Expert Advice
-
ఫండ్స్ కంటే పీఎంఎస్ నయమా?
మ్యూచువల్ ఫండ్స్‌లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్‌టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా? – విష్ణు నివాస్పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్‌ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం.మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్‌ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అద్వైత్మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6–12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్–ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఐటీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్‌తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇంటి పేరు మార్చుకుంటున్నారా..?
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్‌లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్‌లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్‌లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి. పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్‌ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం పడతాయన్నారు. భర్త ఇంటి పేరు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్వాలా అండ్ కో పార్ట్నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు. ఆస్తి పత్రాల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్‌లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు. మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది. పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్‌తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు. పదో తరగతి మెమో చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్‌పోర్ట్‌కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్‌కు, సీబీఎస్ఈ పదో తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్‌పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్‌లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని, వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు. ఆస్తుల క్లెయిమ్ కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు. వీసాకు దరఖాస్తు ‘‘వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్‌పోర్ట్‌లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. పేరు మార్చుకోకపోతే..? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్ వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు. మొత్తం పేరే మారితే? కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
ఇల్లు అమ్మితే లాభం సంగతి..
మూలధన లాభం స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా..అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మామూలు శ్లాబులు .. మామూలు రేట్లే స్వల్పకాలికానికి. ఈ వారం దీర్ఘకాలికం విషయం గురించి ఆలోచిద్దాం. ♦ దీర్ఘకాలిక మూలధన లాభం మీద పన్ను రేటు 20 శాతం. ♦ ఇది వ్యక్తులకు, హిందు ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే. ♦ ఈ ప్రత్యేక రేటు వర్తింప చేయడం వల్ల ♦ ఈ మూలధన లాభాన్ని ఇతర ఆదాయాలతో కలపరు. ♦ గతవారం మనం చూసిన ఉదాహరణలో ఆనందరావు గారి పెన్షన్ రూ. 10,00,000. ఇంటద్దె రూ. 3,00,000, వడ్డీ రూ. 2,00,000, మూలధన లాభం (దీర్ఘకాలికం) రూ. 20,00,000 అనుకోండి. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షన్, ఇంటద్దె, వడ్డీలు మొత్తం రూ. 15,00,000లో సేవింగ్స్ రూ.2,00,000 తీసివేసి తదనుగుణమైన రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు. ♦ మూలధనలాభాలు దీర్ఘకాలికం కాబట్టి వాటిని ప్రత్యేకంగా భావించి కేవలం 20 శాతం చొప్పున లెక్కిస్తారు. దీనికి విద్యా సుంకం అదనం. ♦మూలధన లాభాలకు బేసిక్ లిమిట్‌ని వర్తింపచేస్తారు. ♦ఉదాహరణకు 60 ఏళ్ల సత్యనారాయణ గారికి ఇతర ఏ ఆదాయాలు లేవు అనుకుందాం. వారికి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,50,000 అనుకోండి. పన్ను కట్టక్కర్లేదు. ♦ఇలాంటి బేసిక్ లిమిటు 60 ఏళ్లు దాటి 80వ సంవత్సరంలో ఉన్న వారికి రూ. 3,00,000 చొప్పున, 80 ఏళ్లు దాటినవారికి రూ. 5,00,000 వర్తింపచేస్తారు. ♦అయితే, ఇతర ఆదాయం ఉండి ఉంటే ఆ ఆదాయంలో నుంచి సెక్షన్ 80సీ మొదలైన వాటిని తగ్గిస్తారు. ఉదాహరణకు, ఇతర ఆదాయం రూ. 1,50,000 ఉంటే, నిజంగా సేవ్ చేసి ఉంటే మినహాయింపు దొరుకుతుంది. ♦కేవలం దీర్ఘకాలిక మూలధన లాభం ఉంటే అందులో నుంచి సెక్షన్ 80సీ మొదలైన మినహాయింపులు, తగ్గింపులు రావు. ఇవ్వరు. ♦ 80సీ నుంచి 80 యు వరకు అమల్లో ఉన్న ప్రయోజనాలు ఇవ్వరు. ♦పైన చెప్పిన రూల్సు రెసిడెంటు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి. ♦మూలధన లాభం మీద బేసిక్ రేటు 20 శాతం, విద్యా సుంకం, పరిమితి దాటితే సర్‌చార్జీ కూడా పడుతుంది. -
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...
దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది. ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది. డబ్బు భలే జబ్బు మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు. తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు . ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు. -సిమ్మాదిరప్పన్న. -
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే..
ఆఫీసు అంటేనే అక్కడ ఉన్న అందరితోనూ కలిసి పని చేయాలి. ఇలాంటప్పుడు ఎవ్వరితోనైనా కలిసి ఎలా పని చేయాలి? వర్కప్లేస్ ఎక్స్పర్ట్, స్పీకర్, రైటర్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పాడ్‌కాస్ట్ హోస్ట్ అమీ గలో కార్యాలయాలలో ఎలా ఉండాలో పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ‘గెటింగ్ ఎలాంగ్’ అనే ఈ బుక్ ఇప్పుడు పని ప్రదేశాల్లో ఉండే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలను అమీ గలో వివిధ రంగాల నుండి స్వయంగా సేకరించింది. ఈ యేడాది చదివి తెలుసుకోదగిన పుస్తకాలలో అమీ బుక్ ప్రముఖంగా నిలిచింది. వర్క్ ప్లేస్‌లో ఎలా ఉండాలో అమీ సేకరించిన విషయాలు, సూచించిన పరిష్కారాలు ఉద్యోగులందరికీ ఎంతగానో తోడ్పడుతున్నాయి. పనిలో సంఘర్షణ ఉంటుంది. పనిచేసే చోట సంబంధాలు కఠినంగా ఉంటాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒత్తిడి ఉంటే మన సృజనాత్మకత, ఉత్పాదకత కూడా తగ్గుతుంది. స్పష్టంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ విషయాల గురించి రాత్రిపూట ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడపవచ్చు. ఈ ప్రవర్తన చేస్తున్న ఉద్యోగం వదులుకునేలా చేస్తుంది. చేస్తున్న పని నుండి బయటకు వచ్చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడవచ్చు. మీటింగ్‌లో కళ్లు తిప్పడం, ఎగరేయడం, సహోద్యోగులపై విరుచుకుపడటం లేదా మనం మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం కూడా మనల్ని ఉద్యోగం నుంచి వేరు చేస్తాయి. చాలావరకు నవ్వుతూ, వేరే మార్గం లేనట్టుగా వ్యక్తులను భరిస్తుంటారు. సరైన పరిష్కారాలు తెలియక హానికరమైన ప్రవర్తనలను భరిస్తుంటారు. ఇక్కడ చూడాల్సింది మనలోని చిత్తశుద్ధి, కెరియర్ మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వర్క్‌ప్లేస్ ఎక్స్పర్ట్ అమీ ‘గెటింగ్ ఎలాంగ్’లో కష్టతరమైన సహోద్యోగులను గుర్తించి, ఇలా మన ముందుంచింది. ►సరైన బాస్ లేకపోవడం: వీరిపై ఉద్యోగుల్లో విశ్వాసం ఉండదు. ఫలితంగా ఏదో విధంగా మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి బాస్ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించే ఎక్కువ ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి కష్టపడవచ్చు. ► నిరాశగా ఉండేవారు: ఇలాంటి వారితో సరైన ప్రోత్సాహం, కెరీర్లో పెరుగుదల ఉండదు. ► దూకుడుతనంగా ఉండటం: సహోద్యోగులు తమ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ధోరణి ఉండదు. తాము ఏదైనా తెలియజేయడానికి పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడానికి ఉన్నట్టు కనిపిస్తారు. ► అన్నీ తెలుసు అనే ఆలోచన: అత్యంత తెలివైన వారిగా చూపించుకోవడానికి తపన పడుతుంటారు. తగినంత సమాచారం లేకపోయినా, చెప్పేది తప్పు అని తెలిసినా తనదే కరెక్ట్ అనే ధోరణలో ఉంటారు. ► హింసించే వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే: సాధారణంగా ఒక సీనియర్ వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, అది మర్చిపోయి తన కింద ఉన్నవారితో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తన ప్రవర్తనతో ఇతరులు బాధపడుతున్నారా అనేది కూడా ఆలోచించరు. ►పక్షపాతంతో పనిచేసే సహోద్యోగి: పై స్థాయిలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వారిని పొగుడుతుంటాడు. ఏదైనా నీ కోసం చేస్తాను అంటారు. ► రాజకీయాలు చేసేవాళ్లు: ఈ వ్యక్తులు తమ కెరీర్‌ను ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకోసం అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. అబద్ధాలు చెబుతుంటారు. అభద్రత పెంచే భయం నాయకత్వ పాత్రను పోషించాల్సిన సందర్భంలో అభద్రత పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అధికారుల అతిపెద్ద భయం అసమర్థతే అని ఒక సర్వేలో తేలింది. సీనియర్ స్థానానికి ప్రమోట్ అయినప్పుడు పనితీరుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. కలిసిపోవడానికి ముఖ్యమైనవి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడానికి సహాయపడేది ముందుగా మన దృష్టి కోణం. అందుకు ఎదుటివారికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి గురించి తప్పుగా అనుకోకూడదు. సహోద్యోగి ఎంత సన్నిహితమైనా మన స్థాయిని మర్చిపోకూడదు. నియంత్రణలపై దృష్టి పెట్టాలి. సహోద్యోగిని మార్చమని పై అధికారులకు చెప్పే బదులు మనం విభిన్నంగా ఏం చేయగలమో వాటిపైన దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో నేరుగా పనులు చేసే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఇ–మెయిల్ వంటి ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఒకరి దృక్పథాన్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే, సహోద్యోగి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వారు సహకరించకపోతే నేను మాత్రమే ఎలా పరిష్కరించగలను? ప్రతిదీ ప్రయత్నించాను.. కానీ, ఇప్పుడు ఎలా? ... ఇలాంటి ప్రశ్నలు కొన్ని సార్లు భయానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. పనిలో కష్టతరమైన సంబంధాలను కొనసాగించడానికి, వ్యక్తుల మధ్య మంచి బంధాలను పెంపొందించడానికి గెటింగ్ ఎలాంగ్ ఒక మంచి గైడ్‌లా ఉపయోగపడుతుంది. టీమ్ వర్క్ బాస్ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను గుర్తించాలి. సంవత్సరాంతపు లక్ష్యాలను చేధించడం, వర్క్‌పాలసీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఉద్యోగులపై ఉన్న అభద్రతా భావాలను తొలగించగలగాలి. పనిని ఉమ్మడిగా చేయడానికి ప్రయత్నించాలి. పై అధికారి దగ్గర సాధ్యమైనంతవరకు ‘మేము’ వాక్యాన్నే జోడించాలి. ఉదాహరణకు..‘ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేయడానికి ‘మేమంతా’ కష్టపడ్డాం. టీమ్‌గా ఇంకా బాగా కనిపించాలనే మేమంతా కోరుకుంటున్నాం’ అని విజయం సాధించినప్పుడు బాస్‌కు తెలియజేయాలి. పనిలో టీమ్ సహకారం ఎంత ఉందో తెలియజేయాలి. ఆఫీసులో స్నేహాలు ‘గెటింగ్ ఎలాంగ్ కోసం నేను న్యూరోసైన్స్, వ్యక్తుల హావభావాలలో చూపించే తెలివి, చర్చలు, మేనేజ్మెంట్ సైన్స్.. వంటి వివిధ అంశాల నుండి విషయ సేకరణ చేశాను. స్నేహితుల బృందాలు ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. సపోర్టివ్‌గా ఉండే సహోద్యోగులతో ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు. సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల సమాచారం, ఆలోచనలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం, సాధన పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాలు ఎలా ఉంటున్నాయో కూడా దీని ద్వారా అర్ధమవుతుంది. స్నేహాలు కెరీర్‌కు కూడా మంచివి. స్నేహితులుగా భావించే సహోద్యోగుల బృందాలు, వారి పనితీరుపై చేసే పరిశోధనలో ఎక్కువ ఉత్పాదకత వచ్చింది. – అమీ గలో -
పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– కిరణ్ అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – విజయశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ఈక్విటీల్లోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
వరల్డ్ ట్రామా డే.. ప్రతి ఏడాది 10 లక్షల మంది చనిపోతున్నారు
జీవితం అనిశ్చితం. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా ఏదో రోడ్డు ప్రమాదానికో గురై గాయాలు కావచ్చు. అనుకోకుండా మంటలు చెలరేగి చర్మం కాలవచ్చు. హఠాత్తుగా వర్క్ప్లేస్లోనో లేదా పెద్దవయసువారు బాత్రూమ్లోనో పడిపోయి, గాయం కావచ్చు. ఇలా అనుకోకుండా ప్రమాదం జరగడం, యాక్సిడెంటల్‌గా బాధలకు గురికావడాన్ని వైద్య పరిభాషలో ‘ట్రామా’ కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రమాదాలప్పుడు అనుసరించాల్సిన మార్గ్గదర్శకాలపై అవగాహన కోసం ప్రతి ఏడాదీ అక్టోబరు 17వ తేదీని ‘వరల్డ్ ట్రామా డే’గా నిర్వహిస్తుంటారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, అందించాల్సిన ప్రథమ చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లోనే ట్రామా కేసులెక్కువ. దీనివల్ల తలకు గాయాలు, ఎముకలు విరగడాలు వంటివి జరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డం వల్ల ఏటా 50 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రతి ఆరు సెకండ్లకు మరణం సంభవిస్తోంది. ఇలా మన దేశంలో ఏటా 10 లక్షల మంది మృతిచెందడంతో పాటు రెండు కోట్ల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. యువతలో సంభవించే మరణాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందేవారూ, అందునా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారే ఎక్కువ. యాక్సిడెంట్లలో లేదా పెద్ద వయసు కారణంగా తలకు గాయాలు, ఎముకలు విరగడాలు రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాల్లో తలకు గాయం కావడం మామూలే. పెద్దవయసు వారిలో మజిల్‌మాస్ తగ్గడం, కాళ్లలో స్పర్శజ్ఞానం మందగించడం, అకస్మాత్తుగా స్పృహ తప్పడం, అకస్మాత్తుగా బీపీ తగ్గిపోవడం, కొందరిలో పక్షవాతం, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి కారణాలతో పడిపోతే తలకు గాయాలు, ఎముకలు... ప్రధానంగా తుంటి ఎముక వంటివి విరగడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు. ముందుగా పరిశీలించాల్సిన లక్షణాలు... స్పృహ కోల్పోవడం ,ఫిట్స్ రావడం రెండు, అంతకన్నా ఎక్కువ వాంతులు కావడం ∙చెవి, ముక్కులోంచి రక్తం రావడం. ప్రమాదానికి ముందు మొదలుకొని 30 నిమిషాల లోపు జరిగిన సంఘటనలు గుర్తులేకపోవడం. తలకు గాయాలు తక్షణ సాయాలు ముందుగా అంబులెన్స్ ద్వారా పారామెడికల్ లేదా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి సహాయం అందాలి. ఆసుపత్రికి తీసుకొచ్చాక ఎమర్జెన్సీలోనే చికిత్స ప్రారంభం కావాలి. ఎందుకంటే మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం కష్టం కాబట్టి చికిత్స వీలైనంత త్వరగా అందాలి. రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపాలి. రోడ్డు ప్రమాదాలూ.. ప్రథమ చికిత్స సహాయం కోసం పిలవడం (కాల్ ఫర్ హెల్స్) : దీనివల్ల సమీప హాస్పిటల్‌కు బాధితుల్ని వీలైనంత త్వరగా తరలించడానికి వీలవుతుంది. దగ్గర్లోని ఆసుపత్రి వివరాలను, అంతకంటే ప్రధానంగా ఆంబులెన్స్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ∙సీన్ సేఫ్టీ : బాధితులను పక్కన చేర్చే సమయంలో అక్కడ సురక్షితంగా ఉందా అన్నది చూసుకోవాలి. ఉదా: ప్రమాద బాధితుల్ని రోడ్డు మధ్యన ఉంచడం కంటే ఓ పక్కగా తీసుకురావడం సురక్షితం. ∙తలను కదల్చకుండా ఉంచడం (హెడ్ ఇమ్మొబిలైజేషన్): తలను కదల్చకుండా ఉంచాలి. ఎందుకంటే... తలకు గాయాలైన సందర్భాల్లో మెడకూ, వెన్నుపూసకూ గాయాలైనప్పుడు, తలను కదల్చకుండా ఉంచడం వల్ల వెన్నుపూసలకు సంబంధించిన అనర్థాలను నివారించినట్లు అవుతుంది. ∙రక్తస్రావాన్ని అరికట్టడం : రక్తస్రావం జరగడం... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయాలకు దారితీసే ప్రధాన అంశం. అందుకే రక్తస్రావాన్ని అరికట్టడం... రోడ్డు ప్రమాద చికిత్సలో చాలా కీలకమైన అంశం. అందుకోసం చేయాల్సినవి... ∙రక్తస్రావానికి కారణమైన గాయం ఏదైనా ఉందేమో పరిశీలించాలి. గాయం కనిపిస్తే, దానిపై తగినంత ఒత్తిడితో రక్తస్రావం ఆగేలా చేయాలి. శుభ్రమైన గుడ్డ లేదా గాజుగుడ్డను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. గాయంపై శుభ్రమైన గుడ్డతో రెండు చేతులతో ఒత్తిడి కలిగిస్తూ పదినిమిషాలు అలాగే ఉంచాలి. టార్నికేట్ : ఒకవేళ పైన చెప్పినట్టు పదినిమిషాల పాటు ఒత్తిపట్టినా రక్తం ఆగకపోతే ఏదైనా గుడ్డతో గాయంపై రక్తం ఆగేందుకు గట్టిగా కట్టుకట్టి, అలా ఎంతసేపు కట్టి ఉంచారో వైద్య బృందాలకు తెలపాలి. అయితే ఇలా గట్టిగా ఒత్తిపట్టి ఉంచడమన్నది కాళ్లూ లేదా చేతుల విషయంలోనే జరగాలి తప్ప శరీర భాగాల్లోని మిగతా చోట్ల చేయకూడదు. కంటి గాయాలు కంటికి అనేక రకాలుగా గాయాలయ్యే అవకాశముంది. రైతులు పొలాల్లో, డొంకల్లో నడిచేప్పుడు ముళ్ల చెట్లు, తుప్పలు కంటికి కొట్టుకోవడం, ఇటుక, ఇసకలారీల్లోంచి పార్టికిల్స్ వచ్చి కళ్లలో పడటం, రాత్రి ప్రయాణాల్లో పురుగులు కళ్లకు కొట్టుకోవడం, వంటి ప్రమాదాలు జరిగి, కళ్లు గాయపడవచ్చు. ఇక పిల్లల విషయంలో బంతి / షటిల్‌కాక్ వేగంగా ఎగిరొచ్చి కంటికి ఢీకొనవచ్చు. పరిశీలించాల్సిన లక్షణాలు... ►కన్నునొప్పి, కంటివాపు ► కంట్లో ఏదైనా పడినట్లు (ఫారిన్ బాడీ) అనిపించడం ►మసగ్గా కనిపించడం,ఏమీ కనిపించకపోవడం అందించాల్సిన ప్రథమ చికిత్సలు పొలాల్లో మందు పిచికారి చేస్తున్నప్పుడు కంట్లో పడితే, దాని ప్రభావం తగ్గించడం కోసం నీళ్లతో కంటిని కడగాలి. ∙రోడ్డు ప్రమాణంలో ఫుల్ ఫేస్ హెల్మెట్ వాడాలి. ∙బంతి/షటిల్‌కాక్ కళ్లకు తగలగానే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ∙ఒక గ్లాసు నీళ్లు తీసుకుని, కన్ను ముంచి, రెప్పలను ఆడిస్తూ ఉండాలి. కొద్ది కొద్దిసేపటికి ఈ నీళ్లను మారుస్తూ ఉండాలి. ∙కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు కంటిని ఎట్టిపరిస్థితుల్లో నలపకూడదు. కాలిన గాయాలు... తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► గాయం కాగానే... కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. అలా కనీసం 10 నిమిషాల పాటు, మంట తగ్గేవరకు కడగాలి. ► కాలినప్పుడు బట్ట చర్మానికి అంటుకుంటే దాన్ని తీయకూడదు. డాక్టర్ మాత్రమే దాన్ని తొలగిస్తారు. ∙కాలిన గాయలపై ‘క్లింగ్ ర్యాప్’ (తినే పదార్థాలపై కప్పే ట్రాన్స్పరెంట్ షీట్)తో చుట్టడం గానీ లేదా కప్పడం గానీ చేయాలి. ► గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న నీళ్లనే వాడాలి. ఐస్ వాటర్ వద్దు. ∙కాలిన గాయం మందం... మన అరచేయి మందంలో సగానికంటే ఎక్కువగా ఉన్నప్పుడూ లేదా రసాయనాల వల్ల కాలిన గాయమైతే బాధితుల్ని వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాలి. ∙గాయాన్ని ఎప్పుడూ రుద్దకూడదు. ∙గాయాలపై పసుపు, పేస్టు, నెయ్యి వంటివి రాయకూడదు. డా.రాహుల్ కట్టా, ట్రామా కేర్ స్పెషలిస్ట్ -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. కొనే ముందు డాక్యుమెంట్లు.. స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి. లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్‌ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్‌కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి. ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి. బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. అలాట్మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‌కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‌కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్‌కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
అమెరికా సంబంధం అని పెళ్లిచేశారు..నెల తిరిగేసరికి విడాకుల నోటీస్
జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, శాకాహారి, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్‌కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్‌లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్‌లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్‌ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు.ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది. ► తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ► వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది. ► వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు. ► జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ► భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది. ► సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?
ఫ్లెక్సీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్.. ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– వెంకటరమణ మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య పెట్టుబడులను వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం పథకాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి రియల్ ఎస్టేట్ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్ రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లును ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకునే విషయం కాదు. పెట్టుబడిగా రియల్ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. మరో కోణం నుంచి చూస్తే.. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే క్రమం తప్పకుండా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా ఉండొచ్చు. అలా చూస్తే ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్ ఎస్టేట్ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి. -
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా? జెనెటికల్ కౌన్సెలింగ్ హెల్ప్ అవుతుందా?
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''వరుసకు అన్న అవుతాడు.. మా పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు.. ఏం చేయాలి''?
''నేను మా దూరపు బంధువుల అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అయితే అతను నాకు అన్న వరుస అవుతాడని ఈ మధ్యే తెలిసింది. ఈ విషయం తెలిశాక వాళ్లింట్లో వాళ్లు మా పెళ్లికి అభ్యంతరం చెప్తున్నారు. దాంతో ఆ అబ్బాయి కూడా భయపడుతున్నాడు. ఈ వరుస.. నిజంగానే మా పెళ్లికి ప్రమాదమా? దానివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందా''? దగ్గరి సంబంధంలోని పెళ్లిళ్లలో చాలాసార్లు జన్యుపరమైన వ్యాధులను చూస్తుంటాం. సేమ్ క్రోమోజోమ్ ప్యాటర్న్ దీనికి కారణం. రూపుదిద్దుకునే పిండంలో జెనెటిక్ మాల్ఫార్మేషన్స్ అవుతాయి. ఇలాంటి జంటలను సాధారణంగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఒకసారి జెనెటిక్ కౌన్సెలింగ్‌కి పంపిస్తాం. ఆ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో ఆ జెనెటిక్ రిస్క్ నిర్ధారణ అవుతుంది. కొన్ని పరీక్షల ద్వారా బిడ్డకు ఎలాంటి రిస్క్ ఉండవచ్చనేది కొంతవరకు కనిపెట్టవచ్చు. కానీ కొంతమందిలో తెలియకుండానే జెనెటిక్ రిస్క్ వల్ల అబ్నార్మల్ ఫీచర్స్ ఏర్పడతాయి. కొన్ని కేసెస్‌లో మూడవ నెల, అయిదవ నెల స్కానింగ్ ద్వారా కనిపెట్టవచ్చు. కొన్ని కేసెస్‌లో పుట్టిన తర్వాతే బిడ్డను డయాగ్నసిస్ చేయవచ్చు. డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్‌డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్‌కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్‌లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్‌డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
జీతం.. గీతం.. అదనపు ఆదాయం ఉందా? ఐటీ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి!
ఈ వారం ట్యాక్స్ కాలంలో పొరుగింటి మీనాక్షమ్మ మొగుడు పుల్లయ్యను చూడక తప్పదు. తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు. వగలే కాని నగలెప్పుడైనా కొన్నారా అని నిలదీసి అడిగిన ఆండాళమ్మకు మొగుడు .. పక్కింటి పుల్లయ్య చేసే వ్యవహారం బైటపెడతాడు. వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ.. తెలుసుకోవే.. అని. చంద్రయానం గురించి తర్వాత తెలుసుకుందాం. ‘‘చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి’’ ఇది నాటి పాట. ప్రస్తుతం మన కథలన్నీ ఆదాయపు పన్ను వారికి తెలిసిపోతున్నాయి. మూన్‌లైటింగ్ కాదు.. మూన్ చేజింగ్. కరోనా కాలంలో ఇంటివద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతో ఆదాయం సంపాదించారు. ఒక యజమాని దగ్గర పని చేస్తూ సంపాదిస్తూ, అదే సమయంలో మరో యజమాని దగ్గర చేస్తూ ఎడాపెడా రెండు చేతులా సంపాదించారు. ఇలా సంపాదించడంలో తప్పు లేదు ‘‘కష్టే ఫలి’’ అన్నారు. అలాంటి రాబడిని ఆదాయపు పన్ను వారికి చూపెట్టక పోవడమే తప్పు. 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా సంపాదించి వారు రిటర్నుల్లో ఆదాయాన్ని డిక్లేర్ చేయని వారికి తాఖీదులు వెళ్లాయి. ఈ విషయం ఎలా తెలిసింది? ఆదాయం ఆన్లైన్లో వచ్చింది. బ్యాంకులో జమయ్యింది. డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిగాయి. కొంత మంది ఆస్తులు కొన్నారు. కొంత మంది బ్యాంకు ఎఫ్డీలు, షేర్లు.. డిబెంచర్లలో ఇన్వెస్ట్మెంట్లు చేశారు. కొంత మంది విలాసవంతమైన వస్తువులు కొన్నారు. టూర్లు.. బార్లు.. కార్లూ.. కొంత మంది రుణాలను బుద్ధిగా తీర్చేశారు. విదేశాలకు పంపారు కొంతమంది. గూగుల్ పేమెంట్లు, పేటీఎంలు.. ఇలా ఎన్నో. మీకు పేమెంట్లు చేసిన యజమానులు ఎప్పటికప్పుడు వివరాలను డిపార్టుమెంటు వారికి తెలియజేస్తున్నారు. మీకు రాబడి .. వారికి ఖర్చు. ఆ ఖర్చులు క్లెయిమ్ చేయడం వల్ల ఆ కంపెనీలకు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆదాయపు పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి వాళ్లు అన్ని వివరాలు, ఖర్చులు, జమలు, లాభనష్టాలు, సమర్పిస్తారు. టీడీఎస్ పరిధిలోకి రాకపోయినా వివరాలు మాత్రం ఇచ్చి ఉంటారు. ఇది కాకుండా పుల్లయగారికి ‘‘గీతం’’.. అంటే లంచంగా భావించారు ‘‘సంబరాల రాంబాబు’’లో పాట రచయిత. లంచం తప్పు. చట్టరీత్యా నేరం. దాన్నీ ఆదాయంగా పరిగణిస్తారు. ఇదీ చదవండి: జీఎస్టీ రివార్డ్ స్కీమ్: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు ఎలా బైటపడాలి? లెక్కలన్నీ సక్రమంగా చూపించి, బుద్ధిగా పన్ను కట్టండి. మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పని చేసి, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యుల అకౌంటులో వేస్తే పన్ను భారం తగ్గుతుందేమో చెక్ చేయాలి. అలాంటప్పుడు పన్ను పరిధిలో లేని వారిని ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
ఇన్కమ్ ట్యాక్స్ అలర్ట్: ‘లక్ష’లో మీరున్నారా? కోరి కొరివితో పెట్టుకోకండి
ఆదాయపు పన్ను శాఖ వారు లక్ష మందికి నోటీసులు పంపారు. సాక్షాత్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎవరికి పంపించారంటే.. ప్రధానంగా మూడు రకాల వారికి.. 1. రిటర్నులు వేయని వారికి 2. ఆదాయం తక్కువ చూపించి రిటర్ను వేసిన వారికి 3.తప్పుడు సమాచారంతో రిటర్ను వేసిన వారికి పైన పేర్కొన్న వారందరికీ లక్ష నోటీసులు ఇచ్చారు. ఈ లక్షలో మీరున్నారా అనే ప్రశ్నకు జవాబుగా ‘మాయాబజార్’లో శర్మ–శాస్త్రిలాగా తాన–తందానలాగా ‘మేమా..మేమేం చేశాం’ ని కుదుటపడకండి. డిపార్ట్మెంట్ వారికున్న అధికారం ప్రకారం అవసరమైతే ఆరేళ్లు వెనక్కి వెళ్లి అసెస్మెంటుని ‘రీ–ఓపెన్’ చేయొచ్చు. ఇలా ఇప్పటికే 55,000 మంది విషయంలో అసెస్మెంట్ చేశారు. ఇప్పటికి 2023 మార్చి ఆఖరు నాటికి సంబంధించి అత్యధిక సంఖ్యలో రిటర్నులు వేసినప్పటికీ, వేసిన వాటిలో 70 శాతం రిటర్నులలో ట్యాక్సబుల్ ఇన్‌కం లేదు. ఏదో మొక్కుబడిగా వేసిన రిటర్నులు లేదా ‘ఈ సంవత్సరానికి అయిపోయింది’ అని చేతులు దులుపుకున్న బాపతు అన్నమాట. ముందుగా, వాళ్లు సేకరించిన సమాచారాన్ని బట్టి రూ. 50,00,000 ఆదాయం ఉన్న వారికి ... ఇలా ఉన్న వారిలో వేయని వారు, తక్కువ చూపించిన వారు, తప్పుగా చూపించిన వారిని ఎంచుకున్నారు. ఇవి ఏదో యధాలాపంగా, అనాలోచితంగా ఇవ్వలేదని, పస ఉన్న కేసులేనని ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఘంటాపథంగా చెప్పారు. ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇవి కాకుండా 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాని వేతన జీవులకు నోటీసులు పంపుతున్నారు. ఇవి ఎటువంటివి అంటే.. 1. ఇంటద్దె అలవెన్సు 2. లీవ్ ట్రావెల్ అలవెన్సు 3. ఇంటి రుణంపై వడ్డీ 4. మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు 5. సెక్షన్ 80 కింద చెల్లింపులు 6. పెట్టుబడులు 7. సేవింగ్స్ 8. పిల్లల స్కూలు ఫీజులు చాలా మంది ‘‘ఏమీ అడగరులే’’ అని దొంగ క్లెయిమ్‌లు చేస్తున్నారు. కొంత మంది దొంగ రశీదులు, బిల్లులు పెడుతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఇల్లు ఉంటే అద్దె చెల్లించకుండా అద్దె చెల్లించినట్లు క్లెయిమ్ చేస్తున్నారు. దయచేసి తప్పుగా/లేనిదాన్ని క్లెయిమ్ చేయకండి. అన్ని చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయండి. ప్రతి దానికి కాగితం, డాక్యుమెంటు, రుజువులు, బిల్లులు, వోచర్లు, బ్యాంకు స్టేట్మెంట్లు, బ్యాంకు సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలు.. ఇవన్నీ మూడో వ్యక్తి నుంచి.. అంటే ఎక్స్టర్నల్ నుండి పొందండి. దీన్నే ‘‘ఎవిడెన్స్’’ అంటారు. జాగ్రత్తపడండి. కోరి కొరివితో పెట్టుకోకండి. -
పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గాలు?
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – భానుశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ పెద్దింటి అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు నిజంగా మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది.