2న ఏకసభ్య కమిషన్ రాక
నంద్యాల(అర్బన్): షెడ్యూల్డు కులాల్లోని ఉప – వర్గీకరణపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నియమించిన రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ జనవరి 2వ తేదీన కర్నూలుకు రానుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి చింతామణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించి జిల్లా అధికారులు, వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో వినతి పత్రాలను స్వీకరిస్తుందన్నారు. తర్వాత వాటిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపుతుందన్నారు. కమిషన్‌కు వినతులు అందించే వారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండాలని సూచించారు.
మద్దిలేటయ్య ఒక్క రోజు ఆదాయం రూ.5.35 లక్షలు
బేతంచెర్ల: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన లక్ష్మీమద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శనివారం క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వివిధ సేవల ద్వార రూ.5,35,095 ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఇందులో చైన్నె నగరానికి చెందిన కమ్మరి బ్రహ్మయ్య ఆచారి కుమారుడు కమ్మరి విష్ణు ఆలయ అభివృద్ధికి రూ. 2లక్షల విరాళం అందజేశారన్నారు.
గనుల యజమానులకు తాత్కాలిక ఊరట
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులకు తాత్కాలిక ఊరట లభించింది. దీంతో కొద్దిరోజులుగా స్తంభించిన నాపరాళ్ల రవాణా మొదలైంది. ఇటీవలనే కూటమి ప్రభుత్వం కన్సిడరేషన్ ఫీజు లక్షల్లో చెల్లించాలని గనుల యజమానులకు ఆదేశాలు జారీ చేయడంతో వారం రోజుల క్రితం నాపరాతి రవాణా ఆగిపోయింది.దీంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. యజమానులు, కార్మికుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారులు సింగిల్ రాయల్టీతో రోజంతా నాపరాళ్ల రవాణాకు అవకాశం కల్పించారు. కన్సిడరేషన్ ఫీజుపై ప్రభుత్వం జనవరి 10లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో అంత వరకు సరఫరాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.
ప్లాస్టిక్ రహిత సమాజం అందరి బాధ్యత
బనగానపల్లె రూరల్: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో మంత్రి బీసీ దంపతుల ఆధ్వర్యలో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా, జిల్లా ఎస్పీ ఆధిరాజ్‌సింగ్‌రాణాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తన సతీమణి బీసీ ఇందిరమ్మ ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజం కోసం పాస్టిక్ నిర్మూలన ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, బీసీ సోదరుడు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, పలుశాఖల ఉన్నతాధికారులు పట్టణ వ్యాపారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment