RTC employees
-
ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ సొమ్ముపై గందరగోళం నెలకొంది. ఉద్యోగులు చెల్లించిన సుమారు రూ.125 కోట్లు, వాటిపై వడ్డీ కలిపి.. మొత్తం రూ.200 కోట్ల మొత్తానికి లెక్కతేలకుండా పోయింది. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ స్కీమ్ కోసం పదేళ్ల కింద ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమైందో తెలియడం లేదని.. ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మొదటి నుంచీ లెక్కేసి మొత్తం డబ్బులు కట్టాలంటున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవటం, పీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకోవటం, విషయం కోర్టు వరకు వెళ్లటం, అయినా బకాయిలు చెల్లించక ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం దాకా ఇప్పటికే ఎన్నో ఆందోళనకర పరిణామాలు జరిగాయి. దానికితోడు అధిక పెన్షన్ల వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది.అసలేం జరిగింది?ఉద్యోగులకు అధిక పెన్షన్ కోసం 1995 నవంబరులో భవిష్యనిధి సంస్థ ఆప్షన్లను కోరింది. భవిష్య నిధి వ్యవహారాల కోసం ఆర్టీసీలో ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టు ఉంటుంది. ఆ ట్రస్టు ఉమ్మడి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్‌ను వసూలు చేసి ఈపీఎఫ్ఓకు జమ చేసింది. 2014 ఆగస్టు వరకు ఇది కొనసాగింది. మొత్తంగా 16,307 మంది ఇలా హయ్యర్ పెన్షన్ కోసం వారి వేతనాల నుంచి 8.33 శాతం చొప్పున కాంట్రి బ్యూషన్ చెల్లించారు. అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది ఉన్నారు. వారు హ య్యర్ పెన్షన్‌కోసం చెల్లించిన మొత్తం సుమారు రూ.125 కోట్ల వరకు ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వారి ఆప్షన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనితో అప్పటివరకు వారు చెల్లించిన కాంట్రిబ్యూషన్ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఈపీఎఫ్ఓ వద్దే ఉండిపోయింది. పీఎఫ్ వ్యవహారాలు చూసేందుకు ఆర్టీసీలో ప్రత్యేకంగా ట్రస్టు ఉన్నా.. అది పట్టించుకోలేదు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము రూ.125 కోట్లకు వడ్డీ కలిపి రూ.200 కోట్ల వరకు అవుతుందని.. ఆ సొమ్ము లెక్క తేలడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.ఇప్పుడూ పూర్తిగా కట్టాలంటూ నోటీసులతో..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ గతేడాది మరోసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు తీసుకుంది. అప్పట్లో తిరస్కరణకు గురైనవారిలో కొందరు రిటైరవగా.. మిగతావారిలో చాలా వరకు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి వేతనాల నుంచి 8.33 శాతం కాంట్రిబ్యూషన్తోపాటు ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్ స్కీం నిర్వహణ చార్జీల పేరిట మరో 1.16 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. స్కీం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం సొమ్మును చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆప్షన్ రిజెక్ట్ అయి ఇప్పుడు మళ్లీ ఆప్షన్ ఇచ్చినవారు.. అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తాన్ని వసూలు చేసుకోవాలని అభ్యర్థించారు. కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని పీఎఫ్ ట్రస్టు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు..హయ్యర్ పెన్షన్ ఆప్షన్లను తిరస్కరించిన వెంటనే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వాపసు చేయాల్సి ఉంది. కానీ ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య ఎక్కడుందో చెప్పేవారు కూడా లేకపోవటం విడ్డూరం. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ఆర్టీసీ మిన్నకుండిపోతోంది. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించి 7,373 మంది ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది – ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావుఏపీలోనూ ఇదే సమస్య..ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 8,934 మంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఎదు రుచూస్తున్నారు. వారు అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి తాజా కాంట్రిబ్యూషన్‌ను లెక్కించాల్సి ఉంది. దీన్ని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు సీరియస్‌గా తీసుకుని కొలిక్కి తేవాల్సి ఉంది– ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత దామోదర్వెంకట్రావు.. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో క్లర్కు. 1996లో ఆయన కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో.. హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు ఆప్షన్ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్‌గా రూ.2.60 లక్షలు చెల్లించారు. ఆయన ఆప్షన్ రిజెక్ట్ అయింది. కానీ ఈ విషయం వెంకట్రావుకు తెలియలేదు. సమాచారం ఇవ్వాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పట్టించుకోలేదు. తాజాగా 2022లో ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం మళ్లీ ఆప్షన్ స్వీకరించింది.దీనికి వెంకట్రావు దరఖాస్తు చేసుకోగా.. 1996 నాటి నుంచి ఇప్పటివరకు కలిపి కాంట్రిబ్యూషన్ రూ.4.80 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నోటీసు ఇచ్చింది. ఇదేమిటని ఆయన ఆరా తీయగా.. 1996లోనే తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. అప్పట్లో చెల్లించిన మొత్తం మినహాయించి మిగతాది చెల్లిస్తానని ఆయన చెబితే.. మొత్తం చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ఓ నుంచి సమాధానం వచ్చింది. మరి నాడు చెల్లించిన సొమ్ము ఏమైందో అంతుపట్టని పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీలో వేల మంది ఉద్యోగుల సమస్య ఇది.. -
ఆర్టీసీ ఉద్యోగులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను జీతాల బిల్లులతో కలిపి ఇవ్వకూడదని నిర్ణయించింది. దాంతో రాష్ట్రంలోని దాదాపు 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతిననున్నాయి. తమకు జీతాలతోపాటే నైట్ డ్యూటీ అలవెన్స్‌లు, టీఏ, ఇతర అలవెన్స్‌లు చెల్లించాలని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నిధుల కొరత లేదా ఇతర కారణాలతో అలవెన్స్‌లు ఏళ్ల తరబడి చెల్లించేవారు కాదు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై కూడా సానుకూలంగా స్పందించింది. అలవెన్స్‌లను కూడా గ్రేడ్–1 ఉద్యోగులకు రూ.600 నుంచి రూ.800కు, గ్రేడ్–2 ఉద్యోగులకు రూ.400 నుంచి రూ.600కు, గ్రేడ్–3 ఉద్యోగులకు రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ఆ అలవెన్స్‌లను జీతాల బిల్లులతోపాటే ఆమోదించి ప్రతి నెలా జీతాలతోపాటే చెల్లించాలని నిర్ణయించింది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలతోపాటు అలవెన్స్‌లను కూడా చెల్లిస్తూ వచ్చారు. కాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఆగస్టు నెల జీతాల బిల్లులతో నైట్‌డ్యూటీ అలవెన్స్‌లు, టీఏలు, ఇతర డ్యూటీ ఆధారిత అలవెన్స్‌లను కలపవద్దని విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు షాక్‌కు గురయ్యారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో తమకు అలవెన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉండే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యేలా ఆందోళన చెందుతున్నారు. నేడు నిరసనప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు ఈ నెల 30న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించాం. నిరసన ప్రదర్శన నిర్వహిస్తాం. రిటైరైన ఉద్యోగులకు సకాలంలో సెటిల్మెంట్ చేయకుండా ట్రెజరీ శాఖ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఈ అంశంపై కూడా నిరసన తెలుపుతాం. – పీవీ రమణారెడ్డి, అధ్యక్షుడు, – వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సభలో దుమారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలతో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ఏ స్థితిలో ఉంది..దాని అమలులో జాప్యానికి కారణాలు చెబుతూ.. ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ముఠాగోపాల్, సంజయ్‌లు ప్రశ్నించారు. ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచి్చన సమాధానంపై..జాప్యం లేదు అని చెప్పటమేంటని హరీశ్‌రావు నిలదీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరీ్టసీపై చెప్పిన హామీలను ప్రస్తావించారు. 2015 నాటి వేతన సవరణ బాండు బకాయిలు విడుదల చేస్తున్నట్టు గత ఫిబ్రవరిలో నెక్లెస్ రోడ్డు వద్ద జరిగిన సభలో స్వయంగా సీఎం ప్రకటించి నమూనా చెక్కును చూపారని, ఇప్పటి వరకు ఆ చెక్కు నిధులు నెక్లెస్ రోడ్డు నుంచి బస్‌భవన్‌కు చేరలేదని, మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఆరీ్టసీకి నిధులు సరిగా రీయింబర్స్ చేయటం లేదని పేర్కొన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆరీ్టసీని చంపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం అసంబద్ధంగా, సంప్రదింపులు లేకుండా విలీనం చేశారని ఎదురుదాడికి దిగారు. గవర్నర్ సంతకం చేయటం లేదంటూ కారి్మకులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి రాజ్‌భవన్ ముందు ఆందోళన చేయించారన్నారు. త్వరలో అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి నుంచి సానుకూల సమాధానం రానందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిని స్పీకర్ తిరస్కరించారు. తమకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావుకు అదే అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీనిని మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన వ్యక్తం చేసే ప్రొవిజన్ లేదన్నారు. మరి ఆ ప్రశ్న అడిగిన వారిలో కూనంనేని లేకున్నా, ఆయనకు స్పీకర్ అవకాశం ఇవ్వటం నిబంధనకు విరుద్ధం కాదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని..ఒకసారి ప్రశ్న ఆమోదం కాగానే అది సభ ఆస్తిగా మారుతుందని, దానిపై ఇతర సభ్యులకు మాట్లాడే అధికారం లేదని ఏ రూల్ చెప్పటం లేదని పేర్కొన్నారు. సభ్యులు పోడియం వద్దకు వస్తే బయటకు పంపే నిబంధన కూడా ఉందని, కానీ స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. కారి్మక సంఘానికి అప్పట్లో హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను ఎలా తొలగించాలో ఆ పార్టీ నాయకుడికి తెలియక కారి్మక సంఘాలనే రద్దు చేశారని, అది వారి కుటుంబగొడవ అని, దానితో తమకు సంబంధం లేదని సీఎం అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే, స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించి ఇటీవల చనిపోయిన మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేసి టీ విరామ సమయం ప్రకటించారు. -
గతుకుల రోడ్డుపై.. బతుకు బండి!
వందల సంఖ్యలో బస్సులు.. లక్షల మంది ప్రయాణికులు.. వారిని సకాలంలో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిలో నిమగ్నమవుతున్నారు. పని భారాన్ని భరిస్తూ ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులపై తీవ్ర పనిఒత్తిడి పడింది. వీటన్నింటినీ తట్టుకుని నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నా.. వారి బతుకు బండి సురక్షితంగా సాగడంలేదు. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులు, ఇలా అనేక సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2400కు పైగా మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షా 90వేల మంది ప్రయాణించేవారు. కాగా.. మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెండు లక్షల 90 వేలకు చేరింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో సామర్థ్యానికి మించి అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించడానికి వయస్సు పైబడినవారు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు.నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికుల కిటకిట8 గంటల డ్యూటీ లేదు..డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డేడ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతోంది. నిజామాబాద్ – హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు అవుతుండగా.. నిజామాబాద్ – వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు పడుతుంది.దీంతో పాటు వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతోంది. ఇలా డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పని చేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాల భారిన పడుతున్నారు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యూనియన్లు లేకపోవడంతో డిపోలోని అధికారులు సిబ్బందికి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేయడంతో పనిఒత్తిడి పెరుగుతోంది.ప్రశ్నిస్తున్న అధికారులు..ఆర్టీసీ బస్సులకు డైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రూట్లో వెళ్లే బస్సులు కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. డైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేఏంపీఎల్ వచ్చేటట్లు చూడాలని సూచనలు చేస్తున్నారు. కండక్టర్లకు మహాలక్ష్మి పథకంతో పాటు టిక్కెట్లకు టార్గెట్ నిర్దేశిస్తున్నట్లు ఆరీ్టసీలో చర్చ జరుగుతోంది. దీంతో టార్గెట్ కాకపోతే తాము ఏం చేయగలమని కండక్టర్లు వాపోతున్నారు.రెండు డ్యూటీలు చేస్తేనే స్పెషల్ ఆఫ్..ఆర్టీసీ ఉద్యోగులు లీవ్‌లు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనార్యోగం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇతర సెలవులు కావాలంటే అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. -
ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాల స్తంభన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై భవిష్యనిధి (పీఎఫ్) సంస్థ తీవ్ర చర్యకు ఉపక్రమించింది. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంతో ముడిపడిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఈ ఖాతాల్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ మొత్తం నుంచే సంస్థ రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో ఆర్టీసీలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రూ.వేయి కోట్లకు చేరువలో బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధి ఖాతాల్లో ప్రతినెలా కంట్రిబ్యూషన్ జమ అవుతుంటుంది. సాధారణ సంస్థల్లాగా కాకుండా, భవిష్యనిధి ఖాతాలను సంస్థనే నిర్వహిస్తుంది. వాటిల్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, వారి పక్షాన సంస్థ కంట్రిబ్యూషన్ జమ చేస్తుంది. గతంలో ఈ కంట్రిబ్యూషన్ ఠంచన్‌గా జమయ్యేది. కానీ, పదేళ్లుగా సంస్థ పనితీరు సరిగా లేకపోవటంతో.. సంస్థ అవసరాల కోసం భవిష్యనిధి మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవడం ప్రారంభించింది. ఏడాదిన్నర క్రితం వరకు అలా రూ.1,200 కోట్లకు ఆ బకాయిలు పేరుకుపోయాయి.పలు దఫాలుగా భవిష్యనిధి సంస్థ నిలదీసింది. కానీ ఆర్టీసీ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో, విడతల వారీగా రూ.300 కోట్ల వరకు చెల్లించింది. ఆ తర్వాత ఆ చెల్లింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు రూ.950 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రతినెలా కంట్రిబ్యూషన్ల కింద రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని ఇప్పుడు పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించి నిలదీయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. రీజినల్ ఖాతాల్లోకి జమ..భవిష్యనిధి సంస్థ చర్యతో వెంటనే తేరుకున్న ఆర్టీసీ.. రోజువారీ ఆదాయాన్ని బస్‌భవన్‌కు ఉన్న ప్రధాన ఖాతాల్లో కాకుండా రీజినల్ కార్యాలయాలతో అనుసంధానమైన ఇతర ఖాతాల్లో జమ చేయటం ప్రారంభించింది. ఈమేరకు అన్ని కార్యాలయాలకు బస్‌భవన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలందాయి. ఈ ఖాతాలు ఫ్రీజ్ కానందున వాటిల్లో జమ చేసి వాటి నుంచే డ్రా చేసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. భవిష్యనిధి సంస్థ వాటినీ ఫ్రీజ్ చేయబోతోందని సమాచారం అందడంతో హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్కాకుండా స్టే పొందాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది.అలా జరగని పక్షంలో ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఉన్న టోల్గేట్ల ఫాస్టాగ్‌లకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంది. దాన్ని కూడా పీఎఫ్ సంస్థ ఫ్రీజ్ చేయబోతోందని ఆరీ్టసీకి సమాచారం అందింది. అదే జరిగితే, ఫాస్టాగ్‌ల నుంచి టోల్ రుసుము మినహాయింపునకు వీలుండదు. దీంతో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కాకుండా నగదు చెల్లిస్తే, రుసుము రెట్టింపు ఉంటుంది. ఇది ఆర్టీసీపై రోజువారీ రూ.లక్షల్లో భారం పడుతుంది. దీంతో ఫాస్టాగ్ ఖాతాకు కూడా ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. సోమవారం సెలవు కావటంతో, మంగళవారం దాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. పీఎఫ్ బకాయిలకు సాయం సాధ్యమా?హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేనిపక్షంలో కచి్చతంగా పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందే. అన్ని నిధులు ఆర్టీసీ వద్ద సిద్ధంగా లేనందున.. ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి ఉద్యోగుల చెల్లింపునే ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన ప్రస్తుత తరుణంలో, పీఎఫ్ బకాయిలకు సాయం చేయటం సాధ్యమా అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. బాండు బకాయిలను ఆర్టీసీ డ్రైవర్లకు చెల్లించి, మిగతా వారికి చెల్లించలేదు. బాండు బకాయిలకు రూ.280 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 కోట్లే అందినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని గత ఫిబ్రవరిలో డ్రైవర్ కేటగిరీ ఉద్యోగులకు చెల్లించారు. మిగతా వారికి చెల్లించలేదు. దీంతో భవిష్యనిధి బకాయిల విషయంలో గందరగోళం నెలకొంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాల చెల్లింపు మొదలైంది. 2017 నాటి వేతన సవరణకు సంబంధించి గత మార్చిలో ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించటంతో, ఆ మేరకు కొత్త వేతనాలను జూన్ 1న చెల్లించారు. మే నెలకు సంబంధించి వేతనాలు తాజాగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. 21 శాతం ఫిట్మెంట్ ప్రకారం కొత్త వేతనాలు అందుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపుతో.. 2017లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు అప్పట్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. వాటితో చర్చించేందుకు నాటి ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. వేతన సవరణ చేయకుంటే సమ్మెను ఆపబోమని కారి్మక సంఘాలు తేల్చి చెప్పటంతో, మధ్యే మార్గంగా 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్‌కు కమిటీ ప్రతిపాదించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఫిట్మెంట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీనికి కార్మిక సంఘాలు సమ్మతించి సమ్మెను విరమించాయి. అప్పటినుంచి ఐఆరే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మార్చిలో 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇక అప్పటివరకు ఉన్న 82.6 శాతం కరువు భత్యంలోంచి, 2017 వేతన సవరణ గడువు నాటికి ఉన్న 31.1 శాతాన్ని ఉద్యోగుల మూలవేతనంలో చేర్చారు. మిగిలిన కరువు భత్యాన్ని 43.2 శాతానికి న్యూట్రలైజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఆర్టీసీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను తగ్గించారు. మొత్తంగా కాస్త సంతృప్తికరంగానే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపు అమలులోకి రావటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు మాత్రం ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనటంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ. 360 కోట్ల భారం ఈ వేతన సవరణతో ఆరీ్టసీపై సాలీనా రూ.360 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంతో, రోజువారీ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సంస్థ ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తోంది. ఇది కొంతవరకు సత్ఫలితాలనిస్తోంది. -
తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు. 2019లోనే విలీనంపై చర్చ ⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది. ⇒గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది. ⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ⇒సెపె్టంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది. ⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. ⇒ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎన్నికల హామీలో ఉంది.. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి. –అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది. – మర్రి నరేందర్ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. -
ఆర్టీసీ ఎంతో హ్యాపీ..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈ పేరు వింటనే ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఈ పేరు చెవిలో పడితేనే ఆ ఉద్యోగుల్లో హడల్ ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటం...కల కూడా. గతంలో చంద్రబాబుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విలీనం సాధ్యం కాదని కొట్టిపారేశారు. అంతేకాదు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించి తన రాజగురువు రామోజీరావుకు అప్పగించాలన్న దురాలోచన కూడా చేశారన్నది బహిరంగ రహస్యమే. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.దశాబ్దాల ఆర్టీసీ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ చరిత్రాతి్మక నిర్ణయం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో నవోదయాన్ని తీసుకువచి్చంది. ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలను కలి్పంచడమే కాకుండా ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోంది. ఆర్టీసీ పట్ల చంద్రబాబు వైఖరి? ఆయన విధానాలు ...ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అనే అంశాలను ఓసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.జగన్ విలీన హాసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం.⇒ ఉద్యోగుల జీతాల కోసం ఒక్క నెల కూడా అప్పు చేయలేదు. ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లించింది. ఇప్పటికి 52 నెలల్లో రూ.15,600 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. ⇒ జీతాల కోసం అప్పులే చేయలేదు కాబట్టి...వడ్డీ సమస్యే లేదు ⇒ వైస్సార్సీపీ కోసం అద్దెకు తీసుకున్న బస్సులకు తక్షణమే పార్టీ ఖాతా నుంచి బిల్లుల చెల్లింపు ⇒ జీతాల చెల్లింపునకు ఐదేళ్లలో రూ.2,500 కోట్లు అప్పు తీర్చింది. అప్పు రూ.2 వేల కోట్లకు తగ్గింది. ⇒ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సంఘం బకాయి రూ.200 కోట్లు చెల్లింపు దాంతో ఉద్యోగులకు సులభంగా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు ⇒ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద ప్రమాద బీమా సదుపాయం ప్రమాద బీమా మొదట రూ.45 లక్షలకు...అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు పెంపు ⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ⇒ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పన ⇒ 2016 నుంచి 2019 మధ్య పెండింగులో ఉన్న 845 మందికి ఉద్యోగాలు ⇒ 2020 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ⇒ 2020 తరువాత అనారోగ్య కారణంతో పదవీ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు. ⇒ 2020 తరువాత రిటైరైన ఉద్యోగులకు గ్రాడ్యుటీ రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కింద రూ.271.89 కోట్లు, సరెండర్ లీవుల కింద రూ.165 కోట్లు చెల్లింపు ⇒ ఇప్పటికి 1,406 కొత్త బస్సులు కొనుగోలు. మరో 1,500 కొత్త బస్సుల కొనుగోలుకు ప్రతిపాదన. తొలిసారిగా ఈ–బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ. తిరుమల–తిరుపతి ఘాట్‌లో 100 ఈ–బస్సులు. రానున్న ఐదేళ్లలో 7 వేల ఈ–బస్సుల కొనుగోలుకు నిర్ణయం ⇒ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.బాబు మాటల మోసం..!⇒ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు. ⇒ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి. ⇒ ఉద్యోగుల జీతాల కోసం చేసిన అప్పులే ఏడాదికి రూ.350 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది.⇒ టీడీపీ అవసరాల కోసం బస్సుల వినియోగం. బిల్లులు చెల్లించని టీడీపీ.⇒ రూ.4,500 కోట్ల నష్టాల్లో ఉండేది.⇒ ఉద్యోగుల పరపతి సంఘానికి రూ.200 కోట్ల బకాయి పడడంతోరుణాలు ఇవ్వలేని దుస్థితి.⇒ ప్రమాద బీమా రూ.30 లక్షలు మాత్రమే.⇒ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం.⇒ కారుణ్య నియామకాలు చేపట్ట లేదు.⇒ గ్రాడ్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, సరెండర్ లీవులు పెండింగ్..⇒ కొత్త బస్సులు కొనుగోలు లేదు.⇒ పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలుఇవి చదవండి: పిఠాపురంతోనే సీఎం జగన్ లాస్ట్ పంచ్.. -
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
విలీనం లేదు.. వేతన సవరణ 'ఊసే లేదు'!
సాక్షి, హైదరాబాద్: ‘ఇటు ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంపై స్పష్టత లేదు.. అటు బకాయి ఉన్న రెండు వేతన సవరణల జాడ లేదు’ఆర్టీసీకి సంబంధించి ఈ కీలక అంశాలకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. బడ్జెట్లో ప్రతిపాదించటం ద్వారా శుభవార్త అందుతుందని ఎదురు చూసిన ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే నెక్లెస్ రోడ్డు సమీపంలో వంద ఆర్టీసీ కొత్త బస్సులను స్వయంగా ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో ఆ కార్యక్రమంపై కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సందర్భంగా కూడా కేవలం 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్ల మొత్తం విడుదల ప్రకటన తప్ప ప్రధాన అంశాలను కనీసం మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా ఆర్టీసీ పెండింగు అంశాలపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటంతో.. అసలు తమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ పంథా ఏంటో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ‘మహాలక్ష్మి’ పథకాన్ని సక్సెస్ చేసినా.. పట్టించుకోరా? ప్రభుత్వం కొలువు దీరిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును ఆర్టీసీ ఆరంభించింది. గత డిసెంబరు 9న ఒక్క కొత్త బస్సు లేకుండా, ఉన్న సిబ్బందితోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సగటున రోజుకి 28 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఈ పథకం మొదలయ్యాక అది 45 లక్షలకు చేరింది. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ సంఖ్య 52 లక్షలకు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. 30 శాతం డొక్కుగా ఉన్న బస్సుల్లో ఓవర్‌లోడ్ వల్ల ఎక్కడ ఎప్పుడు ఏ బస్సు అదుపు తప్పుతుందోనని ఆర్టీసీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ, నిత్యం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సిబ్బందికి జాగ్రత్తలు సూచిస్తుండటంతో ఎక్కడా ప్రమాదాలు చోటుచేసుకోకుండా పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. బస్సులు కిక్కిరిసి ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉన్నా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒక్క కొత్త బస్సు కూడా సమకూర్చకుండానే తమతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినా తాము విజయవంతంగా అమలు చేస్తున్నామని, కానీ తమకు అందాల్సిన ఆర్థిక లబ్ధి విషయంలో ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించటం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు జీఓ ఇచ్చినా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కానీ, విధివిధానాలకు కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. విధివిధానాలు ఖరారయ్యేలోపే ఎన్నికల కోడ్ రావటంతో ఆ విషయం మరుగున పడింది. విధివిధానాలు వచ్చేలోపు తమ జీతాలను ట్రెజరీ ద్వారా చెల్లించేలా ఆదేశించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరినా అది నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో వెంటనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశించారు. కానీ, రెండు నెలలైనా దాని జాడలేదు. అన్నీ వదిలేసి తక్కువ మొత్తం విడుదల చేసి 2017, 2021 సంవత్సరాల్లో వేతన సవరణలు జరగాల్సి ఉంది. కానీ అవి నాటి నుంచి పెండింగులోనే ఉన్నాయి. ఇక 2013లో జరిగిన వేతన సవరణకు సంబంధించి బాండ్ల రూపంలో చెల్లించాల్సిన రూ.281 కోట్ల మొత్తం కూడా పెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ఇవి కాకుండా, ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)కు సంబంధించి దాదాపు రూ.1100 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటన్నింటినీ పెండింగులో ఉంచి కేవలం తక్కువ మొత్తం ఉన్న బాండ్ల నిధులను మాత్రమే విడుదల చేస్తున్నట్టు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం కూడా అంతేనా? శాసనసభ ఎన్నికలకు ముందు, ప్రధాన కార్మిక సంఘాల నేతలు.. వారివారి సొంత సంఘాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. బడ్జెట్ ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశంసిస్తూ పోస్టులు వైరల్ చేశారు. కానీ, బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా వారిపై కార్మికుల నుంచి ఒత్తిడి పెరగటంతో తాజాగా కార్మిక నేతలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరు కంటితుడుపు చర్యగా కూడా లేదని, కార్మికుల ఓపిక నశించకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ తీరు నిరుత్సాహానికి గురిచేసిందని, అప్రజాస్వామిక, నియంత పాలనను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించనుందా అంటూ రాజిరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని చెప్తున్న ఈ ప్రభుత్వం చేతల్లో చూపటం లేదని వీఎస్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులను ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని సీనియర్ కార్మిక నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలతోపాటు అలవెన్సులు కూడా కలిపి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ‘పే ఇన్ టు’లో డ్యూటీ బేస్డ్ అలవెన్సులను జీతాలతోపాటు కలిపి చెల్లించనుంది. ఈ మేరకు ఖజానా శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2024 జనవరి నుంచి ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఓవర్ టైమ్ అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించనున్నారు. దాంతో దాదాపు 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నైట్ అవుట్, డే అవుట్, ఓటీ అలవెన్సులు విడిగా చెల్లిస్తున్నారు. ఆ విధంగా కాకుండా విలీనానికి ముందు ఉన్నట్టుగానే జీతాలతోపాటు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం అలవెన్సులను జీతాలతోపాటు చెల్లించాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు, ఎస్ఆర్బీఎస్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా త్వరలోనే దశలవారీగా చెల్లించాలని నిర్ణయించింది. పదోన్నతులకు త్వరలో మార్గదర్శకాలు ప్రభుత్వంలో విలీనానికి (2020 జనవరి 1కి) ముందు నుంచి ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న వారికి పదోన్నతుల కల్పనకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 1,026 మందికి పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలపై అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీలో ఉద్యోగ నిర్వహణకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నిర్వహణకు ఉన్న వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్రమశిక్షణ చర్యలు అమలు చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ ఉద్యోగులు అప్పీల్ చేసేందుకు.. తదనంతరం సత్వరం పరిష్కరించేలా విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. త్వరలోనే క్రమశిక్షణ చర్యలపై ప్రత్యేకంగా అప్పీళ్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలతోపాటు అలవెన్సులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – పల్లిశెట్టి దామోదరరావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులకు ప్రయోజనకరం ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై సాను కూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్యూటీబేస్డ్ అలవెన్సులను ప్రతి నెల జీతాలతోపాటు చెల్లించడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – పీవీ రమణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వై.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో?
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ‘ఆర్టీసీ ఓటర్లు’ కీలకంగా మారబోతున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 వేల వరకు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో అంతగా లేనప్పటికీ, వేలల్లోనే ఉండటం విశేషం. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు దాదాపు 20 వేలమంది ఉన్నారు. వారి కుటుంబాలకు సంబంధించి దాదాపు 2.43 లక్షల ఓట్లు ఉన్నట్టు అంచనా. గత రెండు ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. ఈసారి వారి ఓట్లను సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు తనకే అధికంగా వస్తాయని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. చదవండి: ‘ప్రజల తెలంగాణ’ కల నిజం చేస్తాం ప్రచారంలో ఆర్టీసీ ప్రస్తావన.. నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశలో ఉన్న ఆర్టీసీని ఆదుకుని తిరిగి నిలబెట్టిన ఘనత తమదే అని బీఆర్ఎస్ నేత లు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించిందని, వారికి అందాల్సిన దీర్ఘకాలిక బకాయిలను కూడా చెల్లించక ఇబ్బంది పెడుతోందని చెబుతోంది. బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఆర్టీసీలో నియామకాలే చేపట్టలేదని, ఫలితంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంటోంది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు రుణాలు ఇస్తూ ఉపయోగపడే సహకార పరపతి సంఘం నిధులు వాడేసుకుందని, సంస్థకు ప్రభు త్వం నుంచి నిధులు రాక సహకార పరపతి సంఘం మూతపడబోతోందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు అందబోతున్నాయని బీఆర్ఎస్ చెప్తోంటే, విలీనం పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క నెల కూడా వేతనాలు అందించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ కూడా ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మద్దతుగా ఉద్యోగులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారో, ఏళ్లు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవటం, సీసీఎస్‌ను నిర్వీర్యం చేయటం, నియామకాలు లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే పార్టీలకు మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. -
ఆర్టీసీ ఉద్యోగులపై అవాస్తవాలేల!
సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావుకు ఒకటే ఎజెండా.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రూపేణా విషం చిమ్మడమే. ఇందులో భాగంగానే ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని మంగళవారం ఈనాడులో వండివార్చారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదంత సులువైన పని కాదని అక్కడ చేతులెత్తేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సులువుగా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగులకు లభించినట్టే అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు తమకు అనారోగ్యం కలిగితే ఈహెచ్ఎస్ కింద రాష్ట్రంలో మెరుగైన వైద్యం పొందుతున్నారు. అయినా ఇదంతా కళ్లుండి కూడా చూడలేని కబోధి రామోజీరావు యథేచ్ఛగా విషం కక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద వైద్యం దక్కడం లేదంటూ అవాస్తవాలను అచ్చేశారు. అసలు వాస్తవాలేవో వివరిస్తూ ఈ ఫ్యాక్ట్ చెక్.. ♦ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందిస్తున్న అన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ సేవలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ♦ఈహెచ్ఎస్ రిఫరల్ ఆస్పత్రుల్లోనే కాకుండా 21 ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఓపీ, చికిత్స విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందితే.. ఆ మేరకు బిల్లులను ఈహెచ్ఎస్ పోర్టల్‌లో సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ♦ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డియాక్ కేర్ ట్రై–ఓఆర్జీ మెషిన్ల ద్వారా గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 149 మందికి గుండెపోటు నివారణ చికిత్స అందించారు. ♦ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. 5 రకాల వైద్య సేవలు అందించే వైఎస్సార్ ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని కడపలో 2021లోనే నెలకొల్పింది. అనంతపురం, రాజమండ్రిలో ఆర్టీసీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలలో కొత్తగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టారు. -
ఉద్యోగుల ఆరోగ్యంపై రాజీ ప్రసక్తే లేదు: APSRTC
సాక్షి, ఎన్టీఆర్: ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సదుపాయలు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల్ని సమానంగా చూస్తోందని.. పైగా వైద్య సదుపాయాలు అందించే విషయంలో ప్రత్యేక చొరవ కనబరుస్తోందని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ చెబుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కార్ చెలగాటం పేరిట ఇవాళ ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఖండిస్తూ.. పూర్తి వివరాలను తెలియజేసింది. ‘‘ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు అనేక సదుపాయాలు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రిఫర్ చేయబడిన ఆసుపత్రులలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స, ఓపీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జిల్లాకొక లైజనింగ్ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా.. .. ఇటీవల కాలంలో ఉద్యోగులకు తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కార్డియాక్ కేర్ Try-cog మెషీన్ల ద్వారా ఉద్యోగులకు ఏర్పడే హృద్రోగ సమస్యలను ముందుగానే పసిగట్టి వైద్యం అందిస్తున్నాం. అలా ఇప్పటి వరకూ 149 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ముందస్తు పరీక్షల ద్వారా ఆరోగ్య భద్రత కల్పించాం’’ అని తెలిపింది. వైద్య సేవల విషయానికొస్తే.. అనారోగ్యం బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు వైద్యపరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తద్వారా సకాలంలో చికిత్స అందేలా చూస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్నిడిస్పెన్సరీలలో నిరంతరం వైద్యం.. ఔషధాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021లో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో వైఎస్సార్ జిల్లాలో డా.వైఎస్సార్ ఏరియా ఆర్టీసీ ఆసుపత్రి ఏర్పాటైంది. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలో ఉద్యోగుల కోసం శరవేగంగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
Fact Check: ‘ప్రగతి రథం’పై ‘పిచ్చి’ కథ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు చూసి ఆవేదన చెందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పిన మాట ప్రకారం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రజల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పడమే కాదు.. ఆ సంస్థను అడగడుగునా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇవి వాస్తవాలు. కానీ, రామోజీరావుకు చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణ ఓ ‘పిచ్చి.’ చంద్రబాబు తప్ప ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా ఉంటే సహించలేరు. అందుకే వాస్తవాలను విస్మరించి ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఓ విష కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో కథనాన్ని అల్లారు. విలీన ప్రక్రియ సందర్భంగా వివిధ దశల్లో ఉన్న అంశాలను వక్రీకరిస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించేందుకు కుట్రలు పన్నారు. కానీ వాస్తవాలు ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనబరుస్తున్న నిబద్ధత తెలుసు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం నుంచి ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను ఓసారి పరిశీలిద్దాం.. కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. అందుకోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. జీతాలతోపాటు అలవెన్స్‌లు డ్యూటీ సంబంధిత అలవెన్స్‌లను ఆర్టీసీ గతంలో జీతంతో కలిపి ఇచ్చేది. కానీ ప్రభుత్వ శాఖల్లో ఆ విధానం అమలులో లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయిని ప్రభుత్వం చెప్పింది. సమగ్రంగా సర్వీసు నిబంధనలు ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపైనా ఈనాడు వక్రభాష్యం చెప్పింది. గతంలోఆర్టీసీ రెగ్యులేషన్ నిబంధనలు అమలులో ఉండేవి. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ నిబంధనలకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆచరణలోకి తెచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలోనే సర్వీసు నిబంధనలను ఖరారు చేయనున్నారు. ఆ నిబంధనలు విడుదలైన తరువాత ఆ ప్రకారం ప్రస్తుతం పెండింగులో ఉన్న అప్పీళ్లు అన్నీ పరిష్కరిస్తారు. మెరుగైన పింఛన్ విధానం ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ–2022 ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సీఎం వైఎస్ జగన్ వర్తింపజేశారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్ సంస్థ ద్వారా అమలయ్యే పింఛన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న సీపీఎస్ పింఛన్ విధానంలో కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. జీపీఎస్‌ను అమలులోకి తేవడానికి సర్వం సిద్ధమైంది. జీపీఎస్ అమలుపై తుది ఆదేశాలు వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెరుగైన రీతిలో ఈహెచ్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సదుపాయం కోసం ఈహెచ్ఎస్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల పనివేళలు, ఉండే ప్రదేశాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేసే ఈహెచ్ఎస్ విధానంలో తగిన మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పథకాలు ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వర్తించిన ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ పథకాలను నిపుణుల కమిటీ రద్దు చేసింది. ఎందుకంటే ఆ పథకాలకు సరిసమానమైన పథకం ఏపీజీఎల్ఐ ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోంది. వాటినే ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేసింది. అందువల్ల 2026 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్ఆర్ఎంబీ’ లో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. 2030 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్బీటీ’లో జమ అయ్యే మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. మిగతా ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిన వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. దశాబ్దాలు గడిచిపోతున్నా ఆ డిమాండ్ కలగానే మిగిలిపోతుందా అని ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదంలో కూరుకుపోయిన వేళ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విధాన నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రజా రవాణా విభాగంగా మార్చారు. అంతకు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నిర్ద్వందంగా తిరస్కరించిన అంశాన్ని వైఎస్ జగన్ సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే నెలనెలా జీతాలు అందుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.275 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఆ విధంగా ఇప్పటివరకు రూ.10,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. దాంతో ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గి, దీర్ఘకాలికంగా ఉన్న అప్పులను తీరుస్తూ ఆ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తోంది. సీసీఎస్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రూ.2,415 కోట్ల అప్పులు తీర్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.307 కోట్ల ఎరియర్స్‌ను కూడా చెల్లించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థను మూసుకోవాల్సిందే అని హేళన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నాలుగేళ్ల తరువాత తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాటను అనుసరించి తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అదీ సీఎం వైఎస్ జగన్ దార్శనికత. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంటే ఇదే అని వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తమ ముఖ్యమంత్రి గురించి చెప్పుకునేలా చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉద్యోగుల ప్రయోజనాలే కాదు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలోనూ ఆర్టీసీది అగ్రస్థానం. కొత్త విద్యుత్ బస్సులు కొనడంతోపాటు డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మారుస్తోంది. 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టింది. 2023–24లో కొత్తగా వేయి విద్యుత్ బస్సులు కొనాలని నిర్ణయించింది. దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల సందర్శన, పుష్కరాల కోసం కొత్త బస్సులు నడుపుతోంది. రెండు వైపులా టికెట్లు తీసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తోంది. ఇలా ప్రయాణికులకు అనేక మెరుగైన సేవలతో వారి మన్ననలు పొందుతోంది. -
ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల బీమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగంలో సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (బీమా)ని రూ.45 లక్షల నుంచి ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచింది. ఈమేరకు ఆర్టీసీ గురువారం ఎస్బీఐతో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత మూడేళ్ల క్రితం రూ.45 లక్షల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలులోకి తెచి్చంది. తాజాగా దీన్ని ఏకంగా రూ.1.10 కోట్లకు పెంచడం విశేషం. కొత్త శాలరీ ప్యాకేజీ 2026 సెప్టెంబరు 2 వరకు అమలులో ఉంటుంది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం: పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. శాలరీ ప్యాకేజీ ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అధిక పెన్షన్ విధానంతో అప్పటి వరకు రూ.5 వేలు పింఛన్ పొందిన ఉద్యోగులకు ఏకంగా రూ.40 వేల వరకు పెన్షన్ పెరిగిందన్నారు.ఇప్పుడు ప్రమాద బీమాను రూ.1.10 కోట్లకు పెంచడం ఉద్యోగుల కుటుంబాలకు భరోసానిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం పట్ల ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రూ.1.10 కోట్ల ప్రమాద బీమాతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు మరణిస్తే వారి పిల్లల చదువుల కోసం అబ్బాయిలకు రూ.8 లక్షలు, అమ్మాయిలకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల పిల్లల వివాహ రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఎంకే సిన్హా, ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ.కోటేశ్వరరావు, కృష్ణమోహన్,ఎఫ్ఏ–సీఏ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈయూ హర్షం ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.10 కోట్ల కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేయడంపట్ల ఈయూ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కృతజ్ఞతలు తెలిపింది.ఈమేరకు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జీవీ నరసయ్య ఓ ప్రకటన జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇలా.. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.85 లక్షలకు పెంపు రూపే డెబిట్ కార్డ్ లింకేజీ ద్వారా రూ.10 లక్షలు కొత్త రూపే కార్డ్ ద్వారా మరో రూ.10 లక్షలు సహజ మరణానికి రూ.5 లక్షలు మొత్తం మీద రూ.1.10 కోట్లు -
వేతన సవరణనా..ఉన్న బేసిక్నేనా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతల వేతన సవరణ జరపకుండానే విలీన ప్రక్రియ పూర్తిచేస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే, విలీనచట్టం అమలులోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ♦ ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం 2013 వేతన సవరణ మీద కొనసాగుతున్నారు. 2015లో జరిగిన ఆ వేతన సవరణలో భాగంగా 44 శాతం ఫిట్మెంట్ పొందారు. వాటికి సంబంధించిన బకాయిలు బాండ్లరూపంలో ఇచ్చే 50 శాతం ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. ♦2017లో జరగాల్సిన వేతన సవరణ చేపట్టలేదు. దాని బదులు, నాటి మంత్రులకమిటీ 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. ♦ 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. ఈ రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల లేదు. ఫలితంగా వారు పదేళ్ల నాటి బేసిక్‌పైనే కొనసాగుతున్నారు. ♦ ఈ రెండు వేతన సవరణలు లేకుండా, ప్రస్తుతమున్న బేసిక్ ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రభుత్వంలోని కేడర్‌లో తత్సమాన బేసిక్ వద్ద ఫిక్స్ చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ♦ 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఆర్టీసీ ఉద్యోగుల బేసిక్ ఎక్కువ. ఆ సమయంలో కొందరు ఉపాధ్యాయ, ఆర్టీసీలో పోస్టుల్లో చాన్స్ వస్తే.. బేసిక్ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ♦ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టీచర్ బేసిక్..ఆర్టీసీ డీఎం బేసిక్ కంటే రెట్టింపునకు చేరింది. ఈ తరుణంలో ప్రస్తుత బేసిక్ ఆధారంగా ప్రభుత్వంలోని కేడర్ ఫిక్స్ చేస్తే, సీనియర్ డిపోమేనేజర్ స్థాయి ఆర్టీసీ అధికారి సెకండ్ గ్రేడ్ టీచర్ స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది. ♦ అదే రెండు వేతన సవరణలు చేసి, ఆ బేసిక్ ఆధారంగా ఫిక్స్ చేస్తే జిల్లాఅధికారి స్థాయిలో ఉంటారు. ఇదే తరహా పరిణామాలు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ డీఎం, ఇతర స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉంటుంది. ఉద్యమానికి కార్యాచరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, సంబరాలు చేసుకోవాల్సిన కార్మికులు ఆందోళన బాట పట్టడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయటంతోపాటు, ఇతర బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేక్రమంలో ఈనెల 26న ఆర్టీసీ కా ర్మిక సంఘాల జేఏసీ (3 సంఘాల కూటమి) ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. కొద్ది రోజులుగా అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వేతన సవరణలు చేయకుంటే తీవ్రంగా నష్టపోవటమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం శుభపరిణామం. కానీ, 2017, 2021 విడతల వేతన సవరణలు ముందు చేపట్టాలి. అప్పుడు ఉద్యోగుల స్థూల వేతనం పెరుగుతుంది. ఆ మొత్తం ప్రభుత్వంలో ఏఏ కేడర్లతో సమంగా ఉందో చూసి ఆయా ఉద్యోగులను ఆయా స్థాయిల్లో ఫిక్స్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మా జీతాలు కనిపిస్తాయి. అప్పుడే విలీన ప్రక్రియకు న్యాయం జరుగుతుంది. లేదంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందు రెండు వేతన సవరణలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. – వీఎస్‌రావు కార్మిక నేత -
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల ఆరో తేదీన ఈమేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా, అందులో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుని గత గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బిల్లును చట్టరూపంగా ఇప్పుడు అమలులోకి తెస్తూ, సెప్టెంబరు 15వ తేదీతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను న్యాయ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. ఇక విలీన విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వు జారీ చేయనుంది. ఆ కమిటీ కూలంకుషంగా పరిశీలించి, ఆర్టీసీ ఉద్యోగులు– ప్రభుత్వంలో ఏయే కేడర్లతో సమంగా ఉండాలి, వారి పే స్కేల్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ వయసు, పింఛన్ విధానం, ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రత్యేక ఆర్థిక బెనిఫిట్స్ ఉండాలా వద్దా.. వంటి చాలా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. వాటిని ఏ రోజు నుంచి అమలులోకి తేవాలో ఓ అపాయింటెడ్ డేæను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నెల జీతాలు ఆర్టీసీ నుంచేనా? గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ, ట్రెజరీ వేతనాలు ఎప్పటి నుంచి చెల్లించాలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వు జారీ చేయాల్సి ఉన్నందున, అప్పటి వరకు ఆర్టీసీ నుంచే యథావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత తొందరలో ఉత్తర్వు జారీ అయితే ఆ సందిగ్ధం వీడుతుందంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎంత చెల్లిస్తుందో, ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుందని, విధివిధానాలు ఖరారయ్యాక అసలు జీతాలపై స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్‌లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్‌ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్‌ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్‌లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోట్ చేసింది. -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
TSRTC: సీసీఎస్ నిధులు వాడుకుని.. వడ్డీకి ఎసరు పెట్టిన ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది. అంత మేర నష్టపోవాల్సిందేనా.. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం.. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ కార్మికులను బలిపశువులను చేయటమే ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే. – వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి