District
-
విడిపోతే ఎడారే
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏమిటని మాట్లాడుతున్నారేగానీ రైతుల గురించి కానీ, సాగునీటి సమస్య గురించి కానీ ఆలోచించే నాయకులు ఎవరూ లేరని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు(రంగరాజు) ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విడిపోయినా, రాయల తెలంగాణ గా వేరుపడినా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నది జలాలు 811 టీఎంసీలు మాత్రమే రాష్ర్టం వినియోగించుకోవాల్సి ఉండగా అదనంగా మరో 200 టీఎంసీలు వాడుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు బోర్డులు వస్తాయన్నారు. అలా వస్తే అవి జాతీయ ప్రాజెక్టులుగా మారి ఇప్పటి మాదిరిగా నీటిని వాడుకొనే అవకాశంలేక నీటి సమస్య ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. రాయల తెలంగాణ ఏర్పడితే రాయలసీమ ప్రయోజనాల కోసం కట్టిన శ్రీశైలం దాని పరిధిలోకి వెళ్లి కృష్ణా డెల్టా ఉనికికి ప్రమాదకరంగా మారుతుందన్నారు. జలవిద్యుత్ కోసమని కట్టిన ఈ ప్రాజెక్టులను ఇంత వరకు నీటి అవసరాలకు వాడుకుంటున్నామని, రాష్టం విడిపోతే ఇలాంటి హక్కులను కోల్పోతామని పేర్కొన్నారు. మిగులు జలాలు వాడుకుంటామని రాయలసీమలో నిర్మించిన తెలుగు గంగ, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులకు నీరు రాని పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. తెలంగాణ లో ఎలాంటి ప్రాజెక్టులు లేవు కనుక సీమాంధ్రప్రాంతానికి ఎగువన కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇలాంటి తీవ్రమైన విషయాలను గమనించకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. 1956కు ముందుతూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఖమ్మం జిల్లాలోవిలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే భద్రాచలం డివిజన్ ను ఆంధ్రాలో కలిపేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారని, అయితే ప్రస్తుతం అక్కడి ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని అంటున్నారని పేర్కొన్నారు. ఈ డివిజన్‌ను ఆంధ్రాలో కలపకపోతే పోలవరం ప్రాజెక్టునుంచి ఇక్కడకు నీళ్లొచ్చేది అనుమానమే అన్నారు. నీటి సమస్య, విద్యుచ్ఛక్తి, ఉద్యోగస్తులు, హైదరాబాద్ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో తెరమీదకు తేవాల్సి ఉండగా, కేవలం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారా... కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుతారా... అనే కోణంలో రైతులు, నీటి సమస్యలను విస్మరించి ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నీటి విషయాలపై ప్రత్యేక దృష్టి వహించి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్వార్థపర ప్రయోజనాల కోసం ఇలాంటి విషయాలను మర్చిపోతే భావితరాల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, దీనికి మరో ప్రత్యామ్నాయం లేనేలేదన్నారు. -
కౌలుదారులపై చిన్నచూపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : దేశంలోనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నాం. వీటి ద్వారా కౌలుదారులు ఇప్పటివరకు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. వారికి బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పిస్తాం. గుర్తింపు కార్డు ఉంటే చాలు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవచ్చు... అంటూ ప్రభుత్వం చేసిన ఆర్బాటపు ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. జిల్లావ్యాప్తంగా కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ బ్యాం కర్లు మాత్రం మొహం చాటేస్తున్నారు. పట్టాదారు, కౌలుదారుల మధ్య నెలకొం టున్న వివాదాలను సాకుగా చూపి రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు పట్టాదారులు పంటరుణాలు తీసుకుంటుండడంతో కౌలుదారులకు రుణాలు దక్కడం లేదు. జిల్లాలో 2013-14 సంవత్సరంలో 9,416 మందిని కౌలుదారులుగా గుర్తించగా, ఇందులో 7,256 మంది కొత్తవారు కాగా, 2,210 మందిని రెన్యూవల్ చేశారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 586 మందికే రూ.1.95 కోట్లు రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెన్యూవల్ చేసిన 2,210 మందికి కూడా రుణాలు మంజూరు చేయకపోవడం కౌలు రైతుల కష్టాలకు నిదర్శనం. గతేడాది 8వేల మందిని గుర్తించినా, 3800 మందికి మాత్రమే రూ.8.26 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 80వేల మంది.. జిల్లావ్యాప్తంగా దాదాపు 80వేల మంది కౌలుదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో చాలా మంది అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా అధికారులు కుంటిసాకులు చెబుతూ చాలా మందిని పట్టించుకోలేదు. కౌలుదారులుగా గుర్తించిన వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖంగా లేరు. దీనంతటికి అధికారుల వైఫల్యమే కారణమని స్పష్టమవుతోంది. గుర్తింపు కార్డుల జారీ సమయంలో గ్రామ సభలు పెట్టి రెవెన్యూ రికార్డులు పరిశీలించి రైతులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ గ్రామ సభలు నిర్వహించకుండానే పలు మండలాల్లో కౌలు రైతుల ఎంపిక జరిగిపోయిందన్న విమర్శలున్నాయి. భూ యజమానుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోవడం వల్ల కూడా కౌలు రైతుల దరఖాస్తులు చేసుకోలేకయారని ఆరోపణలున్నాయి. భూమిని వరుసగా ఎవరైనా పన్నెండేళ్ల పాటు సాగు చేస్తే అది వారికే సొంతమవుతుందనే అనుమానం భూ యజమానుల్లో నెలకొంది. దీంతోపాటు కౌలు రైతుల రుణం తమకు చుట్టుకుందనే అనుమానాలు ఉన్నాయి. పొలాన్ని ఒకటి రెండు సీజన్లకు కౌలుకు తీసుకుంటూ సాగు సమయంలో ప్రకృతి విపత్తుల తలెత్తి అప్పులు తీర్చలేకపోతే బ్యాంకులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తిరిగి చెల్లిస్తారో లేదో అన్న అనుమానాలతో కూడా బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రైతులు తీసుకున్న రుణాలను బ్యాంకులు రీ షెడ్యూల్ చేసేందుకు సైతం సుముఖంగా లేవు. ఈ విషయమై లీడ్ బ్యాంక్ మేనేజర్ డీఏ చౌదరి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ.. కౌలు రైతులందరికీ రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. -
సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య
ఉండి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రకటనతో తీవ్ర ఆవేదన చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉండి మండలం కోలమూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. కోలమూరుకు చెందిన మువ్వా మేషక్ (22) వ్యవసాయ కూలీ. అవివాహితుడైన ఇతనిపై వృద్ధులైన తల్లిదండ్రులు, మతిస్థిమితం లేని చెల్లి ఆధారపడి ఉన్నారు. ఆరు రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సోమవారం కోలమూరులో జరిగిన ఉద్యమంలో భాగంగా వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లోనుంచి బయటకు వెళ్లి పొలంగట్టు వద్ద పురుగులమందు తాగి ప్రాణాలు వదిలాడు. అతని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంకా ఎంతమంది బలవ్వాలి : మాజీ ఎమ్మెల్యే సర్రాజు మేషక్ మృతి వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కోలమూరు వెళ్లి అతని కుటుంబ స భ్యులను ఓదార్చారు. సర్రాజు మా ట్లాడుతూ రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మబలిదానం చేసుకోవడం బాధాకరమన్నారు. ఇంకా ఎంతమంది బలవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే యిర్రింకి శ్రీను, కట్టా వెంకటేశ్వరరావు బలయ్యారని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సోనియా గాంధీ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థికసాయం అం దించారు. గ్రామ సర్పంచ్ నేతల మార్టిన్, ఉప సర్పంచ్ కూనపరాజు సత్యనారాయణరాజు పాల్గొన్నారు. -
ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేది, తెచ్చేది తామేనని గతంలో ప్రకటించినట్లుగానే మాట నిలబెట్టుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంగా ఏర్పాడ్డాక తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన మంగళవారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు, విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, మెరుగైన రాష్ట్రం కోసం అందరమూ కృషి చేయాలని కోరారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్సింగ్, దిగ్విజయ్‌సింగ్‌లకు కరీం నగర్ ప్రజల తరుపున కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో తమను ముందుకు నడిపిన అందరికీ ధన్యావాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సాధనలో ముందుండి నడిచిన ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎ.లక్ష్మణ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కె.రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.సురేందర్‌రెడ్డి, వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
72 గంటల నిరవధిక బంద్
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ తాడేపల్లిగూడెం జాయింట్ యాక్షన్ కమిటీ 72 గంటల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి బీవీఆర్ కళా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు మూతపడతాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల తోపాటు, ఆటోలు కూడా మూడు రోజులపాటు తిరగవు. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహా యింపు ఇచ్చారు. పాలు, నీటి సరఫరా, మెడికల్ షాపులు, ఏటీఎంల వినియోగానికి సడలింపులు ఉంటాయి. బంద్ సందర్భంగా పోలీస్ ఐలాండ్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శిబిరాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను కొనసాగిస్తారు. రిలే దీక్షలు, వంటా వార్పు వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలు, నీటి సమస్యలు, కరెంటు కష్టాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలలో కలిగే నష్టాలపై రైతులకు, సామాన్యులకు అవగాహన కల్పించాలని తీర్మానించారు. శాంతి మార్గంలో ర్యాలీలు, ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. ఉద్యమాన్ని నడిపించే విషయంలో వివిధ వర్గాలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపారు. వ్యాపార వర్గాల కోణంలో ఇబ్బందులు, ప్రజా జీవనానికి కలిగే ఇబ్బందులపై చర్చించారు. అనంతరం కార్యాచరణను రూపొందించారు. సమావేశానికి జేఏసీ చైర్మన్ ఈతకోట తాతాజీ అధ్యక్షత వహించారు. గమిని సుబ్బారావు, గ్రంధి సత్యనారాయణ, పేరిచర్ల మురళీ కృష్ణంరాజు, మాకా శ్రీనివాసరావు, కొవ్వూరి నాగేంద్రరెడ్డి, తోట హరిశ్చంద్రప్రసాద్,చలంచర్ల మాధవరావు, గంధం సుధాకర్ హాజరయ్యారు. -
ఎవరికి వారే..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : నాలుగేళ్ల నాన్చివేత తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేశాయి. తెలంగాణ విషయంలో ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలో ఇబ్బందిపడ్డ కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు ఈ ప్రకటన కొత్త ఊపిరిపోసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించవచ్చనే ఉత్సాహంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఉమ్మడిగా కృషి చేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం సమస్య కాదన్న ఆలోచనలో వారు ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై చేసిన ప్రకటన విషయంలో ఘనత ఎవరిదనే అంశంపై అధికార పార్టీ జిల్లా ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొనడం హస్తం శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తోంది. అధిష్టానం ప్రకటన రావడానికి తమ కృషి కారణమంటే తమ కృషి కారణమంటూ మంత్రి శ్రీధర్‌రాబు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. తెలంగాణకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసింది. అనంతరం పొన్నం ప్రభాకర్ ఆగస్టు 3న జిల్లాకు వచ్చారు. తెలంగాణ ప్రకటనలో కీలకంగా వ్యవహరించారనే కారణంతో ఆయనకు అదే రోజు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించే పొన్నం తెలంగాణ ప్రకటనకు ముందు తాను నిర్వహించిన పాత్ర గురించి వివరించారు. పార్లమెంట్‌ను స్తంభింపజేశానని పేర్కొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో పార్టీపరంగా జరిగిన మొదటి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారని అంతా భావించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం కారణంగా రాలేకపోయారని సభలో పలువురు నేతలు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఉదయమే ముగిసినా... మంత్రి అదే రోజు జిల్లాకు రాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో వేరే రకంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రకటన విషయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకే మంత్రి రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి రాకూడదని మంత్రి ముందుగానే నిర్ణయించుకున్నారని... ఈ కారణంగానే మంత్రికి సన్నిహితంగా ఉండే డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు కూడా గైర్హాజరయ్యారని చెప్పుకుంటున్నారు. పార్టీపరంగా జరిగిన ఈ కార్యక్రమంతోపాటు పలు ఉద్యోగ, సామాజిక, కుల సంఘాలు అదే రోజు పొన్నం ప్రభాకర్‌ను సన్మానించాయి. మరుసటి రోజు ఆదివారం కూడా వివిధ సంఘాలు పొన్నం ప్రభాకర్‌ను అభినందించాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకావడంతో పొన్నం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా ఒకరోజు గడిచాక... తెలంగాణ ప్రకటనపై మంత్రి శ్రీధర్‌బాబు కాార్యక్రమాలకు అంకురార్పన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మంత్రి జిల్లాకు చేరుకున్నారు. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సాధనలో తన పాత్రను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1999లోనే సోనియాంగాంధీని కోరిన వారిలో తాను ఒకరినని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా ఎంపీ పొన్నం ప్రభాకర్ కంటే ముందుగానే తెలంగాణ కోసం శ్రీధర్‌బాబు కృషి చేసినట్లుగా స్పష్టమవుతోందని మంత్రి వర్గీయులు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది తామేనని చెప్పామని, ఎవరికీ ఏ అనుమానాలు ఉన్నా అదే నిజమయ్యిందని మంత్రి అన్నారు. అనంతరం శ్రీధర్‌బాబును కూడా ఉద్యోగ సంఘాలు సన్మానించాయి. ఎంపీ పొన్నంను సన్మానించిన అన్ని సంఘాలు మంత్రి శ్రీధర్‌బాబుకు అభినందనలు తెలిపాయి. అయితే ఒక్కటిగా కాకుండా ఇలా వేర్వేరుగా సన్మానించడం, అభినందనలు తెలుపడం తమకు ఒకింత ఇబ్బందిగానే పరిణమించిందని ప్రైవేటు విద్యాసంస్థల సంఘం నేత ఒకరు చెప్పారు. ఇలా కాకుండా ముఖ్య నేతలు ఇద్దరు ఉమ్మడిగా వస్తే బాగుండేదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊపిరిపోసే నిర్ణయంపై ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన ముఖ్య నేతలు గొప్పల కోసం పోటీపడి మొత్తం అంశాన్ని పక్కకునెట్టి వేస్తున్నారనే వాఖ్యలు వినిపిస్తున్నాయి. -
గోదారి శాంతిస్తోంది
కొవ్వూరు, న్యూస్‌లైన్ : నాలుగు రోజుల పాటు ప్రమాద స్థాయిలో ప్రవహించి జిల్లా ప్రజల ను వణికించిన వరద గోదావరి క్రమంగా శాంతి స్తోంది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి 19 అడుగులకు చేరిన నీటిమట్టం తగ్గుతోంది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు నీటిమట్టం 17.75 అడుగులకు తగ్గడంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఇంకా వరద ముంపులోనే ఉంది. సుమారు 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గీతా మందిరం గర్భాల యంలో వరద తొలగిపోవడంతో సిబ్బంది ఆల యూన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు. వరద ప్రభావంతో ఆలయంలో ఒండ్రు మట్టి పెద్దఎత్తున పేరుకుపోయింది. మద్దూరులంక వరద ముంపు నుంచి తేరుకుంటోంది. అధికారులు ఇక్కడి పునరావాస కేంద్రాన్ని ఎత్తివేశారు. మం గళవారం ఉదయం 6 గంటలకు 17.40 అడుగులున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 16.20 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు 15.40 అడుగులకు చేరుకుంటుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేశారు. మం గళవారం సాయంత్రం 7 గంటలకు ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 16లక్షల 81వేల 984 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. గత నెలలో 20నుంచి 9 రోజులపాటు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. ఈనెలలో ఆరు రోజులుగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. -
విభజిస్తే ఊరుకోం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు సోనియాగాంధీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే సీమాంధ్ర సత్తా ఏంటో చూపుతామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం ఆ పార్టీ నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ మనుగడ కనుమరుగు అవుతోందన్న భయంతోనే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి భయపడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగ రాజీనామాలతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆనం సోదరులారా బయటకు రండి ‘రాష్ట్ర మంత్రి, రూరల్ ఎమ్మెల్యే ఆనం సోదరులు ఎక్కడ దాక్కున్నారో బాహ్య ప్రపంచంలోకి రండి. మీ ఇంటిముందుకొచ్చాం. దొంగ రాజీనామాలు చేసి బొత్సకు, భానుశ్రీకి ఇవ్వడం కాదు. దమ్ము, ధైర్యం ఉంటే స్పీకర్‌కు ఇచ్చి ఆమోదింప చేసుకుని సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ప్రజా ఉద్యమంలో నేరుగా పాల్గొనండి’ అని కోటంరెడ్డి, అనిల్ సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం పాపం చేశారని ఆయన విగ్రహాలపై చెయ్యి వేయాలని అనుకుంటున్నారు?. మూడు పర్యాయాలు నిన్ను ఎమ్మెల్యేగా చేశారనా? మీ తమ్ముడిని మంత్రి చేశారనా? మరో ఇద్దరు తమ్ముళ్లకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనా? లేక భానుశ్రీని మేయర్ చేసినందుకా? వైఎస్సార్ విగ్రహాలను పగులకొట్టండని పిలుపునిస్తారని ఆనం వివేకానందరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒక్కసారి వైఎస్సార్ విగ్రహాలపై చెయ్యి వేసి చూడండి.. ఏం జరుగుతుందోనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా కల్పిస్తున్న సమయంలో ఆయన్ను జైల్లో పెట్టించి కాంగ్రెస్ నాయకులు నాటకాలు అడుతున్నారన్నారు. ఈ నాటకాలు మరెంతో కాలం సాగవన్నారు. మహా అయితే మరో నాలుగు నెలల పాటు కొనసాగిస్తారేమో అని అన్నారు. ఆ తర్వాత తమ యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అప్పుడు నీవు ఏమి మాట్లాడినా, ఏం చేసినా ఎవరూ పట్టించుకునే వారే ఉండరని ఆనం వివేకానుద్దేశించి కోటంరెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ముప్పసాని శ్రీనివాసులు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్కే సుభాన్, షేక్ మాబు, లెక్కల వెంకారెడ్డి, ఆర్.జెస్సీ, సంక్రాంతి కల్యాణ్‌రెడ్డి, మునీర్‌సిద్ధిక్, దార్ల వెంకటేశ్వర్లు, ఎ.బాలకోటేశ్వరరావు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎస్ఆర్ ఇంతియాజ్, కూకటి ప్రసాద్. జాఫర్మోహిద్దీన్, ఫజల్మన్నడు, దండే లక్ష్మిరెడ్డి, టి.రఘురామిరెడ్డి, ముప్పాల శేషుగౌడ్, కాకుటూరు విజయభాస్కర్‌రెడ్డి, గంధం సుధీర్‌బాబు, రజిని, సుభాషిణి, మీనమ్మ, శ్రావణ్‌కుమార్, హరిప్రసాద్‌నాయుడు, సత్య, అఖిల్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, నర్సింహముదిరాజ్, బత్తల వెంకటేశ్వర్లు, పట్రంగి అజయ్, చేజర్ల మహేష్‌బాబు, ప్రశాంత్, కిరణ్, నరేష్, అజీమ్, కారుదుంప దశరథరామయ్యలతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు. -
వరద నీటిలో.. ఉత్కంఠ
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. దాటేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు మధ్యలో చిక్కుకుపోయాడు. కాపాడేందుకు వెళ్లిన మరో యువకుడిని నీటి ప్రవాహం ప్రమాదంలోకి నెట్టింది. ఒక్కసారిగా తాడు తెగిపోవడంతో ఇద్దరూ వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయారు. ఏం జరుగుతుందోనని అప్పటికే అక్కడ గుమిగూడిన ప్రజలు వాగు వెంట పరుగులు తీశారు. పది నిమిషాల తర్వాత ఇద్దరూ క్షేమంగా ఒడ్డుకు చేరడంతో నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. మంచిర్యాల బైపాస్‌రోడ్డు సమీపంలో ఉన్న రాళ్లవాగు కాజ్వే ఈ ఉత్కంఠ సన్నివేశానికి మంగళవారం సాయంత్రం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన గూడూరి రవి తన ఆటో ట్రాలీని మంగళవారం ఉదయం షోరూంలో మరమ్మతుకు ఇచ్చాడు. సాయంత్రం డెలివరీ ఇస్తామని చెప్పడంతో సాయంత్రం 4గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న రాళ్లవాగు కాజ్వే వద్దకు వచ్చాడు. వాగు అవతలి వైపు వెళ్లిన రవి మళ్లీ వాగు దాటుతుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రవి కాజ్వే మధ్యలోకి రాగానే నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో కాజ్‌వేపై ఉన్న సిమెంటు దిమ్మెను పట్టుకుని నిలబడ్డాడు. గమనించిన స్థానికులు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. తహశీల్దార్ ఇత్యాల కిషన్, సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహం రవి భుజాల వరకు చేరింది. మంచిర్యాల రెవెన్యూ కార్యాలయ సబార్డినేట్ వడ్లకొండ ప్రభాకర్ వరదలో చిక్కుకున్న రవికి కాపాడేందుకు ట్యూబ్‌తో వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో వెనక్కి కొట్టుకు వచ్చాడు. రెండోసారి మరో యువకుడి సహాయంతో సగం దూరం వెళ్లినా.. వరద ఎక్కువ కావడంతో ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చాడు. పట్టణంలోని రాళ్లపేటకు చెందిన ప్లంబర్ సయ్యద్ ఆసిఫ్ తాను కాపాడుతానంటూ ముందుకు వచ్చాడు. అధికారుల సూచనలతో ట్యూబ్ తొడుక్కుని వాగులోకి దిగాడు. ధైర్యంగా ఈత కొడుతూ రవి వద్దకు వెళ్లాడు. వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇద్దరూ వాగులో కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఆసిఫ్ ట్యూబ్‌కు ఉన్న తాళ్లను లాగే ప్రయత్నం చేయగా అది తెగిపోయింది. ఆసిఫ్ చాకచక్యంగా వ్యవహరించి తన ట్యూబ్‌ను రవి పట్టుకునేలా విసిరాడు. రవి ట్యూబ్‌ను పట్టుకున్నా 200 మీటర్ల దూరం కొట్టుకుపోయి ఓ వైపు ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. ఆసిఫ్ ఈత కొడుతూ ఒడ్డుకు చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. రవి ప్రాణాలు కాపాడిన ఆసిఫ్ ధైర్యాన్ని మెచ్చుకుని తహశీల్దార్ ఇత్యాల కిషన్ రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఆసిఫ్ మాట్లాడుతూ కాపాడుతాననే నమ్మకంతో వాగులోకి దిగానని, తాడు తెగడంతో భయపడకుండా రవికి ట్యూబ్ అందించి తాను ఒడ్డుపైకి చేరుకున్నానని ఉద్వేగంగా తెలిపాడు. గూడూరి రవి మాట్లాడుతూ తను బతికిబయట పడుతానని అనుకోలేదని, నేను ఇప్పుడు మీముందు ఉన్నానంటే ఆసిఫ్ కాపాడిన ప్రాణమని, ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటానని తెలిపాడు. ఆసిఫ్‌ను స్థానికులు రియల్ హీరో అంటూ అభినందనలతో ముంచెత్తారు. -
ఉప్పెనలా ఉద్యమం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. ఏడవ రోజైన మంగళవారం కూడా విద్యాసంస్థలు మూతపడ్డారుు. ఉద్యోగులంతా ఉద్యమబాట పడ్డటంతో ప్రభుత్వ కార్యాలయూలు సైతం తెరుచుకోలేదు. మునిసిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ రెండో రోజుకు చేరింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించారు. జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, బైఠారుుంపులు, ప్రదర్శనల నడుమ నిరసన జ్వాలలు మిన్నంటారుు. రజకులు, మేదరులు, నాయూ బ్రాహ్మణులు వంటి వృత్తిదారులతోపాటు పాలక్యాన్లు వంటి చిరు వ్యాపారులు సైతం ఉద్యమంలో జత కలిశారు. ఏలూరు మోతేవారి తోటలోని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయాన్ని పశు సంవర్థక శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్జీవోలు ముట్టడించారు. ఓ యువకుడిని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుగా పేర్కొంటూ ఉద్యోగినులు గాజులు తొడిగి నిరసన తెలిపారు. కావూరి వెంటనే మంత్రి పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు మొగల్తూరు వెళ్లి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పాత ఇంటివద్ద ధర్నా నిర్వహించారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. యువకుడి ఆత్మ బలిదానం.. మరొకరి ఆత్యహత్యాయత్నం రాష్ట్ర విభజన ప్రకటనను తట్టుకోలేక ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మొవ్వా మేషక్ (22) అనే యువకుడు మంగళవారం ఆత్మ బలిదానం చేశాడు. కామవరపుకోట మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన బొప్పారుు కాయల వ్యాపారి నూతి కిషోర్ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. విభజన నిర్ణయం నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన తణుకు మండలం మండపాక శివారు ఎర్రనీలిగుంట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా శంకరుడు (35) గుండెపోటుతో మృతి చెందాడు. నిరసనల హోరు : జిల్లావ్యాప్తంగా వంటా వార్పు, ర్యాలీలు, కేసీఆర్, సోనియూగాంధీ, మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఏలూరులో మెకానిక్‌లు, స్వర్ణకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాగవంశం సంక్షేమ సంఘం, అర్చకుల సమాఖ్య ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. వసంత మహల్ సెంటర్లో అర్చకులు చండీయాగం, పాలకొల్లులో రోడ్డుపై పురోహితులు హోమం నిర్వహించారు. తణుకు నరేంద్ర సెంటర్లో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాంతి హోమం చేశారు. పాలకొల్లు మండలం లంకల కోడేరులో ‘అందాల రాకాసి’ చిత్రం షూటిం గ్ను అడ్డుకున్నారు. కొవ్వూరులో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. సినీ నటుడు మాగంటి మురళీమోహన్ పాల్గొన్నారు. కొవ్వూరు మండలం కాపవరం, తోగుమ్మి గ్రామాల్లో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దొమ్మేరులో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి రెండు గంటలసేపు రహదారులను దిగ్బంధించారు. సోనియా, కేసీఆర్ ఫ్లెక్సీలను ఉతికి ఇస్త్రీ చేశారు. పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. తణుకులో వంటా వార్పు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఆచంట కచేరి సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చింతలపూడిలో సోనియా, కేసీఆర్ బొమ్మలను బంతికి అతికించి ఫుట్‌బాల్ ఆడి నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు ఆటోలను తుడిచి నిరసన తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో రాస్తారోకోలు, ధర్నాలు, మానహారం, కేసీఆర్, సోని యా గడ్డి బొమ్మలతో శవయాత్రలు చేశారు. కార్ల, మెటార్ై సెకిళ్ల ర్యాలీలు చేశారు. ఆకివీడులో సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. భీమవరంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి, ప్రకాశం చౌక్‌లో తగులబెట్టారు. హిజ్రాలు నృత్యాలు చేసి పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధుల తీరుపై నిరసన తెలి పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మార్వాడీలు ప్రదర్శన చేశారు. ప్రకాశం చౌక్ ఆందోళనకారులతో పోటెత్తింది. ఉండిలో వంటావార్పు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పాల్గొని మాట్లాడారు. చింతలపూడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెం టర్లో ఆటాపాటా నిర్వహించారు. మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. కామవరపుకోటలో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో యువకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో రాస్తారోకో, నడిరోడ్డుపై వంటావార్పు చేశారు. తాడేపల్లిగూడెంలో పాత ఇనుము వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రదర్శనలు నిర్వహిం చారు. జంగారెడ్డిగూడెంలో రిలే దీక్షలు రెండో రోజుకు చేరారుు. వైఎస్సార్ సీపీ సమన్వ యకర్త, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. నరసాపురంలో జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని మాట్లాడారు. భీమడోలులో గోలి సుబ్బారావు అనే వ్యక్తి ఐదు రోజుల నుంచి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను వైద్య పరీక్షల కోసం ఏలూరు తరలించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో రిలే దీక్షలు మంగళవారం ఏడవ రోజుకు చేరారుు -
తల్లిని చంపిన తనయుడు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : నవ మాసాలు మోసి కని.. పెంచిన తల్లిని కర్కశంగా హత్య చేశాడో తనయుడు. ఈ సంఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ ఎస్సై కె.స్వామి కథనం ప్రకారం.. పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ బస్తీకి చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు ఎస్కె.రంజాన్, చాంద్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వరంగల్‌లో ఉంటున్నాడు. రెండో కుమారుడు తాజొద్దీన్(24) కొంతకాలంగా మతిస్థిమితం తప్పినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి చాంద్‌బీతో గొడవపడ్డాడు. భోజనంలో విషం కలిపావంటూ వాగ్వాదానికి దిగాడు. కన్నకొడుకు విషం పెట్టే దుర్మార్గమైన చర్యకు తానెలా పాల్పడుతానంటూ ఆమె ఎంత మొత్తుకున్నా వినలేదు. తండ్రి రంజాన్ ఎదుటనే దాడికి యత్నించాడు. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో కొడుకును వారించి నిద్రకు ఉపక్రమించింది. చాంద్‌బీ(45 నిద్రలోకి జారుకోగానే రోకలిబండతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
గుండె పగిలింది..
వింజమూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనివార్యమనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ సమైక్యవాది గుండె ఆగిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న గుండెడమడకలకు చెందిన చీమల నారాయణరెడ్డి(61) సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఉద్యమంలో భాగంగా శనివారం గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహించారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అదేరోజు రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. విభజన కారణంగా వచ్చే నష్టాలను రచ్చబండ వద్ద అందరికీ నారాయణరెడ్డి వివరించే వారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్సీపీ నేత అయిన నారాయణరెడ్డి గుండెమడకలలోని కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఘననివాళి..: చీమల నారాయణరెడ్డి మృతదేహానికి వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణపం బాలకృష్ణారెడ్డి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నేతలు బయ్యపురెడ్డి రామకోటారెడ్డి, ఎం.విజయకుమార్‌రెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్ది రమణారెడ్డి, ముక్కమల్ల శ్రీనివాసులురెడ్డి, వెలుగోటి రమేష్‌నాయుడు, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, లెక్కల శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. -
శ్రావణం.. శుభప్రదం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : హిందువులకు అతి నియమ నిష్టలతో కూడిన మాసం శ్రావణం. శ్రావ ణ మాసం ముగిసే వరక మహిళలు, భక్తులు సంప్రదాయాలు ఆచరిస్తారు. కఠిన ఉపవాసాలు ఆచరిస్తూ దైవనామస్మరణలో గడుపుతారు. మరి ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. బుధవారం నుంచి ఈ మాసం ప్రారంభమైంది. కైలాసనాధుడైన శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసాలలో శ్రావణమాసం ప్రధానమైంది. మహిళలు ఆయురారోగ్యాల కోసం, కుటుంబ, భర్త శ్రేయస్సుల కో సం వ్రతాలు, నోములను ఆచరిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్రతాలు ఆచరిస్తూ రాత్రి జాగరణ చేయడం ఆనవాయితీ. మైసమ్మ, పోచమ్మ ఆలయా లు మూత వేసి, శివకేశవుల ఆలయాలు ఈ మాసంలో నుంచి తెరుచుకుంటా యి. ఈ మాసంలో మహిళలు నక్తవ్రతా లు, ఏకవృత్తవ్రతాలు ఆచరిస్తారు. మంగళగౌరీ, గౌరీ వ్రతాలు, అన్నపానీ యాలు లేకుండా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ మాసంలో సోమవారం శివాలయాలకు వెళ్లి శివుడి తలపై పత్రదళం పెట్టి, నీళ్లతో అభిషేకాలు చేస్తారు. ఇలా చేస్తే జపతపాలు, యాగాలు చేసిన ప్రతిఫలం చేకూరుతుందని, శివలోకప్రాప్తి చేకూరుతుందని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు శివాలయాల్లో బిల్వపూజ, పత్రదళ పూజలు ఆచరిస్తారు. మహిళలు పత్రదళాలలో భోజనాలు చే స్తారు. ఐదు సోమవారాలు ఒక్కో ధ్యా నంతో శివుడికి శివముక్తి పూజలు చేస్తా రు. ఇలాచేస్తే జన్మజన్మంతరాల పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. మాంసాహారాలు మానీ.. హిందువుల పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో కఠిన నియమాలు ఆచరిస్తుం టారు. ఉదయం నుంచి రాత్రి వరకు దే వాలయాల్లో గడపడమే కాకుండా.. నెల రోజులు మాంసాహారాలు మానేస్తుం టారు. పురుషులు క్షవరం తీసుకోరు. శైవక్షేత్రాల దర్శనం.. మునులు, రుషిలు, సన్యాసులు, భక్తులు పెద్దసంఖ్యలో ఈ మాసంలో శైవ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. పాదయాత్రలతో వెళ్తారు. పుణ్యక్షేత్రాలైన కాశీ విశ్వనాధుడు, శ్రీశైలం మల్లికార్జునుడును దర్శించుకుంటారు. ప్రతి దేవాలయాల్లో విశేష పూజలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే పాపాలు దూరమై శివలోకప్రాప్తి చేకూరుతుందని నమ్మకం. శుభ ముహూర్తాలెన్నో.. శ్రావణ మాసంలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రెండు మూడు నెలలుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈసారి పెళ్లి సందడి ఎక్కువగానే ఉండనుంది. ఈనెలలో 9, 15, 19, 22, 23, 24, 25, 28, 30 తేదీలలో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, దుకాణాలు కళకళలాడనున్నాయి. వరలక్ష్మీ వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (16న) వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్ర తం చేస్తారు. సౌభాగ్యంతో వర్ధిల్లాలని కుంకుమార్చనలు చేస్తారు. పుత్రైకాదశి శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి (17)న భక్తులు పుత్రైకాదశిని జరుపుకుంటారు. సంతానం లేనివారు, మగ సంతానం కోరుకునేవారు ఈ రోజున పుత్రైకాదశి వ్రతం ఆచరిస్తారు. శివకేశవులను ఆరాధిస్తారు. రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి(21న) రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. మహిళలు సోదరులకు రాఖీ కడతారు. సోదరసోదరీమణుల బంధానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమినీ జరుపుకుంటారు. అర్హులైనవారు ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి(ఈనెల 11వ తేదీ)న నాగుల పంచమి జరుపుకుంటారు. సర్పదోషాలు తొలగిపోవడానికి నాగదేవత అనుగ్రహాన్ని కోరుతూ మహిళలు పుట్టలో పాలుపోసి, పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేయించి పుట్టలో వదులుతారు. మంగళగౌరి వ్రతం నిండు నూరేళ్ల సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం, ధర్మ సంతానం కోసం నూతన వధువులు మంగళగౌరి వత్రం ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్లలో శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. భక్తులు ఈనెల 29న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నా రు. కృష్ణుడి అనుగ్రహం కోసం ఈ రో జంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ భగవంతుడికి వివిధ ఉపచారాలు చేస్తా రు. ఇలా చేస్తే కోటి ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందన్నది విశ్వాసం. -
జూడాల సమ్మె ఉధృతం
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు స్టైఫండ్‌ను మూడేళ్లకు ఒకేసారి డిపాజిట్ చేసేలా జారీ చేసిన జీవో 93 రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు(జూడా) సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె మంగళవారం నాటికి తొమ్మిది రోజులకు చేరగా.. రోజుకో తీరులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందడం లేదని, ఉదయం వైద్యులు చూసి వెళ్లిన తర్వాత ఎంత అత్యవసరమైనా చూడడానికి ఎవరూ రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 66 మంది హౌస్ సర్జన్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. శస్త్రచికిత్సల సమ యంలో హౌస్సర్జన్లు తప్పనిసరిగా అవసరం. వారు సమ్మెలో ఉండడంతో సీనియర్ వైద్యు లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగుల తాకిడి వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల కారణంగా రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు వెయ్యి మంది నుంచి 1500 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ఓపీ విభాగంలో ఉదయం నుంచి 12గంటల వరకు రోగులను పరీక్షిస్తారు. అనంతరం అత్యవసర విభాగంలో ఆరుగురు హౌస్సర్జన్లు 24గంటలు అందుబాటులో ఉంటారు. వీరు ఆయా వార్డుల్లో రోగులతోపాటు, అత్యవసర సమయంలో వైద్య పరీక్షలు చేస్తుంటారు. ప్రస్తుతం వీరంతా సమ్మెలో ఉండడంతో అత్యవసర విభాగంలో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పెద్ద ఎత్తున రోగులు బారులు తీరుతున్నారు. ఇద్దరే వైద్యులు పరీక్షలు చేస్తుండడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వసతులు కరువు తమ న్యాయమైన డిమాండ్లతోపాటు రిమ్స్‌లో నెలకొన్న సమస్యలూ పరిష్కరించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అత్యవసర విభాగంలో జూడాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో హాస్టల్‌కు ఎవరు వస్తున్నారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్, డీఎంఈకి సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం జూడాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ వైద్య సేవలకు సంబంధించి పీహెచ్సీ, సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలి. - ఉప్పరి మల్లేశ్, రిమ్స్ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు వసతులు కల్పించాలి రిమ్స్ ఆస్పత్రిలో జూడాలకు సరైన వసతులు లేవు. అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తించే జూడాలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు ఉద్యోగ భద్రత కరువైంది. ఎవరు గొడవకు దిగుతారో తెలియని పరిస్థితి. మాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సమస్యలపై పరిష్కారంపై అధికారులు పట్టించుకోవడం లేదు. - ఆదిత్య, జూడా ఉపాధ్యక్షుడు నిర్ణయం మార్చుకోవాలి.. జూడాలకు రావాల్సిన స్టయిఫండ్‌ను ప్రతి నెలా చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలి. పీజీ మెడికల్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. - సౌమ్య, జూడా సంఘం ఉపాధ్యక్షురాలు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె జూడాల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసిన వైద్యులకు ఆయా పీహెచ్‌సీల్లో శాశ్వత ఉద్యోగం కల్పించాలి. శాశ్వత ఉద్యోగాలిస్తే ఎక్కడైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లరు. - గీత, జూనియర్ డాక్టర్ -
సింహగర్జన
నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఎదురుకానున్న సమస్యలను అన్నివర్గాలు తలచుకుంటూ సింహపురిలో కార్మిక, కర్షక, విద్యార్థి, వృత్తిదారులు కదంతొక్కారు. ఏకంగా ఆరు దఫాలకు పైగా కలెక్టరేట్ మంగళవారం ముట్టడికి గురి కావడంతో కార్యకలాపాలు స్తంభించాయి. రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీకి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మద్దతు పలకడంపై జనాగ్రహం పెల్లుబికింది. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు నగరంలో నాయీబ్రాహ్మణ, సింహపురి ఆటో మొబైల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి మద్దతు పలికారు. వైఎస్సార్సీపీ నెల్లూరు నగర, రూరల్ సమన్వయకర్తలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ, ఏసీ సెంటర్, ఎన్టీఆర్ సెంటర్, బోసు బొమ్మమీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఈ ర్యాలీలో కేసీఆర్, సోనియా వేషధారణల్లో ఉన్న వ్యక్తులను చూసి మహిళలు దూషణల పర్వం కొనసాగించారు. అఘోరాలకన్నా ఘోరాతి ఘోరంగా సోనియా రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తోం దంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో సోనియాకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. న్యాయవాదులు, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్లో మూడు గాడిదలకు సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ బొమ్మలను కట్టి వాటిపై కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో దాడి చేసి సమైక్యాంధ్ర ఇవ్వకుంటే అసలు వ్యక్తులకు ఇదేగతి పడుతుందంటూ యువకులు నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ విద్యుత్ భవన్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కావలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మద్దూరుపాడు జాతీయ రహదారిపై లారీ ఓనర్స్ అసోసియేషన్ రాస్తారోకోతో పాటు వంటా వార్పు నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. సోనియా వేషధారణతో ఉన్న వ్యక్తిపై మహిళలు చెప్పులతో దాడి చేసి సోనియాకు ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. జవహర్‌భారతి పీజీ, డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. కావలిలో మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులను ఉద్యమంలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పొదలకూరులో ఆటోలు, సు మోల యజమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మనుబోలు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటాచలంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జర్నలిస్టులు, కార్మిక సంఘాలు, విద్యార్థి జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్లో నిరసనలతో పాటు వంటావార్పు చేపట్టారు. దుత్తలూరు నర్రవాడ సెంటర్లో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూళ్లూరుపేటలో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు నిరసనగా శిరోముం డనం ద్వారా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లోని పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. గూడూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, నాయకులు నాసిన నాగులు, చంద్రయ్య, యువజన నాయకుడు కోడూరు వీరారెడ్డి, జేఏసీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో తోపుడు బండ్ల వ్యాపారులు సోనియాగాంధీకి పిండ ప్రదానం చేసి మానవ హారం నిర్వహించారు. చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లో కూడా విద్యార్థులు, వివిధ సంఘాలు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనంతో నిరసనలను వ్యక్తం చేశారు. కోవూరులో ఎన్జీఓ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజక వర్గంలో రాపూరు కాశీపేట సెంటర్లో విద్యార్థి సంఘాలు సమైక్యాంధ్ర పోరాట సమితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోనియా దిష్టి బొమ్మలను దహనం చేశారు. అంచెలంచెలుగా సమైక్యాంధ్ర ఉద్యమం మంగళవారం నాటికి తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజన మానుకొని సమైక్యాంధ్రను ప్రకటించే వరకు ఉద్యమాలను ఆపేది లేదంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు స్పష్టం చేశారు. -
వైఎస్సార్ సీపీ భారీ బైక్ ర్యాలీ
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమించారు. పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై నగర వీధుల్లో ర్యాలీ చేశారు. గిరింపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ఏఎస్ మనోహర్ జెండా ఊపి ప్రాంరభించారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలం, చిత్తూరు నగరం నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో సీబీ రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, పలమనేరు రోడ్డు, గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. అక్కడి నుంచి హైరోడ్డు, బజారువీధి, చర్చివీధి, గాంధీ రోడ్డు, తిరుపతి రోడ్డు, ఆర్టీసీ డిపో రోడ్డు, ఆఫీసర్స్ లైన్, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఒక వాహనంలో తెలుగుతల్లి వేషధారణలో విద్యార్థిని కూర్చోపెట్టారు. అక్కడే కేసీఆర్ వేషదారణలో ఉన్న వ్యక్తిని ఒక బాలుడు బాక్సింగ్ ఆడుతున్నట్టు ఊరేగించారు. ప్రజలు ఉద్యమించాలి వేర్పాటువాదాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రోత్సహించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏఎస్.మనోహర్ స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి కరుడుగట్టిన తెలంగాణ వాదులతో కలిసి ఎన్నికలకు వెళ్లినా ఏనాడూ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయలేదన్నారు. స్యూటర్ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ 10 జిల్లాలకు చెందిన ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే 13 జిల్లాలకు చెందిన సీమాంధ్రులు ఎందుకు సమైక్యాంద్రను సాధించలేమని ప్రశ్నించారు. నాయకులను పక్కన పెట్టి ప్రజలు ఉద్యమించాలన్నారు. అప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. రాష్ట్రంలోని సీమాంధ్ర మంత్రులు చేతగానిదనం వల్లే రాష్ట్రం ముక్కలయ్యిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ తరపున కేంద్రానికి లేఖ ఇవ్వడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి వారి మనోభావాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి అన్నారు. అనంతరం చిత్తూరులోని మహాత్మ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మనోహర్ వినతిపత్రం ఇచ్చారు. స్కూటర్ ర్యాలీలో పార్టీ నేతలు రామ్మూర్తి, మదన్, సాయిసుజిత్, కుట్టీ రాయల్, సయ్యద్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు
నిర్మల్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడు వర్షాకాలం ఆరంభం నుంచే వర్షాలు అధికంగా కురియడం, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు అమాంతం పెరిగిపోయాయి. 5.05 మీటర్లపైనే భూగర్భజలాలు ఉండగా, గతేడాదిలో పోల్చుకుంటే 4.12 మీటర్లు పెరిగాయి. సాధారణం కంటే 90 శాతం అధికం... జూలైలో సరాసరి 558.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 1056.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 90 శాతం అధిక వర్షపాతం నమోదుకావడంతో జిల్లాలో భూగర్భజలాలు అమాంతం 5.05 మీటర్ల పైకి వచ్చాయి. గతేడాది సరాసరి కురియాల్సిన వాటి కంటే 14 శాతం తక్కువ నమోదు కావడంతో గత జూలైలో 9.17 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా ఈ ఏడాది మేలో 10.06 మీటర్లు, జూన్‌లో 7.85 మీటర్ల లోతులో ఉన్నాయి. మీటరు కంటే తక్కువ లోతులోనూ.. భూగర్భ జలాలను తెలుసుకునేందుకు భూగర్భ జలశాఖ వారు జిల్లా వ్యాప్తంగా 75 ఫిజియోమీటర్లను ఏర్పాటు చేశారు. కురుస్తున్న వానలకు జిల్లాలో మీటరు కంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అనేక చోట్ల నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కొమ్ముగూడ, భీమిని, రాంపూర్, గుడిహత్నూర్, జైనథ్, జైనూర్, కడెం, కాగజ్‌నగర్, మామడ, నార్నూర్, నిర్మల్, తిర్యాణి, ఉట్నూర్ ప్రాంతాల్లో మీటరు కంటే తక్కువ లోతులోనే భూగర్భజలాలు ఉన్నాయి. డివిజన్ల వారీగా... జిల్లాలోని నాలుగు డివిజన్ల వారీగా చూసుకుంటే భూగర్భ జలాలు గతంలో కంటే ఆశాజనకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ డివిజన్లో గతేడాది జూలైలో 5.44 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది జూలైలో 2.32 మీటర్ల లోతులో ఉన్నాయి. నిర్మల్ డివిజన్లో గతేడాది 10.47 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి 7.30 మీటర్ల లోతులో, ఉట్నూర్ డివిజన్లో గతేడాది 6.89 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది 3.55 మీటర్ల లోతులోనే ఉన్నాయి. మంచిర్యాల డివిజన్లో గతేడాది 10.05 మీటర్ల లోతులో.. ఈసారి 4.57 మీటర్ల లోతులో, ఆసిఫాబాద్ డివిజన్లో 12.44 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది 4.23 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంతటి ఆశాజనకమైన భూగర్భజలాలు ప్రస్తుతం ఉన్నా వేసవివచ్చిందంటే చాలు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కురుస్తున్న జలాలను ఒడిసిపట్టకపోవడమే. జలాలను ఒడిసిపట్టలేక... జిల్లాలో కురవాల్సిన వర్షపాతం కంటే అధికాంగా నమోదైనా ఆ జలాలను ఒడిసిపట్టలేకపోతున్నాం. అందుకే ఏటా విలువైన నీరంతా వృథాగా పోతోంది. ప్రధానంగా వేసవి వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతాలు, గుట్టప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటోంది. ఏజెన్సీ, గుట్ట ప్రాంతాల్లో అవసరమైనంత చెరువులు, కుంటల నిర్మాణాలు చేపట్టకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. నీటి సంరక్షణకు చెరువులు, కుంటల నిర్మాణంతోపాటు గుట్టప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మిస్తే భూగర్భజలాలను కూడా పెంచుకునే వీలుంటుంది. -
‘పర్యాటకం’..పరిహాసం!
రాజులు, సంస్థానాదీశులు, నిజాం నవాబుల కాలం నాటి ఆలయాలు, బురుజులు..వాటిలో అద్భుతంగా చెక్కిన శిల్పాలు పాలమూరు పర్యాటక కేంద్రాల సొంతం. జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం అందించే బృహత్తర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించినా..ఎవరు ముందుకురాకపోవడంతో పర్యాటకం కళ తప్పింది. విడుదల చేసిన నిధులు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. కలెక్టరేట్/గద్వాల, న్యూస్‌లైన్: జిల్లాలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదం అందించే ప్రక్రియ ఏడాదిగా ముందుకుసాగడం లేదు. 11 పర్యాటక కేంద్రాల్లో పనులు చేపట్టేందుకు ఇంతకుముందే టెండర్లు ఆహ్వానించారు. ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా మరోసారి మంగళవారం టెండర్లదాఖలుకు తుది గడువు విధించగా ముగ్గురు మాత్రమే ముందుకొచ్చారు. ఎనిమిది కేంద్రాలకు టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకురాలేదు. జిల్లావ్యాప్తంగా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నా..ముందుగా 11 కేంద్రాలను మాత్రమే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో 9పురాతన ఆలయాలు కాగా, రెండు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. కానీ టెండర్లు పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.7.99కోట్లు మంజూరుచేసింది. ఏడాదిలోపే వీటిని వినియోగించాలని నిబంధనలు విధించినా, అధికారులు వాటిని వినియోగించుకోలేకపోయారు. ఇప్పటికీ వాటిని ఖాతాకే పరిమితం చేశారు. -
పగబట్టిన ‘పంచాయతీ’
మక్తల్ రూరల్/గట్టు, న్యూస్‌లైన్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఇంకా పగలు, ప్రతీకారాలు పొడచూపుతూనే ఉన్నాయి. విజేతలు, పరాజితుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గునమండే కక్షలు రగిలిపోతున్నాయి. ఈ కోవలోనే మక్తల్ మండలం కర్నీ గ్రామంలో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో విజేతగా నిలిచిన సర్పంచ్‌గా అభ్యర్థి విజయాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడికి చెందిన బైక్, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు..ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా రాఘవేందర్ గౌడ్ గెలుపొందారు. ఆయనకు అదే పార్టీ నాయకుడు మల్లేశ్వర్‌రెడ్డి పూర్తి మద్దతు తెలిపి భుజస్కందాలపై బాధ్యతను వేసుకుని రాఘవేందర్‌గౌడ్‌ను గెలిపించారు. నాటి నుంచి ప్రత్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని స్థానికులు చెప్పారు. ఇదిలాఉండగా సోమవారం రాత్రి గ్రామంలోనే మల్లేశ్వర్‌రెడ్డి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్, ట్రాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇది గమనించిన ఆయన ఇంట్లోనుంచి బయటివచ్చి మంటలను ఆర్పివేసేలోగా వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి. అయితే తెల్లవారేసరికి ఇంటి ముందు పెద్దఎత్తున గుమిగూడటంతో గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ మక్తల్ పోలీసులకు మల్లేశ్వర్‌రెడ్డి ఫోన్‌ద్వారా సమాచారమందించారు. ఎస్ఐ మురళి పోలీసు బందోబస్తుతో కర్ని గ్రామానికి ఘటనస్థలాన్ని పరిశీలించారు. కొందరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు బాధితుడు మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసునమోదు నమోదుచేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు. గట్టు ఉప సర్పంచ్ ఎన్నికలో బాహాబాహీ గట్టు, న్యూస్‌లైన్: మంగళవారం జరిగిన గట్టు ఉప సర్పంచ్ ఎన్నిక వార్డుసభ్యుల మధ్య సిగపట్లకు దారితీసింది. పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టు సర్పంచ్‌గా వైఎస్ఆర్ సీపీ మద్దతుతో సంతోషమ్మ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు ఏడుగురు సభ్యులు వైఎస్సార్ సీపీ మద్దతుతో గెలుపొందారు. ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో, ఒకరు టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. అయితే కోరం లేకపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలాఉండగా కాంగ్రెస్, టీడీపీ వార్డు సభ్యులు ఏకం కావడంతో వారి సంఖ్య ఏడుగురికి పెరిగింది. రెండు సమానమైన సందర్భంలో సర్పంచ్ ఓటుతో ఉప సర్పంచ్ పదవి సర్పంచ్ వర్గానికి వెళుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లిన వైఎస్ఆర్ సీపీ మద్దతుతో వార్డుసభ్యుడిగా గెలుపొందిన మల్లేష్‌ను కిడ్నాప్ చేశారు. మంగళవారం ఉపసర్పంచ్ ఎన్నిక తరుణంలో మల్లేష్ కనిపించకుండాపోవడంతో వైఎస్ఆర్ సీపీ శిబిరంలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో వార్డుసభ్యులు సిగపట్లకు దిగారు. అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఇంతలో కనిపించకుండాపోయిన మల్లేష్ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమవడంతో కథ సుఖాంతమైంది. -
మొక్కుబడిగా కాంగ్రెస్, టీడీపీ ఉద్యమాలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాం ధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ జిల్లాకు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉద్యమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. రెండు రోజుల క్రితం మొక్కుబడిగా ఉద్యమాల్లో పాల్గొని చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ అధిష్టాన వైఖరిని ఖండిస్తూ మారుమూల పల్లెలు సైతం రోడ్డెక్కి నినదిస్తుంటే ఆ పార్టీల నేతలు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని ఒంటెద్దు బండ్ల యూనియన్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం, ఆటో డ్రైవర్లు, బ్యాంకులు, జేసీబీ ఓనర్లు, బస్సు ఓనర్లు, వాకర్స్ అసోసియేషన్లు ఇలా అన్ని సంఘాలు నిరసన తెలిపాయి. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఉద్యమాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒకటి రెండు చోట్ల మొక్కుబడిగా ఉద్యమాలు చేపట్టి తాము కూడా చేశామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొనేందుకు సీఎం నుంచి అనుమతి రాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం తరఫున జిల్లాలో చక్రం తిప్పుతున్న ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి విభజన వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు చేయకూడదని, దీనికి సీఎం అనుమతి లేదని సూచించినట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు ఒక్క నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్న దాఖలా లు కనిపించలేదు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాత్రం ఒకరోజు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపి వెళ్లిపోయారు. ఎంపీ చింతామోహన్ ఇంతవరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఇటీవల ఆయనను అడ్డుకున్న సమైక్యాంధ్ర ఉద్యమ నేతలతో తాను రాజీనామా చేయనని ఖరాఖండిగా తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే రవి అసలు కనిపించడం లేదు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి జై సమైక్యాంధ్ర అంటున్నా ఉద్యమాల వైపు వెళ్లలేదు. వీరందరికీ చెక్‌పాయింట్ లాగా కిశోర్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకే బా బు సీఎం ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ఆయన నిరాహారదీక్షకు ఉపక్రమించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తొలి రెండు రోజులు నిరసనలు చేపట్టలేదు. ఎంపీ శివప్రసాద్ ఇంటిని ముట్టడించిన నిరసనకారులకు ఇంట్లో ఉండి కూడా లేదని పంపించారు. ఈ నెల 4వ తేదీన మాత్రం టీడీ పీ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూ ర్తి కలిసి తెలుగుతల్లి విగ్రహం వద్ద ధర్నా చేశా రు. పైగా ఆందోళన చేస్తున్న యువతను తాగుబోతులుగా చదలవాడ వక్రీకరించడం గమనార్హం. ఇప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జం గాలపల్లి శ్రీనివాసులు నోరు మెదపలేదు. ప్రస్తుతం జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతం కావడంతో విధిలేక బుధవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ముందు వరుసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిన క్షణం నుంచి క్రమం తప్పకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ తన వైఖరిని వెల్లడించిన అరగంటలోనే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి గాంధీ రోడ్డు జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. నగరి నియోజకవర్గంలో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 24 గంటలపాటు నిరసన తెలియజేశారు. గంగాధర నెల్లూరు, పుత్తూరులో జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు నుంచి నేటి వరకు ఆ పార్టీ నాయకులు ఉద్యమంలో ముందుంటున్నారు. మరే పార్టీ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం లేదు. వేలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో ఆ పార్టీలు అయోమయంలో పడిపోయాయి. -
25 పంచాయతీలకు 13న ఎన్నికలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో భారీవర్షాలు, వరదల కారణంగా ఈనెల 8న జరగాల్సిన 30 పంచాయతీ ఎన్నికల్లో 25 పంచాయతీలకు వాయిదా పడ్డాయి. గత నెల మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో 18 మండలాల్లోని 30 పంచాయతీలు, 318 వార్డులలో వర్షాలు, వరదల కారణంగా ఎన్నికలను మొదట ఆగస్టు 8కి వాయిదా వేశారు. సోమవారం నుంచి జిల్లాలో మళ్లీ వర్షాలు కురుస్తుండడం, వరదల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగడంతో ఎన్నికల సిబ్బంది, ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఉండటంతో 25 పంచాయతీలు, 257 వార్డుల ఎన్నికలు వాయిదా వేశారు. భీమిని మండలం లక్ష్మాపూర్, సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి, ఉట్పూర్ మండలంలోని ఉట్నూర్, కడెం మండలం లోని ఉడుంపూర్, ఖానాపూర్ మండలంలో ని ఇటిక్యాల సర్పంచ్ స్థానాలకు, వీటి పరిధిలోని 60 వార్డులలో ఎన్నికలు జరుగు తాయని కలెక్టర్ ఏ.బాబు తెలిపారు. వాయిదా పడ్డ పంచాయతీలు ఇవే.. ఆదిలాబాద్ డివిజన్లోని బేల మండలం సాంగ్వి-జి, బోథ్ మండలంలోని బాబేర, కరత్వాడ, బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్, ఆదిలాబాద్ మండలంలోని యా పల్‌గూడ, మంచిర్యాల డివిజన్లోని వేమనపల్లి మండలంలోని చామన్‌పల్లి, ధస్నాపూర్, ఆసిఫాబాద్ డివిజన్లోని సిర్పూర్-టి మండలం దబ్బా, కౌటాల మండలంలోని బాబాసాగర్, గుడ్లబోరి, గంగాపూర్, బెజ్జూరు మండలంలోని దిమ్డా, కుశ్నపల్లి, పాపన్నపేట్, పెంచికల్పేట్, ఔట్ సారంగపల్లి, కాగజ్‌నగర్ మండలంలోని బారేగూడ, మాలిని, పోతపల్లి, వంజారి, ఆసిఫాబాద్ మండలంలోని మోవడ్, ఉట్నూర్ డివిజన్లోని నార్నూర్ మండలంలోని గాదిగూడ, పరస్వాడ-బి, వాంకిడి మండలంలోని కన్నెరగావ్, తిర్యాణి మండలంలోని మంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతోపాటు ఆయా గ్రామ పంచాయతీల్లోని 257 వార్డుల్లో ఎన్నికలతోపాటు మంగి గ్రామ పంచాయతీలోని నంబర్ 3లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మెస్‌లు మూసివేయడాన్ని నిరసిస్తూ వీసీ బంగ్లా ముట్టడి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ యూనివర్సిటీలో మెస్‌లు మూసివేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం రాత్రి వీసీ బంగ్లాను ముట్టడించారు. ఎస్వీయూలోని అనుబంధ హాస్టళ్ల మెస్‌లను మంగళవారం మూసివేశారు. ఇప్పటికే మహిళా హాస్టళ్లలోని విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపారు. తాజాగా మెన్స్ హాస్టళ్లనూ మూసివేశారు. దీన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో వీసీ బంగ్లాను ముట్టడించారు. బంగ్లాలోకి చొరబడే ప్రయత్నం చేశారు. గేట్లను తోసివేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు బంగ్లా గేట్ వద్ద పడుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు వీసీ కుట్రపన్నారని ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్‌లో వీసీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం సొంత జిల్లాలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉద్యమాలకు వేదికైన ఎస్వీయూలో మెస్‌లు మూసివేయడం ద్వారా ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వర్సిటీ అధికారులే మెస్‌లు నడిపి తెలంగాణ ఉద్యమానికి సహకరించారని తెలిపారు. ఎస్వీయూ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారన్నారు. మెస్‌లు తెరుస్తామని వీసీ ప్రకటన చేసే వరకు కదిలేది లేదని బంగ్లా గేటు వద్ద పడుకున్నారు. వీసీ రాజేంద్ర విద్యార్థులతో చర్చించారు. మెస్‌లు మూసివేసే అంశం తనకు తెలియదని చెప్పారు. వీసీ సమాధానంతో సంతృప్తి చెందని విద్యార్థులు ‘మీకు తెలియకుండా ఎలా మూసివేస్తారని’ ప్రశ్నించారు. స్పందించిన రాజేంద్ర బుధవారం సంబంధిత అధికారులతో మాట్లాడి మెస్‌లు తెరిపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శేషాద్రినాయుడు, ఆనంద్ గౌడ్, వి.వెంకటరమణ పాల్గొన్నారు -
జిల్లాలో 76 పంచాయతీలు ఏకగ్రీవం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంది. ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రోత్సహించడానికి నజరానాలు కూడా ఇస్తుంది. ఇటువంటి పంచాయతీలను రెండు కేటగిరీలుగా చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.7 లక్షలు, 15వేల కంటే అధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత నెల 21, 23, 27 తేదీల్లో జిల్లాలోని 866 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా 84 పంచాయతీల్లో ప్రజలు సర్పంచ్‌లను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఇందులో 76 గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటికి మాత్రమే పారితోషకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఏకగ్రీవమైన పంచాయతీలకు దాదాపు రూ.5 కోట్లకుపైగా నిధు లు వచ్చే అవకాశం ఉంది. కాగా 2006లో జిల్లాలోని 866 పంచాయతీలకు 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో ఒక్కో ఏకగ్రీవ పంచాయతీకి రూ.5 లక్షలు చొప్పున పారితోషకం అందజేశారు. పారితోషికం ఖర్చులు ఇలా.. గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామాల్లో ఉన్న వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దానిని ఎంటైర్‌బాడీ గుర్తిస్తారు. ఇలాంటి ఏకగ్రీవ పంచాయతీకి ప్రభుత్వం పారితోషకం ఇస్తుంది. ఈ నిధులను ఒక్కో పంచాయతీలో మొదటగా పర్మినెంట్‌గా ఉండే పంచాయతీ భవన నిర్మాణానికి, స్థలానికి, మురికివాడల్లో సమస్యలను పరి ష్కరించేందుకు, మురికికాలువలు శుభ్రం చేసేందుకు, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. అందుబాటులో రూ.12 కోట్ల నిధులు జిల్లాలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో దాదాపు రూ.12 కోట్ల నిధుల వరకు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల ప్రత్యేక పాలనలో ప్రతి మండలానికి జనరల్ ఫండ్స్ కింద రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్లు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు ఉన్నట్లు అధికారుల ద్వారా సమాచారం. గ్రామాల్లో కొత్తగా కొలువుదీరిన సర్పంచ్‌లు చేపట్టే అభివృద్ధి పనులకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన లో గ్రామీణులు నరకం చూశారు. నిధులున్నా ప్రత్యేకాధికారుల తీరు.. గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేసిం ది. అయితే ఖర్చుపెట్టని నిధులు ఇప్పుడు కొత్త సర్పంచ్‌లకు అందుబాటులోకి రానున్నాయి. పనులు చేయించిన గ్రామ పంచాయతీల్లో తక్కువగా, చేయని గ్రామాల్లో ఎక్కువగా, ఇలా చూస్తే ఒక్కో గ్రామ పంచాయతీల ఖాతాలో దాదాపు రూ.4 వేల నుంచి రూ.17 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం నూ తనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు నిధుల కొరత లేకుండా పోయిందని అధికారులే చర్చించుకోవ డం గమనార్హం. అధికారికంగా చెక్‌పవర్ అందితే తాము హామీ ఇచ్చిన మేరకు సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమాయత్తం కావాల్సి ఉంది. జీపీల ఖాతాల్లో ఉంటే ఉండొచ్చు.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి రెండేళ్లుగా సర్పంచ్‌లు లేకుండా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనలో మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఖర్చులు చేశారు. గ్రామాల్లోని ఆయా అవసరాలను బట్టి అధికారులు ఖర్చు చేసి ఉండొచ్చు. ఆ విధంగా జీపీల ఖాతాల్లో నిధులు జమ ఉంటాయి. అవసరాలను బట్టి నిధులను ఖర్చు చేస్తే కచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు జీపీల ఖాతాల్లో జమ ఉన్నట్లు మాత్రం తెలియదు. ప్రస్తుతం గ్రామాల్లో పని చేసే సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. -
పంట వరదపాలైందని రైతు ఆత్మహత్య
కుక్కునూరు,న్యూస్‌లైన్: గోదావరి వరద మరో రైతు నిండుప్రాణాన్ని బలిగొంది. వరదలు తొలగిన తర్వాత కుళ్లిన పత్తిమొక్కలను చూసి ఓరైతు మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుక్కునూరు మండలం రామసింగారంలో ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.... రామసింగారానికి చెందినపసుపులేటి వెంకటేశ్వరరావు(32) అనే రైతు తనకున్న నాలుగుఎకరాలకు తోడు ఆరెకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను వేశాడు. గత నెలలో వచ్చిన వరదలకు పదెకరాలలోని పత్తిచేలు పాడయ్యాయి. ఆ తర్వాత యాభై వేలకుపైగా వెచ్చించి పదెకరాలను శుభ్రం చేయించి మళ్లీ విత్తు నాటాడు. కాగా మూడురోజులుగా గోదావరికి వచ్చిన వరదలవల్ల మళ్లీ చేలన్నీ నీటమునిగాయి. మంగళవారం సాయంత్రం వరదలు కాస్త తగ్గాయని చేలకు వెళ్లి చూడగా పత్తి మొక్కలన్నీ కుళ్లిపోయిఉన్నాయి. నాటిన విత్తనాలు కూడా వరదపాలయ్యాయి. దీంతో వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడంతా వృధా అయిందని నిరాశ చెందాడు. ఆవేదనతో ఇంటికి వచ్చిన ఆ రైతు...రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాను, పంటంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసి పక్కకు వె ళ్లి పురుగుమందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య, తల్లిదండ్రులు చెబుతూ భోరున విలపించారు. రైతు మృతి వార్తను తెలుసుకున్న తహశీల్దార్ గన్యానాయక్, ఎస్సై అబ్బయ్య పరామర్శించారు. విచారణ తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని కుటుంబసభ్యులకు తెలిపారు. -
రుణం..గగనం
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇక రుణాలు అందడం గగనమే..ఓవైపు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడం.. మరోవైపు సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తున్న ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నిలిపేసింది. ఆర్థికంగా వెనకబడిన షెడ్యూల్డు కులాల(ఎస్సీ)కు చెందిన వారిని ఆదుకునేందుకు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన అర్హులకు రుణాలు మంజూరుచేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే జిల్లాకు 3975 యూనిట్లను లక్ష్యంగా నిర్ణయించారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని, యూనిట్లు నెలకొల్పేందుకు సబ్సిడీ మంజూరు చేయాలని ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్లో దరఖాస్తులు చేసుకున్నా ఒక్క యూనిట్‌కు కూడా మంజూరుచేయలేదు. కాగా, యూనిట్లను మంజూరు చేయొద్దంటూ ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు ప్రతిరోజూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోతున్నారు. అధికారులు కూడా నిస్పహాయస్థితిలో ఉన్నారు. రుణం పొందేవారు ముఖ్యంగా నిరుద్యోగులు చిన్న చిన్న పరిశ్రమలు, సేవలు, వ్యాపారాలు, పాడి ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకం, భూమి కొనుగోలు, బోరు, గొట్టపు బావులు, విద్యుత్ మోటార్లు, పైపులైన్, విద్యుదీకరణ, చర్మ వృత్తికారుల వ్యాపారాలు, సఫాయి కర్మ చారీల సహాయ కార్యక్రమాల కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్తగా గుర్తించిన పాకీ పనివారు, వెట్టి చాకిరి విముక్తి పొందిన కార్మికులు, జోగిని స్త్రీల పునరావాసం, అత్యాచార బాధితుల ఆర్థిక సహాయం, విడుదలైన ఖైదీలు, లొంగిపోయిన తీవ్రవాదులు, చిన్న పిల్లలు ఉన్న వితంతువులు, వికలాంగులు కూడా వ్యక్తిగత రుణాలు పొందే అవకాశం ఉంది. ఒక యూనిట్‌ను ఏర్పాటుచేసుకునేందుకు లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. చేతులేత్తేసిన అధికారులు బ్యాంకురుణ ం పొందిన లబ్ధిదారులకు వారు నెలకొల్పిన యూనిట్‌ను బ ట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మునిసిపల్ కమిషనర్, బ్యాంకు అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరిగినప్పటికీ ఒక్క యూనిట్ కూడా మంజూరు కాలేదు. కొత్తగా బోరుబావులు తవ్వుకున్న లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని నిధుల మంజూరు కోసం ఎస్సీ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు బడ్జెట్ ఏవిధంగా ఇవ్వాలనే విషయమై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారని, తమ చేతుల్లో ఏమీలేదని లబ్ధిదారులకు స్థానిక అధికారులు చెప్పి పంపిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలవుతున్న దృష్ట్యా ఆ నిధుల మంజూరుపై కూడా ఇప్పటివరకు స్పష్టతలేదు. దీనికితోడు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మంజూరు కాకపోవడంతో సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.