Sagubadi
-
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్‌గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్‌్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్‌లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్‌ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్‌పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్‌లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్‌తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్‌టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్‌లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్‌కు అనుగుణంగా బెంచ్‌లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్‌ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి దోహదం!
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.అర్బన్ అగ్రికల్చర్.. అంటే? నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. నాణానికి అవతలి వైపు..అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు. తాజా పోషకాహారం లభ్యతపోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్‌ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు. -
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు
గాక్ ఫ్రూట్.. అత్యంత ఖరీదైన పండు. మనకు కొత్త పంట. కానీ, అనేక దక్షిణాసియా దేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఎన్నెన్నో ΄ోషకాలు, ఔషధ గుణాల గని ఈ అద్భుత పండు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయుక్తమైన పండ్ల జాతి గాక్. కేరళ, కర్ణాటకలో అతికొద్ది మంది ఇంటిపంటగా సాగు చేస్తున్న ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పెరట్లో సాగు చేస్తూ.. కిలో రూ. 500కు విక్రయిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంటిపంటగా, వాణిజ్య పంటగా సాగు చేసుకోదగిన ఈ కొత్త పంటపై ప్రత్యేక కథనం. బొరగం వెంకట్ బీటెక్ చదువుకొని పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకే అయితే పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదైనా మంచి కొత్త పంటను మన ప్రజలకు పరిచయం చేయాలన్న తపనతో ఇంటర్నెట్ సహాయంతో లక్షణమైన గాక్ ఫ్రూట్‌ను సాగు చేయనారంభించారు. వెంకట్ స్వస్థలం ఏలూరు జిల్లా పోలవరం మండలం లోని మామిడిగొంది గ్రామం. గాక్ ఫ్రూట్‌ను కేరళలో కొందరు సాగు చేస్తుండటాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వెంకట్, మొక్కలు తెప్పించి తన ఇంటి పెరట్లో 2023 నవంబర్ నెలలో నాటారు. సుమారు 300 మొక్కల్ని నాటి, పందిరి పైకి పాకించారు. ఇందులో కొన్ని ఆడ, మగ మొక్కలు కలిసి ఉన్నాయి. చాలా ఏళ్లపాటు పండ్ల దిగుబడిని ఇవ్వటంతోపాటు.. ఏడాది పొడవునా పండ్లను అందించే అద్భుత తీగజాతి పంట ఇది. అవగాహన లోపం వల్ల మొక్కల్ని దగ్గరగా నాటటం వల్ల కొన్ని మొక్కలు చనిపోయాయని, ప్రస్తుతం 120 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని వెంకట్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. రెండు నెలల క్రితం నుంచి చక్కని ఎర్రటి పండ్ల దిగుబడి తీసుకుంటున్నానని, ఎంతో ఆరోగ్యకరమైన ఈ పండ్లకు చాలా గిరాకీ ఉందని వెంకట్ తెలి΄ారు. గాక్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్న ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కిలో పండ్లకు రూ. 500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా చెప్పారు. ఒక్కో పండు అరకేజీ వరకు బరువు పెరుగుతోంది. ప్రతి రెండు ఆడ మొక్కల పక్కన ఒక మగ మొక్కను నాటుకోవాలని, 6“6 అడుగుల దూరంలో నాటుకొని పందిరి వేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు ఏడాది పొడవునా నిరంత రాయంగా పండ్ల దిగుబడి వస్తూ ఉంటుందన్నారు. దీని తీగలు ఎంత విస్తారంగా పెరిగే వీలుంటే అన్ని ఎక్కువ పండ్ల దిగుబడి వస్తుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నారు. ఆకాకర జాతికి చెందిన గాక్ ఫ్రూట్ పైన కూడా నూగు ఉంటుంది. లోపల గుజ్జుతో ΄ాటు గింజలు ఎక్కువగానే ఉంటాయి. గింజల్ని తీసేసి గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే పోషకాల లోపం తగ్గి΄ోతుందని, జబ్బులు సైతం తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. గాక్ ఫ్రూట్ పూలకు కృత్రిమంగా చేతులతో పరపరాగ సంపర్కం చేస్తే అధిక పండ్ల దిగుబడి వస్తుందని, సహజంగా జరిగితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని వెంకట్ వివరించారు. గాక్ ఫ్రూట్ పువ్వు రెండు నెలల్లో పిందె నుంచి పండు దశకు పెరుగుతుంది. రంగులు మారుతుంది. పిందె పడిన తొలి నెలలో ఆకు పచ్చగా ఉంటుంది. ఈ దశలో ఈ కాయలను గోకాకర మాదిరిగానే కూరవండుకొని తినొచ్చు. దోస కాయ మాదిరి రుచి ఉంటుందన్నారు. రెండో నెలలో మొదటి పది రోజుల్లో పసుపు పచ్చ రంగుకు మారుతుంది. 20 రోజులకు నారింజ రంగులోకి మారి, 30 రోజులకు ఎర్రగా మారుతుంది. పండు పండిన తర్వాత త్వరగా మెత్తబడి పోతుందని వెంకట్ వివరిస్తున్నారు. విత్తనాలు నల్లగా ఉంటాయి. యూట్యూబ్ ద్వారా వెంకట్ దగ్గర ఈ కొత్త పంట సాగవుతున్నట్లు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన శాఖ అధికారులను పంపారు. పండ్లతో పాటు కొన్ని మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా సాగు చేయించటం ప్రారంభించారు. గాక్ ఫ్రూట్ పోషక విలువలతో కూడిన పంటని, దీన్ని సులువుగా తీగ ముక్కలను కత్తిరించి నాటుకోవచ్చని వెంకట్ ఇంటిపంటను పరిశీలించిన ఉద్యానాధికారి సందీప్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. ఇది చీడపీడలు ఆశించని పంటని, సాగు చేయటం కూడా సులువేనని అన్నారు. ఇద్దరు రైతులతో తాము ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామన్నారు. వియత్నాం, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో చిరకాలంగా సాగులో ఉన్న గాక్ ఫ్రూట్‌ను అనాదిగా సందప్రదాయ వైద్యంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని యూనివర్సిటీ సైన్స్ మలేషియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైకోపెన్, బీటా కెరోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల కేన్సర్, అల్సర్లు, కంటి సమస్యలు తదితర జబ్బుల్ని నయం చేసే విశేష ఔషధ గుణాలు గాక్ ఫ్రూట్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా జర్నల్ ఆఫ్ క్రాప్సైన్స్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలకు గాక్ ఫ్రూట్ ముడిసరుకుగా ఉపయోగపడుతున్నందున వాణిజ్యపరమైన విలువ కలిగి ఉండటం మరో విశేషం. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్కిలో రూ. 500కు అమ్ముతున్నామన ప్రాంతానికి ఓ మంచి కొత్త పంటను పరిచయం చేయాలనే తపన నాకుండేది. ఇంటర్నెట్లో గాలిస్తుండగా గాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. కేరళలో ఒకరి దగ్గరి నుంచి మొక్కలు తెప్పించి నాటా. 20 సెంట్ల నా పెరటి తోటలో గాక్ ఫ్రూట్స్ వారానికి 10–15 కిలోల వరకు పండుతున్నాయి. కూరకు ఉపయోగపడే పచ్చి గాక్ కాయలను కిలో రూ. 300కు అమ్ముతున్నా. కేరళలో కిలో రూ. 1,000 – 1,500 వరకు అమ్ముతున్నారు. గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొదించటంతో పాటు.. షుగర్, కేన్సర్ వంటి జబ్బుల్ని కూడా నయం చేస్తుంది. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వాళ్లు ముందే బుక్ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. మొక్కలు కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. – బోరగం వెంకట్ (77999 11174), గాక్ ఫ్రూట్ సాగుదారు, మామిడిగొంది, పోలవరం మండలం, ఏలూరు జిల్లా -
ముళ్లు లేని బ్రహ్మజెముడుతో బయోగ్యాస్!
ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్ లెస్ కాక్టస్) పంటను కరువు ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ పశుగ్రాసం కోసం సాగు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు దీనితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్కల్ని తీవ్ర కరువు పరిస్థితుల్లో.. నిస్సారమై వ్యవసాయానికి పనికిరాని భూముల్లో (మన దేశంలో వ్యవసాయ భూమిలో 40శాతం ఇప్పటికే నిస్సారమై సాగు యోగ్యం కాకుండా΄ోయిందని అంచనా) కూడా సాగు చేయొచ్చు. ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా అడుగులు వేశారు కూడా. అయితే, బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం వాడుతున్న పశువుల పేడకు బదులు పాక్షికంగా బ్రహ్మజెముడు మొక్కల్ని వాడొచ్చని తాజాగా రుజువైంది. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఆవిష్కరణ కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మజెముడుతో బయోగ్యాస్‌పై పరిశోధన జరుగుతోంది. కరువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశువుల పేడతో బయోగ్యాస్ ద్వారా 65% బయోమీథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పేడపై ఆధారపడటం తగ్గించి బ్రహ్మజెముడును వాడుతున్నారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్ ఉమ్మడిగా ఝాన్సీలో పరిశోధనలు చేపట్టాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్క ఆకులను పశుగ్రాసంగా, çపర్యావరణహితమైన తోలు ఉత్పత్తులకు ముడిసరుకుగా, బయోగ్యాస్ ఉత్పత్తితో ఇంధనంగా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బ్రహ్మజెముడు స్లర్రీని సేంద్రియ ఎరువుగా, ఈ చెట్టు పండ్లు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. ఈ పండ్లను అనేక దేశాల్లో ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా ఇష్టంగా తింటారు. బ్రహ్మజెముడు ఆకుల గుజ్జుతో పాటు కొంతమేరకు పేడను కలిపి చేసిన బయోగ్యాస్ ప్రయోగాత్మక ఉత్పత్తిలో 61% వరకు మీథేన్ కంటెంట్‌ను సాధించడం విశేషం. దీంతో ఇది వాణిజ్యపరంగా లాభదాయకమైనదేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిప్ ద్వారా నీటిని అందించటం, ఎరువుల వాడకం ద్వారా ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట ఉత్పాదకతను పెంచే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక్కో బ్రహ్మజెముడు మొక్క ఏడాదికి 69 కిలోల బొగ్గుపులుసు వాయువును గ్రహిస్తుందట. రైతులకు కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇదీ చదవండి : గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ!
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్‌తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్‌ఆర్‌కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇటీవల రూపొందించింది.మార్కెట్లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది. ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్పిఓలు/ కోఆపరేటివ్లు కృషి చెయ్యాలి. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
సేంద్రియ సాగు, ప్రాసెసింగ్‌పై 3 రోజుల శిక్షణ
ప్రకృతి/ సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు పంట దిగుబడులకు విలువ జోడింపు ద్వారా అధికాదాయం పొందటం వంటి అంశాలపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నాబార్డు సహకారంతో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రోన్ల వాడే పద్ధతులు, యంత్రపరికరాలతో సులువుగా వ్యవసాయ పనులు చేసుకోవటంపై కూడా శిక్షణ ఇస్తారు. ఏపీలోని 30 మంది రైతులకే ఈ అవకాశం. వసతి, భోజన సదుపాయం ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచిన రైతులు 97053 83666/ 90739 73999కు ఫోన్ చేసి తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్‌గా, ఫంగిసైడ్‌గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
వర్షాధార భూముల్లో.. అధిక దిగుబడినిచ్చే.. సరికొత్త బీటీ పత్తి సూటి రకం!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో 2023–24 సీజన్లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర -
కుంకుడు తోట.. ఎకరానికి రూ.13 లక్షలు!
ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల నిర్వహణ ఖర్చుతో ఈ ఆదాయం పొందటం విశేషం. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటి అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. సరికొత్త కుంకుడు వంగడాన్ని రూపొందించటంతో ΄ాటు కుంకుడు పొడితో సబ్బులు, టూత్‌పేస్టులు తయారు చేస్తున్నారు. కుంకుడు కాయల పొడిని సేంద్రియ పురుగుమందుగా, గ్రోత్ ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా కూడా వాడొచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు. రైతు శాస్త్రవేత్త పద్మారెడ్డి సుసంపన్న అనుభవాలు రైతులకు చక్కని వ్యవసాయ, వ్యా΄ార ΄ాఠాలుగా నిలుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు.నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్టప్రాంత రైతు చేసిన ప్రయోగం అబ్బుర పరిచే ఫలితాలనందిస్తోంది. డిగ్రీ చదువుకున్న పద్మారెడ్డి(59) వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. గతంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పట్టు సాధించారు. ఆయన భార్య శోభారాణి స్వగ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. తన ఊరి వారు, మిత్రులు కుంకుడు మొక్కల తోట చూసి నీకేమైనా పిచ్చా? కుంకుడు చెట్లు చేలో ఒకటో రెండో వేసుకుంటే చాలు. ఎవరైనా ఏకంగా 12 ఎకరాల్లో ఇలా తోట ఎవరైనా పెడతారా పటేలా? అని ఎగతాళి చేశారు. కానీ తన ఆలోచన వేరు. తాను వేరే ఏ తోట పెట్టినా ఆ తోటను బతికించుకోవటానికి తగినంత నీరు లేదు. కుంకుడు చెట్లయితే నీరు పెట్టాల్సిన పని లేదు. మొండి చెట్టు కాబట్టి బతికి పోద్దిలే అన్నది పద్మారెడ్డి ఆలోచన. ఆ చెట్లు పెరిగి మంచి కుంకుడు కాయల దిగుబడి ఇస్తుండటంతో ఆయన ఆలోచన ఎంత ముందుచూపుతో కూడినదో అందరికీ అర్థం అవుతున్నది.8 లక్షల ఎకరాలకు విత్తనాలు..33 ఏళ్ల చెట్టు ఏటా 100 కిలోల కాయలు కాస్తోంది. ఎకరానికి పది వేల కిలోల దిగుబడి. గత సీజన్లో కిలో రూ. 130 చొప్పున అమ్మితే ఎకరానికి రూ. 13 లక్షల ఆదాయం వచ్చిందని పద్మారెడ్డి తెలి΄ారు. ఆనోటా ఈనోటా తెలుసుకున్న అనేక రాష్ట్రాల రైతులు సుమారు 4 లక్షల మంది ఇప్పటికి సందర్శించారు. 8 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలు అమ్మానని, వారిలో చాలా మంది కుంకుడుతోటలు సాగు చేస్తున్నారన్నారు. కాబట్టి, భవిష్యత్తులోనూ ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోలేమని ఆయన స్పష్టం చేశారు. విస్తీర్ణం పెరిగి భవిష్యత్తులో కుంకుళ్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుందన్నారు. ఎంత తగ్గినా, ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎకరానికి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా అయితే ఆదాయం రాదని పద్మారెడ్డి చెబుతున్నారు.కొత్త వంగడం నమోదుకు యత్నాలు..దేశంలోనే అరుదైన ఒక అద్భుత కుంకుడు వనంగా పద్మారెడ్డి తోట గుర్తింపు పొందింది. అనేక రాష్ట్రాల నుంచి రైతులు, అధికారులు ఇప్పటికి లక్షలాది మంది తన తోటను సందర్శించారని ఆయన సంతోషంగా చె΄్పారు. 12 ఎకరాల్లో 1200 కుంకుడు చెట్లను 31 ఏళ్లుగా సాగు చేస్తున్న పద్మారెడ్డి తోటలో 3–4 రకాల కుంకుడు రకాలు ఉన్నాయి. వీటిలో 63 చెట్లు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన గుర్తించారు. మెరుగైన చెట్లను ఎంపిక చేసి సరికొత్త కుంకుడు వంగడాన్ని ఆయన రూపొందించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు పద్మారెడ్డి కుంకుడు క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు. దీనితో ΄ాటు జాతీయ స్థాయిలో దీన్ని సరికొత్త రైతు వంగడంగా అధికారికంగా గుర్తింపు తెప్పించేందుకు దరఖాస్తు చేయటంలో పద్మారెడ్డికి ఉద్యాన వర్సిటీ తోడ్పాటునందిస్తోంది. పిజెటిఎస్ఎయు క్వాలిటీ కంట్రోల్ ప్రయోగశాలలో పద్మారెడ్డి కుంకుడు కాయలపై పరీక్షలు జరిపించారు. ఇందులో అద్భుత ఫలితాలు రావటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.ఒక్కసారి నాటి, మూడు/ నాలుగు సంవత్సరాలు వాటిని కా΄ాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అనుభవాలు చాటి చెబుతున్నాయి. పెద్ద కమతాలు ఉండి, సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.20×20 దూరంలో నాటాలి..కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. 20“20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్‌తో నీటిని అందించాలి. రెండు కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొ΄్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. కుంకుడు మొక్క నాటి డ్రిప్ ఏర్పాటు చేసి, యాజమాన్య పద్ధతులు ΄ాటిస్తే నాలుగో ఏడాది నుంచి 20–30 కిలోల కాపుప్రారంభమవుతుంది. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుంది. నవంబర్–డిసెంబర్లో పూత వస్తుంది. ఏప్రిల్‌లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20–25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి.విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి!33 ఏళ్లుగా 12 ఎకరాల్లో కుంకుడు తోట సాగుచేస్తున్నా. ఏటా 1200–1300 క్వింటాళ్ల ఎండు కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నా. విత్తనాలు కిలో రూ. వెయ్యి, ఇప్పటికి 8 లక్షల ఎకరాలకు అమ్మా. ఇకపై కుంకుళ్లు అమ్మకుండా.. విలువ జోడించి అమ్మాలనుకుంటున్నా. కుంకుడు పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని జోడించి.. కిలో 170కి అమ్ముతున్నా. ఇది పంటలకు పురుగుమందుగా, గ్రోత్‌ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ పొడిని మరింత మెరుగ్గా తయారు చేసి.. బ్రాండ్ చేసి ప్యాక్‌చేసి మార్కెట్లోకి తేబోతున్నా. పండ్ల పొడిగా, టూత్‌పేస్ట్‌గా, కాళ్ల పగుళ్లకు మందుగా.. ఇలా అనేక రకాలుగా కూడా కుంకుడు ఉపయోగపడుతోంది. పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా. కుంకుడు చెట్లకు తేనెటీగలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. ప్రకృతికి కూడా ఈ తోట ఎంతో మేలు చేకూర్చుతోంది. – లోకసాని పద్మారెడ్డి (99481 11931), రైతు శాస్త్రవేత్త, పోలేపల్లి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా– నిర్వహణ: పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్‌లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్‌లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్‌లో బయోచార్‌పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్‌మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్‌షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్‌రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
Yarru Baparao: సేఫ్ ఫుడ్ సేనాని!
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు. ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.భావితరం కోసం...ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట!
రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పంట దిగుబడులు పండించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇండియా గుడ్ అగ్రికల్చర్ ్రపాక్టీసెస్ (ఐ.జి.ఎ.పి.– ఇండ్ గ్యాప్) మంచి ఫలితాలనిస్తున్నాయి. అనేక మంది రైతులు గ్యాప్ పద్దతులకు అనుగుణంగా ఆహార పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తూ, రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, అధిక పంట దిగుబడుల ఉత్పత్తి సాధించటం ఇండ్ గ్యాప్ పద్ధతిలో ముఖ్యమైన అంశం.తుంగభద్ర సేంద్రియ వ్యవసాయ ధాన్య విత్తన రైతుల పరస్పర సహాయ సహకార సంఘంలో సభ్యులైన రైతులు గ్యాప్ పద్ధతులను ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారు. 2023–24లో కర్నూలు జిల్లాలోని సీ.బెలగల్ మండలం కొండాపురం (రంగాపురం), గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గ్యాప్ పద్ధతులనుపాటిస్తూ బీపీటీ 5204 రకం వరి పంటను సాగు చేశారు. రైతులు ఒక్కొక్కరు అరెకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 24.09 హెక్టార్లలో గ్యాప్ పద్దతులకు అనుగుణంగా వరి పండించారు.గ్యాప్ నిబంధనల ప్రకారం వరి సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 10–15 రోజులకోసారి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించి రైతులకు గ్యాప్ పద్దతులపై అవగాహన కల్పించారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సి.బెలగల్ ఏవో మల్లేష్ యాదవ్, జిల్లా వనరుల కేంద్రం అధికారులు ప్రతి పొలంబడికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తూ వచ్చారు.కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని 50 మంది రైతుల్లో ప్రతి రైతు 100 శాతం గ్యాప్ పద్దతులుపాటించారు. నాట్లకు ముందు సామూహికంగా పచ్చి రొట్ట ఎరువు పంట సాగు చేసి, పూత దశలో పొలంలో కలిపి దున్నేశారు. ఎకరాకు 3–4 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారు. కొందరు రైతులు వేపచెక్క, వర్మీ కంపోస్టు కలిపి వేసుకున్నారు. పురుగుల బెడదను తగ్గించుకునేందుకు ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా రసాయనిక వ్యవసాయం చేసే రైతులు ఈ ్రపాంతంలో ఎకరానికి 6–8 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తూ ఉంటారు.గ్యాప్ పద్ధతిలో 4 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, అనుమతించిన కొన్ని పురుగుమందులను తగు మోతాదులో మాత్రమే ఉపయోగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట సాగు కాలంలో ఏపీ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అధికారుల బృందం మూడు దఫాలు పరిశీలించింది. వరి కోతలు పూర్తి కాగానే మూడు శ్యాంపుల్స్ సేకరించి గుంటూరులోని వ్యవసాయ శాఖ ల్యాబ్‌కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో రసాయనిక అవశేషాల ప్రభావం జీరో ఉన్నట్లు స్పష్టం కావడంతో సర్టిఫికేషన్ అథారిటీ ఈ సొసైటీ రైతులకు ఉమ్మడిగా ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్‌ను 2024 జనవరిలో జారీ చేసింది. ఆ తర్వాత రైతులు వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముకున్నారు.దిగుబడితో పాటు ధరా ఎక్కువే!అతిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ధాన్యం పండించిన రైతులు బియ్యం క్వింటాలు రూ.5,500 ప్రకారం విక్రయించుకుంటే, ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ పొందిన సహకార సంఘం రైతుల బియ్యానికి రూ.7,000 ధర లభించింది. మామూలుగా అయితే వరి సాగులో ఎకరాకు సగటున రూ. 45 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఇండ్ గ్యాప్ పద్ధతిలో ఖర్చు రూ.28 వేలు మాత్రమే. సగటున ఎకరాకు ధాన్యం దిగుబడి 2.51 క్వింటాళ్లు అదనంగా వచ్చింది. మొత్తం 50 మంది రైతులు 24.09 హెక్టార్లలో 102.9 టన్నుల దిగుబడి సాధించి రూ. 71 లక్షల ఆదాయం పొందారు. సాధారణ రసాయనిక వ్యవసాయ రైతులతో పోల్చితే ఇది రూ. 14.4 లక్షల అధికం కావటం విశేషం. ఈ స్ఫూర్తితో తుంగభద్ర సహకార సంఘం రైతులు ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు కొనసాస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)నికరాదాయం పెరిగింది..8 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. నేను 2.75 ఎకరాల్లో ఇండ్ గ్యాప్ పద్ధతిలో వరి సాగు చేశాను. మిగతా పొలంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాధారణ పద్ధతిలోనే పండిస్తున్నాను. సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు చాలా ఏళ్లుగాపాటిస్తుండటంతో గ్యాప్ పద్ధతిని అనుసరించటం నాకు సులువైంది.వేప చెక్కను ఎక్కువగా వినియోగించడం, గో ఆధారిత పద్దతులుపాటించడం వల్ల పంట భూముల్లో సూక్ష్మ జీవులు విశేషంగా అభివృద్ది చెంది వరి పంట ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. కెమికల్స్ వాసన లేకుండా వరి పండించాను.మామూలుగా అయితే ఎకరాకు వరి సాగులో రూ.45–50 వేల వరకు పెట్టుబడి వ్యయం వస్తుంది. గ్యాప్ పద్ధతులుపాటించడం వల్ల ఎకరాకు రూ.28 వేలు చొప్పున 2.75 ఎకరాల్లో రూ. 77 వేలు ఖర్చయింది. 41 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. మిల్లింగ్ చేయగా 27 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. కర్నూలు తీసుకెళ్లి క్వింటా రూ.7,000కు అమ్మాను. క్వింటాకు రూ. వంద రవాణా ఖర్చు వచ్చింది. రూ.1.09 లక్షల నికరాదాయం వచ్చింది. మా సంఘంలోని 50 మంది రైతుల్లో క్వింటా బియ్యం రూ.7,500కి అమ్మిన వాళ్లూ కొందరు ఉన్నారు. ఈ ఏడాది కూడా గ్యాప్ పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నాం. – పి.మధుసూదన్‌రెడ్డి (94900 96333), రైతు, కొండాపురం, సీ.బెలగల్ మండలం, కర్నూలు జిల్లాఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం..ఇండ్ గ్యాప్ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులకు దేశంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దేశంలో అమలయ్యే గ్యాప్ పద్ధతులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యు.సి.ఐ.) ‘ఇండ్ గ్యాప్’ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం 2023–24 ఖరీఫ్ నుంచి ఏపీ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా ఈ ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ వ్యవస్థ రైతులకు దేశంలోనే తొలిగా అందుబాటులోకి తెచ్చింది. 2023–24లో ఏపీలోని ప్రతి జిల్లాలో పైలెట్ ్రపాజెక్టు కింద ఒక పంటను గ్యాప్ పద్ధతిలో పొలంబడిలో భాగంగా సాగు చేయించడం విశేషం.ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న అనేక సహకార సంఘాలు, ఎఫ్.పి.సి.లు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం ద్వారా ఇండ్ గ్యాప్ పద్ధతులను అనుసరించి లబ్ధిపొందటం విశేషం. విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా ఉత్పత్తులపై పరీక్షలు చేయించి రైతులకు ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. తద్వారా రైతులు మంచి మార్కెట్ ధరకు విక్రయించి మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. దిగుబడులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా క్రమంగా కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో సేంద్రియం వైపు మళ్లే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం గమనార్హం.ఇవి చదవండి: పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా? -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్‌లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్‌కు, కంప్యూటర్‌కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్‌సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్‌ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్‌తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్‌లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్‌లోని రిమోట్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్‌కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్‌సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్