easter
-
క్రీస్తు బలియాగం వెనుకున్న పరమార్థం ఇదే..!
క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖనానుసార సువార్తగా ఎప్పటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువుపట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్ననూ అది సువార్త కాదు. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు యెడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరుచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొఱె -
ఆస్పత్రి నుంచి నేడు పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జి
రోమ్: కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్(86) శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వాటికన్ వర్గాలు తెలిపాయి. సెంట్ పీటర్స్ స్క్వేర్‌లో బుధవారం సంప్రదాయ వారాంతపు ప్రసంగం అనంతరం అస్వస్థతకు గురైన పోప్‌ను రోమ్‌లోని గెమెల్లి పాలీక్లినిక్‌లో చేర్పించారు. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. యాంటీబయాటిక్ చికిత్సకు స్పందిస్తున్నారని వాటికన్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అయితే, ఆదివారం నుంచి ఈస్టర్ వీక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఇప్పటికే మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. -
Easter Special: లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం
యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. సీయస్ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు. వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము. వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది. శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ప్రాముఖ్యమైనవి. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’ యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’. ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
ఈస్టర్ సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. #HappyEaster — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2022 ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: క్రైస్తవులకు సీఎం కె.చంద్రశేఖర్ రావు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు. చదవండి: (టెలీమెడిసిన్ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ) -
సర్వోన్నతునికి.. సమాధి సంకెళ్లు వేయగలదా..?
యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది. భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ ‘రక్షకుడు’ రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు! ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. ‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర’ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ‘మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.’ అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి. క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా ‘క్రీస్తుకు పూర్వం’ అని, తర్వాతి కాలమంతా ‘క్రీస్తు శకం’ అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్ అధినేత నెపోలియన్ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ ‘ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్ , నేను, చార్ల్ మాన్ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన ‘ప్రేమ’ పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!’ ‘ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?’ అన్నారు మన గాంధీజీ. అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల్లో ‘నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!’ స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం ‘యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.’ ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభువు చెప్పారు... ‘తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.’ సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు.. ‘యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార’ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక! – ఝాన్సీ కె. వి. కుమారి -
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది.. నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీటర్లో తెలియజేశారు. విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది. ఈ ప్రకాశవంతమైన రోజు నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. #HappyEaster — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2021 చదవండి: ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు -
కాంతి పుంజం ప్రభాత కిరణం
బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం ఇచ్చే సంతృప్తితో కాలాన్ని గడపాలని కోరుకుంటాడు. ఓటమి అంగీకరించడం మనిషికి మింగుడు పడని వ్యవహారం. ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో... ఇంకా మరెన్నో. ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే మనిషి ఇంత సంతోషంగా ఉంటే.. ప్రతి మనిషికీ ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే... ఇంకెంత ఆనందం! సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణానికే మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో బంధించిన మరణం ‘మరణించింది’. అసలు ఈ పుట్టుకకు, మరణానికి దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. క్రీ.శ 1799లో కాన్రాడ్ రీడ్ అనే యువకుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చాలాసేపు ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. నిరుత్సాహంతో తిరుగు ప్రయాణమైన అతనికి ఒక నల్లటి రాయి దొరికింది. బరువు సుమారుగా పది కేజీలు ఉంది. ఇంటికి తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరకు ఇంటికి తీసుకువచ్చాడు. కొంచెం పాతగా ఉన్న తన ఇంటిలో ఒక తలుపు మాటిమాటికి పడిపోతూ ఉంది. తనకు దొరికిన నల్లటి రాయిని డోర్‌స్టాప్‌గా ఉపయోగించాడు. మూడు సంవత్సరాలు గతించిన తరువాత తన తండ్రి జాన్ రీడ్ ఆ నల్లరాయిని పరిశీలించి నగలను విక్రయించే షాపులో దానిని చూపించమని సలహా ఇచ్చాడు. పెద్దగా ఆసక్తి లేకుండానే తన తండ్రి మాట ప్రకారం షాపుకు వెళ్ళి చూపించగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అది ఒక నల్లరాయి కాదు... బంగారం. చాలాకాలం భూమిలో ఉండిపోయిన కారణంగా నల్లరాయిలా ఉంది. ఆ సమయంలో దాని విలువ మూడువేల ఆరువందల డాలర్లు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. దాని విలువ తెలియని కారణంగా దానిని ఒక డోర్‌స్టాప్‌గా మూడు సంవత్సరాలు ఉపయోగించారు. సరియైన చోటికి తీసుకెళ్ళినప్పుడు దాని విలువేంటో అర్థమయ్యింది. మనిషి దేవుని చేతిలో ఉంటేనే తన విలువేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అనంత విశ్వంలో మనిషికి సాటియైనదేదీ లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు. అత్యంతాశ్చర్యకరమైన రీతిలో మానవుని తల్లి గర్భంలో రూపించి నిర్మించాడు. తన రూపంలో తన పోలికలో చేసుకొనినందు వలన వల్లమాలిన ప్రేమను మనిషిపై పెంచుకొని ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేసే అధికారమిచ్చాడు. తాను మహోన్నతుడైనప్పటికీ మనిషితో స్నేహం చేయాలని కోరుకున్నాడు. అయితే ఇంగితం కోల్పోయిన మానవుడు తనను సృజించిన దేవుని విూదే తిరుగుబాటు చేయగా తట్టుకోలేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగరవ్వాలనే కరుణామయునిగా శరీరాకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితముగా ప్రేమించి ప్రాణత్యాగం చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. పరమాత్ముని జీవనవిధానం శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. ఆయన మరణం కూడా మరెవరితోను సాటికానిది. దయనీయమైనది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. అత్యంతాశ్చర్యకరమైనది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. వాస్తవానికి క్రీస్తు మరణం, ఆ తర్వాత పునరుత్థానం సంభవించిన ఆ సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ‘‘నజరేయుడైన యేసు’’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తును సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పి, కొరడాలతో కొట్టి, ఝెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వ్రేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురిచేశారు. ప్రేమ, సహనములకు కర్తయైన దేవుడు వాటినన్నిటిని సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయన రక్తం మాత్రమే మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం మాత్రమే మనిషి మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది. క్రీస్తు మరణ, పునరుత్థానాలు క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు పునాదిగా నిలిచాయి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యేసుక్రీస్తు మరణం సిలువపైనే జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. అది ముమ్మాటికి నిజం కనుక! గెత్సెమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపుబిందువులుగా మారెను. వైద్య పరిభాషలో దానిని హెమాటిడ్రోసిస్ లేదా హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించెను. ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు, లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు. ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి వస్త్రములు లాగివేస్తారు. ఒక మానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి. పదునైన ఎముకలు, ముళ్ళు శరీరంలోకి దిగబడి మాంసాన్ని పెకిలిస్తాయి. ఈ ప్రక్రియలో చాలామంది తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పకూలిపోతుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనిషికి స్వస్థత చేకూర్చబడాలని వాటిని భరించెను. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు, రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించేవారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. సిలువ వేసే స్థలానికి తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు ఏడు అంగుళాల పొడవు, సుమారు ఒకటి నుండి రెండు సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగగొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మతినొందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారెను అని బైబిల్లో వ్రాయబడింది. రోమన్లు వాడే బల్లెం పొడవు సుమారు 1.8 మీటర్లు. క్లోరోఫామ్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ జేవ్‌సు సింప్సన్, మరికొంతమంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యనిపుణులు యోహాను వ్రాసిన ఈ మాటపై పరిశోధన చేశారు. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తమును నీళ్ళు బయటకు వచ్చాయి. యేసుక్రీస్తు దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్ళు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసం, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవం. వాస్తవాన్ని పరిశీలిస్తే యేసు గొప్ప శబ్ధముతో కేకవేసి అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుండి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు తిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తం పోయింది. తలలో ముళ్ళకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహం నుండి బయటకు పోయింది. శరీరం రక్తం కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ముఖ్యమైనవి. ఎందుకాయనకు ఇన్ని కొరడాదెబ్బలు? ఎందుకన్ని అవమానాలు? ఎందుకాయనకన్ని రాళ్ళ దెబ్బలు, ఇన్ని అమానుష చర్యలు? ఎందుకు తలకు ముండ్ల కిరీటం? ఎందుకు పిడిగుద్దులు? ఎందుకు పరిశుద్ధ చేతులకు, కాళ్ళకు మేకులు గుచ్చడం? ఎందుకు పక్కలో బల్లెపు పోటు, సిలువ శిక్ష? పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.’ అవును! క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువుచేయబడింది. మనిషికి బదులుగా దేవుడు పాపములను తనమీద వేసుకొని వాటి శిక్షను భరించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యాలను జయించిన పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. మానవునిగా ఈ భూమ్మీద క్రీస్తు జీవించిన కాలంలో ఆయన గడిపిన ప్రతీక్షణం పరిశుద్ధతతో, ప్రేమతత్వంతో జాలి కనికరాలతోనే జీవించారు కాని ఏనాడు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదు. సమాజాన్నిగాని, తన అనుచరులను గాని ద్రోహకార్యాలకు పాల్పడమని బోధించ లేదు. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పడమే కాదు యేసు క్రీస్తు దాన్ని అక్షరాలా చేసి చూపించారు. క్రీస్తు ప్రేమతత్వాన్ని తమ నరనరాల్లో జీర్ణించుకున్న ఎందరో మహనీయులు ప్రపంచానికి దీవెనగా నిలిచారు. తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి దేశాన్ని, తన వారందరిని విడిచి అనేకమంది అనాథలను, అభాగ్యులను చేరదీసి... తల్లికంటే, తోబుట్టువు కంటే మిక్కుటమైన ప్రేమాభిమానాలందించి పురుగుకంటే హీనంగా మారిపోయిన వారి జీవితాలకు మరలా విలువనిచ్చిన మదర్ థెరిస్సా ఒక మంచి ఉదాహరణ. ఎవరి పాపఫలితం వారనుభవించాలి, ఎవరి కర్మకు వారే కర్తలు, తండ్రులు ద్రాక్షపండ్లు తింటే పిల్లల పళ్ళు పులియవు, పాపం చేసిన వారు శాపగ్రస్తులవ్వాల్సిందేనన్న నీతి సూక్తులు, వాక్యాలు మానవులపై గుదిబండలుగా మోపుతున్న తరుణంలో పాపప్రక్షాళనకు, పాపసంహారానికి, పాప పరిహారానికి మానవుడు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఆయా కార్యాలతో అలసిపోతూ సత్యాన్వేషణలో అలమటిస్తుండగా పాపులను రక్షించుటకు నేనీ లోకానికొచ్చానని, లోకమును ప్రేమిస్తున్నానని, ప్రతి మనిషి పాపపు శిక్షను భరించి నిత్యజీవాన్ని అందించు రక్షకునిగా దిగి వచ్చానని మాటలతో చెప్పడమే కాకుండా చేసి నిరూపించిన త్యాగమూర్తి క్రీస్తు. చేయకూడదనుకున్న వాటినే మాటిమాటికి చేస్తూ, చేయాలనుకున్నవాటిని చేయలేక చతికిలపడుతున్న మనిషిని రక్షించడమే దేవుని అభిలాష. పాప పిశాచితో మనిషి పోరాడలేక విఫలమై చిత్తుగా ఓడిపోయి పతానవస్థకు చేరిపోగా పాపానికి చేయాల్సిన పరిహారం చేసి రక్తమంతా కార్చి, ప్రేమనంతా కనుపరచి, పాపపు కోరలను విరిచి, పాపాన్ని ముక్క చెక్కలు చేసి సమాధి చేసిన ఘనుడు యేసు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోతే విచారవదనాలతో, బాధాతప్త హృదయాలతో, విలాపముతో, శోకముతో తల్లడిల్లుతారు గాని, యేసుక్రీస్తు మరణ దినాన్ని ‘గుడ్ ఫ్రైడే’గా ఘనపరుస్తున్నారంటే అందులో ఎంత అర్థముందో గమనించాలి. గుడ్ ఫ్రైడే విషాదాన్ని పంచేదికాదు పాపపిశాచితో నలిగిపోతున్న మానవాళికి శుభ ప్రారంభాన్నిచ్చేది. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుత నవకాంతిమయ నిర్మాణముగా మార్చి వేశాయి. ప్రపంచానికి ఆయనందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత చెక్కు చెదరనివని.. ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియ జేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలు కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనకు వీరిని క్షమించుమ’’ని చెప్పెను (లూకా 23:34). యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఏళ్ళ తరబడి పగను, ప్రతీకారేచ్ఛను తమలో నాటుకున్నవారికి ఓ గుణపాఠాన్ని ఈ మాట నేర్పిస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికి వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో...... తెలిసి తెలిసి తనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసినా క్షమించగలిగిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.’’ (లూకా 23:43) యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరియొక ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారు చేసిన పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాపపడకుండా ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు గదా. నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమని హేళనతో మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో కనబడుటలేదు. రెండవవాడు మాత్రం అతనిని వారించి యేసువైపు చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్షనుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళు లేని రాజ్యం. ‘‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’’ (యోహాను 19:26, 27)’’. యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్ముకున్నవారిని ఏనాడు ఒంటరిగా విడువడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనాపాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. సంబంధ బాంధవ్యాల విలువలు, బాధ్యతలు అంతరించిపోతున్న నేటి దినాలలో యేసుక్రీస్తు పలికిన మాట ఎంత మంచి ఆదర్శాన్ని చూపించింది. వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులను పెంటకుప్పల మీద, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారిని ఇబ్బందిపెడుతున్న వారికి క్రీస్తు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. అంతటి మరణ వేదనలో సయితం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. తన శరణుజొచ్చిన ఎన్నడును విడిచిపెట్టేవాడు కాదు. ‘‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను.’’ (మత్తయి 27:46) ఈ మాట అరమేయిక్ అనే భాషలో క్రీస్తు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. యేసు ప్రభువు పలికిన ఈ మాటకు ‘‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి ’’అని అర్థం. నరావతారిగా మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇలకు వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు అయినను ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం పరిహరించబడినప్పుడు మాత్రమే మనిషి దేవునితో శ్రేష్ఠమైన సహవాసం కలిగియుండగలడు. దేవునితో సహవాసం ఓ అనిర్వచనీయ అనుభవం. ‘‘దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)’’. యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలు అనుభవించారు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యములను ఆయన చేసెను. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడినాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం. ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ, విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘‘సమాప్తమైనది.’’ (యోహాను 19:28) ఇది విజయానందంతో వేసే విజయనాదం. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి సాధించాకా వేసే కేక. మరింతకూ ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానందంతో కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో, ఆకస్మికంగానో రాలేదు. ఒక పరమార్థం కలిగి దానిని పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ దానిని నెరవేర్చి మనుష్యులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోషముతో కేకవేశారు. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.’’ (లూకా 23:46) ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన మాటలలో చివరి మాట ‘‘అప్పగించుకొంటున్నాను.’’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవుని దగ్గరకు చేరాలి. ఈ లోకంలో ఎలా బతికినా చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమే కాదు, లోపల ఆత్మ కూడా ఉందని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి. యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన తర్వాత తలవాల్చి మరణించారు. అంతటితో ఆయన శకం ముగిసిందని రోమన్లు, యూదులు అనుకున్నారు. ఇంక వారికి తిరుగులేదు. తాము చెప్పిందే శాసనం అనుకున్నారు. యేసు సిలువపై చనిపోయిన తరువాత యూదుల న్యాయసభలో ప్రముఖుడైన యోసేపు అనే వ్యక్తి యేసు దేహము తనకిమ్మని పిలాతును అడిగాడు. అరిమతయి యోసేపు అనే వ్యక్తి తనకొరకు తొలచుకున్న సమాధిలో ఉంచారు. ఎవరో అడిగారట!! నీ సమాధిని యేసుకెందుకు ఇస్తున్నావని. అందుకు అతడిచ్చిన సమాధానం ‘‘కేవలం మూడురోజులకు మాత్రమే. ఆ తరువాత ఆయన దానిలో ఉండడు గదా!!’’ ఆదివారం తెల్లవారుచుండగా ఆయన సమాధిని అలంకరించడానికి కొంతమంది వెళ్ళారు. ఆనాటి దినాలలో అనేకులు ప్రవక్తలు చనిపోయాక వారి సమాధులను అలంకరించేవారు. కాబట్టి యేసు సమాధిని కూడా అలంకరించడానికి వెళ్ళారు. వారు వెళ్ళి చూసే సమయానికి ఆశ్యర్యం... అద్భుతం. యేసు సమాధి తెరవబడియుంది. అక్కడ నిలబడియున్న దేవదూత వెళ్ళిన వారికి ఇచ్చిన సందేశం ‘‘క్రీస్తు ఇక్కడ లేడు. లేచి యున్నాడు.’’ ఉరికే ఉత్సాహంతో, ఊపిరాడనివ్వని సంతోషంతో, కట్లు తెంచుకునే హృదయానందంతో శిష్యులు, స్త్రీలు అందరూ ఆ వార్తను లోకానికి చాటాలనుకున్నారు. అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. విత్తనం నేలను పడి చనిపోయినట్లే ఉంటుంది కానీ అది మొలిచి మహావృక్షముగా మారుతుందని ఎవరు ఊహించగలరు? ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను’’. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఆనాటి శిష్యులే సాక్షులు. ‘‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలంచేవారు’’ అని వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. తోమా అనేక సంఘాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడువబడి చనిపోయాడు. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణించింది. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికి ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయిపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యవసనాలు, దౌర్భాగ్యమైన శారీరక వాంఛలు, పాపపు యిచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవ లేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలను సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఓ అద్భుతమైన పుస్తకాన్ని వ్రాసాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణిలోనికి తీసుకొచ్చారు గాని వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు... స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలు ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా. సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కుల మతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయా లకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినదికాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికి యిట్టే అవగతమౌతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవ లోకానికి సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దానవచనం ‘‘సమాధానం కలుగును గాక !’’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానము ఉంటుంది. ఈనాడు అనేకులు తమ పరిస్థితులనుబట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఒకసారి సుప్రసిద్ధ సంగీత కళాకారుడు ఒకాయన ప్రపంచస్థాయి సంగీత కచేరి చేశాడు. అతడు వాయించిన సంగీత సమ్మేళనానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఆలపించిన కొన్ని పాటలలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘దుఃఖం వలన ఒరిగేదేమిటి? విచారం వలన సాధించేదేమిటి? దుఃఖాన్ని విచారాన్ని దూరంగా విసిరేసి ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి.’’ ఆ రాత్రి గడిచి ఉదయం లేచేసరికి అందరూ నివ్వెరపోయే వార్త... ఆ సంగీత స్వర మాంత్రికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని. ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి అని పాడిన వ్యక్తి ఆనందంగా ఉండలేకపోయాడు. శాంతి సమాధానాలు డబ్బు, పేరు ప్రఖ్యాతులతో వచ్చేవి కాదు. శాంతిదూతయైన దేవునికి æహృదయంలో చోటివ్వడం ద్వారా మాత్రమే లభించేవి. పునరుత్థాడైన క్రీస్తు ద్వారా మానవాళి పొందుకునే మరొక వాగ్దానం ‘‘భయపడకుడి’’. ప్రస్తుత ప్రపంచమంతా ఎన్నో భయాలతో నిండియుంది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యములు, సమస్యలు... ఇంకా ఎన్నో కారణాలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం సొంతం అవుతుంది. ఇకముందు ఏమౌతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయంతో ఏమీ సాధించలేని వాళ్లు దేవుని మీద విశ్వాసంతో గొప్ప కార్యాలు సాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థానం నిరీక్షణ ప్రసాదించింది. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయనయందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోవుతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురుచూసేవారు ఎన్నడు సిగ్గుపడరు. ప్రభువునందు మనిషికున్న నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జోబ్ సుదర్శన్ అనే ఒక క్రైస్తవ రచయిత ఇలా అంటాడు. ‘‘చీకటీ, ప్రకృతిపై నీ గొంగళి కప్పు. గేత్సెమనే తోటలో నా ప్రభువు దురపిల్లుతున్నాడు. వెలుగు అలలారా అణగారండి! సిలువపై నా ప్రభువు వసివాడుతున్నాడు. గాలీ గోల చెయ్యకు...పక్షులారా కిలకిలరావాలు మానండి! సమాధిలో నా ప్రభువు నిద్రిస్తున్నాడు. ప్రాతకామా వేగిరపడు సమాధిలోనికి తొంగిచూడు! అక్కడ లేడు, నా ప్రభువు లేచాడు. దిగ్గజాల్లారా ఘీంకరించండి! మహిమ దేహధారి ఆరోహణమవుతున్నాడు’’. తనను వినమ్రతతో సేవించే ప్రతి హృదయం తో క్రీస్తు ఇలా సంబోధిస్తున్నాడు. ‘‘నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడలేను. నేనిప్పుడు వేనవేల పవనాల జవాన్ని జీవాన్ని. కోటి ప్రభలు కలబోసిన కాంతిపుంజాన్ని. పండిన చేలపై వెచ్చగా ప్రసరించే ప్రభాత కిరణాన్ని. రాత్రివేళ అల్లన మిణుకుమనే కోట్లాది నక్షత్రాల వైభవాన్ని. మెల్లని తొలకరి వర్షాన్ని. గుండెల్లో హాయిని నింపే హర్షాన్ని. నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడ లేను’’. సాక్షి పాఠకులకు గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
మరణం మరణించిన వేళ...
నేడు ప్రపంచంలోని క్రైస్తవులంతా ఈస్టర్ పండుగను భక్తి పారవశ్యంతో జరుపు కొంటున్నారు. సమాధిని గెలిచి లేచిన క్రీస్తు శక్తిని తలపోసుకుంటూ ఆయన దివ్యనామాన్ని స్మరించుకొంటూ తరిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేదీ లేదు అంటూ ఆయన ఘననామాన్ని కీర్తిస్తున్నారు. యేసు ప్రభువును సమాధిచేసి ఎవరి గృహాలకు వారు వెళ్లిపోయారు. రోమన్ సైనికులంతా సమాధి ముందు కాపలాగా ఉన్నారు. శిష్యులు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోయి మృతులలోనుండి యేసు లేచాడని ప్రచారం చేసే అవకాశానికి అడ్డుగా నిలుచున్నారు. ఆదివారం ఉదయాన్న ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ఉత్కృష్టమైన వైభవమైన కార్యం జరిగింది. అదే యేసు పునరుత్థానం. ఉత్థానము అంటే లేపబడుట. పునః అనగా తిరిగి. పునరుత్థానము అనగా మరణాన్ని జయించి తిరిగిలేచుట. యేసు పునరుత్థానము జరిగిన ఆ రోజు... ఎన్నో ఏళ్ళుగా తన కబంధ హస్తాలలో బంధించి, నిష్కర్షగా మనుషులను కబళిస్తున్న మరణం మరణించింది. మరణ మృదంగం మూగబోయింది. మనుష్యులను వారి కలలను, వారి ఆశయాలను మూసిపెడుతున్న సమాధి శాశ్వతంగా తెరవబడింది. తాండవమాడుతున్న దుష్టశక్తుల మీద ఖచ్చితంగా ఏనాటికైనా పైచేయి సాధించవచ్చని ఋజువుచేయబడింది. సకల చరాచర సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమైనదేదీ ఉండదని తేలిపోయింది. సత్యాన్ని సమాధిలో పెట్టగలం కానీ దానిని ఎక్కువకాలం దానిలో ఉంచలేమన్న ద్విగుణీకృతమైన విషయం బట్టబయలైంది. నిరాశలోనుండి నిరీక్షణ యుగంలోనికి మానవజాతి అడుగుపెట్టింది. ఆవేదనాభరితమైన ప్రతి ప్రశ్నకు సర్వలోకనాథుని పునరుత్థానం అత్యున్నత సమాధానాలను అనుగ్రహించి తన భక్తులను ఆనంద పారవశ్యంతో నింపింది. అంతరంగంలో అద్వితీయమైన కాంతి వింతవింతగా నిండి బతుకంతా నిత్యనూతనమయ్యింది. మానవత్వం దైవత్వంతో నిర్విరామంగా సహవసించడానికి పునాది పడింది. నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి చదివి యూనివర్సిటీలోనే మొదటి స్థానంలో నిలిచి తన కష్టానికి ప్రతిఫలంగా తనచేతికి అందిన సర్టిఫికెట్‌ను చేతపట్టుకొని తన ఆనందాన్ని కడుపు కట్టుకొని ఈ స్థానానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులతో పంచుకోవాలన్న ఆశతో గ్రామానికి ప్రయాణమయ్యాడు ఓ ఇంజనీరు. ఫోన్లు పెద్దగా అందుబాటులోనికి రాని ఆ రోజుల్లో ఎర్రబస్సెక్కి ప్రయాణం ప్రారంభించాడు. ఓ మంచి ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో హాయిగా గడుపుతున్నట్టుగా ఊహించుకొంటూ మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. కాసేపటికి కఠోరమైన బస్సు హారన్ శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు. మామూలుగా కన్నా ఇంకొంచెం వేగంగా తన ఇంటివైపు అడుగులు వేయసాగాడు. తన తాత కట్టించిన చిన్న పెంకుటిల్లు ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. చాలా కాలం తర్వాత నా కుమారుడు వస్తున్నాడని తల్లి చెప్పడం ద్వారా తనను చూడడానికి ప్రజలు వచ్చియుండొచ్చు అని అనుకుంటూ ఇల్లు సమీపించే సరికి తన ముద్దుల చెల్లి విగతజీవిలా పడివుంది. గుండెలవిసేలా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ‘‘అన్నయ్యా త్వరగా వచ్చేయి. నిన్ను చూడాలని ఉంది’’ అని చెల్లి రాసిన ఉత్తరం మూడు రోజుల క్రితమే అందింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చాడు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఏదో తెలియని నిశ్శబ్దం ఇంటినంతా కమ్మేసింది. తమకు తోచినట్టుగా ఆదరించిన బంధువులు ఒక్కొక్కరిగా తమను విడచి వెళ్లిపోతున్నారు. తన మనసులో కొన్ని ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువులు తన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తల్లిదండ్రులను అడిగాడు. వారి దగ్గర కూడా సమాధానాలు లేవు. ‘‘మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు?’’ ఈ మూడు ప్రశ్నలు ఆ యువకుని తొలిచేస్తున్నాయి. కలవరంతో, భారమైన హృదయంతో, మానసిక సంఘర్షణతో ఇల్లు విడచి బయలుదేరాడు. జవాబులు తెలిస్తే తిరిగొస్తా లేకపోతే నన్ను శాశ్వతంగా మర్చిపోండి అని కన్నవారికి చెప్పి పయనమయ్యాడు. బహుశా చాలామంది ఎన్నో విషయాలను గూర్చి ఆలోచిస్తారు గాని ఈ మూడు విషయాలు గూర్చి ఆలోచించరేమో. వాటిని ఆలోచించేంత సమయం నేటి మనుష్యులకు ఉందా? వాటి సమాధానాలు తెలుసుకోవడమే పరమార్థమని గ్రహించిన యువకుడు మార్గంలో తనకు తారసపడిన ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను నిర్మొహమాటంగా ప్రశ్నించాడు. ఒక్కొక్కరి దగ్గరనుండి ఒక్కో విధమైన సమాధానం. బుర్ర వేడెక్కిపోయే విషయాలను కూడా ఓపికతో విన్నాడు. చివరకు ‘‘వీటికి ఈ భూమ్మీద సమాధానం లేదు. అందుకే ప్రపంచమంతా మాయ అంటారు కొందరు’’ అని తనలో తాను గొణుక్కొంటూ మార్గాయాసంతో అటుగా వెళ్తున్న ఓ ఎద్దులబండిని ఆపి కొంతదూరం వెళ్లడానికి సహాయపడమని అడిగి బండెక్కి కూర్చుంటాడు. ఆ బండి నడుపుతున్న వ్యక్తి ముఖంలో ఏదో తెలియని ప్రకాశం, ప్రశాంతత. ఇతడు బహుశా భౌతికంగా ధనవంతుడు కాకపోవచ్చు గాని ఇతడు విశిష్టమైన ఆధ్యాత్మిక కుబేరుడుగా ఉన్నాడు. ‘‘మీ ముఖంలో అగుపిస్తున్న ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తాను ఒకొప్పుడు సప్త వ్యసనాలకు బానిసగా ఉంటూ కుటుంబాన్ని ఛిద్రం చేసుకొంటున్న వేళలో యేసు జీవితం మరియు ఆయన మధురమైన ప్రేమ తనను ఎలా రక్షించాయో సవివరంగా వివరించాడు’’. తాను వెదకుచున్న ప్రశ్నలకు సమాధానాలు లభించే చోటు దొరికిందన్న సంతోషంతో కొన్ని రోజులు మీ ఇంటిలో ఉండవచ్చా? అని అడిగాడు. తప్పకుండా ఉండవచ్చు అన్న సమాధానం ఆ యువకునికి ఊరటనిచ్చింది. ఇంటికి చేరగానే చాలాకాలం తరువాత కడుపునిండా తృప్తిగా అన్నం తిన్నాడు. తనకున్న ప్రశ్నలను వారితో పంచుకున్నాడు. ఏదీ దాచుకోకుండా వారు తమకు తెలిసినది యువకునికి వివరించిన పిదప పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను అతని చేతిలో ఉంచారు. నీ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది అని వారు చెప్పడంతో రాత్రంతా దైవగ్రంథాన్ని భక్తితో ఆసక్తితో పఠించడం మొదలుపెట్టాడు. కృపకు రాజబాటలు వేసిన యేసు జనన మరణ పునరుత్థానములు తన మనసును హత్తుకున్నాయి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏవేవో చిన్న చిన్న బహుమానాలు కాదు ఇచ్చింది, తన విలువైన ప్రాణాన్నే బలిదానంగా సమర్పించి, మరణాన్ని జయించి తిరిగిలేచాడు. తాను చెప్పిన మాటలు మరియు తన బల్యర్పణ వాస్తవమైనవని ఆయన పునరుత్థానము ఋజువు చేసిందని విశ్వసించాడు. మానవుని సృష్టించినది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నాడు. ‘మానవుడు దేవుని సృష్టి. సర్వశక్తిగల దేవుడు తన రూపములో తన పోలికలో మనిషిని కలుగచేశాడు. ఆ కారణాన్ని బట్టి సృష్టిలో గ్రహాల కన్నా, నక్షత్రాల కన్నా, పాలపుంతల కన్నా మనిషే గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నియు మనిషి కోసమే సృష్టించబడ్డాయి. మానవుడు కలుగచేయబడిన విధానం చాలా విలక్షణమైనది. మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని మనిషికి తొడిగి నీవు ఈ విశ్వాన్ని ఏలుబడి చేయాలని దేవుడు ఆదేశించాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనిషి కోతి నుండి పరిణామం చెందినవాడు కాదు. లేదా ఏదో రసాయన చర్యల ద్వారా ఉద్భవించినవాడు కాదు. దేవుని రూపంలో ఆయన దివ్య ప్రణాళికలను నెరవేర్చడానికి çసృష్టించబడినవాడు. మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? అనే ప్రశ్నకు సయితం సమాధానం కనుగొన్నాడు. మానవుడు జీవించే డెబ్బయి లేదా ఎనభై సంవత్సరాలు తనకు తాను ఏదో కూడబెట్టేసుకొని సంపాదించుకొని ఏదో ఒకరోజు మరణించడం కానేకాదు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఒక పరమార్థం ఉంటుంది. దానిని తెలుసుకొని మహోన్నతమైన దైవచిత్తానికి లోబడి పదిమందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా బతకడమే ఆ పరమార్థం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే దైవాజ్ఞకు లోబడడంలోనే అమితమైన ఆనంద సంతోషాలు దాగియుంటాయి. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు? మరణం అందరికి వస్తుంది. సామంతులైనా సామాన్యులైనా, రాజులైనా రోజువారి కూలీలైనా, స్వాములైనా, సోగ్గాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా, స్త్రీలైనా పురుషులైనా, ఒంటిచేత్తో ప్రపంచాన్ని గడగడలాడించిన వారైనా మరణం ముందు తల వంచాల్సిందే. మరణం తర్వాత ఏం జరుగుతుంది? క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఒక మనిషి మరణించిన తరువాత కూడా జీవిస్తాడు. ఈ భూమ్మీద తాను చేసిన పాపాలకు క్షమాపణ పొంది విశ్వాసం ద్వారా దేవుని నీతితో నింపబడితే మోక్షరాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు దేవుని రాజ్యములో అమరుడుగా జీవిస్తాడు. లేని పక్షంలో తన పాపాలకు శిక్షగా నరకములో వేదనను అనుభవిస్తాడు. మరణం తరువాత ఏమి జరుగుతుందో మనుష్యులకు తెలియకపోవచ్చు గాని ఆదిమధ్యాంతరహితుడైన పరమాత్ముడు ఆ విషయాలను తెలిపినప్పుడు మనిషి నమ్మాల్సిందే. ఎంతో కాలంగా చెప్పులరిగేలా ఈ ప్రశ్నలకు సమాధానాలను వెదకుచున్న ఆ యువకుని మనసు కుదుటపడింది. పరమాత్ముని గూర్చిన సత్యం బోధపడింది. సంతోషంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన సత్యాన్వేషణ ఏవిధంగా కొనసాగిందో, సత్యాన్ని ఏవిధంగా కనుగొన్నాడో చెప్పాడు. యేసు పునరుత్థానం చెందుట వలన తన భక్తులకు విజయానికి సంబంధించిన అనిర్వచనీయమైన భరోసా దొరికింది. ఏ దేవుడైతే తమ గుండెల్లో కొలువుతీరాడో ఆయన మరణాన్ని జయించినవాడు అని జ్ఞప్తికి తెచ్చుకొన్న ప్రతిసారి జీవితం పునీతమౌతుంది. జీవితకాలం ఆయన తమతో తోడుగా ఉంటాడన్న సత్యం వారిని ఆనంద పారవశ్యంలోనికి నడిపిస్తుంది. దుఃఖం నాట్యంగా మారుతుంది. ఓటమిలాగా కనిపించిన పరిస్థితులలో దేవుడు అసాధారణరీతిలో వారికి విజయమిస్తాడనే నమ్మకం స్థిరపడుతుంది. మరణాన్నే జయించగలిగిన దేవుడు కష్టపరిస్థితుల్లో స్మరించుకుంటే పట్టించుకోకుండా ఎందుకుంటాడు? దుష్టశక్తులు కొన్నిసార్లు ఊహించని రీతిలో స్థాయిలో చెలరేగిపోతుంటాయి. అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకొనే ప్రయతాన్ని కొందరు నిర్విరామంగా చేస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తుంటారు. జీవితం ముగింపు దశకు వచ్చేసిందని హేళన చేస్తారు. యేసుక్రీస్తు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అంతా తామనుకున్నట్టుగా జరిగించారు. అబద్ధ సాక్ష్యములు పెట్టి, న్యాయం యేసు వైపు ఉన్నప్పటికి పిలాతు మనసును తమవైపు తిప్పుకొని మరణ శాసనాన్ని లిఖించారు. ఆయన మరణాన్ని కన్నుల పండువగా వేడుకగా చూశారు. విపరీతమైన బాధను అనుభవిస్తుంటే ఏదో ఘనకార్యం చేస్తున్నామన్నట్టుగా ఉప్పొంగిపోయారు. సమాధిలో పెట్టబడినప్పుడు ఒకే ద్వారం కలిగిన సమాధిముందు బరువైన రాయిని అడ్డుగా ఉంచారు. వందలాదిమంది సైనికులను కాపలాగా ఉంచారు. అయితే చివరకు ఏమయ్యింది? వారి పన్నాగాలన్ని ఏమయ్యాయి? యేసు ప్రభంజనాన్ని సమాధిముందు ఉంచిన రాయిగాని, రాటుతేలిన రాణువవారుగాని ఆపగలిగారా? అరచేతులతో సూర్యకాంతిని అడ్డుకోవడం తేలికకాదు అనే విషయం ఆదివారం ఉదయాన్నే క్రీస్తు పునరుత్థానంతో ఋజువు చేయబడింది. పైశాచికంగా తమ నోళ్లవెంబడి వడిగా వెలువడిన మాటల పిడుగుల సవ్వడి సద్దుమణిగింది. ప్రగల్భాలు పలికిన నోళ్లు మూతలుపడ్డాయి. ఒంటరిగా మూడురోజులు సమాధిలో ఉన్న యేసు మరణ సంకెళ్ళను తెంచుకొని బయటకు వచ్చాడు. అంతవరకు విరుచుకుపడిన అల్లరిమూకలు మూర్ఛిల్లి పడిపోయారు. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. దుమ్మునిండిన మనిషి హృదయదారుల్లో విజయ ప్రవాహం పరవళ్లు తొక్కింది. బంధాలకు, అప్యాయతలకు, ప్రేమకు చోటులేని సమాజంలో మనిషి కలలు కూడా సమాధిచేయబడుతున్నాయి. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న వారి ఆశయాలను సమాధిలో కుక్కేస్తున్నారు. యేసు పునరుత్థాన చరితను ఆకళింపు చేసుకోగలిగితే సమాధిలో కూరుకుపోయిన ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు మరలా తిరిగి లేస్తాయనే భరోసా వస్తుంది. ఎంతమంది అదిమిపెట్టి పాతాళానికి తొక్కేసినా ఒకానొకరోజు అవి భూమిలోతులను చీల్చుకొని వచ్చే మహాబీజంగా శాఖోప శాఖలుగా పల్లవిస్తాయి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలగడమే నిజమైన విజయానికి నిర్వచనం. నాగలితో జీవితమనే పొలాన్ని అందరూ దున్నేసారని బాధపడడం కంటే ఆ దున్నబడిన పొలంలో విత్తనాలు వేసుకొంటూ పోవడమే సహృదయుల విశిష్ట లక్షణం. సమయం వచ్చినప్పుడు పనలు కోసుకొంటూ ముందుకు సాగిపోవడమే విజయవీరులు ప్రపంచానికి నేర్పించే పాఠం. ‘‘భయపడకుడి, ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే లేచి యున్నారు.’’ ఇదే మాట నేటికి యెరూషలేములోని యేసుక్రీస్తు సమాధిలోపల చూడగలం. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. ఆ ఖాళీ సమాధి కోట్లాదిమంది హృదయాలలో ఉన్న ఖాళీని పూరించింది. చీకటిని పారదోలింది. ప్రపంచ పోకడ పరుగులోనుండి పరిశుద్ధుని జాడలోనికి మానవాళిని నడిపింది. దౌర్భాగ్యపు కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా పరిణామం చెందాయి. శుభప్రదమైన నిరీక్షణ విప్పారింది. డా.జాన్‌వెస్లీ (యువ రచయిత, వక్త) క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సిస్టర్ విమలారెడ్డి ఈస్టర్ సందేశం
సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు శిలువ మరణం పొంది మూడవ రోజున సజీవుడై తిరిగి లేచిన పర్వదినమే ఈస్టర్. లోకంలో కక్ష, రాక్షసత్వాలు ఎంతగా పేట్రేగినా.. ప్రేమ, కరుణలకు సమాధి కట్టలేరు. ఈ పరమ సత్యాన్ని చాటేదే ఈ పర్వదినం.. శిలువపై బలిదానమైన దైవ కుమారుడు ఏసుక్రీస్తు పునరుత్థానం చెందిన పర్వదినమే ఈస్టర్.. శోకానికి అడ్డుకట్ట తథ్యమని..అంతిమంగా క్షమే జయిస్తుందని, పొలిమేరలు లేని ప్రేమకే పట్టాభిషేకమని సందేశమిచ్చే పండగ ఈస్టర్. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈస్టర్ ఆదివారం రోజున క్రైస్తవులు సమాధుల వద్దకు చేరుకుని రంగులతో అలకరించిన సమాధులపై పూలు చల్లి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. ఈస్టర్ పర్వదినం ప్రాముఖ్యతపై సిస్టర్ వైఎస్ విమలారెడ్డి వివరణాత్మక సందేశం ఇచ్చారు. ఈస్టర్ పర్వదినంపై పూర్తి వివరణాత్మక సందేశం కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. -
ఏప్రిల్ వరకూ శ్రీలంకకు ఫ్రీ వీసా!
న్యూఢిల్లీ: భారతీయులకు ఇస్తున్న ఫ్రీ వీసా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ కొనసాగించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది జరిగిన ఈస్టర్ దాడుల వల్ల పర్యాటక రంగానికి కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఫ్రీ వీసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచే ముసాయిదా కేబినెట్ పరిశీలనలో ఉందని ఆ దేశ పర్యాటక మంత్రి ప్రసన్న రణతుంగ శుక్రవారం తెలిపారు. -
శ్రీలంక చేరుకున్న ఎన్ఐఏ బృందం
కొలంబో: శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్లలో భారత్ మూలాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం కొలంబోకు చేరుకుంది. బాంబులకు పాల్పడిన వారు భారత్‌లోని కశ్మీర్, కేరళలో శిక్షణ పొందినట్లు తెలుస్తోందని శ్రీలంక పోలీస్ చీఫ్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై లోతైన విచారణ కోసం ఎన్ఐఏ బృందం సంబంధిత అధికారులతో చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయి. -
శ్రీలంకలో ఇంకా బాంబుల మోత
కొలంబో: శ్రీలంకలో ఇంకా బాంబుల మోత మోగుతోంది. ఈస్టర్ సండే రోజు జరిగిన మారణహోమం నుంచి తేరుకోకముందే.. శుక్రవారం రాత్రి మరోసారి మానవ బాంబులు పేలాయి. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కాల్పులకు పాల్పడగా.. ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా సమ్మంతురై ప్రాంతంలో ఉగ్రస్థావరంపై సైన్యం దాడులు నిర్వహించింది. భద్రతాబలగాల రాకను పసిగట్టిన దుండగులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతిచెందారు. ఈ స్థావరం నుంచి భద్రతాబలగాలు భారీగా పేలుడు పదార్థాలు, ఐసిస్ యూనిఫారాలను స్వాధీనం చేసుకున్నాయి. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో 253 మంది మరణించారు. 500మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఈ దాడులకు ఐసిస్ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించుకుంది. -
అల్పాహారం క్యూలో నిలుచునే!
కొలంబో: శ్రీలంకలో భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో కొలంబోలోని లగ్జరీ హోటల్ ‘సినమన్ గ్రాండ్ హోటల్’ఒకటి. ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. క్యూలో వచ్చిన ఆజం ప్లేట్లో అల్పాహారం వడ్డిస్తుండగానే.. ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే.. ఆ లాంజ్ అంతా రక్తపుమరకలు.. ‘ప్లీజ్ కాపాడండం’టూ ఆర్తనాదాలతో నిండిపోయింది. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈస్టర్ బ్రేక్‌ఫాస్ట్ కోసం లాంజ్ బిజీగా ఉంది. ఇందులో కుటుంబాలతో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణంలోనూ.. మా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాం. దాదాపు 20 మంది పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. వీరిని నేషనల్ హాస్పిటల్ పంపించాం’అని ఆ హోటల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కుదరకపోవడంతోనే! ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉన్మాది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని పోలీసులు సేకరించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం శ్రీలంక జాతీయుడే అయిన ఉన్మాది ఆజం.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి బిజినెస్ పనిమీద వచ్చానంటూ మరో రెండు హోటల్స్‌లో గదులకోసం ప్రయత్నించాడు. ఆయా హోటళ్ల మేనేజర్లు తిరస్కరించడంతో చివరకు శనివారం రాత్రి సినమన్ గ్రాండ్ హోటల్లో చేరి ఇంతమంది ప్రాణాలు తీశాడని వెల్లడైంది. సినమన్ గ్రాండ్తోపాటు షాంగ్రి–లా, కింగ్స్బరీ హోటళ్లతోపాటు ఈస్టర్ ప్రార్థనలకోసం వచ్చిన మరో మూడు చర్చిల్లోనూ ఉన్మాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. చారిత్రక సెయింట్ ఆంథోనీస్ కేథలిక్ చర్చ్‌లో అత్యంత తీవ్రతరమైన పేలుడు జరిగింది. చర్చ్ పైకప్పు ఊడి కిందపడడంతోపాటు.. అలంకరించిన లైట్లు, అద్దాలు విరిగిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడులకు కారణం ఎవరనేదానిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దుర్ఘటనలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. వీరంతా ఆయా హోటళ్లలో జరిగిన పేలుళ్లలోనే చనిపోయారు. ప్రధాని నివాసానికి సమీపంలోనే.. హోటల్ సినమోన్ గ్రాండ్‌కు సమీపంలోనే శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం ఉండడంతో.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. షాంగ్రి–లా హోటల్లోని టేబుల్ వన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు వినిపించాయి. అయితే.. ఈ ఘటనలో ఎందరు మరణించారో ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ హోటల్ రెండో అంతస్తులోని రెస్టారెంట్లో పేలుడు ధాటికి కిటికీలు ఎగిరిపోయాయి. పైకప్పులో ఉన్న విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ‘హోటల్లో ఉన్న మిగిలిన వారి భద్రతే మా ప్రాధాన్యత. వారిని కాపాడేందుకు మా విపత్తు నిర్వహణ బృందం పనిచేస్తోంది’అని షాంగ్రి–లా హోటల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మృతుల దిబ్బగా కింగ్స్బరీ కొలంబో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలోని కింగ్స్బరీ హోటల్.. నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ జరిగిన పేలుడులోనూ మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎందరు చనిపోయారు.. వారి వివరాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ‘ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఈ వరుస బాంబుపేలుళ్లపై యావత్ శ్రీలంక మౌనంగా రోదిస్తోంది. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం. వారికి అవసరమైన వైద్యసేవలను అందించడంలో మా వంతు సాయంచేస్తున్నాం. హోటల్ మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించాం’అని కింగ్స్బరీ హోటల్ యాజమాన్యం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. చర్చిలో మాంసం ముద్దలు కొలంబో: ముష్కర మూకల రక్తదాహానికి అమాయక భక్తులు బలయ్యారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చి, సెయింట్ ఆంథోనీస్ చర్చిలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. చర్చిల గోడలకు మనుషుల మాంసపు ముద్దలు అతుక్కుపోయాయంటే పేలుళ్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా రక్తపు మడుగులే దర్శనమిచ్చాయి. పేలుళ్ల తీవ్రతకు అద్దాలు పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి. కుర్చీలు సైతం విరిగిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. సెబాస్టియన్ చర్చి బయట కూడా మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. చర్చిల్లో ఈ దారుణ దృశ్యాలను చూసి పోలీసులు, సహాయక సిబ్బంది చలించిపోయారు. సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో 30 మృతదేహాలు లభించాయని ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలంబో ప్రతినిధి ఫాదర్ ఎడ్మండ్ తిలకరత్నే చెప్పారు. ఈ చర్చిలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మతబోధకులు గాయపడ్డారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ చర్చికి సమీప గ్రామాల నుంచి 1,000 మందికిపైగా భక్తులు వచ్చారని వెల్లడించారు. శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన సెబాస్టియన్ చర్చిని నెగొంబో పట్టణంలో 1946లో నిర్మించారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో అమరవీరుడిగా పేరుగాంచిన సెయింట్ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పేలుళ్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొలంబో ఆర్చిబిషప్ కార్డినల్ మాల్కోమ్ రంజిత్ డిమాండ్ చేశారు. ద్వీప దేశానికి నెత్తుటి గాయాలు శ్రీమహాబోధి దాడి (1985): అనురాధాపురాలో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో క్రైస్తవ సన్యాసులు (నన్స్), బౌద్ధ భిక్షవులతో సహా 146 మంది పౌరులు మరణించారు. ► అలూత్ ఒయా నరమేధం (1987): సింహళీ జాతీయులపై ఎల్టీటీఈ చేసిన దాడిలో 127 మంది మరణించారు. ► శ్రీలంక పార్లమెంట్‌పై గ్రెనేడ్ దాడి (1987): శ్రీలంక పార్లమెంట్‌పై ఎల్టీటీఈ తీవ్ర వాద సంస్థ జరిపిన గ్రెనేడ్ బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ► కొలంబో బస్‌స్టేషన్‌లో బాంబుదాడి (1987): కొలంబో బస్‌స్టేషన్‌లో జరిగిన కారు బాంబు దాడిలో 113 మంది పౌరులు మరణించారు. ► కట్టంకూడి మసీదులో నరమేధం (1990): కట్టంకూడి మసీదులో ఎల్టీటీఈ చేసిన దాడిలో 147 మంది ముస్లింలు చనిపోయారు. ► పల్లుయగొదెల్లా నరమేధం (1992): సింహళ జాతీయులే లక్ష్యంగా పల్లుయగొదెల్లాలో ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన దాడిలో 285 మంది దుర్మరణం పాలయ్యారు. ► కొలంబో సెంట్రల్ బ్యాంకుపై బాంబుదాడి (1996): కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేటువద్ద ఎల్టీటీఈ అమర్చిన ట్రక్కు బాంబు దాడిలో 91 మంది మరణించారు. ► దిగంపతన బాంబుదాడి (2006): దిగంపతనలో 15 మిలిటరీ కాన్వాయ్ బస్సులపై ఎల్టీటీఈ ట్రక్కు బాంబు దాడిలో 120 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన సినమన్ హోటల్ సెబాస్టియన్స్ చర్చిలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఆదివారం కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చి వద్ద రోదిస్తున్న బాధితులు సెబాస్టియన్స్ చర్చి వద్ద గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం ఉగ్రవాదుల కోసం ఓ హోటల్ వద్ద హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు -
దివ్య సందేశంపై రాక్షస కృత్యం!
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక నెత్తురోడింది. క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు నరహంతకులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీ యులు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అనే ముగ్గురు భారతీయులు మరణించారనీ, వీరి గురించిన అధిక వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ తెలిపారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నా మని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. వాటికన్ సిటీలో ఇచ్చిన సందేశంలో ఈ ఘటనను దారుణ హింసగా అభివర్ణించారు. ఆదివారం ఉత్తర కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చిలో ప్రార్ధనల సమయంలో చోటుచేసుకున్న భారీ పేలుడుతో బీతావాహ దృశ్యం.. దశాబ్దం తర్వాత మళ్లీ విధ్వంసం ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్)తో అంతర్యుద్ధం ముగిశాక గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో తాజా పేలుళ్లు మళ్లీ రక్తపాతాన్ని సృష్టించాయి. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారితోపాటు, శ్రీలంకకు వచ్చి విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొలంబోలోని సెయింట్ ఆంథోని చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చిలో ముందుగా ఉదయం 8.45 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ప్రజలు ప్రశాంతంగాప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుళ్లు జరిగాయని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. పేలుళ్లలో విదేశీయులైన ఇద్దరు చైనీయులు, పోలండ్, డెన్మా ర్క్, జపాన్, పాకిస్తాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు కూడా మృతి చెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలంబో లోని ఐదు నక్షత్రాల హోటళ్లైన షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరిల్లోనూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికిపాల్పడింది తామేనని ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. శ్రీలంకలో గతంలో ఎల్టీటీఈ భయానక దాడులకు పాల్పడేది. శ్రీలంక నుంచి విడదీసి తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎల్టీటీఈ దాదాపు మూడు దశాబ్దాలు పోరాడింది. చివరకు 2009తో ఎల్టీటీఈ అధ్యక్షుడు వేళుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక ఆర్మీ మట్టుబెట్టడంతో ఇక ఆ సంస్థ అంతరించిపోయింది. ఆత్మాహుతి దాడులేనని చెప్పలేం.. ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు దాడులూ ఆత్మాహుతి దాడులేనని చెప్పడానికి పోలీసుల వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవనీ, అయితే నెగొంబో చర్చిలో పేలుడు తీరును పరిశీలిస్తే అది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని గుణశేఖర చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ సినమన్ గ్రాండ్ హోటల్ లోని రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించారు. కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో 66 మృతదేహాలను ఉంచామనీ, గాయపడిన 260 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నామని గుణశేఖర తెలిపారు. అలాగే నెగొంబో లోని మరో వైద్యశాలలో 104 మృతదేహాలు ఉండగా, 100 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనుమానంపై ఏడుగురిని అరెస్టు చేశా మని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజెవర్ధనే తెలిపారు. ఈ ఎనిమిది దాడులనూ ఒకే సంస్థ చేసిందని తాము భావిస్తున్నామన్నారు. దాడుల్లో మొత్తం 27 మంది విదేశీయులు చనిపోయారని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి రవీంద్ర అరియసింఘె వెల్లడించారు. గాయపడిన విదేశీయుల్లో భారత్‌తోపాటు అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారని మీడియా తెలిపింది. రాజధాని కొలంబోలోని జూ వద్ద జరిగిన మరో పేలుడులో ఇద్దరు మరణించారు. కొలంబో శివార్లలోని ఓ ఇంట్లో సోదాలు జరిపేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది చనిపోయారు. ముందే హెచ్చరించినా.. శ్రీలంకలో త్వరలో ప్రధాన చర్చిలు లక్ష్యంగా బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ పోలీస్ చీఫ్ 10 రోజుల ముందుగానే హెచ్చరించారు. ఏప్రిల్ 11నే ఆయన నిఘా హెచ్చరికలను ఉన్నతాధికారులకు పంపారు. ‘నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్టీజే) అనే సంస్థ చర్చిలు, కొలంబోని భారత దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఓ విదేశీ నిఘా సంస్థ నుంచి సమాచారం అం దింది’అని పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. అయినా శ్రీలంక పోలీసులు దాడులను ఆపలేకపోయారు. ముస్లిం సంస్థ అయిన ఎన్టీజే గతేడాది బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడంతో దాని పేరు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని విక్రమసింఘే నిరవధిక కర్ఫ్యూ విధింపు ఎనిమిదో పేలుడు సంభవించిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందంది. ప్రజలు శాంతిని పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ‘ఈ అనూహ్య పరిణామాల వల్ల నేను విస్మయానికి గురయ్యాను. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను కోరాం’అని ఆయన చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె మాట్లాడుతూ ఇవి పిరికిపందలు చేసిన దాడులనీ, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని కోరారు. సెలవులో ఉన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, వైద్యాధికారుల అందరి సెలవులను రద్దు చేసి తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాలతోపాటు బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచారు. తాత్కాలికంగా అన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. పాఠశాలలను సోమ, మంగళవారాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నిరవధికంగా మూసివేశారు. కొలంబో జిల్లాలో ఈస్టర్ ప్రార్థనలను రద్దు చేస్తున్నట్లు కార్డినల్ (క్రైస్తవ మతంలో ఓ పదవి) మాల్కొమ్ రంజిత్ చెప్పారు. ఎల్టీటీఈని అణచివేసిన నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స మాట్లాడుతూ ఇది ఆటవిక దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక, ఉగ్రవాద, పిరికిపందల చర్యలను తాము సహించబోమనీ, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఎన్టీజే..హింసామార్గం శ్రీలంకలో చర్చిలపై నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) దాడులు చేసే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని 10రోజుల క్రితమే హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. అయితే ఈ హెచ్చరికల్ని శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ముస్లిం అతివాదులు సభ్యులుగా ఉన్న ఎన్టీజే తొలి సారి 2013లో వెలుగులోకి వచ్చింది. 2013, జూన్‌లో ఎన్టీజే కార్యదర్శి అబ్దుల్ రెహ్మానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గౌతమబుద్ధుడు నరమాంస భక్షకుడనీ, బౌద్ధమతం నరమాంస భక్షణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బౌద్ధుల ఆరాధనా విధానంపై విమర్శలు చేశారు. దీంతో 2014 మార్చిలో శ్రీలంకలో బౌద్ధులు–ముస్లింల మధ్య హింస చెలరేగడంతో ప్రభుత్వం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజలను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను 2016లో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. 2018లో ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులు గౌతమబుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చా యి.వీరి వ్యవహారశైలి హద్దుదాటడంతో ఎన్టీజేపై నిషేధం విధించాలని పీస్ లివింగ్ ముస్లిమ్స్ ఇన్ శ్రీలంక(పీఎల్ఎంఎంఎస్ఎల్) డిమాండ్ చేసింది. కేవలం హిం సను ప్రోత్సహించడమే కాకుండా ఇస్లాంలో అతివాద వహాబీ భావజాలాన్ని ఎన్టీజే వ్యాప్తిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో 22 లక్షల మంది ప్రజలు ఉండగా వీరిలో బౌద్ధులు 70%, హిందువులు 12.5%, ముస్లింలు 10%, క్రైస్తవులు 7.5%ఉన్నారు. శ్రీలంకను వరుస బాంబు పేలుళ్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొలంబో బిషప్ దిలొరాజ్ కనగసబే భావోద్వేగంతో స్పందించారు. ‘30 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో సతమతమైన అనంతరం మన ప్రజలంతా కలసిమెలసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తమ–తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జీసస్ పునరుత్థానమైన రోజున తమ ప్రియమైనవారిని కోల్పోయి మనోవేదనను అనుభవిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. శ్రీలంక లాంటి దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, భగవంతుడిని ప్రార్థించాలని బిషప్ కనగసబే పిలుపునిచ్చారు. ‘ఈ దుర్ఘటనతో అల్లాడిపోతున్న ప్రతీఒక్కరి బాధను తగ్గించాలనీ, వారిపై దయ చూపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అలాగే విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రాణాలకు విలువ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. - కొలంబో బిషప్ భావోద్వేగ సందేశం హెల్ప్లైన్లు ప్రకటించిన భారత హైకమిషన్ శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. బాంబు పేలుళ్లు, దాడులకు సంబంధించి ఎలాంటి సహాయం, సమాచారం, స్పష్టత కావాలన్నా భారతీయులు సంప్రదించవచ్చంటూ 5 హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. +94777902082, +94777903082, +94112422788, +94112422789, +94772234176 నంబర్లకు ఫోన్ చేసి భారతీయులు వివరాలు అడగొచ్చని హైకమిషన్ ట్విట్టర్లో తెలిపింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై శ్రీలంక ఆంక్షలు కొలంబో: వరుస బాంబు పేలుళ్లపై సోషల్ మీడియా లో విస్తృతమవుతున్న వదంతులను నిరోధించేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఆదివారం బ్లాక్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వదంతులు చెలరేగుతుండటంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బాంబు పేలుళ్లపై భద్రతాదళాల విచారణ సాగుతోందని, విచారణ కొలిక్కి వచ్చేదాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతా యని ప్రకటించారు. ప్రజలు సహనంతో వ్యవహరిం చాలని, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ట్వీట్ చేశారు. ఫేస్బుక్ కూడా బాంబు పేలుళ్లపై స్పందించేందుకు వీలుగా ఒక మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిందని సీఎన్ఎన్ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేం దుకు, తమ వారిని గుర్తించేందుకు, పేలుళ్ల ప్రభావానికి గురైన సన్నిహితులను చేరుకునేందుకు వీలుగా ఈ టూల్ ఉపయోగపడుతుం దని ఫేస్బుక్ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బాంబు పేలుళ్లకు అవకాశమున్న ప్రాంతాలలో గుంపులుగా ఉండవద్దని, ఆసుపత్రుల పరిసరాలకూ ప్రజలు రావొద్దని శ్రీలంక హోంశాఖ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈస్టర్ రోజున జరిగిన ఉగ్ర దాడులు.. 2017 ఈజిప్టు 2017 ఏప్రిల్ 9న ఈజిప్ట్‌లోని టాంట, అలెగ్జాండ్రియా నగరాల్లో ఈస్టర్ పండగ రోజు జరిపిన బాంబు దాడిలో 45 మంది మరణించారు. ఈ దాడి నుంచి కాప్టిక్ పోప్ తవడ్రోస్ ఐఐ క్షేమంగా బయటపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని డాయిష్ ప్రకటించింది. 2016 పాకిస్తాన్ లాహోర్‌లోని ఓ పార్క్‌లో ఈస్టర్ వేడుకలను జరుపుకుంటున్న వారిపై బాంబు దాడి జరిగింది. చిన్న పిల్లలు సహా మొత్తం 75 మంది ప్రాణాలు విడిచారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తామే అని పాకిస్తానీ తాలిబన్ శాఖ జమత్–ఉల్–అహ్రార్ ప్రకటించుకుంది. 2012 నైజీరియా ఉత్తర నైజీరియాలో సాం స్కృతిక, ఆర్థిక నగరమైన ఖడునాలో 2012 ఏప్రిల్ 8న చర్చి వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఇస్లామిక్ సంస్థ బొకొ హరమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. క్రిస్టియన్స్‌పై దాడులు.. 2019 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్‌లో ముస్లిం ప్రాబల్యం ఉన్న జోలో ప్రాంతంలోని ద్వీపకల్పంలో 2019 జనవరి 27న క్యాథలిక్‌లపై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడికి డాయిష్ బాధ్యత వహించింది. కానీ దాడికి పాల్పడింది అజంగ్–అజంగ్ సంస్థగా అధికారులు పేర్కొనారు. 2017 ఈజిప్ట్ 2017 మే 26న సెంట్రల్ మిన్య వద్ద సెయింట్ సామ్యూల్ ఆశ్రమానికి బస్సులో వెళ్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడింది తామే అని డాయిష్ ప్రకటించుకుంది. 2016 కైరో చర్చిలో పార్థనలు చేస్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ లక్ష్యంగా 2016 డిసెంబర్ 11న జరిగిన ఆత్మాహుతి దాడిలో 29 మంది ప్రాణాలు వదిలారు. ఈ దాడికి సైతం డాయిష్ బాధ్యత వహించింది. 2016 యెమెన్ ఉగ్రవాదులు యెమెన్‌లోని అడెన్‌లో క్యాథలిక్ వృద్ధాశ్రమంపై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. మరణించిన వారిలో కోల్‌కతాలోని మిషనరీ ఆఫ్ చారిటీకి చెందిన నలుగురు నన్‌లు కూడా ఉన్నారు. డాయిష్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015 పాకిస్తాన్ 2015 మార్చి 15న ఆదివారం రోజు లాహోర్‌లోని చర్చిల్లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనతో 17 మంది మృత్యువాత పడగా, 70 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామే అని తెహ్రీక్–ఇ–తాలిబన్ ప్రకటించింది. -
దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
-
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై : శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ... ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు. OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking. — Radikaa Sarathkumar (@realradikaa) 21 April 2019 శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 165 మంది మృతి చెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి : బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో -
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఈస్టర్ శుభదినాన ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని చల్లగా చూడాలి. మీ కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్ చేశారు. May the risen Lord bless you and your loved ones this Easter; and fill your home with hope, love and joy. Happy #Easter — YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2019 -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ రోజు ఉదయం నుంచి మూడు చర్చిలతో పాటు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. -
ప్రపంచానికి వరం పునరుత్థాన శక్తి
రెండువేల యేళ్ళనాటి ఈస్టర్ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆరోజున సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయానికి పూర్వమే చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన విశ్వాసులైన కొందరు స్త్రీలకు అక్కడ తెరువబడి ఉన్న సమాధి దర్శనమిచ్చింది. శుక్రవారం నాడు అసంపూర్తిగా మిగిలిన పరిమళ క్రియల్ని యేసు దేహానికి సంపూర్తి చేసేందుకు వాళ్ళు వెళ్లారు. సమాధికి అడ్డుగా రోమా ప్రభుత్వం ఒక పెద్దబండ రాయిని పెట్టి దానికి ముద్రవేసి అక్కడ కావలి వారిని కూడా పెట్టింది. తీరా స్త్రీలు అక్కడికెళ్తే, అడ్డు రాయి తొలగించబడి ఉంది, కావలివారు లేరు, స్త్రీలలో ఒకరైన మగ్దలీనా మరియ అది చూసి కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి పేతురు, యోహాను అనే ఇద్దరు శిష్యులకు ప్రభువు దేహాన్నెవరో ఎత్తుకెళ్లారని చెప్పి వారితోపాటు మళ్ళీ వచ్చి చూసింది. సమాధిలో ప్రభువు దేహం లేదు. సమాధి చేయడానికి ముందు శుక్రవారం నాడు ఆయనకు తొడిగిన నారబట్టలు మాత్రం సమాధిలో పడి ఉన్నాయి. ఆమెకు దుఃఖం ఆగలేదు. మగ్దలీనా మరియ అక్కడే రోదిస్తుండగా ‘అమ్మా ఏడుస్తున్నావెందుకు? ఎవరికోసం వెదుకుతున్నావు?’అని ఎంతో అనునయంగా తనను అడుగుతున్న ఒక వ్యక్తి సమాధి వద్ద కనిపించాడు. చీకట్లో అతను తోటమాలీ కావచ్చనుకొని ‘అయ్యా, నా ప్రభువు దేహాన్ని నీవేమైనా మోసుకెళ్లి ఇంకెక్కడైనా పెట్టావా?’ అనడిగింది మరియ. వెంటనే ‘మరియా’ అని ఆయన పిలువగా ఆయనే ప్రభువని గుర్తించి ‘రబ్బూనీ’ అంటే హెబ్రీ భాషలో ‘బోధకుడా’ అని ఆమె బదులిచ్చింది. మగ్దలీనా మరియకు యేసుప్రభువు ఆనాడు తనను తాను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్ నవశకం ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. పైగా అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశానిర్దేశం చేసి 40వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమేంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాలదాకా నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తితోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధమయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మశక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీలోంచి గదిలోకి వస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. అపవిత్రత అంటకుండా జీవించడానికి ఆదిమ చర్చికి ఆ శక్తే తోడ్పడింది. తమకున్నదేదీ తమది కాదని, అదంతా సమిష్టి సొత్తని భావించి ఒకరిపట్ల ఒకరు అద్భుతమైన ప్రేమానురాగాలతో వాళ్ళు జీవించింది కూడా పరిశుద్ధాత్మ శక్తిగా ప్రభువు నిర్వచించి వారందరికీ భాగస్వామ్యాన్నిచ్చింది పునరుత్థానశక్తితోనే!! అదే శక్తిని కొన్నాళ్ల తర్వాత పొందిన అపొస్తలుడైన పౌలు కూడా ‘నాకు లోకసంబంధంగా లాభకరమైన వాటినన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను. ఆయన పునరుత్థానబలాన్ని తెలుసుకోవడానికి సమస్తాన్ని మలంతో సమానంగా ఎంచుకొంటున్నాను’ అన్నది కూడా ఆ పునరుత్థాన శక్తితోనే (ఫిలిప్పి 3:7–11). ఈస్టర్ ఆదివారం ఉదయం నాటి ఈ పునరుత్థానశక్తి చేత కొత్త నిబంధన యుగపు విశ్వాసులంతా నింపబడాలన్నది యేసుక్రీస్తు అభిమతం. పౌలు పత్రికల్లో పౌలు ద్వారా తన ఈ అభిలాషను ప్రభువు వ్యక్తం చేశాడు. ప్రభువు పునరుత్థాన శక్తినెరుగని, ఆ శక్తిని పొందడం ఎంత అత్యవసరమో అవగాహన లేని చర్చి ఎంత పెద్దదైనా, ఆ చర్చిలో వేలు, లక్షలమంది విశ్వాసులున్నా అది నిర్జీవమైనదే, నిస్సారమైనదే. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురు తదితర శిష్యులకు ప్రభువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్థైర్యం కరువయింది. ఎందుకంటే వాళ్లంతా ఆయన్ను వదిలేసి ప్రాణభయంతో పారిపోయారు. ఇపుడు ఏ మొహం పెట్టుకొని ఆయనతో మళ్ళీ జత కలుస్తారు? అందువల్ల పేతురు గలిలయ సరస్సులో చేపలు పట్టే పనికి మళ్ళీ వెళ్లిపోదామనంటే మిగిలిన శిష్యులు కూడా ఆయనతో వెళ్లిపోయారు. కాని యేసుప్రభువు ప్రేమతో వెళ్లి వారిని అక్కడే కలుసుకున్నాడు. గలిలయ సరస్సులో చేపలు పడుతున్న శిష్యులకు ముఖ్యంగా పేతురుకు ఆయన సాక్షాత్కారం అలా లభించింది. వారిని ప్రభువు మళ్ళీ తన పరిచర్యకు పిలుచుకొని ఈసారి వారిని తన పునరుత్థాన శక్తితో నింపి అజేయులను చేశాడు. దేవుని పేరుతో లోకంలోని మంచివాటిని సంపాదించుకో వడానికి మామూలు శక్తియుక్తులు చాలు. కానీ లోకాన్ని ఆయన ప్రేమ, క్షమాపణ, సమాధానంతో నింపడానికి మాత్రం చాలా త్యాగపూరితమైన జీవితం, పరిచర్య అవసరం. అది ప్రభువిచ్చే పునరుత్థానశక్తితోనే సాధ్యం. దేవుని పేరుతో ఎన్నెన్నో కూడబెట్టుకోవాలి అ నుకునేవారికి, దేవునికోసం అన్నింటినీ నష్టపర్చుకొని, వ్యయపర్చుకొని, పోగొట్టుకునేవారికి, లోకశక్తికి, పునరుత్థాన శక్తికి ఉన్నంత తేడా ఉంది. ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు పోవడానికి మాత్రం పునరుత్థాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ శక్తే!!! హ్యాపీ ఈస్టర్.... రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com స్కాట్లాండ్ దేశంలో జాన్ జి. ప్యాటన్ 13 మంది పిల్లలున్న ఒక నిరుపేద కుటుంబంలో 1824లో జన్మించాడు. చాలా చిన్నతనంలోనే ప్రభువును ఎరిగాడు. ప్రభువు పరిచర్య కోసం సిద్ధపడ్డాడు. ఇపుడు మనం వెస్టిండీస్ గా పిలుస్తున్న నల్లజాతీయులుండే ‘కెరీబియన్ దీవులకు’ తనను దయచేసి తనను పంపమని తన చర్చి ముఖ్యాధికారికి ఉత్తరం రాశాడు.‘నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్లిన మన మిషనేరీలను 19 ఏళ్ళ క్రితమే అక్కడి నరమాంసభక్షకులు చంపుకొని తిన్నారని నీకు తెలియదా? వెళ్లిన మరుక్షణమే నిన్ను కూడా వాళ్ళు చంపుకు తినేస్తారు జాగ్రత్త. కావాలంటే సురక్షితమైన, సుఖవంతమైన మరో స్థలానికి నిన్ను పంపుతాను’ అని జవాబిచ్చాడు డిక్సన్ అనే ఆ వృద్ధ మిషనేరీ. ‘కుదరదు. నేనక్కడికే వెళ్తాను. నా మృతదేహాన్ని భూమిలో పురుగులు తింటాయా, లేక నరమాంసభక్షకులు తింటారా? అన్నది నాకు చాలా చిన్న విషయం. చీకట్లో ఉన్న ప్రజలను దేవుని వెలుగులోకి తేవడమే నా జీవిత లక్ష్యం. అందుకు నాకు ప్రభువువారి పునరుత్థాన శక్తి తోడుగా ఉంటుంది. దయచేసి నన్ను అక్కడికే పంపండి’ అని ప్యాటన్ ఆయనకు మరో ఉత్తరం రాశాడు. ఎట్టకేలకు ప్యాటన్ 32 ఏళ్ళ వయసులో తన్నా అనే కెరీబియన్ దీవిలో తన భార్య మేరీతో సహా కాలుబెట్టాడు. అలా అనడం కంటే, కష్టాల కొలిమిలో కాలుబెట్టాడనడం ఉచితమేమో. నరమాంసభక్షకులైన దాదాపు 4000 మంది నల్లజాతీయులు ఆ దీవిలో ఉంటే, వారి నుండి తనను తాను రక్షించుకోవడమే తొలి రోజుల్లో అతనికి ప్రధాన వ్యాపకంగా ఉండేది. అయినా వారిమధ్య ధైర్యంగా తన పరిచర్య కొనసాగించాడు. వారికి బట్టలేసుకోవడం దగ్గరినుండి నాగరికతనంతా నేర్పించాడు. ఈలోగా ఆయన భార్య, కుమారుడు నిమోనియాతో వారం రోజుల వ్యవధిలో చనిపోతే తానుండే ఇంటిపక్కనే తానే స్వయంగా తవ్వి వారిని భూస్థాపన చేశాడు. ఎన్నో రాత్రులపాటు ఆ సమాధుల వద్ద ఒంటరితనంతో రోదిస్తూ గడిపాడు. ఇప్పటికైనా స్వదేశానికి వచ్చెయ్యమన్నారు పెద్దలు. కానీ అది మాత్రం జరగదన్నాడు. ఆ ద్వీపవాసులకు సువార్త చెబుతూనే వారి భాషను నేర్చుకొని వారి భాషకు లిపిని తయారుచేసి, ఆ లిపిని వారికి నేర్పించి ఆ భాషలోకి బైబిల్‌ను అనువదించాడు. అలా అక్షరాస్యతా ఉద్యమాన్ని అక్కడ ఆరంభించాడు. కెరిబియన్ దీవులన్నింటిలో అలా సువార్త ఉద్యమం, సాక్షరతా ఉద్యమం, నాగరికతా ఉద్యమం ఒకేసారి వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా ఆ దీవుల్లోని వాళ్లంతా నరమాంసభక్షణ మానేసి యేసుప్రభువు రక్షణలోకి వచ్చి దేవుని ఆరాధకులుగా మారారు. ఆయన మరణించేనాటికి అంటే 1907 నాటికి ఆ దీవులన్నీ, సువార్తతో, అక్షరాస్యతతో, నాగరికతతో నిండిపోయాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రభువువారి పునరుత్థాన శక్తితో నింపబడితే వచ్చిన విప్లవాత్మకమైన మార్పులివి. -
వైఎస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పునరుద్ధానుడైన క్రీస్తుఏసు ఆశీర్వాదాలు ప్రతికుంటుబానికి లభించాలని ఆకాంక్షించారు. ‘‘మీకు, మీ కుటుంబాలకు ప్రేమ, శాంతి చేకూరాలని కోరుతున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. May the resurrected Christ bless your home and fill you and your loved ones with peace, love and joy. Happy Easter. — YS Jagan Mohan Reddy (@ysjagan) 1 April 2018 -
క్రీస్తు కారుణ్యం మనకు ఆదర్శం
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మనుష్యుల హదయాల్లో వెలుగును నింపిన పండుగ ఇది. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు పునరుత్థానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియచేసింది. దేవునికి అసాధ్యమేదీ ఉండదని నిరూపించింది. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ యేటా కోట్లాదిమంది ఆ ఖాళీ సమాధిని చూసి పరవశంతో నింపబడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. క్రీస్తు జీవనశైలి ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైది. భువిపై ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకొని వచ్చింది. నిరాశ నిస్పృహల నుండి మనిషికి విడుదల ప్రసాదించింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. మహత్తర ఆధ్యాత్మిక భావాలు ఇమిడియున్న ఆయన బోధల ద్వారా ప్రయోగాత్మకమైన ఫలవంతమైన జీవితానుభవాలు పొందుకొనే సావకాశం ఏర్పడింది. గర్వం, అహంభావం, దురహంకారం ఏలుబడి చేస్తున్న ప్రస్తుత లోకంలో ఘనతర లక్ష్యాలు నిలువుగా నీరు గారిపోతున్నాయి. మనిషి మస్తిష్కంలో గూడుకట్టుకుపోయిన పాప స్వభావం వల్ల సమాజానికి చాలా కీడు జరుగుతోంది. పాపం మనిషిని ఎటువంటి నీచస్థానానికైనా దిగజారుస్తుంది. ఆఖరుకు పతనానికి నడిపిస్తుంది. సాటి మనిషిని ప్రేమించని రాక్షస సమాజంలో తన దివ్యమైన బోధల ద్వారా నవ్యపథ నిర్దేశం చేసిన ఘనుడు యేసుక్రీస్తు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ఆచరణాత్మకంగా చాటిచెప్పాడు. తన పంతమే నెగ్గాలని ఉవ్విళ్లూరే ఉగ్రవాదానికి బలౌతున్న అభాగ్యులు ఎందరో. పైశాచిక మూర్ఖత్వపు దాడులు మానవాళి చరిత్రలో నెత్తుటి పుటలను లిఖిస్తున్నాయి. ఇటువంటి సమాజంలో మార్పును తీసుకురావాలన్న సదాశయంతో వెలువడిన క్రీస్తు సందేశాలు, బోధలు సదా ఆదరణీయం. ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.’’ అని క్రీస్తు కొండమీది ప్రసంగంలో తెలియచేశాడు. ఆత్మలో దీనత్వం అనగా తన నిస్సహాయతను సర్వశక్తుడైన దేవుని దగ్గర నిర్మొహమాటంగా ఒప్పుకోవడం. ఒక చంటిబిడ్డ తన తల్లిపై ప్రతి చిన్న విషయానికి ఏవిధంగా ఆధారపడుతుందో అలా పరమాత్మునిపై ఆధారపడటం. స్వనీతి కార్యములు మోక్షప్రాప్తినివ్వవని మనస్ఫూర్తిగా గ్రహించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలను అశ్రువులతో అభిషేకం చేయడం. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా పతనానికి దోహదమయ్యే దుర్లక్షణాలను దేవుని శక్తిద్వారా పరిత్యజించడం. ‘‘తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.’’ అనే తన దివ్య బోధలతో శిలలను కూడా శిల్పంగా మార్చుతున్నాడు యేసు. భయరహిత వాతావరణం సృష్టించుకుంటూ దినదిన ప్రవర్ధమానం చెందడం క్రీస్తు బోధల ద్వారా నేర్చుకోవచ్చు.జీవితం విలువ తెలిసినవానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహంకారం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందనేది బైబిల్ ఉపదేశం. అసత్యపు బండలను కొట్టుకొని తునాతునకలౌతున్నమనిషిని సంపూర్ణతలోనికి నడిపించాలన్నదే క్రీస్తు ఆలోచన. జడత్వంతో నిండిన ఇంద్రియాలను చైతన్యపరచి, వర్ణరహిత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం తన వంతు కృషి సలిపిన మహాఘనుడు యేసుక్రీస్తు. ‘ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించు’ అని బోధించిన యేసు అక్షరాలా దానిని తన జీవితంలో నెరవేర్చగలిగారు. యేసు దివ్యనామము విశ్వమంతటా మారుమోగడానికి గల అనేక కారణాలలో ‘ఆయన కారుణ్యం’ ప్రధానమైనది.క్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో యెరూషలేములోని మేడగదిలో తన శిష్యుల పాదాలను కడిగాడు. అది ప్రజల గుండెల్లో శాశ్వతకాలం నిలిచిపోయే ఓ అపురూప సంఘటన. అప్పటికే ఆయనకు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రజాదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గొప్పవానిగా, దేవునిగా గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు. యేసు భోజనపంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన ఉంచి ఒక తువాలు నడుమునకు కట్టుకొని, పళ్లెములో నీళ్లు పోసి తాను ఏర్పరచుకొన్న శిష్యుల పాదాలు కడుగుటకు, వాటిని తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. తాను కాళ్ళు కడిగే శిష్యులు చాలా సామాన్యమైన వారు. వారు ఆనాటి సమాజంలో విశిష్టులు కారు. ఆ సందర్భంలో శిష్యులు ఆయనను వారించినా భావితరాలకు స్ఫూర్తి కలుగుటకు, సేవాతత్పరతను అందరూ అలవాటు చేసుకొనుటకు ఆవిధంగా యేసు చేశాడు. తాను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని చేసిన ఆ సర్వోత్తమ కార్యము సాక్షాత్కరించిన జీవితాల్లో ‘సేవ’ పట్ల యథార్థ దృక్పథాన్ని రగిలించింది. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు’, ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి’ అన్న క్రీస్తు బోధనలు చేతల్లో నిరూపించబడ్డాయి. ఈ అసాధారణ సంఘటన ఆధారంగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఓ వినూత్న నిర్వచనాన్ని ఇచ్చాడు. ‘ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు’ అనే నినాదంతో నవ్యపథ నిర్దేశాన్ని చేశాడు. ‘మనుష్యులంతా సమానమే’ అంటూ వర్ణ వివక్షను రూపుమాపడానికి తనవంతు కృషి చేశాడు.క్రీస్తులో ఉన్న శాంత స్వభావాన్ని, కారుణ్యాన్ని, ప్రేమను ఆకళింపు చేసుకొన్న మదర్ థెరిసా భారతదేశ చరిత్రలో ఓ శ్రేష్టమైన స్థానాన్ని పొందింది. కేవలం మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే దీవెనకరంగా మారిన మదర్ క్రీస్తు ప్రేమాగ్ని జ్వాలల్లో నుంచి ఎగసిన ఓ నిప్పురవ్వ. అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలన్న తపనతో ఈ దేశానికి వచ్చిన మదర్ ఎందరినో అక్కున చేర్చుకొంది. కడుపునిండా అన్నం, కంటినిండా నిద్ర, ఒంటి నిండా బట్టలను ఇచ్చి మానవీయ హృదయంతో ప్రజలను ఆదుకొంది. ఎక్కడ నుంచో వచ్చిన ఆమెను ‘మదర్’ అని సంబోధిస్తూ ఆమెను గౌరవించిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత స్థితిగతులను విడిచి లోకహితం కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో కలకత్తా వీధుల్లో అనాథ పిల్లల పోషణ కోసం యాచన చేసేది. ఆ ప్రక్రియలో ఒకసారి వికృత చేష్టలకు బందీయైన ఒక వ్యక్తి, మదర్ థెరిసాపై ఉమ్ము వేశాడు. ‘దీనత్వం’ అంటే ఏమిటో నేర్చుకుంది కదా! ఆ ఉమ్మిని తుడుచుకొంటూ ‘‘నా కోసం ఇది ఇచ్చావు... అనాథ పిల్లల కోసం ఏమి ఇస్తావు?’’ అని తిరిగి అడిగింది. ఆ ఒక్క మాటతో గర్వపు పొరలు విడిపోయాయి. ఇంతగా అవమానించినా తిరిగి ఏమీ అనని మదర్ గుండెల్లో ఉన్న తగ్గింపును అర్థం చేసుకొన్నాడు. జీవితాంతం మదర్ థెరిసా ఆశ్రమానికి తనకు తోచినంత సహాయం చెయ్యడం ప్రారంభించాడు. నోబెల్ బహుమతి ప్రదానం రోజున మదర్ మాట్లాడుతూ ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగడమే నిజమైన క్రైస్తవ్యం’ అని తాను ఎవ్వరి నుంచి సేవాస్ఫూర్తిని పొందిందో ఆ విషయాన్ని కచ్చితంగా ప్రపంచానికి తెలిపింది. నేటికీ ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థల ద్వారా విశేషమైన సేవలు పేదలకు అభాగ్యులను అందుతున్నాయి. కొంత చేసి ఎంతో చేశామని ప్రగల్భాలు పలికే నేటి సమాజంలో ఎంతో చేసినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో నింపబడిన వ్యక్తులను కనుగొనడం కొంచెం కష్టమే. అటువంటి వారిలో విలియం కేరీ ఒకడు. ఇంగ్లండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో విశిష్ట కార్యాలు చేశాడు. ఒక్కమనిషి తన జీవితకాలంలో ఇన్ని కార్యాలు చేయగలడా? అనిపించే విధంగా సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అంతే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను 36 భాషల్లోకి అనువదించాడు. అనేక భారతీయ భాషల్లో నిఘంటువులు రాశాడు. పట్టాను బహూకరించే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. స్వదేశ భాషలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాను సాధించాలనుకున్న వాటిని సాధించి తీరాడు. దేశచరిత్రలో, ప్రజల గుండెల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. జీవన పరిణామాలన్నింటిని సమదృష్టితో చూడగలిగే స్థితప్రజ్ఞతను ఆకళింపు చేసుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఒకసారి ఇంగ్లండ్ వెళితే తన స్నేహితుడొకడు వచ్చి అపహాస్యంతో, విలియం కేరీని కించపరచాలనే ఉద్దేశంతో ‘నీవు చెప్పులు తయారు చేసుకొనే వ్యక్తివని మర్చిపోవద్దు’ అన్నాడు. క్రీస్తు కారుణ్యంతో, వినమ్రతతో నింపబడిన కేరీ ‘అయ్యా! నేను చెప్పులు తయారు చేసేవాణ్ణి కాదు... వాటిని కేవలం బాగుచేసుకునేవాణ్ణి’’ అని బదులిచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కేరీ ఇచ్చిన సమాధానం, అతనిలో ఉన్న తగ్గింపు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. అంతేమరి! నిండుకుండ ఎప్పుడూ తొణకదు కదా! ‘కారుచీకటిలో కాంతిరేఖ’ అని కేరీని పిలవడంలో అతిశయోక్తి లేదుకదా! ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ప్రపంచంలో నేటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు క్రీస్తు కారుణ్యమునకు, దీనత్వమునకు ఆరాధకులే. ఆధ్యాత్మిక చింతన కోసం, జీవన సాఫల్యం కోసం తపించే ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఉన్న మహోన్నత ప్రేమతత్వానికి మంత్రముగ్ధులే. మానవ హృదయ వైశాల్యాన్ని పెంచుతూ, గుణాత్మక పరివర్తనకు దోహదపడుతున్న క్రీస్తుప్రభువు తగ్గింపు జీవితం సదా అభినందనీయం. యేసుక్రీస్తు పరలోకములో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమే.. యేసు పుట్టింది పశువులశాలలో. పసికందుగా పవళించింది గరుకైన పశువుల తొట్టెలో! దేవుడు ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఆయన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో పూల పాన్పులు, అంతఃపురాలు ఆయనకు ఆహ్వానం పలుకలేవా? ఎందుకు ఆయన పశువులశాలలో పుట్టాడు? పశువుల శాల వంటి మానవ çహృదయాన్ని పావనపరచుటకు ఆయన పశువుల తొట్టెలో జన్మించాడు. రెండవ కారణం ‘‘పశువుల శాలలోనికి ఎవ్వరైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’’. క్రీస్తును దర్శించుటకు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేనేలేవు. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను మొదటగా దర్శించుకున్నది గొర్రెల కాపరులు. రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దూత ద్వారా శుభవార్త అందింది. భక్తి పారవశ్యంతో క్రీస్తును దర్శించుకొని పరమానందభరితులయ్యారు. ఇది నిజంగా విడ్డూరమే! లోకరక్షకుడు అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని క్రీస్తు తన జన్మ ద్వారా నిరూపించాడు. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణాపూరితమైన మనసును వేరుచేయలేము. క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైనది. అవధులు, షరతులు లేనిది. విలువైన ఆయన ప్రేమలో వంచన లేదు. మధురమైన క్రీస్తు ప్రేమకు మరణం అంటే ఏమిటో తెలియదు. ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది నజరేతులోని ఒక వడ్లవాని ఇంటిలో. ఆ కాలంలో గలిలయలోని నజరేతుకు ఏమాత్రం పేరుప్రఖ్యాతులు లేవు. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యోసేపు అనే వ్యక్తికి అన్ని విషయాలలో సహాయం చేశాడు. కష్టమంటే ఏమిటో తెలుసు. చెమటోడ్చడం అంటే తెలుసు యేసుకు. మనిషి సాధక బాధకాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. ఆ కాలంలో పరమ పాపులుగా పిలువబడే సుంకరులతో అనేకసార్లు భోజనం చేశాడు. వారితో సహవాసం చేసి దైవ మార్గాన్ని వారికి ఉపదేశించాడు. దైవభక్తిలో ఎడతెగని, అలుపెరుగని అలౌకిక అనుభవాలు దాగి ఉంటాయని తెలియచెప్పాడు. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి çహృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కానీ తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చిన ప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా పరిగణించేవారు. సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. సొంత కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ద్వేషించేవారు. అలాంటివారిని తన దివ్య స్పర్శతో బాగుచేశాడు. వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రోగ పీడితులను పరామర్శించాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. వికటముతో మాట్లాడి, చులకనగా వ్యవహరించిన వారిని కూడా ప్రేమపూర్వక పదజాలంతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. మట్టల ఆదివారం రోజున క్రీస్తు గాడిదపై ప్రయాణం చేశాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని జెకర్యా ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేరింది. పూర్వదినాల్లో ఏ రాజైనా గుర్రంపై ప్రయాణిçస్తూ మరో పట్టణానికి వెళ్తే యుద్ధానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించేవారు. గాడిదపై వస్తుంటే సమాధానం కోసం వస్తున్నాడని గ్రహించేవారు. కలవరంలో నిండిపోయిన యెరూషలేము పట్టణానికి సమాధానాన్ని ప్రకటించడానికి క్రీస్తు గాడిదపై దీనుడుగా ప్రయాణం చేశాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి నేను విశ్రాంతిని కలుగచేతును’’ అని క్రీస్తు ఏనాడో ప్రకటించాడు. నేటి దినాల్లో మనిషి మనశ్శాంతి కోసం తపిస్తున్నాడన్నది కాదనలేని సత్యం. విశ్యవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు శాంతి కోసం అన్వేషిస్తున్నారు. కొందరు ధన ధాన్యాలలో శాంతిని వెదకుతుంటే మరికొందరు కీర్తి ప్రతిష్టలలో వెదకుచున్నారు. కొందరు బంధాల్లో శాంతిని పొందుకోవాలని తపిస్తుంటే మరికొందరు ఒంటరి తనంలోనే సంతోషాన్ని వెదకుచున్నారు. ఈ వెతుకులాటలో నిజమైన శాంతి దొరకక అనేకులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. వాస్తవాన్ని అంగీకరించే మనస్సుంటే శాంతి అనేది భౌతిక సంబంధమైన విషయాలపై ఆధారపడి లేదు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. కొందరు శాంతి సమాధానాల కోసం పరితపిస్తారు, మరికొందరు శాంతితో జీవిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గలవాడు శాంతి సమాధానాలతో జీవిస్తాడని భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సందర్భంలో తెలియజేశారు. అవును! పరమాత్ముడు సమాధానానికి సృష్టికర్త గనుక ఆయన పాదాల దగ్గర కాకపోతే మరెక్కడ శాంతి దొరుకుతుంది? క్రీస్తు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి, వస్త్ర హీనునిగా చేయబడి, పరమ పవిత్రుడైనప్పటికీ మనిషి కోసం దోషిలా నిలువబడి, మానవ అపహాస్యాన్ని, హేళనను భరించిన సహనశీలి. తాను చేయని నేరాలను తలదించుకొని భరించాడు. చివరకు తనను యెరూషలేము వీధుల్లో ఈడ్చి, కల్వరి కొండపై మేకులతో సిలువకు కొట్టి, ముళ్ల కిరీటం ధరింపజేసి కిరాతకంగా హింసించిన వారిని కూడా క్షమించిన దయార్ద్ర హృదయుడు యేసు. ఒక్క ఎదురుమాట చెప్పినందుకే మొండెము నుండి తల వేరు చేయించిన చక్రవర్తులు ఎందరో చరిత్రలో ఉన్నారు. తమ మాటకు ఎదురు నిల్చినవారిని ఖండములుగా నరికినవారున్నారు. తమను అవమానపరచారని కత్తి వాతకు గురిచేసిన రాజులెందరో మానవ చరిత్రలో ఉండగా ప్రేమ చూపి సత్క్రియలు చేసి, దయను కురిపించి, ఆకలి తీర్చి, స్వస్థపరచి, మృతులను సైతం సజీవులుగా చేసిన మహోన్నతుడు యేసు. యేసు ఏమి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు? ఆయన పుట్టింది ఎవరో పశువులపాకలో. ఒకసారి ఓ పరాయి పడవలో అమరమున తలవాల్చి నిదురించాడు. అనేక రాత్రులు ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. ఆఖరికి ఆయన మరణించిన తరువాత కూడా అరిమతయి యోసేపు అనువాని సమాధిలో ఉంచబడ్డాడు. ఇవన్నీ దేనికోసం? కేవలం మనిషిని సొంతం చేసుకోవాలన్న ఆశయంతో, తపనతో ఆయన దేన్నీ సొంతం చేసుకోలేదు. అవును! పరమాత్ముడు మనిషి çహృదయంలో వసించాలని ఆశిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని క్రీస్తు పలికాడు. అది అక్షరాలా ఆయన జీవితంలో నెరవేరింది. ఒంటరిగా సిలువపై వేలాడుతూ ప్రజల పాపాల కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసీఫసు కూడా క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించాడు. ఆ సమయంలో సిలువ చుట్టూ చేరిన అనేకులు సిలువ నుంచి దిగిరా! నీవు దైవకుమారుడని నమ్ముతామని క్రీస్తును సవాలు చేశారు. అంతమంది సవాలు చేస్తున్నా క్రీస్తు ఎందుకు సిలువను దిగలేదు? ఆ స్థానం నుంచి క్రీస్తు తప్పుకుంటే మానవునికి రక్షణ లేదు గనుక. పాప పరిహారం జరగదు గనుక.సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా! ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మూడవ రోజున మరణ బంధనాలను తెంచుకొని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్దరాయిగాని, చుట్టూ మోహరించి ఉన్న రోమన్ సైనికులు గాని ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆరోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని ఋజువుచేయబడింది. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. సమాధి నుంచి బయటకు వచ్చాడు గనుక ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి లాజినస్. ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తుండగా పిలాతు భార్య ప్రొక్యులా ఇలా అడిగింది – ‘‘క్రీస్తు పై నీ అభిప్రాయం ఏమిటి?’‘. ‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణం కచ్చితంగా ఓడిపోతుంది. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి శ్రీకారం చుడతాడు. విశ్వంలో ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి గాని, శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. ప్రియ నేస్తమా! ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? ప్రజలంతా నిన్ను నిందిస్తూ వేధిస్తున్నారా? నీవు ఎందుకూ పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు అనినిన్ను హేళన చేస్తున్నారా? మౌనం వహించు! నీవు చేయాలనుకున్న కార్యమును నెరవేర్చడానికి ముందుకు సాగిపో! మరణాన్ని జయించిన దేవుని అనిర్వచనీయమైన కృప మరియు శక్తి నీకు తోడుగా ఉంటాయి. ఆయన్ను గుండెల్లో ప్రతిష్టించి క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కో, నిందలూ అవమానాలూ వస్తున్నాయని కృంగిపోకు! ప్రపంచంలోని విజేతలందరూ ఏదోక సందర్భంలో వాటిని ఎదుర్కొన్నవారే. ధైర్యంతో ముందుకు సాగిపో! నీవు తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ రోజు నీ తగ్గింపే రేపు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సిరియాలో మారణహోమం ఆపండి: పోప్
-
సిరియాలో మారణహోమం ఆపండి: పోప్
వాటికన్ సిటీ/జెరూసలేం: సిరియాలో మారణహోమానికి ముగింపు పలకాలని పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం వాటికన్ సిటీలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం సెయిం ట్ పీటర్స్ బాసిలికా చర్చి ప్రాంగణంలో గుమిగూడిన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధం, కరువు, రాజకీయ అనిశ్చితితో తీవ్ర ఇక్కట్లు పడుతున్న సిరియా ప్రజల కోసం ప్రార్థించారు. అలాగే ఉక్రెయిన్, ఆఫ్రికాలో అంతర్యుద్ధాలు ముగిసిపోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈస్టర్ సందర్భంగా జెరూసలేంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం చెందినట్లు భావించే ప్రాంతంలో నిర్మించిన సపుల్కర్ చర్చిని వేలాది మంది సందర్శించారు. -
పునరుత్థానం....భక్తుల ఆనందపరవశం
– భక్తిశ్రద్ధలతో ఈస్టర్ – క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు – ఆకట్టుకున్న క్రీస్తు జన్మదిన నాటక కథలు – జిల్లా వ్యాప్తంగా సంబరాలు కర్నూలు సీ క్యాంప్ : ఏసుక్రీస్తు పునరుత్థానుడైన సందర్భంగా ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా చర్చిల్లో వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ ఆరాధనతో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే నాడు సిలువలో బందీఅయి చనిపోయిన క్రీస్తు తిరిగి లేచి తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడని, దీన్నే విశ్వాస పండుగ అని కూడా క్రైస్తవులు చెబుతుంటారు. నగరంలోని బిషప్చర్చి, కోల్స్ సెంటీనియక్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, సీఎస్ఐ చర్చి, రాక్‌వుడ్ చర్చి, హోసన్న మందిరం, స్టాంటన్, ఇమ్మానియేలు ప్రార్థన మందిరం, లాంటి ప్రధాన ఆలయాల్లో పాస్టర్లు దైవ సందేశం వినిపించారు. ఈస్టర్ అంటే విశ్వాసం, నమ్మకం అని చనిపోడానికి ముందు క్రీస్తు తాను తిరిగిలేస్తానని చెబుతాడని, ఆమాట నిజమైతే పునరుత్థానం ఉంటుందని ఈస్టర్‌నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడుకాబట్టి పునరుత్థానం ఉంటుందని పాస్టర్లు పేర్కొన్నారు. ప్రతి మనిషి విశ్వాసం, ప్రేమ, నమ్మకం, జాలి, కరుణ, కలిగి ఉండాలని అవి లేని వారికి పరలోక రాజ్యం ఉండదని చెప్పారు. ఏటా గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వస్తుంటాయని, పండుగ వచ్చిన ప్రతీసారి ఒక కొత్త నిర్ణయంతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. సాయంత్రం యేసుక్రీస్తును స్మరిస్తూ క్రీస్తుజన్మ ఇతివృత్తంపై క్రైస్తవులు నాటకాలు ప్రదర్శించారు.