షాడోలే అసలైన హీరోలు
ఎమ్మెల్యే కలెక్షన్ కింగ్‌లంతా వీరే...
కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రధాన అనుచరులదే హవా
ఏ పని కావాలన్నా వీరు తలూపాల్సిందే...
పోస్టింగుల నుంచి పైరవీలదాకా అంతా వీరి కనుసన్నలల్లోనే...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల నడకను నీడలే శాసిస్తున్నాయి. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ పని చేయాలో...ఏ పోస్టుకు ఎవరిని సిఫారసు చేయాలో.. ఏ పని ఎవరికి అప్పగించాలో అంతా వీరే నిర్ణయిస్తున్నారు. నీడను కూడా నమ్మకూడదనేది పాత సామెత. అంతా నీడను నమ్మి... వారు చెప్పినట్టే చేయాలనేది కూటమి ఎమ్మెల్యేల బాట. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల్లో ఎవరి దారి వారిదే. ఒకరు సొంత కుటుంబ సభ్యులను షాడోలుగా పెట్టుకుని పనులు నడుపుతుంటే... మరొకరు బంధువులు, ప్రధాన అనుచరులతో పనులు కానిస్తున్నారు. తమ చేతికి నేరుగా మట్టి అంటుకోకుండా అవినీతి వ్యవహారాలను గుట్టుగా చక్కబెడుతున్నారు. కొద్ది మంది ఎమ్మెల్యేలకు ఏకంగా ఐదు నుంచి పది మంది వరకూ షాడోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కొందరు కేవలం సొంత కుటుంబ సభ్యులతో మాత్రమే పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరి కొందరు తమ ప్రధాన అనుచరులను నమ్ముకుని జేబులు నింపుకుంటుండగా.... ఆరోపణలు వచ్చిన వెంటనే తనకు తెలియకుండా చేశాడని అధిష్టానానికి వివరణ ఇస్తూ పక్కన పెట్టినట్టు నటిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యుల నీడలే వ్యవహారాలన్నీ నడుపుతుండటంగమనార్హం.
పెత్తనమంతా వారిదే...!
విశాఖ జిల్లాలోని ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో తీరు. కూటమిలోని ఒక ఎమ్మెల్యే పైకి నిజాయితీపరుడిగా నటిస్తూ.... వ్యవహారాలను మాత్రం ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కానిస్తున్నారు. ఆయన లేని సమయంలో ఆయన కుటుంబంలోని వ్యక్తి ప్రారంభోత్సవాలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఇక పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి... నియోజకవర్గమంతా కొట్టినపిండి మాదిరిగా ఉన్నప్పటికీ... ఆయన లేని సమయంలో ఆయన అనుచరుడు అధికారులపై కేకలు వేస్తూ పనిచేస్తున్నారు. అధిష్టానం నుంచి ఆయనపై ఏ మాత్రం సానుకూల దృక్పథం లేకపోవడంతో దూకుడు తగ్గించిన సదరు ఎమ్మెల్యే.... ఆయన షాడో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ దబాయించి మరీ పనులు చేయిస్తుండటం గమనార్హం. ఇక నగరంలో కూటమిలోని ఓ ఎమ్మెల్యే మాత్రం అంతా పెదరాయుడు టు ధనుష్... ధనుష్ టు పెదరాయుడు అన్నట్టుగా నేరుగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనే పేరున్న ఓ ఎమ్మెల్యేకు కుటుంబంలోని ఐదు మంది షాడోలుగా వ్యవహరిస్తున్నారు.
సతీమణి, కుమారుడు, అల్లుడు, మేనల్లుడు, బావమరిదితో పెత్తనమంతా సాగుతుండటం ఆయన వద్దకు వచ్చే అందరికీ తెలిసిన విషయమే. మంత్రి పదవి ఆశిస్తున్న మరో ఎమ్మెల్యేకు మాత్రం పోలీసు పోస్టింగుల్లో భార్య తరఫు బంధువు (బావమరిది) ఒకరు భారీగా దండుకోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు ప్రచారం చేశారు. వసూళ్లన్నీ ఎమ్మెల్యే జేబులోకి చేరడంతో నియోజకవర్గంలో కనపడకుండా... కేవలం ఇంటికి మాత్రమే వచ్చేలా చూసుకుంటున్నారు. ఇక జీవీఎంసీలోని వ్యవహారాలన్నీ ఇద్దరు కార్పొరేటర్ల ద్వారా ఆయన చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మండలానికి ఒకరు...!
అనకాపల్లి జిల్లాలోనూ ఎమ్మెల్యేలదీ ఒక్కొక్కరిది ఒక్కో స్టెయిల్. ఇప్పటికే జనసేన అధిష్టానం నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొని క్లాసులు పీకుతున్నా.... అస్సలు తగ్గేదేలే అని ఆయన రెచ్చిపోతున్నారు. ఆయన అవినీతి దూకుడుకు ఎవ్వరూ ఆనడం లేదు. ఆయన సోదరుడి అండతో అందినకాడికి దోచుకుంటున్నారు.
పరిశ్రమల నుంచి పోస్టింగుల వరకూ... నేవీ నుంచి నరేగా నిధుల వరకూ ఆయనకు అడ్డులేకుండా పోయింది. ఇక మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని మండలానికో వ్యక్తిని షాడోగా మార్చుకున్నారు. అక్కడ కొత్తగా వెంచర్ వేయాలన్నా.... నిర్మాణాలు చేపట్టాలన్నా వీరి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఈయనకు నియోజకవర్గమంతా మొత్త 10 మంది వరకూ షాడోలుగా వ్యవహరిస్తున్నారు. మరో ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ సతీమణితో పాటు కుమారులు చూసుకుంటుండగా... ఇంకో ఎమ్మెల్యే పెత్తనమంతా కుమారుడే దగ్గరుండీ మరీ చక్కబెడుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నుంచి పెద్దగా ఎక్కడా హడావుడి చేయకపోయినప్పటికీ సదరు ఎమ్మెల్యే అల్లుడు మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇదే జిల్లాలోని ఒకరు మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సదరు ఎమ్మెల్యే అనుచరులు ఇప్పటికే భూకబ్జాలు, పోస్టింగుల్లో భారీగా వసూళ్లకు తెగబడటంతో అధిష్టానం దాకా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటివరకు అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన సదరు వ్యక్తి తనకు తెలియకుండా చేశాడంటూ దూరం పెడుతున్నట్టు సర్దిచెప్పుకున్నారు. ఈ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని మండలానికి ఇద్దరు ముగ్గురు షాడోలుగా రెచ్చిపోతున్నారు.
ఎమ్మెల్యే భర్తదే పెత్తనం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్తదే మొత్తం పెత్తనమంతా నడుస్తోంది. ఏ పోస్టింగు కావాలన్నా... ఆయన ఓకే అనాల్సిందే. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి... ఎన్ని ఆరోపణలు వచ్చినా ముందుకేనంటూ నీడగా సాగుతున్నారు. ఒక నియోజకవర్గ ఇంచార్జీకి గతంలో పీఏగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పటికీ వెనుక నుంచి కథ మొత్తం నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment