District
-
12 గ్రామ పంచాయతీల తుదిపోరుకు సమాయత్తం
సాక్షి, నరసరావుపేట: జిల్లాలోని 12 గ్రామ పంచాయతీలకు, 118 వార్డులకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాఅధికారులు సమాయత్తమయ్యారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు, కండ్లకుంట, వినుకొండ మండలం అందుగులపాడు, ఈపూరు మండలం ఊడిజర్ల, గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లిఅగ్రహారం, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, గుంటూరు డివిజన్లోని చల్లావారిపాలెం గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. 40 మంది సర్పంచ్ అభ్యర్థులు, 118 వార్డులకు 260 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 28,264మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. నేడు ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో శిరిగిరిపాడు, కండ్లకుంట, తూబాడు, రొంపిచర్ల, ముత్తనపల్లి, ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం పంచాయతీలు అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో ఈ గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు జరుగుతాయనే కారణంతో ఇక్కుర్రు, రొంపిచర్ల, ముత్తనపల్లి, తూబాడు, శిరిగిరిపాడు, కండ్లకుంట పంచాయతీలకు ఎన్నికలను కలెక్టర్ సురేశ్‌కుమార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత నెలకొని ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగ్రామం తూబాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో లేకపోవడం గమనార్హం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నరసరావుపేట, గురజాల డీఎస్పీలు వెంకటరామిరెడ్డి, పూజ తెలిపారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీలతో పాటు ఐదుగురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 968 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. రొంపిచర్ల: ఎన్నికలు జరుగనున్న ముత్తనపల్లి, రొంపిచర్ల గ్రామాల్లో పోలీసులు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. -
బాలికల గురుకుల వసతిగృహంలో ప్రబలిన అంటువ్యాధులు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ (కస్తూర్బా) బాలికల గురుకుల వసతిగృహంలో అంటువ్యాధులు ప్రబలాయి. దాదాపు 20 మంది బాలికలు చేతులకు, కాళ్లకు చీము పుండ్లతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ వసతి గృహంలో 147 మంది బాలికలు చదువుకుంటున్నారు. వసతి గృహ ంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు గదులు ఇరుకుగా ఉండి బాలికలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాగా వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అంటువ్యాధులు మరింత మంది బాలికలకు ప్రబలే ప్రమాదం ఉంది. వసతి గృహంలోనే ఉండి బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఏఎన్ఎం అనురాధ కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వీరికి వెంటనే వైద్య సౌకర్యం అందలేదు. మొదట్లో నలుగైదుగురు విద్యార్థినిలకు మాత్రమే చేతులు, కాళ్లకు పుండ్లు ఏర్పడగా ఆ తర్వాత 20 మంది బాలికలకు ఈ అంటువ్యాధి సోకింది. బుధవారం వీరిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్సకు వచ్చిన వారిలో పలువురు బాలికలు జ్వరంతో కూడా బాధపడుతున్నారు. వీరిలో టి. మహేశ్వరి అనే ఏడో తరగతి బాలిక విపరీతమైన జ్వరంతో పాటు చేతి వేళ్ల మధ్య పుండ్లతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఐదో తరగతి చదువుతున్న వనిత అనే బాలిక పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపించినా ఫలితం లేకపోవడంతో మహేశ్వరిని బుధవారం సాయంత్రం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా వసతి గృహం వార్డెన్ దశరాథరామిరెడ్డి మాట్లాడుతూ ..ఏఎన్ఎం విధులకు రాకపోవడం వల్ల బాలికలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. వసతి గృహంలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, కొద్ది మంది బాలికలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. -
గుంటూరులో సమైక్యాంధ్ర జేఏసీ ధర్నా
పాఠశాలలో ఆడుతూ పాడుతూ అక్షరాలు నేర్వాల్సిన చిన్నారి రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుంది. పాఠాల్లో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నారన్న ఆందోళన నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల్లో కనిపించింది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని ఇన్నాళ్లూ అభివృద్ధిపై కన్న కలల్ని యూపీఏ ఛిద్రం చేసిందని సీనియర్ సిటిజన్లు ఆవేదన చెందుతున్నారు. ఇదే అభిప్రాయాలతో వైద్యులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు ఇలా అందరూ సమైక్యాంధ్ర విభజనపై కదం తొక్కుతున్నారు.. రాజకీయ సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యంగా అడుగులేస్తుండగా, ప్రజాసంఘాలు తమ ఉద్యమ పంధాను వీడనాడకుండా నిరసన తెలియజేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమ ఆందోళనలతో బుధవారం కూడా జిల్లా అట్టుడికింది. మున్సిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె కొనసాగుతుంది. తాడేపల్లిలో మున్సిపల్ ఉద్యోగులు శిరోముండన చేయించుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు రెండోరోజుకు చేరాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్లు, పారిశుద్ధ్య ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా తరువాత ఆటాపాటా కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞాన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ నుంచి హిందూకళాశాల సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో, ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి శంకర్‌విలాస్ సెంటర్లో ధర్నా చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు. ఎంపీ రాయపాటి యువసేన కార్యకర్తలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. గుంటూరులో సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ సమావేశం.. విభజనకు నిరసనగా సీమాంధ్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ బుధవారం గుంటూరులోని ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో సమావేశమైంది. మొత్తం 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఆ సంస్థ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని నిర్ణయించారు. ఇక ఏపీఎన్జీవో సంఘం పిలుపుమేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది విధులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాపరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డులో కొనుగోళ్లు నిలిపివేసిన కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు, హమాలీలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. హిందూ కళాశాల సెంటర్లో నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక విజయరాజు ఆమరణ నిరాహార దీక్షబూనారు. తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు తోపుడుబండ్లతో ర్యాలీ జరిగింది. టీడీపీ డ్రామాలాడుతోంది.. ఎమ్మెల్యే మస్తాన్‌వలి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి తన అనుచరులతో హిందూకళాశాల సెంటర్లోని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కొంతసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విభజనకు అనుకూలంగా అందజేసిన లేఖను బహిరంగపరిచారు. సమైక్య ఉద్యమంలో టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మర్రి రాజశేఖర్... చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ సందర్శించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమ ర్యాలీ జరిగింది. సత్తెనపల్లి, పెదకూరపాడు, మంగళగిరిలలో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ, జిల్లావ్యాపార సంఘాల ఆధ్వర్యంలో యూపీఏ అధినేత్రి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెనాలిలో జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు సమాధులు కట్టారు. వారి చిత్ర పటాలను దహనం చేశారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. -
నష్టాల బాటలో ఆర్టీసీ
సాక్షి, విశాఖపట్నం: ‘మూలిగే నక్కపై తాటిపండు పడింది’ అన్నట్టు తయారైంది ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిస్థితి. ఎనిమిది రోజులుగా పెద్దసంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో లక్షల్లో నష్టం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి రాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపివ్వడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఏటా రూ.2 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే ముందు న్న విశాఖ రీజియన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాలు తప్పే లా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా యాభై శాతం బస్సులే రోడ్డెక్కుతున్నాయి. రోజుకి రూ.70 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా ఇప్పటికే రూ.30 లక్షల వరకు గండిపడింది. సమ్మెతో మరింత నష్టాలు తప్పవని భావిస్తున్నారు. రీజియన్‌లో సుమారు 1060 బస్సులున్నాయి. ఇందులో 240 బస్సులు ప్రైవేట్‌వి. వీటి ద్వారా అయినా ఆదాయం రాబట్టుకునే పరిస్థితి లేదు. ఈయూ సమ్మెకు పిలుపునివ్వగా, ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఆర్‌ఎంఎఫ్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆర్టీసీ సంఘాలన్నీ సంఘీభావం ప్రకటించా యి. భద్రతా సిబ్బంది, అడ్మిన్స్టాఫ్, అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చాలా బస్సులు రద్దు తెలంగాణ విభజన నిర్ణయం తరువాత రాజో లు, అమలాపురం, నర్సాపురం వైపు బస్సులు వెళ్లడం లేదు. శ్రీకాకుళం వైపు పాక్షికంగానే తిప్పుతున్నారు. కొన్ని ప్రాంతాలకు పగటి పూట కాకుండా రాత్రి వేళల్లోనే బస్సుల్ని పంపిస్తున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రం 90 శాతం బస్సులు తిరుగుతున్నాయి. అరకు వంటి ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు పంపిస్తున్నా అవి తిరిగి వచ్చేవరకూ టెన్షనే. దీంతో ప్రైవేట్ వాహనాలు జోరందుకున్నాయి. సమ్మె ప్రారంభమైతే లాభార్జన స్థానంలో రూ.కనీసం 8 కోట్లు నష్టపోవడం తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోనీ చార్జీలు పెంచి భర్తీ చేసుకుందామనుకున్నా రోజురోజుకి విభజన ఉద్యమాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇదీ సాధ్యమని చెప్పలేము. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడితే తప్ప ఆర్టీసీ ఈ దెబ్బనుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
పడిపోయిన కూరగాయల వ్యాపారం
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: కూరగాయలు భయపెడుతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల కూరగాయలూ కిలో రూ.35పైనే పలుకుతున్నాయి. ఇటీవల టమాటా కాస్త దిగొచ్చినా మిగతా కూరగాయల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. సామాన్యులు మార్కెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ప్రతి కూరగాయను పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. నెల బడ్జెట్లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో ఏమేం వండాలో ముందుగానే లెక్కలు వేసుకుని కొనుగోలు చేస్తున్నారు. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్.. ఇలా సర్దుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కొనుగోలు చేస్తున్నారు. ఫ్రిజ్‌ల నిండా నింపుకొనే పరిస్థితికి టాటాచెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక పేదలు పచ్చళ్లతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు.. తీరా రైతుల పంటలు మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరి గిన ప్రతిసారి రైతులు ఆశతో సాగు ప్రారంభించడం.. నాలుగైదు నెల ల్లో పంట చేతికొచ్చాక ధరలు లేకపోవడం యేటా రివాజుగా మారిం ది. చేవెళ్ల మండలంలోని 30 పంచాయతీల పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు. కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి. చేవెళ్ల మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కొనలేని పరిస్థితి మార్కెట్లో కూరగాయల ధరలు చూస్తే భయమేస్తోంది. రోజురోజుకు ధరలు పైపైకి పోతున్నాయి. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పడు రెండు రకాల కూరగాయలు కూడా రావడంలేదు. రోజూ కూరలు కొనడం ఇబ్బందిగా ఉండి ఒకపూట పచ్చడితో తింటున్నాం. - కృష్ణ, చేవెళ్ల గ్రామస్తుడు వ్యాపారం కష్టంగానే ఉంది ఈ ధరల మూలంగా విక్రయాలు పడిపోయాయి. అందరూ పావుకిలో, అరకిలోకు మించి కొనడం లేదు. ఏ కూరగాయ ధర చెప్పినా ‘అంత రేటా..’ అని ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లాభాలు కూడా బాగా తగ్గిపోయాయి. - శ్రీను, కూరగాయల చిరువ్యాపారి -
‘అరకువేలీ కాఫీ’ పథకం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతాల్లో సాగుచేస్తున్న కాఫీ నాణ్యతపరంగా శ్రేష్టమైన రకమని, ‘అరకువేలీ కాఫీ’గా అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందిన ఈ కాఫీ సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరు వేల టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతున్నట్టు అంచనాలున్నాయని, పన్నెండో పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ ఉత్పత్తిని బలోపేతం చేయాలని, అందుకోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాన్ని కొనసాగించాలని ప్రతిపాదించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ఫైన్ కప్’ అవార్డుల కార్యక్రమంలో అరకు లోయ కాఫీ ‘ఉత్తమ అరబికా కాఫీ అవార్డు’ను సాధించిందని కూడా పేర్కొంది. రాజ్యసభలో బుధవారం ఓ ప్రశ్నకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి డి.పురంధేశ్వరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
‘తెలంగాణ’ ఓట్లపై ఆశలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పైచేయి సాధించినా, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బయట పడింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఆత్మరక్షణలో పడిన అధికార పార్టీ నేతలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరింత షాకిచ్చాయి. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీలు చాలా చోట్ల అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చాయి. 2009 సాధారణ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు పంచాయతీ ఫలితాలు తలబొప్పి కట్టించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా వెలువడిన ప్రకటన కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమపై, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటన దోహదం చేస్తుందని పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందుకు ఒక్కోనేత ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి బుధవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆహ్వానించి తూప్రాన్‌లో సభ ఏర్పాటు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా తెలంగాణ ప్రకటన సాధనలో తమ పాత్రను ప్రమోట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు సొంత నియోజకవర్గం అందోలులో రాజకీయ ప్రత్యర్థి లేకపోవడంతో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సాధన క్రెడిట్ అంతా డిప్యూటీ సీఎం ఖాతాలో చేరిందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. విలీనంపై అనాసక్తి టీఆర్ఎస్ విలీన వార్తలపై అధికార పార్టీ నేతల్లో అనాసక్తి వ్యక్తమవుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహంతో జిల్లాలో రికార్డు స్థాయిలో ఎనిమిది మంది కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.‘నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపే టీఆర్ఎస్తో విలీనమైతే కాంగ్రెస్‌కు పెద్దగా ప్రయోజనం కలగదు’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.మెదక్ ఎంపీ విజయశాంతి చేరిక తమకు నష్టం చేస్తుందనే భావన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎంపీగా విజయశాంతి కూడగట్టుకున్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో తమపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు విశ్లేషించుకుంటున్నారు. -
తేడా వస్తే తెలంగాణను స్తంభింపజేస్తాం
నంగునూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తొమ్మిది జిల్లాల ప్రజలను ఏకం చేసి తెలంగాణను స్తంభింపజేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. 12 సంవత్సరాలు శాంతియుతంగా పోరాడి కేసీఆర్ తె లంగాణ తెస్తే.. సీమాంధ్రలో కొందరు నాయకులు అల్లర్లు సృష్టించడానికి డబ్బులిచ్చి కేసీఆర్ బొమ్మలు తగలబెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నంగునూరులో పలు పార్టీలకు చెందిన వంద మంది బుధవారం హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ఇస్తామన్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు, లగడపాటి, కేవీపీలు డబ్బులు పెట్టి ఉద్యమాల పేరిట అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. అందరు మనవారే అభివృద్ధికి పాటు పడండి తెలంగాణ కోసం పోరాడిన ప్రజలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని హరీష్‌రావు పిలుపు నిచ్చారు. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ వారేననీ, విభేదాలు పక్కన పెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రమేశ్‌గౌడ్, మల్లయ్య, సారయ్య, వెంకట్‌రెడ్డి, రాజనర్సు, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తుంగ కనుకయ్య, మణిచారి, కనుకయ్య, రాంరెడ్డి, దేవులపల్లి రాజమౌళి, బడే రాజయ్య పాల్గొన్నారు. -
అనితను మార్చాల్సిందే...
నక్కపల్లి/పాయకరావుపేట, న్యూస్‌లైన్: పాయకరావుపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించిన అనితను మార్చాల్సిందేనని తెలుగుతమ్ముళ్లు పార్టీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 11మంది సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి అనిత వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అనిత నియామకంతో పాయకరావుపేటలో తెలుగుతమ్ముళ్లు రెండుగా చీలిపోయారు. ఇద్దరు ముఖ్యనేతలు రాజీనామా చేశారు. ఈ దశలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డిరామానాయుడు రాజీ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో అసమ్మతినేతలంతా పార్టీ అధినేతకు ఇక్కడి పరిస్థితిని వివరించారు. మొదటి నుంచి అనిత నియామకాన్ని పాయకరావుపేట మండలంలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకిస్తోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం కనిపించింది. పలుగ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మండల మాజీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు గొర్లె రాజబాబు పార్టీ పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఇరువర్గాలను ఏకంచేసి రాజీ కుదిర్చేందుకు రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు మంగళవారం పాయకరావుపేటలో ఒకవర్గం ఏర్పాటుచేసిన కార్యాలయం వద్దకు వచ్చి రెండోవర్గంవారు రమ్మని కబురు పంపారు.అక్కడకు వచ్చేపనిలేదని కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రామానాయుడు రాజబాబు రాజీనామాను ఆమెదించేది లేదని ఆయనపార్టీలోనే కొనసాగుతారంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో రెండో వర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, చింతకాయలరాంబాబు,దేవవరపు వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో పలువురు ఎకాయెకిన బస్సులో మంగళవారం రాత్రి హైదరాబాద్వెళ్లారు. బుధవారం ఉదయాన్నే చంద్రబాబును కలిసి గెలుపొందిన సర్పంచ్‌లను పరిచయం చే శారు. అనంతరం అనితపై ఫిర్యాదు చేశారు. అనిత వ్యవహారం నియోజవర్గంలో పార్టీకి తీరని నష్టం కలుగిస్తోందంటూ వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమికి ఆమె కృషి చేశారని, ఆమె వ్యవహార శైలి బాగాలేదని, తక్షణం మార్చకుంటే తాము పార్టీలో కొనసాగలేమని తేల్చిచెప్పినట్టు బాబును కలిసిన కొందరు నాయకులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. అనిత వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, తొందర పడొద్దని,సమస్యపరిష్కారానికి చర్యలు చేపడతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో పెదిరెడ్డిశ్రీను,దేవవరపుసత్యనారాయణ,లెక్కలగోవిందు సర్పంచ్‌లు చించలపు సన్యాసమ్మ, తదితరులతోపాటు మరో50మంది కార్యకర్తలు, ముఖ్యనాయకులు ఉన్నారు. -
అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య
తొగుట, న్యూస్‌లైన్: అప్పుల బాధలు తాళలేక మండ ల పరిధిలోని లింగాపూర్‌కు చెందిన అక్కరాజు శ్రీనివాస్ (29) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఏస్ఐ హబీబ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అదే గ్రామవాసి గాంధారి నరేందర్‌రెడ్డికి చెందిన బోరు వెల్ లారీకి రెండేళ్లుగా డ్రైవర్, డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. వారం పది రోజులకోమారు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బోరు బండి పనులు సాగక పోవడంతో తొగుటలో ఉన్న బోర్వెల్ కార్యాలయం లో ఇతర పనివాళ్లతో కలిసి శ్రీనివాస్ ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్రలేచిన శ్రీనివాస్ దిన చర్యలో భాగంగా బహిర్భూమికని బయటకు వచ్చాడు. బోర్వెల్ కార్యాలయానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న పత్తి చేను పక్కనే ఉన్న బండ పైకి చేరుకున్న శ్రీనివాస్ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును తాగాడు. ఇదిలా ఉండగా పత్తి చేనును కౌలుకు చేస్తున్న పాగాల బాల్‌రెడ్డి బుధవారం చేనులోకి వెళ్లాడు. అయితే అప్పటికే శ్రీనివాస్ పడి ఉన్న విషయాన్ని గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా పురుగుల మందు డబ్బాను చూసి అతడి యజమాని నరేందర్‌రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న భార్య, బంధువులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడి పెట్టారు. గ్రామస్థులతో స్నేహపూర్వకంగా ఉండే శ్రీనివాస్ ఇక లేడంటూ జీర్ణించుకోలేక పోయాడు. భార్య లత మాత్రం తన భర్త సొంతింటి కోసం అప్పులు చేశాడని, ఈ నేపథ్యంలో అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య లత, ఓ కుమార్తె గాయత్రి ఉన్నారు. వృద్ధాప్యంలో తోడుగా ఉంటావనికుంటివి కదరా.. వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటావని అనుకుంటే ఇంతలో ఎంత పని జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు అక్కరాజు నర్సింలు, లక్ష్మిల రోదనలను ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడు శ్రీనివాస్ యజమాని నరేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కంటతడిపెట్టాడు. -
విహారం మిగిల్చిన విషాదం
సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి రూరల్/పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్ : స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో విహారయాత్రకు బయలుదేరిన ఐదుగురు మిత్రులను మృత్యువు వెంటాడింది. విహారయాత్ర ముగించుకుని తిరుగుపయనమైన వారు గమ్యం చేరుకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మృతుల్లో ఒకరైన శశిభూషణ్ తన పుట్టిన రోజుకు ఒకరోజు ముందే మృతి చెందటం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలో షాంగ్లా గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన రాబిన్ స్వరాజ్(38), శ్రీకాంత్(26), ప్రదీప్‌కుమార్(25), శశిభూషణ్(26), ప్రణీత్‌రెడ్డి(25) మృతి చెందారు. వీరంతా మిత్రులు కాగా, గత శనివారం ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు గోవాలో సరదాగా జరుపుకోవాలని సంగారెడ్డి నుంచి ఇండికా వాహనంలో బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని మంగళవారం రాత్రి సంగారెడ్డి తిరుగుపయనమయ్యారు. అయితే బీజాపూర్ సమీపంలో షాంగ్లా వద్ద 218 జాతీయ రహదారిపై రాత్రి 7.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఇండికా వాహనం బండరాళ్లలోడ్తో ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. బీజాపూర్ సమీపంలోని కొల్లార్ పోలీసులు ఘటన స్థలం చేరుకుని మృతదేహాలను బీజాపూర్‌లోని అల్-ఇమామ్ ఆసుపత్రికి తరలించారు. ఇండికా వాహనంపై ఉన్న వాహనం సర్వీసింగ్ సెంటర్ స్టిక్కర్ ఆధారంగా కొల్లార్ స్టేషన్ పోలీసులు మృతుల వివరాలను ఆరా తీసి వారి కుటుంబీకులకు రాత్రి 11.30గంటల ప్రాంతంలో సమాచారం అందజేశారు. బుధవారం ఉదయం హుటాహుటీన బీజాపూర్ వెళ్లిన మృతుల కుటుంబీకులు అక్కడి అల్-ఇమామ్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఆ తర్వాత వాహనాల్లో ఐదు మృతదేహాలను తీసుకుని రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంగారెడ్డికి చేరుకున్నారు. ఆ వెంటనే రాబిన్‌స్వరాజ్, ప్రదీప్‌కుమార్, శశిభూషణ్, ప్రణీత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, శ్రీకాంత్ అంత్యక్రియలు మాత్రం గురువారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వేడుక చేసుకునేందుకు వెళ్లి... సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచి మిత్రులు. వీరికి మరో ఆరుగురు మిత్రులు సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తం 11 మంది మిత్రులు గతనెల 31న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కలుసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే ఉన్నందున గోవా విహారయాత్రకు వెళ్ళాలని, అక్కడే సరదాగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిలో ఆరుగురు మిత్రులు తమకు వీలుకాదని చెప్పటంతో రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి షిర్డీ మీదుగా గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత శనివారం రాబిన్ స్వరాజ్ మామయ్యకు చెందిన ఇండికా విస్టా కారులో ఐదుగురు మిత్రులూ సంతోషంగా గోవా బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని సంగారెడ్డికి తిరిగి వస్తుండగా బీజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బర్త్‌డేకు ఒకరోజు ముందే... బర్త్‌డేకు కేవలం ఒక్కరోజు ముందే శశిభూషణ్ మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను, మిత్రులను, బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. సంగారెడ్డి మండలం కవలంపేట గ్రామానికి చెందిన శశిభూషణ్ పుట్టినరోజు గురువారం(8వ తేదీ) కావడంతో ఆ రోజు కుటుంబసభ్యులతో గడపాలనుకున్నాడు. అందుకే బుధవారం నాటికే స్వగ్రామం చేరాలని గోవా నుంచి బయలుదేరాడు. అయితే పుట్టినరోజు వేడుకలు జరుపుకోకముందే శశిభూషణ్ మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. తమబిడ్డ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సిన తాము అతని అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందని శిశిభూషణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే శిశిభూషణ్ మరణవార్త చివరి వరకూ ఆయన తల్లి శ్యామమ్మకు కుటుంబీకులు తెలియనివ్వలేదు. ఒక్కసారిగా కనిపించిన కుమారుడు మృతదేహాన్ని చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. కుటుంబాల్లో అంతులేని విషాదం సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి మృతితో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రి వారి మృతి వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వారి ఇళ్లవద్ద విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాలను వారి బంధువులు, మిత్రులు పరామర్శించారు. మృతుల స్నేహితులంతా వారి ఇళ్లవద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఐదుగురు మిత్రుల మృతితో సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, రుద్రారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల నేపథ్యమిది.... రాబిన్‌స్వరాజ్: సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన పభుత్వ ఆస్పత్రి విశ్రాంత ఉద్యోగి శాంతకుమార్ పెద్దకుమారుడు. ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రాబిన్‌స్వరాజ్ సంగారెడ్డి ఐటీఐ ఎదురుగా శ్వాస క్లినిక్‌ను 8 నెలలుగా నడుపుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తన మిత్రులతో కలిసి గత శనివారం తన మామయ్య వాహనంలో మిత్రులతో కలిసి రాబిన్‌స్వరాజ్ గోవా బయలుదేరి వెళ్లాడు. కె.శ్రీకాంత్: సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడలో నివాసం ఉంటున్న కె.శ్రీకాంత్ స్థానిక యాక్సిస్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వర్రావు 25 ఏళ్ల క్రితం నెల్లూరు నుంచి సంగారెడ్డికి వచ్చి ఇటుక వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. వెంకటేశ్వర్రావుకు ఇద్దరు కుమారులు కాగా వారిలో మృతుడు శ్రీకాంత్ చిన్నవాడు. సంగారెడ్డిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్ ఇక్కడే యాక్సిస్ బ్యాంకులో రెండేళ్లుగా పనిచేస్తూ సహచరులతో కలుపుగోలుగా ఉండేవాడు. ఇటీవలే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ప్రదీప్‌కుమార్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రదీప్‌కుమార్ సంగారెడ్డిలోని విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హెచ్ఎండీఏ విశ్రాంత ఉద్యోగి అంజయ్య, శాంతమ్మ దంపతులకు ప్రదీప్‌కుమార్ ఏకైక కుమారుడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న ప్రదీప్‌కుమార్ మృతితో వారి కుటుంబం వారసున్ని కోల్పోయింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు తోబుట్టువులు ప్రదీప్ మరణవార్త విని హతాశులయ్యారు. ప్రణీత్‌రెడ్డి: పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ప్రణీత్‌రెడ్డి ఇటీవలే ఎంసీఏ పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ప్రాజెక్టు చేస్తున్నాడు. -
ఇచ్చింది సోనియా.. తెచ్చింది కాంగ్రెస్
తూప్రాన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవాదులేననీ, వారిని సెటిలర్స్ అనడం భావ్యం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం తూప్రాన్‌లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఎస్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చేది...ఇచ్చేది తామేననీ ఎన్నోసార్లు చెప్పామని, ఇచ్చినమాటకు కట్టుబడే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అందువల్లే ఆ నినాదాన్ని ఇపుడు ‘‘ఇచ్చింది సోనియాగాంధీ, తెచ్చింది కాంగ్రెస్’’గా మార్చుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తనతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలంతా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానానికి విన్నవించారని ఆయన తెలిపారు. అందువల్లే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత తెలిపారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుల సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన వారు దశాబ్ధాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నారనీ, వారిలాగే వివిధ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం ఉద్యమాలు చేపట్టారని డీఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే సీమాంధ్రుల మనస్సు నొప్పించకుండా తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి రాజధాని ఏర్పాటు అయ్యేవరకు సహకరిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అంశాన్ని అడ్డం పెట్టుకుని లాభపడాలని చూశాయనీ, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో వారి ఆటలకు చెక్ పడిందన్నారు. గజ్వేల్, పటాన్చెరు ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, నందీశ్వర్గౌడ్లు తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, బాబుల్‌రెడ్డి, భాగవన్రెడ్డి, వీర్కుమార్గౌడ్, చక్రవర్తి, రవీందర్‌గుప్త, అలీం, పెంటాగౌడ్, నరేందర్‌రెడ్డి, కమ్మరి సత్యనారాయణ, వెంకటస్వామి, వెంకట్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, రఘునాథరావు, అనంతం, మాల్లారెడ్డి, సిద్దిరాంలుగౌడ్, సామల అశోక్, ఉమార్, నాగరాజుగౌడ్, అనిల్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు పోతరాజుపల్లి చౌరస్తా నుంచి తూప్రాన్ వరకు సాగిన విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఇక ‘ప్రాదేశిక’ పోరు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : పంచాయతీ సమరం ముగిసింది. మండల పరిషత్తు సంగ్రామానికి తెరలేచింది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఆయా స్థానాల విషయమై కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 13లోగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు ఏర్పాట్లు చకాచకా సాగిపోతున్నాయి. 14న ప్రాథమిక నోటిఫికేషన్, 28 తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజా అంచనా ప్రకారం జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు పెరగనున్నాయి. దీనిపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాలు జనాభా ఆధారంగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేపడుతున్నారు. 2006లో జరి గిన స్థానిక సంస్థల పాలక వర్గాల ఎన్నిక 2001 జనాభా ప్రకారం జరిగింది. ఈ దఫా 2011 జనాభా గణాంకాలు అందుబాటులోకి వచ్చా యి. ఫలితంగా ప్రాదేశిక నియోజకవర్గాల సం ఖ్య పెరగ నుంది. దీని కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి జిల్లాకు పంపింది. ఒక్కో ఎంపీటీసీ స్థానం పరిధిలో కనీసం 3500 మంది జనాభా ఉండాలని, అత్యధికంగా 4 వేలు మించకూడదని నిబంధన ఉంది. భౌగోళికంగా ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎంపీటీసీ స్థానాల ఏర్పాటులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధ్యమైనంత వరకు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ప్రయత్నించాలని సూచించింది. సాధ్యం కానిపక్షంలో పక్క పం చాయతీలోని జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. 2011 జనాభా లెక్కల ప్రకా రం గ్రామీణ ప్రాంత జనాభా 22.54 లక్షలు. ఈమేరకు ఏయే మండలాల్లో జనాభా పెరిగిందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై జాబితాలను సిద్ధం చేయాలని అధికారులు ఎంపీడీవోలను ఆదేశించారు. ఇప్పటికే ఆయా జాబితాలను రూపొందించే పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 624 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పునర్విభజన తరువాత ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఎంపీటీసీ లెక్కపై గురువారం ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 14న ప్రాథమిక నోటిఫికేషన్ : ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 13 లోగా పూర్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై 21వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి 22 నుంచి 26 వరకు పరిశీలిస్తారు. 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే రోజున దా నిని ప్రభుత్వానికి పంపుతారు. ఎంపీటీసీ స్థా నాలతో పాటు జెడ్పీటీసీ స్థానాల జాబితా రూ పొందించిన తరువాత వీటికి రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తారు. గ్రేటర్లో విలీనమవుతున్న 10 పంచాయతీలను కూడా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఎం పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కనున్నా యి. మండల అధ్యక్ష స్థానాలతో పాటు సగం జె డ్పీటీసీ స్థానాలకు కూడా రిజర్వు కానున్నాయి. 1933 పోలింగ్ కేంద్రాలు ఈ ఎన్నికల కోసం మొత్తం 1933 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఎన్నికలకు 4222 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తిం చారు. వీటిని సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పోరు గ్రామాల్లో రాజకీయ వేడిని రగిల్చింది. ఇక పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఈ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు బాటలు వేయనున్నాయి. సమైక్యాంధ్ర సెగ ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వెంటనే వీటిని నిర్వహించాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెలాఖరులో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సమైక్య సంకల్పం
సమైక్య నాదం ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్ర విభజనోద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. రాస్తారోకోలు, మానవహారాలు, బంద్‌లు, నిరశన దీక్షలు వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగాయి. సమైక్యాంధ్ర సాధన కోసం బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆమరణ నిరశన దీక్షలు చేపట్టింది. మునగపాక, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తన కుమారుడు ప్రధాని కావాలన్న దుర్బుద్ధితో సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. వైఎస్సార్ సీపీ రాంబిల్లి మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (చంటిరాజు) మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా మునగపాక మెయిన్‌రోడ్డులో కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి సమైకాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఈసీఎస్ డెరైక్టర్ దొడ్డి బాలాజీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సూరిశెట్టి సుధారాణి, మునగపాక సర్పంచ్ టెక్కలి రమణబాబు, తోటాడ సర్పంచ్ దాడి వీరమహలక్ష్మినాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, పార్టీ నేత షేక్ ఇస్మాయిల్, విశ్రాంత తహశీల్దార్ కాండ్రేగుల సూర్యనారాయణ, ఉప సర్పంచ్ ఆడారి పోలి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల వెతలు
హైదరాబాద్,న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుండడంతో రాయలసీమ, కోస్తాంధ్రాలవైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎనిమిది రోజులుగా ఆర్టీసీ సర్వీసులు నడవకపోవడంతో అటువైపు ప్రయాణం సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోస్తావైపు ఓ మోస్తరుగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ రాయలసీమ వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ పూర్తిగా నిలిచిపోయి డిపోలకే పరిమితమయ్యాయి. గత శనివారం నుంచి ఆర్టీసీ అధికారులు కర్నూలువరకు అరకొరగా బస్సులను నడుపుతున్నారు. బుధవారం రాత్రి 8గంటల వరకు ఎంజీబీఎస్ నుంచి 2588 బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా కేవలం 2170 మాత్రమే వెళ్లాయి. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి 2648 బస్సులు ఎంజీబీఎస్‌కు రావాల్సి ఉండగా 2137 మాత్రమే వచ్చాయి. కాగా ఈనెల 9, 10,11 తేదీల్లో వరుస సెలవుల కారణంగా రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే ఆర్టీసీ షెడ్యూల్డ్ సర్వీసులకు ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ముందస్తుగా అడ్వాన్స్‌గా రిజర్వేషన్ కల్పించడంతో గురువారం షెడ్యూల్డ్ బస్సుల సీట్లు అన్నీ రిజర్వయ్యాయి. గురువారం పరిస్థితిని బట్టి బస్సులు నడిపిస్తామని, రాయలసీమ వైపు బస్సులు నడపలేని పక్షంలో ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు: మరోసారి స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ అగ్రనాయకత్వం స్థానిక నాయకత్వానికి సూచించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారని ప్లీనరీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో కూడా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని అభిమానించే కార్యకర్తలు, నేతలు చాలామంది ఉన్నారని, వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరింది. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతూ దుష్ర్పచారం చేస్తున్న విషయాన్ని ప్రతీ నాయకుడు గుర్తించాలని వివరించింది. పార్టీలో క ష్టపడి పనిచేసే కార్యకర్త ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని జగన్మోహన్రెడ్డి సందేశం పంపినట్లు సమావేశంలో పాల్గొన్న అగ్రనేతలు స్థానిక నాయకత్వానికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకుండా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ప్రతీ నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, జహీరాబాద్, మెదక్ పార్లమెంటు పరిశీలకులు ఎస్. నారాయణరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు నల్లా సూర్యప్రకాష్‌రావు, శ్రీధర్‌రెడ్డి, దేశ్‌పాండే, రామాగౌడ్, మాణిక్యరావు, బి.హనుమంతు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీధర్‌గుప్తా, మనోజ్‌రెడ్డి, కూర జైపాల్‌రెడ్డి, మెట్టపల్లి నారాయణరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ నేత సతీష్ గౌడ్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ పి.ప్రతాప్‌రెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ మల్లయ్య, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా బిక్షపతి, మైనారిటీ విభాగం కన్వీనర్ మహ్మద్ ఫరూక్ ఆలీ, జిల్లా అధికార ప్రతినిధులు టి. ప్రభుగౌడ్, ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు. -
నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల
నాగార్జునసాగర్న్యూస్లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి బుధవారం కృష్ణమ్మదిగువకు ఉరకలేసింది. సాగర్ జలాశయం గేట్లు ఎత్తే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 585.40 అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి 4,48,550 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 6 గేట్లను పైకి ఎత్తారు. సాయంత్రం 4 గంటలకు 18 గేట్ల ద్వారా 1,41,264 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6.30 గంటలకు 20 గేట్ల ద్వారా, 8 గంటల సమయానికి 24 గేట్ల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు నుంచి 1,91,413 క్యూసెక్కుల నీటిని బయటకు పంపిస్తున్నారు. కుడికాల్వకు 8007 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 8000 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 36642, ఎస్ఎల్బీసీ 1200, వరదకాల్వకు 305 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
శివశంకర్ మృతికి ఎన్టీటీపీఎస్ అధికారుల సంతాపం
ఇబ్రహీంపట్నం,న్యూస్‌లైన్ : ఎన్టీటీపీఎస్లో ఉద్యోగం చేస్తూ రాష్ట్రస్థాయి కార్మిక నాయకుడిగా ఎదిగిన వేజండ్ల శివశంకర్‌రావు ఆకస్మికంగా మృతి చెందడం దురదృష్టకమరమని ధర్మల్ కేంద్రం ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ కెఎస్.సుబ్రమణ్యరాజు పేర్కొన్నారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేజండ్ల సంతాప సభ బుధవారం ఎన్టీటీపీఎస్లోని మూడవ అంతస్తు భవనంలో ఏర్పాటు చేశారు. వేజండ్ల చిత్ర పటానికి పూల దండ వేసి నివాళ్లర్పించిన ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక శాంతిని నెలకొల్పడంలో యాజమాన్యానికి ఆయన పూర్తిగా సహకరించారని అన్నారు. పారిశ్రామిక సంబంధాల్లో నూతన ఒరవడికి నాంది పలికి నిస్వార్థ సేవలో పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రెండవ దశ పర్యవేక్షక ఇంజనీర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుడి నుంచి జేపీఏగా 1996లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి కష్టపడి పనిచేసే వారని, 2011లో ఫోర్మేన్ గ్రేడ్-2 గా పదోన్నతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో 1535 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు, అధ్యక్షుడు జాన్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పీ రాధాకష్ణ, వైస్ ప్రెసిడెంట్ పీ శ్రీనివాసరావు, హెచ్ 43 అధ్యక్షుడు వీ మధుప్రకాశ్‌రెడ్డి, కోశాధికారి వీ శ్రీనివాసరావు, ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
వికలాంగ మహిళపై హత్యాయత్నం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగురాలైన ఓ మహిళను సజీవ దహనం చేసేందుకు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి భార్య యత్నించింది. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బంటుమిల్లి రోడ్డు ప్రాంతానికి చెందిన వికలాంగురాలు యార్లగడ్డ వెంకటేశ్వరమ్మ(30) స్థానిక ముబారక్ సెంటర్లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. వీరంకి మురళి అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. వీరికి ఏడాదిన్నర వయస్సుగల కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్వరమ్మకు, మురళి భార్య దేవికి గతంలో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వెంకటేశ్వరమ్మ హోటల్లో ఉండగా దేవి అక్కడకు వచ్చింది. వెంటనే వెంకటేశ్వరమ్మ కళ్లలో కారం చల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో వెంకటేశ్వరమ్మ పొట్ట, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసి, ఆమెను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకంగా చూస్తున్న కుమారుడు.. వెంకటేశ్వరమ్మ చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడుతోంది. కుడి చెయ్యి సరిగా సహకరించదు. మురళి ద్వారా బిడ్డను కని, బంధువులకు దూరంగా ఉంటోంది. హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. హత్యాయత్నం తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరమ్మ వద్దనే కుమారుడిని కూడా ఉంచారు. తల్లికి ఏం జరిగిందో అర్ధం కాక, తండ్రి అం దుబాటులో లేక ఆ బాలుడు వచ్చిపోయే వారి వంక అమాయకంగా, బిత్తర చూపులు చూస్తుండటం అక్కడివారిని కలచివేసింది. -
మోసకారి టీడీపీ నేత ఎక్కడ?
కుత్బుల్లాపూర్/ జీడిమెట్ల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ జీడిమెట్ల డివిజన్ కోశాధికారి సూరపనేని వెంకట శివాజీ బిచాణా ఎత్తేయడంతో అప్పు ఇచ్చిన బాధితుల దృష్టి ఇప్పుడు అతని ఇంటిపై పడింది. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని ప్రసూననగర్‌లో ఉన్న శివాజీ ఇంటికి వచ్చి పలువురు పడిగాపులు కాస్తూ కనిపించారు. మరికొంత మంది తాళం వేసిన ఇంటికి మళ్లీ తాళాలు వేస్తూ కన్పించారు. వంద గజాల్లో గ్రౌండ్ ప్లస్ 3 భవనాన్ని నిర్మించగా దీని ఖరీదు రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం. సొంతూరైన కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో సైతం ఇటీవల నూతన గృహాన్ని నిర్మించాడు. గ్రామానికి వెళ్తున్న సందర్భంలో అక్కడి వారి ముందు తాను గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్పొరేటర్ అంటూ బీరాలు పలికేవాడని తెలిసింది. అంతే కాకుండా నగరం నుంచి విజయవాడకు మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు బాధితులు కనుగొన్నారు. అయితే ఆ బస్సులు ఎక్కడ నుంచి వెళ్తున్నది, ఏ ట్రావెల్స్ పేరు మీద ఉన్నాయన్న విషయం తెలుసుకునేందుకు ఒక వైపు బాధితులు, మరో వైపు పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రసూననగర్, వివేకానందనగర్, శ్రీనివాస్‌నగర్ ప్రాంత వాసులే కాకుండా బాలానగర్‌లోని లోకేష్ కంపెనీ ఉద్యోగులు మోసపోయిన వారిలో అధికంగా ఉన్నారు. సోమవారం రాత్రి 60 మంది పోగై లెక్కలు చూసుకోగా రూ. 5 కోట్లు రాగా, మంగళవారం అది రూ. 15 కోట్లకు చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో సైతం ఇతగాని చిట్టా భారీగానే ఉందని బాధితుల ద్వారా వెలుగులోకి వస్తోంది. ఏది ఏమైనా ఈ కేసును త్వరగా చేధించే దిశగా జీడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశాల్లో విసృ్తత తనిఖీలు చేస్తున్నాయి. ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు.. సూరపనేని వెంకట శివాజీ రూ. 5 లక్షలు, రూ. 2 లక్షలు చిట్టీలు వేసి పలువురి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుండా వారికి రూ. 3 చొప్పున వడ్డీ చెల్లించేవాడు. పలువురికి సంవత్సరం, రెండు సంవత్సరాలు వడ్డీ కట్టేవాడని తెలిసింది. అయితే వారు న్యాయ సలహా తీసుకుని ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే 15 మంది ఫిర్యాదు చేయగా లక్షల్లో అప్పులిచ్చిన వారు ఐటీ రిటర్న్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. శివాజీని ఎలాగైనా పట్టుకుని తమ డబ్బులు వసూలు చేసుకుంటామనే ధీమాతో మరికొందరు ఉన్నారు. -
ఫలించని తంత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ స్థానానికి అసలు ఉపఎన్నికే జరపకూడదని భావించిన కాంగ్రెస్‌కు, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని ఆశపడిన తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. వారొకటి తలిస్తే.. వేరొకటైందిప్పుడు. ఉపఎన్నికకు పోరు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీలు కరుణించినా స్వతంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. సానుభూతి మంత్రంతో తెలుగుదేశం పార్టీకి అందివచ్చిందనుకున్న ఏకగ్రీవ ఫలం దక్కకుండాపోయింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థి తలపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అసలీ ఉపఎన్నిక తొలినుంచి ఉత్కంఠభరితంగానే మారింది. కేవలం ఎనిమిది మాసాల వ్యవధిలో ఎన్నిక ఎందుకనుకున్న అధికార పార్టీ సాచివేత ధోరణి అవలంభించిన విషయం తెలిసిందే. ఈ దశలో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. హైకోర్టు సూచన మేరకు రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అవనిగడ్డకు ఉప ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తప్పదన్నట్టుగానే ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ దశలో తొలి నుంచి ఇక్కడ పోటీ లేకుండా సానుభూతి సాకుతో తిరిగి ఎమ్మెల్యే పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఎవరినీ పోటీకి పెట్టకుండా బ్రాహ్మణయ్య కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే పదవి దక్కేలా సహకరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలకు విజ్ఞాపన లేఖలు రాశారు. ఏకగ్రీవం విషయంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ద్వంద్వ వైఖరిని అనుసరించినప్పటికీ బ్రాహ్మణయ్య కుటుంబంపై సానుభూతితో వైఎస్సార్సీపీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకుంది. అయినా స్వతంత్ర అభ్యర్థుల బెడద తెలుగుదేశానికి తప్పలేదు. టీడీపీకి ముప్పుతిప్పలు ఏకగ్రీవం కోసం టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నామినేషన్ ఉపసంహరణ కోసం స్వతంత్ర అభ్యర్థులు వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆయనతో పాటు మరో 15 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన దశలో ఐదుగురి నామినేషన్లు తిరస్కరించగా.. మరో 11 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం సాయంత్రం మూడు గంటలతో ముగియడంతో వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా టీడీపీ నేతలు నానా పాట్లు పడ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ తదితర నేతలు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంలో వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎనిమిది మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, మరో ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు. ఒక దశలో చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రమణ్యం అందరూ ఉపసంహరించుకుంటే తాను కూడా పోటీ నుంచి తప్పుకొంటానని మెలిక పెట్టారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్ ఇదిగో వస్తున్నానంటూ కాలయాపన చేశారు. రాజశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన రాస్తారోకో వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని, ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నందున నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. దీంతో మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ మరో గంట పొడిగించి సాయంత్రం నాలుగు గంటల వరకు అవకాశం ఇచ్చారు. అయినా రాజశేఖర్ రాకపోవడంత్ధో సుబ్రమణ్యం కూడా పోటీ నుంచి నిష్ర్కమించబోనని ప్రకటించారు. చివరికి ఉపఎన్నిక తప్పనిసరైంది. బరిలో ముగ్గురు.. అవనిగడ్డ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ జి.రవి బుధవారం రాత్రి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా అంబటి శ్రీహరిప్రసాద్‌కు సైకిల్ గుర్తు ఖరారు చేశారు. స్వతంత్ర అభ్యర్థుల సైకం రాజశేఖర్‌కు కప్పు-సాసర్, రావు సుబ్రమణ్యానికి సీలింగ్ ఫ్యాన్ గుర్తులను కేటాయించారు. పోలింగ్ 21న జరగనుంది. ఈ నెల 24వ తేదీన ఫలితం ప్రకటిస్తారు. -
అంతా ‘బ్రాంది’యేనా..!
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు..’ అన్నట్టు మద్యం వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా వ్యాపారం మూడ్ ఫుల్స్, ఆరు నిబ్లు మాదిరిగా సాగేలా వ్యాపారులు కొత్త దారులు వెదుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలతో ఈసారి మద్యం కేటాయింపులపై కచ్చితమైన చర్యలు తీసుకున్నారు. పల్లెపోరు నేపథ్యంలో అవకాశం ఉన్నంతమేర విక్రయాలు జరపడంలో లిక్కర్ సిండికేట్లు ఫలప్రదమయ్యారు. ఆంక్షలు కాస్త సడలిస్తే మరిన్ని లాభాలు వచ్చేవని మధనపడుతున్న సిండికేట్లకు తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం, అవనిగడ్డ ఉపఎన్నిక కోడ్ మింగుడుపడనీయడం లేదు. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారింది. గత ఏడాది జూలైలో ఎంత సరకు కేటాయించారో.. ఈ ఏడాది జూలైలోను అదే కోటాను అమలుచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత్యంతరంలేని ఎక్సైజ్ అధికారులు గతంలో వలే ఇప్పుడూ కోటా ఇచ్చారు. గుడివాడ, విజయవాడ డిపోల నుంచి నెలవారీగా ఇచ్చే మద్యం కోటాపై కంట్రోల్ పెట్టారు. గత ఏడాది జూలైలో విజయవాడ డిపో నుంచి మద్యం 1,88,509 కేసులు, బీర్లు 74,425 కేసులు ఇవ్వగా.. ఈ ఏడాది జూలైలో మద్యం 1,68,081 కేసులు, బీర్లు 63,879 కేసులు ఇచ్చారు. గుడివాడ డిపో నుంచి గత జూలైలో లిక్కర్ 1,02,007 కేసులు, బీర్లు 29,609 కేసులు, ఈ ఏడాది జూలైలో మద్యం 93,796, బీర్లు 23,206 కేసులు కోటాగా ఇచ్చారు. గత ఏడాది మాదిరిగానే కోటా ఇచ్చినా ఈ ఏడాది దాదాపు 57 మద్యం షాపుల లెసైన్సులు రెన్యువల్ కాలేదు. వాటికి కేటాయించే కోటా తగ్గినా లిక్కర్ సిండికేట్లు పంచాయతీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుని అడ్డదారులు వెదికారు. రెండు నెలలుగా దాచిన మద్యం నిల్వలను ఎన్నికల్లో వదిలించుకున్నారు. దీనికితోడు పట్టణాల్లోని బార్లు, మద్యం షాపుల్లో ఉన్న నిల్వలను పల్లెలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మద్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ సరిపడే మద్యం స్టాకు లేకపోవడంతో వారి ఆశలకు అడ్డుకట్ట పడినట్టయింది. ఎన్నికల వేళ బెల్ట్ షాపులను తొలగిస్తామన్న అధికారుల ప్రకటనలు అరకొరగానే నెరవేరాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపుల్ని సీజ్ చేసినట్టు బిల్డప్ ఇచ్చినా.. వేరేచోట బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా అమ్మకాలు సాగించారు. పలుచోట్ల నాటుసారా కూడా బాగానే తయారైంది. ఆశ నిరాశేనా.. జిల్లాలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు మద్యం వ్యాపారులకు మింగుడుపడడం లేదు. ఇటీవల 335 మద్యం షాపుల రెన్యువల్ విషయంలో ఎక్సైజ్ అధికారులు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. చివరి అస్త్రంగా పంచాయతీ ఎన్నికల్లో చూసీచూడనట్టుగానే ఉంటామని, అమ్మకాలు బాగుంటాయి కాబట్టి లాభాలు వస్తాయని ఆశ చూపారు. జిల్లాలో 57 షాపులు మినహా అన్నింటినీ రెన్యువల్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో అడ్డంగా సంపాదించేద్దాం అనుకున్నవారికి జూలై కోటా ఆంక్షలు అవరోధంగా మారాయి. ప్రస్తుతం తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమంతో షాపులు మూతపడుతున్నాయి. మరోవైపు అవనిగడ్డలో ఉపఎన్నిక జరుగుతుంటే ఎన్నికల కోడ్ కారణంగా జిల్లా అంతటా గత ఆగస్టు మాదిరిగానే ఈ నెలలోనూ మద్యం కోటా కేటాయిస్తున్నారు. అదనపు కోటా పొంది లాభాలు పొందుదామనుకున్న వ్యాపారులకు ప్రభుత్వం ఝలక్ ఇవ్వడంతో అడ్డదారులు వెదుకుతున్నారు. -
12 అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్
విశాఖపట్నం/గుంటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ (ఈయూ) మద్దతు ప్రకటించింది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలో బస్సులు తిరగకుండా నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ నేతలు బుధవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణను బీచ్‌రోడ్ క్యాంప్ కార్యాలయంలో కలసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ వలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, మంగళవారం ఒంగోలులో చేసిన తీర్మానం మేరకు జోనల్ ఈడీలకు బుధవారం సమ్మె నోటీసులిచ్చినట్టు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే వరకూ పోరాడతామన్నారు. సమైక్యాంధ్ర సాధనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాచేసి ప్రజలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పెదమజ్జి సత్యనారాయణ, కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ, జోన్లో ఉన్న 27 డిపోల్లో, జోనల్ వర్క్‌షాపుల్లో నిరవధిక సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. బుధవారం నుంచి అన్ని డిపోల్లో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కాగా, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఈనెల 12 నుంచి సమైక్య ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు సీమాంధ్రలోని 13 జిల్లాల యూనియన్ నాయకులు బుధవారం గుంటూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం అన్ని జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు సమ్మె నోటీసులను అందజేయాలని నిర్ణయించారు. అదేరోజున సీమాంధ్రలోని 123 డిపోల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. 11న నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన జరపాలనీ, 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలతో కలసి జేఏసీగా ఏర్పడి ఉద్యమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ఇందుకోసం సీమాంధ్రలోని నాలుగు జోన్లలోని ఎన్ఎంయూ కార్యదర్శులను స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు. -
విభజనహోరు
సాక్షి, మచిలీపట్నం: తెలుగుతల్లి బిడ్డలను విడదీస్తే ఊరుకోమంటూ మచిలీపట్నంలో ఆందోళనలు హోరెత్తాయి. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలతో పట్టణం పోటెత్తింది. పలువురు హిజ్రాలు ర్యాలీల్లో నృత్యాలు చేస్తూ ఉద్యమానికి మద్దతు పలికారు. మునిసిపల్ క్లాస్-4 సిబ్బంది విచిత్రవేషాలతో ప్రదర్శనలిచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. లక్ష్మీటాకీస్, కోనేరుసెంటర్లలో విద్యార్థినులు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రంగవల్లులు వేశారు. నందిగామలో న్యాయవాదులు, ఐసీడీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్వర్యంలో మైలవరంలో భారీ ర్యాలీ జరిగింది. ఉయ్యూరులో సంపూర్ణ బంద్ పాటించారు. వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమైక్యవాదులు ఉయ్యూరు ప్రధాన సెంటరును దిగ్బం ధించారు. రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. రోడ్డుపై వ్యాపారులు వంట కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పోరంకి సెంటర్లో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త సురేష్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కానూరు సిద్ధార్థ లా కళాశాల వద్ద కొనసాగుతున్న రిలే దీక్షాశిబిరాన్ని అదే పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి మద్దతు తెలిపారు. కంకిపాడులో బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో మహాశాంతియాగం నిర్వహించారు. గుడివాడలో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లపైనే వంట వండారు. నడిరోడ్డుపై నాట్లు వేశారు. టీఆర్ఎస్ నేత హరీష్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. జగ్గయ్యపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ విద్యార్థులు, ముస్లిం సోదరులు మానవహారం ఏర్పాటుచేశారు. నందిగామ నియోజకవర్గంలో పాఠశాలలు మూతపడ్డాయి. నూజివీడులో మున్సిపల్ ఉద్యోగులు చిన్న గాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో దహనసంస్కారాలు నిర్వహించారు. గన్నవరం మండలంలోని ముస్తాబాద, గొల్లనపల్లి, చినఆవుటపల్లి గ్రామాల్లో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. బెజవాడలో... కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటుచేశారు. ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. భవన నిర్మాణ కార్మికులు, వడ్డెరలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాఘవయ్య పార్క్ జంక్షన్లో మానవహారం చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరో ర్యాలీ తీశారు. వైద్యులు, వైద్య ఉద్యోగులు గంటసేపు విధులు బహిష్కరించి ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు మూడోరోజూ విధులు బహిష్కరించారు. భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. బందర్‌రోడ్డులో ఆటో ర్యాలీ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు, సిబ్బందికి సమైక్యాంధ్రపై ఎన్జీవో నాయకులు అవగాహన కల్పించారు. విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్లలో అన్ని ఆటలు రద్దుచేశారు. -
సాఫ్ట్వేర్ యంత్రం.. ఫ్యాషన్ మంత్రం..
‘కంప్యూటర్ ముందు యంత్రంలా చేసే పనికన్నా మనసుపెట్టి చేసే ఆవిష్కరణలు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు ఫ్యాషన్ డిజైనర్ శశి. బంజారాహిల్స్‌లో ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో నెలకొల్పిన తన బొటిక్‌లో ఆమె నిరంతరం సృజనత్మాక ఆలోచనల్లో మునిగితేలుతూ కనిపిస్తారు. రూ.50 వేలు ఉద్యోగం వచ్చే సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశి.. ఫ్యాషన్ డిజైనర్‌గా మారే క్రమంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి కాని, దుస్తులు కుడతావంటే ఎవరూ రారని అమ్మ, నాన్న వద్దన్నారు. వారిని ఒప్పించలేక ఇంటి నుంచి బయటకు వచ్చి బంజారాహిల్స్‌లోని స్లమ్ ఏరియాలో రూ.2,500కు గది అద్దెకు తీసుకున్నా. దాచుకున్న డబ్బు పెట్టి ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం కొన్నాను. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునే దాన్ని. తొమ్మిది నెలల పాటు భిన్న ప్రయోగాలు చేసి ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను రూపొందించాను. అవి అందరికీ బాగా నచ్చాయి. అవి నచ్చిన వారు ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. అలా మొదలై ఇలా ఈ రోజు 30 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. ‘రిపోర్టర్’ అనే తెలుగు సినిమాకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాను. ‘మా అమ్మాయి డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది’ అని ఇప్పుడు అమ్మనాన్న పదిమందికీ చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఫేస్బుక్లో ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’కి యాభై వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఐదుగురు నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా కుట్లు, డిజైనింగ్ పనిలో మెలకువలు నేర్పుతున్నాను. ఇంకా పేదపిల్లలకు చదువుకోసం డొనేట్ చేస్తున్నాను’’ అంటూ వివరిస్తారు శశి. ఉద్యోగంతో ఆగిపోతే ఇవన్నీ సాధ్యమయేవా? అని ప్రశ్నిస్తారామె.