health policy
-
బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!
ఆరోగ్యం, సంపద... ఏ మనిషి జీవితంలోనైనా ప్రధాన పాత్ర పోషించే అంశాలివి. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏమీ ప్రయోజనం ఉండదు. అదే... సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే చాలు... ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం అత్యంత ప్రధానం అన్న విషయం దీన్నిబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది.ఇవాళ్టి రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత తేలిక్కాదు. కోవిడ్ మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో ఎరుకే.. అదీగాక... మారిన కాలమాన పరిస్థితుల్లో... ఎప్పుడు ఎలాంటి రోగాలు పుట్టుకొస్తాయి ఎవ్వరం చెప్పలేం. అప్పటిదాకా ఎంతో హాయిగా.. ఎలాంటి చీకూ చింతా లేకుండా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క అనారోగ్యం వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్ని తల్లకిందులు చేసేస్తోంది. అప్పటికప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే... లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే.. చూస్తూ చూస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా... అంచేత అప్పో సొప్పో చేసి అయినా వైద్యం చేయిస్తాం.పల్లెలు పట్టణాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోతూ ట్రాఫిక్ విచ్చలవిడిగా పెరిగిపోయి.. ఎప్పుడు ఏ ఆక్సిడెంట్ అవుతుందో... బయటకు వెళ్లిన మనిషి సురక్షితంగా వస్తాడో రాడో అంతుచిక్కని రోజులివి. ఇలా ఆకస్మికంగా తలెత్తే అనివార్య ఖర్చుల్ని తలెత్తుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటప్పుడే... మన చేతిలో ఆరోగ్య బీమా కార్డు ఉంటే... కొండంత ధైర్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లే. పైగా నేటి రోజుల్లో కుటుంబానికంతటికీ జీవిత బీమా తో పాటు, ఆరోగ్య బీమా ఉండటం అత్యవసరంగా మారిపోయింది. ఈనేపథ్యంలో ఆరోగ్య బీమా స్థితిగతులను ఓసారి పరిశీలిద్దాం.మనదేశంలో ఆరోగ్య బీమాను అందించే ప్రముఖ కంపెనీలు ఇవి.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కేర్ హెల్త్ ఇన్సూరెన్స్హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ తదవనివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్మణిపాల్ సిగ్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీఅకో జనరల్ ఇన్సూరెన్స్టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్వైద్యం ఖరీదైన అంశంగా మారిపోయిన ఈరోజుల్లో మీరు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని వైద్య ఖర్చులనుంచి గట్టెక్కిస్తుంది.కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పాలసీ తీసుకోవచ్చు.వయోపరిమితిని బట్టి ప్రీమియం రేట్లు ఉంటాయి. చిన్న వయసులో తక్కువ ప్రీమియం కే పెద్ద పాలసీ తీసుకోవచ్చు.ఏదైనా ఒక రోగంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఆ వైద్యానికయ్యే ఖర్చుల్ని మనం ఎలాంటి నగదు చెల్లించనక్కర్లేకుండా పొందవచ్చు. మనం పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.వీటిలో అత్యంత ప్రధానమైంది మనం బీమా తీసుకునే సంస్థ ఏయే హాస్పిటల్స్ తో అనుసంధానం అయివుందో తెలుసుకోవడం.అంటే దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్ తో పాటు, స్థానిక హాస్పిటల్స్ లో కూడా వైద్యం చేయించుకోవడానికి వీలుగా కవరేజ్ కలిగి ఉండాలి.ఒక రోగానికి సంబంధించి హాస్పిటల్ లో జాయిన్ కావడానికి ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయ్యాక 30 రోజుల పాటు వైద్య ఖర్చులు పొందే సౌలభ్యాన్ని వివిధ బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు వాటి వివరాలు తెలుసుకోవాలి.మనం తీసుకునే పాలసీ కి చెల్లించే ప్రీమియానికి కొంచెం అదనంగా చెల్లించడం ద్వారా పర్సనల్ ఆక్సిడెంట్ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్ వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.యాక్సిడెంట్ అయ్యి... ప్రాణాపాయం తప్పి శాశ్వత అంగ వైకల్యానికి లోనైతే... అడిషనల్ రైడర్స్ తీసుకోవడం వల్ల పెన్షన్ మాదిరి నెలనెలా (మన సమ్ అష్యురెడ్ ని బట్టి) సొమ్ములు పొందవచ్చు. సాధారణంగా వృద్ధాప్యానికి మరోపేరే అనారోగ్యం. కాబట్టి కచ్చితంగా ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వయోపరిమితితో సంబంధం లేకుండా.. ఎంత వయసువారైనా బీమా పాలసీ లు తీసుకోవడానికి ఐఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. ఇది సీనియర్ సిటిజెన్లకు వరమనే చెప్పాలి. అలాగే ఒకే ప్రీమియం తో మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా రక్షణ కల్పించే విధంగా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.పాలసీ తీసుకునే టైం కే రోగాలు ఉన్నా కూడా వాటిని కవర్ చేస్తూ బీమా సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏయే బీమా సంస్థలు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ను పేర్కొంటున్నాయో తెలుసుకోవాలి.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 డ్ కింద మనం కట్టే ప్రీమియానికి (షరతులకు లోబడి) రూ. 25,000 నుంచి రూ.75,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.సాధారణంగా 24 గంటలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటేనే పాలసీ వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని సంస్థలు అవుట్ పేషెంట్ గా చేయించుకునే వైద్యానికయ్యే ఖర్చులను కూడా బీమా కవరేజ్ లోకి తీసుకుంటున్నాయి. అంతేకాదు... ప్రత్యేకించి ఓపీ చికిత్సల కోసమే ఉపయోగపడే విధంగా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.ఎలాంటి ఆరోగ్య సేవలు పొందవచ్చు, ప్రీమియంలు ఎలా ఉంటాయి ఇత్యాది అంశాలను మరోసారి చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు, పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్‌లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?
నా వయసు 27 ఏళ్లు. నేను ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నాను. నాకు బీమా కంపెనీలు రూ.కోటి టర్మ్ పాలసీ ఇస్తాయా? రూ.5 లక్షల ఆరోగ్య బీమా కూడా తీసుకోవాలనుకుంటున్నాను సరిపోతుందా? - ఆకాశ్మీ వయసును పరిగణలోకి తీసుకుంటే బీమా సంస్థలు సాధారణంగా వార్షికాదాయానికి 20-25 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ వార్షికాదాయం రూ.5 లక్షలు కాబట్టి, మీకు రూ.కోటి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఒకే కంపెనీ మీకు రూ.కోటి టర్మ్ పాలసీ జారీ చేయకపోతే మంచి చెల్లింపుల రికార్డున్న రెండు కంపెనీల నుంచి రూ.50 లక్షల చొప్పున పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేప్పుడు ఎలాంటి దాపరికాలు లేకుండా మీ ఆరోగ్య వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి పాలైతే లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మీ వయసులోని వారికి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించే ఆరోగ్య బీమా కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎలాంటి కో-పే(పాలసీదారులు కొంత, కంపెనీ కొంత చెల్లించే విధానం) లేకుండా, పూర్తిగా కంపెనీయే క్లెయిమ్ చెల్లించే పాలసీను ఎంచుకోవాలి. ప్రస్తుతం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. రూ.5 లక్షలు ప్రస్తుతం సరిపోతాయని మీరు భావిస్తున్నా. భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి, మీరు రూ.10 లక్షలకు తగ్గకుండా పాలసీ తీసుకోవడం ఉత్తమం. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసా..?
చదువు అయిపోయి కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఒక్కసారిగా తమకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తోంది. అప్పటివరకు చిల్లర ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడినవారు ఉద్యోగం రాగానే విచ్చలవిడి ఖర్చుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు ఏరూపంలో వస్తాయో తెలియదు. కాబట్టి యువతతోపాటు అందరూ కొన్ని చిట్కాలు పాటించి డబ్బు ఆదా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం. నెలవారీ ఖర్చులకు మించి అప్పు చేసి మరీ క్రెడిట్‌కార్డు ఉందనే దీమాతో వస్తువులు కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి. నెలవారీ బిల్లులో మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుందనేలా బ్యాంకు మెసేజ్‌లు కనిపిస్తాయి. అలాచేస్తే కట్టాల్సిన మొత్తం పేమెంట్‌పై తదుపరి నెల అధికవడ్డీ వసూలు చేస్తారు.నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. నెలాఖరులోపు తరచుగా మీకు నగదు కొరత వస్తుందంటే.. ఖర్చులను సమీక్షించాల్సిందే. ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.నెలవారీ మొత్తం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగతా డబ్బును ఆదా చేయాలని చూస్తారు. కానీ ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి. ఆదాయంలో కనీసం 20 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో సంపదను సృష్టించేందుకు ఇది తోడ్పడుతుంది.ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలి. దీన్ని సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో ఉంచుకోవచ్చు.ఉద్యోగం చేస్తున్న సమయంలో బోనస్, ప్రమోషన్, ఇంక్రిమెంట్ల రూపంలో అదనంగా డబ్బు సమకూరుతుంది. దాన్ని విలాసాలు, ఖరీదైన వస్తువులు కొనేందుకు వినియోగించకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్ ఫండ్లను ఎంచుకుని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ వయసు, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు వస్తున్న వేతనం లెక్కించి నెలవారీగా కొంత మొత్తంతో పదవీవిరమణ కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు. మారుతున్న ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందుగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రమాదవశాత్తు మీరు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే టర్మ్ పాలసీ తప్పకుండా ఉండాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే ఈ రెండు పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది. -
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని ఎత్తివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రద్దు డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నిరసన చేపట్టారు. ‘పన్ను ఉగ్రవాదం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాందీతో పాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం ఎంపీలు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీ ప్రజలపై పెనుభారమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు.జీఎస్టీతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. ఇండియా కూటమి ఎంపీల నిరసనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనలు, నినాదాలు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ప్రవేశ ద్వారం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడతామని సభ్యులంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8,263 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. -
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల కోసం కూడా త్వరలోనే బీమా పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు జునో జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో ఎడెల్వీస్ జనరల్ ఇన్సూరెన్స్) సీడీవో రాకేశ్ కౌల్ తెలిపారు. ప్రస్తుతం రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి అంశాలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో మరికొన్ని హెల్త్ పాలసీలను కూడా ప్రవేశపెడుతున్నట్లు కౌల్ పేర్కొన్నారు. తమ వ్యాపారంలో దాదాపు 35 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంటోందని ఆయన పేర్కొన్నారు. 30 లక్షల పైగా కస్టమర్లు, 1,000 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లు ఉన్నట్లు కౌల్ తెలిపారు. -
కోరుకున్నట్టుగా హెల్త్ పాలసీ: బజాజ్ అలియాంజ్ ఆఫర్
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తమకు కావాల్సిన సేవలతోనే తీసుకునే విధంగా ‘మై హెల్త్‌కేర్ ప్లాన్’ను బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. మోటారు వాహన ఇన్సూరెన్స్‌ను నడిపినంత దూరానికే తీసుకునే విధంగా ఇటీవలే కొత్త తరహా ప్లాన్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. ఇదే మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లోనూ కొత్త తరహా సేవలతో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకు వచ్చింది. కస్టమర్లు తమకు కావాల్సిన కవరేజీ ఎంపిక చేసుకోవచ్చని, వాటి ప్రకారం ప్రీమియం ఖరారు అవుతుందని సంస్థ తెలిపింది. హాస్పిటల్లో ఇన్ పేషెంట్‌గా చేరినప్పుడు అయ్యే వ్యయాలు, హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలు, మేటర్నిటీ వ్యయాలు, ఎయిర్ అంబులెన్స్ సేవలు, అధునాతన చికిత్సా విధానాలు, అవయవ దాత వ్యయాలు, ఆయుర్వేదిక్, హోమియోపతీ సేవల కవరేజీ తీసుకోవచ్చు. బేబీ కేర్ కవరేజీ కూడా అందుబాటులో ఉంది. ఒక ఏడాదికి చెల్లించే ప్రీమియానికి రెట్టింపు విలువ మేర.. అవుట్ పెషెంట్ కవరేజీ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉంటుంది. ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ఆదాయం నష్టం వంటి సందర్భాల్లో అదనపు పరిహారానికి సంబంధించిన రైడర్లను సైతం ఈ ప్లాన్‌తోపాటు తీసుకోవచ్చు. -
బిగ్హాట్తో ఎంఐబీఎల్ జత
ముంబై: అగ్రి డిజిటల్ ప్లాట్‌ఫాం బిగ్హాట్తో చేతులు కలిపినట్లు మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోక ర్స్ (ఎంఐబీఎల్) వెల్లడించింది. దేశీయంగా అసంఘటిత వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని పేర్కొంది. అలాగే కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ భారతంలో బీమాను మరింత విస్తృతం చేసేందుకు కూడా ఉపయోగపడగలదని వివరించింది. ఈ భాగస్వామ్యం కింద బిగ్‌హాట్ కస్టమర్లకు ఎంఐబీఎల్ హెల్త్, మోటర్ పాలసీలను విక్రయించనుంది. హెల్త్ పాలసీలో రూ. 5 లక్షల వరకూ సమ్ ఇన్షూర్డ్ ఉంటుందని ఎంఐబీఎల్ ఎండీ వేదనారాయణన్ శేషాద్రి తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో ఉన్న కోటి మంది పైగా రైతులకు ఆరోగ్య బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని బిగ్‌హాట్ ఇండియా సహ వ్యవస్థాపకుడు సతీష్ నూకాల పేర్కొన్నారు. -
మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ బీమా పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా ప్రోహెల్త్ ప్రైమ్ పేరిట హెల్త్ పాలసీని ఆవిష్కరించింది. ఆస్పత్రి చికిత్స వ్యయాలకు మాత్రమే పరిమితం కాకుండా క్యాష్‌లెస్ అవుట్‌పేషెంట్ డిపార్ట్మెంట్ వ్యయాలకు (డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, ఫార్మసీ ఖర్చులు మొదలైనవి) కూడా కవరేజి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత అని సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కస్టమర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తాము నిర్వహించిన అధ్యయనంలో దేశీయంగా అవుట్పేషంట్ డిపార్ట్ వ్యయాలు మొత్తం హెల్త్‌కేర్ ఖర్చుల్లో 62 శాతం స్థాయిలో ఉంటున్నాయని, ఆస్పత్రిలో చేరితే బిల్లులో వైద్యయేతర వ్యయాలు 10–12% మేర ఉంటున్నాయని తేలినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సమగ్రమైన బీమా పాలసీని అందించాలనే ఉద్దేశంతో ప్రోహెల్త్ ప్రైమ్‌ను రూపొందించినట్లు సిక్దర్ పేర్కొన్నారు. -
2 నిమిషాల్లో కోటి రూపాయల పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: నవీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా తమ మొబైల్ యాప్ ద్వారా 2 నిమిషాల్లోనే ఆన్లైన్ ఆరోగ్య బీమా పాలసీని జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ. 2 లక్షల నుంచి రూ. 1 కోటి ద్వారా కవరేజీ ఉండేలా ఈ పాలసీలను తీసుకోవచ్చని సంస్థ ఎండీ రామచంద్ర పండిట్ తెలిపారు. క్యాష్‌లెస్ క్లెయిమ్స్‌కు 20 నిమిషాల లోపే ఆమోదముద్ర లభిస్తుందని ఆయన వివరించారు. నెట్వర్క్యేతర ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే పూర్తి పత్రాలను అందించడాన్ని బట్టి నాలుగు గంటల్లోపు క్లెయిమ్స్‌ను సెటిల్ చేస్తామని పేర్కొన్నారు. బేస్ సమ్ అష్యూర్డ్‌పై ప్రభావం పడకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల కోసం రూ. 20 వేల వరకూ అదనపు కవరేజీ ఉండేలా ఎక్స్ట్రా కేర్ కవర్ కూడా ఉంటుందని పండిట్ పేర్కొన్నారు. -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
హెల్త్ పాలసీల రెన్యువల్‌కు 21 వరకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్‌డౌన్ నేపథ్యంలో సంబంధిత కాలంలో గడువు ముగిసే హెల్త్ పాలసీల రెన్యువల్‌కు ఈ నెల 21 వరకు గడువు పొడిగించాలని అన్ని బీమా సంస్థలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కోరింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 1నే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య గడువు ముగిసే పాలసీలకు ప్రీమియం చెల్లించలేని వారికి ఏప్రిల్ 21 వరకు అవకాశం ఇవ్వాలని సంబంధిత నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. అలాగే, వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చెల్లింపునకు కూడా ఏప్రిల్ 21 వరకు గడువు పొడిగించాలని ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. -
పాలకుల నిర్లక్ష్యం ఖరీదు కరోనా!
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశం ఆది నుంచి ప్రజారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం అంతకష్టమయ్యేది కాదు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.28 శాతం కేటాయింపులు జరపగా, 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.5 శాతం, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 1.6 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. మన పొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మనకన్నా ఎక్కువ నిధులను కేటాయిస్తున్నాయి. దేశంలో ప్రజారోగ్యానికి కనీసం జీడీపీలో మూడు శాతం నిధులనైనా కేటాయించాలని ప్రజారోగ్య విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2006లో ‘నైన్ ఈజ్ మైన్’ అనే నినాదంతో పాటశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం, వైద్య రంగానికి మూడు శాతం నిధులను కేటాయించాలన్నది నాడు విద్యార్ధుల డిమాండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రతీ ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనే చెబుతూ వచ్చాయి. పలు పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. కానీ అవి ఎప్పుడు మాట నిలబెట్టుకోలేక పోయాయి. దేశంలో ఆరోగ్యం జాతీయ లేదా ఉమ్మడి జాబితాలో కాకుండా రాష్ట్రాల జాబితాలో ఉండడం, ఆరోగ్యం పౌరలు ప్రాథమిక హక్కు కాకపోవడం ప్రతికూల అంశాలే. 2022లో వచ్చే 75వ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్య రంగాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడమే కాకుండా, ఈ రంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని ఆరోగ్య రంగంపై 15వ ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక్కరు చొప్పున ఆలోపతి వైద్యుడు ఉండాలి. భారత్‌లో రిజిస్టర్డ్ ఆలోపతి వైద్యులు 11,54,686 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వాస్పత్రుల్లో 1,16,756 మంది పని చేస్తున్నారు. ప్రతి 10,926 మందికి ఒకరు చొప్పున వైద్యులు ఉన్నారంటే వైద్యుల కొరత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం భారత్‌లో క్రిటికల్ కేర్ నిపుణులు 50 వేల మంది అవసరం కాగా, 8,350 మంది మాత్రమే ఉన్నారు. దేశంలో నేడు కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగిన ల్యాబ్‌లు 118 మాత్రమే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడే భారత్ లాంటి వర్ధమాన దేశానికి ప్రైవేటు, భీమా రంగాలపై ఆధారపడే వైద్య విధానం పనికి రాదు. -
ఆరోగ్యానికి బీమా భరోసా..
సమగ్రమైన హెల్త్ పాలసీతో పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ .. క్యాన్సర్, మూత్రపిండ సమస్యల వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వీటి నుంచి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించేది కొంత తక్కువే. ఇక పేషెంట్‌కు అనువైన హాస్పిటల్లో క్యాష్‌లెస్ ఫీచర్ గానీ లేకపోతే .. క్లెయిమ్ వేళ ఎంత కోత విధిస్తారు .. ఎంత ఇస్తారో అన్న అనిశ్చితి నెలకొంటుంది. వీటికి తోడు సబ్–లిమిట్స్, కో–పే వంటి నిబంధనలేమైనా ఉంటే.. పాలసీదారుకు క్లెయిమ్‌లో మరింత కోత పడే అవకాశముంది. అప్పటికే ఒకవైపు అనారోగ్యం, మరోవైపు హాస్పిటల్ బిల్లులతో సతమతమవుతున్న పాలసీదారుకు ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య బీమా సంస్థలు కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యల చికిత్సకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవర్.. పేరుకు తగ్గట్టుగా పక్షవాతం, గుండె పోటు, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్ మొదలైన తీవ్ర అనారోగ్య సమస్యల చికిత్స వ్యయాలను ఎదుర్కొనేందుకు క్రిటికల్ ఇల్నెస్ కవర్స్ తోడ్పడతాయి. ఇవి పూర్తిగా నిర్దిష్ట అనారోగ్య సమస్యలకోసం మాత్రమే ఉద్దేశించినవి కావడం వల్ల.. అలాంటి వాటి బారిన పడినప్పుడు పాలసీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. ఒకవేళ అప్పటికే వేరే రెగ్యులర్ పాలసీ కింద చికిత్స వ్యయాలను క్లెయిమ్ చేసుకున్నా కూడా.. ఈ క్రిటికల్ ఇల్నెస్ కవర్ క్లెయిమ్ కూడా పొందవచ్చు. పూర్తి స్థాయిలో కోలుకునే దాకా ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ తరహా పాలసీలను తీసుకునేటప్పుడు సాధ్యమైనంత విస్తృతంగా వ్యాధులకు కవరేజీ ఉండేలా చూసుకుంటే మంచిది. ప్రత్యేక క్యాన్సర్ ప్లాన్స్ .. క్యాన్సర్ వ్యాధితో పాటు చికిత్స వ్యయాలు కూడా భయం గొలిపేవిగానే ఉంటాయి. అందుకే క్యాన్సర్ చికిత్స వ్యయాల కోసం ఉపయోగపడేలా ప్రత్యేక పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు. అయితే, వీటిని తీసుకునేటప్పుడు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. ప్రారంభ దశలోని క్యాన్సర్ చికిత్సకు కొన్ని సంస్థలు .. మొత్తం సమ్ అష్యూర్డ్‌లో 25 శాతం మాత్రమే ఇచ్చేవి ఉన్నాయి. అలాగే, 150 శాతం దాకా ఏకమొత్తంగా చెల్లించేవీ ఉన్నాయి. కనుక ఆయా సంస్థల పాలసీలను పరిశీలించి చూసుకోవాలి. ఇక, ఒక్కసారి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించేసిన తర్వాత కూడా పాలసీ ముగిసిపోతుందా.. ఆ తర్వాత కూడా కొనసాగించుకోవచ్చా అన్నదీ తెలుసుకోవాలి. కొన్ని రకాల క్యాన్సర్స్ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి.. పాలసీ వ్యవధి సుదీర్ఘకాలం ఉండేలా చూసుకోవడం మంచిది. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు..: ప్రమాదాల బారిన పడినా, అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినా.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఎలాగూ హాస్పిటలైజేషన్కు కవరేజి ఉంటుంది కదా.. మళ్లీ ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అన్న ప్రశ్న తలెత్తవచ్చు.పెట్టే ఖర్చుతో పోలిస్తే అత్యధిక ప్రయోజనాలివ్వగలగటమే వీటి ప్రత్యేకత. తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీనిస్తాయి. ప్రమాదవశాత్తూ మృత్యువాత పడినా, ప్రమాదాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఈ పాలసీల ద్వారా కవరేజీ ఉంటుంది. చికిత్సా కాలంలో ఉద్యోగానికి హాజరు కాలేక నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేస్తాయి (పాలసీలో పేర్కొన్న పరిమితులకు లోబడి). ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ప్రత్యేకంగా .. మినహాయింపులేమేం ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాక్షిక అంగవైకల్యం సంభవించినప్పుడు ఆదాయ నష్టాలను కొన్ని వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు భర్తీ చేయవు. అంతే కాకుండా పాలసీలకు కొన్ని సబ్–లిమిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా క్షుణ్నంగా తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. పరిమితులూ ఉంటాయి.. నిర్దిష్ట సందర్భాల్లో సాధారణ పాలసీలకు మించి ఈ తరహా పాలసీలు ప్రయోజనాలు అందిస్తాయనడంలో సందేహం లేదు. అయితే, ఇవి అన్ని ఆరోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే సమగ్రమైన పాలసీలు కావన్నది గుర్తుంచుకోవాలి. సాధారణ పాలసీని జీవితకాలంపాటు రెన్యూవల్ చేసుకోవచ్చు. కానీ ఈ తరహా ప్రత్యేక పాలసీల కాలవ్యవధి ఆయా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు క్లెయిమ్ చెల్లింపుల తర్వాత ముగిసిపోయే అవకాశం ఉంది. కాబ ట్టి ఇలాంటి పాలసీలను సాధారణ పథకానికి అదనంగా, మరింత రక్షణ కోసం తీసుకోవడం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. నిర్దిష్ట సందర్భాల్లో సాధారణ పాలసీ అందించే కవరేజీకి అదనంగా ప్రయోజనాలు పొందేందుకే ఇవి ఉపయోగపడతాయి. -
డెంగ్యూకీ ఉందో పాలసీ
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ, చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నవే. అనేక దఫాలుగా రక్త పరీక్షలు, ఔషధాలు, ఇంజెక్షన్లు... ఈ ట్రీట్మెంట్ అంతా ఖరీదైనదే. అందుకే బీమా సంస్థలు ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ కోసం హెల్త్ పాలసీలను ప్రవేశపెట్టాయి. ఇన్–పేషంట్ హాస్పిటలైజేషన్‌తో పాటు ప్రీ– హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ దాకా ఇవి కవరేజీని అందిస్తున్నాయి. పేద, గొప్ప తారతమ్యం లేకుండా ఎవరికైనా డెంగ్యూ సోకే ప్రమాదముంది కనక.. ఈ వర్షాకాలంలో డెంగ్యూ నుంచి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు సమగ్రమైన కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవడం శ్రేయస్కరం. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు చాలా అంశాలు చూసుకోవాలి. మొత్తం కుటుంబానికి కవరేజీ ఉంటుందా లేదా, సమ్ అష్యూర్డ్.. ప్రీమియం ఎంత? అప్పటికే ఉన్న వ్యాధులకు కవరేజీ ఇచ్చేందుకు వెయిటింగ్ పీరియడ్ ఎంత? నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, క్యాష్‌లెస్ సదుపాయం, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంటు పరిమితులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. డెంగ్యూ పాలసీలోనూ ఇలాంటివి ఉండేలా చూసుకోవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాల్లో కొన్ని ఇవి.. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ ఆరోగ్య బీమా పాలసీని కొనేటపుడు కట్టే ప్రీమియానికి తగినంత విలువ లభిస్తోందో లేదో చూసుకోవాలి. ప్రీమియం తక్కువగా ఉండాలి. అత్యధిక కవరేజీ లభించాలి. ఇటు హాస్పిటలైజేషన్, అటు అవుట్పేషంట్ ట్రీట్‌మెంట్‌కూ పనికొచ్చేదిగా చూసుకోవాలి. ఓపీడీ కవరేజీ.. డయాగ్నస్టిక్ టెస్టుల నుంచి కన్సల్టేషన్, హోమ్ నర్సింగ్, ఫార్మసీ దాకా అన్నింటికి కవరేజీనిచ్చేలా డెంగ్యూ పాలసీ ఉండాలి. సాధారణంగా డెంగ్యూ చికిత్స ఇంటి వద్దే పొందవచ్చు. కొనుగోలు ప్రక్రియ సులభంగా పాలసీ ఎంత సరళతరంగా ఉంటే అంత మంచిది. ఏ వయస్సు వారైనా çఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమి యం కట్టేసే పాలసీ తీసుకోవాలి. ముందస్తు వైద్య చికిత్సలు తదితర బాదరబందీ లేకుండా పాలసీ నిబంధనలు సరళంగా ఉన్నది ఎంచుకోవాలి. వెయి టింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇతరత్రా సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు రిజెక్ట్ చేసిన వారికి సైతం డెంగ్యూ కేర్ పాలసీ వర్తించేలా ఉండాలి. ఆస్పత్రిలో చేరాకా.. గది అద్దె వంటి వైద్యయేతర ఖర్చులకు కూడా కవరేజీ ఉండాలి. భారీగా చికిత్స ఖర్చులు.. డెంగ్యూ పాలసీని తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నవారు ఒకసారి దీని చికిత్స వ్యయాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా డెంగ్యూ వైద్య పరీక్షలకే చాలా ఖర్చవుతుంటుంది. ఇక తీవ్రమైన కేసు అయిన పక్షంలో అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్చి, ప్లేట్లెట్స్ ఎక్కించాలి. వైద్య పరీక్షలకే దాదాపు రూ.5,000 నుంచి రూ. 10,000 దాకా ఖర్చవుతుంది. ఇక ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సా వ్యయాలు సుమారు రూ. 35,000 నుంచి రూ.70,000 దాకా ఉంటున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే బీమా సంస్థలు డెంగ్యూ కేర్ పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. వైద్య పరీక్షల నుంచి చికిత్స వ్యయాల దాకా అన్నింటికీ కవరేజీ అందించేవిగా ఇవి ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే... ఒకవేళ ఇప్పటికే మీకో హెల్త్ పాలసీ ఉన్నా.. డెంగ్యూ పాలసీని ప్రత్యేకంగా తీసుకోవడం మంచిదే. తద్వారా మీ ప్రైమరీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే బోనస్‌ను యథాతథంగా అందుకోవచ్చు. సాధారణంగా ఏ క్లెయిమూ చేయని పాలసీదారుకు బీమా సంస్థలు కొంత బోనస్ ఇస్తుంటాయి. సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో లేదా ప్రీమియంలో డిస్కౌంటు ఇవ్వడం రూపంలోనో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా డెంగ్యూ కవరేజీ తీసుకోవడం వల్ల.. పాలసీదారు తన ప్రైమరీ హెల్త్ పాలసీలో దీన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా బోనస్‌లను కాపాడుకోవచ్చు. కాబట్టి.. ఈ వర్షాకాలంలో.. ప్రాణాంతకమైన డెంగ్యూ నుంచి మీకు, మీ కుటుంబసభ్యులందరికీ రక్షణ కల్పించేలా స్వల్ప ఖర్చుతో డెంగ్యూ పాలసీ తీసుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆంటోనీ జేకబ్ సీఈవో, అపోలో మ్యూనిక్ హెల్త్ -
‘మోదీ కేర్’లో ఎవరి కేర్ ఉంది?!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పదివేల పేద కుటుంబాల కోసం బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరోగ్య రక్షణ పథకాన్ని ఇప్పుడు మోదీకేర్‌గా విస్తత ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారా? లేదా 2019లో జరగాల్సిన పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారా? అన్న అంశంపై కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, అలాంటప్పుడు బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నను పక్కన పెడితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల ప్రకారం పదివేల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయల ఆరోగ్య బీమాను వర్తింప చేయాలంటే ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలు కావాలి. ఆ లెక్కన చూసుకున్నా రెండు వేల రూపాయలు ఏ మూలకు సరిపోవు. ఈ పథకం కింద తదుపరి కేటాయింపులు ఎప్పుడు ఉంటాయో, ఎంత ఉంటాయో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ పథకాన్ని ఖరారు చేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని ఆర్థిక కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత స్కీమ్ గురించి ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరపడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. అంటే, ఈ సంవత్సరంలో ఆ ఆరోగ్య స్కీమ్ అమలు కాకపోవచ్చమాట. వాస్తవానికి ఈ పథకం కొత్తదేమీ కాదు. రాష్ట్రీయ ఆరోగ్య స్కీమ్ కింద కుటుంబానికి 30 వేల రూపాయల ఆరోగ్య బీమాతో 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని గురించి ప్రస్తావించకుండా 2016 బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతి పేద కుటుంబానికి 1.5 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా కల్పిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఈ స్కీమ్ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే స్కీమ్‌ను తిరగేసి ప్రతి పేద కుటంబానికి 5 లక్షల రూపాల ఆరోగ్య రక్షణ స్కీమ్ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. రెండేళ్లపాటు ఈ స్కీమ్‌ను అమలు చేయని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం నిజాయితీగా ఈ స్కీమ్‌ను అమలు చేస్తుందా? చేసేదుంటే కేవలం రెండువేల కోట్ల రూపాయలను మాత్రమే ప్రకటించడం ఏమిటీ? అన్నది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. దేశంలో మొత్తం ఆరోగ్య రంగానికి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 48,878 కోట్ల రూపాయలను కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ కేటాయింపులు 53,198 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరానికి అదే ఆరోగ్య రంగానికి 54,667 కోట్ల రూపాయలను కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 11.8 శాతం, సవంరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కేటాయింపులు కేవలం 2.7 శాతం పెరిగాయి. జీడీపీతో కేటాయింపులను పోలిస్తే పెరగాల్సిన కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. పైగా ప్రపంచంలోనే ఓ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆరోగ్య పథకం అతి పెద్దదని అరుణ్ జైట్లీ గర్వంగా చెప్పుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ హెల్త్ మిషన్’ కింద ఏటా 30 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఆ పథకం పెద్దదవుతుందా? ఇప్పుడు చెబుతున్న ఈ పథకం పెద్దదవుతుందా? నిజంగా ఇదే పెద్దదయితే అంతకన్నా నిధులను ఈ స్కీమ్‌కు ఎక్కువ అవసరం అవుతాయికదా! మనకన్నా అధిక జనాభా కలిగిన చైనా తమ దేశ పౌరులందరికి ఐదు లక్షలు, పది లక్షలు అంటూ పరిమితి అనేది లేకుండా నూటికి నూరు శాతం (ఎంత ఖర్చయితే అంత) ఆరోగ్య బీమాను అమలు చేస్తోంది. అప్పుడు అది పెద్ద స్కీమ్ అవుతుందా? మనది పెద్ద స్కీమ్ అవుతుందా? ప్రతి కుటుంబానికి ఐదులక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడంలో కూడా మతలబు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆధునిక యుగంలో ఓ కుటుంబం ఆరోగ్య అవసరాలకు ఏడాదికి లక్షన్నర రూపాయలు చాలట. అంటే మిగతా మూడున్నర లక్షల రూపాయలను బీమా సంస్థలు లేదా కార్పొరేట్ ఆస్పత్రులు లేదా రెండింటికి లాభాల కింద ముట్టచెబుతామన్నది వైద్య నిపుణుల అంచనా. మరి ‘మోదీకేర్’లో ఎవరి కేర్ ఎక్కువ ఉన్నట్టు?! -
హెల్త్ పాలసీనీ మార్చుకోవచ్చు!
► మొబైల్ నంబర్ మాదిరే ఇక్కడా పోర్టబిలిటీ ► సేవలు నచ్చకుంటే వేరే సంస్థకు మారే అవకాశం ► అదే సంస్థలో వేరే ప్లాన్‌కూ మారిపోవచ్చు ►వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లకు వెసులుబాటు మొబైల్ కంపెనీ అందించే సేవలు నచ్చకపోతే నంబరుతో సహా వేరే కంపెనీకి మారిపోయే వెసులుబాటు ఇప్పుడొచ్చింది. ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ... ఇపుడు ఆరోగ్య బీమా పాలసీలకూ అందుబాటులోకొచ్చింది. అంటే... ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీసులు నచ్చకపోతే మరోదానికీ మారొచ్చు. లేదా మనకు అనువైనదిగా ఉంటే అదే కంపెనీ ఆఫర్ చేసే మరో పాలసీకి కూడా మారిపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ప్రయోజనాలు, పోర్టబిలిటీ ప్రక్రియ మొదలైన అంశాల గురించి వివరించేదే ఈ కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం పాలసీ తీసుకునే నాటికే దాని పరిధిలోకి రాని ఆరోగ్య సమస్యేదైనా ఉంటే.. కొంత కాలం తర్వాత బీమా కంపెనీ సదరు ఆరోగ్య సమస్యకి కూడా కవరేజీ ఇచ్చే వెసులుబాటు ఒకటుంది. నిర్దిష్ట కాలం దాకా నిరీక్షించే పాలసీదారుకు మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. గతంలో ఒకవేళ గడువులోగా వేరే కంపెనీ పాలసీ తీసుకుని ఉంటే.. అప్పటి దాకా నిరీక్షణ రూపంలో వచ్చిన ప్రయోజనాలు దక్కకపోగా.. మళ్లీ కొత్త కంపెనీలో ఆయా ఆరోగ్య సమస్యలకు కవరేజీ కోసం మళ్లీ నిరీక్షించాల్సి వచ్చేది. లేదా అదే కంపెనీలో మనకు అనువైన మరో పాలసీకి మారినా .. అప్పటిదాకా జమయిన క్రెడిట్స్ పాయింట్స్‌ను వదులుకోవాల్సి వచ్చేది. అయితే, తాజాగా పోర్టబిలిటీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య తీరిపోయింది. కంపెనీని మార్చినా లేదా అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారినా అప్పటిదాకా జమయిన క్రెడిట్స్ కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆరోగ్య సమస్యల కవరేజీ కోసం మళ్లీ మొదటి నుంచి నిరీక్షించాల్సిన పని లేకుండా.. సత్వరమే ప్రయోజనం పొందే వెసులుబాటు దొరుకుతుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్‌తో పాటు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నింటికీ ఈ పోర్టబిలిటీ ఆప్షన్ వర్తిస్తుంది. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీకి వస్తే.. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారేందుకు వీలుంది. ఈ కింది సందర్భాల్లో పోర్టబిలిటీని ఎంచుకోవచ్చు.. ♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా లేకపోతే. ♦ నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకు ప్రస్తుతమున్న కవరేజీ సరిపోదని భావించిన పక్షంలో; అలాగే ప్రస్తుత కంపెనీ అంతకు మించిన కవరేజీ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోయినా.. ♦ మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా మందకొడిగా ఉన్నా లేక క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్ర బాగా లేకపోయినా.. ♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న పాలసీలకన్నా మార్కెట్లో మరింత తక్కువ ప్రీమియంకే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభించే పాలసీ దొరుకుతున్నా.. పోర్టబిలిటీకి గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలకు పోర్టబిలిటీ అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల విషయానికొస్తే.. బీమా కంపెనీని మార్చుకునే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకానికి మారే వెసులుబాటు ఉంది. అదే వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రం అదే కంపెనీలో వేరే పాలసీలకైనా మార్చుకోవచ్చు లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీకైనా మారొచ్చు. ఇందుకోసం 45 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుత పాలసీ ప్రీమియం రెన్యువల్ తేదీ కన్నా 45 రోజుల కన్నా ముందుగా (అరవై రోజులు దాటకుండా) మాత్రమే పోర్టింగ్ దరఖాస్తును సదరు ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. పోర్టింగ్కి సంబంధించిన గడువు నిబంధనలకు విరుద్ధంగా మీ దరఖాస్తు ఉందని భావించిన పక్షంలో బీమా కంపెనీ దాన్ని తిరస్కరించవచ్చు. కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు పాలసీని పోర్టింగ్ చేసుకునేందుకు వీలుండదు. ఇండివిడ్యువల్ నుంచి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి ఇండివిడ్యువల్కి కూడా పాలసీని పోర్టింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటోంది. ఇది చాలా మందికి ఊరట కలిగించే విషయం. ఉదాహరణకు పెళ్లి కాక ముందు ఇండివిడ్యువల్ పాలసీ ఉన్నా.. వివాహమయ్యాక ఫ్యామిలీ ఫ్లోటర్‌కి మారాల్సి వస్తుంది. ఒకవేళ మీ ప్రస్తుత బీమా కంపెనీ పాలసీలు మీకు అనుకోండి వేరే సంస్థకు మారొచ్చు. అయితే, ఒక్క విషయం.. అప్పటిదాకా అది వ్యక్తిగత పాలసీగానే ఉన్నందు వల్ల .. పాలసీ పరిధిలోకి అప్పటిదాకా రాని ఆరోగ్య సమస్యలకు సంబంధించిన క్రెడిట్స్ అనేవి సదరు పాలసీదారువి మాత్రమే కొనసాగుతాయి. కొత్తగా పాలసీలోకి చేర్చిన జీవిత భాగస్వామికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ లాంటివి మళ్లీ కొత్తగానే మొదలవుతాయి. అదే, ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి ఇండివిడ్యువల్ పాలసీకి మారాల్సి వచ్చే సందర్భాలూ ఎదురుకావొచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటం వల్ల తరచూ క్లెయిమ్స్ చేయాల్సి వస్తుండవచ్చు. దీంతో మొత్తం పాలసీలోని కుటుంబసభ్యులందరికీ పూర్తి ప్రయోజనాలు లభించకుండా పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడే మెంబర్ పేరును ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి తొలగించి ప్రత్యేకంగా వారి పేరున ఇండివిడ్యువల్ పాలసీని తీసుకోవడం శ్రేయస్కరం. మిగతా కుటుంబసభ్యులకు ప్రస్తుత ఫ్యామిలీ ఫ్లోటర్ బీమా కవరేజీ యథాప్రకారం కొనసాగుతుంది. ప్రీమియం క్రమం తప్పకుండా కడితేనే.. పాలసీ ప్రీమియంలు క్రమం తప్పకుండా కడుతుంటేనే పోర్టింగ్ అవకాశం ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా సరే ప్రీమియం క్రమం తప్పకుండా కట్టకపోవడం వల్ల పాలసీకి బ్రేక్ వచ్చిదంటే అవకాశం కోల్పోయినట్లే. ప్రీమియం గడువు తేదీ ముందుగా ప్రాసెస్ కాకపోతే.. నిర్దేశించిన విధంగా 45 రోజుల కన్నా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఎంచుకున్నప్పటికీ.. ఆఖరి రోజున కూడా మీ దరఖాస్తు కొత్త బీమా కంపెనీ దగ్గర పెండింగ్‌లోనే ఉన్న పక్షంలో బీమా రక్షణ కోల్పోకుండా మీకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రస్తుత బీమా కంపెనీ దగ్గర పాలసీ గడువును గరిష్టంగా నెల రోజుల పాటు పొడిగించుకునేందుకు వీలు ఉంటుంది. పొడిగించుకున్న వ్యవధికి మాత్రమే ప్రీమియం కడితే సరిపోతుంది. అయితే, ఈలోగానే ఏదైనా క్లెయిమ్ తలెత్తిన పక్షంలో.. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కంపెనీ చెల్లింపులు జరుపుతుంది. కానీ, అలాంటప్పుడు పాత కంపెనీకే పూర్తి ఏడాది ప్రీమియంను కట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసిన తర్వాత ఇక ఆ ఏడాదంతా అదే సంస్థ పాలసీనే కొనసాగించాల్సి వస్తుంది. వేరే సంస్థకు పోర్టింగ్ అవకాశం ఉండదు. ఇక, పోర్టింగ్ సంబంధించి కొత్త సంస్థ నుంచి రూఢీగా పాలసీ జారీ అయితే గానీ లేదా పాలసీదారు నుంచి రాతపూర్వకంగా అభ్యర్ధన వస్తే గానీ ప్రస్తుత బీమా సంస్థ.. పాలసీని రద్దు చేయడానికి లేదు. సమ్ అష్యూర్డ్లోకే నో క్లెయిమ్ బోనస్ కూడా .. ఉదాహరణకు మీ ప్రస్తుత పాలసీ కవరేజీ రూ. 2 లక్షలు కాగా మీకు నో–క్లెయిమ్ బోనస్ కింద రూ. 50,000 వచ్చిందనుకోండి. పోర్టబిలిటీ ఎంచుకున్నప్పుడు కొత్త బీమా సంస్థ.. ప్రస్తుత సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ని కూడా కలిపి ప్రీమియం లెక్కేస్తుంది. అంటే.. పాలసీని పోర్ట్ చేసినప్పుడు రూ. 2 లక్షలు కాకుండా రూ. 2,50,000 కవరేజీకి ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కొత్త సంస్థ మీ దరఖాస్తు తిరస్కరించవచ్చు.. పోర్టబిలిటీ అనేది పాలసీదారు హక్కే అయినప్పటికీ.. బీమా కంపెనీలు కచ్చితంగా పోర్టింగ్ వచ్చిన ప్రతి పాలసీనీ అంగీకరించి తీరాలనేమీ లేదు. కొత్త కంపెనీ మీ దరఖాస్తును కొత్తదానిలాగే పరిగణిస్తుంది. ఒకవేళ రిస్కులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే తిరస్కరించనూ వచ్చు కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలకు సిఫార్సు చేయొచ్చు. అయితే ఏ నిర్ణయమైనా సరే మీరు పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గడువు దాటిన పక్షంలో తిరస్కరించడానికి ఉండదు. ప్రక్రియ ఇలా.. అవసరమైన పత్రాలతో పోర్టింగ్ దరఖాస్తును సమర్పించాక, కొత్త బీమా సంస్థ మీ మెడికల్, క్లెయిమ్‌ల హిస్టరీ గురించి ప్రస్తుత బీమా సంస్థ నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇదంతా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వెబ్ సైట్ ద్వారా జరుగుతుంది. కొత్త సంస్థ నుంచి అభ్యర్ధన వచ్చిన వారం రోజుల్లోగా మీ ప్రస్తుత సంస్థ సదరు సమాచారాన్ని ఐఆర్డీఏకి అందించాల్సి ఉంటుంది. లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్ల వుతుంది. ప్రస్తుత సంస్థ నుంచి వివరాలు వచ్చాక, కొత్త సంస్థ అండర్‌రైటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తుంది. పాలసీదారు నుంచి దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పోర్టబిలిటీ కోసం ప్రత్యేక చార్జీలేమీ ఉండవు. పూర్తిగా ఉచితం. కావల్సిన పత్రాలు.. ♦ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ♦ గడిచిన ఏడాదిలో క్లెయిమ్స్ లేకపోతే ఆ విషయాన్ని స్వయంగా ధృవీకరిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్. ♦ ఒకవేళ క్లెయిమ్ ఉంటే, డిశ్చార్జి సమ్మరీ, చికిత్స, రిపోర్టు కాపీలు మొదలైనవి. ♦ కీలకమైన అనారోగ్య సమస్యలేమైనా గతం నుంచీ ఉంటే వైద్యులతో కన్సల్టేషన్ పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు, చికిత్స రిపోర్టులు. ♦ పోర్టబిలిటీ దరఖాస్తు ఫారం ♦ ఇవి కాకుండా సదరు బీమా సంస్థ ఇతరత్రా పత్రాలేమైనా కోరిన పక్షంలో అవి. పోర్టబిలిటీ ప్రయోజనాలు.. ♦ కొత్త సంస్థ నుంచి మెరుగైన సేవల అంచనాలు. ♦ సముచిత ప్రీమియానికి మెరుగైన పాలసీ ♦ భవిష్యత్ అవసరాలను బట్టి పాలసీని తీర్చిదిద్దుకునే అవకాశం. ప్రతికూలతలు.. ♦ రెన్యువల్ సమయంలో మాత్రమే పోర్టింగ్‌కు అవకాశం. ♦ నో–క్లెయిమ్ బోనస్ ఉచితంగానే పోగుపడినా.. కొత్త సంస్థ దాన్ని కూడా సమ్ ఇన్సూర్డ్ కింద చేర్చడం వల్ల ప్రీమియం భారం పెరగడం. ♦ కొత్త బీమా సంస్థ మళ్లీ మీ రిస్కును తమ తమ పద్ధతుల్లో బేరీజు వేసుకుని మళ్లీ కొత్తగా ప్రీమియంలు నిర్ణయించడం. -
ఆరోగ్యానికి... రెండు పాలసీలు!
♦ నచ్చిన కంపెనీ నుంచి పరిహారం కోరొచ్చు ♦ మొదట కంపెనీ గ్రూప్ పాలసీని క్లెయిమ్ చేస్తేనే బెటర్ ♦ వైద్య బిల్లు పరిమితి దాటిపోయినా కంగారక్కర్లేదు ♦ ఒక పాలసీ పరిమితి అయిపోతే రెండోది వాడొచ్చు మన దేశంలో ఒక్క హెల్త్ పాలసీ కూడా లేని వారు ఇప్పటికీ అత్యధికంగానే ఉన్నారు. కాకపోతే ముందు జాగ్రత్తతో రెండు పాలసీలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. సాధారణంగా ఉద్యోగస్తులకు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ పాలసీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనివల్ల అన్ని అవసరాలూ తీరకపోవచ్చు. పైగా ఉన్నట్టుండి కంపెనీని వీడాల్సి వస్తే హెల్త్ కవరేజీ కూడా ఆగిపోతుంది. అందుకే ఉద్యోగులు విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా అవివాహితులైతే వ్యక్తిగత హెల్త్ పాలసీ తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇలా రెండు పాలసీలున్నప్పుడు వాటికి సంబంధించిన కవరేజీ ప్రయోజనాలు వేర్వేరుగా ఉండొచ్చు. తగినంత కవరేజీ ఉండాలి... ఒకటికి మించి పాలసీలు తీసుకునే సమయంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అన్నీ ఒకే తరహాలో ఉండడం అంత ప్రయోజనకరం కాదు. వేటికవే ప్రత్యేక ప్రయోజనాలతో ఉండేలా ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఏ తరహా వైద్య అవసరాలు ఏర్పడినా ఒకటి కాకుంటే మరొకటైనా కవర్ చేసేలా ఉండాలి. ఇక మొదటి పాలసీ గురించి రెండో పాలసీ జారీ చేసే కంపెనీకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. పరిహారం చెల్లింపులో ఇది కీలకాంశం అవుతుందన్నది భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా మాట. ఇక ఒకటికి మించిన పాలసీలు తీసుకునే వారు పారదర్శకంగా అన్ని వివరాలనూ పాలసీ దరఖాస్తులో పేర్కొనడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల సమాచారాన్ని తెలియజేయడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అన్ని పాలసీలు ఒకేలా ఉండవు హెల్త్ పాలసీల్లో మెడిక్లెయిమ్ పాలసీలు నష్ట పరిహారం చెల్లించేవి. అంటే ఇండెమ్నిటీ అన్నమాట. హాస్పిటల్లో అయిన వైద్య ఖర్చుల బిల్లులను బీమా కంపెనీలు గరిష్ట పరిమితి మేరకు చెల్లిస్తాయి. మరో రకం డిఫైన్డ్ బెనిఫిట్ (క్రిటికల్ ఇల్నెస్) పాలసీలు. ఏదైనా అనారోగ్యం బయటపడిన వెంటనే మొత్తం బీమాను చెల్లించేస్తాయి. ఈ నేపథ్యంలో ఒకటికి మించిన ఇండెమ్నిటీ కవరేజీ పాలసీలు ఉన్నవారు ఆయా బీమా కంపెనీల్లో దేని నుంచైనా పరిహారం పొందొచ్చు. అంతేకానీ, పరిహారం కోసం రెండు బీమా కంపెనీలనూ సంప్రతించడం తప్పనిసరి కాదు. పాలసీదారుడి ఇష్టం మేరకు తనకు ఇండెమ్నిటీ పాలసీలున్న ఏ కంపెనీ నుంచైనా పరిహారం పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఉదాహరణకు రూ.2 లక్షల బిల్లయితే రెండు బీమా పాలసీలున్నవారు ఒక్కో బీమా కంపెనీ నుంచి రూ.లక్ష చొప్పున తీసుకోవాల్సిన ఇబ్బందేమీ లేదు. గతంలో ఈ విధానం ఉండేది. ఒకటికి మించిన పాలసీలుంటే పరిహారాన్ని బీమా నిష్పత్తి మేరకు కంపెనీలు చెల్లించేవి. ప్రయోజనాలు ఎక్కువే... ఒకటికి మించిన పాలసీలు ఉండడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఉదాహరణకు ఆస్పత్రి పాలై రూ.2 లక్షల బిల్లు అయిందనుకోండి. క్లెయిమ్ సందర్భంలో బీమా కంపెనీ రూ.2 లక్షల పరిహారం ఇవ్వకుండా ఏవేవో నిబంధనల సాకుతో రూ.1.50 లక్షలే చెల్లించొచ్చు. అప్పుడు మిగిలిన రూ.50 వేలను చెల్లించాలని కోరుతూ పాలసీదారుడు మరో కంపెనీని ఆశ్రయించొచ్చు. ఇది పాలసీదారుడి హక్కు అని ఐఆర్డీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు హెల్త్ పాలసీలున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే రూ.3 లక్షల బిల్లు వచ్చిందనుకోండి. ఓ బీమా కంపెనీ నుంచి రూ.2 లక్షల వరకే పరిహారం వస్తుంది. అప్పుడు మిగిలిన రూ.లక్షను మరో బీమా కంపెనీ నుంచి పొందే అవకాశం ఉంది. ఒకటికి మించిన ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్లు ఉంటే? క్రిటికల్ ఇల్నెస్ పాలసీలే ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్లు. ఇవి జీవిత బీమాకు రైడర్‌గానూ, విడిగా స్టాండలోన్ పాలసీగానూ తీసుకోవచ్చు. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం ఈ తరహా పాలసీల్లో పరిహారం కోసం వచ్చే క్లెయిమ్‌లను అన్ని బీమా కంపెనీలు ఆమోదించాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రక్రియ ఇదీ... సాధారణంగా బీమా కంపెనీలు పరిహా రం చెల్లించేందుకు ఒరిజినల్ బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీని తప్పకుండా సమర్పించాలని కోరతాయి. పరిహారం ఒకే బీమా కంపెనీ నుంచి తీసుకుంటుంటే ఈ విషయంలో సమస్య ఏమీ ఉండదు. కానీ, ఒకటికి మించిన బీమా కంపెనీల నుంచి పరిహారం కోరాల్సి వస్తే ఒరిజినల్ బిల్లులు, ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీలు అన్నింటికీ సమర్పించడం సాధ్యం కాదు. అప్పుడు మొదట ఒక బీమా కంపెనీ నుంచి పరిహారం తీసుకున్న తర్వాత ఆ కంపెనీ జారీ చేసే ఒరిజినల్ సెటిల్మెంట్ లెటర్‌తోపాటు బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ జిరాక్స్ కాపీలపై స్వయంగా అటెస్టేషన్ చేసి సమర్పించాల్సి ఉంటుందని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ చీఫ్ పరాగ్ గుప్తా తెలిపారు. పరిహారం కోసం దేన్ని ఎంచుకోవాలి? పాలసీదారులకు ఒకటికి మించిన పాలసీలు ఉన్నప్పటికీ ఏదో ఒక బీమా కంపెనీని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయొచ్చని చెప్పుకున్నాం. అయితే, ఉన్న పాలసీల్లో ఏ కంపెనీని ఎంచుకోవాలి? అన్న ప్రశ్న ఉదయించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే, ఏదేనీ పరిహారం కోసం వెయిటింగ్ పీరియడ్‌లో ఉండి ఉండొచ్చు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు విడిగా మరో హెల్త్ పాలసీ ఉన్న వారు... నిస్సంకోచంగా గ్రూప్ హెల్త్ పాలసీ కంపెనీ నుంచి ముందుగా పరిహారం పొందాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే గ్రూప్ పాలసీల్లో నో క్లెయిమ్ బోనస్ తరహా ఎటువంటి ప్రయోజనాలూ ఉండవు. పైగా గ్రూప్ పాలసీలు రిటైల్ పాలసీలతో పోలిస్తే విస్తృత కవరేజీనిచ్చేవిధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
వీటి గురించీ తెలుసుకోండి..
నో క్లెయిమ్ బోనస్ సంగతేంటి? ప్రస్తుత హెల్త్ పాలసీ రూ.2 లక్షలకు ఉంది. దానిపై నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.50వేలు కలిసి ఉందనుకుంటే... పోర్టబిలిటీలో కొత్త బీమా కంపెనీ రూ.2.5 లక్షలకు బీమా కవరేజీ ఇస్తుంది. ప్రీమియం కూడా అంత మేర చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు తిరస్కరణ పోర్టబులిటీ దరఖాస్తును కచ్చితంగా ఆమోదించాలనేమీ నిబంధనల్లేవు. పోర్టబిలిటీ దరఖాస్తు అయినప్పటికీ దాన్ని నూతన దరఖాస్తుగా భావించి బీమా కంపెనీ నియమ నిబంధనల మేరకు దాన్ని అన్ని విధాలుగా పరిశీలిస్తుంది. చివరికి పాలసీ ఇవ్వడం రిస్క్ అని భావిస్తే దరఖాస్తును తిరస్కరించవచ్చు. లేదంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరవచ్చు. 15 రోజుల్లోపే తేల్చాలి... పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీ కోరిన అన్ని రకాల పత్రాలూ సమర్పించారు. దానిపై నిర్ణయాన్ని నిబంధనల మేరకు బీమా కంపెనీ 15 రోజుల్లోగా తెలియజేయాలి. ఆ లోపు తెలియజేయక పోతే పోర్టబిలిటీని ఆమోదించినట్లే లెక్క. 15 రోజుల తరవాత తిరస్కరించే అవకాశం లేదు. కవరేజీ పెరిగితే... పోర్టబిలిటీ సదుపాయంలో భాగంగా బీమా కవరేజీ పెరిగితే నిబంధనలు మారిపోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుత పాలసీ రూ.2లక్షలే. పోర్టబిలిటీలో భా గంగా మారే బీమా కంపెనీలో కనీస పాలసీ రూ.5 లక్షలు ఉందనుకోండి. అప్పుడు కచ్చితంగా రూ.5 లక్షలు తీసుకోక తప్పదు. అలాంట ప్పుడు పాత పాలసీలోని నిరీక్షణ కాలం బదిలీ కాదు. ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలంటే... ప్రస్తుత పాలసీ పత్రం, నో క్లెయిమ్ బోనస్‌పై స్వీయ ధ్రువీకరణ, ఒకవేళ క్లెయిమ్ ఉంటే ఆస్పత్రిలో ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ, వైద్య పరీక్షలు, ఫాలో అప్ రిపోర్టు కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ అదనంగా ఏవైనా కోరినా అందించాలి. ఇలా పోర్టబిలిటీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలన్నీ జత చేసి సమర్పించిన తర్వాత... దరఖాస్తు దారుడి వైద్య చరిత్ర, క్లెయిమ్ చరిత్ర గురించి కంపెనీ సమాచారాన్ని కోరవచ్చు. ఇదంతా ఐఆర్డీఏ వెబ్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఇలా కోరిన 7 రోజుల్లోగా పాత కంపెనీ సమాచారాన్ని అందించాల్సి ఉంటుం ది. ఈ వివరాలు అందిన వెంటనే నిబంధనల మేరకు దరఖాస్తును పరిశీలించి తన నిర్ణయాన్ని దరఖాస్తు అందిన దగ్గర నుంచి 15 రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. పోర్టబులిటీ సేవలు పూర్తిగా ఉచితం, ఎలాంటి చార్జీలు విధించడానికి వీల్లేదు. అనుకూలతలు ⇒ మరో కంపెనీలో మంచి సేవలు లభిస్తుంటే ⇒ సరసమైన ప్రీమియానికే మంచి సదుపాయాలతో పాలసీ వస్తుంటే ⇒ భవిష్యత్తు అవసరాలను తీర్చే స్థాయిలో తగినంత కవరేజీతో చౌకగా వస్తుంటే. ప్రతికూలతలు ⇒ పోర్టబులిటీ ద్వారా వచ్చే కస్టమర్‌కు పాలసీ ఇచ్చేముందు కంపెనీలు పూర్తిగా పరిశీలిస్తాయి. రిస్క్ ఉందనుకుంటే ఆ మేరకు ప్రీమియం పెంచుతాయి. ⇒ పాత కంపెనీలోని నో క్లెయిమ్ బోనస్ కొత్త కంపెనీకి వాస్తవికంగా బదిలీ కాదు. కవరేజీ పెంచుతారు. ⇒ ఆ మేరకు అదనపు ప్రీమియం చెల్లించాలి. -
ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతోంది
* రూ. 50 లక్షల హెల్త్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు * సగటు సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షల స్థాయిలో ఉంటోంది ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి అవగాహన పెరుగుతోందని, దీంతో పాలసీదారులు ఎంచుకునే కవరేజీ సగటున రూ.4-5 లక్షల స్థాయికి చేరిందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అండర్‌రైటింగ్ విభాగం అధిపతి అమిత్ భండారీ చెప్పారు. మెట్రో నగరాల్లో రూ. 50 లక్షల పాలసీలూ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారాయన. పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉండేలా మరిన్ని సేవలు ప్రవేశపెడుతున్నామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంటర్వ్యూలో ఏమన్నారంటే... అధిక కవరేజీపై పెరుగుతున్న ఆసక్తి.. దేశీయంగా ప్రైవేట్ బీమా పాలసీలు తీసుకునేవారు 5 శాతమే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ.. బీమా సురక్ష యోజన మొదలైన ప్రభుత్వపరమైన పథకాలతో కలిపితే ఇది సుమారు 20 శాతం మేర ఉంటుంది. అయితే, ఆరోగ్య బీమాపై ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది. గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. అప్పట్లో సగటున సమ్ అష్యూర్డ్ సుమారు రూ.3 లక్షలుంటే ఇపుడది రూ. 4- 5 లక్షలుంటోంది. మెట్రో నగరాల్లోనైతే కొందరు రూ. 50 లక్షల కవరేజీ కూడా తీసుకుంటున్నారు. అలాగే వినూత్నమైన పాలసీలూ కోరుకుంటున్నారు. ప్రివెంటివ్, ఓపీడీ కవరేజీ లాంటి వాటి గురించి అడుగుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు పాలసీ ప్రీమియాల్లో డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పాలసీదారులు తీసుకునే కవరేజి మొత్తం కాస్త తక్కువగా ఉంటోంది. బహుశా దక్షిణాదిలో చికిత్స ఖర్చు కొంత తక్కువగా ఉండటం కారణం కావొచ్చు. వినూత్న పాలసీలు..: పాలసీదార్ల డిమాండ్లకు అనుగుణంగా మేం వినూత్న ఆప్షన్లూ ఇస్తున్నాం. పూర్తి స్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ పథకంతో పాటు ఇటీవలే హెల్త్ బూస్టర్‌ను కూడా ప్రవేశపెట్టాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించే వారికి నిర్దిష్ట రివార్డ్ పాయింట్లు ఇచ్చి, ఆ మేరకు డిస్కౌంట్లు లేదా అధిక కవరేజీని అందిస్తున్నాం. వివిధ అంశాలను బట్టి మొత్తం 8,000-10,000 దాకా పాయింట్లు కేటాయించాం. ఉదాహరణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మారథాన్లలో పాల్గొనడం మొదలైన వాటికి నిర్దిష్ట పాయింట్లుంటాయి. ఒకో పాయింటు విలువ సుమారు పావలా. ఎనిమిది వేల పాయింట్లూ లభిస్తే సుమారు రూ.2,000 మేర డిస్కౌంటు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వారికిది ప్రోత్సాహమే. పాలసీదారులకు ప్రయోజనకరంగా మరిన్ని సేవలు .. మా నెట్‌వర్క్‌లో సుమారు 2,500 పైగా ఆస్పత్రులున్నాయి. పాలసీదారులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ వారికి మరిన్ని ఆప్షన్లుండేలా చూడాలన్నది మా ఉద్దేశం. ఇక బేస్ పాలసీతో పాటు క్రిటికల్ ఇల్నెస్ మొదలైన వాటన్నింటితో కలిపి చూస్తే సుమారు 10 వరకూ పాలసీలు అందిస్తున్నాం. అధిక చికిత్సా వ్యయాలపై ఆస్పత్రులతో బీమా సంస్థలు చర్చించిన మీదట... నగదు చెల్లించేవారితో పోలిస్తే పాలసీదార్లకు సుమారు 10- 15 శాతం దాకా ఆస్పత్రి వ్యయాలు తగ్గుతున్నాయి. చిన్న ఆస్పత్రులైతే ఈ తగ్గుదల 25 శాతం దాకా కూడా ఉండొచ్చు. మా సంస్థపరంగా స్థానికంగా అందుబాటులో ఉండే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాలు, మౌలిక సదుపాయాలు, చికిత్స నాణ్యత తదితర అంశాలను పోల్చి చూసుకునేందుకు ప్రత్యేకంగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంను కూడా అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో దాదాపు 140 పైగా ఆస్పత్రులను, 30 పైగా కీలక చికిత్సలను ఇందులో చేర్చాం. మా పాలసీదారులే కాకుండా మిగతావారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ-కామర్స్ సైట్లలో హెల్త్ పాలసీలు.. ఈ-కామర్స్ సైట్లలో బీమా పాలసీల విక్రయమనేది తక్షణమే రాకపోవచ్చు. ఎందుకంటే మిగతా రకాల పాలసీలతో పోలిస్తే హెల్త్ పాలసీ అండర్‌రైటింగ్ చేయాలంటే సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యలు (డయాబెటిస్ వంటివి) తెలిస్తేనే సాధ్యం. వాహనాల పాలసీల్లాగా వీటిని ఆన్లైన్లో ఆషామాషీగా జారీచేయడం కుదరదు. బహుశా మిగతా రకాల పథకాలు వచ్చిన కొన్నాళ్లకు హెల్త్ పాలసీలూ ఈ-కామర్స్ సైట్లలోకి రావొచ్చు. అది కూడా స్టాండర్డ్ పథకంగా పలు పరిమితులతో ఉండొచ్చు. - అమిత్ భండారీ ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ అండర్‌రైటింగ్ విభాగం హెడ్ -
ప్రీమియం కోత.. అయినా అందని వైద్యం
ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మొత్తాన్ని కట్ చేస్తున్నారు గానీ, వాళ్లకు వైద్యం మాత్రం అందడం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. రెండు నెలల పాటు తాత్కాలికంగా ఈ పథకాన్ని నిలిపివేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మరో రెండు నెలల పాటు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే, నవంబర్ ఒకటో తేదీ నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ వర్తించదని ఇటీవలే ఏపీ సర్కారు జీవో జారీచేసింది. దాంతో అటు రీయింబర్స్మెంట్ రాక, ఇటు హెల్త్ పాలసీ అమలుకాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఆస్పత్రులలో ఉద్యోగులకు హెల్త్ పాలసీ అమలు చేయట్లేదని అశోక్ బాబు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులతో ఎంఓయూ కుదరలేదంటూ వైద్యానికి నిరాకరిస్తున్నారన్నారు. రెండు నెలల పాటు రీయింబర్స్మెంట్ కొనసాగించేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం అంగీకరించారని ఆయన తెలిపారు. -
పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ గతేడాది ప్రారంభించింది. ఈ-రిపాజిటరీ ఏమిటంటే... ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట. ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు. అంతా ఉచితమే... బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్డేట్ చేస్తుంటుంది. ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది. స్నేహిల్ గంభీర్ సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ -
హెల్త్ పాలసీ నిబంధనలు... ముందే తెలుసుకుంటే మేలు
కుటుంబ ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యం. ఆరోగ్య బీమా నుంచి అత్యుత్తమ ప్రయోజనాలు పొందాలంటే పాలసీలోని నిబంధనలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, క్లెయిమ్‌ను పరిష్కరించుకునే సమయుంలోనే ఆరోగ్య బీమా పాలసీ అసలు విలువ మనకు బోధపడుతుంది. పాలసీ నిబంధనలను పాటించలేదంటూ బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాలున్నాయి. పాలసీ నిబంధనలు, క్లాజులను ఆకళింపు చేసుకుని, అమలు చేస్తే క్లెయిమ్ పరిష్కార సమయుంలో ఇబ్బందులు తలెత్తవు. వెయిటింగ్ పీరియుడ్: మీరు తీసుకోదలచిన పాలసీలోని వెయిటింగ్ పీరియుడ్ను పరిశీలించండి. పాలసీ తీసుకున్న కొంతకాలం వరకు క్లెయిమ్‌లను బీమా కంపెనీలు పరిష్కరించలేవు. దీన్నే వెయిటింగ్ పీరియుడ్ అంటారు. సాధారణంగా, ఓ పాలసీ కొన్న తొలి 30 రోజుల్లో ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు మినహా ఎలాంటి క్లెయిమ్లకూ చెల్లింపులు ఉండవు. ఈ వ్యవధినే ‘కూలింగ్ పీరియుడ్’గా పేర్కొంటారు. అన్ని కంపెనీల కూలింగ్ పీరియుడ్ ఒకేలా ఉండదు. వ్యవధి ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. ఒకటి రెండేళ్ల వెయిటింగ్ పీరియుడ్ తర్వాత కవర్ చేసే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. వీటిని మినహాయింపులు’గా వ్యవహరిస్తారు. ముందునుంచే ఉండే వ్యాధి: పాలసీదారునికి ఏదైనా వ్యాధి ఉంటే బీమా దరఖాస్తు సమయుంలో వెల్లడించాలి. సాధారణంగా మొదటి నాలుగేళ్ల పాటు ఇలాంటి వ్యాధులను కవర్ చేయువు. మినహాయింపులు: పాలసీ నుంచి మినహాయించిన వ్యాధుల గురించి కూడా ఖాతాదారులు తెలుసుకోవాలి. కాస్మెటిక్ సర్జరీ, అబార్షన్, గర్భధారణకు తీసుకునే చికిత్స, డయూగ్నొస్టిక్ చార్జీలు వంటివి సాధారణంగా కవరేజీలో ఉండవు. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సబ్లిమిట్: కొన్ని రకాల అంశాలకు సంబంధించి బీవూ కంపెనీలు చెల్లించే గరిష్ట పరిమితిని సబ్లిమిట్ అంటారు. గది అద్దె, శస్త్రచికిత్సల వ్యయూలపై సబ్లిమిట్ ఉంటుంది. శుక్లం శస్త్రచికిత్సకు ఓ పాలసీలో రూ.20 వేలు సబ్లిమిట్గా ఉండవచ్చు. అంటే, ఖర్చు ఎంతైనప్పటికీ బీమా కంపెనీ రూ.20 వేలు మాత్రమే చెల్లిస్తుంది. కో-పే: ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చులో బీమా కంపెనీ, బీమా చేయించుకున్న వ్యక్తి ఎంతెంత భరించాలనే వివరణ కో-పేలో ఉంటుంది. ఆసుపత్రిలో చికిత్స పొందినపుడు సంబంధిత పాలసీదారు కొంత శాతం ఖర్చును భరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 10-25% వరకు ఉంటుంది. డిడక్టిబుల్స్: పలు ఆరోగ్య బీమా పాలసీల్లో డిడక్టిబుల్ క్లాజు ఉంటుంది. బీవూ కంపెనీ బ్యాలెన్స్ అవంటును చెల్లించడానికి ముందే పాలసీదారు చెల్లించాల్సిన మొత్తాన్ని డిడక్టిబుల్ అంటారు. చాలా పాలసీల్లో ఇది ఐచ్ఛికంగా ఉంటుంది. అంటే మీకు ఇష్టమైతేనే తీసుకోవాలి. ఎంత చెల్లించాలనే అంశాన్ని కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఈ తరహా ఖాతాదారుల నుంచి బీమా కంపెనీలు తక్కువ ప్రీమియుం వసూలు చేస్తుంటారు. సంజయ్ దత్తా చీఫ్ - అండర్‌రైటింగ్ అండ్ క్లెరుుమ్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్