ఐనవోలు: పెద్ద మనుషులు తిట్టారని మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన బినబోయిన అనిత శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ కులానికి చెందిన నాయిని చిన్న కొమురయ్యకు కొండపర్తిలో సుమారు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. చిన్న కొమురయ్యకు కొడుకులు లేక పోవడంతో కుమారై, అల్లుడు బినబోయిన అనిత–ఐలయ్య ఇల్లరికం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం చిన్న కొమురయ్య వ్యవసాయ భూమి పక్కనుంచి కెనాల్ కాలువ పోయింది. దీంతో ఆయనకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడానికి బాట సమస్య ఏర్పడింది. పెద్ద మనుషుల ద్వారా తన ముందున్న రైతుతో మాట్లాడుకుని గుంట భూమికి బదులు మూడు గుంటల భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని బాట సమస్యను పరిష్కరించుకున్నాడు. ఈక్రమంలో మరో రైతు బినబోయిన రమేశ్ కూడా బాట కోసం సదరు పెద్ద మనుషులను సంప్రదించాడు. ఆపెద్ద మనుషులు గతంలో చిన్నకొమురయ్యకు చేసిన తీర్మానానికి భిన్నంగా గుంట భూమికి గుంట భూమి ఇచ్చేలా తీర్మానం చేశారు. ఈతీర్మానం నచ్చకపోవడంతో చిన్న కొమురయ్య ఒప్పుకోలేదు. దీంతో కుల పెద్దలు అతడిని కులం నుంచి బహిష్కరించారు. ఈక్రమంలో బాట హద్దులు ఏర్పాటు చేయడానికి గురువారం పెద్ద మనుషులు చిన్న కొమురయ్య వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి హద్దులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో చిన్న కొమురయ్య కుమారై బినబోయిన అనిత.. పెద్ద మనుషులు అన్యాయం చేస్తున్నారని, వారి తీరుపై అభ్యంతరం తెలిపింది. దీంతో కుల పెద్ద మనుషులు ఆమెను దూషించగా.. తీవ్ర మనస్తాపంతో పక్కనే వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కాగా.. హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో చిన్నకొంరయ్య తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కుల పెద్దమనుషులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. నాయిని పెద్ద ఐలయ్య, నాయిని దశరథం, బైకని సాయిలు, కొడాలి భిక్షపతి, నాయిని కనక సేన, బైకాని పెద్ద రాజుతో పాటు బినబోయిన రమేశ్‌పై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
ఆరుగురు కుల పెద్దలపై కేసు
Comments
Please login to add a commentAdd a comment