Mee Seva centres
-
ఇక ఆన్లైన్లోనే.. ఆ సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు మాన్యువల్‌గా రెవెన్యూవర్గాలు జారీ చేస్తున్న 9 రకాల సర్టీఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విద్య, ఉద్యోగార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలకు తోడు రెవెన్యూ సంబంధిత రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారానే ఆన్లైన్లో ఇస్తున్నారు. అయితే, ఈ సర్టీఫికెట్లు ఏడాదిలోపు రెండోసారి తీసుకుంటే మాత్రం మాన్యువల్‌గా తహసీల్దార్ కార్యాలయాలే ఇస్తున్నాయి. ఇప్పుడు ఏడాదిలోపు తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్యాప్ సర్టీఫికెట్, పేరు మారి్పడి పత్రం, స్థానికత నిర్ధారణ, క్రీమీలేయర్–నాన్క్రీమీలేయర్, మార్కెట్‌వాల్యూ సర్టీఫైడ్కాపీ, ఖాస్రా, సెస్లా పహాణీలు, ఆర్వోఆర్–ఐబీ రికార్డులు ఇక నుంచి మీసేవకేంద్రాల ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారం, సర్టీఫికెట్ ఫార్మాట్లను తమకు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగా ముందుకెళ్లాలని సీసీఎల్ఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సర్టీఫికెట్ల కోసం మీసేవకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచే వాటిని జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. -
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్‌కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపు ఏళ్లు గడుస్తున్నా కదలని ఫైళ్లు
వికారాబాద్: జిల్లాలోని అనేక మంది అర్హులకు ఆహార భద్రత కరువైంది. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత ఒకేసారి కొత్త కార్డులు జారీచేసింది. ఈ సమయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో మిగిలిన వారంతా రేషన్‌తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా కార్డుల్లో కొత్త పేర్లను చేర్చే విషయంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఆహార భద్రతపథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు ఆరు వేలకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఆయా కుటుంబాల్లో పెళ్లిళ్లు, ప్రసవాలు జరిగి సభ్యులసంఖ్య పెరిగింది. మృతి చెందిన వారి పేర్లను కార్డుల్లోంచి తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా వచ్చిన వారి వివరాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. 35,000 పెండింగ్ ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాను ఆన్లైన్లో పెట్టింది. కానీ వీరికి కార్డులు జారీ చేయకుండా ఏడాదికి సరిపడే కూపన్లు అందజేసింది. ఆతర్వాత బయోమెట్రిక్ విధానంలో బియ్యం సరఫరా చేస్తోంది. కానీ కొత్తగా ఆయా కుటుంబాల్లోకి వచ్చిన వారిని చేర్చడంపై మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉన్నారు. వీరందరూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకోని వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటికీ మోక్షం కలిగితే జిల్లాకు మరో 210 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరగనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై రాష్ట్ర సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నష్టపోతున్నారు. 2,41,622 కార్డులు జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరలదుకాణాలు, 2,41,622 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 2,14,853 ఎఫ్ఎస్సీ, 26,730 అంత్యోద య, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో లబ్ధిదారులందరికీ సబ్సిడీపై చక్కర పంపిణీ చేయగా ప్రస్తుతం అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేశాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. – రాజేశ్వర్, డీఎస్ఓ -
‘లక్ష’ణంగా వసూళ్లు
కరీంనగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు ప్రకటించిన రూ.లక్ష సాయం పొందడానికి వృత్తిదారులు పడరానీపాట్లు పడుతున్నారు. ఒకవైపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తుండగా, మరోవైపు రెవెన్యూ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ దళారులు దోచుకుంటున్నారు. చేతి, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల్లోని 15 కులాలకు మొదటి దశలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆయా కులాలకు చెందిన నిరుద్యోగులు, యువకులు దరఖాస్తుల కోసం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 6నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,696 వచ్చాయి. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు తెలిపారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ కార్యాలయాల్లో జాప్యం నెలకొంటుంది. సర్వర్లు పనిచేయకపోవడంతో సర్టిఫికెట్ల జారీలో ఆలస్యమవుతోంది. అంతేకాకుండా కార్యాలయాల్లో తగినంత సిబ్బంది లేక పెద్దసంఖ్యలో దరఖాస్తులు పేరుకపోతున్నాయి. యువకులు, నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు, మీ సేవకేంద్రాల నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని సిబ్బందితో దళారులు సిండికేట్‌గా మారి సర్టిఫికెట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మీ సేవ సెంటర్లలో దోపిడీ రూ.లక్ష సాయం పొందడానికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకే అవకాశం ఉందనే ప్రచారంతో పలువురు యువకులు పెద్దసంఖ్యలో మీ సేవ కేంద్రాలకు తరలివస్తున్నారు. దరఖాస్తుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రావడంతో నాలుగైదు రోజుల నుంచి మీ సేవ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.45 తీసుకోవాల్సి ఉండగా రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రెండురోజుల్లోనే సర్టిఫికెట్లు తీసుకొస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.500 వరకు దండుకుంటున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాల్లో ఈ దోపిడీ దందా పెద్దమొత్తంలో సాగుతుందని తెలుస్తోంది. -
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్.. మీసేవ ఆపరేటర్ల హస్తం!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో మీసేవ ఆపరేటర్ల హస్తం కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నాతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు -
కొంత ఖర్చవుతుంది.. ముందుగా వెయ్యి ఇవ్వండి.. తరువాత!
సంతోష్‌నగర్‌కు చెందిన నాగరాజు ఇటీవల మీ సేవ కేంద్రం ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది తెలిసిన ఇద్దరు దళారులు నాగరాజును సంప్రదించి..‘వయసు సడలించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు స్క్రూట్నీని కఠినంగా ఉంటుంది. అర్హత సాధించడం కష్టం. మీసేవలో సమర్పించిన దరఖాస్తు కాపీ మాకిస్తే తహసీల్ ఆఫీస్‌లో పైరవీ చేసి ముందుగానే మార్గం సుగమం చేస్తాం. ఇందుకు కొంత ఖర్చవుతుంది. ముందుగా రూ.వెయ్యి ఇవ్వండి. మంజూరైనంక రెండు నెలల పింఛన్ ఇవ్వాలి’ అని మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నగరంలో దళారులు పింఛన్ అర్హులను బుట్టలో వేసుకుని దండుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆసరా కొత్త పింఛన్ల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కొందరు చోటా నేతలు, గల్లీ లీడర్లు, నిరుద్యోగులు దళారులుగా అవతారమెత్తి దరఖాస్తుదారుల అమాయకత్వం, అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. మీ–సేవ కేంద్రాల ద్వారా వృద్ధాప్య పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకొని గాలం వేస్తున్నారు. కొందరు దరఖాస్తుదారులను స్వయంగా కలుస్తుండగా, మరి కొందరు ఫోన్ల ద్వారా సంప్రదించి ‘అన్నీ మేమే చూసుకుంటాం’ అని భరోసా ఇస్తున్నారు. కొంత నగదు లంచంగా ఇవ్వాలని చెబుతున్నారు. కేవలం దరఖాస్తు మాత్రమే చేస్తే సరిపోదని, పోటీ చాలా ఉందని చెబుతున్నారు. దరఖాస్తుదారులు సైతం పింఛను మంజూరు కాదేమోనన్న భయంతో దళారుల మాటల్ని నమ్మి వారు అడిగినంత ముట్టచెబుతున్నారని తెలుస్తోంది. దండిగా దరఖాస్తులు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల వయసును 60 ఏళ్ల నుంచి సడలించడంతో మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దండిగా దరఖాస్తులు నమోదయ్యాయి. 57 ఏళ్లు దాటిన వారు పోటీపడి మరి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోని పండుటాకులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల నమోదు ఉచితం కావడంతో నిరుపేదలు (బీపీఎల్) తోపాటు మద్య, సంపన్న(ఏపీఎల్) వర్గాలు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు నమోదైనట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఆసరా పింఛన్లకు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించలేదు. తహాసీల్ ఆఫీసుల్లో దరఖాస్తు సమరి్పస్తే విచారణ జరిపి మంజూరు చేసేవారు. తాజాగా వయసు సడలించడంతో ఆన్లైన్ ద్వారా స్వీకరించగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. స్పష్టత ఏదీ? ఆసరా దరఖాస్తులపై స్పష్టత లేకుండా పోయింది. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ వివరాల నమోదుతోపాటు వాటి ప్రతులను సమర్పించాలన్నారు. కానీ ఎక్కడ సమర్పించాలో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. తహసీల్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ తీసుకోవడం లేదు. మీ సేవ కేంద్రాల్లోనూ జిరాక్స్ ప్రతులు తీసుకోవడం లేదు. ఈ అంశం కూడా దళారులకు కలిసి వస్తోంది. ఆ ప్రతులను దళారులు తీసుకొని దరఖాస్తుదారుల్లో ఆశలు నింపుతున్నారు. పింఛన్ల మంజూరుపై క్షేత్ర స్థాయి విచారణ కఠినంగా ఉంటుందని భయపెడుతూ దండుకుంటున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. -
‘వరద సాయం: మీసేవా కేంద్రాలకు వెళ్లద్దు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద సాయం రూ. 10 వేల కోసం బాధితులు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు మీసేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ మీసేవా కేంద్రాల నిర్వాహకులు తెలియాజేస్తున్నారు. వరద సాయం బాధితులు భారీగా రావడంతో నిర్వాహకులు మీసేవా కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో పెద్ద సంఖ్యలో మీసేవా కేంద్రాల వద్ద ఆందోళన నేలకొంది. మీసేవా కేంద్రాల వద్ద బాధితుల క్యూ పెరగడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ స్పందించారు. వరద సాయంపై ఆయన కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. వరద సాయం కోసం బాధితుల వివరాలు సేకరిస్తారని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరించిన తర్వాత వరద బాధితుల అకౌంట్లో డబ్బు జమఅవుతాయిని ఆయన వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరద సాయం అందజేస్తామన్న సంగతి తెలిసిందే. -
మీ–సేవ కేంద్రాలు షురూ
సాక్షి, హైదరాబాద్: మీ–సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. లాక్డౌన్ కారణంగా గత నెలన్నర రోజులుగా మూతపడ్డ ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైనందున మీ–సేవ కేంద్రాలకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆ శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం అంగీకరించింది. కంటెన్మైంట్ జోన్ల పరిధిలో మాత్రం ఆంక్షలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని, కనీసం ఒక ఆధార్ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు ఆదేశించారు. సిబ్బంది కచ్చితంగా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతి నమోదుకు ముందు బయోమెట్రిక్‌ను శానిటైజర్‌తో క్లీన్ చేయాలని సూచించారు. -
ఈ రబీ నుంచే ఈ-కర్షక్
ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృత్తి విపత్తుల వలనో మరేఇతర కారణంగానో చేతికందకుండా పోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. దురదృష్టవశాత్తు ప్రతి యేడాదీ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. ఒకసారి అనావృష్టి, మరోసారి అతివృష్టితో పంట నష్టం జరిగి విలవిలలాడుతున్నారు. అయితే వారికి సాంత్వన నిచ్చేలా ప్రభుత్వం బీమా పథకాలు అమలు చేస్తోంది. అయితే గతంలోవలే బీమా నమోదుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కేవలం యాప్ ద్వారా ఇంటివద్దే కూర్చుని నమోదయ్యే సౌలభ్యాన్ని ప్రభుత్వం కలి్పంచింది. సాక్షి, ముప్పాళ్ల/సత్తెనపల్లి/కారంపూడి: రైతులు రానున్న రోజుల్లో మీసేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది వద్ద ఈ–కర్షక్ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు, పంటల బీమా వర్తించినట్లే. ఆ మేర వ్యవసాయశాఖ ఈ రబీ నుంచే ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల బీమాపై సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది రబీ వరకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద ఎంపిక చేసిన ఏజెన్సీకి రైతులే బీమా ప్రీమియం చెల్లించేవారు. ఆ తర్వాత ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. గడిచిన ఖరీఫ్‌కు కూడా ప్రభుత్వమే ప్రీమియంను రైతులు బ్యాంకులు, మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది నవంబరులో రబీ పంటల బీమాకు షెడ్యూల్ విడుదల చేసినా...సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇకపై ఈ–కర్షక్ యాప్‌లో పంటలు నమోదు చేసుకున్న వారికి బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రైతులకు వెసులుబాటు కలగనుంది. ఇకపై ఇదే కీలకం... ఇకపై ఏటా ఖరీఫ్, రబీ సీజన్లో ఈ–కర్షక్ యాప్ ద్వారా రైతులు వేసిన పంటలను నమో దు చేస్తారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసే రాయితీ పథకాలు మొత్తం దీని ఆధారంగానే అందజేస్తారు. రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి మొబైల్ అప్లికేషన్ నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేడీఏ కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు. అంతర్పంటలు, పండ్లతోటలు, కూరగాయల సాగు, మొదటి, రెండు, మూడు పంటలు దేనికి దానికి యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు ఆప్షన్లు ఇచ్చారు. నమోదు ఇలా.... గ్రామ సచివాలయంలో ఉన్న వీఏఏ/హెచ్ఏ/ఎస్ఏఏ,వీఆర్ఓల సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలుకు వివరాలను మొబైల్ అíప్లికేషన్ నందు నమోదు చేయాలి. సీజన్‌వారీగా ఖరీఫ్, రబీ మరియు వేసవి పంట కాలంలో విడివిడిగా నమోదు చేయాలి. గ్రామ సచివాలయ స్థాయి నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయాధికారి పర్యవేక్షించి నమోదయిన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అ«దీకృతం చేయవలసి ఉంటుంది. సమాచారాన్ని జేడీఏ కార్యాలయంలో కేటాయించిన అధికారి పర్యవేక్షణ అనంతరం జిల్లా జేడీఏ కార్యాలయంలో నియమించిన అధికారి కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందిస్తూ ఉంటారు. ప్రయోజనం ఇలా... ఇకపై బ్యాంకు ద్వారా రుణం పొందేవారు..ఆయా బ్యాంకుల్లో బీమా కింద రిజి్రస్టేషన్ చేయించుకోనవసరం లేదు. రుణం పొందని వారు కామన్‌సరీ్వసు సెంటర్లో నమోదు చేసుకోనవసరం లేదు. ఏ బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబరు 1, 2019 తర్వాత బ్యాంకులు పంట రుణం నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఉంటే, దానిని తిరిగి రైతులకు చెల్లిస్తారు. బ్యాంకులు రైతుల వద్ద వసూలు చేసిన ప్రీమియం సొమ్మును కంపెనీకి జమ చేసి ఉంటే తిరిగి చెల్లిస్తారు. అర్హత కలిగిన అన్ని క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సాగుదారుని ఆధార్ అనుసంధానం బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. నోడల్ ఏజన్సీగా వ్యవసాయశాఖ నూతన విధానం అమలుకు వ్యవసాయశాఖను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. పంటల బీమా పథకంలో చేరడానికి ముందుగా ఆధార్ కలిగిన సాగుదారుడి వివరాలు ఇ–కర్షక్ అనే ఆండ్రాయిడ్ యాప్‌లో నమోదు చేస్తారు. అందుకోసం నిరీ్ణత గడువు విధించారు. రబీలో శనగపంటకు జనవరి 31, మిగిలిన అన్నిపంటలకు ఫిభ్రవరి 15 గడువుగా పేర్కొన్నారు. సొంత రైతు, కౌలు రైతు అనే వివరాలు ఇ–కర్షక్‌యాప్ ద్వారా గుర్తిస్తారు. -
ఆధార్.. బేజార్!
ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు, స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టులు.. ఇలా సేవలకు ఆధార్‌కార్డే ఆధారంగా మారింది. జిల్లాలో గతంలో చేసిన ప్రజాసాధికార సర్వేలో ఆధార్ అప్డేట్ చేయకపోవడం వల్ల సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్‌కార్డు పొందాలన్నా, మార్చుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ప్రజలు తమ కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి వారం రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆధార్ అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండితిప్పలు మాని బారులు తీరుతున్నారు. ఈ సమస్య జిల్లాలో ప్రస్తుతం అధికంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సాక్షి, చిత్తూరు : ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. నవరత్నాల నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చారు. ఆ పథకాలు దక్కాలంటే ప్రజాసాధికార సర్వే చేయించుకోవాల్సిందే. గత సర్కారు చేసిన ప్రజాసాధికార సర్వేలో జరిగిన లోపాల వల్ల ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన బృందం నిర్లక్ష్యంగా ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల చాలామంది పేర్లు అప్డేట్ కాలేదు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ముఖ్యంగా రేషన్‌కార్డు ఉండి తీరాల్సిందే. ఆ రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హలవుతారు. దీంతో జిల్లాలోని ప్రజలు తమ పేర్లను అనుసంధానం చేసుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఫెయిల్ ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులకెళ్లి సేవలు పొందవచ్చు. అయి తే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ప్రజలకు ఆధార్ అనుసంధాన సేవలు అందించకపోవడంతో ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నిత్యం ఆధార్ సేవలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. వారు పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. బ్యాంకు, పోస్టాఫీసు, మీ–సేవ, ఆధార్ కేంద్రాల ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలు చేయాల్సి ఉన్నా, అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలు నిల్ ఆధార్ అనుసంధానం కోసం జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు, రేషన్ షాపులకు ప్రజలు వెళుతున్నారు. అయితే అక్కడ ఆధార్ అనుసంధానానికి తగిన పరికరాలు లేకపోవడంతో ప్రజలను మీ–సేవ కేంద్రాలకు వెళ్లండని పంపేస్తున్నారు. సర్వర్ స్లో, చిన్నపిల్లలకు, వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యకు ప్రత్యామ్నాయ సేవలు అందించా లంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు తప్పనిసరి. జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. రేషన్‌షాపుల్లో ఐరిష్ యంత్రాలున్నా అవి పనిచేయడం లేదు. అవగాహన లోపంతో అవస్థలు ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే ప్రభుత్వ, మీ–సేవ కేంద్రాలే కాదు.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో తిరుపతి నార్త్ చీఫ్ పోస్ట్‌మాస్టర్, ఎస్వీ యూనివర్శిటీ వద్ద ఉన్న చీఫ్ పోస్టుమాస్టర్, తిరుపతి హెడ్ పోస్టాఫీసు, తిరుపతిలోని ఎన్సీపీ కాలనీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, ఎస్వీ యూనివర్శిటీ రోడ్డులో డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బైరాగ పట్టెడలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్డీ, బాలాజీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు, శ్రీదేవి కాంప్లెక్స్ వద్దనున్న ఆంధ్రాబ్యాంకు, ఖాదీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు తదితర చోట్ల ఆధార్ అనుసంధాన సేవలు పొందవచ్చు. -
ఇక ‘మీ సేవలు’ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో అడ్డగోలుగా కొత్త కేంద్రాలకు అనుమతులివ్వడాన్ని తప్పుబట్టిన సర్కారు.. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్లను రద్దుచేయాలని ఆదేశించింది. ఇకపై ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటులో నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే కొత్త నిబంధనలు వెలువరించనున్నట్లు వెల్లడించింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ–సేవల వినియోగంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ‘మీ సేవ’కేంద్రాల కొనసాగింపును కూడా సమీక్షించాల్సిన పరిస్థితి రావచ్చని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి ఉంచుకొని కొత్త సెంటర్ల ఏర్పాటుపై అచితూచి అడుగేయాలని సూచించింది. గతేడాది భద్రాద్రి–కొత్తగూడెం.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ‘మీ సేవ’కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇకపై అలా జరగడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రోజుకు లక్షన్నర సేవలు జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఏం కావాలన్నా ‘మీ సేవ’గడప తొక్కాల్సిందే. ఇలా దాదాపు 500 ఎలక్ట్రానిక్ సేవలందిస్తున్న మీ–సేవ కేంద్రాల్లో ప్రతిరోజు సగటున లక్షన్నర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో మీ–సేవ కేంద్రాలు ప్రారంభించిన గత ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు 12.50 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,500 పైచిలుకు కేంద్రాలు పనిచేస్తుండగా.. ఇందులో 85% సెంటర్లలో నెలవారీ ఆదాయం రూ.10వేల లోపే ఉంటుంది. ఈ పరిణామం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ కూడా కష్టంగా మారడానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలు ఆన్‌సేవలు విస్తరించడమే. పోలీస్, ట్రాఫిక్, ఇతర ప్రభుత్వ విభాగాలు తమ సేవలను ఈ సేవలతోపాటు సొంతంగా ఏర్పాటు చేస్తున్న పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి. తద్వారా మీ–సేవ కేంద్రాల్లో లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఇప్పటికే లాభదాయంగాని సెంటర్లను నెట్టుకొస్తున్న నిర్వాహకులకు కొత్తగా ఏర్పాటు చేసే వాటితో మరింత నష్టం జరగనుంది. మేడ్చల్‌లో రెట్టింపు కేంద్రాలు గతేడాది భద్రాద్రి జిల్లాలో 5వేల జనాభా, దూరాన్ని బట్టి కొత్తగా 53 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ఆ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్వాహకుల గిట్టుబాటును పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా కొత్తవాటికి అనుమతి ఇవ్వడం సరికాదని అన్ని జిల్లాల యంత్రాంగాలను ప్రభుత్వం హెచ్చరించినా.. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏకంగా 219 కొత్త కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సర్కారు సీరియస్ అయింది. దూరాన్ని కూడా పట్టించుకోకుండా 5వేల జనాభా ఆధారంగా గల్లీకో కేంద్రం ఉండేలా నోటిఫికేషన్లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే జిల్లాలో 297 కేంద్రాలుండగా.. తాజాగా దాదాపుగా అదే స్థాయిలో కొత్త కేంద్రాలకు పచ్చజెండా ఊపడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఇలా అడ్డగోలు వ్యవహారాలకు తావివ్వకుండా ఇకపై నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ సేవల విస్తృతితో మీ–సేవల్లో తరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రస్తుతం ఉన్నవాటినే కుదించే పరిస్థితి రావచ్చు. ఈ ధోరణిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే కొత్త మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్లకు రాసిన లేఖలో జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. -
‘మీ సేవ’లో బయోమెట్రిక్ విధానం
సాక్షి, ఖమ్మం : వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకనుగుణంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలను పొందిన వారిలో ఇతరులు నిర్వహించడం, అధికంగా రుసుములు వసూలు చేయడం, పని వేళల్లో తేడాలు..ఇలా రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటికి కళ్లెం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కొన్నిచోట్ల మీసేవ కేంద్రాలను పొందిన వారు ఇతరులకు వాటి నిర్వహణను అప్పగించారు. తమది కాదన్నట్లుగా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలూ వెలుగు చూశాయి. ఇకపై ఇటువంటి వారికి కళ్లెం పడనున్నది. సరికొత్తగా బయోమెట్రిక్ నూతన విధానాన్ని అమలు చేయబోతున్నారు. మీసేవ కేంద్రం తెరవగానే నిర్వాహకుడు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. దీంతో వేరే వారు కేంద్రాలను నిర్వహించేందుకు వీలు పడదు. గతంలో ఇతరుల పేరిట నిర్వహించే దుకాణాలు ఇక మూసివేయాల్సిందే. జిల్లాలో సుమారు 30వరకు బినామీల పేర్ల మీద నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 209 మీసేవ కేంద్రాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మీ సేవ కేంద్రం యజమానితో పాటు ఒక ఆపరేటర్ బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ సేవలు అందించేలా ప్రోగ్రాం పూర్తయింది. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే మీ సేవ నిర్వాహకుడు రిజిస్టర్ చేసుకున్న సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తేనే ఆన్లైన్ సేవలు కొనసాగనున్నాయి. నూతన విధానంతో ఆపరేటర్లు పొరపాటు చేశారనే కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. తద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందడంతో పాటు బినామీలకు చెక్ పడనున్నది. పారదర్శకంగా సేవలు.. రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా సేవలను అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల మెరుగైన సేవలను అందించనున్నాం. ఇప్పటికే అన్ని మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. – దుర్గాప్రసాద్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ -
అక్రమార్జనకు ఆధార్
సాక్షి , కడప : రూ.5 వేలు ఇస్తే ఆధార్ కార్డులో వయస్సు మార్చేస్తామంటూ కొన్ని మీసేవ కేంద్రాలు అక్రమ వ్యాపారానికి తెరలేపాయి. వృద్ధా్దప్య పెన్షన్ల ఆశ చూపి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొందరు అత్యాశకు పోయి వీరి వలలో చిక్కుకుని అడిగింది ముట్టజెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ మీసేవ కేంద్రాలు ఆధార్‌లో వయస్సు మార్పిడి వ్యవహారానికి తెరలేపాయి. తక్కువ వయసును ఎక్కువగా చూపించి జన్మభూమి కమిటీలు పెన్షన్లు మంజూరు చేయించాయి. ప్రతిఫలంగా భారీ మొత్తం లబ్ధి పొందాయి. ఇందువల్ల అర్హత లేని వారికి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరయ్యాయి. అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తాజాగా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్‌లో వయసు మార్పిడి చేస్తూ అక్రమార్జనకు దిగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. బి.మఠం, గోపవరం, బద్వేలు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, కడపతోపాటు దాదాపు ఎక్కువ మండలాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎగబడుతున్న వైనం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ మొత్తాన్ని పెంచింది. పెన్షన్‌కు అర్హత వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిం చింది. పెద్ద మొత్తంలో నెలనెల కచ్చితంగా పెన్షన్ వస్తుండడంతో కొందరు మీసేవ నిర్వాహకులు గ్రామాల్లో జనా నికి పెన్షన్ వల విసురుతున్నారు. రెండు నెలల పెన్షన్ తమకు ఇస్తే జీవితకాలం పెన్షన్ పొందే అవకాశ మంటూ ఆఫర్లు చూపుతున్నారు. అక్రమమని తెలిసినా కొందరు ఆధార్‌లో వయస్సు మార్పుకు ఎగబడుతున్నారు. ఆధార్‌కార్డును అధికారులు ప్రామాణికంగా తీసుకోవడంతో కొన్ని మీసేవ కేంద్రాలవారు దీనిని అవకాశంగా భావిస్తున్నారు. దీంతో వయసు మార్పిడీ వ్యవహారం సాగిస్తున్నారు. కొందరు రూ.4 వేల నుంచి రూ. 5 వేలు చెల్లించి ఆధార్‌లో వయస్సు మార్పించుకొంటున్నారు. అర్బన్ పరిధిలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటిలలో ప్రభుత్వ భవనాలలో వేతన ప్రాతిపదికన 11 మీ సేవలు నడుస్తున్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగులకు కార్వే కంపెనీ జీతాలు చెల్లిస్తోంది. ఇవి కాకుండా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సెలెక్షన్స్ నిర్వహించి పలువురు నిరుద్యోగులకు ఇచ్చినవి 44 ఉన్నాయి.ఇవి అర్బన్ కేంద్రాల్లో కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఏపీ ఆన్లైన్ ఆధ్వర్యంలో 318 మీ సేవా కేంద్రాలున్నాయి. ఏపీ ఆన్లైన్ పరిధిలో కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్న మీ సేవలు మరో 700 వరకు ఉన్నాయి. మీసేవల్లో అక్రమాలు: కమీషన్ ఆధారంగా పనిచేస్తున్న వెయ్యికి పైగా మీ సేవల్లో ఆధార్‌కార్డు వయస్సు మార్పిడీ వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన విభాగాల్లోని కొన్ని చోట్ల కూడా ఈ అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు 3,01,691 ఉన్నాయి. 1, 35,788 మంది వృద్దాప్య పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు పొందుతున్నవారిలో 2,247 మంది ఒంటరి మహిళలు , అభయ హస్తం కింద 4,054 మంది , సీకేడీయూలో 343మంది, 1,645 మంది డప్పు కళాకారులు ,37,164 మంది దివ్యాంగులు , 492 మంది మత్స్యకారులు, 277 మంది కల్లుగీత కార్మికులు, 844 చర్మకళాకారులు, 12,511 మంది చేనేతలు..1,06,180 మంది వితంతువులు ఉన్నారు. కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా, మరికొంతమంది దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుండగా, అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేయనుంది. ఈ వ్యవస్థలు ఏర్పడగానే అర్హులకు పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిని అవకాశంగా తీసుకుని మీసేవలు డబ్బులు దండు కొనేందుకు జనాలకు వల వేస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి మీసేవ కేంద్రాలలో ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇప్పటికే మీ సేవ బాధ్యతలు చూస్తున్న పలువురితో సమావేశమైనట్లు సమాచారం.మీ సేవలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. -
‘మీ–సేవ’లో ఏ పొరపాటు జరిగినా అతడే బాధ్యుడు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యకలాపాల సేవలకు కేంద్ర బిందువు మీ–సేవా కేంద్రాలే. విద్యుత్ బిల్లు చెల్పింపు నుంచి పాస్‌పోర్టు నమోదు దాకా.. రెవెన్యూ సేవలను ఇక్కడి నుంచి పొందాల్సిందే. అయితే, ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఏర్పాటైన ఈ కేంద్రాలు చాలావరకు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ సేవలకు ఇష్టానుసారం ఫీజులు, సర్వీస్ చార్జీల వసూలు చేస్తున్నారు. ఇకపై ఇలాంటి దందాలకు, వసూళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టే ఏర్పాట్లు చేసింది. కేంద్రాల నిర్వహణలో ఏ చిన్నపాటి తప్పిదం జరిగినా దానికి ఆ కేంద్రం యాజమానే (లైసెన్స్‌దారు) బాధ్యత వహించాలి. ఇందుకోసం మీ–సేవా కేంద్రాల నిర్వాహణలో ‘బయోమెట్రిక్’ విధానం ప్రవేశపెట్టారు. కేంద్రం యాజమాని బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే మీ–సేవా సర్వీసులు అందించేందుకు వీలవుతుంది. దీంతో హైదరాబాద్ మహా నగరంలో సగానికి పైగా బినామీల నిర్వాహణలో కొనసాగుతున్న కేంద్రాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలకు సంబంధించి వినియోగదారుల వద్ద ఇష్టానుసారం చేస్తున్న వసూళ్లకు కూడా అడ్డుకట్ట పడనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సగానికి పైగా మీ–సేవా కేంద్రాలు బినామీల నిర్వాహణలో సాగుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా 447 ఆన్లైన్ కేంద్రాలు ఉండగా, అందులో టీఎస్ ఆన్లైన్ సర్వీసులు 198, ప్రభుత్వ ఈ–సేవా సర్వీసులు 26, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) కేంద్రాలు 220 ఉన్నాయి. తాజాగా మరో 70కి పైగా కొత్త కేంద్రాలు మంజూరు చేయనున్నారు. మొత్తంమీద ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల్లో సగానికి పైగా లైసెన్స్ పొందినవారి చేతుల్లో లేనట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్ విధానంతో కేంద్రం యాజమాని తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో సదరు బినామీ నిర్వాహకులు చిక్కుల్లో పడినట్లే. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు మీ–సేవా కేంద్రాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేశారు. మీ–సేవా కేంద్రం యాజమానితో పాటు ఒక ఆపరేటర్ మాత్రమే బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ సేవలు అదించేలా ప్రత్యేక ప్రోగ్రామింగ్ రూపొందించారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆన్లైన్ సేవలు ముందుకు వెళ్తాయి. కేంద్రం నిర్వాహకుడు(యాజమాని) బయోమెట్రిక్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మీ–సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. మీ–సేవా ద్వారానే అన్ని సేవలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆన్లైన్ సేవలన్నింటినీ మీ–సేవా కేంద్రాల ద్వారానే కొనసాగుతున్నాయి. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ప్రజాపంపిణీ, రిజిస్ట్రేషన్, రోడ్డు రవాణ, కార్మికశాఖ, విద్యుత్, వైద్య, విద్య, సంక్షేమ, పోలీసు, వాణిజ్య పన్ను తదితర శాఖల సేవలు మీ–సేవా ద్వారానే అందుతున్నాయి. దీంతో మీ–సేవా కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కుప్పలు తెప్పలుగా గల్లీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి కొందరు ఉపాధి కోసమని మీ–సేవా కేంద్రాలను మంజూరు చేయించుకొని ఇతరులకు విక్రయించడం, లీజు, అద్దె, కమీషన్ పద్ధతిపై ఇతరులకు అప్పగించడం పరిపాటిగా మారింది. దీంతో కేంద్రాల నిర్వాహకులు సేవలందించేందుకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు మీ–సేవా కేంద్రాల ముసుగులో అక్రమ దందా కూడా సాగుతున్న ఉదాంతాలు అనేకం వెలుగు చూశాయి. కేంద్రాల అక్రమ వసూళ్లు అధికారుల దృష్టికి వెళ్తే ఆపరేటర్లు తప్పిదం చేశారని యాజమానులు కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. తాజగా వచ్చిన బయోమెట్రిక్ విధానంతో బినామీలు కేంద్రాలు నిర్వహించేందుకు వీలుండదు. ఆపరేటర్ వెసులుబాటునివినియోగించుకుంటే వారు చేసే అక్రమాలకు, అధిక వసూళ్లకు సదరు యాజమానే బాధ్యత వహించాలి. పారదర్శకత కోసమే.. మీ–సేవా కేంద్రాల నిర్వాహణతో పాటు పార్శదర్శకంగా సేవలందించేందుకు బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చాం. దీంతో బినామీల నిర్వహణకు వీలుండదు. ప్రజలకు అందించే సేవలకు అధిక చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. చిన్నపాటి తప్పిదానికైనా కేంద్రం యాజమానే బాధ్యత వహించాలి. – రజిత, ఈ–డిస్ట్రిక్ మేనేజర్, హైదరాబాద్ -
మీసేవ..దోపిడీకి తోవ
అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కృషిచేస్తుంటే కొన్ని సంస్థలు, కొందరు అధికారుల తీరు ఆ లక్ష్యాలను నీరు గారుస్తోంది. రైతుల భూమితో పాటు పంటల వివరాలను ప్రధానమంత్రి ఫసల్‌బీమాకు అప్లోడ్ చేయడానికి మీ సేవ కేంద్రాలు ఒక్కో రైతునుంచి రూ. 150 నుంచి రూ. 200 తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి.ఇది పేద ,మధ్య తరగతి రైతులకు భారంగా మారడమే కాక సీఎం జగన్ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. సాక్షి ప్రతినిధి కడప: ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రైతుల పంటలబీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇక తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చెల్లించడంతోపాటు తమ పంటల వివరాలను మీసేవల ద్వారా బీమా కంపెనీకి అప్లోడ్ చేయించుకొనే బాధ్యతను రైతులకు అప్పగించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మీసేవ కేంద్రాలు రైతులవద్ద రూ.150 నుంచి 200 వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి. బీమా ప్రీమియం రైతు వాటా కేవలం రూపాయి మాత్రమే కాగా మీసేవా కేంద్రాలు మాత్రం వన్–బీ కోసం రూ. 50 నుంచి 60 రూపాయలు, రైతు భూ వివరాలను ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పోర్టల్‌కు అప్లోడ్ చేసినందుకు రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. ఇది పేద, మధ్య తరగతి రైతులకు మరింత భారంగా మారింది. మీసేవల దోపిడీ పుణ్యమా అని వైఎస్ జగన్ప్రభుత్వంతో పాటు తాముకూడా బీమా ప్రీమియం చెల్లించినట్లు అవుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 51 మండలాల పరిధిలో లక్షలాది మంది రైతులు ఈ సీజన్ కు తాము సాగుచేస్తున్న పత్తి, మిరప,పసుపు, చెరకు వరి,కంది,జొన్న,సజ్జ,ప్రొద్దుతిరుగుడు తదితర పంటలకు సంబంధించి బీమాకోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ పంటలకు జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని గడువు విధించారు. బీమా ప్రీమియం మొత్తం రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతులు తమ భూమి, సాగుచేసిన పంటల వివరాలు మీసేవల ద్వారా ప్రధానమంత్రి ఫసల్‌బీమాకు అప్లోడ్ చేయించాలి. జగన్ సర్కార్ ప్రోత్సాహంతో పంటలు సాగుచేసిన రైతులందరూ ఈ ఏడాది బీమా చేసేందుకు సిద్ధమయ్యారు. రైతుల అవసరాలే అవకాశంగా... రైతుల అవసరాలను అవకాశంగా తీసుకున్న మీ సేవ కేంద్రాలు దోపిడీకి తెరలేపాయి. వాస్తవానికి వన్–బీ లేదా అడంగల్ కు రూ.25 రూపాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.50 నుంచి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదికూడా వన్–బీ స్టాంపు పేపర్(క్వాలిటీ) కాకుండా ఏ ఫోర్ సైజ్ వైట్ నార్మల్ పేపర్‌పై ప్రింట్ తీసి ఇస్తున్నారు. వాస్తవానికి ఒక్క వన్–బీ, అడంగళ్ల లోనే కాదు అన్నిరకాల సర్టిఫికెట్లకు మీ సేవా కేంద్రాల వారు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు ఆధార్‌కార్డు సవరణకు రూ. 50 తీసుకోవాల్సి ఉండగా రూ. 200 తీసుకుంటున్నారు. కొత్త ఆధార్ కార్డు ఎన్రోల్ మెంట్ ప్రీగా చేయాలి కానీ రూ. 200 తీసుకుంటున్నారు. బర్త్ సర్టిఫికెట్‌కు రూ.35 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.60 వసూలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌కు రూ.35 కు బదులు రూ. 100 తీసుకుంటున్నారు. ప్రతి సర్టిఫికెట్‌పైనా రూ.30 కి తక్కువ లేకుండా అదనంగా తీసుకుంటుండగా సీజనల్‌గా డిమాండ్‌ను బట్టి రూ. 100 నుంచి రూ. 200కు తక్కువ లేకుండా వసూలు చేస్తున్నారు. కొందరు రెవెన్యూ అధికారులకూ వాటాలు మీసేవ కేంద్రాలు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పైగా వారి దోపిడీకి సహకరిస్తున్నారు. చాలామంది రెవెన్యూ అధికారులకు వాటాలు ముడుతుండడంవల్లే మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం ప్రీమియం మొత్తాన్ని రైతుల తరపున చెల్లించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రభుత్వమే రైతుల పక్షాన అన్నిరకాల పంటలకు సంబంధించిన బీమా ప్రీమియం చెల్లిస్తుందని చెప్పిన వైఎస్ జగన్ సీఎం కాగానే మాట నిలబెట్టుకున్నారు. తొలి బడ్జెట్ లోనే ఇందుకోసం రూ.1163 కోట్లు కేటాయించారు.ప్రధానమంత్రి ఫసలబీమా యోజన కింద వరి పంటకు ఒక్క ఎకరాకు రూ.440 రూపాయలు, కందికి రూ. 240, జొన్నకు రూ. 200,సజ్జకు రూ.150, ప్రొద్దుతిరుగుడుకు రూ. 240, పత్తికి రూ. 1200, మిరపకు రూ. 3900, పసుపుపంటకు రూ. 4 వేలు, చెరకుకు ’రూ. 3,150 చొప్పున మొత్తం ప్రీమియంను వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించనుంది. దాదాపు 2లక్షల హెక్టార్లలో రైతులు బీమా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.ఈ లెక్కన మీసేవా కేంద్రాలు వసూళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగనుంది. పట్టించుకోని ఉన్నతాధికారులు: జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల దోపిడీ సాగుతోంది.ఇందుకు కొందరు స్థానిక అధికారుల మద్దతే కారణమనే ఆరోపనలున్నాయి. కొందరు అధికారులకు మీసేవా కేంద్రాలనుంచి ప్రతి నెలా మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి మీసేవా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటే పేద,మధ్య తరగతి ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుంది. చర్యలు తీసుకోవాలి మీసేవలో ఎటువంటి సర్టిఫికెట్ పొందాలన్నా నిర్ణయించిన దానికంటే అదనంగా వసూలు చేస్తున్నారు. బీమా దరఖాస్తుకు రూ.150 తీసుకుంటున్నారు. కరువు నేపథ్యంలో రైతుకు ఇది భారమే. గంటల తరబడి వేచి ఉంటేనే బీమా దరఖాస్తు పూర్తవుతుంది. కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా ఉండటం లేదు. అదనపు వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాలి. – రామనారాయణరెడ్డి, మిద్దెల, కాశినాయన మండలం దోపిడీ చేస్తున్నారు మీసేవ నిర్వాహకులు దోపిడి చేస్తున్నారు. ప్రస్తుతం బీమా చేసుకోవాలంటే ప్రభుత్వం చేయూతనిస్తున్నా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు అదనంగా రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించినా ప్రయోజనం లేదు. ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయించిన రుసుం తీసుకునేలా చర్యలు చేపట్టాలి. – నాగేశ్వరరెడ్డి, బసనపల్లె, కాశినాయన మండలం అడ్డూఅదుపు లేదు మీసేవ కేంద్రాల్లో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు మీసేవ ద్వారా పొందాల్సి ఉండటంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను తీసుకోవడం లేదు. దోపిడీకి పాల్పడుతున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. – పెంచల్‌రెడ్డి, గోపవరం -
ధ్రువపత్రాలు పొందండిలా..
నూతన విద్యా సంవత్సరం ఈనెలలో ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి పది, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆపై చదువులకు ప్రవేశాలు పొందే వారికి వి«ధిగా కళాశాలల్లో కుల, నివాస ధ్రువీకరణపత్రాలు అందించాల్సి ఉంటుంది. ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చాక హడావుడిగా వీటి కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు తీస్తారు. వారి కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఎలా పొందాలో తెలుసుకుందాం... – కలసపాడు కుల ధ్రువీకరణపత్రం కుల (క్యాస్ట్) ధ్రువీకరణపత్రం పొందేందుకు దగ్గరలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుని చిరునామా, ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరిది పాత కులధృవీకరణపత్రం ఉంటే, పాఠశాల, కళాశాలల నుంచి ఇచ్చిన టీసీ పత్రాలు జత చేసి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత సంబంధిత పత్రాలన్నింటిపై వీఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దార్ ధ్రువీకరిస్తారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం నుంచి ఆన్లైన్ అనుమతి ఇస్తారు. అనంతరం మీసేవ ద్వారా సర్టిఫికెట్ చేతికి వస్తుంది. ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్ (ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు) ఈ సర్టిఫికెట్ ఓసీ వర్గాలు, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్య, నాయుడు (కమ్మ) తదితర ఉన్నత కులాల వారికి అవసరం ఉంది. వీరు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వం విద్య కోసం ఉపకార వేతనాలు అందజేస్తుంది. దీని కోసం ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, అడ్రస్ తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఓబీసీ ఓబీసీ (అదర్ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్) సర్టిఫికెట్‌ను పొందేందుకు దరఖాస్తుదారుడు మీసేవ కేంద్రంలో దరఖాస్తు నింపి వాటితో పాటు కులాన్ని సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాలు, ప్రైవేటు ఉద్యోగులైతే వారి వేతన స్లిప్పులు జతపరిచి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణపత్రం ఆదాయ ధ్రువీకరణపత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తును నింపి దాంతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, గుర్తింపుకార్డు పత్రాలను జతచేయాలి. సంబంధిత పత్రాలన్నీ మీసేవ కేంద్రంలో వారు స్కాన్‌చేసి అనంతరం పత్రాలను తహసీల్దారు కార్యాలయానికి పంపుతారు. అక్కడ వీఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు కార్యాలయ సిబ్బంది విచారించి అర్హులకు అనుమతిస్తారు. అనంతరం మీసేవ సర్టిఫికెట్ పొందవచ్చు. నివాస ధ్రువీకరణపత్రం నివాస ధ్రువీకరణపత్రం కోసం సమీపంలోని మీసేవ కేంద్రాల్లో లభించే దరఖాస్తు ఫారం నింపి దాంతో పాటు అన్ని విద్యార్హత పత్రాలు, బోనపైడ్, చిరునామా పత్రం, గుర్తింపు కార్డులను జతచేయాలి. తిరిగి వాటిని సంబంధిత తహశీల్దారు కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత వీఆర్ఓలు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే జారీ చేస్తారు. గ్యాప్ సర్టిఫికెట్ మండల తహసీల్దారు కార్యాలయాల్లో గ్యాప్ సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యలో వెనుకబడిన విద్యార్థులు అనారోగ్య కారణాలతో చదవలేనివారు, చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి ఉన్నత విద్య చదవాలనుకునేవారు విధిగా దీనిని అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందే వారికి ఇది తప్పనిసరిగా అవసరం. ఈ సర్టిఫికెట్ పొందాలంటే రూ.10 స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్ (చదువులో ఎందుకు గ్యాప్ వచ్చిందో సూచిస్తూ) నోటరీ, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన పత్రాలు, విద్యార్హత పత్రాలు, అనారోగ్య కారణాలతో చదువులో గ్యాప్ వస్తే సంబంధిత మెడికల్ పత్రాలు జతచేసి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. గడువు వివరాలు సర్టిఫికెట్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణీత గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణపత్రం 30 రోజులు, ఆదాయ ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, నివాస ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ ఏడు రోజులు, ఓబీసీ సర్టిఫికెట్ 7 రోజులు, గ్యాప్ సర్టిఫికెట్‌ను ఏడు రోజుల్లో పొందవచ్చు. ఎవరినీ ఆశ్రయించాల్సిన పనిలేదు ధ్రువీకరణపత్రాల కోసం నేరుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దళారులను ఆశ్రయించొద్దు. అన్నీ అవసరమైన పత్రాలు జతచేస్తే నిర్ణీత కాలవ్యవధిలో అందుతాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాల కోసం వెళ్లిన వారు పాత పత్రాలు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరివైనా ఉంటే వాటిని జతచేయాలి. విచారణలో అధికారులకు చాలా సులువుగా ఉంటుంది. సకాలంలో సర్టిఫికెట్ త్వరితగతిన చేతికి అందుతుంది. -
పౌర సేవలు మరింత విస్తృతం
సాక్షి, సిటీబ్యూరో: మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడిసర్వీసుల కోసం వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతుండడంతో మీ సేవ కేంద్రాల్లో సేవలను వేగవంతం చేసేందుకు తెలంగాణ ఐటీ శాఖ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం అవసరమైతే గ్రేటర్ హైదరాబాద్ వాసులు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లేవారు. అక్కడ గంటల తరబడి నిల్చునేవారు, నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్తగా 2.0 వెర్షన్ ద్వారా సామాన్యులకు మీ సేవ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా ఎవరికి వారే వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. రిజిస్ట్రేషన్ ఇలా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్లో ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీ సేవ 2.0 వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో కేఐఓఎస్‌కేలోకి వెళ్లాలి. ఇందులో మూడు రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సిటిజన్ సర్వీస్‌లోకి వెళ్లాలి. తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పేరు, చిరునామా, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సెల్‌ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత హోం పేజీ వస్తుంది. అనంతరం లాగిన్ కావాలి. దీంతో 37 రకాల సేవలు పొందవచ్చు. మున్ముందు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సర్వీసులు ఇవే.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం టీ–ఫోలియో యాప్ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో కొన్ని ఇబ్బందులు రావడంతో తాజాగా 1.0 సాఫ్ట్వేర్ నుంచి 2.0 వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం దీని ద్వారా 37 రకాల ప్రభుత్వ పౌర సేవలు ఇంటి వద్ద నుంచే పొందేందుకు వీలు కల్పించింది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా సెల్‌ఫోన్‌కి ఈ సమాచారం అందుతుంది. వెంటనే వినియోగదారుడు మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దీని ద్వారా ఆహార భద్రత, ఆదాయం, కులం, నివాసం, భూములకు సంబంధించిన ఆర్ఓఆర్, పహణీ తదితర ధ్రువపత్రాలతో పాటు 37 రకాల పౌర సేవలను పొందవచ్చు. ఈ సేవలకు గాను చెల్లించే రుసుం ఆన్లైన్ ఖాతా నుంచే చెల్లించవచ్చు. దీనిపై సందేహాలుంటే 1100, 18004251110 టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా లేదా 91210 06471, 91210 06472 వాట్సాప్ నంబర్ల ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. పౌర సేవలు మరింత విస్తృతం తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన మీ సేవ 2.0 వెర్షన్ ద్వారా పౌర సేవలు మరింత విస్తృతం కానున్నాయి. పౌరులు తమ సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సిటిజన్ పేరుతో లాగిన్ అయి మీ సేవకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.– జీటీ వెంకటేశ్వరరావు, కమిషనర్, మీ సేవ -
ఇచ్చట ‘మీసేవ’ తిరస్కరించబడును!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన రైతు శివప్రసాద్‌రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఒక సర్వే నంబరు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ముడుపులు ఇవ్వకపోవడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన శంకర్‌రెడ్డి (బాధితుడి విజ్ఞపి మేరకు పేరు మార్చాం) మ్యుటేషన్ కోసం రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలంటూ నిర్దిష్ట రుసుము చెల్లించి అన్ని ఆధారాల జిరాక్స్ కాపీలతో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఆయన దరఖాస్తును తిరస్కరించారు. సంబంధిత అధికారిని కలవగా ముడుపుల కింద కొంత సొమ్ము తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత చేసినా ఇప్పటికీ ఆయన పేరుతో మ్యుటేషన్ కాలేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా తిరస్కరించిన ‘మీసేవ’ దరఖాస్తుల సంఖ్య 71 లక్షలకుపైమాటే. ఒక్కో దరఖాస్తుకు ప్రజలు సగటున రూ.300 చొప్పున చెల్లించినట్లు లెక్క వేసినా 71 లక్షల అర్జీలను తిరస్కరించడం ద్వారా సర్కారు వసూలు చేసిన సొమ్ము రూ.213 కోట్లకు పైమాటే! ఇక బాధితులు నష్టపోయింది దీనికంటే ఎక్కువే ఉంటుంది. పౌరులకు పనులు జరగని మీసేవ అర్జీలతో ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీసేవలో దరఖాస్తు చేసినా మళ్లీ సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ముడుపులు చెల్లిస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, పురపాలక శాఖల్లో ఇలాంటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీంతో ‘ఎందుకొచ్చిన మీసేవ..?’ అంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం పారదర్శకతకు మారుపేరంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ‘మీసేవ’ తిరస్కరణ సేవగా మారింది. భూముల మ్యుటేషన్, కొలతలు, అదనపు సర్వే నంబరు చేర్పు, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ తదితరాల కోసం ‘మీసేవ’ ద్వారా అందే దరఖాస్తులను అధికారులు పెద్ద ఎత్తున తిరస్కరిస్తూ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీసేవ తిరస్కరణ అర్జీలు 71 లక్షలు దాటిపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గడువుదాకా పట్టించుకోని సిబ్బంది.. ఏ పని కావాలన్నా లంచాలు చెల్లించాల్సిన పనిలేదని, నిర్దిష్ట రుసుము కట్టి మీసేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్త డొల్ల అనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పౌరులే నిదర్శనం. ఏ శాఖల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకునే దిక్కులేక గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు ఇస్తున్నారు. మీసేవ ద్వారా అందే అర్జీలను చాలామంది సిబ్బంది నిర్దిష్ట గడువు వరకు పట్టించుకోకుండా తీరా రెండు మూడు రోజుల ముందు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కనీసం కారణం కూడా చూపకుండానే పక్కన పడేస్తున్నారు. పక్కవారికి పంపితే పరిష్కారమైనట్లా? కొందరు సిబ్బంది తమ వద్దకు వచ్చే అర్జీలను ఇతర ఉద్యోగుల వద్దకు పంపుతూ పరిష్కారమైనట్లు జాబితాలో చేర్చేస్తున్నారు. దీనివల్ల పరిష్కారమైన అర్జీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తంతును చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వినతులను తిరస్కరించడం దారుణమైతే, ఫైలును పక్క ఉద్యోగికి పంపి పరిష్కారమైనట్లు నమోదు చేయడం మరీ ఘోరమని పేర్కొంటున్నారు. ‘ఈ పరిణామాలు ఏమాత్రం సరికాదు. సరైన కారణాలు చూపకుండా కొందరు, అసలు కారణం పేర్కొనకుండానే మరికొందరు వినతులను తిరస్కరిస్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిర్దిష్ట సమయంలో దరఖాస్తు పరిష్కరించకుంటే సంబంధిత ఉద్యోగి పేరు రికార్డుల్లో నమోదవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని గుర్తించాం. ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని స్పెషల్ ఛీప్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. చేతి చమురు వదులుతోంది ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రుసుములు, సర్వీసు చార్జీల రూపంలో రూ.వందల్లో చెల్లిస్తున్నారు. అయితే దరఖాస్తుతో పని అయిపోతుం దనుకుంటే పొరపాటే. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుకు జత చేసిన పత్రాలు స్పష్టంగా లేవంటూ, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి మరికొంత సొమ్ము చెల్లించాలి. ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో అర్జీకి సుమారు రూ. 400 దాకా చేతి చమురు వదులుతోంది. ఇవీ ‘మీసేవా’ గణాంకాలు... - 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రెవెన్యూ వెబ్సైట్ వెబ్‌ల్యాండ్‌లో అదనపు సర్వే నంబరు చేర్పు కోసం 2,41,447 వినతులు రాగా 1,57,365 అర్జీలను తిరస్కరించారు. 82,557 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. - వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 69,274 మంది దరఖాస్తు చేసుకోగా 50,913 అర్జీలను ఆమోదించారు. 17,576 వినతులను తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. - 500 చదరపు అడుగులలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 32,056 అర్జీలు రాగా 3,562 వినతులను మాత్రమే ఆమోదించారు. 20361 దరఖాస్తులను తిరస్కరించారు. - ఆక్రమిత ప్రభుత్వ భూమిలో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 73,783 వినతులు రాగా 3401 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. 70,382 దరఖాస్తులను తిరస్కరించారు. - ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 8,60,440 దరఖాస్తులు రాగా 6,20,070 అర్జీలను ఆమోదించారు. 2,25,711 వినతులు తిరస్కరించారు. - కంప్యూటరైజ్డ్ అడంగల్‌లో కరెక్షన్ కోసం 40,74,721 వినతులు రాగా 26,97,255 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన 13,37,732 అర్జీలు చెత్తబుట్టపాలయ్యాయి. -
'మీసేవ'లు బంద్
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న మీసేవ కేంద్రాల సిబ్బంది మరోసారి సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గతంలో ఆందోళన చేపట్టిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు విశాఖ జిల్లాలో సోమవారం మీసేవ కేంద్రాలు మూతపడ్డాయి. బంద్‌లో భా గంగా చినవాల్తేరు, ఆర్కేబీచ్, ఆరిలోవ, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, జ్ఞానాపురం, మాధవధార, బుచ్చిరాజుపాలెం, గాజువాక, చిన,పెద గంట్యా డ, తగరపువలస, అనకాపల్లి ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు మూతపడ్డాయి. ఫలితంగా పలు రకాల పన్నులు, బిల్లుల చెల్లింపు కోసం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.మీసేవ కేంద్రాల నిర్వహణ చూసే రామ్ ఇన్ఫో సంస్థ ఇప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వకపోయినా కార్మికశాఖ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ మీసేవలు కిటకిట కాగా, ప్రభుత్వ మీసేవకేంద్రాలు బంద్ కారణంగా నగరంలో,జిల్లాలోనూ ప్రైవేట్ మీసేవ (ఏపీఆన్‌లైన్) కేంద్రాలు ప్రజలతో కిటకిటలాడాయి. జీవీఎంసీ పన్నులు, ఆర్టీఏ పన్నులు, విద్యుత్‌బిల్లులు, తహసీల్దార్ ధ్రువపత్రాలు వంటి సేవల కోసం ప్రజలు ప్రైవేట్ మీసేవ కేంద్రాలను ఆశ్రయించారు. ఇంటిపన్నులు చెల్లించే నెల కావడంతో ప్రభుత్వ మీసేవ కేంద్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇదీ పరిస్థితి రాష్ట్రంలో 2003 లో మీసేవలు ప్రారంభం కావడం తెలిసిందే. విశాఖలో మీసేవ కేంద్రాలను రామ్ఇన్ఫో సంస్థ 2015 సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. గత సంస్థ మాదిరిగానే ఈ సంస్థ కూడా ఇప్పటికీ నియామక పత్రాలు అందజేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా, మేనేజర్లు నుంచి రూ.50 వేలు, ఆపరేటర్ల నుంచి 25వేలు వంతున సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకున్నా రశీదులు మాత్రం ఇవ్వలేదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ డిపాజిట్లు వాపసు చేయాలని కార్మికశాఖ సమక్షంలో డిమాండ్చేసినా ఫలితం లేకపోయింది. గడువు పొడిగింపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈనెల 16వ నుంచి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న మీసేవ కేంద్రాలను ఏపీటీఎస్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రామ్ఇన్ఫో సంస్థకు మరో రెండునెలలపాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని మీసేవ ఉద్యోగుల సంక్షేమసంఘం అధ్యక్షుడు గోవింద్‘సాక్షి’కి తెలిపారు. నిర్వహణ అధ్వానం రామ్ ఇన్ఫో సంస్థ మీసేవ కేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసిందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేంద్రాల నిర్వహణకు గాను తెల్లకాగితాలు తదితర సామగ్రిని సొంత సొమ్ముతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. పలు కేంద్రాలలో సెక్యూరిటీగార్డులు, స్వీపర్లు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. కంప్యూటర్లు పనిచేయకున్నా సైట్ ఇంజనీర్లు ఇద్దరే కావడంతో సకాలంలో మరమ్మతులు చేయలేని దుస్థితి తుందని సిబ్బంది చెబుతున్నారు. విద్యుత్ బిల్లులుచెల్లించకపోవడంతో చినవాల్తేరు, చినగంట్యాడ, పెదగంట్యాడ, వన్‌టౌన్ రెల్లివీధి ప్రాంతాలలోని మీసేవ కేంద్రాలకు విద్యుత్ నిలిచిపోయింది. జనరేటర్లు కాదుకదా కనీసం యూపీఎస్సదుపాయం కూడా లేదు. వెట్టిచాకిరీ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 22 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 22 మంది మేనేజర్లు, 50 మంది ఆపరేటర్లు, ఒక సమన్వయకర్త, సైట్ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు. గతంలో ఆపరేటర్లు 90 మందికి పైగా ఉండేవారు. ఇప్పుడు కేవలం 50మందే ఉండడంతో తీవ్ర పనిఒత్తిడితో సతమతం అవుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. మేనేజర్‌కి రూ.9,300, ఆపరేటర్లకు రూ.6,400, సెక్యూరిటీ గార్డులకు రూ.4వేలు, స్వీపర్లకు రూ.800 వంతున వేతనాలు ఇస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల వేతనాలు ఇప్పటికీ ఇవ్వకపోవడం గమనార్హం. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని మీసేవ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మీసేవ కోల్పోతున్న ఆదాయం సూర్యాబాగ్ రూ.20లక్షలు ఆశీలమెట్ట రూ.15లక్షలు సీతమ్మధార రూ.7లక్షలు దొండపర్తి రూ.15లక్షలు చినవాల్తేరు, రూ.5లక్షలు ఎంవీపీ కాలనీ రూ.7లక్షలు కంచరపాలెం రూ.10లక్షలు మాధవధార రూ.20లక్షలు చినగంట్యాడ రూ.25లక్షలు మల్కాపురం రూ.15లక్షలు చిట్టివానిపాలెం రూ.12లక్షలు వడ్లపూడి రూ.10లక్షలు తగరపువలస రూ.5లక్షలు అనకాపల్లి 2 కేంద్రాలు రూ.20లక్షలు -
అందరికి కాదు... కొందరికే...!
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు నిరుద్యోగులకు బాబు వస్తే జాబు గ్యారెంటీ అని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలతో నిరుద్యోగ యువకులు ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తులు చేసుకునేందుకు, ఫీజులు కట్టేందు తల్లిదండ్రులపై ఆధారపడనవసరం లేదని భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యోగాలు లేక, ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి ఉంటే, ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ. 2 వేలు చొప్పున ఈ సంవత్సరాల కాలంలో రూ.120,000 భృతి అంది ఉండేది. ఈ పథకం అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ఒక్కొక్క నిరుద్యోగి దాదాపు లక్ష రూపాయలకు పైగా నష్టపోయామని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన పలు జనాకర్షణ హామీలతో అధికారంలో కొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్నయన్న సమయంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి, ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా ఒక్కొక్క నిరుద్యోగికి మొదట రూ.1000 చొప్పున మంజూరు చేశారు. తర్వాత నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంచారు. ఈ పథకం అమలులోనూ సీబీఎన్ ఆర్మీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని నియోజవకర్గంలో పలువురు నిరుద్యోగులు అంటున్నారు. యువనేస్తం కొందరికే వచ్చింది టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతి మండలంలో కొందరికి మాత్రమే అందుతుంది. ఈ పథకం కింద మీసేవలో దరఖాస్తు చేసినప్పటికీ, మంజూరు కాలేదు. యువనేస్తం పథకం అమలులో చిత్తశుద్ధి లోపించింది. – ఆదిమూలపు కొండయ్య (బీఏ), నాయుడుపాలెం గ్రామం, పుల్లలచెరువు మండలం ఒక నెల మాత్రమే వచ్చింది ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి రూ.1000, ఒక నెల మాత్రమే వచ్చింది. ఆ తరువాత నెల నుంచి రావడం లేదు. 1100 నంబరుకు ఫోన్ చేసినప్పటికీ, సరైన స్పందన లేదు. ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. ఎన్నికల ముందు ఈ పథకం అమలు చేయడం నిరుద్యోగులను మరొకసారి మోసగించడమే. – జిల్లెల చెన్నారెడ్డి (ఎంఫార్మసీ), తోకపల్లె గ్రామం, పెద్దారవీడు మండలం నిరుద్యోగ భృతి మంజూరు కాలేదు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ, ప్రభుత్వం నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. అర్హులైన నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పథకం కొందరికే వర్తింపజేశారు. బీఎస్సీ విద్యను పూర్తి చేసి, నిరుద్యోగ భృతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ప్రభుత్వం నిరుద్యోగభృతి మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. – అందుగుల రత్నరాజు (బీఎస్సీ), యడవల్లి గ్రామం, దోర్నాల మండలం -
చిత్తూరు.. మీ ఓటు ఉందా? చూసుకోండిలా..
సాక్షి, చిత్తూరు జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాస్థాయిలో ఫిర్యాదు విభాగం అధికారి పేరు : గోపాలయ్య (ఎన్నికల విభాగం సూపరింటెండెంట్) సెల్ నంబర్: 94910 77009 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
పశ్చిమ గోదావరి: ఓటరు లిస్టులో మీ పేరు చెక్ చేస్కోండి..!
సాక్షి, పశ్చిమ గోదావరి: ♦ 1950 టోల్‌ఫ్రీ నెంబరులో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడీ నెంబర్‌ను 1950 నెంబర్‌కు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ♦ గూగుల్ ప్లే స్టోర్‌లో VOTER HELP LINE యాప్‌ను మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, సంబంధిత వివరాలు ఎంటర్ చేసి ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఆర్డీఓ ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఎమార్వో ఆఫీసులో ఎమ్మార్వో లేదా ఎన్నిక విధులకు కేటాయించిన ఇతర అధికారులను కలిసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ♦ బూత్ లెవెల్ ఆఫీసర్స్ (బీఎల్వో)లు వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితాను ప్రతీ పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. ♦ ఒక వేళ మీఓటు లేదని తెలిస్తే పై మూడు స్థాయిల్లోను అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి ఫామ్ - 6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. ♦ మీ సేవా కేంద్రాల్లోను నిర్ణీత రుసుము తీసుకుని ఓటుందో లేదో తెలియజేస్తారు. సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆన్లైన్లో కూడా నమోదు చేస్తారు. ♦ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవెల్ అధికారి వరకూ అందరి వద్ద ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా మీ ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే ఓటు నమోదుకు ఉన్న అవకాశాలు గురించి ఆర్డీవో, ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలి. బూత్ లెవెల్ అధికారి - 912111 9481 తహసీల్దార్ - 94910 41449 - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
‘డబుల్’ డబ్బుల్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు మీ–సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదుకు నిర్ణీత ఫీజు కంటే రెండింతలు అధికంగా వసూలుచేస్తున్నారు. దీంతో పేదల జేబుకు చిల్లు పడుతోంది. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చేసిన ఓ ‘పత్రికా ప్రకటన’తో ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అధికారిక ప్రకటన ఇవ్వడంతో లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్లో నమోదు అనంతరం దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఇది కాస్త రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా తయారైంది. మూడు లక్షలకు పైగా... ఒకరిని చూసి మరొకరు ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుకు లబ్ధిదారులు ఉత్సాహం చూపుతుండడంతో... మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు దాన్ని ‘క్యాష్’ చేసుకుంటున్నారు. పేదలతో మీ–సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గత రెండు నెలలుగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో ఇప్పటికే 3లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరింత మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లే ఇప్పటికీ పూర్తి కాలేదు. మురికివాడల్లోని లబ్ధిదారులకు పొజిషియన్ సర్టిఫికెట్లు అందజేసినా, కనీసం ఒక్క శాతం కూడా పూర్తి చేసివ్వలేదు. తొలి విడత నిర్మాణాలు పూర్తయిన, తర్వాతే రెండో విడత ఇళ్ల నిర్మాణాలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో నిర్మిస్తున్న ఇళ్లు ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన వారికి మాత్రమే సరిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెండింగ్ దరఖాస్తులు, తాజా దరఖాస్తులను కలిపితే దాదాపు 5లక్షలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో 3లక్షల దరఖాస్తులు అర్హత సాధిస్తే, వారిని ఎంపిక చేసి ఇళ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు మరో ఐదేళ్లు పట్టొచ్చని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనే పూర్తి... గ్రేటర్‌లోని మూడు ప్రాంతాల్లో 496 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 38 ప్రాంతాల్లో 39,669 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. వాస్తవానికి 2019 మార్చి నాటికి 68 ప్రాంతాల్లో 59,835 పూర్తి చేయాల్సి ఉంది. అమీన్పూర్, గాజులరామారం, జమ్మిగడ, సయ్యద్‌సాబ్‌కాబాడా తదితర ప్రాంతాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఇంకా లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. జియాగూడ, బండ మైసమ్మనగర్, అహ్మద్‌గూడ, డీపోచంపల్లి, ఎరుకల నాంచారమ్మ బస్తీ, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. -
మీ సేవలపై సమ్మెట పోటు
కర్నూలు(అగ్రికల్చర్)/ఆళ్లగడ్డ: మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమ్మె బాట పట్టడంతో జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు బంద్ అయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం కేంద్రాలను మూసి నిర్వాహకులు ఆందోళనకు దిగారు. డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో 867 కేంద్రాలున్నాయి. కర్నూలులో 4, నంద్యాల 3, ఆదోని 3, ఎమ్మిగనూరులో రెండు కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీ టిని అర్బన్ మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తారు. వీటితోపాటు డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో గ్రామీ ణ ప్రాంతాల్లోని నడస్తున్న 8 వన్‌స్టాప్ సెంటర్లు పని చేస్తుండగా మిగతా 847 కేంద్రాలు మూతపడ్డాయి. మీసేవ కేంద్రాల ద్వారా 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 350 వరకు సేవలందుతున్నాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబందించి 53 సేవలు అందుతున్నాయి. నష్టాల్లో మీసేవ కేంద్రాలు... మీసేవ కేంద్రాల ద్వారా రైతులు, విద్యార్థులు ఇతర అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికి కమీషన్ అంతంతమాత్రం ఇస్తుండటం, పలు సేవలు తప్పించడం వల్ల అనేక కేంద్రాలు నష్టాల్లో నడుస్తున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీసేవ ఆపరేటర్ల కమీషన్ పెంచాల్సి ఉండగా తగ్గించడంపై వీరు భగ్గుమంటున్నారు. మీసేవ కేంద్రాల నుంచి ఆధార్ నమోదును తప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రూ.15వేల గౌరవవేతనం సహా 15 డిమాండ్లను మీసేవ కేంద్రాల డైరెక్టర్ ముందుంచినట్లు మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్ నాయకులు నాగరాజు, లోకేష్ షేక్షావలీ తదితరులు తెలిపారు. అవసరానికి మించి కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పలు కేంద్రాలకు బాడుగులు, విద్యుత్, నెట్ బిల్లులు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిపోయిన దరఖాస్తులు 2015లో ఒక్కో మీసేవ కేంద్రం ద్వారా సగటున రోజుకు 500 వరకు అప్లికేషన్లు అందేవి. కేంద్రాల ఏర్పాటు పెరిగిపోవడంతో ప్రస్తుతం రోజుకు 50కి మించడం లేదు. కేంద్రం నిర్వహణ కోసం నెలకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చవుతోంది. ఇందులో సగం మొత్తం కూడా ఆర్జించని కేంద్రాలున్నాయి. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా స్పందన లేకపోవడంతో సమ్మె బాట పట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొదటి రోజు తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందించారు. ప్రధాన డిమాండ్లు.. ♦ జీఎస్టీ నుంచి మినహాయించాలి. లేదంటే ఆ మేరకు సొమ్మునుప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించాలి. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు కొన్ని మినహాయింపులుండాలి.ఆపరేటర్లకు భృతి చెల్లించాలి. ♦ కేంద్రాల ప్రారంభ సమయంలో డిపాజిట్ రూపంలో వసూలు చేసిన రూ.లక్ష మొత్తాన్ని తిరిగివ్వాలి. ♦ పెండింగ్ ఉన్న కమీషన్వెంటనే చెల్లించాలి. ♦ నిర్వాహకులందరికీ ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ♦ స్టేషనరీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి -
స్తంభించిన ‘మీ సేవ’
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: జిల్లాలో ‘మీ సేవ’లు స్తంభిం చాయి. తమ డిమాండ్ల సాధన కోసం ‘మీ సేవ’ కేంద్రాల సిబ్బం ది గురువారం నుంచి సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సంఘం పిలు పు మేరకు చేపట్టిన ఆ సమ్మెలో జిల్లాకు చెందిన దాదాపు రెండు వేల మీ సేవా కేంద్రాలు తాత్కాలికంగా మూత పడ్డాయి. 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 440 సేవలు అందించే ఈ కేంద్రాలు జిల్లాలో మూతపడడంతో తొలి రోజే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రెండు వేల కేంద్రాలకు చెందిన సుమారు ఆరు వేల మంది సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాల పేరిట రెండు కేటగిరీల్లో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఏపీ ఆన్లైన్, కామన్ సర్వీస్ సెంటర్ (సీఎంసీ) ఈ రెండు సంస్థలు జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలు కమీషన్ పద్ధతిలో...అర్బన్ ప్రాంతాల కేంద్రాలు శాలరీ పద్ధతిలో పని చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల కేంద్రాల ఆపరేటర్లు, సిబ్బంది ప్రధానంగా తమ కమీషన్ల పెంపు కోసం...బకాయి కమీషన్లు ఏ నెలకానెల ఇవ్వాలన్న డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 18 డిమాండ్లపై ప్రభుత్వానికి సమ్మె అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఈ నెల 17వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గం ముందే ప్రకటించి గురువారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. గ్రామీణ సమ్మెకు కొన్నిచోట్ల అర్బన్ సిబ్బంది మద్దతు తెలిపితే... మరికొన్నిచోట్ల తమకు మద్దతు ఇచ్చేలా చేసుకుని అర్బన్ ప్రాంతాల్లో కేంద్రాలను కూడా మూయించే ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లాలో మీ సేవా కేంద్రాల వద్ద సిబ్బంది ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. స్తంభించిన సేవలు ఇలా... జిల్లాలోని ‘మీ సేవా’ కేంద్రాల ద్వారా ప్రజలు ఇంటి పన్నులు, కరెంటె బిల్లులు, టెలిఫోన్, సెల్‌ఫోన్ బిల్లులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని సేవలను పొందుతున్నారు. ‘మీ సేవ’ అంటే నేడు ప్రజా జీవితంలో ఓ భాగమైపోయింది. సమ్మె సమాచారం తెలియని ప్రజలు ఉదయం వచ్చి పడిగాపులు కాయడం కనిపించింది. చివరకు విషయం తెలిసి తిరుగు ముఖం పట్టారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతోపాటు ఇతర మున్సిపాటీలు, మండల కేంద్రాల్లో ఉన్న దాదాపు 750 మీ సేవా కేంద్రాల్లో నిత్యం వేలాది సేవలను ప్రజలు పొందుతున్నారు. కమీషన్ పెంపే ప్రధాన డిమాండ్ మీ సేవా కేంద్రాల్లో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది ప్రధానంగా చేసిన సేవలకు కమీషన్ పెంపు కోసం పోరాడుతున్నారు. గత ఏడాది మార్చిలో వీరి ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చి కమీషన్ పెంచినప్పటికీ అది 50 నుంచి 60 శాతం మాత్రమే పెంపు అమలవుతోంది. అయినప్పటికీ కమీషన్లు సరిపోక... ప్రజల నుంచి సేవలపరంగా ఒత్తిడి రెట్టింపు అవడంతో ఆ కేంద్రాల ఆపరేటర్లు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు అరకొర పెంపుతో ఇచ్చే కమీషన్లు కూడా ఏ నెలాకానెల కాకుండా మూడు నెలల బకాయిలు పేరుకుపోయిన తర్వాత ఇస్తున్నారు. దీంతో నిర్వహణా భారం మరీ పెరిగిపోయి కమీషన్‌ను తక్షణమే పెంచడంతోపాటు బకాయిలు లేకుండా రెగ్యులర్‌గా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మెకు సమర శంఖం పూరించారు. ముఖ్యంగా ఆపరేటర్లకు నెలకు కనీస వేతనం రూ.15 వేలుండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సేవలకు సంబంధించి ఏ కేటగిరీకి రూ.25, బీ కేటగిరీకి రూ.30 కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మీ సేవకు మొత్తం జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.