Crops cultivation
-
పైసా తగ్గకుండా ‘మద్దతు’ధర
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కళ్లాల నుంచి ధాన్యం తరలించేందుకు అయ్యే రవాణా, హమాలీ చార్జీలను ప్రభుత్వం అదనంగా ఇస్తోందన్న విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ధాన్యం సేకరణలో కొత్త విధానాలపై ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో పాటు రైతుల ఫోన్లకు ఆడియో, వీడియోల రూపంలో సందేశాలను పంపాలని సూచించారు. రైతులకు జరిపే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని, పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి(డీబీటీ)లో పూర్తి మద్దతు ధరను జమ చేయాలని నిర్దేశించారు. ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ధాన్యం సేకరణ యాప్.. ధాన్యం సేకరణలో కొత్త విధానం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. చిన్నచిన్న సమస్యలు ఎదురైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ రైతులకు మరింత మెరుగ్గా సేవలందించేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోళ్ల లక్ష్యానికి అనుగుణంగా గోనె సంచులను సమకూర్చుకోవాలి. పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ధాన్యం సేకరణ యాప్‌లో సిగ్నల్స్ సమస్యలు తలెత్తితే ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. సిగ్నల్స్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో అప్లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు. అవసరమైతే వారి నుంచి సాంకేతిక సహకారాన్ని పొందాలి. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా వచ్చే ఖరీఫ్ నుంచి సీఎంఆర్ రైస్ మిల్లుల్లో డ్రయర్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలి. కొనుగోళ్ల సమయంలో ఇబ్బంది లేకుండా ఇతర శాఖల నుంచి అవసరమైన మేరకు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవాలి. జవాబుదారీతనం పెరిగేలా.. పౌరసరఫరాల శాఖలో ఎక్కడా అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలి. జిల్లా పౌరసరఫరా అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా వారి విధివిధానాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందించాలి. వీటిని కచ్చితంగా పాటించేలా సమర్థంగా పర్యవేక్షించాలి. ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి అన్ని విధాలా తోడ్పాటు అందించాలి. మన ప్రభుత్వం వచ్చాక చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. పుష్కలమైన పోషకాలను అందించే చిరుధాన్యాలు కావాలని ప్రజలు కోరితే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. హాజరైన మంత్రులు, అధికారులు.. సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ æశాఖ కమిషనర్ రాహుల్ పాండే, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా రబీ జోష్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో నీటి నిల్వలు, భూగర్భ జలాల్లో పుష్కలంగా పెరగడంతో రబీ సీజన్లో దేశంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే నవంబర్ రెండో వారానికి 6 శాతం పెరుగుదల ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది 1.68 కోట్ల హెక్టార్లలో సాగు చేయగా ఈసారి 1.80 కోట్ల హెక్టార్లను దాటింది. ‘‘గోధుమల సాగు 41 లక్షల హెక్టార్ల నుంచి అది ఇప్పటికే 46 లక్షలకు చేరవైంది. వరి 6 లక్షల హెక్టార్ల నుంచి 7.5 లక్షలకు పెరిగింది. పప్పు ధాన్యాల విస్తీర్ణం గతేడాది 55.41 లక్షల హెక్టార్ల కంటే స్వల్పంగా తగ్గింది’’ అని పేర్కొంది. పంజాబ్, మధ్య ప్రదేశ్ లో వరి కోతలు సాగుతుండటంతో గోధు మల సాగు ఇంకా మొదలవలేదని వ్య వసాయ శాఖ చెప్పింది. తెలంగాణ సహా వరి పండించే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమి ళనాడులో ఇప్పుడిప్పుడే వరి పంటల సాగు మొ దలైందని వెల్లడించింది. గతేడాది అన్ని పంటల సాగు విస్తీర్ణం 6.18 కోట్ల హెక్టార్లుగా నమోదైంది. ఈసారి 6.33 కోట్ల హెక్టార్ల వరకు పెరగవచ్చని అంచనా. -
సర్కారు ‘యంత్ర’తంత్రం.. కూలీల కొరతకు చెక్
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 980 మంది రైతులు 2,450 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. సీజన్లో కూలీలు దొరక్క ఇబ్బందిపడేవారు. చిన్నచిన్న యంత్రాల కోసం కూడా దళారీలను ఆశ్రయించేవారు. సీజన్లో బెంగళూరు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే యంత్రాలకు వేలకు వేలు పోయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆర్బీకేల పరిధిలో ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాల ద్వారా ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్, ఇతర యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఒక్కో సీజన్లో పంటను బట్టి ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.. సాక్షి, అమరావతి: ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు రైతుల కష్టాలకు చెక్ చెబుతున్నాయి. కూలీల కొరతను తీర్చడమేకాదు.. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు తక్కువ ధరకే అద్దెకు ఇచ్చేందుకు ఆర్బీకే, క్లస్టర్ స్థాయిల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో వివిధ రకాల పరికరాలను 6,781 కేంద్రాల్లో.. రూ.25లక్షల అంచనా వ్యయంతో క్లస్టర్ స్థాయిలోని 391 కేంద్రాల్లో మరికొన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 40 శాతం సబ్సిడీపై రైతు గ్రూపులకు ఈ కేంద్రాల ద్వారా దుక్కి యంత్రాలు, దమ్ము, చదును చేసే పరికరాలు, వరి నాటే, నూర్పిడి యంత్రాలు.. విత్తనం, ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలను అందించింది. వీటితోపాటు ఇటీవలే ఆర్బీకే స్థాయిలో రైతు గ్రూపులకు 3,800 ట్రాక్టర్లను కూడా అధికారులు అందించారు. పంటల సరళి, స్థానిక డిమాండ్‌ను బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ, అద్దెలు నిర్ణయించే బాధ్యత రైతు కమిటీలకు అప్పగించారు. వీటి ధరలు, సంప్రదించవలసిన వారి వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు వీలుగా మండలానికి మూడు చొప్పున ఈ ఏడాది రెండువేల గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు డ్రోన్స్ సరఫరాకు చర్యలు చేపట్టింది. యంత్రాలతో పెట్టుబడి ఆదా నిజానికి.. దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.600, దమ్ముకు రూ.1,000లు తీసుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఆర్బీకేల్లోని ట్రాక్టర్లను అద్దెకు తీసుకుంటే రూ.ఐదారు వందలకు మించి అవడంలేదంటున్నారు. ► అలాగే.. సీడ్ కం ఫెర్టిలైట్ డిల్లర్ ద్వారా విత్తనాలతో పాటు మందును ఒకేసారి చల్లేందుకు ఎకరాకు రూ.300 వరకు మిగులుతోందని రైతులు అంటున్నారు. ► జొన్న, మొక్కజొన్న కట్టలు కట్టేందుకు గతంలో ఎకరాకు కూలీలకు రూ.1,500లు ఖర్చయ్యేది. అలాంటిది ప్రస్తుతం కట్టలు కట్టే మిషన్‌వల్ల రూ.ఐదారు వందలు మించి కావడంలేదు. ► మినుము పంటకు పురుగుల మందు పిచికారి కోసం ఎకరాకు ఒక్కో కూలీకి రూ.600 ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.200కు మించి కావడంలేదు. ► ఇక గతంలో కోత మిషన్‌కు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలు చెల్లించే వారు. కానీ, ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3వేల లోపే అవుతోందని రైతులు చెబుతున్నారు. ..ఇలా ఇతర పరికరాల ద్వారా పొందే ఆదా లెక్కిస్తే రెండు సీజన్లు కలుపుకుని పంటను బట్టి ఎకరాకు రూ.10 వేలకు పైగా ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రైతు గ్రూపునకు ఆదాయం గ్రామంలో ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి ట్రాక్టర్–టిల్లర్ తీసుకున్నాం. మేం వాడుకోగా గ్రామంలో రైతులకు అద్దెకిస్తున్నాం. బయట ఎకరాకు రూ.1,300–రూ.1,500 తీసుకుంటున్నారు. మేం రూ.900–రూ.1,100కు ఇస్తున్నాం. ఎకరాకు రూ.400 వరకు ఆదా అవుతుండడంతో మా వద్ద అద్దెకు తీసుకునేందుకు గ్రామంలో మెజార్టీ రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. – పత్తి వెంకటబ్రహ్మయ్య, ఆలమూరు, నంద్యాల జిల్లా పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది మా గ్రూపు తరఫున రెండు రోటేవేటర్లు, రౌండ్ పీలర్, థ్రషర్స్ తీసుకున్నాం. రోటోవేటర్‌కు బయట ఎకరాకు రూ.1,800 వరకు తీసుకుంటున్నారు. మేం రూ.900కే అద్దెకిస్తున్నాం. థ్రషర్కు బయట రూ.2వేలు తీసుకుంటే. మేం రూ.1,600కే ఇస్తున్నాం. రౌండ్ పీలర్కు కట్టకు రూ.30లు తీసుకుంటే మేం రూ.25లకే ఇస్తున్నాం. వీటివల్ల మాకే కాదు.. గ్రామంలో మెజార్టీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – పగిడి శివరామయ్య, రుద్రవరం, నంద్యాల జిల్లా ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేదు మా గ్రూపు ద్వారా ట్రాక్టర్ తీసుకున్నాం. మేం మిరప, మినుము సాగుచేస్తున్నాం. మేం వినియోగించుకోగా గ్రామంలో మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా అన్ని రకాల పనులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – జమ్మి సురేష్, దేవరపల్లి, ఏలూరు జిల్లా రూ.3.64 లక్షలు సబ్సిడీ జమైంది మా గ్రూపు కింద ఇటీవలే తైవాన్ స్ప్రేయర్లు, న్యూ హాలాండ్ ట్రాక్టర్ తీసుకున్నాం. వీటి ఖరీదు రూ.9.57 లక్షలు కాగా.. రూ.3.64 లక్షల సబ్సిడీ జమైంది. ఖరీఫ్ సాగు వేళ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మా గ్రూపులో రైతులందరి అవసరాలు పూర్తికాగానే ఇతర రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – భీమవరపు శివరామకృష్ణ, పెనుమూలి, గుంటూరు జిల్లా -
కోటి మార్కు దాటిన సాగు
సాక్షి, : రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 1.02 కోట్ల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ఇటీవల తగ్గుముఖం పట్టడంతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. దీంతో ఎక్కడికక్కడ విస్తీర్ణం పెరుగుతోంది. సెప్టెంబర్ చివరి వరకు వానాకాలం సీజన్ కొనసాగనున్నందున రైతులు ఇప్పుడు వరి తదితర పంటలపై దృష్టి సారించారు. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.29 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 15 లక్షల ఎకరాలకు గాను 5.47 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.88 లక్షల ఎకరాలకు గాను 3.85 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను 5.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక వరి ప్రతిపాదిత లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 34.95 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8 జిల్లాల్లో 100%, అంతకు మించి సాగు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వంద శాతానికి మించి పంటలు సాగయ్యాయి. సాధారణ సాగుతో పోలిస్తే మెదక్ జిల్లాలో అత్యధికంగా 116%, మహబూబాబాద్ జిల్లాలో 115% పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 109%, కొమురంభీం జిల్లాలో 108%, ఆదిలాబాద్ జిల్లాలో 107%, పెద్దపల్లి జిల్లాలో 104%, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 100% చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 30% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ములుగులో 40%, భద్రాద్రి కొత్తగూడెంలో 45%, సూర్యాపేటలో 47% మేరకే పంటలు సాగయ్యాయి. 28 జిల్లాల్లో 50 శాతానికి మించి పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పత్తిపై వర్షాల పెను ప్రభావం రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన పత్తి పంట భారీగా దెబ్బతినగా, మిగిలిన చేన్లు కూడా ఎర్రబారి తెగుళ్లతో సమస్యగా మారుతున్నాయి. గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో ఈసారి చాలామంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. వ్యవసాయశాఖ కూడా సమావేశాలు నిర్వహించి పత్తి సాగు పెంచాలని రైతులను కోరింది. ఈ మేరకు పత్తి సాగు పెరిగింది అయితే జూలై ప్రారంభం నుంచి మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగి దెబ్బతిన్నది. వరుసగా కురిసిన భారీ వర్షాలతో మొదట్లో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండోసారి వేశారు. అయితే మొక్క ఎదుగుతున్న దశలోనే మళ్లీ వర్షాలు పడడంతో జాలు పట్టిపోయాయి. ఇక దెబ్బతిన్న పంట పోగా మిగిలిన పత్తి చేన్లలో మొక్క ఎదుగుదల నిలిచిపోయింది. వానలకు చేలలో నీరు నిలిచి పంట ఎదగడం లేదని, కలుపు తీయడం ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం లేక పత్తి చేన్లను కొందరు రైతులు వదిలేశారు. మరికొందరు పత్తి చేన్లను పూర్తిగా దున్ని మొక్కజొన్న, వరి పంటలను సాగు చేసుకుంటున్నారు. -
వరుణ.. కరుణ సుజలాం.. సుఫలాం
సాక్షి, అమరావతి: గోదావరి గలగలలు.. కృష్ణమ్మ బిరబిరలు.. పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈదఫా ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేసింది. నవంబర్‌లో తుపాన్లు వచ్చేలోగా ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి చేసి రెండో పంటకు నీటిని విడుదల చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలకుల దూరదృష్టికి వరుణుడు కలిసి రావడంతో గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్, గండికోట, చిత్రావతి, వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు జూన్ 10న, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్‌కు జూన్ 30న, సాగర్ కుడి, ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), ఎల్లెల్సీ(దిగువ కాలువ), వంశధార, తోటపల్లి సహా అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతన్నలు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి వాణిజ్య పంటలను భారీ ఎత్తున సాగుచేశారు. సాగర్, కుడి ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నారుమడులు పోస్తున్నారు. నెలాఖరుకు ఆయకట్టులో ఖరీఫ్ సాగు పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. మూడేళ్ల కంటే మిన్నగా.. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్సైడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద 7.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలో కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉరకలెత్తుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, సోమశిల లాంటి భారీ ప్రాజెక్టులన్నీ నిండాయి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 983.48 టీఎంసీలుకాగా ఇప్పటికే 812.47 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో పూర్తి సామర్థ్యం మేరకు రిజర్వాయర్లలో 560.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అక్టోబర్ ఆఖరు వరకు నదుల్లో వరద ప్రవాహం కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఏడాది అన్ని బేసిన్లలోనూ నీరు భారీగా పెరగనుంది. రెండో పంటకూ అవకాశం.. గతంలో గోదావరి డెల్టాలో మాత్రమే రెండో పంటకు నీటిని విడుదల చేసేవారు. గత మూడేళ్లుగా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపుతున్న ప్రభుత్వం నీటి లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నూర్పిళ్లు కూడా సకాలంలోనే పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటం, అక్టోబర్ వరకు వరద ప్రవాహం, ఆ తర్వాత సహజ ప్రవాహం నదుల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ ఏడాది నీటి లభ్యత గత మూడేళ్ల కంటే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో సాగు మంత్రివర్గ సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగానే నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా చర్యలు చేపట్టాం. ఈ దఫా రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలలో ఏటా కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే అధిక ఆయకట్టులో పంటలు సాగుచేసే అవకాశం ఉంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ -
ఉద్యాన సిరులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటలు రైతు ఇంట సిరులు కురిపిస్తున్నాయి. జిల్లాలో ఉద్యాన పంటలుగా అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ, బత్తాయి, బొప్పాయి, మిరప, మల్లె తదితర పంటలు సాగులో ఉన్నాయి. మెట్ట రైతుల బెట్ట తీరేలా దిగుబడులకు తోడు ధరలు సైతం ఆశా జనకంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ దఫా రికార్డు స్థాయిలో రేటు దక్కుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నిమ్మ రేట్లు బాగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యాన రైతుల ఇళ్లల్లో సిరులు దొర్లుతున్నాయి. నిమ్మతో పాటు మిరప, బత్తాయి, బొప్పాయి, మల్లె పంటల ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయి. నిమ్మ ధరలు అయితే చరిత్రలో ఎన్నడూ పలకని విధంగా పసిడి ధరతో పోటీపడుతున్నాయి. నిమ్మ లూజు బస్తా కనిష్టంగా రూ.13 వేల నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు స్థానిక మార్కెట్లో పలుకుతోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకూ ధర ఉంది. ముంబయి, బెంగళూరు మార్కెట్లలో సైతం నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటాయి. అవే ధరలు మార్కెట్లో నిలకడగా ఉండడంతో నిమ్మ రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఎండలు ముదరడంతో.. ఎండలు ముదరడంతో నిమ్మ ధరలు వేగంగా పుంజుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో పొదలకూరు, గూడూరు నిమ్మ మార్కెట్ల నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, బెంగళూరుకు ఎగుమతి అవుతాయి. తాజాగా ఆయా మెట్రో సిటీల్లో «నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో మార్కెట్లో ఊపు వచ్చింది. కిలో ఆపిల్ కంటే కిలో నిమ్మధర అధికంగా ఉంది. తాజా సీజన్లో మహారాష్ట్రలోని బీజాపూర్, ఏపీలో రాజమండ్రి, ఏలూరు, తెనాలిలో దిగుబడి ఆశించిన మేరకు లేకపోవడం, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నిమ్మ కాపు బాగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర లభిస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు. బత్తాయి.. మిరప ధరలు జోష్ బత్తాయి, మిరప, మల్లెల ధరలు సైతం జోష్‌లో ఉన్నాయి. టన్ను బత్తాయిలు మేలైనవి రూ.60 వేలు పలుకుతుంటే.. కాయ నాణ్యతను బట్టి రూ.40 వేలకు తక్కువ లేకుండా ధర ఉంది. మిరపలో ఆకాష్ రకం కాయలు ధరలు బాగా ఉన్నాయి. బెంగళూరు బ్రీడ్ అయిన ఈ రకం నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. దీంతో మెట్ట ప్రాంత రైతులు అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం కిలో రూ.120 తక్కువ లేకుండా ధర పలుకుతోంది. ధరలు బాగా ఉండడంతో ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలు లాభాలు దక్కుతున్నాయి. మల్లెపూలు మార్చి నుంచి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 తగ్గడం లేదు. అక్టోబర్ వరకు దిగుబడి రానుంది. ఉద్యాన పంటల ధరలు నిలకడగా ఉండడంతో రైతులు ఇంట సిరులు కురుస్తున్నాయి. జిల్లాలో సర్వేపల్లి, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో కలిసిన గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కూడా అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లల్లో ఉద్యాన పంటలు సాగులో ఉండడం విశేషం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో ఉద్యాన పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్లో ధరలు కూడా బాగుండటం, ప్రభుత్వం ఉద్యాన రాయితీలు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది. ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన మెటీరియల్ రాయితీతో అందిస్తోంది. ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించేందుకు బిందు సేద్యంతో పాటు మల్చింగ్ విధానం సాగుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ప్రోత్సాహక నగదు జమ చేస్తోంది. హెక్టారుకు రూ.16 వేల రాయితీ అందిస్తోంది. బత్తాయి ధరలు బాగున్నాయి ఈ ఏడాది బత్తాయి ధరలు అశాజనకంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ధరలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. గతేడాది వర్షాలు పుష్కలంగా కురిసి దిగుబడులు బాగా వచ్చాయి. గిట్టుబాటు ధరలు లభించాయి. ఈ ఏడాది మంచి వర్షాలు పడటంతో దిగుబడితో పాటు కాయ నాణ్యత కూడా చాలా బాగుంది. టన్ను ధర కాయ నాణ్యతను బట్టి రూ.45 వేల నుంచి రూ.60 వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. దివంగత వైఎస్సార్ హయాంలో బత్తాయి రైతు ఇంట ఆనందం కనిపించింది. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పాలనలో బత్తాయి ధరలు గిట్టుబాటుగా ఉన్నాయి. – సయ్యద్ గౌస్‌మొయిద్దీన్, బత్తాయి రైతు, దాసరి పల్లి, ఉదయగిరి మండంలం -
హార్టికల్చర్ హబ్‌గా ఏపీ
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలతో ఉద్యాన పంటల సాగులో ఏపీ ముందంజలో ఉంది. సర్కారు ప్రోత్సాహంతో ఏటా వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రెండేళ్లుగా ప్రతి జిల్లాలోనూ వెయ్యి నుంచి 2వేల హెక్టార్లలో కొత్తగా పంటలు వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల హెక్టార్లలో 138 రకాల పండ్లు, కూరగాయలు, పువ్వుల పంటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పండ్లు, పూలకు మంచి డిమాండ్ ఉండటంతో విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. అరుదైన ఉత్పత్తులు ఇక్కడ ప్రత్యేకం ఉద్యాన పంటల సాగులో మిర్చి అత్యధికం. అందులో గుంటూరు జిల్లాలో సాగయ్యే మిర్చికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ పండే మిర్చి దేశంలో ఎక్కడా సాగవ్వదని అధికారులు చెబుతున్నారు. అలాగే, నేల స్వభావంవల్లే రైతులు ఇక్కడ ఈ పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారని చెప్పారు. అందుకే ఇక్కడ అత్యధికంగా మిర్చి యార్డులు ఏర్పాటుచేసుకున్నారు. ఇక రెండో స్థానంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది మామిడి. మొత్తం 52 రకాల మామిడి పంటలు రాష్ట్రంలో సాగవుతున్నాయి. ఇందులో కర్నూలు, కృష్ణా జిల్లాలో సాగయ్యే బంగినపల్లి ఎంతో ప్రత్యేకమైనవి కావడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని తోతాçపురి రకానికి కూడా. ఇక్కడ ఏటా మామిడి సాగు పెరుగుతుండటంతో చిత్తూరు జిల్లాలో పెద్దఎత్తున గుజ్జు పరిశ్రమలు ఏర్పాటుచేసి ఎగుమతి చేస్తున్నారు. టమాటా, ఉల్లికి కేరాఫ్ చిత్తూరు, కర్నూలు ఇక టమాటా, ఉల్లి పంట ఉత్పత్తులకు నిలయం చిత్తూరు, కర్నూలు జిల్లాలు. ఇక్కడ ఈ రెండు పంటలు అధికంగా సాగుచేస్తున్నారు. టమాటా కోసం మదనపల్లిలో ప్రత్యేకంగా మార్కెట్ యార్డును ఏర్పాటుచేయగా.. కర్నూలులో అతిపెద్ద ఉల్లి మార్కెట్ యార్డు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఈ రెండు ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. ఈ రెండు మార్కెట్లే వీటి ధరలను నిర్ణయించడం విశేషం. ఇక్కడ నుంచే వీటిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మరో ప్రధానమైన ఉద్యాన పంట అరటి. వివిధ ప్రాంతాల్లో 17 రకాల అరటి పంటలు సాగుచేస్తున్నారు. అమృతపాణి, చక్కరకేళి, కర్పూరం రకాలకు ఎక్కువ డిమాండ్. వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో అరటి పంటను అత్యధికంగా సాగుచేస్తున్నారు. కొత్త రకాల సాగు.. రాయలసీమ జిల్లాల్లో కొత్తకొత్త రకాల పండ్ల తోటలు వేస్తున్నారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో డ్రాగన్ ప్రూట్ పంటల సాగుచేస్తున్నారు. మొదట్లో ఎకరం, రెండెకరాల్లో ప్రారంభమైన ఈ పంటల సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ మూడు జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఖర్జూరం, కర్నూలు జిల్లాలో ద్రాక్ష సాగు విస్తరిస్తోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ అంపాపురం వద్ద నూనెగింజల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. రెండు జిల్లాల నుంచి వచ్చే పంట ఉత్పత్తుల ద్వారా ప్రతిరోజూ 1.60 లక్షల టన్నుల ప్రొడక్షన్ ఉందని పరిశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. మరోవైపు.. రాష్ట్రంలో జీడిపప్పు సాగు కూడా అనూహ్యంగా పెరుగుతోంది. కొబ్బరి తోటలూ అధికంగా ఉన్నాయి. ఉపాధి పథకంతో ఊతం ఉద్యాన వనాలకు ‘ఉపాధి’ హామీ పథకం ఎంతగానో చేయూతనిస్తోంది. పండ్ల తోటల పెంపకానికి ఈ పథకం రైతులకు బాసటగా నిలుస్తోంది. మూడేళ్లపాటు వాటి సంరక్షణకు తోడ్పాటునిస్తోంది. తమ సొంత పొలాల్లో తాము కోరుకున్న పండ్ల తోటలు పెంచుకుంటూనే ‘ఉపాధి’ పొందే వెసులుబాటు కల్పిస్తుండడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. సొంత పొలంలో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తోంది. తోట పెంపకానికి ఎంతమంది ఉపాధి కూలీలు అవసరమవుతారో గుర్తించి, ఆ రైతుతో పాటు వారికి కూడా వేతనాలు చెల్లిస్తారు. తన తోటలో తాను పనిచేసుకుంటూ రోజుకు రూ.220కు పైగా వేతనం పొందే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు తోటల పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా కనీసం వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. -
ఫలించిన ప్రయోగం
శింగనమల: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంభిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించిన అనంతపురం రైతులు జిల్లాలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్‌రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్‌రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్‌గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్‌రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మం‘‘ -
పంటల సేకరణకు కాల్‌సెంటర్ 155251
సాక్షి, అమరావతి: పంటల సేకరణలో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 155251 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 10,641 రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పంటల సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అన్ని ఆర్బీకేలు కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తాయని, అవసరమైతే వీటికి అనుబంధంగా మరికొన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాస్తవ రైతులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవసాయశాఖ పంటల సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసిందని, ఈ వివరాలన్నీ ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ప్రధానంగా పౌరసరఫరాలశాఖ, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, సీసీఐలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటలను కూడా ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రైతులకు పంటల సేకరణ, ధరలపై అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాలు నిర్మించాలని, విస్త్రత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేలకు ఎలా తెచ్చుకోవాలో, ఏయే ప్రమాణాలు పాటించాలో రైతులకు అర్థమయ్యేలా వీడియోలు ప్రదర్శించి చూపాలని కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సేకరణ చేపట్టాలని, కూపన్ల జారీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల సేకరణ తరువాత రైతులకు ఎన్ని రోజుల్లో నగదు చెల్లిస్తారో స్పష్టంగా తెలపాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా చెప్పాలని పేర్కొన్నారు. పంటల ధరలు, అమ్మిన రైతుల వివరాలు, నగదు చెల్లింపులకు సంబంధించిన వివరాలను అందరికీ తెలిసేలా పారదర్శకంగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల సేకరణ కేంద్రాలకు సంబంధించిన వివరాలను మ్యాప్‌ల రూపంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వద్ద ఉంచాలని, తద్వారా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో పాల్గొనే అన్ని సంస్థల ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 155251 నంబరుకు కాల్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు. -
ప్రకృతి వ్యవసాయానికి ‘ఉపాధి’ బాసట
సాక్షి, అమరావతి బ్యూరో: లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎరువులు, పురుగులు మందులు వాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నేల స్వభావానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తక్కువ పెట్టుబడితో ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఐదు వరుసల నమూనాలో పంటలు సాగు చేసే అవకాశాన్ని పరిచయం చేస్తోంది. రైతులను ఈ దిశగా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడానికి జాతీయ ఉపాధి హామీ నిధులతో వందశాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఒకే నేలలో ఒకేసారి 5 రకాల పంటల సాగు.. ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం పద్ధతిని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తంగా రైతులకు పాటించేలా ప్రోత్సహిస్తాయి. ఐదు వరుసల వ్యవసాయంలో రైతు ఒకే నేలలో ఐదు రకాలదాకా పంటలను ఒకేసారి సాగు చేస్తారు. ఇందులో పండ్ల మొక్కలు, కూరగాయలు, తీగ జాతి మొక్కలు నాటుతారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఖర్చు తగ్గుతుంది. పండ్ల మొక్కలు నాటిన మూడేళ్లకు పంట చేతికి వస్తుంది. ఆలోగా వాటి మధ్యలో అంతర పంటగా నాటిన కూరగాయలు, తీగజాతి మొక్కల పంట చేతికి వచ్చి రైతుకు ఆదాయ వనరుగా మారుతుంది. ఐదు వరుసలలో ఏదో ఒక పంట దిగుబడి బాగా వచ్చినా నష్టపోయే ప్రమాదం ఉండదు. భూసారం పెరుగుతుంది. మూడేళ్ల తర్వాత పండ్ల మొక్కలతో ఎలాగో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పంట సాగుచేసిన నెల రోజుల నుంచి ఏడాది పొడవునా రైతుకు ఆదాయం లభిస్తుంది. జిల్లాలో 210 పంచాయతీల్లో అమలు ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఈ ఏడాది 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక్కో రైతుకు కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా ఒక ఎకరం వరకు సాగు చేసుకొనే అవకాశం ఉంది. రైతు పొలం భూసార పరీక్ష, గుంతలు తవ్వటం, మొక్కల నాటడం, మూడేళ్ల వరకు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చునంతా జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. రెండు వరుసలలో సాగు చేసే పండ్ల మొక్కలను డ్వామా అందజేస్తుంది. మామిడి, సపోటా, జామ, కొబ్బరి, నేరేడు, ఊసిరి, సీతాఫలం, రేగి, నిమ్మ వంటి మొక్కలు నాటుతారు. మిగిలిన మూడు వరుసలలో కంది, బొప్పాయి, కూరగాయలు, దుంపజాతి, తీగ జాతి మొక్కలు నాటుతారు. ఇలా ఒక్కో రైతుకు మూడేళ్లలో గరిష్టంగా రూ.2.21 లక్షల దాకా ప్రయోజనం కలుగుతుంది. తక్కువ పెట్టుబడితో, నష్టపోకుండా ఐదు వరుసల పంట సాగుకు ఉపాధి హామీ నిధులను ఇవ్వటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎంతో మేలు పెట్టుబడిలేని ఐదు వరుసల ప్రకృతి వ్యవసాయం సాగును జాతీయ ఉపాధిహామీ పథకంలోకి తీసుకురావటం రైతులకు ఎంతో ప్రయోజనకరం. దీన్ని ఉపయోగించుకొని రైతులు నష్టపోకుండా, ఏడాది పొడవునా ఆదాయం పొందొచ్చు. పొలంలో భూసార పరీక్షలు మొదలు, గుంతలు తవ్వటం, మొక్కలు, వాటిని నాటుకోవటానికి, పరిరక్షణకు ఇలా వివిధ రూపాల్లో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరవుతాయి. ఇది రైతులకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో 210 గ్రామ పంచాయతీలలో అమలు చేయనున్నాం. – గజ్జెల శ్రీనివాసరెడ్డి, పీడీ, డ్వామా, గుంటూరు -
పంటల ‘చిత్రపటం’ రెడీ
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత సాగు ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. పంటలవారీగా రాష్ట్ర ప్రజల అవసరాలు, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో సాగుచేయాల్సిన పంటల చిత్రపటాన్ని సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌తోపాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పంటలను దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలను పరిపూర్ణంగా తీర్చేలా సాగు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే ఈ వానాకాలం నుంచి పత్తి, కంది, పామాయిల్‌తోపాటు నూనెగింజల పంటల వైపు సర్కారు మొగ్గుచూపుతోందని అధికార వర్గాలంటున్నాయి. ఈ పంటలకు తగిన డిమాండ్ ఉన్నా రాష్ట్రంలో సాగు, దిగుబడి తక్కువగా ఉన్నాయని, ఈ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర అవసరాలను తీర్చుకొనేలా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలుస్తోంది. డిమాండ్‌కన్నా ఎక్కువ దిగుబడి ఉన్న వరి, మొక్కజొన్న లాంటి పంటలకు కొంత బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనతో సంప్రదాయబద్ధంగా ఈ పంటలను సాగుచేస్తున్న రైతాంగాన్ని ఇతర పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఇచ్చిన నివేదికలను అంచనా వేస్తూ రాష్ట్రంలో ఏ పంట ఏయే ప్రాంతాల్లో సాగు చేయాలనే విషయమై సీఎం కేసీఆర్ భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారంగా ఏయే జిల్లాల్లో ఎంత పంట సాగు చేస్తున్నారు? మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో ఏ జిల్లాల వాటా ఎంత ఉంటోంది? ఏయే జిల్లాల్లో పంట మార్పిడి విధానాలు అవసరమవుతాయనే దానిపై వ్యవసాయశాఖతోపాటు ఆ రంగానికి చెందిన నిపుణులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. పంటలవారీగా ప్రభుత్వ ఆలోచన ఇలా.. పత్తి: అధికారిక లెక్కల ప్రకారం గతేడాది వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ ఈ వానాకాలం సీజన్లో దీన్ని 65.70 ఎకరాలకు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా 3–4 అంశాలు కారణమవుతున్నాయి. నాణ్యత ఆధారంగా దేశంలో ఎంత పత్తి పండినా కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికితోడు ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కుల తయారీకి పత్తి అనుబంధ ఉత్పత్తులు అవసరం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ పంటకు డిమాండ్ వస్తోంది. దుస్తుల తయారీకి 64 శాతం, గృహాలంకరణలకు 28 శాతం, పారిశ్రామిక వినియోగానికి 8 శాతం పత్తి అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే డిమాండ్ ఆధారంగా పత్తి సాగును ఈసారి 11.25 లక్షల ఎకరాల్లో అదనంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. పప్పు ధాన్యాలు (కంది): దేశంలో పప్పుధాన్యాల వార్షిక వినియోగం 27–28 మిలియన్ టన్నులుకాగా 2019–20 వ్యవసాయ సంవత్సరంలో 23 మిలియన్ టన్నుల దిగుబడి జరిగింది. దేశవ్యాప్తంగా అవసరమైన మరో 5.6 లక్షల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో పప్పుధాన్యాల డిమాండ్‌కు, దిగుబడికి భారీ తేడా కనిపిస్తోంది. ఏటా రాష్ట్రంలో 11.7 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరమవగా కేవలం 5.6 లక్షల టన్నుల దిగుబడే వస్తోంది. దీంతో పప్పుధాన్యాల సాగు పెంచాలని, ముఖ్యంగా రాష్ట్ర భౌగోళిక, సాగునీటి పరిస్థితులకు అనుగుణంగా కంది సాగును ప్రోత్సహించాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వానాకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగు చేపట్టగా ఈసారి దాన్ని 15 లక్షల ఎకరాలకు పెంచాలని యోచిస్తోంది. పామాయిల్: ఏటా రూ. 69 వేల కోట్ల విలువైన పామాయిల్ దిగుమతులు దేశానికి వస్తున్నాయి. ఇండోనేసియా, మలేసియాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశానికి అవసరమైన మరో 9–10 మిలియన్ టన్నుల పామాయిల్ కావాలంటే ప్రస్తుతం సాగవుతున్న దానికంటే 70 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 3 లక్షల ఎకరాల్లోనే ఇది సాగవుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 48,594 ఎకరాల్లో 9,929 మంది రైతులే పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు చేపట్టిన నాలుగో ఏడాది నుంచి ఎకరానికి రూ. 82 వేల నుంచి రూ. 1.23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ నాలుగేళ్లలో పత్తి, మిరప, పసుపు, కంది, సోయాబీన్, శనగ, పెసరలతోపాటు ఇతర కూరగాయలను సాగు చేసుకోవచ్చు. వెదురు, చందనం లాంటి గట్టు పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రూ. 130.90 కోట్ల వ్యయంతో 50 వేల ఎకరాల్లో రాష్ట్రంలో పామాయిల్ సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సాగవుతున్న 50 వేల ఎకరాలను లక్ష ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. నూనెగింజలు: ప్రపంచంలో 90 శాతం ఆముదం నూనె మన దేశంలోనే ఉత్పత్తి అవుతోంది. దేశం ఉత్పత్తి చేసే ఆముదం నూనెలో 75 శాతం గుజరాత్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్రంలో వనపర్తి, నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే దీన్ని సాగుచేస్తున్నారు. ప్రస్తుతం సాగవుతున్న దానికన్నా అదనంగా 1.4 లక్షల ఎకరాల్లో ఆముదం సాగుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో సాగవుతున్న 0.65 లక్షల ఎకరాలను కనీసం 1.50 లక్షల ఎకరాలకు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. వరి: రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం అభివృద్ధి చెందడంతో వరి సాగు ఎక్కువవుతోంది. 2019 వానాకాలంలో ఏకంగా 41.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే ఈసారి దాన్ని 40 లక్షలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనూ 25 లక్షల ఎకరాల్లో ఫైన్ వెరైటీ ధాన్యం, మరో 15 లక్షల ఎకరాల్లో ముతక వెరైటీలను సాగు చేయించాలనుకుంటోంది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఏడాదికి 90 లక్షల టన్నుల ధాన్యం అవసరంకాగా 2019–20లో ఏకంగా 1.93 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. అదే విధంగా ఏడాదికి సరిపడా మొక్కజొన్న నిల్వలు ఉన్నందున ఈ పంట సాగు చేయకుండా రైతులకు నచ్చచెప్పాలని, ఈ పంట సాగు చేస్తున్న రైతులకు పంటమార్పిడి విధానంపై ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జొన్నలు, సజ్జలతోపాటు కందులు, పెసల వంటి పప్పుధాన్యాలు, పత్తి, వేరుశనగ లాంటి నూనెగింజల సాగును ప్రోత్సహించాలని యోచిస్తోంది. -
సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదుగా
సాక్షి, పెదవేగి (పశ్చిమ గోదావరి) : వరినాట్ల సమయంలో రహదారుల వెంట ఎక్కడ చూసినా ప్రధానంగా వరినారు పట్టుకుని వాహన చోదకులను ఆపి, సొమ్ములు వసూలు చేయడం కన్పించేది . ఇది గోదావరి జిల్లాల్లో సంప్రదాయంగా వస్తోంది. గతంలో వరినాట్ల సమయంలో బావ వరస అయ్యేవారు చేలోకి వస్తుంటే మరదలి వరుస అయ్యేవారు ఆపి, పసుపు, కుంకుమలకు సొమ్ములు ఇవ్వాలని పట్టుబట్టేవారు. అయితే ఇది కేవలం చేలగట్లకే పరిమితం అయ్యేది. కానీ ఈ విధానం ప్రస్తుతం రోడ్డెక్కింది. వచ్చేది ఎవరన్నది పక్కన పెట్టి వాహనాలను నిలిపేసి, బలవంతంగానైనా సొమ్ములు వసూలు చేస్తున్నారు. కొంతవుంది ఇష్టపూర్వకంగా ఇస్తున్నా, ఇంకొందరు తప్పక ఇస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వెళ్తున్న వాహనాలను ఆపుతున్న సందర్భాల్లో ఒక్కోసారి ప్రవూదాలు కూడా జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటో, కార్లు, ట్రాక్టర్ల వంటివాటిని కూడా ఆపి సొమ్ములు వసూలు చేస్తున్నారు. వచ్చిన సొమ్మును కూలీలంతా సమానంగా తీసుకుంటుంటారు. సంప్రదాయమే అయినా బలవంతంగా వసూలు చేయకుండా ఉంటే బాగుంటుందని వాహనచోదకులు పేర్కొంటున్నారు. -
పల్నాటి రైతుల కన్నీటి కష్టాలు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావుకు 16 ఎకరాల భూమి ఉంది. అందులో మిర్చి, పత్తి పంటలు వేశాడు. వర్షాలు కురవకపోవడంతో ఎనిమిది బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. నిరుత్సాహపడకుండా 1200 అడుగుల లోతు వరకూ తవ్వించినా ఫలితం శూన్యం. ఎనిమిది బోర్లకు రూ.10 లక్షలు ఖర్చవడంతో అప్పులపాలై మూడెకరాల భూమిని అమ్మి అప్పు తీర్చాడు. నీరు పడకపోవడంతో 13 ఎకరాల్లోని పంటలు ఎండిపోయి మరో రూ.10 లక్షల వరకూ నష్టం వచ్చింది. అప్పులు తీర్చేందుకు తిరిగి మరో మూడెకరాలు బేరం పెట్టాడు. అయితే అప్పటికే పల్నాడులో కరువు విలయతాండవంతో భూముల ధరలు సగానికి పడిపోయాయి. పొలాలు అమ్ముకునేవారు తప్ప కొనేవారులేక వడ్డీలు పెరిగిపోతున్నాయని కన్నీటిపర్యంతమవుతున్నాడు. వెల్దుర్తి మండలం పాపిరెడ్డికొండ తండాకు చెందిన చిన్నా నాయక్ తన మూడెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. తీవ్ర వర్షాభావంతో పొలంలో ఉన్న ఒక్క బోరు ఎండిపోయింది. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటం చూడలేక ఇటీవల రెండు కొత్త బోర్లు వేశాడు. 1000 అడుగులకు పైన తవ్వినా నీరు పడలేదు. దీనికోసం రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టాడు. మరోవైపు పంట పెట్టుబడికి చేసిన అప్పులు, పిల్లల బడి ఫీజులు తడిసిమోపిడయ్యాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక పొలం అమ్మకానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నాడు. సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వించి భూగర్భ జలాలను పైకి తెచ్చామని, తద్వారా కరువును జయించామని సీఎం చంద్రబాబు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులు 1000–1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడటం లేదు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా.. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి, నూజెండ్ల, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పులపాలవుతున్నారు. ఒక్కో రైతు ఐదు బోర్లు వేసినా.. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామ రైతులు తమ పొలాల్లో ఉన్న బోర్లు ఎండిపోవడంతో ఈ ఏడాది మరో 300 వరకూ కొత్త బోర్లను వేశారు. వీటిలో 5 శాతం బోర్లలో కూడా నీరుపడలేదు. కొందరు తమ పొలాల్లో 5–10 వరకూ బోర్లు వేసినా నిరాశే ఎదురైంది. దీంతో రైతులు పంటలు ఎండిపోయి అప్పులపాలై అందినకాడికి పొలాలను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కండ్లకుంట, గుండ్లపాడు, ఉప్పలపాడు, బోదలవీడు, శిరిగిరిపాడు, వెల్దుర్తి వంటి గ్రామాల్లో సైతం వందలాది మంది రైతులు 1000–1200 అడుగుల మేర బోర్లు వేసినా చుక్క నీరూ పడకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఒక్క వెల్దుర్తి మండలంలోనే బోర్లకు సుమారు రూ.20 కోట్ల వరకూ రైతులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలో 12 వేల హెక్టార్లలో పత్తి, 4 వేల హెక్టార్లలో మిర్చి, 500 ఎకరాల్లో కంది పంటలను రైతులు సాగు చేశారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రూ.200 కోట్ల మేర నష్టపోయారని అంచనా. ఒక్క మండలంలోనే ఇంత నష్టం వాటిల్లితే పల్నాడు ప్రాంతంలోని మిగతా మండలాల్లో సంభవించిన నష్టం వేల కోట్లలో ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మండిపడుతున్న రైతు సంఘాలు గుంటూరు జిల్లాలో సాగర్ చివరి ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి సైతం దుర్భరంగానే ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు, నడింపాలెం, పాతమల్లాయపాలెం, కోయవారిపాలెం రైతులు ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నారు. కృష్ణా నది నిండా నీళ్లున్నా సాగుకు నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి దుర్భిక్షం ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వోల్టా చట్టంపై అవగాహన కల్పించని ప్రభుత్వం వోల్టా కమిటీలను ఏర్పాటు చేసి వోల్టా చట్టంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుండటం వల్లే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చట్టం ప్రకారం.. రైతు బోరు వేయాలనుకుంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు డీడీ చెల్లించి భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయించాలి. రెండు బోరు బావుల మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలి. అలా ఉందా? లేదా? అనేది తహసీల్దార్ నిర్ధారణ చేసుకున్నాక క్షేత్ర స్థాయి పరిశీలన కోసం జిల్లా భూగర్భ జలశాఖకు రిఫర్ చేయాలి. జియోహైడ్రాలజిస్ట్ సదరు భూమిలో నీటి లభ్యతను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తెలుసుకుని.. నీటి లభ్యత ఉంటే బోరు బావి తవ్వుకోవడానికి అనుమతి ఇస్తారు. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా దగ్గర దగ్గర బోర్లు వేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ముప్పాళ్ల నాగేశ్వరరావు, చిన్నా నాయక్‌ల పరిస్థితే కాదు.. అక్కడ ఏ రైతును కదిల్చినా క‘న్నీటి’ గాథలే. పక్కనే కృష్ణానది పారుతున్నా పంటలకు నీరందని దుస్థితి. కనీసం బోర్లుతోనైనా పంటలు సాగు చేసుకుందామనుకుంటే అడుగంటిన భూగర్భ జలాలు పైకి రానంటున్నాయి. ఇవన్నీ కరువు జిల్లా అయిన అనంతపురంలో అనుకుంటే పొరపాటే. ‘విశ్వనగరం’ అమరావతి కొలువైన గుంటూరు జిల్లా పల్నాడులో రైతులు పడుతున్న కన్నీటి కష్టాలు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న కరువుపై ప్రత్యేక కథనం.. -
కనికరం ఏది?
-
రుణమే యమపాశమై..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మీదేవీ నాయుడు చిన్న రైతు. తొలకరిలో కురిసిన వర్షంతో పత్తి, మిర్చి సాగు చేశారు. ఆ తర్వాత వరుణదేవుడు ముఖం చాటేయడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనికరం లేని పాలకులు మొఖం చాటేశారే కానీ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం భేతాళపురం గ్రామానికి చెందిన దున్న లక్ష్మీనారాయణ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట తిత్లీ తుపానుకు ధ్వంసమైంది. ప్రభుత్వం నుంచి ఆయనకు నయా పైసా సాయం అందలేదు. అప్పుల భారం పెరిగి బతుకు భారమై పంట చేలో శవమై తేలాడు. సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రైతన్నలు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పెదకడబూరుకు చెందిన రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ రైతు తనువు చాలించగా ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ప్రకాశం జిల్లాలోనూ ఓ యువరైతు వరుసగా మూడేళ్ల పాటు అప్పుల పాలు కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరువు ప్రాంతాలకు వెళ్లని సీఎం.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇటీవల అన్నదాతల చావుకేకలతో మార్మోగుతోంది. పంట పొలాలు మరుభూములుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారుతోంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడం, అరకొర మాఫీ వడ్డీలకే సరిపోక బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు చనిపోతుండగా అననుకూల పరిస్థితుల్లో పంట పండించినా గిట్టుబాటు ధర రాక మరికొందరు, ప్రైవేట్ వ్యాపారుల నుంచి 4 – 5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి సంక్షోభంలో చిక్కుకుని ఇంకొందరు రైతులు మరణిస్తుంటే ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, పంటల బీమాను పట్టించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ధరలలో వ్యత్యాసం కింద ఇస్తామని ప్రకటించిన స్థిరీకరణ నిధుల్ని గానీ, మొక్కజొన్న, కంది, మిర్చికి ఇస్తామన్న బోనస్ మొత్తాల్ని గానీ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. పంటల సాగుబడి వ్యయం భారీగా పెరిగినా, వరుస కరువులు, తుపాన్లు వెంటాడుతున్నా సర్కారు కనికరం చూపడం లేదు. రైతు ఆత్మహత్యల్ని గుర్తిస్తే ఎక్కడ సాయం ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టు వృద్ధి రేటుపై గొప్పలు చెబుతోంది. నాలుగున్నరేళ్లుగా వరుస కరువులు, ప్రకృతి విపత్తులు, తుపాన్లతో రైతులు కకావికలమై ఊళ్లకు ఊళ్లు వలస వెళుతున్నా ప్రభుత్వం మొండిచెయ్యే చూపుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లలో ఇంతవరకు నయాపైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆత్మహత్యల నివారణకు చొరవ చూపించి రైతన్నల్లో మనోధైర్యం నింపాల్సిన ముఖ్యమంత్రి కనీసం కరువు పీడిత జిల్లాల్లో పర్యటించకపోవడం దురదృష్టకరమని వ్యవసాయ రంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు. కనికరం ఏది? రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి కేవలం 347 మండలాలను రాష్ట్ర ప్రభుత్వమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. వాస్తవానికి అన్ని మండలాల్లోనూ కరువు తాండవిస్తోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అయితే కరువు ప్రాంతాలను ప్రకటించారే గానీ కరువు మాన్యువల్ ప్రకారం ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలను ప్రకటించలేదు. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.2 వేల కోట్లను పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు. పంటల బీమా లెక్కల్ని ఇంతవరకు తేల్చలేదు. ఫలితంగా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా తగ్గిపోతోంది. రబీలో మొత్తం సాగు విస్తీర్ణం 23.43 లక్షల హెక్టార్లకుగానూ ఇప్పటి వరకు సగం ప్రాంతంలో కూడా విత్తనాలు పడలేదు. మరో వారంలో సీజన్ కూడా ముగియబోతోంది. రెండు సీజన్లలో కలిపి రైతులు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయినట్టు అనధికార అంచనా. వడ్డీకీ చాలని మాఫీ 2014లో చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.15,038 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో వారికి సకాలంలో రావాల్సిన ఏ రుణమూ అందకుండా పోయింది. వారికి కొత్తగా అప్పులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చి సాగు చేసి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. బీమా పరిహారానికీ మొండిచెయ్యి కరువుల్ని జయించానని, సముద్రాలను గెలిచానని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు రైతుల ఇక్కట్లను పట్టించుకోకుండా అభివృద్ధి రేట్లంటూ అంకెల గారడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయాభివృద్ధి రేటు 16.55 శాతంగా నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పుకోవడం గమనార్హం. ఒకవైపు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. కనీస మద్దతు ధరలకు మార్కెట్ ధరలకు ఎటువంటి పొంతన లేకుండా పోయిందనే దానికి రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే వరే ప్రత్యక్ష నిదర్శనం. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1750 ఉంటే రూ.1,100 – రూ1,200 మించి ఎవరూ కొనడం లేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుపోయి మరోమార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిపై హైకోర్టు సైతం ఇటీవల స్పందిస్తూ.. రైతులు కష్టాలు చెప్పుకునేందుకు ఓ చట్టబద్ధ సంస్థ ఉండాలని సూచించినా టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు చంద్రన్న రైతు బీమా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షలను సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతూ అన్నదాతల ఆత్మహత్యలను గుర్తించడానికే ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో రైతుల్లో మనోధైర్యం నింపేలా చేయడమే తక్షణ కర్తవ్యమని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. బాబు గద్దెనెక్కాక వేలల్లో రైతుల బలవన్మరణం.. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,635 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వ్యవసాయ రంగంపై కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2014లో ఏపీలో 164 మంది (వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను కలపలేదు. వారిని కూడా కలిపితే 570 మందికి పైగా ఉంటారని అంచనా) అన్నదాతలు చనిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనా వేసింది. 2015లో ఆ సంఖ్య 916 (వీరిలో రైతులు 516 మంది)కి పెరిగింది. 2016లో ఏపీలో 804 మంది (వీరిలో కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు) ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. 2017 నుంచి ఆ సంస్థ రైతుల చావుల్ని నమోదు చేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. అంటే సగటున ఏటా రాష్ట్రంలో 7 వందల మంది రైతులు చనిపోతున్నారు. దీని అర్థం రాష్ట్రంలో పూటకో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టని, ఈ నాలుగేళ్లలో 2,650 మంది చనిపోయారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 46 మంది, అనంతపురం జిల్లాలో 44 మంది ఉన్నారు. అప్పుల భయంతో కుమిలిపోయాడు.. మాకు సేద్యం తప్ప వేరే ఆధారం లేదు. రెక్కలు విరిగేలా కష్టపడ్డా గట్టెక్కలేకపోయాం. అప్పుల భయానికి నా బిడ్డ ఎంతో కుమిలిపోయేవాడు. దీనికి అనారోగ్యం కూడా తోడవడంతో ప్రాణం తీసుకున్నాడు. చిన్నారులు అనాథలయ్యారు. అన్యాయం జరిగిపోయింది నాయనా.. – నాగన్న (మృతుడు పెద్ద రంగన్న తండ్రి) పెద్ద దిక్కును కోల్పోయాం.. మా ఇంట్లో అమ్మనాన్న తర్వాత కుటుంబ భారాన్ని మా అన్నే భుజాన వేసుకున్నాడు. సేద్యం చేస్తూ మమ్మల్ని బతికిస్తూ వచ్చాడు. పంటలు పండక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యాం. ప్రాణాలు తీసుకోవడానికి అప్పులే ప్రధాన కారణం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయాం. – చిన్న రంగన్న (మృతుడి తమ్ముడు) కరువు మండల మైనా ఏం లాభం? గత సెప్టెంబర్‌లో పెద్దకడబూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేదు. వరుస కరువులతో చితికిపోయిన తమను ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా కానరాక యువరైతు పెద్ద రంగన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. – వెంకటేశ్వర్లు, రైతు యువరైతు బలి యర్రగొండపాలెం: వరుసగా మూడేళ్లు పాటు పంటలు పండక అప్పుల పాలు కావడం, రుణం తీర్చే దారి కానరాక ప్రకాశం జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యర్రగొండపాలెం మండలం పందివానిపల్లెకు చెందిన గోపు వెంకటరెడ్డి (35) తనకున్న 1.22 ఎకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అదునులో వర్షాలు కురవకపోవడం, పొలంలో బోర్లు ఎండి పోవడంతో మిరప పంట చేతికి అందలేదు. తక్కువ నీటితో సాగు చేద్దామని మొక్కజొన్న వేసినా తెగులు సోకడంతో హతాశుడయ్యాడు. గత మూడేళ్లుగా పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీరకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరగడంతో మానసిక వ్యధకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం తన ముగ్గురు పిల్లలను పుల్లలచెరువు మండలం సి.కొత్తపల్లిలోని అత్త వారి ఇంట్లో అప్పగించి భార్యతో కలసి వరి కోతల కోసం గుంటూరు జిల్లా కారంపూడికి వెళ్లాడు. అక్కడ పని చేయలేక ఒంటరిగా తిరిగొచ్చాడు. అనంతరం పనులు ముగించుకొని పుట్టింటికి చేరుకున్న భార్య అంజమ్మ మంగళవారం ఉదయం భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పొరుగు వారికి ఫోన్ చేసింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా వెంకటరెడ్డి చీరతో ఉరి వేసుకొని చనిపోయినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం తరువాత వెంకటరెడ్డి గ్రామంలో కనిపించ లేదని, బహుశా అదే రోజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల వయసున్న కుమారుడు శివారెడ్డితోపాటు 9, 7 సంవత్సరాల వయసున్న కుమార్తెలు సుచిత్ర, లక్ష్మి ఉన్నారు. ఉసురు తీసిన అప్పులు.. వెంకటరెడ్డికి దాదాపు రూ.6 లక్షల మేర అప్పులు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. 2016లో యర్రగొండపాలెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మృతుడు రూ.1.10 లక్షలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిసి ఇది దాదాపు రూ 1.50 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ అప్పులు కూడా ఉండటం, వాటిని తీర్చాలని ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రాణం తీసిన అప్పులు ఆదోని/టౌన్/మంత్రాలయం/పెద్దకడబూరు: సాగు కోసం చేసిన అప్పు యమపాశమైంది. కరువు కుంగదీయగా ఏటా రుణఊబిలో కూరుకుపోవడం అన్నదాత వెన్ను విరిచింది. ఆదుకునే దిక్కు కానరాక ఆ రైతు దంపతులు పురుగుల మందు తాగారు. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. భార్య కళ్లెదుటే పురుగుల మందు తాగడంతో... పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద రంగన్న తన తల్లి నారాయణమ్మ పేరుతో ఉన్న 4.50 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. వర్షాభావం కారణంగా ఏటా నష్టపోవడం మానసికంగా కుంగదీసింది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి? వైద్య చికిత్స కోసం డబ్బు ఎక్కడి నుంచి తేవాలనే విషయంపై భార్య సరస్వతి అలియాస్ పద్మతో సోమవారం రాత్రి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బంధువులు వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పినా పెద్దరంగన్న బలవన్మరణమే శరణ్యమని భావించాడు. మంగళవారం ఉదయం మిరప పంటను మార్కెట్‌కు తరలించేందుకు బస్తాల్లో సిద్ధం చేసిన అనంతరం ఇంటికి చేరుకుని భార్య ఎదుటే పురుగుల మందు తాగాడు. దీంతో పెద్ద రంగన్న భార్య కూడా పురుగుల మందు డబ్బాను లాక్కుని బలవంతంగా తాగింది. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్దరంగన్న చనిపోగా పద్మ పరిస్థితి విషమంగా ఉంది. పెద్దరంగన్న మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దంపతులకు పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెట్టుబడులు మట్టిపాలు.. నిరుడు ఖరీఫ్‌లో ఉల్లి 90 బస్తాల దాకా దిగుబడి వచ్చినా ధరలు లేకపోవడంతో పెద్దరంగన్న దాదాపు రూ.40 వేల వరకు నష్టపోయాడు. ఎకరం పొలంలో వేసిన మిరపకు జెమిని వైరస్ సోకడంతో రూ.2 లక్షలు దాకా పెట్టుబడి మట్టి పాలైంది. వర్షాభావం, గులాబీరంగు పురుగు ఆశించడంతో పత్తి కూడా దెబ్బ తింది. దీంతో మూడు ఎకరాల్లో పత్తి పంటను గొర్రెల మేత కోసం వదిలేశాడు. పెద్ద రంగన్న స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 2016లో పంట రుణం రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం వడ్డీతో కలిపి అప్పు దాదాపు రూ.1.80 లక్షలకు చేరుకుంది. ఇది కాకుండా బయట మరో రూ.4 లక్షల మేరకు అప్పు చేశాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అఖిల (7), అజయ్ (5), ఓంకార్(3) ఉన్నారు. చెట్టంత కొడుకు తన కళ్లెదుటే శాశ్వతంగా కళ్లు మూయగా కోడలు మృత్యువుతో పోరాడుతుండటాన్ని చూసి పెద్ద రంగన్న తల్లిదండ్రులు నాగన్న, నారాయణమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఖరీఫ్ సాగు 52 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 56.74 లక్షల ఎకరాలు సాగు కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే కాస్త తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటల్లో అత్యధికంగా పత్తి విస్తీర్ణమే ఉండటం గమనార్హం. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగు చేయడం గమనార్హం. కంది సాధారణ సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న ఇప్పటివరకు 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో నార్లు పోశారు. ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి. -
ఆకు పచ్చని బంగారం!
వెదురు.. పేదవాడి కలప! ఆర్థికపరంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అభివృద్ధికి దోహదపడే పంటగా వెదురు గుర్తింపు పొందింది. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇది మంచి సాధనం. అందుకే దీన్ని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం) అని పిలుస్తుంటారు. పంటల సాగుకు తగినంత సారం లేని భూములు, అటవీయేతర ప్రభుత్వ భూములు వెదురు తోటల సాగుకు అనుకూలం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బాంబూ మిషన్’ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో 1,05,000 హెక్టార్లలో వెదురు తోటల సాగే లక్ష్యం. వెదురు రైతులకు మూడేళ్ల పాటు ప్రభుత్వ సహాయం అందుతుంది. నాలుగో ఏడాది నుంచి వెదురు కోతకు వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు.. 60 ఏళ్లపాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో డ్రిప్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘సాగుబడి’ ప్రత్యేక కథనం. వెదురు అనాదిగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందువల్లనే మన పొలంలో పెరిగిన వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరక్కుండా పోయింది. అందుకని, కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మధ్యప్రదేశ్ రైతు వెదురుతోట ఏరియల్ వ్యూ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ‘బాంబూ మిషన్’ను ప్రారంభించింది. ఖర్చులో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించే విధంగా మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ ‘సాగుబడి’ ప్రతినిధితో ముఖాముఖిలో వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి హరిత విస్తీర్ణాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగుకు అంతగా యోగ్యం కాని ప్రైవేటు, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. భూసారం పెద్దగా లేక పడావు పడిన ప్రభుత్వేతర, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. సాగుతోపాటు.. నర్సరీల ఏర్పాటుకు, వెదురుతో అగరొత్తులు, ఫర్నిచర్ వంటి అనేక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కూడా బాంబూ మిషన్ నిధులను సమకూర్చుతున్నది. ఈ కార్యక్రమాల అమలుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెదురు అభివృద్ధి సంస్థ(బి.డి.ఎ.) రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు వెదురు జాతులు అనుకూలం! వెదురును వాణిజ్యపరంగా సాగు చేయదలచినప్పుడు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ముళ్లు తక్కువగా ఉండి, లావుగా, నిటారుగా పెరిగే రకమై ఉండాలి. 2. రెండు కణుపుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఇటువంటివి ఎక్కువ ధర పలుకుతాయి.ప్రకృతిలో వెదురు జాతులు చాలా ఉన్నప్పటికీ బాంబూసా బాల్కోవా, బాంబూసా టుల్డ అనే రెండు రకాలు రైతులు సాగు చేసి అధికాదాయం పొందడానికి అనువైనవిగా గుర్తించినట్లు డోబ్రియల్ తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వెదురును ఇప్పటికే రైతులు కొందరు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఇటీవల ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఏయే వెదురు రకాలు మేలైనవో గుర్తించింది.నీరు నిలవని ఎర్ర నేలలు వెదురు సాగుకు అనుకూలం. మధ్యప్రదేశ్‌లో కొందరు రైతులు నల్లరేగడి భూముల్లో (4“4 మీ. దూరంలో) సాగు చేస్తున్నారు. భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. అయితే, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. వెదురు తోటలు నాటిన నాలుగో ఏడాది నుంచి బొంగులను నరకవచ్చు. అప్పటి నుంచి సుమారు 60 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వెదురు తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.తప్పనిసరిగా డ్రిప్‌ను ఏర్పాటు చేసుకొని.. తగినంత ఎరువులను అందిస్తే.. భూసారం అంతగా లేని భూముల్లోనూ వెదురు సాగు ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిన భూముల్లో అయితే ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు వెడల్పు, మీటరు లోతులో పొలం అంతటా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలకు కందకాల నుంచి పొంగిపొర్లే నీటిని కూడా పొదివి పట్టుకోవడానికి నీటి కుంటలు తవ్వుకోవచ్చు. బాంబూసా టుల్డ రకం ఇది థాయ్‌లాండ్‌కు చెందిన రకం. చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలలో సాగులో ఉంది. దీన్ని భవన నిర్మాణ రంగంలోను, పేపర్ మిల్లుల్లోను ఎక్కువగా వాడుతున్నారు. బొంగులు ఆకుపచ్చగా 5–10 సెం.మీ. లావుతో 7–23 మీటర్ల ఎత్తున పెరుగుతాయి. కణుపుల మధ్య 40–70 సెం.మీ. దూరం ఉంటుంది. కింది వైపు కణుపులకు పీచు వేళ్లు ఉంటాయి. బాల్కోవా రకానికి పెద్దపీట బాంబూసా బాల్కోవా రకం వెదురు నున్నగా అందంగా, ఆకు పచ్చగా, లావుగా, నిటారుగా ఎదుగుతుంది. బొంగులు 12–20 మీటర్ల ఎత్తున, 8–15 సెం.మీ. లావున ఎదుగుతాయి. కణుపుల మధ్య 20–40 సెం.మీ. లావున ఎదుగుతాయి. మన దేశంతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో బాల్కోవా రకం కనిపిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఈ రకం వెదురు ఎక్కువగా సాగులో ఉంది. దీని మొలకలు ఆహారంగా తీసుకోవచ్చు. భవన నిర్మాణంలో, బుట్టలు, తడికెలు వంటివి అల్లడానికి ఈ వెదురు బాగుంటుంది. 5 లక్షల టిష్యూకల్చర్ మొక్కలు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 5 లక్షల బాంబూసా బాల్కోవా రకానికి చెందిన నాణ్యమైన టిష్యూకల్చర్ మొక్కలను కనీసం వెయ్యి మంది రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తామన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలకు 100%, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50% సబ్సిడీ ఇస్తారు. వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి.. బీళ్లుగా ఉన్న భూముల్లో పచ్చని చెట్లు ఏడాది పొడవునా పెరుగుతూ ఉంటే.. భూతాపం తగ్గడానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక ఉపాయంగా వెదురు సాగును ఇండోనేషియా వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎకరానికి రూ. లక్ష ఆదాయం అంచనా కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసు మొక్కలను నాటుకోవాలి. వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్ల(4“3)దూరంలో నాటుకోవచ్చు. ఎకరానికి 330 మొక్కలు నాటి డ్రిప్‌తో ఎరువులు, నీరు తగినంతగా అందిస్తే.. నాలుగేళ్లలో రూ. 4 లక్షల ఖర్చవుతుంది. నాలుగేళ్ల తర్వాత కుదురుకు 8 చొప్పున సుమారు 2,640 బొంగులు వస్తాయి. బొంగు రూ. 50 చొప్పున ఎకరానికి రూ. 1,32,000 ఆదాయం వస్తుంది. బొంగు బరువు 15 కిలోల చొప్పున 60 వేల కిలోల వెదురు ఉత్పత్తవుతుందని భావిస్తున్నట్లు తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ తెలిపారు. ఆ తర్వాత ఎకరానికి ప్రతి ఏటా రూ. 25 వేలు ఖర్చవుతుంది. ఎకరానికి ఏటా ఆదాయం రూ. లక్ష వస్తుందని అంచనా వేస్తున్నారు. వెదురు బొంగుల నుంచే మొక్కలు! వెదురు మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునే సులువైన మార్గం ఇది. వెదురు గింజలు మొలవడానికి చాలా రోజులు పడుతుంది. అన్ని గింజలూ మొలవకపోవచ్చు. కాబట్టి, పచ్చి బొంగులను భూమిలో పాతి పెట్టి 60 రోజుల్లో మొక్కలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కేంద్రీయ అటవీ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఎ.ఆర్. అనుబంధ సంస్థ) శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఒక పచ్చి వెదురు బొంగుతో 165 మొక్కలను తయారు చేసుకోవడం మేలని ఐ.సి.ఎ.ఆర్. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒక ఏడాది, మూడేళ్ల బొంగుల కన్నా రెండేళ్ల బొంగులతోనే నాణ్యమైన ఎక్కువ మొక్కలు పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. బాంబూసా వల్గారిస్ అనే వెదురు రకం సాగుకు అనువైనదని వారు చెబుతున్నారు. మట్టి తవ్వి పచ్చి బొంగులను ఉంచి.. వాటిపైన.. మట్టి (ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన) మిశ్రమాన్ని 3 సెం.మీ. మందాన వేయాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా తడుపుతూ ఉండాలి. కణుపుల దగ్గర నుంచి 14వ రోజు నుంచి మొలకలు రావడం మొదలై 35 రోజుల్లో పూర్తవుతుంది. ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మాత్రమే మొలకలు, వేర్లు మొలుస్తాయి. బొంగును మట్టిలో పాతిపెట్టిన 60 రోజులకు మొలకలను బొంగు నుంచి వేరు చేయవచ్చు. బొంగుకు ఇరువైపులా మట్టిని జాగ్రత్తగా తీసివేసి మొక్కలను సికేచర్తో కత్తిరించి సేకరించాలి. మట్టి మిశ్రమాన్ని నింపిన పాలిథిన్ బ్యాగులలో మొక్కలను పెట్టి, పెంచుకోవాలి. కనీసం ఆరు నెలల మొక్కలనే పొలంలో నాటుకోవాలి. పొలం చుట్టూ గట్లపైన పచ్చి బొంగులను భూమిలో పాతి పెడితే.. మొలకలు వస్తాయి. వాటిని అలాగే పెరగనిస్తే చాలు. అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి వెదురు జీవ కంచెను ఇలా పెంచుకోవచ్చు. 1. బాంబూసా వల్గారిస్ వరి రకం బొంగులు భూమిలో పాతిన 28 రోజులకు పెరిగిన మొలకలు. 2. బొంగులో ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మొలకలు, వేర్లు వచ్చిన దృశ్యం 3. బొంగు మొదలు దగ్గరలో ఉన్న కణుపుల్లో వేర్లు వస్తాయి కానీ మొలకలు రావు. 4. పాలిథిన్ బ్యాగ్‌లలో నాటిన బాంబూసా వల్గారిస్ మొక్కల – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కదలే చైతన్యం రైతు పెద్దమ్మ!
బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదుగుతుందనడానికి రాజ్‌కుమార్ దేవి జీవితమే నిలువుటద్దం. బీహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పుర్ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేసింది. ఆమె 30 ఏళ్ల క్రితం పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు అక్కడి వారికి తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఆమెను అనుసరించారు. వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది. ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. బహుళ పంటల సాగుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం ద్వారా గ్రామీణ మహిళల జీవితాలలో మార్పు తేవచ్చని లోకానికి చాటిచెబుతున్న ఈ ‘రైతు పెద్దమ్మ’కు ఎవరైనా జేజేలు పలకవలసిందే! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తింటున్న నీరెంత ?
నీరు.. ఆహారమే జగతిలో ప్రతి జీవి మనుగడకూ ఆధారం... మనం తినే ఆహారం ఏదైనా..ఆ మాటకొస్తే వేసుకునే వస్త్రమైనా... అంతా నీటి మయమే! ఏ ఆహార పదార్థం తయారు కావాలన్నా నీరు చాలానే ఖర్చవుతుంది. ఏయే ఆహార పదార్థాలకు ఎంతెంత నీరు ఖర్చవుతుందన్నది ప్రశ్న! దీని గురించి శాస్త్రీయంగా తెలియజెప్పేదే ‘వాటర్ ఫుట్‌ప్రింట్’! ఇదంతా ఎందుకూ అంటే..? భూతాపం పెరిగి వాతావరణం అనూహ్యంగా మారిపోతూ ఉంది.. ప్రకృతిలో మమేకమై ఉండే అన్నదాతలకు కూడా పంటల సాగు కత్తి మీద సాములాగా మారిపోతూ ఉంది.. భూతలమ్మీద నీటి లభ్యత నానాటికీ తగ్గుతుంటే, జనాభా మటుకు పెరుగుతూ ఉంది.. మనందరమూ ‘ఆహార నీటి’ చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది. అంటే.. ఎక్కువ నీటితో పండే ఆహారంపై నుంచి మనసు మళ్లించి... ఆహార వృథాను అరికట్టాలి. తక్కువ నీటితో పండే సమతుల్య ఆహారం వైపు దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు వస్తున్నాయి.. 5,000–7,000 వేల లీటర్ల సాగు నీటితో పండే కిలో వరి బియ్యం కన్నా.. ఇందులో సగం నీటితోనే.. అది కూడా కేవలం వాన నీటితోనే పండే చిరుధాన్యాలు నిజంగా సిరిధాన్యాలే కదా.. తినే వారిలో ‘ఆహార నీటి’ చైతన్యం వస్తే... పండించే వారిలోనూ వస్తుంది! అప్పుడిక ఆహార, పౌష్టికాహార భద్రతకు ఢోకా ఉండదు!! ఏ పంటకైనా లేదా ఏ ఆహార పదార్థానికైనా ఎంత నీరు ఖర్చవుతుందంటే ఠక్కున సమాధానం చెప్పడం అంత సులువేమీ కాదు. ఏయే పంటకు ఎంతెంత నీరు ఖర్చు అవుతుందనే విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆయా దేశ, కాల, వాతావరణ, భూమి స్థితిగతులను బట్టి.. ఇంకా చెప్పాలంటే, సాగు పద్ధతిని బట్టి.. ఉత్పాదకతను బట్టి కూడా నీటి ఖర్చు మారిపోతూ ఉంటుంది. కాబట్టి, కిలో వరి బియ్యం పండించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చయ్యే నీటికీ, అమెరికాలో ఖర్చయ్యేనీటికీ, చైనాలో ఖర్చయ్యే నీటికీ మధ్య చాలా వ్యత్యాసమే ఉంటుంది. ఏటేటా భూతాపం, ఉష్ణోగ్రత, వాతావరణ ఉపద్రవాలు పెరిగిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పౌరులందరూ ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, వినియోగించేటప్పుడు ‘ఆహార నీటి’ చైతన్యంతో వ్యవహరించగలగాలి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఆహార భద్రత, పౌష్టికాహార భద్రత సాధించడానికి పాలకులు, ప్రజలు అందరూ ‘ఆహార నీటి’ చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం తరుముకొస్తోంది. ప్రజల్లో, విధాన నిర్ణేతల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నెదర్లాండ్స్‌కు చెందిన ‘వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్’ అనే సంస్థ ప్రపంచ దేశాల్లో వ్యవసాయ, ఆహార గణాంకాలను సేకరించి, క్రోడీకరించి ‘నీటి వినియోగ ముద్ర’(వాటర్ ఫుట్‌ప్రింట్)లను తయారు చేశారు. వర్షపాతం, కాలువ/చెరువుల ద్వారా పెట్టిన సాగు నీరు, బోరు/బావి ద్వారా తోడిన నీరు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయ్యే నీటి ఖర్చును 2011 నాటి గణాంకాల ఆధారంగా లెక్కగట్టారు. ప్రతి ఒక్కరి ఆహారానికి 3,496 లీటర్ల నీటి ఖర్చు! ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషీ తింటున్న ఆహారోత్పత్తికి రోజుకు సగటున 3,496 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తేల్చింది. అయితే, ప్రతి పూటా మాంసం తినే పాశ్చాత్య దేశాలతో పోల్చితే అప్పుడప్పుడూ మాంసం తినే అలవాటున్న భారతీయ పౌరుడు తినే ఆహారానికి ఇంతకన్నా తక్కువే ఖర్చవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. తాగునీరు, ఇంటి అవసరాలకు తలసరి నీటి ఖర్చు రోజుకు 137 లీటర్లు కాగా, అనుదినం వాడే పారిశ్రామిక వస్తువుల నీటి ఖర్చు 167 లీటర్లు.ఆహార నీటి ఖర్చు ప్రపంచ సగటు కన్నా మన దేశంలో తక్కువగానే ఉంది. మొత్తం తలసరి నీటి వినియోగంలో 92% ఆహారోత్పత్తికే ఖర్చవుతున్నదని అంచనా. మన దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అవసరాల నిమిత్తం రోజుకు 3 వేల లీటర్ల నీటిని వాడుతున్నారు. చైనా పౌరులు సగటున రోజుకు 2,900 లీటర్ల నీటిని వాడుతున్నారు. అమెరికా పౌరులు సగటున రోజుకు 7,800 లీటర్ల నీటిని వాడుతున్నారు.ఒక దేశంలో పండించిన పంట లేదా శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తిని మరో దేశంలో ప్రజలు దిగుమతి చేసుకొని తింటూ ఉంటారు. అంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఆహార పదార్థం/ వస్తువు ఎగుమతి అయ్యిందీ అంటే.. నీరే మరో రూపంలో ఎగుమతి అవుతున్నదన్న మాట. ఈ ప్రకారం చూస్తే.. అమెరికన్లు 20% విదేశాల్లో నీటితో తయారైన వస్తువులు, ఆహారాన్ని దిగుమతి చేసుకొని వాడుతుంటే.. చైనీయులు 10%, భారతీయులు 3% వాడుతున్నారు. కిలో వరి బియ్యం ఉత్పత్తికి 5,331 లీటర్లు! ఆహార ధాన్యాల్లో వరి సాగుకు అత్యధికంగా నీరు ఖర్చవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సగటున కిలో వరి ధాన్యం పండించడానికి 1,670 లీటర్లు, కిలో బియ్యం పండించడానికి 2,497 లీటర్ల నీరు ఖర్చవుతున్నదని (2011 నాటి గణాంకాల ప్రకారం) వాటర్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అయితే, మన దేశంలో రెట్టింపు నీరు ఖర్చవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.ఎ.ఆర్.ఐ.–న్యూఢిల్లీ)లోని వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కోకిల జయరామ్ 2007–08లో మన దేశంలో పంటలకు వాడిన నీటిపై అధ్యయనం చేసి.. 2016లో నివేదిక వెలువరించారు. ఆ ప్రకారం.. వరి సాగుకు 1250 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. మన దేశంలో సగటున టన్ను వరి ధాన్యం ఉత్పత్తికి 35,71,900 లీటర్ల నీరు ఖర్చవుతోంది. టన్ను వరి ధాన్యాన్ని మిల్లు ఆడిస్తే 670 కిలోల బియ్యం వస్తాయనుకుంటే.. కిలో వరి బియ్యానికి 5,331 లీటర్ల నీరు ఖర్చవుతోంది. చిరుధాన్యాల దిశగా.. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో వరి సాగవుతున్న ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాల్లో సైతం రానున్న రోజుల్లో పెరిగే 2 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల వరి దిగుబడులు భారీగా తగ్గే పరిస్థితి వస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) అధ్యయనంలో తేలింది. అనివార్యంగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏయూ హెచ్చరించడం గమనించ వలసిన సంగతి. చిరుధాన్యాల సాగుకు 400 ఎం.ఎం. నీరు సరిపోతుంది. అది కూడా వర్షాధారంగానే సాగవుతుంది. సగటున ఎకరానికి 5–10 క్వింటాళ్ల చిరుధాన్యాల బియ్యం దిగుబడి వస్తుంది. శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిన ఉదంతాలున్నాయి. వరితో పోలిస్తే ‘నీటి వినియోగ ముద్ర’ మూడింట రెండొంతులకు తగ్గిపోతుంది. సిరిధాన్యాలను నగర, పట్టణ ప్రాంతవాసులు దైనందిన ప్రధానాహారంగా తీసుకోవడం ప్రారంభిస్తే.. అందరికీ సంతులిత ఆహారం అందుతుంది. ఆధునిక జీవనశైలి జబ్బులను పారదోలడంతోపాటు మెట్ట రైతుల ఆదాయాలూ అనేక రెట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 15,400 లీటర్ల నీరు = కిలో మాంసం! మాంసం ఉత్పత్తి కన్నా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి చాలా తక్కువ నీరు ఖర్చవుతున్నదన్నది నిజం. కిలో పశు మాంసం ఉత్పత్తికి 15,400 లీటర్ల నీరు ఖర్చవుతున్నది. పాశ్చాత్య దేశాల్లో ఆవులను, ఎద్దులను పారిశ్రామిక పద్ధతుల్లో పెంచి మూడేళ్ల వయసులో పశువును వధిస్తే.. ఎముకలు తీసేయగా 200 కిలోల మాంసం వస్తుంది. ఒక్కో పశువు సగటున మూడేళ్లలో 1,300 కిలోల ధాన్యాలతో తయారైన దాణా, 7,200 కిలోల గడ్డి తింటుంది. ఈ ధాన్యాలను పండించడానికి 30 లక్షల 60 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. పశువు మూడేళ్లలో 24,000 లీటర్ల నీరు తాగుతుంది. దీని మాంసాన్ని శుద్ధి చేయడానికి 7 వేల లీటర్ల నీరు ఖర్చవుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పశుమాంసం ఉత్పత్తికన్నా చిన్న జీవాల మాంసం ఉత్పత్తికి తక్కువ నీరు ఖర్చవుతున్నది. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సాగర్ రైతు కన్నీటి సేద్యం!
500 అడుగులకు పడిపోయిన నాగార్జున సాగర్ నీటిమట్టం నీటి విడుదలపై ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి - పొలాల్లో బోర్లు, బావులు తవ్విస్తూ భగీరథ యత్నం - ఇందుకోసం రూ.లక్షల్లో అప్పులు - అయినా సరిగా నీళ్లు పడక ఆందోళన - వర్షాధార పంటలు వేద్దామన్నా భయమే! - అవసరమైనప్పుడు కురవని వానలు - ఆయకట్టులో 90 శాతం భూమి బీడుగానే వదిలేసిన వైనం - నీటి వనరులున్న కొన్ని చోట్ల మాత్రం సాగు మొదలు - రైతుల దైన్యంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన బొల్లం శ్రీనివాస్.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు కష్టకాలం వచ్చింది.. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సరిగా లేక సాగర్‌లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దీనికితోడు ఎగువ నుంచి వరద వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కాలువ నీటి విడుదలపై ఆశలు వదిలేసుకున్న కొందరు రైతులు తమ పొలాల్లో బోర్లు, బావులు తవ్విస్తున్నారు.. మరికొందరు రైతులు వర్షాధార పంటలు వేస్తున్నారు. కానీ పెద్ద సంఖ్యలో రైతులు సాగుచేసే పరిస్థితి లేక భూములను బీడుగా వదిలేశారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న 3.68 లక్షల ఎకరాల ఆయకట్టులో.. ఈసారి ఏకంగా 90 శాతం భూములు బీడుగానే ఉండడం ఆందోళనకరంగా మారింది. మొత్తంగా అటు సాగర్ నీళ్లు రాక.. ఇటు వర్షాలూ సరిగా లేక.. బోర్లు, బావులు తవ్వించినా నీళ్లు పడక.. పంటలు వేసే పరిస్థితి లేక.. వేసిన పంటలను కాపాడుకునే పరిస్థితి లేక.. బోర్లు, బావుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ ఆయకట్టు రైతుల దైన్యంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఇదీ.. రైతుల భగీరథ యత్నం సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై ఆశలు సన్నగిల్లడంతో.. రైతులం తా బోర్లు వేయించడం, బావులు తవ్వించ డాన్ని ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా నల్లగొండలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న 17 మండలాలు, ఖమ్మంలోని 16 మండలాల్లో బోర్లు, బావుల సంఖ్య పెరు గుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 3,79,623 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇటీవల జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లు పెరిగాయి. సాగర్ నీళ్లు వస్తే మొత్తం ఆ నీటితో.. రాకపోతే బోరు, బావుల నీటితో కొద్ది గా పంటలు సాగు చేయవచ్చని రైతులు యోచి స్తున్నారు. నీళ్లు పడకుంటే.. రెండు, మూడు బోర్లు వేస్తూ భగీరథయత్నం చేస్తున్నారు. వర్షాధార పంటలు వేసినా.. సాగర్ నీళ్లు వస్తే వేసిన పంటలు దున్నేసి వరిసాగు చేద్దామని.. నీళ్లు రాకపోతే ఆ పంటలే ఉండిపోతాయని ఆలోచించిన ఆయకట్టు రైతులు.. వర్షాధారంగా పత్తి, పెసర, కంది, జొన్న, సజ్జ పంటలు వేశారు. బోరు, బావుల కింద 20 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 6 వేల ఎకరాల్లో మెట్ట పంటలు వేశారు. ఇక నీళ్లున్న చెరువుల కింద 5 వేల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా లో సాగర్ ఆయకట్టు 3.68 లక్షల ఎకరాలుం టే.. కేవలం 31 వేల ఎకరాల్లో పంటలు సాగుకావడం గమనార్హం. మిగతాదంతా బీడు భూమిగానే ఉంది. ఇటీవలి వర్షాలతో రైతులు పంటల సాగు కోసం దుక్కులను దున్ని పెట్టుకున్నారు. నీళ్లు వచ్చే అవకాశముంటే వెంటనే నారు పోయాలనే యోచనతో ఉన్నారు. కానీ ఇప్పటికీ సాగర్‌లోకి నీటి చేరిక మొదలు కాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. పుష్కరకాలంలో ఇదే తొలిసారి.. పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబ లేశ్వరంలో జన్మించిన కృష్ణా నది.. నాగార్జున సాగర్ వరకు 1,100 కిలోమీటర్లు ప్రయాణి స్తుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నదిలో ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ.. పరీవాహక ప్రాం తంలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ఈసారి సాగర్ నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. వాస్తవానికి ఇంతకుముందు పలుమార్లు నాగార్జున సాగర్‌లో 540 అడుగుల వరకు నీరు తగ్గినా సాగుకు నీటిని విడుదల చేశారు. కానీ ఈసారి విడుదల చేయకపో వడానికి కారణం ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడమే. ప్రస్తుతం నీటిమట్టం 500 అడుగులకు పడిపోయింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయికి నీటిమట్టం తగ్గడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసి ఆ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు పూర్తిగా నిండితేనే.. రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు, అక్కడి నుంచి నాగార్జున సాగర్‌కు నీరు వస్తుంది. సాగర్ ఎండిపోతే ఎలా బతకాలి? ఈ రైతు పేరు మెగావత్ భీంలాల్. అనుముల (హాలియా) మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని పంగోనికుంట తండాకు చెందిన ఈ రైతు రెండెకరాల్లో సాగు చేస్తాడు. ఈసారి సాగర్‌లో నీళ్లు తక్కువగా ఉన్నాయని, పంటలకు నీరిచ్చేది కష్టమేనని తెలుసుకుని పొలంలో బోర్లు వేయించాడు. ముందు వేసిన బోరులో చుక్క నీరు కూడా పడలేదు. తర్వాత వేసిన బోరులోనూ కొన్ని నీళ్లే పడ్డాయి. బోరు వేయించేందుకు కొత్తపల్లిలోని నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రూ.70 వేలు అప్పు తీసుకున్నాడు. అందులోంచి ఈ రెండు బోర్లు వేయించేందుకే రూ.50 వేలకుపైగా ఖర్చయ్యాయి. మిగిలింది రూ.20 వేలు. నీళ్లు పడిన బోరులో మోటార్ బిగించడం, పైప్‌లైన్, కరెంటు పనుల కోసం అవి సరిపోని పరిస్థితిలో.. మరో రూ. 20 వేల వరకు అప్పు చేసేందుకు సిద్ధమయ్యాడు. అసలు నీళ్లుపడిన బోరు నుంచి ఎంత వరకు నీళ్లు వస్తాయి, అవి పంట సాగుకు సరిపోతాయో లేదో అనేది తెలియక ఆందోళన చెందుతున్నాడు. పక్కన ఉన్న సోదరుడి పొలం నుంచి మోటారు తీసుకెళ్లి పెట్టి పరీక్షిస్తున్నాడు. నీళ్లు సరిపోయే పరిస్థితి లేకపోతే.. ఇక వర్షాధార పంటలే దిక్కు అని వాపోతున్నాడు. రెండెకరాలు ఉంటే 10 గుంటలే సాగు పంగోనికుంట తండాకు చెందిన మహిళా రైతు మెగావత్ బోడికి 2 ఎకరాల భూమి ఉంది. గతంలో సాగర్ నీళ్లు విడుదల ఆలస్యమైన నేపథ్యంలో అందులో బోరు వేయించింది. కానీ అందులో నీళ్లు తక్కువగా పడ్డాయి. ఇటు సాగర్ నీరు రాక, అటు బోరులో నీళ్లు సరిగా లేక.. ఈసారి కేవలం 10 గుంటల్లో మాత్రమే వరి పంట వేసింది. మరికొంత భూమిలో కంది పంట వేసినా నీళ్లు లేక సరిగా ఎదగలేదు. బోరులోనూ నీళ్లు తగ్గిపోతుండడంతో.. సాగు చేసిన పంట కొంచమైనా చేతికివస్తుందో, లేదోనన్న ఆందోళనలో మునిగిపోయింది. ‘‘పంట ఏమో ఇట్ల ఉంది.. కూలి పనికి పోదామన్నా.. ఎక్కడా పని దొరకడం లేదు. సాగర్ నీళ్లే లేకుంటే బయట పని ఎలా దొరుకుతుంది..?’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్న నీళ్లూ ఎండిపోతే..? కొన్నేళ్లుగా సాగర్ నీటి కష్టాలు చూస్తున్న అనుముల మండలం హజారుగూడేనికి చెందిన చిమ్మట బాలసైదులు.. గతేడాది యాసంగిలో బావి తవ్వించాడు. బావికి, మోటారు, విద్యుత్ లైన్, పైపులకు కలిపి రూ.1.25 లక్షలు ఖర్చు చేశాడు. అతడికి నాలుగెకరాల పొలం ఉన్నా.. ఈ ఖరీఫ్‌లో మాత్రం ఎకరన్నరలోనే వరి వేశాడు. సాగర్‌లోకి నీళ్లు రాకపోతే సమీపంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో నీళ్లుండవని ముందే ఊహించి... తక్కువగా పంటసాగు చేశాడు. అయితే సాగర్‌కు నీళ్లు రాక ఈ బావిలోని నీళ్లు కూడా ఎండిపోతే.. పంటల సాగు పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉన్నాడు. -
వర్మివాష్‌తో పంటలకు మేలు
రామాయంపేట: సేంద్రీయ ద్రావణమైన వర్మీవాష్‌తో పంటలకు మేలు చేకూరుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేశ్ పేర్కొన్నారు. మండలంలోని కోనాపూర్‌లో ఆదర్శ రైతు పోచమైన కిషన్ తయారు చేసిన ద్రావణాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎకరాకు మూడు లీటర్ల చొప్పున ద్రావణాన్ని పిచకారీ చేస్తే శిలీంద్రాలను రూపుమాపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ద్రావణంతో భూమి కూడా సారవంతంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని గణేశ్ సూచించారు. కార్యక్రమలో రైతు కిషన్, ఇతర రైతులు అశోక్, భీరయ్య పాల్గొన్నారు. -
కృష్ణమ్మా.. పరవళ్లు ఏవమ్మా?
- బోసిపోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు - వర్షాకాలం మొదలై నెలన్నరైనా ఎగువ నుంచి వరద కరువు వానాకాలం మొదలై నెలన్నర అయింది.. కానీ వర్షాల్లేవు.. ఎగువ నుంచి వరద లేదు.. ఫలితంగా కృష్ణమ్మ వెలవెలబోతోంది. ఈపాటికి జలకళ సంతరించుకోవాల్సిన కృష్ణా ప్రాజెక్టులన్నీ బోసిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ జంటనగరాలు, నల్లగొండతోపాటు ఏపీలోని రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అటు తాగునీటికి, ఇటు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడేయడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టాలు డెడ్ స్టోరేజీ కన్నా దిగువకు చేరాయి. ఆయకట్టుకు సాగునీరు సంగతి అటుంచితే తాగునీటి అవసరాలకు కూడా సరిపోయేంత నీటి లభ్యత లేదు. దీంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎగువన మరో 206 టీఎంసీల నీరు చేరితే కానీ దిగువకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -సాక్షి, హైదరాబాద్ వచ్చింది ఏడు టీఎంసీలే.. దక్షిణ తెలంగాణకు ప్రధాన ఆదరువుగా ఉన్న కృష్ణా నది గతంలో ఎన్నడూ లేనంత నీటి కటకటను ఎదుర్కొంటోంది. తెలంగాణ, ఏపీలోని కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటివరకు సరైన వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరలేదు. సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులుకాగా.. ప్రస్తుతం 504.2 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకుగాను 787.8 అడుగులకు పడిపోయింది. నెలన్నర వ్యవధిలో సాగర్ పరిధిలో వ చ్చిన నీరు ఒక టీఎంసీ మాత్రమే. శ్రీశైలంలో ఇప్పటికే 834 అడుగుల కనీస మట్టాన్ని దాటి నీటిని వాడేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 787.8 అడుగుల వద్ద 23.47 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. తుంగభద్రకు కొద్దిమేర వరద ఉండడంతో శ్రీశైలానికి సాగర్ కన్నా కాస్త మెరుగ్గా 4 టీఎంసీల మేర నీరు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. జూరాలకు కూడా 2 టీఎంసీల నీరే వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రాజెక్టుల్లోకి 7 టీఎంసీల నీరు రాగా.. మొత్తంగా 389 టీఎంసీల కొరత ఉంది. సాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న నీటిలో సుమారు 6 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు వాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోనూ ఖాళీ.. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ ఎన్నడూ లేనివిధంగా జూలైలోనూ ప్రాజెక్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.15 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈ సీజన్లో ఆలమట్టిలోకి 7 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి 62.61 టీఎంసీల మేర నీరుండగా ప్రస్తుతం 28 టీఎంసీల మేర తక్కువగా ఉంది. అయితే గడచిన రెండ్రోజులుగా అక్కడ గరిష్ట ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక 37.64 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్‌లో ప్రస్తుతం 15.15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నెలన్నర సమయంలో అక్కడ 4 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. తుంగభద్రలో 100 టీఎంసీలకుగానూ 27.39 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. మొత్తంగా ఎగువ ప్రాజెక్టుల్లో ఏకంగా 206 టీఎంసీల మేర లోటు కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలకు మరో నెల రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కలవరపెడుతున్నాయి. అయితే పుష్కరాల సమయానికీ అనుకున్నంత మేర నీరు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సందిగ్ధంలో ఆయకట్టు తెలంగాణలో సాగర్ కింద 6 లక్షలు, జూరాల కింద లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోవడంతో ఈ 7 లక్షల ఎకరాల్లో పంటలసాగు సందిగ్ధంలో పడింది. మిగతా చోట్ల ఖరీఫ్ ఆరంభమై నాట్లకు సిద్ధమవుతున్నా.. ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో నీళ్లు లేక రైతులు తలలు పట్టుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా నీళ్లొస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. -
కరువుతో ఎండిపోతున్న రబీ పంటలు
పంటల సాగు విస్తీర్ణం 57 శాతానికి మించని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండటంతో రబీ పంటలు ఎండిపోతున్నాయి. రబీలో పంటల సాగు విస్తీర్ణమే 57 శాతానికి మించలేదు. వేసిన ఆ కొన్ని పంటలనూ కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, వేరుశనగ తదితర పంటలు ఎండిపోతున్నాయి. పంట కాలం పూర్తయ్యే నాటికి ఇవి పూర్తిగా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 31.32 లక్షల ఎకరాలు కాగా... కేవలం 17.87 లక్షల ఎకరాల్లోనే (57%) సాగు చేశారు. అందులో వరి సాగు సాధారణ విస్తీర్ణం 16.12 లక్షల ఎకరాలు కాగా... కేవలం 6.3 లక్షల (39%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మొత్తంగా సాగు విస్తీర్ణం తక్కువైనా ఉన్న వాటిని కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. రబీలో సాధారణంగా 129.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 27.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 79 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళంలోకి దిగజారాయి. జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే భారీగా తగ్గిపోయాయని వ్యవసాయశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
అప్పులెలా తీర్చాలనే బెంగతో..
ధారూరు(రంగారెడ్డి): సాగు భారం కాగా.. అప్పులు తీర్చే దారి కానరాక మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు యాదయ్య(30) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, కూరగాయలు సాగు చేశాడు. పత్తి ఆశించిన దిగుబడి రాలేదు. బోర్లు వేయటానికి, పంటల సాగుకు బ్యాంకు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన అప్పులు రూ.3 లక్షల వరకు మిగిలాయి. ఈ క్రమంలోనే భార్య నర్సమ్మ ఈనెల 10న గొడవ పడి, బంధువుల ఇంట్లో జరిగే విందులో పాల్గొనేందుకు ఇద్దరు కొడుకులు మల్లేశ్(5), మణికంఠ(3)లతో కలిసి తాండూర్ వెళ్లింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య పురుగుల మందు తాగి పడుకున్నాడు. అర్థ్దరాత్రి సమయంలో తల్లి అతడిని నిద్ర లేపేందుకు యత్నించగా ఎంతకూ లేవలేదు. అప్పటికే మృతి చెందిన యాదయ్యను చూసి కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. -
పశుసంపద తగ్గుదలతో అల్ప దిగుబడులు
నేలలలో సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాల కొరత ఏర్పడటం వల్ల ఐరోపాలోని పలు దేశాల్లో ప్రధాన పంటల సాగులో 1990 నుంచి దిగుబడుల్లో పెరుగుదల నమోదవలేదని శాస్త్రవేత్తల తాజా విశ్లేషణ తేల్చింది. భూమికి సేంద్రియ ఎరువులను అందించే పశుసంపద 1980నుంచి ఐరోపాలో క్రమేపీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు, సాగుయోగ్యమైన భూములు తగ్గిపోతున్నాయి. జర్మనీకి చెందిన మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్ఎఓ) నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. మధ్య, ఉత్తర ఐరోపాలో గత 20 ఏళ్లుగా విస్తృతంగా సాగవుతోన్న బార్లీ, గోధుమ వంటి చిరుధాన్యపు పంటలను పరిశోధన కోసం ఎంచుకున్నారు. గత ఇరవయ్యేళ్లుగా ఈ పంటల దిగుబడుల్లో పెరుగుదల లేదని తేలింది. సైన్స్ ఆఫ్‌ది టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. నేలలో ఉండే సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. వీటిని నేలకు అందించే కారకాలు ముఖ్యంగా పశుసంపద తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులకు అత్యంత అవసరమైన జీవనద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంట దిగుబడులపై ఇది పెను ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల సేంద్రియ పదార్థం సరఫరా నిలిచిపోయి.. అధిక స్థాయిలో జీవనద్రవ్యం నశించిపోవటం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. రసాయనిక ఎరువులను తక్కువగా వినియోగించటం, పప్పుజాతి పంటలను అధికంగా సాగుచేయటం, పంటమార్పిడి పద్ధతిని పాటించటం ద్వారానే ఈ సమస్యను అధిగమించగలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సేంద్రియ పదార్థం అందకుంటే దీర్ఘకాలంలో నేల జీవనద్రవ్యాన్ని కోల్పోతుంది. ‘ఇది ఇలానే కొనసాగితే భూగర్భ నీటి నిల్వలు, నేల భూసారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త వియోస్మియర్ చెప్పారు.పంట దిగుబడులకు సంజీవనిలా పనిచేసే జీవనద్ర వ్యాన్ని కాపాడుకోవటం అవసరమని దీనికోసం సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేయటం, పంటమార్పిడిని పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు అటవీ వనాల పెంపకం, పంట వ్యర్థాలను పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియలను చేపట్టటం ద్వారా జీవనద్రవ్యాన్ని నష్టపోకుండా నివారించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.