టోక్యో వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటున్న సుజాత
జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసే బెల్లం, ఇతర ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ పెరిగింది. నాణ్యమైన పద్ధతుల్లో తయారీ చేసే బెల్లం దేశవిదేశాల్లో ఆధరణ చూరగొంటోంది. విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెన్యా, మారిషస్, యూరప్ తో పాటు మన దేశంలో రాజస్థాన్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. దీంతో రోజురోజుకూ ఈ బెల్లం తయారీపై రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో తయారవుతున్న ఆర్గానికి బెల్లానికి మంచి గిరాకీ ఉంది. ఆర్గానిక్ బెల్లం, బెల్లం ఆధారిత ఉత్పత్తులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతూ లాభాలు కురిపిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వలే ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను జిల్లాలో ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పోటీ పడుతూ.. అనకాపల్లి పరిశోధన కేంద్రంలో విలువ ఆధారిత బెల్లం తయారీ చేస్తున్నారు. దీంతో అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో హాట్‌కేక్‌లా అమ్ముడవుతోంది.
అనకాపల్లి జిల్లా నుంచి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా మార్క్‌తో సేంద్రియ బెల్లం, బెల్లంతో తయారయ్యే ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నారు. ఏటా జిల్లా నుంచి సుమారు 25 వేల టన్నుల సేంద్రియ బెల్లం, 30కి పైగా సేంద్రియ బెల్లం ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆర్గానిక్ బెల్లం, బెల్లం ఉత్పత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు 100కి పైగా ఉన్నాయి. అనకాపల్లి, మునగపాక, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో ఆర్గానిక్ బెల్లాన్ని అధికంగా తయారుచేస్తున్నారు. చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో చెరకు రైతులకు అండగా ఆర్గానిక్ బెల్లం తయారీ సంస్థలు నిలుస్తూ మంచి గిట్టుబాటు రేటు అందజేస్తున్నాయి.
ఈయన కోటవురట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన వేగి శ్రీనివాసరావు. వారసత్వంగా సేంద్రియ బెల్లం తయారు చేస్తున్నారు. ఇందుకోసం మాకవరపాలెం మండలం జంగాలపాలెంలో తండ్రి పేరిట రూ. 2.5 కోట్లతో ఆగ్రోస్ యూనిట్ ఏర్పాటుచేశారు. అత్యాధునిక యంత్రాలతో, 40 మంది నిపుణులైన ఉద్యోగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్గానిక్ బెల్లాన్ని తయారు చేసి, విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఐఎస్‌వో 22000, ఐఎస్‌వో 1001 పత్రాలను పొందారు. ప్రస్తుతం అమెరికా, ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి 15 వేల టన్నుల చెరకు క్రషింగ్‌తో బెల్లం తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. రైతుల నుంచి 1,500 టన్నుల వరకూ..ఒక్కో టన్ను రూ.2,600 నుంచి రూ.3 వేల ధరతో కొనుగోలు చేస్తున్నారు. బెల్లం పౌడర్, 10, 20, 850 గ్రాముల దిమ్మలు ఎగుమతి చేస్తున్నారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో యూనిట్ కోసం దరఖాస్తు చేశారు. బెల్లం సరఫరాకు గానూ ఘనా నుంచి టెండర్ సర్టిఫికెట్ కూడా వచ్చింది.
ఈమె సుజాత. ‘క్యూ వన్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఫుడ్స్’ పేరిట కుటీర పరిశ్రమను ఏర్పాటుచేసి.. ‘అనకాపల్లి బెల్లం రుచులు’ పేరుతో 40 రకాల సేంద్రియ బెల్లం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పౌష్టికాహారమైన పప్పుండలు, కొబ్బరి ఉండలు, అరిసెలు, చిమ్మిలి, పాకుండలు, మినప సున్నండలు, అవిశ లడ్డూలను ఎగుమతి చేస్తున్నారు. రూ.10 వేల పెట్టుబడితో ఆర్గానిక్ బెల్లం ఉత్పత్తులను ప్రారంభించారు. మొదట్లో నష్టాలు వచ్చినా..వెనక్కి తగ్గలేదు. తరువాత మాల్స్, ఆర్గానిక్ స్టోర్స్ నుంచి ఆర్డర్లు పెరిగాయి. గత ఏడాది వరల్డ్ ఫుడ్ పెస్టివల్‌లో ‘అనకాపల్లి బెల్లం రుచులు’ పేరిట ఏర్పాటు చేసిన ఉత్పత్తులకు విశేష ఆదరణ లభించింది. అప్పుడే జపాన్, కెన్యా దేశాల వారితో ఒప్పందం చేసుకున్నారు. సింగపూర్, దుబాయ్, కెన్యా,మెల్‌బోర్న్, జపాన్ నుంచి ఆర్డర్లు పెరిగాయి. ఇటీవల విదేశాలకు హిమోగ్లోబిన్ లడ్డు, అరిసెలు, బూదిగుమ్మడికాయ హల్వా తదితర వాటిని ఎగుమతి చేస్తున్నారు.
హైడ్రోస్ కలపకుండా..
బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, హైడ్రోస్ వినియోగిస్తారు. కానీ సేంద్రియ బెల్లం తయారీలో వాటిని వినియోగించకుండా సుక్రోజ్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’లను తగుమోదతాదులో కలిపి తయారు చేస్తున్నారు. పంచదారతో సంబంధం లేకుండా, హైడ్రోస్, రంగు కలపకుండా బెల్లం తయారు చేస్తారు. ఆధునిక పద్ధతుల్లో తయారు చేసే బెల్లం తయారీ యూనిట్లను జిల్లాలో ఏర్పాటు చేశారు. విటమిన్లు, ఫ్లేవర్లు జత చేసి నాణ్యత, అత్యున్నత ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ తయారీ చేస్తున్నారు. అందుకే అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment