స్టైలే వేరు
● చోరీలో.. అతగాడి
● పగటి పూట చోరీ చేస్తాడు.. సగమే పట్టుకుపోతాడు
● స్థానికులపైనే అనుమానం వచ్చేలా పక్కాగా స్కెచ్
● పోలీస్‌స్టేషన్‌లో విచారణ సమయంలో పరారీ!
ఎచ్చెర్ల క్యాంపస్ : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆ దొంగ స్టైలే వేరు. అందరిలా కాకుండా పట్టపగలే చోరీకి వెళ్తాడు. ఎవరూ లేని సమయం చూసి ఇళ్లలో దూరి చాకచాక్యంగా బీరువా తెరుస్తాడు. పది తులాల బంగారం ఉంటే ఐదు తులాలు మాత్రమే చోరీ చేస్తాడు. అంటే తెలిసిన వ్యక్తులు, పొరుగింటి వారే ఈ చోరీ చేశారనే అనుమానం వచ్చేలా వ్యవహరిస్తాడు. క్లూస్‌టీమ్‌కు దొరక్కుండా చేతికి గ్లౌజ్‌లు వాడుతాడు. సీసీ కెమెరాలు లేని ఏరియాలనే ఎంచుకుంటాడు. క్రికెట్ క్రీడాకారుడు కావడంతో బెట్టింగ్‌లు అంటే మహా మోజు. చోరీ చేసిన నగలను నమ్మకస్తులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద కుదవపెట్టి మరీ బెట్టింగులు కాస్తుంటాడు.
60 నేరాలతో సంబంధం..!
జిల్లాలో ఎచ్చెర్ల, రణస్థలం, నరసన్నపేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం పట్టణం ప్రాంతాల్లో సుమారు 60 దొంగతనాలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం ఫరీదుపేటలో మహిళా టైలర్ ఇంటిలో బీరువాలో 10 తులాలకు పైగా ఉండగా, ఆరు తులాలు బంగారం మాత్రమే చోరికి గురైంది. దీంతో టైలరింగ్ శిక్షణకు వచ్చిన వారిపై అనుమానం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేశాక చివరకు ఈ దొంగకు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఈ దొంగ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పున్నాన రాంబాబుగా గుర్తించినట్లు తెలిసింది.
బాత్‌రూమ్ నుంచి పరారీ..
జిల్లాలో జరిగిన చోరీలకు సంబంధించి విచారణ చేసేందుకు రాంబాబును ఇటీవల జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాలు జరిగిన ఇళ్లను సైతం పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విచారణ ముగుస్తున్న దశలో పోలీస్‌స్టేషన్‌లో మంచిగా నటిస్తూ.. బాత్‌రూమ్‌కు వెళ్లి ట్యాప్ నీళ్లు వదిలి పక్కనున్న చెట్టుపై నుంచి దూకి తప్పించుకున్నట్లు తెలిసింది. మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ నిందితుడిని పట్టుకోవటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇతని ఆచూకీ దొరికితే దర్యాప్తు ముందుకు కొనసాగి రికవరీలు చూపించటం వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment