ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి.. ఈనాడు దినపత్రికలో కొద్ది రోజుల క్రితం పెద్ద అక్షరాలతో బానర్ కధనం. బాగానే ఉంది. తప్పు లేదు. ఇక్కడ నిజంగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా?కాదా? అన్న మీమాంసలోకి ఈనాడు వెళ్లలేదు. అలాగే మరో పత్రిక ఆంధ్రజ్యోతి తెలంగాణలో అంతకన్నా పెద్ద హెడింగ్ తో పదిహేనువేల పోలీస్ ఉద్యోగాలు అంటూ వార్త ఇచ్చింది. ఈ పత్రికలు తెలంగాణలో ఎలా ఉన్నాయో, ఏపీలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడడానికి ఇది పెద్ద ఉదాహరణ అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వంలో భర్తీ చేస్తే , ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమని ప్రచారం చేస్తాయి..ఏపీలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని. ఇంత తేడా ఎందుకు?అంటే తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భుజాన వేసుకున్నందుకే అని చెప్పనవసరం లేదు.
✍️ఏపీలో తెలుగుదేశం కోసం పచ్చి అబద్దాలు రాయలని ఈ రెండు మీడియా సంస్థలు, మరికొన్ని తెలుగుదేశం చానళ్లు కంకణం కట్టుకుని పని చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉత్సాహంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పినా ,అది అంత తేలికకాదు. నిజంగానే ఆయన చెప్పినట్లు జరిగితే మంచిపేరే వస్తుంది. కాని ప్రభుత్వంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని జాబ్స్ ఇవ్వగలుగుతారు?తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నిటిని ఫిల్ చేయవచ్చు? అసలు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చాక, ఎంత వ్యవదిలో పరీక్షలు ,ఇంటర్వ్యూలు పూర్తి అవుతాయి..మొదలైనవాటన్నిపై ఒక అవగాహనతో ఇలాంటి విషయాలు మాట్లాడాలి. కాని రేవంత్ అలా చేసినట్లు అనిపించదు. ఏపీలో వైఎస్ జగన్ లక్షముప్పైవేల ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వగలిగారు. దానికి కారణం అక్కడ ఆయన అందుకు తగ్గట్లు వ్యవస్థలను ఏర్పాటు చేయడమే. ఏపీ అంతటా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఆయన తీసుకు వచ్చారు.
✍️ప్రతి సచివాలయంలో సుమారు పది ఉద్యోగాలు కల్పించి వారి ద్వారా పౌరసేవలు అందిస్తున్నారు. వాటికి అనుబందంగా సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. రేవంత్ కూడా వలంటీర్ల వ్యవస్థ తెస్తానని గతంలో చెప్పారు. అది చేయాలంటే గ్రామ,వార్డు స్థాయిలో వ్యవస్థ ఉంటేనే వలంటీర్లతో ప్రయోజనం ఉంటుంది. మరి ఇవేవి లేకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారో తెలియదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల వ్యవహారంలో తెలంగాణ ప్రజలలో అసంతీప్తి మొదలవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలు చేస్తున్నా, దాని వల్ల కాంగ్రెస్ కు పూర్తి ప్రయోజనం వస్తుందా?రాదా? అన్నది చెప్పలేం.అలాగే ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచినా తక్షణం ప్రజలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు.
✍️ఇవి కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేస్తామని, మహిళలకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు,రైతు బందు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దళితులకు పన్నెండు లక్షల సాయం వంటి అనేక హామీలు పెండింగులో ఉన్నాయి. అవి నెరవేరాలంటే ఎంత బడ్జెట్ కావాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఈ నేపద్యంలో ప్రజలలో అలజడి పెరగకుండా ఉండేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలో ఈ గ్యారంటీల ప్రభావం పడకుండా ఉండేందుకు ,నిరుద్యోగులలో అశాంతి నెలకొనకుండా ఉండడానికి రేవంత్ ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఉండవచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఈ గ్యారంటీల గురించి చెబుతామని అంటున్నారు. అది ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.
✍️ ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ గ్యారంటీల కోసం ప్రజలు లక్షల సంఖ్యలో క్యూలలో నిలబడి దరఖాస్తులు చేసుకున్నారు. ఇదంతా ఒక పెద్ద ప్రక్రియగా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే, ఈనాడు,ఆంద్రజ్యోతి ఎలాంటి విశ్లేషణాత్మక కధనాలు ఇవ్వకుండా రేవంత్ కు జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నించాయి.ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈనాడు ఇదే రీతిలో ప్రచారం చేసేది. అంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేక వార్త రాయలంటే వణికే తెలుగుదేశం మీడియా ,ఏపీ లో మాత్రం ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రికి అనుకూలంగా వార్తలు ఇచ్చినా ఫర్వాలేదు. ముఖ్యమంత్రి ప్రకటనను ఇవ్వడం ఆక్షేపణీయం కాదు. కాని అదే ఏపీకి వచ్చేసరికి లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు అంత కక్ష కట్టి పచ్చి అబద్దాలు రాస్తున్నాయన్నదే ప్రశ్న.
✍️ఆరువేల టిచర్ పోస్టులకు గాను డిఎస్సిని ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తే దానిని దగా కింద ప్రచారం చేశాయి.ఈ టీచర్ పోస్టుల ప్రకటనలో కాస్త ఆలస్యం అయితే అయి ఉండవచ్చు. అంతవరకు రాసినా ఓకే. కాని ఉన్నవి,లేనివి కలిపి అసత్యాలు వండి వార్చి ప్రజలను మోసం చేయడానికి యత్నించారు. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిసిన ఐబి సిలబస్ ను ప్రవేశపెట్టడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మొదటి పేజీలో కనీసం ఒక లైన్ రాయడానికి వీరికి చేతులు రాలేదు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్ముతూ ఈ మీడియా సంస్థలు పలు కధనాలు ఇచ్చాయి.
✍️ చివరికి పిల్లల చదువకు ఉపయోగపడే టాబ్ లు ఇచ్చినా ఈనాడు రామోజీరావు తెగ బాధపడిపోయారు. పరిశ్రమలను తరిమేస్తు్న్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి,తదితర టీడీపీ మీడియా సంస్థలు అరవైవేల కోట్ల ఇండో సోలార్ పానెల్ ప్రాజెక్టుకు భూమి కేటాయిస్తే,దానిపై విషం చిమ్ముతూ వార్తలు రాశారు. ఇలా ప్రతి రోజు ఈ పత్రికలు, టివిలు నెగిటివ్ వార్తలు రాసి ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నాయి.
✍️కేవలం తమ మాట వినే చంద్రబాబును సీఎంను చేయడం కోసం ఏపీ ప్రజలకు నష్టం కలిగేలా ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఏపీ ప్రజలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి శాపంగా మారాయంటే అసత్యం కాదు. విద్యార్ధులకు సంబంధించిన విషయాలలో కూడా దారుణమైన స్టోరీలు ఇస్తూ టాబ్ లపై కూడా ఏడ్చిపోయారు. ఏది ఏమైనా తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వార్తలు ఇచ్చే ఈనాడు,ఆంధ్రజ్యోతి మీడియాకు ఏపీప్రజలు ఎలా బుద్ది చెబుతారో చూడాలి.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment