‘సమగ్ర శిక్షా’ ఉద్యోగుల పోరుబాట
● క్రమబద్ధీకరణ హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్న ఉద్యోగులు
● మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు.. ప్రభుత్వం నుంచి స్పందన కరువు
● నేటి నుంచి నిరవధిక సమ్మెలోకి..
గద్వాల టౌన్: అరకొర వేతనాలతో 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం మరోసారి పోరుబాటకు సిద్ధమయ్యారు. గత మూడు రోజులుగా రిలే నిరహార దీక్షలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరంతా విద్యాభివృద్ధికి, ప్రభుత్వ కార్యక్రమాల క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేజీబీవీల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. ప్రభుత్వం తమను గుర్తించి సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, రెగ్యూలర్ చేయాలని కొంత కాలంగా కోరుతున్నారు. జిల్లాలోని సమగ్ర శిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 457 మంది ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు.
హామీ నెరవేర్చాలని..
గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో 26 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టి, వినూత్న పద్దతిలో నిరసనలు తెలిపి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీక్ష కారణంగా విద్యాశాఖలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆ దీక్షల సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి టీపీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమగ్రశిక్షా ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల వివరాలు..
విభాగం సంఖ్య
కేజీవీబీ బోధన, బోధనేతర ఉద్యోగులు 279
ఏపీఓ, సిస్టం ఆనాలిస్టు, డీఎల్‌ఎంటీ, డీటీపీ 9
ఎంఐఎస్, సీసీఓ, ఐఈఆర్‌పీ,మెసెంజర్స్ 32
పాఠశాల స్థాయిలో ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలు 78
కాంప్లెక్స్ స్థాయిలో సీఆర్‌పీలు 32
యూఆర్‌ఎస్ బోధన, బోధనేతర 15
Comments
Please login to add a commentAdd a comment