Anakapalle District Latest News
-
స్మార్ట్ మీటర్లు షాక్ కొడతాయి జాగ్రత్త!
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న దేవరాపల్లి: విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న పిలుపునిచ్చారు. దేవరాపల్లిలో స్మార్ట్ మీటర్ల బిగిస్తున్న వారిని మంగళవారం ఆయన ప్రశ్నించారు. దేవరాపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్ల బిగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటరు విశాఖలో బిగించి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలకు ప్రభుత్వం పూనుకుందని ఆయన విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలు కొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారని వెంకన్న గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శరవేగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో డబ్బులు ఉంటేనే ఇకపై పేద ప్రజల ఇళ్లలో లైట్లు వెలుగుతాయని లేకుంటే అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే దళిత గిరిజనుల ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడే అవకాశం ఉందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. -
పీసీ మహలనోబిస్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంవీపీకాలనీ (విశాఖ): ప్రపంచ ప్రఖ్యాత గణాంకవేత్త ఆచార్య పీసీ మహలనోబిస్ పేరిట అందించే అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సెట్విన్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.సత్యపద్మ తెలిపారు. ఈ అవార్డు స్టాటస్టిక్స్‌లో విస్తృత పరిశోధనలు, గణాంక పద్ధతులను ప్రోత్సహించిన వారికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు ద్వారా రూ.10 వేల యూఎస్ డాలర్స్ నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, మెమెంటో అందిస్తామన్నారు. https:// www.isi-web.org పోర్టల్ ద్వారా డిసెంబర్ 31వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కె.కోటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
కె.కోటపాడు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ, జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు తనిఖీ నిర్వహించారు. కార్యాలయం ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వివరాలను వీరు అడిగి తెలుసుకున్నారు. స్టాంపు పత్రాలను నిర్దేశించిన ధరలకు మాత్రమే విక్రయించాలని స్టాంప్ వెండార్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు ఇతర అంశాలపై కార్యాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం
● అనకాపల్లి ఆర్డీవో ఆయిషా సర్వేయర్లతో మాట్లాడుతున్న ఆర్డీవో ఆయిషా మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అనకాపల్లి ఆర్డీవో ఆయిషా కోరారు. మంగళవారం ఆమె స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై తహసీల్దార్ ఆదిమహేశ్వరరావుతో చర్చించారు. అనంతరం మునగపాక మెయిన్‌రోడ్డు విస్తరణలో కోల్పోనున్న గృహాలతోపాటు వ్యవసాయ భూములను ఆమె పరిశీలించారు. మునగపాక మండల పరిధిలోని రెవెన్యూకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. అలాగే మునగపాక బాధితులకు ఎంత పరిహారం ఖరారు చేశారని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంతలో పనులు వేగవంతం చేసి విస్తరణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కొత్త మరుగుదొడ్ల మంజూరుకు సర్వే
● కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన సామాజిక దురాచారమని, పర్యావరణం, ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాటిని నివారించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమన్నారు. విద్యార్థులు ఆహారం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. కొత్త మరుగుదొడ్ల మంజూరుకు, సామూహిక మరుగుదొడ్ల మరమ్మతులకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఎఎస్ఎ. రామస్వామి మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా హమారా సౌచాలయ్ హమారా సమ్మాన్ నినాదంతో ప్రచారాన్ని డిసెంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త మరుగుదొడ్ల మంజూరు కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టరు కె. అనంతలక్ష్మి, , గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటా సర్వే చేపట్టాలి తుమ్మపాల: జిల్లాలో ఇంటింటి సర్వే చేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని, డిసెంబరు 10 నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటి సమావేశంలో ఆమె మండలాల వారీగా నిర్మాణ పనులు పురోగతిని సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన మరుగుదొడ్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
అయ్యన్నను గెలిపిస్తే.. రౌడీరాజ్యమేనని ఆనాడే చెప్పా..
నర్సీపట్నం: నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని ఎన్నికల ప్రచారంలో తాను ఆనాడే చెప్పానని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన మంగళవారం డీఎస్పీ మోహన్‌ను కలిసి శాంతిభద్రతలను కాపాడాలని, రౌడీయిజాన్ని అరికట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అనుచరులైన రౌడీలు హత్యలు, దాడులకు తెగబడడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో తరుచూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నాతవరం మండలం చుక్కా రాము అనే వ్యక్తిపై దాడి చేశారని, డి.ఎర్రవరంలో సబ్బవరపు వెంకునాయుడికి చెందిన జీడి తోట నరికేశారన్నారు. చీడిగుమ్మల్లో పాకలు తగులబెట్టి ఇళ్లపై దాడి చేశారని, మాకవరపాలెం మండలం యరకన్నపాలేనికి చెందిన కొల్లు అప్పలనాయుడిపై దాడి చేశారన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఐదు నెలల కాలంలో నియోజకవర్గంలో 250 కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. నర్సీపట్నం టౌన్లో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై రౌడీ షీటర్ పప్పలనాయుడు హత్యాయత్నం చేశాడరన్నారు. కొత్తవీధిలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బండారు కొండబాబు, రౌడీ షీటర్ బండారు సంతోష్ రెండు రోజుల క్రితం ఓ సామాన్య వ్యక్తిని హత్య చేశారన్నారు. వీరంతా స్పీకర్ అయ్యన్నపాత్రుడి ముఖ్య అనుచరులు కావటం గమనార్హమన్నారు. ఇందుకు సాక్ష్యంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అతని కుటుంబ సభ్యులతో నిందితులు ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. స్పీకర్ అనుచరుల చేతిలో హత్యకు గురైన మృతుడు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, భార్యకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. టౌన్లో సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తెరవటం వల్ల ఆకతాయిలు మద్యం సేవించి రెచ్చిపోతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, టెంపుల మాజీ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, పార్టీ నాయకులు మళ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పీకర్ ఇలాకాలో రౌడీయిజాన్ని అరికట్టాలని డీఎస్పీకి వినతి -
ఉత్సాహంగా యువజనోత్సవాలు
డాబాగార్డెన్స్ (విశాఖ): జాతీయ స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలను మంగళవారం స్థానిక ఏవీఎన్ కళాశాలలో నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ యువజనోత్సవాల పోటీలు ప్రారంభించి మాట్లాడారు. యువత యువజనోత్సవాల్లో పాల్గొని వారిలో నిబిడీకృతమైన కళలను బయటకు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ సాంస్కృతిక పోటీలు (జానపద కళా రూపాలు), వక్తృత్వ, ఫొటోగ్రఫీ, చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్టు చెప్పారు. హైస్కూల్ విద్యార్థులతో సైంటిఫిక్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సహకారంతో వివిధ స్కూళ్ల విద్యార్థుల ద్వారా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 2 నుంచి నృసింహ దీక్షలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఏడాది శ్రీ నృసింహ దీక్షలు డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో వి.త్రినాథరావు మంగళవారం తెలిపారు. దేవస్థానం వైదికులు నిర్ణయించిన ప్రకారం 2 నుంచి మండల దీక్ష, 12 నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభంకానున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో దీక్షాధారులకు సింహగిరిపై దేవస్థానం తరపున మాలధారణ చేసి, తులసి మాల, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న దీక్షలు విరమించాల్సి ఉంటుందన్నారు. దీక్ష చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
● ఎస్పీ తుహిన్ సిన్హారికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం: నర్సీపట్నం టౌన్, రూరల్ పోలీసు స్టేషన్లను ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తనిఖీ చేశారు. రౌడీషీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని, ప్రస్తుతం వారు జీవనోపాధికి ఏమేమి పనులు చేస్తున్నారో ఆరా తీశారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే నిరుపేదలు, వృద్ధులు, మహిళల సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సహకరించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల కట్టడికి ఆకస్మిక, డైనమిక్ తనిఖీలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ మోహన్ ఉన్నారు. డౌనూరు చెక్‌పోస్టు తనిఖీ అనకాపల్లి, అల్లూరి జిల్లాల సరిహద్దులో డౌనూరు వద్ద ఉన్న ఎన్డీపీఎస్ చెక్‌పోస్టును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లో నమోదైన వాహనాల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది వాహన తనిఖీలను పర్యవేక్షించి సూచనలు చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
● ఐదుగురికి గాయాలుఅనకాపల్లి: స్థానిక డైట్ కళాశాల సమీపంలో మంగళవారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వెంకట నారాయణ కథనం మేరకు వివరాలు....ఖమ్మం పట్టణం జెడ్పీ కాలనీకి చెందిన అశోక్‌కుమార్ పద్మావతి దంపతుల కుమార్తె వివాహం ఆదివారం విశాఖలో జరిగింది. వివాహం అనంతరం కుటుంబ సభ్యులైన అశోక్‌కుమార్, పద్మావతి, రామలింగం,అన్నపూర్ణ దంపతులతో పాటు మరో మహిళ లక్ష్మీశ్రీకరిలు అన్నవరం వెళ్లి తిరిగి విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కారు డ్రైవర్ రామలింగంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామన్నారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులు విశాఖకు తరలించామన్నారు. కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రశ్నించేతత్వం లోపించడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు
● రూరల్ సీఐ రేవతమ్మనర్సీపట్నం: మహిళల్లో ప్రశ్నించే తత్వం లోపించడం వల్లనే అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖాగ్రంథాలయంలో నిర్వహించిన మహిళా దినత్సోవంలో సీఐ మాట్లాడారు. జీవితాంతం కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాటలు కాదని ఆడపిల్లలు తాత్కాలిక ఆకర్షణకు లోనై జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. ఆడపిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్లయిన తర్వాత భర్త మీద, తర్వాత కుమారుల మీద ఆధారపడవలిసిన దుస్థితి ఇప్పటికీ కొనసాగడం దురదృష్టకరమన్నారు. కొంతమంది మహిళలు పదవుల్లోకి వస్తున్నా పురుషుల పెత్తనమే కొనసాగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. అనంతరం గ్రంథాలయ అధికారి దమయంతి, మహిళలు సీఐను సత్కరించారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.త్రిమూర్తులరెడ్డి, హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మి, మర్రిపాలెం డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ జి.మేరిపుష్ప పాల్గొన్నారు. -
వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించండి
ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు వినతిపత్రం అందిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు కోటవురట్ల: అదనపు బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు మొరపెట్టుకున్నారు. ఈమేరకు ఎంపీడీవో కాశీవిశ్వనాథరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఐదేళ్లుగా సంక్షేమ సహాయకులుగాను, డిజిటల్ సహాయకులుగానూ పనిచేస్తున్నామని, తమకు సంబంధించిన పనితో పాటు ఇతర శాఖల పనులు కూడా మాపై రుద్ది వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. ప్రతీ సోమ, గురువారాలలో పాఠశాలలకు వెళ్లి టీఎంఎఫ్ ఫొటోలు అప్లోడ్ చేయడంతో పాటు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ స్కాలర్షిప్స్, హౌషింగ్ జిలో ట్యాగింగ్, ఎన్పీసీఐ బ్యాంకు లింకింగ్, పింఛన్ల పంపిణీ, బీఎల్వో డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు చేసే పనిని కూడా మాతోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్లకు బీఎల్వో విధులు అప్పగించవద్దని జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ బీఎల్వో విధులు చేయిస్తున్నారని ఆరోపించారు. -
సారా బట్టీలపై దాడులు
● కొరువాడలో 1600 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం కె.కోటపాడు/చోడవరం రూరల్ : నాటుసారా తయారీపై ముందస్తు సమాచారంతో కొరువాడలో ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. చోడవరం ఎకై ్సజ్ సీఐ పాపునాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ శేఖరం ఆధ్వర్యంలో గ్రామం శివారు గల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తుమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1600 లీటర్ల బెల్లం పులుపును ఎకై ్సజ్ సిబ్బంది గుర్తించి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా సారా తయారీకి ఉపకరిస్తున్న బట్టీలన్నింటినీ కొరువాడ గ్రామానికి చెందిన కక్కల దేవుడు కుమారుడు రాము నిర్వహిస్తున్నట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, పూర్తి విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చోడవరం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.వి.పాపునాయుడు వెల్లడించారు. -
జోనల్ స్పోర్ట్స్ మీట్లో పతకాల పంట
● తెనుగుపూడి గురుకుల విద్యార్థుల ప్రతిభదేవరాపల్లి : డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జోనల్ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్‌ను దేవరాపల్లి మండలం తెనుగుపూడి గురుకుల పాఠశాల విద్యార్థులు సొంతం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకుల పాఠశాలలో ఈ నెల 14 నుండి 16 వరకు జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలలో తెనుగుపూడి గురుకుల విద్యార్థులు వివిధ విభాగాలలో 40 మంది సత్తా చాటారని గురుకుల ప్రిన్సిపాల్ పి.రఘు తెలిపారు. సీనియర్స్ ఖోఖో, కబడ్డీలో విన్నర్ గా, హ్యాండ్ బాల్లో రన్నర్‌గా నిలిచారు. 400 మీటర్ల రన్నింగ్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సిహెచ్. సూర్యకిరణ్ రజత పతకం సాధించాడు. జూనియర్స్‌లో ఖోఖో విన్నర్, వాలీబాల్ రన్నర్‌గాను నిలిచారు. జూనియర్స్ విభాగంలో 100 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి ఎస్. గౌరీ మణిశంకర్, వినయ్‌కుమార్ రజతం, కాంస్య పతకాలు సాధించారు. 200 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి ఎస్.గౌరీ మణి శంకర్ స్వర్ణ పతకం సాధించాడు. 400 మీటర్ల రన్నింగ్‌లో గౌరీ మణిశంకర్, 8వ తరగతి విద్యార్థి ఆర్.తరుణ్ ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 800 మీటర్ల రన్నింగ్‌లో ఆర్.తరుణ్, 1500 మీటర్ల రన్నింగ్‌లో టెన్త్ విద్యార్థి బి.పార్ధు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్స్ లాంగ్ జంప్, జావెలిన్ త్రోలో టెన్త్ విద్యార్ధి ఎన్. సాయి వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్‌ను సాఽధించాడు. జూనియర్స్‌లో 4 ఇంటు 100 మీటర్ల రిలే పరుగు పోటీలో జి. గౌరీ మణిశంకర్, బి.వినయ్, ఆర్.తరుణ్, ఎన్. సాయి బంగారు పతకాలను సాధించారు. విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు జి.తరుణేశ్వరరావు, నాగేశ్వరరావులను ప్రిన్సిపాల్ రఘు, స్కూల్ కమిటీ చైర్మన్ నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో పాటు పీఈటీలను ఉమ్మడి విశాఖ జిల్లా గురుకులాల కోఆర్డినేటర్ ఎస్.రూపావతి అభినందించినట్టు ప్రిన్సిపాల్ రఘు తెలిపారు. -
‘చలో విజయవాడ’ పోస్టర్ ఆవిష్కరణ
యూనియన్ నాయకులతో కలిసి చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధ్యక్షుడు గోపీనాథ్ నర్సీపట్నం: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10న జరిగే సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్ పిలుపునిచ్చారు. యూనియన్ సభ్యులతో కలిసి మంగళవారం చలో విజయవాడ పోస్టర్‌ను గోపినాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి పాతన పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, దేముడు, కె.వి.రమణ, ఆర్.కె.నాయుడు, రవి పాల్గొన్నారు. -
పుస్తెల బంధనం!
పుత్తడి బొమ్మకు.. జిల్లాలో కలవరపరుస్తున్న బాల్య వివాహాలు వయసు రాకుండానే పెళ్లి పీటలెక్కుతున్న బాలికలు చట్టాలున్నా చట్టుబండలే ఇటీవల అనకాపల్లి గాంధీనగరం పరిధిలో ఓ 17 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. బాలిక తరపున ఎవరో చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమ అధికారులపై బాలిక బంధువొకరు తిరగబడ్డాడు. పోలీసుల సాయంతో అతికష్టం మీద తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆ వివాహాన్ని ఆపారు. చిన్నారిని చేయొద్దు పెళ్లికూతురు యలమంచిలి పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి పదో తరగతి పూర్తయిన 15 ఏళ్ల బాలికను ప్రసవం కోసం తీసుకురావడంతో వైద్యులు నివ్వెరపోయారు. తమ వద్ద డెలివరీ చేయడానికి కుదరదని చెప్పడంతో వారు పక్క జిల్లాలో ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బాలిక నివసిస్తున్న గ్రామంలో ఐసీడీఎస్, మహిళా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం. రెండేళ్లలో ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలు 151 బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1098 యలమంచిలి రూరల్: ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా.. ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. చిన్నారి పెళ్లి కూతురికి పుస్తెల బంధనం తప్పడం లేదు. ఇందుకు నిరక్షరాస్యత, పేదరికం కొంత కారణం కాగా.. తల్లిదండ్రుల ఆలోచనా విధానం మరో ప్రధాన కారణం. తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్న కొందరు తల్లిదండ్రుల ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడల్లో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. లోకం పోకడ తెలియకుండానే బిడ్డలకు బాల్యంలోనే వివాహాలు చేసి వారి జీవితాలను కొందరు తల్లిదండ్రులు చేజేతులా అగాధంలోకి నెడుతున్నారు. 18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేస్తే అనారోగ్యంతో కుంగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. అడ్డుకుంటున్నా.. ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంక్షేమ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్న వారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే, అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. పెద్దయితే తాము చెప్పిన సంబంధం చేసుకుంటుందో లేదో అనే ఆలోచనతో మరికొందరు, ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెస్తుందేమోనన్న భయంతో ఇంకొందరు.. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గత రెండేళ్లలో అధికారుల దృష్టికి వచ్చిన 151 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అధికారుల దృష్టికి రాకుండా జరిగిపోతున్న పెళ్లిళ్లు అనేకం ఉంటున్నాయి. ●బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బాధ్యత మోస్తూనే అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు గర్భం దాలిస్తే తల్లికీ, బిడ్డకు ప్రాణాపాయం ఉంటుంది. ●ఎంతో సందడిగా ఆనందోత్సాహాలతో జరగాల్సిన పెళ్లి అధికారుల జోక్యంతో అర్థంతరంగా ఆగిపోతే రెండు కుటుంబాల వారికీ నగుబాటే కదా. అందుకే పెళ్లి వయసు రాకుండా ముహూర్తాలు పెట్టుకొని, అడ్డుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ●బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఏటా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 3 వేల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని హైస్కూల్, జూనియర్ కళాశాలల్లో సమావేశం నిర్వహించి బాలికలకు బాల్యవివాహాల వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తారు. నిద్రావస్థలో యంత్రాంగం బాల్య వివాహాల నిరోధక చట్టం 2006కు సంబంధించి నిబంధనలను కఠినతరం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 మార్చి 19న జీవో నంబరు 13ను విడుదల చేసింది. బాల్య వివాహాలను నివారించి, ప్రజలను చైతన్యం చేసేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, ఐసీడీఎస్ పీడీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కన్వీనర్లుగా ఉన్నారు. డివిజన్ స్థాయిలో డీఎస్పీ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్లుగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని కమిటీలు ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఆగడం లేదు. గ్రామ స్థాయిలో ఉన్న వారందరికీ వారి పరిధిలో ప్రతి విషయం తెలుస్తుంది. కానీ బాల్య వివాహాల నియంత్రణపై ఉదాసీన వైఖరినే అవలంబిస్తున్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ప్రాణానికే ప్రమాదం బాల్య వివాహాల వలన వచ్చే గర్భాల వల్ల బాలికలు ఎనీమియా బారిన పడే ప్రమాదం ఉంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్తపోటుతో మెటర్నల్ డెత్‌లు జరుగుతాయి. బిడ్దను మోసే సామర్థ్యం బాలికలకు తక్కువగా ఉంటుంది. 6 నెలల క్రితం యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి 17 ఏళ్ల ప్రాయంలోనే గర్భం దాల్చిన కేసు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాను. చిన్న వయసులో గర్భం దాలిస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రమాదమే. –డాక్టర్ ఆర్.నిహారిక, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గైనకాలజిస్ట్, యలమంచిలి సీహెచ్‌సీ సమాచారం ఇవ్వండి బాల్య వివాహాలు జరిగినట్టు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పెళ్లిని ఆపుచేస్తాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. తగిన వయసు లేకపోతే మానసిక, శారీరక పరిపక్వత ఉండదు. –కె.అనంతలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, అనకాపల్లి ●బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్య వివాహం చట్తరీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ కోసం 1098 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకుంటారు. అందరూ బాధ్యులే.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహం జరిపించిన తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, అనుమతించిన పెద్దలు, సహకరించిన వారు కూడా నేరస్తులే అవుతారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకొని సంసారం చేస్తే పోక్సో కేసు నమోదవుతుంది. –కె.వి.సత్యనారాయణ, డీఎస్పీ, పరవాడ -
యువత సన్మార్గంలో నడవాలి
నర్సీపట్నం: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంకల్పం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా నేడు మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏవిధంగా చెడిపోతున్నారో వివరించి, వారిని తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ సంకల్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావంపై పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు సంబంధిత స్కూల్, కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. వీడియోలను ప్రదర్శిస్తున్నామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడిన నిందితులకు గరిష్టంగా 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తున్నారన్నారు. చట్టాల తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలపై బానిసలైన యువకులు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి నేరస్థులుగా మారుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగదారులు, క్రయవిక్రయాలు జరిపే వారిపై నిఘా పటిష్టం చేస్తున్నామని, సరఫరా చేసే వారి సమాచారం 9392918196 తెలియజేయాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం మత్తు పదార్థాలతో యువత శరీరం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్.కృష్ణ, సీఐలు గోవిందరావు, రేవతమ్మ, ఎస్సైలు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు ఎస్పీ తుహిన్ సిన్హా -
సృజన వెలికితీసేందుకే బాలోత్సవ్
డాబాగార్డెన్స్: మహారాణిపేటలోని సెయింట్ ఆంథోనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విశాఖ బాలోత్సవం వేడుకగా ప్రారంభమైంది. విశాఖ బాలోత్సవం అధ్యక్షుడు పిల్లల మర్రి రఘు అధ్యక్షతన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బేతవోలు రామబ్రహ్మం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ బాలోత్సవం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పిల్లలను ప్రోత్సహించేందుకు ఇటువంటి వేదికలను ఉపయోగించుకోవాలని స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ పిల్లలు దేనినైనా సూక్ష్మంగా గ్రహిస్తారన్నారు. కన్సర్న్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పీకే జోష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ రత్నకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాలలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇన్ని ఈవెంట్స్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యదర్శి జీఎస్ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు కె.రమాప్రభ మాట్లాడుతూ రెండు నెలలుగా ఈ కార్యక్రమం కోసం కృషి చేయగా 120 పాఠశాలల నుంచి దాదాపుగా 8 వేల మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు 84 సాంస్కృతిక, ఈవెంట్స్ ఉంటాయని, తొలి రోజు 27 ఈవెంట్స్ నిర్వహించామన్నారు. 100 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు, ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీనాథ్, ఆహ్వాన సంఘం సభ్యురాలు కె సుశీల, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధి వై.మోదాంబికా దేవి, ఎం.ఎల్లాజీ, ఎం.గుణశంకర్, వై.సత్యనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ బాలోత్సవంలో వక్తలు -
మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
● 26 మందికి నియామక పత్రాలుఎంపికై న విద్యార్థులతో ప్రిన్సిపాల్ శాస్త్రి మాడుగుల రూరల్ : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, ఐక్యూఏసి విభాగం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఉద్యోగ మేళాను మంగళవారం నిర్వహించారు. ఎస్.కె.ఎల్.అసోసియేట్స్, హెల్త్ కేర్(విశాఖపట్నం) కంపెనీల్లో టెలికాలర్ మరియు హోమ్‌కేర్ ఉద్యోగాల కోసం 76 మంది ఉద్యోగార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి రాత, మౌఖిక పరీక్ష నిర్వహించారు. వీరిలో 26 మందిని ఎంపిక చేసి, వారికి ఉద్యోగ నియామక పత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ శాస్త్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.జయలక్ష్మి, ఉపన్యాసకులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● గ్యాంగ్‌లో ఆరుగురు అరెస్టు– మరొకరు ఇప్పటికే జైలులో.. ● రూ. 15.5 లక్షల విలువైన 20 ద్విచక్రవాహనాలు స్వాధీనం
శ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా బైక్‌చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను ఆమదాలవలస పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 15.5 లక్షల విలువైన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీలే కాక బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లు, వైన్‌షాపు, రోబరీల్లో నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ నేరాలతో సంబంధమున్న మరో వ్యక్తి గంజాయి కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గత నెల 5వ తేదీ రాత్రి ఆమదాలవలసకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కరణం శ్రీనివాసరావు తన ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్ఐ కె.వెంకటేష్‌లు తమ సిబ్బందితో కలసి దర్యాప్తు కొనసాగించారు. విచారణ కొనసాగించగా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి అర్జునరావు (37) దివ్యాంగుడు కావడం, ఏ పనిచేయక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇతనికి ఆమదాలవలస కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్, పలాస మండలం అంబుసోలికి చెందిన జడ్యాడ సోమేశ్వరరావు (21), విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన సప్ప హరీష్ (21), ఆమదాలవలస మెట్టెక్కివలసకు చెందిన మదాసు ధనుష్ (19)లు పరిచయమయ్యారు. పథక రచన చేశారిలా.. అర్జునరావు వీరందరికి ఖర్చులకు డబ్బులివ్వడమే కాక ఉండటానికి గది అద్దెకిచ్చి రాత్రి పూట బైక్, ఇతర చోరీలు ఎలా చేయాలన్నదానిపై ప్రణాళిక రూపొందించేవాడు. దొరికిన బైక్‌లను ఏపీలో అమ్మితే సమస్యని, ఒడిశాలో అమ్మితే పోలీసులకు దొరికే అవకాశముండదని ఒడిశా గజపతి జిల్లా మినిగాన్కు చెందిన తన మిత్రుడు దారపు శేషగిరి (42) అతని బంధువైన ఏరుపల్లి బాలాజీ (సరుబుజ్జిలి మండలం, తురకపేట)ల సాయంతో అమ్మేవారు. పట్టుబడ్డారిలా.. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ గేట్ స్కూల్ కూడలి వద్ద ఎస్ఐ వెంకటేష్, తమ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో జడ్యాడ సోమేశ్వరరావుపై విజయనగరం బొబ్బిలిలో మూడు, కాశీబుగ్గ, ఆమదాలవలసల్లో ఒక్కొక్కటి చొప్పున పాత కేసులుండగా సప్ప హరీష్‌పై బొబ్బిలిలో మూడున్నాయి. ఈ ఏడాది ఎన్డీపీఎస్ (గంజాయి) కేసులో అంపోలులో జైలుశిక్ష అనుభవిస్తున్న కారుణ్య జగదీష్‌పై బొబ్బిలిలో మూడు, ఆమదాలవలసల్లో నాలుగు కేసులుండటం విశేషం. స్వాధీనం చేసుకున్న బైక్‌లు ఎక్కడెక్కడివి అంటే.. ఆమదాలవలస పీఎస్ పరిధిలో ఐదు, కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఐదు, శ్రీకాకుళం రూరల్, విజయనగరం 1టౌన్, విశాఖపట్నం3 టౌన్ లావేరు, ఎచ్చెర్ల పీఎస్‌ల పరిఽధిలో ఒక్కొక్కటి చొప్పున కాగా మరో ఐదు ద్విచక్రవాహనాలు వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేష్, పీసీలు రాధాకృష్ణ, శ్యామలరావు, బాలకృష్ణలను ఎస్పీ అభినందించారు. పట్టుబడిన ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు -
డబ్బులిస్తేనే కుళాయి కనెక్షన్
● కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటంనక్కపల్లి : ‘కుళాయి కనెక్షన్ కావాలంటే డబ్బు కట్టాలి.. లేకపోతే కనెక్షన్ ఇవ్వం.. ఫ్రీగా కావాలంటే టైమ్పడుతుంది..అర్జంట్ అయితే మేము అడిగినంత డబ్బులు చెల్లించి కనెక్షన్ పొందండి..’ అంటూ గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ శాఖలో కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి పైపులైన్లు వేసి ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లు కేటాయించారు. సుమారుగా రూ.133 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు, బోర్లు నిర్మించి, ప్రధాన వీధుల్లో పైపులైన్లు వేసి, మెయిన్ పైపులైనుకు కుళాయి పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆపై మెయిన్‌లైను నుంచి లూపులైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. మండలంలోని గొడిచర్ల గ్రామంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. మెయిన్లైనుకు ఆనుకుని ఉన్నవారికి, మెయిన్‌లైను నుంచి మూడు మీటర్ల దూరంలో ఉన్న లూపు లైన్లలో ఉన్నవారికి కనెక్షన్ ఉచితంగానే ఇస్తున్నారు. మూడు మీటర్లు దూరం దాటి ఉన్నవారికి మాత్రం కనెక్షన్ ఇవ్వడం లేదు. ఇదేమని కాంట్రాక్టర్లను అడిగితే ఫ్రీగా ఇప్పట్లో వేసే ప్రసక్తి లేదని, రెండో విడతలోనో, మూడో విడతలోను వేస్తామని, డబ్బులు ఇస్తే ఇప్పుడే వేసేస్తాం అని చెబుతున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే వెయ్యి రూపాయల నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని, పైపులు, ట్యాపులు తెచ్చుకుంటే రూ.500 నుంచి వెయ్యి వసూలు చేస్తున్నారని వారు చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి గ్రామానికి సగటున రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసింది. మెయిన్ పైపులైను, లూపులైన్లు, ట్యాపులు సైతం ఈ నిధుల నుంచే ఖర్చు చేయాలి. కానీ ఫ్రీగా ఇవ్వాల్సిన కనెక్షన్లను కూటమి ప్రభుత్వం వచ్చేక డబ్బులు వసూలు చేసి ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగభూషణం వద్ద ప్రస్తావించగా కుళాయి పైపులైన్లు ఏర్పాటు పనులు కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, పర్యవేక్షణ మాత్రం ఆర్డబ్ల్యూఎస్ శాఖదేనన్నారు. డబ్బులు వసూలు చేస్తున్న విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
‘చలో విజయవాడ’ పోస్టర్ ఆవిష్కరణ
యూనియన్ నాయకులతో కలిసి చలో విజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధ్యక్షుడు గోపీనాథ్ నర్సీపట్నం: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10న జరిగే సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్ పిలుపునిచ్చారు. యూనియన్ సభ్యులతో కలిసి మంగళవారం చలో విజయవాడ పోస్టర్‌ను గోపినాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి పాతన పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, దేముడు, కె.వి.రమణ, ఆర్.కె.నాయుడు, రవి పాల్గొన్నారు. -
కరువు బరువు
భద్రత సంక్షేమంనర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో పెచ్చులూడి పడుతున్న డార్మెటరీ రోలుగుంట బీసీ బాలుర వసతి గృహంలో తలుపులు లేని గదులు శిధిలమయిన అద్దె భవనంలో రేవు పోలవరం బీసీ వసతి గృహంస్లాబు పెచ్చులు ఊడిపోతున్న గదులునర్సీపట్నం ఎస్సీ హాస్టల్ దుస్థితిశీతాకాలంలో చలిని తట్టుకునే దుప్పట్లు కరువు.. సగానికి పైగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో రక్షణ గోడలు కానరావు.. తలుపులు లేని బాత్రూమ్లు.. బాలికల హాస్టళ్లలోనూ ఏర్పాటు కాని సీసీ కెమెరాలు.. జూన్ నెల నుంచి అందని కాస్మొటిక్ చార్జీలు.. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో బితుకుబితుకుమంటూ విద్యార్థులు.. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలకే సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయి. హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వ పర్యవేక్షణ డొల్లతనమంతా బయటపడింది. వసతి గృహాల్లో గదులకు తలుపులు, కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో దోమలు విజృంభించి విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితులున్నాయి. శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాల నుంచి విద్యార్థులను తరలించాల్సి ఉన్నా ఆర్థిక భారంతో అధికారులు ముందడుగు వేయడం లేదు. సాక్షి ఫీల్డ్ విజిట్‌లో వెల్లడైన వాస్తవాలివి.. –సాక్షి, అనకాపల్లి ●అనకాపల్లిలో గుండాల జంక్షన్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 130 మంది ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థినులు ఉంటున్నారు. అందరూ హాల్లోనే నేల మీద పడుకుంటారు. వర్షం పడితే బిల్డింగ్ అంతా జలమయమే. ●అద్దె భవనంలోనే కొనసాగుతున్న గవరపాలెం మహాత్మజ్యోతిబాపూలే వసతి గృహంలో ఇరుకు గదులు.. నీటి సదుపాయం నిల్ ●గాంధీనగరం డీఎన్టీ హాస్టల్లో 100 మంది విద్యార్థులకు గదులు సరిపోడంలేదు. ●అంజికాలనీలో ఉన్న ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పెద్ద వర్షం పడితే రహదారిపై ఉన్న వర్షపు నీరు గదుల్లోకి వచ్చేస్తుంది. బాత్రూమ్ల దగ్గర పాముల సంచారం, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ●విజయరామరాజుపేటలో నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఆవాసియా విద్యాలయ అర్బన్ హాస్టల్లో 103 మంది విద్యార్థులున్నారు. బాత్రూమ్లకు తలుపుల్లేవు. ఫ్యాన్లు సరిగ్గా తిరగవు. దోమల బెడద ఎక్కువ. సీసీ కెమెరాలు లేవు. తాగునీటి పైప్‌లు చిదిగిపోయాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో పెదబొడ్డేపల్లి బాలుర గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్ అధ్వానంగా ఉంది. డార్మెటరీ శిథిలావస్ధకు చేరింది. ●నర్సీపట్నం ఎస్సీ బాలుర వసతి గృహంలో భవనం స్లాబ్ పెచ్చులూడుతోంది. ●అద్దె భవనంలో కొనసాగుతున్న ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు జైలు వాతావరణంలో గడుపుతున్నారు. ●250 మంది విద్యార్థులున్న నర్సీపట్నం అబిద్సెంటర్లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో బాత్ రూమ్‌లు చాలక విద్యార్థులు కాలకృత్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. ●వేములపూడి ఎస్సీ బాలుర వసతిగృహంలో బాత్ రూమ్‌లు, రన్నింగ్ వాటర్ లేక కాలకృత్యాలు తీర్చుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ●నాతవరం ఎస్సీ బాలికల హాస్టల్లో మరుగుదొడ్లు, గొలుగొండ గురుకుల పాఠశాలలో భోజనం తయారు చేసే కిచెన్ శిథిలావస్ధకు చేరాయి. వర్షాలకు కిచెన్ స్లాబ్ పెచ్చులూడి పడుతోంది. పైకప్పు స్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు వేలాడుతున్నాయి. ●తాండవ గిరిజన ఆశ్రమం ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన భవన నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. మాడుగుల మండలంలో సరసయ్యపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాత్రూమ్లు పరిశుభ్రంగా ఉండడం లేదు. ప్లే గ్రౌండ్ వర్షం వచ్చిన పది రోజుల వరకూ బురదమయంగా అధ్వానంగా ఉంటుంది. ●కోనాం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో బాత్రూమ్ల తలుపులు పాడయ్యాయి. ●తురువోలు బీసీ బాలుర వసతి గృహ భవనంలో వర్షం వస్తే భవనం పూర్తిగా తడిసి ముద్దవుతుంది. ●చీడికాడ మండలం అప్పలరాజుపురం బీసీ బా లుర హాస్టల్లో రెండు గదులు పాడయ్యాయి. వీటికి మరమ్మతులు చేపట్టి ప్రహరీ గోడ నిర్మించాలి. ●దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల వి ద్యాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుకు గురయింది. చోడవరం మండల పరిధి గోవాడలో బీసీ గర్ల్స్ హాస్టల్‌కు సొంత భవనం లేదు. 80 మంది పి ల్లలున్న ఈ భవనంలో వాటర్, బాత్రూమ్ సమస్యలున్నాయి. ●చోడవరం సమీపంలో గాంధీగ్రామ పంచాయతీ సిటిజన్ కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహం అన్ని గదుల స్లాబులు పెచ్చులూడి పోయి ఉండడంతో పాటు వర్షాకాలం నీరు కారడం సహజంగా మారింది. విద్యార్థులకు 6 మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం అంతంత మాత్రం. ●పాయకరావుపేట పట్టణంలో గల నెంబర్–1ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. నెంబర్– 2 వసతి గృహంలో బాత్రూమ్లకు డోర్లు లేవు. లెట్రిన్లు సక్రమంగా లేవు. ●ఎస్.రాయవరం మండలంలో బీసి బాలుర హాస్టల్‌కు ప్రహరీ లేదు. గదుల్లో కిటికీలకు గ్రిల్స్ లేవు. కొన్ని గదుల తలుపులకు గడియలు లేకపోవడంతో విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారు. ●అద్దె భవనంలో ఉన్న రేవుపోలవరం బాలబాలికల హాస్టల్లో ప్రహరీ గోడ లేదు. ●కోటవురట్ల మండలం ఎస్సీ బాలికల వసతి గృహంలో ప్రహరీ కూలిపోవడంతో విద్యార్ధినులు ఆందోళన చెందుతున్నారు. భవనం స్లాబ్ పెచ్చులూడి పడుతోంది. ●యలమంచిలిలో బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 120 మంది విద్యార్థులున్నారు. వీరికి 9 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో కిటికీలకు అద్దాలు, కొన్ని గదులకు తలుపులు, ఫ్యాన్లు లేవు. టాయిలెట్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ●కొత్తపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో మోటర్ పాడైపోవడంతో 6 నెలలుగా నీటి సరఫరా జరగడంలేదు. ఉన్న ఒక చేతి బోరు కూడా పాడవడంతో పాత టైర్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు పూర్తిస్థాయిలో లేవు. గాంధీనగరం బాలుర హాస్టల్లో వర్షం కురిస్తే వంటగది పై కప్పు నుంచి నీరు కారుతోంది. ●రాంబిల్లి మండలంలోని కేజీబీవీ వసతి గృహంలో విద్యార్థులకు రక్షణ గోడ లేదు. మరుగుదొడ్లు, స్నానపుగదుల దుస్థితి -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
మాట్లాడుతున్న గోపినాథ్ నక్కపల్లి: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ అన్నారు. సోమవారం ఆయన వేంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు పీఆర్టీయూ మండల శాఖ తరపున లంచ్ బ్యాగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల సమయాలు మార్చాలన్న ప్రభుత్వ ఆలోచన పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు టి.వి.రమణ, ప్రగడ శివాజీ, గౌరవాధ్యక్షుడు చోడిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యాయులు ప్రసాద్, రమణ, ఎన్వీఎస్ ఆచార్యులు పాల్గొన్నారు. -
రౌడీ రాజ్యం
రౌడీయిజం వారి వృత్తి.. రాజకీయం ప్రవృత్తి.. తెలుగుదేశం క్రియాశీలక సభ్యులు వారు.. ఆ పార్టీ అండతో చెలరేగిపోతారు.. వారు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఎవరూ సంచరించడానికి వీల్లేదు.. ఎవరైనా ఎదురుగా కనిపిస్తే చాలు తమను ధిక్కరించినట్టు భావిస్తారు.. వారి పనిపడతారు. నర్సీపట్నంలో సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడి హత్య అలాగే జరిగింది. టీడీపీ నాయకుడు బండారు కొండబాబు, పార్టీ సాధారణ కార్యకర్త అయిన రౌడీ షీటర్ బండారు సంతోష్ అకారణంగా అతనిని పొట్టన పెట్టుకున్నారు. మృతుడి భార్య, ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు. ● నర్సీపట్నంలో యువకుడి దారుణ హత్య ● నిందితులిద్దరూ టీడీపీకి చెందినవారు ● అయ్యన్న ఇలాకాలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు ● మృతుడి బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం ● పోలీస్ స్టేషన్, ఏరియా ఆస్పత్రి ముట్టడినర్సీపట్నం: హతుడికి, నిందితులకు పాత కక్షలు లేవు. హత్యకు గురైన నాగేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించిందీ లేదు. కానీ క్షణాల్లో ప్రాణాలు తీశారు. టీడీపీ అండతో కలిగిన కండకావరమే అందుకు కారణం. అందుకే మృతుడి బంధువులు, గ్రామస్తుల్లో అంత ఆగ్రహం రగిలింది. హత్యను నిరసిస్తూ స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లేందుకు వారు బయలుదేరగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకుని నిలువరించారు. వెనుతిరిగిన మృతుడి బంధువులు టౌన్ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. హంతకులను అరెస్ట్ చేసి.. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న బండారు కొండబాబును సాయంత్రంలోగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తామని టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అకారణంగా ప్రాణం తీశారు.. టౌన్ సీఐ గోవిందరావు అందించిన వివరాల ప్రకారం.. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సర్వసిద్ధి నాగేశ్వరరావు(నాగు) (32) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. నర్సీపట్నం కొత్తవీధిలో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులు ఎస్.సురేష్, పి.నవీన్, శంకర్లను భోజనానికి ఇంటికి తీసుకువచ్చాడు. ఆ దారి వెంబడి రావొద్దంటూ అక్కడ మద్యం సేవిస్తున్న టీడీపీ నాయకుడు కొండబాబు, ఆ పార్టీ సాధారణ కార్యకర్త అయిన రౌడీషీటర్ సంతోష్ వారిని హెచ్చరించారు. భోజనం చేసి తిరిగి వెళ్తున్న మృతుడి స్నేహితుడు శంకర్‌ను మళ్లీ ఎందుకురా ఇలా వచ్చావంటూ బైక్ తాళాలు లాక్కొని సిగరెట్‌తో మెడపై కాల్చారు. శంకర్ వెళ్లి నాగేశ్వరరావును తీసుకురావడంతో ఇరువు వర్గాల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్ సంతోష్, టీడీపీ నాయకుడు కొండబాబులు నాగేశ్వరరావుపై దాడి చేశారు. స్పృహ కోల్పోయిన నాగేశ్వరరావును బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఐదు నెలల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం నాగేశ్వరరావు హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సోమవారం ఉదయం టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులు ఇద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ అండతో ఎంత మందిని హతమారుస్తారంటూ బంధువులు, గ్రామస్తులు ఆక్రోశం వెలిబుచ్చారు. హత్యను నిరసిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. పోలీసులు నచ్చచెప్పడంతో వెనుతిరిగి టౌన్ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. హత్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ నచ్చజెప్పినా వారు శాంతించలేదు. మృతుడి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రి ముందు కూడా ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్డుపై బైటాయించారు. దీంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. హంతకులను అరెస్టు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే మృతదేహాన్ని తీసుకువెళ్తామని లేదంటే, తీసుకువెళ్లే ప్రసక్తి లేదని భీష్మించారు. మృతుడి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. మృతుడు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి సోమవారం రాత్రి పరామర్శించారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మోహన్ నర్సీపట్నం: సర్వసిద్ధి నాగేశ్వరరావును హత్య చేసిన నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ మోహన్ తెలిపారు. మద్యం మత్తు, ప్రేరేపిత మాటలే హత్యకు దారి తీశాయన్నారు. మృతుడి మేనమామ పల్లా అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టామన్నారు. సీఐ గోవిందరావు బృందం నేరం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారన్నారు. హత్యకు పాల్పడిన కొత్తవీధికి చెందిన రౌడీ షీటర్ బండారు సంతోష్‌ను సుబ్బారాయుడుపాలెం రాయల్ రిసార్ట్స్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. బండారు కొండబాబును మాకవరపాలెం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. ఇద్దరు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. బహిరంగంగా మద్యం తాగితే కేసులు పెడతామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కేడీ పేట, డౌనూరు ప్రాంతాల్లో రెండు పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. రౌడీ షీటర్లు ఎలాంటి అకతాయి చర్యలకు పాల్పడినా ఉపేక్షించేదిలేదన్నారు.