తవ్వుకో.. అడిగినంత ఇచ్చుకో..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రకృతి సహజంగా పారే మానేరు తీరాలు, వాగులలో ఇసుక అందరికీ కాసులు కురిపిస్తోంది. ఇసుక దందా ఈజీ మనీకి మార్గంగా మారింది. మామూలు వ్యక్తుల నుంచి ‘మాఫియా’గా ఎదుగుతున్న ఈ వ్యాపారుల వెనుక కొందరు రాజకీయ నాయకు లే ఉండటం గమనార్హం. రేయింబవళ్లు ఇసుక త వ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నా.. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. ఇందుకు టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ మండలాల నుంచి ట్రాక్టర్ల ద్వారా పరకాల డంపింగ్ పాయింట్లకు పట్టపగలు ఇసుక చేరుతున్న దృశ్యాలే సాక్ష్యం.
హనుమకొండ, పరకాలల్లో డంపింగ్..
జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో చలివాగు పరివాహక ప్రాంతం ఇసుక తవ్వకాలకు ప్రధాన వనరుగా మారింది. టేకుమట్ల, చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని పలు పలుచోట్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా పరకాల, రేగొండ, హనుమకొండలోని డంపింగ్ కేంద్రాలకు చేరుతోంది. చలివాగు, దమ్మన్నపేట, కాల్వపల్లి, రేపాక, కనపర్తి, చలివాగు బ్రిడ్జి మీదుగా ఇసుక తరలింపునకు ఒక మార్గం కాగా.. లింగాల క్రాస్, రాయపర్తి, దమ్మన్నపేట, మెయిన్ రోడ్డు మీదుగా పరకాలకు మరో మార్గంలో ఇసుక ట్రాక్టర్లు చేరుకుంటున్నాయి. పరకాలలో డీపీఆర్ ఫంక్షన్‌హాల్ సమీపంతో పాటు మరో నాలుగు చోట్ల ఇసుక డంపులు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. కాల్వపల్లి నుంచి పరకాలకు ఇసుక తరలిస్తే ఒక ట్రాక్టర్ యజమాని నెలకు రూ.10 వేలు ఒక కీలకశాఖకు చెల్లిస్తున్నారట. వ్యాపారాన్ని బట్టి ఆ శాఖకు రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చే ట్రాక్టర్ యజమానులు కూడా ఉన్నారని, లేదంటే కేసులు తప్పవన్న ప్రచారం కూడా ఉంది.
కీలక ప్రజాప్రతినిధి ముందే హెచ్చరించినా..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటి నిర్మాణాలకు స్థానికంగా ఉన్న ఇసుకను తరలించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఊటంకిస్తూ స్థానిక అవసరాలకు ఇసుకను ఉపయోగించుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని ఓ కీలక ప్రజాప్రతినిధి అధికారులకు బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో స్థానిక, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసేవారు పరకాల చలివాగు దాటొద్దని కూడా హెచ్చరించారు. అయితే ఆ కీలక ప్రజాప్రతినిధి ఇచ్చిన వెసులుబాటును అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు ‘మాఫియా’గా మారి మరింత రెచ్చిపోతుండటం చర్చనీయాంశం అవుతోంది.
‘కాసులు’ కురిపిస్తున్న వాగుల ఇసుక..
దందాకు రాజకీయ ముసుగు
చలివాగు పరీవాహక ప్రాంతాలే
కేంద్రాలు
కొందరు స్థానిక నాయకులే
కర్త, కర్మ, క్రియ..
రేగొండ, పరకాలలో డంపింగ్ కేంద్రాలు, లారీల్లో హైదరాబాద్‌కు రవాణా
పోలీసు, మైనింగ్, రెవెన్యూ శాఖల
ప్రేక్షకపాత్ర
రేగొండలో దందాకు రాజకీయ ముసుగు..
రేగొండలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ‘సిండికేట్’గా మారి అక్రమ ఇసుక దందాకు మరింత ఊపునిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాగుల నుంచి నిత్యం ఇసుక తవ్వే ట్రాక్టర్‌ల యజమానులకు నాయకత్వం వహిస్తూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఉదయం 6 గంటలలోపు.. సాయంత్రం 6 గంటల తర్వాతే స్థానిక అవసరాలకు ఇసుక తీసుకోవాలన్న నిబంధనలకూ వీరు పాతరేశారు. రేగొండకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి నేతృత్వంలో మరో ఐదుగురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు రేగొండలో డంపింగ్ కేంద్రం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నారు. డంపింగ్ కేంద్రంలో లారీలు నింపి గోరుకొత్తపల్లి (కొత్తపల్లి గోరి), కొప్పుల మీదుగా శాయంపేటకు.. అక్కడి నుంచి హనుమకొండ, హైదరాబాద్‌కు రోజుకు పదుల సంఖ్యలో తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. సహకరించే అధికారుల్లో కొందరికి రోజు, నెలవారీ మామూళ్లు కూడా ముట్టచెబుతున్నట్లు బహిరంగ చర్చ జరుగుతోంది. మామూళ్లలో పోలీసుశాఖది సింహభాగం ఉంటుందని కూడా అంటున్నారు. అందువల్లే పరకాల, హనుమకొండ ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment