international market
-
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కె ట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో గణాంకాలు నవంబర్ నెలకు ఆటో రంగ గణాంకాలు ఆశావహంగా వెలువడ్డాయి. పెళ్లిళ్ల సీజన్‌కుతోడు.. ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగడంతో వాహన విక్రయాలు సానుకూలంగా నమోదయ్యాయి. దీంతో సోమవారం(2న) ఆటో రంగ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అంచనాలను వమ్ము చేస్తూ జీడీపీ నెమ్మదించడంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. తయారీ, మైనింగ్‌తోపాటు వినియోగం తగ్గడం జీడీపీని దెబ్బతీసింది. జీడీపీ మందగమన ప్రభావం ఆర్బీఐ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని మిశ్రా తెలియజేశారు. వడ్డీ రేట్లపై నిర్ణయాలు కీలకంగా నిలవనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భౌగోళిక అనిశి్చతులు మార్కెట్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్మీనా పేర్కొన్నారు. ప్రధానంగా రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు, వ్యవసాయేతర రంగంలో ఉపాధి, నిరుద్యోగిత అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా వివరించారు. వీటికితోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగం(5న)పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు సంతోష్ మీనా పేర్కొన్నారు. ఆర్థిక గణాంకాలు దేశీయంగా ఈ వారం ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు అరోరా చోప్రా తెలియజేశారు. నవంబర్ నెలకు తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. అక్టోబర్‌లో తయారీ రంగ పీఎంఐ 57.3కు చేరగా.. సరీ్వసుల రంగ పీఎంఐ 59.5గా నమోదైంది. క్యూ2లో దేశ జీడీపీ నీరసించినప్పటికీ ప్రపంచ దేశాలలో వేగవంత వృద్ధిగా నిలవడం ప్రస్తావించదగ్గ అంశమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలూ కీలకమేనని తెలియజేశారు. గత వారమిలా.. పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 686 పాయింట్లు(0.9 శాతం) జంప్‌చేసింది. 79,803 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224 పాయింట్లు(1 శాతం) ఎగసి 24,131 వద్ద స్థిరపడింది.అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు నవంబర్‌లో రూ. 21,612 కోట్లు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల(నవంబర్)లో నికరంగా రూ. 21,612 కోట్ల(2.56 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మెరుగుపడటం, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం, దేశీ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే అంతక్రితం నెల(అక్టోబర్)తో పోలిస్తే నవంబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్ తగ్గింది. అక్టోబర్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ ఎఫ్‌పీఐలు దేశీ ఈక్విటీల నుంచి 11.2 బిలియన్ డాలర్లు(రూ. 94,017 కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
కనకం.. పూనకం!
(శివరామకృష్ణ మిర్తిపాటి) : క నకం.. పూనకాలు లోడింగ్ అంటూ బంగారం రోజురోజుకూ రేటు పెరుగుతూ కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడాది క్రితం రూ.60,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల బంగారం రేటు ఇప్పుడు రూ.78,000ను దాటేసి ‘నగ’ధగలాడిపోతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గించడంతో కాస్త దిగివచ్చిన బంగారం.. చాలా మందిలో ఆశలు రేపింది. మరికొంత తగ్గుతుందేమో కొనుక్కుందామని ఎదురుచూసిన వారికి నిరాశ మిగుల్చుతూ చుక్కలను తాకుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడంతో.. ప్రపంచవ్యాప్తంగా పుత్తడికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు మన దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పోటెత్తుతోంది. రేటెంతైనా తప్పదుకదా అన్నట్టుగా కొనుగోలుదారులు బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు. ⇒ కొండెక్కిన బంగారం కొత్త శిఖరాలతో చుక్కలు చూపిస్తోంది. తాజాగా ప్రపంచ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర 2,700 డాలర్ల పైకి ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. దేశీ మార్కెట్లో కూడా 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్) రేటు రికార్డులు బ్రేక్ చేస్తూ రూ.78,300కు ఎగబాకింది. 2023లో మొత్తంగా 20% ఎగబాకిన గోల్డ్ రేటు.. ఈ ఏడాది ఇప్పటికే 29% దూసుకెళ్లడం విశేషం. గడిచిన 14 ఏళ్లలో ఒక ఏడాదిలో ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. అసలే, పండుగ సీజన్‌కు తోడు వచ్చే 3 నెలల్లో పెళ్లిళ్ల బాజాలు మోగనుండటంతో రేటెక్కువున్నా బంగారం షాపులు కళకళలాడుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో గ్రామీణ డిమాండ్ కూడా జతవుతోందని అంటున్నారు. జూలైలో దిగుమతి సుంకం భారీ కోత నేపథ్యంలో ఆగస్టు నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగి 140 టన్నులకు జంప్ చేయడం మన దగ్గర డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందనేందుకు నిద ర్శనం. కాగా 2023–24లో భారత్ మొత్తం 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 850 టన్ను లకు చేరవచ్చనేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. వెరసి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా భారత్ నిలుస్తోంది.పసిడి కాంతులకు కారణమేంటి?కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి, భూగర్భంలోని నిల్వలు అడుగంటుతు న్నాయి. మరోవైపు ఆభరణాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లుచెప్తుండటంతోపాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ వాటాను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంటోంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతోపాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన రిజర్వు బ్యాంకు వద్ద కూడా పసిడి నిల్వలు 840 టన్నులకు ఎగబాకాయి.ఇలా ఓవైపు సరఫరా మందగించడం.. మరోవైపుడిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్‌కు ప్రధాన కారణం. ఇక ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు కనబడకపోగా.. ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడుల తో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ’అణు‘ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితిలో ఆదుకునే సురక్షిత సాధనాల్లో కి, బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. తాజా గా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత అంచనాలను మించి అర శాతం వడ్డీరేట్ల కోత విధించడంతో బంగారానికి మరింత బూస్ట్ ఇచ్చినట్ల యింది. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ఇప్పుడు 2,708 డాలర్లను తాకింది.ఈ పరుగు ఎందాకా?ఫెడ్ రేట్ల కోత ఇప్పుడే ప్రారంభమైందని.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మరో ముప్పావు శాతం తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల పసిడి పరుగులకు ఢోకా ఉండదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ చెబుతోంది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం రేటు 2,900 డాలర్లకు చేరవచ్చని తాజాగా అంచనా వేసింది. ‘‘అమెరికాలో వాస్తవ వడ్డీరేట్లు ఇంకా తగ్గుముఖం పట్టనున్నాయి. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ జోరందుకోనుంది. సీజనల్‌గా ఆభరణాల కొనుగోళ్లు కూడా పుంజుకోనున్నాయి. సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వలు ఇంకా ఎగబాకవచ్చు.దీంతో రాబోయే 6–12 నెలల్లో పసిడి రేట్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’అని యూబీఎస్ పేర్కొంది. యూఎస్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ సైతం సమీప భవిష్యత్తులోనే పసిడి ఔన్స్ ధర 3,000 డాలర్లకు చేరుతుందని లెక్కగట్టింది. వీటి ప్రకారం చూస్తే.. దేశీయంగా 10 గ్రాముల రేటు (24 క్యారెట్) రూ.85,000కు చేరే చాన్సుంది. అంటే పాత తులం (11.7 గ్రాములు) అక్షరాలా లక్ష రూపాయలను తాకుతుంది. రూపాయి విలువ గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు!వన్నె తగ్గని పెట్టుబడి..పసిడి పగ్గాల్లేకుండా పరుగులు తీస్తుండటంతో పెట్టుబడులూ జోరందుకుంటున్నాయి. నిజానికి పెట్టుబడి కోసమైనా కూడా మన దగ్గర ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. దీనివల్ల తరుగు, మజూరీ నష్టాలు అదనం. కాబట్టి పెట్టుబడి కోసం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. కానీ ఇందులోనూ అదనపు చార్జీల భారం ఉంటుంది. పైగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా.దీనికి ప్రత్యామ్నాయం సార్వ¿ౌమ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్. ఎనిమిదేళ్ల క్రితం గ్రాము రూ.3,100 పెట్టి కొన్న గోల్డ్ బాండ్లపై ప్రస్తుతం 150 శాతంపైగా రాబడి లభిస్తోంది. అయితే బంగారం భగభగలతో ప్రభుత్వం ఇప్పుడు వీటి జారీని నిలిపేసింది. సెకండరీ మార్కెట్లోనే దొరుకుతున్నాయి. ఈటీఎఫ్‌లు, ఎస్జీబీలను షేర్ల లాగే నచ్చినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం మంచిదని, ప్రతి నెలా కొద్ది్దకొద్దిగా (సిప్ రూపంలో) ఇన్వెస్ట్ చేయాలనేది నిపుణుల సలహా!సుంకం కోతతో తగ్గినా.. రూపాయి వాతతో! మోదీ సర్కారు జూలైలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి ఎకాయెకిన 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం రేటు ఒక్కసారిగా రూ.5 వేల వరకు తగ్గి.. రూ.66 వేల స్థాయికి దిగొచ్చింది. దీనితో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కానీ అంతర్జాతీయంగా బంగారం రేటు నాన్‌స్టాప్‌గా పరుగులు తీయడంతో మన మార్కెట్లో కూడా పుంజుకోవడం మొదలైంది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత (సెపె్టంబర్ 18న)తో ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.గత 10 రోజుల్లో 100 డాలర్లకు పైగా (మన దగ్గర 10 గ్రాములకు దాదాపు రూ.3,000) పెరిగింది. అంటే సుంకం కోత లేకుంటే.. ధర ఇప్పుడు రూ.83,000 కింద లెక్క. మరోవైపు రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. రెండేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉంది. అదే స్థాయిలో ఉండుంటే.. ప్రస్తుత పసిడి ధర రూ.74,000 (6 శాతం దిగుమతి సుంకంతో కలిపి) ఉండేది. కానీ రూపాయి 83.60కి దిగజారడంతో రేటు 78,000 స్థాయికి చేరింది. అంటే రూపాయి పతనం వల్ల మనం మరో రూ.4,000 అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట!రిస్కు పూజ్యం.. రాబడి ఘనం!ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కూ లేనంత స్టోర్ ఆఫ్ వేల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వేల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే.. ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. భూమి వంటివాటికి స్టోర్ ఆఫ్ వేల్యూ ఉన్నా.. బంగారంలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. అంటే అసలుకు మోసం రాకుండా, లిక్విడిటీ ఎక్కువ ఉండేది బంగారమే. దానికితోడు మంచి రాబడి కూడా. పసిడి ధర ఐదేళ్లలో రెండింతలకుపైగా పెరిగింది. స్టాక్ మార్కెట్ల (షేర్ల)లో ఇంతకు మించి లాభాలొచ్చే వీలున్నా.. అది చాలా రిస్‌్కతో కూడుకున్నది.ధర ఇంతగా పెరుగుతుందనుకోలేదు రెండు నెలల క్రితం బంగారం ధర తగ్గినప్పుడు చాలా ఆనందించాం. ఇంకా తగ్గుతుందేమో అవసరమైన నగలు కొనుక్కోవచ్చని అనుకున్నాం. కానీ ఇంతగా పెరుగుతుందనుకోలేదు. రేట్ చూస్తుంటే భయమేస్తోంది. భవిష్యత్తులో బంగారం కొనగలుగుతామా? అనిపిస్తోంది. – శిరీష, మోతీనగర్, హైదరాబాద్ఎంత పెరిగినా కొనాల్సిందే..బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతుందో అర్థం కావడం లేదు. నేను అమెరికా నుంచి వచ్చాను. అక్కడివారికి బంగారంపై మక్కువ లేకపోయినా మనవారికి మాత్రం ఎనలేని ఇష్టం. ఎంత పెరిగినా ఎంతో కొంత కొనాల్సిందే. – నేహా, హైదరాబాద్ఇలాగైతే బంగారం కొనడం కలే.. ప్రభుత్వం బంగారంపై సుంకం తగ్గించినప్పుడు చాలా ఆనందించాం. బంగారం రేటు పెరుగుతుందనుకోలేదు. ఇలాగైతే బంగారం కొనడం కల గానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం బంగారం కొనాలంటే.. చాలా పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుంది. – నిషా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 2,01,296 టన్నులు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం భూమిపై ఉన్న మొత్తం బంగారం (ఆభ రణాలు, పెట్టుబడులు, ప్రభుత్వాల వద్ద, పారిశ్రామిక వినియోగంతో కలిపి) దీని విలువ 17.4 ట్రిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో రూ.1,455 లక్షల కోట్లు!53,000 టన్నులు ⇒ భూగర్భంలో ఇంకా మిగిలి ఉన్న కచ్చితమైన బంగారు నిక్షేపాలు.⇒ 21.8 క్యూబిక్ మీటర్లు ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతా కరిగించి ముద్ద చేస్తే.. 21.8 మీటర్లుండే క్యూబ్‌లో పట్టేస్తుందట!⇒ 13% ప్రపంచ పసిడి నిల్వల్లో భారతీయుల వాటా ఇది. ⇒ 25,000 టన్నులు మన దేశంలో ప్రభుత్వం, దేవాలయాలతోపాటు ఆభరణాలు, ఇతర రూపాల్లో ప్రజల వద్ద ఉన్న మొత్తం బంగారం అంచనా. -
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రికార్డులు
న్యూయార్క్: అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర కొత్త రికార్డు స్థాయిలను చూసింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోల్చితే 40 డాలర్లు పెరిగి 2,534 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,538 డాలర్లనుసైతం చూసింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు కోత అంచనాలకుతోడు భౌగోళిక ఉద్రిక్తతలు ప్రత్యేకించి పశి్చమాసియా పరిణామాలు దీనికి నేపథ్యం. -
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్‌తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు
న్యూఢిల్లీ: బంగారం ధర గత వారం రోజులుగా ఏరోజుకారోజు కొత్త రికార్డులకు చేరుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం పూర్తి స్వచ్చత 10 గ్రాముల ధర రూ.350 పెరిగి 71,700కు చేరింది. అంతర్జాతీయంగా కూడా ధరలు సరికొత్త రికార్డులను తాకడం దీనికి నేపథ్యం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) ధర జూన్‌తో ముగిసే కాంట్రాక్ట్ ఒక దశలో భారీగా క్రితం ముగింపుతో పోల్చితే 27 డాలర్లు పెరిగి 2,372డాలర్లపైకి ఎగసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి పరుగునకు కారణమవుతున్నాయి. 2024లో దేశంలో పసిడి 10 గ్రాములకు రూ.7,700 పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి విలువ 10 గ్రాములకు ఏకంగా రూ.71,080కి ఎగసింది. సోమవారం ఈ వార్త రాసే సమయానికి క్రితం ముగింపుతో పోలి్చతే రూ.158 లాభంతో రూ.70,794 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా... ఇదిలావుండగా, వెండి కూడా న్యూఢిల్లీలో కొత్త గరిష్టాలను చూసింది. సోమవారం కేజీకి రూ.800 ఎగసి రూ.84,000 స్థాయిని చూసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కేజీ ధర (మే కాంట్రాక్ట్) ఒక దశలో 82,109ని తాకింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయానికి ధర రూ.942 ఎగసి రూ.81,805 వద్ద ట్రేడవుతోంది. -
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
పొగాకు రైతు ఇంట సిరుల పంట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వర్జీనీయా పొగాకు డిమాండ్ పెరగడంతో పొగాకు పంట ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది పొగాకు వేలంలో కేజీ పొగాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. బ్రైట్ గ్రేడ్, లోగ్రేడ్ అన్న తేడా లేకుండా అన్ని గ్రేడ్లకు రికార్డు ధరలు రావడంతో కేజీ పొగాకు సరాసరి ధర రూ.214గా నమోదైంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డుపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చి పొగాకు ముక్క (స్క్రాప్)ను వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కలి్పంచడం, అదనపు పొగాకు పంట అమ్మకాలపై జరిమానాలు రద్దు చేయడంతో రైతుల ఆదాయం రెట్టింపు అయింది. భారీగా పెరిగిన ఉత్పత్తి .. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. వీటిలో కందుకూరు–1, కందుకూరు–2, కలిగిరి, డిసి పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఉండగా, ఒంగోలు–1, ఒంగోలు–2, పొదిలి, కనిగిరి, కొండెపి, వెల్లంపల్లి, టంగుటూరు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిని ఎస్బిఎస్ (సదరన్ బ్లాక్ సాయిల్), ఎస్ఎల్ఎస్ (సదరన్ లైట్ సాయిల్)గా విభజించారు. వీటిలో ఎస్బిఎస్ పరిధిలో 5 వేలం కేంద్రాలుంటే, ఎస్ఎల్ఎస్ పరిధిలో 6 వేలం కేంద్రాలున్నాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో 2022–23 పంట సీజన్‌కు సంబంధించి 89.35మిలియన్ కేజీల పొగాకును అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. కాని ఇప్పటికే 122.34మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. పలు వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు వేలం జరిగే అవకాశం ఉండడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినట్లు అర్ధమవుతుంది. రికార్డు ధరలు ఈ ఏడాదే.. గత రెండేళ్ల నుంచి రికార్డు «పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా.. ఈ ఏడాదిలోనే మార్కెట్లో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఒంగోలు రీజియన్ పరిధిలో ఈ సీజన్లో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు అత్యధిక రూ. 288 పలికినా ప్రస్తుతం స్థిరంగా రూ. 280 ధర వస్తుంది. అయితే ఈ ఏడాది గ్రేడ్లతో సంబంధం లేకుండా దాదాపు అన్ని గ్రేడ్లకు రేట్లు పెరగడంతో సరాసరి రేట్లు మొదటిసారి డబుల్ సెంచరీ దాటాయి. ఎస్బిఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలో ప్రస్తుతం కేజీ పొగాకు సరాసరి ధర రూ 214.47గా నమోదైంది. అంటే క్వింటా పొగాకు సరాసరిన రూ 21,300 వరకు ధర రావడం గమనార్హం. రెండింతలైన బ్యారన్ కౌలు.. ఈ ఏడాది పొగాకు సాగులో వచి్చన లాభాలతో మరోసారి రైతులు పొగాకు పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొలాలు, బ్యారన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతేడాది రూ.15వేలు ఉన్న పొలం కౌలు ప్రస్తుతం రూ.30వేల వరకు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. అదే సందర్బంలో గతేడాది రూ.1లక్ష ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2లక్షలు పలుకుతుంది. ఈ ఫొటోలోని పొగాకు రైతు పేరు రావూరు వెంగళరెడ్డి. ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ళకు చెందిన ఆయన గత 13 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాడు. రెండు బ్యారెన్లు పంట సాగు చేస్తే గతేడాది పెద్దగా మిగిలిందేమీ లేదు. ఈ క్రమంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకు సొంతంగా ఉన్న బ్యారెన్‌తో పాటు మర్రిపాడు మండలం డీసీపల్లిలో మరో ఆరు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. ఇందుకోసం రూ.70 లక్షలు బ్యాంకుల వద్ద, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. అంతకు ముందే అతనికి రూ. 70 లక్షల అప్పు ఉంది. అయితే ముందెన్నడూలేని విధంగా పొగాకు ధరలు పెరగడంతో గతంలో తనకున్న అప్పులన్నీ తీరి మరో పాతిక లక్షల రూపాయల ఆదాయం మిగిలిందని రైతు వెంగళరెడ్డి ఆనందంతో చెప్పాడు. మర్రిపాడు మండలం డీసీపల్లికి చెందిన ఈ రైతు పేరు గోపిరెడ్డి రమణారెడ్డి. 30 ఏళ్లకుపైగా పొగాకు సాగు చేస్తున్నాడు. మూడు దశాబ్దాలకుపైగా పొగాకు సాగు చేస్తున్నా కుటుంబ అవసరాలు తీర్చడానికే తప్ప ఆరి్థకంగా పెద్దగా ఆదాయం మిగలలేదు. ఈనేపథ్యంలో 2022–23 వ్యవసాయ సీజన్లో తనకున్న ఒక్క బ్యారెన్‌తో పాటు మరో మూడు బ్యారెన్లు కౌలుకు తీసుకుని పొగాకు పంట సాగు చేశారు. ఈ ఏడాది వేలంలో ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని ఖర్చులు పోను రూ.60 లక్షలకుపైగా ఆదాయం మిగిలిందని సంతోషంగా చెప్పాడు. పొగాకు రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ రైతులకు మేలు చేసింది. మార్కెట్లో డిమాండ్ లేని సమయంలో రైతులను ఆదుకునేందుకు 2020–21 సీజన్లో నేరుగా మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించింది. ఈ ప్రభావంతో 2021–22 సీజన్ నుంచి పొగాకు మార్కెట్లో ఊహించని ధరలు రైతులకు లభిస్తున్నాయి. ప్రస్తుతం 2022–23 సీజన్ అయితే రికార్డు ధరలతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే బోర్డుపై ఒత్తిడి తేవడంతో అదనపు అమ్మకాలపై విధించే 5శాతం ఫెనాల్టీ ని రద్దు చేశారు. ఇప్పటి వరకు అదనపు పొగాకును అమ్ముకోవాలంటే 5శాతం ఫెనాల్టీ చొప్పున అంటే ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు బోర్డుకు చెల్లించాల్సి వచ్చేది. దీని వల్ల ఒక్కొక్క రైతుకు సరాసరిన రూ 40వేల నుంచి 60వేల వరకు లబ్ధి జరిగింది. ఇక స్క్రాప్(పొగాకు ముక్క)ను ఈ ఏడాది నేరుగా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు ముక్కను కూడా వ్యాపారులు కేజీ రూ 150 వరకు వెచి్చంచి కొనుగోలు చేశారు. -
చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి : చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరబ్‌కు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం, జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్–ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం.. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు, అకడమిక్–రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది. ఉత్పత్తి, వినియోగం పెంపు.. అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాలయాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్ స్నాక్స్‌ను, డిపార్ట్మెంటల్ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించినట్లు కేంద్రం పేర్కొంది. -
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్‌నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
రొయ్యల మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఈక్వెడార్’
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది. గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్‌లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్‌కు వస్తున్నాయి. ఈక్వెడార్‌లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్‌గట్ తదితర వైరస్ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్‌లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు.. రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది. సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ అంతర్జాతీయ రొయ్యల మార్కెట్లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి. – గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా ఒడుదుడుకులు తాత్కాలికమే ఆక్వా మార్కెట్లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది. –కేఎస్వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
అంతర్జాతీయ మార్కెట్లో ఎయిరిండియా న్యూ టార్గెట్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో 30 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పుడు దేశీయంగా 10 శాతం, అంతర్జాతీయంగా 12 శాతం మార్కెట్ వాటా ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునే దిశగా ఎయిరిండియా ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, మంచి పురోగతి కనిపిస్తోందని విల్సన్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో తమ విమానాల సంఖ్యను మూడు రెట్లు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్‌బస్ చిన్న విమానాలను సమకూర్చుకోనున్నట్లు వివరించారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో టేకోవర్ చేసింది. కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించడానికి విహాన్డాట్ఏఐ పేరిట పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్‌పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్
సాక్షి, పాడేరు : గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ లక్ష్యంగా కృషిచేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం పాడేరులోని వెలుగు కార్యాలయం సమీపంలోని వన్‌ధన్ యోజన మార్కెటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీవో పాడేరు డివిజన్ పరిధిలోని డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులన్నింటిని పరిశీలించారు. వెలుగు కార్యాలయం సమీపంలో విశాలమైన స్థలం ఉందన్నారు. అక్కడ మార్కెటింగ్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా డుంబ్రిగుడ మండలంలోని డ్వాక్రా మహిళలు సత్తా సాధించారని, అదే స్ఫూర్తితో డివిజన్లోని అన్ని మండలాల డ్వాక్రా సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రోడ్డు పక్కనే ఉన్న సుండ్రుపుట్టు వెలుగు కార్యాలయం ద్వారా అన్ని అటవీ, వ్యవసాయ గిరిజన ఉత్పత్తులన్నింటికి రిటైల్ మార్కెటింగ్ జరపాలన్నారు. వన్‌ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న అన్ని వ్యాపార ఉత్పత్తులను రిటైల్‌గా అమ్మకాలు జరిపి ఆ లాభాలను డ్వాక్రా సంఘాలకు వర్తింపజేయాలన్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళి, డీపీఎం సత్యం నాయుడు, వెలుగు ఏపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: పోలీసులకు చిక్కిన హుండీల దొంగ) -
రికార్డు గరిష్టానికి విమాన ఇంధనం ధర.. కొత్తగా ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా ఏటీఎఫ్ ధరను 5.2 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం నిర్ణయించాయి. రెండు నెలల్లో ధరల పెంపు (ఈ ఏడాది) ఇది నాలుగో విడత కావడం గమనార్హం. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కిలోలీటర్ ఏటీఎఫ్‌కు రూ.4,482 మేర పెరిగింది. దీంతో ఒక కిలోలీటర్ ఏటీఎఫ్ విక్రయ ధర రూ.90,520కు చేరింది. 2008 ఆగస్ట్‌లో ఏటీఎఫ్ గరిష్ట ధర రూ.71,028గా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి చూస్తే కిలోలీటర్‌కు 16,497 మేర పెరిగినట్టయింది. గత డిసెంబర్లో రెండు విడతల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం గమనార్హం. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత తగ్గడం కలిసొచ్చింది. ఆ తర్వాత నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటు ధరల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో చమురు మార్కెటింగ్ సంస్థలు ఐటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. -
Space Tourism: వినువీధిలో విహారయాత్రలు
వినువీధిలో విహారయాత్రల సందడి మొదలవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల చేపట్టిన వ్యోమ విహారయాత్ర విజయవంతమైంది.మరికొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో సన్నాహాలు చేసుకుంటున్నాయి.డబ్బు, ధైర్యం, దారుఢ్యం, ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై కసరత్తులు చేసుకుంటున్నాయి.స్పేస్ టూరిజం సూపర్ లగ్జరీ పరిశ్రమగా ఎదిగే అవకాశాలపై అంతర్జాతీయ మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్పేస్ టూరిజం కథా కమామిషు కాస్త తెలుసుకుందాం.. ‘వర్జిన్ గ్రూప్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రైవేటు సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఇటీవల జరిపిన వ్యోమ విహారయాత్ర వార్తల్లో సందడి చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన వర్జిన్ గెలాక్టిక్ బృందంలో తెలుగు యువతి శిరీష బండ్ల ఉండటంతో ఈ సంఘటనకు మన జాతీయ మీడియాలో, మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం లభించింది. ఒక పర్యాటక బృందం వినువీధిలో జరిపిన తొలి విహారయాత్ర ఇదే అయినా, అంతరిక్షానికి చేరుకున్న తొలి ప్రైవేటు సంస్థ మాత్రం వర్జిన్ గెలాక్టిక్ కాదు. అమెరికన్ సంస్థ ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ తయారు చేసిన ‘స్పేస్‌వన్’ వ్యోమవిమానం పద్దెనిమిదేళ్ల కిందటే ఈ ఘనత సాధించింది. అయితే, అందులో పైలట్ తప్ప యాత్రికులెవరూ లేరు. ‘స్పేస్‌వన్’ వ్యోమవిమానంలో పైలట్ సహా ముగ్గురు ప్రయాణించేందుకు వీలు ఉన్నా, 2003 డిసెంబరు 17న పైలట్ బ్రియాన్ బిన్నీ ప్రయోగాత్మకంగా అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాడు. ఆ తర్వాత ‘స్పేస్‌వన్’ 2004 సెప్టెంబరు–అక్టోబరులో రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు భూకక్ష్య నుంచి వందమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ఈ రెండు యాత్రల్లో ఒకసారి మైక్ మెల్విల్, మరోసారి బ్రియాన్ బిన్నీ పైలట్లుగా ‘స్పేస్‌వన్’ విమానాన్ని అంతరిక్షం వరకు తీసుకుపోయి, అక్కడ చక్కర్లు కొట్టి విజయవంతంగా భూమ్మీదకు వచ్చారు. ఈ ఘనత సాధించినందుకు ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ సంస్థ పది మిలియన్ డాలర్ల (రూ.74.45 కోట్లు) ‘ఎక్స్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘స్పేస్‌వన్’ ప్రయోగాలు విజయవంతమైన తర్వాతి నుంచే స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రిచర్డ్ బ్రాన్సన్ బాటలోనే తాజాగా ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా వ్యోమ విహారయాత్రకు సమాయత్తం అవుతున్నారు. బెజోస్ ఆధ్వర్యంలోని ‘బ్లూ ఆరిజిన్’ జూలై 20న చేపట్టనున్న ఈ యాత్రలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ శిక్షణలో ఉత్తీర్ణులైన 13 మంది మహిళల్లో ఒకరైన వ్యాలీ ఫంక్‌తో పాటు ‘బ్లూ ఆరిజిన్’ తొలి వ్యోమయాత్రలో పాల్గొనేందుకు వేలంలో 28 మిలియన్ డాలర్లకు (రూ.208 కోట్లు) టికెట్టు దక్కించుకున్న ఒక అజ్ఞాత యాత్రికుడు కూడా పాల్గొననున్నారు. అపరకుబేరుడు ఎలాన్ మాస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ కూడా స్పేస్టూరిజం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘స్పేస్ఎక్స్’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) విజయవంతంగా వ్యోమగాములను, కార్గోను చేరవేసింది. ఊరకే అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చేయడం కాకుండా, త్వరలోనే చంద్రుడి మీద విహారయాత్ర నిర్వహించేందుకు ‘స్పేస్ఎక్స్’ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సంస్థ 2023లో జపానీస్ శతకోటీశ్వరుడు యుసాకు మేజావాను చంద్రుడి మీదకు తీసుకువెళ్లనుంది. యుసాకుతో పాటు ఈ యాత్రలో మరో ఎనిమిది మంది ఔత్సాహిక యాత్రికులు కూడా పాల్గొననున్నారు. ఇరవై ఏళ్ల కిందటే తొలి వ్యోమపర్యటన స్పేస్ టూరిజం ఆలోచనలు గడచిన శతాబ్ది చివరినాళ్లలోనే మొదలయ్యాయి. ప్రైవేటు సంస్థలు ఈ దిశగా ప్రయత్నాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే సరిగా ఇరవయ్యేళ్ల కిందట– 2001 ఏప్రిల్ 28న అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ‘సోయుజ్ టీఎం–32’ వ్యోమనౌకలో శాస్త్రవేత్తల బృందంతో కలసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకుని, అక్కడ ఎనిమిది రోజులు గడిపి వచ్చి, ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యోమ పర్యాటకుడిగా రికార్డులకెక్కాడు. టిటో తన అంతరిక్ష ప్రయాణానికి 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) చెల్లించాడు. భూమ్మీదకు తిరిగి వచ్చాక ఈ పర్యటన తన కంపెనీకి, వ్యాపారానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పాడు. టిటో తర్వాత 2002లో దక్షిణాఫ్రికాకు చెందిన పారిశ్రామికవేత్త మార్క్ షటిల్వర్త్, 2005లో అమెరికన్ వ్యాపారవేత్త గ్రెగరీ ఆల్సెన్ కూడా డబ్బులు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చారు. వీరి తర్వాత ఇరాన్లో జన్మించిన అమెరికన్ వ్యాపారవేత్త అనోషే అన్సారీ 2006లో డబ్బు చెల్లించి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చి, తొలి మహిళా అంతరిక్ష పర్యాటకు రాలిగా రికార్డులకె క్కారు. తర్వాత అమెరికన్ వాణిజ్యవేత్త చార్లెస్ సిమోన్యి 2007లో ఒకసారి, 2009లో ఒకసారి ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి వచ్చాడు. అమెరికన్ వీడియో గేమ్ డెవలపర్ రిచర్డ్ గేరియట్ 2008లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లి, అంతరిక్షయానం చేసిన రెండోతరం అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. రిచర్డ్ గేరియట్ తండ్రి ఆవెన్ గేరియట్ ‘నాసా’ తరఫున రెండుసార్లు అంతరిక్షయానం చేశాడు. రిచర్డ్ గేరియట్ తర్వాత కెనడియన్ వ్యాపారవేత్త గై లాలిబెర్టె 2009లో ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లాడు. వీళ్లందరూ రష్యన్ ప్రభుత్వానికి చెందిన ‘సోయుజ్’ వ్యోమనౌకల్లోనే అంతరిక్ష పర్యటనలు చేశారు. ‘స్పేస్ అడ్వెంచర్స్’ కంపెనీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ యాత్రల్లో తన పర్యాటకులను ‘సోయుజ్’ ద్వారా అంతరిక్షానికి తీసుకువెళ్లింది. ‘స్పేస్‌వన్’ ప్రయోగం విజయవంతమైన దరిమిలా ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో దూసుకుపోవడానికి ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. 2021–2022 స్పేస్‌టూర్లు ఈ ఏడాది ద్వితీయార్ధంలో, వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యాటకులతో మరో నాలుగు స్పేస్‌టూర్లు నిర్వహించేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నాలుగు టూర్లు, వాటిలో పాల్గొనే వారి వివరాలు... ► ‘నాసా’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ‘స్పేస్ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ ఈ ఏడాది సెప్టెంబరు 15న నలుగురు పర్యాటకులతో మూడురోజుల అంతరిక్ష యాత్ర చేపట్టనుంది. ఇది అంతరిక్షం చేరుకుని, భూమి చుట్టూ చక్కర్లు కొట్టి తిరిగి వస్తుంది. ఈ వ్యోమయాత్రలో అమెరికన్ వ్యాపారవేత్త జేర్డ్ ఇసాక్‌మెన్, కాలేజీ ప్రొఫెసర్ సియాన్ ప్రోక్టర్, పిల్లల ఆస్పత్రికి చెందిన పారామెడికల్ ఉద్యోగి హేలీ ఆర్సెనాక్స్, అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి క్రిస్టఫర్ సెంబ్రోస్కి పాల్గొననున్నారు. ► రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ ఈ ఏడాది ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పిస్తూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) రెండు యాత్రలు చేపట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్ 5, 16 తేదీలలో ‘సోయుజ్ ఎంఎస్–18, ఎంఎస్–19’ వ్యోమనౌకల ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో రష్యన్ సినీ దర్శకుడు క్లిమ్ షిపెంకో, రష్యన్ నటి యూలియా పెరెసిల్ద్ పాల్గొననున్నారు. ► ‘రాస్‌కాస్మోస్’ ఈ ఏడాది డిసెంబర్ 8, 19 తేదీలలో ఐఎస్ఎస్కు సోయుజ్–20 వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న 12 రోజుల యాత్రలో జపానీస్ వ్యాపారవేత్త యుసాకు మేజావా, ఆయన సహాయకుడు యోజో హిరానో పాల్గొననున్నారు. ► ‘నాసా’ ఆధ్వర్యంలో ‘స్పేస్ఎక్స్’కు చెందిన ‘క్రూ డ్రాగన్ రీసైలెన్స్’ వచ్చే ఏడాది జనవరిలో ఐఎస్ఎస్కు పదిరోజుల యాత్ర నిర్వహించనుంది. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ పైలట్, వ్యాపారవేత్త ఐటాన్ స్టిబ్బె, అమెరికన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ల్యారీ కానర్, కెనడియన్ వ్యాపారవేత్త మార్క్ ప్యాథీ పాల్గొననున్నారు. ఈ యాత్రలో పాల్గొనే ఒక్కొక్కరి వద్ద 55 మిలియన్ డాలర్లు (రూ.410 కోట్లు) వసూలు చేస్తున్నట్లు ‘స్పేస్ఎక్స్’ ప్రకటించింది. ‘రాస్‌కాస్మోస్’ మాత్రం తన ధరలను అధికారికంగా ప్రకటించకపోయినా, ఇందుకోసం 30 మిలియన్ డాలర్లు (రూ.224 కోట్లు) వసూలు చేస్తున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. అమిత సంపన్నుల ఆటవిడుపు ప్రస్తుతానికైతే ‘స్పేస్ టూరిజం’ అమిత సంపన్నుల ఆటవిడుపుగా మాత్రమే కనిపిస్తోంది. దండిగా డబ్బు, అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో గడపగలిగే శారీరక దారుఢ్యం, అక్కడి వరకు వెళ్ల గలిగే గుండెధైర్యం ఉంటే చాలు, ఎవ్వరైనా వెళ్లవచ్చు. ప్రపంచంలోని ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో స్పేస్ టూరిజం పేరిట కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల ఆనందం కోసం అమిత సంపన్నులు భారీ మొత్తంలో డబ్బు వృథాగా ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాస్త్ర పరిశోధనల కోసం, శాస్త్ర సాంకేతిక పురోగతి కోసం వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థలు జరిపే వ్యోమయాత్రలను అర్థం చేసుకోవచ్చు గాని, కేవలం పర్యటన కోసం అంతరిక్ష యాత్రల పేరిట డబ్బు ఖర్చు చేయడాన్ని సమర్థించలేమని పలువురు అంతర్జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘అంతరాలు గల ప్రపంచంలో మనం ఉంటున్న నేపథ్యంలో నాకున్న సామాజిక అభిప్రాయాల ప్రకారం కేవలం కొద్దిమంది సంపన్నులకే పరిమితమయ్యే వ్యోమయాత్రలను సమర్థించలేను’ అని యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు గంటెర్ వెర్హ్యూజెన్ అభిప్రాయపడ్డారు. స్పేస్ టూరిజంపై విమర్శలు ఎలా ఉన్నా, ఇది శరవేగంగా ఎదుగుతున్న పరిశ్రమ అని, 2030 నాటికి 3 బిలియన్ డాలర్ల (రూ.22,360 కోట్లు) వార్షిక టర్నోవర్ సాధించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రచారానికి పుట్టుకొచ్చిన సంస్థలు స్పేస్ టూరిజం మరింతగా పుంజుకునేలా ప్రచారం కల్పించేందుకు పలు సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘స్పేస్ టూరిజం సొసైటీ’, ‘స్పేస్ ఫ్యూచర్’, ‘హాబీ స్పేస్’ వంటి సంస్థలు స్పేస్ టూరిస్టులుగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి కోసం వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. స్పేస్ టూరిజం కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సవివరమైన సమాచారాన్ని అందించేందుకు ‘యూని గెలాక్టిక్ స్పేస్ ట్రావెల్ మ్యాగజైన్’ అనే ద్వైమాసపత్రిక కూడా ప్రారంభమైంది. ‘జంక్’ జటిలం! అంతరిక్ష విహారయాత్రలపై సామాజిక విమర్శలను పక్కనపెడితే, వీటిపై శాస్త్రవేత్తల బృందాల్లో మరో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శాస్త్ర పరిశోధనల కోసం జరిపిన అంతరిక్ష యాత్రల కారణంగా పునర్వినియోగానికి పనికిరాని పరికరాల శకలాలు, అంతరిక్ష ప్రమాదాల కారణంగా ముక్క ముక్కలైన ఉపగ్రహాల శకలాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర వ్యర్థాలు అంతరిక్షంలో భారీగా పేరుకుపోయాయి. అంతరిక్ష ప్రయోగాలు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యర్థాలనే ‘స్పేస్ జంక్’ అంటున్నారు. వీటిని అక్కడి నుంచి తొలగించడం లేదా, అక్కడికక్కడే నాశనం చేసేయడం వంటి చర్యలు చేపట్టేందుకు తగిన పరిజ్ఞానం, పద్ధతులు ఇంతవరకు అభివృద్ధి చెందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక ప్రయోజమేదీ లేకుండా, కేవలం సంపన్నుల వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్ష యాత్రలు చేపడితే ‘స్పేస్ జంక్’ సమస్య మరింత జటిలం కాగలదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘స్పేస్ జంక్’లో దాదాపు 0.4–4 అంగుళాల పరిమాణంలో ఉన్న 5 లక్షలకు పైగా శకలాలు భూమికి దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ శకలాలు గంటకు దాదాపు 36 వేల కిలోమీటర్ల వేగంతో చక్కర్లు కొడుతుంటాయి. ఇంత శరవేగంగా చక్కర్లు కొట్టే ఈ శకలాలు పొరపాటున భూమిపై నుంచి కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు గాని, రాకెట్లకు గాని తాకితే పెనుప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో పేరుకున్న ‘స్పేస్ జంక్’ను అక్కడికక్కడే నాశనం చేసేందుకు జపానీస్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’ ఒక ‘ఎలక్ట్రానిక్ స్పేస్ విప్’ (అంతరిక్ష కొరడా) రూపొందించి, దీని పనితీరుపై పరీక్షలు జరుపుతోంది. ‘స్పేస్ జంక్’ సమస్యకు సరైన పరిష్కారం ఇంకా లభించక ముందే స్పేస్ టూరిజం కోసం వాణిజ్య సంస్థలు పోటీ పడటం సరికాదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. టూరిస్టులకు ‘నాసా’ అవకాశం స్పేస్ టూరిజం దిశగా ప్రైవేటు సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కూడా తన అంతరిక్ష యాత్రలలో పర్యాటకులకు అవకాశం కల్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘నాసా’ ప్రైవేటు పర్యాటకులకు అవకాశం కల్పించనున్న తన ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’ (సీసీపీ) కింద ప్రత్యేకంగా రూపొందించిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ క్యాప్సూల్ ద్వారా యాత్రలు నిర్వహించనుంది. ‘బోయింగ్ స్టార్‌లైనర్’ జరిపే ఒక్కో అంతరిక్ష యాత్రలో ఒక్కో ప్రైవేటు పర్యాటకునికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనికి టికెట్ ధరను ఇంకా నిర్ణయించలేదు. ‘సోయుజ్’ ద్వారా అంతరిక్ష యాత్రలకు రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ వసూలు చేసే తాజా ధరను పరిగణనలోకి తీసుకుని, తమ ధరను నిర్ణయించనున్నట్లు ‘బోయింగ్’ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. చంద్రమండలానికి టికెట్ రూ.1,119 కోట్లు ‘స్పేస్ఎక్స్’ కంటే చాలా ముందుగానే అమెరికన్ స్పేస్ టూరిజం కంపెనీ ‘స్పేస్ అడ్వెంచర్స్’ 2005లో చంద్రమండలానికి యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దీనికి టికెట్ ధరను కళ్లు చెదిరే రీతిలో100 మిలియన్ డాలర్లుగా (రూ.745 కోట్లు) నిర్ణయించింది. ‘డీప్ స్పేస్ ఎక్స్‌పెడిషన్– ఆల్ఫా’ (డీఎస్ఈ–ఆల్ఫా) పేరిట ‘సోయుజ్’ వ్యోమనౌక ద్వారా చేపట్టనున్న ఈ యాత్రలో ఏకకాలంలో ఇద్దరు పర్యాటకులకు అవకాశం ఉంటుందని తెలిపింది. అమ్మకానికి పెట్టిన రెండు టికెట్లలో ఒక టికెట్ 150 మిలియన్ డాలర్లకు (రూ.1119 కోట్లు) అమ్ముడుపోయినట్లు 2011లో ‘స్పేస్ అడ్వెంచర్స్’ వ్యవస్థాపకుడు ఎరిక్ ఆండర్సన్ ప్రకటించారు. ఐఎస్ఎస్ మీదుగా చంద్రమండలానికి సాగే ఈ యాత్ర 9–21 రోజులు సాగుతుందని వెల్లడించారు. తొలుత ఈ యాత్రను 2015లో నిర్వహించనున్నట్లు ప్రకటించినా, తర్వాత దీనిని 2018 నాటికి వాయిదా వేస్తున్నట్లు ‘స్పేస్ అడ్వెంచర్స్’ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు ఈ యాత్రను నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించేదీ కూడా ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. తాజా పరిస్థితులను గమనిస్తే, ‘స్పేస్ అడ్వెంచర్స్’ తన కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నట్లే భావించవచ్చు. అంతరిక్ష యాత్రలపై టూరిస్టుల అభిరుచులు పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి సిద్ధపడు తున్న సంస్థలు తమ వినియోగదారుల అభిరుచులపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టుల అభిరుచులకు అనుగుణంగా తమ భవిష్యత్ ప్రణాళికలకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఒక ఆన్లైన్ సర్వే ప్రకారం స్పేస్ టూరిస్టుల అభిరుచులు ఇలా ఉన్నాయి: ► అంతరిక్షంలో రెండువారాలు లేదా అంతకంటే తక్కువ కాలం గడపాలనుకుంటున్న వారు– 70 % మంది ► వ్యోమనౌకలో చక్కర్లు కొట్టడంతో సరిపెట్టుకోకుండా, స్పేస్‌వాక్ చేయాలనుకుంటున్న వారు– 88% మంది ► స్పేస్‌వాక్ కోసం అవసరమైతే అదనంగా 50 % వరకు చెల్లించాలనుకుంటున్న వారు– 14% మంది ► అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేస్ స్టేషన్ లేదా హోటల్లో గడపాలనుకుంటున్న వారు– 21% మంది. సొంత వాహనాలతో సిద్ధమవుతున్న ప్రైవేటు సంస్థలు ‘స్పేస్ అడ్వెంచర్స్’ గత ఇరవయ్యేళ్లుగా పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించినా, ఆ సంస్థ ఇప్పటి వరకు సొంత వాహనాన్ని రూపొందించుకోలేకపోయింది. వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు తమ తమ సొంత వాహనాలతో పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పోటాపోటీగా ముందుకొస్తున్నాయి. ► ‘వర్జిన్ గెలాక్టిక్’ టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు (రూ.1.86 కోట్లు). ఇప్పటికే 58 దేశాలకు చెందిన ఆరువందల మంది ఈ టికెట్లు కొనుక్కుని, అంతరిక్షంలో చక్కర్లు కొట్టేందుకు తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టికెట్లు కొనుక్కున్న వారిలో పోటీ సంస్థ ‘స్పేస్ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉండటం విశేషం. ► ‘బ్లూ ఆరిజిన్’ తన తొలి అంతరిక్ష యాత్ర కోసం వేలంలో టికెట్‌ను అమ్మినా, రెగ్యులర్ టూర్ల కోసం ఇంకా టికెట్ ధరను ప్రకటించలేదు. అయితే, ఈ ధర 2 లక్షల డాలర్ల (1.49 కోట్లు) వరకు ఉండవచ్చని ‘బ్లూ ఆరిజిన్’ ఉద్యోగి ఒకరు ‘రాయ్‌టర్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ► ‘వర్జిన్ గెలాక్టిక్’, ‘బ్లూ ఆరిజిన్’ సంస్థలు నిర్వహించే టూర్ ప్యాకేజీలు పర్యాటకులను అంతరిక్షంలో చక్కర్లు కొట్టించి, తిరిగి భూమ్మీదకు తేవడానికి మాత్రమే పరిమితమైతే, ‘స్పేస్ఎక్స్’ ఏకంగా ఐఎస్ఎస్లో ఎనిమిది రోజులు గడపడానికి వీలుగా పర్యాటకుల కోసం ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఒకేసారి నలుగురు పర్యాటకులు పాల్గొనేందుకు వీలుంటుంది. నలుగురికి కలిపి 55 మిలియన్ డాలర్లు (రూ.410) టికెట్ ధరగా నిర్ణయించింది. ‘స్పేస్ఎక్స్’ ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ‘డ్రాగన్2’ వ్యోమనౌకను రూపొందించుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది ఐఎస్ఎస్ యాత్రకు వెళ్లనుంది. ఐఎస్ఎస్లో గడపడానికి సిద్ధపడిన పర్యాటకులకు తగిన శిక్షణ, ఐఎస్ఎస్లో వారు గడపడానికి అవసరమైన స్లీప్సూట్స్ వంటి సామగ్రి సరఫరా, ఆహార పానీయాలు, లైఫ్ సపోర్ట్, వైద్యసేవలు వంటివన్నీ కల్పిస్తుండటం వల్లనే స్పేస్ఎక్స్ తన టికెట్ ధరను భారీగానే నిర్ణయించింది. అంతరిక్షంలో ‘అరోరా’ హోటల్! అమెరికాకు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ కంపెనీ ఆరియాన్ స్పాన్ ‘అరోరా స్పేస్ స్టేషన్’ పేరిట భూమి చుట్టూ పరిభ్రమించేలా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 2018లో ప్రకటించింది. దీనిని సూపర్ లగ్జరీ హోటల్‌గా తీర్చిదిద్ది, అంతరిక్ష పర్యాటకులకు అత్యంత విలాసవంతమైన వినూత్నమైన అనుభూతిని అందించనున్నట్లు తెలిపింది. హూస్టన్‌లో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ‘ఆరియాన్ స్పాన్’ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ బంగర్ ప్రకటించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇందులోకి పాసింజర్లను రిసీవ్ చేసుకోవడం ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో సిబ్బంది కాకుండా, మరో ఆరుగురు యాత్రికులు బస చేసేందుకు వీలుంటుంది. ఈ హోటల్లో గడపదలచిన వారు తప్పనిసరిగా మూడు నెలల శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఇందులో పన్నెండు రోజుల బస కోసం ప్రకటించిన టూర్ ప్యాకేజీ ధరను ‘ఆరియాన్ స్పాన్’ 9.5 మిలియన్ డాలర్లుగా (రూ.70.18 కోట్లు) నిర్ణయించింది. ‘అరోరా’ స్పేస్‌స్టేషన్ హోటల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇందులో బసచేసే యాత్రికులు యథేచ్ఛగా ఇందులో సంచరించవచ్చు. దీనిలోని కిటికీల గుండా అంతరిక్షంలోని వింతలను, అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించవచ్చు. దీనిలోని హోలోగ్రామ్ డెక్‌పై ఆటలాడవచ్చు. అయితే, ఇది అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని నిర్మాణం ఇంతవరకు ప్రారంభం కాలేదని కథనాలు వెలువడ్డాయి. నిర్మాణ పనులను నిలిపివేసి, ఇప్పటి వరకు సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించేశామని ఆరియాన్ స్పాన్ సంస్థ వెబ్సైట్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. అయితే, ఈ సంస్థ ప్రతినిధులు మాత్రం, వచ్చే ఏడాది పాసింజర్లను రిసీవ్ చేసుకుంటామని చెబుతున్నారు. -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఆర్గానిక్ చేనేత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్లబోతున్నాయి. ఈ దిశగా రాష్ట్ర అధికారులు, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీసీ) అధికారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు సహజ సిద్ధమైన రంగులు, నూలు ద్వారా కళాత్మకమైన డిజైన్లు రూపొందిస్తున్నారని హెచ్‌ఈసీపీ అధికారులకు వివరించారు. విస్తృతమైన ప్రచారం, మార్కెటింగ్ అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారని చెప్పారు. రసాయనాలు వినియోగించని పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరించిన రంగులను వినియోగించి చేనేత వస్త్రాలను నేయిస్తున్నట్టు హెచ్ఈపీసీ అధికారులకు వివరించారు. వీటి వల్ల చర్మ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు రావని.. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ తదితర దేశాలకు ఏపీ చేనేత వస్త్రాలను ఎగుమతి చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్గానిక్ వస్త్రాలకు విశేష ఆదరణ.. హెచ్ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఏపీలో ఆర్గానిక్ చేనేత వస్త్రాలను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని తీసుకువస్తే విశేష ఆదరణ పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. చేతితో నేసిన ఉత్పత్తులను దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరగనుందని చెప్పారు. అలాగే ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్సి పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 11 వరకు అంతర్జాతీయ వర్చువల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆప్కో డీఎంవో ప్రసాద్ రెడ్డి, చెన్నై ఆప్కో మెగా షోరూం మేనేజర్ ఎన్.కోటేశ్వరరావు, బండారు ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. -
స్టార్టప్స్‌లోకి నిధుల ప్రవాహం..
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం మరింత జోరందుకుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే.. అంకుర సంస్థల్లోకి సుమారు 12.1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు రావడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే వ్యవధిలో స్టార్టప్ సంస్థల్లోకి సుమారు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ఇటీవలే ట్యాక్సీ సేవల సంస్థ ఓలా 500 మిలియన్ డాలర్లు, సోషల్ కామర్స్ అంకుర సంస్థ డీల్‌షేర్ 144 మిలియన్ డాలర్లు, ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ 315 మిలియన్ డాలర్లు సమీకరించాయి. 2020 మొత్తం మీద దాదాపు 11 స్టార్టప్‌లు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్) హోదా పొందగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 16 అంకుర సంస్థలు యూనికార్న్ వేల్యుయేషన్ దక్కించుకున్నాయి. అంకుర సంస్థల్లోకి వచ్చిన వీసీ పెట్టుబడుల్లో సింహభాగం ఇన్వెస్ట్మెంట్స్కి సెకోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా తదితర సంస్థలు సారథ్యం వహించాయి. విలీనాలు.. కొనుగోళ్లు.. కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా స్టార్టప్స్ విభాగంలో భారీగా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల డీల్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా యూనికార్న్ హోదాను దక్కించుకున్న ఫార్మ్ఈజీ ఇటీవలే .. లిస్టెడ్ కంపెనీ అయిన డయాగ్నొస్టిక్ సర్వీసుల సంస్థ థైరోకేర్‌లో మెజారిటీ వాటాలను రూ. 4,546 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను దక్కించుకుంది. కొత్తగా యూనికార్న్ స్థాయికి ఎదుగుతున్న అప్‌గ్రాడ్ .. ఇలాంటి కొనుగోళ్ల డీల్స్ కోసం 250 మిలియన్ డాలర్లు పైగా కేటాయించింది. మరోవైపు, పలు అంకుర సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) సందడికి కూడా సిద్ధమవుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటో అన్నింటికన్నా ముందుగా వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 9,375 కోట్లు సమీకరిస్తోంది. జూలై 14న పబ్లిక్ ఇష్యూ ప్రారంభమవుతోంది. ఇక ఫిన్–టెక్ దిగ్గజం పేటీఎం సైతం నవంబర్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి.. సాధారణంగా అంకుర సంస్థలకు దేశీయంగా టాప్ 20–30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించిన తర్వాత వృద్ధి అవకాశాలు పెద్దగా ఉండటం లేదని మార్కెట్ పరిశీలకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కలంగా వస్తున్న నిధుల తోడ్పాటుతో ఇకపై చాలామటుకు స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. లిమిటెడ్ పార్ట్నర్స్, మైక్రో వెంచర్ క్యాపిటల్ సంస్థలు తదితర కొత్త తరహా ఇన్వెస్టర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో స్టార్టప్ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక ప్రకారం 2025 నాటికి అత్యంత సంపన్న భారతీయ ఇన్వెస్టర్లు .. టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. -
మళ్లీ కరోనా కల్లోలం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై: కరోనా రెండో దశ విజృంభణతో సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు కలవరపెట్టగా.., లాక్డౌన్ భయాలు వెంటాడాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. రూపాయి వరుస పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా ప్రతికూలాంశంగా మారింది. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. కార్పొరేట్ సంస్థల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,708 పాయింట్లను కోల్పోయి 47,883 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 524 పాయింట్ల పతనంతో 14,311 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లు పెద్ద ఎత్తున విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ మొదలు ముగిసేంతవరకు ట్రేడర్లు అమ్మేందుకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 587 పాయింట్లను కోల్పోయింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఒక్క డాక్టర్ రెడ్డీస్ తప్ప, మిగిలిన అన్ని షేర్లు నష్టాల నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,746 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.233 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలే... జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 634 పాయింట్ల క్షీణతతో 48,957 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు పతనంతో 14,645 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేవలం పావు గంట వ్యవధిలోనే సుమారు 190 షేర్లు లోయర్ సర్క్యూట్ తాకాయి. అలాగే బీఎస్ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది. భారీ నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో సూచీలు కాస్తయినా కోలుకుంటాయని ఆశించిన ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ మరింత క్షీణించసాగాయి. ఏ ఒక్క రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్ల నష్టపోయి 47,693 వద్ద, నిఫ్టీ 587 పాయింట్లు పతనమై 14,248 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్‌సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల నష్టాలతో మొదలు కావడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ‘‘కరోనా ఉధృతి, లాక్డౌన్ భయాలతో స్టాక్ మార్కెట్ నెలరోజు కనిష్టానికి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గి, ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టేంత వరకు మార్కెట్లో అస్థిరత కొనసాగుతుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్–ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిమిషానికి రూ.2,321 కోట్ల నష్టం సూచీల మూడున్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.8.77 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.2321 కోట్ల నష్టాన్ని చవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలకు నాలుగు కారణాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. దేశవాప్తంగా ఆదివారం ఒక్కరోజే 1.68 లక్షల కేసుల నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులు రోజు కో నూతన గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలో లాక్డౌన్ భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. వ్యాక్సిన్ కొరత... దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. వ్యాక్సిన్లు లేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకా కేంద్రాలను మూసేశాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల టీకా ఉత్సవ్ మందకొడిగా సాగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. గణాంకాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దేశీయ కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడి మొదలవుతుంది. కంపెనీల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పలు కంపెనీల షేర్లలో ముందస్తు లాభాల స్వీకరణ చేశారని స్టాక్ నిపుణులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గారు. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై సానుకూల వైఖరికే మొగ్గుచూపవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ మళ్లీ పుంజుకున్నాయి.అలాగే అమెరికాలోనూ ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఇన్వెస్టర్లు కూడా అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారు. -
బుల్ మళ్లీ రంకెలేసింది..
ముంబై: భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ బుల్ రంకెలేసింది. అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్... విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్లింది. పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పరుగును ఆపలేకపోయాయి. అమెరికాలోని హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్‌తో తడబడలేదు. ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న బాండ్ ఈల్డ్స్ భయాలను బేఖాతరు చేసింది. కరిగిపోయిన రూపాయితోనూ కలవరపడలేదు. వెరసి రెండు వారాల గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పెరిగి 14,845 వద్ద నిలిచింది. గడిచిన రెండు నెలల్లో ఇరు సూచీలకూ అత్యధిక లాభాలు ఇవే కావడం విశేషం. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండు నెలల కనిష్టానికి పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఏడాది స్థాయికి చేరుకోవడంతో మెటల్ షేర్లు మెరిశాయి. కిందటి వారంలో నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే రియల్టీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 1260 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించగలిగింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు, నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రారంభంతో పాటు కార్పొరేట్ కంపెనీ క్యూ4 ఫలితాల విడుదల నేపథ్యంలో రిటైల్ కొత్త ఇన్వెస్టర్లు, అధిక సంఖ్యలో కొనుగోళ్లను చేపట్టి ఉండొచ్చు. నిఫ్టీ చివరి ట్రేడింగ్ సెషన్లో కీలకమైన 14,500 మద్దతు స్థాయిని ఛేదించగలగడం కూడా సాంకేతికంగా కలిసొచ్చింది. ఇప్పటికీ మార్కెట్ అంతర్గతంగా బలహీనంగా ఉంది. ట్రేడర్లు అప్రమత్తత వహించాలి’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. ఆరంభం నుంచి దూకుడుగానే ... మూడురోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సూచీల గ్యాపప్ ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 323 పాయింట్ల లాభంతో 49,331 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 14,628 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనసాగిన పర్వంతో సూచీలు దూసుకెళ్లాయి. మిడ్ సెషన్లో కాస్త వెనక్కి తగ్గినా.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,260 పాయింట్లు లాభపడి 50,268 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లను ఆర్జించి 14,876 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్, ఇంధన షేర్లు జోరుతో సూచీలు ఈ స్థాయిలో లాభాలను మూటగట్టుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఎన్హెచ్ఏఐ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకోవడంతో దిలీప్ బిల్డ్‌కాన్ 5% లాభంతో రూ.586 వద్ద ముగిసింది. ►బోనస్ ఇష్యూను పరిగణనలోకి తీసుకోవడంతో ఇక్రాన్ ఇంటర్నేషనల్ షేరు ఎనిమిది శాతం లాభంతో రూ.87 వద్ద స్థిరపడింది. ►అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడైన యస్ బ్యాంక్ షేరు చివరికి 17% లాభంతో రూ.16 వద్ద స్థిరపడింది. -
అంతర్జాతీయ మార్కెట్‌కు ఉలవపాడు మామిడి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. ఉలవపాడు మామిడి తోటల అభివృద్ధికి ప్రత్యేకించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు కూడా తన వంతు సహకారం అందించనుంది. ప్రధాన క్లస్టర్‌గా ఉలవపాడు ఉలవపాడు మామిడికాయ దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దీని రుచి అమోఘం. ఈ కాయ బరువు కేజీ కేజీన్నర కూడా ఉంటుంది. నాణ్యతతో పాటు తీయదనానికి ఇది మారు పేరు. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది దానిని ఆచరణలో పెడుతున్నారు. దీనిలో భాగంగా ఉలవపాడును ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం జాతీయ హార్టీకల్చర్ బోర్డు సహకారం తీసుకోవడంతో పాటు, ఉపాధి హామీ పథకం నిధులను కూడా వినియోగించుకోనున్నారు. 8 వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి తోటలున్నాయి. సేంద్రీయ విధానాన్ని అవలంభించేలా ప్రభుత్వం ఇక్కడి రైతులను ప్రోత్సహిస్తోంది. ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. వాటిపై క్షేత్ర స్థాయిలో ఇక్కడి రైతులకు పూర్తి అవగాహన కలిగించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఉలవపాడు ఉన్నందున నీటి వసతికి అంతగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ నీటి కుంటల ఏర్పాటుతో పాటు, ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని రైతులకు ఉద్యాన శాఖ సూచించింది. ఇప్పటికే మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. పండ్లను నిల్వ చేసేందుకు సరిపడా గిడ్డంగులు, ప్రయోగశాల సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుంచి వివిధ రకాల మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతున్నాయి. కాయల్ని ఎలా ప్యాక్ చేయాలో శిక్షణ ఇస్తున్నాం.. ఉలవపాడు మామిడి కాయల నాణ్యతకు ఎటువంటి ఢోకా లేకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆ ప్రాంత రైతులకు ప్రస్తుతం వైఎస్సార్ తోటబడి కార్యక్రమం కింద శిక్షణ ఇస్తున్నాం. చీడపీడల నివారణపై వారిని చైతన్య పరుస్తున్నాం. ముదురు తోటల్ని పునరుజ్జీవింపజేసేందుకు హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాం. ఎగుమతిదారులు, కమీషన్ ఏజెంట్లకు కూడా శిక్షణ ఇచ్చి.. కాయల్ని ఎలా ప్యాకింగ్ చేయాలో, విదేశాలలో నిబంధనలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాం. – రవీంద్రబాబు, వ్యవసాయశాఖ డీడీ, ప్రకాశం జిల్లా -
అంతర్జాతీయ విపణిలో వెంకటగిరి జరీ
వెంకటగిరి.. చేనేత జరీ చీరలను చూస్తే మగువల మనస్సులు పురివిప్పుతాయి. మేను పులికించిపోతోంది. సంప్రదాయం, ఆధునీకత కలబోతల వర్ణ రంజితమైన చేనేతల అద్భుత కళాఖండాలు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి జరీ చీరలు దేశీయంగా మార్కెట్లో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం, సరైన మార్కెటింగ్ లేకపోవడంతో ఈ రంగం దశాబ్దాల కాలంగా చతికిల పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం లభించనుంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకానికి వెంకటగిరి జరీ చీరలు ఎంపికయ్యాయి. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి జరీ, పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. జిల్లాలోనే కాకుండా దేశీయంగా పలు రాష్ట్రాల్లోని బ్రాండెడ్ షోరూమ్స్‌లకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చీరల ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానికంగానూ ఏటా రూ.కోట్ల రిటైల్ వ్యాపారం జరుగుతోంది. వెండి జరీ, ఆఫ్‌ఫైన్ జరీతో వివిధ రకాల డిజైన్లతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో చీరను నేయడంతో మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెంకటగిరి చీరలకు భలే డిమాండ్ ఉంది. విదేశీ మహిళలు సైతం వెంకటగిరి చీరలపై మోజు పెంచుకుంటున్నారు. ఆధునిక డిజైన్లతో చీరలను నేస్తుండడంతో వెంకటగిరి చీరలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయి. వెంకటగిరి చీరల్లో జిందానీ వర్క్‌కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్ కనబడడం జాందనీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యత మరెక్కడా కనపడదు. విశిష్ట మహిళలకు వెంకటగిరి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. మార్కెట్ సౌకర్యం విస్తృతం మగువలకు అందాన్నిచ్చే వెంకటగిరి జరీ చీరలకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. జిల్లా, రాష్ట్రీయంగానే కాక దేశీయంగానూ మార్కెట్లో వెంకటగిరి చీరలకు డిమాండ్ ఉండడంతో ఏటా రూ.150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు సౌకర్యం లభిస్తే విక్రయాలు పెరిగి, రెట్టింపు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్థానిక మాస్టర్ వీవర్లు, నేత కార్మికుల అంచనా. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ నేతన నేస్తం’ పథకం అమలు చేసి ఇప్పటికే రెండు దఫాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. చేనేతకు మరింత లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ రంగంలోని యువతను ప్రోత్సహించి, ఎగుమతిదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మార్కెట్లో వెంకటగిరి చీరల విక్రయానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కల్పించింది. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ వసతికి మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకం’ ద్వారా జిల్లా నుంచి వెంకటగిరి జరీ చీరలను ఎంపిక చేశారు. చేనేత కార్మికులున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత చీరలు, గుంటూరు జిల్లా మంగళగిరి నేత కార్మికులు తయారు చేసే చీరలు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జిందానీ చీరలను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ఇవ్వనుంది. -
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.