● ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆర్ధరాత్రి నుంచే సెల్‌ఫోన్లు, సామాజిక మాద్యమాల ద్వారా మిత్రులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలో షిర్డీ సాయి మందిర్, శివకేశవ మందిర్, కేశవనాథ ఆలయం, బాలేశ్వర మందిరంతో పాటు కేస్లాపూర్ హనామన్ మందిర్‌లో భక్తుల రద్దీ కనిపించింది. సాయి మందిరంలో మధ్యాహ్న హారతికి అధికసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కుటుంబ సమేతంగా జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయి మందిరాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ఇందారపు మధూకరశర్మ, సాయిశర్మ కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలువురు అధికారులు కలెక్టర్‌ను కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో చర్చీల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే క్రైస్తవులు అధికసంఖ్యలో చర్చీలకు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment