అందుకే బలం లేకపోయినా పోటీకి దిగుతున్నారు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ధ్వజం
చోడవరం(అనకాపల్లి జిల్లా): విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అవకతవకలకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అందుకే తగినంత బలం లేకపోయినా అభ్యర్థిని పోటీకి పెడుతున్నారని విమర్శించారు. సోమవారం ఆయన చోడవరంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు.
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 640కి పైగా ఓట్లు వైఎస్సార్‌సీపీవే. టీడీపీ కూటమికి 200 ఓట్లు కూడా లేవు. దురుద్దేశంతోనే చంద్రబాబు అభ్యర్థిని పోటీకి పెట్టినట్లు అర్థమవుతోంది. అయినా వైఎస్సార్‌సీపీ విజయం సాధించి తీరుతుంది. రాష్ట్రం దివాలా తీసిందనే మాట దేశం మొత్తమ్మీద ఏ ముఖ్యమంత్రీ చెప్పరు.
కేవలం చంద్రబాబే చెబుతుంటారని దివంగత మాజీ సీఎం రోశయ్య అనేక సందర్భాల్లో చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఇష్టారీతిన హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పడం విడ్డూరం. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియదా? ఎన్నికల హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సిందే. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు భూ ఆక్రమణలు జరిగాయంటూ అధికార పార్టీ అనుకూల మీడియాలో ఊకదంపుడు వార్తలు రాయిస్తున్నారు.
అధికారం చేతిలో ఉన్నవారు విచారణ చేయించొచ్చుగా? లేనిది ఉన్నట్టు అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి బురదజల్లితే చూస్తూ ఊరుకోం. మా నాయకుడు వైఎస్ జగన్ ప్రజలకు సుపరిపాలన అందించారు. శాసనమండలిలో ఉత్తరాంధ్ర వాణి వినిపించేందుకు నన్ను గెలిపించండి’ అని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణరాజు, మాడుగుల సమస్వయకర్త ఇ.అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment