నెలలో డ్రోన్ పోలీసింగ్
● నేర నియంత్రణకు చేపట్టిన చర్యలతో సత్ఫలితాలు ● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
నేరాలు 2022 2023 2024
హత్యలు 39 23 22
లాభం కోసం
హత్య 1 2 1
ప్లాన్‌తో హత్య 9 10 7
అల్లర్లు 0 2 2
కిడ్నాప్ 32 24 21
దాడి 534 399 451
విశాఖ సిటీ: విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే నేర నియంత్రణ అవసరమని, అందుకు తగ్గట్టుగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో డ్రోన్ పోలీసింగ్ కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో మీడియాకు గత మూడేళ్లుగా నగరంలో నేరాల వివరాలను వెల్లడించారు. నగరంలో ఏటా నేరాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామని తెలిపారు. తాను సీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న సరికొత్త నిర్ణయాలతో మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. గత ఆరు నెలల్లో నగరంలో వ్యాపార సంస్థలు, వ్యాపారులు, అపార్ట్‌మెంట్ల ద్వారా 7,526 సీసీ కెమెరాలు, 1,442 చీకటి ప్రాంతాల్లో లైట్లు, 126 నైట్ పెట్రోలింగ్ పార్టీలు పెంపు, 272 మందిపై హిస్టరీ షీట్లు తెరవడం, బహిరంగంగా మద్యం సేవించిన 5,139 మందిపై కేసుల నమోదు, 1272 ప్రాంతాల్లో తప్పుల తొలగింపు.. ఇలా అనేక చర్యలతో నగరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంపై దృష్టి పెడతామన్నారు. గత ఐదు నెలల్లో 9,456 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరస్తులను గుర్తించడంలో కీలకంగా మారాయన్నారు. అలాగే నగరంపై నిఘా పెంచేందుకు ఐదు నెలల్లోనే 126 పెట్రోలింగ్ పార్టీలను పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 175 మంది సస్పెక్ట్ షీట్, 176 మందిపై రౌడీ షీట్, 35 మందిపై పడొఫైల్ షీట్, 36 మందిపై డ్రగ్స్, ముగ్గురిపై భూ ఆక్రమణ, ఒకరిపై సైబర్ బుల్లీ షీట్స్‌ను నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
స్వల్పంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుదల
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చేపట్టిన చర్యలతో నగరంలో రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడంతో పాటు పనిచేయని 66 ట్రాఫిక్ స్నిగల్స్, 86 పాదచారుల సిగ్నల్స్ పునరుద్ధరణ చేపట్టారు. 2022లో 1353, 2023లో 1180, 2024లో 1094 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తగ్గిన సైబర్ క్రైమ్ కేసులు
నగరంలో సైబర్ క్రైమ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.20.42 కోట్లను పోలీసులు స్తంభింపచేశారు. గతేడాది 419 కేసులు నమోదు కాగా రూ.4.04 కోట్లు పలు బ్యాంకులో ఫ్రీజ్ చేశారు. ఈ ఏడాదిలో 364 కేసులు నమోదయ్యాయి. ఇందులో రూ.2.02 కోట్లు బాధితులకు అప్పగించారు.
యాచకులు, హిజ్రాలకు పునరావాసంపై దృష్టి
నగరంలో యాచకులు లేకుండా చేసే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలో ఉన్న యాచకులు, హిజ్రాల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. వారి జన్మస్థలం, కుటుంబ సభ్యులు, ఇతర వివరాలను తెలుసుకొని వారికి అప్పగించాలని భావిస్తున్నారు. ఎవరూ లేని పక్షంలో వారికి ఏ విధంగా పునరావాస, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న అంశంపై త్వరలోనే అన్ని శాఖల అధికారులు, ఎన్‌జీఓ సంస్థలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలాగే కొంత మంది హిజ్రాలు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు అందించాలని భావిస్తున్నారు.
పోలీసులకు ఆరోగ్య తనిఖీలు
నగర పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు కొత్త ఏడాది తొలి వారంలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తల కోసం సీటీ యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేయించనున్నారు.
‘నాకు పిచ్చా’ అన్నారు..
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా నా నంబర్ ఇవ్వడంతో తన బ్యాచ్‌మేట్స్ అందరూ ‘నీకు పిచ్చా.. సొంత నంబర్ ఇస్తున్నావ్’ అని అన్నారని సీపీ నవ్వుకుంటూ చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, విశాఖలో నేర నియంత్రణే లక్ష్యంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.
భారీగా ఎన్‌డీపీఎస్ కేసులు
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కేసులు భారీగా పెరిగాయి. 2023లో 235 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 313 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 927 మంది నిందితుల పాత్ర ఉన్నట్లు గుర్తించగా 718 మందిని అరెస్టు చేశారు. ఇందులో 5024.93 కిలోల గంజాయి, 3518 మత్తు ట్యాబ్లెట్లు, 9.144 గ్రాముల ఎండీఎంఏ పౌడర్, 2 గంజాయి మొక్కలు, 132 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా నియంత్రణకు డెకాయ్ పార్టీలు, డైనమిక్ చెక్ పోస్టుల ఏర్పాటు, రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్, పార్సిల్ కేంద్రాల్లో స్నిఫర్ డాగ్స్ బృందాలతో నిరంతర తనిఖీలు చేపడుతున్నారు.
2022 2023 2024
డ్రంక్ అండ్ డ్రైవ్ 2,08,541 1,44,907 1,63,913
అతివేగం 9,667 21,376 33,707
హెల్మెట్ ధరించకపోవడం 4,11,348 3,71,245 5,03,065
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం 5,928 2,774 7,992
మైనర్ డ్రైవింగ్ 106 201 1,298
రాంగ్ పార్కింగ్ 71,682 39,340 80,487
ట్రిపుల్ రైడింగ్ 13,927 17,046 20,954
ఫైన్లు రూ.17.01 కోట్లు 16.22 కోట్లు 25.67 కోట్లు
డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్లు రూ.1.64 కోట్లు 5.70 కోట్లు 11.05 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment