రింకూ సింగ్, సూర్యకుమార్ స్పిన్ మ్యాజిక్‌తో మ్యాచ్ ‘టై’
సూపర్ ఓవర్లో టీమిండియా గెలుపు
చేజేతులా ఓడిన శ్రీలంక
2 నుంచి వన్డే సిరీస్
పల్లెకెలె: భారత్ బ్యాటింగ్‌లో మాత్రమే చెత్తగా ఆడింది. కానీ శ్రీలంక మొత్తానికే చెత్త చెత్తగా ఆడి చేజేతులా ఓడింది. మరోవైపు ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ ఓవర్లో గెలిచి టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 39; 3 ఫోర్లు) కుదురుగా ఆడాడు. తీక్షణ 3, హసరంగ 2 వికెట్లు తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక కూడా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. కుశాల్ పెరీరా (34 బంతుల్లో 46; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు) రాణించారు.
వాషింగ్టన్ సుందర్ వేసిన సూపర్ ఓవర్లో శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. 3 పరుగుల లక్ష్యాన్ని తొలి బంతికే బౌండరీతో భారత్ అధిగమించింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 2న మొదలవుతుంది.
డ్రామా మొదలైందిక్కడే...
లంక 15 ఓవర్లలో 108/1 స్కోరు చేసింది. చేతిలో 9 వికెట్లున్న లంక 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే సరిపోతుంది. రవి బిష్ణోయ్ 16వ ఓవర్లో కుశాల్ మెండిస్‌ను అవుట్ చేస్తే, 17వ ఓవర్లో సుందర్... హసరంగ (3), అసలంక (0)లను పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్లో ఏకంగా 11 బంతులేసిన ఖలీల్ 12 పరుగులిచ్చాడు. 12 బంతుల్లో 9 పరుగుల సమీకరణం లంకకే అనుకూలంగా ఉండగా... రింకూ సింగ్ 19వ ఓవర్లో 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రధాన బౌలర్ సిరాజ్‌ను పక్కనబెట్టి ఆఖరి ఓవర్ వేసిన సూర్యకుమార్ 2 వికెట్లు తీసి 5 పరుగులే ఇచ్చాడు. అంతే మ్యాచ్ ‘టై’ అయ్యింది.
నిర్లక్ష్యంగా బ్యాటింగ్
ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఒకవేళ విఫలమైఉంటే భారత్ వంద పరుగులు కూడా దాటేది కాదు. ఎందుకంటే అప్పటికే యశస్వి జైస్వాల్ (10), సంజూ సామ్సన్ (0), రింకూ సింగ్ (1) అవుటవడంతో 14 పరుగులకే 3 వికెట్లు, కాసేపటికే కెప్టెన్ సూర్యకుమార్ (8), శివమ్ దూబే (13) పెవిలియన్ చేరడంతో 48కే సగం వికెట్లు కూలాయి. ఈ దశలో గిల్... రియాన్ పరాగ్ (18 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో భారత్ ఆమాత్రం స్కోరు చేసింది.
తీరుమారని లంక
లంక లక్ష్యం చేరేందుకు టాప్–3 బ్యాటర్లు నిసాంక (27 బంతుల్లో 26; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్, పెరీరా చక్కని బాటవేశారు. 15.1 ఓవర్లలో లంక 110/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. మరుసటి బంతికి మెండిస్ అవుటయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారింది. హసరంగ (3), అసలంక (0), పెరీరా, రమేశ్ మెండిస్ (3), తీక్షణ (0)ఇలా 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను పారేసుకోవడంతో ఛేదించే స్కోరును సమం చేసింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 10; గిల్ (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) హసరంగ 39; సామ్సన్ (సి) హసరంగ (బి) విక్రమసింఘే 0; రింకూ సింగ్ (సి) పతిరణ (బి) తీక్షణ 1; సూర్యకుమార్ (సి) హసరంగ (బి) ఫెర్నాండో 8; శివమ్ దూబే (సి) కుశాల్ మెండిస్ (బి) రమేశ్ 13; పరాగ్ (సి) రమేశ్ (బి) హసరంగ 26; సుందర్ (బి) తీక్షణ 25; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–11, 2–12, 3–14, 4–30, 5–48, 6–102, 7–105, 8–137, 9–137. బౌలింగ్: విక్రమసింఘే 4–0–17–1, తీక్షణ 4–0–28–3, ఫెర్నాండో 2–0–11–1, రమేశ్ 3–0–26–1, హసరంగ 4–0–29–2, కమిండు 3–0–24–0.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పరాగ్ (బి) రవి బిష్ణోయ్ 26; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 43; పెరీరా (సి అండ్ బి) రింకూ సింగ్ 46; హసరంగ (సి) బిష్ణోయ్ (బి) సుందర్ 3; అసలంక (సి) సామ్సన్ (బి) సుందర్ 0; రమేశ్ (సి) గిల్ (బి) రింకూ సింగ్ 3; కమిండు (సి) రింకూ సింగ్ (బి) సూర్య 1; విక్రమసింఘే (నాటౌట్) 4; తీక్షణ (సి) సామ్సన్ (బి) సూర్య 0; ఫెర్నాండో (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–58, 2–110, 3–117, 4–117, 5–129, 6–132, 7–132, 8–132. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సిరాజ్ 3–0–11–0,
సుందర్ 4–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–38–2, పరాగ్ 4–0–27–0, రింకూసింగ్ 1–0–3–0, సూర్యకుమార్ 1–0–5–2.
Comments
Please login to add a commentAdd a comment