TS Special
-
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
TS: గ్రూప్–2 వాయిదాకే ఛాన్స్!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–2 అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ ఈ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2–3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావడంతోపాటు ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. ఈ లెక్కన మరో 10 రోజుల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీకి మరో సమస్య ఎదురైంది. టీఎస్సీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డితోపాటు ఐదుగురు సభ్యులు గవర్నర్‌ను కలసి రాజీనామాలు సమర్పించాలనుకున్నా ఆమె సమయం ఇవ్వకపోవడంతో గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపారు. అయితే రాజీనామాలు పంపి వారం దాటినా గవర్నర్ కార్యాలయం నుంచి వాటిని ఆమోదిస్తున్నట్లుగానీ.. తిరస్కరిస్తున్నట్లుగానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే తప్ప కొత్తగా చైర్మన్‌ను, సభ్యులను నియమించే అవకాశం లేదని అంటున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వారి రాజీనామాలతో సంబంధం లేకుండా అప్పటికే ఖాళీగా ఉన్న మరో ఐదుగురు సభ్యులను నియమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొత్త చైర్మన్, సభ్యులు వచ్చాకే పరీక్షలు? ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం పాలనా వ్యవహారాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన అంశాల్లో చైర్మన్, సభ్యుల నిర్ణయమే కీలకపాత్ర పోషించనుంది. దీంతో జనవరిలో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కష్టమేనని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటై మరోమారు తేదీలు ప్రకటించే వరకు అభ్యర్థులు పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో వెలువడిన నోటిఫికేషన్... రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు నెలపాటు అవకాశం కల్పించింది. దీంతో 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలను కమిషన్ రీషెడ్యూల్ చేసింది. దీంతో గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా పడగా... అభ్యర్థుల ఒత్తిడి, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండోసారి జనవరికి వాయిదా పడ్డాయి. -
కోవిడ్‌తో జాగ్రత్త అవసరం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యల పెరుగుతోంది. దాదాపు 700లకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. ఇక, తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. అయితే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం తిలక్‌నగర్‌లోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లారు. కోవిడ్‌పై ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశాం. అవసరమైతే కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం. కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ప్రమాదకరంకాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ కట్టడికి ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నడమనూరు మండలం వెంపాడు స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపు తప్పి.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఆరుగురు మృతి చెందారు. ఆటోలో ఏడుగురు ప్రయనిస్తుండగా అందులోని నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన ఇద్దరు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులు నిడమానూరు మండలం నిమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, గణ్, నాగరాజు, పాండ్య, బుజ్జిగా పోలీసులు గుర్తించారు. చదవండి: ఎంఎంటీఎస్‌కు మరోసారి బ్రేక్ -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్‌గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్‌తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్‌లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్‌కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్‌ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్‌సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
100% మించిన ఆక్యుపెన్సీ రేషియో
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుండటంతో టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పోటెత్తటంతో రికార్డు స్థాయిలో 100.09% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కి.మీ.కు రూ.65.07 చొప్పున ఆదాయం నమో నమోదైంది. కిలోమీటరుకు నమోదయ్యే ఆదాయం ఆధారంగా ఆక్యుపెన్సీ రేషియోను లెక్కిస్తారు. రెండో శనివారం, ఆదివారం, క్రిస్మస్, బాక్సింగ్‌డే..ఇలా వరుస సెలవులు రావటంతో జనం ఊళ్ల బాట పట్టడంతో శనివారం ఒక్కరోజే 49,00,723 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండు, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్‌కూడలి తదితర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఒక్క ఎంజీబీఎస్ నుంచే దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. ఒక్క రోజులో రూ.21.24 కోట్ల ఆదాయం ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. పండగ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణించటం ద్వారా రూ.20 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. సాధారణ రోజుల్లో అయితే, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం కాకుండా, సంక్రాంతి, దసరా లాంటి పండగ సెలవులు లేనప్పటికీ శనివారం ఏకంగా రూ.21.24 కోట్ల ఆదాయం నమోదు కావటం విశేషం. క్రమంగా జనం పోటెత్తుతుండటంతో బస్సుల సంఖ్యను పెంచటంతోపాటు సిబ్బందిని ముఖ్య ప్రాంతాల్లో ఉంచి మానిటరింగ్ చేశారు. శనివారం ఒక్కరోజే సూపర్‌లగ్జరీ, డీలక్స్, గరుడ, రాజధాని బస్సులు రద్దీగా మారాయి. ఎక్కువ చార్జి ఉండే సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో సీట్లు నిండిపోవటంతో భారీగా ఆదాయం నమోదైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఒక్కో గరుడ బస్సులో ట్రిప్పునకు రూ.లక్షన్నర చొప్పున ఆదాయం లభించింది. దీంతో ఆదాయం గరిష్ట స్థాయిలో నమోదై ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు కారణమైంది. -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
తెరపైకి తెలంగాణ పార్కు
జిల్లా కేంద్రంలో తెలంగాణ పార్కు నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మళ్లించడంతో పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవలే నిధులు విడుదల చేసిన నూతన ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ అర్బన్: జిల్లా కేంద్రం వికారాబాద్‌కు ముక్కుపుడక లాంటి తెలంగాణ పార్కు ఏర్పాటు ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు స్థలం గుర్తించి వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రం అభివృద్ధికి తెలంగాణ అర్భన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల నుంచి పార్కు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్ స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారని వినికిడి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున స్పీకర్ జిల్లా కేంద్రంలోనే ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం పార్కు నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. నిధుల మల్లింపుతో నిలిచిన పనులు 2019 జనవరి 29న అప్పటి కలెక్టర్ ఉమర్ జలీల్ తెలంగాణ పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో 13 ఎకరాల స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. 2020లో పార్కు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లభించింది. ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద వికారాబాద్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 25 శాతం పార్కు అభివృద్ధికే కేటాయించినట్లు ప్రచారం సాగింది. 2021 జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికే పార్కు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇట్టి నిధులు అప్పటి పాలకులు, అధికారులు ఇతర అభివృద్ధి పనులకు మల్లించడంతో పార్కు నిర్మాణం పనులు ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. పర్యాటకులు పెరిగే అవకాశం హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ వచ్చే ప్రధాన రోడ్డు పక్కనే శివారెడ్డిపేట్ చెరువు ముందు భాగంలో ఈ పార్కు నిర్మిస్తే పర్యాటకులు పెరగడంతో పాటుగా స్థానికులకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. చెరువులో ఎప్పుడు నీరు ఉండటంతో పాటు, పట్టణానికి కొంత దూరంగా ఉండటం, హైదరాబాద్ ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అనంతగిరికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పర్యాటకులు వచ్చే ప్రధాన రహదారి వెంటే పార్కు నిర్మిస్తే జిల్లా కేంద్రానికి మరింత వన్నె వచ్చే అవకాశం ఉంది. అత్యాధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేసేందుకు అధికారులు గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. పార్కును ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై ఓ ప్రైవేటు కంపెనీ నమూనా గ్రాఫ్ తయారు చేసింది. ఈ తెలంగాణ పార్కులో ప్రత్యేకంగా చిన్న పిల్లల ఆటస్థలం వారు ఆడుకునేందుకు క్రీడా సామగ్రి ఏర్పాటు, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశారు. ఆకట్టుకునే విధంగా గ్రీనరీ ఏర్పాటు, సుమారు వంద రకాల పూల మొక్కలు, పార్కు చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో మెరిసేలా ఏర్పాటు చేయాలని గ్రాఫ్‌లో పొందుపరిచారు. పార్కు నుంచి చెరువు అందాలు వీక్షించేందుకు కొంత ఎత్తులో నిచ్చెనలతో కూడిన ట్రాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కేంద్రానికి ముక్కుపుడక లాంటి ఈ పార్కు నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తొలి ప్రాధాన్యత పట్టణానికి అందాన్ని తీసుకొచ్చే తెలంగాణ పార్కు నిర్మాణం పూర్తి చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. పార్కు నిర్మాణం పూర్తయితే మున్సిపల్‌కు ఆదాయంతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వచ్చిన టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి పార్కుకు నిర్మాణానికి ఎక్కువ శాతం కేటాయించాలని స్పీకర్‌ను కోరాం. – మంజుల, మున్సిపల్ చైర్పర్సన్, వికారాబాద్ -
మహా రద్దీ..
సాక్షి, హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. ‘మహాలక్ష్మి’తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66 శాతంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరుకుంది. కొన్ని మార్గాల్లో అది వందశాతం కూడా దాటింది. అంటే సీట్ల సామర్థ్యం కంటే ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులు 70 శాతం సీట్లలో కూర్చుంటున్నారు. దీంతో మిగతా మహిళలు, పురుషులు నిలబడే ప్రయాణించాల్సి రావడం వివాదాలకు కారణమవుతోంది. బస్సులు సరిపోక... పెరిగిన రద్దీని క్రమబద్ధికరించాలంటే బస్సుల సంఖ్య భారీగా పెంచాలి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సగటున 41 లక్షల మంది, రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో 51 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉంటోంది. మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంది. ఈ కేటగిరీ బస్సులు ప్రస్తుతం ఆర్టీసీలో 7292 బస్సులు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఆర్టీసీ డిపోల్లో ఉన్న అన్ని బస్సులు రోజూ రోడ్డెక్కవు. వాటిల్లో కొన్ని బ్రేక్‌డౌన్‌లో ఉంటాయి. కొన్ని ఇతర అవసరాల కోసం స్పేర్‌లో ఉంటాయి. సాధారణ రోజుల్లోనే బస్సులు సరిపోక ట్రిప్పులకు ఇబ్బంది అవుతూ వస్తున్న తరుణంలో, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అమలులోకి రావటంతో బస్సులకు ఒక్కసారిగా తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వంద శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుండటంతో అదనపు ట్రిప్పు నడపాల్సి వస్తోంది. కానీ బస్సులు అందుబాటులో లేక సర్దుబాటు చేయలేకపోతున్నారు. ఫలితంగా, ప్రయాణికులతో కిక్కిరిసి నడపాల్సి వస్తోంది. స్థలం సరిపోక కొందరు ప్రయాణికులు దిగిపోవాల్సి వస్తోంది. దీంతో అదనపు బస్సు నడపాలంటూ వారు సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు 4 వేల బస్సులు కావాల్సిందే.. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ ఇప్పటికిప్పుడు దాదాపు 4 వేల వరకు కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఆర్టీసీ రెండు వేల బస్సులకు ఆర్డరిచ్చింది. వాటిల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు 1,500 వరకు ఉంటాయి. కానీ ఆ బస్సులు అందుబాటులోకి రావాలంటే ఇంకా నాలుగు నెలల సమయం పడుతుంది. వచ్చే మార్చి చివరి నాటికి అవి దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మరో 20 రోజుల్లో 50 బస్సులు అందనున్నాయి. కానీ అప్పటి వరకు ఈ రద్దీని తట్టుకునే పరిస్థితి లేదు. రోజురోజుకు ప్రయాణికులు–ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని సంతోషపడుతున్నా.. రోజూ నిలబడి ప్రయాణించటం ఇబ్బందిగా భావించేవారు మళ్లీ ఆటోల వైపు మళ్లుతారు. దీంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో కొంత పడిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే నాలుగు వేల బస్సులు కావాలి. కానీ, అన్ని బస్సులు సమకూర్చుకోవటానికి ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త బస్సుల అంశాన్ని ప్రస్తావించలేదు. ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా.. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. వాటిలో 500 బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతాయి. నగరంలో ఓఆర్ 90 శాతాన్ని దాటింది. అంత లోడ్‌ను ఎలక్ట్రిక్ బస్సులు లాగుతాయా అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాగినా, బ్యాటరీలు ముందుగానే డిస్ఛార్జి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అద్దె బస్సుల నోటిఫికేషన్ సమస్య నుంచి గట్టెక్కాలంటే వెంటనే కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఆర్టీసీ అధికారులు మరోసారి అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు అద్దె బస్సులు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగినందున, పాత అద్దె రేట్లకు బస్సులు పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులు సుముఖంగా లేరు. అద్దె చార్జీలు సవరించాలని కోరుతున్నారు. సవరిస్తే ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుంది. వారంలో 50 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్ కొత్తగా వచ్చే బస్సుల నమూనాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం పరిశీలించారు. వాటిల్లో లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. సంక్రాంతి నాటికి 200 బస్సులు రోడ్డెక్కుతాయని, వీటిలో 50 బస్సులు వారం రోజుల్లో అందుతాయని సజ్జనార్ వెల్లడించారు. నాలుగైదు నెలల్లో విడతలవారీగా 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 రాజధాని, 540 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు, నగరం వెలుపల తిరిగేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుతాయని వెల్లడించారు. -
TS: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. కాగా, నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. -
TS: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. TSRTC is inviting applications from entrepreneurs for the supply of various types of city buses under the Hire Scheme in the Greater Hyderabad zone. Prospective entrepreneurs may visit our website at https://t.co/r7jl9XZYI0 for details or contact 9100998230. @TSRTCHQ @PROTSRTC pic.twitter.com/oTbFhTndxE — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చదవండి: TS: ఉదయం 4.30 నుంచే ప్రజావాణి.. ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏమున్నాయంటే -
కరీంనగర్-తిరుపతి రైలు: ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది. కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ చొరవతో ఇది సాధ్యమైంది. అయితే, బండి సంజయ్ ఈరోజు ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణీకులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలను సమీక్షించిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ఏయే రోజు రైలును నడపాలనే దానిపై ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్-హసన్‌పర్తి రైల్వేలైన్.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వేలైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వేలైన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జమ్మికుంటలో ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు! ఇక, రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం వ్యాపారులు, సామాన్య ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు కొనసాగిస్తుంటారని, వారి సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సంజయ్ కోరారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వెళ్లే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(12590-89), యశ్వంతపూర్ నుండి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592-91 ), హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723-23), సికింద్రాబాద్ నుండి పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791-92), చెన్నై నుండి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656-55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
న్యూఇయర్ వేడుకలపై పోలీసు నిఘా
హైదరాబాద్: న్యూ ఇయర్ రోజు మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 12.30 నుండే కస్టమర్లను పబ్‌ల నుంచి బయటికి పంపాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించిన, సప్లై చేసిన కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నీపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. సింగరేణికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్‌పై విచారణ జరుపుతూ వచ్చింది. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. చివరకు.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. -
గంజాయి సేవించనందుకు విద్యార్థిపై దాడి
నిజామాబాద్: గంజాయి సేవించాలని ఒత్తిడి చేయగా.. అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థిపై మరో ఐదుగురు విద్యార్థులు దాడి చేసిన ఘటన మాక్లూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఐదుగురు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన విరామంలో స్కూల్‌కు కొద్దిదూరం వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. గత శనివారం వారి తరగతిలోని మరో విద్యార్థిని సైతం గంజాయి సేవించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, సదరు విద్యార్థి అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఆ విద్యార్థి తనపై తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లికి చెప్పాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో బాధిత విద్యార్థి తల్లి మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. సోమవారం తిరిగి బాధిత విద్యార్థి పాఠశాలకు వెళ్లగా తల్లిదండ్రులకు చెబు తావా అంటూ ఐదుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి చితకబాదారు. దీంతో సదరు విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి బుధవారం మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఎస్సై సుధీర్‌రావును సంప్రదించగా విచారణ చేపట్టి చర్య లు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామన్నారు. -
దోమకొండలో ముగ్గురు మహిళల హల్చల్
కామారెడ్డి జిల్లా: మండల కేంద్రంలో ముగ్గురు మహిళలు బుధవారం రాత్రి హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన పందిరి కాశీనాథ్ ఇంట్లో చొరబడి బంగారు గొలుసు, డబ్బులు దొంగిలించారంటూ కాలనీవాసులు వారిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్న పీఎస్‌కు తరలించారు. మహిళలు మద్యం తాగి, పెప్పర్‌స్రే, కట్టర్, చాకు, సుత్తి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. తమది మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామమని తన పేరు బూస కవిత అని సదరు మహిళ తెలిపారు. దోమకొండకు చెందిన కాశీనాథ్ తమకు గతంలో రూ.5లక్షలు అప్పు ఇచ్చాడని, తన భర్త చనిపోగా ఇల్లు అమ్మి డబ్బులు కట్టానని చెప్పారు. ప్రామిసరీ నోట్లను చించివేసిన కాశీనాథ్ రెండేళ్ల తర్వాత తాము ఇచ్చిన చెక్కులపై చెక్»ౌన్స్ కేసు వేశాడన్నారు. దీంతో తాను అతడిపై వేదింపుల కేసు పెట్టానని పేర్కొన్నారు. రాజీకి వచ్చిన కాశీనాథ్ కేసులు విరమించుకుందామని చెప్పగా, తాను ముందు కేసు విరమించుకున్నానని, కానీ అతడు కేసు విరమించుకోలేదని చెప్పారు. కాగా సదరు మహిళలు చెబుతున్న మాటలు వాస్తవం కాదని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని కాశీనాథ్ పోలీసులను కోరాడు. పైఅధికారుల సూచన మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
కోవిడ్‌పై అప్రమత్తంగా ఉందాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరంలేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ శివరామప్రసాద్, ఉస్మానియా, గాందీ, ఛాతీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావు, డాక్టర్ మహబూబ్ ఖాన్, టీస్ఎంఎస్ఐడీసీ సంచాలకులు కౌటిల్య, చీఫ్ ఇంజనీరు రాజేంద్ర కుమార్, స్పెషల్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్సకు అవసరమైన పరికరాలు, ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెట్టి, వెంటనే ఆయా వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ను వెంటనే పూర్తిచేయాలని, ఆస్పత్రుల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు అందజేయాలని సూచించారు. ఈ 9 కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవు: తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రులు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కి పంపాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ తొమ్మిది కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవని, బాధితులంతా హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 319 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ కేసుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై నిఘా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు రాష్ట్రంలో బుధవారం మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ నగరంలోనే ఈ ఆరు కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది ఆస్పత్రుల్లో లేదా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.44 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు 4,111 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారంతా రికవరీ అయ్యారు. -
చిన్నపల్లెపై చిన్నచూపు!
ఊరిలో 108 మంది జనాభా... 69 మంది ఓటర్లు.. ప్రాథమిక పాఠశాల.. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురే విద్యార్థులు.. ఒక్కరే మాస్టారు.. ఊరికి ఒకవైపు కిన్నెరసాని, మరో వైపు వాగులు.. వర్షాకాలమైతే ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల మేర గతుకులు, బురద రోడ్డు దాటాలి. ఇది దాటేందుకు కనీసంగా గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటే లోపు మృత్యువాత పడటమే.. అసలు ఇంతవరకు అంబులెన్స్ ఆ గ్రామానికి ఒక్క సారి కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ ‘దొంగతోగు’ దుస్థితి ఇది. గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఏకతాటిపై ఉన్న ఆ ఏజెన్సీ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.. (సాక్షిప్రతినిధి, ఖమ్మం) : పాలనా సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగు 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా నేటికీ సమస్యలు సమసిపోలేదు. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచినా ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసానికి వరదతో వాగులు.. వంకలు పొంగిపొర్లడం, కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు కాగా, ఆళ్లపల్లికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగిపొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపినా దూరాభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్లడం లేదు. పాలనా కేంద్రంగా బడి.. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ భవనంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.16 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సాహ సం చేయాల్సిందే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఆ పల్లె అభివృద్ధికి నోచుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా వరదలతో పైపులైన్లు ధ్వంసమై ఏడాదిగా గ్రామానికి తాగునీరు రావడం లేదు. ఆరు కిలోమీటర్లు.. అవస్థలు.. దొంగతోగు సమీపంలోని ముత్తాపురం నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగే వాగులు, వంకలు, గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆస్పత్రికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. రెండు నెలల క్రితం గుండె పోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్‌పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే సరికే మృతి చెందాడు. రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబులెన్స్ రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అనుమతి లభించలేదు. ఇటీవల రెండు కిలోమీటర్లకు అనుమతి రాగా, పనులు ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకుండా.. గ్రామంలో 27 కుటుంబాలున్నాయి. అంతా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు సేద్యమవుతున్నాయి. పోడు పట్టాలు రావడంతో వారి ఖాతాల్లో వానాకాలం రైతుబంధు డబ్బు పడింది. ఆదివాసీ కుటుంబాలన్నీ ఏకగ్రీవంగా సర్పంచ్‌ని ఎన్నుకున్నట్లే.. గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో సందడి నెలకొనాల్సిన ఈ గ్రామంలో పాత కష్టాలే కళ్లముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవనం వస్తాయనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. గ్రామ ప్రొఫైల్ ♦ గ్రామ పంచాయతీ: దొంగతోగు (రాష్ట్రంలో అతి చిన్నది) ♦ 2018లో గుండాల పంచాయతీ నుంచి వీడి నూతన పంచాయతీగా ఏర్పాటు. ♦ తొలుత 35 మంది ఓటర్లు ♦ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం 69 మంది ఓటర్లు. ♦ మొత్తం ఓటర్లలో పురుషులు 36, స్త్రీలు 33 మంది ♦ మొత్తం జనాభా : 108 మంది ♦ పురుషులు : 44, స్త్రీలు : 64 మంది రోడ్డే ప్రధాన ఇబ్బంది.. ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామ సమస్యలు తీరుతాయి. పైపులైన్లు ధ్వంసం కావడంతో ట్యాంకు నుంచి మంచినీళ్లు రావడం లేదు. పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేరు వచ్చినా చేయించలేకపోతున్నాం. నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. – కొమరం బాయమ్మ, సర్పంచ్, దొంగతోగు రోడ్డు ఉంటే ప్రాణం దక్కేది.. నా భర్త అక్టోబర్ 20న గుండెపోటుతో చనిపోయాడు. గుండె నొప్పి వస్తే బండి మీద గుండాల తీసుకెళ్లాం. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అక్కడ వైద్యం పొందుతూ చనిపోయిండు. ఆరు కిలోమీటర్ల రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాల వేళ్లే సరికి నొప్పి ఎక్కువైంది. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆస్పత్రికెళ్తే ప్రాణాలు దక్కేవి. గర్భిణులను మొన్నటివరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రాక్టర్లలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. –పూణె అనంతలక్ష్మి, దొంగతోగు -
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్‌డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్‌ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్‌కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్‌కుమార్ డూప్లికేట్‌ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్‌ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి తాము అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన గణాంకాలతో కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దీనిని బుధవారం శాసనసభ ముందుంచారు. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వసూళ్ల తీరు, ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, ఆర్బీఐ, కాగ్ నివేదికల్లో పేర్కొన్న అంశాలను పొందుపరిచారు. మొత్తం 22 పట్టికల్లో పలు గణాంకాలను వెల్లడించారు. ఆర్థిక శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలివీ.. ► బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవ ఖర్చు శాతం ఆందోళనకరం. 2014–15లో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ ఖర్చు 61.9శాతమే. 2014– 2023 మధ్య సగటు వ్యయం 82.3 శాతం. గత పదేళ్లలో రూ.14,87,834 కోట్ల మేర బడ్జెట్ అంచనాలను ప్రతిపాదిస్తే.. అందులో ఖర్చు చేసినది రూ.12,24,877 కోట్లు. ► కాంగ్రెస్ పాలనలో 2004–14 వరకు సగటు వ్యయం 87శాతం. మొత్తం రూ.10,04,326 కోట్ల అంచనాలకు గాను రూ.8,73,929 కోట్ల ఖర్చు జరిగింది. ► 1956–57లో ఉమ్మడి ఏపీ బడ్జెట్లో తెలంగాణ వాటా కింద రూ.33 కోట్లు ఖర్చు పెట్టగా.. 2013–14 నాటికి ఇది రూ.56,947 కోట్లకు చేరింది. మొత్తంగా గత 57 ఏళ్లలో అంటే 1956– 57 నుంచి 2013–14 వరకు తెలంగాణ లో జరిగిన ఖర్చు రూ.4,98,053 కోట్లు. ► ఈ నిధులతోనే ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టుతోపాటు నాగార్జునసాగర్, జూరాల, కోయల్‌సాగర్, దేవా దుల, శ్రీరాంసాగర్, కడెం లాంటి సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ట్రిపుల్‌ఐటీలు, వర్సిటీలు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, రోడ్లు–భవనాలు, కాల్వలు, విద్యుత్ లైన్లు, రక్షణ సంస్థలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయగలిగాం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది సీఎంల కాలంలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు మాత్రమే. ► 2014–15 తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు అస్థిరంగా ఉన్నాయి. స్థూల ఉత్పత్తితో పోలిస్తే రెవెన్యూ రాబడులు 2015–16లో గరిష్టంగా 13.2శాతంగా ఉండగా.. 2018–19లో 11.8 శాతానికి క్షీణించాయి. అంటే కరోనా మహమ్మారికి ముందే ఆర్థిక మందగమనం ప్రారంభమైంది. ఇక రెవెన్యూ రాబడుల శాతం కూడా పడుతూ, లేస్తూ వచ్చింది. 2021–22లో తెలంగాణ కంటే కేవలం మరో ఐదు రాష్ట్రాలే తక్కువ రెవెన్యూ రాబడులు కలిగి ఉన్నాయి. ► పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయ వనరుల్లో పెరుగుదల లేని కారణంగా ద్రవ్యలోటు పెరిగింది. ఈ లోటును పూడ్చడానికి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ రుణాలు గత పదేళ్లలో ఏటా సగటున 24.5శాతం చొప్పున పెరిగాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపించిన రుణాల్లో బడ్జెటేతర రుణాలను చేర్చలేదు. ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పప్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ఏర్పాటు చేసి ప్రభుత్వమే చెల్లించే విధంగా కొన్ని రుణాలు, ప్రభుత్వ హామీ ఉన్న ఎస్పీవీలు చెల్లించేలా మరికొన్ని, ప్రభుత్వ హామీ లేకుండా మరికొన్ని రుణాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు, హామీ ఇచ్చినవి, హామీలేనివి కలిపి మొత్తం అప్పు రూ.6,71,757 కోట్లకు చేరింది. ► ఈ అప్పులతో ఏటా రుణాల తిరిగి చెల్లింపు భారం పెరిగిపోయింది. 2014–15లో అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులు రూ.6,954 కోట్లు కాగా..2023–24 నాటికి ఇది రూ.32,939 కోట్లకు చేరింది. ► మొత్తం రెవెన్యూ రాబడుల్లో రుణాల చెల్లింపుల భారం 2014–15లో 14 శాతం కాగా.. 2023–24 నాటికి 34 శాతానికి పెరిగింది. బహిరంగ మార్కెట్ రుణాల సగటు వడ్డీ రేటు 7.63 శాతం. కానీ గత ప్రభుత్వం గ్యారంటీలిచ్చి తీసుకున్న రుణాల్లో 95 శాతం రుణాల వడ్డీ రేటు 8.93 నుంచి 10.49 శాతం వరకు ఉంది. ► రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24 ప్రభుత్వ శాఖల్లో 39,175 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇందుకు రూ.3,49,843 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.1,89,903 కోట్లు వ్యయమైంది. మిగతా పనుల కోసం రూ.72,983 కోట్లను రుణాలు తీసుకోవాల్సి ఉంది. ► ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డి్రస్టిబ్యూటర్లకు సంబంధించిన 4,78,168 బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంది. ఈ బిల్లుల మొత్తం విలువ రూ.40,154 కోట్లు. ► ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సగటు వార్షిక వృద్ధిరేటు 17 శాతం. 2014–15లో రూ.17,130 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లించగా.. 2021–22 నాటికి అది రూ.48,809 కోట్లకు చేరింది. రాష్ట్ర రాబడిలో ఇది 38 శాతం. ► కొన్నేళ్లుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతను సూచిస్తోంది. 2014–15లో రాష్ట్ర ఖజనాలో 303 రోజులు నగదు నిల్వ ఉండగా..2023–24 (నవంబర్ 30వరకు) 30 రోజు లకు పడిపోయింది. 2022–23లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను 328 రోజులు ఉపయోగించుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ► 2014–19 మధ్య రాష్ట్రం రెవెన్యూ మిగులును నమోదు చేయగా.. 2019–22 మధ్య జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీల వంటి చెల్లింపులు, పునరావృత ఖర్చులను తీర్చడానికి కూడా రెవెన్యూ రాబడులు మిగలలేదు. ► మొత్తం రాబడులు, వ్యయం మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు. ఈ ద్రవ్యలోటు 2014–15లో రూ.9,410 కోట్లుకాగా.. 2015–16లో రూ.18,856 కోట్లు, 2016–17 నాటికి రూ.35,281 కోట్లకు చేరింది. ► కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారం.. 2023–24లో దేశంలోని రాష్ట్రాలు తమ బడ్జెట్లో 14.7 శాతం విద్యపై ఖర్చు చేస్తాయని అంచనా వేయగా.. తెలంగాణ 7.6శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేసింది. ఇది జాతీయ సగటులో సగం మాత్రమే. ఇదే నివేదిక ప్రకారం వైద్యంపై ఖర్చు కేవలం 5 శాతం మాత్రమే. పారదర్శకంగా అధిగమిస్తాం మొత్తం 42 పేజీల్లో 13 అంశాలను కూలంకషంగా వివరిస్తూ ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలు–వాస్తవ వ్యయం, ఉమ్మడి ఏపీలో తెలంగాణలో చేసిన ఖర్చు, రెవెన్యూ వసూళ్లు, రుణాల తీరు, మూలధన వ్యయం, జీతభత్యాలు–పెన్షన్ల ఖర్చు, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చును అంశాల వారీగా వివరిస్తూ రూపొందించినట్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందిన ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని, పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా, వివేకంతో, పారదర్శకంగా అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది.