investments to ap
-
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
మరిన్ని పెట్టుబడుల కోసం విదేశాలకు..
సాక్షి, అమరావతి: మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈనెల 15 నుంచి 25 వరకు దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో పర్యటించనుంది. అక్కడ ప్రముఖ సంస్థలను సందర్శించి.. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. మంత్రి బుగ్గన ఈ నెల 10న ఢిల్లీలో దక్షిణ కొరియా, వియత్నాం రాయబారులతో సమావేశమై పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ బృందం కొరియాలోని కియా పరిశ్రమను సందర్శించి ఏపీలోని యూనిట్‌ను మ రింతగా విస్తరించడానికి గల అవకాశాలను వివరిస్తా రు. శామ్సంగ్, దేసాంగ్ కార్పొరేషన్లతో పాటు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిష రీస్ టెక్నాలజీలను ఈ బృందం సందర్శించనుంది. విశాఖలో జరిగిన జీఐఎస్‌లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా తాజా పర్యటనలో ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వనున్నారు. వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్‌ను సందర్శించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ..పరిశ్రమలు, టెక్స్టై ల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అక్కడ పాటిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్‌గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్‌గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్‌లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్‌ను ప్రారంభించింది. -
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు రూ.21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయలు చొప్పున 190.29 ఎకరాలను కేటాయించింది. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. తొలుత 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఏడేళ్లలో 39,815 మందికి ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటీపీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టును ఏడు సంవత్సరాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటిపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది. తొలిదశ మూడేళ్ల కాలంలో కనీసం 40 మోగావాట్ల డేటా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 30 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగేళ్లల్లో 50 శాతం మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఏడేళ్లలో పూర్తిగా అందరికీ ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 300 మోగావాట్ల డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. అలాగే, స్కిల్‌కాలేజీ, రిక్రియేషన్ సెంటర్స్ ద్వారా మరో 3,000 మంది వరకు ఉపాధి లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్‌కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కేలాజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ సెంటర్‌కు 9 ఎకరాలను కేటాయించింది. -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
Global Investment Summit: విశాఖ ధగ ధగ
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. ► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. ► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. ► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్ బోర్డు, కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దారులన్నీ.. వైజాగ్ వైపే.. ► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 500 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్ జగన్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు. రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీఐఎస్‌తో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (జీఐఎస్)తో రాష్ట్ర ముఖచిత్రం మారనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 25 దేశాలకు చెందిన 7,500 మంది పారిశ్రామిక దిగ్గజాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, జీఎంసీ గ్రూపుల అధినేతలు కూడా హాజరుకానున్నారని వెల్లడించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సుతో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘమైన తీరప్రాంతం, విశాఖ వంటి ప్రశాంతమైన నగరం, అందుబాటులో ఉన్న యువత వంటి అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా చేస్తాయని వివరించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీతో ఎంతో లాభం
సాక్షి, అమరావతి: విశాఖలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)–2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది. ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు.. సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జీఐఎస్‌లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటంతో తీర ప్రాంత వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం ఆరు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సుమారు రూ.30,000 కోట్లతో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. రామయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా, కాకినాడ గేట్‌వే పోర్టు పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయడమే కాకుండా పోర్టు సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఆరు ఎయిర్‌పోర్టులు.. గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి. చౌక ధరలకే వేల ఎకరాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లలో పలు చోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ కారిడార్ల పరిధిలో 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్ను అభివృద్ధి చేస్తుండగా, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్‌లో ఎకరం రూ.12 నుంచి రూ.15 లక్షలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్‌లో ప్రధానంగా వివరించనుంది. రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70 శాతం మంది యువతీ యువకులే. అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 25 శాతం మంది తెలుగు మాట్లాడే వారే. ఈ లెక్కన పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతగా అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 2021–22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023–28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022–27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020–25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ–22, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020–25, టూరిజం పాలసీ 2020–25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021–26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించనుంది. -
ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలంతా ఆసక్తి చూపారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖ సర్క్యూట్ హౌస్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు’కు సంబంధించి ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో 49 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. వారితోపాటు వివిధ దేశాల అంబాసిడర్లు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న విషయాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రతినిధులకు వివరించారని చెప్పారు. దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా సుముఖత వ్యక్తం చేశారన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. గతేడాదిలో ఏపీ 19 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిందని తెలిపారు. నీతి ఆయోగ్ వంటి సంస్థ కూడా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని అభినందించిందని సీఎం వైఎస్ జగన్ వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలన్నదే ప్రభుత్వ విధానమని వెల్లడించారు. రాష్ట్రంలో 13 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరించామన్నారు. దేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉండగా.. ఇందులో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనకు కలిసివచ్చే అంశమని తెలిపారు. ఇందులో 49 వేల ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశామన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించామని చెప్పారు. తిరుపతిలో ఇప్పటికిప్పుడు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉన్న అవకాశాలు గురించి చెప్పగా వారు అందుకు ఆకర్షితులయ్యారని వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, అదే నెల 28, 29 తేదీల్లో జరిగే జీ–20 సదస్సులు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే వేదికలు కాబోతున్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకొచ్చినా మౌలిక సదుపాయాలతోపాటు అనుమతుల మంజూరులో ప్రభుత్వం సరళంగా వ్యవహరిస్తుందని చెప్పారు. లోకేశ్‌ను చూస్తే జాలేస్తోంది.. లోకేశ్‌ను చూస్తే తనకు జాలేస్తోందన్నారు. చంద్రబాబు తప్ప ఆయన కుటుంబ సభ్యులంతా లోకేష్‌ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఈ ఆలోచన లేదని చెప్పారు. కొడుకును నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆయనకు ఉంటే.. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర తొలి సభకైనా హాజరయ్యేవారన్నారు. అధికారం విషయంలో చంద్రబాబుకు కొడుకైనా, మామైనా ఒకటేనని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. ఏ రాజకీయ పార్టీ అధినాయకుడైనా తన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని భావిస్తారని, అలాగే అన్ని సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం 25 నుంచి 30 సీట్లకు బేరం ఆడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాపులను చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. రాజు ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని.. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి రాజు అని, రాజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అవుతుందన్నారు. దీనిపై చర్చ అవసరం లేదన్నారు. గతంలో రాజ్యసభలో కేంద్రం.. రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రాలకే ఉంటుందని పేర్కొన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయన్నారు. ప్రొసీజర్ ప్రకారమే ముఖ్యమంత్రి విశాఖకు వస్తారన్నారు. వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు అది ఫోన్ ట్యాపింగో.. రికార్డింగో తేలాల్సి ఉందన్నారు. -
CM Jagan: పెట్టుబడులతో రండి
విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా. విశాఖలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వివిధ దేశాల దౌత్యాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ సన్నాహక సదస్సుకు హాజరయ్యారు. అత్యుత్తమ సౌకర్యాలు ‘విశాఖపట్నంలో మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటులో మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ఏ పారిశ్రామికవేత్తకైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రారంభోపన్యాసంతో పాటు సదస్సు చివరలో ఏపీలో పెట్టుబడులకు గల సానుకూలతలను సీఎం వివరించారు. ‘విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమ్మిట్‌కు హాజరు కావాలని మీ అందరినీ వ్యక్తిగతంగా కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియచేయాలి’ అని సీఎం జగన్ సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్, అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ అధికారులు జవహర్ రెడ్డి, కరికాలవలవన్, సృజన శరవేగంగా అనుమతులు.. చౌకగా సదుపాయాలు పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్రంలో సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం అమలులో ఉందని సీఎం జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, శరవేగంగా అనుమతులివ్వడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీటి సదుపాయం లాంటివి దేశంలో మిగిలిన ప్రాంతాల సగటు కంటే చాలా తక్కువగా, సరసమైన ధరలకే అందిస్తున్నట్లు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో ఏపీలో పుష్కలమైన వనరులు ఉన్నాయని, 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 14,680 మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు జరిగాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుందని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి ఏపీలో వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ రూపొందించిన వీడియోను సదస్సులో ప్రదర్శించారు. ఏపీలో అనుకూలతలు ఇవీ.. పెట్టుబడులకు ఆంధ్రపదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవని సన్నాహక సదస్సులో సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా అపార పెట్టుబడుల అవకాశాలను సోదాహరణంగా ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి మీరే (ప్రతినిధులు) ఇంతకుముందు చెప్పారని గుర్తు చేస్తూ పెట్టుబడులతో ముందుకొచ్చేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలియచేశారు. 11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అగ్రగామిగా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్ స్ధానంలో ఉంది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తోనే నెంబర్‌వన్ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. తద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది. ► రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామో తెలియచేసేందుకు ఇదే నిదర్శనం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ వివిధ ఖనిజాధార పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉన్నాయి. ► రాష్ట్రంలో పలు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లున్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ► ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. పరిపాలనపరమైన విషయాల్లో కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఏపీని మన రాష్టంగా భావించండి. ► అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూటర్ అవార్డు (పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్) ఈటీ–2022, బెస్ట్ స్టేట్ ఫర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎనర్షియా అవార్డు– 2022, క్రాప్ అచీవర్ అండ్ లాజిస్టిక్స్ ఈజ్ (లీడ్స్ 2022 రిపోర్ట్) తదితర అవార్డులు ఏపీకి లభించాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వెల్లడిస్తున్నాయి. -
సీఎం జగన్‌ను కలిసిన జోయాలుక్కాస్ చైర్మన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ అలుక్కాస్ వర్గిస్ జాయ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా వర్గిస్ జాయ్‌తో స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం జగన్.. జోయాలుక్కాస్ చైర్మన్‌కు వివరించారు. ఈ సమావేశంలో జోయాలుక్కాస్ సీవోవో హెన్రీ జార్జ్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్‌లు సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్! -
ఐటీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్ఫినిటీ వైజాగ్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతోపాటు పలు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రెండురోజుల ‘ఇన్ఫినిటీ వైజాగ్’ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఐటీ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వైజాగ్‌లో ఉన్న మెరుగైన అవకాశాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ వర్చువల్‌గా ప్రారంభించే ఈ సదస్సులో రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొంటారు. సైయంట్ ఫౌండర్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అఖిలేష్‌కుమార్ శర్మ, ఎస్టీపీఐ డైరెక్టర్ అరవింద్‌కుమార్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, యూనికార్న్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. బాస్, టెక్‌మహీంద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ మొదలైన 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ కోసరాజు శ్రీధర్ తెలిపారు. ఐటీ సంస్థలకు 21 అవార్డులు అందిస్తున్న ఎస్టీపీఐ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న ఐటీ కంపెనీలకు సదస్సు తొలిరోజు ఎస్టీపీఐ అవార్డులు ఇవ్వనుంది. ఐటీ రంగంలో అత్యుత్తుమ ఎగుమతులు నమోదు చేసిన కంపెనీ, అత్యధికమందికి ఉపాధి కల్పించిన కంపెనీ, అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థ, ఐటీ ఎమర్జింగ్ సిటీస్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ వంటి 21 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సరికొత్త ఆవిష్కరణలు నమోదు చేసిన స్టార్టప్‌కు రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు అవార్డు, మెమెంటో ఇవ్వనుంది. ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు.. భవిష్యత్తులో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీని నిలిపేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై రోడ్‌మ్యాప్ రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ 3.0 ఆవిష్కరణలు, డీప్‌టెక్ డొమైన్.. తదితర రంగాల్లో రాష్ట్ర ఐటీ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. దానికనగుణంగా ఈ సదస్సులో కార్యక్రమాలను రూపొందించారు. బిజినెస్ టూ బిజినెస్ (బీటూబీ) నెట్వర్కింగ్ అవకాశాలు సృష్టిసూ మల్టీ నేషనల్ కంపెనీలతో నెట్వర్క్ చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం మొదలైన అంశాలే ముఖ్య అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. తొలిరోజు శుక్రవారం ఐటీ, స్టార్టప్‌లపై దృష్టి సారించనున్నారు. రెండోరోజున ఐటీ ఆధారిత పరిశ్రమలు, బీపీవో కంపెనీలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ ఛాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్ వ్యవహరించనున్నాయి. వివిధ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కలిపి మొత్తం 12 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: 'బంగారు' బాటలో.. చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత -
AP: పెట్టుబడులపై ఫోకస్
సాక్షి, అమరావతి: కొత్తతరం ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్), జీ20 దేశాల సదస్సులు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, పెట్టుబడులను ఆకర్షించడంపై అధికార యంత్రాంగంతో గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 3, 4వతేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, మార్చి 28, 29 తేదీల్లో జీ 20 దేశాల సమావేశాలు విశాఖపట్నంలో జరగనున్నాయి. వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ (జీఐఎస్) సదస్సు సాగాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా సదస్సులో కార్యక్రమాలను రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవతరం ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదికగా నిలవాలని, దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ దేశాల్లో రోడ్ షోలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక పారిశ్రామిక వాడలు, నిర్వహణ తీరును పరిశీలించి అంతకంటే మెరుగ్గా అమలు చేసేలా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఆయా దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ తీరును పరిశీలించి రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు లక్షల కోట్ల ఒప్పందాలు.. వచ్చింది వేల కోట్లే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. గత సర్కారు హయాంలో 2014 – 19 మధ్య రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగితే వాటిలో 10 శాతం కూడా సాకారం కాలేదని, అనామకులకు సూట్లూబూట్లూ తొడిగి ఒప్పందాలు చేసుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అప్పట్లో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చినట్లు వివరించారు. ఇప్పుడు 2019 – 22 మధ్య ఏడాదికి సగటున రూ.15,693 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.1,81,821 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం వీటి పనులు వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ద్వారా 1,40,903 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. సుందర విశాఖ.. శాశ్వత సదుపాయాలు జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రహదారులు, ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డుల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. సుందరీకరణ పనులను కేవలం ఈ సమావేశాల కోసం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఇటు ఆతిథ్యం.. అటు అవకాశాలు విశాఖ వేదికగా మార్చి 28, 29వ తేదీల్లో జీ 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 250 మందికిపైగా విదేశీ ప్రతినిధులు, 100 మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వీటికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ 20 దేశాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున అతిథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అతిథులందరికీ చక్కటి ఆతిథ్యంతోపాటు రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా మంచి ఏర్పాట్లు చేయాలని, ఆయా చోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. జీ 20 దేశాల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ‘ఈనాడు’ ఏడుపు!
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధి కల్పించేలా ఒక కొత్త పరిశ్రమ వస్తుంటే ‘ఈనాడు’కు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజీ ఇంకా పెరిగిపోతోందోనని ఆందోళన చెందుతోంది. ఉన్నవి లేనివి అన్నీ కలిపి.. టన్నులకొద్దీ బురదజల్లుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఏదైనా ఇండస్ట్రీ రాకపోతే ఏడవడం మామూలే అనుకుంటే.. ఎంతో మందికి ఉపకరించే పరిశ్రమ మన రాష్ట్రంలో వెలుస్తోందంటే ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎవరి కోసం ఏడుస్తున్నట్లో ఇట్టే అర్థమవుతోంది. ఇండస్ట్రియల్ హబ్ పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా రావూరు, చేవూరు గ్రామాల్లోని 4,827.04 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేస్తోందని మంగళవారం ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. షిర్డి సాయి ఏ విధంగా చిన్న సంస్థ? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ)కు అర్హత సాధించిన కంపెనీ. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇలాంటి కంపెనీని పట్టుకుని ‘ఈనాడు’ విషం కక్కడం దుర్మార్గం. కేవలం కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన సంస్థ కావడమే పాపమైపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ఎంవీవీఎస్ మూర్తి ఆక్రమించినప్పుడు ఏనాడైనా ఈనాడు ఇలాంటి కథనం రాసిందా? ‘షిర్డిసాయికి 4,827 ఎకరాలు’ శీర్షికన ప్రచురించిన ఈనాడు కథనంలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : సీఎంకు సన్నిహితుడైన వ్యక్తికి చెందినది.. వాస్తవం : ఈ కంపెనీ కోసం ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చాలా ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుతం పరిశ్రమల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అలాంటివేమీ అవసరం లేకుండానే వెనకబడ్డ రామాయపట్నం లాంటి ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది. గతంలో కియా సంస్థకు ఇచ్చిన స్థాయిలో కూడా ఇండోసోల్‌కు రాయితీలు ఇవ్వలేదు. భూమి, కరెంట్, ఎస్జీఎస్టీ, మౌలిక సౌకర్యాల విషయంలోనూ కియా కంటే తక్కువ ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఈ స్థాయిలో ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుండటం. ఆరోపణ: హైదరాబాద్‌లో రిజిస్టరైన కంపెనీ వాస్తవం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు. ఉదాహరణకు కియా పరిశ్రమనే తీసుకుంటే ఆ సంస్థ మన రాష్ట్రానికి చెందిందా? కియా కోసం యూనిట్ రూ.3 చొప్పున 100 శాతం విద్యుత్‌ను 20 ఏళ్ల పాటు ఇస్తుంది. ఇండోసోల్‌కు మాత్రం 7 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.4.5 చొప్పున, ఆ తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.4.5 చొప్పున 40% విద్యుత్‌ను మాత్రమే కేటాయించారు. సొంత విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు (క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను) స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఇండోసాల్ తన సొంత ఖర్చుతో 7.2 గిగా వాట్స్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించింది. కియాకు ఎకరా రూ.6 లక్షలతో మాత్రమే సేకరించే అవకాశం ఇచ్చింది. పైగా భూమిని చదును చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఆరోపణ: అప్పనంగా భూములు కట్టబెట్టేస్తోంది.. వాస్తవం : ఈనాడు చెబుతున్నట్టుగా 4,827 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. పైగా అవి ప్రభుత్వ భూములు కావు. రామాయపట్నంలో ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డ్ ద్వారా భూ సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో విధానం ప్రకారం భూసేకరణ కయ్యే వ్యయాన్ని పూర్తిగా మార్కెట్ ధర ప్రకారం ఇండోసోల్ కంపెనీయే భరిస్తుంది. అంతే గానీ భూమి కొనుగోలు కోసం ఇండోసోల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వలేదు. ఆరోపణ: కలెక్టర్ లేఖ ఆధారంగా భూ సేకరణ వాస్తవం : దేశంలోనే అతి పెద్ద పీవీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ యూనిట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అర్హత సాధించింది. దాని ప్రకారం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాజెక్టు కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరుగుతోంది. ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన భాగాలపై ఆధార పడటాన్ని తగ్గించడం, గ్రామీణ విద్యుదీకరణ కోసం అవసరమైన విధానాలను కేంద్రం రూపొందించింది. ఇండ్రస్టియల్ కారిడార్లు, హబ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మేరకు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా, కేబినెట్ ఆమోదంతో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం చర్యలు చేపట్టింది. ఆరోపణ: ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగించలేదు.. వాస్తవం : రాష్ట్రంలోని ప్రముఖ విద్యుత్ ఉప కరణాల తయారీ కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇప్పటికే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2,500 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఇడిఎ) ద్వారా సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) బిడ్డింగ్‌లో రిలయన్స్, అదానీలతో పోటీ పడి ఎల్–1గా నిలిచి రూ.1875 కోట్ల రాయితీలను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల వ్యవధిలో దశల వారీగా ప్రత్యక్షంగా 11,500 మందికి, పరోక్షంగా దాదాపు 10,000 –11,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 11,500 మందికి ఉపాధి కల్పిస్తుండటంతో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జాగ్రత్తగా పరిశీలించాకే ప్రోత్సాహకాలను వర్తింప చేసింది. -
AP: 2022లో పారిశ్రామిక ప్రగతిలో కీలక ఘటనలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామికరంగ ప్రగతి 2022 సంవత్సరంలో ఊపందుకుంది. ముఖ్యంగా మే 22 నుంచి 26వ తేదీ వరకు సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. టాటా, బిర్లా, ఐటీసీ, నాల్కో, ఎన్టీపీసీ, మిథాని, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాయి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ఏడాది నాలుగుసార్లు సమావేశమై రూ.1,66,919.71 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇందులో రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ రూ.43,143 కోట్లతో సోలార్ ప్యానల్స్ తయారీ, కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్, రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ, రూ.560 కోట్లతో నెల్లూరులో క్రిభ్కో బయో ఇథనాల్, రాష్ట్రంలో వివిధ చోట్ల అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ వంటివి ఉన్నాయి. మే నెలలో సీఎం జగన్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన సందర్భంగా గ్రీన్ ఎనర్జీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం ప్రపంచదృష్టిని ఆకర్షించింది. అలాగే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేసిన క్లోర్ ఆల్కాలిక్ (కాస్టిక్ సోడా) తయారీ యూనిట్‌ను కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఏప్రిల్ 21న ప్రారంభించారు. జనవరి 12న గుంటూరులో ఐటీసీ వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్, నవంబర్ 11న ఐటీసీకి చెందిన స్పైసెస్ పార్కును సీఎం ప్రారంభించారు. జూన్ 23న తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్టెక్, డిక్సన్ వంటి కంపెనీలను సీఎం ప్రారంభించడం ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించారు. ఆగస్టు 16న జపాన్ టైర్ల దిగ్గజ సంస్థ యకహోమా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,200 కోట్లతో ఏర్పాటు చేసిన హాఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభరత వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. విషాద సంఘటన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దుబాయ్ పర్యటనలో రూ.5,100 కోట్ల విలువైన పెట్టుబడులు కుదుర్చుకు వచ్చిన కొద్దిరోజులకే ఫిబ్రవరి 21న హఠాన్మరణం పొందడం రాష్ట్ర పారిశ్రామికరంగాన్ని కుదిపేసింది. అనంతరం మంత్రివర్గ విస్తరణలో పరిశ్రమలశాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. -
పెట్టుబడుల్లో ఫస్ట్.. దేశంలోనే మొదటి స్థానం
సాక్షి, అమరావతి: ప్రచార ఆర్భాటాలు, దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏపీలో రూ.44,286 కోట్ల విలువైన పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా వాస్తవ రూపంలోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. వీటి ద్వారా మొత్తం 70,000 మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గత జనవరి నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.1,99,399 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా ఇందులో 20 శాతం పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2020 నుంచి 129 యూనిట్లలో ఉత్పత్తి రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్పత్తిని ప్రారంభించిన ప్రముఖ కంపెనీల్లో ఏటీజీ టైర్స్, నాట్కో ఫార్మా, గ్రీన్కో సోలార్, ఇసుజు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెంబ్‌కార్ప్, కోరమాండల్, ప్రీమియం ఎలక్ట్రిక్, ఎన్జీసీ ట్రాన్స్మిషన్, విష్ణు బేరియం తదిరాలున్నాయి. ఇక 2020 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో 129 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.64,476 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా మరో రూ.13,516 కోట్ల పెట్టుబడులు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 37 యూనిట్లు నిర్మాణ పనులను ప్రారంభించాయి. వీటి ద్వారా మరో రూ.13,516 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 143 కొత్త యూనిట్లు రాష్ట్రంలో నిర్మాణ పనులు ప్రారంభించగా వీటిద్వారా మొత్తం రూ.32,616 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీల్లో గ్రాసిమ్, సెంచురీ ప్లే, మునోత్ ఇండ్రస్టీస్, టీటీఈ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, బ్లూస్టార్, హావెల్స్ లాంటి సంస్థలున్నాయి. సింగిల్ విండోలో అనుమతులు.. ముఖ్యమంత్రి జగన్ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభం వరకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు మంజూరు చేయడం ద్వారా చేయూత అందిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కార్పొరేట్ దిగ్గజ సంస్థలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవను అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి మద్దతు అందిస్తుండటం వల్లే వరుసగా మూడో ఏడాదీ సర్వే ద్వారా ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో 10.04 లక్షల మందికి ఉపాధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మూడున్నరేళ్లల్లో 1,08,206 యూనిట్లు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 10,04,555 మందికి ఉపాధి లభించింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా గత సర్కారు బకాయి పెట్టిన రూ.962.05 కోట్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడమే కాకుండా ఏ ఏడాది రాయితీలను అదే సంవత్సరం చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను చెల్లించింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా వ్యాపారాలు నిలిచిపోయి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందని ఫ్యాప్సియా ప్రెసిడెంట్ మురళీకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2020–21లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.24.41 కోట్ల రాయితీలను అందచేసింది. మరో 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన! రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు జారీ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రెండు నెలల్లో రూ.64,555 కోట్ల విలువైన 20 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే విధంగా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.14,634 కోట్లతో అదానీకి చెందిన వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ నెలకొల్పే డేటా సెంటర్, ఐటీ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.43,143 కోట్లతో నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ నెలకొల్పే సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తిరుపతి జిల్లాలో 2.25 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్ ప్లాంట్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 20 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే 44,285 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే పెట్టుబడుల సదస్సు నాటికి శంకుస్థాపనలు పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఇన్ఫినిటీ వైజాగ్.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ సమ్మిట్
సాక్షి,అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’తో చెప్పారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడించారు. -
వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్రం మద్దతు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైజాగ్ టెక్ సమ్మిట్ 2023కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో జరిగే సమ్మిట్‌కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చినట్లు సమ్మిట్ నిర్వాహకులు పరల్స్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ప్రకటించారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో నిర్మలా సీతారామన్‌ను కలిసి సమ్మిట్ వివరాలను తెలియచేసినట్లు తెలిపారు. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్లోబల్ టెక్ సమ్మిట్ విజయవంతానికి సహకారం అందిస్తామని, సమ్మిట్ ద్వారా జీ–20 విజన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరినట్లు శ్రీనుబాబు తెలిపారు. జీ20 సదస్సులకు మద్దతుగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో గ్లోబల్ టెక్ సమ్మిట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మిట్ ద్వారా రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ!
సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ! ► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు. ► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. అదనపు పెట్టుబడులు కనిపించవా? ► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది? రిలయన్స్‌కు వివాదాస్పద భూములు ► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్‌టాప్ బ్యాక్స్‌ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్‌కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకువస్తున్న జీయో నెట్ వర్క్ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్ సెట్‌టాప్స్ బాక్స్‌ల తయారీని థర్డ్ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఫ్రాంక్లిన్ పరిస్థితి తెలియదా? ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ డెట్ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. ► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ? ► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? ► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? ► లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)రిపోర్ట్ 2022లో ఆంధ్రప్రదేశ్ అచీవర్‌గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్10 రీజియన్స్‌లో చిత్తూరు–నెల్లూరు రీజియన్ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. ► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది. ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి. ‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం. గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’ – కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
ఇంధన పెట్టుబడులకు స్వర్గధామం ఏపీ
సాక్షి, విశాఖపట్నం: దేశంలో పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) అశోక్‌కుమార్ చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోని బీఈఈ సహకారంతో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) విశాఖలో బుధవారం పెట్టుబడుల బజార్ పేరిట సదస్సు నిర్వహించింది. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సదస్సుని అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచిన పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గొప్ప విషయమన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో జాతీయస్థాయిలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ మొదటి అడుగు వేసిందని, వరుసగా ఇన్వెస్ట్మెంట్ బజార్స్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రశంసించారు. పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి పెట్టుబడుల సదస్సులకు విశేష స్పందన లభించటం బీఈఈకి ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏపీ ఆదర్శంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇన్వెస్ట్మెంట్ బజార్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంధన సామర్థ్య పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఈíసీఎం ఆధ్వర్యంలో ఆర్థికసంస్థల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికత అమలు చేసే పరిశ్రమలకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఈసీఎం చేసిన ప్రతిపాదన కేంద్ర ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.15 వేలకోట్ల విలువైన ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు విధానపరమైన ప్రమాణాలు రూపొందించడంలో ఏపీఎస్ఈíసీఎం ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన చెప్పారు. నిరంతర సరఫరాకు విద్యుత్ వ్యవస్థ బలోపేతం రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తరఫున ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక అద్భుత అవకాశమని చెప్పారు. ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల పూర్తిస్థాయి సహాయ, సహకారాలందిస్తుందన్నారు. ఇంధన సామర్థ్యం అభివృద్ధితో ఇంధన భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వం వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదకారిగా మారుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఏపీఈపీడీíసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, సూర్యప్రతాప్, పీఎఫ్సీ జనరల్ మేనేజర్ మదన్మోహన్, బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఏసీ.. మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా మేడిన్ ఆంధ్రా ఏసీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్ కండిషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలో తయారైందే ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌లో తయారైనవే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు మన రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీం) కింద మార్చినాటికి ఉత్పత్తి ప్రారంభించే విధంగా పనులను వేగంగా చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకిన్ తొలిదశలో ఏటా 10 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా రెండోదశలో మరో 15 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా విస్తరించనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లను పెట్టుబడి పెట్టనుంది. బ్లూస్టార్ ఏటా 12 లక్షల ఏసీలను తయారు చేసే విధంగా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే 10 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా. శ్రీసిటీలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్న ఏసీ తయారీ కంపెనీలు, వాటి పెట్టుబడులు (రూ.కోట్లలో) ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రాన్ని ఏసీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏసీ తయారీలో వినియోగించే ఉపకరణాలను తయారు చేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహిస్తోంది. శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఆరు ఏసీ తయారీ యూనిట్లకు ఉపకరణాలను సరఫరా చేసే ఐదు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అంతేగాకుండా ఇక్కడ ఏర్పాటవుతున్న యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిట్లు నిర్మాణ పనులు పూర్తిచేసుకునే సరికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టారు. -
68 ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
పారిశ్రామికవేత్తలే ప్రచారకర్తలు
సాక్షి, అమరావతి: సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. ఇక గత సర్కారు ప్రచార ఆర్భాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంవోయూల పేరుతో మభ్యపుచ్చింది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదు. వచ్చే ఏడాది మార్చిలో విశాఖ వేదికగా నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలే ప్రచారకర్తలుగా నిలవనున్నాయి. ఆయా యూనిట్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా పరిశ్రమలు నెలకొల్పిన దిగ్గజాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నూతన పెట్టుబడులను రప్పించేందుకు చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలు.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడో ఏడాది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం ఇందుకు తార్కాణం. ఇటీవల రాష్ట్రంలో వివిధ యూనిట్ల ప్రారంభం, శంకుస్థాపన సందర్భంగా ఆయా సంస్థలు ఏమన్నాయో చూద్దాం.. రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏపీ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌సోడా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – బలభద్రపురంలో క్లోర్ అల్కాలి (కాస్టిక్ సోడా) యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అర నిమిషంలోనే ఒప్పించారు.. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 30 సెకన్లు మాత్రమే మాట్లాను. ఎమర్జింగ్ టెక్నాలజీని ఏపీకి తేవడంలో సహకరించాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా మా అబ్బాయి బయోఇథనాల్ ప్లాంట్ స్థాపనకు వివిధ రాష్ట్రాలను పరిశీలిస్తున్న విషయం చెప్పా. ఎక్కడో ఎందుకు? మా రాష్ట్రంలో పెట్టండి అని సీఎం ఆహ్వానించారు. ఏపీలో బయో ఇథనాల్ పాలసీ లేదని ఆయన దృష్టికి తేవడంతో యూనిట్ ప్రారంభమయ్యే సరికి రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల్లోనే రాజమహేంద్రవరంలో యూనిట్‌కు శంకుస్థాపన చేశాం. ఇలా మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణంగా ఉంది. – అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సభలో సీపీ గుర్నానీ, సీఈవో, టెక్ మహీంద్రా పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ దేశ జీడీపీ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటమే కాకుండా అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. సామాజిక ఆర్థికాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవల గుంటూరులో వెల్కమ్ ఫైవ్‌స్టార్ హోటల్‌ను శరవేగంగా ప్రారంభించాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ పరిశీలిస్తుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఎటువంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. – యడ్లపాడులో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ ప్రారంభోత్సవ సదస్సులో సంస్థ సీఈవో సంజయ్ పూరి అత్యుత్తమ ఈఎంసీ కొప్పర్తి కేవలం తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుంది. ఇక్కడి యూనిట్ ద్వారా శామ్సంగ్, బాష్, షావోమి లాంటి పలు ప్రముఖ సంస్థలకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తాం. రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారుగా మారింది – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ రూ.6 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు.. తొలుత తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో యూనిట్ నెలకొల్పుతున్నాం. పెట్టుబడుల ప్రతిపాదనలు అందచేసిన రెండు నెలల్లోనే అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేశారు. ప్రభుత్వ సహకారాన్ని చూశాక రూ.6,000 కోట్ల పెట్టుబడులను రూ.26,000 కోట్లకు పెంచాలని నిర్ణయించుకున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే అతి పెద్ద బ్రాండింగ్. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండింగ్‌గా వినియోగించుకుంటాం. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి