-
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తాడిపత్రికి చెందిన దంపతులు ప్రతాప్ రెడ్డి (25), ప్రమీల(22), మరో మహిళ వెంకటలక్ష్మి (45) మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
మహిళా కానిస్టేబుళ్లపై టీడీపీ నేతల ప్రతాపం
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో కొంతమంది టీడీపీ నేతలు అధికారులు, సామాన్యులనే కాకుండా ఇప్పుడు మహిళా పోలీసులను సైతం బెదిరింపులకు గురిచేసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా ఆదివారం లింగాయపాలెం ఇసుక రీచ్‌కు వెళ్లే లారీలకు స్లిప్పులు రాస్తున్న మహిళా పోలీసులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు గొడవ పెట్టుకుని.. మీరేమైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనుకుంటున్నారా కుర్చీలు వేసుకుని ఇక్కడ ఏంటీ అంటూ.. కుర్చీలను తీసుకుని కంపచెట్లలోకి విసిరేశారు. పక్కనే ఉన్న ఎస్ఈబీ కానిస్టేబుల్ వారించేందుకు యత్నించినప్పటికీ అతనిని కూడా ఇష్టారీతిగా మాట్లాడడంతో.. డ్యూటీ ముగిసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సదరు మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ నాయకులకు వత్తాసుగా లింగాయపాలెం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడితో పాటు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూడా చూసీ చూడనట్లు పొమ్మని ఫోన్లు రావడంతో.. కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు టీడీపీ నేతల దురుసు ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
విషాహారానికి ముగ్గురు విద్యార్థులు బలి.. .. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అనకాపల్లి: ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరో 35 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు రాజగోపాలపురంలో పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన (పాసా) ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆశ్రమంలో శనివారం రాత్రి మిగిలిపోయిన బిర్యానీని తినడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ట్రస్ట్ నిర్వాహకుడు, పాస్టర్ ఎం.కిరణ్‌కుమార్ ఈ నెల 17న పందూరులో మధ్యాహ్నం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ మిగిలిపోయిన బిర్యానీని ఆశ్రమానికి తెచ్చి రాత్రి విద్యార్థులకు పెట్టారు. దాన్ని తిన్న విద్యార్థుల్లో ఐదుగురు అదేరోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తెల్లవారుజామున మరో 15 మంది అస్వస్థతకు గురవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. తల్లిదండ్రులతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. తీవ్ర అస్వస్థతతో ఇంటి దగ్గరే మరుసటి రోజు ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో 35 మందిని తల్లిదండ్రులు సమీపంలోని నర్సీపట్నం, పాడేరు ఏరియా ఆస్పత్రులకు, డౌనూరు, చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. నర్సీపట్నంలో చికిత్స పొందుతున్న 16 మందిలో 14 మంది ఆరోగ్యం విషమించడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.ప్రస్తుతం నర్సీపట్నం, పాడేరు, డౌనూరు, చింతపల్లి ఆస్పత్రుల్లో 21 మంది చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వారిలో కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలేనికి గెమ్మెలి నిత్య(భవాని)(8), చింతపల్లి మండలం తిరుమల పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన తంబెలి జాషువా(7), చింతపల్లి మండలం బలభద్రకు చెందిన కొర్రా శ్రద్ధ(7) ఆదివారం రాత్రి ఇంటి వద్దే మృతి చెందారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జెస్సికాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 13 ఏళ్లుగా అనధికారికంగానే..పాస్టర్ కిరణ్‌కుమార్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాసా ట్రస్టుకు ఎలాంటి అనుమతుల్లేవు. తొలుత అతను కోటవురట్ల మండలం హనుకు గిరిజన గ్రామంలో చర్చి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో గ్రామస్తులు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న 86 మందిలో 80 మంది అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులే.సంఘటన స్థలాన్ని సందర్శించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులతో విచారణకు ఆదేశించారు. పాసా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఉన్నతస్థాయి కమిటీ విచారణకు సీఎం ఆదేశించినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు.విద్యా సంస్థల తనిఖీలకు సీఎం ఆదేశంసాక్షి, అమరావతి: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఇతర విద్యా సంస్థల్లో పరిస్థితులను తనిఖీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారి పరిధిలోని ప్రయివేటు, చైల్డ్ కేర్ సెంటర్లను తనిఖీ చేయాలని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.విద్యార్థుల మృతి ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. -
రూ.300 ఎస్ఈడీ నకిలీ టికెట్లతో మోసం
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్‌ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆనందం.. అంతలోనే విషాదం
కొత్తపల్లి: రాఖీ కట్టడానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందిన సంఘటన కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన ఉప్పరపల్లి బలరామ్ కుమార్తె ఉప్పరపల్లి దేవి (11) అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. రాఖీ పౌర్ణమి కావడంతో దేవితో పాటు తన స్నేహితులు తిత్తి కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మిలు ఉప్పాడలో ఉన్న తమ బంధువులు ఇంటికి రాఖీ కట్టేందుకు వెళ్లారు. దేవి సోదరుడైన సంతోష్‌కు ఉప్పాడలో రాఖీలు కొనుగోలు చేసి తిరిగి ఆటోలో ఇంటికి బయలు దేరారు. ఉప్పాడ– కోనపాపపేట రోడ్డులో కొత్తమూలపేట సమీపంలోని రొయ్యల శుద్ధి పరిశ్రమ దగ్గరలోకి రాగానే ఎదురుగా వచ్చిన లోడు ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవి సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఆటోలో ప్రయాణిస్తున్న కస్తూరి, నాగవల్లి, దుర్గ, లక్ష్మికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కస్తూరికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోడు ఆటో కోనపాపపేట నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే తన సోదరి వచ్చి రాఖీ కడుతుందనుకుంటున్న సోదరుడు సంతోష్‌కు విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవీ మృతితో కోనపాపపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించాయి. -
అనకాపల్లి: అనాథాశ్రమంలో ఫుడ్ పాయిజన్.. నలుగురు పిల్లలు మృతి
అనకాపల్లి, సాక్షి: వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్.. నలుగురు చిన్నారుల్ని బలిగొంది. మరో 27 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కైలాసపట్నంలోని ఓ ఆశ్రమంలో 60 మంది విద్యార్థులు.. ఓ ఆర్గనైజేషన్ ద్వారా ఉచిత వసతితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎం. కిరణ్ కుమార్ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. అయితే.. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు.. పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ డిఈఓ పెన్నాడ అప్పారావు, ఎంఈఓ పి రామారావు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ముండ్లమూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొద్దాల బుచ్చిబాబు (40) సముద్రంలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చిబాబు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు.కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సెలవులు కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకొంటున్నారు. -
మహిళా ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై.. అధికార పార్టీ నేతల దాడి
సాక్షి, టాస్‌్కఫోర్స్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై టీడీపీ నేతలు దాడిచేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నా వారధి సమీపంలో జరిగింది. నార్త్ ట్రాఫిక్ ఎస్సై గీతా రమ్య.. హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణతో కలిసి ఆదివారం సాయంత్రం ఆమె రంగనాయకులపేట పెన్నా వారధికి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. సంతపేట ప్రాంతానికి చెందిన మహేష్ ఫూటుగా మద్యం తాగి ఆ మార్గంలో ఆటో నడుపుతుండగా ఎస్సై అతనిని ఆపి పరీక్ష చేసి కేసు నమోదు చేశారు. ఆటోను పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా డ్రైవర్ అడ్డుకున్నాడు. ఆటోను ఎలా తీసుకెళ్తారంటూ తన స్నేహితులకు ఫోన్‌చేశాడు. అయినా, ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ తాడు సాయంతో ఆటోను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా మహేష్ మళ్లీ అడ్డుకున్నాడు. ఇంతలో టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు, అతని సతీమణి కప్పిర రేవతి తమ అనుచరులతో అక్కడికొచ్చి పోలీసులపై దాడిచేసి గాయపరిచారు. అదే సమయంలో అక్కడున్న ప్రవీణ్ అనే వ్యక్తి దాడి ఘటనను వీడియో తీస్తుండగా అతన్ని కూడా టీడీపీ నేతలు మూకుమ్మడిగా చితకబాదారు. ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో కప్పిర దంపతులూ గాయపడ్డారు. ఇరువర్గాలు సంతపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ట్రాఫిక్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ప్రవీణ్ జీజీహెచ్‌లో చేరారు. కప్పిర దంపతులు తొలుత జయభారత్ ఆస్పత్రి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రిలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదులపై సంతపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆశలు మునిగి.. కన్నీళ్లు మిగిలి
మొదలే సెలవు దినం కావడంతో ఓ తల్లి, తనబిడ్డలను పొలం వద్దకు తీసుకెళ్లింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడే గడిపారు. ఉన్న రెండు ఆవులను పిల్లలతో కలిసి మేపుకుని, పొద్దుగూకడంతో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆవులకు దాహం వేయడంతో పక్కనే ఉన్న ఫాంపండ్ గుంతలోకి పరుగులు తీశాయి. వాటి పగ్గాలు పట్టుకున్న చిన్నారిని ఈడ్చుకెళ్లడంతో గుంతలో పడిపోయింది. కుమార్తెను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా గుంతలోకి దిగి నీటమునిగి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన చౌడేపల్లెలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.చౌడేపల్లె: ఫాంపండ్ గుంతలో పడి తల్లీ బిడ్డ మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, కాటిపేరి పంచాయతీ, కాటిపేరి గ్రామానికి చెందిన కుమార్‌రెడ్డికి రామసముద్రం మండలం, కొండూరుకు చెందిన కె.మౌనిక (32)తో వివాహమైంది. ఈమె మదనపల్లె సెబ్ లిక్కర్ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పుంగనూరు పట్టణంలోని షాపులు, బోయకొండ వద్ద ఉన్న మద్యం షాపులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇద్దరు పిల్లలు అనీషారెడ్డి(07), తనీష్‌రెడ్డి(05)తో కలిసి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పాడి ఆవులను ఉదయం నుంచి సాయత్రం వరకు సమీపంలోని గిరిజాపురానికి వెళ్లే మార్గంలో మేపుకుంటూ సాయంత్రం ఇంటికి బయలు దేరారు. ఓ రైతు పొలంలో ఉన్న నీటిని చూసిన ఆవులు గంతేస్తూ నీటి వద్దకు పరుగులు తీశాయి. అనీషారెడ్డి పట్టుకున్న ఆవు తాడుతోసహా ఈడ్చుకుంటూ ఫారంపండ్ గుంతలో పడేసింది. దీన్ని గమనించిన తల్లి మౌనిక ఆ గుంతలోకి దిగి బిడ్డను కాపాడే ప్రయత్నం చేసి నీటమునిగిపోయింది. మరో బిడ్డ తనీష్‌రెడ్డి వారి చూస్తూ గట్టుపైనే వెక్కిళ్లు పెడుతుండడంతో అటుగా వచ్చిన స్థానికులు గమనించి గుంతలో దిగి తల్లీబిడ్డను బయటకు తీశారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతిచెందడంతో ఒక్కసారిగా విషాదం అలముకుంది. బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రూ.4 లక్షల ఖరీదైన బైక్ చోరీ
పెద్దాపురం: స్థానిక బ్యాంక్ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్ కింగ్ ఓపెరా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆర్అండ్బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్ యథావిధిగానే పార్క్ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టీడీపీ నేత హత్యకేసు: వెలుగులోకి దారుణ నిజాలు
కర్నూలు జిల్లా: టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాసులను సొంత పార్టీ వారే దారుణం హత్య చేసినట్లు విచారణలో తేలింది. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయ బయటపడింది. టీడీపీలో శ్రీనువాసులకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ హత్యను వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్, హత్య వెలుగులోకి రాగానే వైఎస్సార్సీపీ చేసిందంటూ ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది.శ్రీనివాసులను హత్య చేసిన వారు సొంత పార్టీ నాయకులే కావడంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటన ఆగస్టు 14 తేదీన చోటు చేసుకోగా, నేడో-రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. -
ఏలూరులో మహిళపై సామూహిక అత్యాచారం
ఏలూరు టౌన్: కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఏలూరులో ముగ్గురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భర్తను చితక్కొట్టి.. భార్యను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆ మృగాళ్ల ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. పోలీసులు వెంటనే స్పందించకపోవడం, ఘటన వివరాలు ఓ వ్యక్తి వెంటనే తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే.. కూటమి సర్కారులో మహిళలకు భద్రత కరువైందన్న దానికి తార్కాణంలా ఈ ఘటన నిలుస్తోంది.భర్త ఫిర్యాదుతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ఏలూరు జీజీహెచ్‌లో వైద్యచికిత్స అందిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన వివరాలు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలానికి చెందిన భార్యాభర్తలు జీవనోపాధి కోసం 20 రోజుల క్రితం ఏలూరు నగరానికి వచ్చారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ హోటల్లో పనికి కుదిరారు. రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న ఆధ్యాతి్మక వేదిక రామకోటిలో నిద్రపోయి.. ఉదయం లేచి పనులకు వెళుతున్నారు. జీతం వచ్చాక అద్దె ఇల్లు కూడా తీసుకోవాలని భావించారు. వీరు ఇలా జీవించడం చూసిన ముగ్గురు జులాయి యువకులు కొద్ది రోజులుగా భర్తతో స్నేహంగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు భర్తకు మద్యం తాగించారు. అతను మత్తులో మునిగి నిద్రపోగా.. అతని భార్య (35)ను అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయగా.. మెలకువ వచి్చన భర్త వారిని అడ్డగించాడు. యువకులు బలమైన కర్రతో భర్త కాళ్లను చితక్కొట్టారు. అనంతరం మహిళను సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె ముఖంపైనా బలంగా కొట్టారు. పోలీసుల అలసత్వం కాళ్లపై బలంగా దెబ్బతిన్నా.. భర్త రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరిచాడు. సినిమా చూసి అటుగా వెళుతున్న బాలాజీ అనే యువకుడు ఇది గుర్తించి డయల్ 100కు ఫోన్ చేయగా సిబ్బంది పట్టించుకోలేదు. చేసేది లేక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు వెంటనే స్పందించకుండా ఆలస్యం చేశారు. పోలీసులు వెంటనే స్పందించకపోవడంతో బాలాజీ.. తన స్నేహితులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లాడు. వీరు వెళ్లాక నిందితులు ముగ్గురూ బాధిత మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏలూరు వన్‌టౌన్ గజ్జవారి చెరువు వద్ద బిట్టు బార్ ఎదురుగా రోడ్డుపై నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జులాయిగా తిరిగే ఈ నిందితులు ఏలూరు టీచర్స్ కాలనీలో చెంచుకాలనీ రోడ్డు ప్రాంతానికి చెందిన నూతిపల్లి పవన్, లంబాడీపేట, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నారపాటి నాగేంద్ర, ఎంఆర్ఆర్ కాలనీ 13వ రోడ్డు ప్రాంతానికి చెందిన గడ్డి విజయకుమార్ అని పోలీసులు వెల్లడించారు. -
ఐదేళ్లలో అందరినీ చంపేస్తాం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరినీ చంపేస్తాం.. రోజు ఇళ్ల మీదకు వచ్చి కొడతాం. వైఎస్సార్సీపీ నా కొడుకులు ఎవడడ్డమొస్తాడో రమ్మను. ఒక్కొక్కరి అంతు చూస్తాం’ చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో శనివారం తెలుగుదేశం కార్యకర్తల హెచ్చరిక ఇది. మంత్రి అనగాని ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయులు రెచ్చిపోయి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గుళ్లపల్లిలో శుక్ర, శనివారాల్లో చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు అనుచరుడైన రిటైర్డ్ ఆర్మీ జవాను సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేసి, సంపత్‌కుమార్‌తో సహా ఐదుగురిని గాయపరిచిన వారు.. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వారందరినీ చంపేస్తామంటూ బెదిరించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ కార్యకర్త కుమార్ మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్త సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో రాళ్లతో ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. బూతులు తిట్టి వెళ్లిపోయారు. శనివారం 15 మందితో కలిసి కుమార్ మళ్లీ సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశాడు.ఒక్కసారిగా ఇంట్లోకిదూరి బూతులు తిడుతూ దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో సంపత్‌కుమార్, ఆయన బాబాయి గాలి శ్రీనివాసరావు, తమ్ముడు గాలి శివకృష్ణ, మరో ఇద్దరు గాయపడ్డారు. గాలి శ్రీనివాసరావు దవడకు పెద్ద గాయమైంది. సంపత్‌కుమార్‌కు ఎదపైన, పొట్టమీద గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత తెలుగుదేశం వర్గీయులు మరోసారి సంపత్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. దాడులు, ఆస్తుల ధ్వంసం బాధ్యతాయుతమైన మంత్రి అనగాని నియోజకవర్గంలో రెండు నెలలుగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ వారు దాడులు చేస్తున్నారు. ఆస్తులను «ధ్వంసం చేస్తున్నారు. బలహీనవర్గాలపై ఈ తరహా దాడులు పెరిగాయి. ఊళ్లు విడిచి వెళ్లకపోతే చంపేస్తామని మైకు అనౌన్స్మెంట్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఊరువదలి వెళ్లక పోతే చంపేస్తామని టీడీపీ మూకలు హెచ్చరించడంతో రెండునెలలు అజ్ఞాతంగా గడిపిన చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు నాలుగు రోజుల కిందట సొంత గ్రామం గుళ్లపల్లికి వచ్చారు.ఆయన రాగానే తెలుగుదేశం వర్గీయులు ఆయన అనుచరులపై దాడులకు దిగారు. ఇటీవల తమ ఇంటివద్ద అరుగుపై కూర్చుని ఉన్న వైఎస్సార్సీపీ నేతలు వాకా వెంకటేశ్వరరావు, వీరంకి శివయ్యలపై కర్రలతో దాడిచేసి కొట్టి గాయపరిచారు. కస్తూరివారిపేటలో ఆంధ్రప్రభ విలేకరి యనుముల వెంకటేశ్వరరావు ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. రాం»ొట్లవారిపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజేష్‌కుమార్ ఇంటిపై 30 మంది టీడీపీ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్, సర్పంచ్ల సంఘం నాయకుడు ప్రసాదరెడ్డిని గ్రామం వదలి పెట్టకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రసాదరెడ్డి గ్రామం వదలిపెట్టి వెళ్లిపోయారు. నగరం, నిజాంపట్నం తదితర మండలాల్లోను ఈ తరహా దాడులు పెరిగాయి. టీడీపీ మూకల దాడులు తట్టుకోలేక నియోజకవర్గంలోని వందలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లారు. స్పందించని పోలీసులు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నా పోలీసులు ఏ మాత్రం స్పందించడం లేదు. దాడుల గురించి తెలిసినా తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం వర్గీయుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి వద్దకు వెళ్లి మొక్కుబడిగా కేసు నమోదు చేస్తున్నారు. -
భర్త అనుమానం.. పెను‘మంటలై’..
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
చంద్రగిరిలో యధేచ్చగా గంజాయి రవాణా!
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో జోరుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. గాదంకి టోల్ ప్లాజా దగ్గర ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. అయితే స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డిక్కీలో నుంచి రెండు పార్సిల్స్ కింద పడ్డాయి. పోలీసులు వాటిని తనిఖీ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. అది రెండు కేజీల దాకా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కారు వెళ్లిన దృశ్యాలు నమోదు కాగా.. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
నరకం చూపాడని కొట్టి చంపారు!
మలికిపురం: ఎన్నో ఊసులు చెప్పాడు.. మరెన్నో ఆశలు కల్పించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని ఇంటి నుంచి తీసుకువెళ్లాడు.. తర్వాత నరకం చూపించాడు. గంజాయికి బానిసైన ఆ యువకుడు తన ప్రియురాలిని కూడా గంజాయి తాగమని బలవంతం చేసేవాడు. ఆ మత్తులో యువతిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. చివరికి ఆ బాధ భరించలేని ఆ యువతి ఆ యువకుడి చెర నుంచి తప్పించుకుని తన అన్న వద్దకు చేరుకుంది. జరిగిన విషయం చెప్పి విలపించింది. అక్కున చేర్చుకున్న యువతి సోదరుడు పథకం వేశాడు. నమ్మించి మోసం చేసిన ఆ యువకుడిని యువతి, సోదరుడు, అతని స్నేహితుడు కలసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాజోలులో సీఐ గోవిందరాజు వివరాలు వెల్లడించారు. ఆ ఆసక్తికర విషయాలు ఇలా.. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి, మలికిపురానికి చెందిన పడమటి నోయల్ జార్జి (19) ప్రేమించుకున్నారు. ఆరు నెలలు కాకినాడలో సహజీవనం చేశారు. నోయల్ మద్యం, సిగరెట్లు తాగుతూ, గంజాయికి బానిస అయ్యాడు. తనతోపాటు ప్రశాంతిని కూడా తాగమని ఇబ్బంది పెట్టి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీనిని తట్టుకోలేక ప్రశాంతి ఈ నెల 9న కాకినాడ నుంచి గుడిమెళ్లంకలో తన అన్నయ్య రాపాక ప్రకాష్ వద్దకు వచ్చేసింది. అక్కడ నోయల్ జార్జి బాధపెట్టిన విషయాలు చెప్పి విలపించింది.పథకం రచించి..తన చెల్లెలిని బాధ పెట్టిన నోయల్ జార్జిపై కక్ష తీర్చుకోవాలని రాపాక ప్రసాద్ పథకం రచించాడు. అతని స్నేహితుడైన రాజోలు గ్రామస్తుడు యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్, చెల్లి రాపాక ప్రశాంతితో కలిసి నోయల్ జార్జిని చంపేయాలని ప్లాన్ చేశాడు. 9న రాత్రి రాపాక ప్రశాంతి సెల్ నుంచి నోయల్ జార్జికి ఫోన్ చేయించి దిండి– చించినాడ బ్రిడ్జి వద్దకు రావాలని చెప్పించాడు. అక్కడి రాగానే ఇనుప రాడ్లతో నోయల్ జార్జిని కొట్టి చంపి బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి పడేశారు. నోయల్ జార్జి తీసుకువచ్చిన మోటార్ సైకిల్‌ను బ్రిడ్జి వద్ద పెట్టి అక్కడ నుంచి నోయల్ జార్జి అదృశ్యమైనట్లు సృష్టించి పారిపోయారు. రెండు రోజుల తర్వాత నోయల్ జార్జి తండ్రి పడమటి రత్నంరాజు తన కుమారుడి ఆచూకీ కోసం ఫిర్యాదు చేయగా మలికిపురం ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 12న నోయల్ జార్జి మృతదేహం అంతర్వేది పల్లిపాలెం అన్నాచెల్లెలు గట్టు సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాపాక ప్రసాద్, రాపాక ప్రశాంతి, యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ గోవిందరాజు వివరించారు. -
కూలీలను కబళించిన మృత్యు శకటం
కర్నూలు (హాస్పిటల్): వారంతా కూలీలు. వానలు కురవక.. చేద్దామంటే పనులు దొరక్క పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టిన కూలీల్లో ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆటోడ్రైవర్ సహా 17 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయం పడకేసింది. పనులు కూడా దొరకని పరిస్థితుల్లో కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్నారు. రోజులాగే గురువారం స్టీరింగ్ ఆటోలో 20 మంది కూలీలు తెలంగాణలోని ఉండవెల్లి మండలం కంచుపాడు బయలుదేరారు. ఆ ఆటోను కర్నూలు –హైదరాబాద్ హైవేపై జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద వెనుక నుంచి 20 టైర్లు గల భారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పైకెగిరి కింద పడింది. ఆటోలో ఉన్న లక్ష్మీదేవి (58) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన 19 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మూడు అంబులెన్సుల్లో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి అలియాస్ తెలుగు సుజాత (40) మృతి చెందింది. ప్రియాంక (18), అనిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు (40)తోపాటు లక్ష్మీదేవి (60), రాధ (40), మద్దిలేటి (50), వరుణ్‌కుమార్ (13), కె.వరలక్ష్మి (44), పద్మ (45), రమాదేవి (40), నందు (17), భాస్కర్ (47), పావని (25), లక్ష్మీదేవి (50), లక్ష్మీదేవి (50), చిట్టెమ్మ (60), వరలక్ష్మి(47)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ కిక్కిరిసిపోయింది. క్షతగాత్రులకు ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం డిమాండ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పనిచేసిన వారికి 11 నెలలైనా బిల్లులు రాకపోవడం వల్ల పొట్టకూటి కోసం వెళ్లి వారు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
భవిష్యత్తును చిదిమేసింది..
ఓబులవారిపల్లె : వేకువ జామున నిద్రలేచి హడావిడిగా పుస్తకాలు సర్ది.. తన గారాల పట్టిని ముస్తాబు చేసి స్కూల్ వ్యాన్‌లో కూర్చోబెట్టి టాటా చెప్పి మురిసిపోయిన ఆ తల్లి ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వ్యాన్ బయలు దేరిన ఐదు నిమిషాలకే తన బిడ్డ తనువు చాలించిందనే పిడుగుపాటు లాంటి వార్త ఆ తల్లి గుండెను పిండేసింది. దేవుడా ఎంత పనిచేశావు అంటూ ఆ మాతృమూర్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. ఓబులవారిపల్లె మండల కేంద్రానికి చెందిన వీరంరెడ్డి మధుసూధన్‌రెడ్డి, అరుణ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కుమార్తె భవిష్య(07), ఏడాది వయసున్న కుమారుడు వీరం రెడ్డి మోక్షజ్ఞ సాయికుమార్‌రెడ్డి ఉన్నారు. ఎంతో చలాకీగా ఉండే భవిష్య చిన్నఓరంపాడు అయ్యలరాజుపల్లె శ్రీవాణి హైస్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ప్రతి రోజు మాదిరిగా సోమవారం ఉదయం పాఠశాలకు వ్యాన్‌లో బయలు దేరింది. పాఠశాల సమీపంలో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో భవిష్య అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వ్యాన్ డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, కాలం చెల్లిన బస్సులను వాడటం, అతి వేగంగా నడపడం తదితర కారణాలు తమ బిడ్డను బలిగొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. మరో చిన్నారి ప్రాణాలు బలి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. -
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్‌కుమార్ -
ఆర్మేనియాలో ఆంధ్రా యువకుడి మృతి
పెద్దదోర్నాల: జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాదకు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకుని ఉంటున్నామని తెలిపాడు. గురువారం మద్యం పార్టీ చేసుకున్న మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. అనంతరం తాను వైద్యశాలలో చేరినట్లు శుక్రవారం సమాచారం అందించాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను పంపించిన సహచరులు.. అదే రోజున శివనారాయణ చనిపోయాడంటూ సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సహచరుల తీరుపై అనుమానాలు.. ‘రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేసిన శివనారాయణ సహచరులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక మృతుని తల్లిదండ్రులు, దిక్కతోచని స్థితిలో విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు.