IIIT
-
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత -
ముగిసిన ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్’
రాయదుర్గం: ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్–2024 ముగిసింది. ఒక రోజు హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి 130 మంది సాంకేతిక నిపుణులు, డెవలపర్లు, వికీ మీడియా ప్రాజెక్ట్‌ల స్వచ్ఛంద సహకారులు పాల్గొన్నారు.ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీ మీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పోకడలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలోని లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మిట్ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీలలో టెక్నికల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. వికీమీడియా ఉద్యమం ద్వారా ఊహించిన విధంగా ఉచిత జ్ఞానం కోసం మిషన్‌ను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, వికీమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
రూ.83 లక్షల ప్యాకేజీ.. బీటెక్ పాపకు గోల్డెన్ ఆఫర్
జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని, దానివైపే అడుగులు వేస్తే తప్పకుండా అనుకున్న గమ్యం చేరుతారని ఎంతోమంది నిరూపించారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన 'ఇషికా ఝా'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. భాగల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో బీటెక్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థిని 'ఇషికా ఝా' క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి ఏకంగా 83 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ పొందింది. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు, కోడింగ్ పట్ల మక్కువతోనే.. కోడింగ్ రాయడం ప్రారంభించింది. ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మెలుకువలు నేర్చుకుంటూ అనుకున్న విధంగానే జాబ్ కొట్టేసింది. 2020-24 సెషన్‌లోని బీటెక్ బ్యాచ్ చివరి సంవత్సరం కంటే.. కూడా ఈమె ఎక్కువ ప్యాకేజ్ పొంది రికార్డ్ బద్దలుకొట్టింది. గూగుల్ హ్యాకథాన్ చివరి రౌండ్లో.. ప్రాజెక్ట్ చేయడానికి 'ఎన్విరాన్మెంట్' టాపిక్ వచ్చిందని, ఆ సమయంలో ఇషికా ఝా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి ఫారెస్ట్ ఫైర్ ప్రిడిక్షన్‌పై చేసిన ప్రాజెక్ట్ విజయ శిఖరాలను తాకేలా చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్‌కి ప్రిపేర్ కావడం ప్రారంభించినట్లు ఇషికా ఝా వెల్లడించింది. గూగుల్ హ్యాకథాన్‌లో విజయం సాధించినందుకు తన సీనియర్లకు క్రెడిట్ ఇస్తూ, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా కూడా తాను ఎక్కువ నేర్చుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు ప్రస్తుతం ఈమె టెక్నికల్ డొమైన్ నేయిపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో, వెబ్ డెవలప్మెంట్ వంటి వాటిని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాలనే తన అభిరుచి తనను ఇతరులకు భిన్నంగా చేస్తుందని ఝా చెబుతోంది. -
ఆ ట్రిపుల్‌ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్‌కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్‌పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్ శనివారం ఔట్‌పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్‌కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్‌కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్‌పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
AP: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
సాక్షి, నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2023–29 సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు గాను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,,400 సీట్లు ఉండగా, ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించామని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 20, 21వ తేదీల్లో, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 21, 22వ తేదీల్లో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 24, 25వ తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులందరూ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆయా సెంటర్లకు హాజరు కావాలన్నారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సరి్టఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారని, సీటు పొందిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, మిగిలిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇది కూడా చదవండి: కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు -
ట్రిపుల్ ఐటీలకు 38,100 దరఖాస్తులు
నూజివీడు(ఏలూరు): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం 38,100 దరఖాస్తులు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పేర్కొన్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా మరో 100 సీట్లు కలిపి 1100 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించి మార్కులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించనున్నారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఆయన అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైనవారి జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని చాన్సలర్ తెలిపారు. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌కు కన్వీనర్‌గా ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజును నియమించినట్లు తెలిపారు. -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
పరిశోధనలు, ఆలోచనలకు పదును పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచంలో భారతదేశం తనదైన ముద్ర వేసినా ఆవిష్కరణలు లేకపోవడంతో దేశీయంగా అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులు రావడం లేదని మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశంలో ఆవిష్కరణల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు తమవంతుగా జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాము లు కావాలని విద్యార్థులను ఆహ్వానించారు. హైదరా బాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా టాక్ సిరీస్‌ను ప్రారంభించిన కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి–ఆర్థిక ప్రగతితో పాటు హైదరాబాద్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం విద్యా ర్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ‘సాంకేతిక ఆధా రిత ఆవిష్కరణలపై పనిచేస్తున్న విద్యార్థులు, యువత దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినపుడే విజయం సాధిస్తారు. నేటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న పేదదేశంగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్‌కు వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపా ల్సిన అవసరముంది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువు తున్న విద్యార్థులు ప్రపంచస్థాయి ఆవిష్కరణల కోసం సృజనాత్మకంగా ఆలోచించాలి. పరిశోధన, అభివృద్ధి రంగాలపై దేశంలో ఖర్చు పెంచాల్సిన అవసరముంది. ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలి. పరిశోధన–అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా పాఠ్య ప్రణాళికలు, విద్యా బోధన మార్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యం’ అని కేటీఆర్ సూచించారు. వచ్చే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్లకు లైఫ్‌సైన్సెస్ ‘హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ వాతావరణం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొని ఉంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భారతీయ యువత అన్ని రంగాల్లో వినూత్న ఆవిష్కరణల దిశగా పని చేయాలి. స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువత వాటిపై పెట్టుబడిదారులకు ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తమ ఉత్పత్తుల గురించి వివరించగలిగితే భారతీయ స్టార్టప్‌లలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.’ అని కేటీఆర్ వివరించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను కేటీఆర్ పరిశీలించారు. సమావేశంలో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింగాద్రి తదితరులు హాజరయ్యారు. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్‌కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు. -
ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్‌లో.. సర్కారు స్కూళ్ల సత్తా
సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ–ట్రిపుల్ ఐటీలు)లో ప్రవేశాలకు ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఎక్కువమంది ఎంపికయ్యారు. సీట్లు సాధించిన వారిలో 76.97 శాతం మంది వీరే. ఇందులో బాలికల శాతం 66.04. టాప్–3 ర్యాంకులు సాధించిన వారు కూడా ప్రభుత్వ విద్యార్థులే కావడం విశేషం. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎంట్రన్స్ ఫలితాలను గురువారం విజయవాడలోని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. టాప్–3 జెడ్పీ విద్యార్థులే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జెడ్పీ పాఠశాలకు చెందిన జల్లెల నందిని మయూరి ఓపెన్ కేటగిరీలో ప్రథమ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి జెడ్పీ పాఠశాలకు చెందిన చక్రపాణి బెహర రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా మున్నంగి జెడ్పీ పాఠశాలకు చెందిన సోమిశెట్టి ఫణీంద్ర రామకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు రాష్ట్రంలోని నాలుగు ఐఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని, 600 మార్కులకు గాను అన్ని క్యాంపస్‌లలో 93 నుంచి 95 శాతం మార్కులను కేటగిరీల వారీగా కటాఫ్‌గా నిర్ణయించామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని నాలుగు క్యాంపస్‌ల్లోను కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బొత్స వెల్లడించారు. విద్యా రంగానికి ఎంతైనా ఖర్చుచేస్తాం మన విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని మంత్రి తెలిపారు. అందుకనుగుణంగా ఐఐఐటీల అభివృద్ధికి, వాటిల్లో వసతులు, ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తరఫున ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏటా ఎస్టీ కేటగిరీలో సీట్లు మిగులుతుండడంతో వాటిని ఎస్సీ కేటగిరీకి మార్చేవారమని, అయితే.. ఈసారి ఎస్టీ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. న్యాయస్థానం సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పంతో 2008లో ట్రిపుల్ ఐటీని నెలకొల్పారని, దీనిని ఆయన తన మానసపుత్రికగా భావించారన్నారు. ప్రస్తుతం ఒక్కో క్యాంపస్‌లో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 400 సీట్లు ఉన్నాయని, తద్వారా ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా వీటిల్లో చదువుకునే అవకాశం దక్కిందని మంత్రి బొత్స వివరించారు. విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా తమ విద్యార్థులకు 93 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించామని, వీటిని మరింత పెంచేందుకు ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు ల్యాప్‌టాప్, యూనిఫారతో సహా అన్ని వసతులను ఉచితంగా కల్పిస్తున్నట్లు కేసీ రెడ్డి చెప్పారు. కౌన్సెలింగ్ తేదీలివే.. అక్టోబర్ 12, 13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లలో, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌వి ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, అక్టోబర్ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను www.rgukt.in వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. ఐఐఐటీ క్యాంపస్‌ల డైరెక్టర్లు ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి, ప్రొఫెసర్ పి. జగదీశ్వర్‌రావు, అడ్మిషన్ కన్వీనర్ ప్రొఫెసర్ గోపాలరాజు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.. దరఖాస్తు చేసుకోండి ఇలా
సత్తెనపల్లి (పల్నాడు జిల్లా): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో సెంటర్లో 1100 సీట్లు (ఈడబ్ల్యూఎస్ కింద వంద సీట్లు అదనం) అందుబాటులో ఉన్నాయి. గతనెల 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: అది ‘ఐ–టీడీపీ’ పనే పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నూజివీడు, ఇడుపులపాయలోని సీట్లలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ–మెయిల్, మొబైల్‌కు సమాచారం ఇస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కులలిస్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్, సంబంధిత రిజర్వేషన్ల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. అర్హతలు ♦అభ్యర్థులు ప్రథమ ప్రయత్నం లోనే 2022లో ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. ♦ఈ ఏడాది సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారూ రెగ్యులర్‌గానే ప్రభుత్వం ప్రకటించినందున వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ♦ ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250, ఎస్సీ, ఎస్టీలు రూ. 150 చెల్లించాలి. ♦ రశీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, సర్వీసు చార్జి కింద ఆన్లైన్ సెంటర్‌కు అదనంగా రూ.25లు చెల్లించాలి. ఫీజుల వివరాలు ♦ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ♦ ట్యూషన్ ఫీజు కింద పీయూసీ–1, పీయూసీ–2లకు ఏడాదికి రూ.45వేలు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి ♦ ఎన్నారై, అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి కోర్సులు పీయూసీ : గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లిషు, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇంజినీరింగ్ : కెమికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ (ఈ రెండు నూజివీడు, ఇడుపులపాయలో మాత్రమే ఉన్నాయి). సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు. గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్ 19 అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్ 29 కౌన్సెలింగ్ తేదీలు : అక్టోబరు 12 నుంచి 15 వరకు తరగతులు ప్రారంభం : అక్టోబరు 1 -
ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ లేకుండా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్ఐటీల్లో సీట్లు కోరుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్‌కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్‌లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత వరకు అవకాశం? దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి. ఆప్షన్ల ఎంపికే కీలకం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. తగిన వ్యూహం అవసరం ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
రోబోటిక్ పోటీ.. ట్రిపుల్ఐటీ మేటి
గచ్చిబౌలి (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ రెండు ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది. ఇందులోని ‘సెరెబ్రస్’ టీమ్ ద్వితీయ స్థానం పొందగా, ‘లూమోస్’ తృతీయ స్థానం గెలుపొందింది. బెంగళూరులోని ఐఐఎస్సీలోని ఏఐ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్కులో ‘ఓపెన్ క్లౌడ్ టేబుల్ ఆర్గనైజేషన్ చాలెంజ్’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 133 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీ ఇలా... కోవిడ్–19 వైరస్ వ్యాప్తితో పారిశుధ్య కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలను నిర్వహించారు. వాష్‌రూమ్‌లో శుభ్రం చేసే పనుల కోసం రోబోను సృష్టించాలి. ఈ రోబో ద్వారా ఫ్లోర్‌పై ఉండే టిçష్యూపేపర్, చిన్న పేపర్ కప్పులు వంటి చెత్తను తొలగించడం, వాష్‌బేసిన్‌ను శానిటైజింగ్ లిక్విడ్‌తో శుభ్రపరచడం వంటి టాస్క్‌లు ఉన్నాయి. ఈ టాస్క్‌లను ఎంత సమయంలో పూర్తిచేస్తారు, సోప్ డిస్పెన్సర్, ఇతర వస్తువులు పడిపోకుండా శుభ్రం చేయడంలో రోబో ప్రదర్శించిన నైపుణ్యం, వినియోగించిన హార్డ్‌వేర్ తదితరాల ఆధారంగా బృందాలకు స్కోర్ ఇచ్చారు. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో నుంచి 4 బృందాలు గ్రాండ్ ఫినాలే కోసం ఎంపికయ్యాయి. ఇక్కడ ఒక్కో జట్టుకు రోబో రూపకల్పన కోసం రూ.4 లక్షల బడ్జెట్ ఇచ్చారు. సూరజ్ నేతృత్వంలో సెరెబ్రస్ సెరెబ్రస్కు పీహెచ్డీ స్కాలర్, డ్రోన్ స్టార్టప్ ఆర్కా ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సూరజ్ బోనగిరి నేతృత్వం వహించారు. ఇందులో వేదాంత్ ముందేదా, కరణ్ మిరాఖోర్, రాహుల్ కశ్యప్, శ్రీహర్ష పరుహురి, కర్నిక్ రామ్ ఉన్నారు. ‘ప్రతి బృందం అద్భుతమైన, ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించింది. మా డిజైన్ రెండు అంశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. రోబో పరిసరాలను గ్రహించడానికి, స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయడానికి లిడార్స్, రాడార్స్, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాం. కెమెరా ఆధారిత సాంకేతికత ద్వారా మా రోబో అన్ని పనులను పూర్తి చేసింది’ అని సూరజ్ చెప్పారు. ఈ విజయం ఎంతో గర్వకారణమని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అధినేత ప్రొఫెసర్ మాధవ కృష్ణ చెప్పారు. రెండో స్థానంలో నిలిచిన ఈ టీమ్ రూ.2.5 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది. లూమోస్ టీమ్ ఇలా.. ఈ పోటీలో ఆదిత్య అగర్వాల్, బిపాషాసేన్, విశాల్‌రెడ్డి మందడి, శంకర నారాయణన్‌తో కూడిన లూమోస్ జట్టు మూడవ స్థానంలో నిలిచి రూ.77వేలు గెలుచుకుంది. టీసీఎస్ రీసెర్చ్ ఇండియా సహకారంతో ప్రొఫెసర్ కృష్ణ మార్గనిర్దేశనంతో పోటీపడింది. ‘రోబోటిక్ పరిశోధనలో రోబో గ్రాస్పింగ్, మానిప్యులేషన్ ముఖ్యం. కేవలం వస్తువులను తీయడం, పట్టుకోవడంతోపాటు విసరడం, నొక్కడం, స్లైడింగ్ చేయడం, పేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక పనులు చేయడానికి మనుషుల చేతుల మాదిరి నైపుణ్యం కలిగిన చేతులను రూపొందించడానికి అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో మాదైన శైలిలో ప్రదర్శన చేసి మేము విజయం సాధించాం’ అని టీమ్ సభ్యులు చెప్పారు. -
రూ.1.2 కోట్ల జాక్‌పాట్..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు..!
లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)కు చెందిన అభిజీత్ ద్వివేది అనే విద్యార్థి తన ప్రతిభతో అమెజాన్ సంస్థలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీను పొంది రికార్డు సృష్టించాడు. అమెజాన్ అతడికి సుమారు రూ. 1.2 కోట్లను ప్యాకేజ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్‌కు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా అభిజీత్ ద్వివేది నియమితులయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభిజీత్...తన అద్భుతమైన ప్రతిభతో వార్షిక ప్యాకేజీతో మునుపటి ప్లేస్మెంట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. కోవిడ్-19 ఉదృతి కాస్త తగ్గడంతో ఐఐఐటీ లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్లతో 100 శాతం ప్లేస్మెంట్ సాధించారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో రికార్డులను క్రియేట్ చేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే... ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో వార్షిక సగటు వేతనం రూ 26 లక్షలుగా ఉందని ట్రిపుల్ ఐటీ డైరక్టర్ డాక్టర్ అరుణ్ మోహన్ షేర్రీ వెల్లడించారు. చదవండి: అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు! -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్‌లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్‌కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్‌కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్‌తో ఆఫ్‌లైన్ మోడ్‌లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్‌లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్‌లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్‌తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు
వేంపల్లె (వైఎస్సార్ కడప జిల్లా): ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతుల కోసం ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఈ4) విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి (సోమవారం) పీ2 (ఒంగోలు, ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే సుమారు 1,100 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి పీ1 విద్యార్థులకు, 19వ తేదీ నుంచి ఈ3 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. మార్చి 2వ తేదీలోపు ఈ1, ఈ2 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు బహిష్కరిస్తున్నట్లు మెయిల్స్ పెట్టారని, అందుకు స్పందించి త్వరలోనే వారికి ఆఫ్‌లైన్ తరగతుల కోసం షెడ్యూల్ ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఖాళీల భర్తీ నూజివీడు (ఆగిరిపల్లి): కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది, విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీ అయిన 66 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసినట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు క్యాంపస్‌లో 34, శ్రీకాకుళం క్యాంపస్‌లో 32 సీట్లకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పూర్తయిందన్నారు. ఖాళీల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు. -
జేఈఈ–2022 జాడేది?
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్–2022 షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్‌ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తం.. 2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా? జేఈఈ మెయిన్‌ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా
ఒంగోలు మెట్రో: రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) సెట్– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్ వెలువరించి, సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే లక్ష్యం రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే నా ముందున్న లక్ష్యం. – మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్ కలెక్టర్‌గా చూడాలని అమ్మానాన్న కోరిక 2వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. – కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్ ఇంజనీరింగ్ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతా ఇంజనీరింగ్ (సీఈసీ) చదువుతూ సివిల్స్‌కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్జీయూకేటీ సెట్–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. – మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు -
AP: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు.. 1. ఎం. గుణశేఖర్ (ధర్మవరం, అనంతపురం) 2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్ జిల్లా) 3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా) 4. వెంకటసాయి సుభాష్ (జమ్మలమడుగు, వైఎస్సార్ జిల్లా) 5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ(ఐఐఐటీ).. అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్లు (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (మ్యాథమేటిక్స్/డేటాఅనలిటిక్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి. ► ఈమెయిల్: careers.faculty@iiits.in ► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: http://www.iiits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు