ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల రెడ్ బుక్ రాజ్యాంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు.. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపులతో మొదలైన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం.. క్రమేపీ పార్టీ అభిమానుల ఇళ్లు, ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసుల బనాయింపులకు విస్తరించింది. ఆపై రాష్ట్రంలోని ఓ మోస్తరు అధికారి నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లనూ వేధించడం మొదలుపెట్టారు. ఓ మోసకారి నటితో ఫిర్యాదు చేయించి.. దాని ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, ఇంకో పాతిక మంది సీనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా సతాయించడం చేశారు.
ఇప్పుడు.. తాజాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీడియాకూ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలకూ అమలు చేయాలని బాబు, లోకేష్‌లు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సాక్షి మీడియాపై కేసులు పెట్టడం, ఎడిటర్ మురళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి అంటూ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని వేధించడం వంటి చర్యలకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ ఆరోపణలు గుప్పించడం, ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లతో ఢీకొట్టారన్న ఆరోపణలను కూడా వైఎస్సార్‌సీపీపై నెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించాలని చూశారు. కానీ, ఆ ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టాయి. ఇక లాభం లేదనుకున్నారేమో.. వరద ముంపులో అవినీతి కంపుపై వార్తలు ఇస్తారా అంటూ చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
మీడియాను ప్రభావితం చేయడం, తనకు గిట్టకపోతే అణచివేసే యత్నం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారంలో వచ్చిందే మీడియా అండతో కదా. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి పెద్దగా పోటీ లేకపోవడంతో వాళ్లు రాసిందే వేదం అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ‘వార్త’ మీడియా వచ్చినా అంత ప్రభావం చూపలేదు. అయినా దాన్ని తమ వ్యతిరేకిగా భావించి చంద్రబాబు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కాలంలో టీవీ ఛానెళ్లు మొదలయ్యాయి. వాటిని కూడా ఆయన చాలావరకు ప్రభావితం చేయగలిగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారీతిలో కథనాలు ఇచ్చేవి. సంపాదకీయాలు రాసేవి. వైఎస్ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేస్తుండేవారు. అయినా పెద్దగా ఫలితం వుండడం లేదని భావించి సాక్షి మీడియాను తేవడానికి సహకరించారు.
అప్పట్లో వ్యాపారరంగంలో ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్.. సాక్షి పత్రికను, ఆ తర్వాత సాక్షి ఛానెల్‌ను తీసుకొచ్చి ప్రజల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. వైఎస్ జగన్ భవిష్యత్తులో కీలక నాయకుడు అవుతారనే భావనతో చంద్రబాబు, తమ మీడియా వ్యాపారానికి గట్టి పోటీదారుడు అవుతారన్న భయంతో రామోజీరావు వంటి వారు కాంగ్రెస్‌తో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించి వైఎస్ జగన్‌ను జైలుకు కూడా పంపారు. అయినా ఆయన పట్టు వీడకుండా ఇటు సాక్షి మీడియాను, అటు రాజకీయాన్ని కొనసాగించి ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి ఎల్లో మీడియా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని దారుణమైన అసత్య కథనాలు రాసినా ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మలేదు. అలాగని అసలు ప్రభావం పడలేదని చెప్పలేం. అందువల్లే 2014లో ఆయన అధికారానికి కొద్దిలో దూరమయ్యారు. ఐనా ఆయన జనంలో తిరగడం మానలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని టీడీపీ కొనుగోలు చేసినా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేశారు. ప్రజల్లో విశ్వసనీయత తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో సైతం ఎల్లో మీడియా జగన్‌పై ఏదో రకంగా విరుచుకుపడుతుండేది. జనం వాటిని నమ్మలేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగలిగారు.
రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి అది సహజంగానే నచ్చదు. ఎల్లో మీడియాకు గిట్టలేదు. దాంతో మళ్లీ చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కుమ్మకై ఉన్నవి లేనివి కలిపి సృష్టించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. వారికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడయ్యారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా వైఎస్ జగన్ వారిపై కేసులు పెట్టలేదు. ఒక వేళ కేసులు పెట్టాల్సి వచ్చినా అబద్దపు వార్తలపై ఖండన ఇచ్చి, ప్రచురించకపోతే లేదా ప్రసారం చేయకపోతేనే చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే రైతుల భూములన్నీ జగన్ లాగేసుకుంటారంటూ ఘోరమైన అబద్ధాన్ని రాసి, అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా పతాక స్థాయికి తీసుకెళ్లింది.
జగన్ ఏ పని చేసినా ఏదో రకంగా వంకలు పెట్టడం, జనంలో అపోహలు సృష్టించడం వంటివి భారీ ఎత్తున చేసేవారు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవడానికి యత్నిస్తే చంద్రబాబు నానా యాగీ చేసేవారు. జగన్ పాలనలో పత్రికా స్వేచ్ఛ దెబ్బతినిపోయిందని గోల గోలగా ఆరోపించేవారు. ఆ తర్వాత ఎలాగైతేనేం ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తనకు నచ్చని మీడియాపై, అలాగే సోషల్ మీడియాపై తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించారు.
సాక్షి టీవీతోపాటు ఎన్టీవీ, టీవీ 9 ఛానెల్‌ను ఏపీలో పలు చోట్ల రాకుండా కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో ఇందుకోసం ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారట. ఇక సాక్షి పత్రికకు అయితే ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు. తమకు బాకాలు ఊదే మీడియాతోటి మాత్రమే సఖ్యతగా ఉంటూ మిగిలిన మీడియాను తొక్కేయాలని, తద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టారు.
విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకునే క్రమంలో స్కామ్‌లు జరిగాయన్న కథనం ఇచ్చినందుకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి కేసు పెడితే దాన్ని విజయవాడ పోలీసులు నమోదు చేశారు. ఆ వార్తలో నిజం లేకపోతే ప్రభుత్వం ఖండన ఇవ్వొచ్చు. లేదా వివరణ చెప్పవచ్చు. వాటిని కవర్ చేయకపోతే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవడం సహజంగా జరగాలి. కానీ, అవేమీ లేకుండా ఒక ప్రధాన పత్రిక ఎడిటర్‌పైనే కేసు పెట్టడమంటే పత్రికాస్వామ్యాన్ని హరించి వేయడమనేది వేరే చెప్పనవసరం లేదు. విశేషమేమిటంటే వరద సహాయంలో 5నుంచి 10శాతం అవకతవకలు జరిగి ఉండవచ్చని చంద్రబాబే చెప్పారు. మరి దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పోలేదా?. ఆయనపై కూడా కేసు పెట్టాలి కదా.
సీపీఎం నేత బాబూరావు మొదట ఈ స్కాంను బయట పెట్టారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వ లెక్కల్లో రాసిన సంగతిని ఆయన బయట పెడితే ప్రజల్లో అది సంచలనం అయింది. సంబంధిత మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ లు కూడా దీనిపై గందరగోళంగా మాట్లాడారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రభుత్వ పరపతిని పునరుద్ధరించుకునేందుకుగాను సాక్షి ఎడిటర్ పై తప్పుడు కేసు పెట్టారని అర్థమవుతోంది. వచ్చే నాలుగేళ్లు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎటూ తమది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి టీడీపీ వారు దేశ రాజ్యాంగాన్ని వదిలి రెడ్ బుక్‌నే ఫాలో అవుతారు.
ఇక వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డొల్లతనాన్ని ప్రదర్శించుకుంది. అంతటితో ఆగకుండా ఆయన్ను పోలీసు విచారణకు పిలిచారు. ఇంతకు కేసు ఏంటయ్యా అంటే టీడీపీ ఆఫీసుపై కొందరు దాడి చేయడం. దాడిని ఎవరూ సమర్థించరు. జగన్ ప్రభుత్వంలోనే దీనిపై కేసు పెట్టారు. అసలు ఈ దాడికి కారణం ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు జగన్‌ను నోటికొచ్చినట్టు దూషించడం. ఆ సంగతిని మాత్రం బయటకు చెప్పరు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి అలాగే సజ్జల వంటి వారిని ఇరికించి కక్ష తీర్చుకోవాలనేది వాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం ఇలా పగ ప్రతీకారాలకు పాల్పడడం చంద్రబాబు నైజమే.
ఇదేమీ కొత్త కాదు. 2014-19 మధ్య కూడా సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. కాపుల ఆందోళన వార్తలు కవర్ కాకుండా చూడాలని ప్రయత్నించింది. తమ చెప్పు చేతల్లో ఉండని జర్నలిస్టులను వేధించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి కొత్త కాదు. వీటిని ఎదుర్కోవడం జర్నలిస్టులకు కొత్త కాదు. కాకపోతే మీడియాను అణచివేయడం ద్వారానే తాము అధికారంలోకి కొనసాగగలమని చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇప్పటికీ భ్రమ పడుతుండడం ఓ చారిత్రక విషాదం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న జర్నలిస్టులు చంద్రబాబును ఎదుర్కోలేరా?.
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment