ఇంటర్ కళాశాలల్లో ప్రయోగ పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. నిధుల్లేక సైన్స్ రసాయనాలు కొనుగోలు చేయలేని పరిస్థితి. కొన్ని చోట్ల గదుల్లేక తరగతి గదిలోనే ఓ మూలన ర్యాకుల్లో ఉంటున్నాయి. బోటనీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు తదితరవి విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం, అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయన శాష్త్రంలో లవణ, విశ్లేషణ, మూలకాలు తదితర వాటి గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. ఇందులో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ప్రత్యేక ల్యాబ్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కొన్ని చోట్ల తరగతి గదుల్లోనే ల్యాబ్ పరికరాలతో నెట్టుకు రావాల్సి వస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం పంపిణీ చేసిన పరికరాలతో ప్రయోగాలు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రయోగ గాజు పరికరాలు పరిశోధన చేస్తున్న క్రమంలో కింద పడి పగిలిన సందర్భాలు లేకపోలేదు. హైడ్రోక్లోరి యాసిడ్, సల్ఫర్ యాసిడ్‌తో 24 రకాల రసాయనాలు అవసరం ఉంటుంది. ఏ ఒక్క రసాయనం లేకపోయినా ప్రయోగాలకు అంతరాయం కలుగుతుంది. ప్రయోగశాలలు అధ్వానంగా ఉండడం, రసాయనాలు లేకపోవడం వల్ల పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలపై పట్టు సాధించలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పరికరాలు, రసాయనాలు కొనుగోలుపై దృష్టి సారిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment