Pimpri
-
వారంపాటు లాక్డౌన్.. కుటుంబాలు రోడ్డున పడతాయి
సాక్షి, ముంబై: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్లలో వారం రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ను హోటల్ రంగాల యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కాలా దివస్‌గా అభివర్ణించారు. కాగా, పుణేలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిందని, వారంపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పుణే రీజినల్ పోలీస్ కమిషనర్ సౌరబ్ రావ్ విలేకరులతో వెల్లడించారు. అయితే పుణేలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని యునైటెడ్ హాస్పిటాలిటీ అసోసియేషన్, రెస్టారెంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజింక్య షిండే తప్పుబట్టారు. ‘‘గత సంవత్సరం విధించిన లాక్డౌన్ వల్ల 40 శాతం హోటళ్లు, రెస్టారెంటు ఇప్పటికే మూతపడ్డాయి. దీని కారణంగా ఆర్థికంగా నష్టపోయాం, ఈ షాక్ నుంచి ఇంతవరకు తేరుకోనేలేదు. మళ్లీ లాక్డౌన్ అమలు చేయడమేంటి. ప్రస్తుతం 50 శాతం వ్యాపారాలు నడుస్తున్నాయి. నష్టాల్లో ఉన్నప్పటికీ కస్టమర్లకు సేవలందించాలనే ఉద్ధేశంతో ఎలాగో కొనసాగిస్తున్నాం. హోటళ్లు మూసివేయడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా...?’’ అని అజింక్య నిలదీశారు. ఆర్డర్లు తగ్గడంతో.. పుణే–పింప్రి–చించ్వడ్ జంట నగరాలలో అనేక ఐటీ, ఆటోమెబైల్, ఇంజినీరింగ్, వైద్య, విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంతోపాటు దేశంలోని నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది విద్య, ఉద్యోగ, ఉపాధి వేటలో వస్తుంటారు. వీరంతా ఒంటరిగా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో రెండు పూటల భోజనం కోసం హోటళ్లపై ఆధారపడతారు. కానీ, వాటిని మూసివేయడం వల్ల పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక స్విగ్గి, జోమాటో ద్వారా ఆన్లైన్లో భోజనం, టిఫిన్లను ఆర్డర్ చేస్తే వారు ఎక్కువ చార్జీలు వేస్తూ కస్టమర్ల నడ్డి విరుస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న తెలుగు హోటల్ యజమానులు.. జంట నగరాలలోని హింజ్వాడి, తాతేవాడి, బోసరి, ఎంఐడీసీ, చాకణ్, చికిలీ, విశ్రాంతి వాడి, కల్యాణ్ నగర్, మగర్ పట్టా, క్యాంపు తదితర ప్రాంతాలలో తెలుగువారు హోటళ్లు హాస్టళ్లు నడుపుతున్నారు. గత ఏడాది విధించిన లాక్డౌన్ వల్ల సగానికి పైగా మూతపడ్డాయి. దీంతో అనేక మంది స్వగ్రామాలకు తరలిపోయారు. మళ్లీ రావడానికి జంకుతున్నారు. ఉన్న వారిలో కొందరు పెద్ద హోటళ్ల స్థాయి నుంచి చిన్నచిన్న పార్శిల్ అందించే స్టాళ్ల స్థాయికి మారిపోయారు. వారంపాటు లాక్డౌన్ సాక్షి, ముంబై: రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పుణే సిటీతోపాటు పింప్రి–చించ్వడ్, జిల్లాలో శనివారం నుంచి వారం రోజులపాటు లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు, పుణే సిటీ బస్సులు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, వారాంతపు సంతలు, మార్కెట్లు వారం రోజులపాటు మూసి ఉంటాయి. పగలు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో పుణేకర్లు సాయంత్రం ఆరు లోపే ఇళ్లకు చేరుకోవల్సి ఉంటుంది. అయితే పెళ్లిలు, అంత్యక్రియలు మినహా ఇతర ఎలాంటి శుభకార్యాలు, సామాజికి సేవా, సంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభులు, ఇతర కార్యక్రమాలపై నిషేధం విధించారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జీ మంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుణే జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్‌పై ఆరా తీశారు. దీంతో కరోనా నియంత్రణకు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత రీజినల్ పోలీసు కమిషనర్ సౌరబ్ రావ్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే కార్యాలయాలు సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. దీంతో విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులను పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయరని ఆయన అన్నారు. కరోనా నియమాలు కచ్చితంగా అమలు చేసేందుకు పెట్రోలింగ్ నిరంతరం జరుగుతుందని రావ్ స్పష్టంచేశారు. అమల్లోకి ఆంక్షలు.. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా థియేటర్లు, పుణే సిటీ బస్సులు, ప్రార్థన మందిరాలు మూసిఉంటాయి. ఎలాంటి ధార్మిక, సంస్కృతికి కార్యక్రమాలకు అనుమతి లభించదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలు మూసి ఉంటాయి. కానీ, పరీక్షలు జరుగుతాయి. హోటళ్లు తెరిచే ఉంచుతారు, తినుబండారాలు పార్శిల్స్ ఇచ్చేందుకు అనుమతి ఉంది. మెడికల్, తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయి. పెళ్లికి ఇరువైపుల నుంచి కేవలం 50 మంది హాజరుండాలి. ఇదివరకు అనుమతి పొందిన పెళ్లిళ్లే జరగాలి. కొత్త వాటికి అనుమతి లేదు. అదేవిధంగా అంత్యక్రియలకు కేవలం 20మంది ఉండాలి. ఉద్యానవనాలు ఉదయం తెరిచి ఉంటాయి. -
రోడ్డుపైనే అంత్యక్రియలు..
పింప్రి: శ్మశానం కోసం భూమిని కేటాయించటం లేదంటూ రద్దీగా ఉండే రోడ్డుపైనే గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలివీ... మహారాష్ట్రలోని పింప్రిలో హింజవడీ ఏరియా గబార్వాడీలో నివసించే పరమేశ్వర్ గావరే (33) శుక్రవారం మరణించాడు. ఆయన భౌతికకాయానికి నడిరోడ్డుపై అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే కొన్నేళ్ల కిందట శ్మశానం ఉండేది. అయితే ఐటీ పార్క్ నిర్మాణం తర్వాత ప్రభుత్వం స్థలాలను సేకరించి అక్కడ రోడ్డును నిర్మించింది. అయితే, ప్రభుత్వం 2007లో గబార్వాడీ ప్రజల కోసం అదే ప్రాంతానికి సమీపంలో స్థలాన్ని శ్మశానం కోసం కెటాయించింది. కొందరి వ్యతిరేకత కారణంగా ఇంత వరకు అక్కడ శ్మశానం నిర్మాణం చేయలేదు. దీనిపై గ్రామస్థులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రస్తుతం ఎవరైన మరణిస్తే సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లి అంత్యక్రియలు చేయాల్సివస్తోంది. శ్మశానభూమి ఏర్పాటు చేస్తామని స్థలం కేటాయించి 10 ఏళ్లు గడిచిన ఇంకా నిర్మాణం చేయకపోవడంపై నిరసనతో ఉన్న గ్రామస్థులు పరమేశ్వర్ గావరే భౌతికకాయాన్ని నడిరోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహిచారు. ఇప్పుడైన ప్రభుత్వం కళ్లు తెరవాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
ఓట్ల బాటలో ‘కోట్లు’!
అభ్యర్థుల్లో 47 శాతం మంది కోట్లకు పడగెత్తినవారే.. * రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించినవారు 9 మంది * అసలు పైసా ఆస్తి కూడా లేదన్నవారు 14 మంది.. పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని.. అభ్యర్థిగా నిలుచున్న వ్యక్తికి నామినేషన్ వేసినప్పటినుంచి ఫలితాలు వెలువడేంతవరకు రోజూ లక్షలమీదే ఖర్చు ఉంటుంది.. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి అభ్యర్థీ ఎన్నికలైనంతవరకు కొందరు కార్యకర్తలను తనతోనే తిప్పుకోవాల్సి ఉంటుంది. దాంతో అద్దెవాహనాల అవసరం పడుతుంది. అలాగే సహచరులకు అన్ని ఖర్చులు తానే భరించాలి.. ప్రచార సభలు తప్పనిసరి.. వాటిని ఏర్పాటుచేద్దామనుకునే ప్రాంతానికి అద్దె చె ల్లించడం దగ్గర నుంచి సభ పూర్తవ్వడానికి అవసరమైన అన్ని ‘హంగు’లకూ సదరు అభ్యర్థి జేబుకు చిల్లు తప్పనిసరి.. ప్రస్తుతం బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చులు అనధికారికంగా కోట్లలోనే ఉంటాయి.. ఇటువంటి ఎన్నికలను తట్టుకోవాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ర్టంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎంతమంది కోటీశ్వరులు.. ఎంతమంది సామాన్యులు వంటి సమాచారంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) స్వయం సేవాసంస్థ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 2,336 మంది అభ్యర్థుల్లో 1,095 మంది అంటే 47 శాతం అభ్యర్థులు రూ. కోటి, అంతకు పైగా ఆస్తులు ఉన్నట్లు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. పార్టీల వారీగా ఎన్సీపీ నుంచి మొత్తం 277 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 229 మంది కోటీశ్వరులు (83 శాతం), కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 287 మంది అభ్యర్థుల్లో 222 మంది (77 శాతం), బీజేపీ నుంచి 258 మంది అభ్యర్థుల్లో 210 (81), శివసేన నుంచి 278 మందిలో 197 మంది (71 శాతం), ఎమ్మెన్నెస్ నుంచి 218 మందిలో 100 మంది (46 శాతం), స్వతంత్రులు 489 మంది పోటీలో ఉండగా వీరిలో 62 మంది (13 శాతం) కోటీశ్వరులుగా తేలింది. ఇతరులు 529 మంది అభ్యర్థుల్లో 75 మంది (14 శాతం) మొత్తం అన్ని పార్టీల నుంచి 2,336 మంది పోటీలో ఉండగా వీరిలో 1,095 మంది (47) మంది కోటీశ్వర్లు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో మోహిత్ కుంబోజ్ (దిండోషి, బిజేపీ) రూ.353 కోట్లు ఆస్తులు చూపించి మొదటి స్థానంలో ఉండగా, డాక్టర్ నందకుమార్ తాస్గావ్కర్ (ఫల్టాణ, శివసేన) రూ.211 కోట్లు, మంగల ప్రభాత్ లోడా (మల్బార్ హిల్, బిజేపీ), రూ.198 కోట్లు, అబూ అసీమ్ ఆజామీ (మాన్‌ఖుర్డ్ శివాజీనగర్, సమాజ్‌వాది పార్టీ) రూ.156 కోట్లు, ప్రసాద్ మినేషా లాప్ (శివ కోలివాడ, ఎన్సీపీ) రూ.126 కోట్లు, జగదీష్ ములుక్ (వడగావ్‌శేరి, బీజేపీ) రూ.104 కోట్లు, హితేంద్ర ఠాకూర్ (వసై బహుజన వికాస్ పార్టీ) రూ.100 కోట్లు, వినయ్ బైన్ (పశ్చిమ మలాడ్-శివసేన) రూ.93 కోట్లు, హికమత్ ఉదాన్ (ధనసావంగి-శివసేన) రూ.92 కోట్లు ఆస్తులు చూపించని అభ్యర్థులు వీరే... ఒకవైపు కోట్లు ఉంటేగాని ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో కూడా వేలు, వందలు లేని అభ్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యమే. అలాంటి వారిలో తమకు ఏ ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన వారు 14 మంది ఉన్నారు. వారిలో యువరాజ్ పాటిల్ (అమల్ నేర్-స్వతంత్య్ర అభ్యర్థి), సలీం అబ్దుల్ కరీం (బాలాపూర్-సమాజ్‌వాది పార్టీ), యోగేష్ కోరడే (సావనేర్-స్వతంత్ర), అశోక్ ఉమఠే (నాగ్‌పూర్ సెంట్రల్-స్వతంత్ర), చంద్రకాంత్ ఠాణేకర్ (వేగలుర్-స్వతంత్ర), ఆనంద్ పాటోల్ (పరతుర్ స్వతంత్ర), గౌతం ఆమరావు (పశ్చిమ ఔరంగాబాద్-ఎమ్మెన్నెస్), విలాస్ రణపిసే (పౌఠాణ్-స్వతంత్ర), యువరాజ్ ఆహిర్ (మాగఠాణే-ప్రబుద్ద్ రిపబ్లికన్ పార్టీ), నిలేష్ పాటిల్ (ములుండ్-బీఎస్పీ), అప్పారావు గాలఫడే (విలేపల్లి-స్వతంత్ర), జయంత్ వాఘ్మోరే (పశ్చిమ ఘాట్కోపర్ -స్వతంత్ర), షేక్ అబ్దుల్ రహీమ్ (పశ్చిమ బాంద్రా, స్వతంత్ర), సంజయ్ నకట్ (కొలాబా-బీఎస్పీ) ఉన్నారు. రూ.రెండు వేల లోపు ఆస్తి చూపించిన వారు.. మొదటి పది మందిలో సతీష్ బండారే (శిరోల్-స్వతంత్ర) రూ.822, ప్రమోద్ సుఖ్‌దేవ్ (బండారా-అంబేద్కర్ పార్టీ) రూ.1,000, జ్ఞానేశ్వర్ కురిల్ (బదనాపూర్-స్వతంత్ర) రూ.1,000, వికాస్ రోకడే (ధారావీ-స్వతంత్ర) రూ.1,000, అజిత్ మోడేకర్ (కాగల్ ఎమ్మెన్నెస్) రూ.1,000, నిలేష్ శేలార్ (పాచోరా, బహుజన్ ముక్తి పార్టీ) రూ.1,380, విశ్వాస్‌రావు ధరటే (ఇస్లాంపూర్-స్వతంత్ర) రూ.1,429, సంజయ్ సక్పాల్ (దిండోషి-స్వతంత్ర) రూ.2,000, యాసిన్ శేఖ్ (మలబార్ హిల్, స్వతంత్ర) రూ.2,050 ఆస్తి కలిగి ఉన్నట్లు తమ అఫిడవిట్లలో చూపించడం గమనార్హం. -
సాంగ్లీ జిల్లాలో రసవత్తరంగా ఎన్నికలపోరు
పింప్రి, న్యూస్‌లైన్: సాంగ్లీ జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఈసారి అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి సత్తా ఎంటో తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్-ఎన్సీపీ-బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఖానాపూర్...: ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివరావు పాటిల్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అభ్యర్థిగా అమర్ సిన్హా దేశ్‌ముఖ్, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్ బరిలోకి దిగగా ఎన్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ బాబర్‌ను శివసేన ఎన్నికల్లో పోటీకి నిలిపి పోటీని రసవత్తరంగా మార్చింది. ఈసారి సదాశివ్రావు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాస్గావ్ (కవఠే మహాంకాళ్)...: ఇది ఎన్సీపీ స్టార్, ప్రచాకర్త, ఆర్ఆర్ పాటిల్ నియోజక వర్గం. ఇక్కడ ఆర్ఆర్ పాటిల్‌కు కార్యకర్తల అండ, నియోజక వర్గంలో బలమైన సామాజిక వర్గం అనుకూలాంశాలుగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో కొంత కాలంగా ఇంటింటి ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి సంజయ్ కాకా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ కూడా ఆర్ఆర్ పాటిల్ ప్రతిష్టను తగ్గించేందుకు ఎన్సీపీకి చెందిన అజిత్ ఘోర్పడేకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ సురేష్ శేండగేను నిలిపి పోటీని కొత్తపుంతలు తొక్కించింది. ఈసారి ఆర్ఆర్ పాటిల్ గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. పలుస్-కడేగావ్..: ముఖ్యమంత్రి కావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పతంగ్ రావు కదమ్ నియోజక వర్గం ఇది. పతంగ్రావును ప్రతిసారి ఎన్నికల్లో ఎదుర్కొంటు వస్తున్న పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ ఈసారి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ నుంచి శ్రామిక్ ముక్తి దళ్‌కు చెందిన మోహన్ యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ..: సాంగ్లీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంభాజీ పవార్‌కు కాకుండా ప్రముఖ నగల వ్యాపారి సుధీర్ గాడ్గిల్‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలపగా, శివసేన అభ్యర్థిగా పృథ్వీరాజ్ పవార్, కాంగ్రెస్ నుంచి మదన్ పాటిల్ బరిలో ఉన్నారు. ఈసారి బీజేపీ తన స్థానాన్ని నిలుపు కొంటుందో లేదో చెప్పడం కష్టంగా ఉంది. అన్ని ప్రధాన పార్టీలు పోటీని సవాలుగా తీసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మీరజ్...: మీరజ్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడేకు బీజేపీ తిరిగి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలిపింది. ఈసారి మీరజ్‌ను గెలుచుకోవాలని కాంగ్రెస్..ప్రొఫెసర్ సిద్ధార్థ్ జాదవ్‌ను నిలబెట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసాహెబ్ వాన్మోరేకు ఎన్సీపీ టిక్కెట్ ఇచ్చింది. శివసేన నుంచి తానాజీ సాత్పుతే, కాంగ్రెస్ రెబల్‌గా సీఆర్ సాంగలీకర్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అన్ని వైపులా తలనొప్పులు మోదలయ్యాయి. బుజ్జగింపులతో నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శిరాళా...: సిట్టింగ్ ఎమ్మెల్యే మాన్సింగ్రావు నాయిక్కు ఎన్సీపీ టిక్కెట్ ఇవ్వగా, బీజేపీ శివాజీరావు నాయిక్‌ను ఎన్నికల బరిలో దింపింది. కాంగ్రెస్‌పార్టీ సత్యజిత్ దేశ్‌ముఖ్‌ను నిలబెట్టింది. ఎన్సీపీ-బీజేపీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాన్సింగ్ రావు ఓట్లను ఎంతవరకు చీల్చితే బీజేపీకి అంత లాభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జయంత్ పాటిల్ ఎన్సీపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే బావమరిది అయిన సత్యజిత్‌కు సపోర్టు చేస్తాడా వేచి చూడాలి. జయంత్ పాటిల్ ఎవరికి అనుకూలంగా ప్రచారం చేస్తే వారికి విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇస్లాంపూర్...: ఇస్లాంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తిరిగి ఎన్సీపీ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ జితేంద్ర పాటిల్‌ను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా నానాసాహెబ్, శివసేన అభ్యర్థిగా భీంరావు మానే పోటీలో ఉన్నారు. జితేంద్ర పాటిల్ ఒక్కడే పోటీలో ఉన్నట్లయితే జయంత్ మరో నియోజకవర్గంలో ప్రచారం చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలలో ప్రచారానికి సులువైంది. జత్...: ఆఖరు వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌లా నడిచిన జత్ నుంచి ఎన్సీపీకి చెందిన విలాస్‌రావు జగతాప్‌కు బీజేపీ టికెట్ లభించింది. దీంతో ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ శేండగే మనస్థాపం చెంది ఎన్సీపీలోకి చేరి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్ సిన్హా సావంత్, శివసేన నుంచి సంగమేశ్వర్ తేలి పోటీలో ఉన్నారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ-ఎన్సీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ జిల్లా నుంచి మహా మహులు పోటీలో ఉన్నారు. అందులో ప్రస్తుత మంత్రులు హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, అటవీ, పునరావాస శాఖ మంత్రి పతంగ్‌రావు కదమ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్‌తోపాటు విలాస్‌రావు జగతాప్లాంటి మహా నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
75% ఓటింగే లక్ష్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంధ సంస్థలు ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహనకల్పిస్తున్నారు. సైకిల్ ర్యాలీలు, ప్రచార రథాలతో ఓటు విలువను తెలియజేయడం, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఓట్ ఎక్స్‌ప్రెస్’ మినీబస్‌ను కూడా ప్రాంభించారు. పింప్రి, చించ్వడ్, బోసిరి అసెంబ్లీ నియోజక వర్గాలలో తిరిగి ప్రజల్లో ఈ వాహనం జనజాగృతి కల్పించనుంది. చించ్వడ్ ఎన్నికల అధికారి భానుదాస్ గైక్వాడ్ ఓట్ ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా వుండగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లాలో కేవలం 54.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 57.42 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కసరత్తు చేస్తోంది. మరోపక్క జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీధి సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రచార డిజిటల్ స్క్రీన్ల రథాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటీపడి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఎన్నికల కురుక్షేత్రం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దీనికి తోడుగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఎన్నికల సందడి మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ లడకత్, నోడల్ ఆఫీసర్ యశ్వంత్ మన్కేడ్కర్, అన్నా బోదడే, శరద్ మాన్కర్, ప్రకాష్బన్, షబ్బీర్షేఖ్, అనిల్ పాసల్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాల వేగానికి కళ్లెం
పింప్రి, న్యూస్‌లైన్ : పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హైవేపై గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకెళ్తుంటాయి. గంటకు 80 కి.మీ వెళ్లాలనే వేగనియంత్రణను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో చాలా మంది వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వడగావ్, ఖండాలా వద్ద వాహనాల వేగాన్ని అంచనా వేయాలని, వేగంలో నియమ నిబంధనలు పాటించని వాహన దారులపై టోల్‌నాకా ప్లాజాల వద్ద చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. మితి మీరిన వేగంతో 30శాతం వాహనాలు ఈ మార్గంపై గంటకు కేవలం 80 కి.మీ. వేగంతో వాహనాలను నడపాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వాహనాలు గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని వాహనాలు గంటకు 170 కి.మీ. వేగంతో నడుస్తున్నట్లు పోలీసుల రికార్డులు తెలియజేస్తున్నాయి. వారం రోజులుగా సుమారుగా 172 వాహనాలు వేగ నిబంధనలు పాటించ లేదని హైవే మార్గాల విభాగ పోలీసు ఇన్స్పెక్టర్ సుధీర్ అస్పట్ తెలిపారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. హైవేపై ప్రమాదాలను నివారించడమే వేగనియంత్రణ ఉద్దేశమని చెప్పారు. -
సీటే ముఖ్యం.. పార్టీ కాదు
పింప్రి, న్యూస్‌లైన్ : సీటే ముఖ్యం.. పార్టీ కాదు.. అన్నట్టుగా అభ్యర్థులు ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీల జెండాలను మోయడానికే పరిమితమైన రెండవ తరగతి నాయకులకు తమ పార్టీ టెక్కెట్ ఇవ్వక పోవడంతో గుర్తింపు పొందిన పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ-రిపబ్లికన్ మధ్య పొత్తు ఉండేనా.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తోనే ఉండాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు రాందాస్ అఠావలే ప్రకటించినా ఆ పార్టీ అభ్యర్థులు అనేక మంది పలు నియోజక వర్గాల్లో నామినేషన్లు వేశారు. పుణే లోని వడగావ్ శేరి నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ కాంబ్లే నామినేషన్ వేయగా ఆర్పీఐ నుంచి నవనాథ్ కాంబ్లే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ తుదివరకు పోటీకి నిలబడుతుందో వేచి చూడాలి. ఆయా పార్టీ నాయకుల మాటలను అభ్యర్థులు ఎంత వరకు పాటిస్తారో? అధినాయకత్వం వీరిపై ఏ చర్యలు తీసుకోనుందో తేలాల్సి ఉంది.? మూడు పార్టీలు మారిన జగతాప్... ఐదేళ్ల కిందట చించ్వడ్ నుంచి కాంగ్రెస్‌కు సీటు లభించలేదు. పొత్తులో భాగంగా ఎన్సీపీకి సీట్ కేటాయించారు. దీంతో లక్ష్మణ్ జగతాప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా మావల్ నుంచి శేత్గారి కామ్‌గార్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. తిరిగి ఎన్సీపీ గూటికి చేరుతాడన్న ఊహాగానాలు ఉండగా, చివరికి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా చించ్వడ్ అసెంబ్లీ నుంచి నామినేషన్ వేశారు. పార్టీలు మారిన నాయకులు... పుణే మాజీ ఉప మేయర్ దీపక్ మానకర్ కాంగ్రెస్‌ను వీడి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేయగా, గతంలో ఎన్సీపీ నుంచి పోటీ చేసిన సచిన్ తావరే శివసేన పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన మాజీ ఎమ్మెల్యే శరద్ డమాలే ఈసారి భోర్ బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్ మిలింద్ ఏక్బోటే శివాజీనగర్ నుంచి శివసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఆంబేగావ్లో శివసేన ఎంపీ శివాజీరావు ఆడల్రావుకు కుడి భుజంగా ఉన్న జైసింగ్ ఎరండే బీజేపీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. జున్నర్‌లో శివసేన మాజీ పంచాయతీ సమితి సభ్యుడు నేతాజీ డోకే బీజేపీ అభ్యర్థిగా అవతారమెత్తారు. శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ దత్తా బహరట్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించడం, ఓటర్ల మనస్సు గెలుచుకోవడం, అభ్యర్థులకు ఈసారి కత్తిమీద సాముగా మారనుంది. -
ఏ సెగ్మెంట్లో ఎవరికెంత బలం..?
పింప్రి, న్యూస్‌లైన్ : అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ ఏ నియోజక వర్గం ఎవరికో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార పీఠం కోసం సీట్ల పేచీ కొలిక్కిరాలేదు. పశ్చిమ మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో గతంలో చేసుకొన్న పొత్తులు తారుమారు అయ్యే సూచనలున్నాయి. కొందరు నాయకుల సీట్ల కోసం పార్టీలను సైతం మారే పరిస్థితులున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీల నాయకులు జంప్ జిలానీలుగా అవతారమెత్తారు. శివసేన-బీజీపీకి సమాన బలం షోలాపూర్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లలల్లో కాషాయ కూ ట మిలో భాగంగా శివసేన 8, బీజేపీ 3 పోటీ చేస్తూ వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో శివసేన 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక్కటీ గెలుచుకోలేకపోయింది. బీజేపీ రెండు స్థానాల్లో గెలిచి, ప్రస్తుతం అధిక సీట్లకు పోటీ చేయాలని భావిస్తోంది. ఈ జిల్లాలో పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నాయని పలువురి అభిప్రాయం. చోటా మోటా నాయకులు శివసేనలోకి వెళ్లిపోవడంతో ఈ సారి కొంత బలం పుంజుకొంది. గ్రా మీణ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో జంప్ జిలానీల మూలంగా శివసేన బలపడుతోంది. సాంగ్లీలో సత్తా ఉన్న నాయకులే కరువు సాంగ్లీ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలల్లో సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా అటు బీజేపీకి గానీ ఇటు శివసేనకు గానీ లేదు. కండబలం, ధన బలం ఉన్న అభ్యర్థులు లేరు. జిల్లాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. సాంగ్లీ నుంచి సంభాజీ పవార్, జత్ నుంచి ప్రకాష్ శేండగే, మిరజ్ నుంచి సురేష్ ఖాడే ఉన్నారు. శివసేనకు ఇక్కడ అంత బలం లేదు. శివసేనకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి ఉంది. పుంజుకొంటున్న బీజేపీ సతారా జిల్లాలోని 8 నియోజక వర్గాలల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నాయకులు బీజేపీలో చేరడంతో జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంది. మాజీ ఎమ్మెల్యే దిలీప్ యేలాగావ్కర్, సదాశివ్ సత్కాల్, రవీంద్ర సరామణే ఇతరుల రాకతో బీజేపీ కదం తొక్కుతుండగా, శివసేనకు 5 నియోజక వర్గాలలో అభ్యర్థుల కరువు నెలకొంది. కూటమితో ఫలితం అహ్మద్‌నగర్ జిల్లాలో మొత్తం 12 నియోజక వర్గాలల్లో మహా కూటమి లో భాగంగా గతంలో 7 నియోజక వర్గాలు అకోలా, సంగంనేర్, కోపర్గావ్, శ్రీరాంపూర్, శివ్డీ, నగర్, పార్నెర్ శివసేన ఆధీనంలో ఉండగా, రాహూరీ, శ్రీ గోందా, కర్జత్-జాంఖేడ్, శేవ్‌గావ్, నేవాసా నియోజక వర్గాలు బీజేపీకి ఉన్నాయి. జిల్లాలో సమానంగా పార్టీల బలం ఉంది. కూటమి ద్వారా పోటీ చేస్తే అటు బీజేపీ, శివసేనకు ప్రయోజనం ఉంటుంది. బబన్‌రావు పాచ్‌పుతే బీజేపీ లోకి రావడం ఆ పార్టీకి కొంత కలసివచ్చే అవకాశం ఉంది. పుణేలో ఒంటరిగానైనా సరే పుణే జిల్లాలో గతంలో బీజేపీ కసబాపేట్, శివాజీనగర్, పర్వతి, పింప్రి, మావల్, శిరూర్, దౌండ్, ఖడక్వాస్లా మొత్తం 8 నియోజక వర్గాల నుంచి పోటీ చేయగా, శివసేన వడగావ్ శేరి, కోత్రోడ్, పుణే కంటోన్మెంట్, హడప్సర్, ఖేడ్, ఆంబేగావ్, జున్నర్, భోర్, పురంధర్, బారామతి, ఇందాపూర్, చించ్వడ్, బోసిరి మొత్తం 13 నియోజక వర్గాలలో పోటీ చేసింది. సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా పార్టీలు బరిలోకి దిగితే.. కొందరు నాయకులు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉంది. దీని ద్వారా బీజేపీ బలం పెంచుకునే యోచనలో ఉంది. కొల్హాపూర్ శివసేనదే హవా కొల్లాపూర్ జిల్లాలో గతంలో 10 నియోజక వర్గాలలో 8 స్థానాలకు గాను శివసేన పోటీ చేయగా, రెండు స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. ఇచ్ఛల్ కరంజి నుంచి ప్రస్తుతం బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొల్హాపూర్, కర్వీర్, కాగల్, చందఘడ్, రాధనగరి, శిరోల్, హత్ కణంగలే, షాహువాడి నుంచి శివసేన పోటీ చేయగా, కొల్హాపూర్, కర్వీర్, మత్ కణంగల్ మాత్రమే శివసేన గెలుపొందింది. ఈ ప్రాంతాలలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ బలంగా ఉన్నారు. స్వభిమాన్ శేత్కారి సంఘటన... శివసేనకు చెందిన చందఘడ్, రాధనగరి, శిరోల్ స్థానాలకు ఎసరు పెట్టనుంది. -
అన్ని పార్టీల్లోనూ ఎన్నికల కళ
పింప్రి, న్యూస్‌లైన్ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఎట్టకేలకు వెలువడింది. ఎన్నికల తేదీలు కూడా ఖారారు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన వెలువరించడానికి ఉత్సాహపడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఆయాపార్టీలు హోరెత్తుతున్నాయి. ప్రచారాలు, అభ్యర్థుల బలప్రదర్శనలూ ఊపందుకొన్నాయి. అభ్యర్థుల నియమాకం ఖరారు కాకముందే ఎన్నికల వేడి రాజుకొంది. ఇంకా పార్టీల మధ్య పొత్తులు కొలిక్కిరానే లేదు. పొత్తులు ఫలించి, ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయితే అసలైన ఎన్నికల సందడి తెరమీదికి వస్తుంది. ఒక వేళ పొత్తులు వికటించినా ఎవరిదారిని వారే వెళ్లేందుకు కూడా బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. పది నియోజక వర్గాల్లో ఆశావహులు పుణే జిల్లాలో పది నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారనుంది. పుణే, పింప్రి-చించ్వడ్ నగరాలకు చెం దినవి కావు. పూర్తిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట ర్లు ఉంటారు. ఇందులో రైతులు అత్యధికంగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తే వారికే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్షేషకులు బావిస్తున్నారు. మావల్... మావల్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే బాలాబేడగే కొనసాగుతున్నారు. ఈ సారి బీజేపీ నుంచి తిరిగి బాలా బేగడే రంగంలోకి దిగడానికి నిర్ణయించుకొన్నారు. కానీ ఇక్కడ నుంచి జ్ఞానేశ్వర్ దల్వీ, చంద్రశేఖర్ బోస్లే దిగంబర్ బేగడే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. శివసేన నుంచి మచ్చీంద్ర ఖరాడే, రణశింగ్ ఫ్రంకణ్యస్ పోటీ పడుతున్నారు. ఎన్సీపీ నుంచి మావులీ దాబాడే, బాలాసాహెబ్ నేవాలేతోపాటు మరో 15 మంది ఈసీటు కోసం ఆశపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కిరణ్ గైక్వాడ్ పోటీకి సిద్ధమవుతున్నారు. శిరూర్-హవేలి... శిరూర్ -హవేలినియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన అశోక్ పవార్ కొనసాగుతున్నారు. ఈ సారి కూడా తనకే సీటు కేటాంచాలని ఆశోక్ ఆశిస్తుండగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ప్రదీప్ కదం, మంగళాదాస్ టికెట్ వేటలో ఉన్నారు. బీజేపీ నుంచి బాబూరావు పాచర్ణే ముందున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి సందీప్ బోండ్వే పేరు వినిపిస్తోంది. జున్నర్... జున్నర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన వల్లభ్ దత్తాత్రేయ కొనసాగుతున్నారు. ఈసారి సీటు కోసం అతుల్ బేనకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొత్తు వికటిస్తే కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాలాసాహెబ్ దాంగట్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెన్నెస్ నుంచి శరద్ సోన్వాణే, మకరంద్ పాటిల్ ఉండగా మహాకూటమి ఏర్పడక పోతే బీజేపీ నుంచి అడ్వకేట్ దత్తా బాగవతే, శివసేన నుంచి ఆశాతాయి బుచకే, పంచాయతి సమితి మాజీసభ్యులు నేతాజీ వోకే, సంభాజీ తాంబే, జిల్లా పరిషత్ సభ్యులు మావురీ ఇక్కడ నుంచి పోటీకి సిద్ధ మవుతున్నారు. దౌండ్... దౌండ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్సీపీకి చెందిన రమేష్ తోరట్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎన్సీపీ తరఫున రమేష్ తోరట్, తాలూకా పార్టీ అధ్యక్షులు అప్పా సాహెబ్ పవార్ పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నారు, కాంగ్రెస్ నుంచి తాలూకా అధ్యక్షులు పోపట్ భాయి టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి రాజా భావు తాంబే పేరు ముందున్నది. బీజేపీ నుంచి నాందేవ్, వాస్దేవ్ కాలే, రాహుల్ కూల్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇందాపూర్... ఇందాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా హర్షవర్ధన్ పాటిల్ (కాం గ్రెస్) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా హర్షవర్ధన్ పాటిల్ ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఎన్సీపీ నుంచి దత్తాత్రేయ భర ణే, పోటీకి సై అంటున్నారు. పొత్తు లేకపోతే వీరి మధ్యనే పోటీ ఉం టుంది. ఎమ్మెన్నెస్ నుంచి డాక్టర్ శశికాంత్ టికెట్ ఆశిస్తుం డగా, మహాకూటమి లేకపోతే బీజేపీ నుంచి మావూరీ చౌరే, శివసేన నుంచి విశాల్ బోంద్రే, నితిన్ కదమ్, శేత్కారి సంఘటన పార్టీ నుంచి ప్రదేశ్ అధ్యక్షులు విఠల్ పవార్ పేర్లు వినిపిస్తున్నాయి. పురంధర్-హవేలీ... పురంధర్-హవేలీ నియోజకవర్గంఎమ్మెల్యేగా విజయ్ శితారే (శివసేన)కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయ్ ఒక్కరే బరిలో దిగుతున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి బాబా జాధవ్ రావ్, గంగాధర్ జగదాలే సీటు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ టికవడే, సుధాంరావు ఇంగలే, దిగంబర్ దుర్గాడే పేర్లు వినిపిస్తున్నాయి. పొత్తులు లేకపోతే కాంగ్రెస్ నుంచి సంజయ్ జగతాప్ పొటీకి సై అంటున్నారు. భోర్-వేల్హా-ముల్షీ... భోర్-వేల్హా-ముల్షీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సంగ్రామ్ తోపట్ (కాంగ్రెస్) కొనసాగుతున్నారు. ప్రస్తుతం సంగ్రామ్కే తిరిగి సీటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోత్తులు లేకపోతే ఎన్సీపీ నుంచి రఘునాథ్ కింద్రే, రంజిత్ శివతారే, విక్రమ్ ఖట్వడ్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శివసేన నుంచి బాబాభావు బేడకే, కుల్ దీప్ కోండ్రే, శరద్ జమాలే పోటీ పడుతున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అభ్యర్థులు ఎవరూ లేరు. ఆంబేగావ్... ఆంబేగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దిలీప్ వల్సేపాటిల్ (ఎన్సీ పీ) కొనసాగుతున్నారు. ఈసారి టిక్కెట్ కోసం మంగళా దాస్ బాందల్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. శివసేన నుంచి జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు అరుణగిరే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ, ఎమ్మెన్నెస్ నుంచి పోటీకి ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. బారామతి... బారామతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కొనసాగుతున్నారు. అజిత్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీకే చెందిన చంద్రకాంత్ కదమ్ పోటీకి సిద్ధపడుతున్నారు. చంద్రకాంత్ అంధుడు కావడంతో ఇక్కడ పోటీ చర్చనీయాంశమైంది. ఎమ్మెన్నెస్ నుంచి వినోద్ భావలే, శివసేన నుంచి అడ్వకేట్ రాజేంద్ర కాలే పేర్లు వినిపిస్తుండగా, పోత్తులు లేకపోతే కాంగ్రెస్ నుంచి అడ్వకేట్ రవీంద్ర రణసింగ్, ఆకాష్ మోరే సీటు కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. ఖేడ్... ఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దిలిప్ మోహితే (ఎన్సీపీ) కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్సీపీ నుంచి పోటీ చేయాలని జిల్లా పరిషత్ సభ్యులు సురేష్ గోరే తీవ్రంగా కషి చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అశోక్ ఖాండేభరాడ్, శివసేన నుంచి రాం గావడే, అజిత్ బుట్టే పాటిల్, రాజేష్ జవలేకర్ ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. పొత్తు లేకపోతే కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షులు వందనా తాయి సాత్పుతే పోటీ చేయాలని చూస్తున్నారు. పొత్తులపై చర్చలు షురూ ప్రస్తుతం పొత్తులపై ఆయా పార్టీలో చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా సీట్లు తారుమారైతే, పార్టీల సీట్లు రాకపోతే, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగేందుకు వెనుకాడేది లేదని కొందరు తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా పార్టీలకు పొత్తులు, అభ్యర్థులు, సీట్లు, రెబల్ల బెడదతో తలనొప్పిగా మారింది. అభ్యర్థులను ఒకే తాటిపైకి తేవాలనే పార్టీల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
పింప్రిలో డెంగీ వ్యాధి జోరు
పింప్రి, న్యూస్‌లైన్ : నగరంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. అనేకమంది ఇప్పటికే ఈ వ్యాధిబారినపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఆరోగ్య విభాగం యుధ్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపీడితుల సంఖ్య స్వల్పంగానే ఉంది. కాగా ఈ వ్యాధి మరింత విజృం భించే అవకాశముందంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విభాగం అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అంతేకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే ఈ సూచనలను కార్పొరేషన్లు పట్టించుకోకపోవడంతో డెంగీ పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దోమల నివారణకు మందులను సమకూర్చకపోవడం, మొక్కుబడిగా నోటీసులు పంపడం తదితర కారణాల వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి. దీనికి తోడు వాతావరణం కూడా దోమల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసింది. గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి డెంగీ రోగుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఈ వ్యాధిపీడితులకు ప్రాథమిక దశ నుంచే పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని, అంతేకాకుండా ర్యాపిడ్ యాక్షన్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని జిల్లా పరిషత్ ఆరోగ్య అధికారి డాక్టర్ నందకుమార్ దేశ్‌ముఖ్ తెలిపారు.వాతావరణంలో మార్పులే డెంగీకి కారణమని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ పేర్కొన్నారు. నగరవాసులకు ఈవ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామన్నా రు. పుణేలో ఈ ఏడాది జూన్‌లో 279 మంది, జూలైలో 630 మంది, ఆగస్టులో 591మంది, సెప్టెంబరులో 466 మంది ఈ వ్యాధిబారినపడ్డారు. డెంగీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని నియంత్రించే దిశగా కార్పొరేషన్ ఆరోగ్య విభాగం అడుగులు వేస్తోంది. దోమలు బాగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించడం ప్రారంభించింది. స్వార్గేట్ ప్రాంతంలో టైర్లను ఉంచిన ప్రదేశాలలో దోమల ఉత్పత్తిని గమనించిన కార్పొరేషన్ అధికారులు సంబంధిత దుకాణదారులకు రూ. పదివేల మేర జరిమానా విధించారు. మరో 38 ప్రదేశాలను గుర్తించి సంబంధితులకు నోటీసులను జారీ చేశామని కార్పొరేషన్ కీటక నాశిని విభాగం అధికారి డాక్టర్ సంజీవ్ వావరే తెలిపారు. డెంగీ రోగుల సంఖ్య నానాటికీ పెరగడం రాజకీయ పార్టీలకు ఓ ఆయుధం లభించినట్లయింది. దీనిపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న కార్పొరేషన్ కమిషన ర్ కుణాల్ కుమార్ ఆరోగ్య శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారిని పరిశీలనకు పంపుతున్నారు. పుణేలోనూ... పుణే నగరంలోనూ నానాటికీ ఈవ్యాధిపీడితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చికిత్సకు అవసరమైన ప్లేట్లెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు నెలలో నగరంలో ప్రతి రోజూ సగటున 19 మంది ఈ వ్యాధి బారినపడగా, ఈ నెలలో ఆరంభం లో ఈ సంఖ్య 36కు చేరుకుంది. కాగా 15 రోజులుగా ప్లేట్లెట్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో బ్లడ్ బ్యాంకుల్లోనూ ఇవి లభించడం లేదని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి డాక్టర్ ఆన ంద్ చాఫేకర్ తెలిపారు.దాతల నుంచి తీసుకున్న రక్తంలోని ప్లేట్లెట్లను వేరుచేసేందుకు ఐదు రోజులు పడుతోందన్నారు. -
13 వేల పాఠశాలల మూసివేత
పింప్రి, న్యూస్‌లైన్: ప్రభుత్వం పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉంటే మూసివేయాలని డీఐఎస్ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ఇలాంటి పాఠశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీన్ని అమలు చే యాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసింది. పాఠశాలలు నడవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం కూడా మూసివేత దిశగా రంగం సిద్ధం చేస్తుంది. ఆయా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, మూతపడే పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 13 వేల పైచిలుకు ఉన్నాయి. ఈ మేరకు ఆయా జిల్లా విద్యాధికారులు ఆయా పాఠశాలకు నోటీసులను అందజేశారు. గత సంవత్సరమే సూచన విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని గత సంవత్సరమే డీఐఎస్ఈ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రభుత్వానికి సూచించింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకొంది. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లో వివిధ పథకాల ద్వారా విద్యార్థులను పెంచడం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. గ్రామాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు విద్యార్థులను చేరవేసేందుకు వాహనాల ఏర్పాటు తదితర సౌకర్యాలు కల్పించింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. విద్యార్థులు పాఠశాలలకు రాని పరిస్థితులను అధ్యయనం చేసింది. చివరకు మూసివేత వైపే మొగ్గుచూపుతోంది. అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే.. వెంటనే ఈ పాఠశాలలను మూసివేయ వద్దని రాష్ట్ర శిక్షణ మంత్రాలయం చెబుతున్నా, ప్రభుత్వం మాత్రం మూసివేసేందుకే మొగ్గు చూపుతోంది. గత సంవత్సరం ఉపాధ్యాయులు సేకరించిన వివరాల ప్రకారం 13,905 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మరాఠీ, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సింధి, తమిళం, తెలుగు పాఠశాలలు ఉన్నాయి. 3,700 పాఠశాలల్లో పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్థానిక స్వరాజ్య సంస్థలకు అప్పగించింది. ఇట్లాంటివి 13 వేల పాఠశాలలు ఉన్నాయి. పుణే, కొంకణ్ జిల్లాలో ఈ పాఠశాలల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇందులో తెలుగు మీడియం పాఠశాల పుణే దేహు రోడ్ కంటెన్మెంట్లో ఉంది. మూతబడే పాఠశాలలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పైరవీలు ప్రారంభం
పింప్రి, న్యూస్‌లైన్: అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో పుణే పార్లమెంటుస్థానంలోని స్థానాల్లో పోటీకి అవకాశం దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల 15న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తు, మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతానికైతే అన్ని పార్టీల టికెట్లకూ భారీ పోటీ ఉంది. పుణే పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన బీజేపీ ఈ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకోగలిగింది. ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న కల్మాడీ ఆశలకు గండి కొట్టిన కాంగ్రెస్.. అవినీతిపరులకు టికెట్ ఇచ్చేది లేదని చెబుతూ విశ్వజిత్ కదమ్‌ను పోటీ నిలిపింది. దీంతో కల్మాడీ కాంగ్రెస్ కదమ్‌కు సహకరించలేదు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం పుణేకు వచ్చినా కాంగ్రెస్ ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీస్థానాల్లో పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయింది. బీజేపీ సునాయాసంగా 3.15 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే ఈ నియోజక వర్గంలోని ఆరు అసెంబ్లీ సీట్లలో కస్బాపేట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే గిరీశ్ బావట్ ప్రాతినిత్యం వహిస్తుండగా, పర్వతి నుంచి బీజేపీకే చెందిన మాధురి మీనల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కోత్రోడ్డు స్థానం నుంచి శివసేన నాయకుడు చంద్రకాంత్ మోకాటి, శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు వినాయక్ నిమ్హర్, కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ నాయకుడు రమేష్ బాగావే, వడగావ్‌శేరి నుంచి ఎన్సీపీ నాయకుడు బాపు సాహెబ్ పఠారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పుణేలోని ఆరు నియోజకవర్గాల్లో మూడుసీట్లలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి, మూడుసీట్లలో శివసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్‌కు వెన్నులో వణుకు మొదలైంది. బీజేపీ కస్బాపేట్ అభ్యర్థి శిరోలే 58 వేల ఓట్ల ఆధిక్యం సాధించగా, పర్వతి స్థానంలోనూ బీజేపీ 69 వేల మెజారిటీ సాధించింది. కోత్రోడ్డు బీజేపీ అభ్యర్థి 91 వేల మెజారిటీకి పెరిగింది. ఇతర నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు కూడా మంచి మెజారిటీ సాధించారు. కస్బాపేట్ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ తిరిగి ఇదే స్థానం నుండే సీటును ఆశిస్తుండగా, హేమంత్ రసనే, గణేష్ చిడకర్, అశోక్, ధీరజ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మన్సే నుంచి గతంలో పోటీ చేసిన రవీంద్రకు టికెట్ లభించడం కష్టమేనని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మన్సే నుంచి పోటీ చేసిన దీపక్ పాయ్గుడేకు ఆయన సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత మన్సే కార్పొరేటర్ రూపాలీ పాటిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పర్వతి నుంచి మాధురి మీనల్ గత ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన సచిన్ తావరేను ఓడించారు. అయితే ఈమెను కస్బాపేట్ నుంచి పోటీ చేయించి, పర్వతి నుంచి మాజీ ఎంపీ పురీష్ రావత్‌ను లేదా మాజీ మంత్రి దిలీప్ కాంబ్లేను నిలపాలని బీజేపీ యోచిస్తున్నది. కాంగ్రెస్ నుంచి అభయ్ ఛాజ్డ్, ఎన్సీపీ నుంచి కార్పొరేషన్ సభాగృహ నేత సుభాష్ జగతాప్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. శివాజీ నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే వినాయక్ నిమ్హణ్ త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నాయకులు దత్తాఖాడే, ఎంపీ అనిల్ శిరోలే కుమారుడు సిద్దార్థ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వికాస్ మటకరి కూడా తన ప్రయత్నం చేస్తున్నారు. మన్సే నుంచి రంజిత్ శిరోలే పేరు వినిపిస్తున్నది. కోత్ రోడ్డు నుంచి శివసేన నాయకుడు చంద్రకాంత్ మోకటే గెలుపొందగా, ఈసారి ఇక్కడి నుంచి పోటీకి సేన నగరాధ్యక్షుడు శ్యాం దేశ్‌పాండే, మాజీ మంత్రి శశికాంత్ సుతార్తోపాటు ఇతని కుమారుడు ప్రస్తుత కార్పొరేటర్ పృథ్వీరాజ్ సుతార్ ఉత్సాహం చూపిస్తున్నారు. మన్సే నుంచి కిషోర్ శిందే, గజానన్ మారణే పోటీలో ఉండగా, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు, కార్పొరేటర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ బాగలే తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. అయితే కార్యకర్తల్లో రమేష్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. వడగావ్‌శేరి ఎన్సీపీ ఎమ్మెల్యే బావు సాహెబ్ పటారేకే ఈసారి కూడా టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ మాత్రం మోడీ ప్రభావంపై గంపెడాశలు పెట్టుకుంది. -
పుణే మేయర్‌గా దత్తా
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర మేయర్ పదవికి అధికారపక్షం ఎన్సీపీ కార్పొరేటర్ దత్తాత్రేయ ధనకవడే, ఉప మేయర్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్ ఆబా బాగుల్ బుధవారం నామినేషన్లు వేశారు. కార్పొరేషన్లో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీరి ఎన్నిక లాంఛయప్రాయమే. నగర మేయర్, ఉప మేయర్ పదవులకు సెప్టెంబరు 15న ఎన్నికలు జరుగుతాయి. రాబోయే రెండున్నర సంవత్సరాలకు గాను మేయర్ పదవి ఓపెన్ కేటగిరి వెళ్లడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా వ్యవహరించాయి. ఎన్సీపీ నుంచి మేయర్ అభ్యర్థిత్వం కోసం దత్తాత్రేయతోపాటు బాబురావు, ప్రశాంత్ జగతాప్, వికాస్ దాంగట్, బాలా సాహెబ్, సచిన్ దొడకే దరఖాస్తు చేసుకున్నారు. చివరికి దత్తాత్రేయను ఎన్సీపీ తన అభ్యర్థిగా నిర్ణయించింది. రాబోయే ఎన్నికల్లో కులం, ప్రాం తం కీలకం కాబట్టి అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించాయి. ప్రస్తుతం ధన్గార్ల రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రంగా కొనసాగుతోంది. వీరు పలు ప్రాంతాల్లో హింసాత్మకం ఆందోళనలకు పాల్పడ్డారు కూడా. అన్ని విధాలా వెనకబడ్డ తమకు ఎస్టీలుగా గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపు మరాఠాల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కులాలు కీలకంగా మారాయి. మేయర్ అభ్యర్థిత్వాన్ని ఎస్సీలకు కట్టబెట్టాలని కొందరు, మరాఠాల కని కొందరు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి ఉప మేయర్ కోసం ఏడుగురు దరఖాస్తు చేయగా, ఆబా బాగుల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం పుణే కార్పొరేషన్లలో బలాబలాలు ఇలా ఉన్నాయి. ఎన్సీపీ-54 , కాంగ్రెస్ 26, బీజేపీ-26, శివసేన-15, ఎమ్మెన్నెస్‌కు 28 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. -
కిరాతక బస్సు డ్రైవర్‌కి ఉరి ఖరారు
పింప్రి, న్యూస్‌లైన్: అడ్డదిడ్డంగా బస్సు నడిపి తొమ్మిది మందిని బలి తీసుకున్న ఎమ్మెస్సార్టీసీ బస్సు డ్రైవర్ సంతోష్ మానే పెట్టుకున్న పిటిషన్‌ను మంగళవారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. సెషన్స్ కోర్టు గతంలో విధించిన ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా పుణేలో 2012 జనవరి 25న బస్టాండులో నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సును బయటికి తీసుకొచ్చిన మానే నగర వీధుల్లో అడ్డగోలుగా నడపడంతో తొమ్మిది మంది చనిపోగా, 37 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై 2013లో విచారణ జరిపిన సెషన్స్ కోర్టు మానేకి ఉరి శిక్ష విధించింది. తాను మానసిక రోగినని పేర్కొంటూ మానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ సమయంలో తన వాదనను సెషన్స్ కోర్టు వినిపించుకోలేదని ఆరోపించాడు. దీనిపై పునర్విచారణ జరిపిన హైకోర్టు మానసిక రోగినంటూ మానే గతంలో పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా ఉరి శిఖను ఖరారుచేసింది. మానేపై హత్య, హత్యాయత్నం, దాడికి పాల్పడడం, బస్సు చోరీ, ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చడం తదితర నేరాల కింద సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.కె.శెవాలే అప్పట్లో ఉరిశిక్ష విధించిన సంగతి విదితమే. -
శాసనసభ ఎన్నికలు పైరవీలు మొదలు
పింప్రి, న్యూస్‌లైన్ : శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉండడంతో ఈసారి ఏవిధంగానైనా టికెట్లు సాధించి మళ్లీ శాసనసభకు ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నగరమంతటా పర్యటిస్తున్నారు. తాము ఏమిచేయాలనుకుంటున్నామనే విషయాన్ని ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) చెందిన 36 మందికిపైగా కార్పొరేటర్లు ఈసారి ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారు. శాసనసభకు వెళ్లేందుకు కార్పొరేటర్ పదవి రాజమార్గంగా కనిపించడంతో టికెట్‌కోసం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నారు. నగరంలోని ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య పెరిగే అవకాశముంది. పార్టీల మధ్య పొత్తులు, ఏ నియోజక వర్గం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలోనూ ఔత్సాహికులతోపాటు, ప్రస్తుత ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు. గతంలో కార్పొరేషన్ పదవులను చేపట్టిన వారే ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులయ్యారు. ఇంకా విశేషమేమిటంటే గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటిదాకా కార్పొరేటర్ పదవుల్లో కొనసాగిన బాపు పఠారే, మాధురీ మిసాల్, చంద్రకాంత్ మొకాటే, మహాదేవ్ బాబర్లు ఎమ్మెల్యేలయ్యారు. దివంగత రమేష్ వాంజలే కూడా గతంలో కార్పొరేటరే. ఆయన ఆకస్మిక మరణంతో స్థానిక కార్పొరేటర్ బీంరావు టాప్కిర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే అనిల్ బోస్లే కూడా కార్పొరేటర్‌గా పనిచేస్తూనే శాసనసభ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా వీరితోపాటు భాయి వైద్, రమేష్ భాగవే, మాజీ మంత్రి చంద్రకాంత్ ఛాజెడ్, బాలాసాహెబ్ శివర్కర్, శశికాంత్ సుతార్,అనిల్ శిరోలే, అడ్వొకేట్ వందనా చవాన్ తదితరుల కార్పొరేటర్ స్థాయినుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులస్థాయికి ఎదిగినవారే. రాజకీయాల్లో ఇప్పుడు తొలి అర్హత కార్పొరేటర్‌గా ఎన్నికవడమే. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిలో కసబాపేట్ నుంచి గణేష్ బిడకర్, హేమంత్ రసణే, ముక్తా తిలక్, రవీంద్ర ధంగేకర్, రూపాలీ పాటిల్, దీపక్ మన్కర్, అరవింద్ షిండే, ఉదయ్ కాంత్ అందేకర్లు ఉన్నారు. అదేవిధంగా పుణే కంటోన్మెట్ నుంచి అజయ్, ప్రశాంత్, ప్రదీప్ గైక్వాడ్ ఉన్నారు. శివాజీనగర్ నుంచి దత్తా బహిరట్, మేధా కులకర్ణి, రాజు పవార్ ఉన్నారు. ఇంకా సుభాష్ జగ్తాప్, శివలాల్ భోస్లే, అశ్వినీ కదమ్, దినేష్ ధాడవే, రవీంద్ర మాలవడకర్, అడ్వొకేట్ అభయ్ ఛాజెడ్, ఆబా బాగుల్, శ్రీనాధ్ భిమాలే, రాజేంద్ర శిలీమరకర్లు ఉండగా, ఖడక్వాస్లా నుంచి వికాస్ దాంగట్, శంకర్ కేమసే, దిలీప్ బరాట్, దత్తా ధనకవడే, సచిన్ దోడకే, వసంత మోరే ఉన్నారు. హడప్సర్ నుంచి సునీల్ (బండు గైక్వాడ్) చేతన్ తుపే, వైశాలీ బన్కకర్, ప్రశాంత్ జగ్తాప్, ఆనంద్ అలకుంటే, నానా భానిగిరే, వడగావ్‌శేరి నుంచి బాపురావ్ కర్ణేగురూజీ, ఉషా కలమేకర్, సచిన్ భగత్. కోత్రోడ్ నుంచి అడ్వొకేట్ కిశోర్ షిండే, జయశ్రీ మారణే, పృథ్వీరాజ్ సుతార్, ప్రమోద్ నిమ్హణ్ తదితరులు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కార్పొరేటర్‌కు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది? వారిలో ఎవరు గెలుపొందుతారు? అనే విషయం తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. -
పెరుగుతున్న బాల నేరస్తులు
పింప్రి, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు బాల నేరస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మిగతా రాష్ట్రాలన్నింటికంటే మహారాష్ట్రలో బాల నేరగాళ్ల సంఖ్య అధికమని తేలింది. ఏటా వీరి సంఖ్య పెరుగుతూనే ఉన్నట్టు దీని అధ్యయనంలో వెల్లడయింది. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశ, సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది బాలలు చెడుదారి పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుంచి సత్ప్రవర్తనను అలవాటు చేయకపోవడంతో నేరాలకు సులువుగా ఆకర్షితులవుతున్నారని తెలియజేస్తున్నారు. బాలనేరస్తుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గలవారు 90 శాతం మంది తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య విపరీతంగా పెరిగిందని ముంబై పోలీసుశాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. 2000లో రాష్ట్రవ్యాప్తంగా బాలనేరస్తులు 1,641 నేరాలకు పాల్పడగా, 2010 నాటికి ఇది 4,315కు చేరుకుంది. 2011లో 4,775 నేరాలు నమోదు కాగా, 2012-13 మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాలనేరస్తుల విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్ర... ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి తోసి ముందువరుసలో నిలుచుంది. రాష్ట్రంలో అత్యధికంగా బాల నేరాలు ముంబై మహానగరంలో జరుగుతుండగా, ఆ తర్వాత స్థానాల్లో పుణే, ఠాణే, నాసిక్ ఉన్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ వివరాల ప్రకారం.. ఏడు నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. 2011లో నమోదయిన 89 శాతం నేరాలను 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలలే చేశారని తేలింది. ఈ నేపథ్యంలో బాల నేరస్తుల కనీస వయస్సు 18 నుంచి 16కు తగ్గించాలన్న డిమాండ్ ప్రజల్లో వెల్లువెత్తింది. ఇలా తగ్గిస్తే బాల నేరస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. మైనర్లు తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ శిక్ష అనుభవించాల్సిన వయస్సు కాకపోవడంతో వీరిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వీరికి సత్ప్రవర్తన, క్రమశిక్షణ, చదువు నేర్పుతున్నారు. చిన్న వయసులోనే హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు వంటి తీవ్ర నేరాలు పాల్పడడానికి సోషల్ మీడియా దోహదపడుతోందని సామాజికరంగ నిపుణులు అంటున్నారు. టీవీలు, ఇంటర్నెట్ వంటి చోట్ల నేరాల ఘటనలను చూసి ప్రేరణ పొందుతున్నారని విశ్లేషించారు. ఢిల్లీలో నిర్భయ కేసు, అదేవిధంగా ముంబై శక్తిమిల్‌లో జరిగిన అత్యాచారాల కేసుల విచారణ సందర్భంగా బాల నేరస్తుల వయస్సును తగ్గించాలని ప్రతిపాదన రావడం తెలిసిందే. సులువుగా వచ్చే డబ్బుతో బాల నేరస్తులు చెడు అలవాట్లకు కూడా బానిసలవుతున్నారు. మైనర్లు నేరాలకు పాల్పడ్డా, చిన్న వయసు కావడం వల్ల త్వరగా బెయిల్ వస్తోంది. దీంతో వీరు మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఎన్సీఆర్బీ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 2003లో మొత్తం 17,16,120 నేరాలు జరగ్గా అందులో బాల నేరస్తులవే 17,811 కేసులు ఉన్నాయి. 2004లో బాలల నేరాలు 19,229 నమోదు కాగా, 2005లో 18,939, 2006లో 21,088, 2007లో 22,865, 2008లో 24,535, 2009లో 23,926, 2013లో 31,725 ఇలా ప్రతి ఏడాది బాలల నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. -
ములా, ముఠా నదులకు మహర్దశ
పింప్రి, న్యూస్‌లైన్ : ములా, ముఠా నదులకు మహర్దశ పట్టనుంది. పుణే నగరం నడిబొడ్డున మురికి కాలువలుగా మారిన ఈ నదుల ఆధునికీకరణకు పుణే కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం 715 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. మురికి నీటి కాలువలుగా పారుతున్న ఈ రెండు నదుల రూపురేఖలు మారనున్నాయి. నిధుల సమీకరణ ఇలా.. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెరైక్టరేట్ (ఎన్‌ఆర్‌సీడీ)కు నివేదించింది. ఈ ప్రణాళిక రూపుదిద్దుకోవడానికి కేంద్రం 50 శాతం నిధులు, 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం నిధులను పూణే కార్పొరేషన్ సమకూర్చాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాను పుణే కార్పోరేషన్ సమకూర్చుకుంటుంది. ఈ విషయాన్ని కేంద్రానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. 25న జాయ్కో కంపెనీ సర్వే ఈ నిధుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం జపాన్‌కు చెందిన జాయ్కో కంపెనీకి పంపించింది. మొత్తం నిధుల్లో 85 శాతం నిధులను ఇవ్వడానికి ఆ కంపెనీ సిద్ధమైందని కార్పొరేషన్‌కు చెందిన అధికారి పేర్కొన్నారు. దీనికి సంబంధించి నదుల పరిసరాలను సర్వేను జరపడానికి కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం ఈ నెల 25వ తేదీన నగరానికి రానున్నారని తెలిపారు. అనంతరం నిధులను అందించే విషయంపై ఆ కంపెనీ తుది నిర్ణయం తీసుకొంటుంది. వచ్చే సంవత్సరం మార్చి నుంచి నదుల ఆధునికీకరణ పనులు జరుగనున్నాయని తెలిపారు. -
మేయర్ కిరీటం ఎవరికో..
పింప్రి, న్యూస్‌లైన్: నిబంధనల ప్రకారం పుణే నగర మేయర్ పదవి రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి) మారడంతో పైరవీలు, సిఫార్సులకు తెరలేచింది. అన్ని కులాల కార్పొరేటర్లు ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పుణే కార్పొరేషన్లో ప్రస్తుత కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్సీపీ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఈ పార్టీ కార్పొరేటర్లంతా మేయర్ పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపిక ఎన్సీపీ కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం కార్పొరేషన్లో అధికారం కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి చేతిలో ఉంది. వచ్చే నెల 15వ తేదీలోపు మేయర్ పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇవి జరుగుతుండడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. దీనికితోడు ఏ కులం/వర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఎన్సీపీ కార్పొరేటర్లు దిలీప్ బరోటే, దత్తా ధనకవడే, బాబూరావు చాండేరే, బాలా సాహెబ్ బోడకే, వికాస్ దాంగట్, విశాల్ తాంబే, చేతన్ తూపే, ప్రశాంత్ జగతాప్తోపాటు మరికొందరు అటు మేయర్ ఇటు ఎమ్మెల్యే టికెట్లకు పోటీపడుతున్నారు. మేయర్ పదవి దక్కనివారంతా అసెంబ్లీ అభ్యర్థిత్యానికి పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలలో పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్సీపీ నాయకులు వేరే పార్టీల్లో చేరారు. ఈసారి కూడా ఇలాగే జరిగితే పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రిజర్వేషన్ల ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. ఎన్సీపీ మరాఠా రిజర్వేషన్లకు అనుకూలమనే ముద్ర పడింది. దీంతో పలు కులాలు ఈ పార్టీపై కన్నెరజేస్తున్నాయి. ధన్‌గార్, వడార్ కులస్తులు తమను ఎస్టీలుగా గుర్తించాలంటూ రోడ్లెక్కారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధిపతి పవార్ తాము కూడా ధన్గార్ల రిజర్వేషన్లకు అనుకూలమేనని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంకటస్థితిలో నగర మేయర్ పదవి జనరల్ కేటగిరికి కేటాయించారు. సభాపక్ష నాయకుడు సుభాష్ జగతాప్ను మేయర్‌గా ఎన్నుకున్నా ఆశ్శర్యపడవలసిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తాము ఏ ఒక్క కులానికీ కొమ్ముకాయటం లేదని చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఎన్సీపీ భావిస్తోంది. అంతేగాక దళిత ఓటర్లను దగ్గర చేసుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్లో పార్టీల వారీగా బలాబలాలు ఎన్సీపీకి 56 మంది, కాంగ్రెస్-29, ఎమ్మెన్నెస్-28, బీజేపీ-26, శివసేన-15 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్సీపీ నుంచి మేయర్లుగా పనిచేసిన వారు రాజలక్ష్మీ భోసులే, మోహన్ సింగ్ రాజ్‌పాల్, వైశాలీ బన్కర్ ఉండగా, ప్రస్తుతం చంచలా కోడ్రే కొనసాగుతున్నారు. -
పుణేలో భారీ చెత్త డిపో
పింప్రి, న్యూస్‌లైన్: వ్యర్థాల నియంత్రణలో భాగంగా పుణేలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో కొత్త డంపింగ్‌యుర్డు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చిన చెత్త డిపో సమస్య ప్రస్తుతం కొలిక్కి వచ్చినట్లు ఉప- ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా పొగవుతున్న చెత్తను ఉరులి దేవాచి గ్రామానికి తరలిస్తున్నారు. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉరులి గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేగాక బాధితులు తరచూ అనారోగ్యం బారినపడుతున్నారు. ఇక్కడి నుంచి చెత్త డిపోను మరో చోటికి తరలించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామంలో చెత్తను పోగు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో వ్యర్థాల భారీ ఎత్తున పోగవుతున్నాయి. గత బుధవారం నుంచి నగరంలోని చెత్త కుప్పలు తెప్పలుగా పడి చుట్టు పక్కల దుర్గంధం వెదజల్లుతోంది. గత బుధవారం నుంచి నగరంలో ప్రస్తుతం సుమారు 4.5 వేల టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. అనేక చోట్ల చెత్త రోడ్లపైకి వచ్చి చేరింది. ఈ విషయంపై ప్రజలు కార్పోరేషన్‌కు ఎన్ని ఫిర్యాదులు చేసినా ‘ముఖ్యమంత్రిని సంప్రదించండి’ అంటూ కార్పొరేషన్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ సమస్య గురించి ఎవరికి విన్నవించుకోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఉరులి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంపై స్పందించిన పవార్, చెత్త డిపోను శివారుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేవించారు. అక్కడ 300 ఎకరాల్లో వ్యర్థాల గుంతను నిర్మిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందున ఈ విషయమై ప్రకటన చేయలేదని పవార్ వివరణ ఇచ్చారు. -
పడకేసిన ఆరోగ్య పథకం
పింప్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకం పుణే జిల్లాలో పడకేసింది. ఈ పథకం గురించి నగర వాసుల్లో సరైన అవగాహన, ప్రచారం కల్పించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పథకం గురించి తెలిసిన వైద్యులు కూడా సరైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యకార్డులను అందజేయడానికి పౌర సరఫరా విభాగం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించింది. కానీ గ్రామ పంచాయతీలల్ల్లో ఆన్లైన్ సదుపాయం లేదు. కార్డుల పంపిణీ మరింత జటిలంగా మారింది. జిల్లాలోని అనేక గ్రామాలల్లో కార్డుల పంపిణీ జరగలేదు. కార్డులు లేని నిరుపేదలు ఈ పథకానికి నోచుకోవడం లేదు. 972 జబ్బులకు ఉచిత శస్త్రచికిత్సలు పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి రాజీవ్ గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 972 రకాల జబ్బులకు శస్త్రచికిత్స, మందుల ద్వారా చికిత్సలతోపాటు 121 రకాల వైద్యపరమైన పరీక్షలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నేషనల్ ఇన్సూరెన్స కంపెనీ సహకారంతో నడుపుతోంది. రూ.1.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు వైద్య ఖర్చులల్లో 50 శాతం భరిస్తుంది. లక్ష రూపాయల ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు 100 శాతం ఉచితంగా వైద్య ఖర్చులను అందిస్తుంది. ఈ వివరాలను పేద ప్రజల చెంతకు తీసుకు పోయినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ చికిత్సలను ఏఏ ఆస్పత్రులల్లో అందిస్తారో చాలా మందికి తెలియదు. ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలు పేదలకు అందకుండా పోతున్నాయి. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదుల చేయ్యాలో తెలియకపోవడంతో రోగులు డాక్టర్ల వద్ద మొరపెట్టుకొంటున్నారు. జిల్లా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్లు సలాహా ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారే తప్ప సహకరించడం లేదు. అంతేకాకుండా ఈ పథకం కింద అంతేకాకుండా ప్రయోజనం జరగకపోగా, కొందరు అక్రమంగా సేవలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అందినకాడికి దండుకోవడమే..
పింప్రి, న్యూస్‌లైన్ : అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల్లోనూ దండుకొంటున్నారు. రోగుల నుండి అత్యధికంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్‌నెస్‌లేని వాహనాలను వినియోగిస్తున్నా రు. కొన్ని అంబులెన్సుల్లో కనీస సౌకర్యాలు లేవు. సామాజిక, రాజకీయ పార్టీలనుండి అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి అంబులెన్స్ ప్రారంభిస్తున్న వారి ఆగడాలను అరికట్టే దిక్కులేకుండా పోయింది. ఇష్టమొచ్చినట్లు రోగుల బంధువుల నుండి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆపదలో ఉన్న రోగులు, బంధువులుకూ ఇబ్బం దులు తప్పడం లేదు. తనిఖీలు నిల్ ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల అంబులెన్సులల్లో వైద్య సదుపాయాలను ఆయా ఆస్పత్రిలే తనిఖీల ను చేస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అం బులెన్సులను ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఒక్కో అంబులెన్సులో ఒక్కో ధరను వసూలు చేస్తున్నా యి. పుణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న అంబులెన్సులను పరిశీలిస్తే.. సంస్థల ద్వారా 288 అంబులెన్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- 326, కేంద్ర ప్రభుత్వం ద్వారా-11, శిక్షణ సంస్థల ద్వారా-8, స్వయం సేవా సంస్థల ద్వారా 110, స్థానిక సంస్థల ద్వారా-32, ఇతరులు-2 మొత్తం నగరంలో 1351 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. సౌకర్యాలు ఉండేవి..ఉండనివి.. అంబులెన్సులు రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీటిలో ప్రత్యేక సదుపాయాలు ఉండవు. ఇవి కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. రెండో రకం అంబులెన్సులల్లో సిలిండర్ , స్ట్రెక్చర్, ఈసీజీ మిషన్, సిరంజ్‌పంప్, డెఫ్రి బ్రిలేటర్ (హృదయ సంబంధించిన యం త్రం) బ్లడ్ ప్రెషర్ మిషన్, వెంటి లేటర్ సెక్షన్ మిషన్, నెబులైజర్, మాస్కులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, నర్సు, డాక్టర్లు, టెక్నీషియన్ ఉంటారని ససూన్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షులు డాక్టర్ డి.బి.కులకర్ణి పేర్కొన్నారు. ఆర్టీవో పరిశీలనకు దూరం ఆర్టీవో ద్వారా అంబులెన్సుల వాహనంలో అన్ని మిషన్ విడిభాగాలను పరిశీలిస్తారు. భద్రతా పరం గా ఈ వాహ నం ఫిట్నెస్ను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆర్టీవో జారీ చేస్తుంది. ఇలా ప్రతి ఏడాది పరిశీ లి స్తోంది. ఇందుకు ప్రతి అంబులెన్స్ నుండి రూ.300 రుసుం వసూలు ఆర్టీవో అధికారులు వసూలు చేస్తా రు. ప్రస్తుతం నగరంలో సేవలందిస్తున్న 1,351 అంబులెన్సులకు 561 అంబులెన్సు లు ఆర్టీవో వద్ద తనిఖీలు జరపనే లేదు. 2012 తర్వాత ఒక్కసారి కూడా వీటిని పరిశీలించిన దాఖ లాలు లేవు. అంబులెన్సుల పనితీరును పరిశీలించడం తమ పని కాదని పుణే కార్పొరేషన్ ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఎస్.టి.పరదేశీ తెలిపారు. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి : ఆర్టీవో ఈ విషయమై ఆర్టీవో అధికారి జితేంద్ర పాటిల్ మాట్లాడుతూ..ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోం, స్వయం సేవా సంస్థల ద్వారా మొత్తం 1,351 అంబులెన్సులు నడుస్తున్నాయన్నా రు. ఇందులో 790 అంబులెన్సులు ఫిట్నెస్ పరీక్ష లు చేయించుకున్నాయని, కొత్త అంబులెన్సులను ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి, పాత అంబులెన్సులను ప్రతి సంవత్సరం తప్పక పరిశీలించాల్సి ఉందన్నారు. ఫిట్నెస్ పరీక్షలు తప్పకుండా జరుపుకోవాలని, లేకుంటే ఆ వాహనాన్ని అన్ ఫిట్ వాహనాలుగా ప్రకటిస్తామని తెలిపారు. -
వేధిస్తే ఫిర్యాధు చేయాలిలా
పింప్రి, న్యూస్‌లైన్ : విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు చేసే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలల సమితి, పోలీసులు సంయుక్తంగా ఫిర్యాదుల బాక్స్‌లను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 4 పోలీస్ జోన్లు 8 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్‌లపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులను లైంగికంగా వేధించడం, మభ్యపెట్టడం లాంటి విషయాల సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తు న్నారు. ఆయా పాఠశాలల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బాక్సులల్లో ఫిర్యాదులు వేయాలని సూచిం చారు. పోలీసులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. సామాజిక సంస్థల స్ఫూర్తి.. 2005 జనవరిలో యరవాడా పోలీస్ స్టేషన్, సమాజ్ సేవకులు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చి నగరంలో బాలికలపై అత్యాచారాలను అరికట్టడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వివిధ పాఠశాలలకు వెళ్లి మార్గదర్శనం, పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేసింది. ఈ క్రమంలో పాఠశాలల్లో ఆడపిల్లలపై విచక్షణ, వేధింపులు తగ్గడాన్ని గమనించి అదే ఫార్ములాను నగరంలోని 4 పోలీస్ జోన్ల పరిధిలోని పాఠశాలల్లో అమలు చేయడానికి పోలీస్ డిప్యూటీ కమిషనర్ మనోజ్ పాటిల్ కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ప్రతి హైస్కూలులో ఈ ఫిర్యాదు బాక్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో గల 21 పాఠశాలల్లో బాక్స్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్రతి బాక్స్‌పై ఫోన్ నంబర్ ఉంటుంది. బాక్స్లల్లోని ఫిర్యాదులను చూసే బాధ్యతను వారానికో పోలీసు అధికారికి అప్పగించారు. ఈ బాక్స్‌లపై పాఠశాల సిబ్బంది పెత్తనం నిర్వహించడానికి వీలు కాదు. విద్యార్థినులు తమపై ఎవరైనా వెకిలి చేష్టలు, వేధించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఫిర్యాదుల బాక్స్‌లను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
ప్రయాణం నరకప్రాయం ఫిట్‘లెస్’
పింప్రి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం అనే పిలుపునకు అర్థంలేకుండా పోతోంది. పుణే నగరంలో బస్సులను ఆశ్రయించే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోజూ ఏదో ఓ చోట దుర్ఘటనలు సంభవిస్తునే ఉన్నాయి. పీఎంపీఎల్‌కు చెందిన బస్సుల్లో వెళ్లాలాంటే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్)కు చెందిన బస్సులు పుణే వాసుల పాలిట శాపంగా మారాయి. ప్రతి ఏడాది ఈ బస్సుల కారణంగా దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. పీఎంపీఎంఎల్ ఉదాసీనత, డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా ఈ దుస్థితి నెలకొన్నది. ఇటీవల సాధువాస్వానీ చౌక్ వద్ద జరిగిన ప్రమాదంలో సంస్థకు చెందిన బస్సుల ప్రామాణికతపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆరు నెలల కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 మంది పీఎంపీ బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. పాతబడిన బస్సులు పాతబడిన ఈ బస్సులు ప్రజల పాలిట శాపంగా మారాయి. పీఎంపీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న బస్సులకు ఫిట్నెస్ ఉండడం లేదు. ఈ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్సుల్లో ఆయిల్ లీకేజీ వల్ల బ్రేకులు వేసినా పడకపోవడంతో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొన్ని బస్సులకు అద్దాలు లేవు. ఇటీవల హడప్సర్లో ఒక పీఎంపీ బస్సులో ఇంజన్‌కు మంటలు అంటుకున్నాయి. డ్రైవరు గాయపడ్డాడు. వరుసగా గురువారం, శనివారాలల్తో సతారా మార్గంపై జరిగిన ప్రమాదాల్లో ఒక్కొక్కరు మరణించారు. బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడంతో బస్సులో ఉన్న ప్రయాణికురాలు ఎగిరి బయట పడి మరణించింది. పలువురు గాయపడ్డారు. ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఏళ్ల కాలంలో ఈ బస్సుల మూలంగా నగరంలో 40కి పైగా మరణించారు. ఇప్పటికైనా పీఎంపీ బస్సులను మార్చి డ్రైవర్లకు శిక్షణ మెళకువలను నేర్పించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ పీఎంపీ పీఆర్వో దీపక్ పరదేశి మాట్లాడుతూ.. పీఎంపీ బస్సు డ్రైవర్లకు శిక్షణ మెళకువలను అందిస్తున్నామన్నారు. మైలేజీ ఎలా పెంచుకోవాలి అనే వాటిపై కూడా సంస్థ శిక్షణ ఇస్తుందని, బస్సుల ప్రమాదాల కారణంగా మరణించిన తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటిని నివారించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ‘పెట్రోలింగ్ కన్జర్వేటర్ రిసెర్చ్ (పీసీఆర్ఐ) ఆధ్వర్యంలో ప్రతి డ్రైవర్‌కు మూడు రోజుల శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇందులో మొదట డ్రైవరు బస్సు నడిపే పద్ధతిని గమనిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని గమనించి శాస్త్రీయ పద్ధతిలో వాహనాన్ని ఎలా నడపాలో శిక్షణ ఇస్తారని దీపక్ పరదేశి వివరించారు. -
అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
పింప్రి, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చరిత్ర సృష్టించబోతున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అటవలే ధీమా వ్యక్తం చేశారు. పుణేలో ఆదివారం నిర్వహించిన సత్తా పరివర్తన్ (అధికారంలో మార్పు) మేళావాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఓడించిన విధంగానే త్వరలో అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్పీఐకి 20 అసెంబ్లీ సీట్లను ఆగష్టు 15వ తేదీ లోపు కేటాయిచాలని, అదేవిధంగా ఏ ఏ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తున్నారనే విషయాన్ని మహాకూటమి నేతలు ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలకు 15 ఏళ్లుగా తాము మద్దతు ఇచ్చామని, ఇకపై వారిని ఓడించేందుకు మహాకూటమిలో చేరుతున్నామన్నారు. సునీల్ తట్కరేను రాష్ర్ట ఎన్సీపీ అధ్యక్షుడిగా చేసిన్నంత మాత్రాన గెలవలేరని, అతని సత్తా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. మాలిన్ గ్రామ ప్రజల పునరావాసానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సహ్యాద్రి పర్వత ప్రాంతాల కింద ఉన్న ప్రమాదకర గ్రామాలను గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. కర్నాటకలో సరిహద్దుల్లో జరుగుతున్న కన్నడ మరాఠీల వివాదాన్ని రాజ్యసభలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఆర్పీఐ సీనియర్ నేత అవినాష్ మహాతేకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాందాస్ ఆటవలేకు చోటు కల్పించాలని ప్రధాన మంత్రి మోడిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ కార్యకర్తల విన్నపం మేరకు పుణేలోని కంటోన్మెంట్, వడగావ్ శేరి, పింప్రి అసెంబ్లీ స్థానాలను ఆర్పీఐకే కేటాయించాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తా పరివర్తన్ పశ్చిమ మహారాష్ట్ర విభాగ రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాజాభావు సరవణే, రాష్ర్ట కోశాధికారి ఎం.డి.శేవలే, పార్టీ కార్పొరేషన్ నాయకుడు సిద్దార్థ్ ఘోండే, యూత్ అధ్యక్షులు పరుశురాం వడేకర్, నగర అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణ మాసానికి సర్వం సిద్ధం
పింప్రి, న్యూస్‌లైన్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీక్షేత్ర భీమశంకర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏటా ఈ క్షేత్రం శ్రావణమాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, పచ్చటి తోరణాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలను కూడా పెంచినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నేటి నుంచి శ్రావణయాత్ర.. శ్రావణమాసంలో వచ్చే తొలి సోమవారమైన నేటి శ్రావణ యాత్ర ప్రారంభంకానుంది. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, ఇతర సదుపాయాలను కూడా పూర్తి చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సేవలను కూడా ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నారాయణ్ గావ్ విభాగానికి చెందిన అశోక్ హండే తెలిపారు. 25 మంది పోలీసు ఉన్నతాధికారులు, 200 మంది సీనియర్ అధికారులతోపాటు పెద్దమొత్తంలో సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నార ని పోలీస్ అధికారి గిరీష్ దీగావ్కర్ తెలిపారు. యాత్ర ఏర్పాట్లను ఆంబేగావ్ ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, సునీల్ తోఖే, ఖేడ్ ప్రాంతీయ అధికారి హిమాంత్ ఖరాడే, జున్నర్ తహశీల్దారు ప్రశాంత్ అవట్, అటవీ సంరక్షణ సహాయ అధికారి కీర్తి జయదోడే, భవన నిర్మాణ విభాగ అధికారి ఎ.బి.దేవడే, ప్రాంతీయ నగరాభివృద్ధి అధికారులు రత్నాకర్, సురేష్, విద్యుత్ మండలి అధికారి ఎస్.ఎస్.గీతే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.