నగరంలో నానాటికీ పెరుగుతున్న తిప్పలు | - | Sakshi
Sakshi News home page

నగరంలో నానాటికీ పెరుగుతున్న తిప్పలు

Published Tue, Feb 6 2024 5:52 AM | Last Updated on Tue, Feb 6 2024 7:33 AM

- - Sakshi

ఈ మహానగరంలో బయటకు వెళదామని బండి బయటకు తీద్దామంటే భయం.. కారులో హుషారుగా వెళదామనుంటే కంగారు.. నడుచుకుంటూ వెళదామంటే టెన్షన్‌..ఎటు వెళ్లాలన్నా.. ఏ సమయంలో అయినా నరకమే.. కారణం ట్రాఫిక్‌.. నగరంలో కోటికి దగ్గరవుతున్న వాహనాలతో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చిపోయే వాటికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మినిమం స్పీడ్‌తో రోడ్డుపై వెళదామంటే ట్రాఫిక్‌ జామ్‌.. బండిని ఎక్కడైనా పార్కింగ్‌ చేయాలంటే స్థలం ఉండదు.. ఉంటే అడ్డగోలు పార్కింగ్‌ ఫీజులు.. కనీసం నడిచేందుకు కూడా ఫుట్‌పాత్‌లు కనిపించవు. ఇక ట్రాఫిక్‌ సిగ్నళ్లు కొన్ని ప్రాంతంలో అస్తవ్యస్తం..అధ్వానం.. అసలు అక్కడ ట్రాఫిక్‌పోలీసులు ఉన్నారో.. లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా సమస్యలు ఎన్నో.. ఎన్నెన్నో...ఈ సమస్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న ట్రాఫిక్‌ సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ఈ రోజునుంచి మీ కోసం... – సాక్షి, సిటీబ్యూరో

నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడానికి నో–పార్కింగ్స్‌లో వాహనాలు నిలుపడం కూడా ప్రధాన కారణమన్నది దాదాపు రెండు దశాబ్ధాలుగా అధికారులు చెప్తున్న అంశమే. అనేక వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు సరైన పార్కింగ్‌ వసతులు లేవు. ఉన్నవి సైతం కమర్షియల్‌ స్పేస్‌లుగా మారిపోతున్నాయి. దీంతో వాటికి వచ్చిన వినియోగదారులంతా రోడ్లపైనే తమ వాహనాలకు ఆపుతున్నారు. ఫలితంగా ఆయా రోడ్లలో భారీ ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ద్వారా 2006లో జీవో నెం.86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్‌ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మొత్తం విస్తీర్ణంలో 60 శాతం, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు తదితరాలకు 40 శాతం పార్కింగ్‌ స్థలం తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి.

నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. అత్యున్నత స్థాయి అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేస్తున్నారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులకు పార్కింగ్‌ సమస్య ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీన్ని పరిష్కరించడానికి మల్టీ లెవల్‌ పార్కింగ్‌ లాట్స్‌ సహా అనేక అంశాలను పరిశీలిస్తున్నాయి. ఆర్థిక భారం, సమయాభావంతో కూడిన వీటికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఊరట లభించనుంది. అలాంటి వాటిలో కీలకమైనవి ఫ్లైఓవర్ల కింది భాగంలో ఉన్న స్థలం మార్పిడి కీలకమైంది.

ఆ ప్రతిపాదన నేటిది కాదు...
ఈ పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి మల్టీ లెవల్‌ పార్కింగ్‌ లాట్స్‌ నిర్మాణం అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనలు నగరానికి కొత్త కాదు. ఇప్పటికే ఒకటి అందుబాటులో ఉండగా.. మరోటి నిర్మాణ దశలో ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారులు 2010లోనే రోబో టెక్‌ పార్కింగ్‌ టవర్స్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయం, పాతబస్తీలోని ఖిల్వత్‌, కూకట్‌పల్లి, ప్యారడైజ్‌, ఎంజీ రోడ్‌, కోఠి, ఘాన్సీ బజార్‌ల్లో ఏడు నిర్మించాలని అధ్యయనం కూడా చేశారు. 30–40 గజాల స్థలంలోనే వివిధ అంతస్తుల్లో 40 కార్లు పార్కింగ్‌ చేసేలా ప్ర ణాళికలు సిద్ధం చేశారు. ఓ విదేశీ సంస్థతో సంప్రదింపులు జరిపి, పీపీపీ పద్దతిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రోబోటిక్‌ వ్యవస్థను అనుసంధానించాలని యోచించారు. అక్కడి తో ఆ ఫైలు అటకెక్కేసింది.

పార్కింగ్‌ సమస్యకు తక్షణ పరిష్కారంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫ్లైఓవర్ల కింద ఉన్న ప్రాంతాలను పార్కింగ్‌ ప్రాంతాలుగా మార్చాలన్నది ఇందులో కీలకమైంది. నగరంలో భారీగా అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లలో అత్యధికం వాణిజ్య ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వీటి కింద ఉన్న ప్రాంతాన్ని పార్కులుగా, గార్డెన్లుగా సుందరీకరించారు. అయితే సుందరీకరణ కంటే మౌళిక వసతులు కీలకమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ల కింద ఉన్న స్థలాలలు ద్విచక్ర, తేలికపాటి వాహనాల పార్కింగ్స్‌గా మారిస్తే ఉత్తమం అని సూచిస్తున్నారు. కొన్ని మార్పుచేర్పులతో, తక్కువ ఖర్చుతో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే నాయిని నర్సింహ్మారెడ్డి స్టీల్‌ బ్రిడ్జ్‌ కింది భాగం ఇలా ఉపయోగపడుతోంది. ఈ పార్కింగ్‌ ప్రాంతాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం లేదు.

నిర్ణీత మొత్తం రుసుము వసూలు చేసినా జీహెచ్‌ఎంసీకి ఆదాయం, కొందరికి జీవనాధారం అవుతుంది. పోలీసులకు జరిమానాలు చెల్లించడం, భద్రత లేని ప్రాంతంలో వాహనం పెట్టడం కంటే ఇలా పార్కింగ్‌ రుసుము చెల్లించడానికే వాహనచోదకుడు మొగ్గు చూపుతాడని నిపుణుడు స్పష్టం చేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న రెన్యువల్‌... వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, కేఫ్‌ల యజమానులకు ప్రతి ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు పోలీసులు లైసెన్స్‌ జారీ చేసే విధానం గతంలో ఉండేది. సుదీర్ఘకాలం గ్యాప్‌ తర్వాత మళ్ళీ ఈ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచ్చే ట్రేడ్‌ లైసెన్సు జారీ, రెన్యువల్‌ ప్రక్రియలు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. రెన్యువల్‌ చేసే సమయంలో ఈ అధికారులు వాటివల్ల ఏవైనా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయా? అనే కోణంలోనూ పరిశీలించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement