regional parties
-
Haryana: ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ మధ్యలో లోకల్
అధికార బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్. వీటికి తోడు ఐఎన్ఎల్డీ, జేజేపీ, బీఎస్పీ. ఇలా నానా పార్టీలతో కిక్కిరిసిపోయిన హరియాణా రాజకీయ రంగస్థలంపై ఆసక్తికరమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెర లేచింది. ఎన్ని పార్టీలున్నా రాష్ట్రంలో ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటూ వస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాకే ఇచ్చింది. 2019లో రాష్ట్రంలో మొత్తం పదికి పది లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా ఈసారి వాటిలో సగానికి సగం ‘హస్త’గతమయ్యాయి. ఆ ఊపుతో రెట్టించిన ఉత్సాహంతో కని్పస్తున్న కాంగ్రెస్‌ను నిలువరించడం కమలనాథులకు అగి్నపరీక్షే కానుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు రెండు ప్రధానపార్టీల్లో ఎవరి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది...కురుక్షేత్రయుద్ధం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణా ఓటర్లు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది. 90 అసెంబ్లీ సీట్లకు గాను 40 స్థానాలతో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లున్న జేజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం రాష్ట్రంలో ఓటరు తీర్పు స్పష్టంగానే ఉండనుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ‘‘బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అద్దంపట్టాయి. ఆ పార్టీకి ఓట్ల శాతం భారీగా తగ్గింది’’ అని వారంటున్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), బీఎస్పీ వంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి పుట్టి పుట్టి ముంచుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఆ పార్టీలు బాగా బలహీనపడ్డా వాటికి పడే ఓట్లు అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకం కానున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు కాంగ్రెస్ ఓటుబ్యాంకునే చీల్చి తమను ఒడ్డున పడేస్తారని బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. దానికి తోడు ఎప్పట్లాగే జాటేతర ఓట్లన్నీ తమకే పడతాయంటోంది. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో జాతీయాంశాలు, మోదీ ఫ్యాక్టర్ వంటివేవీ లేవు గనుక బీజేపీ ఓటు బ్యాంకుకు మరింత భారీగా గండి పడటం ఖాయమని చెబుతోంది. ముళ్లబాటలో బీజేపీ... 2014లో హరియాణాలో సొంతంగా అధికారం సాధించిన బీజేపీ, 2019లో జేజేపీ పొత్తుతో దాన్ని నిలుపుకుంది. ఈసారి మాత్రం ఆ పార్టీకి పరిస్థితి ముళ్లబాటనే తలపిస్తోంది. జాటేతర ఓట్లన్నీ గుండుగుత్తగా పడటం రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల వికాసానికి ప్రధాన కారణంగా నిలిచింది. దాంతో మనోహర్‌లాల్ ఖట్టర్ రూపంలో జాటేతర నేతను బీజేపీ సీఎంను చేసింది. ఆయన తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగారు. రైతు ఆందోళనలు, గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న సవాలు నేపథ్యంలో గత మార్చిలో నాయబ్‌సింగ్ సైనీ రూపంలో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఎత్తుగడ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా కలిసి రాకున్నా ఏకంగా 35 శాతమున్న ఓబీసీ ఓట్లను ఒడిసిపట్టే లక్ష్యంతో సైనీ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. అగ్ర కులాల, పట్టణ ఓటర్లపై పట్టును నిలుపుకునేందుకూ బీజేపీ ప్రయతి్నస్తోంది. వారికి వరుసగా తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్‌లాల్ బదోలీ రూపంలో ఇప్పటికే అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీకి అధ్యక్షున్ని చేసింది. ప్రచార దూకుడూ పెంచనుంది.అడ్వాంటేజ్ కాంగ్రెస్, కానీ...! ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం భూపీందర్ హుడా, ఆయన కుమారుడు దీపీందర్, పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్, సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మొత్తం 90 అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ కలియదిరుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే భూపీందర్, సెల్జా వర్గాల కుమ్ములాటలు పార్టీని కలవరపెట్టే అంశం. ఈ ఇంటి పోరును ఏ మేరకు కట్టడి చేస్తుందన్న దానిపైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది రాజకీయ వర్గాల అంచనా.ప్రాంతీయ పార్టీలన్నీ కుదేలే... జేజేపీ, ఐఎన్ఎల్డీ రెండూ కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26 శాతమున్న జాట్లే వాటి ప్రధాన బలం. వారు ఇటీవల కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. రైతుల ఆందోళనలు తారస్థాయిలో ఉన్న వేళ బీజేపీకి కొమ్ముకాయడం జేజేపీకి భారీగా చేటు చేసింది. జాట్లు పూర్తిగా దూరమయ్యారు. జేజేపీ ఓటు బ్యాంకుకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గండికొట్టింది. ఈసారి బీఎస్పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్ఎల్డీదీ ఇదే పరిస్థితి. నేతల కీచులాటలు పార్టీని బాగా కుంగదీస్తున్నాయి. బీఎస్పీతో గతంలో పెట్టుకున్న పొత్తు దారుణంగా వికటించిన అనుభవం మరింత భయపెడుతోంది. ఆప్ పరిస్థితీ అంతంతే... పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఊపులో హరియాణాలోనూ పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్న సంకేతాలు కని్పంచడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను దూరం పెట్టి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది!జేజేపీ... కకావికలైన కింగ్‌మేకర్ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ). 2018 డిసెంబర్లో హరియాణా రాజకీయ యవనికపై పుట్టుకొచ్చిన కొత్త పార్టీ. చౌతాలా కుటుంబంలో కుమ్ములాటల ఫలితంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) నుంచి వేరుపడి దుష్యంత్ చౌతాలా ఏర్పాటు చేసుకున్న జేజేపీ 2019లో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగింది. 10 సీట్లే గెలిచినా హంగ్ ఏర్పడటంతో కింగ్‌మేకర్‌గా మారింది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి నానా ఎదురుదెబ్బలతో బాగా బలహీనపడింది. 2021 రైతు ఆందోళన సమయంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించకపోవడం జేజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. అనంతరం రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల బరిలో దిగి బీజేపీకి పూర్తిగా దూరమైంది. దీనికి తోడు అసమ్మతి, ఫిరాయింపులతో దుష్యంత్ చౌతాలాకు తల బొప్పి కడుతోంది. గత ఏప్రిల్‌లో జేజేపీ రాష్ట్ర చీఫ్ నిషాన్‌సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే బీజేపీకి జైకొట్టారు. దుష్యంత్ తండ్రి అభయ్ చౌతాలాకు అత్యంత నమ్మకస్తునిగా మెలిగిన ఎమ్మెల్యే అనూప్ ధనక్ శుక్రవారం పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు పార్టీలో దుష్యంత్, ఆయన తల్లి, మరో ఎమ్మెల్యే మాత్రం మిగిలారు. ఈ నేపథ్యంలో పునరై్వభవం దేవుడెరుగు, పార్టీ పుట్టి మునగకుండా చూసుకోవడమే దుష్యంత్‌కు పెను సవాలుగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొచి్చన జాట్, రైతు, దళిత ఓట్లు రాష్ట్రంలో నిర్ణాయక శక్తి అయిన జాట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. వారికి తోడు రైతు, దళిత ఓట్లు కూడా ఆ పార్టీకే భారీగా పడ్డాయి. 90 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 42 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించినట్టు ఓటింగ్ సరళి తేలి్చంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా చుట్టడం తెలిసిందే. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దానికి 30 స్థానాలకు మించలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలుపులు.. మలుపులు.. ప్రాంతీయ పార్టీల ‘జాతీయ’ బంధాలు..
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ కూటమిలో భాగస్వామి అయితేనే ప్రయోజనమా అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ విధానాలు, తమ సిద్ధాంతాలు, తమ వెనుక ఉండే ఓట్ బ్యాంక్ ఆధారంగా జాతీయ పార్టీల కూటమిలో కలవాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పూర్తి అవకాశవాదంతో ఎటు వెళితే ఉపయోగమని అనుకుంటాయో అటు వెళుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకప్పుడు రాష్ట్రాలలోని రాజకీయాలలో అంతగా తలదూర్చేవి కావు. కానీ రాను, రాను అవి కూడా ప్రాంతీయ పార్టీల ధోరణిలో ఆలోచించడం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పట్టు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా జాతీయ పార్టీలతో చెలిమి చేస్తున్నాయి.స్వాతంత్రం వచ్చినప్పటినుంచి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వాటిలో అనేకం జాతీయ పార్టీలలో విలీనం అవడమో, లేక పొత్తు పెట్టుకుని మనుగడ సాగించడమో చేశాయి. నాయకత్వ స్థాయిని బట్టి అవి కొంతకాలం నిలబడగలుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచినా, అనతికాలంలోనే పడిపోయింది. ఒంటరిగా పోటీచేసి అధికారం సాధించలేకపోవడంతో తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తన ప్రయాణం ఆరంభించి 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దశకు ఎదిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా ఉంటేనే ఏపీలో అధికారం సాధించగలుగుతామని నాయకత్వం భావించి పొత్తుపెట్టుకుంది. అది ఫలించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయి రెండు చోట్ల అధికారం పొందింది. టీఆర్ఎస్ తెలంగాణ సాధనకు ఏర్పాటైన ఉద్యమ పార్టీ కనుక కొద్దికాలానికే కూటమి నుంచి విడిపోయింది. తదుపరి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం పొందలేకపోయింది.ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రం రావడం, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేసి అధికారం సాధించడంతో పార్టీకి ఖ్యాతి వచ్చింది. తొమ్మిదినర్రేళ్లపాటు పవర్ లో ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ వంటి పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం విశేషం. కానీ 2023లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలవడంతో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! ఒక దశలో బీజేపీతో స్నేహంగానే ఉన్నా, మరో సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకరించినా ఒంటరిగానే రాష్ట్రంలో రాజకీయం చేసింది.ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా మారడంతో బీఆర్ఎస్(పేరు మారిన టీఆర్ఎస్) ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం సాధించడానికి యత్నిస్తున్న పార్టీ కావడం, బీజేపీ పొత్తు వల్ల తమకు ముస్లిం మైనార్టీల మధ్దతు రాదేమోనన్న అనుమానంతో పొత్తు వైపు బీఆర్ఎస్ చూడలేదు. పైగా తనకు మళ్లీ అధికారం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఏదో ఒక కూటమిగానే ఉండడం విశేషం. తొలుత సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తదుపరి కాలంలో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో స్నేహం సాగించింది.1994, 1996, 1998లలో వామపక్షాలతో కూటమి కట్టిన టీడీపీ 1999 లో బీజేపీ వైపు జంప్ చేసింది. 2004లో ఓటమి తర్వాత 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. అది ఫలించలేదు. దాంతో తిరిగి 2014 నాటికి బీజేపీతో జత కట్టి లాభం పొందింది. అప్పుడే ఏర్పడిన జనసేన కూడా ఉపయోగపడింది. 2018లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ కూటమిలో టీడీపీ చేరి తెలంగాణలో పోటీ చేసింది. అది సఫలం కాకపోవడంతో 2019 ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అలాగే జనసేన కూడా 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టినా ప్రయోజనం కలగలేదు. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ అధినాయకత్వం ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఖర్చీఫ్ వేసింది. ఈలోగా టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించి తన తరపున పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వ్యూహాలలో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి. తొలుత బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా, జనసేన ఒత్తిడితో మళ్లీ టీడీపీని ఎన్డీఏ లో చేర్చుకున్నారు. అది సత్ఫలితాన్ని ఇచ్చి రాష్ట్రంలో అధికారం పొందడమే కాక, కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇచ్చే దశకు టీడీపీ చేరుకుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రయాణం సాగించారు. దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2019లో విజయం తర్వాత వైఎస్సార్సీపీ కనుక ఎన్డీఏ లో చేరి ఉన్నట్లయితే కేంద్రంలో తనకు మంచి పట్టు లభించినట్లయ్యేది. కానీ తన వెనుక ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉంటుందన్న భావనతో అలా చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీతో ఉన్న స్నేహం కారణంగా, కాంగ్రెస్ తో సరిపడదు కనుక ఎన్డీఏకే అవసరమైన అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి వారి అభిమానాన్ని పొందారు.2024 ఎన్నికల ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం వైఎస్సార్సీపీకి పొత్తు ఆఫర్ ఇచ్చినా అందుకు సిద్దపడలేదని చెబుతారు. ఒకవైపు చంద్రబాబు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఉన్న ఆత్మ విశ్వాసంతో దెబ్బతిన్నారనిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఇప్పుడు కలవగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ మోదీపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్డీఏతో జతకట్టడానికి సిద్దపడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో పదకుండు మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు వైఎస్సార్సీపీకి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిదని చెప్పాలి. అలా వైఎస్సార్సీపీ చేస్తుందో, లేదో తెలియదు.ఒడిషాలో బిజు జనతాదళ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అవడంతో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అదే ఎలాగొలా రాజీపడి పొత్తుపెట్టుకుని ఉంటే నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారేమో! అంటే జాతీయ పార్టీతో పొత్తుతో చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నేతలు రాజకీయంగా, ఇతరత్రా లబ్దిపొందుతుండడం గమనించదగ్గ అంశం.ఇతర రాష్ట్రాలను చూస్తే తమిళనాడులో డీఎంకే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇది ఈసారి లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రతిఫలించింది. అన్నా డీఎంకే గతంలో మాదిరి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నష్టపోయింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక అండ పొందిందని చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంలతో పోటీ పడుతోంది. ఇదేమీ కొత్త కాదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు పరస్పరం పోటీ పడుతాయి. ఢిల్లీ స్థాయిలో మాత్రం కలిసి ఒక కూటమిగా ఉంటున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ఆ తరహా ప్రయత్నాలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ మొన్నటి వరకు ఏ కూటమిలో లేదు. బీజేపీ నుంచి తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటోంది. మద్యం స్కామ్ పేరుతో ఆప్ ను బీజేపీ దడదడలాడిస్తోందన్న భావన ఉంది. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇండి కూటమిలో చేరారు. బీహారులో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలం కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి, మరికొంతకాలం బీజేపీతో కలిసి రాజకీయం సాగిస్తూ ఇంతవరకు సఫలం అయ్యారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతో జట్టుకట్టడం ఉపయోగపడింది.ఢిల్లీ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్.సీ.సీలలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్నాటకలో బీజేపీతో జెడిఎస్ జట్టుకట్టడం వల్ల కేంద్రంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి మంత్రి కాగలిగారు. జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటాయి. సిక్కింలో ఘన విజయం సాధించిన సిక్కిం ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.ఓవరాల్ గా చూసినప్పుడు వీలైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో కూటమిలో భాగస్వామి అవడమో లేదా సత్సంబంధాలు పెట్టుకోవడమో చేయక తప్పని పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. అధికార పార్టీతో వీలు కాకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో అయినా చేరితే ఏదో ఒక అండ దొరికినట్లవుతుందన్న భావన ఏర్పడుతోంది. దేశ రాజకీయాలలో ఇది అత్యంత కీలమైన పరిణామంగా కనిపిస్తుంది. లేకుంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్!
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్‌గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్‌సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్‌లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్‌లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్‌ను ఆయన కుమారుడు కుల్దీప్ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి ఈ పారిశ్రామిక హబ్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్‌పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్‌ను కాదని అశోక్ తన్వర్‌కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!
దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్‌సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది... ఇండియా కూటమిదే హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అవినీతి వర్సిటీకి చాన్సలర్ మోదీ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి. – చెన్నై రోడ్‌షోలో సీఎం స్టాలిన్ బీజేపీ పాగా వేసేనా? ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (ఎం)కు 3, ఎస్.రాందాస్‌కు చెందిన పట్టాలి మక్కల్ కచి్చకి 10, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‌సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. అన్నామలై... బీజేపీ తురుపుముక్క బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్‌బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. రాజధానిని నాగపూర్‌కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు – కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై ఐదుగురు ‘సినీ’ సీఎంలు తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నుండి తాజాగా విజయ్ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్ అన్నాదురై ముందుంటారు. ఇక కవిగా, స్క్రీన్‌ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్ వారసురాలైన స్టార్ హీరోయిన్ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు. తర్వాతి తరంలో విజయకాంత్ (ఎండీఎంకే), కమల్‌హాసన్ (మక్కల్ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఇండియా కూటమికే సర్వేల మొగ్గు తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే అంటోంది. అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే. – వెల్లూరు సభలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్‌కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్ మోడల్ కంటే ద్రవిడ మోడల్ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం. – డీఎంకే తరఫున ప్రచారంలో కమల్ హాసన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha polls 2024: గెలిస్తేనే నిలిచేది..!
ఈ లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే. వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం! ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ 2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్‌ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్‌సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు. బారామతిలో ఎవరిదో పరపతి! శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్‌కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు. ఓట్ల చీలిక.. సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు. కేడర్, ఓటర్ ఎటువైపు శరద్ పవార్, ఉద్దవ్లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్‌పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్‌లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు. – ముంబై -
బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..!
న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్‌కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, ఆప్ తర్వాత జేడీఎస్‌కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్‌కు ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: కర్ణాటక ఎన్నికలు: 517 నామినేషన్ల ఉపసంహరణ.. 209 స్థానాల్లో ఆప్ పోటీ -
ప్రాంతీయ పార్టీలూ.. జాతీయ ప్రయోజనాలు
‘‘ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ దేశం మొత్తానికి అవసరమైన జాతీయ దృష్టి లేదు. అవి మహా అయితే ఒక కులానికి లేదా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే అజెండాను మాత్రమే కలిగి ఉన్నాయి. మేమైతే దేశం మొత్తానికి తోడ్పడే దృష్టిని లేదా ప్రణాళికను జనం ముందుంచుతాం. మాకు జాతీయ సిద్ధాంతం ఉంది,’’ అంటూ మూడు నెలల క్రితం ఓ జాతీయపార్టీ అగ్రనేత మీడియాతో అన్నారు. కాని, ఈ ప్రకటన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో మూడు (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నేడు ప్రాంతీయపక్షాల పాలనలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతీయ పార్టీలూ (డీఎంకే, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ) అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ఎన్నికల ప్రణాళికలతో, సమగ్ర జాతీయ దృష్టితో ఈ ప్రాంతీయపక్షాలు పనిచేస్తున్నాయని ఆయా రాష్ట్రాల ప్రజలేగాక దేశ ప్రజల్లో అత్యధిక భాగం భావిస్తున్నారు. సంకీర్ణాలలో ప్రాంతీయ వాటా ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం సహా దాదాపు పది రాష్ట్రాల్లో ప్రాంతీపక్షాలు జాతీయపక్షాలతో ఎలాంటి గొడవపడకుండా పరిపాలన సాగిస్తున్నాయి. 1977 నుంచీ కేంద్రంలో అధికారం చేపట్టిన అనేక సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యపక్షాలుగా ప్రాంతీయపార్టీలు వ్యవహరించాయి. ఇంకా గతంలో పంజాబ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల్లో జాతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న చరిత్ర మనది. అనేక రాష్ట్రాల్లో జాతీయ ప్రయోజనాల పేరు సాకుగా చూపించి జాతీయపక్షాలు సక్రమంగా పరిపాలన సాగించకపోవడం, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించడం, ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయపక్షాలు విస్తరించడానికి దారితీశాయి. ఫలితంగా అనేక ప్రాంతీయపక్షాలు అనేక సందర్భాల్లో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి ప్రధాన హిందీ రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి వచ్చి మంచి పాలన అందించాయి. ప్రపంచీకరణతోపాటే ప్రాంతీయపక్షాల ప్రాభవం ప్రపంచీకరణ విశ్వవ్యాప్తమైన నేటి సందర్భంలో థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ (ప్రాపంచిక దృష్టితో ఆలోచించండి, స్థానికంగా ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టండి) అనే నేటి పరిస్థితులకు అనువైన మాటలను ప్రాంతీయపక్షాలు అమలు చేసి చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, నూతన రాజకీయ పరిస్థితులే నేడు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు, వాటి ప్రాభవానికి కారణమౌతున్నాయి. ప్రాంతీయపక్షాలు జాతీయ పార్టీల కృషికి సమాంతరంగా పరిపూరక పాత్ర పోషిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రాంతీయ పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో సురక్షితంగా పనిచేసుకుని బతుకుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి సంకుచిత ధోరణలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. చదవండి: పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు! 140 కోట్లకు పైగా జనాభా, 22 అధికార భాషలు ఉన్న విశాల భారతంలో జాతీయపక్షాలు, ప్రాంతీయపక్షాలు అన్నదమ్ముల్లా పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం జాతీయ పార్టీలకే విశాల జాతీయ దృక్పథం ఉంటుందని, ప్రాంతీయపక్షాలు ఓ ప్రాంతం లేదా కులానికే ప్రాతినిధ్యం వహిస్తాయని పైన చెప్పిన జాతీయపార్టీ నాయకుడు వ్యక్తం చేసిన అభిప్రాయం నిజం కాదని రుజువవుతోంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
Presidential Elections 2022: రాష్ట్రపతి భవన్ వైపు ముర్ము అడుగులు
దేశ ప్రథమ పౌరుడు, జాతి సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీకగా నిలిచే రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. దేశానికి 16వ రాష్ట్రపతి ఎన్నుకోవడానికి జూలై 18న ఓటింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికలకి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరి పోరు ఉన్నప్పటికీ ఎన్డీయే.. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికులు ముర్ముకే జై కొట్టడంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోరు ఏకపక్షంగా సాగుతుందన్న అంచనాలున్నాయి. ద్రౌపది వెంట 44 పార్టీలు ఉంటే, సిన్హాకు మద్దతుగా 34 పార్టీలున్నాయి. బీజేడీ, వైఎస్సార్సీపీలతో పాటు శివసేన, జేఎంఎం, టీడీపీ, అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి. దీంతో ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపైకెక్కడం లాంఛనమనే చెప్పాలి. ముర్ము గెలిస్తే దేశానికి రెండో మహిళ రాష్ట్రపతి అవుతారు. ఎన్నిక ప్రక్రియ.. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ఓటింగ్ రహస్య పద్ధతిలో జరుగుతుంది. దీంతో క్రాస్ ఓటింగ్‌కు అవకాశాలుంటాయి. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఇవ్వనున్నారు. బ్యాలెట్ పత్రాల్లో రెండు కాలమ్‌లు ఉంటాయి. అవే అభ్యర్థి పేరు, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. పోటీపడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యం ఓటు ఎవరికో తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ఓటు చెల్లుతుంది. రెండో ప్రాధాన్యం ఓటు ఐచ్ఛికం. విజేతని నిర్ణయించేది ఇలా .. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరిగితే, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. ప్రతీ ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారిపోతుంది. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువని పార్లమెంటు సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే దానిని ఎంపీ ఓటు విలువగా నిర్ధారిస్తారు. ఈ సారి జమ్ము కశ్మీర్ రాష్ట్రంగా లేకపోవడంతో 708గా ఉండాల్సిన ఎంపీ ఓటు విలువ 700కి తగ్గింది. ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఎలక్టోరల్ కాలేజీగా వ్యవహరిస్తారు. 776 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలు మొత్తంగా 4,896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,86,431 కాగా అందులో కనీసం 50% కంటే ఎక్కువ ఓట్లు పోలయిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. అంటే 5,49,442కి పైగా ఓట్ల విలువ వచ్చిన వారు అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతునివ్వడంతో ఆమెకు 6 లక్షలకుపైగా విలువైన ఓట్లు పోలవతాయని అంచనా. ఇంచుమించుగా మూడింట రెండు వంతుల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతభత్యాలు, జీవనం దేశంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి అందరికంటే రాష్ట్రపతి జీతం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకి రూ.5 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. 2018లో రూ.లక్షన్నర ఉన్న జీతాన్ని రూ.5లక్షలకు పెంచారు. న్యూఢిల్లీలోని 340 గదులు, హాళ్లు ఉన్న రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసం. అందులోనే బసచేస్తారు. వేసవి కాలం, శీతాకాలం గడపడానికి రెండు విడిదిలు ఉన్నాయి. వేసవి విడిది సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది హైదరాబాద్‌లో ఉంది. ప్రెసిడెంట్స్ బాడీగార్డ్(పీబీజీ) భద్రత ఉంటుంది. భారత ఆర్మీలో ఇదొక విభాగం. ఇక ఎక్కడికైనా ఉచిత ప్రయాణాలు, కావాల్సినంత మంది సిబ్బంది ఉంటారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ ఉన్న కారులో ప్రయాణిస్తారు. రిటైర్ అయిన తర్వాత రూ.లక్షన్నర పెన్షన్, ఉచిత నివాసం, ఫోన్, అయిదుగురు సిబ్బంది, ఉచిత ప్రయాణ సదుపాయాలు ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ రాష్ట్రపతి అధికారాలు–విధులు ► రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. ప్రధాన కార్యనిర్వాహణాధికారి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ రాష్టపతి పేరు మీదే నిర్వహించాలి ► దేశ కార్యనిర్వాహణ అధికారిగా రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీం కోర్టు, హైకోర్టుల జడ్జీలు, ఆడిటర్ జనరల్ ఆర్థిక సంఘాలను నియమిస్తారు. ప్రధానమంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు. ► పార్లమెంటు ఆమోదించిన ఏ బిల్లయినా రాష్ట్రపతి సంతకం తర్వాతే చట్టరూపం దాల్చుతుంది. బిల్లులో తనకి నచ్చని అంశాలు ఉంటే రాష్ట్రపతి వెనక్కి తిరిగి పంపే అధికారం ఉంది. రాష్ట్రపతి సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ సభలో ప్రవేశపెట్టకూడదు. ► దేశంలో త్రివిధ బలగాలకు అధిపతి రాష్ట్రపతి. ► దేశంలో అంతర్యుద్ధం చెలరేగి భద్రత అదుపు తప్పినా, సైనిక తిరుగుబాటు జరిగినా, విదేశాలు దండయాత్రకు దిగినా అత్యవసర పరిస్థితి విధించే అధికారం రాష్ట్రపతిదే. ► సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షలపైన క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ► ప్రధాని, మంత్రిమండలి లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. కానీ దేశ నిర్ణయాలను తెలియజెప్పే ఒక అధికారిక హోదా, గౌరవం ఈ పదవికి ఉన్నాయి. -
Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళ సగర్వంగా కూర్చోవడం ఖాయమైనట్టే. ప్రాంతీయ పార్టీల నుంచి రోజురోజుకూ పోటెత్తుతున్న మద్దతు నేపథ్యంలో రాష్టపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(ఎస్), అకాలీదళ్, శివసేన, జేఎంఎం, టీడీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలుపగా తాజాగా యూపీలో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ సంకీర్ణ భాగస్వామి, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) కూడా ఈ జాబితాలో చేరింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేస్తారని రాజభర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు ఏకంగా 62 శాతం దాకా ఓట్లు ఖాయమయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువయ్యే సూచనలు కూడా కన్పిస్తున్నాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆమె ఓటర్లు 50 శాతం కంటే తక్కువే తేలారు. ఆదివాసీ మహిళ కావడం, రాష్ట్రాలన్నీ చుడుతూ మద్దతు కోరుతుండటంతో ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మొత్తం 10,86,431 ఓట్లకు ఆమెకు ఇప్పటికే 6.68 లక్షల ఓట్లు ఖాయమైనట్టే. ఎస్పీతో తమ బంధం కొనసాగుతుందని రాజ్‌భర్ చెప్పినా, ముర్ముకు మద్దతు నిర్ణయంతో దానికి బీటలు పడ్డట్టేనని భావిస్తున్నారు. -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్‌లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్‌కు ఈ వైల్డ్‌కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
మమత నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి!
గువాహటి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024) బీజేపీని గద్దెదించడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి రూపుదిద్దుకుంటోందని రాజోర్ దళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ అన్నారు. ప్రాంతీయ శక్తుల సమాఖ్యగా ఏర్పడి.. మమతా బెనర్జీ తమ కూటమి నేతగా ప్రజల ముగింటకు వెళతామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థపై తమకున్న విశ్వాసం, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజోర్ దళ్‌ను విలీనం చేయాలని మమత కోరారని, దీనిపై తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ఆదివారం వెల్లడించారు. రాజోర్ దళ్‌ను విలీనం చేస్తే టీఎంసీ అస్సాం శాఖ అధ్యక్షుడిని చేస్తానని తనకు మమత హామీ ఇచ్చారని అఖిల్ చెప్పారు. విలీనంపై ఇప్పటికే మూడుదఫాలుగా చర్చలు జరిగాయన్నారు. ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్ గొగోయ్ శివసాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. జైల్లో ఉండి అసెంబ్లీకి ఎన్నికైన తొలి అస్సామీగా గుర్తింపు పొందారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలపై అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబరులో అరెస్టు చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనపై మోపిన అభియోగాలను కొట్టివేయడంతో ఈ ఏడాది జూలై ఒకటో తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. -
ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ
ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్ విజయం, కేరళలో విజయన్ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అపూర్వమైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్లో మోహరించినా బెంగాల్ టైగర్ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపర నిరూపిస్తుంది. రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది. కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది. అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అలానే వైఎస్సార్సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్ గత రెండేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 91829 18567 -
బీజేపీకి నిరాశ.. మళ్లీ తెరపైకి ప్రాంతీయ శక్తులు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు ఉన్న భారీ బలగంతోనే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కుదరదని తేలిపోయిందని.. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ప్రాంతీయ శక్తులు తిరిగి ప్రవేశించడం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడిపోవడం కూడా దీనికి కారణమని పేర్కొంటున్నారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు.. బెంగాల్లో గెలుపుతో చెక్ పెట్టవచ్చని, కేంద్ర విధానాలకు ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులంటున్నారు. కానీ బెంగాల్ ఓటమి, తమిళనాడు, కేరళల్లో నిరాశాజనక ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయని విశ్లేషిస్తున్నారు. సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యే అవకాశం ‘‘బెంగాల్లో మమత గెలుపు దేశంలో సంకీర్ణ రాజకీయాలకు మళ్లీ తెరలేపే పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్ బయట కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు కేడర్ ఉంది. బీజేపీని ఎదిరించి పోరాడిన ఆమెతో కలిసి పనిచేసేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ కీలకంగా ఉంటుంది. బీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉన్న మమత.. యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. -
అత్యధిక ఆస్తుల కల్గిన పొలిటికల్ పార్టీ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ : అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ జరిపిన అధ్యయనం ద్వారా దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తుల వివరాలను విడుదల చేసింది. అందులో అధికార భారతీయ జనతా పార్టీ 2900 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలోని రాజకీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువ 7,372 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ మొత్తంలో 7 జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం 5349.25 కోట్ల కాగా , 2023.71 కోట్ల రూపాయలు ఆస్తులు 41 ప్రాంతీయ పార్టీలకు సంబంధించినవని తన నివేదికలో పేర్కొంది. జాతీయంగా బీజేపీ, ప్రాంతీయంగా సమాజ్ వాది నెం.1 ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ 2904.18 కోట్లుతో మొదట నిలవగా, తరువాత కాంగ్రెస్ ( ఐఎన్‌సీ) 928.84 కోట్ల రూపాయల ఆస్తులతో రెండు , బీఎస్పీ రూ. 738 కోట్లుతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక ప్రాంతీయంగా 41 రాజకీయ పార్టీల మొత్తం ఆస్తులు చూస్తే 2023.71 కోట్ల రూపాయలు కాగా అందులో 1921 కోట్ల రూపాయల ఆస్తులు కేవలం టాప్ 10 పార్టీల పేరిట ఉన్నాయి. ఇక్కడ సమాజ్ వాది పార్టీ 572.21 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో నిలిచింది. ( చదవండి : స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా ) -
మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా!
సాక్షి, హైదరాబాద్: 2014, లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా విజయఢంకా మోగిస్తూ 19 రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా వల్ల వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోయాయి. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోక తప్పలేదు. ఈ పరిణామాలతో బీజేపీ అధికారం ప్రస్తుతం 13 రాష్ట్రాలకే పరిమితం అయింది. ప్రాంతీయ పార్టీల విజయంతో శరద్ పవార్, భూపిందర్ హూడా, హేమంత్ సోరెన్‌లు తిరుగులేని నాయకులుగా తెరమీదకు రాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అద్భుత విజయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని ప్రాంతీయ నాయకులుగా చరిత్ర సృష్టించారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్‌ను విజయ పథాన నడిపించడం ద్వారా అరవింద్ కేజ్రివాల్ బలమైన ప్రాంతీయ నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎన్నికల విశ్లేషణా సంస్థ ‘పీపుల్స్ పల్స్’ అంచనా వేసింది. -
దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఈసారి కూడా ఉత్తరాది రాష్ట్రాలే ప్రధాన పాత్ర వహిస్తాయని, దక్షిణాదిలో ఎప్పటిలాగే మిశ్రమ ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు ముందుగా అంచనావేశారు. వారి అంచనాలకు కొంచెం అటుఇటుగా దక్షిణాది కర్ణాటకలో బీజేపీ దూసుకుపోతుండగా, తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే దూసుకుపోతోంది. తమిళనాడులో 38 సీట్లకు గాను 22 సీట్లలో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తమిళనాడులోని 22 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగ్గా పాలకపక్ష ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య హోరాహోరా పోరు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం. కరుణానిధిలు మరణించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్లన కూడా హోరా హోరి పోరు జరుగుతుండవచ్చు. కర్ణాటకలో జరిగిన గత ఎన్నికల్లో బీజేపీకి 17 సీట్లురాగా, ఈసారి 20 సీట్లకుపైగా గెలుచుకునే దిశగా బీజేపీ ముందుకు దూసుకుపోతోంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దూసుకుపోతోంది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడ 25 సీట్లకుగాను వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేయగా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనా పార్టీ 18 సీట్లకు పోటీ చేసింది. మొత్తం 25 సీట్లలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగా ఊహించినట్లే మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మినహా మరెక్కడా బీజేపీ హవా కనిపించడంలేదు. ప్రస్తుతం కేరళలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. -
ప్రభుత్వాన్ని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ఆఖరి ఏడో విడత పోలింగ్ ఆదివారం (మే 19న) జరుగుతుంది. ఆ రోజు సాయంత్రానికి అన్ని విడతల పోలింగ్‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతుంటాయి. అధికారికంగా మే 23 తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్న విషయం తెల్సిందే. ఏయే రాష్ట్రాల్లో ఏ పార్జీది పైచేయి అవుతుందన్న దాన్ని పరిశీలించడం ద్వారా తుది ఫలితాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. 1. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 42 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే ప్రాబల్యం 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3. ఒడిశాలో 21 సీట్లు, నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ 4. తెలంగాణలో 17 సీట్లు, టీఆర్ఎస్ ప్రాబల్యం వీటన్నింటిని కలిపితే 105 సీట్లు. వీటిలో కాంగ్రెస్‌కుగానీ, భారతీయ జనతా పార్టీకిగానీ పెద్దగా సీట్లు రావు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాబల్య ప్రాంతాల నాయకులు కాంగ్రెస్‌కుగానీ, బీజేపీకిగాని మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. బెంగాల్, ఒడిశాలో బీజేపీ ఆశించిన విజయాలను సాధిస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు ఉండదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, కేరళలో కమ్యూనిస్టులు ప్రాథమిక అంచనాల ప్రకారం మెజారిటీ సీట్లను సాధిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 130, 140 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు దిశ నిర్దేశించే అవకాశం ఉండదు. మిత్రపక్షాల డిమాండ్లకే తలొగ్గాల్సి వస్తుంది. బీజేపీకి కూడా దాదాపు అలాంటి పరిస్థితే వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే కీలక పాత్ర వహించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే ఆయన పలు ప్రాంతీయ, అలీన పార్టీల నాయకులతోనే కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ మిత్రపక్షమైన జనతాదళ్ (సెక్యులర్), తమిళనాడులోని డీఎంకే నాయకులతో కూడా చర్చలు జరిపారు. అవసరమైతే ఆ పార్టీలను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లాక్కురావచ్చనే ఉద్దేశం కావచ్చు. 1996–98 నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం నాటి పరిస్థితి వస్తుందని, అలా అయితే తానే చక్రం తిప్పవచ్చనే ఆలోచన కేసీఆర్‌కు ఉండి ఉంటుంది. నాడు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ దేవెగౌడకు నాడు కాంగ్రెస్ పార్టీ విధిలేక మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ ప్రభుత్వం రెండేళ్లకు మించి అధికారంలో నిలదొక్కుకోలేక పోయింది. అయితే పార్టీల్లోని అంతర్గత వైషమ్యాల కారణంగానే నాటి ప్రభుత్వం పడిపోయింది. ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రభుత్వాలకే మద్దతు తెలుపుతుంటాయి. బీజేపీకి 220 సీట్లకు పైగా వస్తే తప్పా ఆ పార్టీ కూడా మిత్ర పక్షాలను డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఉండదు. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా హందాగా, ఎక్కువ అభివృద్ధి గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈసారి వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తుంటే బీజేపీకి మెజారిటీ సీట్లు రావని అర్థం అవుతోంది. -
అన్ని పార్టీలు కలిసి రావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడే పరిస్థితులున్నందున, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారంకంటే కూడా దేశ భవిష్యత్ ముఖ్యమని, సెక్యులరిజం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని కోరారు. పదవులకోసం బీజేపీ అమలు చేయబోయే సెమీ ఫాసిస్ట్ ధోరణులు, విధానాలకు మద్దతు తెలపవద్దన్నారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలంటూ యూపీఏలోని భాగస్వామ్యపక్షా ల్లో చీలిక తెచ్చేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజకీయ విధానాలు, నిర్వహిస్తున్న పాత్ర దీనినే స్పష్టం చేస్తోందన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి కేసీఆర్ తానా అంటే తందానా అంటూ వస్తున్నారన్నారు. కేసీఆర్ లేవనెత్తుతున్న అంశాలపై కమ్యూనిస్టు పార్టీలకు అభ్యంతరాలున్నా యని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పడాలని, బీజేపీ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లేకుండానే ఇది ఏర్పడాలని కోరుకుంటున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒకరోజు కుదించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల ఎన్నికల ప్రచారం ముగియడం తో చివరిరోజు ఇతర పార్టీల ప్రచారానికి అవకాశమివ్వకుండా చేయడాన్ని బట్టి ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టమవుతోందన్నారు. సిట్లు వంటింటి కుందేళ్లు: నారాయణ వివిధ అంశాలపై చంద్రబాబు, కేసీఆర్ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్)ఇద్దరు సీఎంల వంటింటి కుందేళ్లుగా మారిపోయాయని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ సిట్లను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం లేదన్నారు. -
కాంగ్రెస్‌కు ఇదొక్కటే చాన్స్
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్లో ఇంకో అంకానికి రంగం సిద్ధమైంది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకుగాను తొలి మూడు దశల్లో 302 స్థానాల ఎన్నికలు పూర్తికాగా.. నాలుగోదశలో భాగంగా మరో 71 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటే.. రెండు, మూడోదశలు ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ పోలింగ్ జరగనున్న కేంద్రాలను విశ్లేషిస్తే.. రాజకీయంగా కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఉపయోగపడేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎక్కువ స్థానాలు సంపాదించుకునే ఈ దశను విశ్లేషిస్తే.... మహారాష్ట్ర.... రాజధాని ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలతోపాటు మొత్తం 17 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ– శివసేన ఈ పదిహేడు స్థానాల్లో 14 గెలుచుకుంది. కాంగ్రెస్–ఎన్సీపీలకు ఒక్కటీ దక్కలేదు. గత ఐదేళ్లలో బీజేపీ – శివసేనల సంబంధాలు తరచూ మారిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన అసెంబ్లీలో ఒంటరిగా పోటీ చేసిన శివసేన ఆ తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వైదొలగింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా పోటీకి దిగారు. కాంగ్రెస్ –ఎన్సీపీలు కూడా సీట్ల సర్దుబాటులో విలువైన సమయాన్ని వృథా చేయడంతో ఎన్నికల సన్నాహాలకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు సమయం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరాను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం ఆ పార్టీలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, మిలింద్ కూటమికి పరీక్ష... మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమికి రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రూపంలో ఓ పరీక్ష ఎదురవుతోంది. శివసేన వ్యవస్థా పకుడైన బాలాసాహెబ్ ఠాక్రే తమ్ముడి కుమారుడైన రాజ్‌ఠాక్రే బీజేపీ – శివసేనలను బహిరంగంగానే విమర్శిస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఎంఎన్ఎస్ స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగని కాంగ్రెస్ – ఎన్సీపీలతో పొత్తు కూడా పెట్టుకోలేదు. కానీ.. పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాత్రం ప్రచార సభలు నిర్వహిస్తూ హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రసంగాలు గుప్పిస్తున్నారు. ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తూండటం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లోముంబై సౌత్ ఒకటని చెప్పుకోవాలి. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవరా పోటీ చేస్తున్నారిక్కడ. 2004, 2009లలో ఈ స్థానం నుంచే గెలుపొందిన మిలింద్ 2014 ఎన్నికల్లో మాత్రం అరవింద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరొందిన ముఖేష్ అంబానీ మద్దతుతో పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఎంత మేరకు విజయవంతమవుతారో వేచి చూడాల్సిందే. ఇక ముంబై నార్త్ నుంచి సినీనటి ఊర్మిళా మటోండ్కర్ బీజేపీ ఎంపీ గోపాల్ షెట్టిల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొని ఉంది. ముంబై నార్త్–వెస్ట్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్, శివసేన ఎంపీ గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, ముంబై నార్త్ –సెంట్రల్లో ప్రియాదత్ (కాంగ్రెస్), సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ (బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ స్థానం నుంచి ప్రియాదత్ 2009లో గెలుపొందగా.. పూనమ్ 2014లో గెలుపొందారు. రాజస్థాన్... ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2014 తరువాత అక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. బీజేపీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో వంద గెలుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది.2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్ అంతమేరకు లాభపడింది. పద్మావత్ సినిమా వివాదం రాజ్çపుత్లలో బీజేపీపై వ్యతిరేకతకు కారణం కాగా.. జైపూర్‌లోని రాజ్ మహల్ ప్రధాన ద్వారాన్ని మూసివేయడం, భరత్పూర్ –ధోపూర్ ప్రాంతంలోని జాట్ సామాజిక వర్గం రిజర్వేషన్లు వంటి అంశాలన్నీ వసుంధర రాజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయని అంచనా. ఏప్రిల్ 29న పోలింగ్ జరుపుకునే స్థానాల్లో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని పాలి, జోధ్‌పూర్, బర్మార్, జాలోర్లతోపాటు దక్షిణ ప్రాంతంలోని ఉదయ్‌పూర్, బాన్స్వారా, చిత్తోర్ఘర్, రాజ్‌సమంద్, భిల్వారాలు, హరోతీ ప్రాంతంలోని కోట, జల్వార్ –బరోన్లు, మధ్య రాజస్థాన్‌లోని అజ్మీర్, మత్సయ్ ప్రాంతంలోని టోంక్–సవాయి మాధోపూర్లు ఉన్నాయి. నిరుద్యోగం.. వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు. బీజేపీ జాతీయ వాదం, భద్రత, బాలాకోట్ దాడులు వంటి అంశాలతో ప్రచారం నిర్వహిస్తోంది. అధికార కాంగ్రెస్ రైతులకు తాము అందించిన పాక్షిక రుణమాఫీ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయడం వంటి అంశాలను తమ విజయాలుగా ఓటర్లకు వివరిస్తోంది. న్యాయ్ పథకం ద్వారా కనీస ఆదాయ పథకం లబ్ధిని నేరుగా జన్‌ధన్ యోజన అకౌంట్లలోకి వేస్తామన్న రాహుల్ గాంధీ హామీ కూడా కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. వీటికి తోడు రాష్ట్రంలోని పన్నెండు మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే మద్దతివ్వడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉంది ఆ పార్టీ. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్‌కు, బీజేపీకి చెందిన జి.ఎస్.షెఖావత్ల మధ్య జోధ్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్శిçస్తుం డగా బర్మార్‌లో కాంగ్రెస్ టిక్కెట్‌పై బీజేపీ దిగ్గజ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. చిత్తోర్‌ఘర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సీపీ జోషీ కాంగ్రెస్‌కు చెందిన గోపాల్ సింగ్ ఐద్వాపై పోటీ చేస్తున్నారు. మొత్తమ్మీద రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వంటి అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మానవేంద్ర సింగ్, వైభవ్, సి.పి.జోషి మహాఘట్‌బంధన్‌తో బీజేపీకి నష్టం? మొత్తం పదమూడు స్థానాలకుగాను సోమవారం పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో కూడిన మహాఘట్బంధన్ కారణంగా బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే ఇందుకు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉంది. అవధ్ ప్రాంతంలోని ఖేరీ, హర్దోయి (ఎస్సీ), మిస్రిక్ (ఎస్సీ), దోయాబ్ ప్రాంతంలోని ఉన్నావ్, ఫరుక్కాబాద్, ఇటావా (ఎస్సీ), కనౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జలౌన్ (ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్, రుహేల్‌ఖండ్ ప్రాంతంలోని షాజహాన్‌పూర్‌లలో గత ఎన్నికలల్లో బీజేపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకోగా, అతిస్వల్ప మార్జిన్‌తో కనౌజ్ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగలిగింది. తాజా ఎన్నికల్లోనూ కనౌజ్లో ఆసక్తికరమైన పోటీ నెలకొని ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున డింపుల్‌యాదవ్ బరిలో ఉండగా బీజేపీ సుభ్రత్పాఠక్ను నిలబెట్టింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. ఇక కాన్పూర్ విషయానికొస్తే.. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ దిగ్గజ నేత మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి శ్రీ ప్రకాశ్ జైస్వాల్, శ్రీ రామ్‌కుమార్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పోటీ చేస్తున్న ఉన్నావ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అరుణ్ కుమార్ శుక్లా, కాంగ్రెస్ నుంచి అను టాండన్‌లు బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట ఇటావాలో బీజేపీ రమాశంకర్ కథారియాతో గెలుపుకోసం ప్రయత్నిస్తూండగా సిట్టింగ్ ఎంపీ అశోక్ కుమార్ దొహారే పార్టీని వీడి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కమలేశ్ కథారియా బరిలో ఉన్నారు. ఝాన్సీలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో బీజేపీ అనురాగ్ శర్మను బరిలోకి దింపగా శివ శరణ్ కుష్వహా (కాంగ్రెస్), శ్యామ్ సుందర్ సింగ్ యాదవ్ (ఎస్పీ)ల రూపంలో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగనుంది. డింపుల్, సాక్షి మహరాజ్, సత్యదేవ్ బెంగాల్లో హోరాహోరీ... తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో కమల వికాసానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయా? అన్నది కౌంటింగ్ తరువాతే తెలుస్తుందిగానీ ఈ సారి పోరు మాత్రం హోరాహోరీగానే సాగుతోంది. గత ఎన్నికల్లో టీఎంసీ ఆరు స్థానాలు గెలుచుకున్న లోక్‌సభ స్థానాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానం గెలుచుకున్న వాటికి సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిల్లో బర్హమ్‌పూర్, కృష్ణనగర్, రానాఘాట్లతోపాటు బర్దమాన్ పుర్బా, దుర్గాపూర్, అసన్సోల్, బీర్బమ్, బర్దమాన్లు ఉన్నాయి. బహరంపూర్‌లో పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ (కాంగ్రెస్), అపూర్వా సర్కార్ (టీఎంసీ), కృష్ణ జౌర్దార్ ఆర్య (బీజేపీ)ల మధ్యనే ఉంది. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున ఈద్ మహమ్మద్ కూడా బరిలో ఉన్నారు. టీఎంసీ కృష్ణ నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ తపస్ పాల్ ను కాదని మహువా మొయిత్రాను బరిలోకి నిలపగా కల్యాణ్ చౌబే (బీజేపీ), శంతనూ ఝా (సీపీఎం)లు ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. అసన్సోల్ విషయానికొస్తే.. ఇక్కడ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో (బీజేపీ)కి పోటీగా సినీనటి మూన్‌మూన్ సేన్(టీఎంసీ), గౌరాంగ్ ఛటర్జీ (సీపీఎం)లు ఉన్నారు. బీర్బమ్లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల మధ్య బహుముఖ పోటీ ఉంది. అధిర్ రంజన్, మూన్‌మూన్ సేన్, బాబుల్ సుప్రియో మధ్యప్రదేశ్‌లో మళ్లీ మోదీ హవా వచ్చేనా? మోడీ హవా కారణంగా బీజేపీ బాగా లాభపడ్డ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒక్కటి. ఈ సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో మధ్యప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వింధ్యప్రదేశ్ ప్రాంతంలోని సిధి, షాదోల్లతోపాటు మహాకోశల్ ప్రాంతంలోని జబల్పూర్, మండ్ల, బాలాఘాట్, ఛింద్వారాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై, కాంగ్రెస్ అధికారం చేపట్టిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాండసోర్‌లో రైతులపై కాల్పులు, వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టడంలో విఫలమవడం వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారితే.. రుణమాఫీ, గో సంరక్షణకు సమగ్ర పథకం వంటి అంశాలు ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎస్పీ, బీఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్ తరఫున నకుల్ నాథ్ పోటీ చేస్తూండగా.. బీజేపీ నుంచి నాథన్ షా, జ్ఞానేశ్వర్ గజ్భియే (బీఎస్పీ)లు పోటీలో ఉన్నారు. నఖుల్ నాథ్, నాథన్ షా, జ్ఞానేశ్వర్ ఒడిశాలో పోలింగ్ పూర్తి.. ఏప్రిల్ 29 వతేదీతో ఒడిశాలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. మిగిలిన మయూర్భంజ్ (ఎస్టీ), బాలాసోర్ (ఎస్సీ), భద్రక్ (ఎస్సీ), జజ్పూర్ (ఎస్సీ), కేంద్రపారా, జగత్సింగ్పూర్ (ఎస్సీ) స్థానాలు గత ఎన్నికల్లో బీజేడీ గెలుచుకున్నవే. అయితే ఈ సారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 1998 నుంచి బీజేడీని గెలిపిస్తూ వచ్చిన కేంద్రపారాలో ఈసారి ఇటీవలే బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వైజయంత్ జై పాండా పోటీ చేస్తూండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేడీ తరఫున సినీనటుడు అనుభవ్ మహంతి ఉన్నారు. బీజేడీని గెలిపించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అనుభవ్, వైజయంత్ కన్హయ్య కుమార్‌కు కఠిన పరీక్ష... బిహార్‌లో నాలుగోదశలో భాగంగా ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బేగూసరాయితోపాటు దర్భంగ, ఉజిర్‌పూర్, సమస్ఠిపూర్, ముంగేర్‌లలో ఈ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో మూడింటిని బీజేపీ, రెండింటిని ఎల్జేఎన్ఎస్పీ గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం బేగూసరాయి అనడంలో సందేహం ఏమీ లేదు. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు మద్దతిచ్చిన బేగూసరాయిలో ఈ సారి సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఆర్జేడీకి చెందిన తన్వీర్ హసన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్‌కు వామపక్ష నేతలతోపాటు ప్రకాశ్‌రాజ్, షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్, స్వరా భాస్కర్ వంటి సినీ ప్రముఖుల మద్దతు లభిస్తుండగా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్‌కు బలమైన కేడర్ ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇవే కాకుండా జార్ఖండ్‌లో ఛత్రా, లోహార్డాగా (ఎస్టీ), పలమావు (ఎస్సీ) లోకసభ స్థానాల్లో రెండింటిని గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఈ సారి అక్కడ గట్టిపోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జేవీఎం(పీ), జేఎంఎం, ఆర్జేడీల కూటమి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఏతావాతా.. తొలి మూడు దశల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించుకునే అవకాశం లేకపోయిన కాంగ్రెస్ ఈ దశలో మాత్రం కొంచెం లాభపడనుందని చెప్పాలి. 2014లో ఈ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా.. ఈ సారి మాత్రం సీట్ల సంఖ్య రెండు అంకెల్లో ఉండవచ్చునని అంచనా. కన్హయ్య, గిరిరాజ్ సింగ్, తన్వీర్ హసన్ ప్రవీణ్ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ. ద్వైపాయన్ సన్యాల్, ఫ్రీలాన్స్ పొలిటికల్ ఎకనమిస్ట్, నోయిడా, ఉత్తర ప్రదేశ్. -
పొత్తులకు బీజేపీ సిద్ధమే: మోదీ
చెన్నై: తమిళనాడులోని రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, పాత మిత్రులను తాము గుర్తుపెట్టుకున్నామని ప్రధాని మోదీ గురువారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని మోదీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అరక్కోణం, కడలూరు, కృష్ణగిరి, ఈరోడ్, ధర్మపురి జిల్లాల బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకే లేదా రజినీకాంత్ పెట్టే పార్టీల్లో దేనితో పొత్తు పెట్టుకుంటుందని ఓ కార్యకర్త అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలకు, ఆకాంక్షలకు అటల్జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోంది. వాజ్‌పేయి ఏం చేశారో దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు ఒక్కరికే హక్కు ఉందని ఆ పార్టీ భావించింది’ అని విమర్శించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని ఐదు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 39 స్థానాల్లోనూ పోటీ చేయగా ఈ కూటమి రెండే సీట్లు (బీజేపీ, పీఎంకే చెరొకటి) గెలిచింది. తర్వాత ఈ 5 పార్టీలూ బీజేపీతో తమ సంబంధాలను తెంచుకున్నాయి. -
అత్యంత సంపన్న పార్టీగా సేన..
సాక్షి, న్యూఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీల కంటే శివసేనకు అత్యధిక విరాళాలు సమకూరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన రికార్డులను విశ్లేషించిన మీదట ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. మహారాష్ట్రకు చెందిన శివసేన 297 విరాళాల నుంచి రూ 25.65 కోట్లు స్వీకరించింది. ఇక రూ24.73 కోట్ల విరాళాలతో ఆప్ తదుపరి స్ధానంలో నిలించింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ రూ 15.45 కోట్ల విరాళాలు రాబట్టి మూడో స్థానంలో నిలిచిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక ప్రాంతీయ పార్టీలు 6,339 విరాళాల నుంచి మొత్తం రూ 91.37 కోట్ల మొత్తం సమీకరించాయి. ఇందులో రూ 65.83 కోట్లు శివసేన, ఆప్, శిరోమణి అకాలీదళ్‌లకే దక్కాయి. నగదు విరాళాల్లో రూ 72.7 లక్షలతో అసోం ప్రధమ స్ధానంలో నిలవగా,రూ 65 లక్షలతో పుదుచ్చేరి తదుపరి స్ధానంలో ఉంది. అత్యధిక విరాళాలు రూ 20.86 కోట్లు ఢిల్లీ నుంచి సమకూరగా, 19.7 కోట్లు మహారాష్ట్ర నుంచి రూ 9.42 కోట్లు పంజాబ్ నుంచి సమకూరాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రాజకీయ పార్టీలు రూ 20,000 మించిన విరాళాల వివరాలను వెల్లడించాలని, ఫామ్ 24ఏని పూర్తిగా నింపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
250 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ?
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 250 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీచేసి గెలుపు అవకాశాలున్న మిత్రపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మోదీని ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏవిధంగా పోటీచేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి ఏకే ఆంటోని అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు. కమిటీ అన్ని రాష్ట్రాల్లోని సీనియర్ నేతలతో చర్చించి ఏ స్థానాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశంపై ఓ నివేదికను తయారుచేస్తోందన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 44 స్థానాల్లోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి ఆయుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టక తప్పదు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు మహాకూటమిగా ఏర్పడాలని ఇటీవల కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే త్వరలో జరుగునున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 250 స్థానాల్లో పోటీ చేస్తే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి అతి తక్కువ స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. -
సీట్ల పంపకమే అసలు పేచీ
లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువుగా కనిపించడం లేదు. శనివారం పార్టీ కార్యకర్తల భేటీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలతో ఆ విషయం స్పష్టమైంది. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే కూటమిలో చేరతామని, లేదంటే ఒంటరిగానే పోటీకి వెళ్లడం ఉత్తమమని మనసులో మాటను ఆమె బయటపెట్టారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పక్షంలో సీట్ల పంపకంపై ఎస్పీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే మాయావతి ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు(అప్నాదళ్ 2 సీట్లతో కలిపి), సమాజ్‌వాదీ 5, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఒక్కచోటా విజయం సాధించలేదు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌లు కూటమిగా పోటీ చేశాయి. పొత్తు పెట్టుకున్నా.. ఆ రెండు పార్టీలు దాదాపు 12కు పైగా స్థానాల్లో ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. సీట్ల ఒప్పందం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు. ఆ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా.. పలు చోట్ల రెండు పార్టీలు పోటీపడడంతో నష్టపోయాయి. ‘కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు పార్టీల మధ్య సీట్ల పంపకం అత్యంత కీలకం. తమకే ఎక్కువ సీట్లు కావాలని ప్రతీ పార్టీ ఆశిస్తుంది. అలాంటి సమయంలో సీట్ల పంపకంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాజకీయ విశ్లేషకుడు జేపీ శుక్లా పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి కూటమి తప్పనిసరి: ఎస్పీ యూపీ సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ లోక్‌సభ నియోజకవర్గాలైన గోరఖ్‌పూర్, పూల్పూర్లో ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి బీఎస్పీ మద్దతిచ్చింది. ఆ రెండు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అఖిలేశ్ స్వయంగా మాయావతి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి సమాజ్‌వాదీ మద్దతిచ్చింది. ‘బీజేపీని ఓడించాలంటే కూటమి ఏర్పాటు తప్పనిసరి. సమ ప్రాధాన్యం దక్కేలా సీట్ల పంపకాన్ని మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది’ అని ఎస్పీ నేత రాజ్‌పాల్ కశ్యప్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజీపడినా.. మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు.. సీట్ల పంపకంపై రాజీ ధోరణిలో వెళ్తాయా? లేదా? అన్నది తెలియాలంటే కొద్ది కాలం వేచిచూడాల్సిందే. -
ప్రాంతీయ దూకుడుకు అడ్డుకట్ట!
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సరైన మెజారిటీ రాని పక్షంలో సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యే అవకాశాలతో.. కమలదళంలో ఒక రకమైన కలవరం మొదలైంది. కర్ణాటక ఫలితాలు, ఎస్పీ–బీఎస్పీల పొత్తు ప్రభావంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ముఖ్య నేతలు బీజేపీ కీలక నేతలతో త్వరలోనే సమావేశం కానున్నారు. సమీప భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలను, ప్రాంతీయ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసి బీజేపీ బేస్‌ను పెంచే కార్యాచరణతోపాటుగా జాతీయ విద్యా విధానం, భద్రతాపరమైన అంశాలు, కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు చెబుతుండటం, అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా పలు (ఆర్థికాంశాలు, ఇంధన ధరల పెరుగుదల, దళితులతోపాటు మైనార్టీల్లో అసంతృప్తి, మహిళలపై అత్యాచారాలు తదితర) అంశాల్లో కనబడుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సమీక్షించాలని సంఘ్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇకపై రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాలను నిర్ణయించే భేటీల్లో ఆరెస్సెస్ కీలక పాత్ర పోషించనుంది. కర్ణాటక ఎన్నికల కోసం స్థానిక స్వయం సేవకులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రెండు నెలలపాటు శ్రమించారు. దీంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడంపైనా ఆరెస్సెస్ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతున్న బీజేపీ.. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ దూసుకుపోవాలనే ప్రయత్నాల్లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికితోడు ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో క్షేత్రస్థాయి కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
అరాచక కూటమిపై పోరు: జైట్లీ
న్యూఢిల్లీ: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధాని మోదీకి, ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న ‘అరాచక కూటమి’కి మధ్య ఉంటుందని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న జైట్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్డీయే సర్కారుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆసుపత్రి నుంచే ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీకి కాల్పనిక ప్రత్యామ్నాయమే తప్ప అసలైన ప్రత్యామ్నాయం కాబోదని జైట్లీ చెప్పారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, ఎన్నో తేడాలు ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైనా.. ఆ కూటమి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్నారు. ‘టీఎంసీ, డీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ తదితర పార్టీలతో కలసి బీజేపీ గతంలో పనిచేసింది. వారు ఓ రోజు ఒక పార్టీకి మద్దతిస్తే మరుసటి రోజు మరో పార్టీకిస్తారు. 1996–98 మధ్య భారత్ ఫెడరల్ ఫ్రంట్లను చూసింది. అదొక విఫల విధానం’ అని జైట్లీ అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమనీ, మరికొన్నింటికి రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రాబల్యం ఉందన్నారు. కుంభకోణాల్లేని పాలనను అందించాం.. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తమ ప్రభుత్వ విజయాలను జైట్లీ వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో అవినీతి కుంభకోణాలు లేని పాలనను అందించిందన్నారు. యూపీఏ కాలంలో ప్రపంచంలోనే అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ పరిస్థితి నేడు ఎంతో మెరుగుపడిందన్నారు. శాసన, వ్యవస్థాగత మార్పుల ద్వారా మోదీ పారదర్శక విధానాలను తీసుకొచ్చారనీ, యూపీఏ కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం పార్టీకి, దేశానికి ఒకరే నాయకుడు ఉన్నారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశం నిరాశ, నిస్పృహల నుంచి ఆశలు, ఆకాంక్షలవైపు వెళ్తోందన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ తదితర చర్యలతో అవినీతిని నిర్మూలించేందుకు, పన్నులు సక్రమంగా వసూలు చేసేందుకు తాము కృషి చేశామని జైట్లీ వివరించారు.