కూర్మావతారంలో కనువిందుగా..
భద్రాచలం : క్షీరాబ్ది సమయాన మందరగిరిని తన వీపున మోసి దేవతలకు అమృతం అందించిన కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశాడు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో రెండో రోజైన బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కూర్మావతారంలో అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ఆరాధన, నివేదన అనంతరం వేద పండితులు 200 నాళాయిర దివ్య ప్రబంధాలను పఠించారు. 12 మంది ఆళ్వార్లకు పరివట్టం కట్టి పూల మాలలు వేసి తులసీ దళాలు సమర్పించారు. అనంతరం కూర్మావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చారు. ఆంగ్ల సంవత్సరాది కావడంతో రామాలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు, సర్వదర్శనం లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కూర్మావతారంలో ఉన్న స్వామివారికి భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మిథిలా స్టేడియంలో నీరాజనం..
ప్రత్యేక పల్లకీపై స్వామివారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ మాడవీధుల మీదుగా మిథిలా స్టేడియంలోని అధ్యయనోత్సవ వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. హారతి సమర్పించాక భక్తులు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన సంగీత, నృత్య, కచేరి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆ తర్వాత స్వామివారు ఊరేగింపుగా తిరువీధి సేవకు వెళ్లారు. తాతగుడి వీధిలోని విశ్రాంత మండపం వద్దకు తీసుకెళ్లి కాసేపు ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి గర్భగుడికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రసాదం స్వీకరించారు.
రామాలయంలో రెండో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు
స్వామివారికి భక్తుల నీరాజనం
నేడు వరాహావతారంలో దర్శనం
నేటి అవతార విశిష్టత..
అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి గురువారం వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు. ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వాయంభువుడితో పాటు బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని బయటకు తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోకకంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూమిని రక్షించాడు. రాహు గ్రహ బాధలున్న వారు ఈ అవతారంలో ఉన్న స్వామిని దర్శిస్తే విముక్తులవుతారని ప్రతీతి.
Comments
Please login to add a commentAdd a comment