మలేరియా నివారణకు పకడ్బందీగా ప్రణాళిక
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: డివిజన్లో మలేరియా, డెంగ్యూ నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అందరికీ వైద్యం అందేలా చూడాలని సూచించారు. వ్యాధుల నివారణకు ఐటీడీఏ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని, దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని పీవో ఆదేశించారు. మలేరియా అండ్ డీసీపీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ 2027 నాటికి మలేరియా, డెంగ్యూ పూర్తి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వైద్యాధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. ఫ్రైడే–డ్రైడే కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా నీటినిల్వలు తగ్గించాలని, దోమలమందు పిచికారీ చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ వ్యాధుల చికిత్సా విధానం, నివారణ చర్యలపై ఆమె వైద్యాధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, నాలుగు మండలాల పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment