతో, ఎక్కువ దూరంలోని కేంద్రానికి వెళ్లి రావాల్సి ఉండటం వంటి సమస్యలతో నగరంలోని అన్ని ఇళ్లకూ ఈ ఆటోలు వెళ్లడం లేదు. ప్రభావం చూపని ప్రహరీలు గ్రేటర్లో ఖాళీగా ఉన్న 350 ప్రభుత్వ స్థలాలకు రూ. 20 కోట్లతో ప్రహరీలు నిర్మిస్తామన్నారు. ఇందులోనూ 89 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఈస్ట్ జోన్లో 93 పనులకు 31 పనులు పూర్తి కాగా, సౌత్జోన్లో 30కి 10, సెంట్రల్ జోన్లో 32 పనులకు 7, వెస్ట్‌జోన్‌లో 87 పనులకు 21, నార్త్ జోన్లో 108 పనులకు 20 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ‘డబ్బాలు’ కొట్టారు.. వంద రోజుల ప్రణాళికకు ముందే చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున మొత్తం 44 లక్షల డబ్బాలను పంచాలని నిర్ణయించారు. ప్రణాళికను ప్రకటించే సమయానికి 14.22 లక్షల డబ్బాలు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. మిగతావి అప్పటికే పంపిణీ చేసేశారు. దీన్ని తెచ్చి ‘ప్లాన్’లో చేర్చారు. అయితే, వంద రోజులైనా ఇంకా పదివేల డబ్బాలను పంపిణీ అలాగే ఉండిపోయింది. చెత్త కేంద్రాల తొలగింపు ఓకే.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు 1116 ప్రదేశాలను ‘చెత్త రహితం’గా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయా ప్రదేశాల్లోని చెత్తను తొలగించడమే కాక, అక్కడ తిరిగి చెత్త వేయకుండా అందమైన ముగ్గులు, స్వచ్ఛ భారత్ నినాదాలతో వర్ణ చిత్రాలు వేస్తూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అయినప్పకీ ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో పూర్తి చేయలేకపోయారు. దాదాపు 960 ప్రాంతాల్లో ఈ పనులు చేశారు. ‘స్లాటర్ హౌస్’లకు ప్లాన్ ముసుగు వందరోజుల్లో చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్‌తో పాటు నాలుగు మోడర్న్ స్లాటర్ హౌస్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వీటిలో మూడింటికి మున్సిపల్ మంత్రి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. వాస్తవానికి వీటి నిర్మాణ పనులు వంద రోజుల ప్రణాళిక ప్రకటించే నాటికే పూర్తయ్యాయి. కొన్నింటికి గత పాలకమండలిలోనే అప్పటి మేయర్ మాజిద్ సైతం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. బస్కీలు తీస్తున్న జిమ్‌లు వందరోజుల్లో 150 ప్రాంతాల్లో యువతకు ఉపకరించేలా తగిన సామగ్రితో జిమ్‌లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కాగా, దాదాపు 50 ప్రాంతాల్లో సివిల్ వర్క్స్ మాత్రం జరిగాయి. మిగతా వాటిల్లో జరగలేదు. సివిల్ వర్క్స్ పూర్తయ్యాక జిమ్ సామగ్రిని అమర్చాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 329 క్రీడా ప్రాంగణాల అభివృద్ధి లక్ష్యం కాగా, ప్రాథమిక పనులు మాత్రం జరిగాయి. మో‘డల్’ మార్కెట్లు.. నగరంలో 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలని తలంచారు. ఇందుకు రూ. 26 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడే పూర్తయినట్టు గొప్పలు చెప్పారు. రోజులు గడిచిపోయినా ఐదు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈస్ట్ జోన్లో 9, సౌత్జోన్లో 5, సెంట్రల్ జోన్లో 9, వెస్ట్ జోన్లో 8, నార్త్‌జోన్‌లో 9 నిర్మాణం జరగాల్సి ఉండగా, ఈస్ట్, వెస్ట్, సౌత్జోన్లలో ఒక్కొక్కటి వంతున పూర్తయ్యాయి.