దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పెద్దగా ఆకర్షణీయమైన ప్రకటనలు చేయలేదు. ఎన్‌డీఏ కూటమికి గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అవసరాలమేరకు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కావాల్సినవి..
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలి. ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు.
మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి.
ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి.
ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు జరగాలి.
హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి.
తెలంగాణలో..
రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి.
తెలంగాణలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి.
ఐటీఆర్ కారిడార్, ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..
ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు..
రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు పెంచాలి.
రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి.
ఇరు ప్రాంతాలకు కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి.
యూనిఫైడ్ కార్డు జారీ (ఆధార్, పాన్, వోటర్, ఈపీఎఫ్, రేషన్ కార్డులన్నింటికి ప్రత్యామ్నాయంగా ఒకే కార్డు) కావాలి.
పెట్రోలు, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి.
సీనియర్ సిటిజన్ల గరిష్ఠ పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి.
ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి.
ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి.
స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలి.
Comments
Please login to add a commentAdd a comment