District
-
ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 24 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఈ.శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్డునెం.62లోని ప్లాట్నెం.1245లో ఇరవై రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి యజమాని ఊరెళ్లగా.. వంట మనిషి దేవరాజ్ (23) ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ.5.14 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించకొని తన స్వస్థలం బీహార్‌లోని మధుమణి గ్రామానికి పారిపోయాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీఐ సుమన్‌కుమార్ కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించారు. వంట మనిషి దేవరాజ్ కుడిచేయికి ఆరు వేళ్లు ఉంటాయని యజమాని చెప్పడంతో పోలీసులు ఆ ఒక్క ఆధారంతో మిస్టరీ ఛేదించారు. నగరంలోని బీహార్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. నిందితుడు దేవరాజ్ చోరీ సొత్తును ఒరిస్సాలోని రూర్కెలాలో విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి.. చోరీకి పాల్పడటం... ఘటన స్థలంలో కారం పొడి చల్లి పోలీసులకు ఆధారాలు దొరక్కుం డా చేసి తప్పించుకోవడం. ఇలా రెచ్చిపోతున్న పాతనేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ అలియా స్ రాము అలియాస్ అభిరామ్ (24)తో పాటు అతని సోదరి బొట్టిపల్లి భాగ్యమ్మ అలియాస్ బేబీ(36)ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 21 తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు, 3 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఫిలింనగర్ అంబేద్కర్‌నగర్ వాసి రామకృష్ణ గతంలో సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్, రాయదుర్గం, బం జారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఇతను అర్ధరాత్రి పూట అపార్టుమెంట్‌లోని డ్రైనేజీ, వాటర్ పైపులైన్లపై పాకుతూ టార్గెట్ చేసిన ఫ్లాట్‌కు చేరుకుంటాడు. ఆ ఫ్లాట్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడతాడు. డాగ్‌స్క్వాడ్ తనను పట్టుకోకుండా ఉండేం దుకు చోరీ చేసిన ప్రాంతంలో కారంపొడి చల్లుతాడు. చోరీ సొత్తును తన సోదరి భాగ్యమ్మ ద్వారా విక్రయిస్తాడు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డునెం.12లోని సాయిశారదా అపార్ట్మెంట్స్, ఫిలింనగర్‌లోని పోర్ట్వ్యూ అపార్ట్‌మెంట్స్‌లో చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామకృష్ణతో పాటు అతని సోదరి భాగ్యమ్మను అరెస్టు చేసి రూ.9 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుల మిస్టరీని ఛేదించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ, డీఐ కె.కిరణ్‌ను ఏసీపీ అభినందించారు. -
పాల కేంద్రాలు.. ప్రత్యేక బస్సులు
లాలాపేట, న్యూస్‌లైన్/సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని లాలాపేటలోని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జంట నగరాల్లో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు విక్రయాలు కొనసాగుతాయి. లీటర్ రూ.32 చొప్పున పాలను విడిగానూ, ప్యాకెట్ రూపంలోనూ విక్రయిస్తామని విజయడైరీ ఎండీ డాక్టర్ మహ్మద్ అలీరఫత్ బుధవారం తెలిపారు. విడిగా పాలు విక్రయించే కేంద్రాలు: నాంపల్లి, ఆజంపుర, దారుల్షిఫా, బేగంబజార్, బహదూర్‌పుర, సనత్‌నగర్, హెచ్ఏఎల్ క్యాంపస్, అమన్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, ముషీరాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, గోల్కొండ, మెహిదీపట్నం, టోలిచౌకి, రాంగోపాల్‌పేట, పంజగుట్ట, సచివాలయం, ఎర్రగడ్డ, బోరబండ, ఏసీగార్డ్స్, మల్లేపల్లి, చిలకలగూడ, మౌలాలి. ప్యాకెట్ పాల విక్రయ కేంద్రాలు: కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్పల్లి, పటాన్చెరు, చాంద్రాయణగుట్ట, మోతీగల్లి, షమ థియేటర్, కాలాపత్తర్, సైదాబాద్, రెయిన్‌బజార్, నల్గొండ క్రాస్‌రోడ్డు, మాదన్నపేట, మురాద్‌నగర్, జానకినగర్, శశిగార్డెన్, సయ్యద్‌నగర్, టప్పాచపుత్ర, సీతారాంబాగ్, రాజ్‌భవన్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, సుల్తాన్‌నగర్, మాణికేశ్వరినగర్, నార్త్‌లాలాగూడ, వారాసిగూడ, హెచ్ఎంటీనగర్, తార్నాక, శాంతినగర్. వివరాలకు ఫోన్: 040-27019851, 040-64643133, 9848172642, 9848172640, 9912526611. ఈద్గాకు ప్రత్యేక బస్సులు రంజాన్ సందర్భంగా శుక్రవారం మీరాలం ఈద్గా వద్ద జరిగే ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరుల కోసం 36 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి ఉదయం 9 గంటలకు ఈద్గాకు చేరతాయి. నమాజు అనంతరం సైతం ఇవి అందుబాటులో ఉంటాయి. -
మోడి రిజర్వేషన్ వ్యతిరేకి
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు, భారత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకమని సామాజికవేత్త, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. బుధవారం ఓయూ క్యాం పస్ గ్రంథాయలంలోని ఐసీఎస్ఎస్ఆర్ హాలు లో టీవీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, అంసా, బీఎస్ఎఫ్, టీవీవీ, ఎంఎస్ ఓ, డీఎస్‌యూ, టీఆర్‌వీడీ, టీఎస్ఏ ఆధ్వర్యంలో ‘గుజరాత్ అభివృద్ధి-ఒక అందమైన అబద్ధం’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ‘అంసా’ అధ్యక్షుడు మాందాల భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కంచ ఐలయ్య, సామాజిక కార్యకర్త షబానా హష్మి (ఢిల్లీ), ప్రొఫెసర్ హేమంత్‌షా (అహ్మదాబాద్) ప్రసంగించారు. ఐలయ్య మాట్లాడుతూ మోడి బీసీ వర్గానికి చెందిన వారైనా బీసీలు, దళితులకు ప్రతినిధి కాదని, బ్రాహ్మణులకు మాత్రమే ప్రతినిధి అని అన్నారు. మోడికి దమ్ముంటే ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే సభలో రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా పరిశోధన విద్యార్థులు కోట శ్రీనివాస్‌గౌడ్, సత్య, సుదర్శన్, బండారు వీరబాబు, డేవిడ్ తదితరులు పలు విషయాలపై చర్చించారు. -
రోడ్డెక్కితే నడ్డి విరిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘వెన్ను’కు దన్నులేకుండాపోతోంది. వెన్నుపూసకు పెద్ద ఆపదొచ్చింది. క్షణమైనా నిలబడనీయదు. కాసేపు నడవనివ్వదు. ఇక ప్రయాణమంటే గగనమే. పగలంతా తిరిగొస్తే రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. పడుకుని లేస్తే కలుక్కు.. కూర్చోవాలంటే నరకం. ఇదేదో అరవై ఏళ్లు నిండిన వారి వ్యధ కాదు.. నిండా ముప్ఫై కూడా పూర్తికాని యువత వెత. నడుము నొప్పి అని చెప్పుకోలేక.. తిరగనూ లేక ఎలాగో నెట్టుకొస్తున్న పరిస్థితి. కొనితెచ్చుకున్న జబ్బు కాదు. వెన్ను కలుక్కుమందంటే లక్షలకు లక్షలు వదుల్చుకోవాల్సిందే. జీవనశైలి, విధి నిర్వహణలోని తీరుతెన్నులు ఈ పరిస్థితికి ఒక కారణమైతే నగర రోడ్లు మరో ముఖ్య కారణం. రోడెక్కితే చాలు నడ్డి విరుగుతోందన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. నగరంలో నడుమునొప్పి బాధితులు పెరుగుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయని జంటనగరాల ఆర్థోపెడిక్ అండ్ స్పైనల్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. గతుకుల రోడ్లే వెన్ను విరుస్తున్నాయి.. నగరంలో దాదాపు 25 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షలమంది వెన్ను నొప్పికి గురవుతుండగా, వారిలో ద్విచక్ర వాహన దారులే 80 శాతం మంది ఉన్నారు. మిగతా వారిలో ఐటీ, ప్రభుత్వోద్యోగులు, ప్రమాద బాధితులు, జన్యుపర లోపాలతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తేలింది. ద్విచక్ర వాహనచోదకులు ప్రస్తుతం నగర రోడ్లలో రోజూ 20 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తే చాలు రెండేళ్లలో వెన్నునొప్పికి గురయ్యే ప్రమాదమున్నట్టు వైద్యులు గుర్తించారు. గతుకుల రోడ్లలో ఒక్కసారి పడితే చాలు వెన్ను తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ఎక్కువ మంది వెన్నునొప్పికి గురవుతున్నారు. మూడువేల గోతులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో ప్రతి వర్షాకాలంలోనూ ఇవి దెబ్బతింటున్నాయి. ఏటా ప్రధాన రహదారులపై 3 వేలకుపైగా గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కో వాహనచోదకుడు రోజూ సరాసరిన 15 కి.మీ. మేర గోతుల రోడ్లపైనే ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్లపై ప్రయాణంతో ఆటో, బస్సు డ్రైవర్లూ ఎక్కువగా వెన్నునొప్పికి గురవుతున్నట్టు తేలింది. వెన్నునొప్పికి ఎలా గురవుతున్నారంటే.. ప్రతి ఒక్కరిలో వెన్నుపూస కీలకం. వెన్నుకు సంబంధించి మెడ భాగంలోని సీ4-సీ5, సీ5-సి6 భాగాలు, నడుము చివర భాగంలో ఉన్న ఎల్4-ఎల్5, ఎల్5-ఎస్1 భాగాలు అత్యంత కీలకమైనవి. గతుకుల రోడ్లలో వాహనాలు ఒక్కసారిగా కుదుపునకు గురవటం వల్ల ముఖ్యంగా ఎల్5-ఎస్1 భాగాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల నడుమునొప్పి రావడం, తర్వాత ఒక కాలు, ఒక చెయ్యి జాలుగా నొప్పి వస్తుంది.. ఈ ప్రభావం మెడ భాగంలో ఉన్న సీ4-సీ5 భాగంలోనూ పడుతోంది. పదేపదే ఆయా భాగాలపై ఒత్తిడి కారణంగా అవి ఎక్కువ అరుగుదలకు గురవుతున్నట్టు వైద్యుల అంచనా. ఏటా 10 వేలకు పైగా సర్జరీలు నగరంలో నడుమునొప్పి శస్త్రచికిత్సలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. 2002-2007 మధ్య జంటనగరాల్లో 5 వేల శస్త్రచికిత్సలు జరగ్గా, 2011-12 మధ్య ఒకే ఏడాదిలో సుమారు 10వేల శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. మరికొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే... గంటకు 40 మంది నడుమునొప్పి బాధితులు నమోదవుతున్నారు 2005 తర్వాత సర్జరీల సంఖ్య 50 శాతంపైనే పెరిగాయి బ్యాక్‌పెయిన్ శస్త్రచికిత్సలకు ఏటా కనీసం రూ.130 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు జిల్లాలతో పోలిస్తే శస్త్రచికిత్సలు జంటనగరాల్లో 80 శాతం ఎక్కువ జంటనగరాల్లో ఆర్థోపెడిక్, స్పైనల్ సర్జన్లు 200 మందిపైనే ఉన్నా 30 మంది మాత్రమే ఎక్కువగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, కొచ్చిన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్జరీ జంట నగరాల్లో వెన్నునొప్పి బాధితులు పెరుగుతున్నారు. గతుకుల రోడ్లు దీనికి ప్రధాన కారణం. సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా ఈ బాధితులు ఉన్నారు. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం, గతుకుల కారణంగా వెన్నుపై ఒత్తిడి పెరిగి ఆపై నొప్పిరావడం తొలిదశ. రెండో దశలో ఒత్తిడి ఉన్న భాగాల అరుగుదల మొదలవుతుంది. కొద్ది రోజులకు డిస్కులు జారిపోవడం జరుగుతుంది. దీంతో నడుమునొప్పితో పాటు ఒక కాలు, ఒక చేయికి నొప్పి రావడం మొదలవుతుంది. 90 శాతం మందికి మందులు, ఫిజియోథెరపీతోనే నయమయ్యేలా చూస్తాం. తప్పనిసరైతేనే సర్జరీకి వెళతాం. సర్జరీ అనంతరం జీవనశైలి మార్చుకోవాలి. గతుకుల రోడ్లలో ప్రయాణించరాదు. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. - డాక్టర్ నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, మెడిసిటీ ఆస్పత్రి (జంటనగరాల ఆర్థోపెడిక్, స్పైనల్ వైద్యుల అసోసియేషన్ సభ్యులు) -
తిరుపతి జేఏసీ కన్వీనర్‌గా శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఎపి ఎన్జిఓ సంఘాలే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి జేఏసీ ఆవిర్భావించింది. 325 ప్రజాసంఘాల కలయికతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ వి. శ్రీకాంత్ రెడ్డిని జేఏసీ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణను రేపు నిర్ణయిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన రోజు నుంచి చిత్తూరు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో బంద్‌లు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు తగులబెట్టడం, వాహనాలు దగ్ధం చేయడం వంటి సంఘటనలో ఇక్కడ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు 325 ప్రజాసంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ(జెఎసి)గా ఏర్పడ్డాయి. ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న ఉద్దేశంతో వీరు ముందుకు సాగుతున్నారు. -
విభజనలో సమన్యాయమేదీ?: భూమన
రాష్ట్ర విభజన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలకు సమ న్యాయం పాటించడంలో విఫలమైందని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం తిరుపతిలో 1500 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 50 కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీ తిరుపతి పురవీధుల గుండా వెళ్లింది. ర్యాలీకి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సోనియా గాంధీ రెండుగా చీల్చి వేశారన్నారు. సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు ఊతమిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. విభజన జరిగిన వెంటనే ముందుగా స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. తరువాత రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూసిన టీడీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని చెప్పారు. -
కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి
కాకినాడ: సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. వైఎస్ఆర్ సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఏపీఎన్జీఓ సంఘం నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర అంతటా గత 8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. -
ఎమిమిదో రోజూ 'సమైక్య ' సెగ
కర్నూలులో కొనసాగుతున్న నిరసనలు తిరుపతిలో హోరెత్తిన సమైక్యనాదం... చిత్తూరు జిల్లాలో చల్లారని సమైక్య జ్వాలలు కృష్ణా జిల్లాలో ఆందోళనలు... -
అవనిగడ్డ ఉపఎన్నిక అనివార్యం
అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. చివరకు టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
భూప్రకంపనలు నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులను వణికించాయి. స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరిలో బుధవారరం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల, బలిజిపాలెం గ్రామాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. నివాసాల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. మళ్లీ భూమి కంపిస్తుందేమోన్న భయంతో ఇళ్ల బయటే ఉన్నారు. -
ముగిసిన 13 జిల్లాల ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం
గుంటూరు: పదమూడు జిల్లాలఆర్టీసీ ఉద్యోగుల సమావేశం ముగిసింది. ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన ఆర్టీసీని విభజిస్తామంటే సహించలేదని ఈ సమావేశంలో తీర్మానించారు. గురువారం నాలుగు జోన్లలో సమ్మె నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలో ఉన్న 123 డిపోలలో రేపు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఉంటుందని, 12వ తేదీన అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచుతామని ప్రకటించేవరకూ సమ్మెకొనసాగుతోందని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. కాగా. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మెకు దిగిన అనంతరం తాము నిరసన చేపడతామని టీఎంయూ ప్రకటించింది. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు 45 కోట్లను కోల్పోతున్న విషయం తెలిసిందే. -
'కేసీఆర్‌పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'
చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్ఎస్ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు. -
'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రెచ్చగొడితే ఉద్యమ రూపురేఖలు మారతాయని వారు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత,శంకర్ నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని వారు ఆరోపించారు. -
'సీమాంధ్ర నేతల ఇళ్ళు ముట్టడించండి'
కర్నూలు: పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి....సమైక్యాంధ్ర జేఏసీ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎమ్మినూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. -
హైదరాబాద్ సమైక్యాంధ్రులదే: అమరనాథ్ రెడ్డి
హైదరాబాద్ కేసీఆర్ తండ్రి జాగీర్ కాదని సమైక్యాంధ్రులదేనని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్‌కు చరిత్రలో పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు అమరనాథ్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజంపేటలో మున్సిపల్ కార్మికులు ఉపాధ్యాయులు, అంగన్వాడి మహిళలు ఐక్య కళాకారుల యూనియన్ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కడపలో బైక్ ర్యాలీ చేసేందుకు యత్నించిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కోటిరెడ్డి సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాల్లో పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
సమైక్యాంధ్ర కోసం విలేకరి ఆత్మహత్యాయత్నం
సమైక్యాంధ్ర కోసం ఓ పాత్రికేయుడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన సాయి అనే పాత్రికేయుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పలువురు నాయకులు చూసి, అతడిని అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిరోధించారు. గత కొన్ని రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాకినాడలో బుధవారం ఉదయం మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. ఆ తర్వాత కొంతసేపు మానవ హారం నిర్వహించారు. మసీదు సెంటర్లో కూడా ధర్నా చేయాలని ఆందోళనకారులు తలపెట్టారు. అంతా కలిసి మసీదు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ధర్నా ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక దినపత్రికకు చెందిన విలేకరి సాయి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన వాహనంలో ఉన్న పెట్రోలును తీసుకుని, ఒంటిపై పోసుకున్నాడు. నిప్పు అంటించుకోబోతుండగా అక్కడే ఉన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గమనించి అతడిని పట్టుకుని నిప్పు అంటించుకోకుండా ఆపారు. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటున్నారని, అది చూసి తట్టుకోలేకపోయానని ఆ తర్వాత సాయి చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో రాష్ట్ర విభజనను తట్టుకోలేక రాజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన కొద్ది సేపటికే పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాలో విలేకరి ఆత్మహత్యాయత్నం జరగడం గమనార్హం. -
సమైక్య ఉద్యమంపై 1024 కేసులు నమోదు
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎవరిమీదా పోలీసులు కేసులు పెట్టడం లేదని, ఆ ఉద్యమానికి సర్కారు అండదండలు ఉన్నాయంటూ కొందరు తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలకు పోలీసులు సమాధానం ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు 1024 కేసులు నమోదయ్యాయని అదనపు డీజీపీ కౌముది బుధవారం విలేకరులకు తెలిపారు. ఇంతవరకు 221 మందిని అరెస్ట్ చేశామని, మరో 1000 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు. జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసంపై 39 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పటివరకు 94మందిని అరెస్ట్ చేశామని కౌముది తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యామాన్ని శాంతియుతంగా చేసుకోవాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: భూమన
తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతోంది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాల కారణంగానే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలను ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన హైలెవల్ కమిటీపై ప్రజలకు నమ్మకం లేదని భూమన వ్యాఖ్యానించారు. అదంతా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన విమర్శించారు. మరోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలతో పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఏలూరులో ఆర్టీఏ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ఆటోమోబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మృతి
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందినవారు దుర్మరణం చెందారు. భాగల్ కోట్ కొల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో అయిదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇండికా కారు (AP 13 S 5405) అదుపు తప్పి గ్రానైట్ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీని ఢీకొంది. దాంతో వారు అక్కడకక్కడే చనిపోయారు. మృతులు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శశి భూషణ్, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాబిన్, శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా గోవా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలకు బీజాపూర్‌లోని అల్ అమీల్ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి మృతదేహాలను బంధువులు సంగారెడ్డికి తీసుకురానున్నారు. -
పుట్లూరులో డయేరియాతో ముగ్గురు మృతి
అనంతపురం : అనంపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరులో డయేరియా విజృంభించింది. కలుషితమైన తాగునీరు సేవించటంతో ఇప్పటికే ఇద్దరు మహిళులు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో నిన్న నారాయణమ్మ (75), లక్ష్మమ్మ (55) మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పైమంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో 18మంది తాడిపత్రిలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు. -
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
కడప : విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లావ్యాప్తంగా ఎనిమిదో రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరోవైపు సమైక్యాంధ్ర జేఏసీ వారం రోజుల పాటు ప్రయివేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు నిచ్చింది. పులివెందులలోనూ బుధవారం ఉదయం బంద్ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రొద్దుటూరులో బంద్ కొనసాగుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఎన్జీవోలు 12వ తేదీ నుంచి విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లాలోనో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 3,71,000.... కాగా అవుట్ ఫ్లో 3,08,000 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతో పాటు, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి నీటి ప్రవాహం వస్తుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావటంతో ఆరు గేట్లు ఎత్తివేసి 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకూ లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని, వరద ఉధృతి కొనసాగితే సాయంత్రానికి 18 గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సీఈ ఎల్లారెడ్డి తెలిపారు. -
మేడారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడారం(తాడ్వాయి), న్యూస్‌లైన్ : మండలంలోని మేడారంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ములుగు ఆర్డీఓ మోతీలాల్, డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రె వెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. మేడారంలోని 161 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ భూముల్లో గిరిజనేతరుడు కోళ్ల రాజే శం నిర్మించుకున్న షెడ్‌ను ట్రాక్టర్ డోజర్‌తో పూర్తిగా తొలగించారు. గిరిజనుడు వత్తం లక్ష్మ య్య ఇంటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా ఆయన అడ్డుకుని తన ఇం టిని తానే తొలగిస్తానని అధికారులను కోరడం తో కొంతమేరకు పాక్షికంగా కూల్చారు. సిద్ధబోయిన రవి నిర్మించిన బిల్డింగ్ స్లాబ్‌పై కట్టిన గోడను కూడా తొలగించారు. పోలీసులు వెళ్లిపోయూక గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇళ్ల ను తొలగించొద్దని ఆర్డీఓను కోరారు. ప్రభుత్వ భూముల్లో ఇకమీదట అక్రమంగా ఇళ్లను ని ర్మించకుండా చూస్తామని, ప్రస్తుతం నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని సర్పం చ్ గడ్డం సంధ్యారాణి ఆర్డీఓను కోరగా ప్రభుత్వ భూమిలో ఇళ్లను కోల్పోరుున గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఆయన సమాధానమిచ్చారు. తొలగించవొద్దని ఆత్మహత్యాయత్నం ఇదిలా ఉండగా షెడ్‌ను తొలగించొద్దని కోళ్ల రాజేశం ఆత్మహత్యకు యత్నించాడు. షెడ్‌ను అధికారులు ట్రాక్టర్ డోజర్‌తో తొలగిస్తుండగా రాజేశం బయటకు రాకపోవడంతో ప్రమాదం జరుగుతుందని భావించిన అధికారులు బల వంతంగా బయటకు తీసుకొస్తుండగానే అత డు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని ఆటోలో తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఓ వ్యక్తి భూమి కొనుగోలు చేశామని, షెడ్‌ను అధికారులు కూల్చడంతో తీవ్ర నష్టపోయూమని రాజేశం భార్య కన్నీరుపెట్టింది. ముగ్గురిపై కేసు నమోదు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మిం చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హతీరాం మంగళవారం తెలిపారు. మేడారంలోని 161 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూ మిలో కోళ్ల రాజేశం, వట్టం లక్ష్మయ్య, సిద్ధబోయిన రవి అక్రమంగా ఇళ్లు నిర్మించుకునట్లు రె వెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
‘వెంటిలేటర్’పై ఎంజీఎం!
ఎంజీఎం,న్యూస్‌లైన్: కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీ ఎం ఆస్పత్రి... సౌకర్యాలు, పరికరాల లేమీ, వైద్యుల కొరత వంటి కారణాలతో ‘యమ’జీఎంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సర్కారు అలసత్వం వెరసి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎంజీఎంలో వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. అత్యవసర సమయూల్లో కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు మూలకుపడ్డారుు. ఆర్ఐసీయూ వార్డులో ఉన్న పది వెంటిలేటర్లలో ఒకే ఒక్కటి పనిచేస్తుండడంతో వైద్యులు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలు కావడం, క్రిమిసంహారక మందు తాగిన బాధితులు, పాము, తేలు కాటు బారిన పడినవారు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వైద్యచికిత్సల కోసం నిత్యం ఎంజీఎం ఆస్పత్రికి పదుల సంఖ్యలో వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నారుు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ క్రమంలో వారికి వెంటనే వెంటిలేటర్ల ద్వారా కృతిమ శ్వాసను అందిస్తూ చికిత్స చేయూల్సి ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా వైద్యసేవలు పొందాలంటే రోజుకు సుమారు *20 వేలు చెల్లించాలి. ఇంత ఖరీదైన వైద్యం పొందలేని నిరుపేదలు ఎంజీఎంకు రాక తప్పదు. కానీ... ప్రస్తుతం ఒకే ఒక్క వెంటిలేటర్ పనిచేస్తుండడంతో అక్కడ రోగుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవక తప్పని పరిస్థితులు దాపురించారుు. ఏడాదిగా మరమ్మతులు లేవు ఎంజీఎం ఆస్పత్రిలోని ఆర్ఐసీయూ వార్డులో చైన్నయ్ ట్రాన్స్హెల్త్ కేర్ కంపెనీ నుంచి *12 లక్షల విలువ చేసే తొమ్మిది వెంటిలేటర్లతోపాటు ఎస్బీహెచ్ బ్యాంక్ అందించిన ఒక వెంటిలేటర్ ఉంది. వీటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ట్రాన్స్ హెల్త్ కేర్ కంపెనీకి అప్పగించారు. ఇందుకోసం ఆ కంపెనీకి ఏటా * నాలుగు లక్షలు చెల్లించాలి. అరుుతే 2011-12కు సంబంధించిన బిల్లులను ఆ కంపెనీకి సకాలంలో చెల్లించలేదు. దీంతో సదరు కంపెనీ వారు గత ఏడాది మెరుుంటనెన్స్ అందించకుండా చేతులేత్తేశారు. మరమ్మతుకు నోచుకోకపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆర్ఐసీయూ వార్డులోని ఏడు వెంటిలేటర్లు మూలకుపడ్డాయి. మిగిలిన మూడు వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.... ప్రస్తుతం ఆ సంఖ్య ఒక్కటికి చేరింది. వారంలో అందుబాటులోకి తెస్తాం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వెంటిలేటర్ల మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వాస్పత్రులకు ప్రత్యేకంగా బయోమెడిక ల్ ఇంజినీర్‌ను నియమిస్తే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. వెంటిలేటర్లను మరమ్మతు చేసే ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడమే కారణం. ప్రస్తుతం వెంటిలేటర్లను వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తాం. - నాగేశ్వర్రావు, ఆర్ఎంఓ -
సార్.. తెలంగాణ దిక్సూచి
హన్మకొండచౌరస్తా/వడ్డెపల్లి, న్యూస్‌లైన్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తన నిరాడంబరమైన జీవితంలో కేసీఆర్‌కే కాదు... తెలంగాణ సమాజానికే పెద్ద దిక్కుగా నిలిచారని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కొనియూడారు. కేసీఆర్ సుఖాల్లోనే కాదు... కష్టాల్లోనూ తానున్నానంటూ వెన్నుదన్నుగా నిలిచి ఓ గురువు, తండ్రి పాత్ర పోషించి అండదండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ 79వ జయంతిని మంగళవారం బాలసముద్రంలోని ఏకశిలా పార్కు (జయశంకర్ స్మృతివనం)లో ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర శివారు మడికొండ నుంచి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు ర్యాలీగా బాలసముద్రంలోని పార్కుకు చేరుకున్నారు. అనంతరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు, ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పదకొండు రోజుల ఆమరణ దీక్ష చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి చిదంబరం స్వయంగా జయశంకర్ సార్‌కు ఫోన్ చేసి మాట్లాడారనిచెప్పారు. ఆ తర్వాతనే డిసెంబర్ 9న తెలంగాణపై అధికార ప్రకటన చేశారని... ఈ ఘనత ప్రొఫెసర్‌కే దక్కుతుందన్నారు. జయశంకర్ సార్ ఎంతో వాక్చాతుర్యం గల వారని, హాస్యప్రియుడని పేర్కొన్నారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే అందుకు ప్రొఫెసర్ అందించిన స్ఫూర్తే కారణమన్నారు. కేసీఆర్ మొండితనానికి జయశంకర్ సార్ సారథ్యం తోడైనందునే తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగిందన్నా రు. కేసీఆర్ సూటిగా విమర్శిస్తే సీమాంధ్రుల గుండెల్లో గునపం గుచ్చినట్లు ఉంటుందని... కానీ జయశంకర్ సార్ విమర్శలు కాశ్మీర్ శాలువాలో చెప్పు పెట్టి కొట్టినట్లుగా ఉండేవని మేధావులే కితాబిచ్చారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ మరణాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని... ఆయన లేడన్న విషయాన్ని పదేపదే గుర్తుచేసుకుని కంటతడి పెట్టేవారని చెప్పారు. రాజముద్ర పడ్డాకే విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ నమ్మొద్దని, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించిన అనంతరం రాజముద్ర పడ్డాకే... విజయోత్సవ సంబరాలు జరుపుకుందామని కేటీఆర్ అన్నారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో ఆంధ్ర నాయకుల విగ్రహాలే కాదు.... తెలంగాణ ఉద్యమ కారులు కాళోజీ, జయశంకర్ సార్ విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పా టు చేసుకుందామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తదనంతరం తెలంగాణ పది జిల్లాలో పునర్నిర్మా ణం చేపట్టి వరంగల్‌లో ఏర్పడే కొత్త జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెడదామన్నారు. తె లంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జయశంకర్ స్మారక గురుకులాలు, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ప్రజలు మరిచిపోలేని పాత్ర పోషించారన్నారు. పాలకుర్తిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ములుగు రాయినిగూడెంలో సీఎం కిరణ్‌కుమార్, పీఆర్పీలో ఉన్నప్పుడు చిరంజీవికి ఓరుగల్లు ప్రజలు తమ పోరాటపటిమను చూపించారన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టాలి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్న సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నాయకుల కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీమాంధ్ర రాజ కీయ నాయకుల స్వార్థం కోసం అక్కడి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఇప్పటికే వేల మందిని పోగొట్టుకున్నామని, ప్రాణాలు విడవొద్దని సీమాంధ్రప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర నాయకుల్లో అపోహలు తొలగించేందుకు చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ ఊపిరి, ఆశయ సాధన కోసం జయశంకర్ సార్ ఓ శిల్పిలా పాటుపడ్డారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జయశంకర్ శిల్పి అయితే కేసీఆర్ మంచి విగ్రహానికి ఉపయోగించే గట్టి రాయిలాంటి వారన్నారు. కేసీఆర్‌ను తెలంగాణకు సింహస్వప్నంగా మలి చిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఏకశిలా పార్కును జయశంకర్ సృ్మతి వనంగా మార్చి, జిల్లా కళాకారుల కోసం పార్కు ఆవరణలో ఆడిటోరియం నిర్మాణానికి నిధులు కావాలని సీఎంను కోరితే... లేవని చెప్పారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వెల్లడించారు. వచ్చే జయంతి లోపు తెలంగాణకే తలమానికంగా ఏకశిలా పార్కును రూపుదిద్దుతాన్నారు. టీడీపీ సీమాంద్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే చంద్రబాబు స్పందించకపోవడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఊసరవెల్లి ఎర్రబెల్లికి చీమునెత్తురు ఉంటే సీఎం పదవిపై కలలు కనడం కాదు... హరికృష్ణ రాజీనామా వెనక్కి తీసుకునేలా బాబుపై ఒత్తిడి తేవాలని సవాల్ విసిరారు. హన్మకొండ చౌరస్తాలో జయశంకర్‌సార్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి కొనియూడారు. టీఆర్ఎస్ నాయకులు పరమేశ్వర్, రాజయ్యయాదవ్, అచ్చ విద్యాసాగర్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్, కొక్కుల సతీష్, గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, దర్శన్‌సింగ్ పాల్గొన్నారు. పెద్ద సార్‌కు ఓరుగల్లు నివాళి జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు ఓరుగల్లు ఘననివాళులర్పించింది. ప్రొఫెసర్ జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా మంగళవారం టీఆర్ఎస్, టీజేఏసీ, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, వైద్య, న్యాయవాద, యువజన, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగారుు. జనగా మ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, పరకాల, ములుగు, నర్సం పేట, మహబూబాద్, డోర్నకల్, వర్ధన్నపేట, తొర్రూరు ప్రాంతాల్లో రక్తదానం, అన్నదానం, పండ్లు, నోట్‌బుక్‌ల పంపిణీ చేపట్టారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. హన్మకొండ అమరవీరుల స్థూ పం వద్ద అధిక సంఖ్యలో తెలంగాణవాదులు నివాళులర్పించారు. భీమారంలో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గొర్రెకుంట, కొత్తవాడ, ఎంజీఎంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ జిల్లా, అర్బన్ కార్యాలయాల్లో రక్తదానం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్, గుడిమల్ల, డాక్టర్ పరమేశ్వర్, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, చాగంటి రమేష్, బూజుగుండ్ల పాల్గొన్నారు.