Bhuggana rajendranath reddy
-
లెక్కలు లేకుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా?
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41 వేల కోట్లకు లెక్కలు లేవంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ స్పష్టం చేశారు. ఆడిట్ సంస్థ అడిగితే దానిని పట్టుకొని కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేయడం సహజమని, వాటి ఆధారంగా ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాలో రూ.410 జమ అయినా వెంటనే సరి చేస్తారని అలాంటిది రూ.41 వేల కోట్లకు లెక్కలు లేకుంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. బుగ్గన మంగళవారం ఆర్ అండ్ బి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించకపోవడంపై ఆడిట్ సంస్థ వివరణ కోరితే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ప్రోగ్రామ్‌లో లోపాల కారణంగానే ఇలా జరిగిందన్నారు. అంతే కానీ లెక్కలు లేకపోవడం, అవతకవకలకు ఆస్కారమే లేదన్నారు. తెలంగాణ వాటాపై ఏపీ అప్పులు తెస్తోందంటూ ఆరోపించడం అవివేకమన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది’ అని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల్లో కోత పేరుతో కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న వార్తలు, టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. రెండేళ్లలో పేదలకు లక్ష కోట్ల సాయం.. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి అప్పులు చేశామని, రెండేళ్లలో నవరత్నాల పథకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలు పేదలకు సాయంగా అందించామని బుగ్గన వివరించారు. అప్పులు కూడా విచక్షణతోనే చేశామన్నారు. తాము రైతులు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం అప్పులు చేశామని, చంద్రబాబు హయాంలో ఆర్భాటాలు, సదస్సులు, ఎంవోయూల కోసం అప్పులు చేశారని గుర్తు చేశారు. క్యాన్సర్ ఫౌండేషన్‌తో ఎంవోయూలు చేసుకుని లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెప్పారన్నారు. ఉద్యోగాలు వస్తాయా.. రోగులు వస్తారా? అని తాను అసెంబ్లీలో ప్రశ్నించానని బుగ్గన పేర్కొన్నారు. దున్నపోతు ఈనిదంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న తరహాలో ఆడిట్ సంస్థ అడిగిన వివరణ ఆధారంగా పీఏసీ చైర్మన్ ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏవైనా అనుమానాలు, సందేహాలుంటే బాధ్యత గల పీఏసీ చైర్మన్‌గా సమావేశం నిర్వహించి అధికారులను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రైవేట్ వ్యక్తికి సీఎఫ్ఎంఎస్.. 2018లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్లను ధారపోసి తెచ్చిన సీఎఫ్ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాలను సరి చేస్తున్నామని బుగ్గన తెలిపారు. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి చెల్లింపులకు సంబంధించిన సీఎఫ్ఎంఎస్ను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తి చేతికి అప్పగించారన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనడం అవాస్తవమన్నారు. పరిమితికి మించిన అప్పులు బాబు హయాంలోనే పీడీ ఖాతాల్లో ఉన్న రూ.10,895 కోట్లు మార్చి నెలాఖరు నాటికి వ్యయం కాకపోవడంతో ప్రభుత్వ కన్సాలిడేటెడ్ నిధికి జమ అయ్యాయన్నారు. ఇది సర్వసాధారణమన్నారు. టీడీపీ హయాంలో 2018–19లో రూ.19,530 కోట్లు, 2019–20లో 20,998 కోట్లు ఇలాగే జరిగాయని గుర్తు చేశారు. సీఎఫ్ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాల వల్లే ట్రెజరీకి మ్యాచ్ కాలేదని మంత్రి పేర్కొన్నారు. అప్పుల్లో రూ.17 వేల కోట్లు తగ్గించినట్లు పేర్కొన్నారని, ఇందులో రూ.16,419 కోట్లు గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి చేసిన అప్పుల వల్లే తగ్గించారని బుగ్గన పేర్కొన్నారు. సామాన్యులకు భరోసా కల్పించాం కరోనా వల్ల రాబడి గణనీయంగా తగ్గినా సామాన్యులను ఆదుకుని భరోసా కల్పించామని, కోవిడ్ నిర్వహణలో ఏపీ మెరుగ్గా వ్యవహరించిందని పలు సంస్ధలు పేర్కొన్నాయని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు మాదిరిగా వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలని, యూజర్ చార్జీలు విధించాలని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదని, సబ్సిడీలు వద్దని ఈ ప్రభుత్వం చెప్పలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు బకాయి పెట్టిన ధాన్యం, విత్తనాలు, విద్యుత్ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. కరోనా కష్టాల్లో ఆదాయం పడిపోవడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని, అదే తరహాలో ప్రజలను ఆదుకోవడానికి అప్పులు చేస్తున్నామని, అదీ కూడా పరిమితికి లోబడే చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు. జీతాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
బిల్లులపై మండలిలో రగడ
సాక్షి, అమరావతి: తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని ప్రవేశపెట్టే విషయమై ఉదయం సభ ప్రారంభం నుండి సాయంత్రం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగించారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ఉద్దేశంతో రూల్–71 కింద నోటీసు ఇచ్చి, దానిపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా, బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార పక్షం పదేపదే విజ్ఞప్తి చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళం నెలకొనడంతో మండలి చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మొదట రూల్–71పై చర్చించి ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ బిల్లులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని.. సందర్భం లేకుండా రూల్–71ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. రూల్–71 అంశంపై చర్చించిన అనంతరం బిల్లుల విషయమై ఆలోచిద్దామని అనడంతో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా జీఓ విడుదలైన తర్వాత దానికి సంబంధించిన విధానం చర్చకు వస్తుందని తెలిపారు. కానీ, రూల్–71పై చైర్మన్ ఇచ్చిన రూలింగ్ సరికాదని.. దానికంటే ముందు తమ బిల్లులనే తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత దానిపై ప్రతిపక్షం డివిజన్ కోరినా ఆమోదించినా, తిరస్కరించినా వారిష్టమని, అయితే ముందు బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. సాయంత్రం రూల్–71పై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటేశారు. తటస్థంగా తొమ్మిది మంది నిలిచారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : కంతేటి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవడం సరికాదని, విలువైన సూచనలు చేసి సహకరించాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు సూచించారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వారికి తగినంత మంది సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష సభ్యులు సహకరించి బిల్లులపై మండలిలో చర్చకు సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మండలిని రద్దుచేసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : పీడీఎఫ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నా వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో అమోదం పొందిన బిల్లులు శాసనమండలికి వస్తే వాటిని అనుమతించకుండా చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి గంటల తరబడి సభను స్తంభింపజేయడం ఏమిటని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. బిల్లులపైనే మొదట చర్చ : బీజేపీ బీజేపీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 అంశంపై చర్చించేలా చూడాలని కోరారు. మరోవైపు.. తాము ప్రతిపాదించిన అంశంపైనే చర్చ జరగాలని టీడీపీ.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి బొత్స మరోసారి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు చెప్పినట్లు చేస్తే ఎలాగని చైర్మన్‌ను ప్రశ్నించారు. చైర్మన్ పదవి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత ఇరుపక్షాల మధ్య సమోధ్య కుదిర్చేందుకు చైర్మన్ షరీఫ్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వం కోరిన విధంగా ముందు రెండు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 ప్రకారం చర్చ ప్రారంభించి మొత్తం మూడు అంశాలను కలిపి చర్చించేందుకు చైర్మన్ అనుమతించారు. అనంతరం.. మంత్రులు బుగ్గన, బొత్స రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. చర్చ అయినా ప్రారంభించండి లేదా బిల్లులను పాస్ చేయాలని చైర్మన్‌ను కోరారు. ఈ పరిస్థితుల్లో యనమల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తామని, సెలక్ట్ కమిటీకి పంపాలన్నారు. రూల్–71 అంశం, రెండు బిల్లులను విడివిడిగా చర్చించాలని కోరారు. అంతకుముందు సభలో ఇలా.. అంతకుముందు.. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో ఆమోదం కోసం పంపారని ప్రకటించారు. తర్వాత టీడీపీ సభ్యులు రూల్–71 ప్రకారం నోటీసు ఇచ్చారని పరిగనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితర మంత్రులతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు కోరారు. అసెంబ్లీలో ఆమోదం పొంది సభకు వచ్చిన బిల్లుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని.. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయన్నారు. అదే రూల్–71 నోటీసుపై ఏడు రోజుల్లో ఎప్పుడైనా చర్చకు చేపట్టవచ్చన్నారు. చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ సభ్యులు కోరుతున్నట్లు రూల్–71 ప్రకారం ముందు చర్చకు అనుమతిచ్చి సభలో చెడు సంప్రదాయానికి నాంది పలకొద్దంటూ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి, పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్‌ను కోరారు. అయినప్పటికీ చైర్మన్ స్పందించకపోవడంతో అధికార పార్టీకి చెందిన సభ్యులు పలుమార్లు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, షేక్ మహ్మద్ ఇక్బాల్, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు పొడియం వైపు వెళ్లి బిల్లులపై మొదట చర్చించాలని పట్టుబట్టారు. ఇలా.. అధికార, విపక్ష సభ్యులు ఎవరికి వారు తమ వాదనకే కట్టుబడడంతో చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరికి చైర్మన్ రూల్–71 కింద చర్చకు చైర్మన్ అనుమతిచ్చారు. చర్చలో టీడీపీ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో గందరగోళం నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై బుధవారం శాసన మండలిలో చర్చ చేపట్టనున్నారు. టీడీపీకి ఐదుగురు ఎమ్మెల్సీల షాక్ తెలుగుదేశం పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి మద్దతివ్వకుండా వారు ఝలక్ ఇచ్చారు. పోతుల సునీత, చదిపిరాల శివనాథరెడ్డి శాసన మండలిలో 71 రూలుపై జరిగిన చర్చకు నిర్వహించిన ఓటింగ్‌లో పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణిలు మండలికి గైర్హాజరై పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకంగా టీడీపీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటింగ్‌లో రూల్–71కి అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా 9 మంది తటస్థంగా ఉన్నారు. -
రాజధాని పేరుతో.. అంతర్జాతీయ స్థాయి కుంభకోణం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధారాలు, పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి రియల్ ఎస్టేట్ రాజధానిగా మార్చారని దుయ్యబట్టారు. గుంటూరు, నూజివీడు అంటూ మొదట్లో రాజధానిపై లీకులు ఇచ్చి.. ప్రజలు అక్కడ భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేసిన చంద్రబాబు అండ్ కో మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రహస్యాలను ఎవరికీ చెప్పబోనంటూ చేసిన ప్రమాణాన్ని (అధికార రహస్యాల చట్టాన్ని) చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర విభజన తేదీ 2014 జూన్ నుంచి రాజధాని ప్రకటన తేదీ 2014 డిసెంబరు నెలాఖరు వరకూ ఆరు నెలల కాలంలో ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన అనుచరులు సొంత పేర్లు, బినామీ పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారని మంత్రి వివరించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎకరా రూ.10 కోట్ల ప్రకారం లెక్కిస్తే 4,070 ఎకరాల విలువ రూ.40,700 కోట్లని, ఇది ఇప్పటి వరకూ తేలిన లెక్కని, విచారణలో ఇంకా ఎంత బయటకు వస్తుందో భవిష్యత్తులో తేలుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారని కూడా సభ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వివరాలను కూడా ఆయన సభలో వెల్లడించారు. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి.. ఎక్కడో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ఇక్కడ విజయవాడకు 20–30 కిలోమీటర్ల దూరంలోని మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు వచ్చి ఎందుకు భూములు కొంటారు. ఇక్కడ రాజధాని వస్తుందని పక్కాగా తెలిసినందునే వారు రాజధాని ప్రకటనకు ముందే ఇక్కడ భూములు కొన్నారు. దీనిని బట్టే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తేటతెల్లమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి. బినామీ పేర్లతో కొనుగోళ్లు.. - టీడీపీ నేతలు సొంతంగానూ, బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో అప్పటి మంత్రి నారాయణ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్ బినామీలు. - వేమూరి రవికుమార్, నారా లోకేశ్‌కు చెందిన బినామీలు వందల ఎకరాల భూములు కొన్నారు. మురళీమోహన్, యార్లగడ్డ రవికిరణ్, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్ ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్ పేర్లతో భూములు కొనుగోలు చేశారు. బుచ్చయ్య చౌదరి గోరంట్ల ఝాన్సీలక్ష్మీ పేరు మీద కొనుగోలు చేశారు. సరిహద్దులు మార్చి.. చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకోలేదు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చ.కి.మీలకు ప్లాన్ చేశారు. కానీ, 2016లో దానిని 217 చ.కి.మీ.కు తగ్గించారు. దీని వెనక.. తమ భూమిని ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వకుండా మొత్తం భూమిని ఉంచుకుని అధిక విలువ పొందడమే లక్ష్యం. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. అనంతవరంలో వీరి బాగోతం ఇంకో రూపంలో సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు తీసుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడి 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డు భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూములూ ఇలాగే చేశారు. 28వేల మంది రైతులు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇస్తే అందులో 14వేల మంది రైతులు ఇప్పటికే భూములు అమ్ముకున్నారు. ప్లాట్లు ఇస్తే.. 8వేల లావాదేవీలు జరిగాయి. దీనిని రాజధాని నిర్మాణం అంటారా.. లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా? టీడీపీ వారే చెప్పాలి’’.. అని బుగ్గన ప్రశ్నించారు. - పయ్యావుల విక్రమసింహ (పయ్యావుల కేశవ్ కొడుకు), ధూళిపాళ్ల వీరవైష్ణవి (ధూళిపాళ్ల నరేంద్ర కూతురు).. - కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు) నంబూరులో, పుట్టా మహేష్ యాదవ్ (మంత్రి యనమల వియ్యంకుడి తనయుడు) - దమ్మాలపాటి శ్రీధర్ పిచ్చుకలపాలెం, నేలపాడులో, పల్లె రఘునాథరెడ్డి ఉద్దండరాయపాలెం, మందడంలో.. - దివంగత కోడెల శివప్రసాద్ శశిఇన్‌ఫ్రా పేరున 17 ఎకరాలు.. - మాజీమంత్రి పరిటాల సునీత పీఆర్ ఇన్ఫ్రా పేరుతో కొనుగోలు చేశారు. - పీఆర్ ఇన్ఫ్రాలో పరిటాల సునీత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు అప్పటి పాలకులు రాజధాని అమరావతిని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చుకున్నారనడానికి అడ్డగోలుగా భూ కేటాయింపులూ నిదర్శనాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. అమరావతిలో మాదిరిగా ఓ విధానం, ప్రాతిపదిక లేకుండా దేశంలో మరెక్కడా భూకేటాయింపులు జరగలేదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరాలతో వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు సరసమైన ధరలకు భూకేటాయింపులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తారని.. కానీ, బాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. ‘కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎవరైనా ఎకరా రూ.4 కోట్లకు భూమి కేటాయించి ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే ఇస్తారా?’ అని బుగ్గన సభా సాక్షిగా నిలదీశారు. భూకేటాయింపులపై మంత్రి బుగ్గన అసెంబ్లీలో వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే.. 125 సంస్థలకు 1,648 ఎకరాలు రాజధాని ప్రాంతంలో అప్పటి బాబు సర్కారు 125 సంస్థలకు 1,648 ఎకరాలను కేటాయించింది. ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 68 ఎకరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 180 ఎకరాలు.. ప్రైవేటు సంస్థలకు 1,366 ఎకరాలు కేటాయించింది. వీటితోపాటు మరికొన్నింటికి కూడా కేటాయించింది. అయితే, ఇందుకు ఒక విధానం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఏడెకరాలు, పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 87ఎకరాలు కేటాయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. అలాగే, ప్రైవేటు సంస్థలైన విట్ ఏపీకి 200 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 200 ఎకరాలు, అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో–యూకే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్ 100 ఎకరాలు, బీఆర్ఎస్ మెడిసిటీ.. ఇలా ప్రైవేటు సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. వరుణ్ హాస్పిటాలిటీకి నాలుగు ఎకరాలు, మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్‌కు నాలుగు ఎకరాలు రూ.కోటిన్నరతో ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం చంద్రబాబు లాగా ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్లో పట్టుబడటం దేనికి సంకేతం? ప్రతిపక్ష నేత మొదట్లో రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. హడ్కో, వరల్డ్‌బ్యాంకు నుంచి రుణాలు తెస్తామని చంద్రబాబు అన్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మరోవైపు.. రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్షంలో ఉంది. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డొక్కల కరువు.. ముష్టికరువు అని పేర్లు కూడా పెట్టారు. గతంలో నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చి కన్నీరు కార్చారు. ఈ నేపథ్యంలో భారీ రాజధాని నిర్మాణం కంటే.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మన ముందున్న కర్తవ్యం. -
కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిపై కూడా బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులకు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు రుణ సహాయాన్ని పెంచాలన్నారు. చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కోసం వైఎస్సార్ నవోదయం కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బ్యాంకర్లను కోరారు. దీనికోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ మధ్య మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరమన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించామని, ఇందుకు సహకరించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి ధన్యవాదాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) చైర్మన్ పకీరిసామి చెప్పారు. వార్షిక రుణప్రణాళిక మేరకు సెప్టెంబర్ 2019 నాటికి వివిధ ప్రాధాన్య రంగాల్లో నిర్దేశించిన రూ.1,69,200 కోట్లకు గాను రూ.94,531 కోట్లు (55.87 శాతం) రుణాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఇదే కాలానికి వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్లకు గాను, రూ.65,577 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈ కింద నిర్దేశించిన రూ.36 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.25,020 కోట్ల (69.60 శాతం) రుణాలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతోదాస్ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఆశించినంతగా ఇవ్వలేదని, అనుకున్న లక్ష్యం మేరకు ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కౌలు రైతుల చట్టాన్ని తెచ్చిందని, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. కాగా, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖల్లో అనుకున్న దానికన్నా రుణాలు తక్కువగా ఇచ్చారని, బ్యాంకులు దీనిపై దృష్టిపెట్టాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ కోరారు. -
రూల్స్ టాక్
-
ఆర్థిక మాంద్యం లేదు
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాదిరే మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఆదాయం కొంత మేర తగ్గింది తప్పితే, ఆర్థిక మాంద్యం (రెసిషన్) వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో మంత్రి జవాబిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాదిలో కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ ఆదాయం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయాయని, ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆదాయం తగ్గిందని చెప్పారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో మాత్రం గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆ కాలానికి కేవలం నాలుగు శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి దాదాపు రూ. 60 వేల కోట్ల బిల్లుల బకాయిలు పెట్టిపోయిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల బకాయిలు చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర కాగా, తమ సూచనలు వినాలని నాలెల్జ్ తెచ్చుకోవాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి అప్పటి విపక్ష సభ్యులు అప్పటి సీఎంను కలిస్తే, తమ పార్టీ వాళ్లు కాదని, నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారని తెలిపారు. రంగులపై మీరా విమర్శించేది?: పెద్దిరెడ్డి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం గోడలకూ ఆ పార్టీ రంగులు వేయించిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు సచివాలయ భవనాల రంగులపై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు జాతీయ జెండాకు ఎక్కడా వైఎస్సార్సీపీ రంగు వేయలేదని వివరించారు. సర్పంచుల ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని, సచివాలయ భవనాలలోనూ సర్పంచికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. మార్చిలోగా ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు: అంజాద్ బాషా అర్హత గల ఇమామ్‌లు, మౌజన్లకు వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల స్థలాలను కేటాయించి, రిజిస్టర్ చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసనమండలిలో చెప్పారు. రాష్ట్రంలో సుమారు 9,000 మంది ఇమామ్‌లు, మౌజన్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రెండు మూడు స్థలాలు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. -
బాబూ.. మీరు మాఫీ చేసిందెంత?
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో మంగళవారం ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఏం యోజన’పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వాడి వేడి చర్చ జరిగింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. చర్చను పక్కదోవ పట్టించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని అధికార పక్ష సభ్యులు అంబటి రాంబాబు, రోజాలు తిప్పికొట్టారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎదురు దాడికి దిగారు. చివరకు వ్యక్తిగత వ్యవహారాలపైనా వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పథకానికి పేరు పెట్టనందున ‘చంద్రన్న దగా’ అని పెడితే బాగుంటుందని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. సభలో ప్రతిపక్ష నేత, సభా నాయకుడిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తొలుత ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు, ఐదు విడతల్లో చెల్లించాల్సిన రైతు రుణమాఫీపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. తుస్సుమన్న చంద్రబాబు సవాల్ హెరిటేజ్ తనది కాదని, నిరూపిస్తే ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ రిటైల్ విభాగంలోని హెరిటేజ్ ఫ్రెష్‌ను ఫ్యూచర్ గ్రూప్‌నకు రూ.296 కోట్లకు విక్రయించారని, దీని ద్వారా చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ గ్రూప్‌నకు ఫ్యూచర్ గ్రూప్‌లో 3.5 శాతం వాటా దక్కిందని ఆధారాలతో సహా వివరించారు. దీంతో చంద్రబాబు మిన్నకుండిపోయారు. రైతులకు మేలు చేసిన ఏకైక సీఎం జగన్ : మంత్రి కన్నబాబు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రైతు కష్టాలు తెలిసిన నేతగా సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఏడాదికి పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచారని తెలిపారు. పెట్టుబడి సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.67,500కు పెంచడం విశేషమన్నారు. రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4,000, మూడో విడత జనవరిలో రూ.2,000 సాయం అందుతుందని తెలిపారు. కౌలు రైతులతో పాటు దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులను, రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్వోఎఫ్ఆర్) కింద పట్టా పొంది సాగు చేస్తున్న గిరిజనులకు, భూసేకరణ చేసి పరిహారం అందని రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మొత్తం 45,82,500 రైతు కుటుంబాలకు రూ.5,230.24 కోట్ల లబ్ధి కలిగిందన్నారు. అర ఎకరంలో కూరగాయలు సాగు చేసే రైతులను కూడా ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చామన్నారు. 10 సెంట్లలో తమలపాకు పండించే రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ మానసపుత్రిక రైతు భరోసా పథకం ప్రకటించే నాటికి పీఎం కిసాన్ యోజన పథకంపై ప్రకటన రాలేదని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన ఎన్టీఆర్ హౌసింగ్, ప్రధాన మంత్రి మాతృత్వ వంజన యోజన, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, పింఛన్లు, చంద్రన్న బీమా ఇలా ఏ పథకం తీసుకున్నా.. కేంద్రం వాటా ఉందని గుర్తు చేశారు. రైతులు, కౌలు రైతులకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. ఒక్క ధాన్యం గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కిలో ఉల్లి రూ.25కే అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని హిందూ పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కన్నబాబు సభకు చూపించారు. బాబూ.. మీరు మాఫీ చేసిందెంత? : బుగ్గన చంద్రబాబు తన హయాంలో ఎంత మొత్తం రుణమాఫీ చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రైతు రుణాలన్నీ (రూ. 87,612 కోట్లు) బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు, రూ.24 వేల కోట్లకు కుదించి.. రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సభలో ప్రదర్శించారు. చంద్రబాబుకు ఫిల్మ్ ఫీల్డ్ పునాది అని, ఇంకా నేరపూరితంగా మాట్లాడుతున్నారంటే ఆయనకు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్వాకంతో బ్యాంకులు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా కూడా లోన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్ నిధులు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను తాకట్టు పెట్టి వాడారని మండిపడ్డారు. కేంద్ర పథకాలకు చంద్రన్న బాట, చంద్రన్న బీమా వంటి పేర్లు పెట్టుకున్నారని, నీరు–చెట్టు పథకంతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు జరపలేదని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రుణ ఉపశమన పత్రాలు పసుపు–కుంకుమ పొట్లాలు కట్టుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనకు వయసు మళ్లిందని, 70 ఏళ్లు పైబడ్డాయని అంతా అంటున్నారని, తనకు 25 ఏళ్ల కుర్రాడి ఆలోచనలున్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. చంద్రబాబు సభను పక్కదారి పట్టిస్తున్నారు చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమంతో సభను పక్కదోవ పట్టిస్తున్నారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రదాయాలు తెలియడం లేదు. ఉదయం నుంచి చంద్రబాబును గమనిస్తున్నా.. చాలా స్పీడ్‌గా మాట్లాడుతున్నారు. 25 ఏళ్ల వయసులో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎదుర్కొంటా అంటున్నారు.. ఇదేమన్నా.. ఫైటింగా? లేక మీరేమైనా బాహుబలా చంద్రబాబూ?. – అంబటి రాంబాబు రైతులు అప్పుల పాలైంది నిజం కాదా? టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజం కాదా?. చంద్రబాబు, ప్రతిపక్ష సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. రైతుల విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకేస్తే.. ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేశారు. రైతు భరోసా కార్యక్రమం నాలుగేళ్లు అమలు చేస్తానని ఐదేళ్లు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే. – ఆర్కే రోజా బాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అధికారంలో ఉన్నన్నాళ్లూ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోని టీడీపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. బాబు హయాంలో మైదుకూరులో గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు పంటను రోడ్లపైన పారబోశారు. టమాటాలను పొలాల్లోనే పశువులకు విడిచి పెట్టేశారు. రైతులను ఆదుకోవాలని తాము ధర్నాలు చేసినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అత్యధిక ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు సబ్సిడీతో విక్రయిస్తున్నారు. – రఘురామిరెడ్డి జగన్‌తో స్వర్ణ యుగం రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ స్వర్ణ యుగాన్ని తీసుకువచ్చారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 రిగ్గులు, లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 రిగ్గులు కొనుగోలు చేయాలని నిర్ణయించడం ఈ ప్రభుత్వానికే సాధ్యమైంది. రైతుల కోసం ఇంతగా చేస్తుంటే.. పచ్చ చొక్కాల వారికి కనిపించకపోవడం వింతేమీ లేదు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి కౌలు రైతులను ఆదుకున్నది సీఎం జగనే కౌలు రైతులను ఆదుకునేందుకు ఏకంగా చట్టం తీసుకువచ్చిన రైతు బంధు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ ప్రభుత్వాన్ని రైతులు సమర్థించడాన్ని సహించలేకే టీడీపీ అవాస్తవ విమర్శలు చేస్తోంది. – కరణం ధర్మశ్రీ -
ఆదాయం తగ్గుదలపై బుగ్గన వివరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లు రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని.. కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఐదారు కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళడం పరిపాటే.. కానీ గత ప్రభుత్వం ఏకంగా 40 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన 20 వేల కోట్లు అప్పులు చెల్లించాం. 15 వ ఆర్ధిక సంఘం కింద నిధులను పెంచి ఇవ్వమని కేంద్రాన్ని అడుతున్నాం. గత సంవత్సరం జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉంది’ అని అన్నారు. అవినీతి రహిత పాలన కోసం చర్యలు: కన్నబాబు ఏసీబీ డీజీగా ఠాగూర్ పనిచేసిన సమయంలో అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించారని తమకు ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ‘ఈ వ్యవహారంపై ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఠాకూర్ హైద్రాబాద్‌లో ఇళ్ళు, పార్కు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీతో ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయించారా లేక ఇతర కోణాల్లో చేశారా అన్న ఆరోపణలపై కూడా విచారిస్తున్నాం. అవినీతి రహిత పాలన కోసం సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
అభివృద్ధి కోసం సీఎం వద్దకు వెళ్తే తప్పా:బుగ్గన
-
వంశీ ప్రసంగిస్తే అంత ఉలుకెందుకు?
సాక్షి, అమరావతి: వల్లభనేని వంశీ ప్రసంగిస్తే టీడీపీ సభ్యులకు అంత ఉలుకెందుకని? ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకోవటానికి వంశీ లేస్తే టీడీపీ వాకౌట్ చేయడం సరికాదని అన్నారు. ఆంగ్లమాధ్యమం, నియోజకవర్గ సమస్యలను వంశీ చెప్పారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎంఆర్ఎఫ్, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. 2016లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశామని, నిధులు ఇవ్వనని చంద్రబాబు సూటిగా చెప్పారని బుగ్గన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయింపులు చేశారని సభలో వివరించారు. శాసనసభ రెండో రోజు మంగళవారం శాసనసభ ప్రారంభమైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని అన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రికి చిన్న సూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలగజేసుకొని.. ఐదు సంవత్సరాల నుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్ ఉండాల్సినంత వరకు ఉందని అన్నారు. ‘సభలోకి రాగానే వంశీ చేతులు ఎత్తారు. ఏంటి అని అన్నాను. అంతలోనే టీడీపీ సభ్యులు ఏదో ఊహించుకొని. ప్రతిపక్షనాయకుడుని తిట్టబోతున్నారు అనుకున్నారు. వాళ్లు ఎందుకు బయటకుపోయారో, ఎందుకు చిన్నచిన్నగా లోపలికి ఎందుకు వచ్చారో వాళ్లకే తెలియాలి’ అని బుగ్గన అన్నారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి రూల్స్ ప్రకారం అడగవచ్చు కదా అని టీడీపీ సభ్యులకు సూచించారు. వల్లభనేని వంశీ మాట్లాడిన ఐదు నిమిషాల్లో తను చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ముఖ్యమంత్రి తీసుకున్ననిర్ణయాలు బాగున్నాయని.. నియోజకవర్గంలో కొన్ని విషయాలు మాట్లాడటానికి సీఎం జగన్ దగ్గరకు వెళ్లానని వంశీ చెప్పారని బుగ్గన అన్నారు. ‘నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందరివాడు. 2014 నుంచి ఈ పద్ధతి మారింది. 2014 వరకు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి అయినా ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, రాజకీయ నాయకుడు కలిసేందుకు, నియోజకవర్గ పనులు, వ్యక్తిగత పనుల కోసమైనా వెళ్లేందుకు యాక్సెస్ ఉండేది. అయితే, 2016లో మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి టీడీపీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తూ.. ఆ తర్వాత ఎక్కడైతే టీడీపీ ఓడిపోయిందో.. అక్కడ టీడీపీ ఇంఛార్జిలకు ఇస్తుంటే.. 46 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోయి చంద్రబాబు నాయుడుని కలిశాం. ఆయన నేను ఇవ్వను అన్నారు. అప్పటి నుంచి ఓ కొత్త సంస్కృతి ప్రారంభం అయింది’ అని అన్నారు. చివరకు, గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులే కాకుండా చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎవరో ఒక మనిషికి ఆరోగ్యం బాగోలేకనో, యాక్సిడెంట్ అయి.. దెబ్బతగిలి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చి అడిగినా రూ.25-30 వేలు ఇవ్వలేదన్నారు. అంత మానవత్వం లేకుండా విభజించి రూలింగ్ పార్టీ, ఆ పార్టీ అంటూ కొత్త సంస్కృతి నేర్పి్స్తే 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక.. టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇస్తున్నారని బుగ్గన పేర్కొన్నారు. -
అడ్డగోలుగా పీపీఏలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో హడావుడిగా 41 విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) కుదుర్చుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. పీపీఏలపై శాసనసభలో సోమవారం టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని తప్పుదారి పట్టించి, డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. పీపీఏలపై సమీక్షతోపాటు ఇతర విధానాలతో విద్యుత్తు వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. హడావుడిగా 41 పీపీఏలా? ‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని బుగ్గన ప్రశ్నించారు. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్‌కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్‌కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్డ్ చార్జీల కింద యూనిట్‌కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి బుగ్గన వివరించారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన తెలిపారు. విద్యుత్తు సబ్సిడీల కోసం టీడీపీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో రూ.2,500 కోట్లు పేర్కొని.. కేవలం రూ.1,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. దాంతో డిస్కంలు రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రూ.4,900 కోట్లు చెల్లించి డిస్కంల పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చిందని మంత్రి వెల్లడించారు. పీపీఏలపై విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడటాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టగా.. మంత్రి తిప్పికొట్టారు. కొన్ని అంశాలపై అధికారులు, నిపుణులు మాట్లాడతారని, టీడీపీ హయాంలో ఐటీ గ్రిడ్స్ కేసులో ఆర్టీజీఎస్ సీఈవో విజయానంద్, అహ్మద్‌బాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిన విద్యుత్తు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే పీపీఏలను సమీక్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చను అడ్డుకుంటారా? శాసనసభలో మహిళా భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా పదే పదే అడ్డు తగిలిన విపక్షసభ్యులపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధచెప్పినా వినకుండా.. విపక్ష సభ్యులు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని తప్పు పట్టారు. ప్రతిపక్షానికి బాధ్యత ఉంటే స్పీకర్‌కు ఉల్లిపాయల బాక్స్‌ను పంపిస్తారా? అని ప్రశ్నించారు. లాభాల కోసం హెరిటేజ్‌లో కేజీ ఉల్లి రూ.200కు అమ్మడం సరైనదేనా? అని నిలదీశారు. అడ్డదారిలో పీపీఏలు ఆమోదించారు: మంత్రి బాలినేని పీపీఏలు చేసుకోవద్దని 2017, ఫిబ్రవరి 27న అప్పటి విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టంగా చెప్పినా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పీపీఏలపై చర్చలో ఆయన మాట్లాడుతూ అప్పటికే అనుకున్న లక్ష్యం చేరుకోవడంతోపాటు పవన విద్యుత్తు ధరలు పడిపోయాయని.. దాంతో ఈఆర్సీకి నివేదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం మంత్రిమండలిలో ర్యాటిఫై చేసి మరీ పీపీఏలను ఆమోదించడం ఎంతవరకు సమంజసమని బాలినేని నిలదీశారు. -
నీరు చేట్టుపై అసెంబ్లీలో బుగ్గన పిట్ట కథ
-
11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని శాఖ అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అమలుచేస్తూ.. వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని.. సంబంధిత మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. -
సభా సమయం వృథా చేయొద్దు
సాక్షి, అమరావతి : చట్ట సభల సమయం చాలా విలువైందని దాన్ని వృథా చేయరాదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఆయన బుధవారం శాసనసభ కమిటీ హాలు–1లో జరిగిన ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఏటా శాసనసభ కార్యకలాపాల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ ప్రకారం సభ జరిగే ప్రతి గంటకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. శాసనసభ్యులు క్రమశిక్షణ, సరైన అవగాహన, సంసిద్ధతతో వచ్చినప్పుడే చట్ట సభ సజావుగా జరుగుతుందని, అప్పుడే చర్చలు అర్థవంతంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు ఏ సమస్యను ప్రస్తావించాలన్నా దానికొక నిబంధన ఉంటుందని దాని ప్రకారం వస్తే మాట్లాడే అవకాశం దొరుకుతుందన్నారు. సభలో ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరు, వారి హుందాతనమే మళ్లీ వారిని ప్రజలు ఎంపిక చేసుకునేలా చేస్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన సభకూ, ఇకపై జరుగబోయే సభా కార్యక్రమాలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని, ప్రజలు ఈ విషయం తెలుసుకునేలా చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు. శాసనసభ జరిగే తీరును బట్టే ప్రభుత్వ ప్రతిష్ట, సీఎం ప్రతిష్ట ఇనుమడిస్తుందని చెప్పారు. సభలోకి వచ్చేటప్పుడు పూర్తి వాస్తవాలతో రావాలని, అవాస్తవాలు వద్దని ఆయన హితవు పలికారు. ఎమ్మెల్యేలు మంచి వక్తలుగా రాణించాలని కూడా ఆయన సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, కరుణాకర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అప్పలరాజు వంటి వారు మంచి వక్తలని, వారు సభలో బాగా మాట్లాడారని సీతారామ్ కితాబు నిచ్చారు. ఆయా అంశాలపై మాట్లాడే వారిని ఎంపిక చేసి తాము ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇస్తామని స్పీకర్ అన్నారు. శాసనసమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. సమాజంలో 70 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యలను మానవతా దృక్పథంతో చట్టసభల్లో ప్రస్తావించాలన్నారు. ఏ సామాజిక వర్గం నుంచైతే ఎన్నికయ్యారో.. వారి సమస్యలను సభలో ప్రతిబింబింప జేయాలన్నారు. ప్రజా ధనం పొదుపు చేస్తున్నాం: మంత్రి బుగ్గన ప్రజా ధనాన్ని ఎంత మాత్రం దుబారా చేయకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, ఆయన భావాలకు అనుగుణంగానే తాము పునశ్చరణ తరగతులను గతంలో మాదిరిగా 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో కాకుండా శాసనసభ కమిటీ హాలులో సాదాసీదాగా నిర్వహిస్తున్నామని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఎంత ఆడంబరంగా శిక్షణా కార్యక్రమాన్ని నడిపించామన్నది ప్రధానం కాదని, ఏ మేరకు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు విషయ అవగాహన కలిగించామన్నదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. శాసనసభలో మాట్లాడేది వేరు, బహిరంగ సభల్లో మాట్లాడే తీరు వేరు అనేది లెజిస్లేటర్లు తప్పకుండా గ్రహించాలని చెప్పారు. మీ నాన్నకు కృతజ్ఞతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే రాష్ట్రంలో శాసనమండలి ఏర్పడిందని, ఆయన వల్లే తామంతా ఇవాళ శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ రామసూర్యారావు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్‌కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. కాగా, శిక్షణా తరగతులకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. మండలి చైర్మన్ హోదాలో ఎంఏ షరీఫ్, బీజేపీ, జనసేన, పీడీఎఫ్ లెజిస్లేటర్లు పాల్గొన్నారు. -
బడ్జెట్లో రూ.5,116 కోట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్లో తమ శాఖకు రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్సింగ్, సాంబశివరావు (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ) ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో విభాగాల వారీగా సమావేశమయ్యారు. భూ పరిపాలన, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు సంబంధించి రూ.5,116.40 కోట్లు కేటాయించాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్థిక శాఖ మంత్రికి నివేదించారు. సాధారణ బడ్జెట్ కింద రూ.1,430.40 కోట్లు, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు రూ.3,686 కోట్లు కలిపి మొత్తం రూ.5,116.40 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.25 కోట్లు ఇవ్వండి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా మార్చేసి, అందులో రెండింటిని గిరిజన జిల్లాలుగా చేయాలని, దీంతోపాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని విడగొట్టి పోలవరం గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. జిల్లాల ఏర్పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదని, తర్వాత చేపడతామని, అయినప్పటికీ ఇందుకోసం రూ.25 కోట్ల బడ్జెట్ కావాలంటూ ప్రతిపాదించామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్సార్సీపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హామీ అమలుకు రూ.13 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ విన్నవించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందుకోసం మొదటి ఏడాది రూ.3,648 కోట్లు కావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయిస్తామని.. తద్వారా అధిక శాతం ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసేలా నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు. బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక (2019–20) సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారని ఆయన తెలిపారు. ముందస్తు బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అమలు చేయడానికి అయ్యే మొత్తం నిధులు కేటాయించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా అందించడానికి ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పాఠశాల విద్యకు 39,897 కోట్లు ఇవ్వండి 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.39,897.42 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. నవరత్నాల హామీల్లో ఒకటైన అమ్మ ఒడి పథకంతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మేరకు నిధులు అవసరమని పేర్కొంది. ఇక ఉన్నత విద్యాశాఖకు రూ.5,027.15 కోట్లు అవసరమని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు అందజేసింది. -
నవరత్నాల బడ్జెట్‌కు కసరత్తు!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తొలి బడ్జెట్‌ను రూపొందించేందుకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల నుంచి నవరత్నాల అమలుకు అవసరమయ్యే నిధులతో పాటు ఆయా శాఖలకు ఎంత మొత్తం కావాలన్న వివరాలను రెండు రోజుల పాటు సేకరించనున్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన బడ్జెట్ అంచనాల సమీక్షలో భాగంగా రోడ్లు భవనాలు, రవాణా, పశుసంవర్థక శాఖ, పర్యాటకం, పౌరసరఫరాలు, వైద్యం, మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, గృహనిర్మాణ శాఖ మంత్రులతో ఆర్థికమంత్రి విడివిడిగా భేటీ అయ్యి వివరాలు సేకరించారు. 2019–20 సంవత్సరానికి నవరత్నాల అమలుకు ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుందో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ప్రెజంటేషన్ రూపంలో ఆర్థికమంత్రికి వివరించారు. ప్రతిపాదనలు అందించిన మంత్రులు.. సమీక్షలో పాల్గొన్న అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని, రహదారుల భూసేకరణకు కావల్సిన నిధులతో పాటు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలని, ఇందుకుగాను రూ. 6,900 కోట్లు అవసరమవుతాయన్నారు. రవాణా శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి ఆర్థిక మంత్రితో సమావేశం అవుతామని, అప్పుడు మరిన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధుల వివరాలను ఆర్థికమంత్రికి విన్నవించారు. పేదల బియ్యం కోసం రూ. 5,600 కోట్లు పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మరో రూ.1500 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సెప్టెంబర్ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా పేదల ఇళ్లకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఆ మేరకు నాణ్యమైన బియ్యాన్ని ఏ విధంగా సేకరించాలి, ప్రత్యేకంగా బ్యాగుల తయారీకి అయ్యే ఖర్చు, బడ్జెట్ ప్రతిపాదనలు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో మొదటగా రెండు లేదా మూడు జిల్లాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేసే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఐదు, పది, పదిహేను కిలోల బియ్యం బ్యాగుల తయారీకి సంబంధించిన యంత్రాలను ఢిల్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కమిషనర్ కోన శశిధర్ ఇటీవల పరిశీలించారు. వాటి పనితీరుపై సంతృప్తిగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యంత్రాలను ఏర్పాటు చేసిన అనంతరం.. ప్రతి జిల్లాలోనూ ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన 25 శాతం నూకలు, మరో 40 శాతం బియ్యం తినడానికి వీలులేని విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ నెల నుంచి అలాంటి బియ్యానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఆగమేఘాలపై యంత్రాంగం కదిలి సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 1000, 1010, 1001 రకం బియ్యాన్ని పలు జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నా ఆ రకం బియ్యం తినడానికి ఇష్టపడడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సోనా, బీపీటీ తదితర రకాల వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వివరించాలని అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. కాగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది. బడ్జెట్లో గిరిజన ఆర్థిక ప్రోత్సాహక పథకాలకు పెద్దపీట ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి బడ్జెట్ ప్రతిపాదనల్లో గిరిజనులకు ఆర్థిక ప్రోత్సాహక పథకాలు, విద్య, వైద్యానికి పెద్ద పీట వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019–20లో ఆర్థిక శాఖ కేటాయించిన తాత్కాలిక కేటాయింపుల కంటే అదనంగా రూ.1,142.13 కోట్లను కలిపి మొత్తం రూ.3,542.22 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో రూ.132.11 కోట్లు నవరత్నాల అమలుకు కేటాయించామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ రంజిత్ బాషా, అడిషనల్ డైరెక్టర్ ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్, గురుకులం కార్యదర్శి భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తనిఖీతో మాకేంటి సంబంధం?
సాక్షి, అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమానాశ్రయ భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన అంశంపై సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తనిఖీలతో తమకు ఎలాంటి సంబంధంలేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించగా.. టీడీపీ సభ్యులు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుని ప్రభుత్వ వైఖరిని వివరించారు. టీ విరామం అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబును తనిఖీ చేస్తారా? అని టీడీపీ నేతలు గొడవ చేస్తున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకు వస్తోందని అన్నప్పుడు కరణం బలరాం, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు అభ్యంతరం తెలిపారు. సంప్రదాయాలు పాటించకుండా కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. దీనిపై అంబటి ఘాటుగా స్పందిస్తూ.. పరమానందయ్య శిష్యులు, నారా నందయ్య శిష్యులవల్లే బాబుకు ఎక్కువ నష్టం జరుగుతోందని చురకవేశారు. కరుణాకర్‌రెడ్డి కూడా ఈ ప్రస్తావన చేస్తూ.. చంద్రబాబు ఉంటున్న కరకట్టపై నుంచి సైకిల్‌పై వెళ్లినా ప్రస్తుతం ఆయనకు ముంచుకొచ్చే ప్రమాదమేమీలేదని, గతంలో మాదిరిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాదమేమీ లేదన్నారు. ఆత్మన్యూనత, మెగలోమానియా (తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం) వంటి వాటితో టీడీపీ నేతలు బాధపడుతున్నారన్నప్పుడు టీడీపీ సభ్యుడు వి.గణేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా భద్రతా రకాలు, వాటి తీరు తెన్నులను, దేశంలో ఎవరెవరికి ఏఏ భద్రతా కేటగిరీ ఉందో గణేశ్ వివరించారు. ఆ తర్వాత కరణం బలరాం మాట్లాడుతూ.. సెక్యూరిటీపై తమకు కొంత అవగాహన ఉందని, ఏ సోషల్ మీడియాలో ఏమి వచ్చిందో తమకు తెలియదని, తమ పార్టీ వారు ఎటువంటి ప్రచారం చేయలేదని, సోషల్ మీడియావల్లే చాలా అనర్ధాలు, నష్టాలు జరుగుతున్నాయన్నారు. ఈ దశలో బుగ్గన జోక్యం చేసుకుంటూ.. టీడీపీ సభ్యుడు మాట్లాడేదానికి చంద్రబాబు తనిఖీకి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటే ఒక విధానం.. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి జెడ్ ప్లస్‌లో ఉంటే మరో విధానం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి.. చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీ చేసిన దానికి ఎటువంటి సంబంధంలేదని, ఎయిర్‌పోర్టు నిబంధనల ప్రకారమే బాబును తనిఖీ చేశారని స్పష్టంచేశారు. విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలకు సంబంధించి మాజీ సీఎంలకు ఎలాంటి మినహాయింపులేదని.. చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదన్నారు. -
మేనిఫెస్టో అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరూ అభివృద్ధి చెందేలా బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో తన చాంబర్లో బుగ్గన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రతీ రూపాయి వృథా కాకుండా చిత్తశుద్ధితో ఖర్చు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, దీన్ని తిరిగి గాడిలో పెట్డడం అతి ముఖ్యమైన పని అని తెలిపారు. ఆర్థిక అంశాలపై పట్టురావడానికి కారణమైన స్వర్గీయ సోమయాజులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్థిక మంత్రి పదవి అప్పచెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఈ స్థాయికి రావడానికి కారణమైన డోన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, కార్యదర్శి ఎం.రవిచంద్ర తదితరులు మంత్రి బుగ్గనకు శుభాకాంక్షలు తెలిపారు. మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి నవరత్నాల్లో మహిళలకు కానుకగా ప్రకటించిన దశలవారీ మద్యపాన నిషేధం అమలుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య శాఖ మంత్రి కె.నారాయణస్వామి పిలుపునిచ్చారు. బుధవారం నాల్గవ బ్లాకులోని తన చాంబర్లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. తక్షణం బెల్ట్‌షాపులను తొలగించాల్సిందిగా బ్రాందీ షాపుల యజమానులను ఆదేశించారు. అందరూ నిజాయతీగా ఉండాలని, ఎంఆర్పీ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన శాఖలోని ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. బీసీల అభ్యున్నతే మా లక్ష్యం బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతే తమ లక్ష్యమని, ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తెలిపారు. బుధవారం సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లోని తన చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నవరత్నాలతో పాటు ఏలూరు బీసీ గర్జనలో ప్రకటించిన డిక్లరేషన్‌ను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. బీసీ సంక్షేమానికి సేవ చేసుకునే అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలోని 2.10 లక్షల మంది రజకులు, 80 వేల మంది నాయీబ్రాహ్మణులకు ఏటా రూ. 10,000 ఇచ్చే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. త్వరలో భూముల రీ సర్వే డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో భూములను రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. 1908 తర్వాత భూముల సర్వే జరగలేదని, ఇప్పుడు రీ సర్వే చేయడం ద్వారా కోర్టులు, వివాదాల్లో ఉన్న అనేక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు 25 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి అనుగుణంగా భూ సేకరణ చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి భూములను చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా పీవోపీ కింద పెట్టారని, ఈ సమస్య పరిష్కరించడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. భూ సేకరణ సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం కాకుండా పరిహారం చెల్లించే రోజు ఉన్న మార్కెట్ ధరను వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తూ తొలి ఫైలుపై మంత్రి సంతకం చేశారు. ఒప్పందం సమయానికి చెల్లింపు సమయానికి ఉన్న ధరల వ్యత్యాసం వల్ల భూయజమానులు నష్టపోతున్నారని, దీనికి అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిళ్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లోని తన చాంబర్లో విశ్వరూప్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, మరో రెండు సర్కిళ్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. మిగిలిన 8 జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు కేటాయిస్తే అందులో రూ. 850 కోట్లు మురిగిపోయాయని, సాంఘిక సంక్షేమానికి రూ. 4,500 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు వెనక్కి తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేస్తుందని చెప్పారు. సీఎం ఆశయాల మేరకు గురుకులాలు, హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడికి సొంతిల్లుండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పేర్కొన్నారు. ఇందు కోసం సుమారు 28 లక్షల గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. బుధవారం సచివాలయం నాల్గవ బ్లాక్‌లో మంత్రి తన చాంబర్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో వంద శాతం ఇందిరమ్మ గృహాలు నిర్మించామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో మంత్రిగా రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆ శాఖ అధికారులు రంగనాథరాజుకు అభినందనలు తెలిపారు. పర్యాటక ఆదాయంపై దృష్టి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. పర్యాటక రంగంపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించిన అనంతరం బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధ్యాత్మికం, ప్రకృతి, బీచ్, మౌంటైన్ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పెంచేలా కృషి చేస్తామని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హిందీ, ఇంగ్లీçషు భాషలపై పట్టు ఉన్న గైడ్లను నియమించుకోనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో కన్వెన్షన్ హాల్‌తో కూడిన శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి ట్రాన్స్పోర్ట్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ట్రాన్సుపోర్టు, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల భోజన విరామ సమయంలో ఆయన నేరుగా మీడియా పాయింట్‌కు వచ్చి జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్నారు. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) వ్యవస్థాపక నాయకుడిగా పనిచేశారని, అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులతో తనకు సాన్నిహిత్యం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. జర్నలిస్టులతో తనకు ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందని, వారి కష్టాలు తనకు తెలుసన్నారు. జర్నలిస్టులకు స్థలాలు, ఇళ్లు, చాలీచాలని జీతాలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని నాని హామీ ఇచ్చారు. తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి నియామకం తిరుపతి పట్టణ అభివృద్ధి అథారిటీ (తుడా) చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 2004వ సంవత్సరంలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తుడా చైర్మన్‌గా చెవిరెడ్డిని నియమించారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆయనను అదే పదవిలో నియమించడం విశేషం. ప్రస్తుతం తుడా చైర్మన్‌గా ఉన్న జి.నరసింహ యాదవ్ రాజీనామా చేయగా దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. -
చంద్రబాబుకు డేటా ‘కుంభకోణం’ క్షోభ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను చేసిన డేటా కుంభకోణం బట్టబయలు కావడంతో వారం రోజులుగా తీవ్రంగా క్షోభకు గురవుతూ.. తానేం చేస్తున్నాడో తెలియని వింత పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఉత్తుత్తి హడావుడి చేస్తూ 48 గంటల్లోనే రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్లను) ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బుగ్గన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ సమాచారాన్ని దొంగిలించారంటూ అందిన ఫిర్యాదుపై విచారణకు రవాణాశాఖ అదనపు డీజీపీ స్థాయి అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఒక సిట్‌ను, ఏపీలో అర్హుల ఓట్ల గల్లంతుకు కుట్ర పన్నారనే నెపంతో వారిని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం మరో సిట్‌ను నియమించిందన్నారు. ఫారమ్-7 అంటే ఎన్నికల అధికారులకు అందించే అర్జీ అని మాత్రమే అర్థమని, ఓటు నమోదు సమయంలో ఆ వ్యక్తి అర్హుడు కాదని తెలపడం, ఆయనకు ఓటు ఉండరాదని చెప్పేందుకు చేసే దరఖాస్తే ఫారమ్-7 అని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలో లక్షల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయని, దొంగ ఓట్లు ఉన్నాయని తమ పార్టీ ముందు నుంచీ చెబుతోందని.. అలాగే డూప్లికేట్ ఓట్లు మరిన్ని లక్షల్లో ఉన్నాయని అన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించాలని చెప్పి పలువురు ఫారమ్-7ను అప్లోడ్ చేస్తున్నారని చెప్పారు. ఫారమ్-7 ఇవ్వడం తప్పు కానే కాదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓ వైపు చెబుతూంటే.. మరో వైపు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫారమ్-7 ఇచ్చిన వారిపై 322 కేసులను నమోదు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారమ్-7 దాఖలు చేస్తున్న వారిపై చీటింగ్ కేసు (సెక్షన్-419) తప్పుడు సమాచారం అందించారన్న నేరం(సెక్షన్-182), ఐటీ చట్టం-66-డి సెక్షన్లో ఉపయోగిస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ రాకుండా ఉండేందుకే ఐటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని తప్పుడు ఆలోచనతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టేలా చూస్తున్నారన్నారు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడకు కేసులు బదిలీ చేయాలా? ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా తాను దొరికి పోయినపుడు తెలంగాణ పోలీసులు కేసు పెడితే అది తెలంగాణ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని చంద్రబాబు ఆనాడు వాదనలు వినిపించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుకు ఒక చట్టం, మరొకరికైతే మరో చట్టమా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా స్కాం విచారణకు తెలంగాణ ప్రభుత్వం 9 మందితో సిట్ వేస్తే చంద్రబాబు కూడా 9 మందితో సిట్‌ను ఏర్పాటు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్‌ను వేస్తే పోటీ పడి చంద్రబాబు రెండు సిట్లను వేసి పోటా పోటీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్కాంకు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే..దానిని అమరావతికి బదిలీ చేయాలని చంద్రబాబు అనడం ఏమిటన్నారు. అంటే దేశంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆ కేసును అమరావతికి బదిలీ చేయాలనేది చంద్రబాబు వాదనా? తనకు నచ్చిన పోలీసులతో.. తనకు నచ్చిన విధంగా డీజీపీతో దర్యాప్తు చేయించాలన్న ఆలోచనా?అని ఆయన ప్రశ్నించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఫిర్యాదు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోందన్నారు. గత నెల 23న డేటా స్కాంపై హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారని.. అదే రోజు గుంటూరు, తుళ్లూరులో ఐటీ గ్రిడ్స్, టీడీపీలకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని కళా ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. సేవామిత్ర యాప్‌ను ఎందుకు మార్చారు? ఏపీకి చెందిన డేటా కనుక ఏపీ పోలీసులే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ వాదనగా ఉందని, అసలు సమస్య డేటా ఏ ప్రభుత్వ పరిధిలోనిది అనేది కాదని, ప్రజలకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే ప్రజల డేటాను దొంగతనం చేసిందనేది ఇక్కడ కేసని ఆయన తెలిపారు. టీడీపీ సర్కారే తన రాజకీయ ప్రయోజనాల కోసం డేటాను రెండు ఐటీ కంపెనీలకు ఇచ్చిందన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్‌నాయుడు పరిధిలోనే డేటా స్కాం చోటు చేసుకుంటే ఆయనెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్కాం బయట పడగానే సేవామిత్ర యాప్‌ను మార్చారని, ఫొటోలను ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. టీడీపీ సర్కారు డేటా స్కాం వింటేనే ఒళ్లు జలదరిస్తోందని ఓ వ్యక్తి ఫోన్లో చేసిన వ్యాఖ్యలను బుగ్గన మీడియాకు వినిపించారు. ఐటీ గ్రిడ్ సీఈవో దాకవరపు అశోక్‌ను ఎందుకు టీడీపీ సర్కారు దాచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన లక్షలాది ఓట్లను తొలగించిందని చెప్పారు. ఉదాహరణకు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు దశల్లో మొత్తం ఏడు వేల ఓట్లు తొలగించారని.. వాటికి సంబంధించిన వెరిఫికేషన్ నివేదికలున్నాయా? అని అడిగారు. 175 నియోజకవర్గాల్లో ఇలా..ఇంకెన్ని ఓట్లను తొలగించారోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. డేటా స్కాంకు చంద్రబాబు పాల్పడింది చాలక దీన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని, తన పాపాలను అందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా ఇసుక, మట్టి, మందు, కబ్జాలు, పర్సంటేజీలు, భూఆక్రమణలు ఇలా పంచ భూతాలను దోపిడీ చేసిన చంద్రబాబు తాజాగా సైబర్‌క్రైంకు సైతం పాల్పడ్డారన్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అవుతోందని భావించి ఒకే రోజున వంద జీవోలు జారీ చేశారనీ ఆయన విమర్శించారు. ఆ సినిమాలు రెండూ పోయాయి.. ఎన్నికలకు ముందు తీసిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో చంద్రబాబును మంచి వ్యక్తిగా చిత్రీకరించారని అందుకే ఆ రెండూ దారుణంగా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డాయని బుగ్గన అన్నారు. దివంగత ఎన్టీ రామారావే ఈ రెండు చిత్రాల్లో కథా వస్తువే అయినా చంద్రబాబును మంచి వ్యక్తిగా చూపించినందువల్ల ప్రజలు ఆ రెండు చిత్రాలను తిరస్కరించారన్నారు. ప్రజలకు మంచి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చెందిన ‘యాత్ర’ చిత్రం ప్రజల్లో మంచి ఆదరణ పొందిందన్నారు. దీనిని బట్టే రాష్ట్ర ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గురించి టీడీపీ నేతలకు పూర్తిగా తెలిసిపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇవి చదవండి : సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..! అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్! స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!? -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ద్రోహుల పార్టీగా, తెలుగు ప్రజల సమాచార దొంగల పార్టీగా తెలుగుదేశం పార్టీ మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనసభా ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి, తద్వారా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల వద్దకు ఎలా వెళ్లిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం పొందిన బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్ సంస్థలకు ప్రభుత్వంలోని పెద్దలతో సంబంధాలున్నాయని చెప్పారు. బ్లూఫ్రాగ్ సంస్థకు పంటల డేటా సేకరణ, సమాజ వికాసం, విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ వంటి కోట్లాది రూపాయలతో ముడిపడిన అనేక కాంట్రాక్టులను అప్పగించారని తెలిపారు. మరోవైపు.. సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీకి సేవలు అందిస్తోందన్నారు. ఈ రెండు సంస్థలకు చెందిన అశోక్, ఫణికుమార్‌లు అమరావతిలోని సీఎంవో లోనే ఉంటారని వివరించారు. వీటితోపాటు మరో మూడు కంపెనీల ప్రమేయం ఈ బాగోతంలో ఉన్నట్లు స్పష్టమవుతోందని బుగ్గన తెలిపారు. ఆధార్ డేటాను, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమాచారాన్ని, ప్రభుత్వం చేయించిన ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసి టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లోకి ఎక్కించి తదుపరి ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా పన్నాగం పన్నారని ఆయన ఆరోపించారు. ‘సేవామిత్ర’లో సమస్త సమాచారం సేవామిత్ర యాప్ ఓపెన్ చేస్తే ప్రతీ ఓటరు కలర్ ఫొటోతో పాటు భార్యాపిల్లల పేర్లు, వయసు, వారి వ్యక్తిగత వివరాలతో కూడిన మొత్తం సమాచారం, బ్యాంకు ఖాతాలు, వారికి ప్రభుత్వం నుంచి అందిన లబ్ధి.. ఇలా చాలా సమాచారం దర్శనమిస్తోందని.. కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుందని.. అది ఐటీ గ్రిడ్స్ వద్ద, సేవామిత్ర యాప్‌లో ఎలా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో పాటు వ్యక్తిగత సమాచారం గోప్యతను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆధార్ డేటా కూడా ఈ కంపెనీలకు ఎలా చేరిందన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014లో మాత్రమే ఏర్పడిందన్నారు. ఆ తరువాతే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం చేపట్టిందని, అనంతరం ఈ సంస్థల ద్వారా ఒక పథకం ప్రకారం కుట్రలు కొనసాగించినట్లు అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంత బాగోతం నడిపిన సీఎం తన బండారం బయటపడడంతో ఇతరులపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని.. తిరిగి దబాయించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఏడాదిన్నరగా ఓట్ల తొలగింపు.. ఇదిలా ఉంటే.. ఓట్ల తొలగింపు వ్యవహారం ఏడాదిన్నరగా జరుగుతోందని, దీనిపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, లోకేశ్వరరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇవన్నీ బయటపడడంతో హడావుడిగా సేవామిత్ర యాప్‌లో కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను, ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారాన్ని తొలగించారన్నారు. ప్రజాసాధికార సర్వే డేటా మొత్తం అహ్మద్ బాబు బాధ్యుడిగా ఉన్న ఆర్టీజీఎస్ వద్ద ఉందని.. అలాగే, యూఐడీఏఐలో గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఐఎఎస్ అధికారి జె.సత్యనారాయణ ఏపీలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్నారని బుగ్గన వెల్లడించారు. ఈయనకు గతంలో ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించినప్పటికీ మళ్లీ తాజాగా అమరావతిలో ఇచ్చారన్నారు. సత్యనారాయణను ఐటీ సలహాదారు బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్టేట్ రెసిడెంట్స్ డేటా హబ్‌లో ఉండే సమాచారం అధారంగా ఓటర్ల జాబితాను టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థ, స్థానికంగా లేని వారు.. ఇలా 4 విభాగాలుగా విభజించారని బుగ్గన చెప్పారు. ఈ డేటా ఆధారంగా వైఎస్సార్సీపీ వారిని గుర్తించి వారి ఓట్లు తొలగింపజేయడం, తటస్థ ఓటర్లను ప్రలోభ పెట్టడం, స్థానికంగా లేనివారి ఓట్లను తామే వేసుకోవడానికి పన్నాగం పన్నారన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ సమాచారాన్ని కూడా వారికి తెలియకుండా దొంగిలించారని ఆయన ఆరోపించారు. గతంలో ఓటరు పేరు చేర్చాలన్నా, తొలగించాలన్నా టీచర్లు ఇతర రెగ్యులర్ సిబ్బంది ద్వారా చేయించే వారని, ప్రస్తుతం ఈ కార్యక్రమం చేస్తున్న బీఎల్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలంతా కాంట్రాక్టు సిబ్బందే కావడంతో వారిపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తూ అక్రమాలకు దిగుతున్నారన్నారు. అసలైన దోషులెవరో తేల్చాలి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? లేక ఆ కంపెనీయే అపహరించిందా.. దీని వెనుక ఎవరున్నారు? అసలు దోషులెవరు? అన్న అంశాలు తేలాలని.. దీనిపై ఎన్నికల సంఘం లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని బుగ్గన డిమాండ్ చేశారు. ఆధార్ డేటా కూడా వీరికి ఎలా చేరిందో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విచారణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు.. బ్యాంకు ఖాతాలు, పేటీఎం వంటి యాప్‌లు, ఈమెయిళ్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని ప్రజలకు బుగ్గన సూచించారు. ఈ డేటాను దుర్వినియోగం చేస్తే ప్రజలకు చాలా నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. -
సీబీఐ అంటేనే బాబుకు భయం
సాక్షి, హైదరాబాద్ : చట్టాలను ఉల్లంఘించడం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేరు చెబితేనే చంద్రబాబు వణికిపోతున్నారని, తప్పు చేయకపోతే ఆయనకు సీబీఐ అంటే అంత వణుకు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ విచారణకు వీలులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 176 జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సమాఖ్య వ్యవస్థకు విఘాతం కల్గించడమేనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రా జ్యాంగం ప్రకారం కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 67 అంశాలు, ఉమ్మడిజాబితాలో 46 అంశాలు ఉన్నాయి. సీబీఐ కేంద్ర జాబితాలో ఉంది. రాష్ట్ర పరిధిలో సీబీఐ ప్రవేశించరాదన్నారంటే ఆడిట్ చేయడానికి కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కష్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కూడా ఇక్కడ పనిచేయరాదంటారేమో?’ అని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ) సోదాలు చేస్తుంటుందని, అందులో భాగంగా టీడీపీకి చెందిన ముగ్గురి ఆస్తులపై ఐటీ తనిఖీలు చేస్తే బాబు అండ్‌కో నానా యాగీ చేసిందన్నారు. రాజకీయ నాయకులు అక్రమార్జనపై తనిఖీలు చేయకూడదనేది బాబు విధానమా? అక్రమాలు చేసిన నాయ కులకు రక్షణ ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారా? అని నిలదీశారు. ఇదో కేన్సర్ వంటిదని బుగ్గన చెప్పారు. తప్పులు బయటపడతాయనే ఇలాంటి జీవోలు ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగిస్తారని, అదే జరిగితే సూత్రధారులు బయటపడతారని బాబు భయపడి సీబీఐ విచారణ జరపడానికి వీల్లేదని జీవో ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. ‘తన తప్పులు బయటపడతాయని భయపడే చంద్రబాబు ఇలాంటి జీవోలు తెస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలి. చట్టం తనపని తాను చేసుకునే వెసులుబాటు ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో అవసరాలకు అనుగుణంగా పలు చట్టాలను, సంస్థలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కేంద్ర సంస్థలకు అధికారాలు లేవని ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఏమి చేయబోతున్నారు? దేశ స్వాతంత్య్రం తర్వాత ఎవరూ చేయని పని చంద్రబాబు ఎందుకు చేశారు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడూ చంద్రబాబు చట్టాలను ఉల్లంఘించారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా ప్రమాణం చేయించారు. ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూలును కాలరాయడమే’ అని బుగ్గన మండిపడ్డారు. కేంద్రం మౌనం వల్లే ఈ పరిణామం విచ్చలవిడిగా అప్పులు చేయడంవల్ల జరిగే అనర్థాలను నివారించడం కోసం కేంద్రం ఎఫ్ఆర్బీఎం చట్టం తెచ్చిందని బుగ్గన చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి చంద్రబాబు సర్కారు అప్పులు చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా శివరామకృష్ణన్ కమిటి రాజధానిపై నివేదిక ఇస్తే కనీసం చట్టసభల్లో దానిని ప్రవేశపెట్టలేదన్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి బీజేపీ కళ్లుమూసుకుందని, ఎన్డీయే సర్కారు ఆరోజు చేసిన పాపానికి ఈ రోజు మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. ఇప్పుడు బీజేపీతో విభేదించి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినందునే చంద్రబాబు ఈ జీవో ఇచ్చారన్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఒక్కరిపైనా కూడా చర్యలు తీసుకోలేదని, డాక్యుమెంటరీ షూటింగ్ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు ముఖ్యమంత్రి వచ్చి 29 మంది దుర్మరణానికి కారకులయ్యారని మండిపడ్డారు. -
అప్పు కోసమే అమెరికాకు చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లింది ఐక్యరాజ్యసమితి సదస్సుకు కాదని, ఎస్ఐఎఫ్ఎఫ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ(ఎన్జీవో) ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకే వెళ్లారని ప్రజాపద్దుల కమిటీ(పీఎసీ) ఛైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై మీడియా అధికంగా హడావుడి చేసిందని అన్నారు. బుగ్గన ఆదివారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఐక్యరాజ్యసమితి సదస్సుకు భారతదేశానికి ఆహ్వానం అందలేదని, భారత్ నుంచి ప్రతినిధి బృందం కూడా హాజరు కాలేదని బయట పడిందన్నారు. ఎస్ఐఎఫ్ఎఫ్ అనే ఎన్జీవో, ఐరాస అనుబంధ పర్యావరణ విభాగం, విదేశీ వాణిజ్య బ్యాంకు ఉమ్మడిగా నిర్వహించిన సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారని పేర్కొన్నారు. ఎస్ఐఎఫ్ఎఫ్ కార్యాలయం న్యూఢిల్లీలోని లోడీ ఎస్టేట్‌లో ఉందని, దానికి అనుబంధంగా గుంటూరు జిల్లా గోరంట్లలో ఒక పరిశోధనా కేంద్రం ఉందని తెలిపారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు పాల్గొన్న సదస్సుకు ముందుగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యం గురించి ప్రచురితమైన ఒక వ్యాసంలో... ఏపీలో సాగును మరింత అభివృద్ధి చేసేందుకు రూ.16,600 కోట్ల పెట్టుబడులు కావాలని పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణ సేకరణకు ఏపీ ప్రభుత్వం–అక్కడి బ్యాంకులకు మధ్య సమన్వయకర్తగా ఉంటామని ఆ వ్యాసంలో ఎస్ఐఎఫ్ఎఫ్ ప్రకటించింది. వాస్తవానికి ఈ వ్యాసం జూన్ 26న ప్రచురితమైంది. ఈ సదస్సును సెప్టెంబర్‌లో ఎస్ఐఎఫ్ఎఫ్ నిర్వహించింది. ఒక పద్ధతి ప్రకారం అంతర్జాతీయ పత్రికలో వ్యాసం రాయించి, సదస్సు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాటు చేసుకుని, అమెరికా ఆహ్వానం మేరకు ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రసంగం అంటూ ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం సిగ్గుచేటు. అధిక వడ్డీలకు అప్పులు తెస్తారా? చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్ర అప్పులు రూ.97 వేల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపైనా రూ.40,000 అప్పు భారం పడింది. ఒక్కో కుటుంబంపై అప్పు రూ.1.5 లక్షలకు చేరింది. బాబు హయాంలోనే రూ.1.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రంపై మరింత భారం వేయడానికి ప్రకృతి వ్యవసాయం పేరుతో చంద్రబాబు రూ.16,600 కోట్ల అప్పు కోసం అమెరికా వెళ్లారు. అమరావతి బాండ్ల తరహాలోనే అధిక వడ్డీకి రుణాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బు పంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రకృతి సేద్యంపై చంద్రబాబు చేసిన ప్రసంగాల్లో, అధికారిక ప్రకటనల్లో విచిత్రమైన వివరాలున్నాయి. ఏపీలో 60 లక్షల మంది రైతులు 2 కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టబోతున్నట్లు, ఒక డాలర్ పెట్టుబడికి 13 డాలర్ల లాభాన్ని చూసి ఐటీ రంగ ఉద్యోగులు కూడా ఈ తరహా సేద్యం వైపు మళ్లుతున్నారని చంద్రబాబు ప్రకటించారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం గోమూత్రం, ఆవు పేడతో సేద్యం చేయడం సాధ్యమయ్యే పనేనా? 2020 నాటికి 17 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తారని చంద్రబాబు చెప్పారు. అసలు ఏపీలో క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రకృతి సేద్యం గురించి ప్రభుత్వంలో ఉన్న వారే ఒక్కో విధంగా చెబుతున్నారు. చంద్రబాబు ఓ విధంగా, వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరో విధంగా ప్రకటనలు చేస్తున్నారు. 1.63 లక్షల మంది రైతులు లక్షన్నర ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారని వ్యవసాయ బడ్జెట్లో చంద్రమోహన్ పేర్కొన్నారు. 1.30 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతోందని 2017–18 సోషియో ఎకనామిక్ నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. అసలు ప్రకృతి సేద్యానికి సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? సీడ్ సర్టిఫికేషన్ సెంటర్ ఉందా? బడ్జెట్ కేటాయింపు ఉందా? రాయితీల సదుపాయం ఉందా? చంద్రబాబు అమెరికా సదస్సుకు వెళ్లి ప్రకృతి సేద్యంపై ఎందుకు బాకా ఊదారంటే.. రూ.16,600 కోట్ల రుణాన్ని సేకరించి, ఆ డబ్బును జనానికి పంచి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం అమల్లో ఉంది. దీనివల్ల కర్నూలు జిల్లా మేకలు, గొర్రెలు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. వీటిని ఆపే దిక్కు లేదు గానీ ప్రకృతి సేద్యంపై చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడం దారుణం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. -
ప్రతిపక్ష పార్టీ బంద్ చేయకూడదా?
బేతంచెర్ల: అధికార పార్టీ అయితే బంద్ చేయవచ్చు..అదే ప్రతిపక్ష పార్టీలు చేయకూడదా అని పీఏసీ చైర్మన్ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణంలో మంగళవారం నిర్వహించిన బంద్‌లో బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఏపీ ప్రజలకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడుకొని నాల్గు సంవత్సరాలు చక్కగా సర్దుకున్నారు. లక్షణంగా మీకు కావల్సినంత అవినితీ చేసుకున్నారు. ఇంత అవినీతి జరిగినా కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యహరించింది. సీఎం హోదాలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ మంచిదని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లికి, వెంకయ్య నాయుడుకు సన్మానం చేశారు. ఢిల్లీ వెల్లిన ప్రతిసారీ శాలువాలు కప్పి, స్వీటు ప్యాకెట్లు పంచడం, రాష్ట్ర ప్రజలకు మాత్రం మన్నుపెట్టిన మాటవాస్తవం కాదా’’ అన్నారు. బుగ్గన ప్రసంగిస్తుండగానే పోలీసులు అరెస్టు చేయడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, విద్యార్థులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బుగ్గనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కార్యకర్తల అడ్డు తొలగించుకొని బుగ్గనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చంద్రబాబువన్నీ గిమ్మిక్కులే
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఆయన అనుకూల మీడియా చేస్తున్న హడావుడి హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన సదస్సుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిని వెంటబెట్టుకొని ముఖ్యమంత్రి వెళ్లడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆరుసార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారని, ప్రధానమంత్రి మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది ఆయనేనని చెప్పారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలని నిలదీశారు. అమరావతిలో అద్భుతాలు సృష్టించారట! ‘‘పెట్టుబడులు పెట్టే అవకాశం కోసం సింగపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రపంచ నగరాల సదస్సు నిర్వహించింది. నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు మాత్రమే హాజరు కావాల్సిన స్థాయి ఉన్న ఆ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టుకుని మేయర్లు, చైర్మన్లు ఎవరైనా వెళ్లొచ్చు. అలాంటిది మన ముఖ్యమంత్రి మాత్రమే సింగపూర్ సదస్సుకు వెళ్లారని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం దారుణం. అర్థం కాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబుకే సొంతం, ఇంకెవరికీ అది సాధ్యం కాదు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే పరిస్థితి వచ్చిందని చెబుతాడు, ఎవరైనా మహిళలు మాఫీ కాలేదంటే కోపంగా చూస్తాడు. ఇంకా మొదలే పెట్టని నిరుద్యోగ భృతిని పరిమితి లేకుండా అందరికీ ఇచ్చేసినట్లు చెబుతాడు. దాన్ని ఆయన అనుకూల మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు సింగపూర్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ విచిత్రంగా ఉంది. అమరావతిలో అద్భుతాలు సృష్టించినట్టు భ్రమలు కల్పించారు. రాష్ట్ర రాజధానిలో 15 నిమిషాల్లోనే పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లొచ్చని, 1,400 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఉందని, వాకింగ్ పాత్ ఉందని, గార్డెన్ సిటీ ఉందని, అంతా విద్యుత్ వాహనాలే వాడుతున్నామంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. అమరావతిలో వర్షం పడితే బయటి కంటే లోపలే నీళ్లెక్కువగా ఉండే తాత్కాలిక భవనాలు, ఇప్పుడిప్పుడే వేసే రోడ్లు తప్ప ఏమైనా ఉన్నాయా? తప్పుడు ప్రచారంతో ఏం సందేశం పంపాలనుకుంటున్నారు?’’ అని బుగ్గన ధ్వజమెత్తారు. ఎవరి వల్ల ఎవరికి లాభం? ‘‘నూతన రాజధాని ఏర్పాటుపై చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే, ఆ నివేదికను కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా పెట్టలేదు. సమాంతరంగా నారాయణ కమిటీని వేశారు. అందులో వ్యాపారవేత్తలను నియమించుకున్నారు. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తారో తెలిజేయకుండా గందరగోళం సృష్టించారు. అమరావతిలో అధికారపార్టీ నేతలు ముందే భూములు కొనేశారు. రాజధానిలో ప్రైవేటు సంస్థలకు ఎకరా రూ.50 లక్షలకు కేటాయించి, ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.కోటి ధర నిర్ణయించారు. స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1,691 ఎకరాలు అప్పగించారు. ఆ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలకు 58 శాతం, ఏపీకి 42 శాతం వాటా ఇవ్వడం న్యాయమేనా? ఇంటి అల్లుడి మాదిరి అంతా రాసిస్తే సింగపూర్ వాళ్లు సంతోషంగానే ఉంటారు. జైపూర్‌లో 17 ఎకరాల్లో, కర్నాటకలో 127 ఎకరాల్లో రాజధానిని నిర్మిస్తే, ఇక్కడ వేలాది ఎకరాలు ఎందుకు? అసలు సింగపూర్ వల్ల ఏపీకి లాభమేంటి? ఏపీ వల్ల సింగపూర్‌కు లాభమేంటి? సింగపూర్‌కు దోచిపెట్టిన చంద్రబాబు సమాధానం చెప్పాలి. లోపాయికారీ ఒప్పందాలు లేకుండానే ఇవన్నీ చేశారా? చంద్రబాబు విదేశీ పర్యటనలు వెళ్లినప్పుడల్లా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని వెంట తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? ఆయన రావడం వల్ల ధైర్యం వస్తుందా? ఏపీలో ఉండటం వల్ల ఏదైనా భయమేస్తుందా?’’ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. అవినీతిలో ఏపీకి రెండోస్థానం ‘‘సులభతర వాణిజ్యంలో ఏపీ నెంబర్‌వన్ స్థానంలో ఉందంటూ అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎవరో ఓర్వడం లేదని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉంది. 2017 గణాంకాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద రూ.71,500 కోట్ల పెట్టుబడులు వస్తే, ఏపీకి వచ్చింది రూ.4,500 కోట్లు మాత్రమే. సులభతర వాణిజ్యంలో పదో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు అదే సంవత్సరంలో రూ.40,500 కోట్లు పెట్టుబడులు రాగా, మూడో స్థానంలో ఉన్న హరియాణాకు పెట్టుబడులే రాలేదు. 8వ స్థానంలో ఉన్న కర్ణాటకకు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ చూసినా.. మహారాష్ట్ర రూ.19 వేల కోట్లు, గుజరాత్ రూ.16 వేల కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.11 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.6 వేల కోట్లు, జార్ఖండ్ రూ.4,276 కోట్లు, తెలంగాణ రూ.4,128 కోట్లు, నాగాలాండ్ రూ.3,761 కోట్లు, రాజస్థాన్ 3,415 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.3,103 కోట్ల పెట్టుబడులను సాధించాయి. ప్రత్యేక హోదా ఉండబట్టే నాగాలాండ్‌కు మనకన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. సీఎంఎస్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం 2017లో అవినీతిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పాలనాపరంగా ఘోరంగా విఫలమయ్యారు’’ అని బుగ్గన దుయ్యబట్టారు. -
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అవినీతి
డోన్: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు రూ.10వేల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారని ఆరోపించారు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని వలిసెల గ్రామంలో వైఎస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డులన్నీ అధికారపార్టీ నాయకుల కుటుంబ సభ్యల పేర్ల మీద ఉన్నాయన్నారు. పనులు చేపట్టకపోయినా రికార్డుల్లో చేసినట్లు చూపి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను తెలుగు తమ్ముళ్లు దిగమింగారని ఆరోపించారు. గృహ నిర్మాణ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని బుగ్గన ధ్వజమెత్తారు. ఒక్కొక్క లబ్ధిదారుని నుంచి టీడీపీ నాయకులు రూ.20వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వెలుగు చూసిన అవినీతి టీడీపీ నేతల బరితెగింపునకు నిదర్శనమని చెప్పారు. కందుల కొనుగోలు కేంద్రాల్లో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి రైతాంగాన్ని నిలువుదోపిడీ చేశారన్నారు. కర్నూలును ఓడీఎఫ్ (బహిరంగ మలమూత్ర రహిత) జిల్లాగా ప్రకటించడం దారుణమని బుగ్గన వ్యాఖ్యానించారు. వలిసెల గ్రామంలో 250 ఇళ్లుంటే ఇప్పటివరకు 80 ఇళ్లకు మరుగుదొడ్లే లేవనే సంగతి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు పాల్గొన్నారు.